3, నవంబర్ 2023, శుక్రవారం

3. శ్రీమదాంధ్ర రామాయణము_ అరణ్యకాండము

 

శ్రీ మదాంధ్ర

రామాయణము

అరణ్య కాండము.

మూలము

శ్రీ వాల్మీకి రామాయణము

 

Rama Pattabhishekam Photo, Anarghyaa.com, Rama Dharbar Photo ...

 

ప్రణీతము

పోచిరాజు కామేశ్వర రావు

శ్రీ మదాంధ్ర

రామాయణము

 

 

 

 

 

 

అరణ్య కాండము.

                                                     మూలము                       

శ్రీ వాల్మీకి రామాయణము

 

 

 

 

 

 

 

 

 

ప్రణీతము

పోచిరాజు కామేశ్వర రావు

 



 

అరణ్య కాండము

సర్గము 1.

 

 

కం.

నలినదళ నేత్ర! సీతా

లలనా హృదయారవింద రమ్య నివాసా!  

కలుషీ కృత జననీ ని

శ్చల వర దత్తార్థ లబ్ధ సమజ నివాసా! 

1.      

 

 

 

 

సీతా రామ లక్ష్మణులు దండకారణ్యమును బ్రవేశించి తాప సాశ్రమములను జేర మునివరు లందఱు వారికి స్వాగతము పలికి సత్కరించుట. 

 

 

 

 

కం.

నియతాత్ముఁడు రాముఁడు దు

ర్జయుఁడు ప్రవేశించి దుశ్చర మయి తనరు న

ట్టి యడవిని దండకా వని

రయమున మున్యాశ్రమము లరసె నటఁ బ్రీతిన్

2.     

 

 

 

చం.

వర కుశ చీర సంచయ విభాసిత బ్రాహ్మ్య వికాస శోభిత

మ్ము రుచిర మేఘ వర్త్మగత పూర్ణ దివాకర మండ లాభమున్

శరణగ తైక భూతముల సంతత శోధిత చత్వ రావలిం

బరఁగు కుటీర మండలముఁ బక్షి మృగౌఘ నిషేవితమ్మునున్    

3.     

 

 

 

చం.

నిరత వరాప్సరో గణ సనృత్య సమున్నత సేవితమ్ములన్ 

గురుతర వేదికా స్రు గవగూహన భాండ కు శాజినమ్ములున్

వర సమిదుత్క రోదక విభాసిత సత్కలశ వ్రజమ్ములం    

దరు ఫల మూల వన్యములఁ దద్దయు వెల్గెడు పర్ణశాలలన్   

4.     

 

 

 

చం.

బలి యుత హోమ పూజిత నివాస నికాయముఁ బుణ్య వేద ఘో

షలఁ బరి పూరితమ్ములు భృశమ్ముగఁ బుష్ప వికీర్ణముల్ సర

స్సుల నలి నావృతమ్ముల సుశోభిత సన్ముని వాటి కావిలిన్

ఫలముల మూలషండములఁ బ్రాణము నిల్పు మునీంద్ర సేవ్యమున్   

5.     

 

 

 

తే.గీ.

దాంతు లజిన చీరాంబర ధారులు రవి

వహ్ని సన్నిభ తేజులు పరమ వృద్ధ

సంయ మీంద్రులు వసియించు చారు తర కు

టీర వర సంయుతమును దుర్వార భూమి        

6.     

 

 

 

తే.గీ.

పుణ్యమూర్తులు నతి మిత భోజనులు ప

రమ ఋషులు నిల్చు నుత్తమ బ్రహ్మ ఘోష

లలరు నట్టి బ్రహ్మ వ రాల యాభ మంబు

జాస నాభ మహాభాగ భూసు రాధి

7.     

 

 

 

తే.గీ.

అట్టి తాప సాశ్రమ మండ లైకముఁ గని

రాఘవుండు శ్రీమంతుఁడు రవి సమాన

తేజుఁ డా నారి సడలించి దివ్య ధనువు

నందుఁ గదియంగఁ జాగెను సుందరుండు    

8.     

 

 

 

మ.

అరవిందాక్షునిఁ గాంచి రాఘవుని దివ్యజ్ఞాన సంపన్నులౌ

వర మౌనీంద్రులు మైథిలిం గని యశో భామామణిం బ్రీతితో

నరుగం జాగిరి స్వాగతింప నెదలం దాశ్చర్య మేపారఁగా

నురు ధర్మాత్మునిఁ గాంచి లక్ష్మణుని వా రుత్సాహులై మిక్కిలిన్   

9.     

 

 

 

ఆ.వె.

మంగళ వచనము లభంగము లుచ్చరిం

చుచు దృఢవ్రత మును లచట కేఁగి

యెదురు వేగముగను ముదమారఁ గొని తెచ్చి

రాశ్రమమున కంత నతిథి వరుల    

10.    

 

 

 

తే.గీ.

సుందరాంగుని సుకుమారు శుభ్ర వేషు

నమిత లక్ష్మీ కళ నలరు నా రఘు వరు

రాము నరసిరి ప్రీతి నరణ్య వాసు

లచ్చెరువు నంది చిత్తమ్ము లందు మిగుల

11.    

 

 

 

కం.

సీతను రాముని లక్ష్మణు

నాతత విస్మయ కరుల నయనముల కకటా

మూఁత నెఱుంగక చూచిరి

ప్రీతిని వనచారు లపుడు పేర్మి చెలంగన్      

12.    

 

 

 

తే.గీ.

భూత హితముల నెల్లను బ్రీతి నెంచు

నా మహాభాగులు మునులు రాముని నతి

థి వరుఁ గొనిపోయి యుంచిరి దివ్య పర్ణ

శాల లోన సంతసమున మేలుగాను        

13.    

 

 

 

ఆ.వె.

అంత సత్కరించి యర్హ విధి సహిత

మగ్ని సన్నిభులు మహర్షి వరులు

ధర్మ వర్తనులు నుదక మొసంగిరి వేడ్క

రాఘ వేంద్రునకు నరర్షభునకు    

14.    

 

 

 

కం.

ఫల పుష్ప మూలములను స

కలముల నాశ్రమము నొసఁగి కాకుత్స్థునకుం 

బలుకులు వల్కిరి ధర్మ

జ్ఞు లంజళులు దగ ఘటించి సురుచిర రీతిన్   

15.    

 

 

 

ఉ.

రాజు యశస్వి ధర్మ పరిరక్షకుఁ డౌ నిల సంతతమ్ము ధా

త్రీ జన సంచయమ్మునకు లీల శరణ్యుఁడు గౌరవమ్ముగాఁ

బూజల నంద నర్హుఁ డగు మూరి ధరించును దండ మింపుగా 

నీ జగతీ జ నావలికి నెంచ గు రూత్తముఁ డీవ రాఘవా

16.    

 

 

 

తే.గీ.

నాలుగవ భాగ మగును భూనాథుఁ డవని

నింద్రు నందు రక్షించు వాఁ డిద్ధరణినిఁ 

గాన రమ్య భోగములకుఁ దాను దగును

దగ ననుభవింపఁ దగును వందనములకును    

17.    

 

 

 

తే.గీ.

పార్థ! నీ రాజ్య మందున్న వార మేము

నీకు రక్ష ణార్హుల మయ్య నిత్య మెంచ

నగర మందున్న లేక వనమ్ము నందు

నున్న మాకు రాజువు నీవ యెన్నఁ డేని

18.    

 

 

 

తే.గీ.

రాజ! క్రోధము నింద్రియ వ్రాతమును జ

యించి నట్టి వారలము మే మంచితముగ

దండము విడిచినారము తాపసులము

మమ్ము రక్షింప వలయుఁ గుమారు లనఁగ         

19.    

 

 

 

కం.

అని యిట్లు ఫలముల సుమము

లను మూలముల వివిధమ్ములను రమ్యములౌ 

వన భోజనముల రాముని

ననుజుని లక్ష్మణునిఁ బ్రీతి నర్చించి రటన్     

20.   

 

 

 

కం.

అన లాభు లన్య తాపసు

లును సిద్ధులు న్యాయ చరితులు యథా న్యాయం

బు నరేంద్రుని నవ్విధము వ

చనములఁ దనిపిరి ప్రభువును జక్కఁగ నంతన్   

21.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నొకటవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 2.

                                                                        

 

 

సీతారామలక్ష్మణులు మునుల యనుజ్ఞఁ గొని సూర్యోదయమున నరణ్యమునఁ బ్రవేశించి వెడలఁ జాగ విరాధుఁ డను రాక్షసుఁడు సీతను గొని రామ లక్ష్మణులను భక్షింతు నన రాముఁడు శోకించుచుఁ బలుక లక్ష్మణుండు మిక్కిలి కోపించి యా రక్కసునిఁ జంపుదు ననుట.

 

 

 

 

కం.

అంతఁ గృతాతిథ్యుఁడు ముని

సంతతి యానతి గ్రహించి సాంద్రత రార

ణ్యాంతరముఁ జొచ్చెఁ బూర్వ ది

గంతర రవిఁ గాంచి రాముఁ డతి వేగమునన్

1.      

 

 

 

మ.

నర శార్దూలుఁడు కూడి లక్ష్మణుఁ గనెన్ నానా మృగాకీర్ణమున్

ఖర భల్లూక మృగేంద్ర సంయుతము వ్యాఘ్రవ్రాత సంచారమున్

గురు విధ్వంసిత వృక్ష గుల్మ స లతా కూటమ్ము వీ తాంబువున్  

వర ఝిల్లీ గణ నాదిత ద్యుచర నిస్వానం బరణ్యమ్మునున్   

2.     

 

 

 

తే.గీ.

అవనిజను గూడి కాకుత్స్థుఁ డరసె నచట

ఘోర మృగ చరితము నందు ఘోర శబ్ద

యుతుని గిరి శృంగ సన్నిభు నుగ్ర రూపు

నిత్య పురుషాదు రక్కసు నత్యధముని    

3.     

 

 

 

మ.

వెరఁగౌ రూపు మహా ము ఖోదరుని గంభీ రాక్షు భీభత్సునిన్

ఖరునిం గ్రూరు సుఘోర దర్శను సుదీర్ఘస్కంధు వ్యాఘ్రాజి నాం

బరు నార్ద్రాంబరు రక్త సిక్తుని ధరా ప్రాణివ్ర జోద్వేగదుం 

బరమ వ్యాదిత కాల సన్నిభ ముఖుం బాపాత్మునిన్ రక్కసున్          

4.     

 

 

 

ఉ.

మూడు మృగేంద్ర రాజముల మూరుచు నాలుగు వ్యాఘ్ర రాజులం   

బాడిగ రెండు దోఁడెలులఁ బంచ యుగంపుఁ గురంగ రాజులం  

గూడ కరమ్ము మత్త జల కుంజర మూర్థము నిన్ప కొఱ్ఱుతో 

వేఁడుకఁ గ్రుచ్చి కూయుచును భీకర రీతిని దైత్యుఁ డచ్చటన్   

5.     

 

 

 

తే.గీ.

కాంచి రాముని లక్ష్మణు మించి సీత

మైథిలిని రోష యుక్తుఁడై మనుజ భోజ

నుండు పర్విడె నా రక్కసుండు ప్రజలఁ

గాంచి యంత్య వేళల నుర్కు కాలు భంగి    

6.     

 

 

 

తే.గీ.

భైరవస్వన మొనరించి ఘోరముగఁ బు

డమినిఁ గుదుపఁ దలఁచి న ట్లడరి కరమ్ము 

నంకమున నుంచి సీతను బింకముగఁ గొ

ని చని యవలకు ననె నిట్లు వచనములను   

7.     

 

 

 

చం.

జడలను నార చీరలు భృశమ్ముగ నూని సదార మీర లి

ట్లడరుచు క్షీణ జీవితులు నక్కట చేరిరి దండకాటవిం

గడు వడి చాప బాణములఁ గత్తుల నూనుచు నిర్భయమ్ముగా

వెడల నశక్య మేరికిని భీకర మైన వనమ్ము లోనికిన్        

8.     

 

 

 

ఆ.వె.

తాపసు లయి మీరు దారతో నుంటిరే

యఘు లధర్మ చారు లగుచు నెవరు

మీర లివ్విధముగ మేదిని మునుల దూ

షింప నెంచి రేల తెంపు మీఱ    

9.     

 

 

 

కం.

నేను విరాధుఁడ నసురుఁడ

కాననమున సాయుధ మిటఁ గదలుచు సతమున్

మౌని వర మాంసముఁ దినుచు

నానందమున వసియింతు నచ్చెరు వేలా

10.    

 

 

 

ఆ.వె.

ఈ రమా మణియె వరారోహ నా కగు

భార్య యిం పొసంగఁ బాప మతులు

మీ రుభయులు నాజి మీ రక్త మేను ద్రా

వెద నిఁకఁ గడుపార విదిత మిద్ది   

11.    

 

 

 

తే.గీ.

దుష్టుఁడు విరాధుఁడు పలుక దుర్మనుండు

గర్వ మడరంగ విని నంతఁ గంప మందె

భీతి సెలగంగ జానకి వాతమునఁ గ

దలెడు కదళీ తరువు వోలెఁ గలఁత తోడ   

12.    

 

 

 

తే.గీ.

వణఁకు సీత శుభాంగనఁ బరుని నవ్వి

రాధు నంకమున నరసి రాముఁ డంత

ముఖము శోషింప భృశముగ మునిఁగి దుఃఖ

మందు లక్ష్మణుతోఁ బల్కె  డెంద మవియ  

13.    

 

 

 

ఉ.

కాంచుమ సౌమ్య సచ్చరితఁ గాంతను నజ్జన కాత్మ సంభవన్

మించి మదీయ భార్యను సుమిత్ర కుమార! విరాధుఁ డంక మం

దుంచఁగ వేఁగు సీత నట నుత్తమ సౌఖ్యము లెల్ల నిచ్చుచుం

బెంచిన రాజ నందనను బెద్ద యశస్వినిఁ గంపి తాత్మనున్        

14.    

 

 

 

తే.గీ.

మన కొఱకు నేవి కోరెనొ జనని వరము

లపుడు కైకేయి లక్ష్మణ! యక్కట యవి

నేఁడు క్షిప్రము నెరవేరు నిక్కముగ ని

పుడు మహారణ్యమం దిట్లు పూర్ణముగను    

15.    

 

 

 

చం.

తనియక రాజ్య లాభమునఁ దల్లియె మధ్యమ దీర్ఘ దర్శినీ

వనిత సుతార్థి కానలకుఁ బంపెను భూత గణప్రియున్ ననుం

గనికర మింత లేకయె స కామగ వర్ధిలె నేఁడు కైకయే 

ఘనముగ నిట్టు లాపదలు గల్గఁగ లక్ష్మణ! యేమి సెప్పుదున్

16.    

 

 

 

తే.గీ.

అవని నన్య నరస్పర్శ మవనిజకుఁ గ

లుగుట కన్న మిన్న యయిన వగపు కలదె

నాకు రాజ్య హరణము జనకు నిధనము

గావు దుఃఖ తరములు లక్ష్మణ! తలంప  

17.    

 

 

 

ఉ.

శోక సభాష్ప మగ్నుఁ డయి శూరుఁడు రాముఁడు వల్క నివ్విధిన్

వీఁకఁ జెలంగి లక్ష్మణుఁడు పెల్లుగ రోషము నూని యిట్లనెం

గాఁక నెదిర్చు పన్నగము కైవడి మిక్కిలి నిశ్వసించుచున్ 

నీ కడ నుండ భృత్యఁడను నే ననిశమ్ము నిటుల్ వచింతువే       

18.    

 

 

 

తే.గీ.

సర్వ భూత రాసులకు నీశ్వరుఁడ వీవు

వాసవ సమానుఁడ వనాథు భంగి పలుక

నేల నేఁ జంపఁగ విరాధు నేల త్రాగు

వాని రక్తము శరములఁ బఱచి రేఁగి      

19.    

 

 

 

తే.గీ.

రాజ్య కాముఁడు భరతుపై రగిలి నట్టి 

కోపము విడుతు నిప్పుడు క్రూరుఁ డైన 

యీ విరాధ రాక్షసునిపై నెలమి వజ్రి

వజ్రమును వేగ గిరి పైనఁ బఱచి నట్లు       

20.   

 

 

 

కం.

ఘన మగు నా భుజ బల రయ

మున నా శరము పడుఁ గాక భూర్యసురు నుర

మ్మున గిరగిర తిరుగుచు నే

ల నసువులను వీడి పడ వలయు గాక యికఁన్       

21.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు రెండవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 3.

 

 

 

లక్ష్మణుఁడు తన్నెవరని యడుగ విరాధుఁడు తన్నెఱిఁగించి వారిని సీతను విడిచి పొమ్మనిన రాముఁ డుగ్రుఁడై లక్ష్మణునితోఁ గూడి విరాధుని బాణములతోఁ గరవాలముతో నెదిరింప సీతను విడిచి విరాధుఁడు వారిరువుర నెదిర్చి రెండు చేతులతో నెత్తుకొని పోవుచుండ నది తా మేఁగ వలసిన గతియే నని యెఱిఁగి  రాముఁడు లక్ష్మణునితో నతని నట్లు పో నిమ్మనుట.     

 

 

 

 

కం.

పలికి ప్రసిద్ధుఁడు లక్ష్మణుఁ

డల నవ్వొలకంగఁ గాంచి యసురు విరాధుం

గలుషాత్ము నడిగె నెవర వి

టుల నీవు చరిం తటవిఁ బటు గతిని నంచున్  

1.      

 

 

 

చం.

అన విని యంత నిండ వన మంతయుఁ గుయ్యిడి పల్కె నివ్విధిన్

వనమున కేల వచ్చితిరి పల్కుఁడు మీ వివరమ్ము లెల్లనున్ 

నను నిట నేర గోరుదు రనంగ రఘూత్తముఁ డాలకించి ప

ల్కె నసురు గాంచి స్వీయ కుల కీర్తిని నా జ్వలి తాననుం దగన్         

2.     

 

 

 

ఆ.వె.

క్షత్రియులము మేము చక్కని వృత్త సం

పన్నులముగ నెఱుఁగు పన్నుగ మము

విపిన గోచరులము వినఁ గోరుదు మెవరు

నీవు దండకా వనిఁ బని యేమి

3.     

 

 

 

ఉ.

అప్పుడు గాంచి రాఘవుని నాతఁడు సత్య పరాక్రముం దగం

జెప్పెద నాలకింపు నృపశేఖర! తండ్రి జయుండు తల్లి యౌ

గొప్ప శతహ్రదా సతియె కొల్త్రు విరాధుఁ డనంగ నన్ను నె

ల్లప్పుడు సర్వ రాక్షసులు లాలన తోడ ధరా తలమ్మునన్

4.     

 

 

 

తే.గీ.

పడసితిఁ దపమ్ము నొనరించి బ్రహ్మ వలన

వరము లస్త్ర రాజములఁ జావమినిఁ గోయఁ

బడమి నెన్నండును విఱుగఁ బడమిఁ బుడమి

లోన నే నద్భుతమ్ముగ నో నరవర!     

5.     

 

 

 

ఆ.వె.

విడిచి రామ నిచటఁ బడయఁ గోరక వచ్చి

నట్టి దారి మీర లరుగుఁ డింకఁ

బర్వు లిడుచుఁ గొనక ప్రాణములు విడుతుఁ

గరుణ తోడ మిమ్ము కా దనకుఁడు  

6.     

 

 

 

తే.గీ.

రాముఁ డుగ్రుం డయి విని విరాధు దుష్ట

వాక్యములు కోప సంరక్త భాసమాన

నయనుఁ డారసి పాప మనస్కు వికృత

రూపుని బదు లొసఁగె నిట్లు రోష మడర

7.     

 

 

 

ఉ.

చీ దను జాధమా! వడినిఁ జేరఁ దలంతువు మృత్యు గేహమున్

వాద మొనర్చి మూర్ఖమున వారక హీన తరార్థ కామివై

యీ దరి నిల్వు జీవము వహించి చనంగ నశక్య మౌను నీ

కీ దురమం దెదిర్చి నను నిద్ధర నిక్కము పాప చింతనా!      

8.     

 

 

 

తే.గీ.

నారి సంధించి వడి రఘు నందనుండు

రాముఁడు సుశీఘ్రమ విసరె రాక్ష సాధ

ముపయి నిశిత బాణము లేడు మూరి రుక్మ

పుంఖములను గరుడ నిభముల రయమున   

9.     

 

 

 

ఆ.వె.

నెమలి పింఛములను నెగడు నా శర రాజ

ములు విరాధు నంగమును గడు వడిఁ 

దూఱి రక్త మందుఁ దోరముగఁ దడిసి

యగ్ని సన్నిభమ్ము లవనిఁ గూలె

10.    

 

 

 

ఆ.వె.

తగుల శరము లట్లు ధరణిజ విడనాడి

రక్కసుండు కోపరక్త నేత్రుఁ

డంత శూలమెత్తి యా రాముని సలక్ష్మ

ణు దరికిఁ బరువెత్తె బెదర కుండ  

11.    

 

 

 

కం.

చేసి మహా నాదమ్మును

ద్రాసద శూలమ్ము శక్రు ధ్వజ నిభ మెత్తం  

దా సరి యయ్యెను యమునకు

రోసమ్మునఁ దెఱవఁగ నసురుఁడు వక్త్రమ్మున్   

12.    

 

 

 

ఉ.

వానిని గాంచి సోదరులు ప్రజ్వలి తాంబక వృష్టిఁ గుర్యఁగా

మేనున నాఁట దైత్యునకు మేటి శరమ్ములు కాల సన్నిభుం 

డా నర భుక్తి నవ్వడర నంతటఁ బెద్దగ నావలింపఁగన్

దానినిఁ గూలె బాణములు ధాత్రిని రౌద్రుని మేని వీడుచున్  

13.    

 

 

 

తే.గీ.

స్పర్శ మాత్రమున వర ప్రభావమునను 

బ్రాణముల నన్నిటి నిలిపి పన్నుగఁ గర

దండమున శూలము గ్రహించి తద్ద పైకి

నెత్తి రాఘవుల పయికి నెగసి యుఱుక   

14.    

 

 

 

తే.గీ.

వజ్ర సంకాశ తచ్ఛూల వరము నంత

మండు చుండ గగన మందు మెండుగఁ గని

రెండు కోలల భేదించె గండు మీఱ

శస్త్ర ధరుల శ్రేష్ఠుఁడు రాముఁ డస్త్ర విదుఁడు

15.    

 

 

 

ఆ.వె.

రాఘవుని నిశిత శరద్వయమున ఛిన్న

మయిన శూలము పడె నవని జాఱి

కరము నుండి వజ్ర ఘాతమునం గూలు 

నట్టి మేరు శిలను ననుకరించి  

16.    

 

 

 

ఆ.వె.

కృష్ణ సర్ప యుగపుఁ గ్రియఁ బ్రకాశించు ఖ

డ్గముల నెత్తి వారు కదలి త్రుటిని

మాఱుకొనిరి తమను మర్దింప నెంచిన

రక్కసుని బలముగ రాఘవులును

17.    

 

 

 

ఆ.వె.

అట్లు కొట్టఁ బడెడి యసురుండు రౌద్రుఁ డ

రసి యకంపనులను రామ లక్ష్మ

ణుల నరర్షభులను బల భుజమ్ముల గ్రహిం

చి చన నెంచె నంత శీఘ్రముగను    

18.    

 

 

 

ఉ.

వాని మతంబు నేరి మది పల్కెను లక్ష్మణుఁ గాంచి రాముఁ డీ 

దానవు నాప కుండు మిటు దారినిఁ బన్నుగ మోయనీ తగం

గానన మం దహో మనలఁ గాంచఁ బథం బిది యౌను లక్ష్మణా

మానుగ నేఁగఁగా మనకు మానక వే చన నీ యథేచ్ఛగా           

19.    

 

 

 

కం.

నిజ వీర్యమ్మున దనుజుఁడు

భుజముల నుంచి యిరువురను బుడుతల భంగిన్

విజ నారణ్యమున రయము

నఁ జాగెను వెడలఁగ స్వీయ నైపుణ్యమునన్   

20.   

 

 

 

తే.గీ.

స్కంధమున నుంచి రాఘవ సన్నుతులను

ఘోరముగ నినదించుచు భార మనక

వారిని విరాధుఁడు నడచి వనమున కభి

ముఖుఁడు నయి దర్ప మడరంగఁ బోవఁ జాగె     

21.    

 

 

 

కం.

వనము మహా మేఘ నిభము

ఘన నానా తరు లతా నికాయ యుతమ్మున్

వన మృగ విహంగ రాజిత

మును వ్యాల శివాది చరితమును వడిఁ గదిసెన్  

22.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు మూడవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 4.

 

 

 

విరాధుఁడు రామలక్ష్మణులను గొనిపోవుచుండ సీత బిగ్గరగా విలపింపఁ గాంచి రామ లక్ష్మణులు విరాధుని రెండు చేతులను నఱకి బాణముల కత్తుల ముక్క ముక్కలు సేసిన నతఁడు చావ కున్న ఖననము సేయ నిర్ణయింప విరాధుఁడు రాముని నెఱిఁగి తన శాప వృత్తాంతమును దెలిపి సీతా రామ లక్ష్మణులను స్తుతించి తనను ఖననము చేయ మని యట్లు సేసిన శాప విముక్తుఁ డనై తన గృహము స్వర్గమున కేఁగఁ గల వాఁడ నని పలుక వా రట్లు చేయుట. 

 

 

 

 

కం.

కని రామ లక్ష్మణుల నా

ఘన భుజులను దనుజుఁ డట్లు కానన మందుం

గొనిపోవు చుండ దుఃఖ

మ్మున వైదేహి యఱచె వడి మూరిన ధ్వనినిన్

1.      

 

 

 

చం.

పలికెను సీత యేడ్చుచు నపారము రాముఁడు సత్యవంతుఁడుం

గలుష విహీన సద్గుణుఁడు క్రచ్చఱ లక్ష్మణు గూడి దైత్యుచే

నల హరియింపఁ బడ్డఁ గన నాయెను వన్య మృగమ్ములే ననుం

గలసి తినంగ నోపు నను గర్వర! చంపుమ వారి వీడుమా    

2.     

 

 

 

తే.గీ.

రాక్ష సోత్తమ! నతు లన రాఘవేంద్రు

లు విని వైదేహి మాటలు తివిరి వీరు 

లసురు దుష్టుని వధియింప నంత నిశ్చ

యించి రిద్దఱు వేగమ మించఁ గినుక     

3.     

 

 

 

తే.గీ.

పరమ రౌద్రుని రాక్షసు వామ భుజము

వేగ ఖండించె సౌమిత్రి వీర వరుఁడు

దక్షిణ భుజమ్ము దుష్టుని దైత్య వరుని

మీఱి ఖండించె రాముండు మేటి మగఁడు     

4.     

 

 

 

మ.

తెగినన్ బాహు యుగమ్ము గూలె ధరపైఁ దీ వ్రార్తి మేఘాభుఁ డం

త గిరీంద్రమ్ము ఘ నాశనిం బుడమిఁ బాతం బైన చందమ్మునం

బగతుం డా యసురుండు  జానువులతోఁ బాదమ్ములన్ ముష్టులన్

మగ లా రాఘవ సోదరుల్ తివిరి వే మర్దింపఁ జూర్ణంబుగా     

5.     

 

 

 

తే.గీ.

చావఁడు విరాధుఁ డమ్ము నిచయ విఘాత

ములను గత్తులఁ గొట్టినఁ బుడమి పైనఁ 

బిండి యొనరింపఁగ ననేక  విధములను వి

చిత్రముగఁ బురుషాదుఁడు చింత నొందు    

6.     

 

 

 

కం.

ఆతని నవధ్యు గిరి నిభు

భీతుల కభయప్రదుండు పృథ్వీప సుతుం

డాతత యశస్వి రాముం

డా తఱి వీక్షించి పల్కె ననుజుని తోడన్    

7.     

 

 

 

కం.

దనుజుఁడు పురుషవ్యాఘ్రా!

యని నోడఁడు శస్త్ర సంచయమ్మునఁ దన దౌ

ఘన మగు తపో మహిమ నీ

తనిఁ బూడ్చెద మింకఁ బుడమి తలమం దనుజా!    

8.     

 

 

 

ఆ.వె.

తీక్ష్ణ తేజు నిభసదృశ రౌద్రు రాక్షసు

కొఱ కరణ్య మందు గుంట నొకటి

కడు విశాలముగను గ్రన్నన నిప్పుడు

త్రవ్వు మయ్య దుష్ట దనుజుఁ బూడ్ప    

9.     

 

 

 

ఆ.వె.

అట్లు గొయ్యి తీయ మంచు లక్ష్మణునితోఁ 

బలికి యన్న వీర్య వంతుఁ డంత

నాక్రమించి వేగ యయ్యసురుని కంఠ

మందు కాలు వెట్టి  యణఁచు చుండె

10.    

 

 

 

చం.

పలికిన రాఘవుం డటులఁ బద్మదళాక్షుఁడు పల్కె రాక్షసుం

డలర భృశమ్ము నమ్రత మహాత్ము నరర్షభుఁ గాంచి యివ్విధిన్

నలిఁగితి శక్ర సన్నిభ! ఘనమ్ముగ నీ వలనన్ రఘూత్తమా!

తెలియక యుంటి మోహమునఁ దెల్లముగా నిను నేను మున్నిటన్   

11.    

 

 

 

కం.

మనుజేంద్రా! కౌసల్యా

తనయ! యెఱిఁగితి నిను రామ! దరుణీ మణి సీ

తను ఘన యశస్వి సౌమి

త్రినిఁ బన్నుగ నిప్పు డెలమి హృదయం బందున్      

12.    

 

 

 

తే.గీ.

తుంబురుఁ డన గంధర్వుఁడ నంబుజాక్ష!

వైశ్రవణు చేత శపియింపఁ బడితి నకట

రాక్షస తనువు నందితి రామ! యిట్లు

ఘోరముగఁ దిర్గు చుంటిని ఘోర వనిని     

13.    

 

 

 

తే.గీ.

కరుణఁ జూపు మనఁగ యక్ష కాంతుఁ డంత

దయ వహించి పలికె నిట్లు దాశరథి వ

ధింప సమరమం దొక నాఁడు మించి నిన్ను

నీ యునికి స్వర్గ మరయుదు నెమ్మి నంచు

14.    

 

 

 

ఆ.వె.

రంభ పైన రతిని రాజరాజు కుబేరు

ననవధాన బుద్ధి నరయ నేను

కోప మూని భృశము ఘోరముగ నిటుల

నన్ను శప్తుఁ జేసె నన్నర రథి   

15.    

 

 

 

తే.గీ.

భూరి దారుణ శాప విముక్తుఁడ నయి

తి నిట నీదు కరుణ తోడ దేవ! యేఁగు

వాఁడ నిప్పుడు స్వీయ భువనమునకుఁ బ

రంతప! యగును గాక భద్రమ్ము మీకు      

16.    

 

 

 

చం.

ఇచటకుఁ దండ్రి! యేకము పయిన్ సగ ముండిన యోజనంపుఁ జో

టుచితపు దేశ మందుఁ గల దుత్తమ తాపసు నాశ్రమం బటన్  

రుచిరపు శక్తి మంతుఁడు పరోక్షుఁడు నౌ శరభంగు డుండు మీ

రచటకు నేఁగినన్ శుభము లందుదు రా రవి తుల్యుచేఁ దగన్     

17.    

 

 

 

తే.గీ.

గొయ్యి తీసి పాఁతి చనుఁడు కుశలముగను

హత దనుజ కోటి  కిది ధర్మ మగును ధరను

రామ! గుంత నుంచఁ బడిన రక్కసులకుఁ 

గలుగు శాశ్వత జగములు లలితముగను     

18.    

 

 

 

కం.

శర పీడిత దైత్య వరుఁడు

విరాధుఁడు వచించి యిట్లు ప్రియ రామునితో

గిరలను వీత తనుండై

యరిగె మహా బలుఁడు దివికి యానందముగన్

19.    

 

 

 

మ.

విని యా మాటలు రాఘవుం డనుజునిన్ వీక్షించి శాసించె ని

ట్లని సౌమిత్రి! గజాభ రౌద్ర తర దైత్యార్థమ్ము రంధ్రమ్మునున్

ఘను నిక్షేప మొనర్పఁ ద్రవ్వుమ మహా కాంతార మధ్యమ్ములో

నని పాదమ్మును నొక్కి దైత్యుని గళం బం దుంచి నిల్చెం దగన్

20.   

 

 

 

తే.గీ.

త్రవ్వుకోల నపుడు తెచ్చి లక్ష్మణుండు

త్రవ్వెఁ జక్కని గుంత విరాధుఁ బూడ్ప

నతని ప్రక్కనఁ గంఠము నంత విడిచి

యఱచు చుండ నాతఁడు వైచి రతని వేగ

21.    

 

 

 

తే.గీ.

త్వరిత విక్రము లాజిని దారుణమున

స్థిరులు రామలక్ష్మణులు మోదితులు పరమ

భీకరుని ఘోర నినదుని బిలము నందు 

నుంచి రెత్తి రాక్షస వరు నంచితముగ      

22.   

 

 

 

ఆ.వె.

వాడి శస్త్రముల నవధ్యు మహాసురు

బిలము నందు నునిచి వీరు లలఘు

నైపుణు లుభయులును నర పుంగవులు చింత

సేసి చంపి రసురు వాసి కెక్క

23.   

 

 

 

కం.

వనచరుఁడు విరాధుఁడు రా

మునికిం దన చావు లేమి పుడమిని శస్త్రా

లినిఁ దెలిపె రాఘవునిచేఁ

దన చావును గోరి బలిమి  దనుజుం డట్లున్   

24.   

 

 

 

తే.గీ.

వినఁ బడంగ మాటలు రఘు వీరు చేత 

బిలము నందిడ మది నెంచ బలము చేతఁ

జొచ్చు చుండంగ గోతి నసుర వరుండు 

ధ్వనుల తోడఁ గంపించెను వనము భృశము

25.   

 

 

 

తే.గీ.

పుడమి గుంట విరాధుని నడఁచి శిలలు

నింపి కప్పి రక్కసు నంత నెమ్మి నూని

రామ లక్ష్మణులు విగత త్రాసు లెదల

లోన సంతస మందిరి కాననమున     

26.   

 

 

 

కం.

అమరంగఁ గనక రుచి చా

పములు ధరణిజఁ గొని దనుజ వరుఁ జంపి వనిం 

దమి వా రడరిరి సంతో

షమున నభస్థితులు సూర్య చంద్రుల భంగిన్   

27.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నాలుగవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 5.

 

 

 

విరాధుని వధియించి రాముఁడు సీతను లక్ష్మణునిఁ గూడి మహర్షి శరభంగుని యాశ్రమమున నున్న యింద్రుని గాంచుచు నచట కేఁగుట, శరభంగుఁడు రామునకు నాతిథ్య మొసఁగి తపో బలమున నగ్నిఁ బ్రవేశించి నూత్న యౌవన దేహమును గైకొని బ్రహ్మ లోకమునకు నేఁగుచు రాముని సుతీక్ష్ణ మహర్షి వద్దకు నేఁగ మనుట.   

 

 

 

 

చం.

అని వధియించి భీమ బలు నట్లు విరాధుని నాశ్వసించి సీ

తను దమిఁ గౌఁగిలించికొని తద్దయుఁ బ్రీతిని రాముఁ డివ్విధిం

గని వచియించె లక్ష్మణుని గారవ మొప్పఁగ దీప్త తేజుతో

మునుకులు వాక్య నైపుణుఁడు భూప కుమారుఁడు భద్ర మెంచుచున్     

1.      

 

 

 

తే.గీ.

దుర్గమం బీ యరణ్యము దుఃఖదమ్ము

కాము వన గోచరులము లక్ష్మణ మన మిఁక

శీఘ్రముగ నేఁగెదము ముని శేఖరుని త

పోధను శరభంగు నిలయమునకుఁ బ్రీతి

2.     

 

 

 

తే.గీ.

చేరి శరభంగు నాశ్రమ శ్రేష్ఠ మంత

నిజ తపః ప్రభావు విదిత నిజ మన స్సు 

రప్రభావుని ముని చెంత రాముఁ డరసె 

నొక్క యద్భుత దృశ్యమ్ముఁ జక్కఁగాను      

3.     

 

 

 

చం.

వెలుఁగుచు స్వీయ గాత్రమునఁ ద్విట్పతి వహ్ని నిభుండు ద్యో మహా

తలమున నుండి డిగ్గుచు రథమ్మును దేవ గ ణావృతుండు భూ

తలమును దాఁక కుండ నవతంస విరాజిత శుక్ల వస్త్ర ధా

రి లలిత దేవ పూజితుఁడు లీలఁగఁ గన్పడె దేవ రా జటన్         

4.     

 

 

 

తే.గీ.

అంత రిక్షము నందున్న హరి హ యోక్త

రథ వరము తరు ణాదిత్య రాజ నిభము

ధవళ మేఘ సన్నిభము చంద్రవర మండ

ల సదృశము కానఁబడె నదూరమ్ము నందు            

5.     

 

 

 

ఆ.వె.

చిత్ర మాల యుతము ఛత్రము విమలమ్ము

గాన నయ్యె నచటఁ గాంచనంపు

దండఁ గరమున నిడి  తరుణు లిద్ద ఱట వి

సర నగ పడి రిద్ధ చామరములు       

6.     

 

 

 

కం.

గగన విరాజితు దేవునిఁ

బొగడిరి గంధర్వ సిద్ధ పుణ్యతమ మునీం

ద్ర గ ణామర సందోహం

బగణిత వాగగ్ర్యముల మహాత్ముని భక్తిన్     

7.     

 

 

 

కం.

శర భంగుని తో నింపుగ

సుర నాథుఁడు వల్కు చుండఁ జూచి యట శతా

ధ్వరు నాశ్చర్యమ్ముగ రఘు

వరుండు లక్ష్మణుని తోడ వచియించె నిటుల్       

8.     

 

 

 

చం.

అరదముఁ జూపి లక్ష్మణున కాకస మందుఁ జెలంగు దాని న

చ్చెరువుగఁ గాంతిమంతమును శ్రీ యుతమున్ రవి సన్నిభమ్ముగాఁ

గరము వెలుంగు నా రథము గాంచుమ లక్ష్మణ! యింక నచ్చటం 

దురగము లింద్ర వాజు లని తోఁచును వింటిమి పూర్వ మివ్విధిన్    

9.     

 

 

 

సీ.

ఈ పురుష వ్యాఘ్రు లిచ్చట నిల్చిరి గాంచుమ దిశ లందు నంచితముగ 

వందలు వందలు పసిడి కుండలముల కాంతితోఁ గరములఁ గత్తు లలర

నురము లాతతములు పరిఘ లా బాహులు రక్త వర్ణములు వస్త్రములు మెఱయ

పులుల వోలె దురాసదులు యౌవనమున నలరు వారు రమ్య గాత్రము లమరఁగ        

 

తే.గీ.

వక్షముల హారములు వెల్గ  జ్వలన నిభము

వార లెల్లర కడరి యపారముగను

బంచ వర్ష ప్రాయంబ రూపమ్ము లెల్లఁ  

బురుష వరులకు లక్ష్మణ! యరసి చూడ    

10.    

 

 

 

తే.గీ.

ఎట్టు లీ పురుష వ్యాఘ్రు లిచ్చటఁ గనఁ

బడుచు నుండిరొ యట్టులె వారి కెప్పు

డుండుఁ బ్రాయము సురలకు నొప్పి యంద

మైన రూప మలరు చుండు మేను లందు       

11.    

 

 

 

ఆ.వె.

ఒక్క నిమిష ముండు  మువిద సీతను గూడి

యిచట వచ్చు దనుక నేఁగి నేను

నేరి రథము నందు నెగడి యున్నట్టి వా

ని ద్యుతి మంతుఁ డెవరని విశదముగ    

12.    

 

 

 

కం.

పలికి నిలువ మని యచ్చో

ట లక్ష్మణునితో నతం డడరి శీఘ్రముగా

నలినాక్షుం డా తాపసు

నిలయపు దిక్కున కరిగెను నిశ్చిత మతినిన్    

13.    

 

 

 

ఆ.వె.

వచ్చు వానిని రఘు వరుని వీక్షించి శ

చీ పతి శరభంగుఁ జేరి యంత 

నొంటరిగను బలికె నొప్పుగఁ బల్కుల 

నివ్విధమ్ము గుట్టు నివ్వటిల్ల   

14.    

 

 

 

ఉ.

అల్లదె వచ్చు చుండె నిట కా రఘు రాముఁడు సంయ మీశ్వరా!

మెల్లగ నుంచు నన్నతఁడు మించి వచింపని చోటు నందుఁ దా

నెల్ల పనుల్ పచించి జయ మెల్లను గైకొని పల్కుఁ జేరి న

న్నల్లది దగ్గరై తనరు నన్య సుదుష్కర కార్య ముండెఁగా      

15.    

 

 

 

కం.

పలికి ముని యనుమతిం గొని 

బలరిపుఁ డా దాపసులను పన్నుగ మన్నిం

చి లలిత హయ యుక్త రథము

నలంకరించి రిపు దమనుఁ డరిగెను దివికిన్     

16.    

 

 

 

కం.

చనిన సహస్రాక్షుఁడు కని

యనల సమీప స్థితు ముని నా శరభంగుం

గనఁ జనె సపరిచ్ఛదముగ

ఘనుఁ డా రాఘవుఁడు రయముగ నెలమి మీఱన్     

17.    

 

 

 

చం.

రయమున మౌని యంఘ్రులకు రాముఁడు సీతయు లక్ష్మణుండునుం

బ్రియముగ మ్రొక్కి కూర్చొనిరి పిల్చి నొసంగఁగ నాసనమ్ములన్

దయ నిడ నాజ్ఞ నవ్విధము తాపస సత్తముఁ డంత నింద్రుఁ గూ

ర్చి యడుగ రాఘవుండు ముని శేఖరుఁ డింపుగఁ జెప్పె సర్వమున్          

18.    

 

 

 

కం.

నన్ను రఘూత్తమ! వరదుఁడు

మిన్నగ నొనరింపఁ దపము మేలుగ దివికిం

గ్రన్ననఁ గొనిపోవఁ దలఁచె

నన్నగ వైరియె యలభ్య మకృతాత్ములకున్    

19.    

 

 

 

తే.గీ.

నే నిచటఁ బురుష వ్యాఘ్ర నిన్ను గలసి 

ధార్మికవరు మహాత్మునిఁ దద్ద వేడ్క

నేఁగెద ముదముగఁ ద్రిదివం బెల్ల సురలు

మించి సేవించు చోటున కంచితముగ

20.   

 

 

 

కం.

నరశార్దూలా! యక్షయ!

వర లోకమ్ముల జయించి బ్రాహ్మ్యాదులతో

సుర లోకమ్ముల నింపుగఁ  

బరఁగితిఁ గైకొనుమ యిత్తుఁ బన్నుగ రామా!   

21.    

 

 

 

చం.

అన శరభంగుఁ డివ్విధి మహర్షి నరర్షభుఁ డా రఘూత్తముం

డనియెను సర్వ శాస్త్ర నిచ యార్థ విశారదుఁ డిట్లు పల్కులన్

ముని వర నే స్వయమ్ముగను బొందఁ దలంతును బుణ్య లోకముల్   

వనమున నుండ గోరుదుము భద్రపుఁ జోటును జూప వేఁడెదన్        

22.   

 

 

 

ఉ.

రాముఁడు శక్ర సన్నిభ బల ప్రవరుండు వచింపఁ బ్రాజ్ఞుఁడౌ

యా ముని పుంగవుండు విని హ్లాదముగన్ శరభంగుఁ డిట్లనెన్

రామ! సుతీక్ష్ణుఁ డన్ముని యరణ్యము నందు వసించు నింపుగా  

క్షేమ మొసంగు ధార్మికుఁడు శీఘ్రమ వేఁడిన నీకు నచ్చటన్      

23.   

 

 

 

తే.గీ.

తాపసిని మహాతేజునిఁ దగ సుతీక్ష్ణుఁ

గనుమ రమణీయ మింక నకల్మషంపు 

వాస మింపుగఁ గల్పించు వనము నందు

రామ! యా ముని నీ కనురాగ మలర

24.   

 

 

 

తే.గీ.

రామ! మందాకినీ నది రమ్య పుష్ప

తరణి ధారి వెల్లువకు నెదురు చనంగఁ

జేరఁ గల వచ్చట కెలమి దారి యగును

జక్కఁగ నిది తాపసుని యాశ్రమముఁ గాంచ       

25.   

 

 

 

ఆ.వె.

ఒక్క నిమిష మాగు మో తండ్రి! యిచ్చట

జీర్ణ గాత్రములను శీఘ్ర మేను

విడుచు నంత దనుక వీర! భుజంగము

స్వీయ చర్మ మడరి విడుచు నట్లు

26.   

 

 

 

తే.గీ.

అంత ముట్టించి యగ్ని సంయమి వరుండు

మంత్రముల వేల్చి హుతమును మహిత తేజుఁ

డపుడు శరభంగుఁ డింపుగ నగ్నిఁ దాఁ బ్ర

వేశ మొనరించెఁ గనుచుండ వింతగాను   

27.   

 

 

 

తే.గీ.

అమ్మహాత్ముని రోమ కేశాలి జీర్ణ

చర్మము నెముక లింక మాంసమ్ము శోణి

తమును సర్వము నగ్ని హోత్రమ్ము పూర్ణ

ముగ దహించి వైచెను వింత మూర నంత     

28.   

 

 

 

ఆ.వె.

ఆతఁ డనిల సన్నిభాంగుఁడు శరభంగుఁ

డగ్ని నుండి లేచె యౌవనుండు

కాఁగఁ బూర్ణముగను గాంతులీనుచు నిజ

తనువు నుండి వెలిఁగెఁ దాపసుండు    

29.   

 

 

 

తే.గీ.

ఆహితాగ్నుల ఋషుల మహాత్ముల సుర

నిచయ లోకములను దాటి నెమ్మి తోడఁ

దాపసుఁడు శరభంగుఁడు తరలి తరలి

బ్రహ్మ లోక మారోహించె రమ్యముగను   

30.   

 

 

 

కం.

ఇలఁ బుణ్య కర్ముఁడు ద్విజ వ

రుల శ్రేష్ఠుఁడు గాంచె ననుచరులతో నజునిన్ 

నలినాసనుండును ద్విజునిఁ

దిలకించి మురిసెఁ బలికెఁ గదియ స్వాగతమున్   

31.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నేనవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 6.

 

 

 

శరభంగ మహర్షి స్వర్గమున కేఁగ మును లందఱు కలసి రాముని చెంతకు నేఁగి రాక్షసుల వలన తమకుఁ గలిగిన యాపదల నెల్లఁ దెలిపి రాజ ధర్మముల నుగ్గడించి రక్కసులను జంపి తమను రక్షింప మని వేఁడుకొనఁగ రాముఁడు వారి కభయ మొసంగుట.   

 

 

 

 

కం.

దివి కేఁగఁగ శరభంగ ము

ని వరుఁడు ముని సంఘములు చనెఁ గలసి జేరన్

నృవరు జ్వలిత తేజస్విని

రవి వంశాంభోధి చంద్రు రయమున నంతన్

1.      

 

 

 

సీ.

చేరిరి రాముని మూరి వానప్రస్థులును వాలఖిల్యులు నిన శశి కిర

ణాస్వాదకులు సంత తాశ్మ కుట్టు లనేక పత్ర భోజనులు తాపసులు స్వీయ

దంత భంజిత శాలి తండము నుదక సంస్థితులు ఘన మునులు తీవ్ర జపులు

చర్మ త ల్పాతల్ప సంచయ మంబర వాసులు కేవల వారిపులును

 

తే.గీ.

వాయు భక్షులు గిరి శృంగ వాసు లవని

శయ్యులు వ్రత కృశులు దమ శాంతు లార్ద్ర

వస్త్ర జపులు నిత్య తపులు పంచ వహ్ని

జపులు బ్రహ్మ తేజులు దృఢ సంయములును  

2.     

 

 

 

కం.

చేరి మునులు ధర్మజ్ఞులు

నా రాముని ధర్మ భృతుల యం దుత్తమునిన్

గౌరవము తోడఁ బల్కిరి

మూరి కలసి వారు వచనముల నిబ్భంగిన్ 

3.     

 

 

 

తే.గీ.

రామ! యిక్ష్వాకు కుల ముఖ్య రాజు వీవు

ధాత్రి కెల్ల మహారథ! ధవుఁడ వయ్య

యాదితేయుల కెల్ల బలారి భంగి

విక్రమ యశస్సులఁ ద్రిజగ ద్విశ్రుతుఁడవు  

4.     

 

 

 

తే.గీ.

పుష్కలములు సత్యము ధర్మము పితృభక్తి

నా గుణములు నీ యందు ననవరతమ్ము

ధర్మ నిరత! మహాత్ముండ! ధర్మవేత్త! 

వేఁడ రాఁగ నాథ! క్షమింపు ప్రీతి మమ్ము

5.     

 

 

 

కం.

కొని యాఱవ భాగ మరిని

జన నాథుఁడు రక్ష నీయ జనుల కిలఁ దలం

పనిచో నిజ పుత్రుల భం

గిని ఘో రాధర్మమె పరికింపఁ గుమారా!    

6.     

 

 

 

చం.

కన నిల రాజు ప్రాణముల కన్నను మిన్నగఁ బ్రీతి పాత్రులౌ

తనయుల భంగి యుక్తపు విధమ్మునఁ బౌరుల నెల్ల నిత్యమున్  

ఘనముగ నందు శాశ్వత మఖర్వపుఁ గీర్తినిఁ బెక్కు వర్షముల్

దనరెడు దాని వాక్పతి పదమ్ము లభింపఁగ వెల్గు నచ్చటన్    

7.     

 

 

 

కం.

పాలన మొనరింపఁ బ్రజల

మూల ఫలాశనులు సేయు పుణ్యఁపుఁ బనిలో  

నాలవ భాగము వొందును

మేలుగ ధర్మ గతినిఁ బుడమి ధవుఁడు రామా!    

8.     

 

 

 

ఆ.వె.

పరఁగ నీవు పతిగఁ బరమ వానప్రస్తు

లధికులు ద్విజ వరులు నటవిలో న

నాథుల వలె దనుజ నాథుల చేఁ జంపఁ

బడుచు నుండి రిచట బెడిదముగను    

9.     

 

 

 

కం.

ముని వరుల భావితాత్ముల

దనుజలచేఁ జంపఁబడిన తాపసుల శరీ

ర నికాయము లిటఁ గాంచుమ

యనేకములఁ గాననమున నంభోజాక్షా!  

10.    

 

 

 

తే.గీ.

పుణ్య పంపా నదీ తీర ముని పదములఁ 

బరమ మందాకినీ పరిసరము లందు 

మేటి పర్వత మా చిత్రకూట మందుఁ 

గదనము సెలంగు ఘోరముగను సతమ్ము

11.    

 

 

 

తే.గీ.

భీమ కర్ములు రాక్షస వీర వరులు

తాపసులకు మా కొనరింత్రు పాప కృత్య

ము లపకారములను వనమున నరవర!

సైపఁ జాలక యుంటిమి చూపు కరుణ        

12.    

 

 

 

ఉ.

రామ యిలన్ శరణ్యుఁడవు రమ్యముగా శరణార్థి కోటికిన్ 

మే మిట నిన్ను జేరితిమి మిన్నగ రక్షణ మెంచి యిత్తఱిన్

భీమ బలోగ్ర దర్పితులు వేదన లిచ్చి వధించు చుండఁగా 

నీ మను జాశ నాధములు హీన విధమ్ముగఁ బ్రోవు మమ్మిటన్

13.    

 

 

 

ఆ.వె.

నేరము ధరలోన నీకన్న నన్యుని

దిక్కు రాజపుత్ర! దిక్కు లందుఁ 

గావు మయ్య మమ్ము కాకుత్స్థ! దనుజుల

బారి నుండి వేగ వీర! దయను

14.    

 

 

 

కం.

విని ధర్మాత్ముఁడు రాముఁడు

ఘన తాపసు లట్లు పలుకఁ గాకుత్స్థుఁడు తా

ననె నెల్లర వీక్షించుచుఁ

గనికరమున కర్హుల నెదఁ గరుణ జనింపన్     

15.    

 

 

 

ఆ.వె.

తగదు పలుక నిట్లు తాపస వరుల యా

నతికి నర్హుఁడ ననియె తలఁతు మది

నాత్మ కార్యమునకె యడవి కిప్పగిది రా

వలసి యుండె మౌనివర్యు లార!

16.    

 

 

 

ఆ.వె.

జనకు నాజ్ఞ నూని చరియించు వాఁడ నై 

చేరితిని వనమ్ము చెలువముగను

రాక్షసు లొనరించు నక్షయ కష్టము

లఁ దొలఁగింప మీకు నదనుఁ గంటి

17.    

 

 

 

తే.గీ.

ఇచట మీ కార్య సిద్ధికి నేమొ గాంచ

నేను యాదృచ్ఛికముగ వని కరు దెంచి

తి మునులార! నాదు వన వాస మిఁక నొసఁగు

గొప్ప ఫలము నా కిప్పుడు తప్పకుండ

18.    

 

 

 

కం.

రణమునఁ జంపఁ దలఁతు నరి

గణము నసుర వర్గము నపకారంపుం గా

రణమున వీక్షింతురు ముని

మణు లనుజుని తోడ నా సమర వీర్యమ్మున్

19.    

 

 

 

ఆ.వె.

మునుల కభయ మొసఁగి ఘన దృఢ మతి ధర్మ

మెంచి కీర్తనీయుఁ డేఁగఁ జాగె

లక్ష్మణు నవనిజను రాముఁడు గూడి సు

తీక్ష్ణుఁ గన మును లరుదెంచు చుండ       

20.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నాఱవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 7.

 

 

 

సీతా రామ లక్ష్మణులు మునులతోఁ గూడి మహర్షి సుతీక్ష్ణుని యాశ్రమము సేరుట, సుతీక్ష్ణుఁడు వారిని సత్కరించి తన తపో బలమునఁ బడసిన పుణ్య లోకముల నిత్తుఁ గైకొను మన రాముఁడు తాను స్వయముగ నవి పొందఁ గోరెద నని పలికి తా ముండుటకుఁ దగిన చోటు చూపుఁ డని వేఁడి యా రాత్రి యచట వసించుట.    

 

 

 

 

కం.

తమ్ముడు సీతయుఁ దోడుగ

నెమ్మి వెనుక రా నరిఘ్న నీరజ నేత్రుం

డిమ్ముగ రాముండు కదిసె

నమ్మునుల యుతము మహర్షి నరయ సుతీక్ష్ణున్   

1.      

 

 

 

కం.

చని కడు దూరం బా దా

రిని నాపగ దాఁటి వావిరి జల యుతమ్ముం

గనె నాతఁడు విమల మహా

ఘన సదృశోన్నత నగమ్ముఁ గమనీయముగన్  

2.     

 

 

 

ఆ.వె.

చొచ్చి రంత వారు శూరు లిక్ష్వాకు వ

రేణ్యులు రఘు వంశ నృవరు లతివ

సీత తోడ నా విశిష్ట కాననమును  

వివిధ వృక్ష రాజ విలసితమును  

3.     

 

 

 

చం.

వనమును జేరి ఘోరమును భాసిత పుష్ప ఫల ద్రుమమ్మునుం

గని రట నుండి యొంటరిగఁ గన్పడ నెల్లెడ నారబట్టలే

తనరెడు నాశ్రమమ్మునను దాపసి వృద్ధు సుతీక్ష్ణుఁ గాంచి ప

ల్కెను రఘురాముఁ డత్యుచిత లీలను నా మల పంక జూటునిన్   

4.     

 

 

 

ఆ.వె.

సత్యవిక్రమ! ముని సత్తమ! రాముఁడ

నేను మిమ్ముఁ గాంచఁ గాననమున 

నేఁగు దెంచితిఁ దమి నింపుగ ధర్మజ్ఞ!

పల్కుఁడు దయఁ గాంచి పన్నుగ నను  

5.     

 

 

 

కం.

కని ధీరుని ధర్మ నిరత

జన ప్రవరు రాముని ముని చక్కఁగ నంతన్

ఘనుఁ గర యుగమున నాలిం

గనము సుతీక్ష్ణుం డొనర్చి కమ్మగఁ బలికెన్      

6.     

 

 

 

తే.గీ.

స్వాగతమ్ము రఘూత్తమ సత్యభృతుల

శ్రేష్ఠ! యాశ్రమమ్మున కిప్డు సేర నీవు

నాథ వంత మైనది రామ! నలిన నేత్ర!

ముని నిలయ మెల్లఁ జక్కఁగ మోద మలర      

7.     

 

 

 

తే.గీ.

వేచు చుంటిని నీ కయి వితత కీర్తి

మంత! దేహమ్ము విడనాడి మహిని స్వర్గ

మేఁగ నెంచక నిజ రాజ్య హీనుఁడ వయి

చిత్రకూట నగము వింటి  జేరితి వని

8.     

 

 

 

ఆ.వె.

దేవ రా జిట కరుదెంచి  శతక్రతు

వమర వరుఁడు సెప్పె నఖిల లోక

ముల జయించితి నని పుణ్యకర్మమ్ముల

రాఘవేంద్ర! నన్నరసి నరవర!     

9.     

 

 

 

తే.గీ.

తపముచేఁ బడసిన నారద ముఖ మునులు

దనరు జగముల మత్ప్రసాదమున రామ!

భార్య ననుజు లక్ష్మణుఁ గూడి భద్రముగను

నీవు విహరింపు మింపుగ నీరజాక్ష!     

10.    

 

 

 

చం.

అనినఁ దపస్వి సత్య వచ నాళి రతుం డిటు లా రఘూత్తముం

డనియెను గశ్యపుండు నలినాసనుతో వచియించు రీతినిన్

ముని వర నే స్వయమ్ముగను బొందఁ దలంతును బుణ్య లోకముల్   

వనమున నుండ గోరుదుము భద్రపుఁ జోటును జూప వేఁడెదన్        

11.    

 

 

 

తే.గీ.

మీర లెల్లెడ కుశలమ్ము కోరు చుంద్రు 

సర్వ భూతముల హితము సక్కఁగాను 

గౌత మాన్వయుండు శరభంగ పరమర్షి

నాకు వచియించె మిముఁ గూర్చి ప్రాకటముగ    

12.    

 

 

 

ఆ.వె.

పలుక రాముఁ డిట్లు పరమర్షి హర్ష ము

ప్పొంగఁ బలికె మధురముగ మునింగి

హర్ష వారిరాశి నమ్మహాత్ముఁడు సుతీ

క్ష్ణుండు వాక్యములను గూర్మి మీఱ   

13.    

 

 

 

కం.

ముని సంఘానుచరిత మీ

ఘనాశ్రమము మూల ఫల నికాయ సమృద్ధ

మ్మును గుణవంతము రాఘవ!

మన మలర వసింపు మిచట మనుజ వరేణ్యా!   

14.    

 

 

 

కం.

అరుదెంచి యాశ్రమమునకు

విరివిగ మృగ సంఘ మడరి వీత భయమ్ముం

జరియించి లోభపఱచుచు

మరలుచు నుండు రఘురామ మాన్య వరేణ్యా!  

15.    

 

 

 

తే.గీ.

మృగములకు మిన్న నన్యము మృగ్య మిచట

దోష మెఱుఁగుమ దీనినిఁ దోరముగను

విని ముని పలుకు లివ్విధ మనెను లక్ష్మ

ణాగ్రజుఁడు వింటి నెత్తుచు నమ్ము తోడ

16.    

 

 

 

ఆ.వె.

వచ్చిన మృగ రాశిఁ బరమ నిశిత బాణ

ముల వధింతు నశని వలెఁ జెలంగు

వాని చేతఁ బుణ్య భావ మహా భాగ!  

యాశ్రమ జనులకు భయమ్ము తొలఁగ

17.    

 

 

 

ఆ.వె.

అది యొసంగు మీకు నలమట మిన్నగ

దాని కన్న మిన్న దలఁప నన్య

మొండు నుండఁ గలదె యుండ నిటఁ జిరమ్ము

పాడి కాదు మాకు వర మునీంద్ర!    

18.    

 

 

 

తే.గీ.

పన్నుగ వచించి రాముఁడు మిన్నకుండె 

నంత పడమటి సంధ్య రా నతఁడు వార్చి 

రాముఁ డాశ్రమ మున దార లక్ష్మణులను 

గూడి రమ్యమున వసతిఁ గూర్చె నడరి  

19.    

 

 

 

కం.

చని సంధ్య రాతిరి సెలఁగ 

ముని వరుఁడు సుతీక్ష్ణుఁ డొసఁగె భోజన మంతన్ 

మనుజర్షభులకు స్వయముగ  

ముని యోగ్యమ్మును గడు శుభమును మన్ననతో      

20.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నేడవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 8.

 

 

 

సుతీక్ష్ణునిచే గౌరవింపఁబడి రామలక్ష్మణు లా రాత్రి యచట సుఖముగఁ గడపి ప్రభాతమున లేచి మహర్షి యనుమతిఁ గొని సీత యిచ్చిన ధనుస్సులు తూణీరములు ఖడ్గములు ధరించి సుందర మైన దండకారణ్యమునకు మునులతోఁ గూడి పయన మగుట.    

 

 

 

 

కం.

మన్ననల నంది మునిచే

మిన్నగ రాముం డనుజ సమేతము నిశనుం

జెన్నుగఁ గడపి యుదయమునఁ

గ్రన్నన మేల్కొనె నుచితపుఁ గాలము నందున్       

1.      

 

 

 

ఆ.వె.

లేచి తగిన వేళ లేమ సీతను గూడి

రఘు కుల తిలకుండు రాముఁ డంత

నుదకము స్పృశియించె నుత్పల గంధమ్ము

శీతలమును సుగుణ శేఖరుండు     

2.     

 

 

 

కం.

కలసి యపుడు సీతా రా

మ లక్ష్మణు లుదిత విధం బమర గణ శిఖులన్

లలితమ్ముగ నర్చించి ము

నులకు శరణ్య మగు వని ఘనులు ముద మారన్    

3.     

 

 

 

కం.

ఉదయించు ప్రభాకరుఁ గని

వదలిన కల్మషము లున్న వారు సుతీక్ష్ణుం

గదిసి మహర్షినిఁ బల్కిరి

మృదువుగ వచనమ్ము లిట్లు  నృగణ వరేణ్యుల్

4.     

 

 

 

తే.గీ.

గౌరవింపఁగ మునివర! గారవమున

మమ్ము దేవ! కలుగఁగ సుఖమ్ము మా కి

చట వసించితిమి నిశినిఁ జన ననుమతి 

వేఁడెదము పల్కిరి మునులు వేగిర మని      

5.     

 

 

 

తే.గీ.

దండకారణ్య వాసుల దర్శనమ్ము

న కయి యాశ్రమ మండలము కదియంగఁ

ద్వరపడుచు నుంటి మిప్పు డీ తాపసులను

గూడి పుణ్య శీలుర నెల్ల వేడుకగను    

6.     

 

 

 

ఉ.

కోరెద మీ మునివ్రజముఁ గూడి తపో ధన ధర్మ నిత్యులన్ 

మూరెడు వారి నగ్ని వలె ముక్త శిఖావలి పుణ్య దాంతులన్

సార కృపార సామృత లసన్మహి మాన్విత వాక్చయమ్ములన్ 

వార కనుజ్ఞ నిం డనెను బన్నుగ నంజలి నూని మ్రొక్కుచున్     

7.     

 

 

 

చం.

చెడు కుల జాతుఁ డర్థమును చెడ్డ పథమ్ముల నంది గర్వ మం

దెడు నరు భంగి దుస్సహపుఁ దేజముతో రవి రాక మున్నయే

వడిఁ జన నెంతు మెల్లరము పల్కి రఘూత్తముఁ డివ్విధమ్ము దా

నడుగులు తాఁకి సీతను నిజానుజుఁ గూడి నమస్కరింపఁగా     

8.     

 

 

 

తే.గీ.

చరణముల నంటు వారిని నరసి లేపి

ముని వరేణ్యుఁ డపుడు గాఢముగను గౌఁగి

లించుకొని ప్రీతి సెలఁగంగ నంచితముగ

నంతఁ బలికె వాక్యము లిట్లు సంతసమున    

9.     

 

 

 

ఆ.వె.

భద్ర పథము నందుఁ బన్నుగఁ జనుమ సౌ

మిత్రిఁ గూడి యింక మేదిని నిను

ఛాయ భంగిఁ దివిరి సతత మనుసరించు

సీత తోడ రామ! శీఘ్రముగను

10.    

 

 

 

తే.గీ.

దండ కారణ్య వాసుల తపము చేత

బ్రహ్మ నెఱిఁగిన వారి తపస్వుల కడు

రమ్య మైన యాశ్రమమును రామ! గాంచు

మచట వీరవరా! ముదమార నెడఁద     

11.    

 

 

 

చం.

పురువుగఁ బండ్లు మూలములు పూసిన కానలు జంతుజాలమున్

గురు శమి తాండ జావళులు కోమల ఫుల్ల సరోజ షండముల్

వర విమ లోదకమ్ములును బద్మిను లుండఁగఁ గన్నె లేళ్లులున్ 

గిరి వర నిర్ఝరమ్ములు వికీర్ణిత కేకి ర వాటవీ తతుల్              

12.    

 

 

 

ఆ.వె.

రమ్య దృశ్యముల నరయ నింపుగ నచట

కేఁగు మయ్య రామ యెలమి మీఱఁ 

జక్కఁగఁ జను మయ్య సౌమిత్రి నీవును 

జూచి తిరిగి నన్ను జూడ వలయు

13.    

 

 

 

ఆ.వె.

ఇట్లు పలుక సంయ మీంద్రుండు కాకుత్స్థుఁ

డట్లె యని వచించి యంత లక్ష్మ

ణుని సహితము సేసి ముని వరునకుఁ బ్రద

క్షిణము కదలెను వనికి నరుగంగ    

14.    

 

 

 

తే.గీ.

అంబులపొదిని వింటిని నాయతాక్షి

సీత యొసఁగెఁ గృపాణ విశిష్టములను

భ్రాతలకు వారిరువురకు రామలక్ష్మ

ణులకు సంప్రీతి నప్పుడు నుత గుణవతి   

15.    

 

 

 

ఆ.వె.

అందుకొని ధనువుల నార్భటములఁ దూణ

ముల నుభయులు కట్టి యలరి మిగుల

నాశ్రమమ్ము నుండి యా రఘు వీరులు

వెడలఁ దొడఁగి రంత వేగముగను   

16.    

 

 

 

కం.

సీతను గూడి ధనుర్ధరు

లాతత భాగ్య విలసితులు నాత్మప్రభలన్

ద్యోతితు లతి సుందర తను

లే తరలిరి రాఘవులు మహీప కుమారుల్     

17.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నెనిమిదవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 9.

 

 

 

మహర్షి సుతీక్ష్ణుని యనుమతిఁ గొని రాముఁడు చనుచుండఁ జేరి పతిని సీత హృద్యముగాఁ బ్రేమ తోడను రాజ్యమును వీడిన క్షత్రియునకు నాయుధములతో హింసకుఁ బాల్పడ నేల యని యాయుధముల వలన కలుగు ననర్థములను దృష్టాంతములతో వక్కాణించి స్త్రీ చాపల్యమున నిట్లు పలికితి నని మీకు నుపదేశింపఁ గల వా రెవరని తమ్మునితోఁ జక్కఁగ నాలోచించి తోఁచిన విధముగా నచిరము చేయఁ డని పలుకుట.  

 

 

 

 

కం.

కైకొని సుతీక్ష్ణు ననుమతి

కాకుత్స్థుఁడు చనుచు నుండఁ గదియుచుఁ బతితో 

నా కాంతామణి జానకి

వీఁకన్ హృద్యముగ నిట్లు ప్రీతిం బలికెన్   

1.      

 

 

 

ఆ.వె.

కరము సూక్ష్మపు విధిఁ గలుగు గొప్ప దగు నీ

ధర్మ మార్యపుత్ర! తథ్యముగను

గామ జనిత రక్తి నే మనుజుండు మ

రల్చు శక్య మగు నరయ నతనికె  

2.     

 

 

 

చం.

నరులకు కల్గు మూడు వ్యసనమ్ములు కోరికలన్ జనించుచుం

బరము లసత్య వాక్యములు పన్నుగ నెంచఁగ వచ్చు ముందుగం  

బరుల సతీ మతల్లులను బైకొను యత్నము వైర హీనమే 

పరఁగుట రౌద్ర మెల్లెడల  భార తరమ్ములు రెండు నంత్యముల్  

3.     

 

 

 

తే.గీ.

మున్ను గనము మిథ్యా వాక్యము గన లేమె

యింక ముందు నీ లో రామ! యింతు లందుఁ 

బరుల దారలం దభిలాష పరమ ధర్మ

నాశనం బది యెక్కడ నాథ! నీకు  

4.     

 

 

 

ఆ.వె.

మానవర్షభ యనుమాన మేల యది లే

దెన్నఁ డయిన నీకు నెంచి చూడ

నుండ దింక రాఘవుండ! మనము నందు

నైనఁ గొంచె మయిన నరయ లేము       

5.     

 

 

 

చం.

నిజ సతి యందు మిక్కుటము నిత్యము బంధము నీకు రాఘవా!

ఋజువుగ సత్య సంధుఁడవు నెక్కుడు ధర్మము నందు రక్తియే

నిజ జన కాజ్ఞ నెన్నుదువు నిత్యము ధర్మము నిల్చు లక్ష్మణా

గ్రజ! మఱి సత్య మింపుగను రాఘవ! నీ మెయి సుస్తిరమ్ముగన్

6.     

 

 

 

తే.గీ.

శక్య మగును మహా బాహు! చక్కఁగ నది

యెల్ల ధరియింప ధాత్రి జితేంద్రియులకె

యింద్రియములు నీ వశ మందు నెలమి యుంట

నే నెఱుంగుదు శుభరూప! నీరజాక్ష!       

7.     

 

 

 

ఉ.

మూడవ దక్కటా భృశము మూరెను రౌద్రము ప్రాణి హింసనం

బే డగరమ్ము వైర మది యింతయు నుండ కెడంద నెంచుచున్

నేఁ డిటఁ దాపసావనము నిష్ఠఁ బ్రతిజ్ఞ యొనర్చితీ వహో

వాఁడిగ దండకాటవి క్షపాచరులన్ వధియింప నాజిలో

8.     

 

 

 

తే.గీ.

ఈ నిమిత్తమ భ్రాతతో నేఁగు దెంచి

తీవు దండకావనమున కిప్పు డూని

చాప బాణము లది చూచి చాల చింత

యొదవెఁ జింతింతు నీ హిత మొప్పు గాను   

9.     

 

 

 

కం.

చన దండకావనమ్మున

కు నాకు రుచియింప దిప్డు ఘోరాటవికిన్ 

వినుఁడు నుడువంగఁ గారణ

మును వీర వరేణ్య!  భద్రముఁ దలఁతు మీకున్

10.    

 

 

 

ఆ.వె.

లక్ష్మణ సహితం బరణ్యమున కరుదెం

చి విలు నమ్ములు గొని చేత ధృతిని 

విరివిగఁ జెలరేఁగి వెచ్చింతు రమ్ములు

కానను వన చరులు కంటఁ బడిన  

11.    

 

 

 

తే.గీ.

క్షత్రియుల హస్త మందుండు కార్ముకమ్ము

జాతవేదుని యింధన సన్నిభమ్ము

చెంత వెలయంగ నయ్యది శ్రేష్ఠముగను

బెంచు బలమును దేజమ్ము మించి సతము   

12.    

 

 

 

తే.గీ.

పూర్వమున మహాబాహు! తపోనిరతుఁ డొ

కండు సత్యవాక్కుఁడు శుచి కలఁడు మృగ వి

హంగ విలసిత పుణ్య మహాటవిని వ

సించుచు మహర్షి సత్తముఁ డంచితముగ       

13.    

 

 

 

చం.

ఋషికిఁ దలంచి విఘ్న మొనరింపఁ దపమ్మున శక్రుఁ డంతఁ బౌ

రుషమున నేఁగుదెంచి భట రూపము నూని కృపాణ హస్తుఁడై

విషయము చెంత కిచ్చె నసి వెల్గుచు నుండఁ దపమ్ము నందు నా

ఋషిఁ గని మ్రొక్కి తాఁ గుదువ యియ్యది యంచు వచించి నమ్రతన్   

14.    

 

 

 

మ.

కరవాలమ్మును దా గ్రహించి ముని తత్కాంతార మధ్యమ్మునం

జరియింపంగ సతమ్ము న్యాస పరి రక్షా దక్షతన్ నిల్చుచున్ 

వర ఖడ్గమ్మును వీడ కెన్నడును దా వన్యమ్ములం గైకొనం

దిరుగుం గానన మందుఁ దాపసుఁడు సందేహింప కింతేనియున్   

15.    

 

 

 

మ.

విరతిం దాపస శుద్ధ కార్య మెదలో వీక్షింపఁగా నేరకే 

కరవాలమ్ము వహింప రౌద్రముఁ దపః కాంతుండు వూనెన్ మదిన్

నిరతం బుండఁగ నట్లు రౌద్రమునఁ దా నిర్భీతి ధర్మచ్యుతిం

బరఁగం గృత్యము లం దహో నరకమే ప్రాప్తించె నా మౌనికిన్           

16.    

 

 

 

తే.గీ.

కత్తి పట్టఁగ నయ్యె నీ వృత్త మెల్ల

శస్త్ర సంయోగ మంగార సంగ మాభ

మందురు బుధులు నే స్నేహ మందు గౌర

వమ్మున వచియింతును గఱపంగఁ గాదు   

17.    

 

 

 

తే.గీ.

చాప మూని నీ వెన్నఁడు నే పగయును 

లేక దండ కాశ్రితులను వీఁక రక్క

సుల వధింపఁ దగదు సుమ్ము శూర! నిరప

రాధులం జంప నకట యర్హమ్ము కాదు             

18.    

 

 

 

కం.

వనమున నాత్మైక నిరత

మునులకు నార్తుల కొసఁగ సముచి తావనమున్

ధను వంతవఱ కవసర మ

గును క్షత్రియులకు గణింప  గురు వీరులకున్

19.    

 

 

 

చం.

వనములు హేతు లెక్కడ తపమ్ములు క్షాత్రము లెక్క డెంచఁగన్

మన మిట నాక్రమించితిమి మాన్య మునీశ్వర భూమి నివ్విధం

బనువుగ దేశ ధర్మ మగు నాదరణీయము నాథ యిత్తఱిన్

మనమునఁ జింత సేయుమ యనాదర మేల నొసంగ మీ కిటుల్    

20.   

 

 

 

ఆ.వె.

ఆయుధమ్ము నూన నార్య! పుట్టుఁ గలుష

బుద్ధి డెంద మందు మూరి కరము   

సని యయోధ్య కచట క్షాత్ర ధర్మమ్మును

దిరిగి చూప వచ్చు నరవరేణ్య!    

21.    

 

 

 

ఆ.వె.

అక్షయంపు హర్ష మత్త మామల కిత్తు

వయిన నీవు మునివి యటవి లోన

విడిచి రాజ్య మెల్ల వీరవరేణ్య! ర

క్తి నునుచి తప మందుఁ గీర్తిమంత!    

22.   

 

 

 

తే.గీ.

ధర్మమునఁ గల్గు విత్తము తథ్యముగను

ధర్మమునఁ బ్రభవించును ధరను సుఖము

ధర్మమున సర్వము లభించుఁ దలఁచి చూడ

ధర్మ సారమ్ము జగ మెల్ల మర్మ మిదియ

23.   

 

 

 

తే.గీ.

తమ్ము తాము కృశింపఁగ నెమ్మిఁ జేసి

కొని నిపుణులు నియమములఁ దనరి తివిరి  

పడయుదురు ధర్మ మింపుగఁ బడయ లేరు

సుఖము లెన్నఁడు సుఖములఁ జోద్యముగను        

24.   

 

 

 

కం.

చరియింపుమ ధర్మమ్మునఁ

బరఁగ శుచి మతియె తపః ప్రభా వనిని నిజం

బరయఁగ ముజ్జగము లెఱుక  

గురు తరముగ సౌమ్య! నీకుఁ గువలయ నేత్రా!    

25.   

 

 

 

కం.

అబలా చాపల్యమ్మున

ను బలికితిని పరులు నీకు నుడువం గలరే

సుబలుడు తమ్ముని భావ

మ్ముఁ బరిగణించి తగఁ జేయుము యథేచ్ఛ వడిన్  

26.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందుఁ దొమ్మిదవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 10.

 

 

 

సీత భర్తపైఁ బ్రేమతోఁ బలికిన వచనముల నాలకించి రాముఁడు శరణు వేఁడిన మునివరుల రక్షణ మత్యంత ధర్మ యుక్త మైన కర్తవ్యమని వివరించుట.  

 

 

 

 

కం.

బదులు వచించెను విని యా

సుదతీ మణి సీత పలుక సురుచిర భక్తిన్

సదమల ధర్మ స్థితుఁ డెద

ముద మూని రఘూత్తముండు ముగుదకు నిట్లున్      

1.      

 

 

 

ఉ.

చెప్పితి యుక్త వాక్యములు స్నేహ యుతమ్ముగ దేవి! ధర్మమున్

గొప్పగ నేరు దీవు సుమకోమలి! నా హిత మెంచి చక్కఁగా 

నొప్పఁగ నీ కులమ్మునకు నొక్కటి చెప్పుదు నీవ యంటివే   

యిప్పు డణంగు నార్తరవ మీశుఁడు చాపము నూని నిల్చినన్   

2.     

 

 

 

తే.గీ.

దండకారణ్య వాసులు తాపసేంద్రు

లు శరణార్హులు సువ్రతులు స్వయ మేఁగు

దెంచి సీత! నన్ను శరణ మంచితముగ 

వేఁడి రార్తులు భృశముగ వేఁగు చుండి   

3.     

 

 

 

చం.

వని నివసించుచుం గరము పాలన సేయుచు ధర్మ మెప్పుడుం 

దినుచును బండ్లు మూలములు తీవ్ర భయమ్మున వీత సౌఖ్యులై 

మును లిటఁ గ్రూర నిత్య నర భోజన రాక్షస కోటి భక్షణ

మ్మును గను చుండి రెల్లరును బూనుచు వే నియమమ్ము లింపుగన్    

4.     

 

 

 

తే.గీ.

తినఁ బడుచు నుండ దండకావన ముని వరు

లట్లు రాక్షస తతి చేత నా ద్విజేంద్రు

లరుగుదెంచి మమ్ముల నెల్ల నడరి కావు

మయ్య యని పల్కి రెల్లరు నార్తి తోడ

5.     

 

 

 

కం.

వారి వదన చ్యుత గిరల

నా రీతి విని చరణముల నంటి పలికితిన్

మూరుచు నీ వాక్యమ్ముల

వీరోచితములను నేను వినుమా సీతా!

6.     

 

 

 

ఆ.వె.

ఇవ్విధమ్ము మీర లేతెంచ మునులార!

యర్హులు కదియఁ బడ నకట కలిగె

సిగ్గు నాకు మిగుల నెగ్గు సైరింప వేఁ

డుదుఁ గరుణ వహింపుఁడు నను గాంచి       

7.     

 

 

 

కం.

నే నేమి జేయ నర్హుఁడ

దాని వచింపుఁ డని యడుగఁ దాపసు లంతన్

దీనమ్ముగ వాక్యమ్ములు

వీనులఁ బడ ననిరి కలసి వేదన తోడన్   

8.     

 

 

 

తే.గీ.

కామ రూపులు పెక్కురు భీమ రాక్ష

సు లడరుచు దండ కావని  సువ్రతులను

మమ్ము బాధించు చుంటిరి మాన వేంద్ర!

రక్ష నొసఁగుమ మా కెల్ల రామ! కరుణ

9.     

 

 

 

ఆ.వె.

అనఘ! హోమ వేళ లందుఁ బర్వముల దు

రాసదు లరుదెంచి రోస మూని

పలల భోజను లసురులు భాధ లొసఁగుచు

నున్న వారు మాకు మిన్నగాను

10.    

 

 

 

ఆ.వె.

రాక్ష సోగ్ర గణ నిరంతర పీడితు

లకు ననాథ మౌనులకును రక్ష

కై వెదకెడు వారి కౌదు వీవ పరమ

గతివి రాఘవేంద్ర! కమల నేత్ర!

11.    

 

 

 

కం.

సమయింపఁగ రక్కసులను

సమర్థుల మయినఁ దపంపు శక్తిఁ దపః క్షీ

ణము వాంఛింపము సుంత చి

ర మార్జితము సుమ్ము తపము రఘుకుల వీరా!

12.    

 

 

 

కం.

బహు విఘ్నంబుల నిత్తురు

సహింపఁగ నశక్య మయ్యె సంతత మిచటన్

విహరించి యథేచ్ఛను దిన

నహ రహమున్ మము శపింప నడరము రామా!

13.    

 

 

 

ఆ.వె.

దండకావనమున దైత్య బాధితులము 

మేము దుఃఖితులము రామ! భ్రాత

తోడఁ గలసి మమ్ము తూర్ణము రక్షింపు

మీవ నాథుఁడ విట నెంచ మాకు

14.    

 

 

 

కం.

విని యా ఋషుల వచనములు

జనకాత్మజ! పాలనమ్ము సలుపఁ బ్రతిజ్ఞన్

మునులను సంపూర్ణమ్ముగ 

వనిలోన నొనర్చితి ధృతి వారక యంతన్

15.    

 

 

 

ఆ.వె.

ప్రతిన సేసి యట్లు బ్రతికి యుండఁగ నన్య

గతి నొనర్పఁ జాల నతివ! మునుల

కెన్నఁ డేని నేను మిన్నగఁ బ్రీతి స

త్యమ్ము నాకుఁ జాల వమ్ము సేయ     

16.    

 

 

 

తే.గీ.

విడువఁ గల జీవితమ్మును వెఱపు లేక

విడువఁ గల నిన్ను లక్ష్మణు నుడువు కొఱకు

విడువ లేను జేసి ప్రతిన విప్రుల కయి

ముఖ్యముగ జనకాత్మజ! పుడమి లోన   

17.    

 

 

 

కం.

మునుల పరిపాలనము నా

కు నవశ్యము సేయ నింకఁ గోరక యున్నన్

మునులం బాలింప వలయు 

ననినం జెప్పంగ నేల నాడఁగఁ బ్రతినన్    

18.    

 

 

 

కం.

నా పైఁ గల ప్రేమ వలన 

నా పై సౌహార్ద ముండ నత్యధికముగా 

నోపితి విట్లు వచించుట

కై పొరపాటు గన సీత! హర్షం బయ్యెన్     

19.    

 

 

 

కం.

అనుకూలము నీకుఁ గుల

మ్మునకును దగి నట్టి వాక్యము పలికి తిట్లున్ 

వినుమా సధర్మ చారిణి! 

నిను బ్రాణమ్ములకు మిన్న నేఁ దలఁతు మదిన్

20.   

 

 

 

తే.గీ.

పలికి యిట్లు మహాత్ముఁడు లలిత వాక్య

ములను దయిత విదేహ రాట్పుత్రి తోడ

ధనువు నూని లక్ష్మణుఁ గూడి తరలె రాముఁ

డపుడు రమ్యము లగు తపో విపినములకు   

21.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందుఁ బదవ సర్గము.

 

 

అరణ్య కాండము

సర్గము 11.

 

 

 

సీతా రామ లక్ష్మణులు వనమునఁ బయనించి ధర్మభృత మహర్షినిఁ గాంచి పంచాప్సరస మను సరస్సును గాంచి మాండకర్ణి మహర్షి చరిత్ర మెఱిఁగి యచట మునుల నిలయములలో వరుసగా కొంత కాలము చొప్పున నివసింపఁగాఁ బది వత్సరములు గడవఁ దిరిగి సుతీక్ష్ణుని యాశ్రమమునకు వచ్చి ముని వలన యగస్త్య మహర్షి సోదరుని యగస్త్య ముని  యాశ్రమములకు  మార్గము నెఱిఁగి దారిలో రాముఁడు తమ్మునకు నిల్వల వాతాపుల చరిత్రము వచించుచు నగస్త్య మహర్షి తమ్ముఁ డగు సుదర్శన మునినిఁ గలిసి యగస్త్య మహర్షి యాశ్రమమును జేరుకొనుట.        

 

 

 

 

కం.

తరలఁగ రాముం డగ్రము

న రమణి సన్నని నడుమున నడవఁగ నడుమన్

ధరణిజ వెనుకను  లక్ష్మణుఁ

డరి దమనుండు వడి నేఁగె నస్త్రము తోడన్

1.      

 

 

 

చం.

వివిధము లైన శైలముల వీక్షణ మేర్పడ సుందరమ్ములౌ

వివిధ నదీ వ్రజమ్ములను బ్రీతినిఁ గాంచుచు రామ లక్ష్మణుల్ 

సువదన సీత తోడుత విశుద్ధ నదీ తట భాసితమ్ములన్ 

స వనజ చక్రవాక ఖగ సారస పంక్తులఁ జాగి రింపుగన్   

2.     

 

 

 

తే.గీ.

పద్మ యుక్త సరస్సులఁ బన్నుగా న

రయుచు మృగ యూధములఁ గరివ్రాతముల ద్రు

మ రిపులను  వరాహ మహిష మత్త వృషభ

రాజముల నెల్లఁ గాంచుచు రమ్యములను    

3.     

 

 

 

ఉ.

దారిని దూర మేఁగి కడు తాపనుఁ డేఁగఁగఁ బశ్చి మాద్రికిన్ 

వారలు గాంచి రచ్చ టొక పద్మిని యోజన విస్తృతమ్మునున్ 

నీరజ రమ్య సోత్పలము నిర్భయ కుంజర యూధ యుక్తమున్ 

సారస హంస సంచయము సంకుల సుందర నీరచారినిన్   

4.     

 

 

 

తే.గీ.

విమల జల రమ్య పద్మాకరమున గీత

వాద్య ఘోషములు వినఁగ వచ్చె నంత

నయిన నొక్కరు నచ్చట నచ్చెరువునఁ

గనఁ బడరు కంటి కప్పుడు కాంతు మనిన   

5.     

 

 

 

తే.గీ.

అంత కౌతూహలమ్మున నడిగిరి రఘు

నందనులు బల్లిదులు విమలేందు ముఖులు

ధర్మభృతుఁ డను ముని చంద్రు  మర్మ మెఱుఁగ

నెంచి కదిసి భక్తి నమస్కరించి యిట్లు    

6.     

 

 

 

ఆ.వె.

అద్భుతమ్ము వినఁగ నందఱకును మాకు 

ముని వరేణ్య! కలిగె ఘనముగఁ గుతు

కమ్ము చెప్పఁ దగినఁ గాకున్న నతి రహ

స్యమ్ము చెప్పుఁ డంచు సమ్మదమున     

7.     

 

 

 

కం.

విని రాముం డిట్లు పలుక

ముని ధర్మాత్ముఁడు వచింపఁ బూనెను సర్వ

మ్మును గొలను ప్రభవ వృత్త

మ్మును రఘనందనుల కిట్లు ముద మారంగన్  

8.     

 

 

 

తే.గీ.

నిత్య జల పూరితం బిది సత్యసంధ!

వెలుఁగు పంచాప్సరస మనఁ గొలఁకు సుమ్ము

మాండకర్ణి నా ముని సత్తముండు స్వీయ 

తపపు మహిమ నిర్మించెను దద్ద ప్రీతి    

9.     

 

 

 

ఉ.

తాపసి మాండకర్ణి యిటఁ దద్దయు నిష్ఠ వహించి నిల్చి తా

నాపము నందు మారుతము నన్నముగాఁ బది వేల సంఖ్య లేం

డ్లేఁపున నాచరించెఁ దప మెల్లను దీవ్ర తరమ్ము నంత సం

తాపము జెంది రగ్నిముఖ దైవత వర్యులు దల్చి రివ్విధిన్         

10.    

 

 

 

చం.

మునివరుఁ డెంచె నేమొ నెదఁ బొందఁగ నొక్కని స్థాన మింపుగా

మన సుర లందు నంచు నిజ మానస పద్మము లందు వేదన

మ్ము నరసి వార లొండొరుల ముచ్చట లాడి తపో వినాశన

మ్ము నొనరుపంగ నచ్చరల ముఖ్యలఁ బంపిరి పంచ సంఖ్యలన్       

11.    

 

 

 

తే.గీ.

మెఱపులను బోలు తేజము మెఱయు నప్స

రసలు సుర కార్య సిద్ధికి రతి పతి వశ

మందు నుండంగ సంయమి నాత్మ తత్వ

మెఱిఁగి నట్టి వానినిఁ జేసి రెల్ల రంత   

12.    

 

 

 

ఉ.

అచ్చర లైరి యైదుగురు నన్నుల మిన్నలు భార్య లింపుగా

మెచ్చి మునీంద్రు డప్పుననె మేటి గృహమ్మును గూర్చె వారికై  

యచ్చొటు కాన రాని విధి నంతఁ దటాకము నందు నుండఁగా 

నిచ్చలు యౌవనమ్మున మునిప్రవరుండు దపః ఫలమ్మునన్  

13.    

 

 

 

కం.

వనితలు వసించి సుఖముగ

మునినిఁ దపో బలమున సతము సెలంగఁగ యౌ

వన మప్సరసలు సెలఁగుచు

ఘనముగ ముంతురు ముదంపుఁ గడలిని రామా!  

14.    

 

 

 

కం.

వినఁబడు చున్నవి రాఘవ!

వనితా మణు లాడు చుండ వాద్య స గాన

స్వనములఁ గాంచన భూషా

ధ్వనులు మనోహరము లిచటఁ దగ మిళితములై    

15.    

 

 

 

ఉ.

తమ్మునిఁ గూడి రాఘవుఁడు తాపసి బ్రహ్మ విదుండు పల్కఁగన్ 

నెమ్మిని నాలకించి రహి నెమ్మన మందు సెలంగ నంతఁ దా

నమ్మునిఁ గాంచి పల్కె నిది యచ్చెరు వంచు భృశమ్ము పల్కు చి

ట్లమ్మను జేంద్రు లంతఁ గని రచ్చట యాశ్రమ మండలమ్మునున్

16.    

 

 

 

తే.గీ.

నార చీర  లాఱుచు నుండ నా రఘూత్త

ముండు ద్విజ కాంతు లలరుచు నుండ నాశ్ర

మమ్ము చేరి జానకిని లక్ష్మణునిఁ గూడి 

మునులు పూజింప వసియించె మునుల తోడ

17.    

 

 

 

తే.గీ.

ఆశ్రమము లందుఁ గాకుత్స్థుఁ డడర సుఖము

మును లొసంగఁగ గౌరవమ్మును సతమ్ము

పూర్వ ముండఁగ నొక యింట మురిసి పిదప

నొండు నింట నస్త్రం బూని యుండె వరుస  

18.    

 

 

 

సీ.

కొంచె మటు నిటుగ నంచితముగఁ బది నెల లొక చోటను నిలువ నొక్క

యేఁ డుండ నొరునింట నెలమి తోడుత నాల్గు నెల లుండ మఱి యొక్క నిలయ మందు 

నైదు నాఱు నెలలు మోదమున నొకట నెల కెక్కువ నొకట నెలకు నరయు

నొకట నెలలు మూడు నొండున నెనిమిది పరు నింట రాముండు వఱల నిట్లు       

 

ఆ.వె.

ఆశ్రమమ్ము లందు ననుకూలముగ నివ

సించు చుండ వార లంచితముగఁ

గడచిన వట యేండ్లు కాంచు చుండగఁ బది

సంతసం బడరఁగ సంతతమ్ము   

19.    

 

 

 

తే.గీ.

తిరిగి తిరిగి కాకుత్స్థుండు తిరిగి సీత

తోడ లక్ష్మణునిం గూడి తూర్ణ మేఁగు

దెంచెను సుతీక్ష్ణు వాటిక కంచితముగ  

ధర్మవేత్త శ్రీమంతుఁడు తాపసిఁ గన

20.   

 

 

 

ఉ.

చేరి సుతీక్ష్ణు  శాల ముని శేఖరు లింపుగఁ జల్పఁ బూజలే

గారవ మొప్ప నుండెను సుఖమ్ముగఁ గొన్ని దినమ్ము లచ్చటన్

వీర వరుండు తాపసినిఁ బ్రీతిని నొక్క దినమ్ము చెంతఁ దా

నారసి పల్కె నివ్విధి మహాత్ముని నమ్రత నా సుతీక్ష్ణుతో        

21.    

 

 

 

ఆ.వె.

ఇయ్యరణ్య మందు నయ్యగస్త్యుఁడు భగ

వంతుఁ డుండు నంచు సంతతమ్ము

వింటి చెప్పు చుండ విబుధ వరులు దేవ!

నెగడ దాపసేంద్ర! నెమ్మి యెడఁద

22.   

 

 

 

ఆ.వె.

ఎఱుఁగ నా స్థలమ్ము నీ విశాల వనిని 

ధీనిధి ముని యున్న దివ్య తటిని

నమ్మహర్షి పావ నాశ్రమం బెచ్చట

నలరు చుండు నెఱుఁగ నార్య! నేను   

23.   

 

 

 

ఉ.

ఆగక యుండ మీ దయ మహర్షి నగస్త్యు నమస్కరింప నే

నేఁగుదు దార యీ యనుజుఁ డింపుగ వెంటఁ జరింప నెమ్మినిన్

బాగుగఁ గోర్కి డెందమునఁ బన్నుగఁ జేయ స్వయమ్ము సేవలన్

వేగమ యమ్మునీంద్రునకు వెల్గుచు నున్నది మౌని సత్తమా!    

24.   

 

 

 

కం.

సంతస మంది సుతీక్ష్ణుం

డంత వినంగ రఘు రాముఁ డట్టు లనఁగ స్వీ

యాంతఃకరణమ్మునఁ దా

నెంతయొ దాశరథిఁ గాంచి యిట్లు వచించెన్

25.   

 

 

 

కం.

ఇదియే వచింప నెంచితి

మది నేనును రామ నీకు మానుగ నీవున్

సుదతి ధరణిజయు ననుజుఁడు

కదలి యగస్త్యని మునీంద్రుఁ గాంచుం డనుచున్  

26.   

 

 

 

ఆ.వె.

స్వయము నీవ భాగ్య వశమున నడిగితి

విట్లు నరవరేణ్య! యింపుగ నుడి

వెద నగస్త్య మౌని సదయుండు వసియించు

నట్టి తావు నీకు నరుగ నటకు

27.   

 

 

 

కం.

వెడల నిట నుండి రాఘవ

వడి నాలుగు యోజనములు పన్నుగ నంతన్ 

వెడలఁగ దక్షిణ దిక్కున

కడరి యగస్త్యుని యనుజు గృహము కనిపించున్

28.   

 

 

 

చం.

చదునుగ నుండి ప్లక్ష తరు సంచయ శోభిత రమ్య పుష్ప రా

శి దనరచున్ ఫలావలి యశేష ముదమ్ము నొసంగ వెల్గగం 

గదలక పక్షు లచ్చటను గమ్మగఁ గూయఁగ హర్ష మారఁగన్ 

సదమల నీర పద్మినులఁ జక్క చరింపఁగ హంస సంఘముల్    

29.   

 

 

 

ఆ.వె.

మూర చక్రవాక కారండ వాదిగ

విహగ రాజము లట రహి నొసంగ 

నిలిచి యొక్క రాత్రి నెమ్మి నుదయమునఁ

జనఁ దగు రఘురామ!  వన పథమున

30.   

 

 

 

ఆ.వె.

దక్షిణంపు దిక్కు తరలి చెట్ల గమి ప్ర

క్కన నరుగుచు రయముగ నొక యోజ

నంపు దూర మందు నరవరేణ్య! యగస్త్యు

నిలయ మరయఁ గలవు నీరజాక్ష!     

31.    

 

 

 

కం.

రమణీయ వనమ్మున వృ

క్షము లుండగఁ బెక్కు లచట కాకుత్స్థా! నీ

వు మగువ మైథిలి లక్ష్మణు

నమిత బలుని తోడ ముదము నరయుదు వచటన్  

32.   

 

 

 

కం.

బుద్ధిని నుంచినను మహా

బుద్ధి! యగస్త్యుని మహర్షిఁ బూజింపంగన్

బుద్ధి నిడుమ నేఁడ చనఁగ

శుద్ధ మనమ్మున మహా యశో వరభూషా! 

33.   

 

 

 

కం.

వినియా ముని వచనమ్ముల

ననుజునిఁ గూడి నతులొసఁగి సాదర మంతన్

ముని వరునకు దా రానుజు

లను గూడి తొడంగెఁ జాగ రాముఁడు ప్రీతిన్  

34.   

 

 

 

ఉ.

చూచుచు రమ్య సానువుల సుందర మేఘ నిభాద్రి పంక్తులం 

జూచుచుఁ బద్మినీ తతుల శుద్ధ జలావృత వాహినీ తతిం 

బ్రోచి వచింప సన్మునియె పోయెడు మార్గము సాగు చా గతిం 

జూచుచు రాఘవుం డనుజు శోభల నింపుగఁ బల్కె నివ్విధిన్  

35.   

 

 

 

ఆ.వె.

ఇదె కనఁబడు చున్న దింపుగఁ బుణ్య క

ర్ముని యగస్త్యు సోదరుని వరాశ్ర

మమ్ము లక్ష్మణా! శుభమ్మును గనుమ త

థ్యమ్ముగ నిదె యంచుఁ దలఁతు నేను   

36.   

 

 

 

కం.

ఘనముగ ఫల పుష్పమ్ముల

వనమున వంగిన తరువులు పథమున నరయన్

మన మిట వేవేలుగ నో

యనుజా! యిదె నే నెఱిఁగిన దంచుఁ దలంతున్   

37.   

 

 

 

కం.

పండిన పిప్పలి పండుల

మెండుగ కటువై తనరు నమిత వాసన లీ

యండన నిప్పుడు వచ్చుచు

నుండెను సౌమిత్రి! కంటె యుద్ద్రుత గతినిన్   

38.   

 

 

 

తే.గీ.

ప్రోవు వెట్టిన కట్టెలు పుడమి నచ్చ

టచ్చట పొడచూపుచు నున్న వచ్చముగను 

దర్భ లగపడు వైడూర్య తండ నిభము 

వెల్గ సౌమిత్రి! కాంచుమ విస్తృతముగ

39.   

 

 

 

ఆ.వె.

నల్ల మబ్బుల వలె వెల్లి విరియు  వన

మధ్య మందు నున్న మౌని వరుల

యాశ్రమమ్ము లందు నడరు నగ్ని శిఖల

పొగలఁ గనుమ దట్టముగ నగపడ

40.   

 

 

 

తే.గీ.

స్నాన మొనరించి యింపుగ సంయ మేంద్రు

లెల్లఁ బుణ్య తీర్థము లందు నెలమి పుష్ప

ముల స్వయమ్ముగను గ్రహించి   పూజల నొన

రింత్రు బ్రాహ్మణోత్తములు విరివిగ నచట

41.    

 

 

 

కం.

కనఁబడు చున్నది యవ్విధి

మునీంద్రుఁ డెవ్విధి నుడివెనొ పుణ్య సుతీక్ష్ణుం

డు నిజముగ నీ ప్రదేశ మ

గు నగస్త్య మునీంద్రుని యనుఁగు టనుజు మఠమే

42.   

 

 

 

తే.గీ.

పుణ్య కర్ముఁ డెవ్వానికిఁ బుట్టెఁ దోడ

నాతఁడు జయించి మృత్యువు నక్కజముగ 

లోక హిత మెంచి యియ్యెడ వీఁక నయ్యె

నెల్లరకు శరణ్యుండు మునీంద్రుఁ డెలమి  

43.   

 

 

 

కం.

మున్నిల్వల వాతాపులు

మిన్నఁగఁ గ్రూరులు కడు బలిమిని సహజన్ముల్

చెన్నుగ విప్రులను బిలిచి

యన్నర భోజనులు సంస్కృ తాలాపములన్  

44.   

 

 

 

తే.గీ.

శ్రాద్ధ భోజన మున కంచు బ్రాహ్మ ణాకృ

తి ధరియించి యిల్వలుఁడె యతిథులుగ నను

జన్ము మేష రూపమ్మున సంస్కరించి

వారి భుజియింపఁ జేయును మూరి యంత     

45.   

 

 

 

ఆ.వె.

తినఁగ విప్రవరు లతిథులు వాతాపి! ర

మ్మనుచు నంత నాతఁ డఱవ నిల్వ

లుండు విని పిలుపును  వెండి వాతాపి కూ

యుచును మేక వోలె నుద్యమించి

46.   

 

 

 

తే.గీ.

విఱిచి విఱిచి మేనుల నెల్ల విప్రవరుల

కాయముల నుండి వెడలు నమేయ మాయ 

నసుర ముఖ్యుఁడు వాతాపి యవ్విధమ్ము

ద్విజ సహస్రముల సతము తీర్చు చుంద్రు   

47.   

 

 

 

తే.గీ.

కామ రూపు లప్పగిదిని క్షయ మొనర్ప 

సుర గ ణార్థితుఁడై యగస్త్యుఁడు మహర్షి

శ్రాద్ధ మట్లు భుజించె నరగణ భోజ

నాసురుని నొక్క నాఁడు మహా ద్విజుండు   

48.   

 

 

 

తే.గీ.

అంత నిల్వలుఁ డొసఁగి మహర్షికిఁ గర

మందు జలము కర్మము పూర్తి యైన దంచు

వెడలుమ బయట కింక సంప్రీతి నంచు

భ్రాతను బిలిచె దొడ్డ సంభ్రమముతోడ

49.   

 

 

 

ఉ.

మాటల నాలకించి కడు మందము నవ్వుచు నిల్వలుం డనం

బాటవ మెట్టు లుండు చన భ్రాత కజాకృతిఁ గాఁగ జీర్ణమే

వీటికి నేఁగె ధర్ముఁ గన వేగమ యిల్వల! నీదు భ్రాతయే

దీటుగఁ బల్క నిట్లు ముని  ధీనిధి నిశ్చల బుద్ధి నంతటన్  

50.   

 

 

 

కం.

అన విని నిజ సోదరుని ని

ధన వాక్యమ్ములఁ దొడంగె ధర్షింప మునిన్

ఘన రోషమ్మున నిల్వల

దను జాధముఁ డంత గాఢ తప్తాత్ముండై  

51.    

 

 

 

ఆ.వె.

ఎగసి యిల్వలుఁడు మునీంద్రుపై లంఘింప

దీప్త తేజుని పయిఁ దీవ్ర వహ్ని

సన్నిభాక్షి దగ్ధ సంతప్త గాత్రుఁడై

స్వర్గమున కరిగె నిశాచరుండు  

52.   

 

 

 

తే.గీ.

ఆశ్రమమ్ము చారు వన పద్మాకర విల

సితము వాని తమ్ముని దిది శీఘ్ర మెవ్వ

రిట్టి దుష్కర్మ మొనరించె దిట్ట మైన

యభిరతి ద్విజులం దడరెడు నట్టి వాని

53.   

 

 

 

కం.

వచియించు చుండ రాముఁడు 

రుచిర మనుజుతో దివాకరుఁడు క్రుంగంగన్

శుచి సంధ్యా వందన మొన

రిచెఁ దమ్మునిఁ గూడి నర వరేణ్యుం డంతన్   

54.   

 

 

 

ఆ.వె.

పశ్చిమంపు సంధ్య వార్చి భ్రాతను గూడి

విధి యుతమ్ము నరుల నధికుఁ డా ర

ఘు వరుఁడు త్వరితముగఁ గూర్మిఁ జేరి మునీంద్రు 

నాశ్రమమ్ము మునికి నర్చ లొసఁగె

55.   

 

 

 

తే.గీ.

ఒసఁగ నాతిథ్య మింపుగ నుత్తముండు

ముని వరుండు నా రాతిరి తిని ఫలమ్ము

లింక మూలములను వసియించె నాశ్ర

మమ్ము నందు రాముఁ డెడఁద నెమ్మి నూని  

56.   

 

 

 

ఆ.వె.

చన నిశీధి వెలుఁగఁ జక్క నాదిత్య మం

డలము గౌరవం బడరఁగ రాఘ

వుం డగస్త్యు భ్రాతఁ బూజించి వేఁడె నా

మంత్రణమ్ము నెమ్మి మాన్య మునిని

57.   

 

 

 

ఆ.వె.

నతు లొసంగుదును ఘన మునీంద్ర!  కడపితి

మి సుఖ మడర నిసిని మీదు భ్రాతఁ

గాంచ దేవ!  గురునిఁ గదలెద మానతి

నిండు కరుణ తోడ నింక మాకు   

58.   

 

 

 

కం.

వెడలుఁ డన మునీంద్రుఁడు రా

ముఁ డుక్త మార్గమునఁ గనుచుఁ బుణ్య వనమ్మున్ 

వెడలం జాగెం బ్రీతినిఁ 

దడయక దా రానుజ సహితమ్ము రయముగన్   

59.   

 

 

 

శా.

నీవారమ్ములఁ దాల వంజుల న గానే కా ల్యశో కావలిన్

వే విన్నూతన వృక్షముల్ పనసలన్ బిల్వమ్ములం దుమ్మికుల్

వేవేలం జిరిబిల్వ పాదపములన్ వే యిప్ప వృక్షమ్ములం

దా వీక్షించుచుఁ బుష్పితమ్ముల లతా తండమ్ములం బ్రీతితోన్    

60.   

 

 

 

తే.గీ.

ఏనుఁగుల తొండముల నింక వానర తతి

చేత నలిఁగిన తరు రాశి నాతతమ్ము

మత్తిలిన ద్విజ శతములు నిత్తె మఱవ

వినఁ బడంగ రవమ్ములు వినుచు నంత   

61.    

 

 

 

ఆ.వె.

తనదు చెంత నుండి తరలఁ దన వెనుక

లక్ష్మణు ననుజుఁ గని రాముఁ డబ్జ

లోచనుండు రఘు వరుల లక్ష్మివర్ధనుఁ

తోడఁ బలికె నిట్లు వేడుకగను   

62.   

 

 

 

తే.గీ.

మెఱయు దళములఁ దరు లిట మీఱుచుండ

మృగవిహగ ములు శాంతితో మెలఁగు చుండ

భావితాత్ముఁడు బ్రహ్మర్షి పరఁగు చుండు

మేటి యాశ్రమ ముండు నిచ్చోటు నందు  

63.   

 

 

 

ఆ.వె.

స్వీయ కర్మ రాశి వెలుఁగు నగస్త్య ము

నీంద్రు నాశ్రమంబ యెల్ల లోక

ములను విశ్రుతమ్ము  పుణ్యాశ్రమమ్ము శ్ర

మఁ దొలఁగింపఁ గలది యదియె నగును  

64.   

 

 

 

తే.గీ.

అధిక ధూమ సమావృత మమల చీర

పంక్తి విలసితమ్ము ప్రశాంత భద్ర జంతు 

యూధ సంయుతమ్ము ద్విజ గణోత్క రాభి

రుత విలసి తాశ్రమ మిది సురుచిర మగును     

65.   

 

 

 

కం.

ఆతని యాశ్రమ మియ్యది 

చూతురు దక్షిణపు దిశ నసురులు సతమ్మున్

భీతు లయి తపశ్శక్తికి 

నా తాపసులఁ దినఁ జాల రమ్ముని మహిమన్     

66.   

 

 

 

కం.

ఎప్పటి నుండి యగస్త్యుం

డిప్పుణ్యుం డీ దిశ వసియింపఁ దొడఁగెనో

యప్పటి నుండి ప్రసాంతత

యొప్పఁగ నిర్వైరు లయిరి యుగ్రాసురులే  

67.   

 

 

 

ఆ.వె.

దక్షిణ దిశ విశ్రుతం బయ్యె నీ భగ

వంతు పేరు వడసి సంతతమ్ము

ముజ్జగముల యందుఁ బురుషులఁ గ్రూర క

ర్ములకుఁ జొరఁబడంగ నలవి కాదు

68.   

 

 

 

చం.

వినయ జ నార్చితార్కు నట వీథిని నాపఁగ నెంచు వింధ్యయే 

విని ముని భాషణమ్ములను బేర్మిని వర్ధిల కుండె నత్తఱిన్

ఘన చిర జీవి తోత్తముఁ డగస్త్యుని పుణ్యత మాశ్రమం బగుం

గన నిది సౌమ్య! లక్ష్మణ! సుఖమ్ముగఁ గాంచుమ చేర నింపుగన్    

69.   

 

 

 

తే.గీ.

లోక పూజితుం డతి పవిత్రుండు విబుధు

లందు నిత్యమ్ము రతి నూను నట్టి పరమ

తాపసుని యాశ్రమమునకుఁ దరల మనకు

మేలు నొనగూర్చు నా ముని మిక్కుటముగ      

70.   

 

 

 

తే.గీ.

అచ్చట నగస్త్యు నర్చింతు నమ్మహా ము

నిని మిగిలిన కానన వాసమును నరవర!   

లక్ష్మణ! యటఁ జల్పఁ  దలంతు లలిత రీతి

సౌమ్య! సంతసం బేపార సంతతమ్ము

71.    

 

 

 

మ.

పరమర్షుల్ సుర సిద్ధ సంచయము సంభావింత్రు గంధర్వులున్

వరభక్తిన్ నియతాశనున్ మునిఁ గృపా పారంగతున్ నిత్యమున్

గురు ముఖ్యుం డగు నా యగస్త్యు నచటం గ్రూరాత్ములన్ దుష్టులన్

నరులం గామ వశాత్ములం గనము వింతన్ రిక్త సంవాదులన్    

72.   

 

 

 

ఉ.

అచ్చట దేవయక్ష స విహంగ వరోరగ కోటి యుండునే

నిచ్చలు ధర్మ తత్పరత నెమ్మి నియంత్రిత భోజనమ్ములన్

సొచ్చెము లన్య దేహముల సూర్య నిభంపు విమాన పంక్తిలో     

నచ్చట నుండి స్వర్గము మహాత్మలు సిద్ధులు గాంతు రింపుగా

73.   

 

 

 

తే.గీ.

ఇచట నర్చింపఁబడి తగ నిత్తురు సుర

వరులు యక్షత్వము మఱి  దేవత్వము వివి

ధము లయిన యట్టి రాజ్య భోగముల భూత

కోటి కింపుగ శుభములఁ గూర్మి తోడ     

74.   

 

 

 

కం.

సుమతీ! వచ్చితి మయ  యా

శ్రమమున కేఁగి మును ముందుఁ లక్ష్మణ! వచియిం

పుమ ముని వరునకుఁ జేరితి

ని మైథిలినిఁ గూడి యిటకు నే నని భక్తిన్     

75.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందుఁ బదునొకండవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 12.

 

 

 

సీతా రామ లక్ష్మణు లగస్త్య మహర్షి యాశ్రమము సేరి మునీంద్రునిఁ బూజింప మహర్షి వారికి యుక్త మైన యాతిథ్య మొసఁగి రామునకు వైష్ణవ చాపము నక్షయ తూణీరములను బాణములను గరవాలమును బ్రసాదించుట.  

 

 

 

 

కం.

ఆశ్రమము సేరి యధ్వపు

టా శ్రమయె తొలఁగఁగ రాఘ వానుజుఁ డట ని

త్యాశ్రిత వత్సల మునివరు

నాశ్రిత శిష్యుఁ గని యిట్టు లనియెం బ్రీతిన్

1.      

 

 

 

ఆ.వె.

రాజవర దశరథు ప్రథమ పుత్రుండు రా

ముండు వచ్చె బల్లిదుండు భార్య

సీత తోడ నిటకుఁ బ్రీతి దర్శింప ము

నీంద్రవరు దపస్వి నీ యగస్త్యు     

2.     

 

 

 

ఆ.వె.

లక్ష్మణుఁ డను వాఁడ రాముని తమ్ముఁడ

నేను వాని హితుఁడ నిత్యము నను

కూలుఁడ నిఁక భక్తిఁ గూడి యుందును విని

యుంటి వేని నన్ను నుండ నోపు

3.     

 

 

 

ఉ.

కానల కేఁగుదెంచితిమి క్రన్ననఁ గైకొని తండ్రి పంపునే

కానఁగ నెంచు వారలము గ్రక్కునఁ బల్కుఁడు మౌనివర్యుతో

నా నన నాలకించి ముని నాథుని శిష్యుఁడు వల్లె యంచుఁ దా

మౌనివరేణ్యు నింగిలపు మందిర సన్నిధి కేఁగె వేగమే     

4.     

 

 

 

ఉ.

చేరి యగస్త్య మౌనివరు శిష్యుఁడు లక్ష్మణుఁ డన్న పల్కులన్

మూరి వచించె నంజలిఁ దపో ధను తోడ వినమ్ర గాత్రుఁడై 

చేరఁగ రాని సంయమిని స్వీయ తపో విభవమ్ము మీఱఁగా

నా రఘు రాము నాగమము నంచిత మింపుగ యుక్త రీతినిన్   

5.     

 

 

 

తే.గీ.

దశర థాత్మజు లర్చింపఁ దలఁచి మిమ్ము

రామ లక్ష్మణు లరుదెంచి భామ సీత

తో నిలిచి యుంటి రిచ్చట నానతి నిడ

నర్హుల రనంతరము సేయు నట్టి పనికి    

6.     

 

 

 

ఆ.వె.

అట్టులు వచియింపఁ జట్టు లక్ష్మణునితో 

రాముఁ డువిద సీత రాఁగ తోడు 

యాశ్రమమ్ముఁ జేరె నంచు మునీంద్రుఁడు

పలికె నాలకించి యెలమి నిట్లు   

7.     

 

 

 

తే.గీ.

మేలు రాముఁ డరుగుదెంచెఁ జాల కాల

మునకుఁ జూడ సన్నిధికి నతనినిఁ  గాంచ

డెందమునఁ గోరుకుంటిని యందఱి వడి

నెలమి రానిమ్ము మన్నన నేల నాప  

8.     

 

 

 

కం.

అన ధర్మజ్ఞుఁడు వచనము

ల నా మహాత్ముఁ డొసఁగి నతులను దగ నటులే

యని యంజలించి శిష్యుఁడు 

చని లక్ష్మణుఁ గాంచి పలికె సంభ్రమ మడరన్

9.     

 

 

 

ఆ.వె.

రాముఁ డెక్కడ యని రాఁ దగు స్వయము  వీ

క్షింప మునిని ననఁగ శిష్యుఁ డతని

తోడ ద్వారమునకుఁ దూర్ణము చని లక్ష్మ

ణుండు సూపె సీతను రఘురాము   

10.    

 

 

 

కం.

ముని మాటల నుడివి వినయ

మునను బ్రవేశింపఁ జేసె ముని శిష్యుఁడు రా

ముని మన్నించి మిగుల మ

న్ననలకు నర్హుని స లక్ష్మణ స వైదేహిన్     

11.    

 

 

 

తే.గీ.

లక్ష్మణుని జానకినిఁ గూడి రాముఁ డడుగి

డెను బ్రశాంతపు టాశ్రమమును మృ గావృ

తమును గాంచుచు నెమ్మినిఁ  దాపస వరు

పర్ణ శాలను బురుషర్షభ ప్రవరుఁడు

12.    

 

 

 

తే.గీ.

అచట వీక్షించె రాముండు రుచిర దేవ

సంచయ స్థానములను బ్రశస్తములను 

బ్రహ్మ దేవుని స్థానము వహ్ని విష్ణు

శక్ర భాస్కర  శశధర స్థల వరముల     

13.    

 

 

 

తే.గీ.

భగ కుబేర ధాతృ విధాతృ వాయ్వనంత

సర్ప రాజాదుల పరమ స్థలముల వసు

గణ వరుణుల గాయత్రీ స కార్తికేయ

ధర్మ పాశ హస్తుల వర స్థలములఁ గనె

14.    

 

 

 

ఆ.వె.

శిష్య బృంద మెల్లఁ జేరి చుట్టును రాఁగ

మునివరుండె యడరి తనకు నెదురు

వచ్చు చుండఁ గాంచి పరమ మునుల ముందు

నా యగస్త్యు రాముఁ డనెను బ్రీతి    

15.    

 

 

 

తే.గీ.

లక్ష్మి వర్ధన! లక్ష్మణ! రయముగ నరు

దెంచు మునివరేణ్యు నితని నెంచుదును 

గస్త్య మునిగఁ దపోనిధిగ మదిఁ గాంచి

యతని యౌదార్యమును నిశ్చయముగ నేను

16.    

 

 

 

కం.

అని యిట్లు మహా బాహుఁడు

ముని రవి సన్నిభు నగస్త్యు పుణ్య పదములన్

వినయమ్మునఁ దాఁకి నిలిచె

ననుజుని వైదేహిఁ గూడి యంజలి తోడన్   

17.    

 

 

 

తే.గీ.

స్వాగతించి కాకుత్స్థునిఁ బన్నుగ నడి

గి కుశలమ్ము నగస్త్యుఁ డుదకము నాస

నమ్ముల నొసఁగి పల్కెను నెమ్మి వారి

తోడ నాసీను లగుఁ డని తోష మడర

18.    

 

 

 

తే.గీ.

వేలిచి ఘృతము నగ్నిని వేగ మొసఁగి 

యర్ఘ్య మతిథుల కింపుగ నర్చ లిచ్చి 

వారి కెంచి వానప్రస్థ పరమ ధర్మ

మంత భోజనము నొసంగె నాదరమున  

19.    

 

 

 

కం.

మును దా నాసీనుండై

ముని పుంగవుఁ డనెను ధర్మము నెఱింగిన వా

డనఘుం డంజలి నిల్చిన

ఘన ధర్మ నిపుణుని రాముఁ గని యిప్పగిదిన్   

20.   

 

 

 

చం.

అనలున కిచ్చి నేతిఁ దగ నర్ఘ్యము వచ్చిన వారి కీ వలెన్

ఘనముగఁ బూజ లింపుగను గాక మునీంద్రుఁడు సల్ప నన్యముం 

దిను తన మాంస మా నరక తీరమునం జెడు సాక్షి భంగినిం 

గనలుచు మిక్కుటమ్ముగను గావున నట్టుల నే నొనర్చితిన్

21.    

 

 

 

తే.గీ.

రాజు వెల్ల లోకములకుఁ బూజనీయుఁ

డవు మహారథివి ప్రియాతిథివి సు ధర్మ

చారివియు మాన్యుఁడవు నీవు చక్కఁగ నరు

దెంచి తిటకు మా సన్నిధి కంచితముగ      

22.   

 

 

 

కం.

అని ఫల మూల సు మాదుల

ఘనముగఁ బూజించి ప్రీతిఁ గాకుత్స్థ వరుం 

దన మెచ్చిన రీతి తిరిగి 

మునీంద్రుఁడు వచించె నిట్లు ముద మారంగన్      

23.   

 

 

 

చం.

కొను మిదె దివ్య చాపమును గూర్మి రచించెను విశ్వకర్మయే

కనక స రత్న భూషితము కార్ముక మియ్యది విష్ణు చాపమే

యిన నిభముల్ శరమ్ము లివి యెన్నఁడు వ్యర్థము కావు రాఘవా!

వనజజుఁ డిచ్చెఁ బార్థివ! యపార కృపారస వీక్షణమ్ములన్  

24.   

 

 

 

తే.గీ.

అమ్ముల పొదు లక్షయములౌ యమ్ము లుండు

నిండుగఁ గనలు చుండ నగ్ని నిభ మడరి

యింద్రుఁ డొసఁగె మున్నివి నాకు నెలమి మీఱ 

రజత కోశముతో నసి రత్న మొసఁగె

25.   

 

 

 

కం.

కరమున నీ ధనువు నిడి య

డరి విష్ణు వసుర వరుల నడఁచి యమరులకున్

విరివిగ శ్రేయము లొసఁగెం

బరమాత్ముఁడు రామ మున్ను బవరము లందున్  

26.   

 

 

 

ఆ.వె.

కొనుమ రామ విష్ణు ధనువుఁ దూణీరము

లను శరముల నింక రమ్య ఖడ్గ

మును జయార్థ మడరి  మున్ను వజ్ర ధరుఁడు

వజ్ర మంది నట్లు పార్థివేంద్ర!     

27.   

 

 

 

కం.

పలికి మహా తేజుం డి

ట్టుల భగవంతుం డగస్త్యుఁడు  వరాయుధ సం

కులము సమస్తమ్ము నొసఁగి

యెలమిన్ రామునకుఁ బలికె నింకనుఁ బలుకుల్  

28.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందుఁ బండ్రెండవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 13.

 

 

 

అగస్త్య మహర్షి సీతతోఁ గూడి రామ లక్ష్మణులు తనకు వందనము లిడ రాఁగ మిక్కిలి సంతోషము నందితి నని పలికి జానకీ దేవి గుణ గణములను పొగడ రాముఁడు  సంతసించి వనములో నుండుటకుఁ దగిన చోటును దెలుపఁ డనిన మహర్షి పంచవటి యనుకూలమైన దేశ మని పలికి యచట కేఁగు మార్గమును వచింప సీతా రామ లక్ష్మణులు పంచవటికి బయలుదేఱుట.     

 

 

 

 

తే.గీ.

సంతసించితి మిక్కిలి సత్య సంధ

రామ! భద్ర మగును నీకు లక్ష్మణ! పరి

తుష్టుఁడ నయితి నవనిజ తోడ రాఁగ

మీరు నతు లిడ నాకు నమితపు రక్తి

1.      

 

 

 

కం.

బడలితిరి మీర లడవిని

నడచి నడచి వ్యక్తమయ్యె నారీమణియే

వడలిన ముఖమ్ముతో నగ

పడంగ  జనకాత్మజయె యపారము రామా!

2.     

 

 

 

కం.

సుకుమారి సీత క్రుంగక

యకముల కిసు మంత యైన ననురాగంబే  

వికసింప భర్త పైఁ దివి

రి కాఱడవి కేఁగుదెంచె లీలఁగ సతియే  

3.     

 

 

 

ఆ.వె.

ఎట్లు సీత కోరు నట్లు సేయుమ రామ!

వనము నందు నిరత మనుగమించె 

నిన్ను రక్తి తోడ నెమ్మి వహించి దు

ష్కరపుఁ బనిని నిట్లు కాంత సేసె

4.     

 

 

 

చం.

అడరుదు రెల్ల స్త్రీలు ధర నందఁగ సౌఖ్యము లెల్ల రాఘవా!

విడుతురు వొంద దుఃఖము లభీతి సదా సహజమ్ము స్త్రీలకుం

గడు చప లాత్మలే మెఱపు కైవడి శస్త్ర నిభమ్ము తీక్ష్ణలే 

కడు వడి మారు తాక్షులను గాంతలు మింతురు మానవర్షభా!  

5.     

 

 

 

తే.గీ.

కాంచ మీ దోషముల నీదు కాంత యందు

రామ! పరికింప నిత్యము శ్లాఘనీయు

రాలు నాదర్శవంతు రా లీ లలన య

రుంధతీ సతికి సమము  రుచిర చరిత  

6.     

 

 

 

కం.

అరివీర దమన! యెచ్చో

ట రామ! సీత ననుజునిఁ బడసి యుందువొ యా

సురుచిర దేశము వెల్గును

ధరలోన నలంకృత మయి తద్దయు సతమున్    

7.     

 

 

 

చం.

పలుక నగస్త్యుఁ డివ్విధము ప్రాంజలుఁడై తగ సంయమీంద్రునిన్ 

వెలుఁగుల వహ్ని సన్నిభుని వీక్షణ మింపుగఁ జేసి బల్కె స

ల్లలితము లైన వాక్యములు రాముఁడు ధన్యుఁడ నైతి సంతసం

బలరఁగ మీకు సీత మఱి భ్రాత గుణమ్ములఁ బ్రాపు నందితిన్  

8.     

 

 

 

ఆ.వె.

ఎచట నాశ్రమమ్ము నేర్పఱచుకొని సు

ఖముగ నుండఁ గలమొ కాన లోన

విరివిగ నుదకమ్ము వెలయు ప్రదేశము  

నానతిండు కరుణ మౌని వర్య!

9.     

 

 

 

కం.

అన విని మునిచంద్రుఁ డొకిం

త నిజ మనమ్మునఁ దలంచి ధర్మాత్ముండే

ఘన ధీర చిత్తుఁడు వచిం

చెను ధీరతర వచనములు శ్రేష్ఠ తరమ్ముల్  

10.    

 

 

 

కం.

ఫల మూ లోదకములు కడు

వెలసిన పంచవటి యనఁగ విశ్రుత దేశం

బల కలదు రెండు యోజన

ముల దూరములో బహు మృగములు చరియింపన్    

11.    

 

 

 

తే.గీ.

చని యటకు నాశ్రమమ్మును జక్కఁగ నొన

రించికొని లక్ష్మణునిఁ గూడి నంచితముగ

ననుభవింతువు సుఖమును జనకు నాజ్ఞ

ను బరిపాలించుచుఁ దగ మనుజ వరేణ్య!   

12.    

 

 

 

తే.గీ.

దశరథుఁడు విధించిన యాజ్ఞఁ దనరి నట్టి 

కాల మందు నధిక మిటఁ గడచె నయ్య!

ప్రతినఁ బూరించి యింపుగ రాఘవేంద్ర!

రాజ్య మందు సుఖింతువు రమ్యముగను     

13.    

 

 

 

కం.

నరవరుని నిన్ను బడసి ద

శరథుఁడు జ్యేష్ఠ సుతినిగ భృశమ్ముగ నా భూ

వరుఁ డయ్యెను దగ ధన్యుఁడు 

తరియించె యయాతి భంగి ధాత్రీశుండే

14.    

 

 

 

కం.

ఎఱుఁగుదు నీ వృత్తాంతము

మెఱయంగఁ దపో విభవము మేలుగ నెల్లన్

మఱియు నెద దశరథుని పయిఁ 

దఱ చయి స్నేహమ్ము నాకుఁ దనరఁగ రామా!  

15.    

 

 

 

తే.గీ.

నీ మనమ్మునఁ గల కోర్కి నే నెఱుగుదు 

నా దగు తపో మహిమ చేత నన్ను గూడి

యిట వసింపఁగఁ దదుపరి  యేఁగ వచ్చు

పంచవటి కీవు ప్రీతినిఁ బలుకు చుంటి    

16.    

 

 

 

తే.గీ.

పొగడ దగిన దవ్వన దేశము కడు రమ్య

మైన దనతి దూరమ్మునఁ గానఁ బడును 

మైథిలి రమించు నచ్చట మందముగను 

జెంత గోదావరీ తటి సంతతమ్ము

17.    

 

 

 

ఆ.వె.

మూలములు ఫలములు వేలు వేలుగ నుండు

వివిధ విష్కిర పరివృత వివిక్త

దేశము  ఘన బాహు! దివ్యమ్ము రమ్యమ్ము

వాస యోగ్య మౌను బార్థి వేంద్ర!

18.    

 

 

 

కం.

రామ సదార వసించుచు 

నా మునులం గావ శక్తి యడరఁగ నచటన్

గోమునఁ బాలింపఁ గలవు  

తామరసాక్ష! యవలీలఁ దాపస వరులన్   

19.    

 

 

 

ఆ.వె.

అదె కనఁబడు చుండె నట నిప్ప చెట్టుల

గొప్ప యడవి యేఁగ నొప్పుగను గు

బేర దిక్కునకు సుదూరము మఱ్ఱి చె

ట్టుఁ గను నంత వఱకు విగత భయము

20.   

 

 

 

ఆ.వె.

అచట నద్రి చెంత నలరు నున్నత తల

మెక్కి చనఁ గనెదవు చక్క నైన 

పంచవటి యనంగఁ బ్రఖ్యాత మైన దే

శమ్ము నిత్య పుష్పితమ్ము వనము   

21.    

 

 

 

తే.గీ.

పలుక ముని యగస్త్యుఁ డిటుల వందనమ్ము

లొసఁగి కోరె నానతిఁ దాపసోత్తముని ర

ఘూత్తముఁడు సత్యవాదిని నత్తఱి వెడ

లుటకుఁ దమ్మునితోఁ బంచవటికి నెలమి  

22.   

 

 

 

కం.

కొని మునివరు ననుమతి వం

దనమ్ము లిడి పాదములకుఁ దరుణీ మణి సీ

తను గూడి వార లాశ్రమ

ము నుండి పంచవటికి ముదముగఁ జాగి రిఁకన్       

23.   

 

 

 

కం.

సమ రాభీతులు నృప సుతు

లు మనుజ పుంగవులు ధనువులు దనర నిజ తూ

ణములను గట్టి ముని నుడివి

న మార్గముననె వెడలిరి కనం బంచవటిన్      

24.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందుఁ బదుమూడవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 14.

 

 

 

సీతారామ లక్ష్మణులు పంచవటికిఁ బోవు చుండ దారిలో జటాయు వను గృధ్ర రాజమును గనుట, జటాయువు తాను దశరథుని మిత్రుఁ డని చెప్పి వాని వంశ చరిత్రమును బ్రాణికోటి యుద్భవమును వివరించుట, వారికి తోడుగ నచట నుందు నని పలుకుట. 

 

 

 

 

కం.

చనుచుండఁ బంచవటికి ర

ఘు నందనులు సీతఁ గూడి కోమలి గృధ్ర

మ్ము నొకటి మహా శరీర

మ్మును భీమ పరాక్రమమును ముందు కని రటన్       

1.      

 

 

 

కం.

శ్రీమంతులు రఘ నందను

లా మఱ్ఱి పయి నిలిచిన మహా పక్షీంద్రున్ 

భీమాంగుని రక్కసునిగ

వే మది నెంచి యెవ రీవు విశదపఱపుమా

2.     

 

 

 

తే.గీ.

అని యడుగ రామ లక్ష్మణు లాలకించి 

సౌమ్యముగ మధురముగ వచనము లిట్లు

ప్రీతి నొసఁగు పగిదిఁ బల్కె భూతల పతి 

మీ జనకుని మిత్రుఁడ నని మీ రెఱుఁగుఁడు   

3.     

 

 

 

చం.

అతనినిఁ దండ్రి మిత్రుఁ డని యాతఁ డెఱింగి రఘూత్తముండు ప్రీ

తి తనరఁ గొల్చి భక్తిఁ దగఁ దెల్పుమ నామము వంశ మార్య నా

రతి నడుగంగ నా విహగ రాజము రాముని నాలకించి యి

ట్లు తెలుప నుత్సహించెను గడుం దమి భూత విహంగ భూతులన్

4.     

 

 

 

తే.గీ.

పూర్వ మందు మహా బాహు భూమి యందు

నుండిరి ప్రజాపతులు రామ యొప్పుగ నుడి

వెద మొదటి నుండి నందఱినిఁ దగ వినుమ

కర్దముఁడు ప్రథముఁడు వారిఁ గాంచఁ బిదప    

5.     

 

 

 

తే.గీ.

వెలసె విక్రీతుఁ డాతని పిదప శేషుఁ

డడరె సంశ్రయుఁడు బహు పుత్రుఁ డతి వీర

వరుఁడు స్థాణు మరీచులు వఱల నత్రి                

మఱియు క్రతువు పులస్త్యుఁడు మనుజ వరులు    

6.     

 

 

 

తే.గీ.

అంగిరసుఁడు ప్రచేతసుఁ డంతఁ బులహుఁ

డడర దక్ష వివస్వంతు లంత నా య

రిష్టనేమి వెలయ నృవరేణ్య! కశ్య

పుఁడు మహాతేజుఁడు చివరఁ బుట్టె రామ!        

7.     

 

 

 

ఉ.

పుట్టిరి యంత దక్షునకుఁ బుత్రిక లర్వది మంది కన్యలన్

దిట్టలె యా యశస్వినుల దేవుల నెన్మిది మందిఁ గశ్యపుం

డిట్టె గ్రహించెఁ బత్నులుగ నింపుగ రమ్య త రావలగ్నలం 

బట్టుల నుండఁగా నదితి పన్నుగ నా దితి నామ లింకనున్           

8.     

 

 

 

తే.గీ.

దనువు కాలిక తామ్రలు తనరఁ గ్రోధ

వశయు మనువు ననల లైరి భార్య లంతఁ

బ్రీతితోఁ గశ్యపుఁ డనెను ద్రిజగ దవను

ల సుతుల  సముల నాకు నిలను గనుఁ డని   

9.     

 

 

 

ఆ.వె.

అదితి కాలిక దితు లా వాక్యముల మదిఁ

దలఁచి రింపుగ రవి కుల వరేణ్య! 

తక్కిన సతు లెదలఁ దలఁపరు రాఘవ! 

కశ్యప వచనముల గారవమున    

10.    

 

 

 

తే.గీ.

అదితి కాదిత్యులు వసువు లశ్వినులును

రుద్రులు జనించిరి నలిన లోచన! రిపు

దమన! ముప్పది ముగ్గురు దైవతములు

విశ్వ విఖ్యాతు లెల్లరు వినుత యశులు      

11.    

 

 

 

కం.

దితి దైత్యులను సుపుత్రుల

సతి కనెను యశస్వుల వన సాగర సుపరీ

వృత భూతలమ్ము సెందెను

సుత సంచయమునకు వినుత శూర వరులకున్

12.    

 

 

 

తే.గీ.

దనువునకు హయగ్రీవుఁడు తనయుఁడు జని

యించె శత్రు వినాశక!  యంచితముగ

నరకుఁ డిఁకఁ గాలకుండును నారి కాలి

క కుదయించిరి పుత్రులు ఘనులు రామ!      

13.    

 

 

 

తే.గీ.

తామ్ర కిఁకఁ బంచ కన్యలు ధరణిఁ బుట్టి

రింపుగను గ్రౌంచి భాసియు శ్యేనియు ధృత

రాష్ట్రియు శుకి యనంగఁ బరమ యశస్వి

నులు సకల లోక విదితలు నుత చరితలు         

14.    

 

 

 

ఉ.

కన్నది గుడ్లగూబలను గ్రౌంచియె భాసియు భాస పక్షులం

గన్నది శ్యేని డేగలను గద్దలఁ దేజులఁ గన్న దింపుగా 

నన్నుల మిన్న హర్షమున నా ధృతరాష్ట్రియు రాజహంసలం

గన్నది చక్రవాకములఁ గమ్మని కంఠము లున్న హంసలన్     

15.    

 

 

 

కం.

శుకి కుద్భవించె నత యను 

సుకన్య యక్కన్య కంత శూరవరా! మె

ల్తుక వినతా నామ కుమా

రి కలిగె భద్ర మగు నర వరేణ్యా! నీకున్

16.    

 

 

 

తే.గీ.

మృగియు మృగమంద హరి యన మగువ భద్ర

మదయు మాతంగి శార్దూలి మఱియు శ్వేత

సురభి లక్షణసంపన్న సురస కద్రు

క లనఁ బదుగురఁ గ్రోధవశ లలన కనె   

17.    

 

 

 

ఆ.వె.

మృగము లుద్భవించె మృగికి నరోత్తమ!

యెలుఁగు గొడ్లు పుట్టె నింక లేళ్లు

చమర సంచయమ్ము సంతానము మృగమం

దకు ముద మడరంగఁ దద్ద యెడఁద    

18.    

 

 

 

తే.గీ.

హరికిఁ బుట్టె వడిగల సింహములు వాన

రములు సంతులై చక్కఁగ రాఘవేంద్ర!

భద్రమదకు నైరావతిఁ బన్నుగ జని

యించె నందన యానంద మెడఁదఁ గలుగ

19.    

 

 

 

తే.గీ.

పుత్రుఁ డైరావతుం డంతఁ బుట్టె గజము

లలన కైరావతికిఁ గరులకు నధిపతి

సంతు లయ్యె మాతంగులు సంతసముగ

నారి మాతంగికి వినుమ నరవరేణ్య!       

20.   

 

 

 

తే.గీ.

కొండముచ్చు లింకఁ బులులు మెండుగాను

దనయు లైరి శార్దూలికిఁ దద్ద ప్రీతి

శ్వేత దిగ్గజములఁ గన వేడ్క సురభి

నెమ్మి రోహిణి గంధర్విని సుతలఁ గనె    

21.    

 

 

 

తే.గీ.

గోవులఁ గనెను రోహిణి పావనముల 

గుఱ్ఱములఁ గనె గంధర్వి గొప్పగాను

సురస జన్మ మొసఁగె నాగ వరములకును 

గద్రువకుఁ బుట్టినవి పన్నగమ్ము లెలమి     

22.   

 

 

 

తే.గీ.

మనువునకు నుద్భవించిరి మానవులు న

రర్షభ! యశస్వు లింపుగ బ్రాహ్మణులును

క్షత్రియులు వైశ్య శూద్రులు సర్వ పుణ్య

ఫల తరువు లనల కెలమిఁ గలిగె రామ!   

23.   

 

 

 

తే.గీ.

వినత శుకికి మనుమరాలు కనెను బుత్రు

లిరువుర నరుణుఁడు మఱియు గరుడుఁ డనఁగఁ

గద్రువ సురస సోదరి కనెను వేయి

ముఖములు గల సర్ప పతినిఁ బుడమి ధరుని        

24.   

 

 

 

కం.

అరుణుని కుమారుఁడను నా

గురు వా సంపాతియే యగు జటాయు వనన్ 

వర నాముఁడ శ్యైనీయుఁడఁ 

బర దమన! యెఱుంగు మిట్లు పన్నుగ నన్నున్        

25.   

 

 

 

తే.గీ.

దుర్గమం బీవనము మృగ దుష్ట రాక్ష

స గణ సేవితం బిది  మీకు సమ్మతం బ

యిన వసింతు నిచట సాయ మెంచి సతము  

వెడల మీరు రక్షగ సీత కడరి నేను     

26.   

 

 

 

తే.గీ.

వంగి కౌఁగిలించికొని యప్పక్షిరాజు

నెలమిఁ బూజించి రాముఁడు లలిత జనకు

స్నేహ కథలఁ బక్షి నుడువఁ జెలఁగి మరల

మరల వినె ముద ముప్పొంగ మనము నందు    

27.   

 

 

 

కం.

తరుణీ మణి  సీత నునిచి

గురు వీర్య జటాయు రక్షఁ గోమలి నంతం

దరలెను పంచవటికి సో

దరు తోడ దహింపఁగ మిడుతల వలె రిపులన్

28.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందుఁ బదునాలుగవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 15.

 

 

 

సీతారామ లక్ష్మణులు పంచవటికిఁ జేర రాముఁడు చక్కని ప్రదేశమును జూప లక్ష్మణుఁడు పర్ణశాలను నిర్మించి గోదావరీ నది కేఁగి స్నాన మాచరించి పుష్పములతోఁ దిరిగి వచ్చి పర్ణశాల కర్పించి రామునకుఁ జూప సీతా రాములు సంతసింప రాముఁడు ప్రేమతోఁ దమ్మునిఁ గౌఁగిలించికొని జటాయువుతోఁ గూడి వా రచట సుఖముగా నుండుట.  

 

 

 

 

       కం.

చని పంచవటికి నానా

ఘన భీకర మృగ పరివృత కాననమునకుం

గని దీప్త తేజు సౌమి

త్రిని రాముఁడు పల్కె నిట్లు ప్రీతి ననుజుతో

1.      

 

 

 

ఉ.

వచ్చితి మా యగస్త్య ముని పల్కిన చోటున కిప్డు లక్ష్మణా!

యిచ్చను మెచ్చు పంచవటి కింపుగఁ బుష్పిత పాదపమ్ములే 

యెచ్చుగ నున్న చోటునకు నెక్కడ యెల్లరమున్ వసింపఁగా

వచ్చునొ చూడు లక్ష్మణ యపార సుఖమ్మున నీవు దిట్టవే

2.     

 

 

 

ఉ.

ఎచ్చట సీత మోదిలునొ యీవును నేనును మిక్కుటమ్ముగా 

నెచ్చట నీటిపట్టు లవి యింపుగఁ జెంతఁ జెలంగు చుండునో

యెచ్చట రమ్య కాననము లెచ్చట రమ్యపు చోటు లుండునో 

యెచ్చట నింధనమ్ములు సు మేద్ధ కుశాంబువు లుండుఁ జెంతనున్

3.     

 

 

 

తే.గీ.

అట్టి దేశమ్ము గాంచుమ యనుజ! యనఁగ

రాముఁ డంతఁ బలికె నిట్లు లక్ష్మణుండు

సీత యుండఁ జెంత వశుడఁ బ్రీతి నీకు

శత సమ లరసి చోటు నాజ్ఞ నిడు చేయ      

4.     

 

 

 

ఆ.వె.

ప్రీతి నొంది కరము భ్రాతృవాక్యములకు

నమ్మహాత్ముఁడు సుమహాభుజుండు

సర్వ గుణ యుతమ్ము స్థలమును దగఁ బరి

కించి యెంచె నొకటి నంచితముగ

5.     

 

 

 

తే.గీ.

చేరి చక్కని యచ్చోటు మూరు నాశ్ర

మంపుఁ గర్మమునకు నంచు మదిని నెంచి 

స్యీయ కరముల సౌమిత్రి చేతులఁ దమిఁ 

బట్టి రాముండు సంప్రీతిఁ బలికె నిట్లు   

6.     

 

 

 

ఆ.వె.

సమతలంపు స్థలము సౌమిత్రి! యీ దేశ

మింక సుందరమ్ము సంకులమ్ము 

పుష్పిత తరు నిచయమున నిట నిర్మింప

నర్హుఁడవు తగు విధి నాశ్రమమును  

7.     

 

 

 

తే.గీ.

సురభి గంధ యు తాదిత్య పరమ కాంతి

సన్నిభ సరోరుహములతోఁ జక్క నైన

సరసు కల దదూరమ్మున సౌమ్య! కనుమ

మునివరుఁ డగస్త్యుఁ డన్నరీతి నడరుచును   

8.     

 

 

 

సీ.

గోదావరీనది కుసుమ ఫలావృత తరు సంచయమ్ముతోఁ దనరు చుండి 

హంస స కాంరండ వాకీర్ణ చక్రవాక సుశోభిత మొసఁగుఁ గనుల విందు

మృగ యూధము లడరి మెఱయు చుండ మయూరము లఱచు చుండంగ మోద మంది  

బహు కంధరమ్ముల పర్వత పంక్తి ఫుల్ల తరుల గూడి నలరుచు నుండ 

 

తే.గీ.

నతి సమీపము నతి దూర మందుఁ గాక 

యగపడుచు నుండెఁ దామ్ర సి తాభ్ర ధాతు

పంక్తులు గవాక్ష తుల్యముల్ పరఁగు చుండె

నిచట నతి రమ్య గిరులు మత్తేభ నిభము    

9.     

 

 

 

సీ.

సాల తా లామ్ర తమాల ఖర్జూర పనస తిమిశ వర పున్నాగ చూత

నీవార తిలక మహా వృక్ష చంప కాశోక కేతక లతా సుమ సురుచిర

గుల్మ తరు నిచయ కుంద చందన నీప పర్ణాస లికుచ సస్పంద నాది

ఖదిర పాటల కింశుక ధవాశ్వ కర్ణ శమీ వృక్ష నిచయ సమేత మిచటఁ    

 

తే.గీ.

బుణ్య దేశంబ యిది యగ్ర గణ్య మగును 

మేధ్య మృగ విహగమ్ములు మించి యుండఁ 

బక్షి రాజుతో లక్ష్మణ! భద్రముగను

ముదము మీఱ వసింత మిప్పుడమి ననుజ!       

10.    

 

 

 

కం.

అన రాముం డిట్లు రిపు ద

మనుండు లక్ష్మణుఁడు కట్టె మంచిగ నంతన్

ఘనబలుఁ డడరుచు నాశ్రమ

మును వేగమ్ముగఁ గడిఁది యపూర్వముగ నటన్

11.    

 

 

 

ఉ.

నేలను ద్రవ్వి స్తంభముల నిల్పి కరీరములన్ శమీ శిఖల్

వీలుగ నుంచి యడ్డముగ విస్తృత రజ్జులు కట్టి యింపుగాఁ

జాల కుశాలి కాశములు చక్కఁగ నాకులుఁ బర్చి యెల్లెడన్

మేలుగఁ బర్ణశాలను నమేయపు రమ్యముఁ గట్టె నన్నకై   

12.    

 

 

 

తే.గీ.

సుందరుండు లక్ష్మణుఁడు విశుద్ధ జల వి

లసిత గోదావరికి నేఁగి లలిత రీతి

స్నాన మాచరించి తిరిగి శాలకు నరు

దెంచెఁ బద్మములను గొని యంచితముగ      

13.    

 

 

 

ఆ.వె.

అర్పణమ్ము సేసి యాతఁడు పుష్పము

లను యథా విధిని నలరుచు శాంతిఁ

జేసి లక్ష్మణుండు  శీఘ్ర మన్నకుఁ జూపె 

నాశ్రమ పదము ముద మార నంత

14.    

 

 

 

కం.

కని సౌమ్యపు టాశ్రమము న

వనిజను గూడి రఘు వరుఁడు భ్రాతృ కృతమ్మున్ 

ఘనుఁ డా రాముఁడు హర్ష

మ్మును బడసె భృశమ్ము నంతఁ బులకితుఁ డయ్యెన్

15.    

 

 

 

ఆ.వె.

తుష్టుఁ డయి కరమ్ము తూర్ణము బాహుద్వ

యములఁ గౌఁగిలించె ననుజు గాఢ

మైన ప్రీతి నన్న యంతఁ బలికె నిట్లు

రాముఁడు వచనములు లక్ష్మణుఁ గని  

16.    

 

 

 

కం.

జనియించెఁ బ్రీతి మిక్కిలి

ఘన కార్యముఁ జేసి తీవు కాకుత్స్థవరా!

కనుదుఁ బరిష్వంగంబ త

గిన దంచును గావున నొసఁగితి నీ కిట్లున్        

17.    

 

 

 

తే.గీ.

పుడమి భావజ్ఞుఁడవు కృతజ్ఞుఁడవు లక్ష్మ

ణ! మఱి ధర్మజ్ఞుఁడవు నరనాథుఁడు కన 

నిన్ను బుత్రుని ధర్మాత్ముఁ డెన్నఁ కాడు

మృతుఁడు ధరలోన నెన్నండు నతఁడు నిజము         

18.    

 

 

 

ఆ.వె.

లక్ష్మివర్ధనుండు రాముండు వచియించి

యివ్విధమ్ము పలుకు లెల్ల నచట

ఫలము లుండ నిండి వసియించె సుఖముగ

జిత నిజేంద్రియుండు చెలువముగను   

19.    

 

 

 

కం.

వసియించెఁ గొంత కాల

మ్ము సేవ లొసఁగంగ దార మూరి యనుజుఁడున్

మసలుచు ధర్మాత్ముఁడు దివి

ని సురవరుని భంగి నడరి నృవరేణ్యుఁ డటన్   

20.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందుఁ బదునేనవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 16.

 

 

 

సీతారామ లక్ష్మణులు పంచవటిలో సుఖముగా నుండ శరదృతువు చని హేమంత ఋతువు రాఁగ నొకనాఁడు మువ్వురు స్నానార్థము గోదావరీ నదికిఁ జనుచుండ లక్ష్మణుఁడు హేమంతర్తు వర్ణనము భరతుని కీర్తనము కైక నింద సేయ రాముఁడు లక్ష్మణునకుఁ గైకను నిందించుట తగ దని గోదావరినిఁ జేరి పితృ తర్పణములు దేవతారాధనము సేసి స్నాన మొనరించుట.

 

 

 

 

కం.

వచ్చెను హేమంతర్తువు

చెచ్చెర శరదృతువు సనఁగఁ జెలఁగుచు నుండన్  

హెచ్చు సుఖమ్మున రాముఁడు 

మెచ్చుచు నిచ్చను సతమ్ము మేటి వనమునన్     

1.      

 

 

 

కం.

ఒకనాఁడు వేకువున రా

జ కుమారుఁడు రాముఁ డరిగె స్నానార్థంబై

వికచ నలిన లోచనుఁడు న

దికి గోదావరికిఁ బ్రీతి దివ్యపు నదికిన్   

2.     

 

 

 

ఆ.వె.

కలశ ముండ స్వీయ కర మందు సహ సీత 

వెనుక నరుగుదెంచు వీర వరుఁడు 

లక్ష్మణుండు భ్రాత రామునితో ననె

వంగి కొంచె మిట్లు వచనములను

3.     

 

 

 

ఆ.వె.

ప్రియవచన! కడింది ప్రియ మైన కాలము 

నీ కిది యరుదెంచె నెమ్మి సెలఁగ 

నల యలంకరించి నట్లు శుభపు టేఁడు

కానఁబడుచు నుండెఁ గాననమున     

4.     

 

 

 

తే.గీ.

మంచు నందు మున్గెను నరసంచయమ్ము   

పమ్మెఁ బుడమి సస్యశ్యామలమ్మయి కడు  

జల మది స్పృశింపఁగ భృశము చల్ల నయ్యె

నగ్నిఁ గన వింతగ సుభగ మయ్యెఁ గరము  

5.     

 

 

 

తే.గీ.

క్రొత్త సస్యము లగ్నికి రుచిర రీతి

నర్పణమ్ము సేసి మఱియు నర్చ లొసఁగి 

పితరులకుఁ గాల మందు సంప్రీతి సాధు

లెల్ల విగత కల్మషు లౌదు రుల్లసిల్ల   

6.     

 

 

 

ఆ.వె.

జానపదులు గో రసం బధికమ్ముగఁ

బొంది కోర్కి లెల్ల నందు చుంద్రు

విజయ మందఁ గోరి పృథివీపతులు యుద్ధ

యాత్ర లందు నుందు రడరి మిగుల

7.     

 

 

 

కం.

సేవింప నంతకుఁ డలరి

సేవించెడు దిక్కును రవి చిత్రముగ నుదీ

చీ వర దిశ కన్పట్టె న

హో విగత తిలక సతి వలె నుండఁగఁ గాంచన్   

8.     

 

 

 

ఆ.వె.

సహజముగనె నిధి తుషారమునకు హిమ

వంతుఁడు రవి యిపుడు పరఁగ దూర

ముగను వ్యక్త మయ్యెఁ దగిన నాముం డని 

హిమగిరి వరుఁడు కడు హిమము నిండ    

9.     

 

 

 

తే.గీ.

స్పర్శ కింపు మధ్యాహ్నము పగటి పూట

తిరుగ నత్యంత మోదము పరఁగు రవి మ

నో హరుం డగు నీడ వినోద మీయ

నేరదు జలము గన నట్టి తీరె యగును    

10.    

 

 

 

తే.గీ.

సౌమ్యుఁ డయ్యెను సూర్యుండు రమ్యముగను

దట్ట మయ్యె  నీహారమ్ము పట్టపగలు

శూన్య మయ్యె నరణ్యము చోద్యముగను

మంచు చలిగాలి దిన మందు  మించె నిపుడు

11.    

 

 

 

తే.గీ.

ఆరుబయట నిద్ర జనులు గోర రిపుడు 

పుష్య మాసము దరిసేర మూరె నెఱుపు 

మంచు దిశ లందు శీతమ్ము మించె మిగుల  

మూడు జాములు పొడ వయ్యె మూరి నిశలు  

12.    

 

 

 

తే.గీ.

ఛన్న సూర్య ప్రభాయుత చంద్రుఁ డరుణ

రుచి తుషార మండలుఁ డిపుడు రుచిరము వె

లుఁగఁడు నిశ్వాస మారుత రుద్ధ దర్శ

నమ్ము భంగినిఁ గాంతి హీన వదనుండు      

13.    

 

 

 

ఉ.

మంచు భృశమ్ము నిండఁగఁ గ్రమమ్ముగఁ బౌర్ణమి నాఁటి రాత్రి నే

కొంచెపు జ్యోత్స్న నైన నిట ఘోరపు రీతినిఁ గాన కుంటిమే  

మించిన యెండ మాడ్పఁగ నమేయము సీతను బోలి యుండఁగా 

నెంచఁగ నక్కజమ్ముగ విహీన వరానన కాంతి భామినిన్       

14.    

 

 

 

ఆ.వె.

చల్లగ నడరు సహజమ్ముగ నీ పశ్చి

మంపు మారుతమ్ము మంచు నిండ

శీతలము  ద్విగుణపు రీతిఁ జెలంగెను

గాంచ నిపుడు మించి కాననమున     

15.    

 

 

 

కం.

యవ గోధూమము లటవిని

నివ బిందులఁ గూడి యుండె నింపొదవంగన్

రవి యుదయింప ముదమ్మున

రవముల బక సారసములు రంజిలెఁ గరమున్    

16.    

 

 

 

కం.

కనక ప్రభా రుచుల నిం

డిన తండులములను వరి కడింది బరువునన్

ఘన ఖర్జూర సుమల భం

గిని వంగి రవంతయె చెలఁగెను రమ్యముగన్   

17.    

 

 

 

కం.

హిమ నీహార కణ నిచయ

సమేత రవి కిరణ కోటి చనఁబొడవుగ దూ

రమున నుదయింప నపుడు ది

నమణి కనంబడెను శశి యనఁగ నిక్కముగన్    

18.    

 

 

 

తే.గీ.

ఆన దరయఁ దాపమ్ము పూర్వాహ్న మందు

నంట సౌఖ్య మొసంగు మధ్యాహ్న మందుఁ

నెఱ్ఱగ రవంత తెల్లగ నెనయు తాప

మడరు భూతలమ్మున రవి యలరు చుండ      

19.    

 

 

 

కం.

పొగమంచు కురియ బెడిద

మ్ముగం దడియఁ బచ్చగఱిక భూతలమున వె

చ్చగ సూర్య రశ్మి చెదరి ప

డఁగ శోభించు భృశముగ నడవు లింపొసఁగన్  

20.   

 

 

 

చం.

కరముగ డస్సి యేనుఁగులు కానన మందుఁ జరించు చుండి త్రా

గ రయము మీఱఁ జల్ల జలకమ్మును దాఁకి కరమ్ములన్ వడిన్

మరలఁగ జేసి నిల్చు నట మాన విహీనులు దొమ్మిఁ బాఱు న

ట్లరయఁగ నిల్చి తీరమున నప్పున మున్గవు నీటి పక్షులే             

21.    

 

 

 

తే.గీ.

మునుఁగఁ బొగమంచు చీఁకటి ముమ్మరముగ

మునుఁగ మం చనఁబడు తమమునను భృశము

 విగత పుష్ప వృక్షమ్ములు విరివి నుండ 

నిద్ర వోయిన యట్టుల నెగడె వనము   

22.   

 

 

 

తే.గీ.

జలము సంపూర్ణ భాష్ప సంఛన్న మయ్యె 

స్వ రుత విజ్ఞేయము లచటి సారసములు  

తీరపు టిసుక మంచుతోమూరి తడియ

నిపుడు కన్పట్టె నదు లెల్ల నింపుగాను      

23.   

 

 

 

ఆ.వె.

పడఁ దుషారము రవి భాసిల్ల మృదువుగ

శైత్య మెల్ల చోట్ల నత్యధికము

పరఁగు చుండఁ బాఱఁ బర్వ తాగ్రమ్మున

నయిన నుదకము రుచి నడరెఁ దఱచు      

24.   

 

 

 

తే.గీ.

ముదిమి వాడిన వగు పద్మములను గూడి

కర్ణికలు కేసరమ్ములు జీర్ణము లయి 

మిగుల నాళ మొక్కటి తామర గమి తోడ

భాసిలదు కమలాకర పర్వ మిపుడు    

25.   

 

 

 

కం.

పురుష వ్యాఘ్రుఁడు వగచుచు 

భరతుఁ డిపుడు దుఃఖమున నపారము నయ స

చ్చరితుఁడు నీ భక్తుఁడు త్వ

త్పరుఁ డయి తప మాచరించుఁ బన్నుగఁ బురినిన్

26.   

 

 

 

ఆ.వె.

విడిచి రాజ్య మాన వివిధ భోగమ్ము ల

నేకములఁ దపస్వి వీఁక శీత

ల తమ భూ తలమున మితముగ భుజియించి

నిదుర వోవు చుండు నిన్ను దలఁచి      

27.   

 

 

 

ఆ.వె.

ఆతఁ డీ సమయము నందు నిత్యము పౌర

సంచయమ్ము తోడఁ జనుచు నుండుఁ 

దివురుచు సరయూ నదికి స్నాన మాచరిం

చుటకుఁ దప్పకుండ సుగుణ నిధియె    

28.   

 

 

 

కం.

సుకుమారుం డత్యంత సు

ఖ కలిత సంవృద్ధుఁడును సుఖములకు నర్హుం

డకటా యపర నిశ భరతు

న కెవ్విధి సరయున గాహనము సేయ నగున్   

29.   

 

 

 

ఉ.

వీరుఁడు నీల వర్ణుఁ డరి వీర నిజేంద్రియ జైత్రుఁ డబ్జ ప

త్రోరు విశుద్ధ నేత్రుఁడు కృశోదరుఁ డుత్తమ ధర్మవేత్త హ్రీ

కార నిషేధుఁ డుచ్చ భుజ కాండ యుగుండును సత్య వాదియున్ 

వారక తీపి పల్కులను బల్కెడి యీ భరతుండు నిత్యమున్        

30.   

 

 

 

కం.

విడిచి వివిధ భోగముల న

తఁ డాశ్రయించె మది నుంచి త్వత్పర రీతిం

గడు భక్తి నిన్ను రఘు వీ

రుఁడు భరతుండు నలినాక్ష! రుచిరాత్ముండే      

31.    

 

 

 

కం.

వనమం దున్నను దపమున 

ననుజుండు భరతుఁడు సక్క ననవరతమ్మున్

నిను ననుసరింపఁగ జయిం

చెను స్వర్గమ్మును వర గుణ శేఖరుఁ డెలమిన్   

32.   

 

 

 

కం.

ద్విపదులు వర్తిల రట తం

డ్రి పథమ్మునఁ దల్లి ననుసరింతు రనెడి యా

యపవాదముఁ దొలఁగించెను

నృప నందనుఁడు భరతుండు నిశ్చయ రీతిన్        

33.   

 

 

 

తే.గీ.

దశరథుని వంటి భర్తను ధరను బడసి

భరతునిం బోలు మంచి కొమరునిఁ బడసి

యంబ కైకేయి యివ్విధి నక్కజముగఁ 

గ్రూరు రా లెట్టు లయ్యెను నేర రాదు

34.   

 

 

 

తే.గీ.

స్నేహ మడరఁ బలుక నిట్లు చెలఁగి ధార్మి

కుండు లక్ష్మణుండు విని రాముండు జనని

నింద సేయ సహింపక డెంద మందు

బదులు పల్కెను ధర్మంపుఁ బలుకు లిట్లు    

35.   

 

 

 

ఆ.వె.

మధ్యమంపు నీదు మాత నిబ్భంగినిఁ 

దగదు దూఱ నెపుడు తద్ద పలుక

నర్హుఁడ విట భరతు నరసి ముదమ్ముగ

నట్లు సేయు మయ్య! యంచితముగ     

36.   

 

 

 

కం.

వన వాస మందు దృఢముగ 

మన మున్నను నిశ్చయముగ మదనుజు స్నేహ

మ్మునఁ దపియింపఁ దిరిగి బా

లుని లీలఁ జరింతుఁ గడిఁది లోలత్వమునన్     

37.   

 

 

 

చం.

భరతుని తీపి పల్కులను భవ్య సుధా నిభ హృద్య వాక్కులం

గరము మనః ప్రమోదము లఖండ శుభావహ భాషణమ్ములన్   

స్మరణ మొనర్తు నే నెపుడు చక్కఁగ నా భరతుం, గనిష్ఠ సో

దరు, నిను గాంచ నేర్తు నని తల్చెద నిత్యము రాఘవోత్తమా!    

38.   

 

 

 

కం.

విలపించు చుండ నాతఁ డి

టుల గోదావరిఁ గదిసి కడు ముదం బారన్

జలముల దోఁగెను రాముఁడు

లలనామణి ననుజుఁ గూడి రయమున నంతన్   

39.   

 

 

 

కం.

సలిలము లొసంగి తగఁ బిత

రులకు సురల కింపు మీఱ రుచి రోదితు సూ

ర్యు లలిత రీతిని స్తోత్ర

మ్ములం బొగడె దేవతలను మూరిన భక్తిన్      

40.   

 

 

 

తే.గీ.

వెలిఁగె సీత ద్వితీయగ జలక మాడి

లక్ష్మణునిఁ గూడి నదిలోన రాఘవుండు

గిరిజతో నందితో జలకేళి సలిపి

నట్టి రుద్రునిఁ బోలుచు నంచితముగ  

41.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందుఁ బదునాఱవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 17.

 

 

 

సీతారామ లక్ష్మణులు పంచవటిలో నాశ్రమమున సుఖముగఁ గాలము గడపుచు నుండ రావణ ఖర దూషణాదుల సోదరి శూర్పణఖ నామ రాక్షసి రామునిఁ గాంచి మోహమున వచ్చి తనను భార్యగా స్వీకరింపు మనియు సీతను లక్ష్మణుని భక్షించెద నన నవ్వుచు రాముఁడు బదులు పల్కుట.   

 

 

 

 

కం.

స్నానం బింపుగ మువ్వురు 

నా నది నటు లాచరించి యమల జలములన్

మేను లలర గోదావరి

నానందమ్మున మరలిరి యాశ్రమమునకున్    

1.      

 

 

 

తే.గీ.

చేరి యాశ్రమ మనుజుని సీత తోడ

నాచరించి యుదయము సేయఁ దగి నట్టి

కర్మముల నెల్ల రాముఁడు ధర్మ విదుఁడు 

పర్ణశాల లోని కరిగె భవ్యముగను

2.     

 

 

 

ఆ.వె.

పూజ లందుచు ముని పుంగవు లొనరింప

సుఖముగ వసియించె సుగుణ వంతుఁ

డచట లక్ష్మణుండు ననుజుండు తోడుండ

వివిధ కథలను వినిపించు చుండి     

3.     

 

 

 

తే.గీ.

పర్ణశాలలోఁ గూర్చుండఁ బడతి సీత

తో మహాభుజ రాముండు తోరముగను

వెల్గె నంతఁ జిత్రాదేవి వెంట నలరు

హిమకరుండు చంద్రుని భంగి విమలముగను      

4.     

 

 

 

చం.

తనరఁ గథా నిమగ్నుఁ డయి దారను గూడి ముదమ్ము మీఱఁగన్

వనిత యొకర్తు రక్కసియె వచ్చె యదృచ్ఛ వనమ్ము లోనికిం

గనె నట నాతి శూర్పణఖ కాంతను గూడిన రాఘవేంద్రునిన్

మనుజ వరేణ్యు దేవ నిభు మానిని రావణు చెల్లె లర్మిలిన్    

5.     

 

 

 

సీ.

సింహ సమాన విశిష్ట వక్షుని మహా బాహువు నాజాను బాహుఁ బద్మ

పత్ర నిభాక్షు దీప్త వదను సుందర దర్శను గుంజర దర్ప గమను

వర జటా మండల భాసితు సుకుమారు సత్త్వ సంపన్ను సుక్షత్రియ కులు 

రాముని నిందీవర సదృశ శ్యామునిఁ గందర్ప సన్నిభ కాంతి కాయు  

 

ఆ.వె.

దేవరాజ నిభుని నా వనమునఁ గాంచి

రక్కసి నృప సుతుని రాఘవేంద్రు

ఘన కకుత్స్థ వంశుఁ గామ మోహిత యయ్యెఁ 

దత్క్షణంబ ఘోరతరము గాను    

6.     

 

 

 

సీ.

దుర్ముఖి సుముఖుని దొడ్డ కడ్పుది సన్నని నడుము గల వానిని వికృ తాక్షి

సువిశాల లోచను శోణ కేశిని సుకేశుని విరూప సురూప సురుచి రాస్యు 

భైరవస్వర కలస్వరుని దారుణ వృద్ధ తరుణు దుర్భాషిణి దక్షిణుని సు

దుర్వృత్త  నయవృత్తు దుష్ట దర్శన సుదర్శను మానవేంద్రుని రాము నరసి     

 

ఆ.వె.

రాక్షసి తగిలి తగులమ్మున భృశముగఁ 

బల్కెనంత నిట్లు వాక్యములను

జడల నూని తపసి సరణి సతినిఁ గూడి  

వచ్చి తేల యసుర వరుల వనికి     

7.     

 

 

 

కం.

వచ్చిన కారణ మెయ్యది

యిచ్చాపము నమ్ము లడర నిట్లు భుజములం 

జెచ్చెర చెప్పుమ సత్యము

చొచ్చి తసుర సేవితమును జోద్యం బయ్యెన్  

8.     

 

 

 

కం.

విని రాక్షసి వాక్యము లె

ల్లను ఋజు బుద్ధి తనరంగ రాముం డంతన్ 

వినిపింపఁ దొడంగె సకల

ము నామె కిబ్భంగి సత్యమును రమ్యముగన్      

9.     

 

 

 

ఆ.వె.

అనృతము రుచియింప దినకుల జాతున

కెన్నఁ డేని నాకు నున్న నాశ్ర

మమున స్త్రీజనుల సమక్షమున విశేష

ముగను గొంచె మైన మగువ వినుమ  

10.    

 

 

 

చం.

అవని వెలింగె నా దశర థాఖ్యుఁడు భూపతి దేవ విక్రముం

డవిరళ ధర్మ వేత్త భువి నాతని పుత్రుఁడ రాముఁ డంద్రు న

న్నవరజుఁ డౌను లక్ష్మణ వరాఖ్యుఁడు వెంటఁ జరించు చుండు నీ

యవనిజ సీత భార్య యగు నన్నుల మిన్నయె నాకు నింపుగా   

11.    

 

 

 

ఆ.వె.

తండ్రి యాజ్ఞ నింకఁ దల్లి యానతిఁ దలఁ

దాల్చి ధర్మ కాంక్ష ధర్మము కొఱ

కు నయి కాననమ్మున నివసింపఁ దలంచి

వచ్చితి మిచట కెద నిచ్చ నూని        

12.    

 

 

 

ఉ.

నిన్ను నెఱుంగఁ గోరెదను నెమ్మి వచింపుమ నీ గుఱించియే 

పన్నుగ నెవ్వ తీ వెవరి భామవు రక్కసి వోలె లేవు నీ

వెన్నగ సుందరాంగి! యిట కెందు నిమిత్తము వచ్చి తివ్విధం

బన్న రఘూత్తముండు విని యామద నార్దిత పల్కె నివ్విధిన్    

13.    

 

 

 

తే.గీ.

వినుమ రామ నేఁ జెప్పెదను నిజ మెల్ల

శూర్పణఖ యను దానను జొప్పడు భయ

మెల్లరకు నన్నసురిఁ గన నేను గామ

రూపిణిఁ జరింతు నీ వని లోన నొంటి

14.    

 

 

 

ఆ.వె.

రావ ణాఖ్యుఁడు వర రాక్షసేశ్వరుఁడు బ

ల్లిదుఁడు భ్రాత నా కగుఁ దనయుండు

విశ్రవసునకు ఘన వీరుండు విని యుందు

వేని నతని మును నరేంద్ర వర్య!     

15.    

 

 

 

చం.

తను ఘన కుంభకర్ణుఁడు సతమ్మును నిద్రఁ జెలంగు వాఁడునున్

ఘనుఁడు విభీషణుండు కనఁ గాదు నిశాచర చేష్టితుండు 

ర్మ నిరత మానసుండు ఖర రాక్షసుఁ డింకను దూషణుండు వీ

రిని మమ సోద రోత్తము లరిఘ్ను లనంగ నెఱుంగు రాఘవా!   

16.    

 

 

 

ఆ.వె.

వారి నెల్ల వీడి వచ్చితి చూచి నం

తటనె నిన్ను రామ! తనరఁ బ్రేమ

నిను బురుష వరేణ్యు నెమ్మది భర్తగ

నెంచి నిశ్చయముగ నంచితముగ     

17.    

 

 

 

తే.గీ.

ఎన్న నాధిపత్యమ్మున మిన్న నేను 

సంచరింపఁ గలను స్వేచ్ఛ సత్వ మడర 

భర్తగఁ జిర ముండుము నాకు భామ సీత

తోడఁ బని యేమి నీ కింక వీడు మయ్య!    

18.    

 

 

 

ఆ.వె.

వికృత మఱి విరూప వెలఁది నీకు సరి కా

నేర దెంచి చూడ నే నగుదుఁ ద

గ ననురూప నీకుఁ గాకుత్స్థ! భార్య రూ

పమునఁ గాంచు మయ్య! పార్థ! నన్ను

19.    

 

 

 

కం.

తిందు నసతిం నతోదరి 

నందముగా లేని దాని ననుజుని తోడన్

విం దనఁగఁ గరాలను నా

డెంద మలర మానిసినిఁ బటిమయె సెలంగన్

20.   

 

 

 

కం.

విహరింతువు కొండ కొనల

నహరహము వనముల నెల్ల నరయుచుఁ బ్రియ! నా

సహితమ్ము దండకా వని

నహో నిరాటంకముగ మహానందముగన్      

21.    

 

 

 

కం.

పలుక నిటుల మదిరేక్షణ

యలర నగ వొకింత నుడువ నారంభించెన్

నలినాక్షుఁ డిట్లు వాక్య

మ్ముల నైపుణుఁడు తగు వాక్యములు రక్కసితో       

22.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందుఁ బదునేడవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 18.

 

 

 

రాముఁడు శూర్పణఖతోఁ దాను వివాహితుఁడు గనుక భార్య దగ్గర లేని లక్ష్మణుని వేఁడు మని పంప నామె యేఁగ లక్ష్మణుఁడు తాను దాసుఁ డని దాసుని భార్యగ నేల యుందు వని తిరిగి రాముని  వద్దకుఁ బంప శూర్పణఖ సీతను మ్రింగ నుఱుక రాముఁ డాపి లక్ష్మణునితో నామెను విరూపినినిఁ జేయ మన లక్ష్మణుఁడు శూర్పణఖ ముక్కు చెవులు కోసిన నామె యేడ్చుచు నన్న ఖరుని చెంత కేఁగి యీ వృత్తాంత మెల్ల వచించుట.     

 

 

 

 

కం.

ఘన కామపాశ బద్ధను

వనితను శూర్పణఖఁ గాంచి పలికెను రాముం

డు నగుచు మెల్లగ స్వచ్ఛము

గను వాక్య విశారదుండు కాకుత్స్థుఁ డిటుల్    

1.      

 

 

 

ఆ.వె.

నే వివాహితుండ నీ వనితా మణి

నా ప్రియంపు భార్య నారు లందు

నిన్ను బోలు నాతి కెన్న సవతి పోరు

దుఃఖ కారక మగుఁ దోరముగను

2.     

 

 

 

ఉ.

ఈతఁడు లక్ష్మణుం డనుజుఁడే యగు నా కతి భాగ్యవంతుఁడున్

నాతి సెలంగె దూరమున నారినిఁ గోరును వీర్యవంతుఁడే

యీతఁడు శీలవంతుఁడు మహిం గన రూపరి యౌవనుండునున్

భ్రాత ఘనమ్ముగాఁ దగును భర్తగ నీ కనుకూలుఁ డౌ నిటన్       

3.     

 

 

 

కం.

వరియింపు మీతని ననుజ

వరుని వరారోహ! మేరు పర్వతముఁ బ్రభా

కర రశ్మి వలె సపత్నీ

విరహితము విశాల నేత్ర! ప్రీతిం బతిగన్   

4.     

 

 

 

కం.

విని యా రాముని పలుకులు

ఘన రాక్షసి రాము వీడి గ్రక్కున నంతం 

గని లక్ష్మణుఁ గామవశ వ

చనమ్ము లివ్విధము పలికె సంరంభమునన్       

5.     

 

 

 

తే.గీ.

ఇట్టి నీ రూపమునకు నా యట్టి వనిత

యుక్తము వరవర్ణినిఁ గొని యూఢగఁ దమి 

నన్ను గూడి దండక లోన మిన్నగ విహ

రింపఁ దగుదువు లక్ష్మణ! సొంపు మీఱ    

6.     

 

 

 

కం.

అప్పలుకుల నవ్విధ మన

నప్పు డసుర శూర్పణఖ మహా కామముతో

గొప్ప వచనముల నేర్పరి

యొప్పుగ లక్ష్మణుఁ డనె నగ వొలుకం బలుకుల్        

7.     

 

 

 

తే.గీ.

ఆర్యునకు వశుండ నిరత మట్టి భ్రాత

నేను దాసునకు సతివై నీవు దాసి

కాఁ దలంతు వేల తివిరి కమలవర్ణి

నీ! యెడఁద నక్కజమ్ముగఁ దోయజాక్షి!        

8.     

 

 

 

ఆ.వె.

అమలవర్ణినీ మహాత్మునకు సు సమృ

ద్ధార్థున కెలమి సతి వయి చెలంగు

మ కృత కృత్య వయి సమంచితముగ చిన్న

భార్యగా ముదమ్ము వడయఁ దగుదు    

9.     

 

 

 

కం.

పొందు నసతిం నతోదరి 

నందముగా లేని వృద్ధ నతివఁ గరాలం

గుందఁగ వీడి వెస నినున్

డెంద మలర సతిఁగ బ్రేముడి రఘూత్తముఁడే        

10.    

 

 

 

కం.

వరవర్ణిని! శ్రేష్ఠం బి

ట్టి రూపము నితంబినీ! విడిచి మానిసి యం

దు రతి వహించెడు వా రె

వ్వ రుందురు విచక్షణులను బరికింపంగన్     

11.    

 

 

 

ఆ.వె.

లక్ష్మణుఁ డనఁ బదములను గరాల నతోద

రి యని విని నిజము లని యువిద యెదఁ

దలఁచెఁను బరిహాసము లని తా నేరక

కామ తప్త చిత్త యేమి యెఱుఁగు

12.    

 

 

 

తే.గీ.

పర్ణశాలలోఁ గూర్చుండఁ బడతి సీత

తోడ దుర్ధర్షుఁ డాతని తోడఁ బలికెఁ

గామ మోహిత శూర్పణఖ రిపు దమను

జేరి రామునిఁ బల్కులు దారుణముగ       

13.    

 

 

 

కం.

ఇందు నసతిం నతోదరి 

నందముగా లేని వృద్ధ నతివఁ గరాలం

గుందిన వీడి వెస ననున్

డెంద మలర సతిఁగ బ్రేముడిం గైకొనవే        

14.    

 

 

 

ఆ.వె.

నీవు చూచుచుండ నేఁడు భక్షింతు నీ

మానుషిఁ గడు ప్రీతిఁ గాననముల

సంచరింతు నిన్ను జక్కఁగఁ గూడి సు

ఖముగ సవతి నిచటఁ గాంచకుండ

15.    

 

 

 

చం.

కొఱవినిఁ బోలు కన్నులను గోపము మీఱఁగ దూఁక సీతపై

నఱచుచు నుల్క రోహిణిని నారసి పర్విడు భంగి దోఁపగన్ 

వెఱ పిడ మృత్యు పాశ మన వీర వరేణ్యుఁడు గాంచి యాపి తా

నఱిముఱి లక్ష్మణుం గని మహాగ్రహుఁడై వెస రాముఁ డిట్లనెన్      

16.    

 

 

 

తే.గీ.

తగ దనుజ పరిహాస మాడఁగ ననార్యు

ల మఱి క్రూర జనుల తోడ లక్ష్మణ! విను 

మెట్టులొ బ్రతికి నిల్చిన యట్టి  సీతఁ

గాంచు మయ్య! వైదేహినిఁ గ్లాంత నిట్లు      

17.    

 

 

 

ఆ.వె.

ఈ విరూప నసతి  నీమహోదరిని ర

క్కసినిఁ గరము మత్త కాంత నిటఁ గు

రూపిణి నొనరింప రోషమ్మునఁ దగుదు

వయ్య లక్ష్మణ! తడయక నరవర!     

18.    

 

 

 

కం.

విని యప్పలుకుల రోష

మ్మునఁ గరవాలమ్ము దీసి ముక్కు చెవులఁ గ్ర

క్కునఁ గోసె రామునిఁ గదిసి 

ఘన బలుఁ డా లక్ష్మణుండు  కాంతకు నంతన్

19.    

 

 

 

కం.

తెగఁ గర్ణ నాస లవ్విధ

ముగ శూర్పణఖ యఱచుచును ముమ్మరముగ నా

మగువ వడిన్ వచ్చిన య

ట్టి గతినిఁ బాఱె వనమునకు ఠీవి నశింపన్   

20.   

 

 

 

ఆ.వె.

ఆ విరూప యమ్మహా ఘోర రాక్షసి

తడిసి రక్త మందు బెడిదముగ వి

విధము లైన యట్టి వింత ధ్వనులఁ జేసె

వర్ష కాల మందు వర్ష నిభము   

21.    

 

 

 

తే.గీ.

కాఱుచుండ రక్తం బధికమ్ము గాను

బట్టి స్వీయ బాహువులను బెట్టిదముగ

ఘోర దర్శన రాక్షసి మూరి తూఱె

ఘోర వనమున గట్టిగఁ గూఁత లిడుచు      

22.   

 

 

 

తే.గీ.

అంత వికృతపు రూపపు టింతి రాక్ష

స నిచ యావృతుని  ఖరుని  ఘనుని నుగ్ర

దర్శనుని జనస్థాన గత సుమహాసు

రుఁ గదిసి పడె భువి నశని పగిది ననుజ     

23.   

 

 

 

తే.గీ.

శోణి తోక్షిత విహ్వల శూర్పణఖ ఖ

రున కనుజ వచియించె రాముని వ నాగ

మము సతిని లక్ష్మణునిఁ గూడి మఱియుఁ దనను 

నిట్లు వికలాంగఁ జేసిన వృత్త మెల్ల              

24.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందుఁ బదునెనిమిదవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 19.

 

 

 

రక్తము కాఱుచుండఁగ నేలపైఁ బడి యున్న చెల్లెలిని ఖరుఁడు క్రోధము చెలఁగఁ బ్రశ్నింప నామె రామ లక్ష్మణులను వర్ణించి చెప్పి లక్ష్మణుఁడు తన ముక్కుచెవులఁ గోసె నని పలుకఁ బదునలుగురను రక్కసులను వారిని వధింపఁ బంపుట.   

 

 

 

 

కం.

పుడమినిఁ గూలిన యామెను

బడుచుండఁగ రక్త మెల్ల భగినిం గని యా

చెడిన నిజ రూపఁ గ్రోధం

బడరంగ ఖరుం డసురుఁడు బ్రశ్నించె నిటుల్   

1.      

 

 

 

ఉ.

లెమ్ము త్యజింపు మోహమును లేచి వచింపుమ యెవ్వ రివ్విధిం

గొమ్మరొ రూప నాశనము ఘోర తరమ్ముగఁ జేసి రక్కటా

పమ్మి కరమ్ము స్పష్టముగఁ బన్నగ ముండఁగ దూర మందు నే

రిమ్మెయిఁ ద్రొక్క నెంచెద రహీన విషావృత కృష్ణ సర్పమున్      

2.     

 

 

 

ఆ.వె.

ఎవ్వరు నిను జేరి యియ్యుగ్ర విషమును

ద్రాగ నెంతు రివ్విధమ్ముగ నిట

నెవ్వ రఱ్ఱు నందు నిట్టులఁ గాల పా

శమ్ము నేర కుండ నెమ్మి నుంత్రు    

3.     

 

 

 

తే.గీ.

బలమునం దీవు మిన్నవు  వలసి నట్టి

తావునకు నేఁగు దానవె నీవు కామ

రూపిణివి నీకు నిట్టి విరూప మే రొ

నర్చిరి యమ నిలయముఁ గనంగ నకట    

4.     

 

 

 

తే.గీ.

ఎవ్వఁడా మహోన్నత వీర్యుఁ డిట్లు నిను వి

రూపిణిగఁ జేసినది స్వర్గ లోక వాసు 

లందు గంధర్వ తాపసు లందు సర్వ

భూతములలో మహాత్ములఁ బొలఁతి! సెపుమ

5.     

 

 

 

ఉ.

కాంచను నేను లోకమునఁ గన్నులు వేయి గలట్టి యింద్రునిన్

మించిన పాకశాసనుని మేటి సురావలిఁ జేయ హానినే

యంచ జలమ్ము నందు గల యట్టి పయస్సును ద్రాగు చంద మే  

నంచిత బాణ వృష్టి నట నాగక కుర్సి గ్రహింతుఁ బ్రాణముల్ 

6.     

 

 

 

కం.

తెగ మర్మమ్ము లని భృశ

మ్ముగ నా ఘోర తర బాణముల ఫేన యుతం

బగు రక్తము త్రాగును గూ

లఁగ నెవ్వం డాతని రుధిరమును ధర తమిన్        

7.     

 

 

 

కం.

ఎవ్వనిఁ జంపుదు రణమున 

నవ్వాని శరీర మందు నా పలలమ్మున్

నివ్వెఱ విహగమ్ములు  తిను 

నివ్వనమునఁ జీల్చి హర్ష మేపారంగన్    

8.     

 

 

 

తే.గీ.

రాక్షస పిశాచ గంధర్వ రాజ దేవ

గణములం దొక్కని నయిన   గావఁగా స

మర్థుఁ నరయ లే మెవ్వని మడియఁ జేయ

నెంతు  వాని నాహవ మందు వింత కాదు

9.     

 

 

 

ఆ.వె.

తెప్పిఱిల్లి  సుంత చెప్పఁగ నీ వర్హు

రాల వెట్టి దుష్టుచే లయమ్ము

కాఁగ నోజ యెల్లఁ గ్రచ్చఱ విక్రమిం

చి యపజయమును బడసితివి యనుజ!   

10.    

 

 

 

తే.గీ.

మించి యన్న పలుక విశేషించి క్రుద్ధుఁ

డిట్లు నాలకించి పలికె నింతి శూర్ప

ణఖ కనుల నీరు నిండఁ గనలున నంత

వాక్యముల నిట్లు సంతాప భారమునను

11.    

 

 

 

చం.

తరుణులు రూపవంతులు సదా సుకుమారులు వీర్యవంతులున్

వర నరు లబ్జ లోచనులు పార్థులు దాశరథుల్ సుధార్మికుల్

గురుతర నార చీరలను గూర్మిని నూను తపశ్చరుల్  ఫలా

ది రుచిర మూల భోజనులు దిట్టలు భ్రాతలు రామలక్ష్మణుల్  

12.    

 

 

 

తే.గీ.

దాంతులు నృప వంశజులు గంధర్వ రాజ

సన్నిభులు సురలో నర సత్తములొ వి

చార మొనరించి దర్కింపఁ జాల నేను

నిక్క మెంచంగ నగ్రజ యక్కజముగ   

13.    

 

 

 

ఆ.వె.

రూపవతిని నా తరుణి సర్వ భూషణ

భూషితను వనితను మూరి వారి

మధ్య నిలువ నే సుమధ్యను గాంచితి

నవనిజను జనక నృపాత్మజ నట     

14.    

 

 

 

ఆ.వె.

ప్రమద కొఱకు నిట్లు వా రుభయులు న న్న

నాథ యసతి యనఁగ బాథ సెలఁగ

నీ యవస్థ నా కమేయముగఁ గలుగఁ

జేసిరి దయఁ గనక వీస మైన  

15.    

 

 

 

కం.

సమరమున మోసగత్తె య

గు మగువ నా యిరువుర నతి ఘోరముగ వధిం

ప మనుజుల యా పడతి రుధి

రము ఫేన యుతము వలఁతును ద్రాగఁగఁ బ్రీతిన్   

16.    

 

 

 

కం.

ఈ నా మొదటి మనోరథ

మే నీ విటఁ దీర్చిన యసురేంద్రుండవు కా

నానందమ్మునఁ ద్రాగుదు

నే నీ మువ్వుర రుధిరము నెమ్మి సెలంగన్         

17.    

 

 

 

కం.

అన విని యామె వచనములఁ

గనలి భృశమ్ముగ ఖరుండు కాల సదృశులన్ 

ఘనులఁ బదునల్గురను బం

పెను బల్లిదుల నసురుండు బెను రక్కసులన్  

18.    

 

 

 

చం.

మనుజులు శస్త్ర కోవిదులు మానిని తోడుత నేఁగుదెంచి రీ

వనికిని దండకా వనికిఁ బన్నుగ నారలు జింక చర్మముల్

దనరఁగ మేని పైనఁ గని దారుణ రీతి వధించి వారి నా

వనిత యుతమ్ము రా వలయు వారి యసృక్కును గ్రోలుఁ జెల్లెలే    

19.    

 

 

 

ఆ.వె.

స్వీయ తేజ మడర వేగమ వధియించి

వారి నసుర వరులు! వాంఛ నెలమిఁ 

దీర్పుఁ డిప్పుడు వెలఁదికి నాదు సోదరీ

మణికి సంభ్రమించి మానితముగ   

20.   

 

 

 

కం.

త్వరను జతుర్దశ రాక్షస

వరు లాజ్ఞప్తు లయి యిట్లు పాఱిరి సుమహో

దరి శూర్పణఖను గూడియు

మరుత్తుచే వేగ పాఱు మబ్బు విధముగన్

21.    

 

 

 

తే.గీ.

వాడి బాణమ్ము లున్నను వార లా య

సుర వరేణ్యులు జాల రయిరి యుదగ్ర

తేజు రాముని మర్దింప ద్విపము లడవి

రగులు వహ్నిని నాపంగ రాని పగిది

22.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందుఁ బందొమ్మిదవ సర్గము.

 

 

అరణ్య కాండము

సర్గము 20.

 

 

 

ఆశ్రమమునకు వచ్చిన చతుర్దశ రాక్షసులను రాముఁడు వధింప శూర్పణఖ యన్న ఖరుని కడ కేఁగి యా వృత్తాంత మెల్ల నాతనికిఁ దెలియఁ జేయుట.

 

 

 

 

కం.

కదిసి రఘువ రాశ్రమము ను

విద శూర్పణఖ భృశ ఘోర వీక్షించి యటన్

సుదతి జనకాత్మజను బ

ల్లిదుల సహజుల నసురులకు లీలం జూపెన్       

1.      

 

 

 

ఆ.వె.

కాంచి రంత వారు కాకుత్స్థు నాసీను

బర్ణశాల లోన బలుని సీత

తోడ లక్ష్మణుండు తోడున్న వానిని  

రాక్షస ప్రవరులు రాముని నట      

2.     

 

 

 

కం.

వచ్చిన యయ్యసురులఁ దాఁ

జెచ్చెర గని రాఘవుండు స్వీయ రుచులతో

నచ్చముగ వెల్గు లక్ష్మణు

నచ్చట వీక్షించి పలికె నాదర మొప్పన్    

3.     

 

 

 

తే.గీ.

నిలువు మొక్క ముహూర్తము నిలిచి జాన

కీ సతికిఁ జెంత సౌమిత్రి! యీ సమీప

మునకు వచ్చిన వీరి నిపుడు వధింతు 

ననఁగ నట్లె యనె నుతించి యనుజ వరుఁడు       

4.     

 

 

 

చం.

ధనువును  దాల్చి రాఘవుఁడు తప్త హిరణ్య విభూషితమ్మునున్

గొనయము గూర్చి తత్క్షణము గొప్పగ ధర్మ రతుండు సోఁకులం

గని వచియించె నిప్పగిదిఁ గానకు దాశర థావనీశ నం

దనులము కూడి జానకిని దండక నుండఁగ వచ్చి యుంటిమే   

5.     

 

 

 

తే.గీ.

రామ లక్ష్మణులము మే మరణ్య మందు

దాంతులు ఫలమూ లాశన ధర్మ నిరతు

లు నగు దండకా వాసులు ముని వరులకు 

నేల బాధ లొసంగుదు రిట్లు సతము     

6.     

 

 

 

ఆ.వె.

మిమ్ము మునుల సంతతమ్ము బాధించు పా

పాత్ములను మహాహవమునఁ జంప

ఋషి వరుల ననుజ్జ నిచటకు వచ్చితిఁ

గొని శరాయుధములు వనికి నేను   

7.     

 

 

 

తే.గీ.

నిలుఁడు సంతుష్టు లైన నెదలఁ గరమ్ము

కారు తిరిగి పో నర్హులు గాంచ మీరు

యుద్ధ భూమినిఁ దొలఁగంగ యుక్త మగునె  

ప్రాణముల నాశ కల్గ మరలుఁడు వేగ   

8.     

 

 

 

తే.గీ.

ఆలకించి యా పలుకుల నా చతుర్ద

శాసుర వరులు రోషమ్ము సంతరింపఁ 

గరము బ్రహ్మఘ్ను లా శూల కరులు  పల్కి

రిట్టు లెల్లరు వాక్కులు బెట్టిదముగ      

9.     

 

 

 

ఆ.వె.

కిన్క నూని ఖరుఁడు కీర్తిత విభుఁడు మ

హాత్ముఁ డనుప మమ్ము నాజి నిన్ను

జంపఁ బ్రాణములను క్షత్రమ్ము నుండి త్య

జింతు వీవ రామ! వంత తోడ

10.    

 

 

 

ఆ.వె.

నీకు నొక్కనికి ననేకుల నెదిరించి

నిలువ మాకు నెదుట కలదె శక్తి

యన్నఁ దిరిగి యుద్ధ మాచరింతు ననెడి

మాట యేల కల్గు మానవేంద్ర!

11.    

 

 

 

తే.గీ.

రమ్ము మేము విసరిన శూలమ్ములఁ బరి

ఘలను బట్టిసమ్ముల స్వీయ కర విముక్త

ములను నీ కరపు  ధనువు బలము నింకఁ 

బ్రాణములఁ ద్యజింతువు రఘురామ నీవు    

12.    

 

 

 

కం.

పలికి చతుర్దశ రక్ష

స్సు లిట్లు రోషమ్ము తోడ శూలము లంతన్

బలముగ విసిరిరి యెల్లరు

నిల దుర్జయుఁ డా రఘువరు నీక్షించి వడిన్    

13.    

 

 

 

కం.

ఆ పదునాలుగు శూలము

లేపారం గాంచి రాముఁ డేసి శరమ్ముల్

కోపమున వసు విలసితము  

లౌ పదు నాలుగిటిఁ  ద్రుంచె నా శూలములన్

14.    

 

 

 

మ.

కొని నారాచము లర్క తుల్యములు గాకుత్స్థుండు క్రుద్ధుండునై

మన మందుం బదునాల్గు సంఖ్యల మహాశ్మవ్రాత తీక్ష్ణమ్ములన్  

ధనువుం గైకొని కాంచి రాక్షసుల నుద్దండుండు వేసెన్ వడిన్

ఘనుఁ డా యింద్రుఁడు వజ్రమున్ విసరు వీఁకన్ మీఱ నుత్సాహియై

15.    

 

 

 

తే.గీ.

పసిడి పింజలను గనలు బంగరు ములి

కు లడరుచు రక్కసుల కెల్ల గుండె లందుఁ

దూఱి చీల్వఁగ నెత్తురు పాఱఁ దడిసి 

వెడలి యంత మునిఁగినవి పుడమి లోన

16.    

 

 

 

తే.గీ.

పగుల గుండెలు వికృత రూపమ్ము లంది

రక్త మందుఁ దడిసిన గాత్రముల తోడ

నసువులను వీడి పడిరి యా యసురు లెల్ల

వేళ్లు తెగినట్టి చెట్టుల విధము తోఁప

17.    

 

 

 

ఆ.వె.

నేలఁ గూలి నట్టి వేలుపు గొంగలఁ

గాంచి శూర్పణఖ వికల మనమ్ము

న వగపున కినిసి ఘనమ్ముగ నేడ్చుచు

నఱచె భైరవముగ వెఱపు తోడ   

18.    

 

 

 

ఆ.వె.

చేరి ఖరుని నాతి శీఘ్రమ యించుక

రక్త మెండ మెయిని మ్రాని బంక

తోడ నందు గనెడు ద్రుమమును బోలి నే

ల పయిఁ గూలెఁ దా నలసి భృశమ్ము 

19.    

 

 

 

కం.

అన్న యెదుట శోకమ్మున

మిన్నగ శూర్పణఖ సేసె మీఱిన ధ్వనులం 

గన్నులఁ గన్నీ రొలుకఁగ 

విన్నని వదనమ్ము తోడ వేదన తోడన్   

20.   

 

 

 

కం.

కని భండనమున మడియం

గ నైరృతులు పర్వు వెట్టి ఖరునకుఁ జెప్పెన్

వనిత యసుర నాశమ్మును 

ఘనుఁ డగ్రజునకు వివరముగ ననుజ యెల్లన్         

21.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నిరువదవ సర్గము.

అరణ్య కాండము

సర్గము 21.

 

 

 

పదునాలుగురు రక్కసులు రామునిచే సంహరింపఁ బడ శూర్పణఖ భయముతోఁ బాఱి యగ్రజుఁడు ఖరునకు నా వృత్తాంత మెల్ల నుడువ ఖరుఁ డామెను ననునయింప శూర్పణఖ ఖరుని రామునిఁ జంపఁ బురికొల్పుట.  

 

 

 

 

కం.

తిరిగి పడ శూర్పణఖ యా

ఖరుఁ డారసి యాగ్రహమ్ము కర మేపాఱం 

బర మానర్థము తోడుత

నరుదెంచిన యనుజ తోడ ననె స్పష్టముగన్    

1.      

 

 

 

తే.గీ.

పంపితి రుధిరాశనుల నా భక్త వరుల

రక్కసుల శూరుల మ దనురక్తుల హితు

లను బ్రియ మొనర్ప నీకు నెల్లరను దిరిగి 

యేల విలపింతు వివ్విధి బేల వోలె     

2.     

 

 

 

ఆ.వె.

చంప నెంచిన మఱి చంపఁ బడెడు వారు

కారు వీర లెపుడు కయ్య మందుఁ 

జెప్పి నట్టి పనినిఁ జేయక యుండెడి

వారు కారు వీరు వీర వరులు   

3.     

 

 

 

కం.

వినఁ గోరెద నేఁ గారణ

మును దిరిగి యనాథ వోలెఁ బుడమిని ఫణి భం

గిని దొర్లఁగ హా నాథా!

యని యేడ్చుచు నివ్విధముగ నకటా చెపుమా

4.     

 

 

 

కం.

కావఁగ నెల్లర నాథుఁడ

నే వఱల ననాథ పగిది నీరజ నేత్రా!

నీ వేలా విలపింతువు  

వే వీడి భయమును లెమ్ము వీడుమ కలఁతన్    

5.     

 

 

 

ఉ.

సోదరుఁ డా ఖరుం డిటుల శూర్పణఖం దగ నూఱడింప నే

త్రోదక మెల్లనుం దుడిచి యుత్తర మిచ్చెను గాంచి యన్న నే

నీ దరి కర్ణ నాసికల నెత్తురు కాఱఁగఁ గోలుపోయి నీ

యాదర మేను బొందితినె యగ్రజ యింపుగఁ జేరి నిన్నిటుల్      

6.     

 

 

 

ఉ.

పంపితి వీవు రాక్షసుల భవ్య చతుర్దశ వీర వర్యులం

జంపఁగ రామలక్ష్మణుల సంగర మందు మదర్థమై రుషం

జంపెను వారి నెల్లరను సన్నుత పట్టస శూల పాణులం

బెంపు వహించి రాఘవుఁడు భీకరుఁడై శిత సాయకమ్ములన్

7.     

 

 

 

తే.గీ.

మర్మముల నాఁట నమ్ములు మహినిఁ గూల

నొక్క క్షణమున రక్కసు లుక్కి రాము

నమ్మహా కర్మ మొసఁగ భయమ్ము తిరిగి

నే విషణ్ణ నుద్విగ్నను నిన్నరసితి    

8.     

 

 

 

కం.

కనిపింప భయం బెల్లెడ

ల నత్యధిక మగ్రజా! శరణ మర్థింపన్

మనమున దలంచి శీఘ్రమ    

చనుదెంచితి భీతి నిటకు సంతాపమునన్     

9.     

 

 

 

తే.గీ.

వగపు లను మొసళు లడరి వాస ముండు

భయ మను తరంగ పంక్తి ప్రబలుచు నుండు

విపుల శోక సాగర మందు భీతి మునుఁగ 

నన్ను గాపాడ రా వేల యన్న! దయను    

10.    

 

 

 

కం.

నన్ననుగమించి వచ్చిన

యిన్నర భోజను లసురులు నెల్లరు బల సం

పన్నుని రాముని శరములఁ

గ్రన్నన సమసి పడిరి భువిఁ గానన మందున్

11.    

 

 

 

చం.

కలిగిన నీ కనుగ్రహము కాంతను నా పయిఁ గొంచె మైననుం 

గలిగిన యీ వరాసుర నికాయము నందు నొకింత యేనియుం 

గలిగిన శక్తి రాఘవుని కన్నను మిన్నగ నింకఁ దేజమున్ 

సలలిత దండకా నిలయుఁ జంపుమ రాక్షస వైరి రామునిన్    

12.    

 

 

 

కం.

విడుతును నీ యెదుటను నే

వడిఁ బ్రాణమ్ములు మదీయ వైరిని రామున్

బెడిదముగఁ జంపకున్నం

దడయక నిరపత్రప! ప్రవిదారణ మందున్   

13.    

 

 

 

తే.గీ.

అమ్మహాత్ముని రాముని నాజి లోన

నీ వెదిర్చి నిల్వ నెదుట నీ వర బల

సంయుతమ్మును జాలదు శక్తి నీకు

నం చెఱుంగుదు బుద్ధిని నంచితముగ     

14.    

 

 

 

ఆ.వె.

శూరుఁడ వని తలఁచు చుండు మిథ్యా విక్ర

ముండ వీవు నిజము భండనమున

రామ లక్ష్మణుల నర వరుల వధియింప

శక్తి లేదు నీకు వ్యక్త మయ్యె    

15.    

 

 

 

ఆ.వె.

తేజ మింక శక్తి దీపించు నేని ని

శాచర! రఘురామ శక్తి మించి

దండకా వనమునఁ దనరు రామునిఁ జంపు

మ కులపాంసన! వదలక చెలంగి     

16.    

 

 

 

కం.

బలహీనున కీ విధముగ

లులిత పరాక్రమున కేల రుచిరంబౌ యీ

లలిత జనస్థాన వసతి

కలసి స్వపక్షుల వెడలుమ  గ్రక్కున నింకన్     

17.    

 

 

 

తే.గీ.

రామ తేజమ్ము నిన్ను ఘోరమ్ముగ నశి

యింపఁ జేయు క్షిప్రము తేజ మింపొసంగి

నట్టి వాఁడు రాముఁడు వీరుఁ డైన యట్టి

లక్ష్మణుఁడు విరూపిని నన్నిల నొనరించె    

18.    

 

 

 

కం.

విలపించి యాతతోదరి

పలు విధముల నిట్టు లసుర బాఁదుకొనెఁ గర

మ్ముల నుదరమ్ము భృశమ్ముగఁ

జెలరేఁగుచు గొల్లు మనియెఁ జింతాకులతన్     

19.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నిరువది యొకటవ సర్గము.

 

 

అరణ్య కాండము

సర్గము 22.

 

 

 

శూర్పణఖ పరుషముగ నిందింప ఖరుఁడు తాను రాముని గణింప నని యుద్ధమునఁ జంపెద నని పలుక సోదరి సంతసించి పొగడఁగ ఖరుఁడు దూషణుఁ డను తన సేనాపతితోఁ బదు నాలుగు వేల మంది రాక్షసులతో రామునిఁ జంప నేఁగుట.

 

 

 

 

కం.

నిందింపఁ బడఁగ రక్కసు

లందఱి నడుమఁ బరుషముగ నవరజ చేతన్ 

మందమ్ముగ నా ఖరుఁ డెదఁ

గుంది ఖరతరముగఁ బలికె ఘోర వచనముల్      

1.      

 

 

 

చం.

భవ దవమాన సంజనిత పార విహీన మదీయ రోషమున్ 

లవణ పయోధిఁ బాఱెడు జలమ్మును సుంత భరింప లేని రీ

తి వనిత! నే భరింపఁగ మదిన్ లవ మాత్రము జాల కుంటి ని

య్యవసర మందు నే మనుదు నక్కట మూరిన యట్టి దుర్విధిన్     

2.     

 

 

 

ఉ.

ఎన్నను నే రఘూధ్వహుని నెన్నఁడు రాముని క్షీణ జీవినిం

గ్రన్నన వీడుఁ బ్రాణములు రాముఁడు సేయఁగ దుష్కృతమ్ములన్

మిన్నగఁ జంప నే నిపుడు మిక్కిలి కోపము నూని యాజిలోఁ 

గన్నుల నీరు నింపకుమ కాంతరొ చత్తురు రామ లక్ష్మణుల్       

3.     

 

 

 

ఉ.

త్రాగుదు వీవు రక్తమును రామునిఁ జంపఁగ నేఁడు గొడ్డలిన్

వేగమ సంగరమ్మునను వేఁడిగ నుండఁగఁ బ్రీతి తోడుతం

దూఁగకు సంభ్రమమ్మునను దుడ్వుమ భాష్పము లక్షులం దిఁకం

దోఁగుమ హర్ష వారిధినిఁ దొయ్యలి శాంతి వహించి యొప్పుగన్   

4.     

 

 

 

ఆ.వె.

ఖర ముఖచ్యుతములు గిర లెల్ల నాలకిం

చి ముద మందె మిక్కుటముగ శూర్ప

ణఖ పొగడెను దిరిగి నాతి మూర్ఖత్వము

చేత ఖరు నసురుల శ్రేష్ఠు నంత       

5.     

 

 

 

ఆ.వె.

మున్ను మిక్కుటముగఁ దన్ను దూషించి య

వ్విధము తిరిగి పొగడ వింత నింతి 

యంత నా ఖరుఁ డిటు లనెను సేనాపతి

దూషణుని నసురునిఁ దూర్ణము కని    

6.     

 

 

 

చం.

మనము నెఱింగి వర్తిలెడు మాన్య చతుర్దశ సంసహస్రులన్ 

ఘన మగు భీమ వేగ భట కాయము నందు వెలుంగు వారినిన్ 

మనుజ పలాన్నులం గలిని మళ్లని వారినిఁ గ్రూర కర్ములన్

ఘన నిభ వర్ణ ఘోరుల జగమ్మున హింస నొనర్చు వారినిన్       

7.     

 

 

 

తే.గీ.

వ్యాఘ్ర దర్పులను సు విశాలాస్యులఁ గడు

బల్లిదుల మహౌజసులను భండ నార్థ

మెల్లరను సిద్ధ పఱుపమ యిపుడు సౌమ్య!

దూషణా! యుద్యమింపుమ తోరముగను        

8.     

 

 

 

ఆ.వె.

తెమ్ము రథము విల్లు నమ్ములు క్షిప్రము

శక్తి చిత్ర ఖడ్గ సంచయమ్ము

వాడి యైన వెల్లఁ బన్నుగ నుంచుమ

రాక్షస గణ వర్య1 రమ్ము వేగ

9.     

 

 

 

కం.

రణకోవిద! పౌలస్త్యు ల

గణిత మహాత్ములు చనంగఁ గయ్యమునకు నా

గణమునకు ముందు నేఁగెద

నణఁపఁగ దుర్వినయు రాము నత్యుగ్రముగన్

10.    

 

 

 

ఆ.వె.

పలుక నిట్లు ఖరుఁడు భాస్కర వర్ణ మ

హారథమ్ము నంత నశ్వములను  

వివిధ చిత్ర వర్ణ విలసితములఁ గూర్చి

నిలిపి దూషణుండు నెమ్మిఁ జెప్పె    

11.    

 

 

 

ఉ.

ఎక్కె ఖరుండు తే రలుక నెక్కటి వేలుపుటింటి కోన నా

మిక్కిలి వెల్గు బంగరుపు మేలిమి పూతఁ బసిండి కల్లులం

ముక్కని పిల్లికన్ రతనపుం బెను బండినొగం జెలంగెడిం

జెక్కఁగఁ బూలు చేపలును జెట్టులు కొండలు వేఁడి వేలుపున్   

12.    

 

 

 

తే.గీ.

మేలి పిట్టలు చుక్కలు మించి తనర

టెక్కె మడరంగఁ గత్తులు మిక్కుటంబు

నుండ చిఱు గంట లడరంగ మెండు బలపు

గుఱ్ఱముల తేరు నెక్కెను విఱ్ఱవీఁగి   

13.    

 

 

 

కం.

కని యా రథమ్ము నెక్కఁగ

ఘనునిన్ ఖరు దూషణు బలగణ నాయకు వా

రినిఁ జుట్టు ముట్టి రసురులు

చన భీమ పరాక్రము లని సల్ప రయమునన్    

14.    

 

 

 

కం.

ఖరుఁ డుండి స్యందనమ్మున 

గురు ధానుష్కుల స వర్మ ఘోరాయుధులన్

వర కేతన ధారులఁ దా

నరసి చనుం డని వచించె నసురుల నెల్లన్     

15.    

 

 

 

తే.గీ.

కదలె నా రాక్షస బలము కవచములఁ బ

తాకముల నూని వడి జనస్థాన మందు

నుండి వేగమ్ముగ నొనర్చు చుండి ఘోర

గర్జనమ్ములు వన మెల్లఁ గంప మంద   

16.    

 

 

 

తే.గీ.

పట్టిసములు ముద్గరములు పదును గొడ్డ

ళు లిఁక శూల చక్రములు కత్తులును వఱల

హస్తములఁ దోమరములు మహా ధనువులు 

పరిఘ శక్తి ముసల గదా వజ్రములును

17.    

 

 

 

తే.గీ.

భీమదర్శను లసురులు వేగముగఁ గ

దలిరి పదునాల్గు వేవురు దర్ప మడర

ఖర మనో౽నువర్తులు ఘోర కానన మగు

నా జనస్థాన మందుండి యంద ఱంత     

18.    

 

 

 

కం.

పరువిడు భీమ పరాక్రము

ల రక్కసులఁ గాంచి ఖరుని రథముం జనియెం

బరువున వారికి వెనుకను

ఖరు బుద్ధి నెఱింగి త్రోల ఖరు సారథియే    

19.    

 

 

 

తే.గీ.

తప్త కాంచన భూషిత దార్ఢ్య చిత్ర

సైంధవ విరాజిత మడరి సత్వరముగఁ

జనఁగ రిపు ఘాత ఖర వర స్యందనమ్ము    

దశ దిశల నిండె ధ్వను లెల్ల దారుణముగ      

20.   

 

 

 

కం.

ఘన రోషం బూని ఖర

స్వనుండు ఖరుఁడు పురికొల్పె సారథి యము భం

గినిఁ జంప నెంచి రిపులను

ఘన ఘన మశ్మములఁ గురియు కరణి నఱచుచున్    

21.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నిరువది రెండవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 23.

 

 

 

ఖరుని సైన్యము రామునిపై దండెత్త నేఁగుచుండ ననేక దుశ్శకనములు పొడచూపిన ఖరుఁడు సందేహింపక ప్రగల్భములు వల్కి త్రిశిర దూషణాది రాక్షస వీరులతో నేఁగి రామలక్ష్మణులను మార్కొనుట. 

 

 

 

 

కం.

చనుచుండ ఖరు మహాబలు

ననీక మతి ఘోర మశివమౌ యసృ గుదక

మ్మును గురిసె వారిదములు ఖ

ర ని భారుణ వర్ణములు ధరణిపై వింతన్   

1.      

 

 

 

కం.

అతి వేగవంతములు ఖరు

ని తురంగములు రథ యుక్త నిపుణాశ్వమ్ముల్ 

విత తాధ్వమున స సుమ విల

సితమ్మునఁ దడఁబడఁ జాగెఁ జిత్రం బనఁగన్    

2.     

 

 

 

ఆ.వె.

సూర్య బింబమునకుఁ జుట్టు నమరె కారు

టెఱుపు రంగు నందుఁ గొఱవి బండి

కల్లు పగిది గుడుసు గాంచు చుండఁగ నక్క

జమ్ముగఁ జనుచుండఁ బమ్మి బలము

3.     

 

 

 

కం.

ఘన కాయ గృధ్రరాజము

కనక ధ్వజ దండ మంతఁ గదిసి వెలయ స్యం

దనమున నున్నతముగ ని

ల్చెను దారుణ విష్కిరమ్ము లీలన్ వేగన్   

4.     

 

 

 

తే.గీ.

చేరి యా జనస్థానపుఁ జేరువకును

మాంస మారగించు విహగ మండల మృగ

సంఘము లఱచె   భీకర స్వనములు వివి

ధమ్ము లెల్లెడల నడర దారుణముగ       

5.     

 

 

 

ఉ.

నక్కలు మిక్కుటమ్ముగ స్వనమ్ములు భైరవముల్ వెలుంగు నా

దిక్కులఁ గాంచి చేసినవి తెల్లముగా నసు రాశివమ్ములన్ 

మిక్కిలి క్రిక్కిఱించినవి మేఘము లద్రి నిభమ్ము లభ్రమం

దెక్కుడు రక్త తోయముల నెల్ల వహించి నిరంతరమ్ముగా

6.     

 

 

 

ఆ.వె.

ఒడలు గగురుపొడుచు నోజఁ బొడమెఁ చీఁక

టి దశ దిశలలోఁ గడింది కనని 

రీతి దేని నైన నాతతముగ వెల్గు

లెల్ల నణఁగె నపుడు తల్లడిల్ల  

7.     

 

 

 

తే.గీ.

పుంటి క్రొన్నెత్తుటికి సరిపోవు  రంగు

నూనె సంధ్య యకాలము లోనఁ గాంచ                         

ఘోర మృగ ఖగములు కంక గోమి గృధ్ర

ములు ఖరు నెదుటఁ గూసెను దెలుప భయము       

8.     

 

 

 

తే.గీ.

నిత్య మశుభ కరము లాజిని భయ దర్శ

నములు జంబుకమ్ము లవి సేన కభి ముఖము

గా నిలిచి కూసె మంటలఁ గ్రక్కు పగిదిఁ

జెలఁగి యప్పుడు వినుచుండఁ జిత్రముగను

9.     

 

 

 

          చం.

పరిఘ నిభుండు కేతువు ప్రభాకరు సన్నిధి నుండఁ గన్పడెం 

దరుణము కాని కాలమునఁ దద్ద గ్రహం బగు సైంహికేయుఁడే

కరములఁ బట్టె నర్యముని గట్టిగ వీచెను మారుతం బటన్

ఖరకరుఁ డుండె నత్తఱినిఁ గాంతి విహీనుఁడునై నభమ్మునన్

10.    

 

 

 

చం.

మిడుఁగురు పుర్వు కాంతి వలె మిన్నునఁ దారలు కన్పడెం బగల్

బడలి మునింగె మీనములు పక్షులు కొల్నులు శుష్క పద్మముల్

విడిచిన వెల్ల వృక్షములు వింతగఁ బుష్ప ఫలవ్రజమ్ములన్  

వడి నెగసెన్ రజం బపుడు వాయు విహీనమ యెఱ్ఱ మబ్బనన్

11.    

 

 

 

ఉ.

శారిక లెల్లఁ గూసె ఘన శబ్దము లీనుచు వింత వింతగా

ధారుణి నుల్కలుం బిడుగు దాఁటులు కూలెను భీకరమ్ముగా

దారుణ రీతి కంపములు ధారుణిఁ గన్పడె సాద్రి గోత్ర సం

హారము మిక్కుటమ్ముగ మహాద్భుత భంగిని నిశ్చయమ్ముగన్

12.    

 

 

 

తే.గీ.

అరద మందున్న వానికి నఱచు చున్న

వాని కతి ధీనిధి కదిరె వామ భుజము

ఖరున కత్తఱి వీక్షింపఁగ నతని గళ

మంత బొంగురు వోయెను వింతగాను  

13.    

 

 

 

కం.

పరికింప నలుదెసలు నా

ఖరునకుఁ గన్నీరు నిండెఁ గనులన్ నుదుటం

బరఁగెను రుగ్మం బయినన్

మరలఁడు మోహవశమునను మనుజాశనుఁడే    

14.    

 

 

 

కం.

కని యుత్పాతముల గగురు

నొనరించెడి వాని నెల్ల నుద్దండ ఖరుం

డనె వచనమ్ముల నివ్విధి 

ఘను లా రక్కసులఁ గని నగవు తొలఁకంగన్

15.    

 

 

 

ఆ.వె.

అవశకునము లిట్టు లతి ఘోర దర్శన

ములఁ గని బెదరంగఁ బోను వీర్య

వంతుఁడ నయి కరము సుంత యేని మదిని 

నేను దుర్బలు వలె వీని కెపుడు    

16.    

 

 

 

ఉ.

తారలఁ గూల్తు బాణములఁ దద్దయుఁ తీక్ష్ణములన్ బలమ్మునం

దారల దారి నుండి మృతి ధర్మము చావున కిత్తుఁ గిన్కతో

నా రఘు వీరు లిర్వుర మహా రణ మందు వధింప కేను నా

ఘోర శరమ్ములన్ మరలఁ గ్రూర బలోద్ధతులన్ రయమ్మునన్   

17.    

 

 

 

కం.

కోరిక తీరినది యగును

వారి రుధిర మెల్లఁ ద్రాగి భగిని కలఁత యె

వ్వారి వలనం గలిగెనో

యా రాఘవుల రుధిరమ్ము నానందముగన్  

18.    

 

 

 

తే.గీ.

అపజయ మెఱుంగ మున్ను నే నాజి లోన

మీర కనిరి ప్రత్యక్షము వీరు లార!

యనృత మేను మీ కిప్పట్టు నందు సుంత

యేని చెప్పుట లేదు మీ రెలమి వినుఁడు

19.    

 

 

 

తే.గీ.

మత్త మైరావతమ్మున నుత్తమంపు

యానమం దేఁగు నట్టి దేవాధినాథు

వజ్రధరు నైన నోడింతు భండనమున

నన్న మానవ మాత్రుల నెన్న నేల

20.   

 

 

 

ఆ.వె.

ఖరుఁడు మీఱి యట్లు గర్జింప వీక్షించి

ప్రమద మందె ఘోర రాక్షస చము

వెల్ల మిక్కుటముగ నుల్లములను మృత్యు

పాశ వశము సెంది యాశ సెలఁగ          

21.    

 

 

 

తే.గీ.

సిద్ధ గంధర్వ చారణ శ్రేష్ఠ దేవ

తాపసులు మహాత్ములు రణ దర్శనాభి

రతులు చేరి పలికిరి గో బ్రాహ్మణ జగ

ములకు నెల్ల స్వస్తి కలుగ వలయు ననుచు     

22.   

 

 

 

ఆ.వె.

జయము నందు గాక సమరమ్ము నందుఁ బౌ

లస్త్యులను నిశాటుల సమయించి

రాముఁ డాజి లోన భీమాసురుల నెల్లఁ

జక్రహస్తుఁ డడరి చంపినట్లు

23.   

 

 

 

చం.

ఇవియు మఱిన్ని వాక్యముల నెల్లఁ గుతూహల మేర్పడంగఁ బ

ల్కి వర విమాన కోటిఁ బరికించుచు వాహిని నెల్ల నిల్చి రం

త విగత జీవులం గనఁగ దారుణ రాక్షస వంశ వీరులం

బ్రవిమల తాప సానిమిష వర్యులు చారణ సిద్ధ సాధ్యులున్  

24.   

 

 

 

కం.

వేగమ మహోగ్ర సైన్యము

తో గమకించి చను ఖరుని దుర్జయుఁ గని వా

రేఁగం జాగిరి రక్కసు

లా గతి నుత్సాహితు లయి యందఱు నంతన్   

25.   

 

 

 

తే.గీ.

శ్యేనగామి పృథుగ్రీవుఁ డింక యజ్ఞ

శత్రువు విహంగముండు దుర్జయుఁడు ఘను ల

గు కరవీరాక్ష పరుషులు గొప్ప వారు

కాలకార్ముకుఁడును మేఘమాలి యింక   

26.   

 

 

 

తే.గీ.

అసురు లా మహామాలి సర్పాస్యుఁడు రుధి

రాశనుండు నాఁ బరఁగు మహాపరాక్ర

ము లగు  పన్నిరువురు ముదమున ఖరున కె

దుటను జనఁ జాగి రెల్లరు తూర్ణముగను

27.   

 

 

 

తే.గీ.

అమ్మహాకపాలి మఱి స్థూలాక్షుఁడును బ్ర

మాథియుఁ ద్రిశిరుం డనఁ బరమ రిపు ఘాత

కులు నలువురు సేనానులు ఘోర దూష

ణుని వెనుక తరలిరి నిపుణు లని యందు    

28.   

 

 

 

తే.గీ.

వేగవంత మా రాక్షస వీర సేన

బల్లిదమ్ము సమర కాంక్షి పార్థ వరులు

రామ లక్ష్మణుల నెదిర్ప గ్రహములు రవి

శశుల మార్కొనెడు పగిదిఁ జాగె నంత    

29.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నిరువది మూడవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 24.

 

 

 

ఖరుఁడు రాక్షస సైన్యముతో నాశ్రమమును సమీపింప రాముఁడు లక్ష్మణ సహితము ఖరుఁడు గాంచిన ఉత్పాతములను గాంచి లక్ష్మణుని సీతతోఁ గలసి గుహలో భద్రముగా విల్లమ్ములతో నాయత్తమై యుండు మని పనిచి మహా రౌద్రాకారమునఁ జాపము ధరించి యా రాక్షస సైన్యమున కెదురు నిలువ భూతములు వనదేవతలు కూడ భయముతోఁ బాఱుట.   

 

 

 

 

కం.

ఖర విక్రమమ్మున ఖరుఁడు

వరాశ్రమమున కరుదెంచ భ్రాత సహితమున్

నర పుంగవుండు రాముం

డరసెఁ దదుత్పాత చయము నతిఘోరమ్మున్

1.      

 

 

 

తే.గీ.

ఉద్భవించిన యట్టి మహోగ్ర దుశ్శ

కునముల గగురులఁ బ్రజలకు నహితమ్ము

నొసఁగు వాని వీక్షించి సహోదరుఁ గని

లక్ష్మణుని నంతఁ బలికెను రాముఁ డిట్లు       

2.     

 

 

 

కం.

కను లక్ష్మణ! యుత్పాతము

ల నాయత భుజా! జగమ్ముల కొసఁగ హానిం

దనరినవి సకల రాక్షస

వినాశనమ్మునకు నుద్భవించిన వానిన్

3.     

 

 

 

తే.గీ.

రక్త ధారలఁ గురియుచు రౌద్ర తర ర

వమ్ము లీనుచు గర్దభ వర్ణ సన్ని

భారు ణాంబుధరములు నభమ్ము నందుఁ

జెలఁగి తిరుగాడు చుండెను జిత్రముగను

4.     

 

 

 

చం.

పొగలను గ్రక్కు చున్న యవి మూరుచు నా శర కోటు లెల్ల మే

లుగ సమరమ్ముఁ గోరుచును రుక్మ విభాసిత చాప రాజముల్

సుగతినిఁ దిర్గుచున్న యవి జూడుమ లక్ష్మణ సంభ్రమమ్ము మూ

ర గహన చారు లైన ద్యుచరమ్ములు కూయుచు నున్న విత్తఱిన్  

5.     

 

 

 

కం.

కాన నగున్ మన ముందట

కాననమునఁ గడు భయమ్ము కానఁగ వచ్చెన్

మేనుల నుండ నసువు లను

మానము మన కిటఁ కడింది మనుజవరేణ్యా!

6.     

 

 

 

ఉ.

ఘోరపు టాజి సంభవ మగున్ వడి సందియ మింత లే దిటన్

మూరుచు మాటి మాటికిని బోరనఁ గంపితమై భుజంబ యే

పారఁగ సూచితమ్ము నిజ భవ్య జయమ్ము ప రాజయమ్మునున్

శూర! ప్రసన్నతం బ్రభల శోభిత మయ్యెఁ దవాస్య మిత్తఱిన్  

7.     

 

 

 

తే.గీ.

యుద్ధ మొనరింప మిక్కిలి యుద్యమించు

వారి వదనమ్ము లందుఁ బ్రభలు విగతము

లయ్యె నెల్లర కాయుః క్షయంబు తథ్య

మగును లక్ష్మణ! పరికింప నసుర తతికి

8.     

 

 

 

చం.

ధ్వను లఱవంగ రక్కసులు తద్ద వినంబడు చుండెఁ గాంచుమా

ఘనముగ మ్రోగ దుందుభి నికాయము నాహత సంచయమ్ములుం

గన వలె  రాఁగ నాపదలు గ్రన్నన ముందుగ నెంచి పూరుషుల్

మనములఁ జేయు కార్యముల మంచి నొసంగెడు వాని నింపుగా   

9.     

 

 

 

తే.గీ.

కావున ధనువు శరములు నీ విపుడు ధ

రించి సీతను గూడ గ్రహించి యేఁగు

మ వడి దుర్గమ మైన గుహాంతరమున

కుఁ దరు సంకులపుఁ దటికిఁ గూరుచుండు 

10.    

 

 

 

ఆ.వె.

యిచ్చగింప నెడఁద నివ్వచనములఁ గా

దనఁగ  నాదు పదము లందు నాన

లక్ష్మణ చను వేగిరమ్ముగ నాలసిం

పఁ దగ దింక ననుజ వర్య! వినుమ

11.    

 

 

 

తే.గీ.

వీరుఁడవు చంపఁగల వయ్య వీరి నెల్ల

సందియము లేదు సుంతయుఁ జంప నెంతు

సర్వ రాక్షసుల స్వయమ్ము సంగరమున

నేను గ్రూర కర్ముల నెల్ల నూని ధనువు  

12.    

 

 

 

కం.

అన విని జానకి సహితము

ధనువు శరములను గ్రహించి దరికిం జేరం

జనని గుహ లోని కేఁగెన్ 

ఘనుండు లక్ష్మణుఁ డనువుగఁ గాకుత్స్థునకున్   

13.    

 

 

 

కం.

వెడలఁగ లక్ష్మణుఁ డవ్విధిఁ

దడయక మైథిలినిఁ గూడి తద్ద ముదమునం

బడసితిఁ గార్యం బని రా

ముఁడు ధరియించెను గవచము పురుషోత్తముఁడే

14.    

 

 

 

చం.

అనలము భంగి మండెడు మహా కవచమ్మున వెల్గు చుండఁగాఁ

గనఁబడెఁ జీఁకటిన్ వెలిఁగి కన్పడు ధూమము లేని యగ్నినా

ఘన రఘు వీరుఁ డత్తఱినిఁ గార్ముక మెత్తి శరమ్ము లంది  జ్యా

ధ్వనులను నింపి దిక్కుల నవారిత రీతిని నిల్చెఁ దా నటన్ 

15.    

 

 

 

తే.గీ.

సిద్ధ గంధర్వ చారణ శ్రేష్ఠ దేవ

తాపసులు మహాత్ములు రణ దర్శనాభి

రతులు బ్రహ్మర్షులు జగములఁ గడు పుణ్య

కర్ములు కదిసి యనిరి ట్లొకరికి నొకరు   

16.    

 

 

 

ఆ.వె.

గోవులకు ద్విజులకు  నీ వర లోకము

లందు నున్న  వారి కందఱికిని

స్వస్తి కలుగ వలయుఁ బన్నుగ నంచును

నింక నిట్టు లనిరి యెల్లవారు

17.    

 

 

 

ఆ.వె.

జయము నందు గాక సమరమ్ము నందుఁ బౌ

లస్త్యులను నిశాటుల సమయించి

రాముఁ డాజి లోన భీమాసురుల నెల్లఁ

జక్రహస్తుఁ డడరి చంపినట్లు

18.    

 

 

 

ఉ.

అక్కట చూచు చొండొరుల నందఱు నీ పదు నాల్గు వేవురన్

రక్కసులన్ రణమ్మున విరామము నొందక యెట్లు రాఘవుం

డొక్కఁడు చంప నేర్చు నని యుత్సుకతన్ వచియించి రివ్విధిన్ 

మిక్కిలి ధర్మ తత్పరుఁడు మేదిని భండన మెట్లొనర్చునో  

19.    

 

 

 

తే.గీ.

ఇట్లు రాజర్షులును సిద్ధు లెల్ల స్వీయ

గణములను గూడి దేవతా గణము నిలువ

వర విమానములను  ద్విజ వరులు నిల్చి

రటఁ గుతూహల ముప్పొంగ నాత్మ లందు

20.   

 

 

 

కం.

సమర తల మందుఁ జొచ్చిన

యమిత స్వీయ తను తేజు నా  రాఘవునిన్

సమ రోత్సాహుం గని  భూ

తము లన్నియుఁ దొట్రిలినవి తద్దయు భీతిన్    

21.    

 

 

 

తే.గీ.

అప్రతిమ రూపు రాముని నల పెఱుంగ

క పను లెల్లఁ జేసెడు వాని ఘనుని రూప

మందఁ గోపమ్ము కన్పట్టె నప్పు డడరి

రుద్రుని పినాక హస్తుని రూపము వలె    

22.   

 

 

 

తే.గీ.

అంతఁ గన్పట్టె ఘోర వర్మాయుధ ధర

రాక్షస ధ్వజని ధ్వజ విరాజితమ్ము 

వితత గంభీర నిర్హ్రాద భీకరమ్ము 

నలుదెసల రామున కపుడు నర వరునకు   

23.   

 

 

 

చం.

ఘనముగ సింహ నాదముల గర్జల నొండొరులున్ సృజింపఁగన్

ధనువులఁ జాఁగఁ జేయుచు సతమ్మును జృంభములం జెలంగఁగన్

నినదము లారఁ జాటుచును నెమ్మిని దుందుభు లందుఁ గొట్టఁగన్ 

వనమున ఘోర శబ్దములు పాఱుచు నిండెను మిక్కుటమ్ముగన్

24.   

 

 

 

కం.

భయ మందఁగ శబ్దములకు

రయమున శ్వాపదము లా యరణ్య మృగ గణం

బె యద్రుచుఁ బర్వులు వెట్టె న

రయక వెనుక కంత శబ్ద రహిత గతులకున్   

25.   

 

 

 

ఆ.వె.

అంత నసుర సేన యత్యంత ఘోర మా

యుధములు వివిధమ్ముల ధరియించి

లోతయిన కడలిని  నాతతముగఁ బోలు

చుండ రాముఁ గదిసె శూర వరుని   

26.   

 

 

 

ఆ.వె.

రాఘవుండుఁ జూచె రణపండితుండు ది

క్కులను బఱిపి దృష్టి ఘోర రాక్ష

స వర సేన నంత సంగరమునకు నా

యత్త మయిన దాని నలుక తోడ     

27.   

 

                       

 

ఆ.వె.

చాఁచి భీమ ధనువు శరములఁ గొని యమ్ము

ల పొది నుండి వేగ రాఘవుండు

తీవ్ర కోప మూనెఁ దెగటాఱ్ప సర్వ రా

క్షసుల నాజి లోన సంభ్రమించి

28.   

 

 

 

తే.గీ.

చూడ శక్యము కానట్టి వాఁడు ప్రభల 

యుగ లయాగ్ని సన్నిభముగ నుజ్జ్వలితుఁడు

క్రుద్ధుఁ డయి నిల్వఁ దేజమ్ముఁ గూడి పాఱి

రి వనదేవత లారసి రేఁగ భీతి   

29.   

 

 

 

కం.

దక్షు క్రతువుఁ గూల్చెడి పా

లాక్షుని రూపమ్ము వోలె నగపడె నపుడున్

సుక్షత్రియుండు రాఘవుఁ

డా క్షణమున రోష మూన నా రూప మటన్

30.   

 

 

 

ఆ.వె.

తేజ మెల్ల నూని స్థిరముగ నిలువ సం

గ్రామ భూమి లోన రఘువరుండు

బ్రాణ రాసు లెల్ల భయ మంది పర్వులు

తీసె నార్తి తోడ దిక్కులకును    

31.    

 

 

 

తే.గీ.

అసుర సేన కార్ముకములు నాభరణము

లుండ ధ్వజములు కవచ సంయుతము నగ్ని

వర్ణ నిభములఁ గన్పట్టె భాస్క రోద

యంపు నీలాభ్ర రాశిగ నింపు గాను  

32.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నిరువది నాలుగవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 25.

 

 

 

తన్నెదిరింప వచ్చిన ఖరుని సైన్యములోని రాక్షసుల నెల్లర రాముఁడు యుద్ధములోఁ జంపుట,  యుద్ధభూమి భయంకరముగఁ గనిపించుట.

 

 

 

 

కం.

కనియెన్ ఖరుండు మును చను

జనులం గూడి నిజ హస్త చాప విలసితున్

ఘన విక్రము విద్విష మ

ర్దను రఘుకుల వార్ధి చంద్రు రామున్ భీమున్     

1.      

 

 

 

కం.

కని సశర మూని చాప

మ్మును ఖర నిస్వనమున వడిఁ బోనిమ్ము రథ

మ్మును రాముని కెదురుగ నని

తన సూతునిఁ బంచె ఖరుఁడు దర్పం బడరన్   

2.     

 

 

 

కం.

విని ఖరు నానతి సూతుఁడు

ఘన బాహుఁడు రాముఁ డొంటిగ ధనువు తోడం

గనపడు చోటునకుం దో

లెను గుఱ్ఱములను గడింది లీలగ నంతన్    

3.     

 

 

 

చం.

మార్కొను నా ఖరుం గని యమాత్యులు రక్కసు లెల్లఁ దత్క్షణం

బుర్కుచు వానిఁ  జేరి వడి నుద్ధతిఁ జుట్టును  బొబ్బరించుచుం

గూర్కొన వారి మధ్య తన ఘోర రథమ్మున నుండఁ గన్పడెం

దర్కము సేయ నభ్రమునఁ దారల మధ్య కుజుండు నా యనన్    

4.     

 

 

 

ఆ.వె.

అంత  ఖరుఁడు శర సహస్రము లా రాము

ని పయి నసమ తేజుని పయి వేసి

పరమ నిశితములను బాధించి భృశముగ

నఱచె ఘోరముగ మహాహవమున

5.     

 

 

 

తే.గీ.

అంత నెల్లరు ఘన చాప హస్తు లయ్య

సురులు క్రుద్ధులై భృశము పెక్కు రకము లగు

శస్త్రములఁ గురియించిరి యస్త్ర విదుని 

రాముని పయి దుర్జయునిపై రణము నందు   

6.     

 

 

 

తే.గీ.

ముద్గరమ్ములఁ బట్టసమ్ములను శూల

ములను బ్రాసములను ఖడ్గములను బరశు

వులను రోష తత్పరు లసురు లని లోన

నడిచి రా రాఘవుని నీరజాక్షు నడరి      

7.     

 

 

 

మ.

ఘన నీలాభ్ర నికాశు లుగ్రులు మహాక్రందప్రభా భాసితుల్

ఘన వీర్యోద్ధత ఘోర దర్శనులు నా కాకుత్స్థు వీక్షించి భం

డన నైపుణ్యులు స్యందనమ్ములను ఘోటవ్రాత విన్యస్థులై

యనికిన్ దూఁకిరి గుంజరమ్ములను గ్రోధావేశులై యెల్లరున్    

8.     

 

 

 

తే.గీ.

రాక్షస దళము లా రఘు రాముని పయి

బాణ వర్షము కురియించెఁ బర్వతమ్ము

పైన వర్షించు పర్జన్య పటల ముదక

ధారలఁ గురియు భంగిని దారుణముగ    

9.     

 

 

 

తే.గీ.

రాక్షస గణము తన చుట్టు నా క్షణమ్ము

పరివృతమ్ము గా నటులఁ జూపట్టె రాముఁ

డపుడు సంధ్యా సమయమున నాత్మ పారి

షదులు సేరఁగ నిల్చిన శంకరు వలె    

10.    

 

 

 

తే.గీ.

ఆపె యాతుధానులు వేసి నట్టి బాణ

జాలమును రఘువీరుఁడు శౌర్యమునను

సాగరమ్ము నద్యోఘము వేగ యాపి

నట్టి చందము దీపింప నక్కజముగ   

11.    

 

 

 

కం.

కుందఁడు రాముఁడు సుంతయు

నందఱి శస్త్రములు దాఁక నాతనిఁ  బిడుగుల్

బృందమ్ములుగాఁ బడ నే

చందము గిరి కదల దట్టి చందము స్థిరుఁడై

12.    

 

 

 

కం.

దెబ్బతిన నెత్తుటఁ దడిసి

యబ్బహు గాత్రమ్ము లుండ నగపడె రాముం

డబ్బురముగ సందె నడరు

మబ్బుల చాటున దినకరు మాడ్కి తలంపన్  

13.    

 

 

 

ఆ.వె.

ఒక్కఁ డుండ రాముఁ డుగ్రులు వేల య

సురుల నడుమ నట్లు సురలు సిద్ధు

లు ఋషి వరులు వ్యాకులు లయిరి గంధర్వు

లును భృశమ్ము రాఘవు నటఁ గాంచి

14.    

 

 

 

కం.

సంకృద్ధుండై మెండుగ

నంకమునన్ వంచి ధనువు నమ్ముల విడిచెన్

జంకక యంతట వందల

నింకను వేలను నిశితము లినకుల మణియే 

15.    

 

 

 

తే.గీ.

కాలదండ సన్నిభములు కంకపత్ర

ఋజు చరములు దుర్వారము లేరి కైన

నాజి దుస్సహములు సుమ హావలీల

గ రఘు వరుఁడు విడిచె విశిఖములఁ గినిసి

16.    

 

 

 

చం.

రిపుబల మందు రాఘవుఁడు లీలగ వేసిన ఘోర బాణముల్

నిపుణతఁ గాలపాశములు నివ్వెఱఁ గొల్పఁగఁ దీసి బ్రాణముల్

రిపులవి జీల్చి యంగములు రేఁగి కడింది మునింగి రక్త మం

దపు డవి సేరి యాకసము నగ్ని నిభమ్ము వెలింగెఁ నచ్చటన్

17.    

 

 

 

తే.గీ.

రామ చాపమండల వినిర్గత శర వ్ర

జమ్ము ఘోరోగ్ర రాక్షస సంచ యాసు

జాల సంగ్రహసామర్థ్య సంచయంబ 

విడువఁబడె నట్టి శరములు విస్తృతముగ

18.    

 

 

 

తే.గీ.

రిపు పతా కాగ్రముల నతి ధృఢ ధనువులఁ 

గవచముల శిరమ్ముల హస్త కాయముల స

భూషణములఁ గుంజర నిభ భూరి సక్థు

ల విఱిచె శత సహస్రములను శరములు        

19.    

 

 

 

ఉ.

పంపెను రాఘవుండు నర వర్యుఁడు వేగమ కాలు నింటికిం

ద్రెంపి రధంపుఁ బైడి నగ తేజుల సారథులన్ హయమ్ములన్ 

సొంపు గజమ్ములం జదిర చోదకులన్ మఱి యాశ్వికావళిన్

గుంపుల నున్న కాలరుల ఘోరముగా రఘు రాముఁ డాజిలోన్ 

20.   

 

 

 

తే.గీ.

తీక్ష్ణ నాళీక నారాచ తీవ్రతమ వి

దారిత శరీర రాక్షస వీరు లెల్ల

రార్త నాదమ్ము లొనరించి రార్తి తోడ

సమర భూమిలో భీకర స్వనము లంత

21.    

 

 

 

ఆ.వె.

వాడి ముల్కు లెల్లఁ  బర వీర మర్మావ

యవము లందుఁ దూఱ నపుడు పడయ

రింత యేని సుఖము యెండి నట్టి వనము

 నిప్పు చేతఁ బడయ నేర్వ నట్లు

22.   

 

 

 

కం.

విసిరిరి కొందఱు బల్లిదు

లసురులు శూరులు బలమి మహాత్ముని పైకిం

గసితోఁ గత్తులు గొడ్డళు

లు సేరి శూలమ్ము లుగ్రులు మహాయుధముల్

23.   

 

 

 

కం.

వారించి వాని నమ్ముల

నా రాముఁడు శస్త్ర తతుల నాయత భుజుఁడే

వారి శిరోధరములు లీ

లా రీతినిఁ ద్రుంచి తునిమె రాక్షసుల ననిన్

24.   

 

 

 

కం.

పగిలిన శిరములు విల్లులు

పగిలిన కవచమ్ము లెల్లఁ బడె నేల పయిన్

ఖగరాజ పక్ష వాతము

నఁ గుజమ్ములు నేలఁ గూలిన పగిది నంతన్

25.   

 

 

 

ఆ.వె.

మిగిలిన యసురులు తమిం జేరిరి ఖరుని

చెంతకుఁ బరు విడుచు శీఘ్రమ  శర

ణార్థము శర సంచయార్తులు భీతినిఁ

గడు విషణ్ణు లలసి కయ్య మందు    

26.   

 

 

 

ఆ.వె.

దూషణుండు వారిఁ దూర్ణం బనునయించి

తోడికొనుచు వారి దూఁకె నంత

రాముని పయి ధర్మ రాజు రోషమ్మున

రుద్రు పైకి దూఁకు రూపు తోఁప

27.   

 

 

 

చం.

కలుగఁగ దూష ణాశ్రయము గ్రమ్మఱి యెల్లరు వీడి భీతినిన్

శిలలును సాల తాలములుఁ జేతుల నుండఁగ రాఘవేంద్రుపైఁ

జెలఁగుచు నుర్కి రెల్లరు నశేషము కుర్యుచు బాణ వర్షముల్

వెలయఁగ ఘోర శూలములు విల్లులు సమ్మెటలుం గరమ్ములన్    

28.   

 

 

 

తే.గీ.

ముంచిరి ద్రుమ వర్షమ్ముల ముంచి రింక

ఘన శిలా వర్షములను సంగరము నందు

రాక్షసులు  విజృంభించుచు రాఘవేంద్రు

దుర్జయుని దోర్బలుని వెసఁ దోరముగను 

29.   

 

 

 

తే.గీ.

తుముల మద్భుతము మహోగ్ర సమర మయ్యె

రోమహర్షణము వనము లోన శత్రు

దుర్జయుండు రామున కింక దుష్ట రాక్ష

స ధ్వజినికిఁ బరస్పర జయము నెంచ

30.   

 

 

 

మ.

అసురుల్ క్రుద్ధులు చుట్టుముట్టిరి యరణ్యం బందు నా రాఘవున్

వెస వీక్షించి ధనుర్ధరుండు దిశలం బెక్కండ్రు సప్రాసముల్

గసిఁ గుర్యంగను బాణ వృష్టిఁ దనపై గాంధర్వ ఘోరాస్త్రమున్

వెస సంధించి యొనర్చె రాఘవుఁ డహో బీభత్స నాదమ్మునున్

31.    

 

 

 

తే.గీ.

రక్కసులపై మహాబాహు రాముఁ డేసి 

యుజ్జ్వ లాస్త్రము నవ్వింటి నుండి వేయ  

శర సహస్రమ్ములను వేగ సర్వ దిశలు

నిండె నా బాణముల తోడ మెండుగాను   

32.   

 

 

 

తే.గీ.

శరము లందుట సంధించుట రయమున శి

లీ ముఖముల విడుచుటను లీల రాముఁ

డెద్దియును వింత నత్తఱి నెఱుఁగ రకట

బాణ నిచ యార్దితు లసుర వరులు సుంత

33.   

 

 

 

కం.

శరములు నింపెను జీఁకటి

స రవి గగన భాగ మందు సంపూర్ణముగా

శరములఁ గ్రక్కెడు భంగిని

నరర్షభుఁడు రాఘవుఁడు గనంబడె నచటన్    

34.   

 

 

 

కం.

ఒక్కుమ్మడిఁ బడు వారలు

నొక్కుమ్మడిఁ జచ్చు వార లుగ్రాసురులే 

యొక్కుమ్మడిఁ బడిన యసురు

లొక్కుమ్మడిఁ జెదర నిండె నుర్వీ తలమే   

35.   

 

 

 

ఆ.వె.

పడ్డ వారు చంపఁ బడ్డ వారును సన్న

మైన వారు విఱిఁగి నట్టి వారుఁ 

బగిలి నట్టి వారు తగఁ జీల్పఁ బడిన వా

రచట నచట వేవు రగపడి రిల

36.   

 

 

 

తే.గీ.

రామ బాణములఁ దెగిన రక్కసుల త

లలు కిరీట యుతములు కరములు నంగ

దముల సహితము మఱియు ఛిన్నములు తొడలు 

నింక మోకాళ్లు నగల సహితము  సెదర   

37.   

 

 

 

తే.గీ.

గుఱ్ఱము లనేక రథములు కుంజరములు

విసన కఱ్ఱలు చామర వితతి రథ ప

తాక సంతతి నానావిధమ్ము లుండ

నెల్లఁ జెదరి ఖండితము లయి పడి పుడమి    

38.   

 

 

 

తే.గీ.

చిత్ర శూల పట్టిసలు నిశితతమ కర

వాలములు పరశ్వధములు ప్రాసములును

వివిధములు వికీర్ణమ్ములు విరివి ఖండి

తము లయి పడి యుండ భువిని దారుణముగ    

39.   

 

 

 

తే.గీ.

చూర్ణ శిల లుండ విచ్ఛిన్న శూల బాణ

సంచయము లనేకమ్ములు సమర భూమిఁ  

జెల్లచెదరి యుండఁగ నపు డెల్లెడలను

గనఁబడె భయంకరముగ నవని కనులకు    

40.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నిరువది యేనవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 26.

 

 

 

రాముఁడు దూషణుని నతని సైన్యమును దదితర రాక్షసులను బదునాల్గు వేల మందిని ఘోర రణమున నొక్కఁడు వధించుట.

 

 

 

 

తే.గీ.

కాంచి తన సైన్య మవ్విధిఁ గయ్య మందు

నణఁగ దూషణుం డంపెను రణమున మర

లని మహావేగు లేన్వేవుర నసురుల దు

రాసదుల మహాభుజుఁ డసురప్రవరుఁడు        

1.      

 

 

 

చం.

కురిసిరి ఘోర రాక్షసులు క్రోధులు భీకర ఖడ్గ శూలముల్

తరువులు శైల రాజములు దారుణ సాయక పట్టిసమ్ములున్

విరివిగ నాపకుండగను బిక్కటిలంగ దిశోప దిక్కులే  

నరవరు పైన నంతట ఘనస్వన సన్నిభ  మెల్ల రార్చుచున్

2.     

 

 

 

ఆ.వె.

ఆ శిలా ద్రుమనిచ యాఖండ వర్షము

ప్రాణ హరము నంత రాఘవుండు

తీక్ష్ణ సాయకముల దిట్ట తనమ్మున

నాపె ధర్మరతుఁడు కోప మూని

3.     

 

 

 

ఆ.వె.

పొంది వర్ష మట్లు మూసిన కన్నుల

తోడ నెద్దు పగిది తూర్ణము వధి

యింప రక్కసులను నింపెఁ గోపమ్మును

డెంద మందు భృశము కుంద కుండ      

4.     

 

 

 

తే.గీ.

తేజమున మండు భంగినిఁ దీవ్ర కోప

సంయు తాత్ముఁడు రాముఁడు శర సమూహ

మెల్ల దిశ లందు నింపెను వెల్లువలను

దూషణ యుత మసురులపైఁ దోరముగను   

5.     

 

 

 

తే.గీ.

దూషణుండు సేనాపతి తూర్ణ మేసె

నశని సన్నిభ శర నిచయమ్ము నంత

శత్రు దూషణుం డున్నత చాప మూని

రాఘవుని పైనఁ గ్రుద్ధుఁడు రణము నందు    

6.     

 

 

 

ఉ.

కత్తినిఁ బోలు బాణమునఁ గ్రన్నన దూషణు విల్లు ద్రుంచి తా

నత్తఱి నాల్గు బాణముల నశ్వ చతుష్కముఁ జంపి రాముఁ డ

త్యుత్తమ మర్ధ చంద్ర విశిఖోగ్రము చేతను సూతు మూర్ధమున్ 

మొత్తియు దూష ణోరమున మూడు శరమ్ములు గ్రుచ్చె గట్టిగన్      

7.     

 

 

 

తే.గీ.

విల్లు విఱుగ హయమ్ములు పిలుకుమార

సారథియు నిహతుండు గాఁ దేరు లేక

శైల శృంగాభ రోమహర్షణ పరిఘముఁ

దూర్ణముగ నందెఁ గరమున దూషణుండు    

8.     

 

 

 

తే.గీ.

పసిఁడి పట్టల మెఱసెడు వర సుర ధ్వ

జినిని మర్దింపఁ జాలెడు  నినుప మేకు

లడరు పర వసార్ద్ర పుర సంహర్త  పిడుగు

బోలు పరిఘను గైకొని మూరి యంత

9.     

 

 

 

ఆ.వె.

అమ్మహోరగ నిభ మగు పరిఘను గొని

క్రూర కర్ముఁ డంత ఘోర రాక్ష

సుం డుఱికెను దూషణుండు వేగమ్ముగ

రాముని పయికి సమరతల మందు    

10.    

 

 

 

చం.

తన పయి కట్లు మార్కొనఁగఁ దద్ద వడిం జనుదెంచు రక్కసుం

గని నతి రోషు దూషణునిఁ గ్రన్నన రెండు శరమ్ము లూని త్రుం

చెను భుజ యుగ్మ మాజిని విశేష కలాప యుతమ్ము  రాఘవుం

డనితర సాధ్య కర్మ మన నస్త్ర విశారదుఁ డక్కజమ్ముగన్          

11.    

 

 

 

తే.గీ.

ఛిన్నహస్త దీర్ఘ తనుండు చేతి నుండి

జాఱఁ బరిఘ శక్రధ్వజ సన్నిభమ్ము

సంగర తలమునఁ బడె దూషణుఁడు రాము

నెదుట భీకరముగఁ గాంచ నెల్ల రపుడు     

12.    

 

 

 

ఆ.వె.

చెల్లచెదర నతని చేతులు రెండును

బుడమి పైనఁ బడెను బొలసుదిండి  

దూషణుండు గాంచ రోష మద గజము

కొమ్ములు చెదరంగఁ గూలి నట్లు        

13.    

 

 

 

కం.

కని సర్వభూత సంఘము

ఘనుండు దూషణుఁడు గూలఁ గాకుత్స్థు ముద

మ్మున సాధు సాధు వనుచు వ

చ నాతిశయములఁ బొగడె భృశమ్ముగ నంతన్    

14.    

 

 

 

తే.గీ.

కినిసి సేనాగ్ర గాములు కేళి మృత్యు

పాశ బద్ధు లయి మహాకపాలుఁ డనఁగఁ 

గలియ స్థూలాక్షుఁడు బ్రమాథి ఘన బలుండు     

మువ్వు రంత దుమికిరి రాముని పయి వడి

15.    

 

 

 

ఆ.వె.

మూరి యెత్తి శూలము మహాకపాలుఁడు

కొని ప్రమాథి గండ్ర గొడ్డలి వడిఁ 

బట్టిసమ్ముఁ జేతఁ బట్టి స్థూలాక్షుఁడు 

రాఁగఁ బైకి వేగ రాముఁడు గని

16.    

 

 

 

           చం.

శిత తమ సాయకమ్ములను జేరిన వారి నెడంద నింపుగా

నతిథులు నాఁ దలంచి యని నాపెను తీక్ష్ణ శరమ్ము లేసి వే

యతులు మహాకపాలుని వరాంగము ద్రుంచె వరేషు పంక్తినిన్

వితతము వేసి బాణములు వీరుఁ బ్రమాథిని సంహరింపఁగా    

17.    

 

 

 

చం.

పడె నతఁ డంత భూమి పయిఁ బాదప శాఖ నిభమ్ము నీల్గఁగం

గడు వడి స్థూలలోచనుని కన్నుల నింపెను సాయ కాలినిం 

దడయక యేను వేల నిశితమ్ములు ముల్కుల నేనువేవురన్

మడియగ దూష ణానుగుల మాన్యుఁడు రాముఁడు సేసె నాజినిన్

18.    

 

 

 

కం.

కని దూషణు దూషణు బల

మును నిహతము కాఁగ నట్లు పోరునఁ గ్రుద్ధుం

డు నయి ఖరుండు భృశమ్ముగఁ

దన సేనాధ్యక్షులకు ముదల నొసఁగె వడిన్      

19.    

 

 

 

తే.గీ.

దూషణుండు ససైన్యము దూలె నాజి

కొని మహా సేనను గుమానుషు నని రాము

ని వధియింపుఁడు రయమున వివిదము లగు

నాయుధమ్ములఁ గైకొని యసురులార!      

20.   

 

 

 

కం.

యానతి యొసంగి రోషము

నూని ఖరుం డధికముగ మహోగ్రుండై తా

నా నరపుంగవు రాముని

పై నతి వేగముగ దూఁకె భండన మందున్    

21.    

 

 

 

తే.గీ.

శ్యేనగామి పృథుగ్రీవుఁ డింక యజ్ఞ

శత్రుఁడు విహంగుఁడు మఱి దుర్జయుఁడును బరు

షుండును గరవీరాక్షుఁడు నుండఁ గాల

కార్ముకుఁడు మేఘమాలియుఁ గలసి యుండ     

22.   

 

 

 

తే.గీ.

ఘన మహామాలి సర్పాస్యుఁడును బలుం డ

గు రుధిరాశనుండు ననంగ గొప్ప వీర

వరులు పన్నిద్ద ఱధ్యక్ష వరులు స బల

మమ్ము లేసిరి రాముని నరసి దూఁకి   

23.   

 

 

 

ఉ.

పావక సన్ని భాభ్ర  వర వజ్ర విభూషిత సాయకమ్ములన్

భూవర నందనుండు రణ భూమినిఁ జంపెను శేష సైన్యమున్ 

వావిరి వెల్గి తేజమున వజ్రము ద్రుంచిన పాద పాభులై 

యీ వసుధన్ నిశాచరులు హీన విధమ్ముగఁ గూలి రెల్లరున్   

24.   

 

 

 

తే.గీ.

రక్కుసుల వంద మందిని నొక్క తడవ

వంద బాణములను వెయ్యి మంది వేయి

బాణముల రాఘవేంద్రుఁడు భండనమునఁ

జంపి యొక్కండు యము నింటి కంపె నడరి   

25.   

 

 

 

తే.గీ.

విఱిగి పడిన కత్తళముల విఱిగిన వర

భూషలను ఛిన్న భిన్న వరేషువులను

శోణి తార్ద్రులై యమ్మహాసురులు గూలి

రెల్లరు ధరణీ తలమునఁ దల్లడిల్లి     

26.   

 

 

 

చం.

విడివడి నట్టి కేశములఁ బృథ్విని గూలిన రాక్షసాలితోఁ

దడియఁగ శోణి తోదమునఁ దద్దయు నిండిన యట్టి భూమి క

న్పడెఁ గుశ సంచయమ్ములు ఘనమ్ముగఁ జిందిన యట్టి జన్నపుం

బుడమిని నున్న వేదికను బోలి చెలంగుచు భీకరమ్ముగన్    

27.   

 

 

 

కం.

ఒక్క క్షణమ్మున నయ్యెను

మక్కిన రక్కసుల నేల మాన్య వనంబే  

యక్కజముగ నరకము వలె

గ్రక్కిన రక్తమ్ము నిండఁ గానన ముండెన్

28.   

 

 

 

కం.

పదునాలుగు వే లసురులు

విదళితు లైరి వని భీమ విస్తృత కర్ముల్

చెదరని ధృతి  రామునిచేఁ

బదాతి యొక్కండ మనుజు వలనన్ వింతన్     

29.   

 

 

 

ఆ.వె.

చక్క నైన సర్వ సైన్య మందు మహా ర

థుఁడు ఖరుం డసుర వరుఁడు త్రిశిరుఁడు

రాఘవుం డొకండు రాముఁడు రిపు సూద

నుండు మిగిలి రకట భండనమున

30.   

 

 

 

ఆ.వె.

శేషు లెల్ల రని నశేషము సత్వ సం

పన్నులు హతు లైరి యెన్నఁ దగిన

వారు దుస్సహులు మహా రాక్షసులు రఘు

రాముని వలన  సమరతల మందు

31.    

 

 

 

కం.

హత మైన బలము గని సమ

ర తటిని రాఘవుని చేత రక్కసుఁడు ఖరుం

డు తనరథ మెక్కి దశరథ

సుతునిఁ గదిసె నశని నెత్తి సురపతి భంగిన్      

32.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నిరువది యాఱవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 27.

 

 

 

రాముఁడు ఖరుని సేనాపతి త్రిశిరుఁ డను రాక్షసుని స సైన్యము యుద్ధములో వధించుట. 

 

 

 

 

కం.

రా మాభిముఖం బేఁగెడు

భీ మాసురు ఖరునిఁ గదిసి పేర్మిఁ ద్రిశిరుఁ డన్ 

నాముండు చమూపతి యగు

నా మానిసిదిండి పల్కె నపు డిబ్భంగిన్     

1.      

 

 

 

ఆ.వె.

విడుమ సాహసమ్ము విక్రమ! యివ్విధి

నాన తిమ్ము నాకు నసుర నాథ!

రాల వేగ నేల రఘురాము నమ్మహా

బాహుఁ గాంచు మెలమి నాహవమున   

2.     

 

 

 

ఆ.వె.

రాక్షసులకు నెల్ల రాముండు చంప న

ర్హుండు ద్రుంతు నతని భండనమున

నాయుధమ్ము పట్టి యడరి వేయుదు నొట్టు

నిజము పల్కుచుంటి నెమ్మి నేను

3.     

 

 

 

చం.

సమరము నందు రాఘవుఁడు చచ్చునొ నా వలనన్ రయమ్మునన్

సమయుదునో సుఘోర మగు సంఖ్య రఘూద్వహు చేత నే నహో

నిమిష మొకింత వేచి కను నివ్వెఱ వీడి నిశాచరోత్తమా!

సమితిని వీడి యుత్సుకత శత్రు వినాశక! ప్రాశ్నికుండవై      

4.     

 

 

 

తే.గీ.

సమయ రాఘవుం డని జనస్థాన మేఁగఁ

గలవు హర్షము మది  సెలగంగ భృశము

నేన నిహతుండ నైనచో నీవ యనికి

రాఘవుని సమీపింపుమ రాక్ష సేంద్ర!    

5.     

 

 

 

ఆ.వె.

మృత్యు లోభ మడర నత్యధక మటుల

వేఁడఁగఁ ద్రిశిరుండు వెడలు చేయ

మ రణ మని యనుజ్ఞ ఖరుఁ డొసంగ వెడలె

రామున కెదురు సమరమ్ము సేయ   

6.     

 

 

 

కం.

అరదము నెక్కి విలసితము

తురగ సమాయత్త మంతఁ దోఁపఁ ద్రిశృం గా

పర పర్వతమ్ము భంగిఁ ద్రి

శిరుండు రఘురాముఁ జేరి శీఘ్ర మెదిర్చెన్    

7.     

 

 

 

తే.గీ.

మేఘమును బోలి  బాణ ధారౌఘము కురి

యించెఁ ద్రిశిరుండు రణ మందు మించి యఱచె

సలిల పూర్ణార్ద్ర దుందుభి సన్నిభంపు

నిస్వనం బడర నరసి నీర జాక్షు   

8.     

 

 

 

తే.గీ.

వచ్చెడు త్రిశిరు వీక్షించి యచ్చట వడి

విల్లు కదలించి యెదిరించె  వేసి నిశిత

సాయకమ్ములు రాముండు సంచలింప

కింత యేని పరమ వీర్యవంతుఁ డంత    

9.     

 

 

 

ఆ.వె.

సింహ కుంజరముల చెన్నునఁ గనిపించి  

రాఘవత్రిశిరుల రణము చెలఁగె

బల్లిదుల నడుమను దల్లడిల్లఁగ దిక్కు

లెల్ల నిస్వనమ్ము లెల్ల నిండ

10.    

 

 

 

ఆ.వె.

నాఁట నుదుట నంత నారాచములు మూడు

రాముఁ డంత బలికె భీమ కోప

మునను ద్రిశిరుఁ డేయ మూర నసహనమ్ము

భాషణమ్ము లిట్లు దోషుఁ గాంచి

11.    

 

 

 

ఆ.వె.

ఏమి విక్రమమ్ము భీమ రాక్షస! యీ వి

ధమ్ము బలము దనరె సుమ్ము నీకు

విరుల భంగి నుండె శరములు నీవి ను

దుటను నాఁట నీ విచట చెలంగి     

12.    

 

 

 

తే.గీ.

కొనుమ మద్ధనుశ్చ్యతములు ఘోర బాణ

ములను గూడ రాఘవుఁ డిట్లు పలికి త్రిశిరు 

వక్షమున ఫణి విష నిభ బాణములఁ జ

తుర్దశములఁ గ్రుచ్చెఁ గినుక దోర్బలుండు    

13.    

 

 

 

తే.గీ.

తిరిగి తేజస్వి రాముఁడు దిట్ట ముడుల

వెల్గు నాల్గు బాణమ్ములు వేసి త్రిశిరు

గుఱ్ఱములను నాల్గింటినిఁ గూల్చెఁ దూలఁ

గ నవి యెల్లఁ బుడమి పైనఁ గాంచు చుండ       

14.    

 

 

 

ఆ.వె.

చంపె సూతు నంత సాయకమ్ము లెనిమి

దింట రాఘవుండు తేరు ధ్వజము

నొక్క కోల నేసి యున్నతమ్మును గూల్చె

రాల నొక్క త్రుటిని   నేల పైన    

15.    

 

 

 

చం.

పదపడి కూల స్యందనము భైరవ రాక్షస పుంగవుండు వే

గ దుముకు చుండ రాఘవుఁడు కార్ముక మెత్తి శరమ్ము వేయఁగా

హృదయము నందు నిల్వఁగ మహిం ద్రిశిరుండు త్రిసాయకమ్ములన్

విదులిచె వాని మూర్ధములు పృథ్వినిఁ గూలఁగ మూడు క్రుద్ధుఁడై     

16.    

 

 

 

కం.

తన శిరములు గూలఁగ నే

లను మున్ను నిశాచరుండు రామ శిత శరా

లి నిపీడితుండు దాఁ గూ

లెను గ్రక్కుచు నెత్తురుం ద్వరితముగ నాజిన్   

17.    

 

 

 

తే.గీ.

చావఁగ మిగిలినట్టి రాక్షసులు ఖరుని

నాశ్రయించిన యట్టి వా రాగ కుండఁ  

బాఱి రెల్లరు పులిఁ గని పాఱు మృగ గ

ణమ్ము భంగిని భీతి రణమ్ము నందు     

18.    

 

 

 

కం.

కని పరుగిడు రక్కసులను

ఘన బలుఁడు ఖరుఁడు మరల్చి కాకుత్స్థునిపైఁ

గినిసి భృశమ్ముగఁ దా దుమి

కెను రాహువు చంద్రుని పయికి దుముకు భంగిన్    

19.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నిరువది యేడవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 28.

 

 

 

ఖరుఁడు యుద్ధములో నశ్వములు సారథి హతులు గాఁగ రథము భగ్నము గాఁగ క్షత గాత్రుఁడై గదతో దిగి యుద్ధమునకుఁ దలపడుట, దేవత లెల్ల రాముని మెచ్చుకొనుట.  

 

 

 

 

కం.

హతుఁడై చన దూషణుఁడు స

హితత్రిశిరుఁడై ఖరుం డు నీ రాము మహో

న్నత విక్రమమ్ము నారసి

యతి సంత్రాసుండు నయ్యె నాజిని నంతన్  

1.      

 

 

 

చం.

బలుఁడు ఖరుండు గాంచి నిజ వాహినిఁ జంపఁగ రాముఁ డొక్కఁడున్ 

విలయులు దూషణత్రిశిర వీరులఁ గాంచి బలక్షయమ్మునుం 

గలఁత చెలంగ రాక్షసుఁడు కయ్యమునం గదిసెన్ రఘూత్తముం 

జలమున వాసవున్ నముచి శక్తిని మార్కొను భంగి నంతటన్  

2.     

 

 

 

ఉ.

ఎక్కిడి చాప రాజము నహీన బలమ్మున నాఖరుండు వే

వెక్కసముల్ శరమ్ములను భీమ భుజంగమ సన్నిభమ్ములన్

స్రుక్కక నెత్రుఁ ద్రాగునవి రోషము నూనుచు రాఘవేంద్రుపై

నుక్కు సెలంగ వేసెను మహోగ్రత నంతట భీకరమ్ముగన్  

3.     

 

 

 

తే.గీ.

నిల్చి యరదమ్మునన్ నారినిన్ విదిల్చి

వీరుఁ డస్త్ర నైపుణ్యము విరివిఁ జూపు

చు వదలె శరమ్ముల ఖరుండు వివిధ దిక్కు

లందు రాఘవుని పయి మహారథుండు    

4.     

 

 

 

తే.గీ.

అమ్మహారథు శరముల నరసి వేగ

రాముఁ డపుడు పూరించి ఘోరంపు వింటి

నంత దుస్సహ సస్ఫులింగాగ్ని సన్ని

భ శరముల నింపె నభము నభ్రముల భంగి   

5.     

 

 

 

కం.

ఆకాశ మయ్యె నప్పు డ

నాకాశమ్ము ఖర రాఘ వాంబకములతో

వీఁకఁ జెలఁగ వేయఁగ నా

ళీకమ్ముల నిర్వురును సలీల రణమునన్  

6.     

 

 

 

కం.

వెలుఁగఁడు దివాకరుఁడు శర

ములు నింపఁగ నెల్లెడలను బూర్ణత మోత్సా

హు లొకరిపై నొకరు తలఁచి

గెలుపును యుద్ధమునఁ జంపఁ గృత నిశ్చయులై    

7.     

 

 

 

ఆ.వె.

సూది మొనల నడరు చుఱుకైన ముల్కులు

శిత వికర్ణుల ఖరుఁ డతి రయమునఁ     

బఱపి  రాముని పయి బాధించె మునికోలఁ

గుంజరమును మీఱి గ్రుచ్చు పగిది   

8.     

 

 

 

కం.

ధను వూని యరదమున నిలి

చి నట్టి ఖరు  రాక్షసు నటఁ జేతం బాశ

మ్మును బట్టి నట్టి దండధ

రుని భంగిని భూతరాసులు కనిన వతనిన్

9.     

 

 

 

కం.

సక లాసుర హంతకు నరు

ణ కిరణ వర గోత్రు రామ నామాంకితుఁ గాం

చి కర మలసి నట్లెంచెను

వికలుండు ఖరుండు నెడఁద వింతగ నంతన్

10.    

 

 

 

కం.

మృగరాజు భంగి విక్రము 

మృగ రాడ్విక్రాంత గమను మేటి యసురు న

ట్లు గనినఁ గుందఁడు రాముఁడు

మృగేంద్రుఁ డరయంగ క్షుద్ర మృగమును భంగిన్

11.    

 

 

 

ఆ.వె.

అంత సూర్య నిభపు టరదమ్మున నిలిచి

ఖరుఁడు సేరె వడినిఁ బురుష వరుని

సంగరమ్ము నందు శత్రుదమను రాము

నగ్నిఁ జేరు శలభ మనఁగ నడరి  

12.    

 

 

 

ఆ.వె.

చేతి బలము సూపి యాతతముగ నమ్ము

తోడ ముష్టి నున్న తోరపు గుణిఁ

ద్రుంచె రాఘవునిది మించిన బలమునఁ

జూచు చుండ ఖరుఁడు చోద్యముగను  

13.    

 

 

 

కం.

తిరిగి కొని యేడు శరములు

పురంద రాశని నిభములు మూరుచు నంతం

బురు షోత్తము కవచమ్మును

గరం బలిగి చీల్చె వేగ ఖరుఁ డుగ్రుండై

14.    

 

 

 

చం.

గనుపులు తద్ద వెల్గునవి గట్టివి యమ్ములు వే ఖరుండు వే

సినఁ గవచమ్ము నేలఁ బడె శీఘ్రమ రామున కర్క తేజమే

నినదము సేసె బిగ్గరగ నెమ్మి సహస్ర శరాలి కుర్సి రా

ముని పయి వీర్యవంతు పయిఁ బోరున రాక్షస వీరుఁ డుద్ధతిన్   

15.    

 

 

 

కం.

తగులఁగ మేనున బాణము

లు గాసిలి రఘూత్తముండు క్రుద్ధుం డయ్యెం   

బొగ లేని నిప్పు వోలె వె

లిఁగె నాజిని రాఘవుం డరి నిషూదనుఁడే   

16.    

 

 

 

తే.గీ.

బిగ్గరగఁ జేసి నాదము  వెగ్గలంపుఁ

జాప మన్యము గైకొని జ్యాను గూర్చె

శీఘ్ర తరముగ నంతము సేయ నెంచి

శత్రువును శత్రు దమనుండు క్షాత్ర మడర      

17.    

 

 

 

చం.

పరమ మునీంద్రుఁ డిచ్చినది వైష్ణవ చాపముఁ జేత నూని యె

త్తి రయము మీఱ రాక్షసుని ధీరత మార్కొని రాముఁ డంతటన్

శరములు స్వర్ణ పుంఖములు సన్నత పర్వము లేసి క్రన్ననన్ 

ఖరుని ధ్వజమ్ముఁ ద్రుంచె నటఁ గయ్యము నందుఁ జెలంగి క్రుద్ధుఁడై  

18.    

 

 

 

తే.గీ.

అమ్మనోహరపుఁ బతాక మంత ముక్క

లై పసిడి మయ మది గూలి యవని పైనఁ

జెల్లచెదరెను దేవత లెల్ల రాన

తీయఁ బుడమిఁ జేరిన యట్టి దినమణి యన   

19.    

 

 

 

ఆ.వె.

క్రుద్ధుఁడై ఖరుండు యుద్ధమం దంత బా

ణములు నాల్గు వేసి నరవరేణ్యు

పైన మర్మవిదుఁడు బాధించె మిక్కిలి

యంకుశమున గజము నడిచి నట్లు

20.   

 

 

 

కం.

ఖర ఘన ధనుర్వినిర్గత

శర విద్ధ క్షతజ సిక్త చారు శరీరుం

డు రఘుకు లార్ణవ చంద్రుఁడు

పరమామర్షుండు నయ్యె భండన మందున్  

21.    

 

 

 

మ.

విలుకాండ్రం బరముండు నుత్తమపు టా విల్లెత్తి యుద్ధమ్మునన్

బల మేపారగ గొప్ప ధార్మికుఁడు దాఁ బంపించె  షడ్బాణముల్

దలఁయే లక్ష్యము కాఁగ నొక్కటి భుజద్వంద్వంబు రెండింటినిన్ 

లలితా ర్ధేందు శిఖాంబకమ్ముల నురః ప్రాంతంబు మూడింటినిన్     

22.   

 

 

 

తే.గీ.

ఇంకఁ గైకొనెఁ గ్రుద్ధుఁడై యిన సమాన

బాణములఁ బదుమూడింటిఁ బార్థ సుతుఁడు

చంప నెంచి రక్కసుని నా సమర మందు

రాముఁడు ఖరుని దుష్కార్య రతునిఁ దివిరి

23.   

 

 

 

తే.గీ.

రథపుఁ గాఁడిని నొక్క శరమ్ముచేత

నాల్గు గుఱ్ఱములను మఱి నాలుగింటి

చేత సారథి నాఱవ శిఖిని  మూట

బండినొగ నింక రెండింట బండికన్ను       

24.   

 

 

 

తే.గీ.

ఇంకఁ బండ్రెండవ ములికి నీ ఖరుని ధ

నువు సశరమును ద్రుంచి   రాఘవుఁడు వజ్ర

తుల్య మగు పదుమూడవ తూపు చేత

ఖరుని భేదించె నగుచు బలరిపు సముఁడు

25.   

 

 

 

ఆ.వె.

భగ్న మైన వింటిఁ బడిన యశ్వమ్ములఁ

దూలి నట్టి సూతు తోడ ఖరుఁడు

మేటి గదను దాల్చి మేదిని నిల్చెను

విరథుఁ డంత దుమికి వీర వరుఁడు    

26.   

 

 

 

కం.

మునులును దేవతలు కలసి

ఘనుం డగు మహారథు ఘన కార్యమ్మును గాం

చిన మురిసి యంజలించుచు 

మనములఁ గొలిచిరి నిలిచి విమానము లందున్  

27.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నిరువది యెనిమిదవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 29.

 

 

 

విరథుఁడైన గదాపాణి ఖరునిఁ గాంచి రాముఁడు పరుషముగ నీదు క్రూర కర్మముల వలన రాజ నియోగితుఁడనై యుద్ధమున నిన్ను నాకు వధింప వలసి వచ్చె నని పలుక ఖరుఁ డుగ్రుఁడై బదు లిచ్చి యెదిర్చి మహా గదను విసర రాముఁడు దానిని బాణముల ముక్కలు సేయ నది నేలఁ గూలుట.       

 

 

 

 

కం.

విరథుం డైన ఖరునిఁ గాం

చి రాముఁడు గదా ధరు నటఁ జెలఁగఁగ ముందున్ 

గిరలు మృదువుగను బల్కెను

బరుషముగ మహాత్ముఁ డంత వాక్యము లిట్లున్

1.      

 

 

 

చం.

తురగ మహార థేభముల తోడ మహాబల సంయుతమ్ము ప

ల్వురు గనఁ జేసితే సకల లోక జుగిప్సిత కర్మ మివ్విధిన్ 

దురితములన్ నృశంస యిటు తోర మొనర్చుచు భూత రాశికిన్ 

గరువము నూని బాధ లిడఁగాఁ ద్రిజగత్పతి యైన నిల్వఁడే   

2.     

 

 

 

కం.

లోక విరుద్ధము లెవ్వరు

వీఁక నసుర! చేయఁ  బనులు పెను దీక్ష్ణమ్ముల్ 

యా కుమతిం గని యాగత

కాకోలముఁ జంపు భంగిఁ గడపుదురు జనుల్  

3.     

 

 

 

ఆ.వె.

లోభమున నయిన గురుతర కామమ్మున

నయినఁ బాప సంచయమ్ము సేసి

యెవ రెఱుఁగరు వార  లీక్షింత్రు నాశము

కరకఁ దిన్న యెఱ్ఱ కరణిఁ జుమ్ము 

4.     

 

 

 

తే.గీ.

దండకారణ్య మందున్న తాపసులను

ధర్మచారులఁ బూజ్యుల దయను వీడి

చంప నింకెట్టి ఫలము నిలింప రిపువ!

పొందఁ గల వీవు పరికింపఁ బొలసు దిండి!     

5.     

 

 

 

కం.

చిరకాల ముండరు బడసి

సిరులు జగన్నింద్యులు ధరఁ జేయ భృశముగా

దురితములు క్రూరు లెల్లరు 

తరువులు సెడ మూలములు పతన మగు నట్లున్   

6.     

 

 

 

ఆ.వె.

పాప కార్యములకు ఫల మవశ్యము ఘోర

ములకుఁ బొందఁ గలరు భూమి జనులు

కాలము గదియంగఁ గాల మందుఁ దరులు

పూలు పరిఢవిల్లి పూయు నట్లు

7.     

 

 

 

కం.

త్వరితము దుష్కర్మములకు

ధరఁ బొందఁ గలరు ఫలమ్ము తప్పక యసురా!

యురు విష సంకలి తాన్నము

విరివిగఁ దిన్నట్టి జనుల విధము దలంపన్

8.     

 

 

 

తే.గీ.

పాపము లొనర్చు వారినిఁ దాపములు జ

నుల కొసఁగు వారి నెల్లరను క్షణదా చ

ర! లయ మొనరింప శీఘ్రమ రాజు నాజ్ఞ

నేఁగు దెంచితి నే నిటు లీ యటవికి      

9.     

 

 

 

తే.గీ.

మహిత కాంచ నాలంకృత మార్గణములు

నేఁడు నేను విడిచినవి చూడు మిపుడు

చీల్చి నిన్ను వెడలు నవి శీఘ్రముగను

బుట్ట నుండి పోవు ఫణుల పొలుపు దనరి  

10.    

 

 

 

ఉ.

వీరలు ధర్మ తత్పరులు విప్రులు నెవ్వరి దండకా వనిన్ 

మూరుచు నీవు తింటివొ విమోహివి వారల నెల్లరన్ వడిం 

బోరునఁ జంపఁ జేరుదువు వ్యూఢము నాఱఁగ దాని తోడుతన్

వారు విమాన సంస్థితులు బాధితులే మును నీ కతమ్మునన్    

11.    

 

 

 

ఆ.వె.

వారు నేఁడు నేను వధియింప నాజినిఁ

గంకపత్రములను గాంతు రచట

నిన్ను నిరయ మందు నీ వుండ వేగమ

పరమ ఋషులు పుణ్య పురుషు లెల్ల

12.    

 

 

 

చం.

వలసిన యట్ల కొట్టు నను బన్నుగఁ జేయుమ యత్న మీ విటం 

గుల విలయుండ నీదు తల ఘోర రణమ్మునఁ ద్రుంతుఁ దాల స

త్ఫల నిభ మిప్డు నేలఁ బడఁ బల్కఁగ నివ్విధి రాముఁ డా ఖరుం

డల నగి క్రోధ మూర్ఛితుఁడు నంత వచించెను రక్త నేత్రుఁడై  

13.    

 

 

 

కం.

హీ నాసురులం గొందఱిఁ

బూని వధింపఁగ దశరథ పుత్రా! స్తుతియిం

తే నిన్ను నీ వనర్హుని

మానవ మాత్రా! తగ దిది మానుమ యింకన్  

14.    

 

 

 

కం.

నర పుంగవు లెవ్వరు నీ

ధర విక్రాంతులు కడింది దార్ఢ్యం బున్నన్ 

గరువమ్మునఁ దేజస్వులు

నరేశ! పొగడుకొనుదురె ఘనమ్ముగ నిట్లున్    

15.    

 

 

 

ఉ.

ప్రాకృతు లస్థి రాత్ములు నృపప్రవ రాధము లాడు నట్టులన్ 

వీఁకఁ జెలంగి పల్కుదువు పెద్దగ నిట్టుల రిక్త వాక్యముల్ 

వే కదియంగ మృత్యు వని వెఱ్ఱులు నెవ్వరు వంశ నామముం

జేకొన నిచ్చగింతురు విశేషముగా నిను నీవు మెత్తువే 

16.    

 

 

 

ఆ.వె.

నీ వికత్థనమ్ము నీ లఘుత్వమ్మును

దెలుపు చున్న దిచటఁ దెల్లముగను

మండ నగ్నిఁ గుశలు మెండుగ స్వర్ణమ్ము

భంగి నుండు నట్లు సంగరమున

17.    

 

 

 

ఆ.వె.

చూతు వీవు నన్ను భీతి గదాధరుఁ 

గొండ వోలెఁ జెదరకుండ నుండ 

ధాతు సంయుతమ్ము  ప్రీతి విజృంభింప

నాజి లోన మీఱి యోజ తోడ    

18.    

 

 

 

కం.

గద నూనఁ గరమ్మున నే

ను దవాసువులఁ గొనఁ దగుదును రణం బందుం

గదియ యముఁడు ముల్లోకము

లఁ దునుమఁ బాశ కరునకుఁ దర మగు విధమునన్ 

19.    

 

 

 

తే.గీ.

చెప్పఁ దగినవి కలవు నీ కిప్పు డెక్కు

వగ నయినఁ జెప్ప నొల్ల నిప్పట్టున మఱి 

సూర్యుఁ డేగ నస్త గిరికిఁ గార్య భంగ

మగు ననెడు శంక వర్ధిల్ల నాజి కెడఁద

20.   

 

 

 

తే.గీ.

తుడుతు కన్నీళ్ల నని నిహతు లయి నట్టి

పెన్నసురులకుఁ బదునాల్గు వేల మంది

కేను నిన్నాజి వధియించి యిప్పు డిం పొ

దవ మహాస్త్రమ్ములు పఱపి తథ్యముగను

21.    

 

 

 

కం.

పలికి ఖరుఁడు రమ్యాంగదుఁ

డల విసరెం గ్రుద్ధుఁ డై మహా గద నంతన్

వెలుఁగంగ నశని సదృశము 

బలవంతుని రాఘవేంద్రు పైన రయమునన్

22.   

 

 

 

కం.

ఖర బాహు ముక్త మా గద

కరము వెలుంగుచును గుల్మ ఘన భూజములన్ 

విరివిగఁ గాల్చుచు రాముని

దరి సేరెను వేగ మడర దారుణ రీతిన్   

23.   

 

 

 

కం.

వచ్చెడు నా గదఁ దాఁ గని

యచ్చపు మృత్యు కర పాశ మన శోభిల్లం

జెచ్చెర ననేక శరముల

నచ్చెరువునఁ జీల్చె రాముఁ డాకాశమునన్  

24.   

 

 

 

కం.

శరముల ముక్క లయి చెదరి

ధరణీతల మందుఁ గూలెఁ దద్దయు వింతన్

వరగద మంత్రౌషధముల

నురగము పడి నట్టి భంగి నూహింపంగన్      

25.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నిరువది తొమ్మిదవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 30.

 

 

 

ఖర రాముల ఘోర యుద్ధమున ఖరుఁడు మరణించుట, దేవత లెల్లరు రాముని స్తుతించుట, సీతయు లక్ష్మణుఁడు గుహ నుండి బయటకు వచ్చుట, సీతా దేవి రాక్షసవీరుల నాశనము రాముఁడు భద్రముగా నుండుటయుఁ గాంచి సంతోషమ్మున ముని వర పూజిత రామునిఁ గౌఁగిలించుకొనుట.

 

 

 

 

కం.

అమ్ముల నా గదఁ జీల్చి న

యమ్మన నిష్టుఁడు కడింది నఱిముఱి నిజ డెం

దమ్మున నున్న ఖరునిఁ గని 

యిమ్ముగ రఘురాముఁ డంత నిట్లనె నగుచున్

1.      

 

 

 

ఉ.

ఇంతియ రాక్షసాధమ! మఱిప్పుడు నీదు బలమ్ము సూపితే 

యెంతయు వీర్య హీనుఁడవ యెట్టుల నా సరి యౌదు వెన్నఁగం 

బంతము నూని పల్కుదువు వ్యర్థ గిరావలి నాదు ముల్కులన్  

సాంతము గూలి నీదు గద యయ్యది ద్రుంచెఁ ద్వదీయ గర్వమున్  

2.     

 

 

 

ఆ.వె.

ఆల మందు నిచటఁ గూలిన యసురుల

యశ్రములను దుడుతు నంచు నీవు

పలికి నట్టి వైన పలుకు లెల్ల నగు మి

ధ్యా వచనములె యసు రాధమ! ఖర!

3.     

 

 

 

ఆ.వె.

నీచు క్షుద్రగుణు ననృత వర్తనుని రక్క

సుని యసువుల నిపుడు చూఱఁగొందు

నమృత మపహరించి నట్టి గరుత్మంతుఁ

బోలి నిశ్చయముగఁ బోరు నందు

4.     

 

 

 

కం.

తెగిన గళము నుండి స్రవిం

పగఁ జీల్పఁగ నా శరములు పన్నుగఁ గాఱం

దగఁ ద్రాగు బుగ్గ లింక ను

రుగులుం గల నెత్తు రవని లోలత్వమునన్

5.     

 

 

 

తే.గీ.

దుమ్ము నిండిన యట్టి యంగమ్ము లింక

చాఁపఁ బడి నేలఁ బడిన భుజముల తోడఁ

గౌఁగిలించికొని  పుడమిఁ దూఁగు దీవు

దుర్లభంపుఁ బడతిని హత్తుకొను నట్లు   

6.     

 

 

 

కం.

రాక్షస పాంసన! పొందఁగ

నక్షయ నిద్ర నిట నీవు నటవీ తటియే 

రక్ష నొసఁగు దండకయె య

రక్షితులకు మౌనులకు శరణ్యం బగుచున్    

7.     

 

 

 

తే.గీ.

నీ జనస్థాన మిది శర నిచయ మేయ

నే నడరి హతస్థానమై నెగడఁగ మును 

లిప్పుడు చరింతురు భయమ్ము నెల్ల వీడి

యన్ని దిశల సంతసమున నడవి లోన  

8.     

 

 

 

కం.

పరులకు భయం బొసఁగెడు న

సుర కాంతలు భీతలై వసుధఁ గూలఁగ నె

ల్లరి బంధులు వనమును నా 

తరుణులు భాష్ప వదనలు వదలుదురు దీనల్  

9.     

 

 

 

కం.

నిను బోలు పతిఁ బడసి యా

వనితలు కుల జాత లింక వగపు రుచుల నె

ల్ల నెఱుంగ గలరు నిక్కము

గ నిరర్థకలై చరింత్రు కానన మందున్   

10.    

 

 

 

ఉ.

క్రూర! నృశంస! క్షుద్ర హృది! ఘోరుని నిం గని విప్రకంటకా!

మూరిన శంక తోడుతనె పోయుదు రాజ్యము నగ్నిలో మునుల్ 

నా రఘు రాముఁ డాజిని ఘనమ్ముగఁ బల్కఁగ సంభ్రమమ్మునన్

ఘోర రవమ్మునన్ ఖరుఁడు కోపము మీఱఁగఁ దిట్టె రామునిన్   

11.    

 

 

 

చం.

ఖలుఁడవు వాఁగు చుంటివి తగన్ భయహీను వలెన్ మహా భయం

బలరిన మృత్యు పాశమునఁ బాతము గాఁ బలుకంగ నేరవే

పలుకఁగ రాని పల్క నగు వాచ్యము లక్కట కాలమోహితుల్

దెలియరు యుక్త కార్యములు దీరుగ నాఱ షడింద్రియమ్ములే     

12.    

 

 

 

తే.గీ.

పలికి యిట్లు ముడిచి భ్రూవు పొలసుదిండి

రాఘవుని తోడఁ గాంచి దూరమ్ము నందుఁ

గల తరువు నవలోకించి నలు దిశలను

దాడ నార్థము రణ మందుఁ దద్ద కినిసి     

13.    

 

 

 

ఉ.

చెచ్చెఱ నూడపెర్కి యొక చెట్టును బండ్లను గిన్కఁ గొర్కుచున్

హెచ్చుగ నెత్తి బాహుల నహీన బలుండు ఖరుండు నార్చుచుం

గ్రచ్చఱ వేగ యుక్తముగ రామునిపై విసరెన్ రణమ్మునం 

జచ్చితి వంచుఁ బల్కెఁ బగ సంతస మందుచు మిక్కుటమ్ముగన్    

14.    

 

 

 

తే.గీ.

వచ్చు దాని నాలోకించి పరమ విక్ర

ముండు రాముండు బాణౌఘములను ద్రుంచి

తీవ్రతర కోపము వహించె దీర్ఘ బాహు

వంత వధియింప ఖరుని నాహవము నందు  

15.    

 

 

 

చం.

జనిత రుషుండు  బ్రస్రవణ సంహననుండు రుషాత్త రక్త లో

చనుఁడు రఘూత్తముండు ఘన శల్య సహస్రము లేసి యాజినిం

దునిమెను రాక్షసున్ ఖరునిఁ దూర్ణము బాణ విఘాతమై స్రవిం

చెను రుధిరమ్ము ప్రస్రవణ శృంగి వ రేద్ధ జలస్ర వాభమై

16.    

 

 

 

కం.

ఖరుఁ డంత విహ్వలుండై

ఖర రాఘవ శర విఘాత కాయుండై ర

క్త రస మహా మత్తుండై 

పరువిడి దుమికెను రఘువరు పైకి  రణమునన్

17.    

 

 

 

తే.గీ.

అస్త్ర నిపుణుండు రాఘవుఁ డరసి దుముకు

నా ఖరుని రక్త సిక్తుని నంత కొంచె

మొక్క యడుగు వెనుక కేఁగి చక్కఁ ద్వరిత 

విక్రముండు సంరంభునిఁ బిలుకుమార్ప

18.    

 

 

 

ఆ.వె.

పావ కాభ మైన దేవరా డ్దత్తమ్ము

బ్రహ్మదండ సన్నిభమ్ము శరము

గైకొని సమరమునఁ గాకుత్స్థుఁ డంత సం

ధించి ఖరుని పయికి మించి విడిచె    

19.    

 

 

 

ఆ.వె.

పిడుగు వంటి బాణ మడరి విడువఁ బడ

కార్ముకమ్ము నుండి క్వణన మడర

రాఘవుని వలన నురమ్మునఁ జొచ్చెను

ఖరున కంత వేగ కక్కసముగ

20.   

 

 

 

కం.

ధరణిం గూలెను ఖరుఁ డ

ప్పరమేష్వగ్ని దహియింపఁ బరమ శివునిచే

నరయఁగ శ్వేతారణ్యము

న రవి కుమారుఁడు యముండు నలిఁగిన పగిదిన్

21.    

 

 

 

తే.గీ.

వజ్రము వలన వృత్రుని భంగి ననఁగ

ఫేనము వలన  నముచినిఁ బోని యనఁగ

నింద్రు నశనితో బలుఁ డసురేంద్రుని వలె 

నిహతుఁ డయ్యెను ఖరుఁ డవనిఁ బరికింప    

22.   

 

 

 

తే.గీ.

అంత రాజర్షి పరమర్షు లంద ఱలరి 

రామునిం బ్రీతిఁ బూజించి రమ్యతరము

పల్కిరిట్లు వచనములు వజ్రధరుఁడు

వచ్చె శరభంగు నాశ్రమ వరమునకును    

23.   

 

 

 

తే.గీ.

ఇందు కొఱకుఁ బాకారి మహేంద్రుఁ డసుర

గణము ఖరుతోడఁ జంపఁగ రణము నందుఁ 

బాప కర్మ  రతుల ని న్నుపాయ మెంచి  

యిటకు రప్పించెను మునుల నెల్లఁ గూడి  

24.   

 

 

 

కం.

మా పనిని దశరథాత్మజ! 

యీ పగిది నొనర్చి తీ వహీనప్రభవం

బేపార దండకమ్మున

నీ పరమర్షులు చరింతు రెలమి నయములన్    

25.   

 

 

 

తే.గీ.

ఇంతలో సుర చారణు లెల్లఁ గూడి

విస్మయ ముదమ్ము లేపార విరివి గాను 

బుష్ప వర్షము కురియించి పురుష పుంగ

వు పయి భేరులు మ్రోయించి రపుడు మురిసి

26.   

 

 

 

తే.గీ.

అడరి యర్ధాధిక ముహూర్త మందు రాముఁ

డతి నిశిత సాయకమ్ముల నసుర వరులఁ 

జూచి యా చతుర్దశ సహస్రులను స ఖర

దూష ణాదుల ననిఁ జంపె దోర్బలుండు  

27.   

 

 

 

ఉ.

అవ్విధి భీమకర్ముల మహాజినిఁ జంపె నహో  సువీర్యమే

నివ్వటిలంగ గొప్ప పని నేర్పునఁ జేసెను విష్ణు భంగి నా

నివ్వచనమ్ములం బలికి యెల్ల దివౌకసు లింపు గొల్పఁగా

నవ్వన మందు నేఁగిరి మహాత్ములు వచ్చిన యట్టి దారినిన్   

28.   

 

 

 

ఆ.వె.

అంత విక్రముండు నా లక్ష్మణుఁడు కంద

రాంత రమ్ము నుండి యతివ సీత

గూడ రాఁగ  వెడలి వేడుకఁ జేరె నా

శ్రమము నర్చ లొసఁగి రాఘవునకు   

29.   

 

 

 

కం.

ముని వరుల పూజ లింకను

దన యనుజుని పూజ లంది తగ రాముం డా

ఘన విజయుండు ప్రవేశిం

చె నిజాశ్రమ మప్పుడు నర శేఖరుఁ డెలమిన్     

30.   

 

 

 

మ.

కని యా రాముని శత్రు హంత ముని సంఘత్రాత సంతోషదున్

జనకక్షేత్రజ సంతసమ్మునఁ బరిష్వంగమ్ము సేసెం బతిన్

ఘన రక్షో విలయమ్ము గాంచి మురిసెం గాంతామణీ శేష్ఠ రా

ముని భద్రమ్ముగఁ గాంచఁగా ఘన ముదమ్ముం బొందె డెందమ్మునన్      

31.    

 

 

 

కం.

ఘన రాక్షస మర్దనునిన్

ముని సంఘార్చితునిఁ బురుష పుంగవుఁ జంద్రా

నన పతిఁ దిరిగి జనక నం

దన రామునిఁ గౌఁగిలించెఁ దద్దయుఁ బ్రీతిన్  

32.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు ముప్పదవ  సర్గము.

అరణ్య కాండము

సర్గము 31.

 

 

 

అకంపనుఁ డను రాక్షసుఁడు జనస్థానము నుండి లంకకు నేఁగి జనస్థానములో జరిగిన ఖర త్రిశిర  దూష ణాది ఘోర రాక్షస వధ రావణునకు నివేదింప రోషమ్ముతో రామ లక్ష్మణులను వధింప నేఁగుదు నన సీతాపహర ణోపాయమున వారిని నశింపఁ జేయు మని యకంపనుఁడు వలుక నంగీకరించి మారీచుని వద్ద కేఁగి సీత నపహరింపఁ దనకు సాయపడు మన మారీచుఁడు రామునితో యుద్ధము సేయ శక్యము కాదని బోధించి మరలు మనఁగ రావణుఁడు తిరిగి వెడలుట.    

 

 

 

 

కం.

హత శేషుండు నకంపనుఁ

డతి వేగముగఁ జని లంక కంత జనస్థా

న తలమ్ము వీడి రాక్షస

పతి రావణు తోడఁ బల్కె వాక్యము లిట్లున్     

1.      

 

 

 

ఆ.వె.

సుస్థిర నిలయులు  జనస్థాన వాసులు

రాక్షసులు సమసిరి రణము నందు 

రాక్షసేంద్ర! ఖరుఁడు రాలె నక్కట వచ్చి

తి నిట కెట్టులొ తమిఁ దివిరి నేను   

2.     

 

 

 

ఉ.

వాని సుఘోర వాక్యములు పడ్డ క్షణంబ శ్రవమ్ము లందు రో

షానల తప్త చిత్తుఁడు దశాననుఁ డస్ర విలోచనుం డనెన్ 

దీను నకంపనుం గనుచు  దృష్టులఁ గాల్చెడు భంగినిన్ జన

స్థాన వినాశకుం డెవఁడు దా మనునే త్రిజగమ్ములం దిఁకన్    

3.     

 

 

 

ఉ.

చేసిన నప్రియమ్ములను జెందఁగ నౌనె  సుఖమ్ము లెందునున్

వాసవ యక్షరాజ ఘన పాశధ రాచ్యుత దేవ కోటికిన్

నే సమరమ్మునన్ యముని నిప్పును గాల్తును మీఱి మిత్తికిం  

జేసెద మృత్యు యోగమును శీఘ్రమ నెమ్మది నుత్సహించుచున్

4.     

 

 

 

కం.

నిజ తేజమ్మునఁ గ్రోధ

మ్ము జనింపఁగ రవ్యనలుల మూరి దహింతున్

ఋజువుగ వాయు రయమ్మును

నిజముగ వారింతు నేను నిరసించి కడున్

5.     

 

 

 

తే.గీ.

విని దశగ్రీవు  రోష చిత్తుని నుడుల న

కంపనుండు భయమ్మునఁ గరములను మొ

గిడ్చి సందేహ మడరెడు గిరల నభయ

మడుగ రావణుఁ డాతని కభయ మొసఁగ   

6.     

 

 

 

ఆ.వె.

యభయ మీయ శాంతి యడర డెందమ్మున

సంశయమ్ము వీడి సంగరమ్ము

నందు జంపి నట్టి యా రఘు వీరు న

కంపనుఁ డపుడు వివరింపఁ దొడఁగె  

7.     

 

 

 

చం.

దశరథ నందనుండు హరి తాదృశ గాత్రుఁడు యౌవనుండు స

ద్యశుఁడు మహా భుజుండు వృష భాభ కకుద్విభవుండు రామ నా

మ శశిని భాననుం డతుల మాన్య పరాక్రమ విక్రముండు నా

త్రిశిర సదూషణోగ్ర ఖర ధీర వినాశకుఁ డో దశాననా!

8.     

 

 

 

కం.

విని యయ్యకంపనుం  డా

డిన మాటలు రావణుఁడు స్ఫటి వ రాభముగా  

ఘన నిశ్వనమ్ముల వచిం

చెను రాక్షస పుంగవుండు చెచ్చెర నిట్లున్    

9.     

 

 

 

కం.

అరుదెంచె నొకో సర్వా

మర సేంద్ర సమేత మటకు మనుజ వరేణ్యుం

డు రఘూద్వహుం డకంపన!

పరమ జనస్థానమునకు వచియింప వయా

10.    

 

 

 

కం.

విని రావణు నుడుల నకం

పనుఁడు తిరిగి చెప్పఁ జాగె బల విక్రమముల్

ఘనుఁడా రామునివి మహా

త్మునివి దశగ్రీవునకు సమూలం బిట్లున్  

11.    

 

 

 

ఉ.

రాముఁ డనంగఁ దేజమున రాజిలు వాఁడు ధనుర్ధ రాగ్ర్యుఁడే

భీమ వరాస్త్ర కోవిదుఁడు వృత్రహ సన్నిభుఁడై చెలంగు సం

గ్రామము నందు వాని సరి లక్ష్మణ నాముఁ డవీయసుండు దా 

భీమ బలుండు నస్త్ర విద విక్రముఁ డస్ర విలోచనుండునున్

12.    

 

 

 

తే.గీ.

దుందుభిస్వనుండు సుధాంశు సుందర వద

నుండు భ్రాతతో నరుదెంచి యుండి వాయు

సంయు తాగ్నినిభమ్ముగ సంభ్రమించి

వడి జనస్థానమునుఁ గూల్చెఁ బార్థ వరుఁడు

13.    

 

 

 

తే.గీ.

దేవతలను మహాత్ముల నే విధముగ

నైనఁ బని లేదు పరికింప నమ్ము లెల్ల

రుక్మ పుంఖ పతత్రులు రోష యుతము

రామ ముక్తము లవి యెల్ల రణము నందు

14.    

 

 

 

కం.

ఎచ్చటి కెచ్చటి కేఁగిన

విచ్చిన భీతి నసురులు భువి రఘువరుండే 

యచ్చట నచ్చట నిల్వఁగఁ

జచ్చె జనస్థాన మందు సైన్యం బెల్లన్     

15.    

 

 

 

తే.గీ.

విని యకంపను వాక్యములను గనలుచు

రావణుండు జనస్థాన మే వడిఁ గని

రామలక్ష్మణు లిద్దఱి రణమున వధి

యింతు ననఁగ నకంపనుఁ డిట్లు పలికె    

16.    

 

 

 

చం.

విను మసురేంద్ర! తత్సమర వృత్తము రాముని భీమ పౌరుష

మ్మును బల లాఘవమ్మును నమోఘము లాజి నజేయుఁ డౌను గి

న్కను వహియింప విక్రమము గాంచఁగ నాపు నదీ రయమ్మునున్ 

ఘన యశుఁ డున్నతుండు దశకంఠ! నిజాంబక పంక్తి నుగ్రుఁడై   

17.    

 

 

 

శా.

శ్రీమంతుండు నశింపఁ జేయును గ్రహశ్రేణిన్ స తారాభ్రమున్ 

రాముం డింకను మున్గ నెత్తు వడిఁ బారావార మం దీ మహిం

దా ముంచుం దగఁ ద్రుంచి వేల నలుగన్ ధాత్రీ తలం బెల్లనున్

వే మీనాలయ వాయు వేగముల నిర్భేదించు బాణమ్ములన్  

18.    

 

 

 

మ.

త్రుటి నాశం బొనరించి లోకముల నుగ్రుండై యశస్వంతుఁడే 

పటిమం దిర్గియు వాని నెల్లను సృజింపంగా సమర్థుండెచూ  

జటి రాట్తుల్యుని రాము నంకమున దుస్సాధ్యంబ నీకున్ జయిం

చుట రక్షోజన కోటి కైనఁ దరమే చూడంగఁ బాపుల్ దివిన్   

19.    

 

 

 

చం.

అతనినిఁ జంప నిర్జరుల కాసుర కోటి కసాధ్య మౌను జు

మ్ము తలఁతు నిట్లుపాయమును మూరి వచింతును జంప నాతనిన్ 

రతి నిడి విన్మ రాజవర! రాముని దార మహా సుమధ్యనున్

సతులకు మిన్న సీత యను శ్యామను నా సువిభక్త దేహనున్

20.   

 

 

 

ఉ.

కాంచన రత్న భూష సుర గాయక నిర్జర కన్య లెవ్వరున్ 

మించరు దాని నచ్చరలు మేదిని రాక్షస కన్య లన్నచో

నెంచఁగ నేల మానవుల నింతిని నీవు హరింపఁ గాముఁడై

త్రుంచును స్వీయ జీవితముఁ గ్రుంగుచుఁ గాంచక సీత రాముఁడే

21.    

 

 

 

తే.గీ.

ఇయ్యకొని యవ్వచనముల నెల్ల నన న

కంపనుండు రావణుఁడు రాక్షస విభుండు 

కొంత చింతించి మిన్నగ నంతరంగ

మందు నాతనితోఁ బల్కె నంత నిట్లు     

22.   

 

 

 

ఉ.

మంచి దకంపనా! చనుదు మానినిఁ దెత్తును లంక కింపుగన్

మించి యొకండ సారథి సమేతము కాల్యము నందుఁ బ్రీతినిన్

మంచి రథమ్ము నెక్కి యని మానుగఁ బల్కి ఖరాలి యుక్తమౌ

యంచిత సూర్య సన్నిభపు టా యరదమ్మున నేఁగె వెల్గుచున్    

23.   

 

 

 

కం.

చన నక్షత్ర పథమ్మున

ఘ నాసురేశ్వర రథమ్ము కమనీయముగాఁ

గనిపించెను వెల్గుచు మే

ఘ నిచయ మందున్న చంద్రు కరణిం బ్రభలన్    

24.   

 

 

 

కం.

చని మారీ చాశ్రమమున

కు నరయ నా తాటకేయుఁ గొలిచె దశగ్రీ

వుని మారీచుఁడు భక్ష్యము

ల ననర భోజ్యముల నొసఁగి రావణు భక్తిన్

25.   

 

 

 

ఆ.వె.

ఆస నోదకములఁ జేసి స్వయము పూజ

నర్థ వంతములుగ నలరు వాక్య

ములు దశానను గని పలికె మారీచుఁడు

వాక్య కోవిదుండు వఱలి యిట్లు  

26.   

 

 

 

ఆ.వె.

రాక్షసేశ్వర! కుశలమె కద రాక్షస

జగతి కెల్లఁ గలిగె సంశయమ్ము 

సత్వరమ్ము తివిరి చనుదెంచ  నిచటకు

నాకు యెఱుఁగు మయ్య నాథ!  నీవు    

27.   

 

 

 

కం.

మారీచుండు వలుక ని

ట్లా రావణుఁడు ఘన తేజుఁ డపరము వాక్యా

పార నిపుణుండు పల్కె వి

చార సమాయుక్త ములు వచనముల నంతన్

28.   

 

 

 

తే.గీ.

అజ్జనస్థాన మందు నిహతు లయి రట

నాదు స్థాన రక్షకులు రణమ్ము నందు 

భీముఁ డక్లిష్ట కర్ముండు  రాముఁ డణఁప

నతని సతిని నపహరింప నగుము తోడు   

29.   

 

 

 

మ.

విని రక్షోగణ నాథు వాక్యములు నావృద్ధుండు మారీచుఁ డి

ట్లనె నెవ్వం డతఁ డిట్లు జానకిని నాఖ్యా తాబలం జేసె మి

త్రుని భంగిం గనిపించు శత్రు వతఁడే తుష్టుండు కా నట్టియౌ

ఘను నానందితుఁ డయ్యు నీ వలన వక్కాణింపుమా రావణా!

30.   

 

 

 

తే.గీ.

సీత నిటకుఁ దోడ్తెమ్మని చెప్పినది యె

వండు చెప్పుమ యట్టి దుష్టుం డెవండు

రాక్షస జగతి కెల్ల విలయము దల్చు

నట్టి క్రూరుండు దా నెవ్వఁ డసుర నాథ!   

31.    

 

 

 

ఆ.వె.

నిన్ను ప్రోత్సహింప మిన్నగ నివ్విది

శత్రు వతఁడు నీకు సందియంబు

లే దొకింత యేని రేఁగి సర్ప ముఖము

నుండి కోఱల నతఁ డూడ్ప నెంచు  

32.   

 

 

 

ఆ.వె.

ఎవ్వఁ డెట్టి పనుల నెట్టి దారిని నీ కె

టఁ బ్రతి పాదనమ్ము డంబమున నొ

నర్ప వింటివో తనర నిద్ర తల పైన 

బాఁదఁ బడితి వెవని వలన రాజ!     

33.   

 

 

 

తే.గీ.

పరమ వంశోద్భవము హస్త వరము గాఁగ 

స్వీయ తేజమ్ము మదముగా విరియ నడరి

రావణ! బుజలు కొమ్ములై రాజిలంగ

రామ మదకరి వీక్షింప రాదు కలిని

34.   

 

 

 

తే.గీ.

పోరు నందుఁ దోఁకను నడుము పయి నుంచు  

రాక్షసీ మృగ హర్తృ నర మృగరాజు 

శర నికాయాంగు నిశిత దంష్ట్ర వరు సుప్తుఁ 

దగదు నిద్రా రతుని లేప దశ వరాస్య!  

35.   

 

 

 

తే.గీ.

భుజ రయం బను మున్నీటి బురద తోడ

నమ్ము లనఁగఁ దనరు కెరటమ్ము లుండ 

నాహవ ప్రవాహమ్ముల నా విలుఁ గొను 

రామ పాతాళ ముఖముఁ జొరఁబడఁ దగదు  

36.   

 

 

 

తే.గీ.

రాక్షసేంద్ర! లంకేశ్వర! లంక కేఁగు

మయ్య కరుణించి హర్షమ్ము నరయు మయ్య

నీదు దారల రమియించు నెగడి సతము

రాముఁడు సదార దనరు నరణ్య మందు

37.   

 

 

 

కం.

పలుకఁగ మారీచుఁ డిటుల

లలితమ్ముగ నాలకించి రావణుఁ డంతం 

దలఁచి యుచితమ్ము లని మర

లి లంక కేఁగి  నిలయమున లీలగఁ జొచ్చెన్  

38.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు ముప్పది యొకటవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 32.

 

 

 

శూర్పణఖ ఖర త్రిశిర దూషణులతోఁ గూడఁ బదునాల్గు వేల రాక్షసులు భండన మందు నొక్క రాముని చేత హతు లైన రోదించి రావణుని కడకు నేఁగి లక్ష్మణునిచేఁ జేయఁ బడిన తన వికృత రూపమును జూపుచు పలుకుట. 

 

 

 

 

చం.

దురమునఁ గూల నవ్విధిఁ జతుర్దశ యుక్త సహస్ర రాక్షసుల్

నరవరుఁ డొక్క రాము వలనం ద్రుటి దుస్సహ భీమ కర్ములే

ఖర యుత దూషణ త్రిశిర కౌణప ముఖ్యులు గాంచి వేదనా

భరిత నిజాత్మ శూర్పణఖ వారిద నాద నిభమ్ము కుయ్యిడెన్   

1.      

 

 

 

కం.

కని రాముని దుష్కర మగు

పనిఁ బర మోద్వేగ మంది స్వాంతం బందుం

జనె రావణ బల రక్షిత

మున కా లంకకు నతి రయముగ నామె పగన్   

2.     

 

 

 

చం.

కనె దశకంఠు శూర్పణఖ కమ్ర విమాన విరాజమానునిం

దను గత దీప్త తేజుని స దైవగ ణేంద్రు నిభం బమాత్య పం

క్తిని నుపవిష్టుఁడై తనరు కీర్తిత రాక్షస వర్యు నంతఁ గాం

చన రవి తుల్య పీఠి శిఖి సామ్య మహోజ్జ్వల దివ్య వేదికన్    

3.     

 

 

 

తే.గీ.

దేవ గంధర్వ భూత యతిప్రవర మ

హాత్ముల కజేయుని రణము నందు వీరు 

నంత కాభ వివృత ముఖు నమర రాక్ష

స రణ వజ్ర కృతవ్రణు సురగణ రిపు

4.     

 

 

 

ఆ.వె.

పోరు నందు మచ్చ నైరావతపు దంత

పుఁ గొనల నుర మందుఁ బొంది నట్టి

వాని వీరుని దశ వదను వింశద్భుజు 

దర్శనీయ వస్త్ర ధరుని ఘనుని

5.     

 

 

 

తే.గీ.

రాజ లక్షణ శోభితు రమ్యతమ వి

శాల వక్షుని వైడూర్య సదృశ తప్త

కాంచన మయ కుండలుని శుక్ల దశను గిరి

సన్నిభుని మహాస్యుని సుమహోన్నత భుజు       

6.     

 

 

 

చం.

విరివిగ విష్ణు చక్రమున విద్ధుఁడు నైనను బెక్కు మాఱులున్ 

సురగణ భండనమ్ములను జోద్యమ యన్య సురాస్త్ర పంక్తిచే

నురుతర తాడితుండు నయి యుద్ధతిఁ గందని రాక్షసేంద్రునిన్ 

స్థిరముగ నుండు వార్ధులను దీవ్రముగాఁ గదలించు వానినిన్

7.     

 

 

 

తే.గీ.

కొండలను విసరెడు వాని ఘోరముగ సు

రలను మర్దించు వాని ధర్మమును సంత

తమ్ము చెఱచు వానినిఁ బరదార లందు 

వాంఛ దృష్టులను బఱపు వాని నసురు  

8.     

 

 

 

తే.గీ.

ఎల్లయస్త్రమ్ములన్ విలసిల్లు వాని

యజ్ఞములఁ దమి నిత్యమ్ము నడ్డుకొనెడి

వాని భోగవతిని వంచి వాసుకిని జ

యించి తక్షకు సతిఁగొన్న యేవకాని  

9.     

 

 

 

ఆ.వె.

చాల బలిమి నేఁగి కైలాస గిరికిఁ గు

బేరు నని జయించి ఘోరముగను

గామగమ్ము పుష్పక మను విమానము

నపహరించి నట్టి యసుర నాథు  

10.    

 

 

 

కం.

వన మా చైత్రరథమును న

లినీ కలిత నందనము నిలిం పోప వనా

లిని గ్రోధం బేపారఁగ

వినాశ మొనరించు వాని వీర వరేణ్యున్

11.    

 

 

 

ఆ.వె.

సూర్య చంద్రులఁ గడు శుభ యోగుల నుదయిం

పంగ స్వీయ బాహు పర్వత శిఖ

ల విలసిల్లి  యాపు రాక్షసేంద్రుని శత్రు

సంచయమ్మును సమయించు వాని  

12.    

 

 

 

తే.గీ.

దశ సహస్ర వర్షమ్ములు తపము సేసి

పూర్వము మహా వనము నందు మూరి నట్టి

భక్తిఁ ధాతకు నిజ శిరః పంక్తి  ధృతి నొ

సఁగిన యా దశగ్రీవు రాక్షస వరేణ్యు   

13.    

 

 

 

తే.గీ.

దేవ దానవ గంధర్వ దీర్ఘపృష్ఠ 

ఖగ పిశాచ గణములచేఁ గయ్యములను

మానవుల చేతఁ దక్కంగ మరణ ముండ

నట్టుల వరము నందిన యట్టి వాని       

14.    

 

 

 

ఉ.

సోమముఁ బుణ్య యాగముల సుద్విజు లింపుగఁ గూర్ప మంత్రముల్

నీమముగాఁ బఠించి కని నీ ఱొనరించెడు యజ్ఞ నాశకున్ 

భీమ నృశంసు నిర్దయుని విప్ర వినాశకు దుష్ట చారినిన్

భూమి జ నాహితాత్ముని విమోహినిఁ గర్కశు రాక్షసేంద్రునిన్ 

15.    

 

 

 

తే.గీ.

రావణుని సర్వ లోక విద్రావణు సక

లావనీ భయంకరుని  నిజాగ్రజు నసు

రాధిపు సమర శూరుని నతివ గాంచె

నమ్మహా బలు నా  శూర్ప ణాఖ్య యచట

16.    

 

 

 

ఆ.వె.

దివ్య వస్త్రములను దివ్య మాలల వెల్గు

చుండి యాసనమున నుండ సుఖము

దనర దండ ధరుని దండ ధరుండునై 

మించి యున్న వాని మేటి శూరు

17.    

 

 

 

ఆ.వె.

పలలభోజ నేంద్రు పౌలస్త్య వంశ నం

దనుని శత్రు నివహ తర్జను నిజ

మంత్రి గణ పరివృత మండితునిఁ గదిసి

పలికె రాక్షసి కడు భయము సెంది    

18.    

 

 

 

కం.

చూపుచు భయ మూర్ఛిత తన

రూపమ్ము మహాత్మ కృత విరూప మతనికిన్

వే పలికెను వాక్యమ్ములఁ

దాపమున విశాల నేత్ర దారుణ గిరలన్

19.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు ముప్పది రెండవ సర్గము.

 

 

అరణ్య కాండము

సర్గము 33.

 

 

 

శూర్పణఖ రావణుని వద్దకు వచ్చి కోపముతో నాతనిని మత్తుఁడై చారుల వలన జనస్థానములోని   విలయ మెఱుంగ కున్నాఁ డని నిందించుచు నతని పాలనము లోని లోపములను దెలుపుచు  రాముని పొగడుచు మంచి రాజున కుండ వలసిన గుణములను బ్రస్తావింప రావణుఁ డామె మాటలకు నాలోచనా మగ్నుఁ డగుట.

 

 

 

 

కం.

రావణుని లోక రావణు

నా వనిత యమాత్య వృత దశానను గనుచున్ 

వావిరి కిన్కను శూర్పణ

ఖా విషధర పల్కె నిట్లు ఖరతర గిరలన్    

1.      

 

 

 

ఉ.

మత్తుఁడ వీవు భోగముల మత్త గజాభ నిరంకుశుండవై

నిత్తెము కామ వాంఛలను నేర వెఱుంగఁగ నట్టి వాని నా

పత్తులు సంభవింపఁగ నపారము నచ్చటఁ గాన కుంటివే

యిత్తఱి రాజ్య పాలనము నెవ్వరు మెత్తురు లోక మందునున్    

2.     

 

 

 

ఆ.వె.

ప్రేత భూమి యందు వెలయు నగ్ని నిభమ్ము

గ్రామ్యభోగములఁ బరగు మహీప

తిని సకామ వృత్తు జనులు మన్నింప రె

న్నండు లుబ్ధు నసురనాథ! వినవె    

3.     

 

 

 

కం.

తగు కాలం బందు నయ

మ్ముగఁ జేయక తన పనులను  భూనాథుండే

సుగతిం దానును రాజ్య

మ్ముఁ గార్యములతో నశించు భూతల మందున్    

4.     

 

 

 

కం.

చారుల నుంచని నృపునిం

బౌరుల నరయని స్వశక్తిఁ బరగని వానిన్ 

దూరమ్మున విడుచును జన

వారము పంక యుత నది నిభ గణము భంగిన్      

5.     

 

 

 

ఆ.వె.

రక్షణమ్ము నీక రాజ్యమునకుఁ బరా

ధీను లయి చెలఁగు క్షితి పతు లెల్ల

రమిత బుద్ధి యున్న నంబుధి నున్న ప

ర్వతవరముల భంగి రాజిల రిల       

6.     

 

 

 

కం.

అభిమానవంతు లాసుర

నభశ్చ రానిమిష గాయన జనుల రిపువై 

శుభకర చారుల నెన్నక 

విభుండ వెట్లగుదు వయ్య విస్తృత చపలా!      

7.     

 

 

 

కం.

బాలస్వభావుఁడవు నీ

వేల యెఱుంగ దగు దాని నెద నేరవె యీ

లీల మతి హీనుఁడవునై 

పాలకుఁ డెట్లైతి వకట భావింపంగన్      

8.     

 

 

 

కం.

జయశీలు రందు శ్రేష్ఠుఁడు 

నయ కోశాగార చార నర పుంగవ సం

చయము నధీనమ్మున నిడ

క యున్న సామాన్య జన నికాశుఁడు సుమ్మీ

9.     

 

 

 

ఉ.

దూరము నందు వేగముగఁ దొట్టు ననర్థ చయమ్ము నింపుగాఁ 

జారులు దెల్పు చుండగను జక్కఁగ నేరి తగం జరింపఁగా

వారిని దీర్ఘ చక్షు లని పార్థివ పుంగవులన్ వచింతురే 

చార విహీనమై సచివ సంఘము తోడుత నిల్చి యుంటివే    

10.    

 

 

 

తే.గీ.

ప్రాకృ తామాత్యులను గూడి పరఁగు చున్న

నిన్ను నే మదిఁ బామర నిభము దలఁతు

స్వజనులు హతులయిన  జనస్థాన మందు

నేర వక్కట సుంతయు నీవు వింత   

11.    

 

 

 

ఆ.వె.

క్రూర కర్ము లసుర వీరులు పదునాల్గు

వేవురు హతు లైరి భీక రాజి

నొక్క రాము చేత నుద్దండ ఖర దూష

ణులను గూడి బల్లిదులను వింటె

12.    

 

 

 

తే.గీ.

ఋషి వరుల కిచ్చె నభయ మహీన బలుఁడు 

రాముఁ డిడె శాంతి దండ కారణ్యమునకు

మన జనస్థానము నెదిర్చె మానవుండు

వీరుఁ డక్లిష్ట కర్ముఁడు వీఁకఁ జెలఁగి    

13.    

 

 

 

ఆ.వె.

లుబ్ధుఁడవు ప్రమత్త లుప్త విభుత్వుఁడ

వీ వెఱుఁగవు భయము లిచట కల్గి

నట్టి వాని నెల్ల నక్కట రావణ! 

పరుల వశుఁడ వయితి  పలుక నేల   

14.    

 

 

 

తే.గీ.

చండునిఁ బ్రమత్తు గర్వితు శఠుని నల్ప

దాతను సకల భూతము లే తఱి వ్యస

నమ్ము లేపారు నత్తఱి నమ్మి చేర

వెందు రక్షణార్థము పార్థు నెడఁదఁ దలఁచి

15.    

 

 

 

కం.

అతిమానుని నగ్రాహ్యుని

నతి రోషుని నాత్మ నుతుని వ్యసనమ్ముల భూ

పతిని స్వజను లైన ధర ని

హతుఁ జేయంగం దలంతు రాత్మల లోనన్     

16.    

 

 

 

కం.

తన కర్తవ్యముల నొన

ర్పని వాటిల్లిన భయముల భయ మొందని య

ట్టి నరేంద్రుఁడు భ్రష్టుఁ డగును

ఘనుండు తృణ తుల్యఁ డగును గడు దీన గతిన్       

17.    

 

 

 

ఆ.వె.

మట్టిగడ్డ లింక మన్నుదుమ్ముల యందు 

నెండు కఱ్ఱ లందు నుండు ఫలము 

రాజ్య హీను లైన రాజుల వలనఁ గా

ర్యమ్ము గాన కుందు రవని జనులు   

18.    

 

 

 

కం.

చినిగిన వస్త్రమ్ముల నలిఁ

గిన దండల భంగి నవని క్షితి నాశుం డై

న నరేశుండు సమర్థుఁ డ

యినను నిరర్థకుఁ డగును మహీతల మందున్   

19.    

 

 

 

మ.

చిర కాలం బిల నప్రమత్త నృవర శ్రేష్ఠుండు సర్వజ్ఞుఁడున్ 

గురు దాంతుండును ధర్మశీలుఁడు జనుల్ గొల్వం గృతజ్ఞుండు గాఁ   

బరఁగున్ రాజ్యము నందుఁ జూచినను దాఁ బండంగ నీత్యక్షులన్ 

నరు లర్చింతురు వీడఁ గ్రోధమును భూనాథున్ మహోత్సాహునిన్    

20.   

 

 

 

ఆ.వె.

ఈ గుణములు లేని హీన బుద్దివి నీవు

రావణ! యెఱుఁగ విట  రణమున మర

ణించి యున్నను రజనీచరు లెల్ల ఘో

రముగ నచట వేగుల వచనముల

21.    

 

 

 

తే.గీ.

విషయ లోలత్వమున మున్గి విరివిఁ బరుల

సతము నిందించు చుండి దేశ సమయముల 

భాజనము గుణదోష సంభావనమ్ము

నేరక పదచ్యుతుఁడ వగుదే రయమున

22.   

 

 

 

కం.

పలుకఁగ నామె తనదు త

ప్పుల నన్నిటి నాలకించి మూరఁగ విత్త

మ్ములు దర్పము వీర్యమ్మును

దలంపఁ జాగె నసుర పతి దద్ద సమయమే       

23.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు ముప్పది మూడవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 34.

 

 

 

శూర్పణఖ రావణునితో రామ లక్ష్మణుల వంశ పరాక్రమములను, సీతా దేవి సౌందర్యమును వర్ణించి యామెను భార్యగాఁ గైకొన మని ప్రోత్సహించుట.     

 

 

 

 

కం.

స రుషఁ బరమ పరుషమ్ములు

గిర లా మంత్రులు వినఁ జెలఁగి పలుకఁగా సో

దరి శూర్పణఖను వీక్షిం

చి రావణుం డడిగె నిట్లు చిఱ్ఱున నంతన్    

1.      

 

 

 

ఉ.

ఎవ్వఁడు రాముఁ డాకృతియు నెట్టిది నాతని వీర్య మెట్టిదో

యెవ్విధ మా పరాక్రమమ యేల చరించుచు నుండె దుర్గమం 

బివ్వర దండకా వనిని నెయ్యది యాయుధ మాతఁ డూని తా

నివ్వెఱఁ జంపె దూషణు ననిన్ ఖర సత్రిశిరాది ముఖ్యులన్

2.     

 

 

 

ఆ.వె.

రాక్షసేంద్రుఁ డట్లు రావణుం డడుగ నా

క్రోధ మూర్చి తోగ్ర ఘోర రాక్ష

సాంగన పలుకంగ నంతఁ జాగె రఘు వీ

రుని చరిత్ర యెల్ల రుచిరముగను        

3.     

 

 

 

ఆ.వె.

దీర్ఘ బాహు యుగుఁ డతీవ విశాల చ

క్షుండు కఱి యజిన ధరుండు మార

సదృశ సుందరుఁడు దశర థాత్మజుండు రా

ముండు వర ధనుర్ధరుండు ఘనుఁడు

4.     

 

 

 

చం.

శరముల శక్ర చాప నిభ చాపము కాంచన భాసితమ్ము నూ

ని రయము మీఱి పాఱఁగ ననిన్ విష కుండలి సన్నిభమ్ములన్

విరివిగ నేయ నేఁ గనను వింటిని లాగుట బాణ పంక్తినిం

గరమునఁ గొంట వేయుటయు గ్రన్నన నచ్చట నబ్బురమ్ముగన్   

5.     

 

 

 

ఆ.వె.

కాంతును శరవృష్టిఁ గయ్యము నందుఁ ద

త్సైన్య మెల్ల సమసి శూన్య మగుట

యింద్రు నశ్మ వర్ష మేపార సస్యమ్ము

లెల్లఁ దత్క్షణంబ చెల్లు నట్లు      

6.     

 

 

 

తే.గీ.

అకట యర్ధాధిక ముహూర్త మందు నొక్క

పదగు నతి నిశి తాంబక  పాతమున న

సుర వరులు చతుర్దశ సహస్రులును స ఖర

దూష ణాదులు మడిసిరి దురము నందు

7.     

 

 

 

తే.గీ.

ఋషి వరుల కిచ్చె నభయ మహీన బలుఁడు 

రాముఁ డిడె శాంతి దండ కారణ్యమునకు

స్త్రీ వధకు సంశయించి  మది విడువంగ

నెట్లొ యవమానిత నయి నే నిటుల నుంటి     

8.     

 

 

 

ఉ.

ఆతని కూర్మి తమ్ముఁడు మహానల తేజుఁడు లక్ష్మణుండు నా

ఖ్యాతిఁ జెలంగు భక్తుఁ డగు నన్నకు నింపుగ సంతతమ్ము వీ

ర్యాతిశయుండు తుల్యుఁడు గుణావలి రామున కెన్నఁగా రిపు

వ్రాత జయుం డమర్షణుఁడు బల్లిదుఁ డున్నత విక్రముం డిలన్    

9.     

 

 

 

తే.గీ.

బుద్ధిమంతుఁడు దక్షిణంపు భుజుఁ డెన్న

రామునకు సంతతము బహిః ప్రాణమై చ

రించు చుండు రాఘవునకు నంచితముగ

నిత్య మనుయాయి యై యుండు సత్యముగను     

10.    

 

 

 

ఉ.

రాముని ధర్మపత్ని ప్రియ ప్రాణ సమాన విశాల నేత్ర తా

రామ హితమ్ము కోరు నెద రాజ నిభానన సంతతమ్మునున్

భామ సునాస రూపవతి భవ్య తరోరు సుకేశి శ్రీ సమా

నామిత కాంతి గాత్ర సుమహా వన దేవత నా విరాజిలున్   

11.    

 

 

 

ఆ.వె.

తప్త కాంచన నిభ తరళవర్ణ తను తా

మ్ర నఖి సీత యనఁ బరఁగు నితంబి

నీ తనుతర మధ్య నిత్య శుభ విదేహ

రాజ కన్య తామరస నిభాక్షి   

12.    

 

 

 

ఆ.వె.

కాంచఁ గిన్నరాలి గంధర్వ యక్షాలి

మున్ను నేను సత్య మెన్నఁ డేని

మహిని నిట్టి దేవి మానవ కాంతల

లోన నైన నిట్టి రూప మెందు       

13.    

 

 

 

ఉ.

ఎవ్వని కీమె భార్య యగు నెవ్వని కౌఁగిలి నుండు సీతయే

యవ్వరుఁ డుండు లోకముల హర్షము నంది బలారి కన్న నీ

కవ్వనితా మతల్లి తగు నాలిగ రావణ! యెంచి చూడ నీ

వివ్వసుధా తలమ్మున మహీజకు భర్తగ నొప్పు దింపుగన్     

14.    

 

 

 

తే.గీ.

శ్లాఘ్య వపువు జగమున నప్రతిమ రూప

వతి సుగుణశీల సుశ్రోణి ప్రతతి జఘన

ఘన పయోధర జానకి కరము నీకు

నడుగ లక్ష్మణుఁడు విరూప నడరి చేసె

15.    

 

 

 

ఉ.

చూచినఁ బూర్ణ చంద్రముఖిఁ జొప్పడు నీ యెద మన్మ థార్తి యే 

తోఁచిన నీకు డెందమునఁ దోయజ నేత్రను బొందు బుద్ధియే 

వే చను దక్షి ణాంఘ్రి నిడి పేర్మి జయింపఁగ సీత నింక నీ

వేఁచి వధించి రాము నట హీనుని సోఁకుల కిమ్ము హర్షమున్    

16.    

 

 

 

తే.గీ.

లక్ష్మణు మహారథు సుఘోర రణమున నిశి

త శర పంక్తి వధించి హతపతి సీత

నింక నీవు యథేచ్ఛఁగ నెలమి ననుభ

వింపఁ దగుదు డెందమునఁ దలంపు మయ్య

17.    

 

 

 

కం.

సమ్మతము లయిన నా వచ

నమ్ములు నిశ్శంక రావణ! యొనర్పుమ  సౌ

ఖ్యమ్మొనగూడఁగ నిప్పని  

నిమ్ముగ రాక్షస వరేణ్య యింకఁ జలమునన్   

18.    

 

 

 

కం.

నిజ బలము నెఱిఁగి యయ్యవ

నిజ ననవద్యాంగి నబల నెమ్మిం గొమ్మా

నిజ పత్నిగఁ బ్రసభమ్మున

రజనీ గణనాథ! యెడఁద రాగం బొప్పన్     

19.    

 

 

 

కం.

విని రాముని ఋజు నిశిత శ

ర నివహ హత రాక్షసుల ఖరత్రిశిర యుతం

బును దూషణుని జనస్థా

న నుత తటిని నుద్యమింప నడవఁగ వలయున్

20.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు ముప్పది నాల్గవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 35.

 

 

 

శూర్పణఖ మాటలను విని రావణుఁడు మంత్రులను వీడి కార్యము నెఱిఁగి బలా బలములు గుణ దోషములను బరిశీలించి కార్యము నిశ్చయించి రథమున సూతునితో నేఁగి మార్గమున నరణ్య శోభలను దిలకించుచు సముద్రమున కావలి వైపున నున్న మారీచుని యాశ్రమము చేరి మారీచునిచేఁ బూజితుఁడై రాకకు కారణము నడుగఁ బడి వచించుట. మార్గమున మఱ్ఱి చెట్టు కనఁబడ గరుత్మంతుని యమృ తాపహరణ కథ వర్ణనము. 

 

 

 

 

కం.

విని నిడువెండ్రుక నెగడు వ

చనమ్ము లన శూర్పణఖ దశగ్రీవుం డం

త నిజామాత్యులకు నొసఁగి

యనుజ్ఞ కార్యము నెఱింగి యాత్మం జనియెన్    

1.      

 

 

 

ఉ.

అప్పని నేరి సత్యముగ నర్థముఁ దర్కము సేసి చక్కఁగాఁ

దప్పుల నింక నొప్పులను దల్చి కడింది నిజాత్మలోనఁ దా

నొప్పుగ నెన్ని స్వీయ బల మున్నది లేనిది సుస్థిరమ్ముగా 

నప్పుడు నిశ్చయించి పని యాన గృహమ్మున కేఁగె నంతటన్  

2.     

 

 

 

తే.గీ.

గూఢముగ యానముల శాలకుఁ జని తేరుఁ

ద్వరితముగఁ గూర్పు మని  సూతుఁ బనుప రావ

ణుండు సారథి లఘు విక్రముండు రథము

నప్పు డాయత్త మొనరించె నాక్షణమున

3.     

 

 

 

ఉ.

బంగరు తేరు రత్నమయ భాసిత మెక్కి పిశాచ వక్త్రముల్ 

బంగరు భూషణమ్ములను బన్నుగ వెల్గెడు గార్దభమ్ములే

పొంగున లాగఁ గామగము బోరన మేఘ నిభస్వనమ్ము లా

రంగ సముద్ర దిక్కునకు రావఁణుఁ డేఁగఁ దొడంగెఁ బ్రీతిమై     

4.     

 

 

 

సీ.

వింజామర  లలర వెల్ల గొడుగు మెఱయంగ వైదూర్యము భంగిఁ దప్త

కాంచన కుండల కాంతుల దశ వక్త్రుఁ డిరువది హస్తమ్ము లింపు గొలుప

దర్శనీయములు వస్త్రమ్ములు ధరియింపఁ ద్రిదశారి తాపసాలి దమనుండు 

దశశీర్ష యుత పర్వత నిభుండు రాక్షసేశ్వరుఁడు వెలింగెను బన్నుగ నట  

 

తే.గీ.

స బక విద్యుత్సహిత మేఘ సరణిఁ దివిరి  

నంబరమునఁ గామగ రథ మందు నిలిచి

యేఁగు చుండంగ ఘన దర్ప మేర్పడంగ

రావణుం డత్తఱి నెద సంరంభ మడర

5.     

 

 

 

కం.

సాగర తీర ప్రాంతము

లోఁ గాంచుచు శైల పుష్ప రుచిర ఫల సహ

స్రాగముల వీర్యవంతుఁడు

నేఁగుచు నరదమ్ము పైన నెలమిం బొందెన్  

6.     

 

 

 

తే.గీ.

విమల శీతల జలముల వెలుఁగు కొలను

లమర నెల్లెడల సువిశా లాశ్రమ పద

ములు పరివృత వేదికలును వెలయ మిగుల

రమ్యముగ నచ్చ టచ్చట రక్తిఁ గాంచె        

7.     

 

 

 

తే.గీ.

వరి యరఁటులఁ గ్రిక్కిరిసియు విరివి వెలుఁగ

నారికేళ వృక్షమ్ములు మూరి యుండ

సాల తాల తమాల పుష్ప కలిత తరు

పరివృతంబు భాసిల్లంగఁ బన్నుగఁ గని

8.     

 

 

 

మ.

ఉరగవ్రాత సుపర్ణ కిన్నర సహస్రోద్యుక్త గంధర్వులున్

వర వైఖానస వాలఖిల్య జన సంభా వ్యాజ వంశీయులున్ 

సు రవిప్రోత్థిత సన్మరీచిపులు సంశోభిల్ల సిద్ధాలియున్ 

నిర తాహార నియంత్రి తోన్నత మునుల్ నిండంగ నా చారణుల్

9.     

 

 

 

ఆ.వె.

కాంచె మాషులు జిత కాములు వెలయంగ

నచట మిక్కుటము సహస్ర సంఖ్య

లచ్చర లతి భూష ణాలంకృతలు మాల్య

విలసితలు రతిజ్ఞ లలన లడర

10.    

 

 

 

తే.గీ.

శ్రీమతులు సుర పత్నుల చేత సేవి

తమ్ము భృశము సుశ్రీ కలితమ్ము దేవ

దానవ గణ చరితము సుధా వ రాశ

న చయ సంచరితమ్ము వనమ్ము గనియె    

11.    

 

 

 

ఆ.వె.

హంసలు ప్లవ సంచయములు క్రౌంచద్విజ

ము లడరంగ నాదముల నొసంగ

సారసములు వెలుఁగ సార వైదూర్య సు

ప్రస్తరములు కడలి ప్రభల తోడ   

12.    

 

 

 

ఉ.

సర్వ సితాంగ భాసిత విశాల సమంచిత మాల్య సంయుతా

ఖర్వ విమాన తూర్యచయ గర్జన రాజిత వాహ పంక్తి  గం

ధర్వ వరాప్సరో జన వితానము కామగులం దపో జి తా

పూర్వ సులోక సంచయుల మూరి కనెన్ ధనదానుజుం డటన్       

13.    

 

 

 

ఆ.వె.

మంచి మ్రాని బంక లంచిత మూరు చం

దన సహస్ర రుచిర తరువు లడరు

వనములఁ గనెఁ దృప్తిని నొసంగు వాసన

లు సెలఁగఁ బలు రకములు ముద మొసఁగ    

14.    

 

 

 

కం.

కనియెన్ ముఖ్యపు టగరులు 

వనోప వనములు సుగంధ ఫల సంయుతముల్ 

కనె జాజులఁ దక్కోలము

ల నేఁగుచు ముదావహముల రావణుఁ డెలమిన్  

15.    

 

 

 

కం.

కనియెం దమాల సుమములు

కనియెన్ మిరియపుఁ బొదలను గనె ముత్యమ్ముల్

జను లెండఁ బెట్టఁ దీర

మ్మున నచ్చోట సముదాయముల నెల్లఁ దమిన్  

16.    

 

 

 

కం.

ప్రసరించిన శంఖమ్ముల

వసుధన్ విద్రుమ చయముల బంగరు గిరులన్

వెసఁ గాంచె రజత వర్ణా

ద్రి సమూహము లెల్లెడలను దివ్య నగములన్

17.    

 

 

 

తే.గీ.

మేటి యొయ్యరములు సెలయూట లమర 

భవ్య నిర్మల జల సరోవరములు  ధన

ధాన్య సంపన్నములు వనితా మణులు గ

జాశ్వ రథములతో నగ రాలిఁ గాంచె     

18.    

 

 

 

ఆ.వె.

సింధురా ట్తటమున శీతల మృదు మారు

తమ్ము నలు దిశలను బమ్మి వీచు

చుండ జల సమృద్ధ  శుద్ధ దేశమ్ములఁ

గాంచె స్వర్గ నిభము లంచితముగ  

19.    

 

 

 

కం.

అటఁ గాంచె నంత నున్నత

వట వృక్షము మేఘ సమము వఱలఁగ శాఖా

జటలు శత యోజనమ్ములు

పటు తరముగ నెల్ల  దిశల వరముని యుతమున్

20.   

 

 

 

తే.గీ.

ఏ మహీజ శాఖ పయి మున్నింపుగ గరు

డుండు భక్ష ణార్థమ  హస్తి నొండు కచ్ఛ

పము మహాకాయమును మహా బలుఁడు వ్రాలెఁ 

గైకొని  యలయ కయ్యది యీ కుజమ్ము  

21.    

 

 

 

కం.

ఖగ రాజేంద్రుఁడు వ్రాల వి

ఱిఁగెను సుపర్ణుండు పక్కి ఱేని బరువు చే

నగశాఖ పర్ణ బహుళము

గగనం బదర భృశ మొక్క క్షణమున నంతన్   

22.   

 

 

 

తే.గీ.

మునులు వైఖానసులు మాషులును మరీచి

పులును వాలఖిల్యులును ధూమ్రు లజు లెల్లఁ

గలసి యుండిరా మఱ్ఱి వృక్షంపుఁ గొమ్మ

పైన వైనతేయుండు సుపర్ణుఁ డంత   

23.   

 

 

 

ఆ.వె.

వారి పైన దయను బడసి గరుత్మంతుఁ

డడరి కొమ్మ నూని యంత వంద

యోజనముల దూర మొప్పుగఁ గొనిపోయె

స గజ కచ్ఛపముగ  సత్వరమ్ము   

24.   

 

 

 

చం.

పలలము నారగించి యిఁకఁ బన్నుగ నెల్లయు నొక్క సారిగన్

విలయము సేసి రాత్రిచర వేశ్మము లవ్విట పోన్నతమ్ముచే 

సలలిత మా మునీంద్రులను సన్మతి నుంచి మహాత్ముఁ డచ్చటం

దుల యన లేని హర్షమును దోరము వొందెను ధర్మచిత్తుఁడై    

25.   

 

 

 

ఆ.వె.

రేఁగ విక్రమమ్ము రెట్టింపు నై హర్ష

మంది యంత నేఁగె నమృత మపహ

రింప బుద్ధిమంతుఁ డింపైన యట్టి వే

గమ్ము తోడఁ జెలఁగి గరుడుఁ డపుడు  

26.   

 

 

 

తే.గీ.

ఇనుప గొలుసు లెల్లం ద్రుంచి యింటి రత్న

మయము భేదించి వడి గరుత్మంతుఁ డమర

నాథు భవనమ్ములో రక్షణమ్ము నందుఁ

దనరు నమృతమ్ము నపహరించెను బలుండు  

27.   

 

 

 

తే.గీ.

అట్టి యా సుపర్ణుని చేత నవిసిన విట

పంపు న్యగ్రోధ తరువు సుభద్ర మనఁగఁ

బరఁగు దానిఁ గాంచె నట రావణుఁడు ముని గ

ణావృతంబై తనరు చుండఁ బావనమును   

28.   

 

 

 

తే.గీ.

ఉత్తరించి నదీపతి నుదధి నన్య

పారమునఁ బుణ్యతర మైన వనము మధ్య 

నడర నేకాంతముగ నొక్క యాశ్రమమ్ము

గాంచె రాక్షసేంద్రుఁడు దశకంఠుఁ డపుడు   

29.   

 

 

 

తే.గీ.

అచట కృష్ణాజిన ధరుండు నయిన జడల

నూని యున్న మారీచుఁడు నా నియతపు

భోజనుం డగు రాక్షసపుంగవుఁ గని

రాక్షసేంద్రుఁడు కదియంగ రావణుండు

30.   

 

 

 

ఆ.వె.

చేర రావణుండు శీఘ్రమ మారీచుఁ

డు విధివంత మంత సవినయమ్ము

సర్వ కామముల భృశముగ నమానుష

ములను బూజ సేసి లలితముగను

31.    

 

 

 

.వె.

భోజనాదులు స్వయముగ నుదక మొసంగి

యర్థ వంతములుగ నడరు గిరలు

హితము లొసఁగఁ బల్కె నిట్లు మారీచుండు

నా దశానను గని మోదమునను

32.   

 

 

 

ఆ.వె.

రాజ! లంక యందు రాక్షసేశ్వర! యెల్లఁ

గుశలము గద తిరిగి కోరి యిటకు 

మించి తూర్ణ మరుగు దెంచితే యెట్టి కా

ర్యమ్ము కలిగె  సంశయమ్ము సెలఁగె   

33.   

 

 

 

కం.

అన నిట్లు మహా తేజుఁడు

ఘనుండు మారీచుఁడు దశకంఠుం డంతన్

విని వాక్య కోవిదుఁడు వ

ల్కె నిట్లు తన హితము గోరి గిరలను బెలుచన్

34.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు ముప్పది యేనవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 36.

 

 

 

రావణుఁడు మారీచునకు జనస్థాన వృత్తాంత మెల్ల వివరించి సీత నపహరించుటకుఁ దనకుఁ  దోడ్పడు మని యా విధము వివరింప మారీచుఁడు విహ్వలుఁడై వచింపఁ దొడఁగుట.  

 

 

 

 

కం.

తోరం బార్తుఁడఁ దండ్రీ!

మారీచ! నుడివెద వినుమ మాటల నెల్లం

బార విహీ నార్తున కీ

వే రుచిర శరణ్యుఁ డౌదు విప్పుడు నాకున్    

1.      

 

 

 

ఉ.

మానుగ నేరు దీవు గద మాన్య! మదీయ జఘన్యుఁ డా ఖరుం

డే నియమింప దూషణుఁడు నింపుగఁ గూడ వసించుటన్ జన

స్థానము నందు దీర్ఘ భుజ సత్వుఁడు శూర్పణ ఖానుజాతయున్

మానవ భోజి యా త్రిశిర మాన్య వరాఖ్యుఁడు నన్య రాక్షసుల్  

2.     

 

 

 

ఉ.

శూర వరేణ్య సంచయము సుస్ఫుట విస్తృత లబ్ధ లక్ష్యులున్

ఘోర నిశాచ రోత్కరము ఘోర వనాంతర మందుఁ దిర్గుచున్

వారక ధర్మ చారులకు బాధ లొసంగుచుఁ దాపసాలికిన్

మూరి వసింతు రెల్ల రటఁ బూని మదాజ్ఞ నిరంతరమ్మునున్

3.     

 

 

 

తే.గీ.

భీమ కర్ములు పదునాల్గు వేవు రసురు

లుగ్ర శూరులు గురిఁ బడయు ఘన నైపు

ణులు ఖ రాను వర్తులు బల్లిదులు ఖర సహి

తమ్ము రాము నెదిర్చి రస్త్ర తతి నాజి

4.     

 

 

 

ఆ.వె.

పరుష మింత యేనిఁ బలుక కున్నను రోష

మూని రాముఁ డపుడు యుద్ధ భూమి

యందు ధనువు నూని యత్యుగ్రము విడిచె

బాణ సంచయమ్ము వారకుండ     

5.     

 

 

 

ఆ.వె.

ఘోర కర్ము లసుర వీరులు పదునాల్గు

వేవురు హతు లైరి భీక రాజి

నొక్క పదగు చేత నుగ్ర తేజులు మాన

వుని వలన నకట శర నిశితముల

6.     

 

 

 

ఆ.వె.

ఖరుఁడు నిహతుఁ డయ్యెఁ గయ్యమ్ము నందు దూ

షణుఁడు పతితుఁ డయ్యె సమసెఁ ద్రిశిరుఁ

డనినిఁ దనరె నిర్భయమ్ముగ దండకా

రణ్య మిప్పు డింక రామ మహిమ        

7.     

 

 

 

కం.

పితృ వర్జితుండు రాముఁడు

సతి సీతం గూడి క్షీణ సత్వుఁ డసుర సై

న్య తతి వినాశకుఁ డవనీ

పతి కుల పాంసనుఁడు రోష వద్ధృదయుండై      

8.     

 

 

 

ఉ.

చెడ్డ గుణమ్ములం దనరు చేష్టల వాఁ డజితేంద్రియుండునున్

దొడ్డగఁ గర్కశత్వ నిశితుండును లుబ్ధుఁడు మూర్ఖ మానసుం

డడ్డము నిల్చు ధర్మమున కంతము లేక యధర్మ చిత్తుఁడై

గడ్డుగఁ బ్రాణి కోటి కపకార మొనర్చును  రాఘవుం డిలన్   

9.     

 

 

 

ఉ.

ఎవ్వని యాజ్ఞ వైర మొక యింతయు లేక బలంపు టుద్ధతిం

జివ్వున కర్ణ నాసికలు సీల్ప విరూపము నందెఁ జెల్లియే

యవ్వసుధాప నందనుని యాలిని సీతను దత్ప్రదేశ మం

దవ్వనితా మణిన్ సుర సు తాభను దెచ్చుట కిమ్ము సాయమున్

10.    

 

 

 

ఆ.వె.

సాయ ముండ నీవు సరసన నుండంగ

సోదర సహితమ్ము  సురల నైన

రణమున గణియింప రాక్షస! తోడ్పడఁ

గా సమర్థుఁడ వయ! కరము నాకు      

11.    

 

 

 

తే.గీ.

యుద్ధ మందైన వీర్యంపు టుబ్బు నందు

నైన లేరు నీ కిల సాటి యరయ నెందు

శూరుఁడవు నుపాయమ్ముల నేరు దీవు

సర్వ మాయల గొప్ప విశారదుఁడవు     

12.    

 

 

 

కం.

వచ్చితి నందుల కిత్తఱి

నిచ్చట కేను క్షణదాచరేంద్రా! వినుమా

చెచ్చెర నీ చేయు పనిని

మెచ్చు గతి నొనర్ప నీవు మీఱి వచింతున్   

13.    

 

 

 

తే.గీ.

కాంచన మృగమ్ము వెండి చుక్క లడరంగఁ  

గాయ మందెల్ల నందముగ నయి నీవు

రాఘవుని యాశ్రమము నందు రమణి సీత

కెదురుగఁ జరింపు మిటు నటు నింపు గొలుప      

14.    

 

 

 

కం.

కని నిను మృగ రూపమ్మున

వనితామణి సీత ప్రీతిఁ బతినిన్ సౌమి

త్రినిఁ గొని రండని తాఁ బ

ల్కును నిస్సంశయముగఁ గడు లోలత్వమునన్

15.    

 

 

 

ఆ.వె.

చూచి వారు చనిన శూన్యంపు టాశ్రమ

మందు నున్నసీత నపహరింతుఁ 

గనక నెట్టి బాధ కమనీయముగఁ జంద్ర

కాంతి రాహు వడరి కైకొను గతి

16.    

 

 

 

తే.గీ.

విగత భార్యుఁడై మసలెడు మగని నా ర

ఘు తనయుని రాఘవేంద్రుని ఘోర తప్తు

నంత నడరి కృతార్థుండనై సుఖముగ

నాతనిఁ బ్రహరింపఁ గలను వీత వీర్యు

17.    

 

 

 

ఆ.వె.

అట్లు రామ నామ మాలకింప మహాత్ము

వక్త్ర మెండె నంతఁ బరమ తప్తుఁ

డయ్యె డెంద మందు నత్యధికముగ మా

రీచుఁ డడలి కరము చూచు చుండ   

18.    

 

 

 

తే.గీ.

ఎండిన పెదవులఁ దడుపు చుండి యార్తి

నేత్రములు మూయక సురల నిభము నిలిచి

మరణ మందిన భంగిని మాట లుడిగి

చూచు చుండెను రావణుఁ జోద్యముగను    

19.    

 

 

 

కం.

పరమ విషణ్ణ హృదయుఁడై 

కరములు మోడ్చి యెఱుగంగఁ గాకుత్స్థు బల

మ్ము రుచిర పరాక్రమము వని 

గిర లుభయ హితమ్ములు బలికెను నమ్రుండై   

20.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు ముప్పది యాఱవ సర్గము.

అరణ్య కాండము

సర్గము 37.

 

 

 

రావణుని మాటలను విని మారీచుఁడు రాముని గుణ గణములు పరాక్రమమును, సీతాదేవి సద్గుణములను వివరించి సీతాపహరణపు టాలోచనను విరమింపు మని వేఁడుట.  

 

 

 

 

కం.

విని రాక్షశేశ్వరుని గిర

లను మారీచుండు వాక్య లావణ్యుం డం

త నిశాచరేంద్రు వీక్షిం

చి నయమ్ముగ బదు లొసంగెఁ జింతించి యిటుల్   

1.      

 

 

 

తే.గీ.

ప్రియములను బల్కు పురుషులు వింత కాదు

సులభముగ దొరకుట రాజ! పలుకు లప్రి

యములు నైనను క్షేమము లత్యధికము

దొరక ననువారు వినువారు దుర్లభు లిల     

2.     

 

 

 

తే.గీ.

చారుల నియమింపక కడు చపలుఁడ వయి

యెఱుఁగ కుంటి వకట వరుణేంద్ర నిభుని

రాఘవుని మహా వీర్యుని రాముని గుణ

ధాముని నిశాచరేశ్వర! తథ్యముగను    

3.     

 

 

 

చం.

కలుగును గాక క్షేమ మిలఁ గౌణప కోటికి సంతతమ్మునుం

జెలఁగి యొనర్పకుండు రఘుసింహుఁడు భూమి నరాక్షసమ్ముగా

నిల జనియింప లేదు గద యిజ్జన కాత్మజ నీకు మృత్యువై

కలుగవు గావె కష్టములు కాంత నిమిత్తము నాకు నిత్తఱిన్

4.     

 

 

 

తే.గీ.

నాశనము కాదు గద లంక  నాథుని నిను

బడసి కామ వృత్తాధిపుఁ గడు నిరంకు

శుని సరాక్షసముగ ఘన శూరు నిన్ను

గూడి సర్వము రావణ! ఘోరముగను     

5.     

 

 

 

ఆ.వె.

నిన్నుబోలు నట్టి నిర్గుణుఁ డతి కామ

వృత్తుఁ డయిన రాజు స్వీయ జనుల

రాష్ట్రమును దనను విలయ మొనరించు దు

ష్టముగ మంత్రితుఁ డయి సత్వరముగ         

6.     

 

 

 

చం.

జనక పరిచ్యుతుం డనఁగ జాలము రాముని మేర దాఁటఁ డె

ప్డు నృవర పాంశనుం డనఁగ మూర్ఖము లుబ్ధుఁడు కాడు శీల మం

దును జెడుఁ గాంచ మెన్నఁడును దుర్గుణ వంతుఁడు కాఁడు సూడఁగాఁ  

జన దనఁ జేత నాహితము సల్ప రతుం డని  రాఘవేంద్రునిన్     

7.     

 

 

 

కం.

వీసము గాంచము తీక్ష్ణతఁ

గౌసల్యానంద వృద్ధి కారకుఁడు సుమీ

దోసము లెంచఁగ జాలము

భాసుర గుణ రాసు లందు భాసిల్లు ధరన్                     

8.     

 

 

 

ఆ.వె.

సత్యవాదిగా దశరథునిఁ దండ్రినిఁ

గైక సేసి నట్టి కపట మందు 

రగులు వానిఁ జేయ రాముఁ డరుగుదెంచె

ధర్మ రతుఁడు వనికిఁ దండ్రి! వినవె     

9.     

 

 

 

కం.

జననికిఁ గైకేయికిఁ బ్రియ

మొనరింపఁ దలంచి తండ్రి కురువుగ రాజ్య

మ్మును భోగమ్ములను విడిచి

వనమ్మునకు వచ్చె నతఁడు వడి దండకకున్       

10.    

 

 

 

ఆ.వె.

కర్కశుండు కాఁడు కాఁ డవిద్వాంసుఁడు 

నెన్నఁ డేనియు నజితేంద్రియుండు

కాఁడు దుశ్శ్రుతమ్ము నాడ నసత్యము

వలుక నివ్విధమ్ము భావ్య మగునె     

11.    

 

 

 

కం.

రాముఁడు ధర్మాకారుం

డీ మహిలో సత్య విక్ర  మేద్ధ తనుఁడు స

ర్వామర నాథుని భంగిన్

భూమీశుఁడు లోకములకుఁ బుణ్యాత్ముండున్   

12.    

 

 

 

ఆ.వె.

జానకీ సతిని నిజప్రభావ సు రక్షి

త రఘురామ పత్నిఁ దస్కరింప  

నకట కోరు దెడఁద  నాదిత్యు ప్రభను గ్ర

హింప నక్కజముగ నెంచు నట్లు   

13.    

 

 

 

తే.గీ.

అమ్ము లెన్నఁగ మంటలై యడరు చుండ 

విల్లు కత్తులు కట్టెలై వెలుఁగు చుండ

రాముఁ డను నిప్పు గొప్పగ రగులు చుండఁ 

జొరఁబడంగఁ దగదు నీ కసురవరేణ్య!   

14.    

 

 

 

చం.

ధనువు ముఖమ్ముగాఁ బరఁగఁ దద్ద శరమ్ములు వహ్ని కీలలై

తనరఁగఁ జాప బాణ ధరు దస్య వరూథినిఁ జంపు వాని రో

షుని ఘను రామ నామ యము శూర! సుఖమ్మును స్వీయ రాజ్యముం

దనువును వీడి మార్కొనఁగఁ దల్చుట యుక్తము కాదు నాయనా! 

15.    

 

 

 

ఆ.వె.

అప్రమేయ తేజుఁ డా రాముఁ డాతని

చాప మాశ్రయించి చను జనక సు

తను హరింప శక్తి దశకంఠ! నీ లోన

లేదు నిక్క మెంచ వాద మేల    

16.    

 

 

 

ఆ.వె.

నిత్య మనుసరించు నిజపతి నరసింహు

సింహవక్షు వీర శేఖరుని ప్రి

యతర మైన దార యసువుల కన్న మి

న్న యగు నాతనికి ననయము  సీత

17.    

 

 

 

తే.గీ.

రాఘవునకు నోజస్వికి మేఘ వర్ణు

నకుఁ బ్రియతరంపు భార్య యనల శిఖా ని

భము వెలుంగు  సుమధ్యను  రమణిఁ దాఁకఁ

గా నశక్తుండ వీవు రాక్షసవరేణ్య!        

18.    

 

 

 

కం.

అసురేంద్ర వ్యర్థపుఁ బనిని

వెసఁ జేయఁ దొడంగు దేల విడువుమ భీమం

పు సమరమం దతఁడు కనినఁ 

బస చెడ నంత మగు నీకు బ్రతు కిఁక ధరలో       

19.    

 

 

 

కం.

విను జీవితమ్ము రాజ్య

మ్మును సుఖములు దుర్లభములు పుడమినిఁ గాంచన్

మన నెంచినఁ జిరకాలం

బొనరుప కప్రియము సుంతయును రామునకున్ 

20.   

 

 

 

చం.

సచివుల నా విభీషణుని సర్వులఁ జక్కఁగ సంప్రదించి నీ

వుచిత విధమ్ము నిశ్చయము నోర్మి నొనర్చి గు ణాగుణమ్ములం

బ్రచురత నెన్ని నీ బలము రామ బలమ్ము హితం బపథ్యముల్

రుచిరముగా గణించియు నలోలతఁ గార్యము నిశ్చయింపుమా

21.    

 

 

 

కం.

నే నెంచను యుక్తం బని

వానినిఁ గోసల కుమారు బవరమునఁ గనన్

నా నుడులను యుక్తములను

మానుగ వినుమా తిరిగి క్షమములన్ శ్రద్ధన్

22.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు ముప్పది యేడవ సర్గము.

 

 

అరణ్య కాండము

సర్గము 38.

 

 

 

మారీచుఁడు మున్ను రాముని వలనఁ దనకుఁ గలిగిన విపత్తు నెల్ల వివరించి యాతని శౌర్య పరాక్రమములను వర్ణించి రామునితో యుద్ధము సేసినఁ గలుగు దుష్పరిణామములను వివరముగాఁ దెలుపుట.  

 

 

 

 

చం.

మును భువిఁ దిర్గుచున్ బలము మూర సహస్ర గజోగ్ర తుల్యమై 

ఘన గిరి సన్నిభం బసిత కజ్జలవర్ణ శరీర ధారి నే

వనమున స్వర్ణ కుండల విభాసిత రత్న కిరీట ధారినై 

జనులకు దండకా తటి నొసంగుచు భీతిని మిక్కుటమ్ముగన్  

1.      

 

 

 

తే.గీ.

కరమునఁ బరి ఘాయుధ మూని కాన లోన

సంచరించుచు సతము భక్షించుచు ముని

మాంస మాశ్రమమ్ములను విధ్వంస మడరి

చేయు చుంటి వీర్యమున నమేయముగను

2.     

 

 

 

తే.గీ.

చాల కలఁగి విశ్వామిత్ర సన్మహర్షి

నా వలన దశరథ నరనాథు కడకు

నేఁగి స్వయముగ మారీచుఁ డిచ్చు చుండె

బాధలను బర్వముల నంచుఁ బలికి యంత   

3.     

 

 

 

ఉ.

రాముఁ డొసంగు రక్షణము రాజ యనంగను ధర్మచిత్తునిన్  

భూమి విభుండు గాంచి ముని పుంగవుఁ బంక్తి రథుండె యిట్లనెన్

రాముఁడు ద్వాదశాబ్దుఁడు ధరం బసివాఁ డకృతాస్త్రుఁ డెన్నఁగా  

నీ మ దనీకముం గలసి  యింపుగ వత్తును దాపసేశ్వరా!

4.     

 

 

 

ఆ.వె.

వచ్చి స చతురంగ బలము స్వయమ్ముగ

మునివరేణ్య నీవు మనము నందుఁ

గోరు వారి నెల్ల ఘోర రాక్షసుల వ

ధింతు నీ రిపులను వంత వలదు

5.     

 

 

 

కం.

అన విని ముని రాజున కనె 

జననాథ! జగములలో నిశాచరుఁ జంపన్

ఘనుఁ డీ రాముఁడు తక్కన్ 

విను మన్యులు చాల రాజి వీరవరేణ్యుల్    

6.     

 

 

 

ఆ.వె.

పుడమి ధవ! విదితము ముల్లోకములకు సు

రలకు నీయ నెంచి రక్ష కర్మ

మింపుగఁ దివిరి యొనరింపఁగ దశరథ!

నీవు విక్రమమ్ము నెగడ మున్ను

7.     

 

 

 

ఆ.వె.

ఉండ నిమ్ము గొప్ప దండు నిచటఁ బరం

తప! సమర్థుఁ డౌను దద్ద బాలుఁ

డైనను ఘన తేజుఁ డాపంగఁ గొని పోదు  

రాము నింక నీకు క్షేమ మగును     

8.     

 

 

 

తే.గీ.

ఇవ్విధ మని విశ్వామిత్రుఁ డేఁగె రాజ

నందనుని గొని సంప్రీతి నంది చిత్త

మందు స్వీయాశ్రమమునకు నంత యజ్ఞ

దీక్షితుం డయ్యె దండక స్థిరపు టెడఁద    

9.     

 

 

 

ఉ.

యాగము కావ నిల్చెను మహాధను వూని సరోరుహాక్షుఁడే 

బాగుగ రాని మీసముల బంగరు హారము తోడ నేక వ

స్త్రాగణితప్రభా రఘు కులాఢ్యుఁడు నింపుచు దండ కాటవిన్ 

వేగమ స్వీయ తేజమును వెల్గెను బాల శశీంద్రు భంగినిన్   

10.    

 

 

 

ఉ.

వచ్చితి మేఘ సన్నిభుఁడ బంగరు కుండలముల్ వెలుంగ నే

నచ్చపు బల్లిదుండను వరాలి నిమిత్త మహోగ్ర దర్పుఁడం

జెచ్చెర నాశ్రమమ్మునకుఁ జేవ సెలంగఁగ సాయుధుండనై 

యచ్చటఁ గాంచి నన్నతఁడు నస్త్రము సజ్యము సేసి నిల్వఁగన్     

11.    

 

 

 

తే.గీ.

మోహమున నేరక బలము ముద్దు లొలుకు

బాలుఁ డంచు విశ్వామిత్రు  పరమ వేది

క పయికి వడి దూఁకఁ దొడఁగఁగా నతండు

శత్రు చయ నిబర్హణుఁ డంత శరము విడువ    

12.    

 

 

 

ఆ.వె.

తగుల బాణ మంత నెగిరి నే నంబుధి

తీర మందుఁ గూలితి వడి వంద

యోజనముల దూర మొక్కయుమ్మడి రామ 

శర రయమునఁ దెలివి సన్నగిల్ల     

13.    

 

 

 

ఆ.వె.

చంప నెంచ కున్న సంరక్షితుఁడ నైతి

వీర వరుని చేత వారినిధినిఁ

గూలఁ దెలివి నంద మేలుగఁ బెద్ద త

డవున కంత లంక డాసితి వడి

14.    

 

 

 

ఆ.వె.

అస్త్ర విద్య నింక నధికముగా నభ్య

సింప నట్టి వాని చేత సులభ

కర్ముఁ డైన యట్టి కాకుత్స్థుచే ముక్తుఁ

డను సహాయు లెల్లరును సమసిరి    

15.    

 

 

 

ఉ.

ఆపఁ బడంగ నా వలన నాఁగక రామ విరోధ మెన్నఁగా

నాపద లందుఁ జిక్కఁ గల వత్యధికమ్ముగ రాక్షసేశ్వరా!

యేపుగ భోగ లాలసుల కింకను బర్వ ర తాసు రాలికిం

దాపము లింకఁ గీడులను దప్పక యిత్తువు నమ్ము రావణా!      

16.    

 

 

 

తే.గీ.

సౌధ పంక్తుల విలసిల్లు  సర్వ రత్న

భూషితమ్మును లంకను బురము నింకఁ

గాంచఁ గల వీవు నాశము గాఁగ జాన

కీ నిమిత్త మక్కట మూఁడఁ గీడు భృశము    

17.    

 

 

 

తే.గీ.

పాపములు సేయ కున్నను బాప సంశ్ర

యమ్మున శుచులు నన్య కృతాఘ రాశి

వలన నశియింతు రెట్లనఁ బాము లున్న

కొలను లోని మత్స్యమ్ములు కూలు నట్లు

18.    

 

 

 

ఆ.వె.

మంచి లేపనముల మించు దివ్యాభర

ణ ఘన భూషితులను నాశమై ప

డఁగ ధరాతలమున విగతాసువులఁ గాంచఁ

గలవు  నీదు దోషముల నసురుల  

19.    

 

 

 

కం.

హృత దారల సహ దారల

హత శేషుల నశరణుల మహాసుర గణ సం

తతి వీక్షింతువు దశ కం

ఠ! తాపము సెలంగ మిక్కుటముగ నెడందన్     

20.   

 

 

 

కం.

శర జాలమ్ము కురియ ని

ప్పు రవల నట గ్రక్కు చుండి పుర గృహములు బా

సురముగఁ గాలఁగ లంక న

సురేంద్ర వీక్షింతు వీవు సూ నిక్కముగన్

21.    

 

 

 

కం.

పర దారగ్రహణమున క

తిరిక్త పాపమ్ము లేదు దేవేరు లహో

పరగుఁచు నుండ సహస్రము

లు రాక్షస వరేణ్య! నీకు లోలత యేలన్     

22.   

 

 

 

ఆ.వె.

నీదు భార్య లందు నిరతి నుంచుమ రక్ష

నిడుమ రక్కసులకు నింపుగ ధన

మాన రాజ్యములకు మానుగ నీ ప్రియ

జీవితమున కసుర శేఖర! యిఁక    

23.   

 

 

 

కం.

దారల సౌమ్యల మిత్రుల

నారసి మనఁ దలచినఁ జిర మానందముగా

నా రామున కప్రియముల

నే రీతినిఁ జేయ కయ్య! యెన్నం డైనన్     

24.   

 

 

 

కం.

యమ సదనమ్మున కేఁగుదు

రమణికి సీత కిడ బాధలను నా గిర లిం

క మది వహింపక శర జా

లమున సబాంధవ మణంగి  రాముం డేయన్      

25.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు ముప్పది యెనిమిదవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 39.

 

 

 

మారీచుఁడు మరణమును దప్పించుకొని లంక నుండి దండకారణ్యమునకుఁ జేరి తిరిగి తాను వర్తించిన వృత్తాంతమును దెలిపి రామునకు నెగ్గుఁ జేయ విరమించుకొను మని రావణునకు హితబోధ సేయుట.

 

 

 

 

కం.

అని యివ్విధి మారీచుఁడు

వినుమ బదు లిడక జరిగిన వృత్తాంతమ్ముం

గన విడుదల నెట్టులొ  నే

నని దాని వచింతు నీకు నని యిట్టు లనెన్    

1.      

 

 

 

ఆ.వె.

అంత ధైర్య మూని యసుర వరేణ్యుల 

జింక రూప ధరుల స్నేహితులను

గూడి వారి తోడఁ గూర్మి వచ్చితి దండ

కా వనమున కేను జేవ మీఱ

2.     

 

 

 

చం.

తిరుగుచు దండకావనిని దీప్తపు జిహ్వయు తీక్ష్ణ దంష్ట్రముల్

పరఁగఁగ దీర్ఘ కాయుఁడను భైరవ సన్మృగ రూప ధారినై  

స్థిరముగ నగ్ని హోత్రములఁ దీర్థము లందును వృక్ష జైత్య పం

క్తి రతి మునివ్రజమ్ములను దిప్పలు వెట్టుచు మిక్కుటమ్ముగన్

3.     

 

 

 

ఆ.వె.

చంపి తాపసులను సద్ధర్మ చారుల

మాంస రక్తములను హింసఁ గ్రోలు

చుఁ గడు క్రూరముగ ఋషులను బీడించుచు

నెత్తు రాని యైతి మత్తుఁడ నట     

4.     

 

 

 

ఆ.వె.

ధర్మ దూషకుండఁ దద్దయు నవ్విధి

మూరు చుండఁ బురుష పుంగవుఁ డగు

రాముని ముని వేష రమ్య తనుని సీత

నింక లక్ష్మణుఁ గని యిద్ధ బలుని      

5.     

 

 

 

ఉ.

తాపసు సర్వ భూత రతుఁ దద్రఘు సూను వనాగ తార్యునిం

దాపసుఁగాఁ దలంచియు మితమ్ముగ భోజన మారగింపఁగా

వే పరువెత్తి శృంగములు పెద్దగ నున్న మృగాకృతిన్ రుషన్

భూపతి పుత్రు వీర్యమును బూర్వము గాంచ స్మరించి మార్కొనన్  

6.     

 

 

 

తే.గీ.

వాని బలము మఱచి పూర్వ వైర మెంచి

నెగ్గ నెంచి మునుపు దెబ్బ నేఁ దలంచి

యతఁడు విల్లునెత్తి రిపు లయంపు నిశిత

శరము లేయ మూటిని రాముఁడు  రవ మడర

7.     

 

 

 

తే.గీ.

వజ్ర సన్నిభమ్ములు రామ బాణములు సు

ముక్తములు రక్త భోజనము లగు  మూడు

నరుగుదెంచెఁ బెన్ముడులతో నంతఁ బాఱ

నే నసురు లిద్దఱు సమసి నేలఁ బడిరి  

8.     

 

 

 

తే.గీ.

రామ బల మెఱిఁగిన వాఁడ భీమ భయము

నంది పాఱఁగ బ్రతికితిఁ బొంది జీవి

తమ్ము నిట కేఁగు దెంచితిఁ దాపసుని వి

ధమ్ము బ్రతుకఁ జాగితి నే శమమ్ము నూని       

9.     

 

 

 

చం.

తరు తరు లందు నా యజిన ధారిని నారల నూను వానినిన్   

వర ధను వూని హస్తమునఁ బాశముతో యము భంగి  నున్న యా

నరవరుఁ గాంచు చుంటిని ఘనమ్ముగ భీతి చెలంగ రాము నే

నరయుచు వేల రాములుగ నంతట రామ మయంబుగా వనిన్  

10.    

 

 

 

ఆ.వె.

రాముని సతతమ్ము రాక్షసాధిప! కను

చుంటి నిందు నందు  నొంటరి నడ

రినఁ గల నయినను విరివిగ సంభ్రమమునఁ

జేతనమ్ము చెదర చింత తోడ     

11.    

 

 

 

ఆ.వె.

రామ భయము మీఱ రావణ! విన్న ర

కార ముండ మొదలు మూరు వస్తు

రాసుల నరయంగ రత్నము రథము ము

న్నగున వెల్ల నెదఁ గలుగు భయమ్ము       

12.    

 

 

 

కం.

నే నెఱుఁగుదు మిక్కుటముగ 

వాని ప్రభావమ్ము తగదు భండన మెన్నం

డా నరవర రామునితోఁ

దాను బలి నముచుల నైనఁ దథ్యము చంపున్   

13.    

 

 

 

కం.

వలసిన రామునితో ననిఁ

జలుపుమ లేదేని యింక క్షమియింపంగాఁ

దలఁపుమ నం గన నెంచిన

వలదీ రఘు రామ కార్య వాంఛయె నీకున్   

14.    

 

 

 

ఆ.వె.

ధర్మ మందు సంతతమ్ము దనరు వా ర

నేకు లన్య జనులవౌ కృతాప

రాధములఁ జెడుదురు రావణ! భార్యా కు

మార బంధు యుతము మంచి వారు

15.    

 

 

 

ఆ.వె.

అట్టి నేను వినుమ యపరాధ మీ వొన

రింప వే నశింతుఁ గంప మడర

నీకుఁ దోచినదియ నీ వొన రింపుమ

యనుగ మింప నిప్పు డసుర వర్య!

16.    

 

 

 

తే.గీ.

రాముఁ డిల మహా తేజుఁడు భీమ బలుఁడు

కోపి  గాకుండు గాక కాకుత్స్థుఁ డసుర

లోకమున కంతకుండును భీకరముగఁ

గాక యుండును గాక రాక్షసవరేణ్య!    

17.    

 

 

 

తే.గీ.

శూర్పణఖ నిమిత్తమ్మునఁ జూవె ఖరుఁడు

తజ్జనస్థాన వాసుఁడు ధర్మ రహిత

మట నతిక్రమింపఁగ రాముఁ డపు డతనినిఁ

గూల్చె నక్లిష్ట కర్ముఁడు ఘోరపు టని   

18.    

 

 

 

కం.

పలుకుమ యున్నట్టి విధము 

పలలాశన వర్య! యచటఁ బరఁగిన దానిం

దలఁపఁగ రామాతిక్రమ

మల కలదే యిందుఁ జెపుమ యావంతైనన్

19.    

 

 

 

కం.

వినకున్న నీవు నాదు వ

చనములు బంధు హితములను జక్కఁగ దశకం

ఠ! నశింతు సపరివారం

బని రా మాజిహ్మ శర చయమ్మున నిపుడే!  

20.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు ముప్పది తొమ్మిదవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 40.

 

 

 

యుక్తము లైన మారీచుని పలుకల నాదరింపక రావణుఁడు రాజుగా నతని నాజ్ఞాపించి చేయ వలసిన పనిని వివరముగా నుడివి చేయనిచో వధింతు నని భయపెట్టుట.

 

 

 

 

కం.

యుక్తములు సమర్థమ్ములు

రక్తిన్ మారీచుఁ డనఁగ రావణుఁడు నిరా

సక్తుఁడు దా నొల్లఁడు రు

గ్యుక్తుఁడు తగు నౌషధమును గొనని విధముగన్   

1.      

 

 

 

కం.

ఘన యుక్త భాషణోక్తునిఁ

గని మారీచు నపుడు దశకంఠుఁడు పరుషం

పు నుడులు రాక్షస నాథుం

డనెఁ గాల సుచోదితుఁడు భృ శాయుక్తములన్   

2.     

 

 

 

చం.

పలికితి తాటకేయ! కడు వ్యర్థ వచస్సు లయుక్త రీతి ని

ష్ఫలములు మిక్కుటమ్ముగను బాతిన బీడుల యందు విత్తన

మ్ముల వలెఁ బాప శీలుఁడును మూర్ఖుఁడు రాముఁడు మానుషుండు మి

క్కిలి యసమర్థుఁ డౌను బరికింప జయింపఁగ నన్ను నాజిలో           

3.     

 

 

 

చం.

విడిచి స్వ రాజ్యమున్ సఖుల వింతగ మూర్ఖతఁ దల్లిదండ్రులం

బడతికి వాక్య బద్ధుఁ డయి ప్ర్రాకృతు భంగి వనమ్ముఁ జేరెనే

కడు వడి నా ఖ రాంతకునిఁ గయ్యము నందు వధింపఁగా వలెన్

నడవగ ముందు నీవు రఘునాథు సతిన్ హరియింపఁగా వలెన్   

4.     

 

 

 

ఉ.

తోఁచెను నిశ్చయంపు గతి దొడ్డఁగ నాదు మనమ్ము నందు మా

రీచ! మరల్ప నేరికినిఁ బృథ్వి సురాసుర సేంద్ర కోటికిన్

వేఁచిన న న్నసాధ్య మిఁకఁ బృష్టుఁడ వైన గుణాగుణమ్ములం

బ్రోచు విధమ్ములం దెలుప మూరి వచింపఁగ నొప్పు నీ కిటుల్       

5.     

 

 

 

ఆ.వె.

వృద్ధి నెంచిన మది విబుధులు ప్రశ్నింప

రాజు చెప్పఁ దగు నిల మృదువుగను  

బ్రాంజళు లయి సచివ వర్యు లప్రతికూల

ములు వచింప వలయు మూర వినతి   

6.     

 

 

 

తే.గీ.

మాన హీనముగ మహావమర్దముగను 

హితము లైనను  మారీచ వితతముగ వ

చింప భాషణములు సంతసింపఁ డెట్టి

రాజు మానార్హుఁడు ధరాతలమ్ము నందు  

7.     

 

 

 

తే.గీ.

రూపు లైదింటిని ధరించు భూపవరుఁ డి

ల నమితౌజసుండు య మానల వరు ణేంద్ర

చంద్ర రూపమ్ములను దండ సంజ్వర ప్ర

సన్నతా విక్రమమ్ములు  సౌమ్య మడర    

8.     

 

 

 

కం.

కాన మహాత్ములు పార్థివు

లో నక్తంచర! భృశంపు టున్నతి వారెం

దేని యవస్థల మాన్యులు

నై నిత్యము పూజనీయు లౌదురు వింటే

9.     

 

 

 

ఆ.వె.

ఆడెదవు పరుషము లభ్యాగతుని తోడ

దుర్మనమునను గుణ దోషముల న

డిగితినె నిను హిత మడిగితినె యమిత వి

క్రముఁడ! నా యడిగిన కార్య మూను  

10.    

 

 

 

ఆ.వె.

ఎలమి నుత్తమంపు టిక్కార్య మందు సా

హాయ్యము నొనరింపు మయ్య వినుమ

యయ్య దెట్టి దనిన నెయ్యము తో నా వ

చనము లెల్ల నిపుడు చక్కఁగాను

11.    

 

 

 

తే.గీ.

కాంచన మృగమ్ము వెండి చుక్క లడరంగఁ 

గాయ మందెల్ల నందముగ నయి నీవు

రాఘవుని యాశ్రమము నందు రమణి సీత

కెదురుగఁ జరింపు మిటు నటు నింపు గొలుప      

12.    

 

 

 

కం.

కని మాయా మృగమును గాం

చనమును విస్మయము నంది జానకి నిన్నున్

వనితా రత్నం బంతఁ బ

తిని రాఘవు క్షిప్ర మడుగుఁ దెమ్మని ప్రీతిన్

13.    

 

 

 

కం.

పాసిన రాముఁడు దూరము

వాసిగ మారీచ! రాము స్వరమున నిట్లున్ 

హాసీతా హాలక్ష్మణ

గాసిల జానకి యఱవుమ కలవర మీయన్

14.    

 

 

 

ఆ.వె.

సంభ్రమించి యంత సౌమిత్రి తా విని

సీత ప్రేరణమ్ము సెలఁగ మిగుల

రామ మార్గ మెంచి రయమున నేగంగఁ 

దొడఁగుఁ బ్రేమ చేతఁ దూర్ణముగను

15.    

 

 

 

కం.

వెడలంగ రామ లక్ష్మణు

లడరి యడలి యపహరింతు నవనిజ నంతన్

వడి సుఖ మేపారఁగ నిం

ద్రుఁ డా శచీ దేవిఁ గొనిన రూపున నసురా!   

16.    

 

 

 

తే.గీ.

ఇప్పని ముగించి వెడలుమ యిష్ట మైన

రీతి నింపుగ నింక మారీచ! యిత్తు

నర్ధ రాజ్యమ్ము సువ్రత! యరుగు గార్య

సిద్ధికిని దండక కిఁక వచ్చెదను వెనుక

17.    

 

 

 

ఆ.వె.

వనిత సీతను గొని వంచించి రాఘవుఁ

జేయ కెట్టి రణము శీఘ్ర మేను

లంకకై వెడలుదు లబ్ధ కాముండనై  

తోడు నీవు రాఁగఁ దుష్టుఁడ నయి   

18.    

 

 

 

తే.గీ.

చేయ కున్న నిప్పని నీవు పాయ కేను

నిన్ను జంపుదు బల్మిని నేను జూతు

నీ వొనర్ప రాజాజ్ఞను నెఱప నట్టి

వారు సుఖియింపక నశింత్రు వసుధ లోన

19.    

 

 

 

తే.గీ.

జీవితము సంశయం బగుఁ జేర నతనిఁ 

దథ్య మగు నెదుర్పఁగ నన్ను ధరణి మృత్యు

వున్న రీతి నెల్లఁ దలంచి యుక్త మైన

దాని బుద్ధి నెఱిఁగి చేయఁ దగుదు వీవు    

20.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నలువదవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 41.

 

 

 

రాజుగా రావణుఁడు మారీచునిఁ బ్రతికూలముగ నాజ్ఞాపింపఁ బరుషములైన వాక్యములతో మారీచుఁడు హెచ్చరించుట.   

 

 

 

 

కం.

ఆనతి నీయ విభునిగ ద

శాననుఁడు విరుద్ధ గతిని నా యసురుఁ డనెన్

వానిం గని మారీచుం 

డూని కినుకను బరుషంపు టుక్తుల నిట్లున్   

1.      

 

 

 

తే.గీ.

పాప కర్మ మమాత్యుల బంధు సుతుల

రాష్ట్ర సంయుతమ్ముగ ఘోర లయపుఁ గార

కమ్ము నొనరింపఁగా సమకట్టి తీవ  

యెవ్వని యుపదేశం బిది యవ్వ చెపుమ

2.     

 

 

 

తే.గీ.

పాప కర్ముఁ డెవ్వఁడు సహింపకయె నీదు

సుఖము నించుక నిజ మనస్సునఁ గపటపు

బుద్ధి నూని మృత్యు ద్వారమునకు నెట్టె        

నెవ్వని యుపదేశం బిది యవ్వ చెపుమ

3.     

 

 

 

ఉ.

తప్పక నీదు శత్రువులు దార్ఢ్యములోఁ గన నీకు హీనులే

యప్పరిపంథు లెల్ల రిటు లాజిని బల్లిదుచే నశింప ని

న్నిప్పుడు గాంతురే యహితు లెవ్వరు స్వీయ కృతమ్ములే నినున్ 

ముప్పుల నింప నిట్లు  ప్రతిబోధన మే రొనరించి రక్కటా   

4.     

 

 

 

ఆ.వె.

చెడ్డ దారి యందుఁ బడ్డ ని న్నాపరు

నీ యమాత్యు లెల్ల హేయ మైన

బుద్ధి నూని తూర్ణముగ వధింపఁ దగిన

వారు కాని చంపఁ బడఁగఁ గనను   

5.     

 

 

 

ఆ.వె.

చెడు గతినిఁ జరించు కడు కామ శీలుని

విభుని మంత్రు లింక విబుధు లెల్ల

రన్ని వేళ లందు నడ్డు కొనఁగ నర్హు

లడ్డుకొనరు వార ణార్హు నిన్ను  

6.     

 

 

 

చం.

సుగతిని ధర్మ మర్థము యశో యుత కామ మమాత్యు లింపుగం

బగతుర జేత లందు వర! పార్థు ప్రసాదముచే గడింతురే

విగత ఫలంబునై చెలఁగుఁ బృథ్వినిఁ దద్వ్యతిరేక మైనచో

నగణిత బాధ లందుదురె యన్యులు దుర్వ్యసనుండు రాజు కాన్     

7.     

 

 

 

ఆ.వె.

రాజు కావలయును రక్షితుం డనయమ్ము

ధర్మ విజయములకుఁ దలఁప  రాజు

వితత మూల మగుట  విజయు లందు వరిష్ఠ! 

స్వీయ మంత్రి గణము చేతఁ గరము

8.     

 

 

 

కం.

పరిపాలింపఁగ రాజ్యము

తరం బగునె రాజ! తీక్ష్ణతను బ్రతికూ లా

వరణములౌ కృత్యములను 

గర మవినీతిం దనరెడు కార్యమ్ములనున్   

9.     

 

 

 

ఆ.వె.

గతిని గుంత లున్న నతిమంద సారథి

తోలు శీఘ్ర హరుల వోలె తీక్ష్ణ

మంత్రము లొనరించు మంత్రులు  నినుగూడి

భ్రష్టు లగుట ధ్రువము రాజ్య మందు     

10.    

 

 

 

కం.

పరుల యపరాధమునన స

పరిచ్ఛదము సాధు జనులు పావన సద్ధ

ర్మరతు లనేకు లిట నశిం

తురు లోకమున నసురేంద్ర! తోరముగఁ ద్వరన్

11.    

 

 

 

ఆ.వె.

వాఁడి కాఁగ స్వామి ప్రతికూల భూపాల

రక్షితు లయి నట్టి  ప్రజలు వర్ధ

నమ్ము నంద లేరు నక్క బారిఁ బడిన

మేక వోలె నో యమిత్ర దమన!    

12.    

 

 

 

కం.

నశియింతు రవశ్యము క

ర్కశుం డయిన రాజు తాఁ బరాజితుఁ డగుచుం 

గృశియింప నింద్రియమ్ముల

భృశ దుష్ట మతిం జరింపఁ గృత నిశ్చయుఁడై   

13.    

 

 

 

కం.

అగపడెను గాకతాళీ

య గతిని ఘోరంపు బాధ యడరుచు నాకున్ 

వగ పేమని నేఁ జెప్పుదుఁ

బగులుదువు స సైన్య మీవు బవరం బందున్     

14.    

 

 

 

ఆ.వె.

రాముఁడు నను జంపి రావణ! నిన్నచి

రమ్ము జంపు ఘన రణమ్ము నందు 

నా కరి కరముల వినాశ మిష్ట మగుఁ గృ

తార్థుఁడ నని తలఁతు నంచితముగ

15.    

 

 

 

ఆ.వె.

రామునిఁ గని నంత రావణ! తప్పదు

చావు నాకు నేరు మీవును జన

క సుత నపహరింపఁగ సబాంధవము  నీదు

మరణ మింక వడి యడరఁ గల దని  

16.    

 

 

 

ఆ.వె.

అవనిజఁ గొనితేర నాశ్రమ మందుండి

నన్ను గూడి యసుర నాథ! నీవు

నేను లంక యేని నిక్కము రక్కసు

లెల్ల రుండ రయ్య! కల్ల కాదు

17.    

 

 

 

కం.

నిను వారింప హితైషిని

వినవు నిశాచర! పలుకులు వింతగ నకటా

వినరు నరులు స్నేహితుల వ

చనమ్ములు పరేత సములు చా వడరంగన్  

18.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నలువది యొకటవ సర్గము.

 

 

అరణ్య కాండము

సర్గము 42.

 

 

 

మారీచుఁడు పలికి యట్లు రావణునితో నేఁగెదమని పలికి యందమైన లేడి రూపము నూని వనములో సీతా దేవి యెదుట చరించు చుండ జానకి చూచి యాశ్చర్యపడుట.

 

 

 

 

కం.

అని దీనుండై యిట్లు వ

చనములు మారీచుఁడు ఘన సంత్రాసముతో

డ నిశాచరా! వెడలెద మ

నెను రావణుఁ గాంచి యంత నిశ్చిత మతియై    

1.      

 

 

 

కం.

కనఁబడఁ గోదండ సశర

ఘనాసి ధారి కటఁ దిరిగి కాకుత్స్థున కే

ను నను వధింపఁగ నెత్తం

గ నాయుధమ్ములు నశింతుఁ గానన మందున్    

2.     

 

 

 

ఆ.వె.

రాముని నెదిరించి రణమున బ్రతుకుఁ బ

డయు టసంభవమ్ము డాసె నిన్ను

గాల దండ హతునిఁ గాకుత్స్థుఁ డన్య య

ముఁ డన నిపుడు నిక్కమును దలంప     

3.     

 

 

 

తే.గీ.

ఇవ్విధి దురాత్మునకుఁ జేయ నేమి కలదు

నాకు వీక్షింప నసురేంద్ర! వీఁక నేఁగు

వాఁడ నయ్య! నిశాచర! భద్ర మింపు

గా నగును గాక యిఁక దశకంఠ! నీకు

4.     

 

 

 

చం.

ముదిత మనస్కుఁ డయ్యె విని ముచ్చట నా వచనమ్ము లెల్ల న

ట్లుదితము కాఁగ రావణుఁడె యుర్వి భయంకరుఁ డంతఁ గౌఁగిలిం

తఁ దనరి చేర్చి గాఢముగఁ దద్దయుఁ బ్రీతి చెలంగ నిట్లనెం

బదిలము మద్వశుండ వయి భాసిలి తన్య పలాశి వీవు మున్   

5.     

 

 

 

చం.

త్వరితము రత్న భూషితము పన్నుగ నెక్కుమ నన్ను గూడియున్

ఖర వరు లీ పిశాచ నిభ కమ్ర ముఖమ్ములు లాగుచుండఁగాఁ

బరమ రథమ్ము జానకికిఁ బన్నుగ లోభము కల్గ జేసి నీ

వరుగు యథేచ్ఛ శూన్యమున నా సతిఁ దెత్తు విదేహ కన్యనున్     

6.     

 

 

 

తే.గీ.

అంత రావణ మారీచు లా విమాన

సన్నిభ రథమ్ము నెక్కి  యాశ్రమ తలమ్ము

నుండి శీఘ్ర తరమ్ముగ నుద్యమించి

వెడలఁగ దొడంగి రిద్దఱు పేర్మి భీతి

7.     

 

 

 

ఉ.

చూచుచుఁ బట్టణమ్ములను శోభిత పర్వత కాననమ్ములన్

లోచన హర్ష దమ్ములు సరోవర  రాష్ట్ర పురవ్రజమ్ములన్ 

వే చని కాంచి రంత రఘు వీర వరేణ్యు వరాశ్రమమ్ము వీ

క్ష్యోచిత దండకా వనిని నుత్సుక రావణ తాటకేయులే   

8.     

 

 

 

తే.గీ.

డిగ్గి స్యందన రాజము నగ్గలముగఁ

గాంచన విభూషితమ్మును గరము నూని

రావణుండు మారీచునితో వచించె

వాక్యముల నివ్విధమ్ముగఁ బడసి ముదము   

9.     

 

 

 

ఆ.వె.

ఆశ్రమంబు గనుమ నరఁటులతో వెల్గు

చుండె నదియ స్నేహితుండ! శీఘ్ర

మడరి మనము వచ్చి నట్టి పనినిఁ జేయ

నుద్య మింపు మయ్య! యుచిత రీతి    

10.    

 

 

 

కం.

విని రావణు నా వచనము

లను మారీచుఁ డసురుండు లలిత మృగపు రూ

పును ధరియించి తిరుగుచుం

డెను రాఘవు నాశ్రమపుఁ దటి విలాసముగన్    

11.    

 

 

 

చం.

లలిత తరాకృతిం దనరె రమ్యత రాద్భుత దర్శనమ్మునున్

వెలయ సి తాసి తాస్య మతి వింత మణిప్రవ రాగ్ర శృంగముల్ 

సలలిత రక్త పద్మ ముఖ చారు తరోత్పల సన్నిభశ్రవ

మ్ములు రుచి రేంద్ర నీల సమముల్ దశనచ్ఛదముల్  విరాజిలన్    

12.    

 

 

 

ఉ.

గ్రీవ మొకింత యున్నతము గెల్చెను గుక్షియె కుంద వజ్ర చం

ద్రావిరళ ప్రభా ద్యుతినిఁ బ్రక్కలు వెల్గె మధూక తుల్యముల్ 

పావన పద్మ కేసర నిభంబులు డెక్కలె యభ్ర రోహముల్  

వావిరి సన్నముల్ మృగపుఁ బాదము లంచిత సంహతమ్ములున్

13.    

 

 

 

చం.

క్షణమున నింద్ర కార్ముక నికాశ సువర్ణ నిజోర్ధ్వ పుచ్ఛమై  

గణిత మనోహ రాభ్ర సమ కాయ మృదుత్వ రుచిప్రభాసమై 

మణిమయ దేహ కాంతుల సమంచిత సన్మృగమై చెలంగి రా

ణ్మణి రఘురాము నాశ్రమము మానుగ నింపెను స్వీయకాంతులన్

14.    

 

 

 

తే.గీ.

వివిధ ధాతు వర్ణమ్ముల వితత దర్శ

నీయ రమ్య రూపమ్ము నూని యసురుండు

లోబినిగఁ జేయ వైదేహి రుచిర శాద్వ

ల వనిఁ దొడఁగెను జరియింప లలితముగను      

15.    

 

 

 

తే.గీ.

వెండి చుక్కలు వందలు వెలయు చుండ

నందముగఁ గన్పడుచు నంత నందు నిందుఁ

జెట్టుల చిగుళ్లు విఱుచుచుఁ జెలఁగి మిగులఁ

బేర్మి విహరింపఁ జాగెను వింత మృగము   

16.    

 

 

 

ఆ.వె.

అరఁటి చెట్ల చెంత కరిగి మంద గతిని

కర్ణికార తరులఁ గదిసి యిటు న

టు తిరుగుచును దడబడుచు సీత దర్శనా

ర్థమ్ము వేచు చుండి సమ్మదమున      

17.    

 

 

 

ఆ.వె.

రమ్య పృష్ఠ ముండ రాజీవ సదృశమ్ము 

మృగ వరేణ్య మపుడు మించ సుఖము

రతిఁ జరించు చుండె రామాశ్రమ పదమ్ము

చెంత వెల్గు లీని సంతతమ్ము    

18.    

 

 

 

మ.

మృగ రాజం బటఁ గొంత దూరము సనున్ మిథ్యా గతిం దిర్గి య

ట్టి గతిం దా మరలున్ ముహూర్తమునఁ బాటింపంగఁ గ్రీడారతిం

దగఁ గూలం బడు నంత భూమి పయిఁ బంతం బూని నిశ్చింత వే

గ గతిం జేరుఁ దదాశ్రమంపుఁ గడపం గాంచున్ మృగవ్రాతమున్   

19.    

 

 

 

తే.గీ.

మృగముల ననుసరించుచు మృగ వ రాకృ

తిఁ దనరుచును మారీచుఁడు తిరిగి వచ్చు

జానకీ దర్శ నార్థము దాను చిత్ర

మండలములఁ దిరుగు చుండు గండు మీఱ         

20.   

 

 

 

ఉ.

చేరును జూచి జింకలను జేరువఁ గన్పడు నన్య జీవులన్

వారక చూచు వాసనను బాఱును దిక్కుల కెల్లఁ బిమ్మటన్

మూరిన నిచ్చఁ జంపి తిను బుద్ధియె చంపఁడు తాఁకి దాఁపఁగాఁ

దోరపు స్వీయ భావమును దుష్ట మనమ్మున రక్కసుం డటన్      

21.    

 

 

 

ఉ.

పూవులు గోయఁ గోరుచును బూర్ణ శశిద్యుతి సన్ని భాస్య సీ

తా వనితా మతల్లి తమిఁ దా నరుదెంచెను బుణ్య నేత్ర యా

పావన పాద పావలినిఁ బన్నుగఁ జేరె నశోక కర్ణికా

రావలి చూత వృక్ష నిచయమ్ముల చెంతకు నంతఁ దిర్గుచున్  

22.   

 

 

 

కం.

వన వాసమున కనర్హ న

లినాక్షి ముక్తామణి సలలిత చిత్రాంగ

మ్మును రత్న మయ మృగమ్మును

వనితామణి సీత గాంచెఁ బరమ ముదమునన్     

23.   

 

 

 

తే.గీ.

రుచిర దంతాధర రమణి రూప్య ధాతు

నిజ తనూరుహమును విస్మయ జని తాంత

రంగ యుత్ఫుల్ల లోచన రాగ మలర

విరియ స్నేహము వీక్షించెఁ బృథ్వి తనయ     

24.   

 

 

 

ఆ.వె.

ఆ మృగమ్ము కూడ నవనిజ నా రామ

దయిత నచట నరసి తద్వనమును

వెలుఁగఁ జేయు నట్లు విహరించె మాయా మృ

గమ్ము మరల మరల నెమ్మి తోడ     

25.   

 

 

 

కం.

మును గాంచ నట్టి యా మృగ

మును నానా రత్నమయ మపూర్వము నచటం

గని పరమ విశ్మయమ్మును

జనకాత్మజ సీత వడసె స్వాంతం బందున్   

26.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నలువది రెండవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 43.

 

 

 

మాయా మృగమును గాంచి సీత యానందముతో భర్తను లక్ష్మణునిఁ బిలిచి దానినిఁ దెమ్మని వేఁడ లక్ష్మణుఁడు సందేహించి యది మారీచుని మాయ యగు నని పలుకఁగ రాముఁడు సీత కోరిక తీర్చుటకై సీత రక్షకై యుండ మని తమ్మునితోఁ బల్కి జింకను బట్టుకొనఁ దా నేఁగుట.  

 

 

 

 

ఉ.

కాంచి మృగమ్ముఁ బార్శ్వములఁ గాంచన రాజత వర్ణ బాసమా

నాంచిత శోభితమ్ము విమలాంగి నితంబిని సంతసం బెదన్

మించఁగ భర్త రాఘవుని మేటి పసిండి శరీర పిల్చె రో

మాంచిత కాంత జానకి మహాయుధ ధారుని వీరు లక్ష్మణున్

1.      

 

 

 

తే.గీ.

పిలువఁ బడ నరవ్యాఘ్రు లట్టులు ధరణిజ

చేఁ గలయఁ జూచి కాంచిరి చిత్ర మృగము

నచట శంకించి లక్ష్మణుఁ డన్న కనియె

నిట్లు మారీచుఁ డే యగు నీ మృగమ్ము

2.     

 

 

 

ఉ.

వేఁటకు నేఁగి భూపతులు వేడబ మేర్పడ కామరూపుఁ డౌ   

పాటవ తాటకేయు ఘన పాప మనస్కుని చేత నిమ్మహో

గ్రాటవి నాశనం బయిరి యక్కట రాజు లనేకు లిద్ది యా

మేటి నిశాటు కార్య మగు మిథ్యయె యీ మృగ మెంచ నిక్కమున్    

3.     

 

 

 

కం.

కన మిట్టి రత్నచిత్ర వ

లనమ్ము నీ జగతి నెందు రాఘవ!  జగతీ

ఘన నాథ! సంశయమ్ము వ

డ నేల యిది యెల్ల మాయ డాయఁగఁ నేలా

4.     

 

 

 

కం.

అన నిట్టు లాపి లక్ష్మణు

ని నగు మొగపు సీత పలికె నెమ్మిని నిట్లుం

దనదు మతి చెదరఁ జర్మ

మ్మును గాంచఁగ భర్త తోడ మురిపెము లొలుకన్    

5.     

 

 

 

ఆ.వె.

చమర సృమరములు మృగములు కలవు పెక్కు

లు మన యాశ్రమమ్ము లోనఁ దిరుగు

చుండి యింపు గొలుప మెండుగ నందమై

న వవి యెల్ల భృశము నరవరేణ్య!      

6.     

 

 

 

ఉ.

దుప్పులు నెల్గుబంటులును దొడ్డవి కోతులు నింకఁ గిన్నరుల్

గొప్పగ  నుండ రూపములు కోరి చరింత్రు మనోహరమ్ముగా

నెప్పుడు చూడ లే దిచట నిట్టి మృగమ్మును గొప్ప తేజ మం

దొప్పుగ  వెల్గు చుండఁగ నహో సదృశమ్మును రాజచంద్రమా!    

7.     

 

 

 

తే.గీ.

అసిత సహిత నానా వర్ణ లసిత రత్న

బిందు సంయుతమ్ముగ ధవ ళేందు సన్ని

భమ్ము వన మెల్ల వెలిఁగించు భంగి వ్యగ్ర

హీన రీతిఁ దనరు చుండె నింపుగ నిది   

8.     

 

 

 

తే.గీ.

రూప మాహ కాంతియు నహో యీ పృషతపు

స్వర సుసంపన్న మెంచ నశక్యమే వి

చిత్ర దేహమ్ముతోడ విశేషము హరి

యించు చుండె నా డెందమ్ము నంచితముగ  

9.     

 

 

 

ఆ.వె.

పట్టఁ బ్రాణ ముండ భద్రముగా నీ మృ

గమ్ము నిచట విస్మయమ్ము కలుగు

నత్యధిక మెడంద నాశ్చర్య కారకం

బతి మనోహరమ్ము నడరి రామ!  

10.    

 

 

 

చం.

తగ వన వాసమే ముగియఁ దప్పక స్వీయఁపు రాజ్య మందు ని

ల్వగ మన రాణివాసమున భవ్య విభూషణమై చెలంగు నిం

పుగ నిది మీకు నబ్భరత పుణ్యున కత్తల కింక నాకునున్ 

మృగవర మద్భుతం బగును మెండుగ నిత్యము నిశ్చయమ్ముగన్

11.    

 

 

 

కం.

అసువులతోఁ బట్టంగా

నసాధ్యమైన నరపుంగవా! యీ మృగమున్

వెస చర్మంబు రుచిర మగు

నసమానమనోహరంబ యయ్యది నాకున్

12.    

 

 

 

ఆ.వె.

కాంచన మయ తన్మృ గాంచిత చర్మముఁ

బఱచి గడ్డి పఱుపు పయిన నిచట

నంచితమ్ముగఁ దమి నాసీను రాలు న

గుదు నడరుచు నుండ మృదువుగాను  

13.    

 

 

 

తే.గీ.

దారుణం బిట్టి కోరిక తరుణుల కస

దృశమ చింతించి చూచినఁ దెల్లముగను 

సత్త్వ చర్మ రమ్యతఁ గాంచ స్వాంత మందు

విశ్మయమ్ము జనించును వితతముగను

14.    

 

 

 

తే.గీ.

శుద్ధ కాంచన వర్ణ మణీద్ధ శృంగ

తరుణ భాస్కర వర్ణ యుత ప్రభా మ

యమ్ము నక్షత్ర పథ కాంతి నడరు మృగము

నరసి రాముండు నచ్చెరు వందె నెడఁద

15.    

 

 

 

తే.గీ.

సీత పల్కుల నాలకించి పర మాద్భు

తంపు మృగము వీక్షింపఁగఁ దద్ద మోహి

తుం డయి సతి ప్రేరేపింప మెండుగ ముద

మంది లక్ష్మణుఁ గని రాముఁ డనియె నిట్లు   

16.    

 

 

 

చం.

అవనిజ కాంక్షఁ గాంచుమ మృగార్థము లక్ష్మణ యిట్టి రమ్య జం

తువు మృగ రాజ మద్భుతము దుర్లభ మెందును నందనమ్ము నం

దు వనమునం గుబేర పరితోషిత చైత్ర రథమ్ము నందు నీ

భువి వెదకంగ దీని సమముం గన శక్యమె యేరి కైననున్  

17.    

 

 

 

తే.గీ.

ముందు వెనుకలకుఁ దిరిగి ముచ్చట గొలు

పు నిజ రోమ రాజి వెలుఁగఁ గనక బిందు

చిత్రములు మృగ మందు విశేష రుచుల

మిగుల భాసిల్లు చుండె సౌమిత్రి గనుమ                                  

18.    

 

 

 

ఆ.వె.

ఆవులింప మండు టగ్ని శిఖాభము

నోటి నుండి వెడలు మేటి జిహ్వ

మెఱపు వోలె నుండె మేఘ పంక్తుల నుండి

వెడలు చుండఁగ నది వింత వొడమ

19.    

 

 

 

తే.గీ.

ఇంద్రనీల గల్వర్కసదృశ ముఖమ్ము 

శంఖ ముక్తాభ జఠరమ్ము చక్క నైన

రూపము మనోహరమ్ము  విలోకనమ్ము

మోహ మీయ కున్నె మది కమోఘముగను   

20.   

 

 

 

ఆ.వె.

చక్కనైన యేణి జాంబూనద మయప్ర

భ విరివి  వెలయంగ  వివిధ రత్న

మయ తనువు నరయఁగ  మనమున విస్మయ

మేరికిఁ గలుగ దొకొ యెందు నైన  

21.    

 

 

 

కం.

మాంసార్థముఁ గ్రీడకునై

హింసింతురు వేట లందు నిద్ధర రాజో

త్తంసులు ధానుష్కులు దీ

ర్ఘాంసద్వయ! లక్ష్మణా!మహానందమునన్ 

22.   

 

 

 

కం.

అతి యత్నమ్మున వని భూ

పతు లురు ధన ధాతు లోహవర వివిధము లం

చిత రత్నమ్ముల నిత్య

మ్ము తగులమున సంగ్రహింత్రు పూర్ణోత్సాహుల్

23.   

 

 

 

కం.

వనసార మెల్ల ధనమే

మనుజులు చింతింతు రయ్య మనముల శ్రీవ

ర్ధనముగ లక్ష్మణ! యా శు

క్రుని భంగిని సంతతమ్ము లోలత మీఱన్   

24.   

 

 

 

కం.

అర్థు లవిచార మెల్లరు

నర్థార్థమ సంచరింతు రర్థ నిపుణులే 

యర్థము నర్థ్యం బని య

త్యర్థము పల్కుదురు లక్ష్మ ణార్యా! వింటే                 

25.   

 

 

 

ఆ.వె.

లక్ష్మణ మృగ రత్న రమ్య కాంచన చర్మ

మందు నన్ను గూడి యిందు వదన

యీ సుమధ్యమ యిట బాసుర మాసీను

రా లగు ముద మొదవ మేలుగ నెద  

26.   

 

 

 

ఆ.వె.

చిత్రవర్ణ మృగము జింక దైనఁ గదళి

దైన మిన్న జుట్టు దైన గొఱ్ఱె

దైన చర్మ మెందు నరయంగ దీనికి

సదృశ మౌనె చెపుమ మృదువు నందు       

27.   

 

 

 

తే.గీ.

శ్రీ యుతంబైన యీమృగ శ్రేష్ఠ మింక

దివ్యమైన నభశ్చర దీప్త మృగము

భవ్యముగ నెన్న మదిలోన దివ్యము లుభ

యములు తారామృగ మహీమృగములు భృశము

28.   

 

 

 

మ.

ఇది మారీచుని మాయయే యనిన నీ యివ్వాక్యమే లక్ష్మణా! 

పదిలం బెంచి యథార్థ మైన యెడలన్ వానిన్ దురాత్మున్ వధిం

పఁ దగున్ నాకు వనాంతరమ్మునను బూర్వం బీతఁ డుగ్రుండునై

యెద క్రూరత్వము నూని తాపసులఁ దా హింసించె ఘోరమ్ముగా   

29.   

 

 

 

కం.

మృగయార్థ మనేక నృపులు

మగధీరులు ధన్వి వరులు మారీచునిచేఁ

బగ హతు లైరి కనుక నీ

మృగము వధకు నర్హమౌను నృవరుల కెంచన్  

30.   

 

 

 

తే.గీ.

మున్ను వాతాపి వంచించి పుణ్య తాప

సేంద్రుల యుదరమ్ముల నుండి యెల్ల వారిఁ

జంపు చుండెను నిండు గర్భంపుఁ బిండ

మాడు గుఱ్ఱమును వధించు నట్టు లకట  

31.    

 

 

 

ఆ.వె.

అంతఁ గొంత కాల మరుగ లోభమ్మున

మునివరు ఘనతేజుఁ గని యగస్త్యుఁ

గదియ నశన మయ్యె నుదరి వాతాపి క

పటపు బుద్ధి సెలఁగ నటవి లోన   

32.   

 

 

 

కం.

తన రూపము నందఁ దివురు

ఘను నా వాతాపి నసురుఁ గాంచి యగస్త్యుం

డు నగుచు భగవంతుఁడు దా

ననియెన్ వాక్యమ్ము లిట్టు లాతని తోడన్

33.   

 

 

 

కం.

వేవుర విప్రశ్రేష్ఠుల

నీ వవమానించితె కడు నీ తేజమునన్

జీవాలి లోక మందిలఁ  

గావున జీర్ణం బయితివి కమనీయముగన్  

34.   

 

 

 

కం.

మనజాలం డీ యసురుఁడు

వని వాతాపి వలె నా కవజ్ఞ నొసఁగుచున్

నను గన ధర్ము జితేంద్రియు

ని నగస్త్యుఁ డసురుని నట్లు నిర్జింతు వడిన్    

35.   

 

 

 

తే.గీ.

ఇచట సన్నద్ధుఁడ వగుమ యింక రక్ష

ణమ్ము నిమ్ము వైదేహికిఁ బమ్మి యెద్ది

చేసిన మన మయ్యది గాంచ సీత రక్ష

ణమ్మున కిటఁ గావలయును జుమ్ము సతము      

36.   

 

 

 

తే.గీ.

చంపెదను దీని నేను లక్ష్మణ శరమున 

లేని యెడల గ్రహింతును దాని వేగ

వత్తు తత్క్షణ మీ మృగ వరముఁ దెత్తు

నప్రమత్తత నుండుమ యత్యధికము    

37.   

 

 

 

ఆ.వె.

మృగపు చర్మము పయి మిక్కిలి కాంక్ష వ

హించె సీత గనుమ యంచితముగ

ముఖ్య మగు త్వచమ్ము మూర నీ జింక య

సువుల నుండ దింకఁ జుమ్ము వీర!     

38.   

 

 

 

తే.గీ.

ఆశ్ర మమ్మున నీ వుండు మప్రమత్తుఁ

డ వయి సీతకై పృషతమ్మును వడి నొక్క

బాణమునఁ జంపి యరుదెంతు నేణ చర్మ

సహిత మేను శీఘ్రముగ లక్ష్మణ! యిచటకు  

39.   

 

 

 

కం.

తిరిగెడు బల ధీమంతుఁడు 

వర విహగ జటాయు తోడ వైదేహిని నీ

వరయుచుఁ బ్రతిక్షణమ్ము ద

నర సంశయ మన్ని దిశల నడరు మెలఁకువన్     

40.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నలువది మూడవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 44.

 

 

 

రాముఁ డట్లు తమ్ముని నాదేశించి కరవాలము ధనువు తూణీరముల నూని మాయా మృగమును బట్టుకొనఁగ నేఁగి యది దొరకకున్నఁ జంప నది తన కంఠస్వరమున హా సీతా హా లక్ష్మణా యని యఱవ నబ్బురపడి చింతతో మరలుట.   

 

 

 

 

కం.

ఆదేశించి రఘు వరుఁడు

సోదరు లక్ష్మణుని నట్లు సురుచిర రీతిన్

దేదీప్యమాన మయిన త్స

రూదగ్ర నిజాసి నూనె నుత్సాహమునన్

1.      

 

 

 

తే.గీ.

వెంట మువ్వంపు లున్నట్టి వింటి నిజ వి

భూషణంబును గైకొని మున్ను విక్ర

ముండు తూణీరముల నూని రెండు తరలె

నంతఁ గోదండ రాముండు సంతసమున   

2.     

 

 

 

ఉ.

వచ్చెడు రాజ పుంగవుని వంచన చేసెడు జింక గాంచి వే 

హెచ్చిన భీతి మాయ మయి యేపున దూరము నందు దర్శనం

బిచ్చెను దిర్గి వింటి నసి నింపుగ వెల్గుచు నేఁగె నామృగం

బెచ్చటి కేఁగ నచ్చటి కహీన పరాక్రమ రాముఁ డత్తఱిన్  

3.     

 

 

 

చం.

కనుఁ దన ముందు రాముఁడు మృగమ్మును బర్విడు చూచి నంతనే

ఘన గుణి ధారి యా మృగము గ్రక్కున గెంతుచు బాణ భీతి శం

కను గడు సంభ్రమమ్మునను గన్పడు దాఁగును లోభుఁ జేయఁగా 

వనమున శార దాభ్రమునఁ బన్నుగ చంద్రుని భంగిఁ దోఁచుచున్    

4.     

 

 

 

చం.

కనఁబడు నొక్క వేళ దరిఁ గన్పడు చుండు మృగంపు రూపునం

దనరెడు తాటకేయుఁ డటఁ దద్దయు దూరము నందు వెల్గుచుం 

గనఁబడి యొక్కొ కప్పుడును  గానక యుండుచుఁ దిర్గి యాశ్రమ

మ్మునకుఁ గడింది దూరముగ మూరుచు వే కొని పోయె రామునిన్   

5.     

 

 

 

ఆ.వె.

కరము కినిసె నంతఁ గాకుత్స్థుఁ డలసియు

మృగము చేత నట్లు మిక్కుటముగ

మోహితుండు గాఁగ భూజపు నీడ శా

ద్వలము పైన వేచెఁ దద్ద విసిగి  

6.     

 

 

 

తే.గీ.

ఆశఁ గల్పించె రామున కా మృగాకృ

తిఁ దనరు నిశాటుఁడు కృతమతి యయి చెలఁగి     

మిక్కుటమ్ముగఁ దా నన్య మృగముల నడు

మఁ గనఁబడి తిర్గి వన మందు మానకుండ    

7.     

 

 

 

ఆ.వె.

పట్టఁ దలఁచి కంటఁ బడిన యంతఁ దనకుఁ 

బర్వు లిడెను వేగ పార్థివుండు

తత్క్షణంబ మృగము  త్రాస మంది కరము

మాయ మయ్యె నంత మరల వింత

8.     

 

 

 

చం.

తిరిగి మృగమ్ము దూరమునఁ దెల్లముగాఁ దరుషండ మందు నుం

డి రతి బయల్పడంగ రుష డెందమునం దడరంగఁ జంప నెం

చె రఘువరుండు జింక నిఁక శీఘ్రముగాఁ గృత నిశ్చయుండునై

శరమును దీసి చాపమున సంధిలఁ జేసి వెలింగె నత్తఱిన్

9.     

 

 

 

చం.

రవి రుచి సన్నిభప్రభల రాముఁడు వెల్గుచు శత్రు మర్దనుం

డవిరళ కాంతిమంతుఁడు మహాత్ముఁడు పన్నగ నిస్వనమ్ములన్

శ్రవణముఁ దాఁక లాగుచును  బ్రహ్మ వినిర్మిత దీపి తాస్త్ర మం

త వదలె నద్దనుర్ధరుఁడు ధర్మవిదుండు మృగమ్ముపై వడిన్    

10.    

 

 

 

ఉ.

చీలిచి జింక దేహమును శీఘ్రమ యా శర మా నిశాటు మ

ర్మాలిని వక్ష మెల్లను మహాశని సన్నిభ మంతఁ జీలిచెం

దాల నగంపు టెత్తునకుఁ దా నెగిరెం గడు నల్ప జీవుఁడే  

వ్రాలెను భూతలమ్మునను భైరవ రావ మొనర్చుచున్ వ్యథన్

11.    

 

 

 

తే.గీ.

విడిచె మ్రియమాణుఁ డగుచును బిఱికి మెకపు

రూపుఁ గపటమ్ముఁ దెచ్చె గుర్తునకు గిరల

సీత లక్ష్మణుఁ బంపెడు చెన్ను నొంటి

తరుణుని హరించు నట్టుల దశముఖుండు  

12.    

 

 

 

తే.గీ.

కాల మెఱిఁగి యఱచె నంత ఘనుని రాము

ని స్వర మనుకరించి భృశము నెగడ యిట్లు

మాయ హా సీత హా లక్ష్మణా యనుచు నె

లుంగు మీఱ మారీచుఁ డుత్తుంగ రుతిని

13.    

 

 

 

ఆ.వె.

తదనుపమ శరమునఁ దన మర్మము లవియ

మృగ తనువును వీడి మేటి కాయ

మూనె నసుర రూప మూనుచు మారీచుఁ

డంత జీవితంపు టంత మందు

14.    

 

 

 

తే.గీ.

చూచి పతితు ఘోరుని  రక్కసుని రుధిరము

నందు మునిఁగిన మారీచు నవని దొర్లు

వాని స్మరియించె లక్ష్మణు భాషణములు

సీత నెద లోన రాముఁడు  సేరె నంత

15.    

 

 

 

ఆ.వె.

మూరి లక్ష్మణుఁ డనె మారీచు మాయ యం

చు నిది తథ్యముగను జూడ సత్య

మయ్యె నయ్య దిపుడు హతుఁ డయ్యె మారీచుఁ

డిట్లు నా వలననె యివ్వనమున

16.    

 

 

 

కం.

హా సీత! లక్ష్మణ! యసుర 

యీసున నిట్లఱచి చావ నీ రాముఁ డహో 

యా సీ తానుజు లటఁ దన

కోసము నెట్లుండి రని గగురు లందె నిటన్ 

17.    

 

 

 

ఆ.వె.

భయము దుఃఖజమును బడసె రాముఁ డపుడు

మృగపు రూపు నసురు మృతునిఁ జేసి

వినఁగ నాతని స్వరమును నవ్విధమ్ముగ

మిక్కుటముగ నెడఁద మేటి మగఁడు   

18.    

 

 

 

కం.

అన్య మృగమ్ము నొకటి రా

జన్యుఁడు చంపి పలలంపు సహితుండయి 

మ్మాన్యుం డేఁగఁ దొడంగె న

నన్య జనస్థానమునకు నతివేగముగన్      

19.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నలువది నాల్గవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 45.

 

 

 

రాముని కంఠధ్వనిఁ బోలు నార్తస్వరమును విని సీత శంకించి రామునిఁ జూచి రమ్మని లక్ష్మణునిఁ గోర నాతఁ డిది రాక్షసమాయ యని చింత వల దనఁ గోపమున లక్ష్మణుని నిందింప నాతఁడు రాముని దెస కరుగుట.  

 

 

 

 

కం.

పతి కంఠస్వర సదృశపు

గతి నార్తస్వర మెఱింగి కాంతామణి సీ

త తివిరి లక్ష్మణుఁ గని రఘు

పతి నేరఁ జను మనె వేగ పరితాపమునన్

1.      

 

 

 

ఉ.

వింటిని యార్తనాదమును వీరుఁడు రాఘవుఁ డార్తిఁ బిల్వఁగా

నొంటిని నిల్వ నేర విఁక నొప్పుగ నా కసువుల్  స్వజీవముం

గంటక మౌను మిక్కుటముగా వెతఁ గుయ్యిడ నీదు భ్రాతయే  

వెంటఁ జరించి రక్షణము వేగమ యన్నకొసంగఁ బాడియౌ                

2.     

 

 

 

ఆ.వె.

అన్నను  శరణార్థి నరయంగ నేఁగుమ

తత్క్షణంబ యసుర దారుణ వశు

ని మృగరాజు బారినిఁ బడిన వృషభేంద్రు

పగిది నున్నవానిఁ ద్వరిత గతిని     

3.     

 

 

 

కం.

వెడలక యుండఁగ నగ్రజు

నుడులు స్మరించి మదిలో ఘనుండు మహా వీ

రుఁడు లక్ష్మణుండు కోపం

బెడంద రేఁగ ననె సీత యిట్టు లతనితో        

4.     

 

 

 

శా.

సౌమిత్రీ! కన వీవు సోదరు నవస్థన్ మిత్ర రూపమ్మునన్

రామస్వామికి శత్రు తుల్యుఁడవు సౌభ్రాత్రమ్ము వీక్షింపవే

రామాంతమ్మును గోరు దీవు మదిలో రక్షింప నీ వేఁగవే 

కామార్తుండవు మన్నిమిత్త మిట శంకా హీనతన్  లక్ష్మణా!            

5.     

 

 

 

తే.గీ.

వ్యసనమే ప్రియ మగు నన్న యన్న లేదు

ప్రేమ నీ కింత యేనియు వెలుఁగు లందు

మూరు నాతనిఁ గాంచఁగఁ బురుష పుంగ

వుఁ జన కుండ నమ్మిక నిల్తువు ధృతి నిట్లు      

6.     

 

                           

 

ఉ.

వచ్చితివే ప్రధానముగఁ బార్థివు రాముని రక్షణార్థమై

హెచ్చుగ సంకటమ్ము లిట యీ రఘు నాథున కావహింపఁగా

నిచ్చట నాదు చెంత నిఁక నివ్విధి నిల్వఁగఁ గార్య మున్నదే

యచ్చెరు వయ్య! యిట్టు లన నా జన కాత్మజ శోక తప్తయై

7.     

 

 

 

తే.గీ.

భాష్ప శోక పరిప్లుత భామ సీత

మృగము భంగి తప్త నరసి మృదు వచనము

లిట్టు లూఱడింప ననియె నింపు గొలుప

లక్ష్మణుఁడు కొనియాడుచు రామ మహిమ

8.     

 

 

 

ఆ.వె.

అవని లోన పన్న గాసుర గంధర్వ

దేవ మనుజ రాక్ష సావలిఁ గన

నొక్కరును జయింప నోపరు నీ భర్త

నెందు వల దవనిజ! సందియమ్ము    

9.     

 

 

 

మ.

కన దేవీ! నరు లందు దేవ తతులన్ గంధర్వు లందైన నా

ఘను లౌ కిన్నరులం బిశాచులను రక్షః కాంతు లందైననున్  

దనుజవ్రాతము నందుఁ బక్షులను యుద్ధం బందుఁ బోరాడుచున్

ఘను నా రామునితో మృగాలిఁ జనఁ డొక్కం డైన జీవమ్మునన్         

10.    

 

 

 

తే.గీ.

ఇంద్ర సదృశుఁ డితఁ డవధ్యుఁడే రఘూద్వ

హుండు రాముఁడు నీ వన నొప్ప దిట్లు

రాముఁ డిట లేని చో నిన్నరణ్య మందు 

వదలి చన నుత్సహింపను బరమ సాధ్వి!    

11.    

 

 

 

 

ఆ.వె.

బల్లిదుల బలునకు  వజ్రి కమరులు తో

డయిన మూడు జగము లందు నెవ్వ

రికి నయిన నితని విరివి యైన  బల మని

వార్య మగును జుమ్ము వలదు శంక     

12.    

 

 

 

తే.గీ.

హృదయము సుఖించుఁ గాక నీ కింక దుఃఖ

మెల్లను విడువు మిప్పుడు తెల్ల మిది మృ

గమ్మును వధించి నీ భర్త నెమ్మి నేఁగు

దెంచు నిటకు శీఘ్రముగను ధృతి వహింపు    

13.    

 

 

 

ఆ.వె.

మాయ యీ స్వరమ్ము మఱి చేసి రెవ్వరొ

నిరతి తోడ నిట్లు  నిజము కాదు

కాంచ  నసురు మాయ గంధర్వ నగ రోప

మమ్ము సుమ్ము దీని నమ్మ వద్దు

14.    

 

 

 

కం.

ఇల్లడవెట్టఁ బడితి విట

సల్లలితముగఁ బతి చేత సద్గుణ సంఘా

తోల్లసితుఁడు రామునిచే 

ఫుల్ల సరోజాక్షి వదలి పోఁజాల నినున్       

15.    

 

 

 

కం.

ఖరుని వధింప జనస్థా

న రతాసురుల వధచే మన మయితిమి మహా

సురులకు విద్వేషుల మె

ల్లర కిట వైదేహి!   భృశము రణ వైరమునన్     

16.    

 

 

 

ఆ.వె.

ఇయ్యరణ్య మందు హింసా విహారులు

రక్కసులు వివిధముల వచనమ్ము

లఁ బ్రసరింపఁ జేయ రక్తి నుందురు చింత

సేయఁ దగదు వానిఁ జిత్త మందు

17.    

 

 

 

కం.

పలుకఁగ లక్ష్మణుఁ డివ్విధి

నలుకం గను లెఱ్ఱఁబడఁగ నవనిజ యంతం

బలికెఁ బరుషములువాక్య

మ్ములు సత్య వచనునితో విమోహిత యిట్లున్

18.    

 

 

 

ఉ.

రాముని కష్ట మివ్విధము లక్ష్మణ! ప్రీతి కరంబు నీ కిటుల్ 

నా మది నెంతు నేను గులనాశక! చేయఁగ దుష్ట చేష్టలన్

గోము వహింతు డెందమునఁ గ్రూర మనస్కుఁడ! రామ దుఃఖమున్

నీ మదిఁ గాంచి యిగ్గిరలు నెమ్మి వచింపఁగ నుత్సహింతువే     

19.    

 

 

 

తే.గీ.

సతము ప్రచ్ఛన్నముగఁ జను శత్రువులకు

నిన్ను బోలు వారికి నిక్క మెన్నఁ గ్రూర

చిత్తులకు లక్ష్మణా! దొడ్డ చెడ్డ వారి

కెల్ల వింత కా దీ పాప మెంచి చేయ   

20.   

 

 

 

ఉ.

దాఁగిన దుష్ట చిత్తుఁడవు దారుణ కానన మందు రాఘవుం

డేఁగఁగ నేకుఁడై త్వరిత మీ వరుదెంచితి మన్నిమిత్తమే

బాగుగఁ జింత సేసి నిను బన్నుగ నా భరతుండె పంపెనో

యీ గతి రాము నొంటరిగ నివ్వనిఁ గాంచుచు హాని సేయఁగా      

21.    

 

 

 

తే.గీ.

భరతు నాశ నీ యాశ విఫలము లగును      

జేరి ఇందీవరశ్యాము వీరుఁ బద్మ

పత్ర సన్నిభేక్షణు రాము భర్త నెట్టు

లన్య నరుఁ గోరు వైదేహి యాత్మలోన    

22.   

 

 

 

కం.

వదలుదుఁ బ్రాణమ్ములు నీ

యెదుటనె సౌమిత్రి శంకయే లే దిందున్

హృదయేశుఁడు లేనియెడల

మదిఁ దలఁప క్షణం బయినను మహిలో నుండన్  

23.   

 

 

 

తే.గీ.

లక్ష్మణుఁడు జితేంద్రియుఁడు పరమ పరుష వ

చనము లన సీత రోమహర్షణములు విని

ప్రాంజలుం డయి వినయుండు పలికె నంత

వాక్యముల నీ విధమ్ముగ వాక్య విదుఁడు     

24.   

 

 

 

తే.గీ.

ఉత్తరం బీయ నే నిట నుత్సహింప

దేవత వగుదు నా కెంచ దేవి! నీవ

యెదురు లేని మాటలు వింత లెట్టు లతివ

ల కగును స్వభావ మిట్లుండు రమణుల కిల      

25.   

 

 

 

తే.గీ.

ధర్మము తలఁపక చపలత్త్వ మడరంగ

తీక్ష్ణముగఁ జీల్చు విధముగ స్త్రీలు పలుకు

చుంద్రు నీ నుడులు సహింప నోపఁ దప్త

శరముల వలెఁ దాఁకినవి నా శ్రవణములను

26.   

 

 

 

తే.గీ.

న్యాయ వాదిని మది లోన న్యాయ మెంచి

పలుక నేను నీ చే నెట్లు పరుషముగఁ బ

లుకఁ బడితినొ వీక్షించి సురుచిరముగను

సాక్షు లగుఁ గాక యివ్వన చరము లెల్ల     

27.   

 

 

 

ఆ.వె.

అన్న మాట పైన నంచితముగ నున్న

నన్ను నకట నీవు మిన్న యైన

శంకఁ గాంతు విట్లు చానల చెడు స్వభా

వమ్మునఁ బ్రలయమ్ము వఱలు నీకు    

28.   

 

 

 

కం.

కాకుత్స్థుఁ డున్న యెడ కే

నీ కాననమున వెడలుదు నిట శుభము లగుం

గాక వనదేవ తావలి

నీ కిఁక రక్ష నిడుఁ గాక  నీరజనేత్రా!   

29.   

 

 

 

తే.గీ.

దుశ్శకునములు పెక్కిటఁ దోఁచు చుండె

నాకు రామునితో రాఁగ వీఁకఁ దిరిగి

నిన్ను జూతునొ మఱి లేదొ నే నెఱుంగ

జనక నందన! వైదేహి! సంశయంబ       

30.   

 

 

 

కం.

అన లక్ష్మణుఁ డిప్పలుకులు

జన కాత్మజ యేడ్చు చివ్వచనములు కన్నీ

టినిఁ దడియ ముఖాంభోజము

ఘన తీవ్ర గతినిఁ బలికెను గని కాకుత్స్థున్   

31.    

 

 

 

ఉ.

ఈ వనిఁ గాన కున్న హృదయేశుని రాముని వేగ చొత్తు గో

దావరి రజ్జు బంధమునఁ దప్పక చత్తును జేరి కొండనున్ 

వే వడ నెంతుఁ ద్రాగుదును బీమ విషమ్మును నిల్తు వహ్నిలో

నే విధి రాఘ వేతరుని నెప్పుడు ముట్టను గాలి నైననున్    

32.   

 

 

 

తే.గీ.

ఇట్లు లక్ష్మణు నిందించి యింతి సీత

దుఃఖ ముప్పొంగ డెంద మందుఁ గడు  వగపు

తోడ నుదరమ్ముఁ దనదు చేతులను బాఁదు

కొనుచు నుండె ఘోరముగను జనక తనయ   

33.   

 

 

 

కం.

విమనస్కను రోదించెడు

రమణిని నార్తను విశాల రమ్యతరాక్షిన్

సముచిత మాశ్వాసింపఁగ

సుమిత్ర తనయుఁడు వలుకదు సుంత యతనితో    

34.   

 

 

 

తే.గీ.

సీత కంజలి ఘటియించి  చిత్త శుద్ధి 

వందనం బాచరించి యవనిజ కంత

భక్తి వంగి వీక్షించుచుఁ బల్మ ఱతివ  

నన్న చెంత కేఁగ దొడఁగె నాత్మజయుఁడు

35.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నలువది యేనవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 46.

 

 

 

లక్ష్మణుఁడు రాముని వెదకఁగ నేఁగ మఱుఁగున నున్న రావణాసురుఁడు సన్యాసి రూపమున  సీతను సమీపించి స్తుతించి మిక్కుటముగ నీ వెవ రని యడుగ జానకి యాతని దుర్బుద్ధిని నెఱుంగక బ్రాహ్మణుండు గావున నతిథిగ నర్ఘ్యములు వన్య భోజనము నొసఁగి

రామ లక్ష్మణుల రాకకై చూచుట.  

 

 

 

 

కం.

పరుషముగ నట్లు వలుకన్

ధరణిజ లక్ష్మణుఁడు కినిసి తద్దయు నంతన్   

భర తానుజుండు సనియె న

చిర మగ్రజు రాముని నరశేఖరు నరయన్

1.      

 

 

 

తే.గీ.

దాఁగి యున్న పౌలస్త్యుండు దశముఖుండు

క్షిప్ర మంత వైదేహిని సీతఁ గదిసె

నయ్యరణ్యమునఁ బరమహంస రూప

మూని లక్ష్మణుఁ డేఁగఁగ నుత్సహించి    

2.     

 

 

 

ఉ.

పాయక యూని ఛత్రమును భవ్య జటా ధరుఁడై విశుద్ధ కా

షాయ దుకూల ధారి యయి చక్కని పాదుక లూని యింపుగాఁ

దోయ లసత్కమండలువు తోడుత దండము వామ హస్త మం

దా యమి రూపుఁ డూని వడి నా జనకాత్మజఁ జేరెఁ బ్రీతినిన్    

3.     

 

 

 

తే.గీ.

సూర్య చంద్రులు లేనట్టి క్షుబ్ధ సంధ్యఁ

దనరు నంధకారము భంగి దశముఖుండు 

చేరె రాఘవ ద్వయ హీన సీతను వన

మందు నతిబలుం డసురుండు  సుందరి నట   

4.     

 

 

 

ఆ.వె.

దారుణుండు సూచెఁ దరుణి యశస్విని

రామపత్ని నంత రాజ హీన

రోహిణీ సతిని మనోహరను గ్రహ మా

కేతు వరసి నట్టు లాతతాయి    

5.     

 

 

 

కం.

అతనిం గాంచి జనస్థా

న తరువ్రాతమ్ము కంపనముల నడరె నా

తతముగ వీవ వెఱచె మా

రుత ముగ్రతమప్ర భాసురు వలని భీతిన్   

6.     

 

 

 

కం.

అసుర వరు నసృగ్లోచను

వెసఁ గని గోదావరి యతి వేగస్రో తా

గ్ర్య సరిత్తహో స్తిమితముగ

నసమాన భయమ్ము తోడ నప్పుడు పాఱెన్    

7.     

 

 

 

ఉ.

రామ విహీన తేప్సు వగు రావణుఁ డయ్యద నేర్పడంగ నా

రామ విలోక నైక రత రామను సీతను భిక్షు రూపుఁడై 

కామము మీఱఁ జేరెను వికార మనస్కుఁడు మంచి వానిగా 

భామినిఁ జిత్ర నా శని యపార విమోహుఁడు  చేరి నట్టులన్   

8.     

 

 

 

తే.గీ.

గడ్డి నిండిన కూపమ్ము కరణి పాప

చిత్తుఁడు పవిత్రుని పగిదిఁ జెలఁగు రూప

మందు నిలిచెను జూచుచు నిందువదన

రామ పత్నిని వైదేహి రావణుండు      

9.     

 

 

 

చం.

కదిసెఁ బవిత్రఁ జారు రదఁ గమ్ర త రాధరఁ బూర్ణ చంద్ర భా

స్వదమల వక్త్ర భాసితను భాష్ప వృతార్త నిపీడి తాంగనన్

సదమల పీత వస్త్ర వర సంవృతఁ బద్మ దళాక్షి సీతనున్

వదలక దుష్ట చేతనుఁడు  పంక్తి ముఖుం డసు రాధినాథుఁడే

10.    

 

 

 

ఆ.వె.

మన్మథ శర నిచయ మర్దితుఁడు దశాన

నుండు భాషణ చతురుండు బ్రహ్మ

ఘోషము లడరి పలుకుచు వినయమ్మునఁ

బలికె నేకతమున వాక్కు లిట్లు    

11.    

 

 

 

ఆ.వె.

స్త్రీల నుత్తమను విశేషముగ జగతిఁ 

బద్మ రహిత లక్ష్మి భంగి వెలుఁగు

నామె నిజ తనుప్ర భాంశువు లడరంగ  

రావణుండు వొగడె రమ్యముగను     

12.    

 

 

 

తే.గీ.

తప్త కాంచన వర్ణాభ! తరుణి! యెవ్వ

రీవు పీత కౌశేయ వరేద్ధ వస్త్ర! 

కమల మాలను ధరియించి కాంత! వెలయు

దీవు పద్మినీ సన్నిభ మీ వనమున   

13.    

 

 

 

తే.గీ.

హ్రీవియా కీర్తివ చెపుమ  లేక లక్ష్మి

వా శుభానన! భూతివా  యదియుఁ గాక

మఱి వరారోహ! స్వేచ్ఛగ మసలు నట్టి

యా రతీ దేవివా లేక యప్సరసవ    

14.    

 

 

 

చం.

అతివరొ దంతముల్ సమము లంచులు తెల్లనివై వెలుంగు  నీ

వి తరుణి! లోచనమ్ము లవి పెద్దవి యంతము లెఱ్ఱ నల్ల గ్రు

డ్లతి తరళమ్ము లా జఘన మత్యధికమ్ము విశాల మింతిరో 

వితతము లూరువుల్ కరటి భీమ కరోపము లబ్జలోచనా!            

15.    

 

 

 

తే.గీ.

మణి వ రాలంకృతమ్ము లమరి యనువుగ

వృత్తములు సంహతమ్ములు నెత్తు కొనల

వంగి బలియ స్నిగ్ధమ్ములు వఱలి తాల

ఫల నిభ కుచము లున్నవి భవ్యముగను   

16.    

 

 

 

తే.గీ.

చారుదతి! చారుదరహాస! చారునేత్ర!

నా మనము హరించితి పద్మనయన! యాప

గా తటినిఁ గోయు నుదకమ్ము కరణి సన్న

మధ్య! చారుకేశిని! సుసంహత గురు కుచ!        

17.    

 

 

 

ఆ.వె.

ఇంత యంద మైన యింతిని  గంధర్వి

ని మఱి కిన్నరినిఁ గని యెఱుఁగ నిల 

యక్షిని విమలాంగి! యమర కాంత నయిన

మున్ను రూపవతిని నెన్నఁ డైన

18.    

 

 

 

కం.

లోకముల మంచి రూపం

బీ కాయపు సౌకుమార్య మింక వయస్సున్

నీ కివ్విధిఁ దనరియు నీ

కీ కానన వాస మేల యెడఁద దహించున్

19.    

 

 

 

కం.

తొలఁగుమ భద్రం బగు నీ

కిల వేగంబ తగ దుండ నియ్యడవిని నో

లలనా! వాసం బిది యసు

రుల కతి ఘోరులకుఁ గామరూపుల కెల్లన్

20.   

 

 

 

తే.గీ.

నీకు సంచరింపఁ దగును నెమ్మి రమ్య

పట్ట ణోపవనములు వరాట్టకములు

గంధ సంపన్నములు సుమ్ము కంజ దళ ని

భాక్షి కాంతార సంచార మకట తగునె

21.    

 

 

 

తే.గీ.

మంచి దండలు బట్టలు మంచి భోజ

నమ్ము  లర్హము లగు నీకుఁ దమ్మికంటి!

మంచి భర్తయు నీ కర్హుఁ డంచు నెంతు

నేను మది నసితేక్షణ! నీరజాక్షి!

22.   

 

 

 

ఆ.వె.

రుద్రుల వసువుల మరుత్తుల నో వరా

రోహ! యెవ్వరవు సరోరుహాక్షి! 

నీవు దేవత యన నిశ్చయముగఁ దోఁతు

విచట నాకు రమణి! యెడఁద లోన     

23.   

 

 

 

మ.

సురలుం గిన్నర సంచయంబు నిచటన్ శోధింప గంధర్వులుం

దిరుగన్నేరరు వాస మీ వని సురద్వేషాలికిన్ భీక రా

సుర యూధమ్మున కేల వచ్చితివి సంక్షోభంపు టీ కానకున్

నిర తాపాయ నికాయ దేశమునకే నీరేజపత్రేక్షణా!

24.   

 

 

 

ఉ.

కోఁతులు సింహ రాజములు ఘోర పృదాకు తరక్షు ఋక్షముల్

భీతి వహింపవే మసల భీకర కంక మృగమ్ము లుండఁగా 

నాతత మత్త కుంజర విహార మహాటవి నందు నుండ నీ

రీతిని నేకతమ్మునఁ జరింపఁగఁ బద్మ విశాల లోచనా   

25.   

 

 

 

కం.

ఎవ్వతె వెవ్వరి దానవొ

యివ్వని కెచ్చోటు నుండి యేకతమున నీ

వివ్విధి నరుదెంచి తిరుగు 

దివ్వన మసు రావృతంబ యేలం జెపుమా

26.   

 

 

 

చం.

పొగడ దురాత్ముఁ డా యసుర ముఖ్యుఁడు రావణుఁ డాలకించి వి

ప్ర గతినిఁ గాన రా నతఁడు పన్నుగఁ బాద్యము లాదిగా నొసం

గి గురు నిభంపు భక్తిఁ బరికించి త దాగతు నిచ్చి యర్చలన్

మగువ వచించె భోజనము మాన్యుఁడ సిద్ధమ యారగింప నాన్  

27.   

 

 

 

ఆ.వె.

ద్విజుని వేషమందుఁ దెల్లముగాఁ బాత్ర

తోఁ గమండలువును దోఁప సీత

కాంచి రోత నూనఁ గాంత కశక్యము

కాఁగ భూసురునిగఁ గాంచి పిలిచె

28.   

 

 

 

తే.గీ.

ఆసనం బిది యాసీను లగుఁడు ససినిఁ

బాద్య మియ్యది గైకొన వలయు నెమ్మి

వన్య భోజనము గొనుఁ డవ్యగ్ర మిచట

నుంచఁ బడె మీ కొఱకు భూసురోత్తమ! తగ    

29.   

 

 

 

కం.

మృదుతర భాషిణి నృపసతి

సుదతి పిలిచినం గని మనసున రావణుఁ డం

తఁ దలఁచెఁ గొనిపోవ బలిమి

నిఁ దరుణిని దృఢముగ నాత్మ నిధనమున కనన్    

30.   

 

 

 

కం.

సురుచిర రూపుని రాముని

హరి ణార్థము చన్న వాని నవరజు తోడన్

ధరణిజ వీక్షింపఁ దొడఁగ

నరసె వనము జానకి కన దా రాఘవులన్  

31.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నలువది యాఱవ సర్గము.

అరణ్య కాండము

సర్గము 47.

 

 

 

రావణుఁడు సీతను దనకు నగ్రమహిషిగా నుండి భోగము లనుభవింప మని వేఁడికొనఁగ జానకి మహా రోషముతో రాముని పరాక్రమమును వర్ణించి యిరువురకు నున్న భేదములను వివరించి తర్జించి తిరస్కరించుట. 

 

 

 

 

కం.

రావణుఁ డడుగంగ నటులఁ 

బావన సన్యాసి రూప భాసితుఁ డపు డ

ప్పావని వచించె జానకి

యీ విధముగఁ దన వివరము లెల్ల నతనితో   

1.      

 

 

 

ఆ.వె.

అతిథి మఱియు విప్రుఁ డాతని కీ కున్న

నుత్తరమ్ము శాప మొసఁగఁ గలఁ డ

ని వెఱచి తనదు మదిని నొకింత తడవు చిం

తించి మైథిలి వచియించె నిట్లు    

2.     

 

 

 

చం.

జనక నృపేంద్రు మైథిలుని సన్నుతు పుత్రిని విప్ర పుంగవా!

తనరుదు సీత  పేరునను ధార్మికు రామున కేను భార్యనే

యినకుల రాజ పుంగవుల యింట వసించుచు సర్వ భోగముల్

మనుజల కర్హ మైన యవి మానుగ నందితి ద్వాదశాబ్దముల్

3.     

 

 

 

కం.

పదుమూడవ యేట నృవరుఁ

డు దలఁచె నభిషేకమును గొడుకు రామునకున్  

సదయ నమాత్యుల తోడుతఁ 

బదిలమ్ముగ దశరథుండు పరమాసక్తిన్   

4.     

 

 

 

ఉ.

చెన్నుగ రాఘవేంద్రు నభిషేకపుఁ గార్యము లెల్లఁ జాగఁగా

మున్నటఁ గొన్న కైక సతి భూవరు భర్తను వేఁడె నత్తఱిం

గ్రన్ననఁ దా వరద్వయము  రామునిఁ గానల కంప మంచునుం

దిన్నగఁ జేయ రాజుగ సుధీవరు నా భర తాఖ్య పుత్రునిన్       

5.     

 

 

 

తే.గీ.

రాముని నభిషేకించిన రాజ! ముట్ట

నన్న మేను నిక్కమ్ముగఁ గన్ను మూయఁ

ద్రాగ నొల్లను నా జీవితమ్మున కగు

నంత మిది తథ్యముగ నంచు ననఁగఁ గైక

6.     

 

 

 

ఆ.వె.

నాదు మామ మన్నన నొసఁగు  మనుజేంద్రుఁ

డంతఁ జేయుదు ననె యంది నట్టి

యర్థములు గలట్టి యంగన భంగి న

యినను సమ్మతింపదు నిజ దార   

7.     

 

 

 

చం.

ఒనరెడు పంచవింశతి వయో గుణ ధాముఁడు రామ నాముఁడున్

ఘనుఁడు నితాంత తేజుఁడు స్వకాంతుఁడు వర్ష నవద్వయమ్ములం

దనరుదు నేను నా పతి సతమ్మును సత్య నిబద్ధుఁ డిద్ధరన్

మనుజుల సర్వ భూత హిత మానస భాసితుఁ డాత్మ శుద్ధుఁడున్

8.     

 

 

 

తే.గీ.

దీర్ఘభుజు విశాలాక్షుని దృఢ మనస్కుఁ 

బ్రియ మొనర్పఁగఁ గైకకు నృపతి వరుఁడు

గొప్ప తేజుఁడు జనకుండు కూర్మి తనయు

ని నభిషిక్తుఁ జేయఁడు కామ నిరతుఁ డపుడు   

9.     

 

 

 

కం.

జనకు సమీపము చేరిన

తనయు నరసి కైక యంత దారుణముగఁ బ

ల్కెను నాదు భర్త తోడ వ

చనముల నిట్లు దృఢముగ రుషా యుక్తములన్    

10.    

 

 

 

ఉ.

ఆనతి నిచ్చె నీ జనకుఁ డయ్యది రాఘవ! యాలకింపుమా

స్వానుజుఁ డైన యిబ్భరతుఁ డంచిత రాజ్య మకంటకమ్ముగాఁ

దాన గ్రహింపఁగా వలెను దండ్రి నసత్యము నుండి కావఁగాఁ 

గానల కేఁగుమా చలుప గాపురమే పదునాలు గేం డ్లటన్       

11.    

 

 

 

తే.గీ.

భయ విహీనుఁడు రాముఁడు పలికి యట్ల

యని తనదు మాత కైకతో నామె భాష

ణమ్ములను దృఢ వ్రతుఁడు నా నాథుఁ డాల

కించి పాలించె నవి యెల్ల నంచితముగ     

12.    

 

 

 

తే.గీ.

ఇచ్చుటయె కాని తానెద్ది పుచ్చుకొనుట

కూడ దనెడు మతమ్మును గూడ దనృత

మెప్డు సత్యమ్ము వచియింపు మెల్లెడ యను

వ్రతము గలవాఁడు రాముఁడు బ్రాహ్మణ వర!    

13.    

 

 

 

చం.

అనుజుఁడు లక్ష్మణాఖ్యుఁడు మహా బల వీర్య సమన్వితుండు త

న్మనుజ వరర్షభుం డగు నృనాథున కింపుగ భండనమ్ము లం

దొనరుప సాయముం దనరి యుగ్రుఁడు  వచ్చె రిపుఘ్నుఁ డివ్వన

మ్మునకు ద్విమాతృ జానుజుఁడు భూరి పరాక్రముఁ డూని వింటినిన్   

14.    

 

 

 

ఆ.వె.

ధర్మచరుఁ డనుజుడు దరలి వనికి వచ్చె

నేను ననుగమింపఁ దాను జడల

నూని నిర్జితేంద్రియుండు రాముఁడు దండ

కా వనమున నిల్చె భూవరుండు   

15.    

 

 

 

తే.గీ.

మేము మువ్వుర మివ్విధి భామ కైక

వలన రాజ్యచ్యుతుల మయి వనము నందుఁ

దిరుగు చుంటిమి యోజను ద్విజ వరేణ్య!

యుండు మిచ్చట శాంతిని నొక్క క్షణము    

16.    

 

 

 

ఆ.వె.

వన్యములను గొనుచుఁ  బందుల జింక లు

డుములను వధియించి సముచితముల

విరివిగ నరుదెంచు వివిధ మాంసములతో

నాదు భర్త  ద్విజ గణప్రవరుఁడ!   

17.    

 

 

 

కం.

ఏకత మేల చరింతువు 

బీకరముల దండ కాటవీ దేశములన్ 

నీ కుల గోత్రమ్ములఁ జెపు

మా కరుణ నిజముగ విప్రమాన్యా!  నాకున్  

18.    

 

 

 

కం.

పలుకఁగఁ జానకి యివ్విధి 

లలనామణి రామపత్ని రావణుఁ డంతం 

బలికె నతి ఘోర వాక్య

మ్ము లివ్విధము రాక్షసుండు భూరి బలుండే     

19.    

 

 

 

కం.

ఎవ్వనిచే లోకమ్ములు

నొవ్వఁబడు సురాసుర సఫణులు వైదేహీ! 

యవ్వర రాక్షస నాథుఁడ

నివ్వటిలెడు రావణుండ నీరజనేత్రా!   

20.   

 

 

 

ఉ.

కాంచన వర్ణ దేహ నిను గాంచి ధరింపఁగఁ బట్టు చీరనే

యుంచను దార లందు రతి నోడి యనిందిత! బల్మి నెందఱో

చంచల నేత్రలం బడయఁ జాలితి వారికి దేవి వౌదు నా

పంచ వరింపు భద్ర మగుఁ బద్మదళాక్షి మదీయ రాజ్ఞివై    

21.    

 

 

 

తే.గీ.

తరుణి! కలదు లంకా నామ పురము కడలి

నడుమ వనధి రక్షితముగ నగ శిఖరము

నందు విహరింపు మింపుగ నచటి వనము

లందు నను గూడి కోర వీ యటవి నుండ   

22.   

 

 

 

ఆ.వె.

ఐదు వేల మంది యతివలు సర్వాభ

రణ విలసిత లెలమి రమణి! నీకు

సేవ లొసఁగు చుంద్రు సీత! నిత్యమ్మును

దార వయిన నాకు దయ వహించి   

23.   

 

 

 

కం.

విని రావణు వాక్యమ్ములు

ఘన కోపావృత నిజాత్మ కాకుత్స్థ వరాం

గన యయ్యనవద్యాంగి గ

ణనకుఁ గొనక యసురుఁ బల్కె నయముగ నిట్లున్      

24.   

 

 

 

ఆ.వె.

శైల సన్నిభం బచంచలుని  ఘనుని

వజ్రి సముని నాదు భర్త నెలమి

నర్ణవమ్ము భంగి నక్షోభ్యు నిత్యము  

రాము ననుసరించు రామ నేను

25.   

 

 

 

ఆ.వె.

సర్వ లక్షణ ఘన సంపన్నుని నృవరు

మఱ్ఱి భంగి వ్యాప్త మనుజ వృషభు 

నిత్య సత్య సంధు నీరజాక్షు మహాత్ము 

రాము ననుసరించు రామ నేను     

26.   

 

 

 

ఆ.వె.

దీర్ఘ బాహు యుగ్ము దీర్ఘోరు సింహ వి

క్రాంత గమను సింహ రాజ సదృశుఁ  

బురుష సింహుఁ బుణ్య పురుషుని రఘువరు

రాము ననుసరించు రామ నేను     

27.   

 

 

 

ఆ.వె.

పూర్ణ చంద్ర ముఖుని భూప నందన వరు

నిర్జి తేంద్రియుని  ధ్వనిత సుయశు మ

హాత్ముని దినకర కు లార్ణవ చంద్రుని  

రాము ననుసరించు రామ నేను     

28.   

 

 

 

ఆ.వె.

నక్కఁ బోలు నసుర యక్కట దుర్లభ

మైన సింహి పైన నాశ పడుదు

ముట్ట శక్య మగునె భూరి సూర్యప్రభా

సన్నిభంపు నన్ను నెన్నఁ డైన    

29.   

 

 

 

తే.గీ.

రాముని ప్రియంపు భార్యను రావణ! మదిఁ

గోరుదే మందభాగ్యుఁడ! ఘోర మిట్లు

పెక్కు లిఁక నీవు  కాంచన వృక్షములను

గాంతు విచట నిక్కముగ నీ యంత మడర

30.   

 

 

 

ఉ.

బల్లిద మౌ మృగారి హరి పంటినిఁ బన్నగ రాజ దంష్ట్రముం

గల్లరి! లాఁగ నెంతువు సుఖమ్ముగ నుండఁ దలంప వక్కటా

తల్లడ మంద కాత్మ వసుధాధర మెత్తుదె మందరమ్మునుం 

ద్రెళ్లక యుండ నోపుదువె ధీరతఁ ద్రాగినఁ గాలకూటమున్   

31.    

 

 

 

తే.గీ.

రామునకు ప్రియ మైన భార్యఁ గడు దుష్ట

బుద్ధిఁ జూతువు వెఱ్ఱివై మూరు చకట 

గ్రుచ్చు కొందువె సూదితోఁ గోరి కంటి 

నాక నెంతువు క్షురమును నాలుక నల    

32.   

 

 

 

తే.గీ.

రామ సతిని బాధింపఁ దలఁతు వెడంద

సూర్య చంద్రుల ముట్టుదె చోద్యముగను

బాణి యుగమునఁ గట్టి గ్రీవమ్ము నందు

శిలను దాఁట నెంతువు నీవు జలధి నెల్ల    

33.   

 

 

 

ఆ.వె.

అగ్ని మండు చున్న నారసి వస్త్రమ్ము

నందుఁ గైకొనంగ నకట యెంతు

మంగళ చరితను సుమంగళి రామ భా

ర్యా మణిని హరింప నకట తలఁతు  

34.   

 

 

 

తే.గి.

రామునకుఁ దగి నట్టి భార్యను గ్రహింపఁ

గోరుచుంటివి రావణ! ఘోర బుద్ధి 

నినుప శూలపుఁ గొన పైనఁ దనరి నడువ

నుద్య మింతువు వెఱ్ఱివై చోద్యముగను     

35.   

 

 

 

ఉ.

అంతర మెట్టి దున్నదియొ యారయ సింహ సృగాల మధ్య మం

దంతర మెట్టి దున్నదియొ యారయ సంద్రము  చిట్టి వాగు లం

దంతర మెట్టి దున్నదియొ  యగ్ర్యపు మద్యము పుల్ల గంజు లం

దంతర మట్టి దున్న యది యా రఘురామున కింక నీకునున్  

36.   

 

 

 

ఉ.

అంతర మెట్టి దున్నదియొ యారయఁ గాంచన మింక సీస మం

దంతర మెట్టి దున్నదియొ యారయఁ జందన మింకఁ బంక మం

దంతర మెట్టి దున్నదియొ  హస్తికిఁ బిల్లికి మధ్యఁ జూడఁగా  

నంతర మట్టి దున్న యది యా రఘురామున కింక నీకునున్     

37.   

 

 

 

ఉ.

అంతర మెట్టి దున్నదియొ యారయఁ దార్క్ష్యుఁడు నింక కాకి యం

దంతర మెట్టి దున్నదియొ యారయ బర్హిణ మింకఁ గొంగ యం

దంతర మెట్టి దున్నదియొ  యంచిత గృధ్రము సారసమ్ము లం

దంతర మట్టి దున్న యది యా రఘురామున కింక నీకునున్     

38.   

 

 

 

తే.గీ.

ఊని విల్లమ్ములను గర యుగ్మముల స

హస్ర నయన సమప్రభ నలరు రాముఁ

డుండ హృత నైన నీ చేత నుండ వీవు

దోమ నోటి వజ్రము భంగిఁ దోఁప నేను               

39.   

 

 

 

కం.

పలికి యదుష్ట విచార గి

రలను సుదుష్టమ్ముగ నసురం గని యిట్లుం

జలియింపఁ దనువు వణఁకి క

దళి గాలికిఁ గదలు నట్లు తన్వి కలంగెన్ 

40.   

 

 

 

కం.

కని కంపించెడు సీతను

దన కులము బలమ్ము పేరు దశకంఠుం డా

ఘన మృత్యు సదృశ తేజుఁడు

వనితకు భయ మీయఁ బనులఁ బల్కఁ దొడంగెన్

41.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నలువది యేడవ సర్గము.

 

 

అరణ్య కాండము

సర్గము 48.

 

 

 

సీత పలుకులకు రావణుఁడు కోపముతోఁ గనుబొమలు ముడిచి తన యొక్క పరాక్రమము నద్భుత కర్మములను వర్ణించి తనను  దిరస్కరించిన నామెకుఁ గలుగు నష్టములను రాముని యసమర్థతను వివరింప సీతా దేవి రావణుని నిందించుట. 

 

 

 

 

కం.

అవ్విధముగ భాషింపఁగ 

నవ్వైదేహి కనుబొమల నసురుం డంతం

జివ్వున ముడిచి యమర్షము

నివ్వటిల బదు లిడె నిట్లు నిష్ఠుర గిరలన్  

1.      

 

 

 

తే.గీ.

వైశ్రవణున కనుజుఁడ సవతి జననికి

సుతుఁడ రావణ నాముండ శూర వరుఁడఁ

బది తలల వాఁడ నో వరవర్ణిని! కడు  

భద్ర మగు నీకు నిత్యము పద్మనయన!   

2.     

 

 

 

తే.గీ.

జనులు మృత్యు వరసి పాఱు చంద మతివ! 

యెవ్వనికి దేవ గంధర్వు లెవ్వ  రైన

నింకను బిశాచ ఫణి విహ గేంద్ర సంచ

యమ్ము భీతినిఁ బర్విడు నతఁడ నేను

3.     

 

 

 

ఉ.

ఎవ్వని చేత వైశ్రవణుఁడే జితుఁ డయ్యె రణమ్ము నందు నే

నవ్వర విక్రముండ నొక యన్యపుఁ గారణమే చెలంగఁగా

నెవ్వని భీతి స్వీయ పురమే సుసమృద్ధము వీడి నిల్చెనో

యవ్వర పాండు శైలమున నన్నర వాహనుఁ డార్తి తోడుతన్

4.     

 

 

 

తే.గీ.

పుష్పకము కామగ విమానము శుభ మెవ్వ

ని బలమున నార్జితంబొ దేని పయి భద్ర 

గతిని నభ మందు విహరింపఁగఁ దర మయ్యె

నేరికి నతండ నే నైతి నిందు వదన!         

5.     

 

 

 

కం.

జని తామర్ష మదీ యా

నన మరసిన మాత్ర మింక నాకేశునితో

దను జారు లెల్లరు భ యా

ర్తిని వేగమ్ముగఁ బరువులు తీయుదు రతివా!

6.     

 

 

 

ఆ.వె.

ఎందు నేను నిల్తు నందు మారుతము వీ

చు నెద శంకితుఁ డగుచు మృదు రీతిఁ

దీవ్ర కిరణుఁ డైన దినకరుం డతి శీత

లాంశువులు వహించు సంశయమున   

7.     

 

 

 

ఆ.వె.

నిశ్చల దళ రాశి  నెగడుఁ దరువు లెల్ల

నీరజాక్షి! నేను నిల్చిన దరి

నదు లడరు  స్తిమితపు టుదకములను గూడి 

నే చరించు చోట నిర్మలముగ

8.     

 

 

 

ఉ.

మీన గ ణాలయంపుఁ దటి మిన్నఁగ వెల్గును నా పురమ్ము  లం

కా నగరమ్ము రాక్షస నికాయ పరీవృత పట్టణమ్ము 

న్మానిత మింద్ర వాసము ఘనం బమరావతి భంగి నిద్ధర

న్మానుగఁ జుట్టు గోడల ఘనమ్ముగ నిత్యము రక్షితంబు సూ     

9.     

 

 

 

తే.గీ.

తెల్లని ప్రహరు లలరార సల్లలిత సు

వర్ణ కక్ష్య రాజమ్ముల భాసితం బ

యి మఱి వైడూర్య మయ తోరణముల తోడ

వెలుఁగు చుండు నద్భుతముగ వినుత పురము  

10.    

 

 

 

కం.

కరి హరి రథ సంబాధము

వర తూర్య నినాద నిత్య భాసితము నిరం

తర ఫల పుష్ప సమావృత

పరమోద్యాన వన రాశి భాసిలు పురినిన్

11.    

 

 

 

కం.

నివసింపఁ గూడి నన్నట

నవనిజ! రాజాత్మజా! నిజాత్మ నిఁక స్మరిం

పవు నీవు మనుజ కాంతల 

నువిద! మనస్విని! విచార మొందఁగ నేలా    

12.    

 

 

 

తే.గీ.

మానవుల కొప్పు దివ్యము లైన భోగ

ముల ననుభవింప వరవర్ణిని! లలితముగఁ

దలఁప వర్ధాయువుని రాముని లలితాంగి!

మనుజ మాత్రుని సుంతయు మైథిలి యెద   

13.    

 

 

 

తే.గీ.

తనదు ప్రియ పుత్రు నిజ రాజ్యమున సుఖమ్ము

గ నిలిపి యకంటకమ్ముగఁ గమల నేత్ర!   

మంద వీర్యుని జ్యేష్ఠ కుమారు నంపె

వనమునకు దశరథుఁడు భూవర వరుండు   

14.    

 

 

 

కం.

గత చేతస్కుం డబల! వి

గత రాజ్యుఁడు తాపసుండు కడు దీనుఁ డహో

యతని వలన నేమి ఫలము

లతాంగి చింతింపు మెడఁద రాముని వలనన్      

15.    

 

 

 

తే.గీ.

రాక్షసుల కెల్ల నిద్ధరఁ బ్రభువు నైన

నన్ను మన్మథ శర విద్ధు నన్ను లందు

మిన్న! నిరసింప మైథిలి! చన్నె నీకు

రాఁగ నీ చెంత కక్కట రమణి! చెపుమ

16.    

 

 

 

కం.

పరితాపము వడయఁ గలవు

తిరస్కరించినఁ గడింది తెఱవా! పిదపన్

నిరసించి పురూరవు ము

న్నురువుగఁ దాపము వడసిన యూర్వసి భంగిన్    

17.    

 

 

 

ఆ.వె.

నాదు వ్రేలి కతఁడు నర మాత్రుఁడు సముఁడు

రాముఁ డెన్నఁగ సమరమ్ము నందుఁ 

బ్రాప్త మైతి నీకు వరవర్ణినీ! నీదు 

భాగ్యమున భజింపు పన్నుగ నను   

18.    

 

 

 

కం.

అన నిట్లు రాక్షసాధిపుఁ

డనయముగ విదేహ కన్య యాగ్రహ మందుం

గను లెఱ్ఱఁ బడఁగ నొంటరి

తనమున వచనములు పరుష తరములు వలికెన్    

19.    

 

 

 

చం.

మును మును దేవు నా సకల భూత నమస్కృతు నుచ్చరించుచున్

ఘనముగ భ్రాత వైశ్రవణుఁ గార్య మమంగళ మివ్విధమ్ముగా

నొనురుప సాహసింతు విట నుర్వి నవశ్యము రాక్షసాధమా!

యనయపు బుద్ధుఁ గర్కశ జనాధిపు నొందినఁ జత్తు రెల్లరున్             

20.   

 

 

 

తే.గీ.

శక్రు భార్య శచీ దేవి సతిని నపహ

రించి యైనను బ్రాణము లుంచ నగును

నన్ను రాముని భార్యను గొన్న నీకు

ధరను జీవిత ముండదు తథ్యముగను    

21.    

 

 

 

తే.గీ.

అంద మైన శచిని నింద్రు హస్తవజ్రు 

హస్తముల నుండి కైకొని యసువులు చిర

కాలము వడయ వచ్చును గలఁత నొసఁగ

నాకుఁ జత్తువు సుధఁ ద్రాగినను దశాస్య!   

22.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నలువది యెనిమిదవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 49.

 

 

 

జానకి మాటలు విని రావణుఁడు భయంకర మైన తన నిజ రూపము దాల్చి సీతను గొనిపోవుట, సీతా దేవి రక్షింప మని రామ లక్ష్మణులను దలఁచుచు వన మృగ గిరి వృక్షములను గోదావరిని,  నచటఁ గనఁబడిన జటాయువునిఁ దన యపహరణమును రామలక్ష్మణుల కెఱిగింప వేఁడికొనుట. 

 

 

 

 

కం.

వనితామణి వచనములను

విని చప్పట చఱచి త్రుటిని భీ మాకారం

బును దా నూనెను రావణుఁ

డు నిజాకారమ్ము తన పటుత్వము వెలయన్

1.      

 

 

 

ఆ.వె.

మైథిలిఁ గని యసుర మఱియుఁ బలికె నిట్లు

నా వచనములఁ దగ నాదు వీర్య

విక్రమముల నీవు విన నట్టు లెంచెద

వెఱ్ఱి తనము మీఱ వెలఁది నీకు     

2.     

 

 

 

చం.

గగనము నందు నే నిలిచి స్కంధము పైన వహింతు ధాత్రి నె

ల్లఁ గడలిఁ ద్రాఁగువాఁడ సమరమ్మున మృత్యువు నైనఁ జంపుదుం 

దగుదును సూర్యు నాప శర తండముచే భువిఁ జీల్చువాఁడ న

న్ను గనుమ కామరూపిని ఘనుం డగు కామదు వెఱ్ఱి తొయ్యలీ!  

3.     

 

 

 

ఆ.వె.

పలుకు చుండ నట్లు వచనమ్ము లసురుని

క్రుద్ధు నేత్ర యుగము కొనలు పచ్చ

గ నయి వెల్గుచు దినకర సన్నిభము శిఖి

ప్రబల తోడ నయ్యె రక్త మయము   

4.     

 

 

 

చం.

విడి వడి రమ్య సౌమ్యతర భిక్షు సురూపము వైశ్రవానుజుం

డడలు నొసంగు స్వీయ మగు నాకృతి నూనెను గాల సన్నిభం

బడరు మహోగ్ర రూపము మహాభ్ర నిభాంగుఁడు రక్త నేత్రుఁడై

వడఁకుచుఁ గోప భారమున భర్మ విభూషణ మండితుండునై

5.     

 

 

 

తే.గీ.

దశముఖుం డంత శర ధనుర్ధరుఁ డయి క్షణ

దాచరుం డయ్యెఁ గపటంపుఁ దాపసిత్వ

తనువు విడిచి మహాకాయుఁడు నిజ రూప

మూనె రక్షో గణాధిపుం డుగ్రుఁ డయ్యె                               

6.     

 

 

 

తే.గీ.

క్రోధమునఁ గన్ను లెఱ్ఱ రంగును వహింపఁ

దనర జీమూత సుప్రభా తనువు తా ధ

రించి రక్తాంబరమ్ముల నంచితముగ 

నిలిచెను గనుచు వనితామణి నసురుండు     

7.     

 

 

 

కం.

కని యసిత కేశను రవి రు

చి నడరు వస నాభరణను సీతను దన్వం

గిని రావ ణాసురుఁడు వ

ల్కె నిట్లు వాక్యములను దిరిగి కఠోరముగన్

8.     

 

 

 

ఆ.వె.

నీకు నేను సదృశమౌ కాంతుఁడ నితంబి

ని నను నాశ్రయింపుమ నిజ పతిగ

ముజ్జగముల ఖ్యాతి పురుషుఁ గోరుదు వేని

భర్తగ వరియింపు పడతి నన్ను

9.     

 

 

 

తే.గీ.

విప్రియము నీకు నెన్నఁడు వెలఁది సేయ

నన్ను భజియింపుమ చిరము నాతి! శ్లాఘ

నీయ పతిని నగుదు నీకు నీరజాక్షి

మనుజ భావము వీడి  కైకొనుమ నన్ను     

10.    

 

 

 

ఉ.

ఎట్టి గుణమ్ములం దలఁచి యిట్లనురక్తి వహింతు రాముపై 

నెట్టన రాజ్య హీను పయి నిత్య నిరర్థకుపై రయమ్మునం  

గిట్టెడు వానిపై నిజ సఖివ్రజ హీనము సూరిమానినీ!

వట్టి వెలంది మాటలను వ్యాల యు తాటవి నున్న వానిపై

11.    

 

 

 

తే.గీ.

ప్రియమునకు నర్హ మగు నామెఁ బ్రియ వచనను 

జేరి దుష్టాత్ముఁ డసురుఁడు మూర నెడఁదఁ

గామ మవనిజఁ బట్టెను గగన మందు

బుధుఁడు రోహిణీ కాంతను ముట్టి నట్లు     

12.    

 

 

 

తే.ీ.

వామ కరమున నసురుండు పద్మనేత్ర

సీత కేశములను బట్టి శీఘ్రమ కుడి

చేతిఁ దొడల క్రిందునఁ బెట్టె భీత చిత్త

నంత దుర్మదాంధుఁడు రావణాసురుండు 

13.    

 

 

 

కం.

కని తీక్ష్ణ దంష్ట్రు మృత్యు ని

భుని సుమహాభుజుని గిరిని బోలు నసుర నా

థుని భీతిం బాఱిరి యా

వనదేవత లెల్ల రంత వనమున నార్తిన్

14.    

 

 

 

చం.

అగపడె నంత మాయగ మహారథ మభ్ర మయమ్ముదివ్య మొ

ప్పగ ఖర నిస్వనమ్ములను బన్నుగ లాగ ఖరవ్రజమ్ములే

మగువ నిజాంక మందు నిడి మానిని భీతిలఁ జేయు మాటలం

దెగడుచు మిక్కుటమ్ముగను దేరున నుంచెను దీనురాలినిన్    

15.    

 

 

 

తే.గీ.

పట్టువడి రావణుని చేత వర యశస్వి

ని జనకాత్మజ కుయ్యిడె నిజపతి బహు

దూరమున నుండ వన మందుఁ దోరముగను

సీత హారామ యని యేడ్చెఁ జింత తోడ    

16.    

 

 

 

కం.

కామార్తుఁడు దశకంఠుఁ డ

కామను బన్నగ సతివలెఁ గంపిత గాత్రన్ 

భామను గ్రహించి రయముగ

నా మైథిలి తోడ నెగిరె నరదము తోడన్ 

17.    

 

 

 

తే.గీ.

రాక్ష సాపహృత నభో తలమ్మునం ద

రుగుచు నుండ వైదేహి గురుతర బాధ

తోడ నున్మత్త వోలె నాతురత సెలఁగ

భ్రాంతి తోఁ గడు పలవించె నింతి సీత    

18.    

 

 

 

ఆ.వె.

అన్నకొసఁగు వాఁడ యనవరత సుఖమ్ము 

దీర్ఘబాహువ!యరుదెంచి వనికి  

నాహ! లక్ష్మణ! మది నరయ వకట నన్ను

గోపి రక్కసుండు  గొని చనంగ   

19.    

 

 

 

ఆ.వె.

ధర్మము కొఱ కిట్లు ధరను జీవిత మర్థ

ము సుఖమును ద్యజించి మసలు నీ వ

ధర్ముఁ డపహరింప దారను గాంచవు

రాఘవేంద్ర! నను నరణ్య మందు

20.   

 

 

 

ఆ.వె.

రాఘవ! యవినీతుల నరసి దండించు

వాఁడ శత్రుదమన! పాపి నసుర

సత్తము నిట వేగ శాసింప వేల రా

వణునిఁ గ్రూర కర్ము వనము నందు

21.    

 

 

 

ఆ.వె.

పక్వ కాల మందు ఫలము లొసంగు స

స్యములు మున్న యీని చందముననె

కర్మ ఫలము లెల్లఁ గన్పట్ట వా క్షణ

మంద దుష్ట జనుల కవని లోన

22.   

 

 

 

ఆ.వె.

కాల వశుఁడ వీవు కర్మ మొనర్చితి

జీవి తాంత కరము రావణ! యతి

ఘోర మైన దాని నా రాముని వలనఁ

బొందు దీవు వ్యసనము భృశముగను      

23.   

 

 

 

ఆ.వె.

అకట ధర్మ కాముఁ డా రఘు వరు ధర్మ

పత్ని నపహరింప బంధు వర్గ

సహిత మింకఁ గైక సంతసించును దీర

స్వీయ కామితం బమేయముగను    

24.   

 

 

 

తే.గీ.

ఓ జనస్థానమున వెల్గు చున్న యట్టి

స సుమ కర్ణికారము లార సన్నుతింతు 

రామునకు క్షిప్రము హరించె రావణుండు

సీత నంచుఁ గరుణతో వచింపు డడరి   

25.   

 

 

 

తే.గీ.

ప్రస్రవణ గిరివర! మాల్యవంత శైల

రాజమ! నమస్కరింతును రామ సతిని  

రామునకు క్షిప్రము హరించె రావణుండు

సీత నంచుఁ గరుణతో వచింపు డడరి   

26.   

 

 

 

తే.గీ.

హంస కారండవ జలచ రావృతంబ! 

వందనములు గోదావరీ! వంద లిడుదు

రామునకు క్షిప్రము హరించె రావణుండు

సీత నంచుఁ గరుణతో వచింపు మడరి   

27.   

 

 

 

తే.గీ.

తరుల కియ్యరణ్యమ్మునఁ దనరు దేవ

తలకును నమస్కరింతును దలను వంచి

రామునకు క్షిప్రము హరించె రావణుండు

సీత నంచుఁ గరుణతో వచింపు డడరి   

28.   

 

 

 

తే.గీ.

ఎవ్వరెవ్వరు వసియింతు రిచట యట్టి

సత్త్వముల నెల్ల మృగపక్షి సంచయమ్ము

నెల్ల శరణు వేడెదు హరియింపఁ బడెడు

ప్రాణ సతి వివశ వివరింప వలెఁ బతికి    

29.   

 

 

 

ఉ.

నేరిన నమ్మహా భుజుఁడు నేర్పునఁ దెచ్చు మహా బలుండు దా

మూరుచు విక్రమమ్మునను బ్రొద్దు కుమారుని వద్ద నుండియున్

వీర వరుండు నా వగవ భీతిని జానకి కాంచె నంతటం 

జేరువ నందు వృక్షమున శ్రేష్ఠ విహంగము నా జటాయువున్

30.   

 

 

 

చం.

కని పలికెన్ భయం బడరఁ గాంత దశానన వశ్య యుమ్మల

మ్మున వచనమ్ము లివ్విధము బోరన గాంచుమ పక్షిరాజమా! 

యనుచిత రీతి నన్నసురుఁ డక్కట పాప మనస్కుఁ డాహరిం

ప నడరి యో జటాయువ! యవారిత మిట్టు లనాథ భంగినిన్ 

31.    

 

 

 

కం.

అసురుని సాయుధు నీ ఖలు

ని సత్త్వవంతుని నజేయుని నివారింపం

గ సమరమున నీవు బలము

న సమర్థుఁడ వని తలంప నా మన మందున్     

32.   

 

 

 

కం.

సకలమ్ము రామ లక్ష్మణు

లకు నీవు  జటాయువ! నను రావణుఁ డిట్లున్ 

వికలమతిని వనిఁ గొనిపో

వు కథ నశేషము వచింపు పురుష వరులకున్

33.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నలువది తొమ్మిదవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 50.

 

 

 

నిదురలో నున్న జటాయు వా ధ్వని విని లేచి రావణుని సీతను గాంచి రావణునితో రాముని భార్య నపరించుట తగదని విడువు మని హెచ్చరించుట, విడువ కున్న నతనితో యుద్ధ మొనరింప నుద్యుక్తుఁ డగుట.     

 

 

 

 

కం.

నిదురఁ గలట్టి జటాయువు

రొద విని పరికింపగ నసురుని రావణు నా

సుదతి నరసె జనకాత్మజ

ను దరువు పై నిలిచి యా ఘనుండు వెఱఁగునన్  

1.      

 

 

 

కం.

పర్వత కూటని భాంగుం

డుర్వి విహంగోత్తముండు నున్నత తుండా

ఖర్వబల సుసంపన్నుఁడు

గర్వ విహీనుఁడు వచించె ఘన శుభ గిరలన్     

2.     

 

 

 

ఉ.

ఆగుమ రాక్ష సోత్తమ! దశాస్య! సనాతన ధర్మ బద్ధుఁడన్

నే గురు పక్షి వంశజుఁడ నిత్యము సత్యము నాశ్రయించుచున్

డాఁగుదుఁ బాదపమ్ముల జటాయువు నాముఁడ వీర్యవంతుఁడన్

బాగుగ గృధ్ర రాడ్వరుని వాక్యము లియ్యవి యాలకింపుమా       

3.     

 

 

 

ఉ.

రాజగు లోక రాశికి పురందర పాశి సమాన వీరుఁడౌ

భూజన కోటి కెల్ల హితముం దగఁ గూర్చెడి వాఁడు రాముఁ డీ

భూజయె ధర్మ పత్ని యగు భూరి యశస్విని వాని కింపుగా

నీ జవరాలు సీత యను నిద్ధచరిత్ర గ్రహింప నెంచితే

4.     

 

 

 

ఆ.వె.

ధర్మ మందు నిలుచు ధరణీపతికిఁ బర

దార లందు నాశ తగునె మించి

రాజ భార్య లెల్ల రావణ! రక్షణీ

య లగుదు రనిశమ్ము నతి బలుండ!

5.     

 

 

 

తే.గీ.

విడువు మీ నీచ బుద్ధినిఁ బడతులఁ బర

దారల స్పృశించు దుర్బుద్ధి దశముఖుండ!

ధీర వరులు గర్హింతురు ధీ నిధులు త

మ సతుల వలె రక్షింతు రన్య సతుల నిల      

6.     

 

 

 

తే.గీ.

రాజ! ధర్మార్థ కామములఁ గన కున్న

శాస్త్రముల లోనఁ బౌలస్త్య! చక్రవర్తు 

లెల్లఁ బాటింత్రు నృపధర్మ మింపుగ నని

శమ్ము చక్క వక్కాణించి సమ్మదమున  

7.     

 

 

 

ఆ.వె.

ధర్మకామములకు ద్రవ్యమునకు నిధి

యౌను జక్కఁగను ధరాధినేత

మూలమగును రాజు భువి ధర్మ శుభముల

కైన పాపములకు నైన నెన్న      

8.     

 

 

 

కం.

చపలుండవు పాపుండవు 

విపరీతము దుష్కృతముల వెలయించుచు ని

ట్లపరిమి తైశ్వర్యము నక

ట పడసితి విమానమును బడసిన వెరవునన్

9.     

 

 

 

ఆ.వె.

ఉన్న యొకని నైజ మెన్న డైనను మార్పఁ

దరము కాదు దుష్టు ధామ మందు

నున్న సంపద చిర ముండ నోపదు సత్య

మెన్న నెపుడు రాక్షసేంద్ర! వినుమ       

10.    

 

 

 

ఆ.వె.

చేయ డింత యేని చేటు నీ పురి కైన

రాజ్యమునకు నైన రాముఁ డా మ

హా బలుం డతనికి నా ధర్మ చిత్తున                

కు నప కార మేల కూర్తు వీవు

11.    

 

 

 

ఉ.

కానన మందు శూర్పణఖ కారణ మా ఖరుఁ డప్పు డా జన

స్థానమునన్ వధింపఁ బడె సంగర భూమిని రాఘవేంద్రుచే

నా నరనాథు దోష మట నారయ నున్నదె చెప్పు సత్యమున్

మానిని లోకనాథ సతి  మానవతిన్ హరియించి పోదువే

12.    

 

 

 

తే.గీ.

వీడు క్షిప్రమ్ము వైదేహిఁ బాడిగ నసు

రేంద్ర! దందహ్యమానము లీ ని జేక్ష

ణముల నిన్ను దహింపఁ దనరక మున్న

వృత్రు నింద్రు వజ్రము భంగి భీకరముగ      

13.    

 

 

 

ఆ.వె.

విష సమన్వితమ్ము పెను పాము నుంచి వ

స్త్రమున నేర వకట రాక్షసేంద్ర!

గళము నందు నున్న కాలపాశమును గాం

చంగ నేర వీవు చావు నకట       

14.    

 

 

 

ఆ.వె.

అవని మోయఁ గలిగి నట్టి యలసట నొ

సంగ నట్టి బరువు చనును మోయ

రోగ మీయ కుండ రుచిర మఱుగు నట్టి

యన్నము భుజియింప నర్హ మగును        

15.    

 

 

 

కం.

ఎయ్య దొనరింప ధర్మము

వ్రయ్య లగుఁ బ్రసిద్ధి కీర్తి లయ మగునో యిం

కెయ్య దిడు శరీరవ్యథ  

యయ్యది సేయంగ నెవ్వ రైన తలఁతురే    

16.    

 

 

 

కం.

అరువది వేలేండ్లు చనిన

వి రావణా! పుట్టి నేను బిత్రార్జితమై

పరఁగెడు రాజ్యము పాలిం

తు రమ్యముగ ధర్మ మూని తుష్టాత్ముఁడనై

17.    

 

 

 

కం.

ముదుసలి నేఁ దరుణుఁడ వై

న దశానన! యున్న స్యందనమున శరయుత

మ్ముఁ దనుత్రాణముతో ధను

వు దనరిన గ్రహించి సీతఁ బోలేవు ససిన్   

18.    

 

 

 

ఆ.వె.

చూచు చుండ నేను సుదతి సీతను బల్మిఁ 

గొని చనంగ జాల వనఁగ నిజము

తర్క హేతువులను దరమె హరింపగ

వసుధ నిల్చు వేద వాక్యములను      

19.    

 

 

 

కం.

నిలువుమ యొక్కముహూర్తము

చలమునఁ జేయ సమరమ్ము శౌర్యం బున్నన్

విలయుం డైన ఖరుని వలె

నిల నిదురింతువు లయించి యింపుగ నిచటన్            

20.   

 

 

 

చం.

పలుమఱు దైత్య దానవుల భండన మందు వధించె రాముఁడే

విలయ మొనర్చు శీఘ్రముగ వీరుఁడు వల్కల ధారి రాఘవుం

డిల నిను నేను జేయఁ గల దెయ్యది రాఘవు లేఁగ దూరమే

బలు లగు వారి భీతి నిఁకఁ బ్రాణ విహీనుఁడ వౌదు రావణా!       

21.    

 

 

 

ఆ.వె.

బ్రతికి యుండ నేను రాముని పత్నినిఁ 

బుణ్యశీల సీతఁ  బుడమి పట్టిఁ

గమలపత్ర నేత్రఁ గైకొని చన జాల

వీవు దశముఖుండ! యెన్నఁ డైన     

22.   

 

 

 

తే.గీ.

చేయ వలె నవశ్య మిట నమేయముగఁ బ్రి

య మగు నీ రామ కార్యము నవని పతి ద

శరథు కార్యమ్ము గూడ యశస్వి యా మ

హాత్ముఁ డసువుల కన్న నా కధికుఁ డగును    

23.   

 

 

 

తే.గీ.

నిలు నిలు దశకంఠ! క్షణము నీకు నిత్తు

నేను రణపు టాతిథ్యము మేన నసువు

లుండఁ బడవైతు నరదమ్ము నుండి తెగిన

తాల ఫల సదృశమ్ముగ నేల పైన     

24.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నేఁబదవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 51.

 

 

 

జటాయువు రావణునితో ఘోరముగాఁ బోరాడి సారథిని రథమును గుఱ్ఱములను గూల్చి నఖ తుండములతో వానిని బాధించుచుండ రావణుఁడు ఖడ్గము గైకొని నాతని ఱెక్కలను గాళ్లను నఱుక సీత జటాయువును జేరి విలపించుట.  

 

 

 

 

కం.

అనిన జటాయువు న్యాయ వ

చనములు విని రావణుండు సక్రోధుండై

తన నేత్రము లిరువది వె

ల్గ నగ్నికణ సన్నిభమ్ముగ నసుర గాంచెన్

1.      

 

 

 

చం.

అసురుఁడు రక్తనేత్రుఁడు మహాగ్రహుఁ డర్జున కుండలుండు రా

క్షస గణనాథుఁ డంతట ఖగప్రవరుం దగఁ దాఁకె రావణుం

డు సమర మయ్యె నప్పుడు కడుం గడు ఘోరముగా నభమ్మునన్

వెస వని మారు తోద్ధత సుభీమ ఘనద్వయ సంగ మాభమై            

2.     

 

 

 

ఆ.వె.

రాక్షస గణ నాథ పక్షి రాడ్వరుల స

మరము ఘోర మయ్యె మాల్యవంత

పర్వతమ్ముల సహపక్ష గిరీంద్రము

ల సమరమ్ము పగిది రభసముగను

3.     

 

 

 

చం.

సునిశిత మార్గణమ్ములను శూరుఁడు రావణుఁ డేసె నా విక

ర్ణి నిచయ ముగ్ర శృంగముల నీడజ రాడ్వరు పై మహాబలుం

డనితర సాధ్యుఁ డా శరము లన్నిటిఁ బత్ర రథేశ్వరుండు నో

ర్మిని భరియించె యుద్ధమున మీఱిన వీర్య పరాక్రమమ్ములన్   

4.     

 

 

 

చం.

పతగ వరేణ్యుఁ డంత నిజ పాద నఖావలి రాక్షసేంద్రునిన్

వితతము చీల్చి గాత్రములు విద్ధునిఁ జేసెను మిక్కుటమ్ముగా 

నతులిత కోపమూర్చిత దశాననుఁ డంబకముల్ పదింటినిం

బతితునిఁ జేయ శత్రువును బన్నుగ వేసెను మృత్యు దండముల్

5.     

 

 

 

తే.గీ.

అట్లు లాగి యాకర్ణాంత మమ్ములు విడు

వఁగ నజిహ్మగములు దశవక్త్రుఁ డడరి

ఘోరములు శిలీముఖములు గూడుకాన్పుఁ

జీల్చినవి జటాయువును నిశిత శరములు              

6.     

 

 

 

కం.

కని యసురు నరదమున సీ

తను భాష్ప నయనను బాణ తతి నిసుమం తే

ని నట గణింపకయే దు

మ్కె నా జటాయు వసురు పయికిఁ గరం బలుకన్    

7.     

 

 

 

చం.

శరమును గూడి చాపమును సన్మణి భూషిత మా ఖగేంద్రుఁడే

చరణ యుగమ్ముతో విఱిచె సన్నుత తేజుఁడు విక్రమమ్మునం

ద్వరితము నన్యచాపమును దాఁ గొని రావణుఁ డాగ్రహమ్మునన్

విరివిగ వేలు వేలు శర వృష్టిఁ గురించెను బక్షిరాజుపై

8.     

 

 

 

ఆ.వె.

శరము లావరింప సంయుగమ్మునఁ బత

గేశ్వరుండు వెలిఁగె నిమ్ముగ నట

గూటిఁ జేరి నట్టి మేటి పక్కి పగిది

సందు లేక సుంత వింత కొలుప  

9.     

 

 

 

తే.గీ.

ఱెక్కల శర వర్షం బెల్ల నక్కజముగఁ

జెదరఁ గొట్టి సత్త్వమ్మున బెదరకుండ

విఱిచెను జరణమ్ముల గొప్ప వింటి నప్పు

డా మహా తేజుఁ డవలీల నడరి యంత      

10.    

 

 

 

ఆ.వె.

అగ్ని సన్నిభంపు టసురుని రావణు

కవచ మంతఁ జించె గ్రక్కున నిజ

పక్ష యుగము చేతఁ బతగేశ్వరుఁడు మహా

వీర్యవంతుఁ డపుడు శౌర్య మడర  

11.    

 

 

 

తే.గీ.

కాంచ నోరశ్ఛద పిశాచ కమ్ర వక్త్ర

దివ్య ఖర వరమ్ముల నతి తీవ్ర వేగ

వంతముల నెల్లఁ జంపెను బక్షి రాడ్వ

రుఁడు జటాయు వత్యంత బలుండు తృటిని

12.    

 

 

 

కం.

మువ్వెదురుల విలసిల్లెడు 

ఱివ్వునఁ గామగ మడుగు తఱిం జనఁ గల దే 

దవ్వులకు హేమ మణి మయ

మవ్వర రథమును విఱిచె విహఁగ మవలీలన్

13.    

 

 

 

కం.

గొడుగుం బూర్ణ శశి నిభము

వడి వ్యజనమ్ములను గూడి పట్టిన వారిన్

విడువక రక్కసుల నతఁడు

తడయక కూల్చె ఖగరాజు తద్దయు బలిమిన్    

14.    

 

 

 

తే.గీ.

పక్షిరాజు తిరిగి మహాబలుఁడు శ్రీమ

దమల చిత్తుఁడు ఘన వేగ మడరఁ దనదు

తుండమున సారథి శిరముఁ ద్రుంచె ఘనము

విక్రమించి జటాయువు భీకరముగ

15.    

 

 

 

కం.

అతఁ డా భగ్న ధనువు విని

హత సారథి హీన రథ హతాశ్వుఁడు  సీతా

సతి నంకమ్మున రక్షః

పతి రావణుఁ డుంచి పుడమి పైనం గూలెన్      

16.    

 

 

 

కం.

దరణిం గూలిన రావణు

నరసి విఖండిత శతాంగు నవ్వన మందున్

వర పక్షీంద్రు నఖిల భూ

త రాశి నుతియించె సాధు తర మని ప్రీతిన్

17.    

 

 

 

చం.

అలసిన గృధ్ర రాజము దశాననుఁ డారసి సంతసమ్మునం

గలఁగ ఖగమ్ము వృద్ధతను గాంతను గైకొని యుద్గమింపఁగాఁ

గులుకుచు సీత నంకమునఁ గోమలి నుంచుచుఁ బోవు వానినిం

బులుఁగు జవమ్మునం బఱచి బోరన నాపుచుఁ బల్కె నివ్విధిన్

18.    

 

 

 

ఆ.వె.

వజ్ర సదృశ బాణ పాణి రాముని దార

నపహరింపఁ దలతు వల్ప బుద్ధి! 

రాక్షస గణ దుర్మరణ నిమిత్త మగును

నిశ్చయముగ దీని నేర వీవు  

19.    

 

 

 

ఆ.వె.

దప్పి గొన్న వాఁ డుదకము ద్రాగు పగిది 

విషముఁ ద్రావ నెంతు వెఱవకయె స

బల కుమార నిచయ బంధు మిత్రామాత్య 

నిజ పరిచ్ఛదమ్ము నిరతి నూని

20.   

 

 

 

కం.

కర్మపుఁ బర్యవసానము

దుర్మతు లెఱుఁగక నశింత్రు తూర్ణం బట్లున్

ధర్మమె ఱుంగని నీ వీ

కర్మమున నశింతు తప్పక దశగ్రీవా!     

21.    

 

 

 

కం.

చిక్కితివి కాల పాశపుఁ

జిక్కమునం దివ్విదమ్ము చేప పలాశన్  

వృక్కాశను గాలమునం

జిక్కిన భంగి విడుపు నరసి చనఁ దరంబే       

22.   

 

 

 

ఉ.

సైఁపరు నిన్ను దుర్జయులు సల్పగ నాశ్రమ ధర్షణమ్మునుం

గోపము నూని రాఘవులు ఘోరతరంపు టకృత్య మెన్నఁడుం

బాపపు లోక గర్హితపు వంచక కార్యము చోరు భంగినిం 

దోఁపక వీరు చందమున ధూర్తుఁడ! భీరుని భంగిఁ జేసితే  

23.   

 

 

 

కం.

నిలువుమ యొక్కముహూర్తము

చలమునఁ జేయ సమరమ్ము శౌర్యం బున్నన్

విలయుం డైన ఖరుని వలె

నిల నిదురింతువు లయించి యింపుగ నిచటన్           

24.   

 

 

 

తే.గీ.

మరణ మాసన్నమైనచో మానవుండు

సంభ్రమించును జేయఁగ సత మధర్మ

కార్యముల నవ్విధము దశకంఠ! చేయ

నుద్యమించితి నిజ లయ మొంద నీవు

25.   

 

 

 

కం.

పాప మొసఁగు పనులఁ దలఁప

నోపుదురే యెవ్వ రైన నుర్వి జగములం

గాపాడు స్వయంభువుఁడును 

జూపునె యాసక్తిఁ జేయ సురవరుఁ డైనన్    

26.   

 

 

 

చం.

పలికి శుభమ్ములౌ గిరలు పన్నుగ నిట్లు ద్విజేంద్రుఁ డంతటం

జెలఁగి దశాస్యు వీపు పయి శీఘ్రమ వ్రాలి కడింది వాడి గో

రులను సుఘోర తీక్ష్ణముల రుద్ర నిభుం డయి గీరె వీరుఁడే

యలుక వహించి యెల్లెడల హస్తిని దుష్టముఁ గొట్టు నట్టులన్  

27.   

 

 

 

ఆ.వె.

నఖ పతత్ర ముఖ ఘనప్రహరణుఁ డంత

నొక్కి యసురు వీపు ముక్కున నిజ

నఖముల వడి గీరుచు ఖగ రాజేంద్రుఁడు     

పీఁకెఁ గేశములను భీషణముగ    

28.   

 

 

 

తే.గీ.

పల్మరు నిడఁ గ్లేశములను బక్షి రాజు

కినుకఁ గంపింపఁ బెదవులు ఘనముగ దశ

ముఖుఁడు వణఁకెను రోషమ్ము మూర రమణి

యవనిజ నునిచి వామాంక మందు నంత

29.   

 

 

 

చం.

తన యఱచేతఁ బక్షి వరుఁ దాడితుఁ జేయ దశాస్యుఁ డత్తఱిన్   

ఘనముగఁ గ్రోధ మూర్ఛితుఁడు కంపము నందక యాక్రమించి ము

క్కున ఖగ రాడ్వరుం డడరి కోసె నహో దశ వామ హస్తముల్

జనితము లయ్యెనే తిరిగి సవ్య కరమ్ములె యక్కజమ్ముగన్     

30.   

 

 

 

తే.గీ.

పుట్ట నుండి బయల్పడు నట్టి పాము

ల వలె  హస్తములు మొలవ రావణుండు

సీత విడిచి భీషణ ముష్టి ఘాతములఁ జ

రణములఁ గడు బాధించె గృధ్రప్రవరుని        

31.    

 

 

 

ఆ.వె.

అంత నతుల వీర్యు లా యిరువుర మధ్య

రాక్షస నిచయంపు రాజు మఱియు

విహగ సంచయంపు విభుని మధ్య నతి ఘో

ర రణ మయ్యె నా యరణ్య మందు   

32.   

 

 

 

ఆ.వె.

రామ కార్య మెంచి రణ మొనరించు జ

టాయువు చరణము లడరి నిజాసి

నూని యిరువయిపుల  నుండు ఱెక్కలను ఖం

డించె రావణుండు మించ బలము  

33.   

 

 

 

ఆ.వె.

ఱెక్కలు తెగ నట్లు మిక్కిలి కోపము

తో నఱుక నసురుఁడు తూర్ణ మంతఁ

బడెను నేల పైనఁ బక్షిరాజు కొన యూ

పిరి తనరఁగ నలసి కరము ఘనుఁడు

34.   

 

 

 

ఆ.వె.

పడ జటాయువు  ధరఁ బడసి గాయమ్ములు

కాంచి సీత జనక కన్య కలఁగి

తనదు బంధు భంగిఁ దరుణి పరువు వెట్టెఁ 

జేర విహగ నాథు శీఘ్రముగను   

35.   

 

 

 

ఆ.వె.

నీల మేఘ కాయు నీడోద్భవుని శుద్ధ

వక్షు వీరవర్యుఁ బతగ విభుని  

నాఱిన వనవహ్ని యన నుండ లంకాధి 

పతి దశ ముఖుఁ డెలమి నతనిఁ గాంచె

36.   

 

 

 

కం.

ధరణిం గూలిన విహగము

నరసి జనక తనయ దశ ముఖార్దితమును జే

రి రయమున స్పృశించుచు మృదు

కరముల విలపించె సీత కాంతారమునన్  

37.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నేఁబది యొకటవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 52.

 

 

 

రావణుండు సీతను దీసికొని పోవు చుండ నామె రామ లక్ష్మణుల నుద్వేగమునఁ బల్మఱు శోకార్తయై వేఁడికొనుట.

 

 

 

 

కం.

సీత శశి నిభాస్య యసుర

పాతిత విహగేశుఁ గాంచి పరితాపముతో

నా తన్వి విలాపించె న

హో తోరమ్ముగ ఘన జని తోద్వేగమునన్     

1.      

 

 

 

చం.

ఘను లగు లక్షణజ్ఞు లిలఁ గాంతు రనేక నిమిత్తముల్ విహం

గ నినదముల్ సుఖాత్యయ నికాయము లందు నరోత్తముల్ దగం

దన కొఱ కున్న యాపదను దథ్యము నేరఁడు రాముఁ డింత యే

ని నకట నా నిమిత్తము ననేక మృగద్విజ కోటి పర్విడన్        

2.     

 

 

 

తే.గీ.

పాప చరితుని చేతఁ గాపాడఁగ నను

నేల పైనఁ గూల్పఁ బడఁగ నిద్ర లోన

మునిఁగె నిచ్చోట ఖగ రాజము కడు డస్సి

నాదు దౌర్భాగ్య మియ్య దనంగ నకట             

3.     

 

 

 

తే.గీ.

రామ! రక్షించు కాకుత్స్థ! లక్ష్మణ!  నను

నంచు నెంచుచు నంతిక మందు నున్న

విందు రని సుసంతప్త యా యిందు వదన

సేసె నాక్రందన మెడందఁ జింత నంది

4.     

 

 

 

ఆ.వె.

కృశ తను లలితాంగిఁ గ్లిష్ట మాల్యాభర

ణ నరసి విలపించు నాతి సీత

రాక్ష సాధిపుండు రావ ణాసురుఁ డంతఁ

బఱువు తీసె నామె పార్శ్వమునకు

5.     

 

 

 

చం.

లత వలెఁ జుట్టి పాదప వరమ్ముల నున్న లతాంగి వీడు మె

ల్ల తరుల నంచుఁ బల్మఱును రావణుఁ  డా రఘురామ పత్నితో

డుత నని రామ రామ యని డుంగుచు నేడ్చెడు రామ హీననున్

సతిని గ్రహించెఁ గేశముల సౌరి సముం డయి  చావ సిద్ధమై    

6.     

 

 

 

ఉ.

ఎల్లల నన్ని దాటి సతి నెంతయొ తల్లడ పెట్ట నట్టులం

గల్లరి రావణుం డట జగమ్ముల స్థావర జంగమమ్ములన్ 

మెల్లగ నంధకార మది మించెను మారుతి వీవ భీతిలెం

జల్లగ నయ్యె భాస్కరుఁడు ఛాయ నశింపఁగ మిక్కుటమ్ముగన్

7.     

 

 

 

తే.గీ.

చూచి సీతను దీనను సుదతి దొంగి

లింప రావణాసురుఁడు నలినభవుండు

తనదు దివ్య చక్షువుల నంతయును నంతఁ   

బలికెఁ గృత మయ్యెఁ గార్యము పన్నుగ నని

8.     

 

 

 

తే.గీ.

సంతసము నింక దుఃఖము సంభవించె

దండకారణ్య మందున్న తాపసులకు

రావణ సహజ సిద్ధపు లయము నరయఁ

గాంచ సీతను బాధింపఁ గాంత నట్లు  

9.     

 

 

 

ఆ.వె.

రామ రామ యంచు లక్ష్మణా యంచు రో

దించు సీత నంతఁ గొంచుఁ జనెను

గగన మార్గ మెంచి విగత భయమ్మున 

రాక్షసాధిపుండు రావణుండు   

10.    

 

 

 

తే.గీ.

తప్త కాంచ నాభరణ యా తరుణి భవ్య

పీత కౌశేయ వస్త్రయు సీత రాజ

పుత్రి శంపాలత యనంగఁ బుణ్య శీల

వెలిఁగె నత్తఱి నాకాశ వీథి యందు      

11.    

 

 

 

ఆ.వె.

ఆమె పీత వస్త్ర మప్పు డెగురుచుండ 

రావణుఁడు వెలిఁగెఁ గరమ్ము వహ్ని

తోడ వెలుఁగు నట్టి తోరంపుఁ బర్వత 

రాజ సన్నిభమ్ము రాక్షసుండు

12.    

 

 

 

తే.గీ.

పరమ కల్యాణి జానకి పద్మ దళము

లనుపమ సుగంధ యుక్తము లసుర నాథుఁ

డా దశానను పై నెఱ్ఱ నైన రంగు

నడరు చుండఁగ వెదచల్లఁ బడిన వపుడు  

13.    

 

 

 

ఆ.వె.

కనక రుచిని వెల్గు కౌశేయ మెగురు చుం

డంగ గగన వీథి నంగనా మ

ణీ మతల్లి  దపుడు నెగడె నరుణ రవి

కాంతి తోడ వెల్గు ఘనము భంగి        

14.    

 

 

 

కం.

చక్కని ముక్కున నడరిన 

యక్కాంతా రత్న సుంద రానన కాంతుల్ 

తక్కినవి లేక  రాముం

డక్కడ నాళమ్ము లేని యబ్జము భంగిన్   

15.    

 

 

 

చం.

జలదముఁ జీల్చి నీలమును జక్కగ నుద్భవమౌ శశాంకు స

ల్లలితపు రూపుఁ బోలి సులలాట సుకేశము లొప్ప జానకీ

లలన విశుద్ధ దంతముల రమ్య విభూషిత సుందరాస్య క

న్నుల జల మెల్ల నొత్తుచును నొవ్వున నేడ్చుచు సుందరాకృతిన్      

16.    

 

 

 

ఆ.వె.

రమ్య నాసిక చిఱు వ్రణమైన లేక యె

ఱ్ఱని పెదవులతో గగనమునఁ గన

క రుచులు మెఱయంగఁ గన్పట్టె రావణు

నంక మందు నుండి యరుగు వేళ       

17.    

 

 

 

కం.

రావణ సుమహా కంపిత

యా వైదేహి వదనము నిజాత్మేశుం డా

భూవరు లేమి వెలుఁగదు ది

నావిర్భూత శశి భంగి నాకాశమునన్

18.    

 

 

 

ఆ.వె.

నలుపు రంగు మేనున నసురుఁ డుండఁగ

హేమ వర్ణ యయిన భామ సీత

కాంచ నంపుఁ గాంచి యంచిత నీలమ

ణి పయి నడరి నట్లు నెగడు చుండె    

19.    

 

 

 

తే.గీ.

ఎఱ్ఱ తామర వంటి మే నింపయిన ప

సిండి రంగున మెఱయంగ సీత యసురు

చెంతఁ దప్త కాంచన భూష వింత మబ్బు

తోటి మెఱపు పగిది నుండె బోటి యపుడు      

20.   

 

 

 

ఆ.వె.

భూమి తనయ సీత భూషణ రవములు

మ్రోఁగు చుండ నపుడు తాఁ గనపడె 

రాక్ష సాధిపుండు రసితము లింకను

మెఱపు తోడ నల్ల మేఘము వలె   

21.    

 

 

 

చం.

శిరమున నున్న పుష్పములు సీత నహో గొని పోవుచుండఁగాఁ

గురిసిన వెల్ల నేల పయి ఘోరపు వేగపు గారణమ్మునం

దిరిగి దశాస్యు వెన్క నవి తేలుచుఁ బర్వెను వింత వింతగా

విరివిగఁ బుష్పవృష్టి యన వెల్గుచు నెల్లెడ లందు నత్తఱిన్   

22.   

 

 

 

ఆ.వె.

పుష్పధార తిరిగె బోరన వైశ్రవ

ణానునుజుని చుట్టు నరయ విమల

మేరు నగము చుట్టుఁ దారల మాల తి

రిగెడు నట్టులఁ జెలరేఁగి యపుడు

23.   

 

 

 

ఆ.వె.

సీత కాలి నుండి చెన్నుగ రత్నభూ

షితము నూపురమ్ము శ్రేష్ఠ తరము

వెలుఁగు లీను చుండ విద్యుత్తు మండల

మ్ము వలె మృదు రవమునఁ బుడమిఁ గూలె   

24.   

 

 

 

తే.గీ.

లేత యెఱ్ఱని చిగురు వోలెఁ గనిపించు

సీత చారు లతాంగి యసిత ఘనాఘ

న నిభ రాక్షసుఁ బ్రభలఁ దనరఁగఁ జేసె

గజ వరేణ్యునిఁ గాంచన కక్ష్య వోలె

25.   

 

 

 

కం.

వెలుఁగుచు నుండఁగ నుల్క వ

లె లతాంగి స్వతేజమున విరివిగ నసుర మై

థిలిని  నభో వీథిఁ గొని త

రలె వైశ్రవణానుజుండు రావణుఁ డంతన్     

26.   

 

 

 

ఆ.వె.

క్షీణ తార లవని క్షిప్రము వడు నట్టి 

భంగి నగ్ని సదృశ వర్ణము లగు

సీత భూషణములు సెదరె నేలను జాఱి   

నభము నుండి నిస్వనముల తోడ     

27.   

 

 

 

తే.గీ.

పడెను మెడ లోని హారము పుడమి పైనఁ

బరఁగ మించి తారాధిప ప్రభల నెల్ల   

గగన భాగమునుండి వేగమ్ము తోడఁ

బడిన భాగీరథీ నది పగిది భువిని   

28.   

 

 

 

ఉ.

గాలికి సంచలింపఁగ ఖగవ్రజ సంయుత పాదపాగ్రముల్ 

లాలన భీతి సెందకుమ రామ సతీ యను పల్కు లొప్పెనే

తూలిన పద్మ షండముల దుఃఖిత మీన జలే చరమ్ములన్ 

వ్రాలఁగ నూర్పులే సఖుల భంగిఁ గలంగిన వా తటాకముల్    

29.   

 

 

 

ఆ.వె.

సీత నీడ నపుడు సింహ శార్దూల మృ

గద్విజములు కినిసి కరము ననుగ

మించినవి పరుగుల మించి యెల్లెడ లందు

నుండి వేగ మడర నుగ్ర వనిని       

30.   

 

 

 

కం.

జలపా తాస్రు ముఖమ్ముల 

విలసచ్ఛృం గోచ్ఛ్రిత భుజ భీషణ నగముల్ 

లలనామణి నపహృత మై

థిలి వీక్షింప విలపించు తీరున నుండెన్

31.    

 

 

 

ఆ.వె.

తెల్లని గుడికట్టు తెల్ల మయ్యె రవికిఁ 

జుట్టు దినము నందుఁ జూడ నపహృ

తావని తనయ రవి దగ్గ తనదు కాంతు

లెల్ల దీనుఁ డయ్యెఁ దల్లడిల్లి    

32.   

 

 

 

తే.గీ.

ఎక్క డున్నది యీ ధర్మ మెక్క డుండె

సత్య మార్జవమ్ము దయయు సతిని రామ

పత్నిని హరింప రావణ పాతకుండు

వగచె సర్వ భూతము లిట్లు వరుసఁ బలికి  

33.   

 

 

 

ఉ.

చూచుచుఁ జూచుచున్ దిశల శోక గ తాక్షుల నిండ నస్రులే 

యా చిన జింక శాబకము లచ్చట నేడ్చిన వెల్ల దీనతం 

జూచి యరణ్య దేవతలు శోకముతో విలపించు సీతనే  

యేఁచగ దుఃఖమే మిగుల నెల్లరు కంపిత గాత్ర లై రటన్          

34.   

 

 

 

చం.

ఘనముగ నేడ్చు చున్న నృపకాంతను బల్మఱు రామ! లక్ష్మణా!

యని మధుర స్వరమ్మున నిలాత్మజఁ జూచుచు నుండ భూమిఁ దా

ననిశము బొట్టు ఫాల తల మందు సెడం జికురమ్ము లూడఁగం 

గొని చనె తా నిజ చ్యుతికి ఘోర దశాననుఁ డా మనస్వినిన్   

35.   

 

 

 

కం.

దరహాస చారు దతి బం

ధు రహిత రాఘవులు నిలువ దూరమ్మునఁ దా

నరయఁగ లేక వివర్ణ య

యి లలన సీత భయ మందె నెడఁదన్ మిగులన్      

36.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నేఁబది రెండవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 53.

 

 

 

సీతా దేవి గగనమున కెగిరిన రావణుని గాంచి భీతిల్లి రోషము నూని విడువ మని వేఁడికొని,  నిందించి మఱియు భయ పెట్టు చుండ రావణుఁడు సీతా దేవిని గొనిపోవుట.   

 

 

 

 

కం.

అసురుఁ డెగుర గగనమునకు

వెసఁ గని మైథిలి నితాంత భీతి మదిఁ జెలం

గ సతి జన కాత్మజ వగచె

నసమోద్విగ్న యయి కోమలాంగి భృశముగన్

1.      

 

 

 

తే.గీ.

కొని చనుచు నుండఁ దన నట్లు కనులు రక్త

వర్ణ మూన రోదన రోష భారమునఁ గ

రుణను వగచుచు మానినీ మణి వచించె

నంత భీమాక్షు రావణు నరసి యిట్లు     

2.     

 

 

 

ఉ.

వేచుచు దొంగిలించి చన భీతను నొంటరి దాని రావణా!  

నీచపుఁ గర్మ మివ్విధము నీ వొనరింపఁగ సిగ్గు సెందవే

వే చనఁ జేసి నా పతిని భీరుఁడవై మృగరూప మాయచే 

నీచ! హరింప నెంతువ యనిందిత నిట్టుల రాక్షసాధమా!

3.     

 

 

 

కం.

నను రక్షింపఁ దొడంగిన

ఘన పక్షీంద్రుఁడు సఖుండు కాకుత్స్థుం డై

న నృవరునకు నా మామ కి

ట నిపాతితుఁ డయ్యె నక్కట యనిని నీచేన్

4.     

 

 

 

చం.

కనఁబడు నీదు వీర్య మధికమ్ముగ నక్కట రాక్షసాధమా!

వినఁబడ నీదు నామమును బీరముగా వచియించితే రణ

మ్మున నను గెల్వ లేదు విరిఁబోఁడి హరించెడు గర్హ్య కార్యమే 

యొనరిచి యొంటిగా నిలువ నూనవు సిగ్గు నొకింత యక్కటా    

5.     

 

 

 

ఆ.వె.

కథలుగ వచియింత్రు కర్మ మధర్మ్యము

క్రూరము నొనరింపఁ గ్రూర! నీవు

విశ్వ పురుషు లెల్ల వీరుఁడ వని నిన్ను

నీవ తలఁతు వకట రావణుండ!     

6.     

 

 

 

ఆ.వె.

శౌర్య మౌర నీదు సత్వము నిస్సీ వ

చింతె కులము నెల్లఁ జెఱచు నట్టి

విట్లు చెప్ప నేల యింక నీ చరితమ్ము

ధాత్రి నొసఁగు రోఁత తథ్యముగను

7.     

 

 

 

ఉ.

చేయున దెయ్య దున్న దిఁకఁ జీ పరువెత్తుచు నుంటి విట్లు నీ

వీ యెడ నిల్వు మొక్క త్రుటి యేఁగవు ప్రాణము లుండ బొందిలో 

నా యవనీప పుత్ర వరు లారయ నొక్క క్షణంబు నైననున్ 

నీ యఖిలంపు ఘోరపు టనీకము వచ్చిన నిల్వ నేరవే    

8.     

 

 

 

కం.

వన మందు మండెడు ననల

మును విహగము సుంత యేని ముట్టంగా నే

రని భంగి రాఘవు లిరువు

రి నిశిత బాణాగ్ని సైఁప లేవు దశాస్యా!   

9.     

 

 

 

చం.

విడువుము నన్ను రావణ! వివేకము తోడుత మేలు నీ కగున్

బెడిద మొసంగ నాకు వ్యధ భీషణ కోపము నూని రాఘవుల్

విడువక యున్న నన్నిపుడు వీర వరేణ్యులు రామలక్ష్మణుల్

మడియఁగ నిన్ను జేయుదురు మాన ధనుల్ దశవక్త్ర! వేగమే        

10.    

 

 

 

ఆ.వె.

యత్న మెద్ది తలఁచి యపహరింప బలిమిఁ   

దలఁతు వయ్య దెల్లఁ దథ్యముగ ని

రర్థకమ్ము నీచ! రాముఁ గనక యసు

వులు ధరింప నిట రిపు వశ నయిన   

11.    

 

 

 

తే.గీ.

మృత్యు వాసన్న మైనచో నిత్యము విప

రీతము లొనరింత్రు నరు లా లీల నీవు

నీకు హిత మైన దెయ్యదొ నేర వింక

మేలు నొసఁగు పనులఁ గాంచఁ జాల వకట     

12.    

 

 

 

కం.

మరణింపఁ దలఁచు వారలు

ధరం దమకుఁ దగిన దెద్ది దాని నకట నే

రరు కాల పాశమును నే

నరయుదు నీ కంఠ మందు నడరఁగ నసురా!      

13.    

 

 

 

ఆ.వె.

భయపు స్థాన మరసి భయపడ వీవు ద

శాననా! రవంత కాన వ్యక్త

మయ్యె నరయు చుంటి వంచు నీవు హిరణ్య

మయ మహీరుహముల మానహీన!     

14.    

 

 

 

కం.

కాంతు వసి పత్ర భీమ వ

నాంతము రావణ! దశాస్య! యా వైతరణిన్ 

సాంతము సాంద్ర తర రుదిర

వంతము ఘోరమ్ము నింక భయదాయకమున్   

15.    

 

 

 

తే.గీ.

పుటము వేసి నట్టి పసిడి పువ్వు లడరు

పిల్లికన్రతనములుగా విరివి యాకు

లినుప ముల్లులు దనరంగ నెల్ల నట్టి

పెద్ద బూరుగు చెట్టును వెసఁ గనుదువు      

16.    

 

 

 

ఆ.వె.

విషము త్రాగి మనని విధముగ వంచింప

నీ మహాత్ముల నిట నిట్లు నిర్ద

యుండ! నీవు బ్రతికి యుండఁ జాలవు చిర

కాల మవనిని దశకంఠ! నిజము     

17.    

 

 

 

ఆ.వె.

జముని త్రాడు మెడకు నమరంగ నడ్డగిం

పంగ రాని దకట పాఱి యెటకు

శాంతి నందు దీవు చింత నరయకుండ

నాదు భర్త నుండి యో దురాత్మ!

18.    

 

 

 

తే.గీ.

ఒక్క నిమిషమ్మున వధించె నొక్కఁడు పదు

నాల్గు వేల రక్కసుల వనమ్ము నందు

నిష్ట మైన భార్యను హరియింప నస్త్ర

కుశలుఁడు నిను జంపఁడె సుతీక్ష్ణ శర తతిని   

19.    

 

 

 

ఆ.వె.

ఇట్టు లన్యములు ననేకములు పరుష

వాక్యములు వలికి యవనిజ రావ

ణాంక గమన మీఱ నార్తి యెడఁద విల

పించె మిగుల  భయము మించ నపుడు   

20.   

 

 

 

కం.

కర మార్తను బహు భాషిణిఁ 

గరుణను విలపించు నామెఁ గరము వణుకు నా

ధరణిజ నిర్దయఁ గొంపో

యె రావణుఁడు రాజ తనయ నేకాంతముగన్   

21.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నేఁబది మూడవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 54.

 

 

 

సీతా దేవి యట్లు గొనిపోవఁబడు చుండఁ బర్వతము పైన నున్న యైదుగురు వానరులను గాంచి తన నగలలోఁ గొన్నిటిని మూట గట్టి, వారు చూచిన రాఘవులకుఁ దెలుపఁగల రన్న యాశతోఁ  గ్రిందికి వైవ నది గమనింపక రావణుఁడు లంకాపురమును జేరి తన యంతఃపురమున సీత నుంచి యెనమండుగురు రాక్షసులను రాముని పనులను గమనింప జనస్థానమునకుఁ బంపుట. 

 

 

 

 

కం.

కాంచక యార్త త్రాణుని

వంచిత గొనిపోవఁ బడఁగ వైదేహి యటుల్

గాంచెను వానరు లేవుర

నంచిత గిరి సంస్థితుల భృశార్దిత దిగువన్      

1.      

 

 

 

చం.

కని తన యుత్తరీయమునఁ గాంచన కాంతుల వెల్గు దానిలో

ఘన శుభ భూషణమ్ములను గట్టి ధరాత్మజ వారి మధ్యలోఁ

గనిన వచింతు రేమొ తన కాంతున కంచుఁ దలంచి యాశతో

వనరుహ నేత్ర క్రింది కట వైచెను బట్టు దుకూలముం దగన్       

2.     

 

 

 

ఆ.వె.

వస్త్రమును గ్రహించి బంగరు నగల తో

వానరుల నడుమను వైచిన యది

సంభ్రమమ్ము నిండ స్వాంతమునం దెఱుం

గడు దశాననుండు కాంత పనిని   

3.     

 

 

 

కం.

హరి వీరులు పింగాక్షులు

తరుణీమణి సీత నేడ్చు దానిని వీక్షిం

చిరి ఱెప్పలు వేయక వా

రి రుహాక్షిని విస్మయమ్ము రేఁగఁగ నెదలన్  

4.     

 

 

 

ఉ.

మానిని తోడ రావణుఁడు మాన విహీనుఁడు వేగ దాఁటి పం

పా నది నేడ్చు చుండఁగ నపారము జానకి యేఁగఁ జాగె లం

కా నగరమ్ము వైపునకుఁ గాంతను మృత్యువుఁ దీక్ష్ణ దంష్ట్రనుం  

దా నిడి కాలకూట విష దర్పిత భోగిని నంకమం దహో

5.     

 

 

 

ఆ.వె.

వనములను నదులను బర్వతముల దాఁటి

గగన మార్గ మందుఁ గ్రన్నన ఘన

చాప ముక్త నిశిత శర సన్నిభమ్ముగ 

రావణుం డరిగెను రాక్షసుండు       

6.     

 

 

 

కం.

తిమి నక్రాలయమును శర

ణము సకల నదీ తతికి  ఘన తరంగ సము

ద్రము వరుణాలయముఁ గదిసి

సముదమ్ము దశాననుండు సయ్యన దాఁటెన్      

7.     

 

 

 

ఆ.వె.

తడఁబడఁగ మరలెడు తరఁగల తోడ మీ

నోరగములు కదల కుండ నుండ

భయము నిండి నట్లు వరుణాలయం బయ్యెఁ

గొనుచు నేఁగ జానకి నసురుండు

8.     

 

 

 

చం.

దివమునఁ దిర్గు చారణులు దివ్యులు సిద్ధులు గాంచి రావణున్

జవమున నేఁగు రక్కసుని చా వరు దెంచె నటంచు నెల్ల వా

రు వలుకు చుండ దుఃఖ భర రోదన సంయుత సీత యంక మం

దు వఱల మృత్యు రూపిణిగఁ దూర్ణమ యాతఁడు సేరె లంకనున్ 

9.     

 

 

 

తే.గీ.

చక్కఁగ విభజింపఁ బడిన చారు పథము

లడరు లంకాపురముఁ జొచ్చి యంచితముగ

సతము రక్షింపఁ బడెడు కక్ష్యలు విరివిగ

నుండు స్వాంతఃపురము రావణుండు సేరె

10.    

 

 

 

తే.గీ.

మయుఁడు మాయ నుంచిన భంగి మానినీ మ

ణిని ఘ నార్తి మోహ పరాయణ నవనిజను

జానకి నసి తాపాంగను జక్కఁగ నుని

చె నట రావణుండు ముదము సెంది మదిని   

11.    

 

 

 

కం.

కని యట భయంకరలఁ బ

ల్కె నా  పిశాచీ వనితల లీలగ నిట్లుం

గన రా దీమెఁ బురుషు లై

నను స్త్రీ లయినను బడయక నా యనుమతినిన్ 

12.    

 

 

 

ఆ.వె.

మణులు ముత్యములును మంగ ళాభరణము

లంబరములు వసువు లంచితములు 

కోరి నట్టి వెల్లఁ గోమలి కీమె కీ

వలె మదాజ్ఞ యిట్లు బడతు లార!  

13.    

 

 

 

ఆ.వె.

తెలిసి యైన నింకఁ దెలియక యైన వై

దేహి కప్రియమ్ము సాహసించి

యెవ్వ రైనఁ బలుక నించుక యైన వా

రి కిల జీవితమ్ము ప్రియము కాదు        

14.    

 

 

 

తే.గీ.

పలికి రాక్షస స్త్రీలతో వాక్కు లట్లు

వీడి యంతఃపురము వేగ వీర్యవంతుఁ

డా దశగ్రీవుఁ డంతఁ దా నాత్మలోఁ ద

లంపఁ జాగెఁ జేయఁ దగు కార్యమ్ము పిదప

15.    

 

 

 

చం.

కనె నపు డష్ట రాక్షసులఁ గాంచఁగ నప్పిశితాశ నోగ్రులన్

ఘన వర మోహితుం డసుర కాంతుఁడు పేర్కొని వారి వీర్య మె

ల్లను వచియించె వాక్యములు రావణుఁ డివ్విధి క్షిప్ర మేఁగుఁ డ

వ్వనమున కెందు నా ఖరుఁడు వాసము సేసెనొ మున్ను శూరతన్  

16.    

 

 

 

తే.గీ.

అజ్జనస్థానమునకు నానాయుధ సహి

తం బసుర వీరగణ హతస్థానమునకు

నేఁగి వసియింపుఁడు విడిచి యెల్ల భయము

నూని బల పౌరుషములను గాన లోన      

17.    

 

 

 

చం.

అతుల బలమ్ము నుంచితిని యచ్చట నా ఖర దూషణాదులన్

వితత బలాఢ్యులన్ సమర వీరులఁ జంపెను రాముఁ డాజి ధీ

రత సహనమ్ము క్రుంగఁగఁ  గరంపు టమర్షము రేఁగె వానిపై    

సతతపు వైర మేర్పడెను సైపఁగఁ జాలక దారుణమ్ముగన్    

18.    

 

 

 

కం.

అంత మొనర్పం బగను ద

లంతును వధియింప కుండ రాఘవుని ననీ

కాంతర మందు రిపుని నా

కింతయు నిద్దుర లభింప దిటఁ దథ్యముగన్    

19.    

 

 

 

కం.

ఖర దూషణ ఘాతిని సం

గరమున రాఘవునిఁ జంపి ఘన హర్షమ్మున్

విరివిగ విత్తము నందిన

దరిద్రుని పగిదిఁ బడయుదుఁ దప్పక యెడఁదన్     

20.   

 

 

 

కం.

నివసించి జనస్థానము

న వీరవరు లార! రామునకుఁ జేరువలో

వివరముగాఁ గాంచుచు రా

ఘవుని పనుల నెల్లఁ దెలుపఁగ వలయు నాకున్

21.    

 

 

 

తే.గీ.

అప్రమత్తులై యెల్లరు నసురు లార!

యేఁగ వలయు నచ్చోటకు నెలమి మీరు

సంతతము రాముని వధింప సత్ప్రయత్న

ము నొనరింప వలయుఁ జుండి మూరి యచట

22.   

 

 

 

ఆ.వె.

కంటి మీ బలములఁ గయ్యములం దనే

కావసరము లందు నందు వలన

నయముగ ననుపుదు జనస్థానమునకు మి

మ్ములను నమ్మకమ్ము మూర నాకు   

23.   

 

 

 

తే.గీ.

అసురు లెనమండ్రు వాక్యము లర్థ వంత

ములు ప్రియము లాలకించి ప్రభువన కొసఁగి

వందనములు రావణునకు వదలి లంకఁ

జని రగపడ కేరికి జనస్థానమునకు    

24.   

 

 

 

కం.

కని సీతను మైథిలినిం

గొని మురిసెను రావణుండు ఘోర తరంబౌ 

యినకుల నందను వైర

మ్మును బడసియు మోహ మంది ముదితుం డయ్యెన్   

25.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నేఁబది నాల్గవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 55.

                                                                                               

 

 

రావణుఁడు సీతకుఁ దన ప్రాసాదము నెల్లఁ జూపి రాజ భోగము లింక నైశ్వర్యముల ననుభవింపఁ దనను వరింపు మని ప్రలోభ పఱచుట. 

 

 

 

 

కం.

పనిచి యసుర వరు లెనమం

డ్రను బల్లిదులను దలంచె రావణుఁ డెదలోఁ

బని యయిన దంచుఁ జక్కఁగ 

మనో వికారము చెలంగ మనుజాశనుఁడే     

1.      

 

 

 

ఆ.వె.

కామ బాణ వశతఁ గలుషిత చిత్తుఁడు

దలఁచుచు ధరణిజను దద్ద రావ

ణుండు సొచ్చె రాక్షసుండు నిజ గృహము 

జానకి నరయంగ సత్వరమ్ము   

2.     

 

 

 

చం.

కదిసి గృహమ్ము రావణుఁడు గాంచెను శోక పరాయ ణాంగనన్ 

సుదతిని నుండ రక్కసులు చుట్టును సీతను భాష్ప లోచనన్ 

బెదరెడు నశ్రు పూరితను వేగపు గాలికి వార్ధిలో మునుం

గఁ దనరు నావ భంగి నటఁ గన్పడు భామ నధో ముఖాబ్జనున్     

3.     

 

 

 

తే.గీ.

స్వ మృగముల వీడి కుక్కల పాలు వడిన

యాడు మృగము భంగి వడలు నామె వశము

కాని దీనను సీతను గాంచి బలిమిఁ

జూపె రాజ సౌధమ్మును సుందరమును   

4.     

 

 

 

సీ.

మేడ లింకను మేటి మిద్దెల గుంపులు వేవురు వెలఁదులు సేవ లొసఁగ

వివిధమ్ము లైనట్టి విహగ రాజ రవము లలరు నానా రత్న విలసితములు 

దాంత తప్తాభ్ర సుందరతర స్ఫటిక రాజిత వజ్ర వైడూర్య చిత విశాల

రమ్య తర స్తంభ రాజములు వెలయు దివ్య దుందుభి ముఖ భవ్య రుతులు     

 

తే.గీ.

తప్త కాంచన తోరణ  క్షిప్త రాజ

వేశ్మముల సుందర గవాక్ష వితతి దాంత

రాజత విలసితముల భర్మ మయ మైన

మెట్ల నెక్కె సీతను గూడి మేటి యసుర          

5.     

 

 

 

తే.గీ.

చిత్రము లయిన తెల్లని శ్రేష్ఠ మణులు

గూడి నట్టి భూతలముల తోడ నున్న

తనదు భవన పంక్తులఁ జూపె ధరణి తనయ

సీతకు దశకంఠుఁ డపుడు ప్రీతి తోడ

6.     

 

 

 

ఆ.వె.

నూతులు సరసులు మహా తరువులఁ గూడి

నట్టి వెల్లఁ జూపె నసుర రావ

ణుండు సీతకు వగ పుండ నెడఁద నేడ్చు  

నామె కశ్రు పూరి తాక్షి కపుడు   

7.     

 

 

 

కం.

భవ నోత్తమమ్ము రావణుఁ

డవనీ నందనకుఁ జూపి యా పాపాత్ముం

డు వలికె నూరింపఁగ భృశ

ము విదేహాత్మజను వచనముల నిబ్భంగిన్      

8.     

 

 

 

తే.గీ.

విడిచి బాలుర రోగుల వృద్ధులఁ బది

కోట్ల రక్కసుల కితర ఘోర కర్ము

లైన యిరువది రెండు కో ట్లసురులకు వి

భుండ నెల్లరకును నేను భూజ! వింటె

9.     

 

 

 

ఆ.వె.

ఒక్క వేయి మంది యొక్కని సేవింప

నన్ను గలరు నాకు నాదు రాజ్య

మింక జీవితమ్ము నెల్ల నీ యం దుంతు

మిన్న నీ వసువుల కన్న నాకు    

10.    

 

 

 

ఆ.వె.

వేల మంది స్త్రీలు లీల వివాహ మా

డిరి నను నలినాక్షి కరము ప్రీతి

వారి కెల్ల నీవు మూరి యీశ్వరి వౌదు 

దార వయిన నాకుఁ దలిరుఁబోడి       

11.    

 

 

 

ఆ.వె.

అన్య బుద్ధి యేల యన్నుల మిన్న! నా

మాట లాలకింపు మచ్చెకంటి!

కరుణ సూపు మింకఁ గాంత! నా పయిన సే

వింపు తప్తుని నను నింపుగాను        

12.    

 

 

 

చం.

వననిధి చేత రక్షితము పాఱఁగఁ బన్నుగ వంద యామడల్

కన నెదిరింపఁ గాఁ దరము కాదు స శక్ర సు రాసు రాలి కీ

సు నగర మైన లంక నిలఁ జూడ బలమ్మున యక్ష దేవ గా

యనుల సురాళి నా సముల నండజ కోటిని ముజ్జగమ్ములన్         

13.    

 

 

 

తే.గీ.

మనుజ మాత్రుఁడు దీనుఁడు వన గతుండు

రాజ్య హీనుఁడు తాపసి రాముఁ డల్ప

తేజుఁ డల్పాయుఁ డీతండు దేవి! వీని

వలన నీ కేమి లాభము దలఁప వలయు

14.    

 

 

 

కం.

నన్ను వరింపుమ జానకి

పన్నుగ నీకుఁ దగి నట్టి భర్తను నేనే

యెన్నఁగ యౌవన మధ్రువ 

మెన్నఁ డనుభవింపు సుఖము లిల  నా తోడన్     

15.    

 

 

 

చం.

విడువుమ సీత! రాఘవుని వీక్షణ మింక నొనర్పు బుద్ధినిం

గడఁగిన వచ్చు టిచ్చటకు కాదు తరం బిఁక నీదు భర్తకుం 

గడు జవ యుక్త వాయువును గట్టఁగఁ ద్రాటను శక్యమే జ్వలిం

చెడు ననలమ్ముఁ బట్ట మది నెంచిన సాధ్యమె పద్మలోచనా!        

16.    

 

 

 

మ.

కన ముల్లోకము లందు నెవ్వనికి శక్యంబౌను  నా నుండి నిం

గొని పోవంగఁ బరాక్రమమ్మునను మద్గుప్తన్  సతీ రత్నముం

గన నబ్బల్లిదు నెందు రాజ్యమును లంకా పట్టణం బేలుమా!

నను బోలున్ జను లింక దేవతలు కాంతా నీకు దాసార్హులే      

17.    

 

 

 

తే.గీ.

మున్ను నీ చేసిన యఘము సన్నగిల్లె

నీ వన నివాసము వలన నీరజాక్షి! 

తడిసి యభిషేక జలమునఁ దరుణి నన్ను

గొనుమ నీ సుకృత ఫలము ననుభవింపు     

18.    

 

 

 

ఉ.

మాలలు మంచి గంధములు మైథిలి! యూనుమ ముఖ్య భూషలన్ 

లీలఁగ నన్ను జానకి వరింపుమ పుష్పక మన్న పేరునన్

మేలి విమాన మియ్యది యమేయ బలమ్మున నర్క సన్నిభం

బే లలిఁ గొంటి నన్నను జయించి కుబేరుని భండనమ్మునన్    

19.    

 

 

 

ఆ.వె.

అతి విశాల మింక నంద మైనది విమా

న వరము విహరింపు మవనిజ నను

గూడి యెక్కి సుఖము తోడ యథేచ్ఛను 

సీత! యిందు నందుఁ బ్రీతి దనర

20.   

 

 

 

ఆ.వె.

పద్మ సన్నిభంపు వదనమ్ము వైదేహి

చారు దర్శనమ్ము మూర శోక

ము వికసింప నేర దువిద! వరారోహ! 

పొందఁ దాప మేల సుందరాస్య!

21.    

 

 

 

చం.

పలుకఁగ నిట్లు రావణుఁడు వక్త్రము వస్త్రము చేత మూసి య

శ్రులఁ దుడిచెన్ ధరాత్మజ సరోరుహ లోచన యిందు సన్ని భా

స్య లలన చింతచే లయము లైన నిజప్రభలన్ రుజార్తినిం  

దలఁపుల వేఁగు దీనఁ గని తద్దయుఁ బాపి నిశాచరుం డనెన్

22.   

 

 

 

తే.గీ.

ధర్మ లోప మని తలంపఁ దగదు సీత!

సిగ్గు వైదేహి చాలింకఁ జెంద నీవు

దైవ నిర్ణయం బిది యెల్లఁ దరుణి! చేరె

నిన్ను ఋషి సమ్మతం బిది నీరజాక్షి!  

23.   

 

 

 

కం.

నున్నని నీ పాద యుగము 

చెన్నుగఁ బీడిత మయి వెలసెను నా తలలన్  

నన్నిఁకఁ గరుణింపఁ దగుదు  

వన్నుల మిన్న! వశుఁడ నతివా! దాసుండన్    

24.   

 

 

 

తే.గీ.

గొంతుక తడి యాఱంగ నేకాంత మిట్లు

నేను భాషింప నేరను నీరజాక్షి! 

తలను వంచి రావణుఁడు వందనము లే వ

నితకుఁ జేయ లే దెన్నండు నిజము సుదతి!   

25.   

 

 

 

కం.

పలికి దశగ్రీవుం డి

ట్టులు కా లోపహతుఁ డసురుఁడు ధరా సుతతోఁ

దలఁచె నిజ మనమ్మున నీ

లలనా రత్నము తన దని రావణుఁ డెలమిన్      

26.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నేఁబది యేనవ సర్గము.

అరణ్య కాండము

సర్గము 56.

                                                                                               

 

 

రావణుని పలుకులను విని సీత గడ్డి పోఁచ నడ్డముగాఁ బెట్టి రాముని పరాక్రమమును వర్ణించి యాతనిచే రావణునకుఁ గలుగ బోవు కష్టములను వచించి నిరాకరింప నశోక వనమున సీతను రావణుఁ డుంచుట. 

 

 

 

 

కం.

విని రావణు పలుకులు సీ

త నడిమినిన్ గడ్డి పోఁచఁ దా నడ్డముగా

నునిచి కలఁతతో నిర్భీ

తిని నా రావణుని తోడ స్థిరముగఁ బలికెన్    

1.      

 

 

 

చం.

నృవరుఁడు ధర్మ రక్షకుఁడు నిత్యము సుస్థిర సత్య సంధుఁడున్

ధ్రువ మతి యైన యా దశరథుండు ప్రసిద్ధుఁడు నందనుండు రా

ఘవునకు రాముఁ డుత్తముఁడు కాంతుఁడు నాకుఁ ద్రిలోక విశ్రుతుం

డవని సుదీర్ఘ బాహువు మహాత్ముఁడు ధర్మ రతుండు దైవమే

2.     

 

 

 

మ.

ఇన వంశార్ణవ పూర్ణ చంద్రుఁ డిల నా యిక్ష్వాకు వంశోద్భవుం

డ నలాభ ద్యుతి సింహ సన్నిభ భుజాగ్ర్య ద్వంద్వ సత్ప్రాభవుం

డనుజున్ లక్షణు గూడి భండనము నం దంతమ్ము గావించు నిం

దన ప్రత్యక్షమ కొన్నచో నను జనస్థానమ్మునం జత్తువే    

3.     

 

 

 

ఆ.వె.

నీ నుడివిన ఘోరు లైన పలాశులు 

బల్లిదులు మదీయ పతి సరసను

నిర్విషు లయి రిచట సర్వులు గరుడుని

చెంత ఘోర ఫణుల చెన్ను తోఁప      

4.     

 

 

 

కం.

గంగా తటమ్ము నెల్లను

భంగమ్ములు గూల్చు భంగిఁ బన్నుగ నిఁక నీ

యంగముఁ జీల్చును రాముని

బంగరు జ్యా వర విముక్త బాణము లెల్లన్         

5.     

 

 

 

ఆ.వె.

రావణ! సమరమున నీ వవధ్యుఁడ వైన

నా సు రాసుర నిచయమున కవని

వైర మూని భృశము నా రాఘవుని తోడఁ

జన వసువుల తో దశ వదనుండ!

6.     

 

 

 

ఉ.

జీవిత మింక దుర్లభము శేషము నీకు దశాననా ధరన్

రావణ! యూప బద్ధ పశు రాజము భంగి వినాశ కారి యౌ

భూవరుఁ డా రఘూత్తముఁడు మూరఁగ రోషము సూడ చక్షులన్

నీ విలయమ్ము మంటలను నేఁ డగు దగ్ధము కాఁగ సద్యమే    

7.     

 

 

 

ఉ.

ఆ గగనమ్ము నుండి పడి యబ్జుఁడు ధాత్రి లయమ్ము నందినన్

సాగర మెల్ల నింకినను సాధ్వికి నా కిడు విడ్పు రాముఁడే

వే గత జీవి కా బలము వీడి ధనమ్ము నశింప లంకయే

వేగమ నీ కతమ్మునన పెన్మిటి లేనిది యౌను రావణా!         

8.     

 

 

 

ఉ.

నాపతి నుండి నన్నిటుల నైరృత! తెచ్చితి వెంచ కెద్దియుం 

బాపపు కార్య మియ్యది యవశ్య మొసంగదు సౌఖ్య మింతయున్

నా పతి దండకా వర వనమ్మున శూన్యమునన్ మహా ద్యుతిం

బ్రాపయి వీర్య ముండ మను రాముఁ డభీతి సు రాశ్రయమ్మునన్              

9.     

 

 

 

చం.

బలమును వీర్య దర్పములఁ బబ్బిన పొంగును స్వీయ సాయక

మ్ముల నని గ్రుచ్చి గాత్రముల మూరి యడంచును రాక్షసాధమా!

విలయము ప్రాణు లొందు గతి వేఁగఁగఁ గాల వ శార్తతన్   నరుల్

దలఁతురు సేయఁ దప్పులను దద్దయుఁ గాలపుఁ జోదనమ్మునన్       

10.    

 

 

 

తే.గీ.

నన్ను బాధింప నివ్విధి మిన్నగ నసు

రాథమ! సమయ మాసన్న మైన దింక

నంతిపురపు వారికి నీకు నంతమునకు

రాక్షస గణమునకు నెల్ల రావణుండ!         

11.    

 

 

 

ఉ.

స్రుక్కులు యాగ భాండములు చొప్పడి నట్టి క్రతుస్థ వేదినిం 

జక్కని విప్ర మంత్రములు సాగఁగ మాలఁడు ధిక్కరింపఁగా

నుక్కున శక్యమే యటుల నుత్తము ధర్మ సతీ మతల్లి న

న్నెక్కటి పాపి ముట్ట నగు నిట్టి పతివ్రత రాక్షసాధమా!    

12.    

 

 

 

తే.గీ.

పద్మషండముల సతము పన్నుగ విహ

రించు రాజహంస యెటుల నెంచు గడ్డి

పొదల నిత్యము విహరించి పొంగు నీరు

కాకి నక్కట మదిలోనఁ గలను నైన    

13.    

 

 

 

తే.గీ.

తెలివి గోల్పోయిన తనువు వలదు పాత

వలయు లేక బంధింపఁగ వలయు రక్ష

కోర నీ మేనునకు బ్రతుకునకు నింద

నూన నెంచ నిప్పుడమిని నేను సుంత 

14.    

 

 

 

కం.

అతి పరుషమ్ములు వాక్కులు

సతి సీత వచించి యా దశగ్రీవునితో

నతి రోషమ్మున నవ్విధ

ము తిరిగి పలుక దిఁక నెట్టి మునుకుల నైనన్     

15.    

 

 

 

చం.

పలుకుల నాలకించి సతి పల్కఁగ జానకి యట్లు గగ్గురుల్

వెలఁదిని గాంచి రావణుఁడు భీతిలఁ జేయఁ గడింది పల్కె ని

ట్టులు వచనమ్ము లప్పుడు కఠోరముగా విను మైథిలీ ననున్

వలవక యున్న మాసములు ద్వాదశముల్ గడవంగ నిన్నిఁకన్     

16.    

 

 

 

తే.గీ.

చారు హాసిని యుదయ భోజన నిమిత్త

మంపెదను ముక్కలుగఁ గోసి యచట నిన్ను 

వండుదురు వంట వారలు పల్కి యిట్లు

రాక్షసుఁడు పరుషమ్ముగ రావణుండు

17.    

 

 

 

ఆ.వె.

రాక్షసీ వనితల వీక్షించి వికృతంపు

ముఖుల ఘోర రూపముల నగపడు

మాంస శోణితముల మను నట్టి వారిని 

ననెను సీత దర్ప మణఁచుఁ డంచు

18.    

 

 

 

కం.

విని నంతనె యా మాటలు

ఘన ఘోరల రాక్షసీ నికాయం బా సీ

తను జుట్టు ముట్టెను గరము

లను మోడ్చి దశాననునకు రయమున నంతన్      

19.    

 

 

 

తే.గీ.

తన్ని కాలితో భూమిని దట్టముగను

జీల్చునో యన రాక్షస శ్రేష్ఠుఁ డంత 

ఘోర దర్శనుండు పలికె వారి తోడ

నింక నిట్లు వాక్యమ్ములు బింకముగను    

20.   

 

 

 

చం.

కొని చని యీ ధరాసుత నిగూఢ మశోక వనాంతరమ్ము నం

దు నిలిపి కావఁగా వలయుఁ దోరముగా నటఁ గూడి తర్జన

మ్మున మఱి సాంత్వనమ్ములను బొల్తి వశం బగు రీతిఁ జేయుఁడీ 

వన కరిణిన్ వశమ్మునకుఁ బన్నుగఁ దెచ్చెడు భంగి నెల్లరున్      

21.    

 

 

 

తే.గీ.

ఇట్టు లానతి రక్కసు లింతులు గొని

చని రశోక వనమునకు జానకి సహి

తమ్ము ఫల పుష్ప యుత పాదపమ్ములు సత

తమ్మలరు మదద్విజ సేవితమ్ము వనికి   

22.   

 

 

 

ఆ.వె.

శోక పరివృతాంగి చోద్యము గాఁగఁ బా

లయ్యె రక్కసులకు హరిణి పెద్ద

పులులకు వశమయినఁ బొలుపున ఘన పాశ

బద్ధ మృగి విధమ్ము వడయ దిమ్ము   

23.   

 

 

 

కం.

జడిపించు చుండ నసురులు

బెడిదముగ విరూప నేత్ర వృత లచ్చోటం    

బడతి ధరణిజ తెలివిఁ గో

ల్పడె భీతిఁ గలఁతను సురలఁ బతినిఁ దలఁచుచున్

24.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నేఁబది యాఱవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 57.

                                                                                               

 

 

మృగాకృతి నున్న యసురు మారీచుని వధించి రాముఁడు మరలు చుండ దుశ్శకునములు దోఁప నాశ్రమమును జేర నంత నెదురు వచ్చు లక్ష్మణుని గాంచి సీత నొంటరిగ వదలి వచ్చినందులకుఁ జింతించి కోపించి కనఁబడు నపశకునములను సీత కాపదను శంకించుట. 

 

 

 

 

కం.

మృగ రూపమ్మునఁ జరియిం

పఁ గామరూపిని వనమున వధియించి వడిం

బగ మారీచుని నంతఁ ది

రిగె వెనుకకు రాఘవుండు కృతకార్యుండై    

1.      

 

 

 

ఆ.వె.

సీతను గన నెంచి శీఘ్రమ రాఘవుఁ

డేఁగుదెంచు చుండ నింక వెనుకఁ

గ్రూర రవము నంత గోమాయు వక్కట

కూసెఁ గలఁత వొడమ ఘోరముగను

2.     

 

 

 

తే.గీ.

నక్క కూఁతగా గుర్తించి వెక్కసంపు

టొడలు గగురుపొడుచు నట్టి యుగ్ర మైన

యా స్వనమ్మును శంకించి యాత్మ లోనఁ

దొడఁగెఁ జింతింప రాముఁడు వొడమ భయము

3.     

 

 

 

ఆ.వె.

జంబుకపు టఱు పశుభంబగు నంచు నెం

చెదను నేను భృశము సీత క్షేమ

ముగ నసురుల కకట భుక్తి గాకుండ వ

ఱలుచు నున్నదె వని లలితముగను   

4.     

 

 

 

మ.

మమ కంఠస్వర మూని కూయ నిట నా మారీచుఁ డద్దానినిన్

విమలాత్ముండు వినంగ లక్ష్మణుఁడు దా వే వీడి వైదేహినిన్

భ్రమతో నక్కట భీతి సెల్గ మది నీప్రాంతమ్ము నందెల్ల వే

గమ వీక్షింపఁగ నన్ను రాఁడు గద యాకాకుత్స్థుఁ డత్యార్తినిన్      

 

5.     

చం.

అసురులఁ గూడి జానకిని నచ్చట నీర్ష్య వధింపఁ గోరుచున్ 

వెస నిట తాటకేయుఁడు నభీతి మృగాకృతి నూని తా భృశ

మ్ము సని సుదూర మెంచి నను మోసము సేయఁగఁ దా హతుండునై 

పస చెడి యిట్లు నా గిరలఁ బల్కెను జచ్చితి నోయి లక్ష్మణా!     

 

6.     

తే.గీ.

క్షేమముగ వార లుందురె యీ మహా వ

నమున నేను లేకుండ వైర మది కల్గె

నసుర తతితో జనస్థాన మందుఁ గాన

వచ్చెను నిమిత్తములు పెక్కు భైరవములు

 

7.     

తే.గీ.

నక్క యఱుపు నసురుఁడు తనను మృగాకృ

తిఁ గొని పోవుట నట్లు చింతించుచు రఘు

నందనుఁడు శంక నందుచు డెంద మందుఁ

గదిసె నా జనస్థానమ్ము కలఁత రేఁగ  

 

8.     

కం.

దీన మృగ విహంగము లా

దీన వదను రాము నెడమ దెస నుంచుచు నా

జాను భుజు నంత ఘోరము

గా నఱవం జాగిన వటఁ గానన మందున్   

 

9.     

ఆ.వె.

కాంచి యా నిమిత్త గణముల నెల్లను

ఘోరములఁ ద్వరితము నా రఘు వరుఁ

డరుగఁ జాగె నిఁక  నిజాలయమ్మునకు సం

భ్రమ మెదఁ జెలరేఁగ రాముఁ డడలి

 

10.    

కం.

చేరె జనస్థానమ్మును 

దారను సీత నలినాక్షిఁ దలఁచుచు నెదలో

వీరుని లక్ష్మణు ననుజుని

నా రాఘవ పుంగవుండు నరి దమనుండే

 

11.    

తే.గీ.

అంత వచ్చెడు లక్ష్మణు నరసె విగత

కాంతి నున్న యనుజుని రాఘవుఁడు సేరె

లక్ష్మణుండు విషణ్ణుండు రాము నా వి

షణ్ణు నార్తుని నార్తుఁడు సనుచు నంత    

 

12.    

తే.గీ.

అన్న రాముఁడు లక్ష్మణు నట్లు సీత

నొంటరిగను వదలి వచ్చి యున్నవాని

విజన మయినట్టి రాక్షస వీరులున్న

ఘోర వనిఁ గాంచి నిందించెఁ దోరముగను            

 

13.    

కం.

కొని యనుజు వామ హస్త

మ్మును రాముఁడు నిత్య మధురము లగు గిరలు ప

ల్కెను బరుషమ్ముగ మఱి యా

ర్తిని లక్ష్మణు తోడ నంత రేఁగిన చింతన్        

 

14.    

తే.గీ.

వచ్చితివి వీడి సీతను వనిత నొంట

రిగ నిచట కీవు లక్ష్మణ! మగువ భద్ర

మిచట యరయఁ జాలునె సౌమ్య! యిట్లు చేసి

తకట నిందార్హ కార్యము ననుచితమ్ము  

 

15.    

తే.గీ.

కంటి నశుభ శకునములు వింటె పెక్కు

లిచట నష్ట మయ్యెను సీత యింక భక్షి

త యయి యుండు నసురుల చేత వనచరుల

చేత సందేహ మది లేదు భ్రాత! సుంత

 

16.    

కం.

కనఁ గలమె నరవ్యాఘ్రా! 

జనకాత్మజఁ బ్రాణములను స్వస్తి సెలంగన్

వనమున నింకన్ వైదే

హినిఁ గన్నుల లక్ష్మణా! మృగేక్షణ నకటా   

 

17.    

తే.గీ.

మిక్కిలి వెలుంగు దిక్కును స్రుక్కి కనుచు

నక్కలు మృగ సంఘమ్ములు వెక్కసముగఁ 

బక్షు లఱచుచు నున్నవి భైరవముగ

రాజ పుత్రికి క్షేమమె లక్ష్మణ! యిట   

 

18.    

తే.గీ.

మృగముగ నయి యసురుఁడు నను గొని పోయె

నాశఁ జూపి దూరమునకు హతుఁడు నయ్యెఁ 

గడు శ్రమమ్మున నాచేతఁ గడకు మాఱె

రాక్షసునిగ మాయావియె యాక్షణంబ        

 

19.    

తే.గీ.

నిండె దైన్యము శోకము మెండుగ నెద

నెడమ కన్నదరుచు నుండె బెడిదముగను

మృతయొ యపహృతయో యయ్యె నతివ యట్టి

గతినిఁ గలదొ లే దిందు శంక పరికింప     

 

 

 

20.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నేఁబది యేడవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 58.

 

 

 

సీతను విజన మైన వనమున వదలి వచ్చిన లక్ష్మణునిఁ గాంచి మిక్కిలి దుఃఖించుచు సీత చంపఁ బడిన దేమో యని శంకించుచు నాశ్రమమును జేరి  యందెల్ల వెతకి సీతను గాంచక యంతపని యైన దని పరితపించుట .

 

 

 

 

కం.

కని లక్ష్మణు దీ నాస్యు వి

జన వని దాశరథి యడిగె జనకాత్మజ సీ

త నట వదలి వచ్చిన వా

ని నిట్లు రాముఁ డెదఁ జింత నివ్వటిలంగన్

1.      

 

 

 

చం.

అరుగుచు నుండఁగా ననుజ! యవ్వని దండక కేను నన్ను నా

వర వనితా మతల్లి కని వచ్చెను జానకి నాదు వెంటనుం

దరుణిని వీడి వచ్చితివి దారుణ కానన మందు లక్ష్మణా!

ధరణిజ యెక్క డున్నయది తద్దయు భీతి చెలంగు చుండెనే    

2.     

 

 

 

తే.గీ.

అకట యుండ రాజ్యభ్రష్టున కతి దీను

న కిట నండఁగఁ బాఱ వనమున కేను

దండకకుఁ దనుమధ్య సీత నలినాక్షి

యెక్క డున్నది చెప్పుమ దక్కఁ గలదె

3.     

 

 

 

కం.

మన నుత్సహింప  నే నిఁక

జన కాత్మజఁ గానక నిమిష మయినఁ బ్రాణ

మ్మున కొనరించును సాయం 

బనునిత్యం బా యమర సుతాభ నిరతినిన్

4.     

 

 

 

కం.

అమ రాధిపత్య మయినఁ బు

డమి కెల్ల విభుత్వ మది యడరిన నయిన నే

ను మదిం గోరను గాంచన

సమాన నిజ దేహ లేక జనకాత్మజయే

5.     

 

 

 

తే.గీ.

నాకు ప్రాణములకు మిన్న నాతి సీత

యుండును గద  తా నెచ టైన నుసుఱు తోడ

నాదు ప్రవ్రాజనమ్ము కాననము నందు

వమ్ము కాదు గదా సౌమ్య! నమ్మకముగ  

6.     

 

 

 

ఆ.వె.

సీత కొఱకుఁ జావు సెలఁగ నా కరుగ న

యోధ్య కీవు మాన వోత్తమ! తిరి

గి కన నిన్ను నచటఁ బ్రకటముగ సుఖము

నందుఁ గైక తీర నామె కోర్కి       

7.     

 

 

 

తే.గీ.

సుతుఁడు మరణింపఁ గౌసల్య సుతుఁడు చక్క  

రాజ్య మందఁగఁ దన కోర్కె రమ్యరీతి 

సఫలమై యిట్లు తనరంగ సంతసించు

కైక నింక సేవింపదు కద కలంత

8.     

 

 

 

తే.గీ.

సీత జీవించి యున్నచోఁ జేర నెంతు

నాశ్రమమ్మును లక్ష్మణ! యట్లు కాక

సచ్చరిత సీత మరణింపఁ జాలు నింక

విడుతు నేను బ్రాణమ్ములు వేగముగను     

9.     

 

 

 

కం.

నవ్వుచు నాశ్రమమునఁ గని 

ఱివ్వున వైదేహి నను మఱి పలుకరింపన్

నివ్వెఱ యగు రాని యెడల

నవ్వనిత నశింతు నింక నచ్చట యనుజా!  

10.    

 

 

 

ఆ.వె.

చెప్పు మనుజ! నాకు సీత బ్రతికి యున్న

దా మఱి మరణించెనా నిజమ్ము

భక్షితం బయినదొ రాక్షసావళి చేత

నేమఱంగ నీవు నిద్ధ చరిత!

11.    

 

 

 

కం

సుకుమారి బాలయును సీ

త కలఁతల నెఱుంగ దెట్టి తఱి నైనను నా

దు కనమి వైదేహి భృశ

మ్ము కలఁగు నిక్కముగ దుఃఖము సెలఁగ నెదలో

12.    

 

 

 

ఆ.వె.

అఱవఁ గపట బుద్ధి నసురుండు లక్ష్మణా

యని దురాత్ముఁడు కడు ఘన రవమున

నపుడు నీకుఁ గూడ నత్యంత భయ మెదఁ

బుట్టి యుండ నోపుఁ బుణ్య చరిత!      

13.    

 

 

 

కం.

విని జానకి నాదు స్వరం

పు నిభంపు గిరలను శంక వొడమంగ భయ

మ్మును జెంది నన్ను వీక్షిం

ప నిన్ననుప వచ్చి యుందు వడి నిట కనుజా!    

14.    

 

 

 

తే.గీ.

కష్ట మొనరించి తీ వన్ని గతుల విడిచి

వచ్చి సీత నేకాంతము వనము నందుఁ

జేయఁ బ్రతిచర్య వీలు నిచ్చితివి యకట

రక్కసులకు దుష్టులకు నరణ్య మందు    

15.    

 

 

 

కం.

ఖరుని వధించిన కతమున

ను రక్కసులు మాంసమును దిను నృశంసులు వీ 

లరసి జనకాత్మజను సం

హరించి భక్షించి యుందు రని నే తలఁతున్    

16.    

 

 

 

తే.గీ.

మునిఁగితిని నే నయో దుఃఖముల నిట రిపు

సూదనా! యే విధి నయినఁ జూడ నేమి

జేయఁ గలవాఁడ నే నింకఁ జేరె దుష్కృ

తమ్ము దైవ వశమ్మునఁ దలఁతు నట్లు  

17.    

 

 

 

తే.గీ.

సీత నా వరారోహను నాతతముగఁ

దలఁచుచు రఘూద్వహుండు నెదను గరమ్ము

సేరె నా జనస్థానము శీఘ్రముగను

లక్ష్మణునిఁ గూడి రాముండు రగులు చుండి   

18.    

 

 

 

తే.గీ.

ఆర్తు ననుజు నిందించుచు నలసి మిగుల

నాక లింక దప్పియు భృశం బడర వక్త్ర

మెండ రంగు చెడ వసతి నింకఁ జేరి 

శూన్యముఁ గనె నిట్టూర్చుచు శోక మడర

19.    

 

 

 

తే.గీ.

ఆశ్రమము నెల్ల వెదకి విహార తటుల

నెల్ల శోధించి యుండెడు నెల్ల భూము

లందు గాలించి యనుకున్న దైన దంచు 

బాధ తోడ గగురుపాటు వడసె నంత    

20.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నేఁబది యెనిమిదవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 59.

 

 

 

రాముఁడు తిరిగి సీతను వదలి యేల వచ్చితి వని దుఃఖముతో లక్ష్మణుని నడుగ నాతఁడు తాను జెప్పిన మాటలు సీత పలికిన దుర్భాషలను తెలుప రాముఁడు తృప్తి సెందక చింతించుట.

 

 

 

 

కం.

తిరిగి యడిగె నడుమను రఘు

వరుండు రాముఁ డవనిజను వదలి వనములో

నరుదెంచిన ననుజునితో

వరాశ్రమము నుండి కలఁత పలుకుల నిట్లున్    

1.      

 

 

 

ఆ.వె.

నమ్మకమ్ము నుంచి యిమ్మైథిలిని వీడి

నే నరిగిన నేల నీవు నకట

యెట్టి కారణమున నిట్లు వచ్చితి వీడి

సీత నొంటరిగను జెప్పు మయ్య!   

2.     

 

 

 

చం.

అరసిన వచ్చు చుండ నిను నా ధరణీ సుత వీడి లక్ష్మణా! 

కరము సెలంగె డెందమునఁ గాఱియ శంకయుఁ గాంచ సత్యమై

పరఁగెఁ జలించె మిక్కుటము వామ భుజాక్షులు నింక డెందమున్   

ధరణిజ లేక దూరమునఁ దమ్ముఁడ! కాంచఁగ నిన్ను వచ్చుచో

3.     

 

 

 

తే.గీ.

పలుకులు విని లక్ష్మణుఁడు శుభతర లక్ష

ణుండు దుఃఖ మంది తిరిగి మెండుగఁ గని

దుఃఖితుని రామునిఁ బలికెఁ దూర్ణ మిట్లు

భాషణమ్ములు సత్యార్థ వంతములను       

4.     

 

 

 

చం.

స్వయముగ నెంచి నే నిటకు వచ్చిన వాఁడను గాను నమ్ముమా

స్వయముగ సీత నింద లిడి సైపఁగ లేని విధమ్ము రోష మూ

ని యరుగు మంచుఁ బంపఁగను నీ కడ కే నరుదెంచితిన్ వడిన్

భయపడె నార్తనాదములు భామ వినంగనె నీ స్వరమ్మునన్   

5.     

 

 

 

తే.గీ.

అతివ హా సీత హా లక్ష్మణా  నను వడిఁ

గావుఁ డం చను నీదు వాక్యములఁ బోలు 

గిరలు కాంత చెవులఁ బడఁ గరము భీతిఁ

జెంది పొమ్ము పొమ్మని పనిచెఁ గంది నన్ను

6.     

 

 

 

చం.

చను మనఁ బెక్కుమార్లు విని చక్కఁగఁ బల్కితి ధైర్యమీయఁగాఁ

గన నిట నెట్టి రాక్షసునిఁ గాఱియ పెట్ట సమర్థు రామునిన్

విను మివి వీడు మింక మది భీతిని సర్వము నన్యు లెవ్వరో

యనినవి సుమ్మి కావు నలినాక్షుని రాముని మాట లెంచఁగా        

7.     

 

 

 

తే.గీ.

దేవతల నైనఁ గాచెడు ధీర వరుఁడు

దాశరథి దీనముగ నత్యధమము లెట్లు

పల్కు నను గావుఁ డంచును వచనములు మ

హాత్ముఁ డెన్నఁ డేనియు దేవి! యరయ వలయు

8.     

 

 

 

కం.

ఎవ్వం డేనియు నెందుకొ 

యివ్విధ మన్న స్వర మూని యే యసురుండో

యివ్వనిఁ గావుఁడు గావుఁడు

నొవ్వున నని మోసపుచ్చు నూహఁ బలికెనో       

9.     

 

 

 

ఆ.వె.

మారిన స్వర మందు మాటలు రక్షించు

లక్ష్మణా యని యిట లక్షితమ్ము

లయ్యె బేల చంద మందు వగవఁ బని

లేదు సుంత యేని వాదు లేల        

10.    

 

 

 

ఉ.

చాలు కలంత యుత్సుకవు స్వస్థవు కమ్మిఁక జానకీ సతీ! 

యాలము నందు రాఘవుని నారయ లేము జయించు వారి నీ

కాలము నందు రాఁ దగెడు కాలము నందు స శక్ర దేవతా

జాలము నందు నైనను విచారము వీడుమ ధైర్య మూనుమా     

11.    

 

 

 

కం.

పలుకఁగ నే నివ్విధిఁ గ

న్నుల నీటినిఁ దాఁ దుడుచు కొనుచు మోహితయై   

పలికెను దారుణ భాషణ

ము లిట్లు వైదేహి తోరపుఁ గినుక నాతోన్

12.    

 

 

 

ఆ.వె.

పాపపుఁ దలఁ పకట తోఁప మదిని భ్రాత

నష్టుఁ డయిన వనిని నన్ను బొంద

నెంచి వచ్చి తిటకు వంచన మొనరించి 

నన్ను నీవు వొంద వెన్నఁ డేని       

13.    

 

 

 

కం.

విలపింప మిక్కుటమ్ముగఁ

జలించి చన నెంచ వకట సంకేతం బి

ట్టు లిడ భరతుండు నా పతి

ని లక్ష్మణా! యనుసరింప నీవు దలఁచితే

14.    

 

 

 

ఆ.వె.

దాఁగి యున్న రిపువు తప్పక నీవు నా

కొఱకు ననుగ మించి వెఱపు లేక

వచ్చి తీవు వీలు వడసినఁ బొందఁగఁ 

గాన నన్న నిపుడు కావఁ జనవు

15.    

 

 

 

తే.గీ.

పలుక సీత యివ్విధము నా కలుక మీఱఁ 

గన్ను లెఱ్ఱనై యధర యుగ్మమ్ము లధిక

ముగఁ జలింపఁగ నాశ్రమమ్మును వదలి ర

యమ్మున నరుదెంచితి నరయంగ నిన్ను

16.    

 

 

 

ఆ.వె.

దుఃఖ మడరఁ బల్కె దుష్కృతం బొనరించి

తీవు సౌమ్య! వచ్చి యిటకు వీడి

సీత నొంటరిగను నాతి నంచును విని

లక్ష్మణు వచనములు రాముఁ డపుడు       

17.    

 

 

 

కం.

తెలిసి తెలిసి లక్ష్మణ! యసు

రుల నాప సమర్థుఁడ నని రోషముగాఁ బ

ల్క లలన జానకి యా పలు

కు లాలకించి వడి రాఁ దగునె నీ కనుజా!    

18.    

 

 

 

ఆ.వె.

సంతసింప నేర నింత యేనియు నీదు

కర్మ మరసి వీడి కాంత సీత

నచట  విని పరుషము లైన మాట లకట

నీదు రాక నిటకు నాదు మదిని     

19.    

 

 

 

తే.గీ.

సీత ప్రేరేప నిన్నట్లు శీఘ్రముగను 

వశుఁడవై క్రోధమున కీవు భృశముగ నవి

ధేయుఁడ వయి సౌమిత్రి!  యతిక్రమించి

తీవు నా శాసనం బెల్ల నిట్టు లకట    

20.   

 

 

 

కం.

మృగమై యెవ్వఁడు మోస

మ్ముగ నిలయము నుండియె గొని పోయెనొ నన్నా

పగతుఁడు రక్కసుఁ డిచ్చట

విగతప్రాణి యయి బాణ వేగమునఁ బడెన్        

21.    

 

 

 

తే.గీ.

లాగి వింటిని బాణము వేగ మడర

లీల వేయఁగ బాధతో రివ్వున మృగ

మయ్యె నసురునిగ వఱల నంగదమ్ము

బాణ తప్తుఁ డఱచెఁ బెద్ద ధ్వని సెలంగ     

22.   

 

 

 

తే.గీ.

అమ్ము తగిలిన యార్తితో నఱచె నాదు

స్వరము నూని దూరము వినఁ బడఁగఁ బలికె

నప్పలుకులను విని వేని నవనిజ నట

వదలి వచ్చితీ విచటకు భ్రాత! యకట   

23.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నేఁబది తొమ్మిదవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 60.

 

 

 

ఆశ్రమ ప్రాంతమున నెల్లఁ దిరుగాడుచుఁ దరులను విచారించుచుఁ బరితపించుచు రాముఁడు సీతకై యడవి నందెల్ల వెదకుట.  

 

 

 

 

కం.

తిరుగాడు చుండ నచ్చో

ట రాముఁ డదరం దొడఁగె నెడమ భుజము కడున్

నర వృషభుండు తడంబడె

నరయఁగ వచ్చె వణఁకు మెయి నంత విశదమై    

1.      

 

 

 

చం.

కని యట ఘోర దుశ్శకున కాయము రాముఁడు తిర్గి తిర్గి సీ

త నెదఁ దలంచి క్షేమముగఁ దా మను చున్నదె వాక్కు లివ్విధిన్

ఘనుఁడు రఘూత్తముండు కడుఁ గందుచుఁ జింత వచింపఁ జాగెనే 

వనితను జూడఁ గోరు నెడ వట్టి నిజాశ్రమ మంతఁ గాంచినన్       

2.     

 

 

 

చం.

కలఁగి కరమ్ము తిర్గుచు సుఖమ్ము నశింపఁగ నిచ్చ టచ్చటన్

నిలయము సేరి చేతులను నీల్గుచు నెత్తుచు సీత లేనిదౌ

స్థలమును మంచు కాలమున సంపద క్షీణము కాఁగ నిల్చు నా

కొలను విధమ్ము గాంచెను సుఘోరముగాఁ దపియించె నత్తఱిన్   

3.     

 

 

 

చం.

కని విలపించె మ్లాన విహగ వ్రజ జంతు సు మావృ తాగ రా

శిని రుచి హీన దేశమును శీఘ్రమ పాఱ నరణ్య దేవతల్

కనఁబడ నట్టి కాననము గడ్డి కటమ్ములు నార చీర లె

ల్ల నట కడింది చెల్లచెదరన్ నిజ శాలయు నుండ శూన్యమై    

4.     

 

 

 

ఉ.

భీరువె యైనదో హృతము వేఁగి కృశించెనొ లేక చచ్చెనో

దారుణ రీతి భక్షితము తా నిట నయ్యెనొ దాఁగెనో వనిం 

గోరి ఫలమ్ము లింక సుమ కోటిని నేఁగెనొ పద్మినీ తటిన్ 

వారి గ్రహింపఁగాఁ గనెనొ వాహినిఁ జేరెనొ సీత యక్కటా        

5.     

 

 

 

తే.గీ.

తివిరి వెదకుచు వనమందుఁ దిరిగి తిరిగి

ప్రియను జానకి నారయ లేదు నెందు 

శోక మగ్నతఁ గన్నులు శోణితమ్ముఁ

దాల్పఁ బిచ్చివాని పగిదిఁ దనరె నతఁడు    

6.     

 

 

 

తే.గీ.

తరువు నుండి తరువునకుఁ బరువు లిడుచు

నద్రి నుండి యద్రికి నేఁగి నదము నుండి

నదికి నేఁగుఁచు విలపించి నర వరుండు 

మునిఁగె శోకార్ణవము నందు ఘనము గాను  

7.     

 

 

 

తే.గీ.

చూచితె కదంబమా నీవు సుదతి నొకతె

నెఱుఁగుదే  కదంబప్రియ నిందు వదన

నెం దయిన సీతను జెపుమ యెలమి నాకు

నెఱిఁగినఁ గనిన విలపించు చిట్టు లడిగె

8.     

 

 

 

ఆ.వె.

నున్నని చిగురు వలె నున్న కాంతామణిఁ 

బచ్చ నైన పట్టు వస్త్రము ధరి

యించి నట్టి దాని నెందైన బిల్వమ! 

కనిన బిల్వ నిభపు స్తనినిఁ జెపుమ     

9.     

 

 

 

ఆ.వె.

అర్జునప్రియ లలితాంగియు నా ప్రియ

యర్జున తరువా! దయ వచియింపు

మ జనకాత్మజ సదమల చరిత బ్రతికి

యున్నదొ మఱి లేదొ యుర్వి లోన

10.    

 

 

 

తే.గీ.

మద్ది వంటి యూరువు లున్న మగువ సీతఁ

బల్లవమ్ముల నింకఁ బుష్పముల వెలుఁగు

మద్ది వృక్షమ్మ! తప్పక ముద్దియను నె

ఱుంగు దీవు వీక్షించితె యంగన నిట

11.    

 

 

 

ఆ.వె.

తుమ్మెదల రొదల నతుల మడరెడు నట్టి

యో తిలక నగమ్మ! సీతను తిల

కమ్ము తోడ నలరు కాంత నెఱుఁగు దంచు

నెంతు నేను దెలుపు మింతి జాడ   

12.    

 

 

 

తే.గీ.

ఓ యశోక వృక్షంబ! శోకోపహతుని

శోకము హరించు దాన! నం జూచి దయను 

నాదు ప్రియ దర్శన మొసఁగి మోద మడర

నన్ను నీ పేర వసుధఁ దనరఁగ నిమ్ము       

13.    

 

 

 

ఆ.వె.

చూచి తేని  నీవు శోభనాంగినిఁ బక్వ

తాల ఫల నిభ వితత కుచ నెంద

యినను దాల తరువ! యీవ దయ కలిగె

నేని నా నితంబిని నెఱిఁగింపు     

14.    

 

 

 

ఆ.వె.

అంబుజాక్షిఁ బ్రియను జంబూ తరువ! చూచి

తేని జాంబవ తను నెందు నైన

నెఱిఁగి తేని సీత నఱమర లేక వ

చింపు మమ్మ నాకు నింపు కొలుప   

15.    

 

 

 

తే.గీ.

ఆహ యో కర్ణికారమ! యార్తవమ్ము

లుండ నిండుగ వెలుఁగుదె మెండుగాను

గర్ణికార ప్రియన సాధ్వి కాంత సీతఁ

గాంచిన వచింపు దయ తోడ నంచితముగ    

16.    

 

 

 

చం.

ఘనుఁడు యశస్వి వెఱ్ఱి వలెఁ గన్పడఁ జూత కదంబ సాల స

త్పనస ధవాగ రమ్య ముఖవల్లభ పాదప మల్లికా లతల్ 

సనఁ జనఁ గేతకమ్ములును జంపకముల్ మఱి మాధవీలతల్

కనపడ నేఁగి దగ్గఱకుఁ గంటిరె సీతను బల్కుడం చనెన్    

17.    

 

 

 

ఆ.వె.

లేనిచో మృగంబ! మానినిని మృగశా

బాక్షినిఁ బ్రియను మిథిలాత్మజను మృ

గీ తతి నడుమఁ బరికింప వచ్చును గాంచి

తె వచియింప వలయుఁ దెల్లముగను

18.    

 

 

 

కం.

వర గజ నాథ! వచింపుమ

తరుణిని గజ కర నిభోరుఁ దప్పక సీతం 

గరి వరమా! యెఱుఁగుదు వీ

వు రమణి నారసిన నాకుఁ బుణ్యస్వాంతన్    

19.    

 

 

 

కం.

కనినను శార్దూలమ! చం

ద్ర నిభాననను బ్రియకాంతఁ దరుణిన్ వైదే

హిని నిర్భయముగ నా తో

డను జెప్పుమ మధురముగ నెడంద సెలంగన్

20.   

 

 

 

ఆ.వె.

కంటి దూర మందుఁ గమలేక్షణ! పరువు

లిడఁగ నేల నిట్టు లింతి! నీవు

దరుల వెనుక దాఁగి యరసి నా తోడను

బలుక కుంటి వేల భామ! యకట

21.    

 

 

 

చం.

నిలు నిలు మింక నెట్టి దయ నీకుఁ దలంపఁగ లేదు నా పయిం

జలుపుదె హాస్య మెక్కువగఁ జాలిఁక నీకు నుపేక్ష యేల నీ

వలువము నేను జూచితిని పట్టుది పీతము పర్వు లెత్తినం 

జెలిమి యొకింత యున్న యెడ శీఘ్రమ యాగుమ పద్మలోచనా!    

22.   

 

 

 

ఆ.వె.

నారి యెన్నఁ డేని చారుహాసిని బాధ

లొసఁగఁ బడ నెఱుంగ నువిద! మున్ను

నూఱ కిటు లుపేక్ష నుండ నేఁ గష్టము

లందుఁ దగదు చేయ నబల నీకు

23.   

 

 

 

తే.గీ.

విశద మగుచున్న దా బాల పిశిత భోజ

ను లసురుల చేత విరహయై వెలఁది సీత

యిట్లు నా నుండి యంగము లెల్ల విఱువఁ

బడఁగ  భక్షితం బంచు నివ్వనము నందు       

24.   

 

 

 

తే.గీ.

శుభము లధర దంతమ్ముల శోభ లలరఁ 

జక్క నైన ముక్కు దనరఁ జారు కుండ

లమ్ము లున్న ముఖమ్ము చంద్ర సదృశమ్ము 

గ్రస్త శశి భంగిఁ గోల్పోవుఁ గాంతి నెల్ల

25.   

 

 

 

ఆ.వె.

చంపక నిభ వర్ణ చారు గళమ్ము గ్రై

వేయ శోభితమ్ము నాయమ విల

పించు చుండ నంత విరివి భక్షితమునై

యుండ నోపు నింక నుగ్రముగను   

26.   

 

 

 

తే.గీ.

పల్లవ నిభ కోమల రమ్య బాహువులను

బాధ నల్లాడు చుండ సాభరణ సాంగ

దముల వేఁగు చుండ భృశము దయను వీడి

యుగ్రు లసురులు భక్షించి యుండ నోపు   

27.   

 

 

 

ఆ.వె.

రాక్షస నిచయముల భక్ష ణార్థంబ నా

చేత విడువఁ బడెను సీత పెక్కు

బంధు లున్న సగము భక్షిత త్యక్త యై

నిలిచె నేమొ యెచటొ నీరజాక్షి     

28.   

 

 

 

కం.

హా లక్ష్మణ! కంటివె యా

బాల నెచట నయిన నయ్యొ వైదేహీ! భ

ద్రా! లలన! యేఁగితి వెటకు

లోలాక్షి! యని పలుమఱును రోదించె నటన్

29.   

 

 

 

తే.గీ.

ఇట్లు విలపించుచు వనము లెల్లఁ దిరిగి

తిరిగి యెగురుచు నొకచోట పరువు లిడుచు

నన్య దేశములను గాంత నరయు కాంక్షఁ

బిచ్చివాని భంగినిఁ దోఁచె నచ్చ టతఁడు   

30.   

 

 

 

కం.

వనములు నదులు గిరులు కా

ననములు సెలయేరు లెల్ల నర శార్దూలుం

డు నిలువ కెక్కడ తిరుగా

డె నతఁడు వేగముగను వెత డెందం బడలన్  

31.    

 

 

 

ఆ.వె.

అట్లు సని విపుల మహారణ్యమున నెల్ల

వెదకి మైథిలి కయి విడిచె నాశఁ 

దిరిగి  తనదు ప్రియ సతి నట నన్వేషింపఁ

దొడఁగె శ్రమ వహించి యడవి యందు    

32.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నఱువదవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 61.

 

 

 

పర్ణశాలలో సీతను గానక రాముఁడు మిక్కిలి యేడ్చు చుండ లక్ష్మణుఁ డోదార్చుట, రాముఁడు సీతను దలఁచుకొనుట తిరిగి యిరువురు వెదకుట. 

 

 

 

 

చం.

అరయక సీత నా దశర థాత్మజుఁ డచ్చట పర్ణశాలలో

నరయ వికీర్ణమై పడఁగ  నాసన రాజము లన్ని వింతఁ దా

నరసి సమస్త దేశముల నా సతిఁ గానక స్వీయ బాహులన్

విరివిగ నంత నెత్తి వడిఁ బెద్దగ నేడ్చుచుఁ బల్కె నిట్టులన్     

  1.  

 

 

 

తే.గీ.

చెప్పు లక్ష్మణ! యెక్కడ సీత యున్న

దేఁగె నే దేశ మక్కట యెవ్వ రపహ

రించి రెవ్వని చేత భక్షింపఁ బడియె 

నెచట సౌమిత్రి! నా ప్రియ యెఱుఁగఁ బలుకు   

  1.  

 

 

 

కం.

పరిహాస మాడ దాఁగితె

తరువు వెనుక నింకఁ జాలు తరుణీ! సీతా!

కరమేను దుఃఖితుండను

గరుణన్ సేవింపు నన్ను గాంతా! రమ్మా   

  1.  

 

 

 

ఆ.వె.

వేని తోడ నాడ విస్వసింప విహరిం 

తట్టి జింక పిల్ల లన్ని సీత!

గాన కస్రువు లవి కన్నుల నిండఁగఁ 

దలఁచు చున్న వెల్లఁ గలఁగి నిన్ను

  1.  

 

 

 

ఉ.

సీతయె లేక యున్న నిఁక శీఘ్రమ నే మరణింతు లక్ష్మణా!

నాతిని దొంగిలింపఁగ ఘనమ్ముగఁ బుట్టిన బాధ చేతనే 

యీ తఱి నేను గూలిన నరేశుఁడు నా జనకుండు నాక మం

దాతఁడు నన్ను గాంచఁ గలఁ డచ్చటఁ దమ్ముఁడ! నిశ్చయమ్ముగన్       

  1.  

 

 

 

చం.

నను గన నీ వొడంబడియు నా యనుశిష్టికిఁ బూర్తి కాకయే

పనిచిన యట్టి కాలము నభమ్మున కారయ వేగ వచ్చితే 

నను నిసి కామవృత్తుఁడ వనంగ నసత్యపు వాది వైతి వం

చును దివ మందు నున్న పిత  శోకము మీఱఁగ దూఱు నన్నటన్ 

  1.  

 

 

 

చం.

అనృజునిఁ గీర్తి వీడు విధి నక్కట భగ్న మనోరథున్ ననున్ 

ఘనముగ శోక తప్తు నిటు కాంతరొ యీ వివశున్ లతాంగిరో 

చనితి పరిత్యజించి నను జాలును పోకుమ వీడి నన్ను బో

యిన మరణింతుఁ దథ్యముగ నింతిరొ నీ విరహాగ్ని మండుచున్

  1.  

 

 

 

కం.

సీతను గాంచఁగ రాముం

డాతతముగ నిట్టు లుండ నార్తిని వన మం

దాతఁడు విలపించుచుఁ జన

నాతురముగఁ గాంచ కుండె నవనిజ నచటన్      

  1.  

 

 

 

తే.గీ.

బురద లోన దిగి మునుంగు కరి వరమ్ము

భంగిఁ జేర లేకయె జనకాంగజను నృ

వరుఁడు విలపించు చుండఁగఁ బలికె లక్ష్మ

ణుండు హిత మెంచి యిట్లనుజుండు తివిరి          

  1.  

 

 

 

ఆ.వె.

వలదు చింత రాఘవ మహాభుజా! యత్న

ము నొనరింప వలయు మనకు నింక

వనము నందు నెల్ల బహు కందర విలసి

తమ్ము నందు శూర! లెమ్ము ధృతిని   

  1.  

 

 

 

తే.గీ.

వన విహార మిష్టపడును వనము నందు

మక్కువ కరమ్ము యట్టి యా మైథిలి చని

యుండు వనికి లేక యరిగి యుండ నగును

బద్మముల విలసిల్లెడి పద్మినికిని    

  1.  

 

 

 

ఆ.వె.

మీన వంజులములు గాన వచ్చు నదికి 

నేఁగి యుండె నేమొ యెంచి స్నాన

మాడ దాఁగె నేమొ యేడ నైన పరిహా

సార్థము వన మందు నతివ రామ!   

  1.  

 

 

 

ఉ.

భీతిలఁ జేయఁ దా మనలఁ బేర్మినిఁ గానన మందు నెచ్చటో

సీత యెఱుంగ నెంచి మదిఁ జెల్వము మీఱఁగ దాఁగి యుండునే 

నాతిని మూరి మార్గణమునన్ వెసఁ గన్గొన  నుద్యమింపఁగా   

నీ తఱి నన్న! యిర్వురకు నింపుగ నొప్పును లెమ్ము రాఘవా!    

  1.  

 

 

 

కం.

వన మెల్లను జానకి యు

న్న నెచ్చ టైన వెతకుదము నర శార్దూలా!

కను నంత వఱకును దలం

చిన నొప్పని నీవు రామ! చింతింపకుమా   

  1.  

 

 

 

కం.

అన సౌహార్దముతో ని

ట్లనుజుఁడు సౌమిత్రి యంత నరయుచు శాంతిన్

మను జోత్తముండు రాముఁడు 

వని వెదక దొడంగె ననుజ వరు గూడి వెసన్  

  1.  

 

 

 

చం.

వనముల శైల రాజముల వాహిను లందుఁ దటాక కోటినిన్   

ఘన గిరి కందరమ్ముల శిఖాప్రవరమ్ముల సాను రాశినిం 

జని చని చేసి శోధనము సర్వ జగమ్ముల జానకీ సతిం 

గనుగొన లేదు రాఘవులు కానన దేశము లందు నెందునున్    

  1.  

 

 

 

ఆ.వె.

వెదకి యెల్ల యెడల విస్తృతముగ రాముఁ

డంతఁ బలికెఁ గాంచి యనుజు లక్ష్మ

ణ! కన లేదు నేను నలినాక్షి సీత శు

భాంగిని నిట నీ మహాద్రు లందు

  1.  

 

 

 

తే.గీ.

దండకా వని గాలించు తమ్ముఁ డార్తి

సెలఁగ నన్న కిట్లనియె రుచిరపు తేజ

మున వెలింగెడు వానితోఁ బొందుదు సతి

బలిని బంధించి మహిఁ గొన్న వటువు భంగి     

  1.  

 

 

 

కం.

అన సౌహార్దముతో ని

ట్లనుజుఁడు సౌమిత్రి యంత ననెఁ దాఁ జింతన్

మను జోత్తముండు రాముఁడు 

ఘన దుఃఖాభిహత చిత్త కాకుత్స్థుఁ డిటుల్    

  1.  

 

 

 

కం.

గాలించితి వన మెల్లను

మేలుగఁ గొలనులఁ గుసుమ సమేతము లెల్లన్

శైలముల గుహా యుతముల

నా లలనం గాంచఁ  బ్రియను నసువుల కన్నన్    

  1.  

 

 

 

కం.

విలపించుచు నివ్విధముగ

నిలా తనూ జాపహరణ మేఁప మదిని వి

హ్వలుఁ డయ్యె నొక ముహూర్తము 

నలినాక్షుఁడు దీనముగను నర వృషభుండే  

  1.  

 

 

 

ఆ.వె.

తప్తుఁడై కరమ్ము తను వెల్లను గృశింప 

మందగింప బుద్ధి మతి సెడంగ 

విరివి నిశ్వసించి వెచ్చఁగఁ గూర్చుండె 

దీనుఁ డాత్రము కడిఁది సెలఁగ నెద

  1.  

 

 

 

ఆ.వె.

నెగడ నార్తి భీతి నిట్టూర్చి మిక్కిలి

హా ప్రియా యనుచు మహాత్ముఁ డంత

రాముఁడు విలపించె రాజీవ నేత్రుఁడు

గద్గదస్వరమునఁ గాంత కొఱకు   

  1.  

 

 

 

ఆ.వె.

వినయ మూని వెస నంజలి ఘటించి

బాంధవుఁ డనుజుండు పరమ ధర్మ

వేది బహు విధముల వీరుని రాముని

నూఱడించె నంత మీఱఁ బ్రేమ    

  1.  

 

 

 

కం.

విని లక్ష్మణోష్ఠ గళిత వ

చనమ్ములను నాదరింపఁ జాలం డయ్యెం

గన నేరక రాముఁడు సీ

తను దిరిగి తిరిగి భృశమ్ము తా విలపించెన్   

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నఱువది యొకటవ సర్గము.

అరణ్య కాండము

సర్గము 62.

 

 

 

సీతావిరహ దుఃఖమున రాముఁడు పరిపరి విధముల విలపించుట.

 

 

 

 

కం.

కమల నయనుఁడు మహాత్ముఁడు

విమనస్కుం డయి కలంత విస్తృత భుజుఁ డా                      

కమలాక్షి సీత నరయక

కుములుచు విలపించె నట రఘుపతి భృశముగన్   

1.      

 

 

 

ఆ.వె.

మదన వివశుఁ డకట మగువఁ గనిన భంగి

లేక యున్న నెదుట వీఁక యెడఁద

వగపు నూని యనఁగ దగనిఁ పల్కులఁ బల్కఁ

దొడఁగె రాముఁ డిట్లు తొనఁక వలపు

2.     

 

 

 

తే.గీ.

సుమ చయ ప్రియ! ప్రియ! నీ వశోక తరువు

నాదు శోక వర్ధిని వెన్క నక్కి యుంటె

నీదు మే నది కనఁబడని విధి నకట

నలిన దళ నేత్ర! తగ దిది లలన! నీకు

3.     

 

 

 

ఆ.వె.

అరఁటి బోదెల వలె నడరు నీ యూరువు

లొరసి యుండఁ గంటి నువిద నేను

దాఁపఁ దరము గాదు తరుణీ మణి! దలఁప 

నీకు వాని నింక నీరజాక్షి!

4.     

 

 

 

చం.

నగుచును  గర్ణికార సువనమ్మున దేవి చరించు చుంటివే

వగపు నొసంగు నాకు నిట భామరొ యీ పరిహాస మెల్లనున్

మగువ కడింది డస్సి చను మానిసి కీ పరిహాస మేల మే

లగు కడు మాన నియ్య దిఁక హాసము చాలిఁక దేవి! మత్ప్రియా!

5.     

 

 

 

ఆ.వె.

ఆశ్రమమ్ము నందు హాస్యము  తగ దింతి

హాస్య శీల వంచు నబల నిన్ను

నే నెఱుఁగుదు లేక నీవు శూన్యమ్ముగఁ 

బర్ణశాల యుండె భామ రమ్ము

6.     

 

 

 

తే.గీ.

నిశ్చయం బిది లక్ష్మణ! నే నిటు విల

పింప సీత చేరదు నన్ను జంపి యుందు

రసురు లామెను గాదేని యపహరించి

యుందు రక్కట  తా నుండ నొంటరిగను  

7.     

 

 

 

తే.గీ.

ఈ మృగ పరివారము కన్ను లెల్ల నిండ

నశ్రువులఁ జెప్పు చున్నవి  యవనిజ యిట

భక్షితం బయ్యె నంచును రాక్షసాలి

చేతఁ దోఁచు చున్నది యట్లు చేత లరయ   

8.     

 

 

 

తే.గీ.

ఎచట యార్య! నీ వుంటివి యిందు వదన!

హా యవనిజ! సాధ్వి! వరాంగి! యడవి లోన

దేవి! నీచేతఁ  గైకేయి తీరి నట్టి

తనదు కోరిక కలదిగఁ దా నగు నిఁక

9.     

 

 

 

కం.

చని సీత తోడ నరుదెం

చిన సీతయె లేక యెట్లు చేరుదు శూన్య

మ్మును లక్ష్మణ! యంతిపుర

మ్ము నయోధ్యా పురము కదిసి మూరిన చింతన్    

10.    

 

 

 

తే.గీ.

తెల్ల మయ్యెఁ బిఱికితన మెల్ల నాది 

యపహరింపఁ బడఁగ సీత యడవి నిట్లు

నిర్దయుఁ డని నిర్వీర్యుఁ డని జను లెల్ల

నన్ను గాంచి పలికెదరు నగరి లోన     

11.    

 

 

 

తే.గీ.

తిరిగి వచ్చిన వనవాసము రయమున నొ

నర్చి కుశల మడుగఁగ జనక విభుండు

నన్ను మిథిలాధిపతి  నరనాథు నెట్లు

చూడ శక్య మగును నాకు సుదతి లేక

12.    

 

 

 

కం.

కని నన్ను విదేహ విభుఁడు

తనయ రహితముగ సుత పయిఁ దగులము మీఱన్

మనమునఁ గలంత మోహ

మ్మునకు  వశుం డగును దథ్యముగ సౌమిత్రీ!  

13.    

 

 

 

కం.

కాదేని యేఁగ నెంచను

సోదర పాలిత నగరికి శూన్యము సుమ్మీ

నా దయిత సీత లేనిది

యా దివ మైన నిఁక నాకు ననుజా! వింటే       

14.    

 

 

 

ఆ.వె.

ఇక్కడ నను వదలి యేఁగు మయోధ్యకు

శుభతర పురమునకు సుదతి సీత

లేని యెడల నిచ్ఛ లేదు జీవింప నా

కింత యేని యెడఁద వంత మీఱ    

15.    

 

 

 

తే.గీ.

కౌఁగిలించి గాఢమ్ముగ నేఁగి భరతుఁ

గని వచింపుమ నాదు వాక్యముల నిట్లు

రాముఁ డొసఁగె నీ కాజ్ఞ భరత! వసుధను

మీఱి పాలింపు మంచు సౌమిత్రి! ప్రీతి

16.    

 

 

 

తే.గీ.

అంబ కైకకును సుమిత్ర కంత నాదు

మాత కౌసల్యకుఁ దగిన రీతి వంద

నమ్ము లొసఁగి  నుడివిన విధమ్ము సేయు

లక్ష్మణ! తగ రక్షింప వలయును దివిరి

17.    

 

 

 

ఆ.వె.

సీత లయము నే నశించిన విధ మెల్ల

విస్తరముగ నీవు వెడలి నాదు

మాతకు వివరింపు భ్రాత! సర్వమ్మును

శత్రు వీర దమన! చారు చరిత!  

18.    

 

 

 

కం.

విలపింప నిట్లు దీనత

లలనా హీనము వనమున రాముఁడు భీతిం

గలఁతను గర మాతురుఁ డ

య్యె లక్ష్మణుఁడు గూడ నంత నెఁడద తపింపన్    

19.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నఱువది రెండవ సర్గము.

 

అరణ్య కాండము

                                                 సర్గము 63.

 

 

 

రాముఁడు తిరిగి సీతను దలఁచు కొనుచు మిక్కుటముగా దుఃఖించు చుండ లక్ష్మణుఁడు సీతను వెదకు నుపాయముల నాలోచింపు మని యన్నను వేఁడికొనుట.

 

 

 

 

కం.

రాజ సుతుండు తనకుఁ బ్రియ

మౌ జానకి లేని వాఁడు నా ర్తాకారుం

డౌ జననాథుఁడు దుఃఖితుఁ

గాఁ జేసి యనుజు మునిఁగె వగపునన్ మరలన్

1.      

 

 

 

కం.

వనటఁ గలంగెడు సౌమి

త్రినిఁ గాంచి కలఁత మునింగి తీవ్రతరముగా

మనుజర్షభుండు వెచ్చగ

ను నిశ్వసించుచు వచించె నొవ్వొలుకు గిరల్  

2.     

 

 

 

ఆ.వె.

చెడ్డ పనుల నెల్ల దొడ్డగ నొనరించు

నన్ను బోలు వాని మున్ను కనము

వగపు మీద వగపు వచ్చు చున్నవి నాకు

నకట వరుస వరుస నగల హృదియె

3.     

 

 

 

ఉ.

మున్నొనరింపఁ గోరినవి మోహము మీఱఁగఁ బాప కార్యముల్ 

గ్రన్ననఁ దిర్గి తిర్గి యఘ కాయము లెల్లును బండి నేఁ డహో 

నన్ను వరించె నివ్విధి ఘనమ్ముగ దుఃఖము పైన దుఃఖముల్

మిన్ను నిభంపు భారముగ మేదిని నక్కట కంటె లక్ష్మణా! 

4.     

 

 

 

చం.

తొలఁగెను రాజ్యమే స్వజన దూరుఁడ నైతిని కాంచ నివ్విధిన్

విలయము నందెఁ దండ్రి మఱి వీడితి నక్కట మాతృమూర్తినే

తలఁపఁగ వీని నెల్ల మదిఁ దద్దయు దుఃఖము నిండు చుండెనే

కలఁచుచు నన్ను మిక్కుటము కంపిత మయ్యెను మేను  లక్ష్మణా!

5.     

 

 

 

తే.గీ.

శూన్య వనముఁ జేరిన యంత శుభచరిత్ర!

మేను శాంతించె దుఃఖమ్ము నేను మఱువఁ 

గలుగ సీతా వియోగము వెలిఁగెఁ దిరిగి

కట్టె లో నగ్ని భంగినిఁ గలఁత భృశము  

6.     

 

 

 

తే.గీ.

భీరు వా రాజ కన్య సభీతి సస్వ

రమ్ము విలపించి యుండు భృశమ్ము బలిమి

గగన గతిఁ గొనిపోవ రక్కసులు సెలఁగి

సీత తా నపస్వరములఁ జింత తోడ

7.     

 

 

 

కం.

సత మెఱ్ఱ నైన  చందన

మతి సుందరమున వెలుంగు నతివస్తనముల్

కృతవృత్తమ్ములు నిఁక శో

ణిత పంక వృతములు వెల్గ నేరవు చుమ్మీ       

8.     

 

 

 

తే.గీ.

అతి మృదువులు సువ్యక్తము లగు పలుకుల

నలరు వక్ర కేశమ్ముల నందమైన

ముఖము వెలుఁగ దసుర వశము నయి యింక  

రాహు ముఖ గత శశి వలె రగులు చుండి   

9.     

 

 

 

తే.గీ.

హార బద్ధమై నిత్యమ్ము నలరు నా ప్రి

య సతి సువ్రత కంఠము నంతఁ జీల్చి 

రుధిర పా నాభిరతు లసురులు సెలంగి

త్రాగు వార లింక నతివ రక్త మెల్ల

10.    

 

 

 

కం.

విజనం బైన వనిని నవ

నిజ రుచిర విశాలనేత్ర నిర్దయ నసురుల్

కుజనులు హరించి యీడ్వఁగ 

నిజ పతి లేక కురరి వలె నెలఁతుక యేడ్చున్   

11.    

 

 

 

ఆ.వె.

ఈ శిలా తలమున నెలమి నా సరసఁ గూ

ర్చుండి చిరు నగవు లొలుకఁగ హాస్య

ము లడరంగఁ బెక్కు పలుకులు నీ తోడ

లక్ష్మణ! వచియించె లలన సీత

12.    

 

 

 

ఆ.వె.

నదుల నెల్ల మిన్న నదియ గోదావరి

ప్రియము కరము నాదు ప్రియకు నేఁగె

నంచుఁ దలఁతు నటకు నెంచ నెన్నం డేఁగ

లేదు సీత యొంటరిగ నచటకు    

13.    

 

 

 

తే.గీ.

చారు పద్మాస్య పద్మవిశాల నేత్ర

పడతి యేఁగెనే పడయంగఁ బద్మములను

దలఁప నదియు యుక్తము కాదు తరుణి యేఁగ

లేదు మున్నెన్నఁ డచటకు లేక నేను

14.    

 

 

 

ఆ.వె.

వివిధ విహగ నిచయ వితత సేవితము పు

ష్పిత ఘనద్రుమ విలసిత వనమున

కరిగిన దనుకొన్న నదియు నయుక్తంబ

భీరు వకట సెందు భీతి మిగుల  

15.    

 

 

 

తే.గీ.

జరిగినవియు జరుగ నున్నవి రవి! జనుల

సత్యము లసత్యముల నేరఁ జాలు దీవు

సీత నాప్రియ యెట కేఁగెఁ జెప్పు మపహ

రింపఁ బడెనొ శోకార్తున కింకఁ గరుణ  

16.    

 

 

 

తే.గీ.

జగము లందుండు నన్నిట శంక యేల 

నీ వెఱుఁగనిది శూన్య మనిలమ! సీత

సత్కులజ హృత యయ్యెన సమసెన గతి

మధ్య నున్నదో చెప్పుమ మాన్య! నాకు 

17.    

 

 

 

కం.

విలపించు చుండ రాముఁ డి

టుల శోకార్తుఁడు విసంజ్ఞుఁడు విని వచించెన్

బలుఁ డా లక్ష్మణుఁడు వచన

ము లిట్లు సమయోచితములు మూరిన నీతిన్   

18.    

 

 

 

ఆ.వె.

వీడు శోక మెల్ల వీర! యూనుమ ధృతి

సీతఁ గాంచు గతిని శీఘ్ర మరయ

వలయుఁ దివిరి యత్నపరు లెప్డు కష్ట కా

ర్యములఁ గ్రుంగఁ గనము భ్రాత! వినుమ   

19.    

 

 

 

కం.

వినినను బల్లిదు లక్ష్మణు

మునుకులఁ నెద రఘు కులప్రముఖుఁడు గొనం డిం

కను వీడి ధృతిని దుఃఖ

మ్మున మునిఁగె భృశమ్ముగాను బురుషోత్తముఁడే  

20.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నఱువది మూడవ సర్గము.

అరణ్య కాండము

సర్గము 64.

 

 

 

సీతకై వెదకుచు దారిలో సీత యాభరణములు, నడుగు జాడలను, మఱియు విఱిఁగిన ధనువు, కవచము, ధ్వజములను గాంచి సీతను రాక్షసు లపహరించి నట్లు నిశ్చయించి రాముఁ డుగ్రుఁడై లోకములను నశింపఁ జేయఁ బూనుట. 

 

 

 

 

కం.

కని పలికె లక్ష్మణునితోఁ

జని నేరుమ సీత జాడ సత్వరముగఁ దాఁ

జనెనొ నదికి గోదావరి

కని కుసు మార్థమ్ము రాముఁ డతి దీనముగన్   

1.      

 

 

 

చం.

అన విని యేఁగి లక్ష్మణుఁడు హంతకుఁడే రిపు వీర కోటికిం 

గని నది యొడ్డు నెల్లెడలఁ గానక పల్కెను గాంచ సీత నం

చును మఱి నాదు పిల్పునకుఁ జూడఁగ నుత్తర మీయ రెవ్వరుం  

గన నగు దేశముల్ జనక కన్య నెఱుంగక యుంటి రాఘవా!       

2.     

 

 

 

తే.గీ.

క్లేశ నాశినిఁ గన జానకీ సతి నన

నాలకించి గోదావరి కంత స్వయము

రాముఁ డేఁగి సంతప్తుఁడు భామ యెక్క

డుండె నని వేఁడి రోదించు చుండ భృశము

3.     

 

 

 

తే.గీ.

భూత రాశి గోదావరీ పుణ్య నదియు

నేని రామున కక్కట యెవ్వరును వ

చింప లేదు వధార్హుఁడు సీత నపహ

రించె దుష్టుఁడు రాక్షసుఁ డంచు సుంత  

4.     

 

 

 

చం.

వగచుచు వేఁడ రాముఁ డిటఁ బల్కుమ యాపగ! సీత జాడనుం

దగ యని కాఁగఁ జోదితయుఁ దద్ద వనమ్మున భూతరాశి చే

తఁ గనఁగ రాక్ష సాధముని తద్భయదంబులు రూప కర్మముల్

వెగ డొదవంగ యా నది సభీతి వచింపదు జానకీ గతిన్

5.     

 

 

 

తే.గీ.

జానకి నిమిత్తము నదిచేఁ దా నిరాశఁ

బడసి యట్లు వైదేహిని భార్యను గనఁ

గరము తపియించు రాముఁడు కాంచి ననుజు

లక్ష్మణునిఁ బల్కె నిట్లు నర వృషభుండు  

6.     

 

 

 

ఉ.

యే వచనమ్ములం బలుక దీ నది లక్ష్మణ! వేఁడ నేను  గో

దావరి యెట్లు చెప్పుదును  దార విహీనము నేఁగి నే నహో

భూవరు చెంత కా జనకుఁ బూరుష వర్యునిఁ గాంచి యింకనుం 

బావన మాత తోడ నట బాధను బంచుట నాకుఁ బాడియే

7.     

 

 

 

ఉ.

ఎవ్వరు రాజ్య హీనునకు నివ్వన వాసము చేయు నాకు నా

నెవ్వలు వాపె నన్నిటిని నెమ్మిని నట్టి విదేహ కన్య నిం

కెవ్వ రెఱుంగఁ బల్కుదురొ యీ నిజ బంధు విహీనుఁ డాలియే

యివ్వని దూర మైనఁ గను  నిచ్చట మేల్కొని దీర్ఘ రాత్రులన్        

8.     

 

 

 

మ.

సజనస్థానము నేను బ్రస్రవణమున్ శైలమ్ము గోదావరీ

సుజ లాగారము సర్వ దేశముల వే శోధింతు సీతా సతిన్

నిజ భార్యామణిఁ జూచు నంత వఱకున్ నీ విత్తరిం గాంచుమా 

నిజమున్ నాకు వచింప నీ మృగములే నెమ్మిన్ నిరీక్షింపఁగా

9.     

 

 

 

ఆ.వె.

రాఘవుండు పలికి భ్రాతతో నిట్లు క

న్నీరు నిండఁ గనుల నారసి మృగ

ములను దీనుఁ డనియెఁ  బలుకుఁడు జానకి

యెక్క డున్న దంచు స్రుక్కి మిగుల   

10.    

 

 

 

చం.

పలుకఁగ నిట్లు రాఘవుఁడు పన్నుగ లేచి రయమ్మునన్ మృగ

మ్ము లడరి దక్షి ణాశ నభముం దగ జూపుచు సీత నప్డు దొం

గిలిన దిశం జనంగఁ బరికించుచు రాముని దీక్ష నంతటన్

లలితుఁ డెఱింగి సంజ్ఞలను  లక్ష్మణుఁ డా మృగ రాశి భావముల్            

11.    

 

 

 

తే.గీ.

వాని సంకేతముల నెర్గి వచన రాశి 

నెల్ల లక్ష్మణుండు పలికె సల్లలితము

గ వచనము లిట్టు లన్నను గాంచి యార్తు

నంత రాముని తోడ  ధీమంతుఁ డలరి  

12.    

 

 

 

ఆ.వె.

సీత యెక్క డంచు భ్రాత! నీ వడుగంగ

లేచి మృగము లెల్ల లీలఁ జూపి

న వవి యెల్ల దక్షిణంపు దిక్కును నేల

నడరి దారిఁ జూపు నట్లు మనకు

13.    

 

 

 

కం.

కనుక మన మేఁగ నీ ది

క్కు నైరృతి దిశకు దొరక నగును దప్పక క

ల్గిన నాధారము కొంత య

యిన నార్యా! జానకిఁ గన నిత్తఱి మనకున్

14.    

 

 

 

ఆ.వె.

బాగు బాగని విని వేగమ కాకుత్స్థుఁ

డంత వెడలఁ జాగె ననుజుఁ గూడి

దక్షిణ దిశ వైపు వీక్షించుచుఁ బుడమి

సుందరాస్యుఁ డడరి యందు నిందు

15.    

 

 

 

ఉ.

అన్నయుఁ దమ్ముఁ డొండొరుల నవ్విధిఁ బల్కుచు నేఁగు చుండఁగాఁ

గన్నుల కప్డు కన్పడఁగఁ గానన భూమి వికీర్ణ పుష్పముల్

క్రన్ననఁ గాంచి వాని ననె రాముఁడు లక్ష్మణు తోడ నిట్టులన్

మిన్నగ తప్తుఁడై వగపు మీఱిన పల్కులు  గద్గదమ్ముగన్    

16.    

 

 

 

చం.

తెలియఁగ వచ్చెఁ బుష్పములు తెల్లమ యిచ్చితి నేను సీతకే

లలన ధరించెఁ బ్రీతిని ధరాసుత కానఁగ భద్ర రీతి నా

కిల నొసఁగంగఁ బ్రీతిఁ కడు నీ మహి భాస్కరుఁ డింక వాయువున్

వలపున దాచిరే యిచటఁ బన్నుగ లక్ష్మణ! శత్రు భంజనా!

17.    

 

 

 

చం.

నర వృషభుండు పల్కి వచనమ్ములు లక్ష్మణు తోడ నిట్లు తా 

నరయుచుఁ బ్రీతిఁ బ్రస్రవణ మద్రిని ధర్మ రతుండు రాముఁ డం

త రమణి భూమి పుత్రి వసుధాధరమా!  సతి మద్వియోగ నీ

వరసితె చెప్పుమా కరుణ నారసి నన్నని వేఁడె నింపుగా   

18.    

 

 

 

తే.గీ

క్రుద్ధుఁడై తిరిగి పలికె క్షుద్ర మృగము

ను మృగరాజు వీక్షించు నట్లు మనుజహరి

యరసి చూపుమ జానకి నభ్రవర్ణ

సానువుల తోడఁ ద్రుంతు గా దేని నిన్ను                                

19.    

 

 

 

ఊ.

సీత నిమిత్త మిట్లన నృశేఖరుఁ డద్రిని గాంచి శైలమే

భీతిని జెప్పఁ బూనియును వీరున కామెను నిల్వఁ జూపకే

యాతత కోప మూని యనె యా రఘు సత్తముఁ డుగ్ర రూపుఁడై

భూతి నొనర్తు బాణముల భూజ తృణాది విహీన భంగినిన్    

20.   

 

 

 

తే.గీ.

పల్లవద్రుమ హీనమై పర్వతంబ!

భస్మ మయి నిల్వ నీ వింకఁ బరుల కెవ్వ

రికిని సేవ్యమానవు కాక వికలమై ని

లువ గలవు సంతతమ్ము నీ వవని లోన    

21.    

 

 

 

ఆ.వె.

చూప కున్న సీత సుదతిని నా కీ న

దిని నయినను నేఁడు తివిరి యెండఁ

జేయు వాఁడ నింక శీఘ్రమ లక్ష్మణ!

చెప్ప కున్న జాడ తప్ప కేను   

22.   

 

 

 

చం.

కినుక వహించి కాల్చు విధిఁ గృత్స్నము కంటిని నుండ నంతటం 

గనె నట భూమిపై నసురు కాలివి గుర్తులఁ జెల్గఁ బెద్దవై

వనిత పదమ్ములం బుడమిఁ బర్విడు భంగిని వాని వెంటనుం

దన పతిఁ గాంచఁ గోరు విధిఁ దల్లడ మందుచు నున్న భంగినిన్

23.   

 

 

 

తే.గీ.

కని యచట సీతవియు రక్కసుని  కదలిక       

లట్లు విఱిఁగిన వింటిని నమ్ములపొది 

రథములును జెదరి పడంగ రాముఁ డంతఁ

గరము సంభ్రాంతుఁడు నయి లక్ష్మణున కనియె     

24.   

 

 

 

తే.గీ.

చూడు లక్ష్మణ! భూషలు చూర్ణము లయి

నేలఁ బడినవి యింకను మాల లిచట

యున్నవి చెదరి సీతవి యుండె రక్త

బిందువులు పైడి చుక్కల చందముగను

25.   

 

 

 

తే.గీ.

రాక్షసులు కామ రూపులు రమణి సీత

ను విఱిచి విఱిచి విభజింప నవనిజ యిఁక

భక్షిత యయి యుండు మఱియు భామ కొఱకు 

యుద్ధ మిద్దఱి మధ్య నైయుండ నోపు    

26.   

 

 

 

చం.

ధను విది స్వర్ణ భూషిత ముదంచిత మౌక్తిక రత్న యుక్తమే 

ఘనము ధరిత్రి భగ్న మయి కన్పడు చున్నది యేరిదో యిటన్

దినకర సన్నిభమ్ము నయి తేజము నందు విదూర జాచిత

మ్ము నగు తనుత్ర మెవ్వరిది భూమి పయిం బడి యున్న దిక్కడన్  

27.   

 

 

 

తే.గీ.

ఛత్రము శత శలాకము చక్కని వగు

మాలలు వెలుంగు చుండఁగ నేల పైన

భగ్న దండ మయి పడె నెవ్వరిదొ యిచటఁ

జక్క గాను వీక్షింపు లక్ష్మణ! యొకింత   

28.   

 

 

 

ఆ.వె.

బంగరు తొడుగులను వఱలు పి శాచాన

న ఖరము లివి యీ రణ తల మందు

దొడ్డ మేను లుండి తోరపు భయదము

లెవ్వరివొ సమసిన విచట గనుమ!   

29.   

 

 

 

ఆ.వె.

మండు నిప్పు వోలె మెండుగ వెల్గు ర

ణ ధ్వజం బిచటఁ గనఁబడు చున్న

దెవ్వరిదొ రథమ్ము నే వీరునిదొ విఱిఁ

గి పడి యున్నది చెదరి పుడమి నిట  

30.   

 

 

 

కం.

ములికు లివి  బండికన్నును

దులఁదూఁగి మెఱుఁ గిడఁ బసిడితో నలదినవై

యిలఁ జెదరిన వెవ్వనివొ ప

నుల ఘోరుం డయిన యా ఘనుఁ డెవఁడొ తలఁపన్   

31.    

 

 

 

చం.

శరచయ పూర్ణ తూణములు సంక్షయమై పడి యున్న వేరివో

గరమునఁ జేఱుకోలను  బ్రకాశితమౌ రథ చోదకుండు నె

వ్వరి కగుఁ దా హతుండు నయి వ్రాలెను వీరలు నెట్టి యమ్ములం

బరఁగి ధరించి చామరలు వ్రాలిరి యెవ్వరి కీరు భృత్యులో    

32.   

 

 

 

ఆ.వె.

ఏ పురుషునిదొ మఱి యే రక్కసునిదొ మా

ర్గ మిది యగును దప్పక పరికింప

వంద రెట్లు నాదు వైర మయ్యె నిపుడు  

జీవితాంతకమ్ము సూవె యరికి    

33.   

 

 

 

చం.

అతి కఠినాత్ము లీ యసురు లౌదురు సౌమ్య! స్వకామరూపులే

సతి హృత యయ్యెనో  యకట సాధ్వియె భక్షితయో నశించెనో

యతి దయనీయయౌ రమణి నాఱయఁ గావదు స్వీయ ధర్మమే

హృత యగు కాల మందు వని నింతయు లక్ష్మణ! యేమి చెప్పుదున్    

34.   

 

 

 

తే.గీ.

మ్రింగఁ బడినను వైదేహి దొంగిలింపఁ

బడిన లోకమ్ము నందు నెవ్వర యినఁ బ్రియ

ము నొనరింపఁ జాలరె నాకు ననుజ! లేరె

దేవతల యందు నైనను గావ నకట  

35.   

 

 

 

తే.గీ.

కరుణ నెఱిఁగిన ఘను లోక కర్త శూరు

నైన నీ భూత రాశియు నేని గౌర

వింప నేరదు లక్ష్మణ! వీర! వినుమ

నిట్టు లయిన నింకఁ దెలియ కేని నయిన    

36.   

 

 

 

కం.

మెత్తని వాని నని దయా

చిత్తుఁడు దాంతుఁడును జనుల శ్రేయము తలఁచున్

నిత్తె మితఁ డని సురావలి

మొత్తము నిర్వీర్యుఁ డంచుఁ బుడమిని నెంచున్  

37.   

 

 

 

తే.గీ.

నన్ను జేరి గుణము లగుణము లయినవి

లక్ష్మణ! కను శశి వెలుఁగు లయము సేసి 

సూర్యుఁ డుదయించి నట్టు లసుర సభూత

మృతికి నాదు తేజమున నణఁతు గుణముల  

38.   

 

 

 

ఆ.వె.

అనుజ చూడు మింక యక్ష గంధర్వ పి

శాచ మనుజ రాక్షస గణ కిన్న

రాలి యెట్టి సుఖము లంద శక్యము కాదు

నిశ్చయముగ నాకు నెగడఁ గినుక

39.   

 

 

 

తే.గీ.

ఉదరి ముల్లోక చారులకు దిగ వీలు

లేని యట్టు లొనర్తును లీల నాదు

దివ్య బాణాస్త్రముల నింపి దివిని నెల్ల

నేఁడు చూడుమ లక్ష్మణ! వేడుకగను  

40.   

 

 

 

మ.

సక లాభ్రగ్రహ సన్నిరుద్ధము లసచ్చం ద్రావరోధమ్మునున్ 

విక లాదిత్య సమీర ణాగ్ని రుచులన్ విధ్వంస మేఁ జేసెదన్

శకలీ భూత ధరాధ రాగ్రములు శుష్కక్షీణ కాసారముల్ 

వికటీ భూత లతాది గుల్మ తరువుల్ వీక్షింతు వో లక్ష్మణా!  

41.    

 

 

 

తే.గీ.

మఱియు సంక్షోభి తాబ్ధుల వెఱవ కుండఁ 

జేసెద నిఁక విజృంభించి శీఘ్రముగను  

ఘోర లయ కర్మరాశి సంకోచ మంద

కేను ముల్లోకములఁ జేయఁ బూనుదు ధృతి  

42.   

 

 

 

ఆ.వె.

భద్ర శీల సీత భద్రముగా నాకు

నొసఁగ కున్న సుర వరోత్తము లిపు

డీ క్షణమునఁ జూతు రిచ్చట లక్ష్మణ!  

నాదు విక్రమమ్ము లేదు శంక

43.   

 

 

 

చం.

గగనము నందు భూతములు కానఁగ లే వెగురంగఁ జోటునున్

సుగతి మ దస్త్ర ముక్తములు చూఱగొనంగ నిరంతరమ్ముగా

మృగ విహగమ్ము లెల్ల నిఁక మేదినిఁ గూలు శరార్దితమ్ములై

జగతియె కాంచు నే నిట భృశమ్ముగ హద్దు లతిక్రమింపఁగన్   

44.   

 

 

 

కం.

ఆకర్ణాంతము లాగుచు

వీఁక శరమ్ములను వదలి విశ్వము లోనన్ 

రాకాసులుం బిశాచము

లే కనఁ బడ నట్లొనర్తు నీ సీతకునై

45.   

 

 

 

చం.

కినుకను వేయ బాణములఁ గేళిని వీర్యము గాంతు రీ సురల్

చన నతి దూర మింపుగను సత్తువ కల్గిన వాని నెల్లరున్

మనఁగ సు రాసు రావలియు మానిసి దిండ్లును నీ పిశాచముల్ 

కన మిల నాదు ఘోర విశిఖమ్ముల నర్ధితులై నశింపఁగన్    

46.   

 

 

 

ఆ.వె.

ముక్కలై భృశమ్ము ముల్లోకముల యక్ష

దేవ దాన వాసురావలి క్షణ

మైన బ్రతుకఁ జాల దవని మదీయ బా

ణౌఘ ఘాతమై యమోఘముగను    

47.   

 

 

 

కం.

హృత నయిన మృత నయిన దే

వత లీయక యున్న సీత బాణమ్ముల నే

నతి వేగమ చేయుదును జ

గతి నెల్లలు లేని రీతిగను సౌమిత్రీ

48.   

 

 

 

కం.

నిజ రూపమ్మునఁ బ్రియ నవ

నిజ నీకున్న జగతి నిఁక నిర్జీవమ్మున్

నిజముగఁ జేయుదు లక్ష్మణ!

భుజ వీర్యమ్మున నఖిలము ముల్కుల తోడన్       

49.   

 

 

 

ఉ.

రాముఁడు పల్కి యివ్విధి శరమ్మును గార్ముక మందుఁ గ్రోధుఁడై 

భీమముగం దగిల్చివిష  భీమ భుజంగ నిభమ్ము  నా రిపు

స్తోమ వినాశకుం డనియె శూర వరుండు యుగాంత వహ్ని నా 

నా మను జోత్తముండు వచ నావలి లక్ష్మణు తోడ నివ్విధిన్     

50.   

 

 

 

తే.గీ.

సర్వ భూతములం దెట్లు చావు ముదిమి

కాలము విధియు నిత్యము వ్రాలుఁ బుడమి

నవ్విధమ్ముగఁ గ్రోధమ్ము నాహరింప

నేను ననివార్యుఁడ నెవరి కేని యనుజ!

51.    

 

 

 

ఆ.వె.

సత్వరమ్ము నాకుఁ జారుదంతిని సీతఁ

జూప కున్న మనుజ సుర భుజంగ 

కాయ సంయుతమ్ము గంధర్వ శైల రా

జమ్ములఁ బరిమార్తు క్షణము లోన   

52.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నఱువది నాల్గవ సర్గము.

 

 

అరణ్య కాండము

సర్గము 65.

 

 

 

లయ కాలాగ్ని వలె నిల్చి ధనువు నెక్కు పెట్టి లోకములను నాశనము చేయఁ బూను నన్నను గాంచి లక్ష్మణుఁడు శాంతపఱచి లోక నాశనము తగ దని యూఱడించి సీతాన్వేషణమునకుఁ దిరిగి యుద్యమింపు మనుట.  

 

 

 

 

చం.

కనపడ కున్న సీత నిజ కాంత తపించెడు నన్న రాఘవున్

ఘన లయ కాల వహ్నివలెఁ గన్పడు లోక వినాశ కామినిన్ 

ధనువును సజ్యముం గనుచుఁ దద్దయుఁ బల్మరు నిశ్వసించుచున్ 

మును కన నట్టి వాని వలె ముజ్జగ మెల్ల దహించు భంగినిన్   

1.      

 

 

 

తే.గీ.

రుద్రుఁ బోలె నిలువఁ గడు క్రుద్ధుఁడై ర

ఘూత్తముఁడు గాంచి లక్ష్మణుఁ డత్తఱి విన

యమ్మునఁ గరములు మొగిడ్చి యంతఁ బలికె

నోటఁ దడియాఱ నన్నతోఁ బాటవమున        

2.     

 

 

 

ఆ.వె.

ప్రకృతిని మృదు మనము రంజిలు దాంతుఁడ

వీవు భూతరాశి హితముఁ దలఁతు 

విట్లు క్రోధ వశత నెట్లర్హుఁడ వగుదు 

నీదు ప్రకృతి విడువ! నీరజాక్ష!   

3.     

 

 

 

తే.గీ.

చంద్రు నందు శోభ ధరలో క్షమయు  సూర్యు

నందుఁ గాంతి వఱల వాయు వందు గతియుఁ 

బరఁగ నివి యెల్ల నీ యందు వాసి కెక్కి

తగ్రజా! యుత్తమపుఁ గీర్తి నంది తీవు

4.     

 

 

 

ఉ.

ఒక్కఁడు సేయ దోషము నరోత్తమ! లోక వినాశ మెంచ నీ

కెక్కడి ధర్మ మార్య! రథ మెవ్వని దెవ్విధి భగ్న మయ్యెనో 

యక్కట యీ పరిచ్ఛదము సాయుధ మంతము సేసి రెవ్వరో 

యొక్కటి యేని నే నెఱుఁగ నుగ్ర రణంబ తలంప రాఘవా!

5.     

 

 

 

కం.

కనఁ బడు డెక్కలచేఁ జెద

రిన నేలయు మిక్కుటముగఁ ద్రెళ్లఁగ నిచటం

దనరె మఱి రక్త బిందువు

లును భండన సూచితము పురుష శార్దూలా!

6.     

 

 

 

తే.గీ.

ఎన్న వాక్యజ్ఞుల వరుండ! యియ్య దొక్కఁ

డ యొనరించిన యుద్ధమే యగు నిరువురు 

కాదు సైన్యంపు పాద నికాయ సంజ్ఞ 

లరయఁ జాల నే నిచ్చట నరవరేణ్య!       

7.     

 

 

 

కం.

ఒకని నిమిత్తము రాఘవ!

సకల జగమ్ములను గూల్ప సద్ధర్మంబే 

నృకు లాధిపులు ప్రశాంతులు 

ప్రకృతి మృదువు లొసఁగుదురు కపటులకు శిక్షల్

8.     

 

 

 

తే.గీ.

సర్వ భూతములకు నీవు శరణ మొసఁగు

వాఁడవు సతమ్ము గతి వౌదు పరమ పురుష!

నీదు భార్యాపహృతమును మేదినీశ!

యెవరు సాధు వని తలంతు రెందు నైన      

9.     

 

 

 

తే.గీ.

దేవ గంధర్వ దైత్య నదీ మహాబ్ధి

శైల రాజము లైనను సాధు జనులు

దీక్షితులకుఁ బగిది నీకుఁ దివిరి చేయఁ

జాల రెవ్వరు విప్రియ మేల కినుక   

10.    

 

 

 

ఆ.వె.

ఎవ్వఁడు హరియించె నివ్వనితా మణి

వాని వెదక వలయు నేను నుండ

రెండవ నరుఁడ నయి మెండుగ విల్లూని

రాజ!సాయ మిడ పరమ ఋషు లిట  

11.    

 

 

 

ఆ.వె.

కడలి వెతక వలయు నడరి పర్వతములు 

గుహలు వనులు నదులు కొలను లెల్ల

రఘువరేణ్య! వేగ రమణి హరించిన 

వాని వెతక వలయు  మానవేంద్ర!   

12.    

 

 

 

తే.గీ.

భార్య నప హరించిన యట్టి వాని మనము

పమ్మి దేవ గంధర్వ లోకమ్ము లందు 

నెక్క డున్నను  వెతకెద మెల్లెడలను 

గాంచు నంత వఱకు నింక నంచితముగ   

13.    

 

 

 

కం.

సామ వచనములఁ ద్రిదశులు

భామ నొసఁగ కున్న రామ! భార్యామణినిన్

భూమీశ్వర! చేయఁదగిన

 దేమరక యొనర్పు మపుడు హితకార్యమ్మున్     

14.    

 

 

 

కం.

నయ శీల సామ గుణ సవి

నయముల సీత నిడ రేని నరపుంగవ! నీ

వ యథేచ్ఛ వజ్ర నిభ శర

చయమ్ముతో నుద్యమింపఁ జనుమ రఘువరా!

15.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నఱువది యేనవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 66.

 

 

 

లక్ష్మణుఁడు శోక సంతప్తుఁ డగు రామునిఁ బరి పరి విధముల నూఱడించి నాతనినిఁ జైతన్య వంతునిఁ జేయుట. 

 

 

 

 

చం.

వగపున వేఁగు వానిఁ గడు భ్రాంతి నటన్ విలపించు వానినిన్

విగత ధవాభు నింకఁ దెలివిన్ మదిఁ గోల్పడి యున్న వానినిం 

దగిలిన వంత వానిఁ గని తాఁకి పదమ్ముల నాశ్వసించుచుం 

దగ వచియించె సోదరుఁ డధైర్యుని రాముని తోడ నింకనున్

1.      

 

 

 

కం.

ఘనముగఁ జేసి తపస్సును

ఘన కర్మము లాచరించి ఘను నిన్ను గనెన్ 

ఘనుఁడు దశరథ మహీపతి 

ఘను లమరు లమృతము నెమ్మిఁ గాంచిన భంగిన్   

2.     

 

 

 

కం.

తవ గుణ బద్ధుఁ డతఁడు నీ

దు వియోగవ్యథను గాంచెఁ దూర్ణమ్ము దివిన్

నృవరుఁడు జనకుఁ డని భరతుఁ

డె వచింప వినమె మనలకు నివ్విధి నపుడున్    

3.     

 

 

 

ఆ.వె.

కలిగి నట్టి వెతను గాకుత్స్థ  నీవ స

హింప కున్న నిట్లు నింక నల్ప

బలుఁడు ప్రాకృతుండు తలఁప నెట్లు సహింపఁ

గలఁడు రాఘవేంద్ర! కమలనేత్ర!   

4.     

 

 

 

తే.గీ.

దుఃఖము సెలంగ నీకు నీ దుస్సహ మగు

తేజమున  నెల్ల లోకము లోజఁ గాల్ప 

నార్తు లీ జను లెచ్చటి కరుగు వారు

రక్షణమ్మునకై యింక రాఘవేంద్ర!  

5.     

 

 

 

ఆ.వె.

లోకపు  గతి గాంచ నీ కరణిఁ దనరు

మును యయాతి నహుషు పుత్రుఁ డడరి

శక్రు లోక మందుఁ జక్కఁగ నిలిచి శా

పమ్ము నందెఁ గాదె పార్థివేంద్ర!

6.     

 

 

 

కం.

మన తండ్రి పురోహితుఁ డా

ముని వరుఁడు వసిష్ఠుఁడు నహమున శత సుతులం

గని తిరిగి వారి నెల్లను

గనండె హతు లట్ల కాఁగఁ గాకుత్స్థ వరా!   

7.     

 

 

 

ఆ.వె.

సత్య సంధ! భూమి సర్వలో కార్చిత

మాత జగతి కెల్ల మనుజనాథ!

కంపనమ్ము లడరఁ గనమె ధరా దేవి

కైన నప్పు డప్పు డచల యయిన 

8.     

 

 

 

తే.గీ.

సూర్య చంద్రు లిరువురు చక్షువులు జగతి

కెల్ల ధర్మజ్ఞు లిద్దఱు తల్లడిలక

సైపరె గ్రహణముల మహా సత్త్వులు గగ

నమ్మున వెలుంగుచును సుస్థిరమ్ము గాను  

9.     

 

 

 

కం.

సురలు మహా భూతమ్ములు

నరులు సకల జీవులును గన విధికి వశులే

పురుషర్షభ! కన లే వి

ద్ధర దైవ వశమ్ము నుండి తలఁగెడు శక్తిన్    

10.    

 

 

 

ఆ.వె.

శక్రముఖ దివిజులు విక్రముండ! న యాన

యముల నరసి యెల్ల రాత్మ లందుఁ 

బన్నుగ నరవర్య! వర్తింత్రు నిత్యమ్ము 

తగదు రాఘవేంద్ర! వగవ నీకు

11.    

 

 

 

ఆ.వె.

నష్ట యయిన సీత నరవరేణ్య హృతయు

నైన ననఘ! యల్పమానవుని వి

ధమ్ము తోఁప నిట్లు ధరణీశ పుత్రక!

తగదు రాఘవేంద్ర! వగవ నీకు 

12.    

 

 

 

కం.

చిం తాపగ తాస్యులు ధీ

మంతులు సత్యము సతమ్ము మది నుంచెడి వా

రెంతటి కష్టము నందును 

సుంతయు నీ వంటి వారు  శోకింప రయా

13.    

 

 

 

కం.

నరశార్దూల నిజమ్ముల

నరసి మహాప్రాజ్ఞులు తగు నాలోచనలన్

విరివిగ శు భాశుభమ్ము ల

డరి నేరుదు రింపుగను దడయక రఘువరా!   

14.    

 

 

 

కం.

నిజ గుణదోషము లెఱుఁగని 

ప్రజ లస్థిరు లాచరించు పను లెన్నం డే

ని జగతి నిష్ట ఫలమ్ముల

నిజ మెంచిన నేర వీయ నృవరశ్రేష్ఠా!

15.    

 

 

 

ఆ.వె.

పెక్కు మార్లు మున్ను ప్రీతి నివ్విధ మీవ

నాకు చెప్పితి కద నయముగను బృ

హస్పతి సదృశుఁడవె యన్యు లెవ్వరు చెప్పఁ

దగుదు రెంచ నీకు ధరణి లోన   

16.    

 

 

 

తే.గీ.

నీదు బుద్ధి మహా ప్రాజ్ఞ! నిశ్చయముగ

దేవతల కైనను గ్రహింప నీ వసుధఁ ద

రంబె నిదురించి నట్టిదౌ రామ! నీదు

జ్ఞానమును మేలుకొలిపితి నేను దివిరి

17.    

 

 

 

తే.గీ.

ఆత్మ లోన సుంత తలంపుమా త్వదీయ

దివ్య మానుష విక్రమ భవ్య గుణము

ల నిట నిక్ష్వాకు వృషభేంద్ర! రణము నందు

ద్విషుల హతమార్చుటకు మున్న వీర వర్య!   

18.    

 

 

 

కం.

సకలమ్మునాశనము సే

యు కార్యము దలంప నేల యుగ్ర రిపుని సు

ప్రకటముగ నీవు గుర్తిం

చి కలుషు దుష్టుని వధింపు చెలఁగి నరేంద్రా!    

19.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నఱువది యాఱవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 67.

 

 

 

లక్ష్మణుని సద్వచనముల నెల్ల రాముఁడు గ్రహించి తేఱికొని తిరిగి వెదకుచుఁ జనఁగ దారుణముగ దెబ్బలు తిని ఱెక్కలు తెగిన జటాయువును గాంచ నతఁడు సీతను రావణుఁడు గొనిపోవు చుండ నాతని నెదుర్కొంటి నని వచించుట.  

 

 

 

 

కం.

అగ్రజుఁ డైన ననుజుని స

మగ్ర వచన సార మెల్ల మనుజ వరుఁడు సా

రగ్రాహి రాఘవుఁడు రా

జాగ్రణి చక్కఁగ గ్రహించె నంత మనమునన్   

1.      

 

 

 

ఉ.

కోపము నిగ్రహించి శ్రుతి కోవిదుఁ డాని ధనుస్సు పైననే

వే పరికించి లక్ష్మణుని వీరుఁడు రాముఁడు జెప్పు నాయనా!

యేపనిఁ జేయ యుక్త మగు నెట్టి యుపాయము నూని సీత నా

పాపవిహీనఁ గాంచెదమొ పన్నుగ నెంచుమ  యంచుఁ బల్కినన్  

2.     

 

 

 

ఉ.

దీనుని దుఃఖ తప్తుఁ గని ధీరుఁడు లక్ష్మణుఁ డన్నతో జన

స్థానము ఘోర రాక్షస వితాన బహూర్ధ్వ లతాద్రు మాయత

స్థానము నందు రాఘవ! భృశమ్ముగ శోధన మింక యుక్తమౌఁ

గానన భూము లందు గిరి కందర నిర్దర దుర్గమమ్ములన్   

3.     

 

 

 

కం.

నానా మృగయుత వన మం

దేనియు  గంధర్వ వరుల యెల్ల యిరవులం

దేనియుఁ గిన్నర వరులుం

గానం బడు నెల్ల గుహలఁ గన నగు మనకున్   

4.     

 

 

 

ఆ.వె.

నన్ను గూడి రామ! చెన్నుగ వెతకుమ

బుద్ధి యుతుఁడ వీవు పుడమిఁ దగునె  

యాపదలఁ జలింప నచలము వాయు వే

గమునఁ గనునె సుంత కంపనమ్ము   

5.     

 

 

 

చం.

పలుకఁగ నిట్లు లక్ష్మణుఁడు బాణము వింటినిఁ గూర్చి క్రుద్ధుఁడై

చెలువపుఁ గానలో వెతక శీఘ్రమ చాగె సలక్ష్మణుండునై

లలితుఁడు గాంచె నవ్వనిని  రాఘవుఁ డంత జటాయువున్ ధరన్

విలసిలఁ బర్వ తాభముగ విద్ధ విహంగము రక్త సిక్తమున్   

6.     

 

 

 

కం.

కని గిరి శిఖాభ పక్షిని

ననె లక్ష్మణు తోడ నిట్టు లా రాముఁడు సీ

త నిదియె లక్ష్మణ! వైదే

హిని నిశ్శంకఁ దిని యుండు నీ వన మందున్

7.     

 

 

 

తే.గీ.

రక్కసుఁడు గృధ్ర రూపుఁ డరణ్య మందుఁ

గలఁడు తెల్ల మయ్యె నిపుడు కాంత సీత

ను దిని విశ్రమించుచు నుండె నుదరి తీక్ష్ణ

దీప్త శృంగ బాణముల వధింతు దీని  

8.     

 

 

 

ఆ.వె.

చక్క వాడి ములికి సంధించి వింటినిఁ 

బిక్కటిల్లఁ గినుక వేగ పర్వు

వెట్టెఁ బక్షి వైపు బెట్టిదమ్ముగఁ గంప

మంద భూమి రాముఁ డడరి యంత   

9.     

 

 

 

కం.

దీను దశరథాత్మజుఁ గని

దీనమ్ముగ నురుగు నెత్రు తెగఁ గాఱంగం

దా నివ్విధిఁ బక్షీంద్రుఁడు

మే నదరఁగఁ బల్కెఁ దివిరి మెల్లగ నంతన్    

10.    

 

 

 

తే.గీ.

ఇట్లు వనిని నన్వేషింతు వెవ్వరి కయి

ఘోర వని నౌషధమ్మును నారయు విధ

మా సతీమణియు మఱి నా యసువు లుభయ

ము లపహృతములు రావణు వలన రామ!  

11.    

 

 

 

ఆ.వె.

లక్ష్మణుండు నింక రామ! నీవును లేక

యున్న సీత నంత నుగ్రముగ బ

లిమిని రావణుండు కుములు చుండఁగఁ  గొని

పోవు చుండఁ గంటిఁ బుణ్యవతిని   

12.    

 

 

 

చం.

కని వడి సీతఁ జేరి దశకంఠుని మార్కొని వాని తేరునుం

దునకలు సేయఁ బృథ్విఁ బడెఁ దూర్ణము గాంచుమ దీని నిచ్చటన్ 

ధను విది భగ్న మైనది రథం బిది ఖండిత మయ్యె వానిదే 

యని నిట వాని తూణములు నారయు మిచ్చట మద్బలమ్మునన్   

13.    

 

 

 

తే.గీ.

సారథి యితండు వానికి సమసె నాజి

నాదు పక్ష ఘాతమ్మున  నన్ను గాంచి

రావణుండు ఖండించి యలయఁగ నేను

బక్షములు సీతఁ గొనుచు నభ్రమున కెగిరె     

14.    

 

 

 

కం.

హతుఁడను రక్కసుని వలనఁ

బతితుండ నయితిఁ బుడమినిఁ బార్థవరేణ్యా!

హతుని వధింప ననర్హుఁడ

వ తలంపుమ రాఘవేంద్ర! యరివీరఘ్నా!

15.    

 

 

 

తే.గీ.

వాని గుర్తించి కన్నీటి వదనుఁడై ద్వి

గుణపు వ్యధ తోడ రాముఁడు  గోమలి జన

క తనయ కథ నెఱిఁగి వీడి కార్ముకమ్ము 

కౌఁగిలించి గృధ్ర వరముఁ గలఁత నేడ్చె  

16.    

 

 

 

ఆ.వె.

లక్ష్మణుండు నేడ్వ రాముఁడు ధరఁ గూలె

నరసి దుర్గమమున నా ద్విజ వరు

నిశ్వసింప నెటులొ నెగడ దుఃఖము పల్కె 

లక్ష్మణుఁ గని యిట్లు రాముఁ డపుడు   

17.    

 

 

 

తే.గీ.

పోయె రాజ్యము వనవాసము వరియించె

సీతఁ గోల్పోతి ద్విజము నశించె నిట్లు

నాదు దుర్భాగ్య మీరీతి  నన్ను గాల్చు

చున్న దిది యగ్ని నైనఁ గాల్చును జెలంగి  

18.    

 

 

 

కం.

వనధిఁ బ్రవేశించిన నక

ట నేను దురదృష్ట మిది యడరి పూర్ణముగా

ను నదీపతి నైనను గా

ల్చును సందేహమ్ము నిందు సుంతయుఁ గనమే        

19.    

 

 

 

ఆ.వె.

మంద భాగ్యు నిటుల మహిఁ గన మెవ్వరి

నన్ను మించి లక్ష్మణ ధర లోఁ జ

రాచరముల  బాధ లను వలఁ జిక్కితి

మిక్కుటముగ నేన యక్క టకట

20.   

 

 

 

కం.

సఖుఁడు మన తండ్రి కీతం

డఖండ బలుఁ డిలఁ బరుండె నక్కట గనుమా!

నఖ ముఖ వరాయుధుం డకృ

ప ఖండితుఁ డయి మ దభాగ్య వశమున నిట్లున్    

21.    

 

 

 

కం.

పలికి బహు భాషణము లి

ట్టులు లక్ష్మణుఁ గూడి రాముఁడు పితృస్నేహం

బలరం జేసి జటాయువుఁ

బలు విధముల నూఱడించెఁ బన్నుగఁ బిదపన్ 

22.   

 

 

 

ఆ.వె.

ఎఱకలు తెగిన విహగేంద్రు నెత్తుటఁ దేలు

నట్టి వాని రాముఁ డంతఁ గౌఁగి

లించి సీత యెక్క డంచుఁ బలికి యింక

నేల పైనఁ దాను గూలఁ బడెను 

23.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నఱువది యేడవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 68.

 

 

 

సీతను రావణుఁ డపహరించి దక్షిణ దిశ వైపు గగన మార్గమున నేఁగె నని పలికి జటాయువు మరణింప దుఃఖించి రామలక్ష్మణులు పక్షీంద్రున కంత్య క్రియలు సల్పుట.

 

 

 

 

ఆ.వె.

ఆత్ర మెద సెలంగ మిత్ర సంపన్ను సౌ

మిత్రి తోడఁ బలికె మేటి పక్షి

నిట్లు రౌద్రు చేత నిలఁ గూల్పఁ బడ జటా

యువును గాంచి రఘుకులోత్తముండు

  1.  

 

 

 

ఉ.

నా కొఱ కీ విహంగ గణ నాథుఁడు యత్న మొనర్చి వీఁకఁ దాఁ

దాఁకి రణమ్మునం దసుర తాడితుఁ డయ్యెఁ ద్యజింప రాని యీ

యోకము స్వీయ జీవమునె యోర్మిఁ ద్యజింపఁగ నున్న దిత్తఱిన్

నాకు ఖగమ్ము నారయఁ గనంబడు ఖిన్నము లైన ప్రాణముల్     

  1.  

 

 

 

కం.

అరయఁ గడుంగడు హీన

స్వరమున ఖగ నాథుఁ డుండె సమరం బందుం

గర మలసి లక్ష్మణ! భయం

కరముగఁ బోరాడి తా వికలుఁ డయ్యె నిటన్    

  1.  

 

 

 

తే.గీ.

కదిసి యా జటాయువు నంతఁ బదిల మగును 

నీకు నంచు రాముం డింక నీవు పలుకఁ

గలిగి తేని చెప్పుమ నాకుఁ గాంత సీత

కథను నీ వధ వివరముగ నని పలికి    

  1.  

 

 

 

ఉ.

ఏలను సీతఁ దా నపహరించెనొ నా యపరాధ మెద్ది  తా

నే లలి రావణుం డరసి యిప్పని సేసె విహంగరాజమా!

యా లలనాంగి చంద్ర సదృ శానన మెవ్విధ మున్న దప్పు డా

కాలము లోన నే గిరలు కాంత వచించెను జెప్పు సర్వమున్   

  1.  

 

 

 

కం.

ఆ రాక్షసుని బలం బా

కారము లెట్టివి మ ఱెట్టి కర్మమ్ములు తా

మూరుచుఁ జేయు నుడువు మా

గారం బెక్కడ యడుగ ఖగ కు లాధీశా!

  1.  

 

 

 

కం.

కని విలపించెడు నా రా

మునిఁ బలికెను సన్న వచనముల నంతట రా

మునితో జటాయు విప్పగి

దినిఁ బక్షీంద్రుండు భృశము  దీనాత్ముండై     

  1.  

 

 

 

చం.

ఘనమగు మాయ రావణుఁడు గాలిని ఘోరముగా సృజించి సీ

తను గొని పోయె నంబర పథమ్మున నేఁగుచు రాక్షసేంద్రుఁడే

నను నలయంగఁ గాంచి యసి నర్కి రయమ్మున నాదు ఱెక్కలం

జనెను ధరాత్మజం గొనుచుఁ జయ్యన దక్షిణ దిక్కు నెంచుచున్      

  1.  

 

 

 

తే.గీ.

శ్వాస మాఁగు చున్నది రఘుచంద్ర! నాకు

దృష్టి భ్రమియింపఁ దొడఁగెను గృత్స్న మింకఁ

గాంచు చుంటి వేరులను వృక్షముల కగ్ర

మందు నక్కజముగ నేను గందె మేను     

  1.  

 

 

 

తే.గీ.

ఏ ముహూర్తములో నసురేంద్రుఁ డపహ

రించి సీతఁ జనెనొ యది యెంచ  వింద

నాఁ జెలఁగు దుర్ముహూర్తము నాశ మగు న

తని ధనం బెల్ల క్షిప్ర మతం డెఱుఁగడు   

  1.  

 

 

 

ఆ.వె.

గాలము గొను చేప కరణి శీఘ్రంబ న

శించు రావణుండు మించి సీత

నీ ప్రియను హరింప నిశ్చయమ్ముగ రాక్ష

సేంద్రుఁ డింక  రాఘవేంద్ర! నిజము     

  1.  

 

 

 

ఆ.వె.

రిత్త కాదు నరవ రోత్తమ! నీదు కా

ర్యమ్ము జానకి కయి యెమ్మెయి నసు

రుని వధించి సమరమున క్షిప్రము విహరిం

తు వలరి జనక సుత తోడ రామ!     

  1.  

 

 

 

తే.గీ.

పలుకు చుండ రాముని తోడఁ బక్షి రాజు

స్పష్టముగ నిట్లు మరణ మాసన్న మైన 

యతని ముఖము నుండి స్రవించె నంత రక్త

ము పలలమ్ము తోడఁ గలసి బోరన నట   

  1.  

 

 

 

తే.గీ.

విశ్రవసు పుత్రుఁ డితఁడు కుబేరున కగు

భ్రాత సాక్షాత్తు పరికింప రావణుండు

నాఁ బలికి పతగేంద్రుఁడు నగ నిభుండు 

దుర్లభ ప్రాణముల వీడెఁ దూర్ణముగను    

  1.  

 

 

 

ఆ.వె.

చెప్పు చెప్పు మంచు నప్పురుషోత్తముం

డడుగు చుండ నకట యంజలి ఘటి

యించి మేను విడిచి యేఁగెఁ బ్రాణమ్ములు

ద్విజవరేణ్యున కిల దివికి నంత     

  1.  

 

 

 

కం.

తలవాల్చి నేలపై నం

ఘ్రులు సాచి శరీర మంతఁ గూలఁగ ధరణీ

తలము పయిం ద్రుటిఁ బ్రాణ

మ్ము లుడుగఁగం గూలఁ బడెను భూరిద్విజమే      

  1.  

 

 

 

చం.

గిరి నిభుఁ దామ్ర లోచనుని గృధ్రవరేణ్యు గతాసుఁ గాంచి యీ

గిర లనె రాఘవుండు పరికించి నిజానుజు వీరు లక్ష్మణుం

బరఁగఁగ ఘోర దుఃఖ మెదఁ బక్షి వరుండు వసించెఁ బెక్కు వ

త్సరములు దండకావనినిఁ జా విటు లొందెనె రాక్ష సావనిన్     

  1.  

 

 

 

తే.గీ.

చిరము నివసించెఁ బెక్కేండ్ల శ్రేష్ఠ మైన

వయసు వాఁడు సుఖమ్ముగఁ బక్షి రాడ్వ

రుండు మరణించె నిట మానితుండు నకట

కాల మెల్లరకు దురతిక్రమము సుమ్ము  

  1.  

 

 

 

ఉ.

తా నుపకార మింపుగను దద్దయుఁ బ్రీతి నొనర్ప నాకిటన్

జానకిఁ జేరి రక్ష నిడ సంగర మందు దశాస్యు చేతిలోఁ

దానె హతుండు నయ్యె బల దర్పితు చేత విహంగ రాజమే 

మేను త్యజించె నా కొఱకు మేదిని వీడి నిజాగ్ర రాజ్యమే  

  1.  

 

 

 

ఆ.వె.

ఎల్లెడఁ గనిపింతు రిద్ధర ధర్మ చా

రు లతి బుద్ధిమంతులు శరణం బొ

సంగు వారు ననుజ! చక్కఁ  దిర్యగ్యోను

లందుఁ గూడ శూరు లెందు నైన

  1.  

 

 

 

కం.

సీతా హరణం బైనను 

భ్రాతా యీ విధము కాదు పక్షీంద్రుండే

యీ తఱి నాకై లక్ష్మణ!

వీతప్రాణుఁ డయి నట్టి విధి దుఃఖమునన్        

  1.  

 

 

 

తే.గీ.

దశరథుఁడు నృపతి యశస్వి తండ్రి నాకు

నే విధము పూజనీయుఁడు నింక మాన్యుఁ

డా విధము పరికింపంగ నండ జేశ్వ

రుండు నాకు నితఁడు  నిత్య ముండుఁ జుమ్ము   

  1.  

 

 

 

కం.

కఱ్ఱలను దెమ్ము లక్ష్మణ!

తుఱ్ఱున నగ్నిని మథింతుఁ దోరమ్ముగ నే

నెఱ్ఱని మంట దహింతును

మిఱ్ఱందు జటాయువు నిడి  మేటి ఖగేంద్రున్  

  1.  

 

 

 

ఆ.వె.

చితినిఁ బేర్చి యిపుడు పతగ లోకేశ్వరు

వీని సంస్కరింతు వీరు రౌద్ర

రాక్ష సేంద్రు చేత రణమునఁ గూలిన

వాని లక్ష్మణ! యిఁక మానితముగ    

  1.  

 

 

 

ఉ.

యాగము చేయు వారు తగ నగ్ని వహించెడు వారు నాజి లో

నేఁగని వారు వెన్కకు మహీతల దాతలు గృధ్రరాజమా!

యే గతి కేఁగ నర్హులరొ యీవును దద్గతి కేఁగు మొప్పితిన్ 

వేగమ సంస్కరింపఁ జను వీరుఁడ! యుత్తమ లోక కోటికిన్    

  1.  

 

 

 

ఆ.వె.

పలికి యిట్లు చితినిఁ బన్నుగఁ బేర్చి 

హించె నా ఖగేంద్రు నిన కులేంద్రుఁ

డంత స్వీయ బంధు వట్ల ధర్మాత్ముఁడు

తొడఁగి రాముఁ డతుల దుఃఖితుండు    

  1.  

 

 

 

తే.గీ.

రాముఁ డేఁగి ససౌమిత్రి రమ్య వనికి

వీరుఁడు వధించి జింకను పెద్ద మేని

దానిఁ బతగేశ్వరున కర్పితమ్ము సేసెఁ

బలల పిండముల నట శాద్వలము నందు

  1.  

 

 

 

ఆ.వె.

సమసి నట్టి మర్త్య చయమున కెట్టి మం

త్రములు చదువుదురొ ధరాసురులు పి

తరుల కొఱకు దివికిఁ దరల నట్టివి జపి

యించె రాముఁ డెల్ల నంచితముగ  

  1.  

 

 

 

కం.

చని గోదావరి కిద్దఱు

ఘనులు నృపాత్మజు లిడి రుదకము లా విహగేం

ద్రున కప్పుడు శాస్త్రోక్తము

గను స్నానము నాచరించి కాకుత్స్థవరుల్     

  1.  

 

 

 

తే.గీ.

దుష్క రమగు పనినిఁ జేసి బుష్కలముగ 

రణమునను గృధ్రము యశస్కరమును బతితుఁ

డయి మహర్షి పుంగవుల న్యాయమున సంస్క

రింపఁ బడి పుణ్య గతులకు నింపుగఁ జనె  

  1.  

 

 

 

కం.

జల మర్పించి ఘనులు రా

మ లక్ష్మణులు ఖగ వరునకు మానుగ నంతం  

దలఁపు దృఢముగ నిడి చనిరి 

లలన వెతక శ్రీధర ఖదిర నిభులు వనికిన్

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నఱువది యెనిమిదవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 69.

 

 

 

జటాయువునకు నుదక ప్రదానము సేసి సీతను వెతకుచుఁ బశ్చిమ దిశ కేఁగి దక్షిణ దిక్కున కేఁగుట, మార్గము  నందు నయోముఖి యను రక్కసిని లక్ష్మణుఁడు శిక్షించుట, కబంధుఁడు రామ లక్ష్మణులను బాహువుల బంధించుట. 

 

 

 

 

కం.

ఉదకం బర్పించి యటులఁ

గదలిరి వెతకుచు నవనిజఁ గాకుత్స్థు లెడం

ద దరికొన వగపు పశ్చిమ

పు దెసకు నవ్వనము నందుఁ బురుషోత్తములే    

1.      

 

 

 

తే.గీ.

అంత ఖడ్గమ్ము నింక విల్లమ్ములను ధ

రించి నట్టి యైక్ష్వాకు వరేణ్యు లిర్వు

రు వడి దక్షిణ దిక్కునకు వెడలి యతి

దుర్గమమ్మును జేరిరి మార్గము వని                           

2.     

 

 

 

చం.

పొదల లతా కుజప్రవర పూరితమౌ  గహనమ్ము ఘోర మె

ల్ల దిశల నావృతంబు నయి రంజిలు చుండ భయంకరమ్ముగాఁ

గదిసి యతిక్రమించిరి మృగవ్రజ సింహ భుజంగ సేవితం

బది సుమహా వనమ్ము వసుధాధిప నందను లిర్వు రంతటన్

3.     

 

 

 

మ.

తమి నుత్సాహులు రాఘవేంద్రులు  జనస్థానమ్మునన్  మూడు క్రో

శములం దాఁటి సుదుర్గమంపు వనిఁ గ్రౌంచం బంచు విఖ్యాతినిన్ 

సుమహా మేఘ యుతంబు వ్యాల మృగ పక్షుల్ నిత్య సంచారముల్ 

ప్రమదం బిచ్చుచు నుండఁ జేరిరి వెసన్ రాముండు సౌమిత్రియున్   

4.     

 

 

 

ఉ.

ఆగుచు నచ్చ టచ్చట మహాటవిలోఁ బరికించుచుం దమిన్

వేగమ సీతఁ గాంచ నెద వేఁగుచుఁ బూర్వపు దిక్కు  క్రోశముల్ 

వే గతియించి మూడు తగ వీక్షణ మింపుగఁ జేసి రంతటం 

జాగి మతంగ మౌని వరు చారుత రాశ్రమ కాననమ్మునున్

5.     

 

 

 

ఉ.

క్రౌంచ మతిక్రమించి ముని కాంతుని శాలకు నంతరమ్మునన్ 

మించిన కాన నారసి యమేయ భయంకర జంతు జాలమున్ 

సంచిత పాదపమ్ములను జక్కగఁ గాంచిరి రాఘవోత్తముల్

మించిన యంధకారమున మేటి గుహోన్నతమున్ గభీరమున్     

6.     

 

 

 

తే.గీ.

చేరి గుహకు సమీపము వారు గాంచి

రచట వికృతాననను రాక్ష సాంగనను సు

భీమ రూపను నిర్బల భీతి దాత్రి

లంబ కుక్షినిఁ దీక్ష్ణ దంష్ట్రను గరాలి    

7.     

 

 

 

తే.గీ.

రౌద్ర దర్శన భీభత్స భ్రాత లరసి 

రామె రామ లక్ష్మణులు  మృగాలి దినుచు

నున్న ముక్త మూర్ధజ విక టోగ్ర చర్మ

నచట రక్కసియును వీరి నరసి కదిసె    

8.     

 

 

 

కం.

చనుచున్న రాఘవుల నా

వనితా రాక్షసి కదిసి యవరజుని సౌమి

త్రిని నగ్రజు ముందుండఁగఁ

గని క్రీడింపంగ రమ్ము కాంతుఁడ యనుచున్   

9.     

 

 

 

చం.

పలికెను బట్టి లక్ష్మణుని భామ నయోముఖి నేను నీకు ని

ట్టుల నిచటన్  లభించితిఁ గడుం గడు ప్రీతిని నీ నదీ తల

మ్ముల ధరణీధ రావలుల మూరి చరింతము శేష జీవిత

మ్ము లలిత రీతి నిర్వురము ముచ్చట నాథ! వరింపు మింపుగన్    

10.    

 

 

 

తే.గీ.

నాఁ బలుకఁ గుపితుండునై నరవరేణ్యుఁ

డంతఁ దీసి నిశిత ఖడ్గ మింతి ముక్కు

చెవు లురోజములను గోసె శీఘ్ర గతిని

లక్ష్మణుండు ధీరుఁడు  శుభ లక్షణుండు    

11.    

 

 

 

కం.

తెగఁ గర్ణ నాసికలు నా

మగువ యఱచి  భీమముగను మఱి వచ్చిన య

ట్టి గతినిఁ బాఱెను వికటపు 

మొగపు టయోముఖి కలంగి బోరన నంతన్

12.    

 

 

 

కం.

వెడలఁగ రక్కసి యవ్విధిఁ

గడు తేజస్వులు రఘు కుల కాంతులు చని రా

యడవిని రిపుఘ్నులౌ రా

ముఁడు లక్ష్మణుఁడును రయమున భూమిజ కొఱకై

13.    

 

 

 

కం.

సుమహా తేజుఁడు బల్లిదుఁ

డమల చరిత్రుండు శుచియు నంతఁ బలికె హ

స్తములు మొగిడ్చి నిజాగ్రజు

ని మహా తేజస్వి నరసి నీరజ నేత్రున్       

14.    

 

 

 

ఆ.వె.

అదురు చున్నది భుజ మతి దృఢముగ నాకుఁ 

గలఁత నందె మనము కరము దుశ్శ

కునము లప్రియములు గోచరించుచు నున్న

విపుడు శంక నాకు నెడఁదఁ గలిగె

15.    

 

 

 

తే.గీ.

కాన నారి సంధించు మింక ధృతి నార్య!

యాలకింపఁ దగు హిత వాక్యములు నావి

యీ నిమిత్తములు పలుకు నిచట సంభ్ర

మమ్ము లొదవఁ గల వనుచు మనకు నిపుడు  

16.    

 

 

 

కం.

వంచులక మను  విహంగము 

పొంచి యచట దారుణమ్ము పోరున మనకున్

మించు జయ మని వచింపఁగ 

నంచితముగ నఱచు చుండె నదురఁగ దిశలే     

17.    

 

 

 

తే.గీ.

సురుచిరముగ  నన్వేషించుచుఁ జనుచుండ

నోజమున రామలక్ష్మణు లుగ్ర వనము

నందు నుద్భవం బయ్యె మహాస్వనమ్ము

వనిని సర్వమ్ము భంజించు భంగి నంత   

18.    

 

 

 

కం.

గగనంబు గాలిచే భృశ

ముగఁ గప్పఁ బడిన విధమ్ము పుట్టి వనము నం

దు గగన భాగము భీకర

ముగ నా శబ్దమ్ము పూర్ణము సెలఁగి నిండెన్

19.    

 

 

 

చం.

ఎఱుఁగఁ దలంచి శబ్దము నరేంద్ర సుతుండు సలక్ష్మణుండు దాఁ

బఱచి ని జేక్షణమ్ములను బ్రక్కన భీమ శరీరు రక్కసుం

దఱ చగు కుక్షి వానిఁ గనెఁ దద్ద వివృద్ధు శిరో గళక్షయున్  

వెఱవఁగఁ బొట్టలోముఖము వెల్గు కబంధుని ముందు నిల్వఁగన్

20.   

 

 

 

ఉ.

రోమము లుండ తీక్ష్ణములు రుద్ర త రాంబుద సన్నిభస్వనున్

భీమ పయోధ రాభ తనుఁ బింగ సుపక్ష్మ లలాట సంస్థి తై 

కామిత వక్ష లోచను మహా జ్వల నాక్షుని ఘోర దంష్ట్రునిన్  

వేమరు నాక వా తెఱల వింతగ నున్న మహాస్యు రక్కసున్

21.    

 

 

 

ఉ.

ఘోర మృగర్క్ష సింహ మద కుంజర భక్షణ కార్య మగ్ను వి

స్ఫారిత యోజ నాయత విశాల సమంచిత ఘోర దోర్యుగున్

మూరి గ్రహించి వే విసరి భూరి మృగావలి యూధపమ్ములం 

దారెడు వానిఁ గాంచి రట  దారికి నడ్డము నిల్వ వానినిన్

22.   

 

 

 

తే.గీ.

అడరి యొక్క క్రోశపు దూర మరిగి మొండె

ము వలె నున్న కబంధుని భుజము లుండఁ

జాచి దారుణ కాయునిఁ జాల భయద 

రూప మున్న వానిఁ గని రిరువురు నచట

23.   

 

 

 

తే.గీ.

అతఁడు నిజ దీర్ఘ బాహువు లత్యధికము

సాచి యుభయుల రామలక్ష్మణుల ఘన క

రములఁ బీడించి భృశముగ రక్కసుండు

పట్టె నంత భీకరముగ నిట్టె నపుడు    

24.   

 

 

 

తే.గీ.

ఖడ్గ ధారులు దృఢతర కార్ముక ధరు

లన్నదమ్ములు తిగ్మ ప్రభా కలిత శ

రీర ధారు లాకర్షింపఁ దోర మసుర

వశు లయిరి వింతగా మహా బలు లిరువురు    

25.   

 

 

 

తే.గీ.

రాముఁడు చలింప లేదు ధైర్యమ్ము వలన 

శూర పుంగవుఁ డైనట్టి కారణమున  

బాలుఁ డయిన కతనఁ దాను వ్యధితుఁ డయ్యె

లక్ష్మణుఁ డనాశ్రయమునఁ గరము నెడంద

26.   

 

 

 

కం.

పలికె విషణ్ణుండై కడు

పలుకుల నిట్లన్నతోడ వశఁడను గనుమా 

బల దర్పుం డసురునకు వ

దలి నను ముక్తుండ వగుమ తగు నిది నీకున్

27.   

 

 

 

ఆ.వె.

నన్ను భూత బలిగ నిన్నరాశనున కొ

సంగి పర్విడుమ భృశంపు సుఖము

తోడఁ గాంచఁ గలవు తూర్ణము వైదేహి  

నడరి  నిశ్చయ మిది యని  తలంతు

28.   

 

 

 

కం.

పితృ పైతామహ భూమినిఁ 

బ్రతిగ్రహించి రఘువీర రాజ్యస్థుఁడవై

మతి నన్ను నిత్య మగ్రజ!

రతి స్మరియింపఁ దగుదు వట రాజ వరేణ్యా!   

29.   

 

 

 

కం.

విని లక్ష్మణు వచనమ్ములు

వనట తగదు నిన్ను బోలు వారికి వీరా!

మనమున వీడు భయం బని

ఘనుండు రాముఁడు వచించెఁ గర మనురక్తిన్    

30.   

 

 

 

ఉ.

అంతట నా కబంధుఁడు మహాసురుఁ డారసి యన్నదమ్ములం

బంతము నూని వేసె రుషఁ బ్రశ్నము లిట్లశని స్వనమ్మునన్ 

వింతగ మీర లెవ్వ రిట విండ్లను ఖడ్గములన్ గ్రహించి వ

న్యంతర మందుఁ దిర్గుదురు న్యాదము నా కన దీర్ఘ బాహులై          

31.    

 

 

 

తే.గీ.

కార్య మెయ్యది యిర్వురు కాన కేల

వచ్చిరి వచింపుఁ డెల్ల నే నిచ్చట నిలు

వంగ నాఁకలి మూఱఁగ వనము నందుఁ 

జేరితిరి నా కొఱ కిటకుఁ జిత్రముగను      

32.   

 

 

 

కం.

అసి బాణ చాప ధరులై 

వెసఁ దీక్ష్ణత రైక శృంగ వృషభంబు లనం

బస మీఱ నేఁగుఁదెంచిరి

స్వ సముఖమున కింక బ్రతుకఁ జాలరు మీరల్    

33.   

 

 

 

చం.

అన నిటులం గబంధుఁడు గిరావలి రాఘవుఁ డాలకించి తా

ననెఁ దిలకించి లక్ష్మణుని నాస్యము శుష్కము కాఁగ నివ్విధిన్

ఘనముగ నొక్కదాని పయిఁ గష్టము లొక్కటి చుట్టు ముట్ట నం 

గను మిట సత్యవిక్రమునిఁ గాంతను గానక యంత మందఁగన్      

34.   

 

 

 

ఆ.వె.

కాల బలము జీవ కాయములకు మిన్న

యే యగు సతతమ్ము నెంచి చూడ

నన్ను నింక నిన్ను నరవృషభ! కనుమ

మోహితులమె వ్యసనముల భృశమ్ము   

35.   

 

 

 

తే.గీ.

కా వఖిల భూత రాసులు కాలమునకు

భారము గణింప లక్ష్మణ! బల్లిదులు ర

ణాస్త్ర విజ్ఞులు విక్రము లయిన వశులె

యిసుక వంతెన వలె నశియింత్రు చిక్కి

36.   

 

 

 

కం.

పలికి దృఢ సత్య విక్రమ

విలసితుఁ డివ్విధి యశస్వి వీక్షించి యుద

గ్ర లసత్పౌరుషు లక్ష్మణుఁ 

దలఁచెఁ జరింప స్థిర మతినిఁ దత్సమయమునన్

37.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నఱువది తొమ్మిదవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 70.

 

                                  

 

కబంధుఁడు రామలక్ష్మణుల భక్షింప నుద్యుక్తుఁడు గాఁగ వా రతని బాహువులను రెండింటిని నిరువురు ఖండించి యాతఁ డడుగఁ దమ్ము నెఱింగింపఁ గబంధుఁ డానందమునఁ దన కథ తెలుపఁ దొడఁగుట.   

 

 

 

 

కం.

నిజ బాహు పాశ బద్ధ స

హజన్ముల రఘుకుల వరుల నారసి యంతం

గుజనుఁడు కబంధుఁడు వలికె

ను జయ్యన వచనము లిట్లు నుత వీరులతో  

1.      

 

 

 

ఆ.వె.

నిలఁబడంగ నేల కలుగ క్షుధార్తున 

కిరువు రరసి నన్ను నీయ దైవ

ము గత చేతసుల మిము నశ నార్థము రాజ

వృషభు లార! యని కలుషుఁ డనంగ

2.     

 

 

 

చం.

వచనము లాలకింపఁగఁ గబంధుఁడు పల్కఁగ రేఁగి కోపమే

ప్రచురము కాఁగ నార్త మదిఁ బన్నుగ విక్రమ మూని యంతఁ దా

నుచితము లప్డు  కాలమున కొప్పఁగ వాక్యము లిట్టు లన్నతో

నచలితుఁడై వచించెను మహాత్ముఁడు లక్ష్మణుఁ డుగ్ర వీరుఁడే    

3.     

 

 

 

ఆ.వె.

నిన్ను నన్ను దినక మున్న యీ రాక్షసా

ధముఁడు విక్రమించి తద్ద యితని

యున్నతంపు బాహు యుగము ఖండింతము

ఖడ్గ యుగము చేతఁ గర్కశముగ  

4.     

 

 

 

తే.గీ.

భీషణుఁ డితండు ఘన బాహు విక్రముండు

రక్కసుఁడు మహా కాయుండు రామ! లోక

ముల జయించి పరాక్రమమున మనల భు

జింపఁ జింతించు చుండెను దెంపు మీఱ   

5.     

 

 

 

కం.

నృపతికి నిశ్చేష్టులను ద

లఁపఁ జంపఁ దగదు జగతిని రఘుకుల వర్యా!

విపరీతము  చంపుట కా

దె పశువుఁ గ్రతు మధ్యఁ దేర నెంచఁగ నీతిన్

6.     

 

 

 

తే.గీ.

ఉదరి వారు సంభాషించు చుండ నిట్టు 

లాలకించి కృద్ధుండునై యంత రక్క

సుండు రౌద్రుండు వక్త్రమ్ము మెండుగాను

దెఱచి మ్రింగఁ దొడంగెను వెఱపు లేక   

7.     

 

 

 

ఉ.

అంతఁ ద్రుటిం జెలంగి మనుజాధిపు సూనులు విక్రమమ్మునన్

వింతగ వాని బాహువులు వీరవ రేణ్యులు వేగ మంస దే

శాంతర మందు నుండి లస దంచిత  ఖడ్గ యుగమ్ముతో నటన్

సాంతము చీల్చి రిద్దఱు మహా బల యుక్తులు సత్య విక్రముల్

8.     

 

 

 

ఆ.వె.

దక్షిణ దిశ నున్న దక్షుఁడు రాముడు

దక్షిణ భుజ మంతఁ దఱుగ వేగ

ముగను లక్ష్మణుండు మూరి సవ్యంపు భు

జమ్ము నఱికె నసి బలమ్మడరఁగ

9.     

 

 

 

ఆ.వె.

అమ్మహా భుజుఁడు మహాసురుండు పుడమిఁ

గూలె ఛిన్న భుజ యుగుఁ డయి ఘోర

నిస్వన మొనరించి నింపి భూ నభములు 

నాదములఁ జెలఁగు ఘనమ్ము భంగి    

10.    

 

 

 

కం.

తెగిన తన చేతుల నరసి 

మిగులఁ దడిసి రుధిరమున నమిత దీనుండై

తగ నా వీరులఁ గాంచి య

డిగె నెవ్వరు మీర లంచు డిందుచు నంతన్

11.    

 

 

 

తే.గీ.

అడుగ నిట్లు లక్ష్మణుఁ డంతఁ దొడఁగెఁ జెప్ప

నా శుభతర లక్షణుఁడు మహాత్మునకుఁ గ

బంధునకు నితం డిక్ష్వాకు వంశ నంద

నుండు రాముఁ డనఁగఁ బ్రసిద్ధుండు జగతి      

12.    

 

 

 

తే.గీ.

నన్నతని భ్రాత లక్ష్మణ నామునిగ నె

ఱుంగు మీ సుర సదృశు ననుంగు పత్ని

నటవి వసియింప రక్కసుఁ డపహరింప

వచ్చితి మిటకు వెతకుచుఁ బడతి వెతను

13.    

 

 

 

ఉ.

అవ్వర రాఘవుం డసురు నారసి తమ్ము నెఱుంగఁ జేసి నీ

వెవ్వఁడ వీ యరణ్యమున నేల చరింతు కబంధమో యనన్

నివ్వెఱ గొల్ప నుంటి విట నీ వగు పిక్కలు కాఁగ భగ్నముల్

నివ్వటిలంగ వక్షమున నీ జ్వలి తాస్యము వింత గొల్పుచున్

14.    

 

 

 

ఆ.వె.

అడుగ నిట్లు లక్ష్మణుఁడు కబంధుఁడు ప్రీతి

నింద్రుని వచనముల నెంచి మదిని

నుత్తరం బొసంగె నత్తఱి నిబ్భంగి 

సంతసించి మానసమ్ము నందు   

15.    

 

 

 

తే.గీ.

స్వాగతమ్ము మీ కిట నరవ్యాఘ్రు లార!

భాగ్యవశమునఁ గంటిని పరమ పురుషు

లార మే లయ్యె భుజములు మీరు నఱక                                         

నా యదృష్ట మనంగ నమేయ బలులు!   

16.    

 

 

 

కం.

వినుము నరవ్యాఘ్ర! నుడువఁ

గ నేను నిజ మున్న దెల్లఁ గాకుత్స్థా! రూ

పును వికృత మె ట్లవినయ

మ్మునఁ  బొందితి నవ్విధమ్ము పూర్ణం బింకన్

17.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు డెబ్బదవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 71.

 

 

 

కబంధుఁడు తన శాప వృత్తాంతమును రామ లక్ష్మణులకుఁ జెప్పి తనను దహించినఁ బూర్వ రూపముతో దివి కేఁగుదు నని సీత నపహిరించిన రక్కసును నెఱిఁగిన మిత్రునిఁ దెలుపఁ గల నని వచించుట.  

 

 

 

 

ఉ.

రామ నృపా! మహా బల పరాక్రమ! వీరవరా! మహాభుజా! 

నే మును ముజ్జగమ్ములను నిల్చితి రూపము నందు మిన్నగా

సోముని శక్ర సూర్యులను సుందరతం గడు మించి యింపుగన్  

నా మెయి వెల్గఁ గాంతుల ఘనమ్ముగఁ బద్మ దళాభ లోచనా!

  1.  

 

 

 

ఆ.వె.

ఇట్టి రూప మందు నెలమిఁ జెలంగుచు

భయ మొసంగు చుండి వనము నందుఁ 

బరమ మునుల నెల్ల బాధించు చుంటిని

వనగతులను రామ! ఘనముగాను    

  1.  

 

 

 

తే.గీ.

అంత నా చేత ధర్షితుఁ డయ్యె నొక్క

మునియె స్థూలశిరస్సను ఘనుఁడు వన్య

ములు వివిధముల నేఱుచుఁ గలయఁ దిరుగు

చుండ రూప దర్పితునిచే మెండుగాను    

  1.  

 

 

 

ఆ.వె.

ఘోర శాప దాత కోపంబు నూని యా

మునివరుండు రూపమును నృశంస

ము నతి గర్హితమ్ము పొందు దీ వనుచు శ

పించె నన్ను దర్పుఁ గాంచి యంత   

  1.  

 

 

 

చం.

విరివిగ శాప తప్తుఁడను వేఁడగ శాప విమోచనమ్మునుం 

గరుణను బల్కె నివ్వచన కాయము పేర్మిని నివ్విధమ్ముగన్

వర రఘువంశ సంభవుఁడు పన్నుగ రాముఁడు కాల్పఁ జీల్చి నీ

యురు భుజ యుగ్మ మీ యటవి నొప్పుగఁ బొందుదు నీదు రూపమున్         

  1.  

 

 

 

తే.గీ.

సిరి వెలుంగు పుత్రుఁడ నేను నరవరుండ!

లక్ష్మణుండ! దనువునకు రణము నందు

నింద్రు వలనన యీ రూప మిట్లు పొంది

తి నతి ఘోరమ్ము నంచును దెలియు మయ్య!      

  1.  

 

 

 

తే.గీ.

తపము నొనరించి మెప్పింప ధాత నా పి

తామహుఁ డిడె  దీర్ఘాయువు తనరు నట్లు

నాకు వరము నా మోహమునను నగారి

యేమి దీర్ఘాయువునిఁ జేయు నింక నంచు   

  1.  

 

 

 

ఆ.వె.

ఎంచి రణము సేయ నింద్రునితో నింద్ర

బాహు ముక్త వజ్ర పాతమున శ

రీర మందుఁ జొచ్చె నూరువు లింక మూ

ర్ధమ్ము నొక్క  ద్రుటిని వమ్మువోవ

  1.  

 

 

 

కం.

నను యాచింపఁగఁ గాలు స

దనమున కంపఁడు బలారి దయతోఁ బలికెన్

ఘనుఁ డింద్రుఁ డపుడు బ్రహ్మ వ

చనము లసత్యములు గావు సత్యము లంచున్     

  1.  

 

 

 

కం.

వీత ముఖ శిరస్సక్థులఁ

బాతితమై వజ్రమునను బ్రతుకఁగ నగునే

యాతత కాలం బేరికి 

వీతాహారం బనంగఁ బ్రీతిని నంతన్     

  1.  

 

 

 

ఆ.వె.

పలుక నిట్లు నేను బర్జన్యుఁ డొసఁగెను 

యోజ నాయత భుజ యుగ్మ మింక

దంష్ట్రలను ముఖమ్ము దయతోడ నాకు ను

దర తలమ్ము నందుఁ దనరు నట్లు     

  1.  

 

 

 

చం.

వనమున దీర్ఘ బాహువులఁ బన్నుగఁ బట్టి మృగద్విపాదులన్

వన మృగ రాశినిం దివిరి భక్షణ మింపుగఁ జేయుచుండ నీ  

వనవరతమ్ము నెన్నఁడు నరాఢ్యుఁడు రాముఁడు కూడి లక్ష్మణుం 

గని నిను నర్కుఁ జేతులను గాంతువు స్వర్గము నప్పు డీ వనెన్

  1.  

 

 

 

ఉ.

ఇత్తను వూని యింద్రు దయ నివ్వన మందు గ్రహించు చుండి రా

ట్సత్తమ! చూచి నట్టి మృగ సంతతి నెల్ల వసించు చుండ నే

నుత్తమ మంచు నెంచి పురుషోత్తము రాముని గాంచ నోపనే

యెత్తఱి నైన నంచు వసియించుచు నుంటిని రామ! యెట్టులో 

  1.  

 

 

 

తే.గీ.

నీవ యా రాముఁడ వగుదు  నీకు భద్ర

మగును గాక వచించె నిట్లమ్మహర్షి

నిజము నెల్ల నన్యుఁడు మఱి నీవు గాక

నన్ను వధియింప శక్తుఁడె నరవరేణ్య!

  1.  

 

 

 

తే.గీ.

సంస్కరింప నగ్నిని మీరు చక్కఁగ నను

జేయఁ గలను సాచివ్య మమేయముగను

మంచి మిత్రుని వచియింతు మాన వేంద్రు

లార మీకు శుభము లెల్ల మూర నింక

  1.  

 

 

 

ఆ.వె.

పలుక నా దనుండు పన్నుగ నిట్లు ల

క్ష్మణుఁడు వినుచు నుండ మనుజ వరుఁడు

రాముఁ డంతఁ బలికె రాఘవుం డా ధర్మ

చిత్తుఁ డిట్లు గిరలు చింత తోడ  

  1.  

 

 

 

ఉ.

కానన మందు మేము చనఁగం గడు దూరము నంతటన్ జన

స్థానము నుండి నాదు సతి జానకి రావణుఁ డాహరించె న

వ్వానిది పే రెఱుంగుదును వాసము రక్కసు రూప మా బలం

బేనియు మేము నేర మిఁక నెద్దియు నిత్తఱి దానవోత్తమా!   

  1.  

 

 

 

తే.గీ.

శోక తప్తులకును దిర్గుచు నిటు లున్న

వారికి ననాథలకు నుపకారము నొన

రింప మీవంటి వారికి నిం పగును ద

లంపఁ గరుణ వహించి యరణ్య మందు   

  1.  

 

 

 

ఆ.వె.

తగిన కాల మందు దంతుల భగ్నమ్ము

లయిన యెండు కఱ్ఱ లడరి తెచ్చి 

గుంటఁ ద్రవ్వి నిన్ను మంట లందు దహింతు

మిపుడు మే మిరువుర మిచట తివిరి

  1.  

 

 

 

కం.

తెలిసిన వచింపుమ యెవరు

లలనా మణి సీత నెటకు రయమున నే లీ

లలఁ గొని పోయిరొ దయ మా

కిల మే లొనరింపు మయ్య యింపుగ నింకన్

  1.  

 

 

 

చం.

పలుకఁగ రాముఁ డివ్విధము వాక్య విశారదుఁ డంత నద్దనుం

డు లలిత వాక్య వక్త యనె డుల్లెను దివ్యపు నాదు జ్ఞానమే

యిలఁ దగులంగ శాపము మహీసుత నేరను సంస్కరింపఁగాఁ 

దెలిసిన వానిఁ జెప్పెదను దివ్యపు రూపము నూని యంతటన్    

  1.  

 

 

 

తే.గీ.

దగ్ధుఁడను గాక యున్నచోఁ దరుణి సీత

నపహరించిన రక్కసు నమ్మహా బ

లుని నెఱుంగ నశక్తుఁడను నరవృషభ!

స్వీయ దోషమునఁ గలిగె వికృత తనువు     

  1.  

 

 

 

ఆ.వె.

అలసి నట్టి తనదు హయముల సూర్యుఁడు

పశ్చి మాద్రి నిపుడు వడయు తఱికి 

మున్న త్రవ్వి గుంటఁ గ్రన్నన రామ! ద

హింపు ముచిత రీతి నింక నన్ను

  1.  

 

 

 

కం.

నయముగ గొయ్యిని దగ్ధుఁడ

నయిన రఘుకుమార! వీర! యయ్యసురు గుఱిం

చి యెఱిఁగిన వానిఁ దెల్పెద

రయమున నిశ్శంక నెలమి రామను బడయన్

  1.  

 

 

 

కం.

చెలిమి యతనితోఁ జేయఁగ

వలయు నుచిత రీతి నంతఁ బన్నుగ సాయం

బిలఁ జేయు నతండు ఘనత

ర లఘు పరాక్రముఁడు ప్రీతి రాఘవ! నీకున్    

  1.  

 

 

 

కం.

అతనికి లేదు తెలియనిది

వెతకిన ముజ్జగము లందు వీసం బైనం

గత మన్యంబున నాతం

డు తిరిగె లోకములు నిజ పటుత్వం బడరన్

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు డెబ్బది యొకటవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 72.

 

 

 

కంబంధుని దహింపఁగ నాతఁ డాకాశమునఁ దిరిగి కనిపించి సుగ్రీవునితో స్నేహము సేసికొని యాతని సాయముతో సీతాన్వేషణము చేయుఁ డని పల్కుట. సుగ్రీవుఁడు కూడ సహాయము నర్ధించు చున్న వాఁడని తెలుపుట.    

 

 

 

 

చం.

పలుకఁగ నా కబంధుఁడు సు వాక్యము లివ్విధి నాలకించి వీ

రు లడరి యంత నా నర వరుల్ వడిఁ జేరిరి రామలక్ష్మణుల్

లలిత గిరీంద్ర కందరము లక్ష్మణుఁ డగ్ని వెలుంగ జేసెఁ గ

ట్టెలఁ జితి పేర్చి యింపుగఁ  గడింది ప్రకాశము చెల్గ నెల్లెడల్

1.      

 

 

 

ఆ.వె.

నేతి ముద్ద పగిదిఁ బ్రీతిఁ బావకుఁడు క

బంధు గాత్ర మపుడు పలల మెల్లఁ

గాఁగు చుండ భృశము కాల్చెను మెల్లగ

నయ్యరణ్య మందు నడరి యంత      

2.     

 

 

 

కం.

అతి బలుఁ డంతఁ గబంధుఁడు

చితిని విదుల్చి విమలములు శ్రేష్ఠ వసనముల్

రతి నూని దివ్య మాలను 

జితి నుండి విధూమ వహ్ని చెన్నున లేచెన్  

3.     

 

 

 

ఆ.వె.

భాస్వ రాంబరములు ప్రత్యంగ భూషల

తోడ సంతసమ్ము తోడ వేగ

యాతఁడు చితి నుండి యంబర తలమున

కెగిరెఁ జూచు చుండ నిర్వు రచట   

4.     

 

 

 

ఉ.

అంబర మందు నిల్చి కలహంసలు లాగు విమాన మందు నా

డంబర మొప్ప  వెల్గులఁ దటమ్ముల  కెల్ల నొసంగి యంతఁ దా

సంబర మంది పల్కెను యశస్విని రాముని గాంచి రాఘవా! 

యంబ ధరా సుతం గనెడు నట్టి విధమ్ము వచింతు నేరుమా   

5.     

 

 

 

తే.గీ.

ఆఱు యుక్తుల లోకము నందు నెవ్వ

రేని చింతింత్రు రాఘవ! యింపుగాను

శుద్ధి కాఁగ దశ చివరఁ జోద్యముగ న

దృష్ట హీనుఁడె రక్షించు స్థిరము గాను

6.     

 

 

 

ఆ.వె.

హీన దశయె నడచు నిపుడు నీకు ననుజుఁ 

గూడి యా కతమున నేఁడు నీకుఁ 

గలిగె నివ్విధముగఁ గాంత ప్రధర్షణ

మటవి లోన రామ! యడల నెడఁద  

7.     

 

 

 

కం.

చెలికాండ్ర నుత్తముఁడ! నీ

వలరి నొకని తోడఁ జెలిమి నడరుచు నింకన్

వలయు నొనర్పఁగ లేని యె

డల నీ కార్య ఫలమును బడయ వని తలఁతున్

8.     

 

 

 

తే.గీ.

వినుమ రాఘవ!  సుగ్రీవుఁ డనెడు వాన

రుండు భ్రాతచేత బహిష్కృతుండు వాలి

చేతఁ బురుహూత నందను చేతఁ గ్రుద్ధు

వలన రాజ్యము నుండి నేఁ బల్కు చుండ

9.     

 

 

 

చం.

గిరివర ఋశ్యమూకమునఁ గ్రేవను బంపకు  నిర్మలాంబు సుం

దరతర మైన పద్మినికిఁ దన్ను భజింపఁగ  భక్తి తోడ న

ల్వు రట నమాత్య వానరులు భూరి బలాఢ్యులు వాస ముండు నా

దరముగ నా కపీశ్వరుఁడు తద్దయు నాత్మ విదుండు వీరుఁడున్

10.    

 

 

 

తే.గీ.

వానరేంద్రుఁడు తేజస్వి పరమ వీరుఁ

డమిత బలుఁడు వినీతుఁడు విమల సత్య

సంధుఁడు ధృతిమంతుఁ డతి  దక్ష వచనుండు

నన్నచే వివాసితుఁడు రాజ్యమ్ము కొఱకు

11.    

 

 

 

తే.గీ.

అతఁడు నీ కొసఁగుఁ దగు సాహాయ్యమును వె

తకఁగ సీతను  మిత్రుఁడు తగదు వగవ

నిట్టి పని యశక్యం బగు నితర గతినిఁ

గాలము నతిక్రమింప శక్యమ్ము కాదు   

12.    

 

 

 

ఆ.వె.

అరుగు మింక వడి మహాబలు సుగ్రీవుఁ

జేరి నగ్ని యెదుట  స్నేహితునిగ

ద్రోహ చింత లేక తూర్ణము చేకొను

మింక భద్ర మగును శంక లేక

13.    

 

 

 

ఆ.వె.

కపి విభుం డతండు ఘనుఁడు సుగ్రీవుఁ డ

గౌరవముగఁ గనఁ దగదు కృతజ్ఞుఁ

డతఁడు కామరూపి యర్ధించు నీదు సా

యం బవశ్య మట మహా బలుండు   

14.    

 

 

 

ఆ.వె.

వాని వాంఛితంపుఁ బనిని సమర్థులు

మీరు సేయ భృశము మించి చేయ

గను గృతార్థుఁ డైనఁ గాకున్న నతఁడు మీ

కార్యము నొన రించుఁ గరము ప్రీతి    

15.    

 

 

 

తే.గీ.

తిరుగుఁ బంపా నదీ వర తీరములను

బుత్రుఁ డా ఋక్షరజునకు మిత్రు నౌర

స తనయుండు సుగ్రీవుఁడు శత్రు వయ్యె

వాలి కగ్రజునకు మీఱ భయము సతము   

16.    

 

 

 

కం.

రయమునను ఋష్యమూక ని

లయు వనచారినిఁ గపీంద్రు రామ! సఖునిగాఁ

బ్రియమునఁ గొనుమా నీవు ధ

రియించి యాయుధ వరములు పృథ్వీప సుతా!

17.    

 

 

 

చం.

అతనికి మాన వాశనుల యాలయ జాలము లెల్ల నెర్కయే

యతి నిపుణత్వ మేర్పడఁగ నాతఁడు నేరని వేవి లే వహ

ర్పతి హరిదశ్వుఁ డింపుగను రామ! సహస్ర మహాంశు వేఁగెడిన్

గతుల సమస్త తీరములఁ గానన వాసికి మెండు జ్ఞానమే

18.    

 

 

 

ఆ.వె.

సకల వానర గణ సహిత మాతండు న

దుల గిరుల గుహలను గలయఁ దిరిగి

దుర్గమములఁ గాంచుఁ దూర్ణము సీతను

రాఘవేంద్ర! వానర తిలకుండు 

19.    

 

 

 

తే.గీ.

పంపి కోతుల నల్దిక్కు పెంపు మీఱ

దీర్ఘ కాయుల వెతకఁగ దీనఁ ద్వద్వి

యోగ తప్త చిత్తను గాంత నుర్వి రావ

ణాలయమున వీక్షించు నయ్యవనిజ నట

20.   

 

 

 

తే.గీ.

మేరు శృంగము నందైన మూరి యింకఁ

బడతి పాతాళ మందున్నఁ బ్లవగ వరుఁడు

నీదు ప్రియను విమలఁ దెచ్చి నిక్కముగను 

రక్కసులఁ జంపి యిచ్చును రామ! నీకు     

21.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు డెబ్బది రెండవ సర్గము.

అరణ్య కాండము

సర్గము 73.

 

 

 

కబంధుఁడు సీతను గనుగొను మార్గము తెలిపి తిరిగి ఋశ్యమూకమున కేఁగు మార్గమును వివరించి యనుజ్ఞఁ గొని యంతర్ధాన మగుట. పంపాతటాక వర్ణనము.

 

 

 

 

కం.

వివరించి యుపాయము న

ట్లవనిజ నరయఁగఁ గబంధుఁ డనె నర్థజ్ఞుం

డు వచనము లర్థ వంతము

లు వినయమున నిట్లు రఘు వరునిఁ గని మరలన్   

1.      

 

                                                                       

 

మ.

కను మీ మార్గము రామ! పశ్చిమపు దిగ్బాగమ్ము గైకొంచు నేఁ

గ నగవ్రాతము పుష్ప సంయుతముతోఁ గన్విందు గాఁ బ్లక్షముల్

ఘన జంబూ పనసప్రియాల తరు సంఘాతమ్ము న్యగ్రోధముల్

వని నశ్వత్థ స కర్ణికార తిలకప్రాశస్త్య చూతాగముల్     

2.     

 

 

 

మ.

పొడి నేలన్ మొలకెత్తు నాగము లనన్ భూజమ్ములున్ రాత్రులం

గడు రమ్యమ్ముగఁ బూయు వృక్షము లశోకక్ష్మాజముల్ వెల్గఁగా

నడవిన్ నింబ కదంబ రక్త తరు నీలాశోక వృక్షమ్ములన్

బెడిదమ్ముల్ కరవీర సాగ్నిముఖులం బెంపార వీక్షించుచున్

3.     

 

 

 

తే.గీ.

వానిఁ దగ నధిరోహించి యేని కూల్చి

యేని దోర్బలం బడర భక్షించుచు నమృ

తాభ ఫల నిచయము కడుపార నేఁగుఁ

డిర్వురును బుష్పిత వనము నెల్ల దాఁటి

4.     

 

 

 

ఆ.వె.

ఏఁగఁ గాంతు రింక నితరంపు సుందర

వనము నందన వన భంగి నుత్త

ర కురు సదృశ మెచట రామ!తరువులు ఫ

లించు నెల్ల దఱుల నెలమి దాని    

5.     

 

 

 

ఆ.వె.

అన్ని ఋతువు లందు నన్ని కాలమ్ములఁ

దేనె లొలుకు నట్టి తియ్య నైన

ఫలము లుండు నట్టి పాదపముల తోడఁ

జైత్రరథము భంగిఁ జారు తరము   

6.     

 

 

 

కం.

ఫలభా రావనత ద్రుమ

ముల మేఘ మహాద్రి సదృశముల శోభలతో

వెలుఁగుచు నుండును గానన

తల మెల్ల భృశమ్ముగ నటఁ దామర సాక్షా!

7.     

 

 

 

ఆ.వె.

నగము లెక్కి యేని నఱకి యేని యథేచ్ఛ 

సుఖముగ రఘువంశ శూరవర్య!

యమృత తుల్య ఫలము లా లక్ష్మణుఁ డొసఁగు

చుండఁ బ్రీతితోఁ జనుండు వనిని   

8.     

 

 

 

చం.

కానను దాటి కానలకు గ్రావము గ్రావ మతిక్రమించి మీ

రో నర సింహు లార! చన నుత్తమ పద్మినిఁ బంప నాఁగ లో

కానఁ బ్రసిద్ధ మైన యది కాంతురు శైవల శైల హీనముం

బూన సమంపు తీర యుగముం దగ నుత్పల పద్మ యుక్తమున్

9.     

 

 

 

తే.గీ.

హంసలు జల కుక్కుటములు నడరి క్రౌంచ

కురరము లొనర్చు స్వనములు గురు తరముగ 

నందుఁ బంపా తటాకము నందు రామ!

నిర్భయమ్ముగ నిత్యము నెగడు చుండి

10.    

 

 

 

ఆ.వె.

నరులఁ గాంచినను బెదరవు నేరక వధిం

తు రని సు ఘృత పిండ వర నిభములఁ 

జూచి వాని రామ! స్థూల ద్విజములను

దినఁగ నర్హులరు వధించి మీరు

11.    

 

 

 

మ.

నడమీనమ్ముల రోహితమ్ములను నానా మత్స్య జాలమ్ములన్

వడిఁ బంపా జల భాసితమ్ములను దా బాణాలిచేఁ జంపి త

మ్ముఁడు సౌమిత్రి దహించి భక్తి నొసఁగుం బొల్సుల్ ఛదమ్ముల్ కనం

బడ రానట్టివి యేక కంటకములన్ వక్రంపుఁ దుండమ్ములన్     

12.    

 

 

 

ఉ.

ఈశ వరేణ్య నీ వట నహీన సరోవర పుష్పసంచ యా

త్మాశుల నారగింప రహి నప్పుడు పద్మ సుగంధ యుక్త పం

పా శివ రౌప్య ధౌతశిల పావన వారిని లక్ష్మణుండు వే

భాసిత పద్మ పర్ణమునఁ బన్నుగఁ ద్రాగ నొసంగు రాఘవా!    

13.    

 

 

 

చం.

వనమున సంచరించు వర వన్య వరాహము లద్రి కందర

స్థ నివహ మాశ నీరు గొన  దప్పిని సౌరభ సన్నిభమ్ములే 

నినద యుతమ్ము పద్మినికి నెమ్మిని వచ్చును బంప కింపుగా

ననిశము వాని నెల్ల నట నారయు దీవు నరేంద్ర సత్తమా!

14.    

 

 

 

ఆ.వె.

శీతలోదకంపుఁ జెలువంపుఁ బంపా త

టమునఁ బాదపముల సుమ నికాయ

విలసితముల నరసి  కలఁతను మునిమాపు

వేళ తిరిగి రామ! విడువఁ గలవు

15.    

 

 

 

కం.

కలువల విరిసిన తమ్ములఁ 

దిలకములఁ గుసుమ యుతములఁ దిలకింప నగున్

లలిత నిశా పుష్ప ద్రుమ

ముల రాఘవ! కాంచఁ గలవు ముద మారంగన్

16.    

 

 

 

కం.

నరు లెవ్వరు లే రచ్చట

ధరింప నా మాలల నవి తడయ నలఁగ వ

బ్బురముగ వాడవు సుంతయు

నరర్షభా! యెన్నఁ డేని నలిన దళాక్షా!

17.    

 

 

 

చం.

మునులు మతంగ శిష్యు లట మోయుచు వన్య పదార్థ రాశి భ

క్తిని నొసఁగంగ స్వీయ గురు దేవున కప్పుడు భార తప్తులై 

తొనకఁగ స్వేద బిందువులు తూర్ణము పుష్పము లయ్యె నంతటన్

మునుల తపో మహత్త్వమునఁ బూరుష వర్య! నశింప వెన్నఁడున్    

18.    

 

 

 

కం.

యరిగిన వారెల్లరు నా

పరిచారిణి తాపసియు శబరి  యచ్చోటం

జిర జీవిని నేఁడు వసిం

చు రామ! రఘువంశ చంద్ర! చూడుమ యామెన్     

19.    

 

 

 

కం.

కని నిన్నచ్చట దేవ ని

భుని భూత నమస్కృతు భృశము మురిసి ధర్మం

బున నిల్చిన శబరి తనిసి

చను స్వర్గమ్మునకు రామ! చక్కఁగ నింకన్

20.   

 

 

 

ఆ.వె.

పశ్చిమంపు టొడ్డు పంపా కమలినికిఁ  

గాంచి చనిన నచటఁ గన నగు నతి

గుహ్య మైన యట్టి గొప్పదౌ యాశ్రమ

స్థానము రఘు వంశ చంద్ర! రామ!

21.    

 

 

 

తే.గీ.

ఆక్రమింప నలవి కాదు విక్రమమునఁ

గరుల కా యాశ్రమమ్మును గాననమున

శైల మందుండు వివిధ గజములు మౌని

పంపు ననుసరించి సతము భద్రముగను      

22.   

 

 

 

తే.గీ.

నందన నిభము దేవ వనప్రవరము 

దనర నానా విహంగ వితానమున భృ

శమ్ము వీక్షింప దానిని సంతసమ్ము

నంది శోకము త్యజియింతు వాత్మ రామ!   

23.   

 

 

 

తే.గీ.

ఋష్యమూకము పంపకు నెదుటఁ గలదు

కష్ట మెక్కఁగఁ బుష్పిత క్ష్మాజ యుతము 

కొండ కాపాడ నేనుఁగు కూనలు తమి

నిర్మితము బ్రహ్మ చేతను నెమ్మి మున్ను 

24.   

 

 

 

కం.

నిదురించి యా గిరి పయిన

నెదఁ గలలో నరుఁడు గాంచు నే విత్తమ్ముం 

బదిలముగఁ బొందు మేల్కొనఁ

గ దాని నిశ్శంక రామ! కమనీయముగన్

25.   

 

 

 

ఆ.వె.

పాప కర్ముఁ డెక్కఁ బర్వతమును విష

మాద్రి నిద్ర నుండ నతనిఁ బట్టి

రక్కసులు భృశమ్ము ప్రహరింత్రు దుష్ట వృ

త్తుఁ డది యెక్క లేఁడు దురిత నరుఁడు   

26.   

 

 

 

ఆ.వె.

ఆడుచుండి పంప యందు నాగ శిశువు

లడరి యా మతంగు నాశ్రమ తట

మున వసించి యఱవ మురిసి యాక్రందన

ములను విందు వీవు ముదము నొసఁగ   

27.   

 

 

 

తే.గీ.

బల్లిదములు మహాగజ వరము లొండొ

రుల నొరసికొను చుండి నెత్రు లొలుకంగ

మేఘ నిభములు విడివిడి యోఘము లయి

నీరు ద్రావుచు  వని నట నెమ్మి మసలు

28.   

 

 

 

తే.గీ.

నీలముల భంగి భల్లూక నివహ వాల

సంఘములు సంతతం బపజయము వైర

మెఱుఁగకయు జింక గము లటఁ దఱచు తిరుగఁ

గాంచి సంతసింతు వెద రాఘవ! భృశమ్ము     

29.   

 

 

 

చం.

కల దొక కందరమ్ము ఘన కానన దేశ సమీప మందు నా

లలితపు శైల రాజమున రాఘవ! కష్ట తరంబు సేరఁగా 

శిల నది మూసి యుండు గుహ చేరువఁ గాంతువు తూర్పు దిక్కునన్

జల మతి శీతలం బగు విశాల తటీ హ్రద మొక్క టింపుగన్

30.   

 

 

 

ఆ.వె.

రమ్యము ఫల మూల రాజిత నానా మృ

గావృతంబ యంతిక ప్రదేశ

మెల్లను గుహ నుండు నింపుగ సుగ్రీవుఁ

డు నలువురు సచివులు తనరఁ గపులు

31.    

 

 

 

తే.గీ.

గిరి శిఖర మందు నుండును హరి వరుండు

నొక్కొక తఱిఁ గబంధుఁడు చక్కఁ జెప్ప

మాలధరుఁడు నింగి నిలిచి మేలి సూర్య

కాంతుల వెలిఁగె నట్లు రాఘవుల కపుడు       

32.   

 

 

 

కం.

కని నింగిఁ గబంధు మహా

త్ముని దరి సేరి తగ వెడలుము దమిఁ గబంధా!

యని పల్కిరి వాక్యమ్ముల

ను నరవరులు  రామలక్ష్మణులు సంప్రీతిన్    

33.   

 

 

 

ఆ.వె.

చనుఁడు కార్య సిద్ధి తనరు మీ కని కబం

ధుఁడు వచించి గిరలు దూర్ణము గొని

ప్రీత హృదయుల రఘు వీరుల యనుమతి

వెడలె నంత గగన వీథి నెలమి

34.   

 

 

 

కం.

నిజ రూపము గొని తేజము

నఁ జక్కఁగ రవి నిభముగఁ దనర దేహం బం

తఁ జదలునఁ జూపి రామున

కుఁ జెలిమి కూర్పు కపి తోడఁ గూర్మిని ననియెన్  

35.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు డెబ్బది మూడవ సర్గము.

 

 

అరణ్య కాండము

సర్గము 74.

 

 

 

రామలక్ష్మణులు కబంధుఁడు తెలిపిన మార్గమునఁ బంపాతటికిఁ జని శబరినిఁ గాంచి యామె యొసఁగిన యాతిథ్యము స్వీకరించుట, మతంగాశ్రమ ప్రభావమును వారికిఁ జూపి వారి యనుజ్ఞఁ గొని శబరి యగ్నిప్రవేశము సేసి స్వర్గమున కరుగుట.

 

 

 

 

కం.

వనినిఁ గబంధుఁడు వచియిం

చిన దారినిఁ బంప కంత శీఘ్రముగాఁ గై

కొని పశ్చిమంపు దిక్కును 

జని రా నృవరాత్మజులు విజన మార్గమునన్

1.      

 

 

 

తే.గీ.

తేనెఁ బోలు ఫలము లున్న మ్రానులు విల

సిల్ల శైలరాజమున వీక్షించుచు వడిఁ

గాంచ సుగ్రీవునిఁ జనిరి యంచితముగ

రామ లక్ష్మణు లిర్వు రరణ్య మందు       

2.     

 

 

 

చం.

గిరి తటి నొక్క చోటుఁ బరికించి వసించిరి  రామ లక్ష్మణుల్

నరవరు లంత వేగ పయనం బొనరించిరి పంప కింపుగాఁ 

దిరిగి తటాక పశ్చిమపుఁ దీరము చేరిరి యాశ్రమమ్ము కాం

చిరి శబరీ తపస్వినిది సేరఁగ రమ్యతరమ్ము నచ్చటన్   

3.     

 

 

 

తే.గీ.

వివిధ వృక్షావృతమ్ముఁ బవిత్ర పర్ణ

శాల నెల్ల వీక్షించుచుఁ జాల సుంద

రమ్మును శబరిఁ గదిసిరి రామ లక్ష్మ

ణులు తపస్వినిని నరర్షభులు ముదమున      

4.     

 

 

 

మ.

కని సిద్ధాంగన లేచి యా శబరి రాఁ గాకుత్స్థులన్ హస్తముల్

వినయం బొప్ప మొగిడ్చి రామ పదముల్  వే పట్టి సౌమిత్రినిం

గని ధీమంతుని మ్రొక్కెఁ బాదముల కర్ఘ్యం బింకఁ బాద్యమ్ములన్

వనితా రత్న మొసంగె నుక్త విధి సంభావించి సంప్రీతినిన్     

5.     

 

 

 

చం.

పలికెను సంశ్రితవ్రతను బన్నుగఁ దత్శ్రమణీ లలామఁ దా

నలరుచుఁ గాంచి  రాముఁ డిటు లంబ! తొలంగునె విఘ్నముల్ దప

మ్ములు కొనసాగునే జనని! మూరక యాఱునె క్రోధముల్ సతం

బిల నియతంబె నీ కశన మిద్ధ తపస్విని! చారుభాషిణీ!      

6.     

 

 

 

తే.గీ.

పొందితివె నియమమ్ములఁ బుణ్యశీల 

డెంద మందెనె సౌఖ్యమ్ము కందకుండ

నీదు గురుసేవ యొసఁగెనె నెమ్మి ఫలము

నీకుఁ బరిపూర్ణముగ నంబ! వీఁకఁ జేయ

7.     

 

 

 

చం.

అడుగఁగఁ బల్కెనా శబరి యంతట సిద్ధ జనార్చ్య సిద్ధ రా

ముఁడు కడు వృద్ధ నిల్చి తగ ముందఱఁ దాపసి పల్కు లివ్విధిం

బడయఁగ నీదు దర్శనము ప్రాప్తము నా కిట సిద్ధి యింపుగాఁ

బడసితి నేఁ దపః ఫలము పన్నుగఁ జేయ గురువ్ర జార్చనల్

8.     

 

 

 

ఉ.

దేవ వరేణ్య! పూజ లిడ దేహము గాంచె ఫలమ్ము నేఁడు నా

కీవు కనంబడంగ నిట నింపుగ రాఘవ! స్వర్గ మందెదన్

నీ వరయంగ నన్నెలమి నేను బునీతను నైతి నిత్తఱిన్

నే వడి నక్షయమ్ములగు నీ దయ లోకము లెల్లఁ గాంచెదన్

9.     

 

 

 

తే.గీ.

చిత్రకూటమునకు రామ! చేర నీవు

కాంతిమంతములు విమాన గణము లెక్కి

నేను సేవ సేసిన యట్టి నిర్మల మును

లెల్లఁ జేరిరి దివమున కెలమి వారు    

10.    

 

 

 

చం.

పలికిరి యిట్టు లంత ముని వర్యులు పుణ్యులు సత్య ధర్మవే

త్త లతిథు లై రఘూద్వహులు తద్దయుఁ బుణ్యపుఁ బర్ణశాలకున్

లలిఁ జనుదెంచి పూజ లిడ రమ్యముగాఁ గొన రామలక్ష్మణుల్

కలుగును నీకు నక్షయ జగమ్ములు నుత్తమ లోకముల్ వెసన్      

11.    

 

 

 

ఆ.వె.

కూడఁ బెట్టితిని రఘుప్రవీరా! నీ క

యి వివిధముల నెలమి నిచట వన్య

ములను నర వరేణ్య వెలయఁ బంపా తీర

మందు నేఱి వీని నందు కొనుమ

12.    

 

 

 

కం.

అని పలుక శబరి రాఘవుఁ

డనె ధర్మాత్ముండు శబరి నారసి జ్ఞాన

మ్మున సంత తాబహిష్కృత

వనితామణి తోడ నిట్లు పన్నుగ గిరలన్     

13.    

 

 

 

చం.

దనువు మహాత్ము చెంత వనితా మణి! వింటిని నీ ప్రభావమున్

ఘనమును నే స్వయమ్ముగను గాంచఁ దలంతును దాని నెల్ల నీ

యనుమతి నా ననంగ విని యా రఘు నందను భాషణమ్ములన్

వనమును వారి కిర్వురకుఁ బన్నుగఁ దాపసి సూపెఁ బ్రీతినిన్    

14.    

 

 

 

కం.

కనుమీ ఘన మేఘ సదృశ

మును మృగ విహ గావృతమ్ముఁ బుణ్య వనమ్ముం

దనరు మతంగ వనమ్మన

నిన వంశాంభోధి చంద్ర! యింపుగ నిచటన్

15.    

 

 

 

చం.

గురువులు భావి తాత్ములు నకుంఠిత దీక్షులు నా గురూత్తముల్

విరివిగ మంత్ర వాక్యముల వేల్చిరి తీర్థ మొసంగి యగ్నులన్

గురుతర కాననమ్మున రఘుప్రవరా! సతతమ్ము భక్తినిం

గరములు కంపితమ్ము లయి కన్పడ నిచ్చిరి నెమ్మి పుష్పముల్

16.    

 

 

 

తే.గీ.

వేది ప్రత్యక్స్థలి యనంగ విదిత మిందుఁ 

జేసి రడరి పూజలు నాదు సేవ లంది

న గురువుల తపో మహిమ వెలుఁగు లొసంగు

చున్నవి దిశల వేదులు చూడు నేఁడు!     

17.    

 

 

 

కం.

ఉపవాస శ్రమ నలసి త

లఁప సప్తాంబుధులు గురువుల సముఖమునకే

నృపవర! చన లేకున్నం

గృపతో నేతెంచెను దిలకింపుమ రామా!    

18.    

 

 

 

ఉ.

స్నానము నాచరించి తరు శాఖల నుంచిన వల్కలమ్ములే

మ్రానుల నాఱకున్నయవి రాఘవ నేటికిఁ గాంచు మిచ్చటన్

మానుగ దేవ సంచయ సమర్పిత పుష్ప చయమ్ము నేఁటికిన్

మ్లానము గాక యున్న యది రామ! కనుంగొను సోత్పలమ్ముగన్

19.    

 

 

 

తే.గీ.

చూచితివి రామ వన మెల్లఁ జూడఁ దగిన

ది వినఁ దగిన దెల్ల నిఁక వింటివి నరేంద్ర!

యనుమతింపఁ గళేబరమును ద్యజింప

నిచ్చగింతును నే నెద నినకు లేశ!     

20.   

 

 

 

ఆ.వె.

వారి నిపుడు నేను భావితాత్ములఁ జేర

నెంతు దాసి నైతి నేరి కాశ్ర

మమ్ము నందు నేను నెమ్మి వారల నెల్ల 

నింక  రాఘవేంద్ర! పంకజాక్ష!

21.    

 

 

 

చం.

వచనము లాలకించి తగఁ బల్కఁగ ధర్మ నిబద్ధ యవ్విధిం

బ్రచుర ముదమ్ము నంది యెద రాముఁడు లక్ష్మణు తోడ సత్య మెం

చుచు వచియించె నిట్లు కడు చోద్యమ యంచును సంశ్రితవ్రతన్

శుచిఁ గని యర్చ లందితిమి శుద్ధ చరిత్ర! యథేచ్ఛ నేఁగుమా      

22.   

 

 

 

చం.

అనుమతి నీయ రాముఁడు జరాంగన వేనలి నార చీరలుం

దనరుచు నుండ నా శబరి తత్సమయమ్మున జీర్ణ దేహ మా

యనలము నందు వేల్చి తగ నర్గెను వెల్గఁగ నగ్ని సన్నిభ

మ్ము నిజ శరీర మెల్ల నట మూరి దివమ్మున కంత వింతగా   

23.   

 

 

 

తే.గీ.

దివ్య భూషణ రాసుల దివ్య మాల్య

ము లనులేపనముల దివ్యము లగు వస్త్ర

ములు ధరించి కన్పడె నట ముదము నొసఁగ 

మించి వెలిఁగించి యచ్చోటు మెఱపు వోలె

24.   

 

 

 

కం.

చనె సుకృతాత్ములు మునులు చ

నిన చోటునకు నొనరింప నిత్యమ్ము దప

మ్మును దన్మహిమ శబరి యా

వనితా మణి పుణ్య దేశ వాసమ్మునకై   

25.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు డెబ్బది నాలుగవ సర్గము.

 

అరణ్య కాండము

సర్గము 75.

 

 

 

శబరి యట్లు స్వర్గమున కేఁగఁగా రామలక్ష్మణులు మతంగాశ్రమ మునుల ప్రభావమును దలఁచుకొనుచు ఋష్యమూక గిరి కేఁగుచుఁ బంపా తటిలోఁ బ్రకృతి సౌందర్యమును దిలకించుట.   

 

 

 

 

కం.

నిజ తేజ మడర శబరి వె

సఁ జన దివమ్మునకుఁ గాంచి సహ జన్మునితో

విజ నాటవి రాముండు త

గఁ జింత సేయం దొడంగెఁ గమనీయముగన్

1.      

 

 

 

కం.

తలపోసి మహాత్ముల మహి

మ లలిత రీతిఁ దన హితము మది నిత్యమ్ముం

దలఁచెడు నేకాగ్రునిఁ గాం

చి లక్ష్మణుని రాముఁ డిట్లు చెప్పఁ దొడంగెన్

2.     

 

 

 

ఉ.

కంటిమి యాశ్రమమ్మును సుఖమ్ముగ లక్ష్మణ! యద్భుతమ్మునుం

గంటిమి యుండఁగా నిట మృగవ్రజ మండజ వ్యాఘ్ర రాశితోఁ 

గంటిమి సప్త వార్ధుల నఖండము తీర్థము లందు నిచ్చటన్

జంటగ మున్గి యిచ్చితిమి చక్కగఁ బెద్దల తర్పణమ్ములన్      

3.     

 

 

 

చం.

చెడు నశియించె నెల్ల నిటఁ జేరు శుభమ్ములు నిశ్చయమ్ముగా

నెడఁద ముదమ్ము లక్ష్మణ యహీనవిధమ్ముగ నుద్భవించెనే

వడిఁ బురుషర్షభా! కలుగు వారక క్షేమము లింపుగా నికఁన్

నడు వడిఁ బంపకుం గదియ నాగ వరమ్మును ఋష్యమూకమున్    

4.     

 

 

 

ఆ.వె.

గిరి యచటఁ  దనరును గెలఁకున  నింపుగ

ధర్మరతుఁడు కూడి తన హితులఁ గ

పులు నలువుర తోడ మూరి సుగ్రీవుఁడు

వాలి భీతిఁ జేయు వాస మచట   

5.     

 

 

 

తే.గీ.

వానరర్షభు సుగ్రీవు నా నగమునఁ

గాంచఁ జను మింక రయముగఁ గాంత సీత

మార్గణం బాతని పయినం బరఁగు లోఁబ

డి శుభ లక్షణ లక్ష్మణ! భృశము సౌమ్య!       

6.     

 

 

 

కం.

విని యట్లు పలుక ధీరుఁడు

ఘనుండు రాముఁడు రయమ్ముగఁ జనెద మార్యా!

యని లక్ష్మణుఁడు పలికి నా

మనమ్ము త్వరపడుచు నుండె మనుజేంద్ర! యనెన్    

7.     

 

 

 

ఆ.వె.

ఆశ్రమమ్ము నుండి యంత వెడలి మహా

త్ముఁడు నరపతి యనుజు తోడఁ జేరె

వడి వడి నడుగు లిడి పంపా తటి విభుండు 

రాముఁ డాత్రముగను రాఘవుండు

8.     

 

 

 

మ.

వడిఁ గాంచెన్ రఘు నందనుండు  ఘనుఁ డా పంపా తటాకమ్ము రా

ముఁడు నా నాగ లసల్లతా వృతమునుం బుణ్యాత్మ సంసేవ్యమున్

గడు మాధుర్య పయోవిరాజితము సౌగం ధ్యాబ్జ షండమ్ముతో 

నడరం జక్కఁగ నీల శుక్ల కుము దాద్యంభోజ తండమ్ములే

9.     

 

 

 

ఆ.వె.

తూర్ణ మంతఁ గదిసె దూరమునం గని

యా మతంగ సరసి  నంబు వాహి

నిఁ గడు ప్రీతి నందు నెమ్మి స్నానము నాచ

రించె ఘనుఁడు రాముఁ డంచితముగ   

10.    

 

 

 

తే.గీ.

ఉత్ప లారవిందములతో నుండ రమ్య

ముగను బద్మ సౌగంధిక పూరితమ్ము 

పుష్పి తామ్ర వనోపేతము నయి బర్హి

ణ గణ సంత తోద్ఘుష్ట నినాదితమ్ము   

11.    

 

 

 

తే.గీ.

బీజ యుత తిలక తరులు విరివి వెలయ

ధవ తరువులు శుక్ల తరులు దనరు చుండ

పూలతో నిండి కరవీరములు సుపుష్పి

తములు పున్నాగ తరువులు తద్ద యడర

12.    

 

 

 

తే.గీ.

విమల మాలతీ కుంద గుల్మములు వెలయ

మఱ్ఱి యెఱ్ఱ గన్నేరులు విఱ్ఱవీఁగ

నరఁటులు నశోక వృక్షము లడరఁ దనరఁ               

గేతకము లతిముక్తక వ్రాతములును    

13.    

 

 

 

తే.గీ.

అన్యము లనేకములఁ బాద పాలి వనిత

వోలె భూషితంబు నయి విపులము వెలయఁ 

బుష్ప రాసులతో ద్రుమము లడరంగఁ 

జూచు చుండి రమ్యముగను శూర వరులు   

14.    

 

 

 

తే.గీ.

వెలయఁ దెల్లని కొంగలు నలరి నెమళు

లాడ నాట్యము  చిలుకల తోడ నన్య

పక్షు లడర వీడి వ్యథ నా వనమున సర

సి నరయుచు రాఘవులు కూడి చనిరి వేగ

15.    

 

 

 

చం.

సరసిని శీత వారినిధిఁ జారుతరమ్మును బంపఁ గాంచుచుం

బరము లశోక వృక్షములు పన్నుగఁ బొన్నలు గుగ్గిలమ్ములున్

విరియఁగ బొట్టుగుల్ వివిధ వృక్షము లింపుగఁ గాంచెఁ గొల్నునుం

దిరముగఁ గామ తప్తుఁ డయి ధీరుఁడు రాముఁడు కూడి లక్ష్మణున్   

16.    

 

 

 

చం.

సమతల పుష్పి తోపవన సంయుత చంపక సాల వృక్షముల్

భ్రమర గ ణావృతమ్ము నయి రాజిల రమ్యతర ప్రభా వనిన్

విమల జ లాఢ్య వాలుక వివిక్తము పంపను బద్మ గంధ యు

క్త మరసి సత్య విక్రముఁడు తమ్మునితో వచియించె నిట్టులన్

17.    

 

 

 

ఆ.వె.

ఋష్యమూక మనఁగ నిచట నీ తీర మం

దుఁ గలదు గిరి వర మటఁ గథితంబ

మున్న పాదపములు పుష్పితమ్ముల తోడ

నలరి పుణ్యతరము లలిత నగము

18.    

 

 

 

కం.

హరి ఋక్షరజు మహాత్ముని

వర పుత్రుఁడు వీర వరుఁడు పరఁగును దా నీ

గిరి పయి సుగ్రీవుఁ డనఁగ

ధర విఖ్యాతుండు భ్రాత! ధర్మాత్ముండై     

19.    

 

 

 

కం.

నరవృషభ! వానరేంద్రుని 

నరయుమ సుగ్రీవునిఁ జని యని లక్ష్మణుతోఁ

దిరిగి యనె సత్య విక్రము

వర వీరుని తోఁడ నన్న పలుకుల నిట్లున్   

20.   

 

 

 

ఆ.వె.

సీత లేక నేను జీవింపఁ గలనె రా

జ్య రహితుండ దీనుఁడ రమణి ధర

ణిజ పయి నిజ మనము నిత్య సక్తము కాఁగ 

లక్ష్మణ! క్షణ మైన రక్తి వీడి

21.    

 

 

 

తే.గీ.

పలికి తన్ను వినుచు నుండ భ్రాతతోఁ ద

దేక బుద్ధిఁ గాంచి విరహ మెల్లఁ దనను

భృశముగ దహించు చుండ ననిశము సుంద

రంపుఁ బంపా నలినిఁ  దోఁగె రాఘవుండు   

22.   

 

 

 

కం.

నానా విహగ విలసితము

కాననమున దూర మేఁగి కాంచుచు వనముల్

దా నరసె నింపుగను బం

పా నలినిని రమ్యమును నృప కుమారుఁ డటుల్   

23.   

 

 

 

మందాక్రాంయతము.

ఇక్ష్వాక్వంభోనిధి సిత నిశీథేశ సంకాశ మూర్తీ!

సుక్ష్వింకానీక ధవ రవి సత్సూను సంభావ్య ధీరా!

భిక్ష్వామ్నాయప్రముఖ శివ సంప్రీత ధానుష్క వీరా!

స్విక్ష్వత్యుగ్రాస్త్ర ధర నిభ! రాజేంద్ర సందోహ పూజ్యా!          

24.   

 

 

 

మాలిని.

నలిన దళ నిభాక్షా! నైగమజ్ఞాన సారా!

సలలిత ఘన దేహా! సచ్చిదానంద రూపా!

ఖలు జన గణ దర్పఘ్నా! సుమిత్రా సుతార్చ్యా!

చల దభినవ ధర్మజ్ఞానసాకల్య మూర్తీ!

25.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు డెబ్బది యేనవ సర్గము.

                           శ్రీమదాంధ్ర రామాయణము నందు నరణ్య కాండము సమాప్తము.        

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి