4, నవంబర్ 2023, శనివారం

6. శ్రీమదాంధ్ర రామాయణము_ యుద్ధ కాండము 2

        శ్రీ మదాంధ్ర

          రామాయణము

                      యుద్ధ కాండము 2.

                    మూలము

                         శ్రీ వాల్మీకి రామాయణము 





                 ప్రణీతము

            పోచిరాజు కామేశ్వర రావు 




శ్రీమదాంధ్ర రామాయణము

(మూలము: శ్రీవాల్మీకి రామాయణము)

 

యుద్ధ కాండము 2

                                                               సర్గము 68.

 

 

 

రాముఁడు యుద్ధములోఁ గుంభకర్ణుని వధించె నని రాక్షసులు నివేదింప రావణుఁడు మూర్ఛిల్లి కొంత తడవునకుఁ దేఱి యనేక విధముల విలపించుచు విభీషణుని మాటలను సమ్మతింప నందులకు విచారించుట.  

 

 

 

 

కం.

కని కుంభకర్ణు మరణ

మ్మును నృవరుని రాముని కరముల ఘోరమ్ముం

జని రాక్షసులు వచించిరి

వనరుచు నసురపతికి దశ వక్త్రున కిటులన్

  1.  

 

 

 

ఉ.

రాజ వరేణ్య! ఘోర సమరమ్మునఁ గాల నిభుండునై మహా

తేజుఁడు కుంభకర్ణుఁడు రతిం దిని కోఁతులఁ బర్విడంగఁ దా

నోజను జేసి సేన నసు రోత్తముఁ డందెను గాలకర్మమున్

రాజిలి రామ తేజమున భ్రాత యడంగెను రాక్షసేశ్వరా!      

  1.  

 

 

 

తే.గీ.

విక్రమింప రాఘవ బాణ పీడితుండు

కడలిఁ దూఱె మై సగము తెగఁ జెవులింక

ముక్కు శిరము లంకాద్వారము నిలుపంగ  

దావ దగ్ధ తరు వన  ముద్ద యయి నిలిచె       

  1.  

 

 

 

కం.

విని భ్రాత కుంభకర్ణుం

డని మరణించె నని రాక్షసాధిపుఁ డంతన్

వనరుచు భృశమ్ము మూర్ఛి

ల్లెను గూలెను రావణుండు క్లేశం బడరన్   

  1.  

 

 

 

ఆ.వె.

ధీర వరులు త్రిశిర దేవాంతక నరాంత

కాతికాయు లా మహాసురులు పి

తృవ్యు మరణము విని సువ్యగ్రులై శోక

మున వగవఁ దొడఁగిరి ముమ్మరముగ      

  1.  

 

 

 

ఆ.వె.

భ్రాతయె మరణింప రాముని చేత న

క్లిష్ట కర్ము వలన నష్ట చేత

ను లయి ఘోర రాక్షసులు మహోదర మహా

పార్శ్వులు మునిఁగిరి వివశత నార్తి      

  1.  

 

 

 

చం.

తెలివి వహించి కష్టమున ధీరుఁడు రాక్షస పుంగవుండు భా

తృ లయ ఘనార్త రావణుఁడు దీనుఁడునై విలపించె నో మహా

బల! రిపు దర్పనాశకుఁడ! భ్రాతను నిర్దయఁ గుంభకర్ణ! నీ

విలఁ ద్యజియించి యా యముని యింటికి నేఁగితె దైవ వశ్యతన్

  1.  

 

 

 

ఉ.

ఎక్కడి కేఁగి తీ వకట యెంతయొ వేఁచి నిజారి సైన్యమున్

ముక్కలు గా నొనర్పకయె మున్నిట బంధుల నాదు దుఃఖముం 

జక్కఁగ నాదు దక్షిణ భుజమ్ముగ వేని దలంచి భీతి నే

స్రుక్క సురాసు రావలికి సోలగ నయ్యది లేను నే నిఁకన్      

  1.  

 

 

 

తే.గీ.

దేవ దానవ దర్పఘ్న! నీవు సముఁడ

వెంచఁ గాలాగ్ని రుద్రుల కంచితముగ

నెట్టు లోడితి వా రాఘవేంద్రున కక

ట సమరమ్మున ఘన వీరుఁడ వయి వింత     

  1.  

 

 

 

ఆ.వె.

వజ్ర ఘాత మయిన వ్యసన మీయ దెపుడు

నీకు నట్టి వీర నీవు రామ

బాణ ఘాతమున నవని శయనించితి

వేల ఘోరముగ నహీన వీర్య!      

  1.  

 

 

 

కం.

గగనమ్మున నిలిచి మునుల

ను గూడి ముద మూని యెదలను భృశమ్ముగ దే

వ గణమ్ములు నినదించు న

నిఁ గూల వీక్షించి నిన్ను నిర్దయ ననుజా!   

  1.  

 

 

 

కం.

ధృవ మరయ లబ్ధ లక్ష్యులు

ప్లవగులు దుర్గముల నింక ద్వారములను లం

క వెఱవక యడరి వెస నె

క్కు వార లగుదురు కరమ్ము కులుకుచు నెదలన్

  1.  

 

 

 

కం.

పని యేమి నాకు రాజ్య

మ్మున నిఁక వైదేహితో నిపుడు పని యే ముం

డును నాకుఁ గుంభకర్ణుఁడె

నను వీడ నశించె బ్రతుకునఁ దగుల మెల్లన్  

  1.  

 

 

 

కం.

అనుజునిఁ జంపిన వానిని

నని నే వధియింప కున్న నా రాఘవునిం

గన వ్యర్థము జీవిత మె

ల్లను మరణము శ్రేయ మగును భ్రాతా! నాకున్

  1.  

 

 

 

ఆ.వె.

నేఁడ యేఁగు వాఁడ నేఁ దమ్ముఁ డున్న చో

టునకు విడిచి యింక ననుజ వరుల

నొక్క క్షణ మయినను నిక్కము మన నిచ్చ

గింప నిట్టు లెద నశింప శాంతి     

  1.  

 

 

 

తే.గీ.

నన్ను మున్నపకార మొనర్చి నట్టి

వానిఁ గని నవ్వరె సురలు భ్రాత! కుంభ

కర్ణ! మరణింప నీ విట్లు కయ్య మందు

నెట్లు నే నింద్రుని జయింతు నింక నకట   

  1.  

 

 

 

తే.గీ.

తనర నజ్ఞాన మెద లోన విన నపుడు వి

భీషణు మహాత్ము నుచితంపు భాషణములు

సేరె యవియె నన్నిపుడు విచార మడర 

నకట చెప్పిన విధముగ ననుజ! యెల్ల  

  1.  

 

 

 

ఆ.వె.

కూలిన తఱి నుండి కుంభకర్ణ ప్రహ

స్తులు విభీషణుండు పలికి నట్టి

వాక్కు లొసఁగు చున్న వక్కట సిగ్గును

దారుణముగ నాకుఁ దలఁచి నంత    

  1.  

 

 

 

కం.

ఘన ధర్మాత్ము విభీషణు

ని నిందితునిఁ జేసి నట్టి నేఁ దత్ఫలమున్ 

మనమును బాధించెడు దా

నినిఁ బొందితి నివ్విధముగ నెట్టనఁ గట్టా

  1.  

 

 

 

కం.

అనుజుని యింద్రు జయించిన

ఘను మరణము నాలకించి కడు వ్యథితుండై

మనము కలంగఁ బలు విధము

లను విలపించి వెసఁ గూలె రావణుఁ డంతన్    

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నఱువది యెనిమిదవ  సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 69.

 

 

 

విలపించుచున్న రావణునితోఁ ద్రిశిరుఁడు ప్రాకృతిని వలె నిట్లు వగవఁ దగ దని యుద్ధమునకుఁ దా నేఁగెద నని పలుక నరాంతక దేవాంత కాతికాయులు నట్లు వచింప వారిని మహోదర మహా పార్శ్వులు తోడుండఁ బంపిన ఘోర యుద్ధములో నరాంతకుఁ డంగదుని చేత వధింపఁ బడుట.  

 

 

 

 

కం.

విలపింప రావణుండు కు

టిలాత్ముఁ డడర నెద నడజడి త్రిశిరుఁ డంతం

బలికె విని యిట్లు వచన

మ్ములు పరితప్తాత్ము నరసి పుత్రుండు తగన్     

  1.  

 

 

 

తే.గీ.

మధ్యముం డన్నదమ్ముల మా పితృవ్యుఁ

డతి బలుఁడు మహా వీరుండు హతుఁడు గాఁగఁ

జెలఁగి రణ మందు రాజన్య! చింతిలుదురె

నిన్ను బోలెడు సజ్జను లెన్నఁ డేని    

  1.  

 

 

 

ఉ.

చాలుదు వీవు ముజ్జగము సైపఁగ రాక్షస నాథ! యిట్లు నీ

వేల తపింతు వాత్మఁ దలపించుచుఁ బ్రాకృతుఁ దమ్మి చూలియే

లాలన నీ కొసంగెను ఖరవ్రజ మేఘ నిభస్వనధ్వజిన్

మేలుగఁ ద్రాణ శక్తులను మేటి ధనుస్సును సాయకమ్ములన్   

  1.  

 

 

 

చం.

పలుమఱు లస్త్ర హీనముగ ధ్వంసము సేసితి దేవ దాన వా

వలిని సహాయు ధావలినిఁ బార్థివ! యర్హుఁడవే వధింపఁగా  

బలమున రాఘ వోద్వహునిఁ బన్నుగ నిల్వుమ యేఁగి యాజికిం

జలమున నీదు శత్రువుల జంపెదఁ బోలుచు వైనతేయునిన్           

  1.  

 

 

 

తే.గీ.

శంబరునిఁ జంపినట్టి యా శక్రు పగిది

నరకుఁ జంపిన వెన్నుని కరణి నేను

నేఁడు చంపఁగ రణమందు నిహతుఁ డయి నృ

వరుఁడు రాముఁడు శయనించు ధరణి పైన

  1.  

 

 

 

కం.

బాలుని త్రిశిరుని మాటలు

మే లిడు నవి యాలకించి మించి తలంచెం 

దా లయమై పుట్టి నటులఁ  

గాల వశుఁడు రావణుండు కౌణపుఁ డెదలో    

  1.  

 

 

 

ఆ.వె.

త్రిశిరుని గిరలు విని దేవాంతక నరాంత

కాతి కాయుఁలు సమ రాంగణమున

కేఁగ నుత్సహించి రెల్లరు ముదమున

నన్నదమ్ము లంత నసుర వరులు    

  1.  

 

 

 

ఉ.

నే నన నేను నంచును ధ్వనించుచు నత్తఱి నైరృతర్షభుల్

సూనులు రాక్షసేంద్రునకు శూరులు శక్ర సమానులున్ నభో

యానులు మాయ లందు ఘనులౌ సుర దర్ప నిహంత లెల్లఁ గ

య్యాన నజేయు లెల్లరు మహా బల దర్పితులున్  యశస్వులున్    

  1.  

 

 

 

తే.గీ.

దేవ గంధర్వ కిన్నర దివ్య సర్ప

గణము లెదిరింప నోడని ఘనులు నస్త్ర

విదులు యుద్ధ విశారద వీర వరులు

లబ్ధ వరులు స్వీయప్రవర విదు లెల్ల   

  1.  

 

 

 

తే.గీ.

అట్టి రిపు బల మర్దను లర్క తుల్య

తేజు లుండఁ జుట్టి సుతులు రాజు రావ

ణుండు వెలిఁగె వాసవు వేని యండ నుండి

రమరు లసురఘ్నులు వృతులై యతనిఁ బోలి   

  1.  

 

 

 

చం.

సుతులను గౌఁగిలించికొని సుందర భూష లొసంగి దీవనల్

వితత మొసంగి పంపెఁ దమి వీరుల భండన భూమి కింపుగా

సతతము పుత్ర రక్షణము సంగర భూమి నొసంగ భ్రాతలన్

వితత బలాఢ్యులం బనిపె వీర వరేణ్యుల యుద్ధ మత్తులన్

  1.  

 

 

 

కం.

అత్తఱి యుద్ధోన్మత్తుఁడు

మత్తుఁడు ఘన కాయులు రిపు మర్దనునకు రా

జోత్తమున కనుజులు  నతు లు

దాత్తముగ నొసఁగి చనిరి ప్రదక్షిణములతో     

  1.  

 

 

 

తే.గీ.

అలఁది సర్వౌషధమ్ముల నంగముల స

గంధ మీ యార్వు రసుర పుంగవులు  యుద్ధ

కాంక్షిణులు మహా వీర్యులు కదలి సమర

రంగమున కేఁగఁ దొడఁగిరి రాజు నాజ్ఞ

  1.  

 

 

 

ఆ.వె.

త్రిశిరసుఁ డతి కాయ దేవాంతక నరాంత

కులు మహోదరుండు నలరి వెంట

నసుర వరుఁడు నమ్మహాపార్శ్వుఁడును  రాఁగఁ

గాలచోదితు లయి కదలి రెల్ల    

  1.  

 

 

 

మ.

అనివా ర్యేభము నీల మేఘ సదృశం బైరావ తామ్నాయమున్

మును దా నెక్కి మహోదరుండు సన సంపూర్ణాయుధుండై వెలిం

గెను దోలంగ సుదర్శ నాఖ్య గజముం గేలీ విధం బస్త శృం

గినిఁ గన్పట్టు దినేశు సన్నిభము వీక్షింపంగ భూషావలిన్         

  1.  

 

 

 

చం.

త్రిశిరసుఁ డశ్వ రాజములు తేరునఁ గట్టగ సాయుధమ్మునన్

భృశముగ భూషితుండు నయి వీరుఁడు రావణ సూనుఁ డెక్కి వె

ల్గె శర ధనుర్ధరుండు గిరి రేఁగిన మేఘ సవిద్యుదుల్క సేం

ద్ర శర వరాస నాభముగ రాక్షస వర్యుఁడు గాంచ నత్తఱిన్

  1.  

 

 

 

కం.

మూడు తలలపై నమరిన

మూడు కిరీటమ్ముల రథమున భాసిల్లెన్

మూడు తలల త్రిశిరసుఁ డా

మూడు పసిడి కొనల శీత భూధరము వలెన్    

  1.  

 

 

 

తే.గీ.

అంత తేజస్వి యతికాయుఁ డసుర నాథ

పుత్రకుం డధి రోహించె భూరి రథము

మేటి విలుకాండ్ర నక్షము మేలి చక్ర

ములు సుకూబరముల తోడ మూరు దాని    

  1.  

 

 

 

తే.గీ.

చాప తూణీరములు ప్రాస స పరి ఘాసి

సంచయమ్ములు నిండంగ స్యందనమునఁ 

గాంచన కిరీట భూషలు మించి వెలుఁగ

నతఁడు వెల్గెడు మేరువు గతి వెలింగె    

  1.  

 

 

 

కం.

అరదము నందు వెలింగె న

సుర పతి సూనుండు నయ్యసుర గణవృతుఁడై

సుర సంచ యావృతుఁ డశని

కరుఁ డింద్రుఁడు వెల్గు రీతిఁ గమనీయముగన్    

  1.  

 

 

 

ఉ.

ఎక్కె నరాంతకుండు తుర గేంద్రము వేలుపు తేజి తుల్యమున్

మిక్కిలి వేగవంతమును మేటి హయమ్ము మనోజవమ్మునుం

జక్క ధరించి ప్రాసమును సన్నిభ ముల్కల కెంచ సర్పభు

క్కెక్కిన శక్తి నూనిన యహీనుని  స్కందుని భంగి వెల్గుచున్

  1.  

 

 

 

ఉ.

అంత గ్రహింపఁగాఁ బరిఘ నంచిత వజ్ర విభూషణమ్ము దే

వాంతకుఁ డద్రి దోర్యుగము నందు వహించిన యట్టి యా రమా

కాంతుని  విష్ణు శాఠ్యమునఁ గన్పడు చుండె మహాసురుండు కా

లాంతక సన్నిభుండు సమ రాంగణ మందు నజేయుఁ డుగ్రుఁడున్    

  1.  

 

 

 

కం.

గదఁ గైకొని బలవంతుం

డుదరి మహాపార్శ్వుఁ డమ్మహోన్నత తనుఁ డ

ప్డు దురమునఁ గుబేరుఁడు ఘన

గదా కరుడు వెలుఁగు రీతిగ వెలింగె నటన్

  1.  

 

 

 

చం.

రతిఁ జని రా మహాత్ములు పురం బమరావతి నుండి యేఁగు దే

వతలను బోలి రాక్షసులు వారణ ఘోటక మేఘ నిస్వన

ప్రతి వర చక్రపాదముల వచ్చిరి వారల వెన్క నింపుగా

వితత వరాయుధమ్ములను వీర వరేణ్యులు సంభ్రమించుచున్

  1.  

 

 

 

కం.

వెలిఁగిరి రవిప్రభలతో

విలసిల్లి కుమార వరులు వినువీథి గ్రహ

మ్ములఁ బోలుచును గిరీట

మ్ముల శ్రీమంతు లరుగ రణమునకు మహాత్ముల్

  1.  

 

 

 

ఆ.వె.

అసురు లూని నట్టి యమల వస్త్రావలి

శార దాభ్ర నిభము మూరు చుండ

నంబరమ్ము నందు హంసావలి పగిది

వెలుఁగు చుండెఁ గాంచ వింతగాను    

  1.  

 

 

 

చం.

మరణము నైన శత్రు చయ మారణ మైనను నిశ్చయంబుగా

సుర రిపు లాత్మలం దలఁచి చొచ్చిరి వీరులు సంగ రార్థు లా

ర్చిరి యొనరించి గర్జలను శీఘ్రమ వేసిరి సాయకమ్ములన్ 

దురమున యుద్ధ దుర్మదులు దుర్జయు లెల్ల మహాత్ము లుగ్రులై    

  1.  

 

 

 

తే.గీ.

సింహ గర్జల జప్పట్లచేఁ జలించె

భూతలం బెల్ల రాక్షస వ్రాత మాజిఁ

జెలఁగి యొనరింప నంబర తలము పగులు

రీతి నప్పుడు గన్పట్టె నాతతముగ

  1.  

 

 

 

చం.

చని కని రంత రాక్షసులు సంతస మంది మహా బలాఢ్యులే 

ఘన కపి సైన్య మెల్లను నగమ్ముల ఱాళ్ల వహింపఁ బాణులం

గనిరి హరీంద్రు లాసురులఁ గాల ఘనాభ శరీరులం దురం

గ నిచయ మత్త నాగ రథ కాయము మ్రోగఁగఁ గింకిణీ ధ్వనుల్    

  1.  

 

 

 

ఆ.వె.

ఉద్య తాయు ధాసు రోత్తములఁ బ్రదీప్త

వహ్ని రవి సదృశులఁ బరివృ తాసు

రప్రవర విరాజులను సమరోత్సాహు

ల నరసి హరి సేన కినిసి యంత      

  1.  

 

 

 

ఉ.

వారిని లబ్ధ లక్ష్యులు ప్లవంగులు గాంచి సముద్య తాద్రులై

ఘోర తరస్వరమ్ములను గూసిరి బల్లిదు లుగ్ర రీతినిన్

మూరి ప్రతిధ్వనించిరి యమోఘముగాను సహింప నోప కా

వీరులు సేయ రాక్షసులు భీకర నాదము లాగ్రహమ్మునన్        

  1.  

 

 

 

తే.గీ.

వానరేంద్రుల రేఁగిన పరమ హర్ష

యుక్త నినదమ్ములను సైప నోపక యసు

రేంద్రులు మహా బలు లఱచి రెల్లరును మ

హోగ్రముగ యుద్ధ మొనరింప నుద్యమించి    

  1.  

 

 

 

ఆ.వె.

రక్కసుల బలమునఁ బ్లవగ యూధపులు సొ

చ్చి వెస నెత్తి  శైల శేఖరములు

వెలిఁగి రపుడు శృంగముల తోడ నద్రి రా

జముల భంగిఁ జెలఁగి సంగరమున    

  1.  

 

 

 

ఉ.

కొందఱు సేరి యంబరము కొందఱు వానరు లుర్వి నిల్చి కే

లం దరు శైల జాలమును రమ్య తరమ్ముగ నూని పోరఁగా

నందఱు వాన రాసుర మహా సమరం బటఁ గాంచ ఘోరపుం

జందము దోఁచె భీకరము సంకులమై ధర రక్తసిక్తమై   

  1.  

 

 

 

ఆ.వె.

శైల తరు శిలా నిచయ వర్షము కురియిం

చిరి ప్లవంగ వరులు చిత్రముగను

బాణ జాలములను వారింపఁ బడియును 

భీమ విక్రము లని వీర వరులు   

  1.  

 

 

 

ఆ.వె.

చేసిరి రణ మందు సింహ నాదమ్ములు

వానరు లసురులును వానరులు శి

లల నసుర వరులను జెలఁగి భస్మము సేసి

రాగ్రహమ్ము మీఱ నుగ్రు లగుచు

  1.  

 

 

 

చం.

అడిచిన ఘోర రీతిఁ గవచాభరణావృత యాతుధానులం

గడఁగి ప్లవంగ వీరు లలుకన్ రథ చారుల హస్తి వాజులం

దడరెడు ఘోర రాక్షసుల నాసురు లద్రి శిఖావృతాంగులై  

పడ వర ముష్టిఘాతములు పైకి వెసం గను గుడ్లురా భువిన్    

  1.  

 

 

 

ఆ.వె.

కూలి రెల్ల రంతఁ తూలి యఱచిరి ఘో

రముగఁ దాడితు లయి ప్లవగ వీర

వరుల చేత నసుర వరులు దీనమ్ముగ

సంగరమున బాధి తాంగు లగుచు     

  1.  

 

 

 

తే.గీ.

అంత రాక్షస వీరు లా హరి వరేణ్యు

ల నిజ శూలాసి ముద్గర ప్రాస శక్తి

ముఖ మహాయుధమ్ముల తోడ మూరి యాజిఁ

గొట్టి పడవైచిరి పుడమి ఘోరముగను       

  1.  

 

 

 

కం.

పడవైచి రొకరి నొక్కరు

నెడఁదల నెంచి విజయమ్ము నెల్లరు తనువుల్

తడియంగ రక్త ధారలఁ

గడు వానర రాక్షసులు జగడమున నలుకన్       

  1.  

 

 

 

ఆ.వె.

గిరుల ఖడ్గముల విసర నపుడు హరి రా

క్షసులు చలము నూని వసుధ యొక్క

క్షణమున రుధిరమ్ము స్రవియింప శోణి తా

వృత మయి కనుపట్టె విరివిగాను       

  1.  

 

 

 

తే.గీ.

నేల యెల్ల నిండె నపుడు వ్రాలఁ బ్లవగ

మర్దితులు రాక్షసులు రణ మదులు పడిన

వారు పడుచున్న వారలు భగ్న శూలు

లంగములఁ జేసి రద్భుత మైన రణము    

  1.  

 

 

 

ఉ.

వానర కోటి వానరుల వారక కొట్టఁగ నైరృతర్షభుల్

మానక రాక్ష సావలిని మర్దన మాసుర కోటి చేతనే

వానరు లాజిఁ జేయఁగను వారక చేసిరి లాగి శస్త్రముల్

వానరులున్ శిలల్ గొనుచు భండన మాసురు లెల్ల నత్తఱిన్          

  1.  

 

 

 

ఆ.వె.

శైల శూల ఘోర శస్త్రమ్ములఁ బరస్ప

రమ్ము కొట్టుకొనిరి ప్లవగ రాక్ష

సప్రవరులు వీఁక క్షిప్రమ్ము సేసిరి

సింహనాదములు విశేషముగను      

  1.  

 

 

 

ఆ.వె.

ఛిన్న కవచ చర్మ సన్నత రాక్షసు

లాజిఁ గూలి రంత హరుల చేతఁ 

బాఱెను రుధిరమ్ము పాదప రస సార

సన్నిభమ్ము నచట మిన్నగాను

  1.  

 

 

 

తే.గీ.

కొంద ఱని వానరేంద్రులు కొట్టి రరద

ము నరదమ్ముచే వారణముఁ బెఱ వార

ణమ్ము చేత గుఱ్ఱమును గుఱ్ఱమ్ము చేత

బెట్టిదమ్ముగఁ జెలరేఁగి వీర వరులు   

  1.  

 

 

 

తే.గీ.

బల్లెముల నర్ధ చంద్రేద్ధ బాణములను

దల్లడిల్లక వానరేంద్ర చ్యుత తరు

శైల శృంగమ్ముల ఘన రాక్షస వరేణ్యు

లాజి ముక్కలు సేసిరి యడరి కరము         

  1.  

 

 

 

తే.గీ.

చెదర గిరులు వృక్షమ్ములు ఛిన్నము లయి

నిహత వాన రాసురులు ననేకు లుండ

వ్రాలి యెల్లెడల నపుడు నేల యయ్యె

దుర్గమం బెల్ల వారికిఁ దోరముగను    

  1.  

 

 

 

చం.

భయమును వీడి చల్పఁగను భండన మట్టు లదీన సత్వు లా

జయ యుత హర్ష దర్పితులు సంచిత ఘోర త రాయు ధాసు రా

లి యెదలఁ గంప మందఁగ స లీల జరింపఁగ నా ప్లవంగ సం

చయము ముదమ్ముతో నసుర సంతతి కూలుచు నుండ ధాత్రినిన్       

  1.  

 

 

 

తే.గీ.

దేవతలు మహర్షులు నా ముదావహ సమ

రమ్ముఁ గని నినదించిరి నెమ్మి నెల్ల

నంత మారుత నిభవేగ మశ్వమును న

రాంతకుం డెక్కి తూఱెను హరుల సేన    

  1.  

 

 

 

చం.

వెసఁ జని తీక్ష్ణ శక్తిఁ గొని వీరుఁడు మీనము వార్ధిఁ జొచ్చు రీ

తి సమద మా నరాంతకుఁడు ద్రెంచెఁ బ్లవంగుల నేడు వందలం 

బస క్షణ మందు ఘోరముగ వానర సైన్యముఁ గొట్టె వాసవా

రి సుడివడంగ నాజిని హరివ్రజ మెల్లను మిక్కుటమ్ముగన్           

  1.  

 

 

 

తే.గీ.

అశ్వ పృష్ఠమం దలరు నరాంతకుఁ గని

రపుడు విద్యాధరులును మహర్షులు చరి

యించు చుండ నతఁడు వానరేంద్రుల ఘన

సేన లోన విజృంభించి చిత్ర గతుల         

  1.  

 

 

 

కం.

అరయఁ బడు వారి మార్గము

గిరి నిభ దేహప్లవగ వికీర్ణము కాఁగం

బరగెను గాంచఁగ మాంస రు

ధిర కర్దమ సంకులపుఁ బృథివియై త్రుటిలో   

  1.  

 

 

 

ఆ.వె.

విక్రమింపఁగ హరి వీరవర్యులు మూరి  

యెంతు రాత్మ లందు నంత లోనఁ

దా నతిక్రమించి తద్ద నరాంతకుం

డడరి వారి నెల్ల నణఁచు చుండె

  1.  

 

 

 

ఉ.

వానర సేనఁ గాల్చె నట వహ్ని వనమ్ములఁ గాల్చు రీతినిన్

వానరు లెత్త శైలములఁ బాదప పంక్తినిఁ బ్రాసఁ గూల్చె వ

జ్రాన నశించి నట్టి ఘన శైల వరమ్ముల భంగి తిర్గుచుం

దా న ఖి లాశలం దనిలు దారిని వర్షపుఁ గాలమం దనిన్    

  1.  

 

 

 

తే.గీ.

పలుకఁ గదలంగ భీతిని నిలువఁ జాల

కుండిరి కపు లేరు నరాంతకుండు లేచి

న నిలిచిన వెడలిన నెల్లర నతి దారు

ణముగ బాధించు చుండె రణమ్ము నందు    

  1.  

 

 

 

కం.

ఒక్కనిచే రవి నిభుచే

నక్కపి సైన్యంబు ప్రాస నణఁగి పుడమిపై

నుక్కు చెడి కూలు చుండెను

వెక్కస మయి పల్వురకును వెలయ నొకండే     

  1.  

 

 

 

తే.గీ.

వజ్ర ఘాత సన్నిభ మైన ప్రాస పాత

మోర్వ లేకయె వానర పర్వ మెల్ల

భీతి నార్చెను దిక్కులు పిక్కటిల్ల

దుస్సహంపు స్వనమ్ములు దూలుచు నని    

  1.  

 

 

 

కం.

వెలిగెఁ బడెడు వానర వీ

రుల రూపము లశని భిన్న రుచి రాద్రి శిఖా

వలిఁ బోలి రణాంగణమున

వలీముఖులు పోరు చుండఁ బంతము తోడన్

  1.  

 

 

 

ఆ.వె.

కుంభకర్ణు చేత ఘోరముగ మును గూ

లిన ప్లవగ వరులును లేచి క్షేమ

మరసి చేరి వాన రాధిపు సుగ్రీవు

చెంత నిలిచి రెల్ల రంత నాజి   

  1.  

 

 

 

ఉ.

ఆ వల నా నరాంతక భయార్తిత వానర సేనఁ గాంచె సు

గ్రీవుఁడు వాఱ దిక్కులకు రేఁగ భయమ్ము కరమ్ము చూచి తా

నీ వలఁ గాంచెఁ బ్రాస కరు నింపుగ గుఱ్ఱముపై నరాంతకుం

జేవను వచ్చు చుండగను జెచ్చెఱ రాక్షస వీరుఁ గ్రుద్ధునిన్        

  1.  

 

 

 

ఆ.వె.

అంతట హరివీరు నంగదు శక్ర స

న్నిభ పరాక్రమునిఁ గని ఘన దేజుఁ

డిట్లనెఁ బ్లవగ పతి యీ యశ్వ వీరుఁడు

క్షోభ నొసఁగు చుండెఁ గోపిఁ గనుమ

  1.  

 

 

 

తే.గీ.

వీర వర్య యేఁగి యితని వేగ ప్రాణ

హీనుఁ జేయుమ నా విని వాన రేంద్రు

పల్కు లంగదుఁడు ఘనాభ వానర వర

సేన నుండి యెగిరెఁ జిత్రభాను భంగి        

  1.  

 

 

 

చం.

గిరి నిభుఁ డంగదుండు వెలిఁగెం గన కాంగదుఁ డద్రి సన్నిభం

బురుతర చిత్ర ధాతు చయ యుక్తము వానర కోటి నుత్తముం

డరయ నిరాయుధుండు స్వ నఖావలి దంష్ట్రవ రాయుధుండు దా

నరసి నరాంతకుం గదిసి యంత వచించెను వాలిజుం డిటుల్     

  1.  

 

 

 

చం.

పనివడి యేమి చేయుదువు పామర వానర కోటి రాక్షసా!

ఘనుఁడవు నిల్చి యిచ్చటను గ్రన్నన వజ్ర నిభంపుఁ బ్రాసముం 

నను గని నాదు వక్షమున నాఁటఁగఁ జేయుమ చూతు నీ  బల

మ్మన విని రేఁగ రోషము నరాంతకుఁ డోష్ఠము పండ్లు కొర్కుచున్

  1.  

 

 

 

.

ఆతఁడు నిశ్వసించి పర మాహి విధమ్ముగఁ జేరి యంగదుం

జేత గ్రహించి ప్రాసమును జెన్నుగ వెల్గెడు దాని వైవఁగా

నాతత వక్ష మందుఁ బడ నయ్యది తాఁకఁగ వజ్ర కల్పముం

బాతిత మయ్యె భూమి పయి భగ్నము గా నట హర్యురమ్మునన్

  1.  

 

 

 

తే.గీ.

కని గరుడి చేతఁ గొట్టఁ బడిన ఫణీంద్రుఁ

బోలు బల మున్న ప్రాసయె పుడమిఁ బడఁగ

విఱిఁగి యఱచేయి వడి యెత్తి వీరుఁ డంగ

దుండు కొట్టెఁ బగుల వాని తురగ శిరము     

  1.  

 

 

 

ఆ.వె.

విఱుఁగ దౌడ యింక వెలికి రాఁ గనుగుడ్లు

తలయుఁ బగులఁగఁ దల తాడనమున

నాలుక వెడలంగ నగ నిభ తురగమ్ము

సోలి సత్వరమ్ము నేలఁ గూలె  

  1.  

 

 

 

కం.

కినిసి కని హత నిజాశ్వ

మ్ము నరాంతకుఁ డెత్తి ఘోర ముష్టిని వెసఁ గొ

ట్టెను ఘోరమ్ముగ వాలి సు

తుని మూర్ధమ్మున ఘనుండు దోర్బల మందున్     

  1.  

 

 

 

తే.గీ.

సడల పిడికిలి దెబ్బకు వడిఁ దన తల

కాఱ నుష్ణంపు రుధిరమ్ము కపివరుఁడు చ

లించి పల్మఱు మోహము కొంచె మంది

తెలివి నంది విస్మితుఁడునై చెలఁగి యంత   

  1.  

 

 

 

కం.

గిరి శృంగ తుల్య ముష్టిని

గురు మృత్యు సమాన వేగిఁ గొట్టె నురమునన్

హరి వరుఁ డంగదుఁ డంతన్

నరాంతకుని ఘోర రీతి నర భోజనునిన్    

  1.  

 

 

 

ఉ.

కూలెను ముష్టి ఘాతమున ఘోర నరాంతకుఁ డంత భూమిపై

జ్వాలల నోటఁ గ్రక్కుచును స్రావము కా రుధిరమ్ము స్వీయ గా

త్రాలిని వజ్ర ఘాతమున వ్రాలిన శైలము భంగి దోఁపఁగా

మేలుగ నంత రిక్షమున మేటి దివౌకసు లార్వ వానరుల్     

  1.  

 

 

 

కం.

చేసెను దుష్కర కర్మము

వాసిగ రాఘవున కీయఁ బర మానందం

బా సమయమ్మున నంగదుఁ

డే సమ రోత్సాహి యయ్యె నింపుగ మరలన్

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నఱువది తొమ్మిదవ  సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 70.

 

 

 

నరాంతకుని మరణము వీక్షించి మహోగ్రులై ఘోరముగ యుద్ధము సేసి యనేక వానరులను జంపి త్రిమూర్ధ దేవాంతకులు హనుమంతుని చేత మహోదరుఁడు నీలుని చేత మహాపార్శ్వుఁడు ఋషభుని చేత వధింపఁ బడుట.

 

 

 

 

కం.

కని యనుజు నరాంతకుని మృ

తి నసుర వర్యులు త్రిమూర్ధ దేవాంతకు లం

త నఱచి రనిఁ బౌలస్త్యుఁ డ

గు నా మహోదరునిఁ గూడి ఘోరార్తులునై    

  1.  

 

 

 

ఉ.

అంత మహోదరుం డలుక నభ్ర నికాశ గజేంద్ర మెక్కి ధీ

మంతుని వాలి నందనుని మార్కొనఁ బర్విడె విక్రముండు దే

వాంతకుఁ డుర్కె భ్రాతృ మర ణార్తిని నంగదు దిక్కు సంజ్వర

స్వాంతుఁడు దీప్తపుం బరిఘఁ బాణిఁ ధరించి మహోగ్రుఁ డుద్ధతిన్   

  1.  

 

 

 

తే.గీ.

రథము నాదిత్య తేజోవిరాజితమ్ముఁ  

బరమ వాజి యుక్తమ్ముఁ ద్రిశిరసుఁ డెక్కి

రాక్ష సాగ్రగణ్యుం డుగ్రుఁ డాక్షణమున

నంగదు దెస కుఱికె ఘోర సంగరమున     

  1.  

 

 

 

కం.

కని యా మువ్వుర నైరృతు

లను సుర దర్పఘ్నుల బెదరక సుంతైనన్

ఘన విట పావృత పాదప

ము నంగదుండు వెకలించి బోరన నంతన్

  1.  

 

 

 

తే.గీ.

విసరె దేవాంతకుని పయి వీరుఁ డంగ

దుండు వృక్షమ్ము ఘన శాఖ లుండ నంత

వాలి సుతుఁడు దీప్తాశనిఁ గేళి లీల

శక్రుఁడు విసరిన పగిది సంభ్రమించి    

  1.  

 

 

 

చం.

అరసి నగమ్ము నా త్రిశిరుఁ డంతట సర్పనిభాంబకమ్ములం

బరఁగఁగఁ జేసె ముక్కలుగ భగ్న నగమ్మును వీరుఁ డంగదుం

డరసి కురించె గెంతి వడి నక్షయ పాదప శైల వర్షమున్  

శరములఁ ద్రుంచె వానిఁ గసి శౌర్యమునం ద్రిశిరుండు వేగియై

  1.  

 

 

 

ఆ.వె.

పాదపములఁ ద్రుంచెఁ బరిఘాగ్రమున మహో

దరుఁడు సాయకములు విరివిగఁ గురి

యించుచుఁ బరువెత్తె మించి త్రిశిరసుఁ డం

గదుని దెసకు నలిగి కర మసురుఁడు

  1.  

 

 

 

కం.

కరిపై నేఁగి మహోదరుఁ

డరి నా వాలి తనయుని మహా కపిఁ గొట్టెన్

గురుతర వజ్ర సదృశ తో

మరమ్మున నురమ్మునం దమర్షం బెసఁగన్     

  1.  

 

 

 

కం.

దేవాంతకుఁడు పరిఘతో

నా వాలి కుమారుఁ గదిసి యడిచి భృశముగన్ 

వేవేగ మరలె నంగదుఁ

డా వీరులు మువ్వు రెదుర నడలఁడు మదిలో     

  1.  

 

 

 

తే.గీ.

పెంచి వేగవంతుఁడు నిజ వేగ మంత

దుర్జయుం డంగదుఁడు తనదు కరతలము

నెత్తి కొట్టె దేవాంతకు నిభ వరంపు

శిరము పైనను బర్వెత్తి శీఘ్రముగను       

  1.  

 

 

 

కం.

హరివరుఁ డంగదుఁ డడిచినఁ 

గరి రాజు కనులు ధరపయిఁ గ్రన్ననఁ గూలం

గ రణమున వారణం బఱ

చి రివ్వునఁ బడెం బుడమినిఁ జేతన మణఁగన్    

  1.  

 

 

 

కం.

కరి హస్తము లాగి బలుఁడు

వర వాలి సుతుండు వేగ బాఁదెను గినుకం

బరువిడి దేవాంతకుని స

మర తలమున బెట్టిదముగ మనుజాశనునిన్       

  1.  

 

 

 

ఉ.

అంత నతండు విహ్వలుఁడునై యనిలమ్మునఁ దూఁగు వృక్షమున్

వింతగఁ బోలి రక్తమును వీరుఁడు లత్తుక రంగు నుండ దే

వాంతకుఁ డోడి కార్చెఁ గడు నత్యధికం బగు యత్నమూని తా

నంతటఁ దేఱి యంగదుని నా పరిఘం గొని కొట్టె బల్మినిన్   

  1.  

 

 

 

కం.

కూలెను మోకా ళ్లానఁగ

నేలఁ బరిఘము తగుల భృశ నిష్ఠుర గతినిన్

వాలి కుమారుండు తిరిగి

వే లేచి యెగిరెను బయికి వీరుం డంతన్

  1.  

 

 

 

ఉ.

చూచి కపీంద్రునిం ద్రిశిరసుం డెగురంగ నజిహ్మగమ్ములం  

జాచి ధనుస్సు ముమ్ములికిఁ జక్కఁగ వేసె లలాట లక్ష్యుఁడై

వేచిన నట్లు మువ్వురును వీరుని నంగదు నాంజనేయుఁడుం

జూచి ఘనుండు నీలుఁడును శూరులు చేరిరి వారి మార్కొనన్   

  1.  

 

 

 

చం.

విసరెను నీలుఁ డద్రి శిఖ భీమము నంతఁ ద్రిమూర్ధుపై వెసన్

విసరఁగ బాణ పంక్తులను భిన్నము సేయఁగ దాని వేగ రా

క్షసపతి సూనుఁ డగ్నికణ జాలములం బడె ధాత్రి నంత సం

తసమున నిర్జరాంతకుఁడు తత్పరిఘం గొని కాంచి మారుతిన్    

  1.  

 

 

 

కం.

దేవాంతకుఁ డుర్క నరసి

యా వచ్చెడు నసురుని ననిలాత్మజుఁ డంతన్ 

వేవేగ యుఱికి కొట్టె మ

హా వజ్ర నికాశ ముష్టి నాతని తలపై

  1.  

 

 

 

కం.

శిరమునఁ గొట్టి మహా బల

హరిప్రవీరుండు మారుతాత్మజుఁ డసురున్

గురుతర నాదమ్మున దు

ర్భర గతిఁ గంపింపఁ జేసె రాక్షస కోటిన్

  1.  

 

 

 

కం.

తల ముక్కలు గా ముష్టినిఁ

బలువరుస కనులును రాల వసుధన్ రసయున్

వెలువడ రాక్షస సూనుం

డిల దేవాంతకుఁడు గూలె నేఁగఁగ నసువుల్

  1.  

 

 

 

తే.గీ.

ఉర్వి రాక్షస యోధ ముఖ్యుండు    గూల

నాజి నిర్జర గణ రిపుం డరసి యా త్రి

మూర్ధుఁ డుగ్రుండునై కిన్క మూర నీలు

వక్ష మందుఁ గురిసె నంప వాన నంత

  1.  

 

 

 

చం.

కినిసి మహోదరుండు దమకించి నగాభము కుంజరమ్ము పై

న నగ వరమ్ము మందరమునన్ రవి చందము వెల్గి బాణ పం

క్తిని హరి నీలు వక్షమున దిట్టముగాఁ గురియించెఁ గొండ పై

నను సబలారి చాపము ఘనమ్ము నిభమ్ము తటిత్తు తోడుతన్

  1.  

 

 

 

తే.గీ.

ఆ శరప్రవాహము చేత నార్తిఁ జెంద

నంగములు గపి సేనాని హరి వరుండు

స్తంభితుం డయ్యె నమ్మహోదరుని వలన

బల్లిదుని చేష్టితమ్మునఁ దల్లడిల్లి

  1.  

 

 

 

కం.

హరి పాలుఁ డంది సంజ్ఞను

గిరిని స తరుషండ మెత్తి కేళీ లీలన్

శిరము పయిఁ గొట్టెను మహో

దరు నసురుని నీలుఁ డడరి తద్ద బలమునన్

  1.  

 

 

 

కం.

గిరి పాత భగ్నుఁడై నిజ

కరి మర్దనుఁడై పుడమిని గతజీవి మహో

దరుఁడు వెసం గూలెన్  గిరి

వరమ్ము వజ్రమ్ము చేతఁ బడు చందమునన్    

  1.  

 

 

 

చం.

కని పిన తండ్రిఁ జంపుటను గయ్యమునం ద్రిశిరుండు కార్ముక

మ్మును గొని మారుతాత్మజుని మూరఁగఁ గోపము తీక్ష్ణ బాణ పం

క్తి నిగుడఁ జేసి కొట్టఁగను దిట్టపుఁ గొండ కొనన్ గ్రహించి వై

చెను హనుమంతుఁ డా శిఖను జీల్చె శరమ్ముల నా త్రిమూర్ధుఁడే        

  1.  

 

 

 

ఉ.

శృంగము రిత్త వోవఁ గపి శేఖరుఁ డంత ద్రుమంపు వర్షమున్

భంగ విహీన మా హనుమ పర్పఁగ రావణ సూను పైన నా

నింగిని వృక్ష వర్షమును నెట్టన వచ్చెడు దానిఁ గాంచి ఘో

రాంగుఁడు ద్రుంచి యార్చె నిశి తాంబక వృష్టిఁ ద్రిమూర్ధుఁ డుగ్రుఁడై

  1.  

 

 

 

తే.గీ.

ఎగిరి హనుమంతుఁ డసురు తురగముఁ గృద్ధుఁ

డై నఖములతోఁ జీల్చె సింహమ్ము కరిని

భంగి నంతఁ ద్రిశిరసుండు పన్నుగఁ గొని

శక్తి హనుమ పై వైచెను శమను పగిది

  1.  

 

 

 

కం.

దివి నుండి వచ్చు నా యు

ల్క వలె నడరు శక్తినిఁ దగులక మున్న మహా

ప్లవగుం డా హనుమంతుం

డు విఱిచి యంత నఱచెం గఠోరముగ వెసన్   

  1.  

 

 

 

కం.

వీక్షించి భగ్న శక్తిని

నక్షయ మగు హర్ష మంది హరివరులు భృశం

బా క్షణమున నినదించిరి

రక్షో గణము వగవఁగ జలద నిభ మాజిన్

  1.  

 

 

 

చం.

త్రిశిరసుఁ డెత్తి ఖడ్గమును రేయిచరుండు రణాంతరమ్మునన్

భృశముగఁ గొట్టె వాయు సుతు భీమ తరోరము నందుఁ గొట్ట నా

యశని నికాశ ఘాతమున కంతఁ జలింపక వాయుసూనుఁ డా

త్రిశిరునిఁ గొట్టె వక్షమున ధీరుఁడు హస్త తలమ్ముచే వెసన్     

  1.  

 

 

 

తే.గీ.

ఆయుధము జాఱ మారుతి హస్త తల వి

ఘాతమున నా త్రిమూర్ధుఁడు వీత సంజ్ఞఁ

గూలె నేలఁ బడిన కత్తిఁ గొని మహాక

పి హనుమ యఱచె నసురులు భీతిలంగ    

  1.  

 

 

 

ఆ.వె.

సైప నోపక ధ్వని నా పడ్డ త్రిశిరుండు

లేచి కొట్టె ముష్టి రేఁగఁ గినుక

యనిల సుతుని ఘాతమునకు నలిగి కిరీ

టమున నసురు నయ్యనుమఁడు  పట్టి

  1.  

 

 

 

తే.గీ.

అసురు శిరముల మూటినిఁ బసిడి మకుట

ముల సకుండలముల శితపు టసి చేతఁ

గినిసి భేదించె మారుతి ఘనునిఁ ద్వష్ట

సూను శక్రుఁడు  ఖండించు చొప్పు దోఁప   

  1.  

 

 

 

తే.గీ.

దీప్త వహ్ని నిభాక్షుల దీర్ఘతమ ని

జేంద్రియములఁ ద్రిశిరు తల లిలను మూడు

వడెను భాస్కరాధ్వము నుండి పడెడు తార

లనఁగ భూ తలమ్మున నంత నక్కజముగ

  1.  

 

 

 

తే.గీ.

దేవ శత్రువు మరణింపఁ ద్రిశిరసుండు

హనుమ విక్రమమున నాజి హరులు ముదము

న నఱచిరి భూమి చలియించె నైరృత వరు

లెల్లఁ బాఱి రెల్లెడలను దల్లడిల్లి

  1.  

 

 

 

తే.గీ.

త్రిశిరసు మఱి మహోదరు ధీర వరుల

యంత మింక దుర్జయులు దేవాంతకుఁడు న

రాంతకుఁడు మరణింపఁగ నరసి రణము

నందు మత్తుఁడు కోపించి యసుర వరుఁడు     

  1.  

 

 

 

మ.

కొని జ్వాలావృత దీప్త ఘోర గద నాక్రుద్ధుండు సర్వాయస

మ్మును జాంబూనద పట్ట సంవృతము సంపూర్ణాస్ర ఫేనామిష

మ్మును దీప్తాంగము శత్రు శోణిత మయమ్మున్ రక్త మాలావృత

మ్మును నైరావత సార్వభౌమ భయదమ్మున్ భీత పద్మేభమున్

  1.  

 

 

 

తే.గీ.

అలిగి శుభము తేజో జ్వలితాగ్ర మసుర

వరుఁడు పట్టి మహాపార్శ్వుఁడు రణ కామి

హరుల మార్కొనఁ బర్విడె నయ్యుగాంత

వహ్ని భంగి మండుచు భయావహముగ నని    

  1.  

 

 

 

తే.గీ.

ఋషభుఁ డెగిరి వేగమ వానరేంద్రుఁ డడరి 

రాక్షసవరు మత్తానీకు రణము నందుఁ 

గాంచి దుమికి సమీపించి యంచితముగ

నంత వెస రావణానుజు చెంత నిలిచె   

  1.  

 

 

 

చం.

నిలువఁగ వానరోత్తముఁడు నిర్భయ మాత్మ సమీప మందుఁ బే

రలుకను గొట్ట వక్షమున నాసురుఁ డా గద తోడ వజ్ర క

ల్ప లస దమోఘ దండమున వానర వర్యుఁడు  భిన్నవక్షుఁడై

చలిత తనుండు కార్చెను వెసం గడు రక్తము వీత సంజ్ఞుఁడై

  1.  

 

 

 

చం.

తెలివి వహించి వానరుఁడు దీర్ఘత రావసరమ్మునం దగం

గలఁగి చలింప నోష్ఠములు గాంచెను మత్తుని వేగ వంతుఁడై

యలిగి సమీప మేఁగి  యసురాధముఁ గొట్టెను స్వీయ ముష్టితో

బలముగ శైల సన్నిభుఁడు వక్షమునన్ ఋష భాఖ్యుఁ డుగ్రుఁడై    

  1.  

 

 

 

తే.గీ.

అంత వేరు తెగిన వృక్ష మనఁగ నసుర 

నేలపై రక్త సిక్తుఁడు గూలఁ గాంచి

వాని గద యమ దండము వంటి దాని

వేగ కైకొని వానర వీరుఁ డార్చె   

  1.  

 

 

 

ఆ.వె.

పడి మృతు వలెఁ గొంత తడవు తేఱి సురారి

సందె నందు మబ్బు సరణి దేహి

వారి రాజ సూను వానర వర్యునిఁ 

గొట్టె బల్లిదుండు ఘోరముగను   

  1.  

 

 

 

తే.గీ.

మూర్ఛిలి పుడమిఁ గూలి యపుడు ముహూర్త

మందు లేచి సంజ్ఞ వడసి హరి వరుండు

రక్కసుని యద్రి కల్పఘోర గద వెస గ్ర

హించి వైచి కొట్టెను రాక్షసేంద్రు నంత

  1.  

 

 

 

ఆ.వె.

యజ్ఞ దేవ భూసు రారి రౌద్రు ఘన దే

హమ్ముఁ గదిసి యంత నా గద యుర

ముఁ బగులంగఁ జేయ నపుడు కాఱెను రక్త

మద్రి ధాతు నీర మగపడు గతి

  1.  

 

 

 

ఆ.వె.

వజ్ర నిహత నగము భంగిఁ బుడమిఁ గూల

తనదు గద నసువులు సనఁగ రాక్ష

సుండు పాఱి రంత సుర రిపు లెల్లరు

బీతి రేఁగ వారి కాతతముగ     

  1.  

 

 

 

తే.గీ.

రావ ణానుజుఁ డట్లు మరణము నంద

నర్ణ వాభ రాక్షస సేన యాయుధములు

వీడి కేవలమ్ము బ్రతుక వీత పార

వనధి నిభముగఁ బాఱెను వంత తోడ     

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు డెబ్బదవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 71.

 

 

 

తన సోదరులు, పినతండ్రు లిద్దఱు యుద్ధమున మరణించుటఁ గాంచి కోపమున రావ ణాత్మజుఁ  డతికాయుఁడు సమరమునఁ బ్రవేశించి వానర యోధులు విసరిన శైల వృక్షముల నెల్లఁ ద్రుటి  భగ్నము గావించి రాముని వైపునకు నుగ్రుఁడై దూసుకొని వచ్చుచుండ లక్ష్మణుఁడు వీక్షించి మహోగ్రుఁడై వానితో ఘోర యుద్ధ మొనరించి చివరకు వధించుట.

 

 

 

 

చం.

తుములము రోమ హర్షణము తోరము వ్యాకుల మైన స్వీయ సై

న్యముఁ గని శక్ర విక్రములు నాత్మ సహోదరు లాజిఁ గూలఁగాఁ 

దమ పినతండ్రు లిర్వురును దండ్రికి భ్రాతలు గూలఁ జేసి యు

ద్ధము నతికాయుఁ డంత సుర దానవ దర్ప నిహంత యుగ్రుఁడై     

  1.  

 

 

 

కం.

ఘన తేజస్వి  విధాతృ వ

ర నైరృతుఁడు వేయి సూర్యుల గణము వలె వె

ల్గు నరదము నెక్కి శక్రా

రి నగచరుల మార్కొనఁ జెలరేఁగి పరువిడెన్         

  1.  

 

 

 

చం.

ధనువును మృష్ట కుండలుఁడు తద్ద బలుండు కిరీటి యంతఁ గే

లను భయదమ్ముగాఁ జఱచి రాక్షసుఁ డాత్మ వరాఖ్యఁ బల్కుచున్

ఘనుఁ డని నార్చి భీమముగఁ గాఱియపెట్టెను జ్యా రవమ్ము చే

తను నిజ సింహనాదమునఁ దద్దయుఁ బేరున వాన రాలినిన్   

  1.  

 

 

 

ఆ.వె.

కాంచి వాని హరులు ఘన కాయ మాహాత్మ్య

మును భయార్తులు నయి మనము లందు

నెంచి కుంభకర్ణుఁ డేతెంచె లేచి య

ని కదిసి రొకరి నొకరు కడు భీతి     

  1.  

 

 

 

తే.గీ.

విష్ణునిఁ ద్రివిక్రమునిఁ బోలు వీరు రూప

మారసి భయము తోడుత హరి వరు లటు

నిటు పరువులిడఁగ నితరు లేఁగి వెస శ

రణ్యు లక్ష్మణాగ్రజుని శరణ మడిగిరి 

  1.  

 

 

 

మ.

కని యచ్చో నతికాయు దూరమున నా కాకుత్స్థుఁ  డద్ర్యాభునిన్

నినదింపన్ ఘన సన్నిభం బసురునిన్ నీరేజ పత్రాక్షుఁ డం

త ని జానీకము నూఱడించి తగ స్వాంతం బందు నాశ్చర్యమే

తనరం బల్కె విభీషణుం గని మహా ధానుష్కుఁ డీ రీతినిన్     

  1.  

 

 

 

ఉ.

ఎవ్వఁడు శైల సన్నిభుఁడు నీతఁడు ధన్వి హరీక్షణుండునున్

నివ్వెఱ వేయి గుఱ్ఱముల నిక్కెడు స్యందన రాజ మందుఁ దా 

నవ్వర శూల ముద్గరము లంశుమ దాయుధ కోటి ప్రాసమున్

నివ్వటిలంగఁ దోమరము నిల్చె సభూత మహేశు భంగినిన్       

  1.  

 

 

 

కం.

మృత్యువు నాలుకఁ బోలుచు

నత్యధికము రథము నందు నమరగ శక్తుల్

ప్రత్యయ శంపాభ్రము వలె

సత్యముగ వెలుంగు చుండె స్యందన మందున్   

  1.  

 

 

 

ఆ.వె.

సిద్ధ చాపములు పసిడి పృష్ఠములఁ బ్రకా

శించు చుండఁగ వెలిఁగించు చున్న 

వతని స్యందనమును వితతముగను నింగి

నింద్ర చాపము వెలిఁగించు పగిది    

  1.  

 

 

 

తే.గీ.

అసుర శార్దూలుఁడు రథికు లందు మేటి

దినకర ప్రభల నడరు తేరున నరు

దెంచు చుండె రాహు ధ్వజుఁ డంచిత రవి

కిరణ నిభ శరముల వెలిఁగించి దిశల

  1.  

 

 

 

కం.

ఘన నిభ సన్నాద మసుర

ఘనుండు మువ్వంపు విల్లు కమనీయమునుం  

గనక విభూషిత మూనఁగఁ

గనిపించెను శక్ర ధనువు కరణి వెలుఁగుచున్

  1.  

 

 

 

కం.

టెక్కెమ్ము కోడిపీఁటయు

టెక్కెపుఁ గంబం బడరఁ గడింది రథమునం

బిక్కటిల ఘన నిభ రవం 

బెక్కిరి సారథులు నల్వు రింపుగఁ గనుమా     

  1.  

 

 

 

తే.గీ.

వెలయు చున్న విరువది యమ్ముల పొదు లర

దమ్ము నందు ఘోరపుఁ గార్ముకమ్ములు పది

పసిడి వర్ణపు నారులు పరఁగు చున్న

వెనిమిది యరయ నచ్చట నిద్ధ చరిత!    

  1.  

 

 

 

ఆ.వె.

నలు కయి పొడువు పిడి గలిగి యుండఁగఁ బ్రక్క

లింపుగ వెలుగంగ నింకఁ దెల్ల

ముగను బది కరముల పొడువుతోఁ గత్తుల

జత రథమ్ము నందు సరస నమరె         

  1.  

 

 

 

సీ.

మెడలోన నింపుగ మెఱయ నెఱ్ఱని త్రాడు నల్లని మేనున నుల్లసిల్లి

కాలుని భంగి వక్త్ర మడర మేఘమ్ము నందున్న నాదిత్యు చందమునను

బసిడి యంగదముల బాహు యుగ్మ మడర నెత్తైన కొన లున్న హిమగిరి వలె

శోభిల్లి యాస్యము సురుచిర కుండలద్వయముతోఁ జెలరేఁగి తద్ద వెలుఁగ    

 

తే.గీ.

శైల నిభుఁడు పునర్వసు చంద్రు సరణి

వెలుఁగు వాఁ డరుదెంచెను వీరుఁ డితఁ డె

వం డెవనిఁ గని హరు లెల్లఁ బాఱి రడలి 

చెప్పుమ  మహాభుజ! యసుర శ్రేష్ఠు గుఱిచి     

  1.  

 

 

 

తే.గీ.

అడుగ రాజ పుత్రుఁడు రాముఁ డమిత తేజుఁ

డట్లు తేజస్వి రామున కంత నవ్వి

భీషణుం డెఱిగించెను  వీరుని యతి

కాయుని గుఱించి విశదముగ నిటు లపుడు       

  1.  

 

 

 

చం.

పనులను రాక్ష సాధిపుఁడు వైశ్రవ ణానుజుఁ డుత్సహించు నా

తని తనయుండు సన్నిభుఁడు తండ్రికి సంగర మందు వృద్ధ సే

వి నిరత మస్త్ర కోవిదుఁడు వీర వరుం డతి కాయ నాముఁ డి

ద్ధ నిగమ ధారి సంతతము తద్దశ వక్త్రునిఁ గొల్చుఁ బ్రీతిమై      

  1.  

 

 

 

చం.

వినుతుఁడు ఖడ్గ విద్యలను వింటిని నాగ తురంగ చాలన

మ్మున మఱి సామ భేదముల మూరును దాన నయమ్ము లందు నీ

తని ఘన బాహు వీర్యమునఁ దద్ద సుఖమ్ముగ నుండు లంకలో

జన తతి ధాన్యమాలినికి సంభవ మందె నితండు రాఘవా!    

  1.  

 

 

 

కం.

సేవించి బ్రహ్మను బడసె

నీ వీరుం డస్త్ర రాజి నింపుగ రిపు సే

నా వీరుల సమరమ్మునఁ

దా వధియించెను జెలంగి ధ్యాన విమలుఁడై    

  1.  

 

 

 

ఆ.వె.

బ్రహ్మచేఁ బడసె నవధ్యత్వము సు రాసు

రుల వలన మహాసురుండు కవచ

మింక నీ యరదము నిన నిభము వెలుంగు

దాని నతఁడు ఘోర తపము వలన     

  1.  

 

 

 

కం.

సురలును దానవులు నశిం

చి రాజి వందల కొలంది చిక్కి యితనికిన్

వర యక్షులు నశియించి ర 

లరుచున్  రక్షింపఁ బడిరి రాక్షసు లెల్లన్

  1.  

 

 

 

ఉ.

ధీమతి యింద్రు వజ్రమును ధీరత నెవ్వఁడు సేసె వ్యర్థ ము

ద్దాముని ఘోరపాశమును దారుణ రీతినిఁ గొట్టెఁ గోలలన్

రామ! దశాస్య నందనుఁడు వ్రాలె నతం డతి కాయుఁ డుగ్రుఁడై

యీ మనుజాశనర్షభుఁ డహీనుఁడు నిర్జర దానవఘ్నుఁడున్      

  1.  

 

 

 

ఆ.వె.

యత్నము నొనరింపుమా నరపుంగవ!

క్షిప్ర మతని నాపఁ జెన్నుగ నని

వానర వర బలము దా నమ్ముల నశింపఁ

జేయక మును వారి జాయ తాక్ష!     

  1.  

 

 

 

కం.

అంత నతికాయుఁ డతి బల

వంతుఁడు సొచ్చి హరిసేనఁ బన్నుగ నా ధీ

మంతుండు సఱచి ధనువుం 

బంతమున నఱచెఁ జెలంగి పలుమఱు లాజిన్         

  1.  

 

 

 

చం.

అరదము నందు భీకర మహాంగుని నా రథికప్రవీరునిన్

హరి వరు లమ్మహాత్ము లని నారసి వానర మంత్రు లత్తఱిన్ 

శరభుఁడు నీల మైందులును సత్వర మా ద్వివిదుండు నింకనున్

హరి వరుఁ డైన నా కుముదుఁ డాసురు మార్కొన నుర్కి యంతటన్       

  1.  

 

 

 

ఉ.

పాదప పర్వ తాగ్రములు వైవఁగ నయ్యతికాయుఁ దాఁకఁగాఁ

దా దరి రాక మున్నఁ గని తత్క్షణ మభ్ర వృ తాంబకమ్ములన్

వే ధృతిఁ ద్రుంచె నస్త్ర చయ వేత్తల మేటి వరిష్ఠ తేజుఁడున్

వేదన పాలుచేసెఁ గపి వీరుల నాయస బాణ పంక్తులన్

  1.  

 

 

 

ఆ.వె.

శరచ యార్దితు లయి శాఖామృగులు భిన్న

గాత్రు లాజిని నతికాయుని నెది

రింపఁ జాల రైరి కంపించి రెల్లరు

నయ్యసురుని ధాటి నాఁప లేక    

  1.  

 

 

 

తే.గీ.

యౌవన మదమ్మునఁ జెలఁగి యయ్యసుర వ

రుండు భయపెట్టె నవ్వానరుల బలమ్ముఁ 

గ్రుద్ధుఁ డయి భృశమ్ముగ నాజి ఘోరముగను

సింహము మృగయూధమ్మును జేయు పగిది        

  1.  

 

 

 

ఉ.

కొట్టక యుద్ధ దూరులను గొంచెము నైనఁ బ్లవంగ వీరులన్

నెట్టన నేఁగి రాముని మనీషి సమీపము రాక్షసావలిన్  

దిట్ట స చాప తూణముల ధీరుఁడు వల్కెను దర్ప వాక్కు ల

ప్పట్టున నిట్లు రాఘవుని పార్థ వరేణ్యునితో మదమ్మునన్    

  1.  

 

 

 

చం.

నిలిచితి  బాణ చాపముల నే నరదమ్మున రాఘవేంద్ర! నేఁ

గలఁబడి చేయఁ బ్రాకృతులఁ గయ్యము నెన్నఁడు నుత్సహించుచుం

గలహ మొసంగు యుద్ధ మొసఁగం దగు శక్తియె చాలినంతగాఁ  

గలిగిన వాఁడు నేఁ డడరి క్రన్నన నాకుఁ బరాక్రమమ్మునన్   

  1.  

 

 

 

కం.

విని వాని వాక్యములు కి

న్క నూని సౌమిత్రి రిపు వినాశకుఁడు సహిం

ప నశక్తుండై లేచి వె

స నగుచు నిల్చెను గ్రహించి చాప వరమ్మున్      

  1.  

 

 

 

చం.

తడయక యంత నమ్ములపొదం గల బాణము వేగ లాగి వీ

రుఁ డడరి లక్ష్మణుం డెడఁద రోషము మీఱఁగ సంభ్రమించుచున్ 

వడి నతికాయు ముందు నిలువం జని జ్యా ధ్వని సేసి నింపె నా

కడలిని భూ నభో దిశలఁ గ్రన్ననఁ ద్రాసము నంద రక్కసుల్   

  1.  

 

 

 

కం.

అసురాధి పాత్మజుఁడు భయ

పు సుమిత్రా తనయు చాపపు మహా ధ్వని న

ల్దెస నాక్రమింప విని వె

క్కసముగ విస్మయము నందె ఘన వీర్యుఁ డెదన్   

  1.  

 

 

 

కం.

అతికాయుం డత్యంత కు

పితుఁ డయి యుత్థితుని మనుజ వీర వరేణ్యున్

వితత బలు లక్ష్మణుఁ గని ని

శిత బాణమ్మును గ్రహించి చేరి యిటు లనెన్      

  1.  

 

 

 

కం.

బాలుఁడవే విక్రమమున

మేలుగ నేర్పరివి కావు మేటి బలుని న

న్నేల యెదిరింప నెంచెదు

కాల సదృశు లక్ష్మణ! వెసఁ గదలి వెడలుమా   

  1.  

 

 

 

ఆ.వె.

నాదు కర విముక్త నారాచముల వేగ

మును సహింప నోపరు నగవర మ

గు హిమవంతుఁ డైన మహి యైనఁ దోరంపు

గగన మైన నిక్కముగను వింటె      

  1.  

 

 

 

ఉ.

ఏలను మేలుకొల్పఁ దమకింతు సుషుప్తపుఁ గాల వహ్నినిన్

బాలక! వీడు చాపమును బ్రాణము లిచ్చట మన్నిమిత్తమై

కూలఁగ నీకు లేక నిలు కోరనిచో వెనుదిర్గుటం బసం 

దూలఁగ నీదు ప్రాణములు తూర్ణమ యేఁగెదు కాలు నింటికిన్          

  1.  

 

 

 

చం.

కను మిట నాదు తీక్ష్ణతర కాండములన్ రిపు దర్పహంతలం

ద్రినయను మార్గ ణాభములఁ గృత్స్నము కాంచన భూషితమ్ములన్   

విను మివి సర్ప తుల్యములు వేగమ త్రాగును నీదు రక్తమున్

వని మృగరాజు దూఁకి మదవారణ రక్తము త్రాగు రీతినిన్   

  1.  

 

 

 

ఆ.వె.

పలికి యిట్లు వింటి బాణము సంధించి

న యతికాయుని వచనముల నాల

కించి దర్ప రోష సంచితములను సౌ

మిత్రి కినిసి పలికె మేటి గిరలు    

  1.  

 

 

 

ఉ.

వాఁగినఁ గారు సజ్జనులు వాక్యము లీయ విలన్ మహత్త్వమున్

బాగుగ నూని బాణములు పాఱక ధన్విని మించి నిల్చితిన్

వేగమ చూపు నీ బలము వీరుఁడ వైన దురాత్మ పోరునన్

వాఁగఁగ నీ వనర్హుఁడవు పన్నుగఁ గర్మము లందుఁ జూపుమా   

  1.  

 

 

 

తే.గీ.

పౌరుషము కల్గి యున్ననె శూరుఁ డందు

రాయుధములతో ధన్వివి యరద మందు

నుంటివి పరాక్రమముఁ జూపు వింటె శరము

ల నయిన వరాస్త్రముల నైన రాక్షసేంద్ర!          

  1.  

 

 

 

తే.గీ.

నీ శిరమును నిశిత శర నిచయము నిటఁ 

బఱిపి పడవైతు వెస నేల పైన నేను

గాల సంపక్వ మైనట్టి తాళ ఫలము

గాలి శీఘ్రమ పడవైచు కరణి దోఁప     

  1.  

 

 

 

కం.

శరము లవి దప్త కాంచన

వర భూషితములు మదీయ పాణిచ్యుతముల్

శర శల్యమ్ముల నీదు రు

ధిరము నలరి త్రాగఁ గలవు తృప్తి నొసంగన్   

  1.  

 

 

 

తే.గీ.

బాలుఁ డీతఁ డనుచుఁ గించపఱుపఁ దగదు

బాలుఁడో వృద్ధుఁడో మృత్యు భంగి నన్ను

నాజి నెఱుఁగుమ బాలుండు నైన విష్ణు

వాక్ర మింపఁడె లోకత్రయమ్ము మూటి    

  1.  

 

 

 

కం.

విని లక్ష్మణు వచనమ్ములు

ఘనార్థ వంతమ్ము లుచిత కారణ యుతముల్

కినిసి యతికాయుఁ డంతం

గొనె నత్యుత్తమము తీక్ష్ణ ఘోర శరమ్మున్      

  1.  

 

 

 

కం.

చనుదెంచిరి విద్యాధర

ముని గుహ్యక దేవ దైత్య భూత చయాదుల్

ఘనులు మహాత్ములు యుద్ధ

మ్మును వీక్షింపంగఁ దమి నభో వీథి వెసన్       

  1.  

 

 

 

తే.గీ.

అంత నతికాయుఁడు కినిసి యమ్ము చాప

మందు సంధించి కుదియించు నట్లు నింగి

వేయ లక్ష్మణుని పయి నా వీరుఁ డరసి

యర్ధ చంద్ర శరమ్మున నణఁచె దాని     

  1.  

 

 

 

ఆ.వె.

తాడి తాహి వోలె వాడి శరము భగ్న

మైనఁ గాంచి కినిసి యయ్యతి తనుఁ

డైదు ఘోర తరపు టమ్ములు సంధించి

వైచె నంత నసుర వర్యుఁ డడరి     

  1.  

 

 

 

తే.గీ.

తన్ను దాఁకక మున్నయె యన్నరప్ర

వరుఁడు భరతానుజుండు నా శరముల నిజ

నిశిత శర పంక్తినిం ద్రుంచి భృశముగ జ్వలి

యించు బాణమ్ము నంత గ్రహించి వేగ      

  1.  

 

 

 

ఆ.వె.

ఉత్తమంపు వింటి నుగ్రుఁడై సంధించి

లక్ష్మణుండు శత్రు లయుఁడు లాగి

బెట్టిదమ్ముగ వెస విడిచె నా సాయక

మ్ము నతికాయు పైనఁ బోరు నందు     

  1.  

 

 

 

కం.

ఆకర్ణాంతము వంగిన

వౌ కనుపుల నడరు నట్టి యంబకమును దా

వీఁక విడిచె లాగి సుమి

త్రా కాంతా సుతుఁడు నుదుటఁ దాఁక నసురునిన్   

  1.  

 

 

 

ఆ.వె.

దిగ లలాట మందుఁ దీక్ష్ణ శరము భీమ

రాక్షసునకుఁ దడిసి రక్త మందుఁ 

జూడఁగ నగపడెను జోద్యముగ నపుడు

శైల మందు నున్న సర్పము వలె     

  1.  

 

 

 

తే.గీ.

రాక్షసుండు కంపించెను లక్ష్మణ శర

పీడుతుండునై రణ మందు బెట్టిదముగ

రుద్రు బాణ ఘాతమునకు భద్ర జాత

ఘోర త్రిపుర గోపురపుఁ దూఁగుఁ దలపింప    

  1.  

 

 

 

చం.

ఘన బలుఁ డంతఁ దేఱి శర ఘాతముచే నరి! శ్లాఘనీయుఁ డై

తని యని చింత సేసి యెద నాసురుఁ డాతని తోడ సాధు వం

చును  జరియించె దీర్ఘపు భుజుం డరదమ్మును బట్టి యానన

మ్మును నధికమ్ముగాఁ దెఱచి భూరి భుజమ్ములు వంచి యంతటన్

  1.  

 

 

 

తే.గీ.

బలము నూని లక్ష్మణుఁ గాంచి పట్టు పట్టి

యొకటి మూడైదు మఱి యేడు నుత్సహించి 

రాక్షసుండు బల్లిదుఁడు శరమ్ము లంత

వేగమ గ్రహించి సంధించి లాగి విడిచె

  1.  

 

 

 

చం.

శరములు హేమ పుంఖములు చండత రార్క నిభమ్ము లంత నం

బరమును గాల తుల్యములు భైరవ రాక్షసు విల్లు వీడి స

త్వర మొనరింప దీప్తముగ వాని నభీతిని లక్ష్మణుండు దు

ర్భర నిశి తోగ్ర బాణముల రామ సహోదరుఁ డాజిఁ ద్రుంచినన్      

  1.  

 

 

 

ఉ.

భగ్నము లైన నవ్విధము బాణము లెల్ల సురారి రోష సం

మగ్నుఁడు రావ ణాత్మజుఁడు మత్సర చిత్తుఁడు వే గ్రహించి కా

లాగ్ని నిభాంబకమ్ము విలు నందుఁ దగన్ సమకూర్చి ఱొమ్మునన్

లగ్నమునౌ విధమ్ముగను లక్ష్మణు నారసి వైచె వైచినన్      

  1.  

 

 

 

కం.

అతికాయు శరముచేఁ దా

డితుఁ డయి నిజ వక్షమునఁ గడిఁది కార్చెను శో

ణిత మత్తఱి మత్త గజము

వితతముగ మదమును గార్చు విధ మటఁ దోఁపన్      

  1.  

 

 

 

ఆ.వె.

లాగి యా శరమును లక్ష్మణుండు విశల్యుఁ

డై శరమ్ము నొండు నంతట నన

లాస్త్రమున ఘనముగ నాతఁడు సంధింప

నది జ్వలింపఁ జేసె నా ధనువును

  1.  

 

 

 

కం.

అతికాయుఁ డంత శరము త్వ

రితుఁడు పసిడి పుంఖముఁ జెలరేఁగి భుజంగ

ప్రతి బాణము గొని దినకర

విత తాస్త్రము తోడఁ గూర్చె విజయం బందన్   

  1.  

 

 

 

తే.గీ.

కాల దండమును విసరు కాలుఁ బోలి 

లక్ష్మణుఁ డని నాగ్నేయాస్త్ర రాజిత శర

ము జ్వలిత మతికాయుని పైన మూరి విడువ

నసుర సూర్యాస్త్ర మతి రౌద్ర మంత విడిచె      

  1.  

 

 

 

తే.గీ.

ప్రభల మండు టంచుల రెండు బాణ వరము

లాకసమ్మున నొండొంటి నాగ్రహించి

నట్టి సర్పద్వయము  భంగి బెట్టిదముగఁ

గొట్టుకొను చుండి దహియించి కూలె నవని 

  1.  

 

 

 

కం.

జ్వాల లణఁగ భస్మమ్ములు

రాల వెలుఁగ వా పరమ శరద్వంద్వమ్ముల్ 

కాలుచు నుండియు సుంతయు

నేలం గూలి వెలుఁగంగ నేరవు గాంచన్

  1.  

 

 

 

ఆ.వె.

త్వాష్ట్ర మనెడు నస్త్ర వరము నైషీకము 

నాసురుఁ డతి కాయుఁ డడరి వేసె 

సత్వరమ్ము దాని సౌమిత్రి యైంద్రాస్త్ర

మున నడంచె వీర్యమునఁ జెలంగి      

  1.  

 

 

 

ఆ.వె.

లయము కాఁ గినిసి దురమున నైషీకము

రావణాత్మజుఁడు శరమ్ము నందు

యామ్య మనెడు నస్త్ర మంత సంధించి క్షి

ప్రమ్ము వేయ రాము తమ్ముని పయి      

  1.  

 

 

 

తే.గీ.

వేసి యస్త్రము వాయువ్య మా సుమిత్ర

పట్టి యడఁచి యామ్యమ్మును వర్ష ధారఁ

గురియు మేఘమ్ము భంగినిఁ గురిసెను శర

ధార నతికాయుని పయి నా వీరుఁ డలిగి

  1.  

 

 

 

కం.

కూలిన వవి యంచులు తెగ 

నేలను జేరి యతికాయుని కవచమును వ

జ్రాలంకృతమ్ముఁ జీల్పం

జాలక వజ్ర సదృశమ్ము సంగర భూమిన్    

  1.  

 

 

 

తే.గీ.

రిత్తవోవ వానిని గాంచి యత్తఱిఁ గురి

యించె శర సహస్రమ్ముల నిప్పరఘ్నుఁ 

డా శరౌఘ మభేధ్యంపు టసురు కవచ

మహిమ బాధింప వసుర కుమారు సుంత   

  1.  

 

 

 

తే.గీ.

అతి బలుఁ డతికాయుఁడు శరౌ ఘావ్యధుండు

పన్న గాకార శరమును బఱపి కొట్ట

లక్ష్మణుని మర్మ దేశములను ముహూర్త

కాలము విసంజ్ఞుఁ డయ్యె రాఘవు ననుజుఁడు

  1.  

 

 

 

ఆ.వె.

శత్రు తాపనుండు  సౌమిత్రి తేఱి నా

లుగు నిశిత శరమ్ములు పఱపుచు హ

యముల సారథిని ధ్వజమును ముక్కలు సేసి 

సత్వరము గ్రహించి శర గణమ్ము     

  1.  

 

 

 

తే.గీ.

అంత గుఱి చూచి యతికాయు నంచితముగ

విడిచె నా బాణము లసుర వీరుని వధి

యింప నెంచి సంభ్రమ మెద నించు కైన

లేక సౌమిత్రి సెలరేఁగి వీఁక నాజి

  1.  

 

 

 

ఆ.వె.

అయిన నరవరుండు నసుర సత్తముని బా

ధింపఁ జాల కుండె నంప గముల

సమర మందు నంత సరస కేతెంచి వా

యువు వచించె రఘు కులోత్తముఁ గని     

  1.  

 

 

 

చం.

విను మిది బ్రహ్మదత్త వర వీరుఁ డ వధ్య నివాత సంవృతుం

డని ఘను బ్రహ్మనామ పరమాస్త్రము చే వధియింప నొప్పు నీ

తని నిత రాస్త్రముల్ కవచు దార్ఢ్యు వధింప ననర్హముల్ సుమీ

యన విని లక్ష్మణుండు త్రిదశాధిప సన్నిభ వీర్యుఁ డంతటన్   

  1.  

 

 

 

ఉ.

కైకొని బాణ రాజమును గాండపు టగ్రము నందుఁ గూర్చెఁ దా

వీఁకను బ్రహ్మ మస్త్ర మతి వేగము గూర్ప వరాస్త్ర రాజమున్

నాకము సూర్య చంద్రులును నాలుగు దిక్కులు భూ గ్రహమ్ములుం  

గాఁక సెలంగ భీతిలుచుఁ గంపము లందిన వెల్ల నత్తఱిన్   

  1.  

 

 

 

తే.గీ.

శరము బ్రహ్మాస్త్ర యుక్తమ్ము స వరపుంఖ

మంత యమదూత కల్పము నమర నాథ

శత్రు సూనునిపై వేసె సంగరమున

వజ్ర కల్పము సౌమిత్రి వజ్రి నిభుఁడు    

  1.  

 

 

 

తే.గీ.

లక్ష్మణ కరచ్యుత మమోఘ రయము సజ్వ

లనము వజ్ర సంయుతము చిత్రతర పుంఖ

మరుగుదెంచు చుండ రణము నందు శరము

సాయ కానేకముల నతికాయుఁ డడిచె    

  1.  

 

 

 

తే.గీ.

బాణము సుపర్ణవేగము పార్శ్వ మేఁగు

దెంచె నతికాయునకు నంత మించి మండు

మృత్యు కాలు నిభము దాని మేటి కర్ముఁ

డడిచె ఋష్టి గదా కుఠా రాదుల నని       

  1.  

 

 

 

తే.గీ.

వ్యర్థ మొనరించి యత్యద్భు తాకృతుల వె

లుంగు నాయుధములను జెలంగి శరము

స మకుటం బతి కాయుని సత్త్వవంతు 

శిరము వెసఁ బట్టి హరియించె దురము నందు

  1.  

 

 

 

కం.

పతితం బయ్యెను శర పీ

డిత తచ్ఛిరము సమకుటము డిగ్గన నిల నా

తత హిమవన్నగ శృంగము

పతితం బై నట్టి భంగి భండన మందున్   

  1.  

 

 

 

ఆ.వె.

భూషణమ్ము లెల్ల భువినిఁ జెల్లచెదరఁ

బడ్డ వానిఁ గాంచి దొడ్డ వగపు

నందిరి హత శేషు లన్నిశాచరు లాత్మ

ల నతి కాయుని నసురప్రవరుని   

  1.  

 

 

 

కం.

పరమ విషణ్ణ వదనులై

స్వరములు వికృతములు గాఁగఁ బలలాశను లం

త రణశ్ర మార్త దీనులు

విరివి నొనర్చిరి కలంగి భీతిన్ ధ్వనులన్      

  1.  

 

 

 

కం.

హత నాయకు లతి భీతులు

హతాశులు నిశాచరులు పురాభిముఖులు నై

ధృతి హీనులు నలు దెసలు త్వ

రిత గతి నేఁగిరి పరుగిడి రిత్తగ నంతన్    

  1.  

 

 

 

కం.

విక చాంబుజ సదృ శాస్యులు

నకలంక ముదాన్వితులు మహా సత్త్వు లనే

క కపులు లక్ష్మణు నిహతుం

డు కాఁగ బల్లిదుఁ డగు రిపుఁడు కొలిచి రెలమిన్       

  1.  

 

 

 

ఆ.వె.

అతి బలు నతికాయు నభ్ర సన్నిభుఁ జంపి

సమర మందు నంత సంతసించి

ప్లవగ పూజితుండు లక్ష్మణుండు కదిసె

నన్న రాఘవేంద్రు మన్నన వెస     

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు డెబ్బది  యొకటవ సర్గము.

 

 

యుద్ధ కాండము

సర్గము 72.

 

 

 

రావణుఁ డతికాయుని మరణమ్మును విని యుద్వేగుఁడై పరి పరి విధముల విలపించి లంకా నగర రక్ష ణార్థము రాక్షసుల నప్రమత్తులై యుండుఁ డని యాజ్ఞాపించి యంతఃపురమున కేఁగి చింతాక్రాంతుం డగుట.       

 

 

 

 

కం.

విని యతికాయుని మరణము

ఘన తేజుని లక్ష్మణు ఘన కాండ విఘాత

మ్మున రావణుఁ డుద్వేగ

మ్ము నంది వచియించె దీనముగ వచనమ్ముల్      

  1.  

 

 

 

సీ.

ధన్వి ధూమ్రాక్షుండు ధానుష్క సంచయ శ్రేష్ఠుండు ఘనుఁ డమర్షి భయదుం డ

కంపనుం డా కుంభకర్ణుండు దుర్భేద్యుఁడౌ ప్రహస్తుండు బలాఢ్యు లెల్ల

రాక్షస వీరులు రణ కాంక్షులు నపరాజితులు నిరంతర జిత విమతులు 

హతులైరి యక్లిష్ట వితత కర్ముని చేత రాముని చేత ఘోర రణ మందు      

 

తే.గీ.

రక్కసులు మహాకాయులు పెక్కు రస్త్ర

నిపుణులు మహాత్ము లన్యులు నీల్గి రెల్ల 

శూరు లక్కజముగ నర వీరు మార్కొ

నంగఁ జాలక పోరుచు సంగరమున        

  1.  

 

 

 

ఉ.

భ్రాతలు బంధ మొందియు శరమ్ముల దత్త వరాంబకమ్ములన్

నా తనయుండు వేయ నుత నైజ బలుం డగు నింద్రజిత్తుచే

నే తఱి నా సు రాసురుల కెయ్య దశక్యము యక్ష కోటికిన్

సైతము దేవ గాయక భుజంగ యుతమ్ము తొలంగఁ జేయఁగా

  1.  

 

 

 

ఆ.వె.

ముక్తు లైరి యకట భూవరు లా రామ

లక్ష్మణులు ప్రభావ రయ మడరెనొ

మాయ చేత నైన మంచిగ మోహింపఁ

జేసియో యెఱుంగఁ జిత్ర మరయ    

  1.  

 

 

 

కం.

ఏయే యోధులఁ బంపితి

నే యుద్ధమ్మునకు సమర నిర్జయుల నహో  

యా యా రాక్షసులు నిహతు

లై యవనిం గూలి రెల్ల హరి వీరులచే      

  1.  

 

 

 

కం.

కనఁ జాల నిప్పు డే నా

తని నెవ్వఁడు రాఘవేంద్రుఁ దమ్మునితో నిం

కను సుగ్రీవ విభీషణు

లను సేన వధింప శక్తి రాజిలు వానిన్    

  1.  

 

 

 

కం.

నృవరుఁడు మహా బలుఁ డహో

యెవని పరాక్రమము చేత నీల్గి రసుర వీ

ర వరులు కాకుత్స్థుం డ

స్త్ర వర సుసంపన్నుఁడు రఘు రాముం డవనిన్

  1.  

 

 

 

తే.గీ.

అప్రమత్తత నెల్లెడ సుప్రసిద్ధ

గుల్మము పుర వరమ్మును గుప్త వనము

నా యశోకము రక్షింప నర్హ మగును

సీత యున్నట్టి దేశము నాతతముగ    

  1.  

 

 

 

ఆ.వె.

ఎక్కె డెక్కడ బల మెల్లఁ దనరు చుండు

నక్క డక్కడ మన కాగమన గ

మనము లింపుగాను మాటి మాటికి తెలి

య వలయును విసంశయముగ నింక          

  1.  

 

 

 

కం.

మీ మీ బలముల తోడుత

క్షేమమ్ముగ నెల్లెడ నిలిచి యరయఁ దగు శా

ఖామృగ సంచారమ్ముల

నో మానిసి దిండులార! యుత్సాహమునన్     

  1.  

 

 

 

తే.గీ.

హరుల నేరి నుపేక్షింప నర్హ మెన్నఁ

డైనఁ గా దుదయమున సాయమున నైన

నర్ధ రాత్రి నైనను వారు యత్నము నొన

రించినను వచ్చు చున్న నిలిచినఁ గనుఁడు       

  1.  

 

 

 

కం.

విని లంకాధిపు వాక్యము

ల నెల్ల బల్లిదులు ఘోర రాక్షసు లబ్భం

గి నిలిచిరి యథోక్తమ్ముగ

ను నిశాచర రాడ్వరుని పనుపు నూని తమిన్        

  1.  

 

 

 

ఆ.వె.

రాక్ష సాధిపుండు రావణుం డట్టు లా

దేశముల నొసంగి దీనుఁడై భృ

శమ్ము ఘోర దుఃఖ సంతప్తుఁడై చనె

స్వీయ నిలయమునకు శీఘ్రముగను       

  1.  

 

 

 

కం.

జ్వలియింప దీప్త గోపా

నలము నిశాచర విభుండు నందన దుఃఖా

నల తప్తాత్ముఁడు నిట్టూ

ర్పు లుష్ణములు విడిచెఁ బల్మరుఁ గుములుచు నెదన్       

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు డెబ్బది  రెండవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 73.

 

 

 

పుత్రుల సోదరుల మరణ వార్త నాలకించి శోకించుచున్న తండ్రినిఁ గాంచి యింద్రజి త్తూఱడించి రామ లక్ష్మణులను వానర సైన్యమును యుద్ధమున వధించెద నని పలికి సమర భూమి నదృశ్యుఁడై ఘోర శర వర్షమున బ్రహ్మాస్త్రమున బాధింప వానరులు రామలక్ష్మణులు మూర్ఛిల్లుట. 

 

 

 

 

కం.

హత శేషు లసురు లేఁగి త్వ

రితము దశాస్యునకుఁ జెప్పిరి త్రిశిరు తోడన్

హతు లాజిని దేవాంతకుఁ

డతికాయుఁడు రాక్షస వరు లని శోకార్తుల్ 

  1.  

 

 

 

తే.గీ.

క్షిప్ర మాలకింపఁగ మృతి సెంది నట్లు

రాజు సంపద్విరాజుఁడు భ్రాతల నిజ

సుతులఁ గన్నీరు నిండ నక్షులను ఘోర

తరము చింతించి ధ్యాన ముద్రను మునింగె

  1.  

 

 

 

ఉ.

దీనుని రాక్షసేశ్వరుని ధీరుఁడు శోకము నందు మున్గఁగా

సూనుఁడు రాక్షసేంద్రునకుఁ జూచి మహా రథుఁ డివ్విధం బనెన్

మానుమ తండ్రి మోహము కుమారుఁడ నేనిటఁ జెంత నుండఁగాఁ

గానమె యింద్రజిచ్ఛర నికాయ విఘాతు స జీవ ముండఁగా         

  1.  

 

 

 

ఉ.

కాంచుమ రామ లక్ష్మణులఁ గాయ వికీర్ణుల నేఁడు మచ్ఛిలీ

సంచయ ఘోర పాతమున క్ష్మాతల మందు శయింప నింపుగాఁ 

బంచన హీన జీవు లయి బాణము లంగము లందు నుండఁగా

నించుక కాంచ సందియము నిందు నెడందను నైరృతేశ్వరా!

  1.  

 

 

 

చం.

స్థిరముగ నాలకింపుమ ప్రతిజ్ఞ మదీయము దైవ పౌరు షా

త్త రుచిర మింపు కొల్ప నెద దారుణ మార్గణ సంచయమ్మునన్

నరులను రామ లక్ష్మణుల నైపుణిఁ దృప్తిలఁ జేయు వాఁడ నేఁ

డరయుమ యింద్రజిత్తుని మహా బల సంపద రాక్ష సేశ్వరా!

  1.  

 

 

 

తే.గీ.

చూతు రిప్పుడు రాజ! నీ సూను విక్ర

మమ్మునింద్ర వైవస్వత మాధ వాన

లాశ్వి సాధ్య చంద్రార్క మిత్రాదులు బలి

యజ్ఞవాటి విష్ణుని భంగి నాజి నడర

  1.  

 

 

 

చం.

అని వచనమ్ము లిట్లు త్రిదశారి దశాస్యు ననుజ్ఞ నంది యా

ఘన బలుఁ డెక్కెఁ దేరును సుఖమ్ముగ లాగఁగ గొప్ప గాడిదల్

చన వెస గాలి వేగమున సంగర మెచ్చట నుండె నట్టి చో

టునకు మహేంద్రు స్యందన పటుత్వ రథమ్మున గొప్పతేజుఁడై          

  1.  

 

 

 

చం.

వెడలు మహాత్ము వెంటఁ బెను విల్లుల నూని యనేకు లాసురుల్

కడు ముద మంది బల్లిదులు కయ్య మొనర్పఁ దొడంగి రేఁగఁగా

వడి వడి కొంద ఱేనుఁగుల పైనను వాజుల పైనఁ కొందఱుం 

దడయక వ్యాఘ్ర వృశ్చిక వితాన ఖరోష్ట్ర భుజంగ వాహనుల్

  1.  

 

 

 

తే.గీ.

శ్వాప దాఖనిక బిడాల జంబుక మృగ

రాజ కాక మయూర మరాళ వాహ

ను లసుర వరేణ్యు లాయుధములు ధరించి

ప్రాస ముద్గర నిస్త్రింశ పరశు గదల

  1.  

 

 

 

తే.గీ.

నెఱి భుశుండి యష్టులు శతఘ్ని పరి ఘాదు

లూని విక్రములు వొగడు చుండ  త్రిదశ

రిపుఁడు శంఖ రవములు భేరీ ధ్వను లడ

రంగఁ గదలఁగ సంగర రంగమునకు   

  1.  

 

 

 

ఆ.వె.

శంఖ చంద్ర వర్ణ సన్నిభ చ్ఛత్రమ్ము

తోడ వెలిఁగె శత్రు దుర్జయుండు

పూర్ణ చంద్ర యుత నభో వీథి భంగిని

నింద్రజిత్తు రాక్షసేంద్ర సుతుఁడు

  1.  

 

 

 

కం.

చారుతర చామరమ్ముల

భూరి విభూషితముల వర భూషితుఁ డంతన్

వీరుఁడు వీవఁ బడె ధను

ర్ధారులలో ముఖ్యుఁ డసుర రాజ సుతుఁ డటన్

  1.  

 

 

 

కం.

కని తరలు వానిఁ దనయుని 

ఘన సై న్యావృతునిఁ బంక్తి కంఠుండు వచిం

చెను శ్రీమంతుఁడు రక్షో౽

ధినాయకుఁడు రావణుండు ధృతితో నిట్లున్      

  1.  

 

 

 

తే.గీ.

పుత్ర! యప్రతిరథుఁడ వీవు జిత దేవ

పతివి మనుజుఁ దలప నేల పార్థుఁ డప్ర

ధృష్యుఁ డనిఁ గాఁడు చంపుదు ధీర! రాము

ని నన జనకు దీవనలఁ గొనియె నతండు

  1.  

 

 

 

కం.

రవి నిభ తేజుం డప్రతి

మ వీర్యుఁ డింద్రారి యసుర మాన్యుఁడు తరలం

గ వెలిఁగె లంకా నగరము

దివి వోలె దినకర దివ్య తేజము తోడన్  

  1.  

 

 

 

ఉ.

చేరి త దాహ వాంగణము చెన్నుగ నిల్పి రథమ్ము చుట్టునున్

వైరి జనాంతకుం డసుర వర్యుల నగ్నినిభప్రభాంగుఁ డం

గారము మంత్రవాచ్యములఁ గౌణుప వీరుఁడు వేల్చె భక్తినిన్

హార పటీర  లాజ వర హవ్య సమర్పణ కార్య సంతతిన్   

  1.  

 

 

 

తే.గీ.

ఱెల్లు గడ్డి శస్త్రములు పఱిచి యినుప  స్రు

వమ్ము తోమర మెఱ్ఱ వస్త్రమ్మును గొని

యగ్ని వెలిఁగింప నల్లని దైన మేఁక

జీవములఁ బట్టె నసురుండు శీఘ్రముగను      

  1.  

 

 

 

కం.

ఒక్కుమ్మడి నట మంటలు

సక్కఁగ పొగ లేక లేచి సమిధల నంతన్

వెక్కస మగు జయ చిహ్నము

లక్కజముగను బొడచూపె ననలము నందున్

  1.  

 

 

 

కం.

సుడులు తిరుగు జ్వాలలను బ

సిఁడి చాయల వెలుఁగు వహ్ని చిత్రమ్ముగఁ దా  

వడి లేచి స్వయమ్ముగ  హవిఁ

బడసెను దమిఁ బావకుండు పరమ ప్రీతిన్

  1.  

 

 

 

తే.గీ.

అంత నింద్రారి రప్పించి యద్భు తాస్త్ర

వరము బ్రహ్మాస్త్రమును దనదు రథమును ధ

నుస్సు మంత్రింప నింపుగను బరమాస్త్ర

మంత్రముల నింద్రజిత్తా సమయము నందు   

  1.  

 

 

 

ఆ.వె.

అస్త్ర వరము నసురుఁ డట్టు లాహ్వానించు

చుండ నగ్ని వేల్చు చుండ నపుడు

నభము సూర్య చంద్ర నక్షత్రముల గ్రహ

ములను గూడి వణఁకె విలయ గతిని      

  1.  

 

 

 

తే.గీ.

ఇంద్ర సదృశప్రభావుఁడు నిద్ధ పావ

కాభ దీప్త తేజుఁడు మాయ మయ్యె వేల్చి

యగ్నిఁ జాప బాణాసి రథాశ్వ సూత

సహిత మాకాశ మందు నసదృశ బలుఁడు   

  1.  

 

 

 

ఉ.

అంత పతాక సధ్వజ రథాశ్వ సమావృత రాక్ష సోగ్ర దు

ర్దాంత బలమ్ము సాగె నినదమ్ము లొనర్చుచుఁ జేయ యుద్ధముం

బంతము నూని బాణముల వానర వీరులఁ దోమ రాంకు శా

త్యంత శితమ్ములం జెలఁగి యందఱిఁ గొట్టిరి యాజి రక్కసుల్    

  1.  

 

 

 

చం.

రతిఁ గని యా నిశాచరుల రావణి క్రుద్ధుఁడు వల్క నివ్విధిన్

వితత ముదమ్ము నంది హరి వీరుల గెల్వఁగఁ బోరు సల్పుఁడీ

పతి గిర లాలకించి శర వర్షమునుం గురియించి రా ప్లవం

గ తతినిఁ గాంచి యార్చుచును గయ్యము నందు భయంకరమ్ముగన్      

  1.  

 

 

 

కం.

తా నింద్రజిత్తు సమరము

లోనసురులఁ గూడి వానరులఁ గొట్టెను నా

నా నాళీక ముసల శ

ల్యానేకమ్ముల గదా ప్రహరముల తోడన్   

  1.  

 

 

 

కం.

ఘన తాడితులై  సంగర

మున సాలాయుదులు హరు లపుడు ద్రుమ వర్ష

మ్మును శైలవర్షము నసుర  

ఘను రావణిపైఁ గురిసిరి గ్రన్ననఁ గినుకన్

  1.  

 

 

 

చం.

ప్లవగుల నింద్రజిత్తు గని వారక క్రుద్ధుఁడు బల్లిదుండు వీ

ర వరుఁడు రావణాత్మజుఁడు వ్రయ్య నొనర్చెను గాత్ర రాశినిన్

బవరము నందు నొక్క శిత బాణ వరమ్మున నేడ్గు రేవురన్

నవ కపి సంచయమ్ము వెస నాశ మొనర్చె నెలర్ప రక్కసుల్

  1.  

 

 

 

తే.గీ.

సూర్య సంకాశ శరము లసుర వరుండు

వేసి స్వర్ణ భూషితముల నా సమర సు

దుర్జయుండు బాధించెను దోరముగను

వానరప్రవరుల నెల్ల వాస వారి     

  1.  

 

 

 

తే.గీ.

వారు తెగి నట్టి మేనుల బాణ జాల

పీడితులు కపి వీరులు వీత నిశ్చ

యులు పుడమిఁ గూలి రపు డార్తి సెలఁగ  సురల

చే నసురు లాజిఁ గూలిన చెన్ను దోఁప   

  1.  

 

 

 

కం.

శరముల నాదిత్యచ్యుత   

కిరణ నిభమ్ములఁ దపింపఁ గెరలుచు ఘో రా

సురుఁ డింద్రజిత్తు వెస వా

న రర్షభులు వాని మార్కొన దుమికి రాజిన్    

  1.  

 

 

 

తే.గీ.

అంత నెల్ల వానరులు నిజాంగములు తె

గఁ దెలివి నశింపఁ దడిసి రక్తమ్ము నందుఁ 

గలఁతఁ బాఱ రామార్థము పొలిసి రాజిఁ

బెనఁగి మరలక పరులు సూపి దిట వార్చి   

  1.  

 

 

 

ఉ.

వానరు లద్రి శృంగములఁ బాదప ఘోర శిలాచయమ్ములన్

వాన కురింప నింద్రజితుపై వృతులై సమరమ్ము నందు న

వ్వానను బ్రాణ నాశకము భగ్నము సేసె నిశాచరుండు తే

జానఁ జెలంగి రావణి యశక్యుఁడు గెల్వ రణాన నేరికిన్    

  1.  

 

 

 

తే.గీ.

అంత నగ్ని సన్నిభముల నంబకముల

సర్ప నిభములఁ గపి సేన దర్ప మడఁచి 

పదునెనిమిది శరమ్ముల బాదె గంధ

మాదనునిఁ దొమ్మిదిట నలు మసల నవల    

  1.  

 

 

 

ఉ.

మైందుని నేడు బాణములు మర్మ విదారము లేసి గొట్టి తా

నంది శరమ్ము లైదు గజు నంతట మొత్తి నిశాచరుండు వే

కుందఁగ జాంబవంతుఁ డని ఘోర దశాంబక ఘాతుఁ జేసి యా

క్రందులఁ జేసె నంతఁ గపి కాంతుని నంగదు వాడి ముల్కులన్

  1.  

 

 

 

తే.గీ.

నీలు ముప్పది యమ్ములఁ గూలఁ జేసి

ఋషభు ద్వివిదుని దత్త వరేద్ధ మార్గ

ణమ్ముల నడిచి  కిన్క రణమ్ము నందుఁ 

బ్రాణములు లేని వారిగ వారిఁ జేసె     

  1.  

 

 

 

తే.గీ.

అన్యులను గూడఁ గినిసి ముఖ్య ప్లవగుల

నమ్ముల ననేకములను గాలాగ్ని వోలె

నాజిఁ బీడించె మథియించె హరుల సేన

నర్క నిభ శీఘ్ర గాముల నంబకముల     

  1.  

 

 

 

కం.

శర జాల పీడితమ్ము రు

ధిరోక్షితమ్ము హరి సేన దీనమ్మును  గాం

చి రహి సెలంగ  హృది నిశా

చరుండు సంప్రీతుఁ డయ్యె సమరం బందున్   

  1.  

 

 

 

చం.

తిరిగి శరాస్త్ర వర్షమును దిట్ట తనమ్మున నింద్రజిత్తు వా

నర వర సేనపైఁ గురిసె నైరృత నాథ కుమారుఁ డాజి భీ

కరముగ నొంచె వానరులఁ గన్పడ కేరికి వీడి సైన్యమున్

గురు తర నీల వారిదము కుర్యు విధమ్ముగ గుప్పి బాణముల్

  1.  

 

 

 

తే.గీ.

రావణి శర సంచయ వికీర్ణ నిజ తనులు

హరులు మాయా విమోహులు నఱచి వికృత

ముగ పడిరి ధరాధర సన్నిభు లవని పయి

వజ్రి వజ్రాభిఘాత పర్వతముల వలె

  1.  

 

 

 

ఆ.వె.

వానర వర సేన లోనఁ వాడి శర సం

చయము మాత్ర మరయఁ జాలి రసుర

వీరు నింద్ర జిత్తు ఘోర మాయా మయుఁ

గాంచఁ జాల రైరి యించు కేని   

  1.  

 

 

 

తే.గీ.

అతుల తేజస్వి రక్షో౽ధిపతి మహాత్ముఁ

డంత దిక్కుల నింపె శితాగ్ర శరము

లర్క కాంతి సన్నిభముల నడరి వేసి

వాన రేంద్రుల బాధించె భండనమున   

  1.  

 

 

 

తే.గీ.

శూల ఖడ్గ పరశ్వథ జాల మగ్ని

దీప్తములు నిప్పురవ్వలు తేటపడగ

మంటలు జ్వలించు చుండఁగ మర్కట వర

సేన పైనఁ గురిసె నింద్రజిత్తు  సెలఁగి

  1.  

 

 

 

కం.

జ్వల నాభ శక్ర జిచ్ఛర

ముల నవ్విధిఁ గొట్టఁ బడఁగఁ బోరునఁ బ్లవగ

మ్ములు వికసించిన కింశుక

ముల వలె యోధులు వెలిఁగి రపుడు చిత్రముగన్

  1.  

 

 

 

కం.

కదియుచు నొక్కరి నొకరు ని

నదించుచు వికృత రవముల నగచరు లాజిన్

విదళితులై రావణిచేఁ 

గదల నశక్యు లయి పడిరి క్ష్మాతల మందున్     

  1.  

 

 

 

ఆ.వె.

కాంచు చుండ నింగిఁ గపి వీరు లన్యులు

కొంద ఱక్షు లందు ఘోర సాయ

కములు దాఁక నొచ్చి కదిసి యొండొరులను

బతితు లైరి పుడమి పైనఁ గలఁగి     

  1.  

 

 

 

సీ.

హనుమంతు సుగ్రీవు నంగదు గంధమాదను జాంబవంతు మైందుని ద్వివిదుని

వేగదర్శి సుషేణు నా గవాక్షుని గవయుని నీలుఁ గేసరిని నలుని హరి

లోముని విద్యుదంష్ట్రుని జ్యోతి ముఖుని సూర్యానను దధిముఖు హరుని పావ

కాక్షునిఁ గుముదుని హరి గజు గోముఖుఁ బ్లవగుల నెల్ల మంత్ర యుత మింద్ర

 

తే.గీ.

జిత్తు బాధించి ప్రాస నిశిత శర తతి

శూల పరమాయుధమ్ముల నాల మందు

గదలచే రఘురాము లక్ష్మణుని తోడ

భాస్కరాంశు నిభ శిఖుల బడలఁ జేసె

  1.  

 

 

 

కం.

పర మాద్భుత సంపద్రఘు

వరుఁ డమ్ముల వాన మునిఁగి వసుధాధర ని

ర్ఝర ధారా సదృశమున బె

దరక నలుగడఁ గని పలికెఁ దమ్ముని తోడన్   

  1.  

 

 

 

ఉ.

రావణి యాశ్రయించి యిట బ్రహ్మ వరాస్త్రము నింద్ర శత్రువే

యీ వర వానరధ్వజిని నిత్తఱిఁ గూల్చి మహోగ్ర సైన్యముం

జేవ సెలంగ బాణముల ఛిన్నము సేయుచు నున్నవాఁ డహో 

దేవ రిపుం డనిన్ మనల దిట్టతనమ్మునఁ గంటె లక్ష్మణా!     

  1.  

 

 

 

తే.గీ.

ఉద్య తాస్త్రుఁ డీ యింద్రజిత్తుగ్రుఁ డాజి

బ్రహ్మ వరదత్త వీరుఁడు రణము నందుఁ

గనఁ బడని వీని గెల్వ శక్య మగు నెట్లు

మనకుఁ జింతింప వలయు లక్ష్మణ! భృశముగ

  1.  

 

 

 

ఆ.వె.

ఎవ్వరు విభుఁ డగునొ యీ యస్త్ర రాజము

న కతఁడు సుర వరుఁడు నలినజుఁడు స్వ

యంభువుం డచింత్యుఁ డంచుఁ దలఁతు  బాణ

పాతము సహియింప వలయు మనకు    

  1.  

 

 

 

ఉ.

వానినిఁ గప్పనిమ్మసుర వర్యుని సాయక వృష్టిచే ఘనున్

వానర రాజ సైన్య మని భాసిల కున్నది యగ్ర శూర సం 

తానము గూలఁ దా నరసి ధాత్రిఁ బడన్ మనలన్ నివృత్తులం 

గానక హర్ష రోషములు గ్రమ్మఱు లంక కజేయుఁ డై వెసన్

  1.  

 

 

 

తే.గీ.

అంత నింద్రజి దస్త్ర చయార్తు లైరి

వారు రామ లక్ష్మణులు బవరము నందు

మిక్కుటముగ బాధించి యమేయ బలుఁడు

శక్ర జిత్తఱచె ననిలో సంతసమున     

  1.  

 

 

 

తే.గీ.

భృశము పీడించి వానర వీర సేన

నింక రామలక్ష్మణులను నంక మందుఁ

బొగడ నసురులు దశకంఠు పురము సొచ్చి

జనకున కెఱిఁగించె మురిసి తనదు జయము     

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు డెబ్బది  మూడవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 74.

 

 

 

రామలక్ష్మణుల సహితము వానర సైన్య మింద్రజిత్తుని యస్త్రములకు మూర్ఛిల్ల సుగ్రీవ నీలాంగద జాంబవంతులకు దిక్కు తోఁపకున్న విభీషణుఁ డూఱడింప జాంబవంతుని యాదేశానుసారము హనుమంతుఁడు హిమాలయమున కేఁగి దివ్యౌషధము లున్న పర్వతమును దీసికొని రాఁగ నౌషధముల వాసన సోఁకఁగా నెల్లరు స్వాస్థ్యము లందుట.     

 

 

 

 

కం.

వా రనిఁ బీడింపఁ బడఁగ

ఘోరముగఁ బ్లవంగ సేన గూలెను మూర్ఛన్

నేర రట జాంబవంతుఁడు  

సౌరియు నీ లాంగదులును జలుపఁ దగు పనుల్ 

  1.  

 

 

 

తే.గీ.

అంత విబుధుల శ్రేష్ఠుండు వంత మునిఁగి

నట్టి వానర రాజ సైన్యమ్ము నెల్లఁ

గాంచి యవ్విభీషణుఁడు సమంచిత వచ

నముల నూఱడించెఁ దమి వానర వరులను    

  1.  

 

 

 

ఉ.

ఆర్య కుమారు లిద్దఱు స్వయంభువు వాక్యము లాదరించి యాం

తర్యము లందు నెంచి వశతం దగ దుఃఖితు లైరి రాఘవుల్

శౌర్య ధనాఢ్యు లివ్విధము శక్రజి దుగ్ర త రాస్త్ర ఘాతులై

కార్యము కాదు భీతిలఁగఁ గాలము కాదు విషాద మందఁగన్      

  1.  

 

 

 

చం.

ఒసఁగెను బ్రహ్మ యాతనికి నుత్తమ బ్రాహ్మ మమోఘ వేగమున్

విసరఁగ నా మహాస్త్రమును వీరుల నుత్తముఁ డింద్రజిత్తనిం

బస చెడి నట్లు వ్రాలఁగను బార్థ కుమారులు గౌరవమ్ము నూ

ని సమయమే తలంప నిది నెవ్వగ నందఁగ మీకు నివ్విధిన్   

  1.  

 

 

 

తే.గీ.

అంత ధీమంతుఁ డైనట్టి హనుమ లేచి

మున్ను మన్నించి బ్రహ్మాస్త్రమును విభీష

ణు వచనమ్ముల నాలకించి వెసఁ బల్కె

రాక్షసేంద్రునితో నిట్లు రమ్యముగను

  1.  

 

 

 

తే.గీ.

ఎవ్వ రెవ్వ రస్త్రమ్ముల నొవ్వి యుండి

రసువులు వహించి వారిని నాశ్వసింత

మసుర వర్య! యన నిసిని నయ్యిరువురు  

నూని కాగడాలు వెదకి రుత్సహించి       

  1.  

 

 

 

ఉ.

చూచిరి నేల నిర్వురును శోణిత మూత్ర విసర్జితప్లవం

గాచితమున్ విఖండిత వరాంగుళి వాల పదోరు హస్తముల్

కాఁచుల తోడ గ్రీవములు గాత్రము లచ్చట నుండ గుట్ట లు

గ్రాచల తుల్య వానర మహా నిచయంబును వ్రాలి యుండఁగా

  1.  

 

 

 

కం.

సమ రావని వీక్షించిరి

గములై పడ దీప్త శస్త్ర కాం డావలినిన్ 

విమలాత్ముఁ డసుర వర్యుఁడు

సమీరణ సుతుం డఖిల దిశలను దిరుగుచున్ 

  1.  

 

 

 

ఉ.

పావని యవ్విభీషణుఁడు వాలికుమారు గవాక్షు నీలు సు

గ్రీవు సుషేణు మైందుఁ బరికించిరి సద్వివిదున్ నలున్ వెతన్

ధీవరు నాహుకున్ శరభు ధీరుఁడు నాపన సాఖ్యుఁ గార్య స

ద్యో విదు గంధమాదనుని జ్యోతిము ఖాఖ్యుని వేగదర్శినిన్    

  1.  

 

 

 

తే.గీ.

బ్రహ్మ వల్ల భాస్త్రమ్మునఁ బగటి యైద

వ దగు భాగ శేషమ్మున బల్లిదులు ప్ల

వగులు కో ట్లఱువది యేడ్గురు గతి యించి

రాజిలో దారుణమ్ముగ నసురు చేత     

  1.  

 

 

 

కం.

హనుమ విభీషణు తోడఁ జ 

ని నిశిత తర సాగరౌఘ నిభ బాణములం

దనువులు కూలిన బలమునఁ 

గన వెదకెను జాంబవంతుఁ గపి వరుఁడు తమిన్     

  1.  

 

 

 

చం.

ముసలితనమ్ము మీఱఁగను ముల్కులు వందలు బాధ నీయఁగాఁ

బస సెడ బ్రహ్మ నందనుఁడు పావకు భంగి శమింప వృద్ధుఁడే

వెసఁ గని యా పులస్త్యు కడు పేరిమి సూనుఁడు సేరి చెంతకున్

మసలక పల్కె వాక్యములు మన్నన తోడుత నివ్విధమ్ముగన్    

  1.  

 

 

 

తే.గీ.

ఆర్య! తీక్ష్ణ శిఖుల ఋక్ష వర్య! ధ్వంసి

తములు గావుగా నీదు ప్రాణము లన విని

యవ్విభీషణు పల్కుల నతఁడు కష్ట

తరముగా నుచ్చరించుచు గిరలు వలికె       

  1.  

 

 

 

కం.

విని వీర! నీదు స్వరమును

నిను గుర్తించితిని యసుర నిచయశ్రేష్ఠా!

కనఁ జాలను బీడింపఁగ

సునిశిత శర జాలము నను సుంతయు కనులన్      

  1.  

 

 

 

తే.గీ.

ఎవనిఁ గని యంజనా సతి యింక వాయు

వును సుపుత్ర యుతు లయిరి  పుణ్య చరితు

లట్టి హనుమంతుఁ డసురేంద్ర! యసువు లూని

కలఁడె వానర శ్రేష్ఠుండు కదన మందు         

  1.  

 

 

 

కం.

విని జాంబవంతు వాక్యము

ల నడిగెను విభీషణుండు రఘు నందనులన్

ఘనుల నడగ కిట్లేలను

హనుమంతు నడిగెద వంచు నాశ్చర్యముగన్    

  1.  

 

 

 

ఉ.

వానర రాజు నందయిన వాలి కుమారుని యందు నైననున్

మానవ నాథు నందయిన మానిన నీ దగు స్నేహ మెల్లనున్

వానర ముఖ్యుఁడౌ హనుమ పైఁ గురియించెద వక్కజమ్ముగన్

మానక యేల చెప్పు మయ మారుతి నెన్నెడు కారణమ్మునున్   

  1.  

 

 

 

కం.

ఆ రాక్షసు పల్కులు విని

యా ఋక్ష పతి వచియించె నాతని కిట్లున్

మారుతి నేల యడిగితినొ

నైరృత వర! యాలకింపు నా వచనములన్

  1.  

 

 

 

ఉ.

మారుతి యున్న జీవముల మల్లుల సైన్యము సంపఁ బడ్డ ని

ద్ధారుణిఁ జావ నట్లగు నతండు నశించిన జీవ మున్ననున్

నేరుమ కూలి నట్టులనె నిక్కము నెంచినఁ దుల్యుఁ డగ్నికిన్

మారుత వేగ సన్నిభుఁడు మంచిగ నున్న వహింతు మాశలన్

  1.  

 

 

 

ఉ.

అంత సమీప మేఁగి వినయమ్మునఁ బాదము లంటి మ్రొక్కె ధీ

మంతుఁడు జాంబవంతునకు మారుత సూనుఁడు జాంబవంతుఁడే

సంతస మంతరంగమున జాదు కొనంగఁ దలంచెఁ దిర్గి తా  

వింతగఁ బుట్టి నట్లు కపి వీరుని మాటలు సోఁక వీనులన్

  1.  

 

 

 

.వె.

అంత జాంబవంతుఁ డా హరి వీరుని

తోడఁ బల్కె నిట్లు దోర్బలుండ! 

రమ్ము వేగ వానరర్షభ! కావ న

ర్హుఁడవు నీవు వానరోత్కరమును   

  1.  

 

 

 

ఉ.

శూర వరేణ్య! విక్రమము సూపగఁ జాలుదు వీవ వీరికిన్

వీరులఁ గాంచ నన్యులను వీరికి యుక్త సఖుండ వీ విటన్

మూరి చెలంగఁ గాల మిది బోరన నీకుఁ బ్లవంగ సత్తమా! 

వీరి కొసంగుమా ముదము వృక్ష చరాలికి ఋక్ష కోటికిన్      

  1.  

 

 

 

కం.

హరి వీర విశల్యులుగ నొ

నరింపుమ రఘూత్తములను నరపుంగవులన్

శర జాల సాదితుల వే

గ రామలక్ష్మణులను రథిక వరోత్తములన్    

  1.  

 

 

 

తే.గీ.

కడలి పైపైనఁ జరియించి కపి వరేణ్య!

పర్వతశ్రేష్ఠ మా హిమవన్నగమును

జేరి యుగ్ర ఋషభముఁ బసిండి నగముఁ   

గనుమ కైలాస శిఖరమ్మును నరి దమన!   

  1.  

 

 

 

తే.గీ.

కాంతు వచట సర్వౌషధి కలిత సుంద

రౌషధి నగ వరమ్మును ననుపమప్ర

భల వెలుంగు దాని శిఖరముల నడుమను

వాయు నందన! వానర వర్య! యందు

  1.  

 

 

 

ఆ.వె.

మూర్ధ సంభవములు ముఖ్యౌషధులు నాల్గు

దీప్తములు దగ దశ దిశలను వెఁలి

గించు చుండు నిత్య మంచితముగ నంజ

నా కుమార! యేఁగి వీఁకఁ గనుమ   

  1.  

 

 

 

తే.గీ.

అడరఁగ మృత సంజీవని యన విశల్య

కరణి యనఁగ నింక సువర్ణ కరణి యనఁగఁ  

గపివరోత్తమ! సంధాన కరణి యనఁగ

నాలు గోషధుల గ్రహించి వ్రాలు మిచట         

  1.  

 

 

 

ఆ.వె.

ఊఱడింపు హరుల నుసురు లొసఁగి యన   

జాంబవంతు నా వచనములు విన 

ఘోర బలము చేతఁ బూరింపఁ బడెఁ గపి

యుదక రయము చేత నుదధి వోలె     

  1.  

 

 

 

కం.

పర్వత తటాగ్ర మందు న

ఖర్వ బలుండు నిలిచి ఘన కపి పీడింపం

బర్వతమును దా రెండవ

పర్వతము పగిది స్ఫురించె వాతాత్మజుఁడే    

  1.  

 

 

 

చం.

అదుమఁ బడంగ శైలము మహాకపి పాదములన్ భృశమ్ముగా

నదరి భరింప లేక వెస నంతటఁ గ్రుంగెను విస్మయమ్ముగం

బదపడి రాలి నేలను ద్రుమమ్ములు మండెను వేగ ధాటికిం 

గదలుచుఁ బీడనమ్మునను గ్రన్నన భగ్నము లయ్యె శృంగముల్       

  1.  

 

 

 

చం.

హరివరుఁ డొత్తఁగా విఱిఁగి నట్టి శిలా ద్రుమ రాజి యున్న యా

ధర చలియించు చుండ వితతమ్ముగ శైలము నందు నిల్వఁగా

హరుల కశక్య మయ్యెఁ గడు నత్తఱి రేయిని లంక భగ్న గో

పురముల నూఁగు ద్వారములఁ బొల్చె సభీతి నటించు భంగినిన్    

  1.  

 

 

 

ఆ.వె.

శైల సన్నిభుండు శైలము నట్లు పీ

డించి వాయుజుండు మించి పుడమి

సార్ణవమ్ము నెల్ల నాంజనేయుండు చ

లింపఁ జేసె హరి వరేణ్యుఁ డపుడు     

  1.  

 

 

 

సీ.

ఆ త్రికూట నగము నందున్న మలయ పర్వతము మేరు నగ నిభమ్ము మంద

రాభము ప్రస్రవ ణాకుల నానా ద్రుమ లతా విలసితమ్ము నలిన కువల

యాలంకృతమ్ము నిత్యామర గంధర్వ విద్యాధర మునీంద్ర వితతి సేవి

తం బప్సరో వనితా నిషేవిత మఱువది యోజనముల యెత్తది కనఁబడ

 

తే.గీ.

నెక్కె నానా మృగ విహర ణేద్ధ కంద

రమ్ము నాకుల పడఁగఁ గరమ్ము కిన్న

ర జన యక్ష గంధర్వు లభ్ర సదృశుండు   

వెంచె దేహము హనుమంతుఁ డంచితముగ  

  1.  

 

 

 

తే.గీ.

చరణ యుగ్మమ్మున నదిమి శైల వరము

బడబ ముఖముఁ బోలు ముఖము వాయుజుండు

తెఱచి నినదించె మానిసి దిండు లడలఁ   

గదలఁ జాల రసురులు లంకాపురమున     

  1.  

 

 

 

కం.

కడలికి నమస్కరించుచు

నెడంద గురు విక్రముం డహిత వీర తపుం

డడరి రఘువీరు పనికై

వెడల సమాహితుఁడు నయ్యె వేగిరపడుచున్    

  1.  

 

 

 

తే.గీ.

ఫణి నికాశ వాలము నెత్తి వంచి నడుము

చెవుల నిక్కించి బడబా రుచిర ముఖాభ

నిజ ముఖమ్ముఁ దెఱచి యంత నింగి కెగిరెఁ

జండ వేగమ్మునఁ బ్లవగ సత్తముండు   

  1.  

 

 

 

తే.గీ.

ప్లవగు బా హూరు వేగమ్ము లాగ నెగిరి

శైల తరుశిలా ప్రాకృత నీలకములు 

వాని ననుసరించి తరలి వార్ధి జలము

నందుఁ గూలె వేగము క్షీణ మైన కతన            

  1.  

 

 

 

ఆ.వె.

చాచి భుజగ భోగ సన్నిభ భుజములు

సర్ప శత్రు వీర్య సన్నిభుండు

హిమ గిరికిఁ దొడంగె నేఁగంగఁ దన వైపు

దిశల లాగు చున్న తీరు దోఁప   

  1.  

 

 

 

తే.గీ.

చూచుచుఁ గడలిని నలల సుడు లలరెడు 

దాని జల సత్త్వములు దిర్గు దానిఁ ద్వరిత

గతిని నేఁగఁ దొడంగె మారుత సుతుండు

 హరి కర విముక్త చక్రము కరణి నడరి          

  1.  

 

 

 

కం.

గిరులను బక్షి గణమ్ముల

సరోవరముల నదుల జన సముదాయములం

బురములఁ జెఱువులఁ గాంచుచు 

నరిగెను బితృ తుల్య వేగుఁ డంబర వీథిన్    

  1.  

 

 

 

కం.

శ్రమ లేక పితృ నిభ పరా

క్రముండు హనుమంతుఁ డేఁగె రవి మార్గమునన్

గమకించి వీరులం దు

త్తముండు త్వరితముగ ననిల తనయుఁడు గిరికిన్        

  1.  

 

 

 

కం.

హరి శార్దూలుఁడు మారుతి

యరిగెను మారుత జవమున నాశల నెల్లన్

విరివిగ నింపి రవమ్ముల

స్మరించి యెద జాంబవంతు మాటల నెల్లన్    

  1.  

 

 

 

చం.

వడిఁ జని యంతఁ గాంచె హిమవంతము మారుతి భీమ వేగవం

తుఁడు బహు కందరమ్ము సిత తోయద సంచయ సన్నిభమ్ము న

య్యెడ శిఖరావృతమ్ము విమ లేద్ధ జలస్రవ నిర్ఝ రాద్రి వీ

రుఁడు హరి శైలరాజము విరోధి జనఘ్నుఁడు సుంద రాద్రినిన్

  1.  

 

 

 

తే.గీ.

తాఁ జని వెస నానావృక్ష రాజితం బ

తిప్రవృద్ధ ఘోర శిఖర మప్రతిమము

సుర ఋషి నిషేవతమ్మును సుంద రాశ్ర

మ సువిరాజితమ్ము గనె హిమ నగవరము     

  1.  

 

 

 

ఉ.

కాంచెను బ్రహ్మకోశమును గాంచెను వెండి నగమ్ము రుద్రుఁ డే

తెంచి నిజాంబకమ్ములను దించిన చోటు హయాననస్థలిం 

గాంచెను శక్రు నాలయము గాంచెను బ్రహ్మ శిరమ్ము దీప్తముం

గాంచెను సూర్య కింకరులఁ గాంచెను వైశ్రవ ణాలయమ్మునున్

  1.  

 

 

 

తే.గీ.

కాంచె వజ్రాలయమ్మును గాంచె సూర్య

బంధనమ్ముఁ బ్రభాకర ప్రభను శంక

ర వర కార్ముకమ్మును గాంచె బ్రహ్మదేవు

పీఠ మరసెఁ గాంచె ధర నాభి స్థలమ్ము

  1.  

 

 

 

తే.గీ.

కాంచెఁ గైలాస శైలము గాంచె హిమ శి

లలను గాంచె నా ఋషభ పర్వతము గాంచెఁ 

గాంచన నగ వరమ్మును గాంచె నోష

ధి గణ దీప్త సర్వౌషధి నగ వరమ్ము

  1.  

 

 

 

ఉ.

వాసవ దూత నందనుఁడు వహ్ని నికాయ లసద్రుచిప్రబా

భాసము గాంచి విస్మయము పన్నుగ నంది నెడంద శైల మం

దాసఁ జరించి యోషధుల నాత్రమునన్ వెదకం దొడంగెఁ దా

నాసల నెల్ల నోషధి మహాద్రిని మించఁగ వేయి యామడల్       

  1.  

 

 

 

ఆ.వె.

తమ్ముఁ గోరు వారు తరలి రంచు నెఱింగి

పర్వతమ్ము నందుఁ బరఁగు దివ్య

ము లగు నోషధి వరములు మాయ మైనవి

కాన రాక యుండెఁ గపి వరునకు      

  1.  

 

 

 

ఆ.వె.

అవ్విధమ్ముగఁ బర మౌషధుల నరయ

కున్నఁ గినిసి యంత నుగ్గ్రుఁడై క

రమ్ము వలికె హనుమ యమ్మహాత్ముఁడు జ్వలి

తాగ్ని సన్ని భాక్షుఁ డద్రి తోడ

  1.  

 

 

 

కం.

దయఁ జూప వేల రాముని

పయిఁ బర్వత రాజ!నాదు బాహుల భగ్నం

బయి కూలఁ గాంచ నెంతువె

భయంకరముగ నని కిన్క వాయుజుఁ డంతన్    

  1.  

 

 

 

తే.గీ.

అంత స తరు సనాగ గజాలిఁ గూడి

పసిడి ధాతువులను గూడి భగ్న భీమ  

కూటములఁ ప్రజ్వలిత సాను కోటిఁ బట్టి

పర్వతమ్మును బెకలించి వాత సుతుఁడు       

  1.  

 

 

 

కం.

పెకలిచి గిరి నింగి కెగిరి

సుకరముగ జగమ్ము లసుర సుర సంఘాత

మ్ము కలంగ స్తుతింప ఖచరు

లు కపి గరుడు వేగమున గురు బలుం డేఁగెన్   

  1.  

 

 

 

కం.

కొని భాస్క రాభ శిఖరము

చని భాస్కర పథమున రవి సరస వెలిఁగె భా

ను నిభాని లాత్మజుం డటఁ

గన రెండవ భాస్కరుఁ డనఁగ నిజప్రభలన్      

  1.  

 

 

 

కం.

గిరితో గంధవ హాత్మజుఁ

డురు వేగమునఁ జనుచుండ నుగ్రానలపుం

టరినిన్ సహస్ర ధార న

డరి యూనిన విష్ణు వన నడరెను భృశముగన్         

  1.  

 

 

 

తే.గీ.

వాని వీక్షించి యఱచిరి ప్లవగు లెల్ల

వారిఁ గని యార్చె నెద ముదమార హనుమ 

వీర లిట్లార్వ లంకలో వీర వర్యు

లాలకించి యఱచిరి భయావహముగ     

  1.  

 

 

 

ఆ.వె.

అమ్మహాత్ముఁ డంత నాశైల వరమునఁ 

బ్లవగ సేన మధ్యఁ బన్నుగ దిగి

వందనమ్ము చేసి వానరోత్తములకు

కౌఁగిలించెను దశకంఠు ననుజు

  1.  

 

 

 

తే.గీ.

అమ్మహౌషధ గంధమ్ము నన్నరేంద్ర

సూను లిర్వు రాఘ్రాణించి చోద్యముగ వి

శల్యు లైరి యవ్వానర సత్తములును

లేచి రన్యు లెల్లరును దెలివి వహించి

  1.  

 

 

 

తే.గీ.

క్షణమున నిహతు లైనట్టి కపి వరేణ్యు

లెల్ల వ్రణము లణఁగ రుజ లెల్లఁ దొలఁగ 

నోషధుల వాసన వలన నుర్వి నుండి 

లేచి రెల్లరు నిద్రించి లేచి నట్లు

  1.  

 

 

 

ఉ.

వానర ఘోర రాక్షసుల భండన మైన దినమ్ము నుండియున్

వానర కోటి ధాటికి నవారిత రీతిని నాజి లంకలో  

మేనులు గూల రక్కసుల మీన మహాలయ మందుఁ ద్రోసి రా 

మానిసి దిండ్లు రావణుఁడు మానము నెంచి యొసంగ నాజ్ఞనున్   

  1.  

 

 

 

కం.

హరి గంధవ హాత్మజుఁ డా

గిరిఁ దిరిగి హిమాద్రి నుంచి కేళీ లీలన్

మరలి రయమ్మునఁ జేరెను

నరేంద్రు రాముని సరస మన మలర నంతన్           

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు డెబ్బది  నాలుగవ సర్గము.

యుద్ధ కాండము

సర్గము 75.

 

 

 

సుగ్రీవుఁ డంత హనుమంతునితో లంకా నగరము దహింప నాజ్ఞాపింప వానరు లెల్లరు కాగడాలతో నా పురమును దహింప రావణుఁ డాగ్రహించి కుంభ నికుంభులను రాక్షస సేనతోఁ బంప వానర రాక్షసుల మధ్య ఘోర యుద్ధము జరుగుట.

 

 

 

 

కం.

హరిపతి సుగ్రీవుఁ డలిగి  

గురు తేజుం డర్థ వచన కోవిదుఁ డంతన్

మరు దాత్మజుండు నేరఁగ

గిర లింపుగ నిట్లెదఁ బరికించి వచించెన్       

  1.  

 

 

 

తే.గీ.

కుంభకర్ణుండు సూనులు గూల నాజి

రావణుం డీయఁ జాలఁడు రణము నింక

కాగడాలు గ్రహించి వేగమున మించు

బల్లిదులు హరు లీ లంక వైపు పాఱి       

  1.  

 

 

 

తే.గీ.

సింహ సంకాశు లెల్లరు సేరి రావ

ణాలయమ్మును గాల్పఁగ నరుగ నొప్పు

నన విని హరులు దినకరుఁ డస్తమింప

నిశిని నుల్కల తోడఁ జనిరి నగరికి     

  1.  

 

 

 

చం.

కరములఁ గాగడా లడర గ్రన్నన దిక్కులఁ బర్వు లెత్తుచున్

హరి వరు లాక్రమింపఁగ మహాసురు లారసి దేశ రక్షకుల్ 

పరువిడి రెల్ల భీతిలి యపారము ఘోర విరూప లోచనుల్

మురిసి కరమ్ము డెందములఁ బోవు నిశాచర కోటిఁ గాంచుచున్         

  1.  

 

 

 

తే.గీ.

గోపురమ్ముల వీథుల గొందు లందు

నట్టడుల నింక  వేశ్మమ్ము లందు నగ్ని

నుంచి రసుర వీరుల గృహ సంచయములఁ 

బర్వ తాభ సౌధమ్ములు నుర్విఁ గూలె      

  1.  

 

 

 

చం.

అగరులు మంచి గంధములు నచ్చట మౌక్తిక రత్నవజ్రముల్

పగడము లున్ని బట్టలును బాండు దుకూలము  పట్టు బట్టలున్

నగలు మహాయుధమ్ములు ఘనమ్ముగఁ గాలిన వెల్ల భాండముల్

సు గజ గళాభ్ర భూషలును సుందర వాజి పరిచ్ఛదమ్ములున్       

  1.  

 

 

 

తే.గీ.

అరదపుఁ దొడుగులు కరుల యశ్వముల క

వచము లా డాలులు భట కవచము లింక

ఖడ్గ తోమ రాంకుశ బాణ కార్ముకములు

శక్తులును నారు లెల్ల భశ్మమ్ము లయ్యె            

  1.  

 

 

 

తే.గీ.

అగ్ని దహియించె  రోమజ వ్యాఘ్రజ వర

వాల జాండజములఁ బెక్కు మేలి ముత్య

ముల మణుల నస్త్ర సంచయముల విచిత్ర

వివిధ గృహముల గృహగర్ధి వేశ్మములను          

  1.  

 

 

 

చం.

కనక విచిత్ర వర్మ ధర కమ్ర వరాంబర దామ ధారులన్

ఘన మద సక్త చిత్తుల నఖర్వ సురా చలితాక్షులన్ దహిం

చెను రిపు జాత రోషులను స్వీయ కళత్ర దుకూల హస్తులన్

సునిశిత శూల ఖడ్గ కర శూరుల భీమ గదా ధ రాదులన్

  1.  

 

 

 

ఉ.

త్రాగెడు వారి నింక తిను రక్కసులన్ నిదురించు వారినిన్

బాగుగ శయ్య లందుఁ బ్రియ భామల తోడుత నింక భీతితో

వేగమ పుత్ర యుక్తముగ వేదన మీఱఁగఁ బాఱు వారినిం

గాఁగఁగఁ జేసె లంకఁ గల కౌణప సంతతి మండి మాటికిన్    

  1.  

 

 

 

తే.గీ.

అర్ధ చంద్ర చంద్రాకార వర్ధనములు

సారవంత మహార్హ వేశ్మములు చిత్ర

కాంచన గవాక్ష తల్పయుక్తమ్ములు మణి

విద్రుమ విలసితమ్ములు విన్ను నంటి    

  1.  

 

 

 

ఆ.వె.

వెలయఁ గ్రౌంచ బర్హి వీణా నినాద భూ

షణ గణ రవములును సంతరింప

శైల సన్నిభముల సౌధ రాజమ్ముల

నెల్ల నగ్ని కాల్చె నెల్ల దిశల      

  1.  

 

 

 

కం.

అన లావృత తోరణములు

ఘనమ్ముగ వెలింగె నపుడు కనలుచు ఘర్మ

మ్మున వర్ధిల్లెడు సౌదా

మనీ సహిత మేఘ పంక్తి మాడ్కినిఁ గాంచన్     

  1.  

 

 

 

కం.

అన లావృత సౌధమ్ము ల

వనిఁ గూలెను జూచు చుండ వజ్రి నిశిత వ

జ్ర నిపాతమ్మునఁ గూలిన 

ఘన గిరి శిఖరమ్ముల వలెఁ గ్రన్నన లంకన్    

  1.  

 

 

 

తే.గీ.

ఇండ్ల నిదురించు చున్నట్టి యింతు లెల్ల

నొంటి నున్నట్టి నగలెల్ల నూడఁ గాలు

చుండి యార్తి హా హా యని సుదతు లార్చి 

రంత నుచ్చస్వరమ్ముల నడలు మీఱ     

  1.  

 

 

 

తే.గీ.

కాలు చున్నట్టి వవి యెల్లఁ గాంచ నిల్చి

కరము దూరమ్ము నుండి ప్రకాశితమ్ము

లై కనం బడె నంత దీప్తౌషధ యుత

హిమగిరి శిఖరముల భంగి నెల్లరకును    

  1.  

 

 

 

ఆ.వె.

జ్వాలల జ్వలియించు సౌధ శృంగమ్ములు

రాత్రినిఁ గనిపించె లంక లోప

ల వికసించి నట్టి రమ్య కింశుక వృక్ష

సంచయమ్ము పగిది మించి ప్రభల

  1.  

 

 

 

తే.గీ.

కుంజ రాధ్యక్ష వర ముక్త కుంజరములు

ముక్త ఘోటక సంచయమ్ములును సంచ

రింప నిటునటు లంకాపురి యగపడెను

బ్రళయ వేళ భ్రాంతగ్రాహ వనధి భంగి    

  1.  

 

 

 

ఆ.వె.

ఒక్కెడ గజము గని చక్క విడువఁ బడ్డ

యశ్వ రాజము నెద నడలి పాఱ

నొక్క చోటఁ గాంచి యొక్క భీత గజము

నశ్వము వెసఁ బాఱె నడలి యెడఁద      

  1.  

 

 

 

ఆ.వె.

మండు చుండ లంక మెండుగ నత్తఱి

నడరఁగఁ బ్రతి బింబ మప్పు లందు

నర్ణవమ్ము దోఁచె నరుణ వర్ణమ్మున

వెక్కసముగ నగ్ని పిక్కటిల్ల

  1.  

 

 

 

కం.

హరి వీర దగ్ధ లంకా

పుర మొక్క ముహూర్త కాలమున దీప్త వసుం

ధర భంగి మారినది దు

ర్భరప్రళయ వేళ యం దవారిత రీతిన్   

  1.  

 

 

 

ఆ.వె.

ధూమ యుక్త వహ్ని తోరమ్ముగ దహింప

నార్చి నట్టి రాక్ష సాంగనా స్వ

నమ్ములు శత యోజనమ్ముల దూరమ్ము

దనుక వినఁ బడినవి దారుణములు   

  1.  

 

 

 

కం.

సమ రాభిలాషులు హరులు

దుమికిరి మండెడు తనువులతో వెలి కరుదెం

చు మహాసుర వీరుల పయిఁ

దమక మతిశయింప నెదలఁ దత్క్షణ మలుకన్   

  1.  

 

 

 

ఆ.వె.

వాన రాసురప్రవరుల యుద్ఘోషమ్ము

నిండి దశ దిశలను నేల నింక

సాగరమ్మునెల్ల సత్వరమ్ము బ్రతిధ్వ

నింపఁ జేసెఁ జెలఁగఁ గంపనములు     

  1.  

 

 

 

చం.

ఇరువురు రామ లక్ష్మణు లహీన బలాఢ్యులు హీన శల్యులై

కరములఁ గార్ముకమ్ములను గ్రన్ననఁ గైకొని రెన్న కెట్టి తొం

దర నెద లందుఁ జాపమును దద్దయు లాగిన రాముఁ డంతటన్

గురుతర శబ్ద మేర్పడెను ఘోర భయమ్ము వహింప రక్కసుల్   

  1.  

 

 

 

కం.

వింటిని మ్రోయింప గగన

మంట రవమ్ము రఘు వీరుఁ డాగమ మయ మా  

వింటిని ధరియించిన ము

క్కంటి పగిది తోఁచె మనుజ కాంతుఁడు వింతన్    

  1.  

 

 

 

కం.

ఘన వానర ఘోషమ్ము వి

నిన రక్కసులు నొనరింప నిస్వనములు రేఁ

గిన మిక్కుటమ్ముగను రా

ముని జ్యా ధ్వని మించె రెంటిఁ బురమున వినఁగన్   

  1.  

 

 

 

తే.గీ.

వాన రోద్ఘోషిత ఘన నిస్వనము లింక

రాక్షసు లొనరించిన యట్టి రావములును

రాఘవేంద్రు జ్యా శబ్దం బమోఘము దశ

దిశలు నిండెను మూడును దిట్టముగను        

  1.  

 

 

 

ఉ.

రామ శరాసనోద్గత శరమ్ములఁ  దత్పుర గోపురం బహో

భీమము ముక్కలై పడెను బృథ్విని దీ టది వెండి కొండకున్

రాముని ఘోర బాణముల రాక్షసు లారసి మేడ లందు సం

గ్రామ నిమిత్త సన్నహన కార్యములం జెలరేఁగి రెల్లరున్     

  1.  

 

 

 

కం.

కన నా రాతిరి యుద్ధము

న నిరతి సెలఁగంగ సింహ నాదము లొనరిం

చు నసుర వీరులకుఁ బ్రళయ

పు నిసి యనంగ నెద లందు  స్ఫురియించె నహో    

  1.  

 

 

 

ఉ.

దండన యున్న ద్వారములు దప్పక చేరి రణం బొనర్పుఁడీ

రండని వానరాధిపుఁడు గ్రన్నన నాజ్ఞ నొసంగి పల్కె నే

రుండియు గుమ్మ మందుఁ దమి యుద్ధ మొనర్పక యున్న నిల్చి యా

తం డగు రాజ దూషకుఁడు దండన మందు నసంశయమ్ముగన్     

  1.  

 

 

 

ఆ.వె.

మండు చున్న దివ్వె లుండ హస్తమ్ముల

ద్వారముల సరసన వఱలు చుండఁ

బ్లవగ ముఖ్యు లంత వారి యందు నలుక

మూరె రావణునకు ఘోరముగను   

  1.  

 

 

 

ఆ.వె.

వ్యాకులమ్ము నందె నన్ని దిక్కులు దశ

కంఠుఁ డావులింప గాత్ర పంక్తి

నంత రుద్ర కోప మావహించిన  విధ

మగపడె నరయంగ నలుక నూన

  1.  

 

 

 

చం.

కుల ఘన కీర్తి వర్ధనులఁ గుంభ నికుంభులఁ గుంబకర్ణు సూ

నులను స రాక్ష సావలి ఘనుండు రణమ్మున కంపె రావణుం

డలుక వహించి కంపన వరాఖ్యుఁ బ్రజంఘుని శోణితాక్షునిన్

బలుఁ డగు యూపలోచనునిఁ బన్నుగఁ దోడుగ నుంచి వారికిన్      

  1.  

 

 

 

ఆ.వె.

ఉగ్రుఁ డనుమతించె యూపాక్ష ముఖ్యుల

సింహనాదములను జేసి చనుఁడు

రాక్షసవరు లార! రణమున కెల్ల ర

నుచు వచించి పొగడి యుచిత రీతి     

  1.  

 

 

 

కం.

జ్వలి తాయుధముల తోడఁ గ

దలి రావణ చోదితు లయి త్వరితమ్ముగ వా

రలు మాటిమాటికి నినద

ము లొనర్చుచు లంక నుండి పోయిరి పోరన్     

  1.  

 

 

 

తే.గీ.

రక్కసుల స్వర్ణ భూషల ప్రభలు స్వీయ

కాంతు లింకఁ బ్లవగుల యంగారకమ్ము  

లపుడు వెలుఁగుల నెల్లెడ నాకసమ్ము

నందు నింపిన వింపుగ నక్కజముగ    

  1.  

 

 

 

కం.

తారా నాథుని  కాంతులు

తారా గణ కాంతు లింకఁ దత్సైన్యాలం

కారముల జ్వలిత కాంతులు 

మూర నభో వీథి యెల్లఁ బొంగె వెలుఁగులన్

  1.  

 

 

 

ఆ.వె.

చంద్ర కాంతి గ్రహ నిచయ కాంతి భూషణ

పంక్తి కాంతి సర్వ వాన రాసు

రాప్రమేయ బలము నత్యధికమ్ముగ

వెలుఁగఁ జేసె నెల్లెడలను వింత   

  1.  

 

 

 

కం.

అర కాలిన గృహ కాంతులు

పరఁగు జలము తోడఁ జలిత భంగమ్ముల సా

గరము ప్రకాశించె నపుడు

తిరిగి నిరీక్షింప నత్యధికముగ నిసిలో

  1.  

 

 

 

సీ.

ధ్వజ పతాకమ్ములు దనరంగ నుత్త మాసి పరస్వధమ్ములు సెలఁగు చుండ

భీమాశ్వ రథ వర వేదండ రాజితమ్ము పదాతి సంకులమ్ము ఘన దీప్త

శూల గదా కరవాల తోమర కార్ముకప్రాస గణ సుప్రకాశితమ్ము

రాక్షస గణ సైన్య మక్షీణము సకింకిణీ శత నాదిత నినద బలము

 

తే.గీ.

కనఁబడెఁ గన కాంగదములఁ గదలు గొడ్డ

ళుల శర సహిత కార్ముకముల మహాయు

ధములఁ జందన మాల్య మద్య వర గంధ

మారుతమున నసుర వర్య మహిత బలము        

  1.  

 

 

 

కం.

కని వచ్చిన బలము జల ధ

ర నిస్వనము రాక్షస పటల సమావృతమున్ 

ఘనము దురాసదముఁ జలిం

చి నినాదమ్ములు ప్లవంగ సేన యొనర్చెన్   

  1.  

 

 

 

తే.గీ.

తిరిగి యా రాక్షస బలం బతి రయ మొప్ప

నుఱికె శత్రు సేన పయికి నుగ్రముగను

బావకుని పైకి నుద్ధతిఁ బర్వు లెత్తు

పతగ రాశి పగిది నంత భండనమున

  1.  

 

 

 

కం.

పరిఘలు వజ్రాయుధములు

కరముల రంజిల్లు చుండఁ గర మసుర బల

మ్ము రణ తలమ్మునఁ గాంచఁగ

విరివిగ శోభిల్లు చుండె వీరుల తోడన్

  1.  

 

 

 

కం.

హరి పుంగవు లున్మత్తుల

కరణి సమర కాంక్షు లెగిరి కయ్యము నందుం

దరు పర్వత ముష్టులఁ గొ

ట్టి రంత రక్కసులఁ గడు వడి సరోషులునై    

  1.  

 

 

 

ఆ.వె.

అసురు లట్లె వచ్చు హరి వీరులం గని

భీమ కాయు లంత విక్రమించి

శిత శరమ్ము లేసి శిరముల ఖండించి

రాగ్రహించి త్రుటిని నవనిఁ గూల

  1.  

 

 

 

తే.గీ.

దంత దంశిత కర్ణులు వంత తోడ

ముష్టి ఘాత విఖండిత మూర్ధు లింక

ఘన శిలా చయ నిర్భిన్న కాయు లసుర

వీరులు చరించి రాజిని ఘోరముగను

  1.  

 

 

 

ఉ.

అవ్విధి ఘోర రూపులు మహాసుర వర్యులు వానరావళిన్

నొవ్వఁగఁ దీక్ష్ణ ఖడ్గము లనూహ్య విధమ్ముగ దించి చంపఁగా

నెవ్వఁడు కొట్టె వానిఁ బరుఁడే వెసఁ గొట్టఁగ నెట్టు వానినిం

ద్రెవ్వఁగ నెట్టె నన్యుఁ డొరుఁ దిట్టిన గొర్కిన నట్లె యయ్యెడిన్

  1.  

 

 

 

ఆ.వె.

కొట్టు మనఁగ నదిగొఁ గొట్టు చున్నాఁ డని

కొట్టు చుంటి నంచు నిట్టు లేల

శ్రమపడెదవు నిలువ రాదె యనుచు నొండొ

రులు వచింపఁ జాగె పలుకు లచట     

  1.  

 

 

 

తే.గీ.

శస్త్రములు వ్యర్థములు గాఁగ సజ్జ లణఁగ

నెత్తి నట్టి ప్రాసలతోడఁ గత్తు లింక

శూలములు యష్టు లడరంగ నాల మందుఁ    

బ్రబలె వానర రాక్షస భండనమ్ము

  1.  

 

 

 

ఆ.వె.

చంప నసురు లాజి శాఖామృగులను బ

దుండ్ర నేడ్గురఁ బగ తోడఁ జెలఁగి

రక్కసులను వానర వరు లడఁచిరి ప

దుండ్ర నేడ్గుర నని దూఁకి దూఁకి        

  1.  

 

 

 

కం.

రాలఁగఁ గేశాంబరములు

గూలఁగఁ గవచధ్వజములు క్రుంగఁగ ఘో రా

భీ లాసుర సైన్యమ్మును 

లీలం జుట్టి నిలిచిరి వలీముఖ వీరుల్    

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు డెబ్బది  యేనవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 76.

 

 

 

వానర రాక్షస మహా యుద్ధములో నంగదునిచేఁ గంపన ప్రజంఘులు, ద్వివిదునిచే శోణితాక్షుఁడు మైందునిచే యూపాక్షుఁడు సుగ్రీవునిచేఁ గుంభుఁడు నిహతు లగుట. 

 

 

 

 

కం.

వీర జనక్షయ సంకుల

ఘోర రణము వర్తిలంగఁ గోపించి కడున్

శూరుం డంగదుఁడు కదిసె

ఘోరునిఁ గంపను రణోత్సుకుఁ డసుర వీరున్       

  1.  

 

 

 

కం.

అంగదునిఁ బిలిచి డెందము

నం గినిసి కరమ్ము కంపన మహాసుర సే

నాంగ విభుఁడు మును గదతో

నంగదుఁ గొట్టఁ జలియించె హరివరుఁ డార్తిన్    

  1.  

 

 

 

తే.గీ.

సంజ్ఞను బడసి తేజస్వి శైల శృంగ

మును విసరె నంగదుండు రిపు వరు పైన

నర్దితుం డయి కంపనుం డవనిఁ గూలె

హతునిఁ గంపను గని శోణితాక్షుఁ డాజి    

  1.  

 

 

 

చం.

కదిసెను దేరుపైఁ బ్లవగ కాంతుని నంగదు వీత భీతినిం 

బదను శరమ్ము లేసి వెస బాధ నొసంగెను మేనుఁ జీల్పఁగన్

విదులిచెఁ గాల వహ్ని నిభ విగ్రహ వత్స రదాభ బాణముల్  

పదపడి శల్య కర్ణి సవిపాఠము లింక క్షుర క్షురప్రముల్

  1.  

 

 

 

తే.గీ.

బాణ విద్ధుఁ డంగదుఁ డంత వాలి సుతుఁడు  

సుప్రతాపవంతుఁడు మహా శూరుఁ డడరి

బల్లిదుండు మర్దించెను వాని వింటి 

నమ్ముల రథమ్మును భృశ బలమ్ము నూని     

  1.  

 

 

 

ఆ.వె.

కత్తి డాలు నంతఁ గైకొని శోణితా

క్షుండు పైకి నెగురఁ గ్రుద్ధుఁడై క

రమ్ము శంక వీడి రయము మీఱ నెగిరి

యంగదుఁ డసి లాగి యఱచె నంత     

  1.  

 

 

 

ఆ.వె.

లాగి వాని భుజ పలకము పై యజ్ఞోప

వీత గతినిఁ గోసె నాతతముగ

నంగదుండు నసురు నసితోడ శత్రు ల

పరుల పయికి నుఱికెఁ బట్టి కత్తి      

  1.  

 

 

 

శా.

యూపాక్షుండు ప్రజంఘు తోడుతను యుద్ధోత్సాహి యేతెంచె నా

కోపావేశుఁడు స్యందనమ్మునఁ  బ్లవంగుం దాఁక నయ్యంగదుం

దోఁపంగన్ ససి శోణితాక్షుఁడును వే దూఁకెన్ గదా హస్తుఁ డా

టోపస్వాంతుఁడు కాంచ నాంగదుఁడు విడ్డూరమ్ముగా వానిపై    

  1.  

 

 

 

తే.గీ.

శోణితాక్ష ప్రజంఘుల శూర వరుల

నడుమఁ గపి పుంగవుఁడు దోఁచె నడరి పూర్ణ

చంద్రు వోలె విశా ఖాఖ్యఁ జనెడు తార

ల నడుమ నలరు చుండఁగఁ గనుల కపుడు        

  1.  

 

 

 

తే.గీ.

తలఁచి రక్షింప నంగదు నిలిచి రంత 

ద్వివిద మైందు లతని చెంత  వీర వరులు

గాంచుచు పరస్పర మెదుర్పఁగఁ దగి నట్టి

శత్రుపక్ష వీరులను దత్సమర మందు

  1.  

 

 

 

ఉ.

వెగ్గల మైన గాత్రముల వీరులు రాక్షసు లూని ఖడ్గముల్

డగ్గఱి ఘోరముల్ గదలు డాళుల తోడుత సంభ్రమమ్మునన్

ముగ్గురు రాక్షసేశ్వరులు పోరు నొనర్పఁగ  భీకరమ్ముగన్  

ముగ్గురు వాన రోత్తముల ముందుఁ జెలంగె రణమ్ము ఘోరమై

  1.  

 

 

 

ఉ.

వారు గ్రహించి వృక్షములు వానర వర్యులు కిన్క వైవఁగా

మూరి ప్రజంఘుఁ డన్నిటిని ముక్కలు సేసె వహించి ఖడ్గమున్

దారుణ శైల పాదప వితానము పర్ప రథాశ్వ కోటిపై

నారసి యూపనేత్రుఁడు మహాసురుఁ డమ్ములఁ ద్రుంచె వానినిన్   

  1.  

 

 

 

ఉ.

మ్రానులఁ గైఁ బెకల్చి వెస మైందుఁడు నా ద్వివిదుండు వైవఁగా

వానిని శోణితాక్షుఁ డని భగ్నము సేసె గదాయుధమ్మునన్

మానుగ మధ్య విక్రముఁ డమర్షము తోడఁ బ్రజంఘుఁ డుద్ధతిన్

వానర రాజ నందనుని పజ్జకుఁ బర్విడె ఖడ్గ హస్తుఁడై

  1.  

 

 

 

చం.

తన దెస వచ్చు వానిఁ గని తత్క్షణ మంగదుఁ డశ్వకర్ణమున్

ఘన తరు వెత్తి బల్లిదుఁడు గ్రన్ననఁ గొట్టెను వానరేంద్రుఁడే 

ఘన నిజ ముష్టిఁ గొట్టెను సఖడ్గ మహాసుర బాహు దండమున్

వనరఁగ రక్కసుండు కరవాలము గూలెను నేలపై వెసన్   

  1.  

 

 

 

చం.

కని భువిఁ గూల స్వీయ శిత ఖడ్గము నా ముస లాభ మవ్విధ

మ్మున బిగియించి వజ్ర నిభ ముష్టి ప్రజంఘుఁడు బల్లిదుండు గొ

ట్టె నొసలు పైన గట్టిగ వడిం గపి వర్యునిఁ గొట్ట సంచలిం

చె నొక ముహూర్త కాలము నశింపఁగ సంజ్ఞ యొకింత యంతటన్    

  1.  

 

 

 

తే.గీ.

పడసి సంజ్ఞను దేజస్వి వాలి సుతుఁడు

సుప్రతాపవంతుఁడు కడు చోద్యముగఁ బ్ర

జంఘు రక్కసు శిరమును జఱచి ముష్టి

వేరు చేసె దేహము నుండి వీర వరుఁడు 

  1.  

 

 

 

ఉ.

అక్షుల నిండ నశ్రులు తదంకమునం బినతండ్రి గూల యూ

పాక్షుఁడు డిగ్గి స్యందనము నందెను ఖడ్గము వీర పుంగవుం

డా క్షయ బాణ సంచయుఁడు నట్లరు దెంచుచు నుండ వేగ యూ

పాక్షుఁ బ్లవంగుఁ డా ద్వివిదుఁ డారసి గొట్టి బలుండు ఱొమ్మునన్    

  1.  

 

 

 

తే.గీ.

పట్టె వానిని గట్టిగఁ బట్ట భ్రాత

నరసి శోణితాక్షుండు మహాబలుండు

ద్వివిదు గదతోడఁ గొట్టెను బృథుతరంపు

వక్ష మందు నుగ్రుండునై వానరేంద్రు      

  1.  

 

 

 

కం.

చలియించి గదా ఘాతుఁడు

తెలివిం గొని ద్వివిదుఁ డంతఁ దిరిగి కపి మహా

బలుఁ డెత్తిన గదఁ గైకొనె

బలిమి నసురు నుండి వేగవంతుం డంతన్     

  1.  

 

 

 

కం.

హరి యూధపుండు మైందుం

డురమున యూపాక్షుఁ గొట్టె నుగ్ర తరంబౌ

కర తలమున వీర వరుఁ డ

సుర పుంగవుఁ గదిసి ద్వివిదు శూరత్వమునన్    

  1.  

 

 

 

తే.గీ.

శోణితాక్ష యూపాక్షులు శూర వరులు

సెలఁగి మైందద్వివిదులతోఁ జేసి రంత

ఘోర యుద్ధమ్ము బలిమి లాగుచు వెసఁ బెక

లించుచు నతి తీవ్రమ్ముగ సంచరించి    

  1.  

 

 

 

చం.

ద్వివిదుఁడు శోణితాక్షు ఘన వీరుని గీరి ముఖమ్మునన్ నఖా

లి వెస ధరాతలమ్మునను లీలఁగఁ ద్రోసి నలంగఁ జేయఁగాఁ

గవియుచు యూపలోచనునిఁ గ్రన్నన మైందుఁడు నొవ్వఁజేయ బా

హువుల భృశమ్ము గూలె నసురోత్తముఁ డత్తఱి సంగరావనిన్       

  1.  

 

 

 

కం.

వీర వరు లట్లు నిహతులు

కా రాక్షస సైన్య మంతఁ గదలెను భీతిం

జేరంగఁ గుంభకర్ణ కు

మారుం డున్నట్టి చోటు మన నెంచి వెసన్   

  1.  

 

 

 

ఉ.

వచ్చెడు రాక్షస ధ్వజనిఁ బన్నుగ నారసి కుంభుఁ డింపుగా

నచ్చట నూఱడించి పరమాద్భుత కర్మము సంగరమ్మునన్ 

మెచ్చ భటాలి సేసెఁ గని మేటి బలాఢ్యులు వీర రాక్షసుల్

చచ్చిన శేష సైన్యమును సాధిత లక్ష్యుల వానరేంద్రులన్

  1.  

 

 

 

ఆ.వె.

ధనువు వెస గ్రహించి ధానుష్కు లందు శ్రే

ష్ఠుండు కుంభుఁ డసుర శూర పుంగ

వుండు విడిచెను శర తండము తను దార

ణముల  నహి నిభముల  సమర మందు

  1.  

 

 

 

కం.

ఆతని బాణ సహిత ధను

వా తఱి శంపా లతా యు తైరావత నై

జాతత రుచి ధను వది ద్యో

జాతం బపరేంద్ర చాప సరణినిఁ దోఁచెన్    

  1.  

 

 

 

తే.గీ.

పసిడి పొన్నుల తోడుతఁ బత్ర వసన

ముల నలరు నమ్ములను గర్ణము వఱకు వెస

లాగి గొట్టెను ద్వివిదుని రాక్షసుండు

కుంభకర్ణాత్మజుఁ డనిలో ఘోరముగను   

  1.  

 

 

 

కం.

శరఘాతమ్మున ద్వివిదుఁడు

చరణమ్ములు దడఁబడంగ శాఖామృగ రా

డ్వరుఁ డద్రి కూట సదృశుఁడు

ధరఁ గూలెను విహ్వలుఁ డయి తద్దయు నంతన్    

  1.  

 

 

 

తే.గీ.

మహిఁ బడంగ ఘోరాజిని మైందుఁ డరసి

తమ్ముని మహా శిలను బట్టి త్వరితముగఁ బ

రువిడి కుంభుని పయి వైవ రుచిర శరము

లైదు వేసి ముక్కలు సేసె నసుర వరుఁడు  

  1.  

 

 

 

కం.

ద్వివి దాగ్రజు నన్య శరము

న విషాహి నిభమున నురమునం గొట్టె ఘనుం

డు వెసం దగ సంధించి హ

రి వీరు నా కుంభుఁ డంత రేఁగిన కినుకన్      

  1.  

 

 

 

తే.గీ.

వ్రేటునకుఁ గపి యూధప శ్రేష్ఠుఁ డంత

మైందుఁడు తగుల మర్మము లందు మూర్ఛ

నంది నేలపైఁ గూలఁగ నంగదుండు

మర్దితులఁ గాంచి తన మేనమామల నని   

  1.  

 

 

 

కం.

త్వరితమ్ముగఁ బరువెత్తె న

సుర వర్యుని కుంభు దెసకు శూరుం డుద్య

ద్గురు కార్ముక కరుఁడై నిలు

వ రణమ్మున నంగదుండు ప్లవగుం డలుకన్     

  1.  

 

 

 

చం.

ఇనుప శరమ్ము లైదిట హరీంద్రుని మూడిట తీక్ష్ణ బాణ పం

క్తిని గజరాజుఁ దోమర గతిన్ వెసఁ గొట్టెను గుంభుఁ డంగదుం 

గనక విభూషి తాంబక నికాయమునన్ నిశి తేద్ధ ధారలం

గినుకను దా ననేకములఁ గృత్స్నము నొవ్వ శరీర మత్తఱిన్

  1.  

 

 

 

కం.

కంపింప డంగదుం డని

నొంప శరమ్ములు కపుల ఘనుం డంతట వ

ర్షింపఁగఁ జేసె శిరమ్మున

నింపుగ శిలలను దరువుల నెల్ల నసురుపై       

  1.  

 

 

 

చం.

శిలలను జేసె వ్రక్కలుగఁ జీల్చెను ముల్కులఁ బాదపమ్ములన్

లలి నట నంగ దేరితములం బలలాశన నందనుండు శ్రీ

విలసితుఁ డుల్కలం గరిని విద్ధము సేయు గతిం బ్లవంగు భ్రూ

వుల పయి వేసి బాణములు వోరున నొంచెను దూఁకు నంగదున్

  1.  

 

 

 

ఉ.

కాఱఁగ రక్త మక్షులను గప్పి గరమ్ముల వాని నింపుగాఁ

బాఱి సమీప పాదపముఁ బట్టి కరమ్ముల నొక్కి ఱొమ్మునం 

దేఱి యొకింత వంగి  కడు దిట్ట సకాండము శక్ర కేతువున్

మీఱిన మందరాభమును మిన్నగ వైచెఁ బెకల్చి కుంభుపై

  1.  

 

 

 

ఆ.వె.

అసురు లరయు చుండ నంగ దారణ శిత

శరము లేడు వేసి దరువుఁ జీల్చెఁ   

గుంభుఁ డంగదుండు ఘోరంపు టార్తినిఁ

గూలెఁ దెలివి లేక నేల పైన         

  1.  

 

 

 

కం.

క్షీణించు వనధి వలె న

క్షీణ బలుని నంగదుఁ గపిశేఖర వర్యున్

బా ణార్తు నా ప్లవంగ

శ్రేణులు రామునకుఁ దెలిపిరి యితరు లంతన్ 

  1.  

 

 

 

కం.

కని యార్తుని వాలి సుతుఁ గ

దనమ్మున రఘూద్వహుండు త్వరితమ్ముగఁ బం

చెను జాంబవన్ముఖప్లవ

గ నాయకుల నంగదు ననిఁ గావఁగ నంతన్    

  1.  

 

 

 

తే.గీ.

అగ్ర వానర శార్దూలు రాగ్రహించి

రామ శాసన బద్ధులై రాక్షస వరు

కుంభుని పయి నుద్యత కార్ముకుని పయి కురి

కిరి రణాంగణమ్మునఁ దమకించి యెల్ల        

  1.  

 

 

 

ఆ.వె.

తరుల శిలల నూని కరములఁ గన్ను లె

ఱ్ఱవడఁ గోపమునఁ దఱచుగ రక్ష

ణమ్ము నీయ నెంచి నెమ్మి నంగదునకు

వానరర్షభు లటఁ బాఱి రాజి     

  1.  

 

 

 

ఆ.వె.

జాంబవత్సుషేణులుం బర దమనుండు 

వేగదర్శి కుంభు వీర వర్యు

మార్కొనంగ నా సమర మందు పరుగు లి

డిరి  బ్లవంగ వరులు కరము కినిసి     

  1.  

 

 

 

కం.

పరుగున వచ్చెడు వానర

వరులను బల్లిదుల నాపె బాణౌఘమునన్

గిరిచే వారింపఁ బడెడు

శరనిధి వలెఁ గుంభుఁ డడరి శౌర్యోద్ధతినిన్   

  1.  

 

 

 

ఆ.వె.

బాణ పంక్తి నంత వానరేంద్రులు దాఁటఁ

జాల రైరి యేరు వేల దాఁటఁ

జాల నట్టి కడలి చందమ్ముగ మహాత్ము

లక్కజముగ సమర మందు నపుడు     

  1.  

 

 

 

తే.గీ.

అంత నమ్ముల వానచే హరి గణములు

నొవ్వఁ గాంచి సుగ్రీవుఁడు రివ్వున నని

దూఁకె వెనుక నంగదు నుంచి వీఁకఁ గుంభు

పయికి మృగరాజు కరి పైకిఁ బాఱు పగిది

  1.  

 

 

 

చం.

పెకలిచి శైల రాజములు వృక్ష సమూహము లశ్వకర్ణముల్

సు కపి గణేశుఁ డన్యముల సూర్య సుతుండు బలుండు వైవఁగా

వికలము సేసె నా యసుర వీరుఁడు కుంభుఁడు వృక్ష వృష్టి నం

బకములు వేసి తీక్ష్ణములు వ్యాప్తములన్ దివి దుస్సహమ్ములన్

  1.  

 

 

 

తే.గీ.

చక్కని గుఱి తోడ నిశిత శరము లేసి 

కుంభకర్ణాత్మజుఁడు సీల్ప ఘోరముగఁ ద

రులు శతఘ్నుల పగిది వెలుంగు చుండెఁ 

బీడ్యమానమ్ములై యట వింత గొలుప    

  1.  

 

 

 

తే.గీ.

భిన్న మైనట్టి పాదప వృష్టిఁ గాంచి

వంత జెందఁడు మది లోన సుంత వాన

రాధిపుండు శ్రీమంతుఁడు నర్క నంద

నుండు సుగ్రీవుఁడు కినిసి మెండుగాను

  1.  

 

 

 

చం.

శరముల నొచ్చు చుండియు భృశమ్ము రయమ్మున లాగి యమ్మహా

సురు ఘన కార్ముకమ్ము కపి శూరుఁడు భగ్నము సేసె బల్మినిన్

సుర విభు చాప సన్నిభముఁ జోద్యపుఁ గర్మ మొనర్చి గెంతి యి

గ్గిర లనె నంతఁ గుంభుఁ బరికించి విశీర్ణ రదేభ సన్నిభున్     

  1.  

 

 

 

చం.

వినుతము నీదు తేజు శర వేగ నిభం బగు నద్భుతమ్మునున్

ఘనుఁడ! నికుంభ సోదరుఁడ! గాంచఁ బ్రభావము నందు సన్నతిన్ 

ఘన దశకంఠ తుల్యుఁడవు కల్గితి తండ్రికిఁ దగ్గ పట్టివై

విను వనధీశ వాసవ కుబేర మహాబలి తత్సు తాభుఁడా    

  1.  

 

 

 

చం.

ఘనభుజు నిన్ను శూలధరుఁ గార్ముక హస్తుని శత్రు మర్దనా! 

యనిముషు లైన మించఁ దగ రాజి జితేంద్రియు శోక రాశి భం

గినిఁ దగ విక్రమింపు పరికింపఁగ నే నిట నీదు చేతలం  

గొని వర పంక్తి రావణుఁడు ఘోర బలమ్మున నీదు తండ్రియున్ 

  1.  

 

 

 

తే.గీ.

సైచు చున్నా రసుర సుర సంచయమును

సముఁడ వింద్రజిత్తున కీవు చాపమందు

దశ ముఖునకు సముఁడవు ప్రతాప మందు

రక్కసుల మేటివి బల పరాక్రమముల    

  1.  

 

 

 

కం.

మన మధ్య తనరు సమర

మ్మున ఘోర విమర్దనమ్ము భూతమ్ములు  నేఁ

డు నిలిచి చూడఁ గలవు 

క్రునకును శంబరున కైన ఘో రాజి వలెన్    

  1.  

 

 

 

కం.

చేసితి వసమాన చేష్టలు సూపితి

వస్త్ర కౌశలమ్ము హరివరేణ్యు

లను బరాక్రములను రణమునఁ గూల్చితి   

వీ వనేకుల నసురేంద్ర! వినుమ   

  1.  

 

 

 

తే.గీ.

అలసి యున్న వానినిఁ జంపె నన్న నింద

కడలి చంపఁ జాలను నిన్ను నంక మందు

సుంత విశ్రాంతి గైకొని చూడు మసుర

వర్య! సంగరమ్మున నాదు బలము నెల్ల

  1.  

 

 

 

కం.

అవమాన యుక్త సుగ్రీ

వ వచనముల గౌరవింపఁ బడ నాజ్యమ్ముం 

దివిరి హుతము సేసిన వ

హ్ని విధిఁ బెఱిగె నతని  తేజ మెల్ల రయమునన్     

  1.  

 

 

 

తే.గీ.

అంతఁ గుంభుఁడు సుగ్రీవుఁ బంత మూని

పట్టె బాహుల సమ్మద వారణద్వ

యమ్ము భంగి నిట్టూర్చుచు నప్పు డొండొ

రులు నొరసి కొనుచు శరీరములఁ బెనఁగిరి      

  1.  

 

 

 

కం.

శ్రమియింప భృశమ్ముగ స్వీ

య ముఖమ్ముల ధూమ సంయు తానల మంతం 

గ్రమముగ విడువం బడె నా

సమ రావని ఘోర రాక్షస హరి వరులచే    

  1.  

 

 

 

ఆ.వె.

క్రుంగె నేల వారి ఘోర చరణ పీడ

నముల సంగ రాంగణమున భృశము

కలఁగె నంతఁ గడలి కల్లోలములు ఘూర్ణి

తములు గాఁగఁ గంపనములు సెలఁగ      

  1.  

 

 

 

కం.

హరి నాథుఁడు సుగ్రీవుఁడు

కరముల నెత్తి వెసఁ గుంభుఁ గడలిని వైచెం

గరము కినిసి చూపించెను

శరనిధి భూభాగ మంత సత్త్వం బడరన్      

  1.  

 

 

 

కం.

పడఁ గుంభుఁడు జలరాశిని

వడి వ్యాపించెను సుఘోర పాథోనిధి యె

ల్లెడలం దక్కజముగ నపు

డడరుచు ఘన వింధ్య మంద రాద్రుల భంగిన్   

  1.  

 

 

 

ఉ.

తా వెస గెంతి కుంభుఁడు పతద్వరమో యన ముష్టిఁ గొట్టె సు

గ్రీవుని వక్ష మందుఁ జెలరేఁగి భృశమ్ముగఁ జేరి చెంతకున్

వావిరి యైన వ్రేటునకు వ్రక్కలు నయ్యెను బొందళమ్ము ధా

రా విధ మంత కాఱినది రక్తమె యస్థులు మ్రోగె ముష్టినిన్

  1.  

 

 

 

ఆ.వె.

మెఱుపు లుద్భవించె మించిన ముష్టి వే

గమున కంత వజ్ర ఘాతమునకు

మేరు పర్వతమున మూరి జ్వా లావలి

వుట్టి నట్లు దోఁప బెట్టిదముగ   

  1.  

 

 

 

ఉ.

కొట్టఁబడంగ నట్టు లతి ఘోరముగం గపి వర్యుఁ డంతటన్

బెట్టిద మైన ముష్టి నతి వేగముగన్ బిగియించి కాంతు లం

దిట్టలమై సహస్ర కిరణేశ్వరు కాంతికిఁ దోఁపఁ గట్టిగాఁ

గొట్టెను వజ్ర కల్పమునఁ గుంభు నురమ్మున  విక్రమమ్మునన్    

  1.  

 

 

 

ఆ.వె.

విహ్వలుఁడు నయి భృశ పీడితుం డా కుంభుఁ

డంత జ్వాల లెల్ల నణఁగి నట్టి

నగ్ని వోలెఁ గూలె నవని నా ముష్టి ఘా

తమ్మున నసురుండు సొమ్మసిల్లి   

  1.  

 

 

 

కం.

పిడికిలి పోటున కాతఁడు

వుడమిం గూలె వెస నసుర పుంగవుఁ డంతం

గడు వెలుఁగు లోహి తాంగుఁడు

నుడు మార్గము నుండి కూలు నోజ యదృచ్ఛన్

  1.  

 

 

 

కం.

పడు కుంభుని రూప మపుడు

పిడికిలి విఱిఁగిన నురమున  వీక్షింపంగా

నడరెను హరుచేఁ గొట్టం

బడి నట్టి గవాంపతి వలె బవరము నందున్    

  1.  

 

 

 

కం.

మరణింప విక్రమునిచే

హరి వర్యుని చేతఁ గుంభుఁ డసురేంద్రుండే

ధర స గిరి వనము వణఁకె న

సురులం దధికం బెడఁదలఁ జొచ్చెను భయమే        

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు డెబ్బది  యాఱవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 77.

 

 

 

అగ్రజుఁడు కుంభుఁడు సుగ్రీవునిచే నిహతుఁడు గాఁగఁ గ్రుద్ధుఁడై నికుంభుఁడు ఘోర యుద్ధము సేయఁగా హనుమంతుఁడు వాని నెదిర్చి వధించుట.

 

 

 

 

కం.

కని సుగ్రీవుని చేఁ గూ

లిన యన్నను గుంభు నంత రేఁగిన కోప

మ్మున వానరేంద్రుని దహిం

చు నట్టుల నికుంభుఁ డాజిఁ జూచెను రవిజున్

  1.  

 

 

 

చం.

కొని వెస నా నికుంభుఁ డనిఁ గూర్పఁగ నింపుగఁ బుష్పమాలలం

గనక విభూషితమ్ముఁ బరిఘన్ మణి విద్రుమ భూషితమ్ము కా

ల నిజ క రేద్ధ దండ నిభ రమ్య మహేంద్ర నగాగ్ర తుల్యముం 

గనఁ బడ నైదు వ్రే ళ్లడరి గంధ యుతమ్ముగ  ధీరుఁ డంతటన్   

  1.  

 

 

 

తే.గీ.

రాక్షస భయ నాశనము సంక్రందనధ్వ

జ సదృశమ్మును దేజస్వి చక్కఁ బట్టి

భీమ విక్రముఁ డాస్యము వితతముగఁ దె

ఱచి నికుంభుఁడు రణమం దఱచె భృశమ్ము

  1.  

 

 

 

తే.గీ.

ఉరమునం బతకమ్ము కేయూరములు భు

జముల నగల మాలలఁ గుండలములఁ జిత్ర

ముల వెలిఁగె నికుంభుం డుఱుములు మెఱపులు  

శక్ర ధను వున్న మేఘంపు సరణి నపుడు      

  1.  

 

 

 

తే.గీ.

స్వీయ పరిఘాగ్ర భంజిత వాయు సంయు

తాసమ గ్రంథి సధ్వని భాసమాన

ధూమ హీన పావకు భంగి నా మహాత్ముఁ

డు వెలిఁగె నికుంభుఁ డతి బలుండు ఘనుఁ డచట     

  1.  

 

 

 

తే.గీ.

అసురు పరిఘ తిరుగుచుండ విసవిస నల

కాపుర మమరావతి లోక గణము గ్రహము

లు శశి తారలు నభ మెల్ల దిశలు దిరుగు

చందమునఁ దోఁచె నపు డక్కజమ్ము వొడమ        

  1.  

 

 

 

ఉ.

చేరఁగ రాని దయ్యెను విశేషముగా జ్వలియింప నంతపుం

దీరున రేఁగ నా పరిఘ దీప్త విభూషణ కాంతి తోడ దే  

వారి నికుంభ నామ సుమహాగ్ని యుగాంత మహాన లాభమై

ఘోరపు టింధనం బయి నికుంభుని రోషము వెల్గ నేరికిన్      

  1.  

 

 

 

కం.

అసురులు వానరు లేరును

బస లేక కదలక నిల్వ భయ విహ్వళులై

వెస ఱొమ్మును విచ్చి నిలిచె

నసురుని బలవంతు చెంత హనుమంతుఁ డనిన్

  1.  

 

 

 

ఆ.వె.

పరిఘ సన్నిభ నిజ బాహుల సూర్య ప్ర

భా సదృశ పరిఘను బల్లిదుఁడు ని

కుంభుఁ డంత వైచె ఘోరముగఁ దగుల

వక్ష మందుఁ బ్లవగ వర్యు నరసి    

  1.  

 

 

 

కం.

స్థిర మగు హనుమ విశాలపు

టురముం దాఁకి పరిఘ యసు రోత్తముఁ డుగ్రుం

డరయ నయి వంద ముక్కలు

ధరఁ జెదరె శ తోల్కల వలెఁ దారాధ్వమునన్   

  1.  

 

 

 

కం.

చలియించెఁ బరిఘ యట్లు త

గుల హనుమంతుఁడు కడింది కుంభిని కదలం

జలియించెడు కొండ పగిది

బలవంతుఁడు వాయు సుతుఁడు ప్లవగుం డాజిన్    

  1.  

 

 

 

చం.

అసురుని చేతఁ గొట్టఁబడి యక్కపి వర్యుఁడు బల్మి ముష్టినిన్

వెస బిగియించి గట్టిగను వీరుఁడు వేగమ యెత్తి కొట్టె న

య్యసురు నికుంభు ఱొమ్ము పయి నంజని పుత్రుఁడు వేగవంతుఁ డ

య్యసమ బలాన్వితుండు పరమాద్భుత తేజుఁడు వాయు తుల్యుఁడున్    

  1.  

 

 

 

ఆ.వె.

ముష్టి దెబ్బ కసురు బొందడమ్ము వగిలి

కాఱె రక్త మంత గాత్ర వరము

నుండి మిక్కుటముగ మెండుగ మెఱపులు

మేఘ రాశి లోన మెఱయు నట్లు 

  1.  

 

 

 

తే.గీ.

కడు చలించెను దన్ముష్టి ఘాతమునకు

నా నికుంభుఁ డసుర వర్యుఁ డంత నంది

స్వస్థతను బట్టి హనుమంతు సత్త్వవంతు

నమ్మహాకపిఁ బయి కెత్తె నడరి కినిసి    

  1.  

 

 

 

కం.

కని హనుమంతుని నెత్తఁ బ

డ నికుంభునిచే నసురు లడరు చుండి కడున్

జను లా లంకా వాసులు

ధ్వను లొనరించిరి ముదమ్ము వడసి ఘనముగన్

  1.  

 

 

 

తే.గీ.

రక్కసుఁడు కొని చనుచున్న నక్కపి వరుఁ

డంత ముష్టి నసురుఁ గొట్టి యశని కల్ప

మున ననిల తనయుం డప్డు దనకుఁ దా వి

ముక్తుఁడై యుఱికి హనుమ పుడమి పైకి      

  1.  

 

 

 

కం.

పీడించె నికుంభు నసురు

గాడుపు పట్టి ధరఁ గూల్చి కపివర్యుఁడు తో

డ్తోడ యెగిరి పైకి నలిపెఁ

బాడిగఁ బడి ఱొమ్ము పైన వానినిఁ గినుకన్      

  1.  

 

 

 

ఆ.వె.

పట్టి నిజ కరముల గట్టిగఁ ద్రిప్పి మె

డ నలుక సెలగంగ హనుమ యసురు

శిరమును బెకలించె హరి వీరుఁ డార్వ భై

రవముగ నట నార్తి రాక్షసుండు

  1.  

 

 

 

తే.గీ.

అట్లఱచుచు నశింపఁగ నాంజనేయు

ని కరముల నికుంభుఁడు రామునికిని రాక్ష

సేంద్రు సూనునకుఁ జెలంగ నిరువురకు భృ

శంపు రోష మయ్యెను ఘోర సంగరమ్ము    

  1.  

 

 

 

తే.గీ.

ఆ నికుంభు జీవుఁడు సన నట్లు తొలఁగి

ప్లవగు లఱచిరి నిండెను ధ్వనులు దిశల

నుర్వి కంపించె నాకసం బూడి పడెను

భయము సెలరేఁగె రాక్షస బలము నందు    

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు డెబ్బది  యేడవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 78.

 

 

 

కుంభ నికుంభుల మరణము విని రావణుఁడు కోపోద్రిక్తుఁ డయి రామలక్ష్మణులను వానర సహితము సంప ఖరసుతుని మకరాక్షుని యుద్ధమునకుఁ బంప నతఁడు వొడఁ జూపు దుర్నిమిత్తములను గణింపక యుద్ధ భూమి కరుగుట.

 

 

 

 

కం.

విని కుంభ నికుంభుల చా

వును బర మామర్ష మెడఁదఁ బొడమ దశాస్యుం

డనలము భంగిని జ్వలియిం

చెను రావణుఁ డసుర విభుఁడు చింత సెలంగన్      

  1.  

 

 

 

తే.గీ.

క్రోధ శోక మూర్ఛితుఁ డసురుండు ఖరుని

పుత్రు మకరాక్షుని నసుర పుంగవుఁ గని

యా విశాలాక్షుఁ బురికొల్పె నంత రావ

ణుండు రాక్షస కోటి నాథుండు బలుని

  1.  

 

 

 

చం.

వెడలుమ పుత్ర! నా ముదలఁ బేర్మి వహించి బలమ్ము తోడ నీ

వడరి రణమ్మునం జెలఁగి యక్కపి వీరుల తోడ రామునిం

గడు వడిఁ జంపు లక్ష్మణు నఖండ పరాక్రమ! నా వచింప నా

తఁడు విని శూరమానియె ముదం బెద మీఱఁగ నట్టులే యనెన్

  1.  

 

 

 

ఉ.

వందన మాచరించి కడు భక్తిఁ బ్రదక్షిణ మంతఁ జేసి తా

డెంద మెలర్ప రాజునకు డిగ్గన శుభ్రపు టింటి నుండి వే

యంది దశాస్యు నానతిని నమ్మకరాక్షుఁడు జాగి తత్తటం

బందు బలాధినాథుఁ గని పల్కెను వాక్యము లిట్టు లుద్ధతిన్

  1.  

 

 

 

తే.గీ.

క్షిప్రము గొనితెమ్ము రథమ్ము సేన నెల్లఁ

ద్వరిత గతి సమకట్టుమ పన్నుగ నన

విని బలాధ్యక్షుఁ డసురుండు వేగ తెచ్చెఁ 

దేరు నసుర బలమ్మును మూరి యంత     

  1.  

 

 

 

ఆ.వె.

చేసి యరదమునకు శీఘ్రతరముగఁ  బ్ర

దక్షిణమ్మును మకరాక్షుఁ డెక్కి

సూతునిఁ బురికొల్పె నాతఁడు వేగమ

రథముఁ దోలు మంచు రణ రతుండు

  1.  

 

 

 

చం.

అరయుచు నెల్ల రక్కసుల నాతఁ డనెన్ మకరాక్షుఁ డిట్లు వే

తరలుఁడు నాకు ముందటను దక్షణ మెల్లరు రాక్షసేంద్రుచే

దురమున రామలక్ష్మణులఁ దూర్ణము చంపఁగ నాజ్ఞ నందితిన్

శరములు వేసి రాఘవుల సౌరిని వానర కోటిఁ జంపుదున్   

  1.  

 

 

 

కం.

హరి సైన్యమ్మును గాల్చెద

ఖర శూల నిపాతమున సుకరముగ నాజిం

గర మెండిన కట్టెను వ

హ్ని రయమ్మునఁ గాల్చు పగిది నెగడి రణమునన్    

  1.  

 

 

 

కం.

విని మకరాక్షుని వచనము

లు నిశాచరు లాయుధమ్ములు మెఱయు చుండన్

ఘను లఱచుచు మత్త గజము

లన వెస మకరాక్షు ముందు నరిగిరి భయదుల్   

  1.  

 

 

 

తే.గీ.

కామ రూపు లెల్లరును బింగళ నయనులు

ఘోర దంష్ట్రులు రాక్షస వీర వరులు

ధ్వస్త కేశులు బహు దీర్ఘ  తను లెడఁదల 

మురిసి మ్రోయించిరి వణఁకఁ బుడమి యెల్ల

  1.  

 

 

 

ఆ.వె.

వేల కొలఁది శంఖ భేరులఁ జెలఁగిన

శబ్దములను జఱవ జబ్బల నొన

రింప గర్జ లపుడు రేఁగె ఘోరమ్ముగ

ధ్వనులు సమర భూమి దద్దఱిల్లె    

  1.  

 

 

 

ఆ.వె.

సారథి ములుకోల జాఱె నక్కజముగ

రక్కసుని ధ్వజమ్ము రాలె నేల

నంత దైవ ఘటన నాకస్మికముగఁ గ

య్యమునకు మకరాక్షుఁ డరుగు చుండ

  1.  

 

 

 

తే.గీ.

తేరు లాగు గుఱ్ఱమ్ములు దీనముగ బ

లము నశింపఁ దడఁబడఁ జరణము లశ్రు

లక్షు లందు స్రవింపఁగ నక్కజముగఁ

గదలు చున్నవి యత్తఱిఁ గష్టముగను   

  1.  

 

 

 

ఆ.వె.

రౌద్రుఁడు మకరాక్షుఁ డద్రి నిభుఁడు దుర్మ

తి పయనించుచుండఁ దీవ్రముగను

దారుణముగ వీచె మారుత మావృత

మై పరాగమునఁ దదవసరమున       

  1.  

 

 

 

కం.

కని యా నిమిత్తములు వే

చని రెల్ల గణింప కసుర సత్తము లంతన్

మనుజర్షభు లున్న యెడకు

ఘను నా మకరాక్షుఁ గూడి కదనమ్మునకున్   

  1.  

 

 

 

తే.గీ.

దున్న మొగు లేనుఁగుల సరితూఁగు రంగు

ల మెయి లున్న వా రసి గదలఁ బలు మారు

లార్త గాత్రులు నేను నే నని రణ నిపు

ణు లసురు లఱచు చుండి కదలఁ దొడఁగిరి   

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు డెబ్బది  యెనిమిదవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 79.

 

 

 

మకరాక్షుని తీవ్ర బాణ ఘాతములకు నార్తి సెంది వానరు లెల్లఁ బాఱ రాముఁడు రాక్షసులను శర వృష్టిని వారించి మకరాక్షునితో ఘోర యుద్ధ మొనరించి వానిని సంహరించుట. 

 

 

 

 

కం.

వచ్చిన మకరాక్షుం గని

యచ్చట సంగ్రామ కాంక్ష హరి గణ యోధుల్

హెచ్చఁగ డెందముల దుమికి

జెచ్చెర నిలిచిరి రణప్రసిద్ధులు వీరుల్

  1.  

 

 

 

కం.

హరివీర రాక్షసుల క

ప్డు రణం బొడళు లట గగురుపొడువఁగ నయ్యెన్

సురవర రాక్షస పుంగవు

ల రణము నకు నీ డగుచుఁ గరము ఘోరముగన్       

  1.  

 

 

 

కం.

తరు శూల పాతనమ్ములఁ 

దరుణ శిలా పరిఘ వితతి తాడనముల నొ

క్కరి నొక్కరు మర్దించిరి

హరి రాక్షస వీరు లాజి నత్యధికముగన్   

  1.  

 

 

 

తే.గీ.

శక్తి ఖడ్గ గదా కుంత శర సమూహ

భిండిపాల తోమర పాశ భీమ దండ

పట్టి సాశని ముద్గ రాపర మహాయు

ధముల హింసించిరి హరి సంతతి నసురులు        

  1.  

 

 

 

చం.

శరములఁ బీడ్యమాను లయి సంగర మందు ఖరాత్మజుండు భీ

కరముగ లాగి వేయఁగ నఖర్వముగా హరి వర్యు లెల్లరుం

బరగఁగ భీతి డెందములఁ బాఱిరి భ్రాంత మనస్కులై వెసన్

హరులను గాంచి పాఱఁగ మహాసురు లార్చిరి గెల్వ వెల్గుచున్   

  1.  

 

 

 

కం.

మృగరాజు భంగి గర్విం

పఁగ నసురులు వాన రాలి పాఱుచు నుండం

గఁ గని రఘు రాముఁ డయ్యసు

ర గణమ్మును నాపె శిత శర మహావృష్టిన్    

  1.  

 

 

 

ఉ.

వారితులన్ మహాసురుల వారినిఁ గాంచి ఖరాత్మజుండు నే

పారఁగ రోష మాత్మఁ గడుఁ నంతట రామునిఁ గాంచి యిట్లనెన్

ఘోరపు ద్వంద్వ యుద్ధము నకుంఠిత రీతి నొసంగు వాఁడ నే

నో రఘురామ! నిల్వుమ శరోగ్రము లేసి గ్రహింతుఁ బ్రాణముల్   

  1.  

 

 

 

ఉ.

మున్నట దండకా వనినిఁ బోరున నా జనకున్ వధించితే

నిన్నరయంగ నిప్పు డిట నెమ్మదిఁ గోపము నివ్వటిల్లె నిం 

గన్నులఁ జూడ కుండ నటఁ గాల్చుచు నున్నది బాధ దేహమున్ 

మిన్నగ దుష్ట కర్ముఁ గన మించెను సంజని తాగ్రహం బెదన్   

  1.  

 

 

 

ఉ.

దైవ వశమ్ముచే నిచట దర్శన మిచ్చితి నాకు నివ్విధిన్

నీవు క్షుధార్త సింహము వనిన్ మృగ మక్కట చేరి నట్లుగా

నా వర బాణ వేగమున  నాశము కాఁగఁ గృతాంతు వీటినిన్  

నీవ వసింతు నీ వలన నీల్గిన వారినిఁ గూడి రాఘవా!   

  1.  

 

 

 

ఉ.

మాటలు పెక్కు లేల యిఁక మానక రాఘవ విన్మ నా గిరల్

పోటున నెల్ల లోకములు  బూర్ణము గాంచును నిన్ను నన్నునున్

మేటి గదాస్త్ర బాహువుల మిన్నగ నేర్చిన నీదు హేతులం

బాటవ మొప్పఁ బోరెదము పన్నుగ నెంచుమ నేఁడు రాఘవా!

  1.  

 

 

 

కం.

విని మకరాక్షు గిరల నిం

కను బల్కుచు నుండ నవ్వి కాకుత్స్థుం డి

ట్లనె రిత్తగ వాగెద వే

ల నీవు పెక్కులు తగనివి  రాక్షస వీరా!

  1.  

 

 

 

కం.

సమరమ్మున నెంచిన శ

క్య మగునె విజయమ్ము నంద వ్యర్థము లగు వా

క్యము లాడిన మాత్రమ యు

ద్ధము సేయక యేరి కైన ధరలోఁ జెపుమా    

  1.  

 

 

 

ఆ.వె.

వనిని దండక నటఁ బదునాల్గు వేల ర

క్కసులు నీదు తండ్రి  గ్రన్ననఁ ద్రిశి

రసుఁడు దూషణుండు రణ మందు నా చేతఁ

జంపఁ బడిరి రాక్షస వర! వింటె   

  1.  

 

 

 

ఆ.వె.

తనివి తీరు నట్లు తినును నీ మాంసము

కాక గృధ్ర జంబుకములు  తీక్ష్ణ

తుండ నఖము లున్న తండమ్ము పాపాత్మ! 

నేఁడు సంగరంపు నేల యందు

  1.  

 

 

 

చం.

అన రఘు రాముఁ డిట్లు విని యా మకరాక్షుఁడు బల్లిదుండు కు

ర్సెను శిత బాణ వృష్టి నని శీఘ్రమ కిన్కను రాఘవేంద్రుపై

ఘనుఁడు రఘూత్తముండు శర కాయము వైచి యొనర్ప బాణపం

క్తి నపుడు వేయి ముక్కలుగఁ ద్రెళ్లె వసుంధర దీప్త పుంఖముల్       

  1.  

 

 

 

కం.

ఖర రాక్ష సాత్మజునకు ద

శర థాత్మజునకు సుఘోర సమరం బయ్యెన్ 

గురు బల సంయుక్తమ్ముగఁ

బరస్పరము కలవడంగ భయదం బగుచున్   

  1.  

 

 

 

ఆ.వె.

జాఱ వింటి నుండి జ్యా తల శబ్దమ్ము

లాజి తలము నందు నవి వినఁబడె

నాకసమ్ము నందు నభ్ర గర్జనముల

భంగినిఁ జెలరేఁగి భైరవముగ    

  1.  

 

 

 

కం.

కనఁ గోరి యద్భుత సమర

మును నిలిచిరి యంతరిక్షమున సుర గంధ

ర్వ నికాయ దాన వోరగ

ఘన కిన్నరు లసుర మనుజ కాంతుల రణమున్    

  1.  

 

 

 

తే.గీ.

తగుల దెబ్బ లన్యోన్య గాత్రమ్ము లందు

బలము లయ్యెను రెట్టింపు వారి కంతఁ 

జేసిరి క్రియాప్రతిక్రియ లాస లుంచి

గెలువ నొకరి నొకరు నాజి తలము నందు     

  1.  

 

 

 

ఉ.

రాముఁడు వేయ బాణ తతి రక్కసుఁ డన్నిటిఁ ద్రుంచె నాజిలో

భీమ బలుండు రక్కసుఁడు వేయ శరమ్ము లనేక ఖండముల్

రాముఁడు సేసె వాని సమరమ్మున ముల్కుల నెల్ల దిక్కులున్  

భూమియు నిండ దిట్టముగ భూతల మందు వెలుంగు లాఱెనే      

  1.  

 

 

 

చం.

ధనువును ద్రుంచెఁ గ్రుద్ధుఁ డయి తద్దయు రాముఁడు రాక్షసేంద్రునిం

గని మఱి యష్ట బాణములు గ్రన్నన వేసి వధించె సూతు స్యం

దనమును ద్రుంచి యశ్వముల ధాత్రినిఁ గూల్చిన వేసి బాణ పం

క్తిని విరథుండునై నిలిచె దీనముగా మకరాక్షుఁ డుర్వినిన్     

  1.  

 

 

 

తే.గీ.

నిలిచి నేలపైఁ గైకొనె నలిగి కరము

శూలమును భూతముల కెల్ల క్షోభ మొసఁగు

దానిఁ బ్రభ లందుఁ గన యుగాం తాన లాభ

ము మకరాక్షుఁడు దురవాపము నిశితమును      

  1.  

 

 

 

తే.గీ.

రుషను జ్వాజ్వల్యమానము రుద్ర దత్త

మును విసరె నంత దశరథ తనయు పైన

నపర సంహార ఘోరాస్త్ర మైన దానిఁ

ద్రిప్పి యమర భయదమును దీవ్రముగను

  1.  

 

 

 

కం.

ఖర పుత్ర హస్త ముక్తము

నరసి జ్వలించు చరుదెంచు నాశూలమునున్

శరముల మూడింటను నం

బరమున వ్రక్క లొనరించెఁ బార్థివుఁ డంతన్    

  1.  

 

 

 

తే.గీ.

పెక్కు ముక్కలై శూలము చక్క నైన

స్వర్ణ మండితం బా రామ శర చయార్ది

తమ్ము నేలఁ గూలెను ద్వరితమ్ముగ దివి

నుండి గూలు నుల్క పగిది భండనమున

  1.  

 

 

 

కం.

కని విఱిఁగిన శూలమ్మును

ఘనముగ నక్లిష్టకర్మ కాకుత్స్థునిచే

నినదించె భూత రాశి గ

గనమునఁ గడు చక్క నైన కార్యం బనుచున్    

  1.  

 

 

 

కం.

మకరాక్షుఁడు శూలమ్మును

వికలమ్మును గాంచి ముష్టి వీర వరుం డె

త్తి కినుక నిలు నిలు మంచుఁ బ

లికె నా రాఘవుని తోడ రేఁగఁ జల మెదన్ 

  1.  

 

 

 

కం.

అమ్మక రాక్షుఁ గని కదియ  

నమ్మనుజేంద్రుఁడు హసించి యంతట వింటిన్

సమ్మదమునఁ గూరిచి వెస     

నమ్మును సంధించెఁ బావ కాస్త్రము నంతన్

  1.  

 

 

 

ఆ.వె.

ఆమహాస్త్ర ఘాతుఁడై మకరాక్షుండు

రామ ముక్త శర వరమున భిన్న

హృదయుఁడై పడె నసురేంద్రుఁ డవని పైన   

సంగరమ్ము నందు సమసె నంత

  1.  

 

 

 

కం.

కని మకరాక్షుని పతన

మ్మును రక్కసు లెల్ల రామ ముక్త విశిఖ భీ

తినిఁ బాఱిరి లంకా పుర

మున కర్దితులై భృశమ్ము బోరన నంతన్     

  1.  

 

 

 

ఆ.వె.

రామ శర రయమున కా మకరాక్షుఁడు

ఖర కుమారుఁ డట్లు ధరణిఁ గూల

వజ్ర ఘాత పతిత పర్వతమ్ము పగిది

హృష్టు లైరి యమరు లెల్లఁ గాంచి   

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు డెబ్బది  తొమ్మిదవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 80.

 

 

 

మకరాక్షుని మరణము నాలకించి రావణుఁడు యుద్ధమునకు సుతుని నింద్రజిత్తునిఁ బంప నాతఁ డగ్నికి హోమము చేసి యదృశ్య రూపమున రామ లక్ష్మణులపై శర వర్షమును గురిపించి శర ధారలతో రణ భూమినిఁ గప్ప వానరు లనేకులు మరణింప నింద్రజిత్తుని జయించు  నుపాయములను రామలక్ష్మణులు చింతించుట.    

 

 

 

 

కం.

విని మకరాక్షుని మరణము

నని విజయుం డనిశ మా దశాస్యుం డంతన్ 

ఘన రోషాత్ముఁడు కటకట

మని పండ్లు కొఱికి  తలంచె నలమట నాత్మన్     

  1.  

 

 

 

కం.

కుపితుండు కార్య మేమని

విపరీతమ్ముగఁ దలంచి వివిధ విధములన్

రిపు దమను నింద్రజిత్తుఁ గ

ని పనిచె యుద్ధమునకు సుతుని మహావీరున్    

  1.  

 

 

 

కం.

వధియింపు మహా వీరులఁ 

బ్రధనమ్మున రాఘవులను బల మందు నహో

యధికుఁడ వీ వెల్లపు డే

విధిఁ గనఁబడి కనఁ బడకయు వీరవరేణ్యా!   

  1.  

 

 

 

తే.గీ.

అప్రతిమ కర్ము నింద్రుని నంక మందు

గెలిచి తీ వన్నచో మనుష్యులను గాంచి

యేల గెలువ కుందువు వీర! యాల మందు

నా విని జనకు నాజ్ఞ తనయుఁడు దాల్చి      

  1.  

 

 

 

చం.

చన విని యింద్రజిత్తపుడు సల్పగ హోమము యజ్ఞ భూమికిం

గొని యసు రాంగనా మణులు గూరిమి వచ్చిరి సంభ్రమించుచుం

బనివిని యంత నెఱ్ఱ తలపాగలు హేతులు ఱెల్లుగడ్డి యె

ఱ్ఱని వలువల్  విభీతకపు ఱాచిన కట్టెలు నిన్ప స్రుక్కులున్

  1.  

 

 

 

ఉ.

ఎల్లెడ లందు దర్భలను నింపుగ నగ్నికి నంతఁ జుట్టునున్

బల్లెము లుండఁగం బఱచి పన్నుగఁ బ్రాణము లున్న నిండుగా

నల్లని మేక కంఠమును నైరృత వర్యుఁడు పట్టి గట్టిగా

నల్లన సంగ్రహించె వెస యజ్ఞ తలమ్మున సంగ్రహింపఁగా       

  1.  

 

 

 

తే.గీ.

అంతఁ గనిపించె విజయ చిహ్నమ్ము లెల్ల

హోమ మట వృద్ధి వొంద నహో పొగ కన

రాని మంటలు సెలరేఁగ రాక్ష సేంద్రుఁ

డింద్రజిత్తుఁ డొనర్పఁగ నిద్ధ క్రతువు

  1.  

 

 

 

కం.

కుడివైపు తిరుగు జ్వాలల

నడరుచుఁ గరగించి నట్టి యభ్ర మనఁగ మీ

ఱెడు పావకుండు స్వయముగ

వడి లేచి గ్రహించె హవినిఁ బరమ ముదమునన్   

  1.  

 

 

 

తే.గీ.

వేల్చి యగ్నికిఁ దనిపి దివిజుల దాన

వులను రక్కసుల నుచితంపు గతి నంత

నెక్కెఁ గాన రాని యరద మితరులకు శు

భమును శ్రేష్టమ్ము నసుర ప్రవరుఁడు వడిని

  1.  

 

 

 

తే.గీ.

గుఱ్ఱములు నాల్గు లాగఁగ ఘోర నిశిత

మార్గణమ్ముల తోడుత మహిత చాప

మెక్కిడం బడ వెలిఁగెఁ దే రింపు గొలుప

భృశము జాజ్వల్య మానమై పెన్తనువున     

  1.  

 

 

 

తే.గీ.

కాంచ నాంచిత భూషణ కాంతు లడర

మృగ సమూహము చంద్రార్ధ కృత శశీంద్ర

రచనల నలంకృతము గాఁగ రమ్య రథము

కరము భాసిల్లు చుండె నసురుని తోడ   

  1.  

 

 

 

కం.

పసిడి కడియమ్ము లడరఁగఁ 

బస వెలుఁగు ననలము పగిది భాసిలు చుండన్

విసవిస కదలు ధ్వజం బట

మిసిమి విదూరజ కలితము మేలుగ నమరెన్      

  1.  

 

 

 

కం.

ఇన సన్నిభ బ్రహ్మాస్త్రము

తను రక్షింపంగ నయ్యెఁ దథ్యమ్ముగ నె

వ్వని కైన దురాధర్షుఁడు

ఘన బలుఁ డా యింద్రజిత్తు కయ్యము నందున్

  1.  

 

 

 

ఆ.వె.

వెడలి పురము నుండి వీరుఁ డాజి జయుండు

నసుర మంత్ర వాక్కు లతఁడు సదివి

వేల్చి వహ్ని నట్లు వేగ యదృశ్యుఁడై

పలికె నింద్రజిత్తు పలుకు లిట్లు

  1.  

 

 

 

చం.

కపటముగా వనమ్ములను గ్రాలెడు వారల నిర్వురన్ వధిం

చి పెనఁగి యిత్తు నే జయము శీఘ్రమ తండ్రికి సంగ రార్జిత

మ్ము పరుల రామలక్ష్మణులఁ బోరునఁ జంపి ప్లవంగ హీనమై

విపులఁ జరింపఁ జేయుదును వేడుక నంచు వచించి మాయమై    

  1.  

 

 

 

ఉ.

వచ్చెను దండ్రి ప్రేరణను వాడి శరమ్ములు చాప ముండఁగాఁ

జెచ్చెరఁ దీక్ష్ణుఁ డయ్యసుర చెన్నుగ మూడుశిరమ్ములున్న యా

యచ్చపు సర్ప సన్నిభుల నారసె వానరు లందు విడ్వఁగా

హెచ్చుగ బాణ సంచయము నిర్వుర వీరుల రాఘ వేంద్రులన్   

  1.  

 

 

 

ఉ.

వీరలె రామలక్ష్మణులు వీరుఁడు రావణి నా తలంచి యే

పారఁగఁ గిన్క నారి నిడి యమ్ముల వర్షము మేఘ భంగినిన్

ధారగఁ దొల్కరించె వితతమ్ముగ  నెల్లెడఁ జేరి నింగినిం

దేరు యుతమ్ము కన్పడక ధీరుల నొంచెను రాఘవేంద్రులన్   

  1.  

 

 

 

చం.

ధనువునఁ గూర్చి బాణములు తక్షణ మేసిరి యస్త్ర పంక్తినిన్

ఘనముగ నావరింపఁబడి కౌణపు మార్గణ కోటిచే ననిన్

మనుజులు రామలక్ష్మణులు మానుగ సూర్య నిభాస్త్ర రాశిఁ గ

ప్పిన దివిఁ దాఁక నేర వవి వీరుని రావణి నెట్టి ముల్కులున్     

  1.  

 

 

 

తే.గీ.

అసురుఁ డొనరించి పొగ తోడి యంధకార

మును నభమ్మును వెసఁ గప్పె ఘనము గాను

దిక్కులను గప్పెఁ గల్పించి వెక్కసముగ 

మంచు తోడఁ జీఁకటిని శ్రీమంతుఁ డంత   

  1.  

 

 

 

కం.

వినరావు జ్యాతలధ్వని

యు నేమి ఖుర శబ్దములు నహో చనుచుండం

గన రా దసురుని రూపం

బని సేయుచు నుండ సుంత యైనఁ బరులకున్    

  1.  

 

 

 

తే.గీ.

మబ్బు కమ్మిన చీఁకటి మాడ్కి యంధ

కారమున మహా బాహుఁడు గండు శిలల

వర్షము పగిది నారాచ బాణ వర్ష

ముఁ గురిపించె నద్భుతమును బొలసుదిండి

  1.  

 

 

 

ఉ.

రాముని క్షోభపెట్టెను శరమ్ముల దత్త వరమ్ములన్ మహా

భీమ బలుండు సూర్య నిభ భీకర వాజుల గాత్ర పంక్తిలో

నా మనుజాశనుండు విశి ఖావలి తప్త శరీర రాఘవుల్

హేమ సుపుంఖ బాణ ఘన వృష్టిఁ గురించిరి యింద్రజిత్తుపై   

  1.  

 

 

 

ఆ.వె.

విన్ను నందు నున్న వీరు రావణిఁ జేరి

కాయ మెల్లఁ జీల్చి కంకపత్ర

ములు రుధిరము తోడ భూమిపైఁ గూలిన

వంత రామ లక్ష్మ ణాంక శిఖులు    

  1.  

 

 

 

ఆ.వె.

బాణ పంక్తి చేత బాధింపఁ  బడు నర

ర్షషభులు వడ శిఖులు రామ లక్ష్మ

ణు లరసి బహు భల్లములు వేసి ఛేదించి

రంక మందు వీరు లన్నిటి వెస

  1.  

 

 

 

కం.

ఎటు సూచిన శిత శరముల

నటు వైపు కురించిరి పర మాస్త్రము లంతం

బటిమ రఘు వీర వర్యులు

ద్రుటిం జెలఁగి దాశరథులు దుర్జయు లాజిన్

  1.  

 

 

 

చం.

అతిరథుఁ డింద్రజిత్తు సక లాశలఁ దిర్గుచుఁ దేరు పైన నా

తతముగ రాఘవేంద్రులను దద్దయుఁ దీక్ష్ణ శ రాలి నొంపఁగా

నతులమ యభ్ర పుంఖ విశి ఖావలి విద్ధులు వోలి రెన్నఁగా

వితత సు మాన్వితమ్ము లగు వృక్షములం బెను కింశుకమ్ములన్

  1.  

 

 

 

కం.

ఘనముల మున్గిన రవి వలె

ధనువును నాకృతి శరము లితరములు వేగ

మ్మును సుంతయు నేర రెవరు

ఘన రాక్షస వర్యు ఘోర కార్యము లాజిన్        

  1.  

 

 

 

కం.

వాని వలనఁ గొట్టఁ బడిన

వానరులు సమయ రణమునఁ బ్రాణ విహీనుల్ 

వే నేలఁ గూలి రప్పుడు

కానఁగ వందల కొలంది కలఁత సెలంగన్          

  1.  

 

 

 

ఉ.

అంత వచించె నిట్లలిగి యగ్రజునిం గని లక్ష్మణుండు నే

నంత మొనర్ప రక్కసుల నస్త్ర వరమ్మును బ్రహ్మముం బ్రయో

గింతు ననంగ సోదరుని నింపుగ నా శుభ లక్షణున్ ఘన

స్వాంతుఁడు గాంచి యిట్లనెను జంపకు మొక్కని కోస మెల్లరన్

  1.  

 

 

 

తే.గీ.

సంగర మొనరింపని వాని శరణ మన్న

వాని దాఁగిన వానినిఁ బ్రాంజలి నిలి

చినను వానిఁ బాఱెడు వాని ననుజ! మత్తు

ని నయిన వధింపఁగఁ దగదు నీకు నెపుడు     

  1.  

 

 

 

తే.గీ.

ఆతని వధింప యత్నము నాజిఁ జేయఁ

దొడఁగుదము సర్ప నిభములఁ దూపులను మ

హా భుజా! ప్రయోగింత మయ్యసుర వరునిఁ  

జంప రావణాత్మజుని నీ సమర మందు   

  1.  

 

 

 

ఆ.వె.

కాంచి నంత వానిఁ గపి యూధపులు చంపు

వారు కాన రాని తేరు నందు

మాయఁ దిరుగు వాని నా యసురుని క్షుద్రు

బలిమి నెల్ల రడరి భండనమున      

  1.  

 

 

 

తే.గీ.

పుడమిఁ దూఱిన నింగికి వెడలిన దివ

మున కరిగిన రసాతలమున కరిగిన

దాఁగి యున్నను  నా మహాస్త్రముల నసువు

లను విడిచి కూలు నిఁక భూ తలమ్ము నందు   

  1.  

 

 

 

కం

అని యిట్టు లర్థ వంతము

లిన కుల వీరుఁడు ప్లవగులు వృతులై యుండం

గ నృశంసు రౌద్రు నింద్రజి

తునిఁ జంపఁగ వేచు చుండెఁ దూర్ణం బనిలో    

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నెనుబదవ   సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 81.

 

 

 

ఇంద్రజిత్తు రాముని మనస్సు నెఱిఁగి యుద్ధము వీడి లంక కేఁగి మాయా సీతను కల్పించి తిరిగి వచ్చి హనుమంతుఁడు మున్నగు హరి వీరులు చూచు చుండఁ గత్తినిఁ దీసి మాయా సీత మూర్థమును బట్టి వధించుట.  

 

 

 

 

కం.

నేరి మహాత్ముని రాముని

యా రఘు వీరుని మనస్సు నసురుం డంతం

బోరాట దక్కి నగరికి 

బోరనఁ జనె వేడబమ్ము పురికొన మదిలో    

  1.  

 

 

 

కం.

స్మరియించుచు హతుల మ హా

సుర వీరుల డెంద మందు శోకార్తుండై

కర మాగ్రహించి భీ మా

సురుఁ డెఱ్ఱని లోచనముల శూరుం డేఁగెన్

  1.  

 

 

 

కం.

పౌలస్త్యుఁ డేఁగుదెంచెను

వీలుగఁ బడమటఁ గలట్టి పెను ద్వారమునన్

వేల యసురులం గూడుచు

నాలమునకు దేవకంట కాసురుఁడు దృటిన్

  1.  

 

 

 

ఉ.

కాంచెను రామ లక్ష్మణులఁ గయ్యములోఁ జెలరేఁగు చుండఁగన్

మించి భృశమ్ము నింద్రజియె మేటి నృవీరుల నంత మాయ నూ

హించి యతండు వంచనపు టింతిని సీతను దేరు నందుఁ దా

నుంచి వధింప నెంచె నెద నుండఁగ రక్కసు లెల్లఁ దోడుగన్

  1.  

 

 

 

ఉ.

ఎల్లరఁ జేయ మోహితుల నిత్తఱి దుర్మతి యెంచి యింద్రజి

త్తుల్లము నందు జానకినిఁ దొయ్యలి నుంచి రథమ్ము నందు రా

నెల్లరు వానరాధిపు లహీన పరాక్రము లంతఁ గ్రుద్ధులై

పెల్లుగ నుద్యమించిరి సుభీమ శిలా కరులై రణమ్మునన్   

  1.  

 

 

 

కం.

హనుమంతుఁ డేఁగి ముందఱఁ

గొని పర్వత శృంగము నతి ఘోరమ్మును నె

వ్వనికిం జేరఁగ రానిది

ఘనఁ డా కపి కుంజరుండు కయ్యము లోనన్      

  1.  

 

 

 

మ.

కనియెన్ రావణి స్యందనమ్మునను భూకన్యన్ విచా రాంగనం 

దను జీ ర్ణాబల నేక వేణిఁ గృశ వస్త్రన్ దీన సంస్కార హీ

నను నేకాంబర రాఘవప్రియను గాంతా రత్నమున్ ధూలి యు

క్తను కాంతన్ హనుమంతుఁ డంకమున బాధా తప్త చిత్తుండునై        

  1.  

 

 

 

ఆ.వె.

కని యొకింత తడవు కాంతను సీతగ

మారుతాత్మజుండు మనము నందుఁ

దలఁచెఁ గాంచెను గద తన్విని నచిర కా

లమ్ము మునుపె తాను లంక లోన     

  1.  

 

 

 

తే.గీ.

కని రథమ్మున మసి తోడఁ గాయ మున్న

కాంత నతి దీనను హనుమ స్వాంత మెల్ల

నిండ వంతతో మైథిలినిఁ గను లందుఁ

గాఱఁ గన్నీరు మునిఁగె శోకమ్ము నందు          

  1.  

 

 

 

చం.

కని హనుమంతుఁ డయ్యసుర కాంతు రథమ్మునఁ జెంత నున్న సీ

తను వెత నున్న దీన సతిఁ దన్విని నెయ్యది సేయఁ దల్చె నీ

మె నితఁడు నా వచించుచును మిన్నగఁ దల్చి మహా కపీంద్రుఁ డం

త నలుకఁ గూడి వానరుల దాడికిఁ బర్విడె నింద్రజిత్తుపై      

  1.  

 

 

 

చం.

కని హరి సేన నయ్యసుర కాంతుఁడు క్రుద్ధుఁడునై మహాసి నం

త నొఱఁ గలట్టి దాని నిశితమ్మును లాగి లతాంగి మూర్ధముం

గనికర మింత లేక మది గ్రన్ననఁ బట్టి ప్లవంగు లెల్లఁ జూ

డ నఱవ రామ రామ యని టక్కరి కొట్టెను సీత నత్తఱిన్

  1.  

 

 

 

ఆ.వె.

జుట్టు పట్టి లాగ సుదతి సీతను గాంచి

దీనుఁ డయ్యె హనుమ తీవ్రముగను

శోకజంపు వారి నా కపి వర్యుని

నేత్ర యుగము నుండి నిండఁ గాఱె

  1.  

 

 

 

ఆ.వె.

చారు సర్వ గాత్ర జానకి రామప్రి

య మహిషి నరసి రుష ననియె రాక్ష

సాధిపాత్మజుఁ గని హనుమ పరుష వాక్య

ములను బరమ రోష మూర్చితుండు     

  1.  

 

 

 

ఆ.వె.

ముట్టి తీవు కేశముల రామ మహిషిని

నాత్మ నాశమునకు నకట పుట్టి

బ్రహ్మ ఋషుల గొప్ప వంశమున దురాత్మ!

యసురి కుక్షిఁ బుట్టి నట్టి కతన    

  1.  

 

 

 

తే.గీ.

పాప కర్ముఁడ నీ విట్టి పనినిఁ గట్ట

చేసి తిస్సీ యనార్యుఁడ చెడ్డ నడక

వాఁడ! క్షుద్రుఁడ! దయలేని వాఁడ! పాప

విక్రముఁడ! లేదె పనిఁ గృప వెడ యెడంద      

  1.  

 

 

 

ఆ.వె.

దూర మయ్యె నకట నారి గృహము నుండి

రాజ్య మందు నుండి రామ హస్త

మందు నుండి యెట్టి యపరాధ మొనరించె

నీమె నీకుఁ గొట్ట నేల దలఁతు

  1.  

 

 

 

ఉ.

సీతను జంప నుండ విట జీవము లింకఁ జిరమ్ము నీకు నా

చేతికిఁ జిక్కి తీ విటుల జీర్ణము కాఁ దగి నట్టి వాఁడవై  

నాతులఁ జంప నేఁగెడు ననార్య! జగమ్ముల కేఁగు వాఁడవే

వీత నిజాసువై యధమ! విశ్వ వధార్హుఁడ! క్రూర రాక్షసా!    

  1.  

 

 

 

చం.

పలుకుచు నిట్లు సాయుధులు వానర వర్యులు తోడు రా మహా

నిల తనయుండు పర్విడెను నిండఁగఁ గోప మెడంద రావణిన్

ఖలు నెదిరింప వచ్చెడు నఖర్వపు వానర సేన నంత వీ

ర్యు లసుర వీర వర్యులు మహోన్నత కాయులు కిన్క నాపఁగా            

  1.  

 

 

 

ఉ.

ఆతఁడు వేల బాణముల నా హరి సైన్యము క్షోభ పెట్టి తా

నా తఱి యింద్రజిత్తు పవనాత్మజుఁ గాంచి వచించె నివ్విధం

బాతత రోష చిత్తుఁ డయి యా హరినాథుఁడు రాఘవుండు నీ

వే తెలిగంటిఁ గాచుటకు నిట్లరుదెంచొరొ యామెఁ జంపుదున్

  1.  

 

 

 

ఉ.

నీ విటఁ జూచు చుండఁగను నిర్దయ నిప్పుడ మారుతాత్మజా!    

యీ వసుధా కుమారి వధియించి సలక్ష్మణ రాము నిన్ను సు

గ్రీవుని నవ్విభీషణునిఁ గిన్క దురాత్ముని నేఁడ చంపుదుం 

గావఁగ రాదు పీడ లిడఁ గాంతలఁ జంపఁగ వచ్చు వారినిన్

  1.  

 

 

 

ఉ.

స్త్రీల వధింప రా దనుచుఁ జెప్పితి వీ వది రిత్త మాటయే

చాలును బల్కియివ్విధము చారు శుభాంగిని నేడ్చుచుండఁగా

బేలను మాయ జానకిని వేగ స్వయమ్ము వధించె నంత దు

శ్శీలత నింద్రజిత్తపుడు శీఘ్రమ తీక్ష్ణపు ఖడ్గ ధారచే     

  1.  

 

 

 

ఆ.వె.

జన్నిదంపు గతిని నన్నుల మిన్న కో

యఁబడ నట్లవనిజ యవనిఁ గూలె

దీనురాలు రమ్య మైన రూపము పృథు

శ్రోణి యతిశయింపఁ జూచుచుండ      

  1.  

 

 

 

తే.గీ.

చంపి యింద్రజిత్తు ధరణిజ ననె నిట్లు

హనుమ తోడ వీక్షింపు  రా మాత్మసతినిఁ 

జంపితిని కిన్క వైదేహి చావ నయ్యె

మీ పరిశ్రమము వృథా సమీర పుత్ర!     

  1.  

 

 

 

చం.

సునిశిత ఖడ్గ రాజమున శూర వరేణ్యుఁడు చంపి యట్లు సీ

త నరద మెక్కి రావణి  ముదం బెదఁ దద్దయు మీఱ నంత నా

ర్చె నిలిచి యింద్రజిత్తసుర సేనకు మధ్యను జెంత నుండఁగా 

నినదము వ్యాది తాస్యు ఘన నిస్వనమున్ విని  రెల్ల వానరుల్

  1.  

 

 

 

కం.

ఘనముగ ముదితుం డయ్యెను

వనితామణిఁ జంపి కుమతి వజ్రిరిపుఁ డెదం 

గని హృష్టాసురుఁ బాఱిరి

వనరుచు సువిషణ్ణ హృదులు వానరు లెల్లర్   

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నెనుబది యొకటవ   సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 82.

 

 

 

ఇంద్రజిత్తు భీషణ నాదమ్మును విని యెల్ల వానరులు భీతితోఁ బర్విడ హనుమంతుని ప్రేరణముతో శిలా వృక్షములతో యుద్ధము సేయ మారుతి యనేక రాక్షసులను వధించి సీతా వధ నెఱిఁగింప రాముని వద్దకు నేఁగ నింద్రజిత్తు నికుంభిల కేఁగి హోమ మొనర్చుట. 

 

 

 

 

కం.

విని ఘోరం బగు నాద మ

శని సన్నిభము నరయుచు దిశల నెల్ల హరుల్

మనముల నుప్పొంగ భయము

ఘనముగఁ బరువెత్తి రెల్ల కపి పుంగవులున్   

  1.  

 

 

 

చం.

కపులను మారుతాత్మజుఁడు గాంచి విషణ్ణులఁ బల్కె నివ్విధిన్  

విపుల భయార్త దీనులను భీతినిఁ బాఱఁగ వేరు వేరుగాఁ

గపివరు లార! దీను లయి కయ్యము వీడుచుఁ బాఱనేల మీ

కిపు డెటఁ బోయె శూరతయు నిందఱ కిట్టి విచార మేలనో      

  1.  

 

 

 

ఉ.

నేను జనంగ ముందుగ ననిం దగ రండిఁక నాదు వెన్కనే

మాని రణమ్ము వాఱుటయు మంచి కులమ్మున నుద్భవింపఁగా

మానము గాదు శూరులకు మారుతి యిట్లు వచింపఁ గ్రుద్ధుఁడై

మ్రానులు ఱాళ్లు గై కొనుచు మర్కట వీరులు రేఁగి రాజిలో   

  1.  

 

 

 

చం.

హనుమను జుట్టి గర్జ లిడి యంతట దూఁకిరి రాక్షసాలిపైఁ

గనలి ప్లవంగ పుంగవులు కయ్యము నందుఁ బ్లవంగ యుక్తుఁడై

యనలుని భంగి మండుచు మహాసుర సైన్యముఁ గాల్చె నుగ్రుఁడై

యనిల సుతుండు రాక్షస చయంపు మహా కదనం బొనర్చుచున్

  1.  

 

 

 

తే.గీ.

కాల సన్నిభుండు నయి కిన్క సెలరేఁగఁ 

గరము డెందమ్ము నందు శోకమ్ము సెలఁగ

భృశము కపి పుంగవుం డంతఁ  బెద్ద శిలను

రావణి రథముపై వైచెఁ బావని దృటి      

  1.  

 

 

 

ఉ.

వచ్చెడు నమ్మహా శిలను బన్నుగ సారథి గాంచి చెప్పఁగా

నిచ్చలు నాలకించునవి నెమ్మిని గుఱ్ఱము లున్న తేరునుం   

జెచ్చెరఁ దోలె దూరముగఁ జేరక యా శిల యింద్రజిత్తునిం

జొచ్చెను భూమి లోపలకుఁ జూడఁగ సారథి వ్యర్థమై వెసన్      

  1.  

 

 

 

ఆ.వె.

నలిఁగి రసుర వరులు శిల పడు చుండఁ గ్రిం

ది కతి వేగముగను వికల తనులు

కలఁత సెంది రెల్ల కౌణప వర్యులు

నేల రాల ఱాయి యాల మందు    

  1.  

 

 

 

ఉ.

వందల కాననౌకసులు పాదప ఘోర శిలాచయమ్ములం

బొందిక నెత్తి వైచి రటఁ బోరున భీమ శరీర ధారులే

యందఱు నింద్రజిత్తు పయి నయ్యరి వర్గము వృక్ష వృష్టినిం

జిందఱ లద్రి శృంగములఁ జేసిరి యార్చిరి వింత వింతగన్

  1.  

 

 

 

తే.గీ.

భీమ రూపులు వానర వీర వర్యు

లసురులను ఘోర రూపుల నప్పళింపఁ 

దరుల శిలలఁ గూలిరి నిశాచరులు సమర

తలమునం జేష్ట లుడుగంగఁ  దాడనముల        

  1.  

 

 

 

కం.

కని స్వీయ సైన్య మెల్లను 

ఘన వానర తాడితమ్ముఁ గయ్యము లోనన్

ఘనుఁ డింద్రజిత్తు రోష

మ్మున సాయుధుఁడై యుఱికెను మూరి రిపులపై

  1.  

 

 

 

కం.

సృజియించి శరౌఘమ్ముల

నిజ సేనా పరివృతుఁ డయి నిర్దయఁ గొట్టెన్

విజ యాకాంక్షి హరుల నిం

ద్రజిత్తనేకుల విదిత పరాక్రముఁ డాజిన్      

  1.  

 

 

 

తే.గీ.

వాని యనుచర వీరులు వాన రర్ష

భులను ఖడ్గములను గూట ముద్గరముల

వజ్ర శూలరాజమ్ములఁ బట్టసములఁ

గొట్టి రాహవమం దతి ఘోరముగను

  1.  

 

 

 

తే.గీ.

పెద్ద బోదెల కొమ్మల వృక్షములను

గండు శిలలతో నబ్బల్లిదుండు హనుమ 

ఘోర రాక్షస కదన మవారిత గతిఁ 

జేసె భీమ కర్మాసుర శ్రేణి నణఁచె        

  1.  

 

 

 

ఆ.వె.

పర బలమును హనుమ వారించి పలికె వ

నౌకసులను గాంచి యో కపి వరు

లార! మరలుఁ డింక నసుర బలమ్ము సా

ధింపఁ దగ దిపుడు తలంప మనకు    

  1.  

 

 

 

ఉ.

రామున కీయ సంతసము ప్రాణము లందుఁ ద్యజించి యాస నే

భామ నిమిత్త మిచ్చటకు వచ్చిన వారమొ యట్టి సీతయే

తా మరణించె నింద్రజితు దారుణ ఖడ్గము చేత దీని నా

రామున కా హరీశునకుఁ దప్పక యేఁగి వచింపఁగా వలెన్         

  1.  

 

 

 

తే.గీ.

తెలిపి వారు వచించు రీతి నొనరింప

వలయు మనకు నిట్లు వచించి వానరులను

వేగ వారించి నిర్భీతి వెడలఁ దొడఁగె

నల్ల నల్లనఁ గపి సైన్య మెల్ల రాఁగ    

  1.  

 

 

 

కం.

కని హనుమంతునిఁ జన రా

ముని చెంతకుఁ గ్రతు వొనర్పఁ బొలదిండి వెసం

జనె నింద్రజిత్తు చైత్య

మ్మునకు నికుంభిలకుఁ గుమతి పొలుపారు తమిన్     

  1.  

 

 

 

ఉ.

పావకు నంత వేలిచెను బన్నుగ నెక్కి నికుంభిలం దమిన్

రావణి వేల్చు చుండ ననలం బట వెల్గెను యజ్ఞ భూమిలోఁ

జేవను రక్త మాంస భుజి చెన్నుగ జ్వాలలఁ గూడి తృప్తుఁడై

యా వని వహ్ని సంధ్య తఱి నా రవి భంగినిఁ దోఁచె దీప్తుఁడై    

  1.  

 

 

 

తే.గీ.

రాక్ష సాభివృద్ధి కొఱకు రావ ణాత్మ

జుఁడు విధానజ్ఞుఁ డయ్యసురుఁ డొనరించె

హోమము విధి వంతం బరయుచు న యాన

యజ్ఞు లసురు లుండిరి గుంపు నందు నిలిచి          

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నెనుబది రెండవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 83.

 

 

 

మేఘనాదునిచే సీత మరణించుటను విని నంత రాముఁడు మూర్ఛిల్ల లక్ష్మణుఁ డూఱడించి యింద్రజిత్తును వధించుటకై యుద్యమించుట.

 

 

 

 

కం.

విని రాక్షస వానర ఘో

ర నినదములు భీమ సంగర తల జనితముల్

మనుజేంద్రుఁడు రాముఁడు వ

ల్కె నిట్లు గని జాంబవంతు గిర లుచితమ్ముల్   

  1.  

 

 

 

చం.

వినఁబడె నాయుధధ్వనులు భీమ తరమ్ములు మారుతాత్మజుం

డనిఁ గడు దుష్కరంపు పని నద్భుత రీతినిఁ జేసి యుండ నో

పు నడరి సౌమ్య! ఋక్షపతి! పొమ్ము స్వసైన్యము తోడ వానరేం

ద్రున కిడ సాయ మింపుగను దూర్ణము యుద్ధము సేయు వానికిన్    

  1.  

 

 

 

ఉ.

రామున కట్లె యంచు నని క్రన్నన స్వీయ బలమ్ము తోడఁ దా

నా మరు దాత్మసంభవుని నారయ నేఁగెను జాంబవంతుఁ డా

ధామము సేరఁ బశ్చిమపు ద్వారము గాంచె ససైన్య మారుతిన్ 

ధీమతి రా వగర్చుచును దిర్గి రణం బొనరించి దారిలో       

  1.  

 

 

 

ఆ.వె.

కాంచి మార్గ మందు మించిన ఋక్ష బ

లమ్ము హనుమ యుద్యతమ్ము  నీల

మేఘ సన్నిభం బమోఘమ్ము వెస నాపి

తాను గూడ మరలెఁ దత్క్షణమ్ము    

  1.  

 

 

 

తే.గీ.

సన్నికర్షముఁ జేరి ససైన్య మిట్లు

శీఘ్రముగ వచించె హనుమ చింత మీఱ

రామునిం గని రణ మందు మేము గాంచఁ 

జంపె సీత నేడ్చుచు నుండ శక్రజిత్తు

  1.  

 

 

 

కం.

కని యా దృశ్యం బరి మ

ర్దన! నే విభ్రాంత చిత్తత విచారమునం

జనుదెంచితి నెఱిఁగింపం

గ నీకు నిచ్చటకు వేగ కాకుత్స్థ వరా!   

  1.  

 

 

 

కం.

విని యా గిరలను మూర్ఛి

ల్లెను శో కాక్రాంతుఁడై హరిప్రవరుఁ డనం

గ నృవరుఁడు ఛిన్న మూల ఘ

న న గాభమ్ము పుడమి పయిన రఘుపతి వడెన్         

  1.  

 

 

 

చం.

కని ధరఁ గూల దేవ నిభుఁ గాఱియ రాముఁ బ్లవంగ సత్తముల్

సని రపు డుర్కుచున్ దరికిఁ జల్లిరి మండెడు నగ్ని వోలెఁ జే

ర నలవి కాని వీర వరు రాముని యాస్యము పైన నంతఁ జ

ల్లని యుదకమ్ముఁ  దామరస రమ్యత రోత్పల గంధ యుక్తమున్       

  1.  

 

 

 

ఉ.

అంతట లక్ష్మణుండు పర మార్తుఁడు కౌఁగిటఁ జేర్చి యన్ననున్

వంతను బాహు యుగ్మములఁ బల్కెను వాక్యము లర్థ వంతముల్

సంతత ముంటి ధర్మమునఁ జక్క జయించి నిజేంద్రియమ్ములన్

సుంతయుఁ గావ కున్న యెడ శోకములం దది  వ్యర్థమే చుమీ   

  1.  

 

 

 

తే.గీ.

స్థావరమ్ములు నింకను జంగమములు

నైన భూతమ్ము లున్నవి కాని యట్టి

పగిదిఁ గన రాదు ధర్మమ్ము వసుధ లోన

నంచు నెంతును నే మది నంచితముగ

  1.  

 

 

 

ఆ.వె.

స్థావరమ్ము మఱియు జంగమం బగపడు

నట్టు లిట్టి యర్థ మకట కాదు

యుక్త మెన్న నయిన నో రాఘవేంద్ర! ని

న్నిట్టు లాపద లవి చుట్టుకొనునె

  1.  

 

 

 

కం.

కల దేని యధర్మము చను

ఖలుఁ డా దశవక్త్రుఁడు నరకమ్మున కెన్నం

గలుగన్నేరవు వ్యసన

మ్ములు ధర్మ చరితున కిట్లు మూరుచు నీకున్

  1.  

 

 

 

తే.గీ.

లేక యుంట విపత్తులు లేశమైన

రావణునకు నీ కిటుల మూర వ్యసనములు

భువిని రామ! ధర్మాధర్మము లిటఁ దాఱు

మాఱులె పరస్పరము నెన్న మానవేంద్ర!   

  1.  

 

 

 

తే.గీ.

ధర్మమున ధర్మఫలము నధర్మమున న

ధర్మ ఫల మగు నేని యధర్మ మందుఁ 

దగిలి వీడరు ధర్మము ధరణి జనులు

ధర్మ యుతులు వొందెడు వారు ధర్మ ఫలము   

  1.  

 

 

 

తే.గీ.

ధనము లభివృద్ధి సెంద నధర్మ మందు

నున్న వారికిఁ గ్లేశము లుండ ధర్మ

శీలురకు రిత్త లగు రెండు చింత సేయ

ధర్మ మైనను మఱియు నధర్మ మైన   

  1.  

 

 

 

ఆ.వె.

కాఁగ హతులు పాప కర్ము లధర్మము

చేత నాశ కర్మ శిథిల మగు న

ధర్మ మెవనిఁ జంపఁ దగును దలఁప రామ!

స్వయము హతము గాఁగ వసుధ లోన

  1.  

 

 

 

ఆ.వె.

విహితపుఁ బనుల నిది విలయ మైన లయ మొ

నర్చినను బరుల ననఘ సమేత

కర్మమున విధి యగుఁ గాంచ లిప్తము కర్త 

గాఁడు రఘువరేణ్య! పాడి నెంచ            

  1.  

 

 

 

కం.

ప్రతిచర్య నేరనిది యే

గతి ధర్మ మరి దమనుండ! కనరానిది స

ద్గతి నీయ సమర్థ మగును

మతినిం బరికించి చూడ మనుజ వరేణ్యా!     

  1.  

 

 

 

ఆ.వె.

సత్తనునది యున్న సత్పురుషశ్రేష్ఠ!

కలుగునే యసత్తు కలఁత సెంద

నిట్లు నీకుఁ గలిగె నిపుడు ఘోరమ్ముగఁ

గాన ధర్మ ముంట కాదు నిజము    

  1.  

 

 

 

కం.

బలహీనము బేలయునై

బలమును ధర్మమ్ము కదిసి వర్తింపఁగ దు

ర్బలము నమర్యాదను మను

జులు సేవింపఁ దగ రంచు శూర! తలఁచెదన్

  1.  

 

 

 

కం.

బలమునకు లొంగ ధర్మం

బిలం బరాక్రముము నందు నెలమి విసర్జిం

చి లలితముగ ధర్మమ్మున 

నిలిచిన భంగిని బలమున నిలుమా రతినిన్

  1.  

 

 

 

ఆ.వె.

సత్యమును బలుకుట శత్రుఘ్న! ధర్మం బ

ని పరికించిన యెడ నిజము వలుక

ని జనకుని మ ఱేల నీవు బద్ధునిగ నొ

నర్ప కుంటివి కరుణా విహీను     

  1.  

 

 

 

ఆ.వె.

ధర్మ మైన నా యధర్మ మేనియు నున్న

మున్ను వజ్రి చంపి మునినిఁ బిదపఁ

జేయ కుండుఁ గ్రతువుఁ జిత్రముగ శతక్ర

తు వరి వీర దమన! యవని లోన

  1.  

 

 

 

కం.

ధర్మము నాశము సేయు న

ధర్మ యుతం బయి రఘువర! ధరలో మనుజుల్

కర్మము లొనర్తు రన్నిటి 

నర్మిలి నచ్చిన విధమ్ము నరశార్దూలా!   

  1.  

 

 

 

కం.

ఇదియే నాదు మతమ్మును

బదిలపు రాజ్యంబు నెల్లఁ బరమప్రీతిన్

వదలితివె ధర్మమూలము

నెదఁ దల్పక సుంత యైన నింతకు మునుపే    

  1.  

 

 

 

తే.గీ.

అట్లు నిట్లు సిద్ధించిన యర్థములను

వృద్ధి సెందఁగ వర్తిల్లు నిద్ధర సక

లమ్ము లైన కార్యములు శైలమ్ము లందుఁ 

బాఱు సెలయేరుల పగిది పార్థి వేంద్ర!      

  1.  

 

 

 

కం.

ధన హీన పురుషు నల్ప మ

తి నిఖిల కర్మములు సెడును దీవ్ర నిదాఘ

మ్మున నెండు చిన్న నదుల వ

లెను బరికింపంగ శంక లే దిం దనఘా!

  1.  

 

 

 

ఆ.వె.

సుఖముగఁ బెరిఁగి నతఁ డఖిలార్థములఁ ద్యజి

యించి తిరిగి సుఖము లెంచి మదినిఁ

బాప కార్యములను నేపుగఁ జేయఁ దొ

డంగు దోషములు పరంగు నంత   

  1.  

 

 

 

తే.గీ.

అర్థ మున్న నుందురు మిత్రు లర్థ మున్న

నాత్మ జను లుంద్రు పురుషుఁడౌ నర్థ మున్న

లోక మందుఁ బండితుఁడౌ గురుతర మర్థ

మున్న నాతండు మనుజేంద్ర! యుర్వి లోన        

  1.  

 

 

 

ఉ.

ఎవ్వని కున్న నర్థ మతఁ డెన్నఁ పరాక్రమ వంతుఁడౌ నహో

యెవ్వని కున్న నర్థ మిల నెల్లర కాతఁడు బుద్ధిమంతుఁడౌ

యెవ్వని కున్న నర్థ మతఁ డిద్ధర లోన నదృష్టవంతుఁడౌ

యెవ్వని కున్న నర్థ మతఁడే పరికింప మహా గుణుండునౌ   

  1.  

 

 

 

చం.

విడిచిన చో స్వయమ్ముగను విత్తముఁ జెప్పితిఁ గల్గు దోషముల్

వుడమిని నేన యత్తఱినిఁ బూర్ణము రాజ్యము వీడు బుద్ధినిం

దడయక నీవు కొంటకుఁ గతమ్మును రాఘవ!నేరకుంటి నా

యెడఁదను సుంత నిక్కముగ నివ్విధి దుర్విధి మూరె నిచ్చటన్

  1.  

 

 

 

చం.

అలవడు ధర్మ కామములు నర్థము తిన్నగ నర్థ మున్నచోఁ 

గలుగవు విత్త హీనునకుఁ గామము మీఱినఁ బొంద నర్థముం

గలిగిన హర్ష దర్పములు కామము క్రోధ శమమ్ము లన్నియుం

దలకొను నింపుగా దమము ధర్మము రాజవరేణ్య! రాఘవా!     

  1.  

 

 

 

ఉ.

దేనిఁ ద్యజించి ధార్మికులు తృప్తి వహించి చరింతు రట్టిదౌ

మానవ వర్య! నీ ధనము మాయ మగున్ వెస దుర్దినమ్ములం

గానఁగ రాని యట్టి గ్రహ కాయము భంగినిఁ దండ్రి పంపునం

గానల కేఁగ నీ వసుర కాంతునిచేఁ బ్రియఁ గోలుపోయితే    

  1.  

 

 

 

తే.గీ.

ఇంద్రజిత్కృత దుఃఖము నెల్ల నేఁడు

వాపెదను కర్మము లొనర్చి భూపవర్య!

లెమ్మిఁక నరశార్దూల! త్వరితము తలఁప

వేల నిను మహాత్ముఁ గృతాత్ముఁ గోలు బాహు!       

  1.  

 

 

 

తే.గీ.

కూల్తు నేఁ డిషువుల సాశ్వ కుంజర రథ

సాసురేంద్ర లంకా పురి నవనిజా ని

ధన జనిత కోపి నీ ప్రియార్థం బనఘ! 

హా నిశితములఁ జెలరేఁగి మానవేంద్ర!

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నెనుబది మూడవ సర్గము.

 

 

యుద్ధ కాండము

సర్గము 84.

 

 

 

లక్ష్మణుఁడు రాముని నూఱడించు చుండ సేనను స్వస్థానమున నిలిపి విభీషణుఁడు వచ్చి  రాముని వీక్షించి యిది యింద్రజిత్తు చేసిన మాయ యని సీత బ్రతికియే యున్నదని వచించి లక్ష్మణుని మేఘనాదుని వధింప నికుంభిలకుఁ బంపఁ దగు నని పల్కుట. 

 

 

 

 

కం.

నిలిపి నిజ గుల్మము నిజ

స్థల మందు విభీషణుండు దగ సోదర వ

త్సలుఁ డా లక్ష్మణుఁ డన్నను          

లలి నాశ్వాసించు చుండ రయమున వచ్చెన్

  1.  

 

 

 

ఉ.

కాటుక ముద్ద వంటి ఘన కాయుల నాయుధ హస్త మంత్రులం

బాటవ మున్న నల్వురను బన్నుగఁ గూడి విభీషణుండు గో

త్రాట గజాభ యూధపుల లక్ష్మణు శోక నిమగ్ను నింకఁ గ

న్నీట మునింగి వానరులు నిల్వగఁ గాంచెను జేరి యచ్చటన్  

  1.  

 

 

 

ఉ.

ఆ కడ మోహ సంయుత ఘనార్తు మహాత్ముని రాఘవేంద్రు ని

క్ష్వాకు కులైక వర్ధనుని భాతృ వరాంక గతుం ద్ర పార్తునిన్

వే కని లోపలం గలఁత పిక్కటిలంగ ని దేమిటం చనెన్

శోకము తోడ దీనుఁ డయి చూచుచు లక్ష్మణు దుఃఖ తప్తునిన్

  1.  

 

 

 

తే.గీ.

కని విభీషణు ముఖ మింకఁ గపి గణమ్ము

ఘనుని సుగ్రీవు మందముగ వచియించె 

లక్ష్మణుండు కన్నీరు రాల నయనముల

నుండి యసురు తోడ నెడఁద నిండఁ గలఁత  

  1.  

 

 

 

ఉ.

సీత గతించె నింద్రజితుచే  నన మారుతి నాలకించి తా

నాతత మోహ మందెను నరాధిపుఁడం చను చుండ మధ్యలో

నా తఱి నాపి లక్ష్మణుని నర్థ యుతమ్ముగ రాఘవేంద్రుతో 

నాతఁ డటన్ విసంజ్ఞుని మహాత్ముని గాంచి వచించె నిట్టులన్

  1.  

 

 

 

తే.గీ.

మనుజ పుంగవ! వాయు కుమారుఁ డడలి 

పలికినది యయుక్తం బని దలఁతు నెంతు

నెండె ఘోరంపు సాగరం బెల్ల నంచుఁ

బల్కు చందమ్ము దానినిఁ బార్థివేంద్ర!    

  1.  

 

 

 

కం.

నేరుదు దురాత్ము రావణు

తీరును జానకి గుఱించి తెల్లమ్ముగ నే

నో రామ! యెన్నఁ డైనను

గోరఁడు సీతా నిధనము క్రూరుం డైనన్

  1.  

 

 

 

చం.

అడిగినఁ బెక్కు మారులు ధరాత్మజ నిమ్మని మేలు నెంచుచుం

దొడగఁడు నాలకింపగను దొయ్యలిఁ దిర్గి యొసంగ నా దశా

స్యుఁడు పలు దాన భేదములు సూపిన సామ మశక్య మైనచోఁ

బడతినిఁ గాంచ నన్యములఁ బల్కఁగ నేల రణమ్ము నియ్యెడన్

  1.  

 

 

 

కం.

ఆ తరుణి నెఱుఁగు మాయా

సీత యని మహాభుజ! హరి శేఖరులను దా

నాతతముగ  వంచించుచు

వే తరలెను రాక్షసుండు వీడి రణమ్మున్

  1.  

 

 

 

తే.గీ.

చని నికుంభి లాఖ్యఁ దనరు చైత్యమునకు

హోమ మొనరించుఁ జేసిన హోమ మతఁడు

వాస వాది దేవతలకు భండనమున

నగు దురాధర్షుఁడు దశము ఖాత్మజుండు   

  1.  

 

 

 

కం.

వానరుల విక్రమమునకుఁ

దా నిడ విఘ్నమ్ము నాజిఁ దద్దయు మాయన్

మానవ నాథ! తనర్చెను 

మానక మాయావి యిట్లు మనుజాశనుఁడే

  1.  

 

 

 

తే.గీ.

క్రతు వది ముగియుటకు మున్న కదలి సైన్య

యుతము పోవుద మచటి కాగతపు నీదు

ఘోర మిథ్యా విచారము వీర! వీడు

నీవు శోకింపఁ గాంచి క్షీణించె బలము   

  1.  

 

 

 

ఆ.వె.

స్వస్థ హృదిని నీవు చక్కఁగ నిలు మిట

పంపు మమ్ము ప్లవగ బలము తోడ

సత్త్వవంతు ననుజు సౌమిత్రి వీర వ

ర్యు నొసఁగి యచటకుఁ బురుష వరేణ్య!    

  1.  

 

 

 

కం.

ఈతఁడు నరశార్దూలా!

యాతని పని శిత శరముల నాపిన నంతన్

వీత మహిమ వధ్యుం డగు

నాతఁడు రావణి రణమ్ము నందు మహాత్మా!   

  1.  

 

 

 

కం.

ఘను లక్ష్మణు విహ గాంగక

సునిశిత తీక్ష్ణ శర పంక్తి శోణిత మెల్లం

దనియం ద్రాగు నసుర వ

ర్యునిఁ దాఁకి శరీరమునఁ బురుష శార్దూలా!  

  1.  

 

 

 

కం.

వెస శుభ లక్షణు లక్ష్మణు

నసమాన బలుని ననుపుమ నసురుని వధకై

పస తోడ వజ్రి వజ్రము

ను సత్వరము పంపు నట్లు నుత రణ వీరా!     

  1.  

 

 

 

ఆ.వె.

ఆలసింపఁగఁ దగ దసుర నిధన మందు

శత్రువుని వధింప సత్వర మిడు

నీదు వాణిఁ బనుపు నిర్జ రారులఁ జంప

నింద్రుఁ డొసఁగు రీతి నిపుడు రామ!

  1.  

 

 

 

కం.

పూరించినఁ బని మాయం

బౌ రాక్షసుఁ డమర వరుల కైన రణమునం 

బూరించిన కర్మమ్మునఁ 

బోరిన సురలకును శంక మూరు బ్రతుకునన్    

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నెనుబది నాలుగవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 85.

 

 

 

విభీషణుని మాటలను దిరిగి విని లక్ష్మణుని వానర సైన్యముతోడ నింద్రజిత్తుని వధింప రాముఁడు పంప నాతఁడు విభీషణుఁడు హనుమంతుఁడు మున్నగు వారు తోడు రాఁగ నికుంభిలను జేరుకొనుట. 

 

 

 

 

కం.

విని రాముఁడు శోకార్తుఁడు

ఘన రాక్షసుని వచనములు కానఁడు డెంద

మ్మున స్పష్టార్థము నించుక

యును వివశాత్ముండు మాన వోత్తముఁ డకటా   

  1.  

 

 

 

చం.

మనమునఁ బూని ధైర్యమును మానవ వర్యుఁడు రాఘవుండు వ

ల్కెను బర వీర భంజనుఁడు కిట్టి విభీషణుఁ డుండ నివ్విధిన్

విన నెద నిచ్చగింతును విభీషణ!తిర్గి వచించి నట్టి నీ

మినుకుల నైరృతాధిప! సమీపము నందుఁ బ్లవంగు లుండఁగా  

  1.  

 

 

 

ఉ.

రాముని దీన వాక్యములు రాక్షస పుంగవుఁ డాలకించి తా

నా మను జేంద్రుఁ గాంచి మును పన్నవి వాక్యము  లివ్విధమ్ముగా

నే మఱకుండఁ బల్కెఁ దగ నీ బల ముంచితి  నీ యనుజ్ఞతో 

క్షేమపు రీతి దీర్ఘ భుజ! చెప్పిన యట్టులఁ జెప్పి నంతనే

  1.  

 

 

 

ఉ.

చెన్నుగ నే బలమ్ము విభజించితి నుంచితి నేతలం దగం

బన్నుగ నెంచి న్యాయమును బార్థివ! చెప్పెదఁ దిర్గి విన్మ నా

విన్నప మార్య! యొక్కటిని వీర! యకారణ మార్తి నందఁగా

మిన్నగ నీవు తాపమున మేము మునింగితి మెల్ల రాఘవా!

  1.  

 

 

 

చం.

విడువుమ చింత బూటకపు వృత్తిని వచ్చిన దాని వైరికిం

గడు ముద మిచ్చు దానిని సుఖమ్ముగ సీతను బొంద నెంచినం 

గడు వడి నుద్యమింపవలెఁ గయ్యము నందు వధింప శత్రులం

బడయు మెడంద హర్షమును వంతకుఁ గాదిది కాల మెంచఁగన్  

  1.  

 

 

 

చం.

నరవర! యాలకింపు రఘు నందన యొక్క హితమ్ముఁ జెప్పెదన్

గురుతర మైన సైన్యమును గూడి సుమిత్ర కుమారుఁ డేఁగ నొ

ప్పు రయమునన్ నికుంభిలకుఁ బోరున రావణి సంహరింపఁగా

నురుతర చాప ముక్త సవి షోరగ సన్నిభ మార్గణమ్ములన్   

  1.  

 

 

 

చం.

పడసె నొసంగ నబ్జజుఁడు బ్రహ్మశిరం బను నస్త్ర రాజముం

బుడమినిఁ గామ గామి వర ముద్గ భుగావలి వీరుఁ డింద్రజి

త్తడరి నికుంభిలా తటికి  నాసుర సైన్యము తోడ నేఁగె నా

తఁడు కృతకర్ముఁడై మరలఁ దల్పుమ యెల్లరఁ జచ్చి నట్టులన్      

  1.  

 

 

 

ఉ.

చేరక మున్నికుంభిలను జేయక యున్నను హోమ మగ్ని కే

వీరుఁడు వూని శస్త్రములు వృత్రహజిత్తు! వధించు నాతఁడే

మారకుఁ డౌను నీ కనుచు మాన్యుఁడు బ్రహ్మ వచించె మున్నహో

మారణ మవ్విధమ్ము జనమాన్య! లిఖించె విధాత వానికిన్   

  1.  

 

 

 

ఆ.వె.

ఆజ్ఞ నొసఁగు మో మహాబల! రాఘవ!

చంప నింద్రజిత్తుఁ జావ నతఁడు

సచ్చె రావణుండు  ససుహృజ్జనం బని

నేరఁ దగుదు వీవు నిక్కముగను  

  1.  

 

 

 

చం.

విని వచియించె రాముఁడు విభీషణు మాటల నివ్విధమ్ముగన్

మనమున వాని రౌద్రు ఘన మాయను నేరుదు సత్యవిక్రమా!

వనజ భ వాస్త్ర వేత్తయును బ్రాజ్ఞుఁడు మాయల మారి బల్లిదుం

డని నొనరించు మూర్ఛితుల నప్పతి నింకను నిర్జ రేంద్రులన్       

  1.  

 

 

 

ఆ.వె.

అంతరిక్ష మందు నరదమ్ముపై సంచ

రించు నాతని గతి యించు కేని

కాన రాదు వీర! కమలాప్తు గమనమ్ము

భంగి మునుఁగ మేఘ పంక్తి లోన

  1.  

 

 

 

కం.

అరి నా మాయా వీర్యుని

నరేంద్రుఁ డెఱిఁగి కపటాత్ము  నరభోజనునిన్

గిరలు యశస్సంపన్నుని

నరసి యనుజు లక్ష్మణు ననె నా రాముఁ డిటుల్   

  1.  

 

 

 

ఉ.

వానర నాథు సైన్యమును బన్నుగఁ గూడి మరుత్కుమారునిన్

వానర నేతలం గలసి భల్లగ ణేశుని జాంబవంతునిన్

సేనను గూడి యింపుగను జేరి నికుంభిల రాక్షసేంద్రు త

త్సూనుని మాయలన్ ఘనునిఁ దూర్ణము జంపుమ వీర! లక్ష్మణా!     

  1.  

 

 

 

తే.గీ.

వాని మాయల నెఱిఁగిన యీ నిశాచ

రేంద్రుఁడు విభీషణుఁడు వచ్చు నింక నీదు

వెనుక స్వీయ మంత్రులఁ గూడి  వీర! యనఁగ

రాముఁడు విభీషణునిఁ గూడి లక్ష్మణుండు  

  1.  

 

 

 

తే.గీ.

అద్భుత పరాక్రముఁడు వింటి నంత నెడమ

చేతి నూని కవచ మూని యాతత ముది

తాత్ముఁ డయి నిశిత శర వరాసి యుతుఁడు

రామ పాదములు స్పృశించి లక్ష్మణుఁ డనె  

  1.  

 

 

 

ఉ.

నేఁడు మదీయ కార్ముక సునిర్గత బాణ చయమ్ము రావణిం

బాడిగఁ జేరి చీల్చి వెస వర్ష్మము గూలును లంక లోపలం

జూడఁగ శుద్ధ పుష్కరిణి సుందర హంసలు చేరు భంగినిన్

నేఁడ వధించు రౌద్రు మెయినిం బెకలించి గుణచ్యుతమ్ములై   

  1.  

 

 

 

ఉ.

అని ద్యుతి మంతుఁ డిప్పగిది నగ్రజుతోఁ ద్వరితమ్ముగా గిరల్ 

మనమున నింద్రజిత్తు వధ మానక జేసెడు కోర్కి తోడుతం 

దన గురు పాద పద్మములు దాఁకి యొనర్చి ప్రదక్షిణమ్ములం

జనెను వెసన్ నికుంభిలకుఁ జైత్య వరమ్మున కేఁప రావణిన్   

  1.  

 

 

 

ఉ.

తోడుగ నవ్విభీషణుఁడు తూర్ణము వెంటఁ జరింప నన్నయే

పాడిగఁ బల్క స్వస్తి యుత వాక్యము లేఁగెను విక్రముండు తన్

గూడఁగ వేల వానరులు కూరిమి మారుత నందనుండునున్ 

వేడుక మీఱ లక్ష్మణుఁడు వెన్కను  రా నసురేంద్రు మంత్రులున్  

  1.  

 

 

 

ఆ.వె.

వేగ మరుగుదెంచి పెద్దదౌ హరి సైన్య

ము పరివేష్టిత మయి మూరి నడవ

లక్ష్మణుండు ఋక్ష రాజ బలము గాంచె

దారి లోన నిలువ వీర వరుఁడు

  1.  

 

 

 

ఆ.వె.

చాల దూర మేఁగి సౌమిత్రి మిత్ర నం

దనుఁడు రాక్ష సేంద్రు తద్ద బలము

దూర మందుఁ గాంచెఁ దోరంపు వ్యూహమ్ము

నందు నుండ ధన్వు లందు ఘనుఁడు

  1.  

 

 

 

తే.గీ.

వాని మాయామయునిఁ జేరి పర దమనుఁడు

లక్ష్మణుండు ధనుష్పాణి రఘు వరాన్వ

యోత్తముండు నిలిచెను బ్రహ్మోక్త గతిని

సంహరింప నాత్మఁ దలఁచి సంగరమున

  1.  

 

 

 

కం.

అరు దగు ప్రతాపవంతుఁడు

నరవర సూనుఁడు విభీషణ సమేతుండై

హరి వీరుఁ డంగదునితో

మరుత్సుతుని తోడ నసుర మండలిఁ గాంచెన్   

  1.  

 

 

 

కం.

చొచ్చె నమల శస్త్ర రుచుల

నచ్చమ్మును ధ్వజ రథ నిచ యాభేద్యమ్ముం

జెచ్చెర సు రయము భయదము

నచ్చీకఁటిఁ బోలు దాని నరి సైన్యమ్మున్   

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నెనుబది యేనవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 86.

 

 

 

విభీషణుని యుపాయమున లక్ష్మణుఁ డింద్రజిత్తునిపై నమ్ముల వాన కురిపింప వానర రాక్షసులకు ఘోర యుద్ధము జరుగ నింద్రజిత్తు హోమము నాపి రణోద్యుక్తుఁడు కాఁగ  హనుమంతుఁడు రక్కసులను బాధించుచు రావణిని ద్వంద్వ యుద్ధమున కాహ్వానింప లక్ష్మణుఁ డింద్రజిత్తును గాంచుట. 

 

 

 

 

కం.

అట్టి యెడ విభీషణుఁ డనె 

నిట్టు లహితములు రిపులకు నింకం గడు మే

ల్వుట్ట స్వజనులకు దశరథు

పట్టిం గని  యర్థ సహిత వాక్యము లెలమిన్   

  1.  

 

 

 

కం.

కనఁబడు రాక్షస సేనను

ఘన వర్ణాభము నెదుర్పగఁ దొడఁగ వలయున్

మనుజేంద్ర! తరులను గరము

ల నూని శీఘ్రముగ నిప్డు ప్లవగ వరేణ్యుల్     

  1.  

 

 

 

ఉ.

రావణి సేన నెల్ల వెస లక్ష్మణ! త్రోలఁ దొడంగి నంతటం 

జేవ మహోగ్ర సేనయె విశీర్ణము గాఁగ నతండు దృశ్యుఁ డౌ

నీ వని వజ్రి వజ్ర సదృ శేషు చయమ్ములు సిమ్మి యుర్కుమా

నీ వసురుండు హోమపుఁ బనిన్ నెరవేర్పక మున్న లక్ష్మణా!  

  1.  

 

 

 

ఉ.

చంపుమ యీ దురాత్ముని వెసం గడు వంచకు నీ యధార్మికుం

దెంపునఁ గ్రూర కర్మములఁ దేలెడు రావణి లోక భీకరుం

బంపెను లక్ష్మణుండు విని పల్కు లనంగ విభీషణుండు దా

నంప జడిన్ భృశమ్ముగ దశానన సూనునిఁ దాఁక నంతటన్    

  1.  

 

 

 

చం.

హరి వర ఋక్ష వీర వరు లద్రి నఖాగమ యోధపుంగవుల్

పరువిడి రెల్లరుం గలసి భైరవ రాక్షస సైన్య భూమికిన్

ఖర శర ఖడ్గ తోమర నికాయము తోడను శక్తి యుక్తులై

హరుల జయింపఁ గోరుచు రణాంగణ మం దెదిరించి రాసురుల్

  1.  

 

 

 

చం.

పరఁగెను ఘోర యుద్ధ మట వానర రాక్షస వీర కోటికిం

బురమున లంకలోఁ జెలఁగె  బోరన శబ్దము లెల్ల దిక్కులం

దరువుల శైల శృంగములఁ దద్దయు వాడి శరమ్ములన్ నభం

బురువుగ నయ్యె నావృత మహో వివి ధాకృతి హేతి కోటినిన్  

  1.  

 

 

 

చం.

ప్లవగుల మేనులన్ వికృత వక్త్రులు బాహులు నైన రక్కసుల్

గవియుచు శస్త్రముల్ సొనిపి కయ్యము నందు భృశమ్ముగా భయ

మ్ము వొడమఁ జేయ నా హరులు మూరి శిలాతరు సంచయమ్ము లె

ల్ల విసరి కొట్టి చంపి రని రాక్షస వర్యుల నెల్ల నుగ్రులై

  1.  

 

 

 

కం.

సుమహా కాయులు వానరు

లు మహా బలులు సెలరేఁగి రోషం బడరన్

సమర మొనరించు రాక్షసు

ల మనమ్ముల భయమును దనరఁగ జేసి రటన్       

  1.  

 

 

 

చం.

తన బల మర్ధితం బని సుదారుణ రీతిని శత్రుకోటిచే

వనట మునింగి నట్లు విని వంతను రావణి లేచె హోమపుం

బని నిఁక వీడి వృక్షముల ధ్వాంతము నుండి సరోష చిత్తుఁడై

మును తగఁ గూర్చి నట్టి రథముం దమి నెక్కె సుసంయుతమ్మునున్   

  1.  

 

 

 

ఉ.

భీమ ధనుర్ధరుం డసిత వేష్టిత మేఘ సమప్రభుండు ర

క్తామిత రోహి తాస్య నయ నాగ్రహ మూర్చితుఁ డంత కాభుఁడై

తా మరలంగ రావణినిఁ దద్బల మారసి తేరుపై నటుల్   

భీమ జ వాసురధ్వజిని వెన్కకుఁ దిర్గె నెదిర్ప లక్ష్మణున్     

  1.  

 

 

 

ఉ.

అంతట శైల సన్నిభ మహా కపి యెత్తి దురాసదమ్మునుం

బంతము మీఱఁగా హనుమ పాదప మొక్కటి మొత్తె సైన్యమున్

సాంతము రాక్షసావృతము నల్క ననేక కుజాలిఁ జేసె వి

క్రాంతుఁడు కాల వహ్ని వలెఁ గాల్చుచు రక్కసులన్ విసంజ్ఞులన్    

  1.  

 

 

 

ఆ.వె.

వీరుఁ డట్లు సేయ విధ్వంసము బలిమి

ని హనుమంతుఁ డాజిని నసుర వరు

లరసి వేల మంది యాయుధములు వెద

జల్లి రలుక తోడఁ బెల్లుగాను          

  1.  

 

 

 

ఉ.

శూల వరాలి శూలధర శూరులు కత్తుల ఖడ్గధారులున్

మేలుగ శక్తి హస్తులు నమేయపు శక్తులఁ బట్టిసమ్ములన్

వీలుగ పట్టిసోగ్ర ధర వీరులు కుంత గదా శతఘ్నులుం     

గాల వరాయసేద్ధ పరిఘవ్రజ ముద్గర భిందిపాలముల్   

  1.  

 

 

 

ఉ.

ఘోర పరస్వధమ్ములును గొట్టిరి వైచి తలమ్ములం బగన్ 

మూరగ పిడ్గులన్ బలిమి ముష్టుల వజ్ర నిభమ్ములన్ ఘనున్

మారుత నందనుం గదిసి మారుతి కూడ యెడందఁ గ్రుద్ధుఁడై

వారల ఘోర నాశమును వారక చేసెను భండనమ్మునన్

  1.  

 

 

 

కం.

కనె నింద్రజిత్తు శైల ని

భుని నరులను జంపువాని ముక్తత్రాసున్

హనుమంతునిఁ బవన కుమా

రుని సమరమ్మునఁ జెలంగ రోషాత్ముండై  

  1.  

 

 

 

ఉ.

సారథిఁ గాంచి పల్కె నిటు చక్కఁగ నేఁగుమ యెచ్చ టుండె నా

వీరుఁడు మారుతాత్మజుఁడు వేగమ యచ్చట కంచు నింద్రజి

త్తారయ నాప కున్న నిట నంతము సేయును రాక్షసావలిన్

మూరి యనంగ నయ్యరదమున్ విని  సారథి తోలెఁ జెంతకున్      

  1.  

 

 

 

తే.గీ.

చేరి దుర్ధర్షుఁ డసురుండు మారుతినిఁ గు

రెంచె నింద్ర జిత్తమ్ముల సంచయమ్ము 

ఖడ్గ పట్టి సాసి కుఠార కాయ మంతఁ

గపి వరేణ్యుని తల పైన విపులముగను   

  1.  

 

 

 

కం.

కొని మారుతి యా శస్త్రము

లను ఘోరములఁ బలికె ననిల సుతుఁడు రోష

మ్మున నావిష్టుఁ డయి భృశము

గని రక్కసుని వచనములు కపి వీరుఁ డిటుల్

  1.  

 

 

 

ఆ.వె.

రావణ సుత! కుమతి! రణము నా తోడ శూ

రుండ వైనఁ జేయు ముండ నేర

వీ వసువుల తోడ   నీ వాయు పుత్రునిఁ

జేరి తేని మీఱి పోరు నందు    

  1.  

 

 

 

తే.గీ.

దుర్మతీ! ద్వంద్వ యుద్ధము తూర్ణ మొసఁగ

నెంచి తేని నా కీ విట నంచితముగ

బాహు యుగ్మములం బోర వలయు సైచి

తేని నా వేగము ఘనుఁడ వీ వసురుల

  1.  

 

 

 

ఆ.వె.

వింటి నెత్తి వచ్చు వీరుఁడీ యింద్రజి

త్తు హనుమంతు వధకుఁ దొడఁగు నంచు 

లక్ష్మణునకుఁ జెప్పె రావణాత్మజుఁ జూపి 

యవ్విభీషణుఁడు మహాసురుండు

  1.  

 

 

 

తే.గీ.

ఇతఁడు వాసవుని జయించె సుతుఁడు రావ

ణున కరద మెక్కి చంపు హనుమను వాని

నప్రతిమ శరముల జీవితాంతకరము

ల రిపు వారితములఁ జంపు లక్ష్మణ! వెస   

  1.  

 

 

 

తే.గీ.

అరి విభీషణుం డయి నట్టి యా విభీష

ణుండు వలుక నవ్విధి లక్ష్మణుండు గాంచె

పర్వత నిభు రథస్థునిఁ బర దురాస

దుని దశానన సుతు బల్లిదు నసురేంద్రు     

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నెనుబది యాఱవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 87.

 

 

 

విభీషణుఁడు లక్ష్మణునిఁ గొనిపోయి యింద్రజిత్తును హోమము పూర్తి చేయక మునుపె వధింప వలె నని పలుక నాతనిని రావణి గాంచి దూషింప రావణుని పాపకార్యముల వలనఁ దాను రాముని  నాశ్రయింప వలసె నని పలికి లక్ష్మణుని బాణ వేగమునకు స సైన్యము నీవు నాశనము కాఁగల వని యింద్రజిత్తుతోఁ బలుకుట.  

 

 

 

 

కం.

వచియించి యిట్లు వాక్యము

లుచితముగ ముదంబు వడసి యుత్తమ ధనువున్ 

రుచిరముగఁ గొన్న లక్ష్మణు

నచలితుఁ గొనిపోయె రావణానుజుఁడు వెసన్     

  1.  

 

 

 

చం.

అరిగి కొలంది దూరము మహావన మత్తఱిఁ జొచ్చి యంత నా

సుర వరుఁ డా విభీషణుఁడు సూపెను రావణి సేయు కర్మముం

దరువును నీల మేఘ నిభ దారుణ రూపము మఱ్ఱి చెట్టునున్

గురు రఘు వంశ వీరునకు గొప్ప నిషంగికి రాము భ్రాతకున్     

  1.  

 

 

 

చం.

బలి నిట భూతరాశి కిడి బల్లిదుఁ డంతట నింద్రజిత్తు వే

కలనున కేఁగు నెల్లరకుఁ గన్పడ కింతయుఁ జంపు సంఖ్యపుం

దలమున నెల్ల శత్రువుల దారుణ మార్గణ పంక్తి నింక బ

ద్ధుల ననిఁ జేయు రక్కసుఁడు దుర్జయుఁడౌ రణ మందు లక్ష్మణా       

  1.  

 

 

 

ఉ.

చేరక మున్న రక్కసుఁడు చెట్టును మఱ్ఱిని రావణాత్మజుం

డో రఘువీర! మార్గణము లుగ్రములం దగ వేసి వానినిన్

సారథిఁ దేరు నశ్వములఁ జంపుమ యం చన నాలకించి యా

వీరుఁడు వాని కట్లె యని వింటినిఁ జిత్రముఁ జాచి నిల్వఁగన్

  1.  

 

 

 

చం.

కనఁబడ రావణోద్భవుఁడు ఖడ్గము కంకట మూని సధ్వజుం

డనల సమాన వర్ణ సుమహారథ మందు మహా బలుండు వ

ల్కె నినకు లేద్ధ తేజుఁ డట  లీలగ దుర్జయ! నిన్ను బిల్చు చుం

టి నిపుడు సంగరమ్మునకు డిగ్గన నిమ్ము రణమ్ము నింపుగన్         

  1.  

 

 

 

కం.

అన విని తేజస్వి మహా

మనస్వి దశకంఠు పట్టి మనుజేంద్రుని చెం

తను గాంచి విభీషణుని వ

చనమ్ములు వచించె నిట్లు చాల పరుషముల్        

  1.  

 

 

 

చం.

ఇచటనె పుట్టి పెర్గితివి యెన్న స్వయమ్ముగ నాదు తండ్రి కీ

వు చిన సహోదరుండ వయి పుత్రున కివ్విధి నీయ హానినిన్ 

రుచిర మటంచు నెంచెదవె ద్రోహి! పితృవ్యుఁడ వయ్యు దుష్ట! నీ

వు చెలిమి జాతి గోత్రమునఁ బూనవు కూరిమి ధర్మ దూషణా!     

  1.  

 

 

 

ఆ.వె.

నీదు ధర్మ మేని సౌదర్య మేని త

లఁపవు నింద్యుఁడవు ధర సుజనులకుఁ 

గలుగు జాలి నిన్ను గన స్వజనుల వీడి

కొలువఁ బరుల నీచ!  తలపడితివి      

  1.  

 

 

 

ఉ.

ఎక్కడ స్వప్రజా వసన మెక్కడ యన్య జనాశ్రయమ్ము నీ

వక్కట యల్పబుద్ధినిఁ దదంతర మెన్నఁ డెఱుంగ నేరవే

యెక్కుడు మంచి వారయిన నేమి పరుల్ గుణ హీను లైననుం 

జక్కని వారె స్వీయ కుల సభ్యు లమిత్రుఁ డమిత్రుఁడే కదా!     

  1.  

 

 

 

తే.గీ.

ఎవ్వఁడు తన పక్షమ్మును నిట్లు వీడి

చేరునొ పర పక్షమ్మును జెంద స్వీయ

పక్షము విలయం బక్కట పరుల వలనఁ

జంపఁ బడును దాను బిదప సత్వరమ్ము   

  1.  

 

 

 

ఆ.వె.

జాలి లేక యిట్టి మే లిడని పనిని

స్వజన గణములో నిశాచరేంద్ర!

చేయ నీక తగును జిత్రముగను దశ

వక్త్ర సోదరుండ! పౌరుషమున   

  1.  

 

 

 

కం.

అన నిట్లు భాతృ పుత్రుఁడు

విని పలికె విభీషణుండు వింతగ నా వృ

త్తి నెఱుఁగని వాని వలె నే

లను వాఁగెద వివ్విధముగ రావణ తనయా!

  1.  

 

 

 

.వె.

క్షుద్ర! రాక్షసేంద్ర సూను! గౌరవమున

వీడు పరుష ముద్భవించినఁ గడు

క్రూర చరు లసురుల కులమున మేటి నృ

గుణ మరాక్షసమ్ము కుమతి! నాది   

  1.  

 

 

 

తే.గీ.

అలర నేర దారుణ కర్మముల నెడంద

సంచరింప నెన్నఁ డధర్మ సంచయమునఁ 

దమ్ముఁడు గుణ హీనుఁ డయిన నెమ్మి జూడ

కెట్టు లన్న తమ్ముని వీడు నెన్నఁ డైన    

  1.  

 

 

 

కం.

పురుషుని నధర్మశీలుని

దురిత చరితునిఁ ద్యజియింపఁ దోరపు సుఖమున్

ధరఁ బడయఁ గలరు ఘోరపు

టురగమ్మును వీడి నట్టు లుత్తమ పురుషుల్

  1.  

 

 

 

చం.

పరుల ధనమ్మునుం బరుల భార్యలఁ గైకొను దుష్ట చిత్తులం

ద్వరితము వీడ నొప్పు జ్వలితంపు గృహమ్మును వీడు నట్టులం

బర ధన దారలం గొనుట వారక మిత్రుల సంశయించుటల్

కర మివి మూడు దోషములు  కల్గిన నిచ్చు క్షయమ్ము బాలకా!     

  1.  

 

 

 

చం.

మునులను జంపుటల్ సురల మొత్తుట మానము  రోష వైరము

ల్మనమునఁ బ్రాతి కూల్యమును రాక్షస నాథుని ఘోర దోషముల్

దన గుణ రాశి మూసినవి తద్ద గిరిన్ ఘన రాశి మూయు భం

గిని సిరి నింక జీవితముఁ గృత్స్నము నాశము సేయు దోషముల్    

  1.  

 

 

 

తే.గీ.

నాదు భ్రాత దోషములచే నీదు తండ్రి

విడువఁ బడెను నా చేతను దడయ కుండఁ

బురము లంకయు నీవు నసుర విభుండు

నుండ నేరరు నీ జనకుండు నింక

  1.  

 

 

 

ఆ.వె.

నీచ! బాల! దుర్వినీత! దుర్గర్వి! కా

లంపుఁ బాశమునకు నింపుగాను

బద్ధుఁడ వయి తీవు పల్కు మేమే మన

నెంచి తన్నియు నను నెలమి నింక      

  1.  

 

 

 

కం.

నన్ననఁగ నేల నిచ్చట

నిన్నుం జేరె వ్యసనములు నేఁ డివ్విధి నీ

వన్నగమును న్యగ్రోధము

నెన్నం డికఁ జేర లేవు హీన చరిత్రా!      

  1.  

 

 

 

ఆ.వె.

ధిక్కరించి నీవు ధీరుఁ గాకుత్స్థు న

శక్యుఁడవు బ్రతుక నృసత్త మేంద్రు 

లక్ష్మణు నెదిరింపు రణ మందు యము నింట

సమసి సురల పనినిఁ జలుపు దెలమి

  1.  

 

 

 

తే.గీ.

చూపు ముద్యతంపు బలము తూపుల వ్యయ

ము నొనరింపుమ యాయుధములను గూడి

లక్ష్మణు శర మార్గమ్మున రాక్షస! పడి

స బల మేఁగ లే వసువులు సడల కుండ   

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నెనుబది యేడవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 88.

 

 

 

లక్ష్మణ మేఘనాదులు ఘోరముగా యుద్ధము చేయుట.

 

 

 

 

కం.

విని యటులు విభీషణుని వ

చనమ్ములను శక్రజిత్తు సక్రోధుండై

చనెఁ జెంతకు రయమునఁ బలి

కె నంతఁ గడిఁది పరుషంపు గిర లిబ్భంగిన్       

  1.  

 

 

 

చం.

అరద మలంకృతమ్ము నసితాశ్వయుతమ్ము ఘనమ్ము నెక్కి యా

ఖర కరవాల సాయుధ నికాయ సమేతము నంతకోపముం

డురువును వేగ వంత మగు నుగ్ర ధనుస్సును సాయకమ్ములం

బర బల భేదకమ్ములను బట్టి నిశాచరుఁ డేఁగుదెంచినన్       

  1.  

 

 

 

ఉ.

కాంచి ధనుర్ధరుండు నర కాంతుని లక్ష్మణు నయ్యలంకృతుం 

గాంచన భూష ణావృతుఁడు గ్రాలి రథమ్మున వీరుఁ డింద్రజి

త్తంచిత రీతి మారుతి వరాంసముపై రఘు వీరుఁ డుండఁగా

మించి విభీషణుం గలసి మిత్ర నిభుండు వచించె వారితో     

  1.  

 

 

 

తే.గీ.

సంభ్రమమున సౌమిత్రిని సహవిభీష

ణునిఁ గపీంద్రులఁ గని దశానన సుతుండు

చూడుఁ డిట నాదు శౌర్యము నేఁడ యంచు 

నాపుఁడు మదీయ శరవర్ష మరసి మీరు       

  1.  

 

 

 

తే.గీ.

నాదు వింటి నుండి వెడలు నా శరములు

కాల్చి  వేయును వేగ మీ కాయములను

దూది కుప్పను గాల్చెడు దుస్సహంపు

టగ్ని భంగిని నీ సంగ రాంగణమున

  1.  

 

 

 

ఉ.

చూడుఁడు తీక్ష్ణ బాణముల శూల స తోమర ఋష్టి శక్తులన్

నేఁడు యమాలయమ్మునకు నిష్ఠుర రీతిని మిమ్ము పంపెదన్

వాడి శరోగ్ర వృష్టి నిటఁ బన్నుగ నే సృజియించి యార్వఁగా

నోడక నిల్చునే యెదుట నొక్కఁడు నక్కట మేఘ భంగినిన్         

  1.  

 

 

 

ఉ.

మున్ను నిశం బురస్సరుల పొందిక నిర్వురు నా శరమ్ములం

గ్రన్నన నస్థి జాశని నికాశములన్ ధరపై విసంజ్ఞులై 

చెన్ను నశింపఁ గూలితిరె చేటు స్మరింపరె సర్పరోషుఁడన్

నన్నెదిరింప రాఁ దలఁతు నా మదిఁ గాలునిఁ జేరి నట్టులన్    

  1.  

 

 

 

చం.

విని యసురేంద్రు గర్జితు నభీతుఁడు లక్ష్మణుఁ డాగ్రహుండునై

మినుకులు వల్కె నిట్లసుర! మించి వచింతువు దుర్గమమ్ములౌ

పనులకుఁ బార మింపుగను బారము చేతల నెవ్వఁ డోజఁ జే

రు నతఁడు బుద్ధిమంతుఁ డగుఁ గ్రూర మనస్కుఁడ! యెంచి చూడఁగన్    

  1.  

 

 

 

తే.గీ.

అన్యుల కొనరింప నసాధ్య మైన కర్మ

ము నొనరుప నసమర్థుఁడ!  ఘన గిర లని 

వ్యర్థములను గృతార్థుఁడ నైతి నంచుఁ 

దలఁతు వీవు దుర్మతి! సంతతమ్ము నరయ     

  1.  

 

 

 

ఉ.

అప్పుడు నీవు మాయ మయి యాజి గణించిన మార్గ మెంచఁగాఁ

దప్పక యౌను నీచ మగు తస్కర మార్గము వీర సేవితం

బెప్పుడు కాదు బెక్కు లన నేల శరావలి నెట్లు నొంచి తీ

వొప్పుగఁ జూపు మిప్పు డది యూఱక యివ్విధి వాఁగ నేలనో   

  1.  

 

 

 

చం.

అన విని యింద్రజిత్తడరి యాజి జయుండు స్పృశించి వింటినిన్

ఘనుఁడు బలమ్ము నందు శర కాయము గుర్సె మహా శితావలిన్ 

సునిశిత మార్గణమ్ము లవి శూరుని లక్ష్మణుఁ జేరి నిస్వసిం

చు నురగ సన్నిభమ్ము లయి క్షోభ నొసంగెఁ గరమ్ము వానికిన్   

  1.  

 

 

 

ఆ.వె.

వేగవంతుఁ డసుర వీరుఁ డా యింద్రజి

త్తు సుమహా రయములు తూపు లేసి

సమర మందు శూరు సౌమిత్రి శుభ లక్ష

ణు వెసఁ గొట్టె రావణు తనయుండు   

  1.  

 

 

 

కం.

శర విద్ధుండై కాఱ రు

ధిరమ్ము శ్రీమంతుఁడు రణ ధీరుండు వెలిం

గె రఘుకుల వీరుఁడు విధూ

మ రుచిర పావకుని వలె సమర తల మందున్

  1.  

 

 

 

కం.

నిజ కర్మమ్మును గని యిం

ద్రజిత్తు సముఖమున కరిగి రాక్షస రాజా

త్మజుఁ డంత మహానాద

మ్ముఁ జేసి వచియించె నిట్లు ముది తాత్ముండై   

  1.  

 

 

 

ఉ.

ఱెక్కల వాడి తూపు లివి ఱివ్వున వీడి మదీయ కార్ముకం

బెక్కుడు వేగవంతములు నింపుగఁ గైకొను నీదు ప్రాణముల్

గ్రక్కున జీవితాంతక శరమ్ములు లక్ష్మణ శ్యేన సంఘముల్

నక్కలు గ్రద్ద లెల్లయు ఘనమ్ముగ వ్రాలును జావ నీ పయిన్

  1.  

 

 

 

ఆ.వె.

క్షత్రబంధు భక్తు సౌమిత్రి! భ్రాత న

నార్యు నిన్ను రాముఁ డధమ బుద్ధి

గాంచు నేఁడు హతము గాఁగ రణమ్మున

నాదు శర చయమ్ము నాట మేన

  1.  

 

 

 

కం.

చూచును సడలిన కవచిని

నా చే హతుని శిరము దెగిన నరునిఁ జ్యుత నా

రాచుని సౌమిత్రి! యిచట

వేచిన నొకయింత తడవు  వీర వరేణ్యా!      

  1.  

 

 

 

చం.

విని యన రావ ణాత్మజుఁడు వెక్కసమౌ పరుషమ్ముగా నటుల్

కనలి సహేతుకమ్ముగ నృకాంతుఁడు వల్కె మహార్థ వంతముల్

దనరకు వాగ్బలమ్మునను దద్దయు వాగెదు క్రూరకర్ముఁడా

కొనుమ యశమ్ముఁ గర్మములు కొంచెము లైన యొనర్చి దుర్మతీ!  

  1.  

 

 

 

తే.గీ.

కర్మ మొనరింపకయె పలుకంగ నేల

నిట్లు రాక్షస! యెవ్విధి నెడఁద నీదు

పలుకులను నమ్మఁగలనొ యా పనిఁ దగ నొన

రింపు మింకఁ బలుక నేల రిత్తగాను

  1.  

 

 

 

ఆ.వె.

పలుక కుండ నేను బరుషంపు వాక్యమ్ము

గొంచె మైన నింద యించు కేని

చేయ కుండ నిన్ను జెప్పక గొప్పను  

సుంత చంపు వాఁడ చూడు నిన్ను

  1.  

 

 

 

చం.

త్వరితము లాగి కర్ణములఁ దాఁకఁగ నమ్ముల నైదు వేసెఁ దా

గిర లని యిట్లు లక్ష్మణుఁడు గిన్కను రావణి ఱొమ్ము పైన నా

యురగ నిభంపు మార్గణము లుత్తమ పత్ర రయమ్ములే వెలిం

గె రవి కరాలి సన్నిభము కృత్స్నము నైరృతు వక్షమం దటన్   

  1.  

 

 

 

తే.గీ.

ఆ శరముల నొచ్చి కడు నయ్యసురుఁ డింద్ర

జిత్తు రావణాత్మజుఁడు విశేష రోష

మునను సుప్రయుక్తము లగు మూడు బాణ

ములఁ దిరిగి కొట్టె లక్ష్మణు భూరి బలుని

  1.  

 

 

 

కం.

నర రాక్షస శార్దూలుర

పరస్పర జిగీషుల ఘన భండన మయ్యెం

గరము తుముల మయ్యె  ధను

ర్ధరు లిరువురు పోరు సల్ప దారుణ రీతిన్

  1.  

 

 

 

తే.గీ.

ఇద్దఱు బల సంపన్నులె యిద్ద ఱరయ 

నిద్ధ విక్రమశాలురె యిద్ద ఱెంచ

నెంతొ విక్రాంతు లిద్దఱు నెల్ల యస్త్ర

శస్త్ర నిపుణు లజేయులు శౌర్య బలులు     

  1.  

 

 

 

కం.

గగనమ్ము నం దడరు గ్రహ

యుగమ్ము భంగి బలవృత్ర యుగ్మము పగిదిన్

విగత భయులు సంగ్రామము

నఁ గడు దురాసదులు పోరునఁ జెలఁగి రుభయుల్          

  1.  

 

 

 

తే.గీ.

అమ్మహాత్ములు సింహ ద్వయమ్ము వోలె

నృవర రాక్షస సింహు లనేక మార్గ

ణౌఘములు సృజియించి బలాఢ్యు లడరి  

సంతసమున నొనర్చిరి సంగరమ్ము

  1.  

 

 

 

తే.గీ.

ముదితులు సమార్గణ ధనుర్విభూషితులు జ

యార్థు లొండొరు లపుడు న రాసురర్ష

భులు శరౌఘ వర్షము మేఘము వలె నాజి

భృశము వర్షింపఁ జేసిరి వీర వరులు

  1.  

 

 

 

ఆ.వె.

వృద్ధి సెంది భృశము యుద్ధ మందు రణ కో

విదులు  మాటి మాటి కుదరి శిత శ

రాసి శస్త్ర దండ హస్తులు శంబ రేం

ద్రులను బోలి యొండొరుల నడిచిరి 

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నెనుబది యెనిమిదవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 89.

 

 

 

లక్ష్మణేంద్ర జిత్తుల భయంకర యుద్ధము గొనసాగుట.

 

 

 

 

కం.

సంధించి శరమ్ములు మో

హాం ధాసురుని పయి రాఘ వానుజుఁడు మహా

స్కంధుండు వైరి జన దహ

నేంధనుఁ డహి భంగి నిశ్వసించుచు వైచెన్    

  1.  

 

 

 

ఆ.వె.

వాని జ్యా తలంపు  స్వనమును నాలకిం

ప నసుర నిచ యాధిపతి వివర్ణ

వదనుఁ డయ్యె మనుజ వర్యుని లక్ష్మణుఁ 

గాంచె నింద్రజిత్తు మించ వంత    

  1.  

 

 

 

చం.

కని యసురున్ విషణ్ణ ముఖుఁ గయ్య మొనర్చుచు నున్న లక్ష్మణుం

గని వెస నవ్విభీషణుఁడు గాంచ నిమిత్తము లేను వీని యం

దు నెదఁ దలంతు నీతఁ డనిఁ దోరము దుర్బలుఁ డయ్యె నంచు శం

క నరయ నిందు వేగపడఁ గార్యము నీ కని పల్కె నత్తఱిన్        

  1.  

 

 

 

చం.

శరముల నెక్కు పెట్టి ఫణి సన్నిభ మార్గణ పంక్తి వానిపైఁ

గురిసెను దీక్ష్ణముల్ విషము గూడిన ఘోరత రాహి కోటికిన్

సరి యగు వాని  వేయఁగను శక్ర మహాశని సన్నిభమ్ముగా

శరములు దాఁక విగ్రహము సర్వము క్షోభిల నందె మూఢతన్   

  1.  

 

 

 

ఉ.

ఒక్క ముహూర్త కాలమున నూఱట నందఁగ నింద్రియమ్ములుం

జక్కఁగ సంజ్ఞనుం బడసి  సౌమ్యుని లక్ష్మణుఁ గాంచి సంస్థితున్

మిక్కిలి వీర్యునిం గదిసి మీఱిన యెఱ్ఱఁదనంపుఁ గన్నులం   

బిక్కటిలంగ నాగ్రహము వే పరుషమ్ములు దిర్గి యిట్లనెన్

  1.  

 

 

 

ఉ.

ఏల తలంప వీవు మును నిచ్చట భ్రాతను గూడి యక్కటా

నేల విసంజ్ఞ దొర్లుటను నెమ్మది బంధితు లైన రీతి మీ

రాలము లోన వజ్ర సదృ శాతత ఘాత శరీరులై భువిం

గూలిరి సానుగాము లయి ఘోరముగాఁ బ్రథమంపు టాజిలో     

  1.  

 

 

 

తే.గీ.

నన్ను నెదిరింప నెంచెదు సన్న గిల్లె

నే స్మృతి దలంప నీకు లే దేని యేఁగ

నెంచితివొ యంతకుని యింటి కీవు నిక్క

మంచు దలఁతు దీని నెడఁద నంచితముగ

  1.  

 

 

 

ఆ.వె.

మొదట జరిగి నట్టి పోరు నందు మదీయ

విక్రమమ్ము నీకు సక్రమముగఁ

గాన రాక యున్న నేన చూపించు వాఁ

డ నిలు మిచట ధైర్యమును వహించి    

  1.  

 

 

 

ఉ.

వాడివి సప్త బాణములు వైచెను రావణి పల్కి యిట్టులం

బాడిగఁ దాఁక లక్ష్మణుని బాణములం బది యాంజనేయుపైఁ 

దాడితుఁ జేసె మార్గణ శతమ్ములు వైచి దశాస్యు భ్రాతనుం

గూడఁగ రెండు రెట్టు లయి క్రోధము సత్వర మవ్విభీషణున్   

  1.  

 

 

 

చం.

అనిఁ గని యింద్ర జిత్తు పని నన్నర వర్యుఁ డభీతి నవ్వుచుం

బని యిది యల్ప మైన దని పట్టి శరమ్ములు తద్ద ఘోరముల్

గినుక వహించి లక్ష్మణుఁడు కేలను రావణి పైన వైచి ప

ల్కెను రణ శూరు లివ్విధము రిత్తగ వేయరు మార్గణమ్ములన్      

  1.  

 

 

 

కం.

శరములు లఘువులు నీవి య

సుర! బలమం దల్పము లయి సుఖ దమ్ములునై

పరఁగెం గన జయ కాంక్షులు

దుర మిట్లొనరింప రనుచుఁ దూపులు పఱపెన్          

  1.  

 

 

 

ఆ.వె.

కాంచనంపు టసురు కవచము లక్ష్మణ

ముక్త ఘోర బాణములకు విఱిగి

రథము పైన నంబరమ్ము వీడి పడు చు

క్కల గమి వలెఁ గూలెఁ గదన మందు

  1.  

 

 

 

ఆ.వె.

కాండ పంక్తిఁ దొలఁగఁ గవచమ్ము  గాయమ్ము

లడర గాత్ర మందు నయ్యసుర వ

రుండు రావణాత్మజుండు వెలింగెఁ బ్ర

త్యూష మందు వెలుఁగు ద్యుమణి వోలె

  1.  

 

 

 

ఉ.

రావణి యుగ్రుఁడై కరము లక్ష్మణుఁ గొట్టెను భీమవిక్రమున్

వావిరి వేయి బాణముల బ్రద్దలు గాఁ గవచమ్ము కర్మముల్

లావున వీరు లత్తఱి దురమ్మునఁ జేసి పరస్పరమ్మునుం 

గేవల మెంచి డెందముల గెల్పును మార్కొన దూఁకి రిర్వురున్   

  1.  

 

 

 

చం.

శరములు నాట దేహముల సర్వ శరీరము రక్త సిక్తమై

పరగఁగ వీరు లిర్వురకు భండన విజ్ఞులు నిశ్వసించుచుం

దిరుగుచు వ్యాకులం బయి యతీతము యుద్ధము వర్తిలంగ వా

రిరువురు దీర్ఘకాల మొన రించిరి విద్ధుల నొక్కరొక్కరిన్

  1.  

 

 

 

తే.గీ.

భీమ విక్రము లిర్వురు తాము జయము

నంద నుద్యుక్తు లైరి కయ్యమ్ము నందు

బాణ జాల కీర్ణ కవచధ్వజులు కార్చు

చుష్ణ రుధిరమ్ము సెలయేరు లుదకము వలె   

  1.  

 

 

 

చం.

కడచెను కాల మెక్కువగఁ గయ్యము సేయుచు నుండ నిర్వురుం 

గడు శర వర్ష పాతమునఁ గాల మహాసిత మేఘ భంగినిన్

బెడిదము లైన శబ్దములు వెల్వడ నాజిని మిక్కుటమ్ముగన్

బడలిక సుంతయుం గనరు భండన మాపఁ దలంప రిద్దఱున్

  1.  

 

 

 

తే.గీ.

అస్త్ర విదు లందు నుత్తము లస్త్రములను

మాటి మాటికిఁ జూపుచు మేటి యమ్ము

లిరువురు ననేకములు వేసి యెల్ల నింగిఁ

గప్పి రుచ్చావచమ్ముల నప్పు డడరి       

  1.  

 

 

 

ఆ.వె.

చేసి రిరువు రాజి చిత్రముగను దేలి

కగను బాగుగాను విగత దోష

ముల నడరుచుఁ దుములముగను ఘోర తర మ

న్నరవ రాసుర వర నాథు లపుడు

  1.  

 

 

 

కం.

వారల తుములస్వనములు  

మూరెను నిర్ఘాత నిభము భూరి చలనముల్

దారుణముగఁ బుట్టించెను  

ధారుణి విడివిడిగ సమర తలమునఁ గాంచన్

  1.  

 

 

 

కం.

వా రిరువురు నిట్టూర్చుచు

ఘోరముగ రణం బొనర్పఁ గ్రుద్ధత నింగిం

దారాడు చున్న భీకర   

వారిదముల ధ్వనుల మించె వారి రవమ్ముల్

  1.  

 

 

 

తే.గీ.

పసిడి పింజలఁ దనరారు వాడి సెలలు

సేసి నట్టి పుండ్లు భృశము  సెలఁగు చున్న

వారు కార్చిరి రక్తము బల్లిదులు య

శస్వులు జయనిశ్చయులు భృశం బుభయులు    

  1.  

 

 

 

ఆ.వె.

ఆజి మేనుల పయి నభ్ర పుంఖ శరము

లెల్లఁ బడి  మనుజ వరేంద్ర రాక్ష

సేంద్రుల రుధిరమున నిచ్చఁ దడిసి ప్రవే

సించినవి పుడమినిఁ జిత్రముగను   

  1.  

 

 

 

ఆ.వె.

నిశిత శస్త్ర రాశి నింగి నన్యమ్ములఁ

దాఁకి వా రిరువురు తద్ద యలిగి

వేసిన శరము లవి  వేల ముక్కలుగఁ జే

సినవి విఱిచి వాని శీఘ్రముగను

  1.  

 

 

 

కం.

వారి శర జాల మయ చయ

మా రణమునఁ గ్రతువున జ్వలి తాగ్నుల సరసన్

మూరెడు కుశ చయ నిభముగఁ

దోరమ్ముగఁ గాన వచ్చెఁ దూర్ణం బచటన్

  1.  

 

 

 

కం.

ఘను లా కృతవ్ర ణాంగులు

కనఁబడిరి మహాత్ములు దృఢ కాయులు సమర

మ్మునఁ బత్ర హీన పుష్పిత

ఘన శాల్మలి వృక్ష కింశుక తరు నిభముగన్     

  1.  

 

 

 

ఉ.

కోరుచుఁ జంప నొండొరుల ఘోర రణం బొనరించి రిద్దఱున్

వీరుఁడు లక్ష్మణుం డసుర వీరుఁడు రావణి మాటిమాటికిం

బోరునఁ గొట్ట రావణ సుపుత్రుని లక్ష్మణుఁ డింద్రజిత్తు రో

షారుణ వర్ణ నేత్రుఁడు మహాత్ముని లక్ష్మణుఁ గొట్ట నుగ్రుఁడై

  1.  

 

 

 

ఆ.వె.

సుంత యలసట బల వంతులు  వొంద రి

రువురు నాట ముల్కులు తనువులను

మొలచి పెరిఁగి నట్టి  మొక్క లున్నట్టి ప

ర్వతముల పగిదిఁ గనఁ బడిరి వారు        

  1.  

 

 

 

కం.

అనలమ్ము భంగి రుధిర

మ్మునం దడిసి గాత్ర రాశి ముల్కుల తోడన్

ఘనముగ వెల్గుచు నుండెను    

మను జాసుర వీరులకు సమరతల మందున్     

  1.  

 

 

 

కం.

కడచెను గాలము మిక్కిలి

యడరుచు నొనరింప రణము నత్యుగ్రముగన్ 

బడలిక నందఱు  సుంతయు

నెడ రణ వైముఖ్యము గన రింతయు నిరువుర్

  1.  

 

 

 

కం.

సమరశ్రమమ్ము నాపఁగ

సమ రాజిత లక్ష్మణునకు సాయ మొనర్పన్

సమరమున విభీషణుఁడే

సమంచితం బాత్మఁ దలఁచి  చయ్యన నిలిచెన్      

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నెనుబది తొమ్మిదవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 90.

 

 

 

లక్ష్మ ణేంద్రజిత్తుల ఘోర యుద్దము గొనసాగుట, విభీషణుఁడు రక్కసులను వధించుచు వానరులఁ  బ్రోత్సహించుట, రావణి సారథిని లక్ష్మణుఁడు వధింప వానరులు రథాశ్వములను జంపుట.

 

 

 

 

చం.

కలఁగని మత్త కుంజర నికాశుల మానవ రాక్ష సేంద్రులం

దలఁచి పరస్పరమ్ము వితతంపు జయమ్మును బోరు వారినిన్

బలుఁడు విభీషణుండు గన వారి రణమ్మును సంగ రావనిన్

నిలిచెను భీమ చాపమును నెమ్మి ధరించి కుతూహలమ్మునన్   

  1.  

 

 

 

ఉ.

వింటినిఁ జాచి యయ్యసుర వీరుఁడు రావణు భ్రాత యంతటం 

గంటక సన్ని భాగ్రములు కాండము లేసెను రాక్ష సాలిపై

నంటఁగఁ దీక్ష్ణ మార్గణము లంగము లగ్ని నిభమ్ములై నభం

బంటు నగమ్ములం జెఱచు నక్షజ భంగినిఁ జీల్చె వారినిన్      

  1.  

 

 

 

తే.గీ.

అవ్విభీషణు సచివులు హస్తముల ధ

రించి శూలాసి పట్టిస సంచయమ్ము

నెల్ల రక్కసులం గొట్టి రిద్ధ వీరు

లాజిఁ జెలరేఁగి భృశముగఁ దేజు దనర

  1.  

 

 

 

ఉ.

గున్నల మధ్యఁ గుంభి వలె గొప్పగ నుండె విభీషణుం డనిం

దన్నటు లుండఁ జుట్టుకొని తన్నిజ మంత్రులు ప్రీతి రక్కసుల్

చెన్నుగ రాక్షసోత్తముఁడు సేరి ప్లవంగుల నూలుకొల్పుచుం 

దిన్నని కాల సంవిదుఁడు దిట్ట వచించెను బల్కు లిట్టులన్   

  1.  

 

 

 

ఉ.

రక్కసులన్ వధింప సమరమ్మునఁ గోరు ప్లవంగు లార! వీఁ

డొక్కఁడె రాక్ష సేంద్రునకు నుండెను దిక్కుగ వీని సైన్య మం

దొక్కఁ డితం డిఁకన్ మిగిలె నూఱక మీ రిటు లేల నిల్తురో

మక్క నితండు రావణుని మానిన నన్య బలమ్ము శూన్యమే   

  1.  

 

 

 

సీ.

హతుఁ డయ్యె నాజిఁ బ్రహస్తుఁడు వీరుం డగు నికుంభుఁడు బలుండు కుంభకర్ణుఁ

డసుర కుంభుండు ధూమ్రాక్షుఁడు జంబుమాలియు మహామాలియు రయమున ఘనుఁ

డశనిప్రభుం డింక నసుర సుప్తఘ్నుఁడు యజ్ఞకోపుండు బలాతిశయులు 

వజ్రదంష్ట్రుండును వైరిఘ్న వికటుండు సంహ్రాది తపనుండు సమసి రాజిఁ 

 

తే.గీ.

బ్రఘస మంద  ప్రఘాసులు బల్లిదులు ప్ర

జంఘ జంఘాగ్ని కేతు లసదృశ రశ్మి

కేతు వింక విద్యుజ్జిహ్వుఁ డాతత బలుఁ

డా ద్విజిహ్వుండును సుపార్శ్వుఁ డసుర ఘనుఁడు      

  1.  

 

 

 

.వె.

సూర్య శత్రు వింక శ్రుత కంప నాకంప

నులును జక్రమాలి నుత పరాక్ర

మ బలవంతులు నసమానులు దేవాంత

కుఁడు నరాంతకుండు గూలి రవని

  1.  

 

 

 

ఉ.

వీరి ననేకులన్ రిపుల భీమ తరాసుర వీర వర్యులన్

మీరు వధించి సాగరము మించి తరించి స్వకీయ బాహులన్

వారక చిన్ని గోష్పదము పన్నుగ దాఁటఁగ మీర లర్హులే

మూరి జయింపుఁడీ మిగులు బోరనఁ జచ్చిరి వచ్చి దర్పితుల్

  1.  

 

 

 

కం.

జనకుఁడ నేను నిజ కుమా

రునిఁ జంపు టయుక్తము నృవరు నిమిత్తము నే

మన మందు వీడి జాలినిఁ 

దనయుని వధియింపఁ దలఁతు దారుణ మైనన్     

  1.  

 

 

 

చం.

తనయునిఁ జంపఁ గోరు చిన తండ్రికి నశ్రులు నిండి కన్నులం 

బని నిట నాపు చున్నయవి వాని వధించు మహా భుజుండు ధ

న్వి నెగడి యాజి లక్ష్మణుఁడు వీనికిఁ జెంతఁ జరించు వైరులన్

వనచరులార! కూడికొని పన్నుగఁ జంపుడు విక్రమించుచున్        

  1.  

 

 

 

ఆ.వె.

ఇవ్విధము యశస్వి యింపుగ నసు రేంద్రుఁ

డురువుగఁ బురికొల్ప నుత్సహించి

సంతసమ్ము నంది శాఖామృగులు తోఁక

లఁ గదలించి రెల్ల రమ్యముగను

  1.  

 

 

 

ఆ.వె.

వారిదములఁ గన్న బర్హి సంఘము భంగి

వానరర్షభులు రవమ్ము లడరు

చు నొనరించి రంత ఘనముగ సింహ నా

దముల భంగిని వివిధమ్ము లపుడు

  1.  

 

 

 

ఉ.

అంతట జాంబవంతుఁడు సహానుచ రావలి గోళ్ల తోడుతన్

దంతములన్ నఖమ్ములను దారుణ రీతిని నశ్మకోటితో

వంత లొసంగె మిక్కుటము వైరుల కెల్లను గాంచి రక్కసుల్ 

జెంతఁ జెలంగి ఋక్షపతి శీఘ్రమ కొట్టిరి యాయుధమ్ములన్    

  1.  

 

 

 

ఆ.వె.

చంపుచుండ రాక్షస గణ సైన్యమ్మును

జాంబవంతు నాజి శర సునిశిత

పరశు తోమర వర పట్టి సాదులఁ గొట్టి

రసుర వర్యు లడర నాగ్రహమ్ము      

  1.  

 

 

 

ఆ.వె.

తుముల మయ్యె నంత దురము హర్యసురుల

కు సురవరుల కసుర కోటి కైన

పగిది క్రుద్ధు లైన వారికి భీమ మ

హా స్వనమ్ము లడర నద్భుతముగ     

  1.  

 

 

 

కం.

హనుమంతుఁడు గూడ స్వయము

ఘను లక్ష్మణు దించి యంతఁ గనలు సెలంగం 

గొని నగము నుండి సాల

మ్ము నసురుల కదన మొనర్చెఁ బొలియ సహస్రుల్

  1.  

 

 

 

కం.

పిన తండ్రి కొసఁగి యుద్ధ

మ్మును బలుఁ డయ్యింద్రజిత్తు మూరిన యలుకం

జనెఁ బరు వెట్టి తిరిగి య

మ్మనుజేంద్రుని పైకిఁ బర దమను పైకి వెసన్

  1.  

 

 

 

చం.

అలుకను లక్ష్మ ణేంద్రజితు లంకము నందుఁ జెలంగు చుండి ము

ల్కుల జడినిం బరస్పరము ఘోరముగాఁ గురియించి యిర్వురున్ 

బలముగఁ గొట్టుచుండగను బల్లిదు లిద్ద ఱదృశ్యులైరి య

మ్ముల గమి సూర్య చంద్రులను బోలి ఘనార్తుల వానకారునన్   

  1.  

 

 

 

ఉ.

కైకొను టేని నెక్కిడుట కార్ముక మందును నారి లాగుటల్

వీఁకను బాణ ముక్తి గుఱి వీక్షణముల్ నిజ ముష్టి యత్నముల్   

ప్రాకట రీతిఁ గన్పడవు వారల పాణుల లాఘవమ్ముచే

నా కలహమ్మునం దరయ నన్నర రాక్షస వీర కృత్యముల్

  1.  

 

 

 

ఆ.వె.

చాప వేగ మడర సడలి నట్టి శరజా

లమ్ము కప్ప నక్కజమ్ముగ నట

నంతరిక్ష మందు సుంతయు రూపమ్ము

లు కనరాక యున్నవి కనుల కని     

  1.  

 

 

 

కం.

ఒకపరి రావణి లక్ష్మణుఁ

డొకపరి లక్ష్మణు నసురుఁడు నుగ్రమ్ముగఁ జే

రి కదన మొనర్చు చుండఁగ

నకటా సందేహ మొదవె నత్యధికముగన్    

  1.  

 

 

 

కం.

వా రిరువురిచే నాజి న

పారముగ విముక్త మైన వాడి ములికులన్

నీరంధ్ర మయ్యె గగనము

తోరముగాఁ జీఁక టలమెఁ దూర్ణం బెల్లన్

  1.  

 

 

 

కం.

పడు వారిద్దఱి వీరుల

కడు వాడివి శత శరములు కవియఁగ దిశలన్

బెడిదమ్ముగ శర సంకుల

మడరుచు నయ్యె నలు దిక్కు లాశ్చర్యముగన్

  1.  

 

 

 

కం.

అంతయుఁ జీఁకటి నిండఁగ 

నెంతొ భయమ్ము జనియించె నెల్లెడ లందున్

శాంతింపఁగ పడమటి గిరి 

చెంతను రవి రక్త నదులు సెలఁగుచుఁ బాఱెన్      

  1.  

 

 

 

తే.గీ.

సంగ రాంగణమునఁ దమి సంచరించి

క్రూర మృగములు సెలరేఁగి దారుణముగ

నాదములు సేయ భీమ స్వనములు సెలఁగు

చుండ వీవఁడు వాయువు మండఁ డగ్ని

  1.  

 

 

 

ఆ.వె.

స్వస్తి కలుగుఁ గాక సర్వ లోకముల కం

చుఁ బలికిరి పరమ ఋషు లటఁ జార

ణులను గూడి దుఃఖితు లయిరి గంధర్వు

లాజిఁ జూచు చుండి యధికముగను     

  1.  

 

 

 

ఉ.

అంతట రాక్షసర్షభు హయమ్ములఁ గాంచన భూషితమ్ములన్

సాంతము కాల వర్ణముల నాజిని నాలుగు కోల లేసి తా

నెంతొ కలంచె నాల్గిటిని నిన్నర వర్యుఁడు లక్ష్మణుండు దు

ర్దాంత బలోన్నతుం డడరి దండ ధరాభుఁడు విక్రమించుచున్    

  1.  

 

 

 

ఉ.

ఇంకొక పీత భల్లమున నెంతయొ తీక్ష్ణ శరమ్మునన్ సు ప

త్రాంకము లాగి కర్ణముల నంటఁగ వాసవ వజ్ర తుల్యమున్

బింకము నూని సూతు తల వేగమ త్రుంచెఁ జరించు చున్న నా

యంకము నందు శ్రీ కలితుఁ డత్తల గర్జ ప్రతిధ్వనింపఁగన్

  1.  

 

 

 

ఆ.వె.

సారథి రణమందు సమయ మందోదరి

సుతుఁడు స్వయ మరదము సుగతిఁ దోలు

చుండి ధైర్య మూని వెండి స్పృశించెను

భీమ ధనువు వేగ వీర వరుఁడు   

  1.  

 

 

 

తే.గీ.

చూచు వారి కద్భుత మయ్యెఁ జూడ నేర్పు  

హరుల మగ్నుఁ డైన నసురుఁ డతనిఁ గొట్టె

నిశిత శరముల ధను వందు నిలువ గుఱ్ఱ

ముల పయిన దాశరథి బాణములను బఱపె

  1.  

 

 

 

తే.గీ.

చిక్క నవకాశము లడుచు శిత శరముల

పంక్తిఁ బఱపి యింద్రజితుని వడి వడి నొన

రించు సౌమిత్రి యాజిఁ జరించు వాని

వీత భీతిని రాక్షస వీరుఁ గాంచి    

  1.  

 

 

 

కం.

కని హతుని సారథిని రణ

ము నందు రావణ సుతుండు పోరునఁ దమక

మ్మును వీడె విషణ్ణాత్ముం

డు నయ్యె రాక్షస వరేణ్యుఁడు కలఁత సెలఁగన్

  1.  

 

 

 

కం.

కని దుఃఖావృత తప్తా

నను నసుర వరేణ్యు మురిసి నగచర యోధుల్

ఘను లక్ష్మణు శ్లాఘించిరి

మనుజ వరేణ్యు నతిరథు సమర దుర్భేద్యున్

  1.  

 

 

 

తే.గీ.

త్వరపడి రయమ్ము వెంచిరి వాన రోత్త

ములు ప్రమాథి రభస శరభులు ఘనుండు

గంధమాదనుండు సహింపక నలువురు దు

మికిరి నలు గుఱ్ఱముల పైకి మేటి బలులు

  1.  

 

 

 

ఆ.వె.

పైనఁ బడిన యంతఁ బర్వత సన్నిభు

లా ప్లవంగ వీరు లట్లు గుఱ్ఱ

ముల ముఖముల రక్తము స్రవించె నరుణమ్ము 

నలఁగి నేల మీద నాల్గుఁ గూలె    

  1.  

 

 

 

కం.

తురగమ్ములను వధించి య

సుర వర్యుని గొప్ప రథముఁ జూర్ణమ్ముగఁ జే

సి రయమున నెగిరి తిరిగి నృ

వరు లక్ష్మణు చెంతఁ బ్రీతి వ్రాలిరి నలువుర్

  1.  

 

 

 

కం.

హత సారథి రావణి యా

హతాశ్వ రథ మవతరించి యమ్ముల వానన్

వితతమ్ముగఁ గురిపించుచు

నతి రయమున నుఱికె రాఘ వానుజు పైకిన్   

  1.  

 

 

 

తే.గీ.

అంత లక్ష్మణుఁడు సురగ ణాధినేతృ 

నిభుఁడు వారించె శిత బాణ నిచయమున శ

రముల గుప్పు పదాతిని రావణి హత

తురగు సంగరమ్మున బల్లిదుండు సెలఁగి

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందుఁ దొంబదవ  సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 91.

 

 

 

ఇంద్రజిత్తు లంక కేఁగి యన్య రథమ్మును గ్రహించి తిరిగి యుద్ధ భూమి కేతెంచి ఘోరముగా యుద్ధ మొనరించి లక్ష్మణుని యైంద్రాస్త్రమ్మున నిహతుఁ డగుట.

 

 

 

 

కం.

హత హయుఁడు మహా తేజుఁడు

వితతమ్ముగఁ గ్రుద్దుఁ డసుర వీర వరేణ్యుం

డు తనదు తేజమ్మున సమ

ర తలమ్మున నింద్రజిత్తు ప్రద్యోతించెన్    

  1.  

 

 

 

తే.గీ.

ఒకరి నొక్కరు  వధియింప నుగ్ర శరము

లను వలచు వారలు నిరంతరమ్ము జయము

మసల వనమునఁ జనుదెంచు మత్త కుంజ

రోత్తముల భంగి నుపమింప నుభయు లుంద్రు   

  1.  

 

 

 

ఆ.వె.

ఇచ్చ టచట నుండి యేఁగుదెంచు పరస్ప

రమ్ము చంప నెంచు రాక్షస హరి

వీరు లంక మందు నేరరు విడువంగ

వారి విభుల గౌరవమ్ము మీఱ

  1.  

 

 

 

చం.

ముదము నొసంగ రక్కసుల మూఁకకు మెచ్చుచు సంతసమ్మునం 

గుదురుగఁ బల్కె నివ్విధము ఘోర తమం బిట నెల్ల దిక్కులన్

వదలక కమ్మె సుంత దమ వారిని నన్యుల నేర నట్లు మీ

రుదరి ప్లవంగ వీరులకు యుద్ధము నందు నొసంగ మోహమున్

  1.  

 

 

 

చం.

బెదరక పోరుఁ డే నరిగి పెద్ద రథమ్మునఁ దిర్గి వచ్చెదం 

దదవసరమ్మునం గపుల దండు సెలంగుచుఁ గాంచి నన్నిటం     

గదన మొనర్ప కుండఁ దగు కార్యము లెంచుచు సేయ నర్హులే

కదలెను మోస పుచ్చి కపి కాయము నిట్లని స్యందనార్థమై

  1.  

 

 

 

ఉ.

చేరి పురమ్ము లంక కతి శీఘ్రము సేసి యలంకరింపఁగాఁ

దేరును బ్రాస ఖడ్గములు దివ్య శరావలి నింపి యింపుగా

వారువముల్ చెలంగి పఱవంగ నొనర్చి హయజ్ఞు నైపుణున్

సారథి సంగ్రహించి వెసఁ జక్కఁగ నిల్చి విజేత తేరునన్     

  1.  

 

 

 

తే.గీ.

వెడలె మందోదరీ తనయుఁడు పురమ్ము

నుండి రాక్షస పుంగవు లుండఁ దోడు

తూర్ణము సమర కాంక్షుఁడు దోర్బలుం డ

సుర వరేణ్యుఁ డకట కాలచోదితుండు     

  1.  

 

 

 

ఉ.

వేగులు వేగ లాగ సవిభీషణు లక్ష్మణు మార్కొనన్ వెసన్

బాగుగ నింద్రజిత్తు విడి పట్టణ రాజము శత్రునాశకున్

మూగఁగ గాంచి లక్ష్మణుఁడు మోరమెకమ్ములు నవ్విభీషణుం

డా గతి రాఁగఁ దేలికకు నచ్చెరు వందిరి మిక్కుటమ్ముగన్

  1.  

 

 

 

ఉ.

కోపము నూని రావణి సుఘోర శరమ్ముల వానరేంద్రులన్

వే పగ నూని కూల్చె నని వీరుఁడు వందల వేల సంఖ్యలం

జాపము మండలీకృతము సక్క నొనర్చి సలాఘవమ్ము దాఁ

దూపులఁ జంపె వానరుల దుర్జయుఁ డాజిని విక్రమించుచున్   

  1.  

 

 

 

ఉ.

అమ్ముల వధ్య మానులు మహార్తులు జేరిరి లక్ష్మణున్ హరుల్

బమ్మను జేరు దేవతల భంగిని నంతట  యుద్ధ కోపమే

పమ్మ నెడంద లక్ష్మణుఁడు భగ్నము సేసెను వాని కార్ముకం

బిమ్ముగఁ బాణి లాఘవము నెల్లను జూపుచు బిట్టు మండుచున్

  1.  

 

 

 

ఉ.

నైరృతుఁ డన్య చాపమున నారినిఁ గూర్చుచు నుండ వేగ మే

పారగ మూడు బాణముల నద్ధనువున్ వెసఁ ద్రుంచె లక్ష్మణుం

డా రఘు నందనుం డలిగి యంతట ఖండిత చాపు ఱొమ్మునన్

మూరి శరమ్ము లైదిటిని భోగి నిభమ్ములు వేసి నొంచినన్            

  1.  

 

 

 

చం.

ఉరుతర కార్ముకచ్యుతము లుర్వినిఁ గూలెను వాని కాయముం

ద్వరితము సీల్చి రక్త యుత బాణము లెఱ్ఱని పాములో యనన్

విరివిగఁ గ్రక్కి రక్తమును భిన్న తనుత్రుఁడు నోటి నుండి వి

ల్లురుతర మౌర్వినిం గొనె బలోన్నత మింద్రజితుండు నుగ్రుఁడై

  1.  

 

 

 

చం.

కని ఘన వీరు లక్ష్మణునిఁ గ్రన్ననఁ గుర్సెను గాండ వర్షముం  

గనఁబడ లాఘవమ్ము సుర కాంతుఁడు వర్షముఁ గుర్యు భంగినిన్

ఘన తర బాణ వర్షమును గౌణప ముక్తము నా దురాసద

మ్మును దడఁ బా టొకింతయును బొందక లక్ష్మణుఁ డాపె నింపుగన్

  1.  

 

 

 

కం.

చూపె మహా తేజుఁ డటుల

భూప కుమారుండు ఘనుఁడు ముక్తావేగుం 

డేపారిన విక్రమమును

నా పల లాశనునకుఁ బరమాద్భుతము ననిన్    

  1.  

 

 

 

ఉ.

అంతట మూడు మూడు సెల లాజిని నొక్కొకరిన్ రయమ్ముగా 

నంతము సేసి వేసి త్వరి తాస్త్ర విభూతినిఁ జూపి యంత దే

వాంతకు నింద్రజిత్తుని శరౌఘము లేసి భృశమ్ముగా ననిం

జింతితుఁ జేసె లక్ష్మణుఁడు శీఘ్రమ మార్గణ తాడనమ్ములన్   

  1.  

 

 

 

కం.

బలవంతుఁడు శత్రువు శ

త్రులఁ జంపెడు వాఁడు గొట్ట దురమున భృశ మ

ట్టులఁ దన్ను నింద్రజిత్తు క

నలి పఱపెను విశిఖ ధార నరవరు పైనన్    

  1.  

 

 

 

ఉ.

చేరక మున్న లక్ష్మణుఁడు శీఘ్రమ వానినిఁ ద్రుంచెఁ దీక్ష్ణముల్

ఘోర శరమ్ము లేసి రిపు కోటి నిహంత రఘూత్తముండు నా

పోరున నంత నా రథిక పుంగవు గౌరవ పాత్రుఁ డైన యా

సారథి మూర్ధముం దునిమెఁ జక్కఁగ నానత పర్వ పత్రినిన్    

  1.  

 

 

 

తే.గీ.

లేక యున్నను సూతుఁడు వీఁక లాగె

మండల గతిం దిరుగుచుండి బెండు వడక

వారువములు తడఁబడక ఘోర సమర

మందు వీక్షింప నద్భుత మయ్యెఁ గరము     

  1.  

 

 

 

ఆ.వె.

దృఢ పరాక్రముండు ధీరుండు క్రుద్ధుఁడై

లక్ష్మణుండు భృశము త్రాస మొసఁగఁ 

గొట్టెను శరములను గుప్పించి రావణి

గుఱ్ఱములను యుద్ధ కోవిదుండు        

  1.  

 

 

 

కం.

అప్పనిని సైపఁ జాలక

యప్పరమక్రుద్ధ రాఘ వానుజు పైనన్

గుప్పించె బాణములు పది

యప్పు డలుక మీఱ రావణాత్మజుఁ డాజిన్   

  1.  

 

 

 

ఆ.వె.

వాని వజ్ర సన్నిభ శరము లహి విష

తుల్యములు పసిండి తొడుగుఁ దగిలి

విలయము లయి కూలె నిలను లక్ష్మణు వీడి

వింత వొడమ సంగ రాంతరమున

  1.  

 

 

 

ఉ.

తోఁపఁగ వాని బొందలము తోర మభేద్యమ యంచు నింద్రజి

త్తాపక వైచి బాణముల నంతట నుత్తమ పుంఖ యుక్తముల్ 

సూపుచు నస్త్ర వేగమును శూరుఁడు ఫాలము నందుఁ దాఁకఁగాఁ

గోపము మీఱఁ గొట్టె నట ఘోరముగా రిపు వీరు మూడిటన్

  1.  

 

 

 

కం.

వెలిఁగె రఘునందనుం డా

లలి తాంబకములను గూడి లక్ష్మణుఁ డని లో

న లలాటస్థమ్ములతోఁ

గలహశ్లాఘియె త్రిశృంగ కలి తాద్రి వలెన్   

  1.  

 

 

 

చం.

అసురుని చేత నర్దితుఁడునై కడు నవ్విధి సంగరమ్ములో

వెస నసురేంద్రునిం దిరిగి బెట్టుగఁ గొట్టె శరమ్ము లైదిటం 

బసిఁడి మయమ్ము  లంచిత విభాసిత కుండలముల్ భృశమ్ముగా

నెసఁగెడు నాననమ్మున నహీన పరాక్రముఁ డంత నుగ్రుఁడై   

  1.  

 

 

 

తే.గీ.

లక్ష్మ ణేంద్రజిత్తు లడరి రణము నందు

గొప్ప వీర్యము విల్లులు కూడి నట్టి

వారు భీమ పరాక్రమ వీర వరు లొ

కరి నొకరు మార్గణములఁ గొట్టిరి శితముల

  1.  

 

 

 

తే.గీ.

రక్త సిక్తులు లక్ష్మ ణేంద్రజితు లుభయు

లట్లు భీకర భండన మందుఁ బోరు

చుండ వీక్షింప వెల్గుచు నుండి రపుడు

పుష్పి తేద్ధ కింశుక భూజముల నిభమ్ము      

  1.  

 

 

 

కం.

మన ముంచి జయం బందున

ఘన ధన్వు లిరువురు సర్వ గాత్రము లందుం

గినుకం గొట్టిరి ఘోరము

గ నొక్కరి నొకరు పటుతర కాండావలినిన్

  1.  

 

 

 

ఉ.

కొట్టె రణాగ్రహమ్మునను ఘోర బలుండు విభీషణుం  బగన్

గట్టిగ మూడు తూపుల ముఖమ్మున రావణి బల్లిదుం డనిం  

గొట్టి పితృవ్యు వానరులఁ గొట్టె నయో ముఖ భాసితమ్ములన్

బెట్టుగ వేసి యొక్కొకటి వీరుల నెల్లర వీడ కేరినిన్   

  1.  

 

 

 

తే.గీ.

రావణి దురాత్ముని రథ తురంగములను

జంపెను గదచే నా విభీషణుఁడు గొప్ప

తేజమున నడరెడు వీరుఁ డాజిఁ గినిసి

కరము కూల గుఱ్ఱమ్ములు గాంచి యంత   

  1.  

 

 

 

ఆ.వె.

వీరుఁ డింద్రజిత్తు పృథ్వి సారథి గూల

దిగి రథమ్ము నుండి దివ్య శక్తి

వైచెఁ బిన్న తండ్రి పైన మహా తేజుఁ

డలిగి భృశము ఘోర మైన దాని

  1.  

 

 

 

తే.గీ.

బల్లిదుఁడు సుమిత్రానంద వర్ధనుండు

వచ్చు చున్నట్టి శక్తినిఁ బన్నుగఁ గని

పదను మీఱిన తూపులు వఱపి విఱిచెఁ

గూల పది ముక్కలై యవి నేల పైన    

  1.  

 

 

 

చం.

సుదృఢ తనుండు క్రుద్ధుఁ డయి శూర వరుండు విభీషణుండు వై

చెఁ దగుల వక్ష మందు నతి శీఘ్రమ బాణము లైదు శక్ర జి

త్తదరఁగ నంక మందు నవి యంగముఁ జీల్చుచు  రుక్మ పుంఖముల్

వదలక నెత్తుటం దడిసి పాముల మాడ్కిఁ జెలంగె నెఱ్ఱగన్   

  1.  

 

 

 

కం.

కినిసి పినతండ్రి పయిఁ గై

కొనె నా రక్కసుల నడుమ ఘోర తర శర

మ్మును రావణి యమ దత్త

మ్మును నంత మహా బలమ్ము ముక్త దయుండై

  1.  

 

 

 

మ.

కని యా బాణము నింద్రజిత్తు కొన సంగ్రామమ్మునన్ లక్ష్మణుం

డును నన్యమ్ము గ్రహించె విక్రముఁడు విడ్డూరమ్ముగా స్వప్నమం

దు నిడన్ వైశ్రవణుండు రక్కసులకున్ దుర్భేద్య మింద్రాదు లై

నను సాధింపగఁ జాల నట్టి శరమున్ నైపుణ్య మేపారఁగా   

  1.  

 

 

 

తే.గీ.

లాగ నిద్దఱును బరిఘల వలె నున్న

బాహువుల ధనుస్సుల నట్లు బలము మీఱ

వెల్వడెఁ బెను రవమ్ములు భీకరముగఁ 

గ్రౌంచ పక్షుల కూఁతల మించి యాజి     

  1.  

 

 

 

తే.గీ.

వీరు లిద్దఱు సంధింప విండ్లను శర

ములను శ్రేష్ఠములను భృశముగ వెలింగె

విడువఁ బడి నింగి నింపుచు వెల్గు లెల్లఁ

గొట్టికొనె ముఖము ముఖము బిట్టు శిఖులు

  1.  

 

 

 

తే.గీ.

బెట్టిదమ్ముగ నమ్ములు కొట్టుకొనఁగ

రెండు ఘోర రూపమ్ములు రేఁగె నిప్పు

రవలు పొగతోడ రాపిడిఁ బ్రభవ మైన

యగ్ని దారుణం బయ్యె నత్యంత మపుడు   

  1.  

 

 

 

కం.

కూలిన వొక్కటి నొక్కటి

యాలమ్మునఁ దాఁకి రెండు నవనిన్ శత ఖం

డాలిగ మహాగ్రహ నిభము

లా లక్ష్మణ రావణుల మహా మార్గణముల్

  1.  

 

 

 

చం.

శరములు గాఁగ వ్యర్థములు సంజనితత్రపు లల్క మీఱఁగా

నరయుచు లక్ష్మ ణేంద్రజితు లంకము నందుఁ జెలంగి రిద్దఱున్ 

వరుణ వరాహ్వయాస్త్రమును బన్నుగ లక్ష్మణుఁ డేయఁ గ్రుద్ధుఁడై

యరి దమనుండు రావణి మహాస్త్రము రౌద్రము నేసె నుద్ధతిన్   

  1.  

 

 

 

సీ.

రౌద్రాస్త్ర మాజిఁ గూల్పఁగ వారు ణాస్త్రముఁ గ్రుద్ధుఁడు రావణి గొప్ప తేజుఁ

డాజి జయుఁడు వేసె నంత నాగ్నే యాస్త్రమును గాల్చు గతి జగములను నెల్ల

సౌరాస్త్రమునను లక్ష్మణుఁడు వారించె వారింప దానినిఁ గాంచి రేఁగి కినుక

నాసు రాస్త్రము రావణాత్మజుఁ డరి దారుణమ్మును  సంధించెఁ బమ్మి దాని 

 

తే.గీ.

నుండి వెలువడె వెల్గెడు నుగ్ర శూల

ఖడ్గ కూట కుఠార ముద్గర భుశుండ

ఘన గ దాయుధమ్ములు పెక్కు కని జనింప

దాని లక్ష్మణుం డప్పుడు  తద్ద సెలఁగి    

  1.  

 

 

 

తే.గీ.

సర్వ భూత సంతతికిని సైప రాని

సర్వ శస్త్రములను జీల్పఁ జాలు నట్టి

యస్త్ర రాజమ్ము వారించె నని మహేశ్వ

రాస్త్రమున లక్ష్మణుండు  మహా ప్రభాంగి   

  1.  

 

 

 

ఆ.వె.

అంత నయ్యె రోమహర్షణం బా సమ

రమ్ము నిలిచి యాకసమ్ము నందు

భూతము లవి చుట్టు ముట్టిన వింపుగ

లక్ష్మణుని మహాత్ము రఘు వరేణ్యు    

  1.  

 

 

 

కం.

హరి రాక్షస భైరవ ఘో

ర రవమ్ములతో నడరెడు రణముం గాంచన్

వరుసగ భూతము లా యం

బర మందు నిలువ వెలిఁగె నభమ్ము భృశముగన్   

  1.  

 

 

 

ఆ.వె.

ఇంద్రు ముందు నుంచి ఋషులు గంధర్వులు

గరుడి యురగములు పితరులు సురలు

సక్క నిల్చి నింగి సౌమిత్రిఁ గాచిరి

లక్ష్మ ణేంద్రజితుల రణము నందు   

  1.  

 

 

 

చం.

శర మితరమ్ము శ్రేష్ఠమును జ్వాలి సమస్పృశ రాజితమ్మునుం 

గరమున లక్ష్మణుండు  గొనెఁ గ్రన్నన రావణి దారణమ్మునున్

సురుచిర పత్ర పర్వమును సుస్థిత కాంచన భూషితమ్మునున్

కర మనువృత్త కాయమును  కాయ వినాశక పన్నగాభమున్   

  1.  

 

 

 

ఉ.

తోరము దుర్నివార మతి దుస్సహ మాసుర భీతిదమ్మునున్

గౌరవ దేవ తార్చితము కౌణప నిర్జర యుద్ధ మందు నిం

పార జయమ్ము నిచ్చినది యబ్బల వైరికి దానిఁ గూర్చె నా

వీర వరుండు లక్ష్మణుఁడు వింటిని నమ్మున నైంద్ర మస్త్రమున్       

  1.  

 

 

 

తే.గీ.

ఆజి నపరాజితము శర మంత లాగి

లక్ష్మి గలవాఁడు వీరుఁడు లక్ష్మణుండు

సార్థ వాక్యమ్ము లనియె ధర్మాత్ముఁ డిట్లు

భక్తి యుక్తమ్ముగఁ దలంచి భ్రాత నెడఁద   

  1.  

 

 

 

తే.గీ.

దాశరథి సత్య సంధుఁడు ధర్మ చిత్తుఁ

డప్రతిద్వంద్వుఁ డైనచో నతుల పౌరు

షమున రాముఁ డో దారుణ  శరమ! మించి 

చంపు మింక రావణిని  నిశ్చయముగ నని   

  1.  

 

 

 

ఆ.వె.

లక్ష్మణుండు నారి లాగి యాకర్ణాంత

మంత విడిచె బాణ మప్రతిహత

మింద్రజిత్తు పైన నెలమి నైంద్రాస్త్రముఁ  

జేర్చి యద్భుతం బజిహ్మగమ్ము

  1.  

 

 

 

తే.గీ.

వేసి యైంద్రాస్త్రముం బరవీర హంత

లక్ష్మణుఁడు పడ వేసెను రణము నందు

నింద్రజిత్తు తలఁ గిరీట మింకఁ గుండ

లములఁ గూడి నేల పయి దేహమున నుండి       

  1.  

 

 

 

చం.

మహిఁ బడి రాక్షసాధిప కుమారు శిరం బది స్కంధ హీన దు

స్సహ భయదమ్ము గానఁబడె స్వర్ణ నిభమ్ముగ రక్త సిక్తమై

నిహతుఁడు నింద్రజిత్తు వడె నేల స్వకీయ శిరమ్ము కూలఁగా

సహిత కిరీటమై కవచ సంయుతుఁ డంత వికీర్ణ చాపుఁడై   

  1.  

 

 

 

తే.గీ.

అఱచి రెల్ల వానర వరు లవ్విభీష

ణ సహితులు మీఱ నెదల సంతసము హతుఁడు

గాఁగ నింద్రజిత్తు లయుఁడు గాఁగ వృత్రుఁ

డమర వర్యు లానందించి నట్టు లపుడు    

  1.  

 

 

 

ఆ.వె.

అంతరిక్ష మంత నప్సరో గంధర్వ

ముని నికాయ సర్వ భూతముల జ

య నినదముల నిండె నత్యంతముగ నింద్ర

జిత్తు కాలు నిల్లు సేరి యుండ

  1.  

 

 

 

కం.

జితకాశులౌ హరులచే

వితతమ్ముగఁ గొట్టఁబడుచు వివిధ దిశలకున్

వెతఁ బాఱె నసుర సేన త్వ

రిత మెఱిఁగి పతితుఁ డతఁ డని రేఁగిన భీతిన్   

  1.  

 

 

 

ఉ.

వానర వధ్యమాను లయి పాఱిరి లంకకు వీడి శస్త్రముల్

మానని భీతి మోహితులు మానిసి దిండులు కొంద ఱింకనుం

బూనక ఖడ్గ పట్టిస సమూహ పరస్వధముల్ కరమ్ములం

గానక రక్ష వందలుగఁ గ్రన్నన దిక్కుల కెల్లఁ కేఁగఁగా

  1.  

 

 

 

ఉ.

కొందఱు వానరార్దితులు కూలిరి సంద్రము నందు లంకకుం

గొందఱు వాఱఁ గొండలను గొందఱు భీతిని నాశ్రయింపగాఁ

గొందఱు నేరి యింద్రజితు కూలుట నంకము నందుఁ బాఱఁగాఁ

నం దరయంగ రాఁ డట సహస్ర నిశాచరు లందు నొక్కఁడున్

  1.  

 

 

 

ఆ.వె.

సూర్యుఁ డస్తమింప సూర్య కిరణములు

కాన రాని భంగిఁ గయ్య మందు

నింద్రజిత్తు గూల నెవ్వ రసురు లందుఁ

గాన రారు పాఱఁగా దిశలకు        

  1.  

 

 

 

ఆ.వె.

వాడిన కిరణముల తోడి యాదిత్యుని

యట్టు లాఱి నట్టి యగ్ని వోలె

నయ్యె నంత నా మహా బాహు వింద్రజి 

విగత జీవితుఁ డయి పృథ్విఁ గూల 

  1.  

 

 

 

కం.

శాంతింపఁ బీడ సాంతం

బంతకుఁ జేరఁగ రిపుండు నంకమ్మున దే

వాంతకుఁ డసురాధిప సుతుఁ

డంత జగం బెల్లఁ గాంచి యానందించెన్

  1.  

 

 

 

ఆ.వె.

పాప కర్ముఁ డసుర వర్యుఁడు మరణింప

సర్షి సంఘ మంత శక్రుఁడు భగ

వంతుఁ డత్యధికము సంతసించెను నింగి

దుందుభిస్వనములు విందు సేసె

  1.  

 

 

 

తే.గీ.

ఆడి రచ్చర లింపుగ నలరి పాడి

రెల్ల గంధర్వులు మహాత్ము లింకఁ పుష్ప

వృష్టి కురిసెను బొగడిరి యెల్ల సురలు

హతుఁడు గాఁ గ్రూరుఁ డద్భుతం బయ్యెఁ గాంచ

  1.  

 

 

 

ఆ.వె.

సర్వ లోక భయదుఁ డుర్విఁ గూల నపుడు

పావనమ్ము లయ్యె వారి నభము

రెండు సంతసించిరి సుర దానవు లరు

దెంచి రచట కడరి కాంచ నెంచి      

  1.  

 

 

 

తే.గీ.

దేవ గంధర్వ దానవు లా వలను ని

లిచి ముదమ్మున నిట్లు పలికిరి భూసు

రులు విగత శోకు లయి నెడఁదల భయమ్ము

లేక చరియింత్రు గాక మురియుచు నింక

  1.  

 

 

 

చం.

ప్లవగులు ప్రస్తుతించి రట లక్ష్మణు నైరృత రాజపుత్రుఁ  డా

హవమున నంతరింపఁ గని యప్రతిమప్రతి వీరు నట్లు ధీ

ర వరులు మారుతాత్మజుఁడు రాక్షస వంశ విభీషణుండు ఋ

క్ష వరుఁడు జాంబవంతుఁడును జక్క స్తుతించిరి గెల్వ హృష్టులై    

  1.  

 

 

 

కం.

బొబ్బ లిడుచు గర్జించుచు

నబ్బురముగ గెంతు చుండి హరు లత్యంతం

బుబ్బి వరింపగ లక్ష్యము

నిబ్బరముగ లక్ష్మణు దరి నిల్చిరి ప్రీతిన్

  1.  

 

 

 

ఆ.వె.

వాలములను నేల బాఁదుచు జబ్బలు

సఱచుచు హరి వరులు సంతసమ్ము

న వినిపించిరి వచనమ్ము లిట్లు జయించు

చుండు సతము లక్ష్మణుండు గనుఁడు   

  1.  

 

 

 

కం.

ఒకరి నొక రుంచి కౌఁగిలిఁ 

బ్రకటించిరి వివిధము లట లక్ష్మణు గుణముల్

సకలమ్ముల  సంతోషిం

చి కరము కపి వర్యు లంతఁ జేరి రఘువరున్       

  1.  

 

 

 

కం.

మనములఁ బొంగెను హర్షం

బనితర సాధ్యంపుఁ బనిని నరయం బ్రియ మి

త్రుని లక్ష్మణు పని సురలకు

విన నింద్ర రిపు మరణమ్ము విగ్రహ మందున్

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందుఁ దొంబది యొకటవ  సర్గము.

 

 

యుద్ధ కాండము

సర్గము 92.

 

 

 

లక్ష్మణ విభీష ణాదులు రాముని చెంత కేఁగి యింద్రజిత్తు లక్ష్మణునిచే హతుఁ డయ్యె నని వివరింప రాముఁడు హర్షించి లక్ష్మణునిఁ గౌఁగిలించికొని పొగడ సుషేణుఁడు లక్ష్మణుఁడు మున్నగు వారికి చికిత్స సేయ నెల్లరు నారోగ్యవంతు లగుట.

 

 

 

 

కం.

తత్తనువు నందు నోడిన   

నెత్తు రనిని నింద్రజిత్తు నిహతునిఁ జేయం 

దత్తఱ మందక లక్ష్మణుఁ

డత్తఱి శుభ లక్షణుండు హర్షితుఁ డయ్యెన్   

  1.  

 

 

 

ఉ.

ఆ వర జాంబవంత పవనాత్మజ వానర సంచయమ్ము రా

మావర జేద్ధ తేజుఁడు కృతాంజలిఁ గూడి కడింది రక్తి సు

గ్రీవుఁడు రాముఁ డున్న దరికిం జనుదెంచె విభీషణున్ ఘనుం

బావని నాని లక్ష్మణుఁడు వైరి విమర్దనుఁ డంత శీఘ్రమే      

  1.  

 

 

 

ఆ.వె.

లక్ష్మణుండు సేరి రాముని నిలిచె న

మస్కరించి యంత మనుజ వర్యు

చెంత భక్తి నింద్రు చెంత నుపేంద్రుఁడు

నిలుచు నట్టి భంగి నెమ్మి నూని

  1.  

 

 

 

కం.

దరి సేరి వీరవర్యుఁ డ

సుర వర్యుని నింద్రజిత్తు సూదనమును సం

గర మందు నుడివె గొణఁగుచు

గురువున కా లక్ష్మణుండు  ఘోరపు వధమున్   

  1.  

 

 

 

ఆ.వె.

లక్ష్మణుండు ద్రుంచె రావణి శిరము మ

హాత్ముఁ డంచు నంత నవ్విభీష

ణుండు రాఘవునకు దండ కరిగి నివే

దించె సంతసమ్ము మించ నెడఁద     

  1.  

 

 

 

చం.

అన విన నింద్ర జిద్వధము నవ్విధి లక్ష్మణు చేత నౌట రా

మున కెద సంతసం బడరె మోదమునన్ రఘు రాముఁ డిట్లనెన్

ఘనుని మహాత్ము లక్ష్మణునిఁ గాంచుచుఁ దుష్టుఁడ నైతి సాధు వం

చు నని గృతం బసాధ్య మని సూనుఁడు సావ జయమ్ము లబ్ధమే            

  1.  

 

 

 

తే.గీ.

శిరము మూర్కొని లక్ష్మణు సిగ్గు వడుచు

నుండ బలిమి నంకమ్మున నునిచి ప్రీతి

వీర్యునిఁ బరిష్వజించి సుపీడితముగ

మరల మరలఁ జూచుచు నుండె మమత మీఱ    

  1.  

 

 

 

తే.గీ.

నిశ్వసించు వాని ననుజుని వ్రణ పీడి

తు రిపు బాధితు దుఃఖతప్తుని శిరమ్ము

మూర్కొని పలుమఱులు పల్కె మునుకు లూఱ

డించుచు పురుషోత్తముఁ డిట్టు లంచితముగ    

  1.  

 

 

 

ఉ.

తోరపు మంచి కర్మమును దుష్కర కర్ముఁడ చేసి తింపుగా

మారణ మంద నాజినిఁ గుమారుఁడు రావణు నంక మందు దు

ర్వారునిఁ గూలి నట్టులను  రాక్షసు నెంతును నిశ్చయమ్ముగన్

శూరునిఁ జంప నీ వరినిఁ జొప్పడె నాకు జయమ్ము లక్ష్మణా!

  1.  

 

 

 

తే.గీ.

రావణు నృశంసు కుడి చేయి రావణి సమ

రమున ఖండించితి వతఁ డాశ్రయము గాదె

జనకునకు నాజి నివ్విభీషణుఁడు మారు

తాత్మజుఁడు గొప్ప పని సేసి రంక మందు

  1.  

 

 

 

ఉ.

మూడు పవళ్ల నెట్టులనొ మూరి వధించితి మూడు రాత్రు లం

దోడక వీరు నింద్రజితు నుగ్రుని హీన రిపుండ నైతి నే

నేఁడు దశాననుండు విని నేలను గూల నిజాత్మజుండు దాఁ

గూడి మహోగ్ర సైన్యమును గ్రుద్ధుఁడు వచ్చును యుద్ధ భూమికిన్    

  1.  

 

 

 

కం.

వానిని రక్కసు వచ్చెడు

వానిని నందన లయార్తు వానర వర ఘో

రానీకమ్మునఁ గప్పుచు

నే నా దుర్జయు వధింతు నిశ్శంక ననిన్     

  1.  

 

 

 

ఆ.వె.

అనుజ! రక్షకుండ! హతుఁడు గా నింద్ర జి

త్తంక మందు నాకు నరయ సీత

యేని భూమి యేని యెవ్విధి నింక దు

ర్లభము లగును జెపుమ లక్ష్మణుండ! 

  1.  

 

 

 

ఆ.వె.

ఆశ్వసించి రాముఁ డనుజ వరేణ్యుని

నిట్లు కౌఁగిలించి యెలమి పిలిచి

యా సుషేణుఁ బలికె హరి పుంగవుని తోడ

లలిత గిరల నిట్లు రాఘవుండు

  1.  

 

 

 

తే.గీ.

ఈతని సశల్యు సౌమిత్రి నిద్ధ మిత్ర

వత్సలునిఁ  బ్రాజ్ఞుఁ నెవ్విధి స్వస్థతఁ బడ

యఁ గలఁ డవ్విధి నొనరింపు హరి వరేణ్య!

వైరి పీడితు సంప్రీతి వైద్యవర్య!      

  1.  

 

 

 

తే.గీ.

లక్ష్మణ విభీషణుల వానర వర ఋక్ష

వీరుల ద్రుమ యోధుల రణ విద్ధుల వ్రణ

బాధితులఁ జేయు మారోగ్యవంతు లగు వి

ధంబు క్షిప్ర మొనర్చి యత్నము మహాత్మ!    

  1.  

 

 

 

కం.

అన రాముండు సుషేణుఁడు

విని హరి యూధపుఁ డొసంగె వినుత మహాత్ముం

డు నసఁ బర మౌషధమ్మును

మనుజర్షభ లక్ష్మణునకు మన్నన తోడన్

  1.  

 

 

 

కం.

వడి నాఘ్రాణింప నర వ

రుఁడు గంధముఁ దొలఁగె బాధలును శల్యమ్ముల్  

దడయక తగ నెల్ల వ్రణము

లడంగ నారోగ్యవంతుఁ డయ్యె భృశముగన్

  1.  

 

 

 

కం.

రామాజ్ఞను నొనరించెను

క్షేమము గూర్పఁగఁ జికిత్స శీఘ్ర తరముగా

నా మర్కట సుహృదులకును 

బ్రేమ విభీషణున కామ విజ్ఞుం డంతన్

  1.  

 

 

 

కం.

హత శల్యుండు గతశ్రమ

గతజ్వరుండు క్షణ మందుఁ గలుగఁ దనువునన్

వితత ని జారోగ్యమ్ము ము

దితుఁ డయ్యెను లక్ష్మణుండు ధీరుం డంతన్      

  1.  

 

 

 

తే.గీ.

లక్ష్మణు నరోగు నుత్థితు రాఘవుఁడు వి

భీషణుండు సుగ్రీవుఁడు వీర వరుఁడు

ఋక్షపతి జాంబవంతుఁడు నెల్లరు గని

సబలము సుచిర మందిరి సంతసమ్ము     

  1.  

 

 

 

కం.

కొనియాడె లక్ష్మణు పనిని 

నని దుష్కరము గని దశరథాత్మజుఁ డిన నం

దనుఁ డా సుగ్రీవుఁడు విని

వినిపాతుం డింద్రజి యని  పెల్లుగ మురిసెన్

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందుఁ దొంబది రెండవ  సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 93.

 

 

 

ఇంద్రజిత్తు మరణము విని రావణు మంత్రులు ధ్రువీకరించికొని రావణునకుఁ జెప్పినఁ గోపోద్రిక్తుండై రావణుఁడు సీతను వధింప నేఁగుచుండ మంత్రి సుపార్శ్వుఁడు తగదని వారించి యీ కోపమును రామునిపైఁ జూపి వధింపఁ దగుదు వన విరమించి తన సభ కేఁగుట.  

 

 

 

 

కం.

విని యింద్రజిత్తు మరణం

బనిఁ బౌలస్త్యు సచివులు మహాసురులు ధ్రువం

బని యెఱిఁగి సవ్యథ దశా

నను జేరి నుడివిరి దాని నైరృత పతికిన్

  1.  

 

 

 

తే.గీ.

యుద్ధ మందు మహారాజ! యిద్ధ బలుఁడు

నీ సుతుండు లక్ష్మణునిచే నిహతుఁ డయ్యె

సాయ మిడ విభీషణుఁడు భృశమ్ము మేము

సూచు చుండఁగ రావణి శూరవరుఁడు    

  1.  

 

 

 

ఉ.

శూరుఁ డజేయుఁ డంకముల శూరుని లక్ష్మణు నొవ్వఁ జేసి పా

కారి జితుండు మార్కొని మహాత్ముఁడు ఘోర శరాలి నీ సుతుం

డా రణ మందుఁ గాంచఁగ సమంచిత లోకము లేఁగె శౌర్య మే

పారఁగ రాక్షసాధిప! దశానన! రావణ! శత్రు సూదనా!    

  1.  

 

 

 

ఆ.వె.

ఆలకించి యా భయంకర మతి ఘోర

మతుల దారుణమ్ము నాత్మ సుతుని

యింద్రజిత్తు రాక్షసేంద్రు వధము మూర్ఛ

నందె రావణుండు డెంద మడల   

  1.  

 

 

 

మ.

చిర కాలమ్మున కంది సంజ్ఞ నసురశ్రేష్ఠుండు దీనుండునై

సుర విద్వేషి దశాననుండు సెలఁగన్ శోకమ్ము పుత్రార్థమై

కర మార్తిన్ విలపించె హాతనయ! రక్షస్సైన్య ముఖ్యా! మహా

సుర! నీ వింద్రు జయించి లక్ష్మణునకుం జోద్యమ్ము పాలైతివే   

  1.  

 

 

 

చం.

కినిసినఁ గాలు నైనఁ బరికింప జయింతువు మందరాగ్ర భే

దన మొనరింతు వమ్ములను దప్పక లక్ష్మణుఁ జెప్పనేలయా 

యనిని మహాభుజా! యెవని నారయ నేఁగితి కాలధర్మముం 

గని సుత! యట్టి సౌరి పయి గౌరవ మింపుగఁ బెర్గె నా కెదన్    

  1.  

 

 

 

ఉ.

దేవత లందు యోధులకు దివ్య పథం బిది యీయఁ బ్రాణముల్

భూవరు కోసమా భటుఁడు వొందును స్వర్గము నిశ్చయమ్ముగన్

దేవ గణమ్ము లోకపులు తేఱి మునీంద్రులు నిర్భయమ్ముగాఁ

బోవఁగ నింద్రజిత్తు గనుమోడ్త్రు సుఖమ్ముగ నేఁడు పుత్రకా!

  1.  

 

 

 

తే.గీ.

మూడు లోకము లన్నియు నేఁడు స వన

పృథివి యెల్ల నొక్కఁడు నాదు ప్రియ సుతుండు

శక్రజిత్తు గానఁగ రామి చాల శూన్య

మయ్యె నాకు హృదయ మెల్ల వ్రయ్య లయ్యె     

  1.  

 

 

 

ఆ.వె.

అంతిపురము నందు నసుర కన్యల రోద

నమ్ము చెవులఁ దూఱె నెమ్మన మగ

లఁగఁ గరేణు సంఘ రావముల పగిది

పర్వత గుహ లందుఁ బరఁగు చుండ    

  1.  

 

 

 

ఉ.

ఎక్కడ కేఁగి తీ వకట యింతినిఁ దల్లిని నన్ను నింక నీ

రక్కసులం ద్యజించుచుఁ బరంతప! చక్కటి యౌవరాజ్యమున్

గ్రక్కున లంక నెల్లఁ గడుఁ గాఱియ పెట్టుచు నెల్ల వారినిన్

మక్కువ వీడి నిర్దయఁ గుమార!వచింపుమ నన్ను జూడుమా   

  1.  

 

 

 

తే.గీ.

ఏఁగ నే యమాలయమున కింద్రజిత్తు! 

నాదు ప్రేత కార్యమ్ములు నందన వర

నీకు కార్యమ్ము లౌఁ గద నీవు వాని

ని విపరీతములం జేసితి విట నకట

  1.  

 

 

 

తే.గీ.

బ్రతికి యుండ సుగ్రీవుండు లక్ష్మణుండు

రాఘవుండును నాదు శల్యముల మాప

కుండ మమ్మెల్లరను వీడి యుండ వంత

లూని యేఁగి తెక్కడ కసు రోత్తముండ!   

  1.  

 

 

 

చం.

వనరుచు నుండ నిట్టు లనివార్యము రాజున కావహించె నా

త్మను ఘన కోప మంతటఁ గుమార నిమిత్త సముద్భవమ్ము క్రు

ద్ధుని నతి రోషుఁ జేసె రవిఁ దోరపు గ్రీష్మము నందు నంశువుల్

తనరి వెలుంగఁ జేయు గతిఁ దద్దయు రావణు రాక్షసేంద్రునిన్         

  1.  

 

 

 

ఆ.వె.

నుదుటను గనుబొమ్మ లదరుచు ముడివడ

రావణుండు వెలిఁగెఁ బ్రళయ కాల

మందు నక్ర యుక్త మలల నడరు చుండు

 నట్టి వనధి వలె దశాననుండు   

  1.  

 

 

 

ఆ.వె.

ఆవులింప నంత నాగ్రహమ్మున రావ

ణుండు వాని ముఖము నుండి ధూమ

సహిత మగ్ని వుట్టె జ్వలితమ్ము వృత్రుని

వదన మందు నున్న వహ్ని భంగి

  1.  

 

 

 

చం.

సుత వధ తప్తమానసుఁడు శూరుఁడు రావణుఁ డాగ్రహమ్మునన్

మతినిఁ దలంచి పన్నుగ నమర్ష వశుం డసురేంద్రుఁ డాత్మలో

సతిని విదేహ నందనను జంపఁగ నత్తఱి నిశ్చయించె మా

నిత యని యెంచ కింతయును నిర్దయఁ గ్రూరత తాండవింపఁగన్        

  1.  

 

 

 

చం.

ప్రకృతిఁ గడింది యెఱ్ఱనివి రావణు కన్నులు రోష వహ్నిచేఁ 

బ్రకటితమై సుఘోరముగ రక్త మయమ్ములు వెల్గె మిక్కిలిం

బ్రకృతిని రూప మాతనిది భైరవ మత్తఱి మూర్ఛితుండు గా

వికృత రుషాగ్నిఁ గ్రుద్ధ పురభిత్తుగఁ దోఁచె దురాసదుండునై     

  1.  

 

 

 

తే.గీ.

రాలె నశ్రు బిందువులు స రక్త రావ

ణాక్షి యుగ్మమ్ము నుండి రయమ్ముగా వె

లుంగు దీపద్వయమున నభంగముగ సు

దీప్త తైల బిందువుల రీతి వితతమ్ము

  1.  

 

 

 

ఆ.వె.

పటపట మని కొఱుకఁ బండ్లను వాని యా

దంత నిస్వనములు వింతగ వినఁ

బడెను  యంత్ర ఘన రవమ్ముల భంగిఁ దా

నవులు ద్రిప్పుచుండ నైపుణమున

  1.  

 

 

 

కం.

కాలాగ్ని భంగి క్రుద్ధుఁడు

కాలుచు నే యే వలనులఁ గాంచిన నా యా

మూలల రక్కసు లెల్లరు

వాలిన భీతిని మఱుంగుపడిరి వణఁకుచున్   

  1.  

 

 

 

ఆ.వె.

చేరఁ జాల రైరి యారావణుని నంత

కాభ మా కుపితుని నసురు లేరు

సకల దిక్కు లరయు సత్త్వవంతుఁ జరాచ

రములను దిన నెంచు రాక్షసేంద్రు     

  1.  

 

 

 

కం.

పలికెను రక్షో నాథుఁడు

నిలుపఁ దలఁచి రక్కసుల నని నభీతిని ని

ట్టుల రావణుండు వాక్య

మ్ముల నసురుల మధ్యను దశముఖుఁ డుగ్రుండై     

  1.  

 

 

 

ఉ.

వేల కొలంది వర్షములు పేర్మి నొనర్చితి నేఁ దపమ్ములన్

వేలుపు పెద్ద తుష్టుఁ డయి పెద్దగ నిచ్చె ఫలమ్ములం దపః

కాలము లెల్లఁ దీరగను గ్రన్ననఁ బల్మఱు లా కతమ్మునన్

మేలుగ నాకు లే దడలు మేదిని నిర్జర రాక్షసాలిచే     

  1.  

 

 

 

చం.

కవచము బ్రహ్మ దత్త మది కాంతిని సూర్య నిభమ్ము శక్తి వ

జ్రవర నిపాతనమ్ములను రక్కసు లార! సు రాసు రాజిలో

న విఱుఁగ కుండె నా తొడుగునం దమి నెక్కి రథమ్ము వోర న

న్నెవ రెదిరింపఁ జాలుదు రహీను స్వయమ్ముగ నింద్రుఁ డైననున్        

  1.  

 

 

 

ఉ.

ఇచ్చెఁ బ్రసన్నుఁడై ద్రుహిణుఁ డిద్ద ధనుస్సు స మార్గణమ్మునున్

మెచ్చి సురాసు రాంకమున మేటి ధనుస్సును దెండు తూర్యముల్

హెచ్చుగ రేఁగ రాఘవుల నిద్దఱఁ జంపఁగ యుద్ధ మందు నే

నచ్చపుఁ బౌరుషమ్మున బలౌఘమునం జెలరేఁగి క్షిప్రమున్      

  1.  

 

 

 

కం.

తన సుతు వధచేఁ దప్తుం

డునై యమర్ష వశుఁడై కడు దశాననుఁ డా

త్మను జింతించి భృశము సీ

తను జంపఁగ నెంచె నంత దారుణ బుద్ధిన్      

  1.  

 

 

 

ఉ.

క్రూరుఁడు రక్త లోచనుఁడు ఘోరపు దర్శనుఁ డింక దీనుఁడున్

వారిని దీన రావములు బల్కెడు నైరృత కోటి రావణుం

డారసి పల్కె నా తనయుఁ డంకములో మును వంచనార్థమై

యేరినొ చంపి సీత యని యేమఱచెం గపి కోటి దానినిన్

  1.  

 

 

 

ఉ.

నిక్కము నేఁడు సేసెదను నిత్యము సీతను నే వరించినన్  

మిక్కిలి దుష్ట భూపతి రమించును జానకి యీమె నాశమున్

గ్రక్కునఁ జేయు వాఁడ నని రాక్షస నాథుఁడు రావణుం డహో

యుక్కున స్వీయ ఖడ్గ వర ముగ్రుఁడు ముట్టెను భీకరమ్ముగా   

  1.  

 

 

 

తే.గీ.

ఎగిరి సుత శోక పరితప్తుఁ డెంతొ కినిసి

విమల గగనచ్ఛవినిఁ గనిపించు సగుణ

ఖడ్గ మూని నిజ సచివ గణము దార

లనుసరింప జానకి చోటి కాతఁ డరిగె   

  1.  

 

 

 

ఆ.వె.

వెడలు వానిఁ గాంచి యడరంగ సింహనా

దములు క్రుద్ధు నసుర ధవుని నొకరి

నొకరి కౌఁగిలించి యుదరుచు రాక్షసు

లెల్లరు దమ లోన  నిట్టు లనిరి

  1.  

 

 

 

చం.

విలయులఁ జేయు రాఘవుల వేగమ గాంచి రణమ్ము నందు భ్రా

తల నసురాధినాథుఁ డది తథ్యము నేఁడు దశాననుండు మున్

నలువుర లోకపాలురను నైపుణి నల్గి జయించెఁ గాదె శ

త్రుల ననిఁ బెక్కు మందిని సరోషము గూల్చెను గాదె బల్మినిన్

  1.  

 

 

 

కం.

కొని బలమున ముల్లోకము

ల నుండి రత్నముల నెల్ల రక్షఃపతి ప్రీ

తి ననుభవించె సదృశు లీ

తనికిన్ బల విక్రమముల ధరణిం గలరే        

  1.  

 

 

 

ఉ.

వారలు వల్కు చుండగను వారితుఁ డయ్యును మేలు నింపుగాఁ

గోరెడు వారి చేత వెసఁ గోప నిమగ్న దశాస్యుఁ డేఁగెఁ దా 

నారయ నయ్యశోకవన మందు ధరాసుత నంత రోహిణిం

జేరెడు నింగి నా గ్రహము చెన్నున నుర్కుచు సంభ్రమమ్మునన్      

  1.  

 

 

 

తే.గీ.

రాక్షస వనితా రక్షిత రామ పత్ని

క్రుద్ధు నిస్త్రింశ హస్తు మిత్రులు ననేకు

లాపు చున్నను మరలని యా దసాస్యుఁ

గాంచె సీత యనిందిత కలఁతఁ జెందె    

  1.  

 

 

 

చం.

పలికెను సీత దుఃఖ మయ భామ కడున్ విలపించు చిట్టు లీ

ఖలుఁ డరుదెంచు చుండెఁ గట క్రన్ననఁ జంప సనాథ నన్ననా

థ లలిని ఘోర దుర్మతి యధర్మ రతుండు కడింది క్రుద్ధుఁడై

పలుమఱు పత్యనువ్రతను భార్యవు కమ్మని నన్నలంచెనే   

  1.  

 

 

 

తే.గీ.

అట్లు ప్రేరేచి విఫలుఁడై యాశ లణఁగఁ

గ్రోధ మూర్ఛితుండు నయి యీ క్రూరుఁ డిప్పు

డేఁగుదెంచుచు నుండెను వేగముగ వ

ధింప నెంచి నన్నిఁక ననుకంప వీడి    

  1.  

 

 

 

కం.

లేకున్న నరవ్యాఘ్రుల

నా కలనునఁ జంపి యుండు నన్నను ననుజున్ 

వీకను రాఘవుల నసుర

నా కొఱకు ననార్యుఁ డెదఁ గనలి నేఁ డకటా       

  1.  

 

 

 

ఆ.వె.

లేక స్వీయ పుత్ర శోక సంతప్తుఁడు

రామలక్ష్మణులను రణము నందుఁ

జంపకుండ నన్ను జంపును బాప ని

శ్చయుఁడు ఘోర రాక్షస పతి కిన్క    

  1.  

 

 

 

తే.గీ.

వింటిని భయంకరమ్ములఁ బెక్కు నాద

ముల ననేకులు సంతసమున నఱచుచు

నుండ మన్నిమిత్త మకట భండనమున

రాజ నందను లిర్వురు రాలి రేమొ   

  1.  

 

 

 

ఆ.వె.

అల్ప మతిని నకట హనుమంతు పలుకులు

వినక యుంటి వాని వీపు పైన

నేఁగి యున్న నే జయింపఁ బడక యైన

భర్త యొడిని నుందు బాధ లణఁగ

  1.  

 

 

 

ఆ.వె.

ఏక పుత్ర దీన యెప్పుడు కౌసల్య

యాలకించు సుతు లయమ్ము నప్పు  

డామె గుండె పగులు నంచు నిశ్చయముగఁ

దలఁతు నెడఁద నేను గలఁత మీఱ    

  1.  

 

 

 

కం.

తన సుతు జన్మము బాల్య

మ్మును యౌవనమును నిజ మనమున నాతఁ డొన

ర్చిన ధర్మ కార్యములఁ దలఁ

చును గౌసల్య యని యెంతు శోకావృతయై

  1.  

 

 

 

కం.

మరణింప సుతుండు నిరా

శ రా నెడఁద శ్రాద్ధ మిడి విసంజ్ఞఁ బ్రవేసిం

చు రయమున నగ్నిఁ దప్పక

చొరఁబడు కాదేని నీట శోకం బడరన్

  1.  

 

 

 

కం.

చీ కుబ్జ యసతి మందర

యాకుల కౌసల్య యయ్యె నా యత్యం తా

ఘాకర మానస సేసిన

యా కార్యమ్మునఁ గడింది యక్కట యిటులన్      

  1.  

 

 

 

తే.గీ.

విగత చంద్ర మహాగ్రహ వివశ రోహి

ణి వలె విలపించు చున్న యతివను సీతఁ

గని తపస్వినిని సుపార్శ్వుఁ డను సుశీల

మంత్రి సచివ వారితుఁ దన మగనిఁ గాంచి     

  1.  

 

 

 

తే.గీ.

పలికె మేధావి సాక్షాత్తు వైశ్రవణు న

నుజుఁడు దశవక్త్రుఁ డెట్లు కినుకకు లొంగి

వీడి ధర్మమ్ము వైదేహి నాఁడు పుట్టు

వును వధింపఁ గోరుచు నుండె ననుచు నింక

  1.  

 

 

 

తే.గీ.

వేద విద్యా వ్రతస్నాతుఁడే దయ విడి 

స్వీయ కర్మ నిరతుఁడును వీర వర్యుఁ

డే కతమ్మున స్త్రీ వధ నిచ్చగించు 

నీ క్షణమ్మునఁ జెప్పుమ రాక్షసేంద్ర!      

  1.  

 

 

 

ఉ.

కాంచుమ సీత రూపవతిఁ గాంతను నింపుగ రాక్షసేశ్వరా!

మించిన నీదు కోపమును మీఱి రణమ్మునఁ గూడి మమ్ములం 

ద్రుంచి త్యజింపు రామునిఁ జతుర్దశి నేఁ డపరంపుఁ బక్షమం

దంచిత మీ యమావసి శు భావహ మాజికి నుద్యమింపుమా

  1.  

 

 

 

తే.గీ.

శూరుఁడవు రథికుండవు ధీరుఁడవును

ఖడ్గివి రథ మారోహించి కయ్య మందు

దాశరథిని వధించినఁ దప్పక  పడ

యుదువు మైథిలి నసురేంద్ర! ముదము మీఱ   

  1.  

 

 

 

కం.

విని హితుని ధర్మ యుక్త వ

చనములను గ్రహించి యరిగె సదనమ్మునకున్

ఘనుఁ డా రావణుఁడు తిరిగి

తన సచివులఁ గూడి సభకుఁ దరలె రయమునన్      

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందుఁ దొంబది మూడవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 94.

 

 

 

రావణు నాజ్ఞ రాక్షస వీరులు యుద్ధమున కేఁగి వానరుల నెల్లర బాధించుచుండ రాముఁడు వారి నెల్లరను సంహరించుట.

 

 

 

 

కం.

మృగరాజు భంగి నిట్టూ

ర్పెగయ మహాసనమున సభ కేతెంచి వెసన్

వగతోఁ గూర్చుండెఁ గినుక

బగబగ మని మండుచు దశ వక్త్రుం డంతన్

  1.  

 

 

 

తే.గీ.

పలికెఁ బుత్రవ్యసన ఘోర బాధితుండు

బల్లిదుఁడు బల ముఖ్యుల నెల్లఁ గాంచి

యంజలి ఘటించి రక్షో గణాధినేత

రావణుండు వాక్యమ్ము లాగ్రహము మీఱ

  1.  

 

 

 

చం.

తరలుఁడు మీర లెల్లరు రథమ్ముల నశ్వ పదాతి యుక్త కుం

జర వర సేన తోఁ జెలఁగి సంగర భూమిని రాము నొక్కనిన్

నరవరుఁ జుట్టు ముట్టి ధృతి నైరృతు లార వధింప నర్హులే

కురిసి శరాలి వాన తఱి ఘోర ఘనావళి భంగి నొప్పుచున్     

  1.  

 

 

 

చం.

విరివిగ మీ శరావలిని భిన్నశరీరుఁడు నయ్యు నున్నచో

నరవరు రేపు నేఁ గని రణమ్మున లోకము సూచుచుండఁగా

ఖర శర జాల భగ్న నిజ కాయునిఁ జేయుదు నన్న వాని నె

ల్లరు విని సేనఁ గూడికొని రక్కసు లేఁగిరి స్యంద నావృతుల్

  1.  

 

 

 

చం.

పరిఘ పరశ్వ ధాసి శర పట్టిస ముఖ్య మహాయుధమ్ములన్

హరులను గొట్టి రుద్ధతిని నంగ వినాశక శస్త్ర కోటినిన్

హరులును ఘోర రాక్షసుల నద్రి మహీరుహ సంచయమ్ములన్

విరివిగ వైచి వేగముగ విద్ధులఁ జేసిరి విక్రమించుచున్     

  1.  

 

 

 

కం.

రవి యుదయింపఁగ మొద లయి

బవరము వెసఁ దుముల మయ్యె  భయదం బయి య

ప్డు వనచర వీరులకు నసు

ర వరేణ్యుల కొండొరులకుఁ బ్రత్యర్థులకున్       

  1.  

 

 

 

తే.గీ.

వాన రాసురులు గదలఁ బ్రాసలఁ గర

వాలములను గొడ్డళ్లను నాల మం ద 

వారితు లయి యొండొరులను జేరి కొట్టు

కొనిరి చెలరేఁగి బలమున ఘోరముగను 

  1.  

 

 

 

ఆ.వె.

జరుగు చుండ ఘోర సంగ్రామ మివ్విధి

రేఁగి నట్టి దుమ్ము పృథ్వి పైన

నణఁగె నద్భుతముగ నసుర వానర వీర

వరుల శోణితమ్ము వాఱ నపుడు

  1.  

 

 

 

తే.గే.

పటుతర రథ కుంజరములు తటులు గాఁగ

నశ్వ రాజము లరయ మత్స్యములు గాఁగ

ధ్వజములు తరువులుగఁ గనఁబడఁ  గళేబ

రములు తెప్పలై పాఱెను రక్త నదులు    

  1.  

 

 

 

ఉ.

వానరు లెల్ల రక్తములు వాఱగ మేనుల దూఁకి దూఁకి కో

పానఁ బతాక వర్మ రథ పార్థివ శస్త్ర వరాది కోటినిన్ 

వే నలి సేసి రాజి నరి భీకరులై యసురేంద్ర సంతతిన్

మానక పండ్ల గోరులను మర్దన సేసిరి మిక్కుటమ్ముగన్

  1.  

 

 

 

ఆ.వె.

జుట్టు ముక్కు చెవుల బెట్టిదముగ నొస

ళులను  బ్లవగ వీరులు వెసఁ బట్టి

కొఱికి గీరి యసుర కోటి బాధింపఁ దొ

డఁగిరి సమర మం దడరుచు భృశము     

  1.  

 

 

 

కం.

రక్కసుల పైకి వానరు

లొక్కొక్కరి పైకి నూర్గు రుద్రేకముతో

నుక్కునఁ బాఱిరి  పండిన

యొక్క తరువుఁ జేరెడు శకు నోత్కరము వలెన్    

  1.  

 

 

 

ఆ.వె.

అంత నసురు లలిగి యద్రి సన్నిభులు పె

ద్ద గదలం బరశ్వథములఁ బ్రాస

ల శిత ఖడ్గములను బ్లవగుల ఘోరులఁ

గొట్టిరి చెలరేఁగి బెట్టిదముగ         

  1.  

 

 

 

చం.

శరణము నా శరణ్యు రఘు సత్తము దాశరథిన్ వెసన్ నిశా

చర గణ వధ్యమాన కపి సైన్యము వేడెను జేరి యార్తితో

గురు తర తేజుఁ డంత శర కోవిదుఁ డూని శరాసనమ్మునుం 

గురిసెను బాణ వర్షమును గ్రుద్ధతఁ జొచ్చి నిశాట సేనలో

  1.  

 

 

 

ఆ.వె.

చొచ్చినట్టి వాని శూరుని రామునిఁ 

గాండ వహ్ని చేతఁ గరము కాల్చు

వానిఁ జేర జాల రా నిశాచరు లర్కుఁ

గదియఁ జాల నట్టి ఘనముల వలె    

  1.  

 

 

 

చం

 

చలిపిన కార్యముల్ సులభ సాధ్యము కానివి ఘోర కర్మముల్

గలనునఁ గాన నయ్యె నటఁ గౌణప కోటికి రామ కృత్యముల్

గలఁపఁగ ఘోర సైన్యమును గట్టి రథమ్ములఁ గూల్పఁ గానన

మ్ములఁ జరియించు గాలి వలెఁ బూరుష వర్యునిఁ గాన రెవ్వరున్

  1.  

 

 

 

తే.గీ.

రాముని శర జాలమ్మున బ్రద్ద లయిన

చీల్పఁబడిన యాయుధముల చేత ధగ్ధ

మైన బలముం గనిరి కాన రైరి యేరు 

కర్త నా రఘు వీరునిఁ గయ్య మందు    

  1.  

 

 

 

కం.

కనఁ జాలరు తమ గాత్రము

లను గొట్టుచు నున్నయట్టి రాఘవు నేరున్

ఘనముల నింద్రియ భోగము

ల నూను భూతాత్ముఁ గనని ప్రజల విధముగన్    

  1.  

 

 

 

ఉ.

ఈతఁడె కుంజరధ్వజిని నిత్తఱిఁ జంపుచు నున్నవాఁడహో

యీతఁడె సన్మహారథుల నీతఁడె వాజుల కాల్బలమ్ములం   

జేతి శరాలిఁ గూల్చుచును జీల్చుచు నుండె నటంచుఁ గాంచి వా

రా తఱి రామ రూపులను నంతఁ బరస్పర మాగ్రహమ్ముతో

  1.  

 

 

 

తే.గీ.

రామ రూప సామ్యమ్మునఁ బ్రబలు చుండ

నొండొరులఁ గాంచి  రాక్షసు లుగ్రులై క

రమ్ము కొట్టుకొనిరి సమరమ్ము నందు

నంతరంగముల నపుడు భ్రాంతి సెలఁగ

  1.  

 

 

 

కం.

ఘన గాంధర్వాస్త్రమ్మున

మనముల మోహ మడరంగ మనుజేంద్రుని రా

మునిఁ గనఁ జాలరు యుద్ధ

మ్మున రాముఁడు గాల్చుచున్న మూఁకను నెల్లన్

  1.  

 

 

 

ఆ.వె.

వారు కాంతు రాహవమున వేల కొలంది

రాముల నొక తడవ రక్కసు లటఁ

గ్రమ్మఱ నది యేమొ కాకుత్స్థుఁ డొక్కఁడ 

కాన నగును వారి కన్నులకును 

  1.  

 

 

 

ఆ.వె.

కొఱవి చక్ర నిభము ఘోరంపు టా రామ

కార్ముకమ్ము తిరుగఁ గనిరి కాని

రాక్షస వరు లేరు రామునిఁ గనఁ జాల

రైరి సుంత యైన నాజి లోన    

  1.  

 

 

 

చం.

తను వది నాభి కాఁగ వితతంపు బలమ్ము వెలుంగ జ్వాలలై

ఘన శిఖు లెల్ల నాకులుగఁ గార్ముక మారయఁ గమ్మి గాఁగ నా

రి నినద ముగ్ర రామ తల సృష్ట రవమ్ముగఁ దోఁపఁ దేజు బు

ద్ధి నెగడఁ గాంతియై చెలఁగ దివ్య మహాస్త్రము లగ్ర భూములై

  1.  

 

 

 

తే.గీ.

ఆజి రక్కసులను జంపు నట్టి ఘోర

తరపు రామ చక్రమ్మును దదవసరపుఁ

గాలచక్రము భంగినిఁ గాంచి రపుడు   

జనులు విస్మయమ్ము సెలఁగ మనము లందు

  1.  

 

 

 

సీ.

కామరూపు లగు రాక్షస పుంగవుల వాయు వేగ రథమ్ములు పృథ్విఁ గూలెఁ

బది వేలు గజములు బల్లిదములు పదునెనిమిది వేలు మహినిఁ దొరంగె

నాశ్వికులను గూడి యశ్వములు పదు నాలుగు వేలు వింతగఁ గ్రుంగె నేలఁ

గాలిబంటు లవనిఁ గూలిరి పూర్ణమ్ము రెండు వందల వేలు దండి మగలు    

 

తే.గీ.

దినపు టష్టమ భాగమ్మునను ననల శి

ఖాభ శర సంచయమ్మున నక్కజముగ

నొక్క రాముని చేత మహోగ్ర సంగ

రమ్ము నందు వీక్షింప భయమ్ము సెలఁగ

  1.  

 

 

 

ఆ.వె.

అంత వడి నరిగిరి హతశేషులు హతాశ్వు

లు హత రథులు శాంతులు విగతధ్వ

జు లిఁక లంక కడలి శోక తప్తులు నిశా

చరులు పర్వు లిడుచు దురము వీడి   

  1.  

 

 

 

కం.

హత గజ పదాతి తురగ వి

తతి నయ్యె రణాంగణమ్ము దహనాంబకు ప్రీ

తి తరక్రీడారంగము 

గతి నయ్యెడ నక్కజముగఁ గడు భయదంబై      

  1.  

 

 

 

కం.

సుర గంధర్వ మహర్షులు

వర సిద్ధులు గాంచి యంతఁ బరమాద్భుత మై

న రఘు వరేణ్యుని కార్యము

మురియుచు బహు సాధు వంచుఁ బొగడిరి ప్రీతిన్         

  1.  

 

 

 

తే.గీ.

సరస సుగ్రీవు హనుమను జాంబవంతు

నవ్విభీషణు మైందుని నా ద్వివిదునిఁ 

గాంచి రాఘవుం డనియె నీ యంచి తాస్త్ర

బలము గలవారు నేను ద్ర్యంబకుఁడు నంచు   

  1.  

 

 

 

కం.

సముచిత శస్త్రాస్త్ర జిత

క్లముఁ డింద్ర నిభుండు చంపి రాక్షస పతి సై

న్యము మనుజర్షభుఁడు రఘు ప

తి మాన్యుఁ డయ్యె నట ముదిత దేవావలికిన్   

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందుఁ దొంబది నాలుగవ సర్గము.

 

 

యుద్ధ కాండము

సర్గము 95.

 

 

 

యుద్ధమున రామునిచేత రాక్షస వీరు లనేకులు మరణింపఁగ దుఃఖమున రాక్షస స్త్రీలు పరిపరి విధముల విలపించుట.

 

 

 

 

ఉ.

రావణ ముక్త కుంజర వరమ్ములు వాజులు వేలు వేలుగా

మావటి వాండ్రు వహ్ని నిభ మండిత సధ్వజ చక్రపాదముల్

వేవురు  సద్గదా పరిఘ భృత్కర రాక్షస యోధ వర్యులుం 

బావన కాంచనధ్వజ విభాసిత శూర సహస్ర మయ్యనిన్   

  1.  

 

 

 

తే.గీ.

కామ రూపులు నక్లిష్ట కర్ముని రఘు

రాముని సుతీక్ష్ణ తప్త కార్తస్వర సువి

భూషిత శర జాలమ్మున రోష మడర

మూరి మరణించి రెల్లరు పోరి పోరి         

  1.  

 

 

 

తే.గీ.

విని కని హత శేషు లసుర వీరు లంత 

దీను లరిగి భీతిని దమ స్త్రీలఁ గూడి

వనర విధవలు హత బాంధవలు హత సుత

లు విలపించిరి గుమికూడి యువిద లెల్ల

  1.  

 

 

 

తే.గీ.

శూర్పణఖ వృద్ధ యెట్టులఁ జూచె నీ క

రాళ యక్కట రాముని రతిపతి సము 

వంగి నట్టి పొట్ట గలది  వనము నం ద

తిసు కుమారు భూత హితుని దిట్ట మగని

  1.  

 

 

 

తే.గీ.

లోక నింద్య  యీ రాక్షసి లోక నుతుని

గుణ విహీన యసుర కాంత గుణచయ నిధి  

సుముఖు రాముని దుర్ముఖి శూర్పణఖ వ

రించు టెట్టు లొప్పు నెదఁ దలంచి చూడ   

  1.  

 

 

 

చం.

అసురుల యల్ప భాగ్యమున నంగన వృద్ధయుఁ దెల్ల జుట్టుతో

మసలెడు నట్టి దుష్ట యవమాన కరం బపహాస్య కార్యమున్

వెస ఖర దూష  ణాసురుల వీర వరేణ్యుల నాశ నార్థమై

యసతియె రామ ధర్షణము నక్కట చేసెను గర్హితమ్మునున్

  1.  

 

 

 

తే.గీ.

శూర్పణఖ నిమిత్తమ్మునఁ జూ దశాన

నుండు ఘోర శత్రుత్వమును గొని తెచ్చి

కొనియె నాత్మ వధార్థంబ కోమలి జన

కాత్మజను గొనితెచ్చె దురాత్ముఁ డిట్లు    

  1.  

 

 

 

కం.

జనక సుతను బొందఁడు సీ

తను రావణుఁ డెన్నఁ డేని దశకంఠుఁడు రా

మునితో బలవంతునితో

డ నిట్టు లక్షయపుఁ బగఁ బడసె దుస్సహమున్  

  1.  

 

 

 

తే.గీ.

వనిని వైదేహిఁ గోరిన వాఁ డసుర వి

రాధుఁ డొక్క రాముని చేత లయము నందెఁ

గాంచఁగ నిదర్శన మది యొక్కటియెఁ జాలు

నన్యముల నేల పెక్కింటి నరయ వలయు

  1.  

 

 

 

కం.

పదునాలుగు వేవు రసురు

లుదర్చి శిఖల కెనయెడు శరోత్తమముల వే  

విదళితులు  జనస్థానము

న దురమ్మున నక్కజముగ నరవరు చేతన్      

  1.  

 

 

 

తే.గీ.

ఖరుఁడు దూషణుఁ డింకఁ ద్రిశిరసుఁడు సమ

రమున నాదిత్య సంకాశ రామ బాణ

ముల విలయు లైరి మనములఁ దలఁప నా ని

దర్శనమ్ము జాలదె  యింకఁ దరుణు లార!

  1.  

 

 

 

ఆ.వె.

నెత్తు రాను వాఁడు నినదమ్ము లొనరించు

వాఁడు యోజనంపు బాహువుల న

డరు కబంధుఁడు రఘువరునిచే హతుఁ డయ్యెఁ

జాలు నా ఋజు విటఁ జామ లార!  

  1.  

 

 

 

ఆ.వె.

వాలి మేరు నిభుని వాసవాత్మజు బల

వంతుఁ జంపె నొక్క బాణముననె

రథిక సత్తముండు రాముఁడు వింటిరె

దలఁపఁ జాలు నా నిదర్శనమ్ము

  1.  

 

 

 

ఆ.వె.

శోక మూర్ఛితుండు సుగ్రీవుఁడు హత మ

నోరథుండు హరి వరుండు ఋష్య

మూక వాసి రాజ్యమున నిలుపఁ బడియెఁ

దలఁపఁ జాలు నా నిదర్శనమ్ము

  1.  

 

 

 

ఉ.

చెప్పఁగ నా విభీషణుఁడు చెన్నుగ నర్థ సధర్మ వాక్యముల్

గొప్ప హితం బొసంగఁ దగు కూర్మిని రాక్షస కోటి కత్తఱిన్

మెప్పు వహింప నేరఁడు సుమీ ధన దానుజుఁ డజ్ఞుఁ డాత్మఁ దా

నప్పుడు విన్నఁ గాడు నయి యార్తినిఁ గుందదు లంక యివ్విధిన్     

  1.  

 

 

 

ఉ.

కూలినఁ గుంభకర్ణుఁ డనిఁ గూరిమి తమ్ముడు రాఘవేంద్రుచేఁ  

గూలిన నింద్రజిత్తు రణ ఘోరుఁడు నయ్యతి కాయుఁ డక్కటా

యాలము నందు లక్ష్మణుని యమ్ముల నెల్లరకున్ దురాసదుల్

సాలఁడు నేర రావణుఁడు చావుల నారసి యక్కజమ్ముగన్

  1.  

 

 

 

ఆ.వె.

నాదు తనయుఁడీ రణమ్మున హతుఁ డయ్యె

విగత జీవుఁ డయ్యెఁ బృథ్వి భ్రాత

యీల్గె నాదు భర్త యింటింట వినిపించె

నార్తనాదము లిటు లకట జెలఁగి   

  1.  

 

 

 

కం.

కరి తురగ రథ వరమ్ములు 

ధర వందలు వేలు గూలె దారుణ రీతిన్

గురుతర పదాతి బల మా

దురమున శూర వర రామ దోర్బల మహిమన్  

  1.  

 

 

 

కం.

అని రుద్రుండొ శతక్రతు

వు నగారియొ విష్ణువొ మఱి భూతాంతకుఁ డా

యిన తనయుండొ స్వయము రా

ముని రూపునఁ జంపెనొ పగ మూఁకను నెల్లన్

  1.  

 

 

 

కం.

హతులై చనంగ వీరులు

పతి హీనలమై నిరాశ ప్రబల భృశముగన్

మతుల భయమ్మున కంతము

సతతము విలపింతుము గనఁ జాలక యిచటన్  

  1.  

 

 

 

కం.

దశకంఠుఁడు దత్త వరుఁ డ

తి శూరత నెఱుంగఁ డిట నతి భయము వుట్టన్

విశదముగ ఘోర మింద్ర స

దృశ రాముని హస్తములను దృశ్యం బైనన్   

  1.  

 

 

 

తే.గీ.

అమరు లైన గంధర్వులు నైన నప్పి

శాచము లయిన ఘోర రాక్షసులు నైనఁ

జేర నాజి రాముండు రక్షింప జాల

రెవ్వరును రావణుని శంక యేల యిందు  

  1.  

 

 

 

చం.

కనఁబడె దుర్నిమిత్తములు కయ్యము కయ్యము నందుఁ బంక్తి వ

క్త్రుని వధఁ దెల్పు నట్టివియె కొల్లలు రామునిచే రణమ్ములోఁ

గొనె నభయమ్ము రావణుఁడు కూరిమి నబ్జజుచే సు రాసు రా  

లిని మఱి దాన వావలిని లెస్సగఁ గోరఁడు మర్త్య కోటిచే    

  1.  

 

 

 

కం.

ఇది యా మానుష వర భయ

ము దనరె నిస్సంశయముగ మూరుచు నిచటం

బ్రదుకుల నశింపఁ జేయఁగ 

నుదరి దశగ్రీవున కసు రోత్కరములకున్     

  1.  

 

 

 

చం.

అమరులు పీడ్యమాను లయి యబ్జజుఁ డీయ వరమ్ము లంత స

త్త్వ మరసి నట్టి రాక్షసుల భర్త దశాస్యునిచేఁ దపమ్ములన్

సముచిత రీతి పూజ లిడ సంతస మంది విధాత పల్కె వా

క్యముల హితైక యుక్తముల నారసి ప్రీతిని దేవతావలిన్   

  1.  

 

 

 

ఆ.వె.

నేఁటి నుండి యసుర కోటి దానవ సంచ

యమ్ము సంచరించు నత్యధిక భ

యమున ముజ్జగముల ననవరతమ్ము ని

శ్చయముగ నన సురలు చనిరి ప్రీతి 

 

 

 

  1.  

 

 

 

ఉ.

దేవత లంత సేంద్రు లయి తేఱి పురాంతకు నిర్జరాలికిన్

దేవుఁ బ్రసన్నుఁ జేయగను దృప్తిలి యా వృషభధ్వజుండు తా

నీ వచనమ్ములం బలికె నింతి యొకర్తు జనించు ధాత్రిలోఁ

బావని రాక్షసక్షయము పన్నుగఁ జేయఁగ మీ హితార్థమై  

  1.  

 

 

 

తే.గీ.

ఆమె యగు నీమె జానకి యమర వరుల

చేతఁ బంపఁబడంగ భక్షించును మన

ల నసురఘ్ని స రావణ రాక్షసులను 

దానవులఁ బూర్వ మాఁకలి యాని నట్లు   

  1.  

 

 

 

ఆ.వె.

దాపరించె నిట్టి యేఁపు మనకు దుఃఖ

మున మునుఁగఁగఁ జేసి బుద్ధిహీనుఁ

డింక దుష్ట బుద్ధి సంకోచమును వీడి

చేసిన హరణమ్ము చేత నకట

  1.  

 

 

 

తే.గీ.

కనము శరణ మొసఁగు వారి మనము క్రుద్ధుఁ 

డాక్రమింపఁగ ఘోరంపు టాగ్రహమునఁ

బ్రళయ వేళలో మృత్యువు భంగి మీఱి   

యౌర రాముఁడు బరికింప నేరి నేని

  1.  

 

 

 

ఆ.వె.

శరణ మొసఁగు వారు ధర లేరు మన కిప్డు

ఘోరమైన భయముఁ గూడి యుండ

దట్ట మైన నటవి దావాగ్నిఁ జిక్కిన

యాఁడు కరుల పగిది వేఁడ మనము

  1.  

 

 

 

తే.గీ.

కాలమునకుఁ దగిన యట్టి కార్యమును ఘ

నుండు పౌలస్త్యుఁడు విభీషణుండు సేసె

నెవ్వని వలన భయ ముద్భవించె వేఁడె

వానినె యరిగి శరణమ్ము భక్తి తోడ       

  1.  

 

 

 

కం.

అసు రాంగన లివ్విధి నపు

డు సేతులను బట్టి కొని కడు వనరిరి కలం

త సుదారుణమై జెలఁగ న

లసి రొనరించుచు రవమ్ములను భయ తప్తల్      

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందుఁ దొంబది యేనవ సర్గము.

 

 

యుద్ధ కాండము

సర్గము 96.

 

 

 

రాక్షస స్త్రీల యార్తనాదములను రావణుఁడు విని నిట్టూర్చి కోపోద్రిక్తుఁడై స్వయముగ నమాత్యులతో సైన్యము తోడ రామలక్ష్మణులను వానరేంద్రునిఁ జంపెద నని పలుకుచు యుద్ధమున కేఁగుచుండ దుర్నిమిత్తములను గాంచినను రావణుఁ డేఁగి భీకరముగ వానరులను జంపుట. 

 

 

 

 

కం.

విని యింటింటను నసురాం

గన లేడ్చుచు నుండ జాలి కదురంగఁ గడున్

వినిపించు నార్తనాదము

లను రక్షోగణ విభుండు రావణుఁ డంతన్     

  1.  

 

 

 

తే.గీ.

రావణుండు నిట్టూర్చి దీర్ఘముగ నొక ము

హూర్త మొనరించి ధ్యానము నుగ్రుఁడై క

రమ్ము భీమదర్శనుఁడు  పండ్లను బెదవులఁ

గొఱికి రక్తలోచనుఁ డయ్యెఁ గోప మడర    

  1.  

 

 

 

ఉ.

మండుచుఁ గాల వహ్ని వలె మానిసి దిండ్లకుఁ జేర రాని యు

ద్దండుఁడు పల్కె వ్యక్త రహితమ్ముగఁ గ్రోధ నిమగ్నుఁడౌట నా

దండను నున్న రాక్షసులఁ దాఁ గని చక్షులఁ గాల్చురీతి రు

ద్రుం డయి పల్కు లివ్విధము దుఃఖ రుషావృత మానసుండునై          

  1.  

 

 

 

తే.గీ.

త్వరిత మో మహోదర! మహాపార్శ్వ! రాక్ష

సా విరూపాక్ష! రాక్షస సైన్యములు మ

దాజ్ఞఁ జన వలె నాజికి నని వచింపుఁ

డసుర పుంగవులార! మహాత్ములార!  

  1.  

 

 

 

తే.గీ.

అసురు లసురేంద్రు వాక్యము లాలకించి

భయము తోడ నార్తాత్ములై పార్థి వాజ్ఞ

నూని యవ్యగ్రులై రాక్ష సోత్తములను

ననికిఁ బ్రేరేచి రింపుగ నప్పు డేఁగి  

  1.  

 

 

 

ఉ.

వారలు పల్కి యట్లె యని భైరవ రూపులు ఘోర రాక్షసుల్

వారల స్వస్తి వాక్యములఁ బన్నుగఁ గైకొని యుద్ధ భూమినిం

జేరఁగ నుద్యమించి వెసఁ జెన్నుగ ఱేని కొసంగి మ్రొక్కులం

జేరువ నిల్చి రంజళులు సేర్చి మహారథు లా జిగీషువుల్  

  1.  

 

 

 

తే.గీ.

కని మహాపార్శ్వుని మహోదరుని విరూప

నేత్రు రాక్షసుల నగవు నెగడ పలికె

రావణుఁడు క్రోధ మూర్ఛితుఁ డీ వచనము

లను మహోద్ధతి నతుల పరాక్రముండు   

  1.  

 

 

 

ఉ.

పరమ ధనుర్విముక్తముల బాణములన్ లయ కాల తత్ప్రభా

కర సదృశమ్ములన్ మనుజ కాంతుల రాముని నింక లక్ష్మణుం

ద్వరితము కాలు నింటి కనుపంగఁ బ్రహస్తుఁడు నింద్రజిత్తిఁకన్ 

ఖరుఁడును గుంభకర్ణుఁడును గాంతురు శాంతిని నా ప్రతిక్రియన్   

  1.  

 

 

 

ఆ.వె.

అంతరిక్ష మైన నా దిశ లేనియు

స్వర్గ సాగరములు మార్గణ తతు

లేను వేయ మూరి కానిపింపవు నిండ 

నేఁడు నిక్కముగను జూడుఁ డింక

  1.  

 

 

 

ఆ.వె.

వింటి నుండి వేగ వేసి ఱెక్కలు గల

బాణములను నేఁడు వానర వర

యోధుల విడివిడిగ యుద్ధమ్మునఁ జెలంగి

చంపువాఁడ బలిమి సొంపు మీఱ

  1.  

 

 

 

తే.గీ.

వాయు తుల్య తేజోరథ వరము నుండి

నేఁడు కార్ముకాంబుధి నుండి పాడిగ జని

యించి నట్టి శిత శరోర్మిఁ ద్రుంచు వాఁడ

వానర వర సైన్యమ్మును నేను గనుఁడు

  1.  

 

 

 

ఆ.వె.

వికచ పద్మ వక్త్ర పృథు పద్మ కేసర

కాంతుల కపి యూధ గణ తటాక

ములను మదయుత గజము పగిది చెలరేఁగి

కలఁచు వాడ నేఁడు గాంచ వలయు         

  1.  

 

 

 

ఆ.వె.

సమర మందు నేఁడు శరము లున్న వదన

ములను గూడి ప్లవగ ముఖ్య యూధ

పులె యలంకరింత్రు పుడమి నెల్ల సనాళ

పంకజ నిచయమ్ము పగిది గనుఁడు  

  1.  

 

 

 

ఉ.

ఉదుటున వంద వంద కపి యూధము లందుఁ బ్రచండులన్ వెసం

గుదురుగఁ బాద పాయుధులఁ గోతులఁ గూల్తు శరం బొకండునన్ 

వదలిన యశ్రులం దుడుతు భ్రాతలు నాథులు పుత్రు లాఱఁగా  

గుదగుద లాడు రాక్షసులకుం గనుఁ డింపుగ నేఁడ యెల్లరున్   

  1.  

 

 

 

తే.గీ.

నేఁడు యత్నమ్ము వలననె చూడుఁడు ధర

కానఁబడు నట్టు లొనరింతుఁ గయ్య మందు

మత్శర చయ భిన్న వికీర్ణ మర్క టాలి

చే నచేతన దళముచే శీఘ్రముగను

  1.  

 

 

 

ఆ.వె.

బాణ తప్త పరుల పలముల నక్కల

గ్రద్దలను మఱి పలలమ్ముఁ దినెడు

నితరములను నేఁడు వితతమ్ముగం దృప్తి

వడయు నట్లొనర్తు భండనమున   

  1.  

 

 

 

మ.

సమకూర్పుం డిట నాదు స్యందనము నా చాపమ్మునుం దెండు  క్షి

ప్రము శేషాసుర వీరు లెల్లరు వెసన్ రండింక నావెంట నం

చు మహోగ్రుండు వచింప రావణుఁడు రక్షోనాథుఁ డచ్చోట ను

న్న మహాపార్శ్వుఁడు వంచె సిద్ధపఱుపన్ నానా బలాధ్యక్షులన్     

  1.  

 

 

 

తే.గీ.

లఘు పరాక్రము లరిగిరి రాక్షస బల

నేత లంత నింటింటికి నాతతముగ

రాక్షసుల నెల్లఁ బ్రేరేప నా క్షణమున

సంభ్రమమున లంకాపురి సత్వరమ్ము  

  1.  

 

 

 

ఆ.వె.

ఆ ముహూర్తమున మహాసురులు సు భీమ

దర్శను లఱచుచు వితతముగను భ

యంకర వదనులు మహాయుధముల వివి

ధములఁ గొని భుజములఁ దరలి రంత        

  1.  

 

 

 

ఉ.

శూల శతఘ్ని పట్టిస విశుద్ధ గదా ముస లేద్ధ తీక్ష్ణ ధా

రా లస దోగ్ర శక్తి సుపరశ్వథ ముద్గర కూట యష్టి చ

క్రాలఘు భిండిపాల పరమాసి వరాన్య మహాయుధమ్ములన్

మేలుగ నూని రాక్షసులు మేదిని నిండఁగ వచ్చి రత్తఱిన్  

  1.  

 

 

 

ఉ.

గ్రక్కున నెల్ల సేనకును గాంతుఁడు తేఁ దుర గాష్ట యుక్తముం

జక్కని తేరు నంతట ససారథి స్వప్రభలన్ వెలుంగు ఱేఁ

డెక్కెను రావణుండు వడి నెంతయొ భీతి నొసంగు మేను వాఁ

డెక్కుడు సేనఁ గూడి చనె నిద్ధ బలుం డిలఁ జీల్చునో యనన్   

  1.  

 

 

 

ఆ.వె.

అంతటఁ జెలరేఁగె నసుర కలహ రవ

ముల మృదంగ పటహములయుఁ దూర్య 

శంఖములయు గొప్ప స్వనము లచ్చ టచట

నుండి  చేయు చుండ మెండుగాను    

  1.  

 

 

 

ఊ.

వచ్చెను రాక్షసాధిపతి బ్రాహ్మణ ఘాతి సురాలి కంటకుం

డచ్చము ఛత్ర చామర వరావృతుఁడై మహి జాపహారియున్

హెచ్చుగ దుష్ట చిత్తుఁడును  యెంచి రణం బొనరింప రాముతో

నిచ్చను నంచు గర్జనము లెల్ల వినంబడె వింత వింతగన్

  1.  

 

 

 

కం.

చలియించెను శబ్దమ్ముల

నిలాతలం బెల్లఁ గడిఁది యీక్షింపంగం 

గలకలము నాలకించి హ

రులు పాఱిరి భీతి సెలఁగ  లోలాత్ములునై

  1.  

 

 

 

ఆ.వె.

విజయ మెంచి యనికి వేగ వచ్చె మహాభు

జుండు రాక్షసాధిపుండు రావ

ణుండు తేజమున ఘనుండు సంరంభియై 

సచివు లుండ వెంట సధ్వజుండు   

  1.  

 

 

 

తే.గీ.

త్వర మహాపార్శ్వుఁడును మహోదరుఁడు నెక్కి

రరదములు విరూపాక్షుఁడు నానతీయ

రావణుండు దుర్ధర్షులు రహినిఁ బుడమి

పగులు నట్లఱచుచు గెల్పుఁ బడయఁ గోరి  

  1.  

 

 

 

తే.గీ.

అంతఁ దేజస్వి రక్షోగ ణావృతుండు

ధనువు కాలాంతక యమరాజ నిభము వెస

నెత్తి సమరార్థము నిలిచి రెచట రామ

లక్ష్మణు లరిగె నట్టి  ద్వారమ్ము నుండి  

  1.  

 

 

 

తే.గీ.

ప్రభలు లేని వాఁ డయ్యెను భానుఁ డపుడు

తిమిర మావహించె సకల దిశల నపుడు

పక్షు లొనరించె దారుణ ధ్వనుల నపుడు

మూరి కంపించెఁ గనుచుండ భూమి యపుడు  

  1.  

 

 

 

తే.గీ.

రక్త వర్షము కురిసెఁ బర్జన్యుఁ డపుడు

గుఱ్ఱములు తడఁబడుచును గుంటఁ దొడఁగె

ధ్వజముపై వ్రాలె నొక్క గృధ్రమ్ము వింత

మిక్కిలి యమంగళమ్ములు నక్క లఱచె

  1.  

 

 

 

చం.

కదలెను వామ లోచనము కంపిత మయ్యెను వామ బాహువున్

వదలెను కాంతి యాస్యమును స్వానము దగ్గెను గొంచె మత్తఱిం

గదలఁగ నాజి కట్లు దశకంఠుఁడు వుట్టెను రాక్షసేంద్రు చా

వొదవుటఁ దెల్పు నట్టివి రణోర్వి నిమిత్తము లివ్విధమ్ముగా   

  1.  

 

 

 

ఆ.వె.

అంత నుల్కలు వడె నంతరిక్షము నుండి

పిడుగు రొదలఁ బోలు పెన్నులివులఁ 

గాకములను గూడి గ్రద్ద లమంగళ

కరము లఱవఁ దొడఁగెఁ గఱకుగాను  

  1.  

 

 

 

తే.గీ.

వీని గణియింప కించుక యేని దుర్ని

మిత్తముల నివ్విధమ్ముగ మీఱి నట్టి

వాని మోహ మగ్నుండు రావణుఁడు కాల

చోదితుఁడు వ్యధార్థ మరిగె శూర వరుఁడు        

  1.  

 

 

 

చం.

అసురుల యా మహాత్ముల మహా రథ శబ్దము లాలకింపఁగా

నసమ బలాఢ్య మా కపి మహా చము వంక మొనర్పఁ బాఱె నం

త సమర మయ్యె ఘోరముగఁ దత్కపి రాక్షస సేన కెల్లఁ బే

ర్లు సదివి పిల్వ నొండొరుల రోష జిగీషులు వాన రాసురుల్     

  1.  

 

 

 

కం.

విపరీతము క్రుద్ధుం డయి

యపుడు దశగ్రీవుఁ డమ్మహారథి వీరుం

డు పసిడి ముల్కులను బఱపి   

కపి సేనా వీరవర్య కదన మొనర్చెన్

  1.  

 

 

 

ఉ.

కొందఱు రావ ణార్దితులు కోసిన మూర్ధము లున్నవారునుం

గొందఱు ఛిన్న వక్షులును గొందఱు భీకర భగ్న కర్ణులుం

గొందఱు బ్రాణ హీనులును గొందఱు దారిత పార్శ్వ యుగ్ములుం 

గొందఱు హీన చక్షులును  ఘోర రణమ్మునఁ గాంచ నత్తఱిన్  

  1.  

 

 

 

కం.

కినుకం గన్నులఁ ద్రిప్పుచు

ను నెక్క డెక్కడికి నేఁగును దశాననుఁ డా

ఘనుఁ డక్క డక్కడను శర

ఘన వేగము సైఁపఁ జాలక నలఁగిరి హరుల్

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందుఁ దొంబది యాఱవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 97.

 

 

 

సుగ్రీవుఁడు రాక్షసుల ననేకులను సంహరించి ఘోర యుద్ధమున విరూపాక్షునిఁ జంపుట.

 

 

 

 

కం.

దశకంఠుని బాణమ్ముల

భృశముగఁ దెగి నట్టి గాత్ర వితతిం బ్లవగుల్

కృశియించి వెసం దూల వి

వశులు హరుల తోడ నిండె వసుధా తలమే

  1.  

 

 

 

తే.గీ.

సైఁపఁ జాలని రావణు శర నిపాత

మొక్క దశకంఠు కృత్యము యోధు లెవ్వ

రును సహింప రైరి హరుల ననలమును సు

దీప్తమును బతంగముల రీతి నని లోన           

  1.  

 

 

 

ఆ.వె.

వాని ఘోర నిశిత బాణజాలమ్మున

నర్దితులయి కరము హరులు పఱచి

రాజి  ననల కీల లందుఁ జిక్కిన మండు

చున్న కరులు పాఱు చున్న రీతి

  1.  

 

 

 

ఉ.

మారుత మభ్ర రాశిని సమస్తము నెల్లెడఁ ద్రోయు రీతిఁ దా

నా రణ మందు వానర మహా ధ్వజినిం గడు భీతిఁ బాఱఁగా

మూరి యొనర్చి బాణములఁ బోరున వానరులన్ వధించుచుం 

జేరెను రావణుం డనిని శీఘ్రమ రాముని రాఘవేంద్రునిన్          

  1.  

 

 

 

ఉ.

ఆవిధిఁ బాఱుచుండ నని నారసి భంజిత వానరాలి సు

గ్రీవుఁడు సేన యందుఁ బరికించి సుషేణుని నాత్మసన్నిభుం

గావఁగ నుంచి వీరవరుఁ గయ్య మొనర్పఁ దలంచి శత్రు వీ

రావలి మార్కొనంగఁ జనె నంతట వృక్ష మహాయుధుండునై    

  1.  

 

 

 

ఉ.

వానికి వెన్కఁ బ్రక్కలను వానర యూధపు లెల్ల రంతటన్

మానుగ వెంటఁ నేగి రని మ్రానులు శైలము లూని కేళులన్ 

వానర నాథుఁ డార్చుచును భండన మందు మహా స్వనమ్ముల

న్మానిసి దిండ్ల నొంచి కడు నైరృత వర్యులఁ జేరె నన్యులన్     

  1.  

 

 

 

మ.

ఘన కాయుండు ప్లవంగ రాడ్వరుఁడు రక్షశ్చక్రముం గ్రుద్ధుఁడై

యనిలో మొత్తెను వృక్ష సంచయముఁ గాలాంతాభ్రముల్ గూల్చు భం

గిని రక్షో బల మందు ఘోరముగ శృంగివ్రాత వర్షమ్ము గు

ర్సెను మేఘమ్ములు ఱాల వాన వనిఁ బక్షివ్రాత మందున్ వలెన్     

  1.  

 

 

 

కం.

కపిరాజ ముక్త శైలము

లు పడ నటుల భగ్న గాత్రులు వికీర్ణ వరాం

గ పలాశను లంత నికృ

త్త పర్వతములు జెదరిన విధమున పడి రిలన్        

  1.  

 

 

 

తే.గీ.

క్షీణు లగుచు భంగపడుచుఁ జెదర నసురు

లెల్లెడలను సుగ్రీవు చేఁ బెల్లఱచుచుఁ 

బే రనుచు విరూపాక్షుఁడు చేర రాని

ధన్వి దిగి రథ మిభపు స్కంధమ్ము నెక్కె  

  1.  

 

 

 

ఉ.

దక్షత నెక్కి కుంజరము తత్క్షణ మేసి శరమ్ములన్ విరూ

పాక్షుఁడు వానరేంద్రు పయి నార్చుచు నుర్కుచు వానరాలిపై

రాక్షస వీరు లందఱు కరమ్ము తపింపఁగ నూఱడించుచున్

రక్షణ మిచ్చి నిల్పె నని రక్కసు లందఁగ హర్ష మింపుగన్   

  1.  

 

 

 

ఉ.

మిక్కిలి విద్ధుఁడై పదను మీఱిన ముల్కుల రాక్షసేంద్రుచే

నక్కపినాథుఁ డప్పుడు మహాగ్రహ మూర్ఛితుఁ డార్చి చంపఁగాఁ

గ్రక్కున నెంచి డెందమున క్ష్మాజము నెత్తి ప్రహారి చేరి తా

నుక్కునఁ గొట్టె నాస్యమున నుగ్రుఁడు శూరుఁడు కుంజరమ్మునున్   

  1.  

 

 

 

కం.

తగులఁగ సుగ్రీవుని దె

బ్బ గజేంద్రము ఘోరముగను బాణాసన మా

త్ర గరిష్ఠ దూరము చనియె

వగఁ గూర్చుండఁ బడి చేసె భైరవ రవముల్  

  1.  

 

 

 

చం.

పతిత గజమ్ము నుండి దిగి వానర నాథున కీయఁ ద్రాసమున్

వితత పరాక్రముం డసుర వీరుఁడు వేగమ యూని యార్షభాం

చిత వర చర్మ మింకను విశేష శితాసిని వానరేంద్రు సం

స్థితు లఘు విక్రముండు కదిసెం బగ నాజిని నుగ్ర శత్రువున్    

  1.  

 

 

 

తే.గీ.

అరసి సుగ్రీవుఁడు కినిసి యభ్ర సన్ని

భాశ్మముఁ గొని విరూపాక్షు నంగము పయి

కి విసరఁ గని తొలఁగి పెఱికి యసిఁ గొట్టె

వేగ మవ్విరూపాక్షుఁడు విక్రముండు    

  1.  

 

 

 

తే.గీ.

రక్కసుని ఖడ్గ సుప్రహరణము చేత

నూఁగి సుగ్రీవుఁ డొక్క ముహూర్త మట వి

సంజ్ఞుని పగిది నయ్యెను జయ్యన హరి

లేచి హృది ముష్టి నసురుని లీలఁ గొట్టె

  1.  

 

 

 

ఆ.వె.

కొట్టఁ బడఁగ ముష్టి ఘోరముగను విరూ

పాక్షుఁ డలిగి యసిని హరి వరేణ్యు

కవచముఁ బడ వేసెఁ గయ్యమున నతండు

పదము లంత దెబ్బ కదురఁ బడెను     

  1.  

 

 

 

చం.

వెసఁ బతితుండు లేచి కపి వీరుఁడు వైచెను స్వీయ వజ్ర కీ

ల సమ తలప్రహారమును రక్కసు పైనను  ఘోర రావ మా

యసురుఁడు నైపుణమ్మునను నక్కపి ఘాతము నుండి ముక్తుఁడై

పస గల ముష్టి ఘాతమును వానరు వక్షము నందు నుంచఁగా   

  1.  

 

 

 

కం.

కడు కోపించెను సుగ్రీ

వుఁడు వానర నాథుఁ డట్లు వొలియ ప్రహారం

బడర నసురేంద్రు కుశలత

యెడఁదను వీక్షించి నంతఁ గృత రిక్తమ్మున్

  1.  

 

 

 

తే.గీ.

అంత నంతరమును గాంచి యసుర వర్యు

నందు హరి వరేణ్యుఁడు కిన్క చింద సెలఁగి

యవ్విరూపాక్షుని కణఁత యందు వైచె

నిజ మహాతల ఘాతము  నెగడి మిగుల

  1.  

 

 

 

తే.గీ.

అంత శక్రాశని నిభ త లాహతి క్షితిఁ

గూలె నా విరూపాక్షుఁడు క్రుంగి రక్త

సిక్తుఁ డయి క్రక్కి రక్తము చెవుల నెల్ల

స్రోతముల ఝరముల స్రవించు జలము వలె   

  1.  

 

 

 

ఆ.వె.

మూర నురుఁగు రుధిరమునఁ దడిసిన వాని

రేఁగి నట్టి కినుకఁ ద్రిప్పుచుండ

లోచనమ్ములను విరూపాక్ష తరు విరూ

పాక్షుఁ గనిరి ప్లవగు లక్కజముగ  

  1.  

 

 

 

తే.గీ.

కొట్టుకొను చున్న వానిని బెట్టిదముగ

దొర్లుచుండంగఁ బ్రక్కలఁ దోరముగను

జాలి వుట్టంగ నార్చు రాక్షస వరేణ్యుఁ

గాంచిరి విరోధి నచ్చట కపి వృషభులు     

  1.  

 

 

 

కం.

హరి రాక్షస సైన్యము ల

ట్లు రణమ్మునఁ గూడికొని పటుత రార్ణవ తు

ల్య రవమ్ము లార్చె వేలా

విరహిత శరధిద్వయమ్ము వీఁక ఘనముగన్   

  1.  

 

 

 

కం.

కనిన విరూపాక్షు లయము

వనచర విభు చేత నసుర వానర బల మ

య్యె నపుడు విజృంభి తానిమి

ష నదీ సన్నిభము ఘోర సమరం బందున్  

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందుఁ దొంబది యేడవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 98.

 

 

 

మహోదరుఁడు విజృంభించి వానరలను వధియించు చుండ సుగ్రీవుఁడు మార్కొని వానిని వధించుట.

 

 

 

 

కం.

బలములు పరస్పరమ్మును

గలహమ్మునఁ జంపుకొనఁగ ఘర్మమున సర

స్సులు క్షీణించిన భంగినిఁ

బలుచగ నయ్యె నుభయములు భండన మందున్   

  1.  

 

 

 

కం.

తన సైన్యము నశియింపగ

ఘనుఁడు విరూపాక్షుఁ డణఁగఁ గయ్యము నందుం

గినుక ద్విగుణీకృతం బ

య్యెను బౌలస్త్యునకు రాక్ష సేంద్రున కంతన్  

  1.  

 

 

 

ఉ.

వానర వధ్యమానమును భైరవ రాక్షస సైన్య నాశముం

గానఁగ యుద్ధ రంగమునఁ గ్రమ్మిన దైవ విపర్యయమ్మునుం

బూనెను డెంద మందు వ్యధఁ బుణ్యజనుండు దశాస్యుఁ డంతటం

దాను మహోదరున్ సచివు దాపున గాంచి వచించె నిట్టులన్   

  1.  

 

 

 

ఉ.

ఇప్పుడు నాకు దీర్ఘ భుజ! యింక జయాశ వెలుంగు నీ పయిన్

మెప్పు వహింప శత్రువుల మీఱి వధింపుమ చూపు విక్రమం

బొప్పుగ దీర్ప భర్తృ ఋణ ముత్తమ వీర! రణం బొనర్పు నా

నప్పతి పల్క నట్లె యనె నప్డు మహోదరుఁ డాదరమ్మునన్  

  1.  

 

 

 

చం.

అని రిపు సేన లోనికి మహాత్ముఁడు సొచ్చె మహోదరుండు వ

హ్ని నడరి తూఱ వేగముగ నేఁగు పతంగము భంగిఁ జేసె నం

త నరుల నాశనమ్ము వెసఁ దద్దబలుండు స్వ వీర్య కారణ

మ్మునఁ బతి చోదనమ్మునను బోరున వానర భంజనమ్మునున్        

  1.  

 

 

 

ఉ.

వానరు లంత బల్లిదులు పట్టి భృహచ్ఛిలలన్ రిపూగ్ర సే

నా నివహమ్మునుం గదిసి నైరృత వీరులఁ గొట్టి రెల్లరన్

దాని మహోదరుండు గని తద్దయుఁ గిన్కను  జీల్చె వేసి తా

వానర పాదముల్ దొడలు పాణులు నభ్ర విభూషి తేషువుల్  

  1.  

 

 

 

తే.గీ.

అర్దితు లయి భృశమ్ముగ నసుర వరుల

చేతఁ బాఱిరి ప్లవగులు శీఘ్రమ దశ

దిశలకును కొంద ఱంత భీతి సెలగంగ

నాశ్రయించి రా సుగ్రీవు హరివరేణ్యు   

  1.  

 

 

 

కం.

కని భగ్న వాన రానీ

కిని సుగ్రీవుఁడు పరువిడె కీ శాధీశుం

డని నమ్మహోదరుని పై

కి నుండ డగ్గఱను గాంచి కిన్క సెలంగన్  

  1.  

 

 

 

ఆ.వె.

కొండఁ బోలు నట్టి ఘోర మైన శిలను

విపులమును గ్రహించి వేగ వైచె

వానిఁ జంప నెంచి వాన రేద్రుండు తే

జస్వి యలుక నసుర సత్తము పయి       

  1.  

 

 

 

కం.

త్వర నరుదెంచుశిల మహో

దరుఁడు దురాసదముఁ గాంచి తడఁబడక యహో

శరముల ఛేదించె మహా

సురుండు ఘోరముల నాజి శూరుఁడు లీలన్

  1.  

 

 

 

చం.

శిల పడె వేయి ముక్కలుగ ఛిన్నము గా విశి ఖౌఘ ఘాతమై

యిల  పయి వ్యాకులం బయిన యెక్కటి గృధ్ర సమూహ భంగి ము

క్క లయిన ఱాతి నట్లు కపి కాంతుఁడు క్రుద్ధుఁడు గాంచి సాలమున్

బలమునఁ బీఁకి వైవ వెస బ్రద్దలు సేసె నతండు దానినిన్   

  1.  

 

 

 

తే.గీ.

అంతటఁ బరపురంజయుఁ డా మహోద

రుండు శరముల నొంచెను మెండుగఁ బ్లవ

గేంద్రు నాజిలో సుగ్రీవుఁ డెలమినిఁ బడి

యున్న పరిఘమ్ము నారసె నుర్వి పైన    

  1.  

 

 

 

ఆ.వె.

వెలుఁగు చున్న గుదియఁ బృథ్వి పయిన నెత్తి

కొట్టి యయ్యసురునకుఁ దగఁ జూపి

వాని గుఱ్ఱములను బరిఘమ్ముతో ఘోర

గతి నడిచి వధించెఁ గపి విభుండు        

  1.  

 

 

 

కం.

హత హయ గణమ్ము రథమును

వెతం దిగి మహోదరుండు వీర వరుం డా

యతము గదా దండమును ద్వ

రిత మూని కినిసి కడు చెలరేఁగె రణమునన్  

  1.  

 

 

 

తే.గీ.

ఆ గదా పరి ఘాయుధ హస్తు లిరువు

రార్చుచును గో వృషభ నిభు లాజి మెఱపు

లున్న మేఘ ద్వయము భంగి మిన్నగఁ దల

పడిరి యరివీర మర్దను లడరి యపుడు

  1.  

 

 

 

చం.

విసరె మహోదరుండు గద వెల్గఁగ భాస్కర కాంతి తుల్యమై

వెస రజినీచరుం డలిగి వీరవరుం డగు వాన రేంద్రుపైఁ

గసి సెలగంగ వచ్చు గదఁ గాంచి మహోగ్రము రోష రక్త వం

త సదరు ణాక్షుఁ డుగ్రుఁ డయి తత్పరి ఘమ్మునఁ గొట్టె నగ్గదన్     

  1.  

 

 

 

ఆ.వె.

కూల గుదియ విఱిగి నేల గదాహతి

నంత నినుప ముసల మవని నుండి

ఘోర మైన దాని సౌరి కాంచన భూషి

తమ్ము కై గ్రహించె నెమ్మి మీఱ     

  1.  

 

 

 

ఆ.వె.

ముసల మంత నెత్తి విసరె నసురునిపై

నదియు నింక నన్య మైన యసురు

గదఁ బరస్పరమ్ము కదియంగ విఱిఁగి ప

డినవి ముక్క లయి యవనిని రెండు

  1.  

 

 

 

తే.గీ.

అరసి తేజో బల సమృద్ధు లాయుధమ్ము

లట్లు భగ్నములై పడ నవని దీప్త

వహ్నియుగ్మ సన్నిభ వీర వరులు తలప

డఁ దొడఁగిరి ముష్టిఘాతములఁ దనరించి  

  1.  

 

 

 

ఉ.

అప్పుడు వార లిద్దఱు మహా బలు లొక్కరి నొక్కరుం పగం 

దప్పక కొట్టు కొంచు నినదమ్ము లొనర్చుచు నప్పళించుచుం

గొప్పగఁ గైల నేల పయిఁ గూలిరి తూర్ణము లేచి యోడకే

రొప్పి భుజమ్ములం గదిసి గ్రుచ్చి యొనర్చిరి యుద్ధ ముద్ధతిన్   

  1.  

 

 

 

తే.గీ.

అంత బాహు యుద్ధమ్మున నలసి రా ప

రంతపు లిరువురు ఘనతరము మహోద

రుండు గని సమీపమ్మున నొండు ఖడ్గ

మును గ్రహించెను డాలుతో ఘన రయుండు    

  1.  

 

 

 

ఆ.వె.

డాలు తోడ నుండ డగ్గఱ ఖడ్గము

వేగ వత్తరుండు బాగుగఁ గని

శూరు లందు ఘనుఁడు సుగ్రీవుఁడు గ్రహించె

నుఱికి యంత వానరోత్తముండు

  1.  

 

 

 

కం.

కినిసిన యిర్వురు నార్చుచు

ఘనులా యుద్ధమున నెత్తి కత్తులను రణ

మ్మున శస్త్ర సంచయము లం

దు నిపుణు లొండొరుల పైకి దుమికిరి బలిమిన్    

  1.  

 

 

 

తే.గీ.

జయము నందుంచి మనము లుభయులు దక్షి

ణముగ మండల గతినిం దనరుచుఁ గోప

మూని యన్యోన్యము తిరిగి రా నగచర

వర నిశాచరు లత్తఱి భండనమున         

  1.  

 

 

 

ఉ.

తాను బరాక్రముం డని సతమ్ము దలంచెడు నమ్మహోదరుం

డూని మహోగ్ర ఖడ్గమును నుక్కున నాటెను చర్మమందునున్

దానిని లాగుచుండఁగను దత్ఖలుఁ డారసి వానరేంద్రుఁడే 

వాని శిరమ్ము ఖడ్గమున వారక త్రుంచె సకుండలమ్మునున్    

  1.  

 

 

 

తే.గీ.

మకుట యుక్త శిరమ్మును మర్కట పతి

నఱక నమ్మహోదరుఁడు ఘన బల దర్పి

తుండు గూలఁగ నేల నొక్కండు రాక్ష

సేంద్రు బలమునఁ గాన రా డెందు నపుడు     

  1.  

 

 

 

తే.గీ.

వానరులఁ గూడి హర్షించె వానరేంద్రుఁ

డాజిఁ జంపి మహోదరు నధికముగను

గోప మూనె దశాస్యుఁడు ఘోరముగను

రాఘవేంద్రుండు భృశము హర్షమ్ము నందె  

  1.  

 

 

 

కం.

దీన మనస్కు లయి విష

ణ్ణానను లసుర వరు లెల్ల రావృత చింతా

మానసులు పాఱిరి భయము

తో నిటు నటు నాజి వీడి తూర్ణం బంతన్     

  1.  

 

 

 

తే.గీ.

నేలఁ గూల్చి మహోదరుని గిరి యందు

నొక్క భాగముఁ జెదరు నట్లొనరుచు క్రియ

సూర్య సుతుఁ డరుల కెదిరించుటకు రాని

వాఁడు జయలక్ష్మి వెలిఁగెఁ బ్రభాకరుఁ డన     

  1.  

 

 

 

కం.

సుర యక్ష సిద్ధ భూ తల

వర భూత గణములు హర్ష పరవశమున నా

హరివల్లభునిఁ బొగడినవి 

పరఁగ విజయుఁడై కరమ్ము భండన మందున్    

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందుఁ దొంబది యెనిమిదవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 99.

 

 

 

అంగదుని చేత మహాపార్శ్వుఁడు మరణించుట.

 

 

 

 

కం.

కని సుగ్రీవ నిహతు న

ట్లనిని మహోదరుని నమ్మహాపార్శ్వుఁడు ర

క్త నయనుఁడు బలుఁడు కోప

మ్మున నంగదు భీమ సేన ములికుల నొంచెన్          

  1.  

 

 

 

ఆ.వె.

తొడిమ నుండి పండు సుడిగాలి రాల్చి న

ట్లయ్యసుర వరుండు హరుల సేన

లోన ముఖ్యు లైన వానరుల తలల

రాల్చె నాజి లోనఁ బ్రబల బలుఁడు

  1.  

 

 

 

చం.

శరములు వేసి కొందఱి భుజమ్ములఁ జీల్చెను వానరావళిం

ద్వర పడి గొప్పపార్శ్వుఁడు ప్లవంగులఁ గొందఱి పార్శ్వ భాగముల్

గురుతర మాగ్రహించి పగఁ గోసెను గోయ విసంజ్ఞు లైరి యె

ల్లరు హరు లంది రార్తి సమరమ్మున కంతఁ బరాఙ్ముఖత్వమున్   

  1.  

 

 

 

కం.

కని యుద్విగ్న నిజ బల

మ్మును రాక్షస భంజితమ్ముఁ బోరున నట్లున్

ఘన వేగుఁడు పర్వమ్ముల

వననిధి వలె నంగదుండు వడి నటఁ బెంచెన్     

  1.  

 

 

 

చం.

కరమున నాయసంపుఁ బరిఘప్రవరమ్ము గ్రహించి వేగ వా

నర వరుఁ డంగదుం డలిగి నైరృత వర్యుని పైన వైవఁగా

నరదము నుండి యయ్యసురుఁ డర్దితుఁడై గత సంజ్ఞుఁడై వెసన్  

ధర పయినన్  ససారథి సతాపము గూలె నచేతనుండునై        

  1.  

 

 

 

తే.గీ.

వారిద నిభ యూధము నుండి భల్లుక పతి

కాటుకను బోలు వాఁడు వే కదలి పెద్ద

శిలను బట్టి యశ్వమ్ములఁ జేవఁ జంపెఁ

గినిసి విఱిచె రథమ్మును ఘన బలుండు          

  1.  

 

 

 

ఆ.వె.

అవని నుండి లేచి యంత మహాపార్శ్వుఁ

డొక ముహూర్తముననె యుగ్రుఁ డంగ

దుని ననేక శరములను వేసి బాధించెఁ

దిరిగి మిక్కుటముగ గురు బలుండు     

  1.  

 

 

 

ఉ.

కొట్టెను ఋక్షరాజు ననిఁ గ్రుద్ధుఁ డురమ్మున జాంబవంతునిన్

గట్టిగ మూడు బాణములఁ గాండ చయమ్ముల నా గవాక్షునిం

గొట్టె నిశాచరుం డలుకఁ గొట్ట గవాక్షుని జాంబవంతునిం 

బట్టెను యంగదుండు గని పాణిని నా బరిఘమ్ము క్రుద్ధుఁడై

  1.  

 

 

 

ఉ.

వాలి కుమారుఁ డంగదుఁడు భాస్కర రశ్మి సమప్రభా మహా

భీలము నైన నా గుదియ భీకర రోష విలోచనుండు వే

కేలులఁ బట్టి త్రిప్పి పరికించి సుదూరుని వైచెఁ జంపఁగా 

నాలము నందుఁ గోపమున నయ్యసు రేంద్రుని గొప్పపార్శ్వునిన్     

  1.  

 

 

 

తే.గీ.

అంగదచ్యుత పరిఘమ్ము సంగరమున

రక్కసుని చేతి నుండి శర సహితమ్ము

చాప వరమును నా శిరస్త్రాణముఁ బడ

వైచె వేగమ్ముగఁ బుడమి పైన నంత  

  1.  

 

 

 

కం.

చేరి రయమ్మున వానిని

వీరుఁడు వాలి తనయుండు వేగమ చఱచెన్

ఘోర తలమున సకుండల

మా రక్కసు కణత పయిన నాగ్రహ మడరన్    

  1.  

 

 

 

ఆ.వె.

అమ్మహాద్యుతి సుమహావేగుఁ డమ్మహా

పార్శ్వుఁడు కుపితుండు పన్నుగ నొక

హస్తమున గ్రహించె నతి విపులంపుఁ బ

రశ్వథమ్ము నంత రాక్షసుండు   

  1.  

 

 

 

కం.

తైలమునఁ గడిగి నట్టిది

మేలి యినుప గొడ్డలిని నమేయ బలమునన్ 

వాలి సుతుని పై నసురుఁడు

సాల కినిసి వైచె నంత సంగర మందున్

  1.  

 

 

 

ఆ.వె.

ఎడమ భుజము పైనఁ బడఁగ వేసిన దాని

నంగదుండు మీఱ నాగ్రహమ్ము

తనరి నైపుణమునఁ దప్పించి కొనియెఁ బ

రశ్వథమ్ము నంతఁ బ్లవగ వరుఁడు  

  1.  

 

 

 

తే.గీ.

అంగదుండు వీర వరేణ్యుఁ డాగ్రహించి

మిక్కుటముగఁ దండ్రి సమానుఁ డుక్కు నందు

వజ్ర సంఖాశ నిజ ముష్టి వైరి వీర

దమనుఁ డంత బిగించెను దత్క్షణమ్ము  

  1.  

 

 

 

తే.గీ.

అంగదుండు మర్మజ్ఞుండు చంగున నసు

రేంద్రు వక్షస్స్థలమ్మున నింద్ర వజ్ర

సన్నిభస్పర్శ ముష్టిచేఁ జఱచె బెట్టి

దముగ నమ్మహా పార్శ్వుని దరికి నరిగి    

  1.  

 

 

 

కం.

పగిలెను బిడికిలి పోటున

కు గుండె యసు రోత్తమునకుఁ గుండ వలె వెసన్

విగతప్రాణుఁ డయి నగ

మ్ము గతి మహాపార్శ్వుఁ డంతఁ బోరునఁ గూలెన్   

  1.  

 

 

 

కం.

మరణింప మహాపార్శ్వుఁడు

ధరఁ బడఁ గంపించె సేన తద్దయు నంతన్

దురమున రావణుఁ డయ్యెను

బరమక్రుద్ధుండుగ దశ వక్త్రుం డరయన్  

  1.  

 

 

 

తే.గీ.

అమర సంచయ  సేంద్ర నాదములఁ బోలు

సమద వానర సింహ నాదముల చేత

లంక సాట్టాల గోపుర మింకఁ బగులు

నట్టు లయ్యెను వీక్షింప నపుడు వింత

  1.  

 

 

 

కం.

విని సుర వానర రావము

ల నింద్ర శత్రు వటుల సమరమ్మున  రోష

మ్ము నెగడ భృశమ్ముగ నిలిచె

ననికి సుముఖుఁడై తిరిగి దశాస్యుం డంతన్

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందుఁ దొంబది తొమ్మిదవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 100.

 

 

 

విరూపాక్ష మహోదర మహాపార్శ్వుల మరణమును గాంచి రావణుఁడు కోపోద్రిక్తుఁడై యుద్ధమునకుఁ దలపడ రామ రావణులకు ఘోర యుద్ధము వాటిల్లుట.

 

 

 

 

తే.గీ.

అమ్మహాపార్శ్వుఁడును విరూపాక్షుఁడును మ

హోదరుండును వీరులు యుద్ద మందు

హతులు గాఁగ నావేశింప నాగ్రహమ్ము

రావణుఁడు సూతుఁ బ్రేరేచి రాజు వలికె    

  1.  

 

 

 

ఆ.వె.

మరణ మంది నట్టి మంత్రుల వలని దుః

ఖమ్ము నింక పట్టణమ్ము ముట్ట

డింప నడరిన వగఁ జంపి నేఁ బాపుదు

రామలక్ష్మణులను రణము నందు   

  1.  

 

 

 

సీ.

రణ వనమ్మున నేఁడు రామ వృక్షమును సీతా కుసుమము నుండి వీఁక ఫల మొ

సంగు దాని విరివి శాఖ లనంగ సుగ్రీవుఁడు దుర్ధర్ష కీశ విభుఁడు

జాంబవంతుండు ఋక్ష విభుండు కుముదుండు ద్వివిదుండు మైందుండు ధీర వర్యుఁ 

డంగదుండు యువరా డధిక బలుఁడు గంధమాదనుం డుగ్రుఁడు మారు తాత్మ

 

తే.గీ.

జుఁడు సుషేణుం డితర హరి శూరు లెల్లఁ

దనరు నట్టి దాని వధింతుఁ గనుమ యంచుఁ 

బల్కి రథ ఘోషములు నిండఁ బది దిశలను

రాము నెదిరింప వడి నేఁగె రావణుండు   

  1.  

 

 

 

కం.

ధరణి చలించెను నదులను

గిరులను వనములను గూడి కృత్స్నము నిండం

గ రవమ్ములు భీతిల్లుచుఁ 

గరమ్ము సింహద్విజ మృగ గణములు వాఱెన్   

  1.  

 

 

 

ఉ.

భీమత రాస్త్ర రాజమును వేసెను దామసమున్ గ్రహించి సం

గ్రామము నందు రావణుఁడు కాల్చె వరాస్త్రము వానరావళిన్

భూమినిఁ గూలి రెల్లెడల బోరన లేచె రజమ్ము మిన్నగా

లేమి బలమ్ము సైపరు విరించి యెనర్చిన తామ సాస్త్రమున్   

  1.  

 

 

 

కం.

కని సేనలం దనేకుల

ఘ నాసురేంద్రు శిత శర నికాయములం గూ

ల నవని భగ్నుల వందలు

గ నిలిచె ధృతి రాముఁ డలుకఁ గయ్య మొనర్పన్  

  1.  

 

 

 

.

చూచెను రాక్షసర్షభుఁడు శూరుఁడు దోలి ప్లవంగ సేననున్

వేచిన వాని లక్ష్మణుని వీరునిఁ గూడిన వాని రామునిం

దోఁచుచు నుండ వాసవుని తోడుత విష్ణు వనంగ దుర్జయుం

డై చను వానిఁ దోయజ దళాక్షు నరిందముఁ జాప హస్తునిన్    

  1.  

 

 

 

చం.

కని యట దీర్ఘబాహుఁడు నృకాంతుఁడు లక్ష్మణుఁ డుండఁ దోడుగా

వనచరు లోడి యుండఁగను వచ్చెడు రావణు రాక్షసేంద్రునిన్

మనమున సంతసించి విలు మధ్యను గట్టిగ పట్టి లాగఁ జా

గెను నినదమ్ము సీల్ప భువిఁ గృత్స్నము ఘోరము వేగ వంతమున్  

  1.  

 

 

 

ఆ.వె.

అవనిఁ గూలి రంత నసుర వరేణ్యులు  

వందల కొలఁది దశవక్త్రు బాణ

వేగమున రఘువరు వింటి మ్రోతల నాల

కింప వింత సంతరింప నపుడు

  1.  

 

 

 

కం.

నరవరుల రాజ పుత్రుల

శర పథమున రావణుఁడు దశ వదనుఁడు నిశా

చరుఁ డల శశి సూర్యుల చెం

త రాహువు పగిది వెలింగెఁ దత్సమయమునన్     

  1.  

 

 

 

 

ముం దొనరింప లక్ష్మణుఁడు బోరును దేజిత మార్గణమ్ములం

దొందర వంచి చాపమును దూపులు వేసెను గీల తుల్యముల్

సెందక మున్ను తన్ను నతి శీఘ్రమ రావణుఁ డేసి బాణముల్

కుందక యాకసమ్ముననె కోలల నాపెను వేసి నంతటన్

  1.  

 

 

 

తే.గీ.

ఒక్క బాణమ్మున శరము నొకటి మూటి

నంత మూడింటను బదింట నప్పదింటి

రయము మీఱఁ గూల్చెను వేయ  లక్ష్మణుండు

రావణుండు సూపుచుఁ గర లాఘవమ్ము    

  1.  

 

 

 

తే.గీ.

దాఁటి సౌమిత్రి నంత నా దశ వదనుఁడు

రణ జయుండు సమీపించె రాముని నప

ర గిరి భంగి నిలువఁ గ్రోధ రక్త లోచ

నుండు సంగరమున రావణుండు వేగ

  1.  

 

 

 

ఆ.వె.

చేరి రాఘవేంద్రుఁ జెలఁగి కురిసె శర

వర్ష మతని పైనఁ బంక్తి ముఖుఁడు

రాక్షసేశ్వరుండు రావణుం డడరి ఘో

రముగ బాణ ధారలఁ గని యతఁడు   

  1.  

 

 

 

తే.గీ.

రావ ణాంబక ధారలు రాఘవుండు

వచ్చి పడఁగఁ గైకొనె నంత భల్లములను

దీప్యమాన రోష ఫణి సదృశ విశిఖులఁ

ద్రుంచెఁ దీక్ష్ణ శరమ్ములఁ దూర్ణ మంత       

  1.  

 

 

 

ఆ.వె.

రాఘవుండు మూరి రావణుని పయిన

రావణుండు నడరి రాఘవేంద్రు

పయిఁ బరస్పరమ్ము బాణ వర్షమ్ము గు

రిసిరి వివిధముల విరివిగ నంత   

  1.  

 

 

 

తే.గీ.

కుడి యెడమ లిర్వురుం దిరుగుచు వడివడిఁ 

జిత్ర గతుల గుండ్రముగ విశిఖుల వేగ

మునకు నన్యోన్యము మరల వెనుక కని యొ  

నర్చి రపరాజితు లసుర నర వృషభులు         

  1.  

 

 

 

కం.

ఇరువురు యమాంతక నిభులు

గురుతర రౌద్రులు పఱుపఁగఁ గోలల నెల్లన్

విరివిగను నేక కాలము

న రణము గని భూతములు ఘనముగ భయపడెన్   

  1.  

 

 

 

కం.

గగనము ఘర్మాంతమ్మున

మొగుళుల సతటిత్తుల వలెఁ బోరున నంతం

దగఁ గప్పఁ బడెను దట్ట

మ్ముగ వివిధములైన బాణముల చేత వెసన్    

  1.  

 

 

 

కం.

కనిపించె నభం బప్పుడు

ఘన వేగ సగృధ్రపత్ర కాం డావృష్టిం

గనులకుఁ గిటికీలం గూ

డి నట్లు వేగముగ వేయ డిందక యుభయుల్ 

  1.  

 

 

 

ఆ.వె.

తపనుఁ డస్త గిరికిఁ దరలక మున్న యు

త్థిత ఘనద్వయమ్ము తీరున దివి

నంధకార మయము నమ్ములతో నొన

రించి రక్కజముగ మించి ఘనులు

  1.  

 

 

 

కం.

సంకుల సమరం బయ్యెను

బొంకమ్మునఁ జంప నెంచి పోరుచు నుండం 

గొంకకయ వృత్ర వాసవ

సంకాశ మచింత్య మిం కశక్యము సేరన్     

  1.  

 

 

 

చం.

ఇరువురు గొప్ప ధార్మికులెయిద్దఱు యుద్ధ విశారదుల్ ఘనుల్

వరులు మహాస్త్ర వేత్తలను భండన సంచరితుల్ భృశమ్ముగా

నిరువురు నేఁగి రే గతిని నింపుగ నా గతి బాణ భంగముల్ 

దరలెను వాయు కంపిత నితాంత పయోధి తరంగ భంగినిన్    

  1.  

 

 

 

చం.

నిపుణ కరద్వయుం డడరి నించెను మార్గణ సంచయమ్మునుం

గుపితుఁడు లోక రావణుఁడు క్రూరుఁడు రావణుఁ డాజి లోన నా

నృపవరు ఫాల భాగమున నీల కవేల సమప్రభన్ ఘనుం

డపుడు కలంగఁ డర్క కులుఁ డస్త్ర పరిచ్యుత బాణ పంక్తిచే       

  1.  

 

 

 

ఉ.

పిమ్మట మంత్రముల్ సదివి వీరుఁడు రౌద్ర వరాస్త్ర మింపుగా

నెమ్మి గ్రహించి బాణములు నీరజ నేత్రుఁడు వంచి వింటినిం

గ్రమ్మఁగ నాగ్రహం బెడఁద గ్రక్కున వైచె వరిష్ఠ తేజుఁడే

యమ్మను జాధినాథుఁడు మహాత్ముఁడు రాముఁడు రాక్షసేంద్రుపై   

  1.  

 

 

 

ఉ.

రావణు మేఘ సన్నిభపు రమ్య తనుత్రము నందు నాటఁగా

నే విధి బాధ నీయ వసురేంద్రున కప్పు డవధ్య మౌటచే

భూవరు ముల్కులే రఘు నృపుం డనిఁ దిర్గి రథస్థు నస్త్ర స

త్కోవిదుఁ డస్త్ర రాజమునఁ గ్రూరునిఁ గొట్టె లలాట మందునే   

  1.  

 

 

 

తే.గీ.

పంచ శీర్ష సర్పమ్ముల వంటి యా శ

రములు భేదించి శరముల రావణచ్యు

తముల నిశ్వసించుచుఁ గడు దగ్గి చేవఁ

దూఱిన వవి పుడమి లోనఁ దూర్ణ మంత      

  1.  

 

 

 

తే.గీ.

కూల్చి రాఘ వాస్త్రమ్మును గ్రోధ మూర్చి

తుండు నయి భృశముగ రావణుండు ఘోర

మన్యము నసు రాస్త్రమ్ము మహాస్త్రమును జె

లఁగి ప్రయోగించె నప్పుడు రాముని పయి       

  1.  

 

 

 

ఉ.

కాకుల వ్యాఘ్ర సింహముల గ్రద్దల డేగల నక్క లింకనుం 

బ్రాకట కంక పక్షుల నరణ్యపుఁ గుక్కల మోము లున్నవౌ

భీకర మైన బాణములు పెల్లుగ నైదు ముఖమ్ము లున్నవౌ

యా కనువిన్కు లమ్ములను నాజి దశాస్యుఁడు వేసె నుగ్రుఁడై    

  1.  

 

 

 

తే.గీ.

ఖర వరాహ కుక్కుట శునక మక రాహి

తదిత రాస్య సంయుత బాణ తతుల నేసె

రాముని పయిన మాయావి రావణుండు

నిశ్వసించుచుఁ దేజస్వి నేర్పు మీఱ    

  1.  

 

 

 

కం.

ఆవృతుఁడై సంగరమున

భూవరుఁ డాసుర మహాస్త్ర ముఖ్యమ్మున నా

పావక నిభుఁడు సృజించెను

బావక నామాస్త్రము రఘు వరుఁ డోజ వెసన్  

  1.  

 

 

 

చం.

అనల సమప్రభాస్యముల నమ్ముల సూర్యము ఖాంబకమ్ములం

గనలెడు ధూమకేతు ముఖ కాండము లర్ధ శశీంద్ర వక్త్ర బా

ణ నివహ మింక తారక ఘనగ్రహ వర్ణ విభాసితమ్ములన్

ఘన కన దుల్క వక్త్రములఁ గ్రన్నన వేసెఁ దటిద్రసాభముల్  

  1.  

 

 

 

ఆ.వె.

రాఘ వాస్త్ర విద్ధ రావణ ఘోర శ

రమ్ము లాకసమున లయము లైన

వెల్ల నొక్క త్రుటిని నిలఁగూలె వేల కొ

లంది ముక్క  లయి కలఁగ నసురులు  

  1.  

 

 

 

తే.గీ.

అరసి యక్లిష్ట కర్ముచే నా రఘుపతి

చేతఁ గూలిన యస్త్రమ్ముఁ జేరి రాము

ని ముద మారంగ సుగ్రీవుని సహితమ్ము 

కామ రూపు లార్చిరి ప్లవగ వరు లంత   

  1.  

 

 

 

కం.

బల మడర రావ ణాస్త్రము

ను లలిన్ శాంతింపఁ జేసి నొవ్వక రాముం

డల హర్ష మందెఁ గపి వీ

రు లార్చిరి ముదమ్ము మీఱ రుతులు సెలంగన్

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూఱవ  సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 101.

 

 

 

రామ రావణుల యుద్ధము కొనసాగు చుండఁగ లక్ష్మణుఁడు రావణుని వింటినిఁ ద్రుంప విభీషణుఁడు రావణుని గుఱ్ఱములను వధింప రావణుండు లక్ష్మణుని వక్షముపై శక్తి వేసిన సౌమిత్రి మూర్ఛిల్ల రాముఁడు రావణునితో ఘోరముగ యుద్ధము సేయ భీతిని రావణుఁడు పాఱిపోవుట.

 

 

 

 

కం.

రిత్త యయి పడఁగ నస్త్రం

బత్తఱిఁ గని రావణుఁడు దసాస్యుఁడు కో పా

యత్తుఁ డయి ద్విగుణ మయ్యసు   

రోత్తముఁ డన్యాస్త్ర మూనె నుగ్రుండు వెసన్   

  1.  

 

 

 

చం.

అడరెను వేయ భీకరము నమ్మయ నిర్మిత మన్య మస్త్రమున్ 

వడివడి రాఘవేంద్రు పయి వాలిన క్రుద్ధతఁ గాంతి మంతమున్

వెడలెను వింటి నుండి కడు వెల్గెడు శూల గదాద్యయోగ్రముల్  

దడయక వజ్ర సారములు తారుచు దిక్కుల కన్ని చోట్లకున్  

  1.  

 

 

 

ఆ.వె.

కూట పాశ వజ్ర కోటి ముద్గరములు

వివిధము లవి  బయలు వెడలెఁ దీక్ష్ణ

ములును దీప్తములును విలయ కాలమ్మున

వీచు గాలి వోలె వింత నంత     

  1.  

 

 

 

తే.గీ.

ఉత్త మాస్త్ర కోవిదు లందు నుత్తముండు

రాఘవుండు  గాంధర్వాస్త్ర రాజమున న

డంచె నప్పర మాస్త్రమ్ము నంచితముగ

రామ నిహతాస్త్ర మారసి రావణుండు

  1.  

 

 

 

కం.

కినుకం గన్నుల రాలం

గ నిప్పు లరుణాక్షుఁ డంతఁ గౌణప పతి వే

సెను సౌరాస్త్రమ్ము దశా

ననుండు పరమాస్త్రమును గనలుచు భృశముగన్       

  1.  

 

 

 

చం.

దశముఖు వింటి నుండి త్వరితమ్ముగ వెల్గుచు వచ్చెఁ జక్రముల్

భృశముగ దీప్త చక్రములఁ బెల్లుగ వెల్గె నభోతలం బనిన్  

దిశలను సూర్య చంద్రుల గతిన్ వెలిగింపఁగ  వాని రాముఁ డం

త శిత శరాలిఁ జేసె వెస ధ్వంసము రావణు నాయుధమ్ములన్  

  1.  

 

 

 

తే.గీ.

రిక్త సౌరాస్త్రమును గాంచి రేఁగఁ గినుక

రాక్షసాధిపుం డుగ్రుండు రావణుండు

దశ శరమ్ములు రాముని తనువు నందు

మర్మముల వేసి యడిచెను మనుజ విభుని

  1.  

 

 

 

.వె.

కొట్టఁ బడిన నట్లు ఘోర శరమ్ముల

రావణచ్యుతముల రాఘవుండు

తేజమున ఘనుండు దృఢతఁ గంపింపఁడు

సుంత యేని గొప్ప శూరవరుఁడు  

  1.  

 

 

 

కం.

అంత ర ణాజేయుం డ

త్యంతక్రోధుండునై  దశాననుఁ జింతా

క్రాంతునిఁ జేసెను వేసి య

నంత శర నికాయ మతని యంగము లందున్

  1.  

 

 

 

మత్తకోకిల.

ఇంతలోపల లక్ష్మణుండు నరేంద్రు రాముని సోదరుం

డంతఁ గైకొని సప్త బాణ చయమ్ము శాత్రవ పక్ష వీ

రాంతకుం డతి రోష సంకలి తాత్ముఁ డయ్యసు రేంద్రు దు

ర్దాంతు మానవ మూర్ధ కేతన రత్నముం దునుమాడియున్   

  1.  

 

 

 

ఉ.

సారథి నంత బాణములఁ జంపె సకుండల శీర్ష రాజమున్

వీరుఁడు ద్రుంచి బల్లిదుఁడు పిమ్మట రాక్షస నాథు వింటినిన్

ఘోరముఁ బంచ బాణములఁ గుంజర హస్త నిభమ్ముఁ ద్రెంపఁగా 

నారసి యవ్విభీషణుఁడు నంతట లక్ష్మణ వీరకృత్యమున్   

  1.  

 

 

 

తే.గీ.

ఎగిరి రావణు నీలాంబుద గిరి నిభ వి

రాజమాన సద్ఘోటక వ్రాతమును ద

శాన నానుజ వరుఁడు స్వీయ పటుతర గ

దాయుధమ్మునఁ జంపె నమేయ బలుఁడు   

  1.  

 

 

 

కం.

ఘన వేగవంతుఁడు రయ

మ్మున వీడి హతాశ్వ రథము పోరునఁ గోప

మ్మున రావణుండు గాంచెను

దన తమ్మునిఁ గోప మధికతరముగఁ బెఱిఁగెన్    

  1.  

 

 

 

ఉ.

అంతఁ బ్రతాపవంతుఁడు దశాస్యుఁడు శక్తిని శక్తిమంతమున్

సాంతము దీప్త శక్ర పర మాశని భంగి వెలుంగు దానినిం

బంతముతోడ భ్రాతపయి వైచెను జేరక మున్న దాని ధీ

మంతుఁడు సీల్చె లక్ష్మణుఁడు మర్కటు లార్వఁగ మూడు ముల్కులన్

  1.  

 

 

 

ఆ.వె.

పడెను బుడమి పైనఁ బసిడి మాలల శక్తి

మూడు ముక్క లయి నభో గ తోల్క

ల గమి విస్ఫులింగ రాజితము గగన

తలము వీడి పడు విధమ్ము దోఁప     

  1.  

 

 

 

ఉ.

అంత గ్రహించెఁ గాలునకు నైనను జేరఁగ రాని స్తుత్యముం

గాంతుల వెల్గు దాని దశకంఠుఁడు ఘోరము నన్య శక్తి దు

స్స్వాంతుఁడు బల్లిదుం డది ప్రభారుచులం దగ వెల్గుచుండె న

త్యంతము వేగవంతమును నల్క వహించి యొనర్చె దానినిన్

  1.  

 

 

 

తే.గీ.

ఇంతలోఁ బ్రాణ సంశయ మేర్పడఁగ  వి

భీషణునకు వీక్షించి యా వీర వరుఁడు

లక్ష్మణుం డాదుకొనఁగ శరములు కురిసె

వంచి విల్లు శక్తి కరు రావణుని పైన  

  1.  

 

 

 

తే.గీ.

చిమ్మఁబడ శరౌఘమ్మున నమ్మహాత్ము

చేత దశముఖుఁడు విముఖీ భూత విక్ర

ముం డనుజు విభీషణుఁ దలఁపండు గొట్ట 

గ నపుడు పలికెఁ గాంచి లక్ష్మణుని నిట్లు

  1.  

 

 

 

ఉ.

రావణుఁ డంత రక్షితుని భ్రాతను గాంచి వచించె నిల్చి తా

నా వర వీరు కట్టెదుట నంచిత రీతిని మీఱి కాచితే 

నీ విట వీర్యమాని వయి నెమ్మి విభీషణు వీడి వానినిం

గావున శక్తి నీ పయినిఁ గ్రన్ననఁ గూలును జూడు లక్ష్మణా!

  1.  

 

 

 

తే.గీ.

నెత్తుటి మఱక లున్నట్టి యుత్తమంపు

శక్తి పరిఘ సదృశములు శక్తిమంత

ము లగు నా బాహువుల చేత ముక్తమై చె

లంగి నీ ప్రాణములఁ గొని లక్ష్మణ! చను     

  1.  

 

 

 

చం.

విడిచెను బల్కి యివ్విధము వేగమ యెన్మిది గంట లున్నదౌ

బెడిదపు శక్తి రావణుఁడు పేర్మినిఁ జేయ మయుం డమోఘముం 

దడయక రామసోదరునిఁ దాఁకఁగ ఘోరము మండు దాని నా

యొడయుఁడు దద్ద క్రుద్ధుఁ డయి యుద్ధతి నార్చె ఘనస్వనమ్ములన్    

  1.  

 

 

 

కం.

ఘన వజ్రాశని సదృశ

స్వనము దశాస్యచ్యుతమ్ము శక్తి రణ తల

మ్మున లక్ష్మణు పైకి రయ

మ్మున రాఁ దొడఁగె నపుడు గొలుపుచు భయ మెదలన్       

  1.  

 

 

 

తే.గీ.

వచ్చు చున్న శక్తినిఁ గాంచి పలికె రాముఁ

డిట్లు సౌమిత్రి కగుఁ గాక యింపు స్వస్తి

నీ విచట హతోద్యమవునై నిలుతు గాక

రిత్తవై చనెదవు గాక  యిత్తఱి నిఁక  

  1.  

 

 

 

ఉ.

రావణ ముక్త శక్తి పణి రాణ్నిభ శస్త్రవరం బభీతు నా

ప్రావృత లక్ష్మ ణోరమున వారక మున్గెను వేగవంత మా

శీవిష  జిహ్వ నాఁ దనరి శీఘ్రమ వెల్గుచు గొప్ప కాంతులన్

రావణ వేగ మూలమున లక్ష్మణుఁ డంతట భగ్న వక్షుఁడై

  1.  

 

 

 

తే.గీ.

నాటఁగ సుదూర మా శక్తి నరవరుండు

పుడమి పై వీర్య వంతుండు వడెను జెంత

నున్న రాముఁ డట్టి యవస్థ నన్న గాంచి

యనుజు స్నేహమున విషణ్ణుఁ డయ్యె నెడఁద    

  1.  

 

 

 

తే.గీ.

ఒక్క నిమిషము చింతించి యుగ్రుఁ డయ్యెఁ

బ్రళయ కాలాగ్ని భంగి నరర్షభుండు

భాష్ప లోచనుండు దలంచి వనరఁగ సమ

యమ్ము కాదని కాంచుచు ననుజు నంత

  1.  

 

 

 

ఆ.వె.

తుముల యుద్ధ మాజి దుర్జయుఁ డొనరింపఁ

దొడఁగె నంత రాముఁ డెడఁద నిశ్చ

యించి ఘోరు రాక్షసేంద్రుని వధియింతు  

నెల్ల యత్నము లొనరించి యంచు  

  1.  

 

 

 

ఆ.వె.

శక్తి భిన్న తనుని సర్పయు క్తాచల

సన్నిభు ననుజ వరు సమర మందు

లక్ష్మణుని నరసెను రక్త సిక్తాంగుని

 రాముఁ డార్తితో నరర్షభుండు  

  1.  

 

 

 

చం.

అసురుఁడు క్షిప్ర హస్తుఁడు దశాననుఁ డమ్ములఁ గొట్టుచుండఁగా

విసరుచు రావణాసురుఁడు వేసిన శక్తిని లాగ జాల రా 

యసమ బలాఢ్య వానర గణావలి శ్రేష్ఠులు ఘోర యత్నముల్

వెస నొనరించినం దమిని వీర వరేణ్యులు రావ ణార్దితుల్    

  1.  

 

 

 

తే.గీ.

చొచ్చె నా శక్తి పుడమిని శూరు లక్ష్మ

ణు ఘన వక్షమ్ము ఛేదించుచు ఘన బలుఁడు

రాముఁడు కరద్వయమ్మున లాగి దాని

భయదమును ముక్కలుగఁ జేసెఁ బార్థివుండు

  1.  

 

 

 

ఉ.

లాగుచు నుండ రాఘవుఁడు రావణ హస్త విముక్త శక్తినిన్

వేగమ మర్మభేది శరవృష్టి శరీరమునం గురింపఁ దా

నాఁగఁడు లెక్క సేయఁడు మహాత్ముఁడు కౌఁగిలి నుంచి తమ్మునిన్

బాగుగ గాంచి మారుతుని వానర నాథుని రాముఁ డిట్లనెన్   

  1.  

 

 

 

చం.

నిలువుఁడు చుట్టి మీ రనుజునిం గపి పుంగవు లార! వచ్చె నేఁ

డలరి పరాక్ర మింపుగను నంచిత కాలము మచ్చిరేప్సితం

బిల ఖలు పాపనిశ్చయుని నీ దశవక్త్రు వధింప వానకో

యిలలకు వానకాలమున నింపుగ మేఘము దోఁచు రీతినిన్   

  1.  

 

 

 

ఆ.వె.

ప్రతిన నూని నేను బలుకు చుంటి నిజం బ

చిరము నిశ్చయముగ హరి వరేణ్యు

లార! చూచు వా రరావణ మేని య

రామ మేని కాఁగ భూమి మీరు    

  1.  

 

 

 

చం.

కలిగెను రాజ్య నాశము సకంటక కానన ఘోర వాసముం

గలిగెను దండకా గమన కార్యము దార ఘ నావమానముం

గలిగిన ఘోర దుఃఖమును గయ్యమునన్ వధియించి రావణున్

విలయ మొనర్తు నే నడరి వేగమ యెల్లను రౌర వాభమున్     

  1.  

 

 

 

తే.గీ.

ఎవ్వని కొఱకుఁ దెచ్చితి నీప్లవంగ

సేన సుగ్రీవుఁ జేసితి నేను విభునిఁ

జంపి వాలి వంతెన కట్టి సాగరమ్ము

దాఁటితి నతఁడు గనిపించె మేటి పాపి    

  1.  

 

 

 

తే.గీ.

నాదు దృష్టిఁ బడిన దశాననుఁ డనర్హుఁ

డగును జీవింప దృష్టి విషాహి దృష్టిఁ

బడ్డ వాని వలెను నింక వైనతేయు

దృష్టిఁ బడిన సర్పమ్ము రీతి హరులార!       

  1.  

 

 

 

ఆ.వె.

స్వాస్థ్యమునఁ గనుండు వానర వర్యు లా

రా! యజేయు లార! రామ రావ

ణ సమరమ్ము నిలిచి నగరాజ శిఖరమ్ము

లందు నిబ్బరముగ నలరు చుండి  

  1.  

 

 

 

తే.గీ.

దేవ గంధర్వ చారణ దివ్య ముని యు

తమ్ము ముల్లోకములు నేఁడు నెమ్మి నాజి

నడరు రామ రామత్వమ్ము  నద్భుతమ్ముఁ

గాంచు నిపుడు కనుఁడు ప్లవంగ వరు లార!  

  1.  

 

 

 

చం.

చరములు స్థావరమ్ములును జక్కఁ ద్రిలోకము లందు దేవతా

వరులును సంగరం బయిన భంగిని నెల్లరు కూడి చెప్పు కొం

దు రవని యుండు నంత తఱిఁ దూర్ణ మొనర్తును నేఁడు గాంచుఁడీ

దురమున నట్టి కార్యమును దూల్చెద నాజిని రాక్షసేశ్వరున్      

  1.  

 

 

 

చం.

పలికి రఘూత్తముం డిటుల భర్మ విభూషిత తీక్ష్ణ మార్గణ

మ్ముల దశకంఠుఁ గొట్టె నని మూరి సమాహితుఁడై భృశమ్ముగాఁ

గలఁగి దశాననుండు శిత కాండములన్ ముసలమ్ములన్ ధృతిం

జెలఁగి పయోద ధార లన శీఘ్రమగాఁ గురియించె రాముపై

  1.  

 

 

 

ఆ.వె.

రణ తలమ్ము నందు రామ రావణ ముక్త

శరము లొండొరులను జక్కఁ దాఁకి

కొట్టుకొనుచు నుండ బెట్టిదముగఁ జెల

రేఁగె ఘోర రవము లాఁగకుండ

  1.  

 

 

 

కం.

ధర రామ రావణచ్యుత

శరమ్ము లాకసము నుండి శకలమ్ములునై  

విరివి సెదరి దీప్తాగ్రము

లరయం గూలినవి యెల్ల నాశ్చర్యముగన్  

  1.  

 

 

 

ఆ.వె.

అద్భుతోపమమ్ము లయ్యెను రామ రా

వణుల నారి ధ్వనులు భయ మొసంగ  

సర్వ భూతములకు సమర తలమ్మున

మిక్కుటముగఁ జేయ మేటి బలులు  

  1.  

 

 

 

కం.

శర వృష్టి సిమ్ముచు ధను

ర్ధరుండు బాధింపఁ గరము రఘు వీరుఁడు సం

గరమున వాయు హత ఘన మ

న రావణుఁడు భీతిని స్వజన యుతము వాఱెన్      

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట యొకటవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 102.

 

 

 

మూర్ఛిల్లిన లక్ష్మణుని వీక్షించి రాముఁడు సుషేణునకుఁ జూపి విలపింప నాతని పనుపున హనుమంతుఁ డోషధి గిరిఁ దెచ్చిన సుషేణుఁ డౌషధ మొసంగ లక్ష్మణుఁడు తేఱికొని రావణు వధకై రామునిఁ బ్రోత్సహించుట.   

 

 

 

 

చం.

సమరము నందు శూర వరు శక్తివ రార్దితుఁ గాంచి లక్ష్మణున్

విమలుని రావ ణార్దితునిఁ బెల్లుగ రక్తము నందు మున్గఁగన్

సమర మొసంగి శత్రునకుఁ జల్లుచు రాముఁడు బాణ ధారలం

గుమిలి సుషేణు తోడ రణ కోవిదుఁ డంత వచించె నివ్విధిన్

  1.  

 

 

 

ఉ.

రావణ విక్రమమ్మునను లక్ష్మణుఁ డీతఁడు గూలె నేలపై

వావిరి పెంచి నా వెతను బన్నగ రాజము భంగి నక్కటా

యీ విధిఁ గొట్టుకొంచును మహీతల మందు విసంజ్ఞ నుండ స్వీ

యావరజుండు ప్రాణముల కత్యధికుండు మునింగి నెత్తుటన్    

  1.  

 

 

 

ఉ.

ఏ విధి శక్తి యుక్తుఁడను నిత్తఱి నౌదు రణం బొనర్పఁగా 

నీ వర లక్షణుండు సమరేద్ధ నుతుండు సహోదరుం డహో

చావును జేర ప్రాణముల సౌఖ్యము లందును లాభ మేమి నే

నీ వగ నింక డెందమున నెట్లు భరింతు బలమ్ము రిత్తయే

  1.  

 

 

 

తే.గీ.

ధనువు జాఱుచుండె నిట హస్తమున నుండి

కనులు కన్నీటి మయమయ్యెఁ గాండములు కృ

శించెఁ గలలోనఁ జను మానిసి వలె నంగ

ములు చలించెఁ గలంత ముమూర్ష వుట్టె        

  1.  

 

 

 

తే.గీ.

దుష్ట చిత్త రావణునిచేఁ దూలి నట్టి

తమ్మునిఁ గన మూల్గుచు నుండఁ దగులఁ దనదు   

మర్మభాగమున బయట మసలు ప్రాణ

మనఁగ నత్యధిక ప్రియుని నార్తి సెలఁగె    

  1.  

 

 

 

ఆ.వె.

చూచి యంట దుమ్ము శోకపరాయణుఁ

డయ్యె రాఘవుఁడు ని జానుజునకు

నతి విషాద మెడఁద నావహింప వనరె

మేదినీ విభుండు మిక్కుటముగ     

  1.  

 

 

 

కం.

విజయమ్మునఁ బ్రీతి మనము

న జనింపదు నాకు సుంత నయన విహీనుం

డు జగతిఁ బొందునె హర్షము

ను జంద్రుఁ డుదయింప నింగి నుత వీరుండా      

  1.  

 

 

 

కం.

ఏల రణ మేల ప్రాణం

బాలము రుచియింప నేర దంక తలమునన్

నా లక్ష్మణుండు మూర్ఛం

గూలి పరుండంగ నిట్లు ఘో రావస్థన్   

  1.  

 

 

 

కం.

వన మేఁగెడు నన్నను న

న్ను ననుస రించిన పగిది ననుజ పుంగవు నే

ను ననుసరింతును సౌమి

త్రిని యమ సదనమున కిపుడు ప్రీతి సెలంగన్        

  1.  

 

 

 

తే.గీ.

బంధువులకు నిత్యము ప్రేమఁ బంచు వాఁడు 

ప్రీతి నన్ను నిత్య మనుసరించు వాఁడు

కూట యోధు లసురులచే ఘోర మైన

యీ యవస్థను దాఁ బొందె నిచటఁ గంటె    

  1.  

 

 

 

ఆ.వె.

దేశ దేశముల నతిప్రియ లగు దార

లుంద్రు బంధు జనులు నుర్వి నుంద్రు

దేశ దేశములను దేశముఁ గన నెందు

నుండుఁ దమ్ముఁడు సహజుండు నేను   

  1.  

 

 

 

చం.

వనరుచు నుండ నిప్పగిది బాధను విహ్వలి తేంద్రియుండు జా

లి నెగడఁ గంపితుండు నయి రేఁగఁగ నిశ్వసనమ్ము లత్తఱిన్ 

ఘన కపి యా సుషేణుఁడు నృకాంతునితో ననె నూఱడించుచున్

మినుకుల నిట్టు లింపొదవ మిన్నగ నంతటఁ గాంచి లక్ష్మణున్  

  1.  

 

 

 

ఉ.

కాఁడు మృతుండు భ్రాత యనఘా విను రాఘవ! దీర్ఘ బాహుఁ డు

న్నాఁ డిట లక్ష్మి వర్ధనుఁడు నాటిన శక్తి సజీవుఁడై తగన్

వాడదు సుంత వక్త్రము ప్రభా లయ మింతయు లేదు శ్యామముం

గూడదు గాంచ లక్ష్మణునకుం దను విత్తఱి ధీర పుంగవా!    

  1.  

 

 

 

ఆ.వె.

సుప్రభాయుతమ్ము సుప్రసన్న మతని

యాస్యము పరికింప నక్షు లరయ

సుప్రసన్నములు సుశోభితములు హస్త

ములు సరోజ రక్త తలము లెన్న   

  1.  

 

 

 

కం.

కనిపింపదు రూపమ్ము మృ

తున కివ్విధ మెన్నఁ డేని దుఃఖింపకుమీ

మనమునఁ జిరాయువుల కుం

డు నిట్లు మర్త్యుల కరయ విడు కలఁత నెల్లన్   

  1.  

 

 

 

ఆ.వె.

వీరుఁ డంద లేదు ప్రేతత్వమును లక్ష్మ

ణుండు లక్ష్మివర్ధనుండు ప్రాణ

సహిత మున్నవాఁడు శత్రు వినాశకుం

డనఘ! వీడు శోక మార్య! యింక     

  1.  

 

 

 

తే.గీ.

సడలి నట్టి గాత్రమ్ములఁ బుడమి పైన

నిదుర నుచ్ఛ్వాసముల తోడఁ గదలు చుండి

మాటి మాటికి హృదయమ్ము మనుజ నాథ!

చెప్పుచున్న దీ విషయమ్ము నొప్పిదముగ

  1.  

 

 

 

కం.

అని యిట్లు మహా ప్రాజ్ఞుఁడు

ఘనుఁడు సుషేణుఁడు నరేంద్రు కాకుత్స్థునితో

హనుమంతు సమీపమ్మునఁ

గని చక్కఁగఁ బల్కె నంతఁ గపివరుఁ డిట్లున్    

  1.  

 

 

 

ఉ.

వీర వరేణ్య! సౌమ్య! చని వేగమ మారుత పుత్ర! ఋక్ష రా

జేరిత మౌష ధాద్రికిఁ గపీశ్వర! దక్షిణ శృంగ జాతమున్   

నేరి మహౌషధమ్ము తగు నేర్పున  క్షిప్రము తెమ్ము లక్ష్మణున్

వీరు రుజా విహీనునిగఁ బేర్మినిఁ జేయ నొసంగి దానినిన్           

  1.  

 

 

 

తే.గీ.

వడి వడి విశల్యకరణి సవర్ణకరణి

తరలి సంధానకరణి వాత సమ వేగ!

తెమ్ము సంజీవనిగ నొప్పు దివ్య మైన 

దాని లక్ష్మణు బ్రతికింప వానర వర!      

  1.  

 

 

 

ఆ.వె.

పనుపఁ బడఁగ నిట్లు వాతాత్మజుండు సే

రి తగ నోషధుల గిరిని రయమున

వాని నెఱుఁగ లేక వానర వర్యుఁడు

చింత లోన మునిఁగె శ్రీయుతుండు    

  1.  

 

 

 

ఉ.

మారుతి కంతఁ బుట్టె మతి మానస మందు మహా బలాఢ్య తే

జోరుచి రోగ్ర వీరునకుఁ జోద్యముగా గిరి శృంగ యుక్తమే  

జేరఁగ నొప్పు నంచు నిటఁ జెన్నుగ నోషధు లుండు నంచు నే

నేరుదు నూహఁ జెప్పెఁ గద నెమ్మి సుషేణుఁడు నాకు నట్టులన్

  1.  

 

 

 

ఉ.

నేఁ జనినన్ విశల్యకరణిం గొనకుండ గతింపఁ గాలమే

వే జనియించు దోష మది పెల్లుగ దుఃఖము కల్గు నెన్నఁగాఁ 

దాఁ జని యెంచి యివ్విధము తత్క్షణ మద్రికి మూడు మారులుం 

దేజున నూపి శృంగమును దిట్ట సవృక్షము నెత్తెఁ జేతులన్

  1.  

 

 

 

తే.గీ.

సజల నీల జీమూతమ్ము సరణి నొప్పు

గిరి శిఖరమును బెకలించి హరి వరుండు

నింగి కెగిరి మహా వేగి చంగునఁ బయ

నించి వేగమ్ముగఁ గదిసి యంచితముగ    

  1.  

 

 

 

తే.గీ.

ఉంచి చెంత శృంగము విశ్రమించి సుంత

పల్కెను సుషేణు వీక్షించి పవన సుతుఁడు

నే నెఱుఁగమి నౌషధము మహానగ శిఖ

రమ్ము  కృత్స్నముం దెచ్చితి నెమ్మి నంచు   

  1.  

 

 

 

తే.గీ.

అనఁగ వానిని కీర్తించి హనమ నంత

నా సుషేణుండు గైకొనె నౌషధమును

సురలకును దుష్కరం బగు హరి వరేణ్యు

పనిని వీక్షించి యాశ్చర్య పడిరి హరులు    

  1.  

 

 

 

ఆ.వె.

వాన రోత్తముండు దాని నలఁగఁ గొట్టి

యా సుషేణుఁ డమ్మహా ప్రభా యు

తుండు ముక్కు లోనఁ బిండె నౌషధమును

లక్ష్మి వర్ధనుఁ డగు లక్ష్మణునకు   

  1.  

 

 

 

తే.గీ.

శల్య సహితుండు సౌమిత్రి శల్య రహితుఁ

డయ్యెఁ బీల్చి పరందముఁ డంత మందు

రోగ మెల్ల నశింపఁగ వేగ లేచెఁ

బుడమి నుండి ప్లవంగుల కడర ముదము

  1.  

 

 

 

చం.

ప్లవగులు గాంచి యుత్థితుని లక్ష్మణుఁ బల్కిరి సాధు సాధు వం

చు వర హరిన్ సుషేణు నటఁ జూచి స్తుతించిరి సంతసిల్లి తా

నవరజు రమ్ము రమ్మనుచు నన్న రఘూత్తముఁ డంతఁ గంట నీ

రు వఱలఁ గౌఁగిలించె నృవరుండు సహోదరుఁ బ్రీతి రేఁగఁగన్

  1.  

 

 

 

ఆ.వె.

తమిఁ బరిష్వజించి తమ్మునితో ననె

భాగ్యవశము చేత భ్రాత! నిన్ను

గంటి తిరిగి రాఁగ నంటి మృత్యువు నిట్లు

నీవు లక్ష్మణుండ! నేను బ్రీతి   

  1.  

 

 

 

ఆ.వె.

సీత వలన జయము జీవితమ్ముల నే ప్ర

యోజనమ్ము నాకు నుండ దయ్య! 

పడసిన నిఁక నీవు పంచత్వమును వీని

వలన నర్థ మేమి భ్రాత! చెపుమ     

  1.  

 

 

 

కం.

పలుకుచు నుండ మహాత్ముఁ డి

టుల రాముఁడు పురుష వర్యుఁడు శిథిల వచన

మ్ముల నా లక్ష్మణుఁ డప్పుడు

పలుకఁ దొడఁగె నిట్టు లర్థ వంతములు వెసన్         

  1.  

 

 

 

తే.గీ.

మున్ను సత్యపరాక్రమ! మూరి ప్రతిన

సలిపి యిట్లు తేలికగ నసత్త్వు పగిది

పలుక నీ వర్హుఁడవు గాదు పన్నుగఁ బరి

కింప రాఘవేంద్ర యెదఁ జింతింపు సుంత

  1.  

 

 

 

తే.గీ.

వమ్ము సేయరు చేసిన ప్రతిన నేరు 

సత్య వచను లెన్నండైన శపథ పాల

నమ్ము పరికింప గొప్పతనమ్మున కిల 

లక్షణ మగుఁ గాదె  సతమ్ము రాఘవేంద్ర!   

  1.  

 

 

 

ఆ.వె.

నర వరేణ్య! యిట్లు నైరాశ్యమును నా కొ

ఱకు నయి నెడఁదఁ బడయకుమ రావ

ణుని వధించి సమరమునఁ బరిపాలించు

నీదు ప్రతిన నేఁడు నీరజాక్ష!     

  1.  

 

 

 

ఆ.వె.

వాడి దంష్ట్ర లున్న పంచాస్య మడరి గ

ర్జించు చుండ గజము పంచ సేరి 

బ్రతుక లేని పగిది రామ! నీ శర గతిఁ  

బడి యరి చనలేఁడు ప్రాణములను    

  1.  

 

 

 

కం.

దినకరుఁ డస్తాద్రిఁ గనక

మునుపు రఘుకు లాబ్ధి చంద్ర! పూరిత కర్ముం

డు నయి దురాత్ముని పౌల

స్త్యుని వధ నేఁ గోరుకొందుఁ దూర్ణముగ నిటన్

  1.  

 

 

 

తే.గీ.

క్రూరు రావణుని వధింపఁ గోరి తేని

వీర! నీ భాషఁ బాలింపఁ గోరి తేని

నీ రమణ నృప సుతఁ బొందఁ గోరి తేని

యార్య! నా మాట మన్నింపు మడరి నేఁడు

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట రెండవ  సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 103.

 

 

 

ఇంద్రుఁడు ధనుర్బాణ శక్తులను రథమును సారథి మాతలితోఁ బంపిన రాముఁడు  రథము నధిరోహించి రావణునితో యుద్ధము సేయుట.  

 

 

 

 

కం.

విని లక్ష్మ ణోక్త  వాక్యము

లను బర వీరఘ్నుఁ డంత రఘు పుంగవుఁ డా

ఘన వీరుఁడు వెస సంధిం

చెను గైకొని కార్ముకము విశిఖ వరములతో      

  1.  

 

 

 

చం.

శరములు రావ ణార్థముగ శత్రు చయఘ్నుఁడు రాఘవుండు వే

సె రణము నందు ఘోరములఁ జెన్నుగ నన్య రథమ్ము నూని యా

సుర గణ వల్లభుండు వడి సూర్యుని మార్కొను రాహువో యనం

బరువిడి రావణుండు శిత బాణము లేసెను రాఘ వేంద్రుపై    

  1.  

 

 

 

తే.గీ.

రథము నందుండి వేయ వజ్ర నిభ శరము

లద్రి పై ధారలు కురించు నభ్రము వలె

రావణుండు రాముని పైన రాముఁ డగ్ని

నిభ శరమ్ములు వేసె వాని పయిఁ గినిసి         

  1.  

 

 

 

ఉ.

రావణుఁ డుండఁ దేరు పయి రాముఁడు నిల్వఁగ నేల పైననున్

భూవరుఁ డెట్లగున్ సమము పో రిట నంచును దేవగాయనుల్

దేవత లింక కిన్నరులు ధీవరు లెల్లరు పల్కుచుండఁగా

దేవ విభుండు వజ్రి విని తియ్యని పల్కులు పిల్చి మాతలిన్   

  1.  

 

 

 

ఉ.

నా రథ మెక్కి భూమి పయినం దగ నిల్చిన ధార్మికోత్తమున్ 

వీరు రఘూత్తముం గదిసి వేగమ యేఁగి యొనర్పు మాతలీ!

సారథి! దేవతా హితము సక్కఁగ నం చన నాలకించి యా

ధీరుఁడు సేసి వందనము దేవపతిం గని పల్కె నివ్విధిన్    

  1.  

 

 

 

తే.గీ.

శీఘ్ర మేఁగెద దేవేంద్ర! చేయుదుఁ దగ

నేను సారథ్యమును పచ్చని హయములను

గూర్చి స్యందనోత్తమమునఁ గూర్మి తోడ

రామ రావణ భీకర రణము నందు   

  1.  

 

 

 

సీ.

అంత పసిడి మయ మంగమ్ము చిఱుగంట లుండ వంద లడరి యుదయ భాను

భంగిఁ జెలఁగుచున్న వైడూర్య మయ కూబరం బుండ సిత చామరముల నడరు

కాంచన భూషిత గంధర్వములు సూర్య సదృశములు హరులు స్వర్ణ వేణు

సద్ధ్వజ మడరంగ శక్ర రథ మడర దానిపై నెక్కి మాతలి సురేంద్రు

 

ఆ.వె.

సారథి యనుపంగ శక్రుండు దివి నుండి

వేగ యవతరించి వీర వర్యుఁ

గదిసి సంభ్రమమునఁ గాకుత్స్థుని నమస్క

రించి పలికె నిట్టు లంచితముగ

  1.  

 

 

 

కం.

మునికోల తోడ స్యందన

మున నిలిచి మొగిడ్చి హస్తములు రామ! సహ

స్రనయనుఁ డిచ్చెను రథమును

మనుజేంద్ర! విజయము కొఱకు మన్నన తోడన్

  1.  

 

 

 

ఆ.వె.

ఇది మహేంద్రు చాప మిది కవచం బగ్ని

సన్నిభమ్ము  సూర్య సదృశ శరము

లివి విమలము తీక్ష్ణ మిది ఘోరతర శక్తి

యింద్ర దత్తము లివి యెలమిఁ గొనుమ

  1.  

 

 

 

ఆ.వె.

ఎక్కు మీ రథమ్ము రక్కసు రావణుఁ

జంపు నేను నిలువ సారథిగను

వీర! రాజ వర్య! వేగముగ మహేంద్రుఁ

డాజి దాన వాలి నణఁచి నట్లు   

  1.  

 

 

 

కం.

అన నిట్లాతఁడు విని తే

రునకుఁ బ్రదక్షిణము నరవరుఁ డొనర్చి స భ

క్తి నమస్కరించి యెక్కెను

దన తను కాంతుల జగములు తద్ద వెలుఁగఁగన్   

  1.  

 

 

 

కం.

జరిగె గగుర్పొడుచు తుముల

తర రణము మహాభుజుఁ డగు దాశరథికి భూ

వరునకు రక్షో జనపతి

కి రావణున కప్పుడు సెలఁగి కఠోరముగన్   

  1.  

 

 

 

తే.గీ.

అంత గాంధర్వ దైవ నామాస్త్రములు ద

శాన నుండు సంధించి వేయంగఁ గినిసి

మూరి గాంధర్వ దైవాస్త్రములను వేసి

రాముఁ డస్త్ర వేత్త యడంచె రణము నందు   

  1.  

 

 

 

ఉ.

ఘోరము రాక్ష సాస్త్రమును గ్రుద్ధుఁడు రావణుఁ డంత రక్కసుం

డా రఘు వీర వర్యుని మహాత్ముని పై విడువంగఁ దిర్గి యా

వీరు దనుస్సు నుండి తగ వెల్వడి శ్రీ యుత సర్పరాసులై

యా రఘు రాము పైకి వెస నాజిని నుర్కెఁ బసిండి బాణముల్      

  1.  

 

 

 

ఉ.

కక్కుచు నోళ్ల మంటలను గాంతి మదాననముల్ వెలుంగఁగా

మిక్కిలి విప్పి యాస్యముల మీఱి భయం బిడ రాఘవేంద్రుపై

గ్రక్కున దూఁకఁ జాగెఁ బడగల్ గడు వెల్గఁగ నావరించుచున్

దిక్కుల నెల్ల వాసుకి విధిం దమ స్పర్శ సెలంగ సర్పముల్       

  1.  

 

 

 

కం.

కని యా సర్ప సమూహముఁ

జనుదెంచుచు నుండఁ బైకిఁ జయ్యన నంతన్

మనుజేంద్రుఁ డేసెఁ గోప

మ్మున ఘన గారుత్మతాస్త్రమును భయదమ్మున్   

  1.  

 

 

 

ఉ.

పుట్టి నరేంద్రు చాపమున భూరి శరమ్ములు వోల్ప వహ్ను ల

ప్పట్టున నంతఁ గాంచన సుపర్ణులు నై ఫణి కాయ శత్రువుల్

కిట్టి శ రాహి జాలమును గృత్స్నము ద్రుంచె మహాజవమ్మునుం

బట్టి సుపర్ణ రూపములు బాణవరమ్ములు కామరూపులున్

  1.  

 

 

 

కం.

ప్రతిహతము కా ని జాస్త్రం

బతి రోషుండై శరౌఘ మంతట రక్షః

పతి కురిసెను ఘోరమ్మును

వితతమ్ముగ దుర్జయ రఘు వీరుని పైనన్   

  1.  

 

 

 

కం.

శర వర సహస్రముల నా

నరేంద్రు నక్లిష్టకారి నలిపెట్టి శిఖుల్

విరివిగ వేయుచు మాతలి

సురేంద్రు సారథినిఁ గొట్టె శూరుం డలుకన్   

  1.  

 

 

 

తే.గీ.

అంత గుఱి సూచి కాంచన మాధ్వజమ్ము

నొక్క యమ్మునఁ బడవైచి చక్క రథము

నుండి యరదము పయి రావణుండు బాణ

నిచయమునఁ గొట్టె నమరేంద్రుని హయములను   

  1.  

 

 

 

తే.గీ.

అద్దురాత్ము రావణు కర్మ మట్టు లడరఁ

గాంచి చారణ గంధర్వ సంచయమ్ము

దానవులఁ గూడి మిక్కిలి తల్ల డిల్లె 

నుల్లముల నిండఁగ నతిశయిల్లి చింత

  1.  

 

 

 

తే.గీ.

చూచి యార్తుని రాముని శోకమున ము

నింగిరి ఋషులు సిద్ధు లనేక  కపులు

రావ ణానుజునిం గూడి రావణుఁ డను

రాహు వడరుచుఁ గబలింప రామ చంద్రు    

  1.  

 

 

 

కం.

బుధుఁ డాక్రమించె రోహిణి

విధి దైవతమును హిమకరు ప్రియ నశుభ మొసం

గు ధరా జనుల కని తెలుపు

విధమ్ముగ నపుడు కడింది వింత జనింపన్

  1.  

 

 

 

కం.

కడలి పొగఁ గూడిన యలల

నడరి జ్వలించెడు విధమున నర్కుని వెసఁ దాఁ

కెడు భంగిని నుప్పొంగెను

గడు రోషం బావహింప గ్రక్కున నంతన్     

  1.  

 

 

 

కం.

అసివర్ణుఁడు సుపరుషుఁడు ది

వసకరుఁ డతి మంద రశ్మి భానుఁ డగపడెన్

దెస నడరి యుండ మొండెము 

మసల నపుడు  దోఁక చుక్క మరలక చెంతన్          

  1.  

 

 

 

ఆ.వె.

కోస లాధిపతుల కూర్మి నక్షత్రముఁ 

దరణి వహ్ని దైవతమ్ముఁ జారు

తర విశాఖ యనెడు తార నంగారకుం

డాక్రమించి నిలిచె నంబరమున   

  1.  

 

 

 

కం.

కనిపించె దశగ్రీవుఁడు

తన యిరువది భుజము లెల్లఁ దనరుచు నుండన్   

ధనువును ధరింప మైనా

క నగము వలె రావణుండు గంభీరముగన్

  1.  

 

 

 

కం.

వారితుఁడై రాముఁడు భృశ

మా రాక్షస నాథుచే మహాత్ముఁడు ఘోరం

బౌ రణ భూమిని శరముల

నా  రాఘవుఁ డేయఁ జాలఁ డత్తఱి నకటా   

  1.  

 

 

 

కం.

కనుబొమలు ముడిచి సంర

క్త నయనుఁ డై క్రోధ మూనెఁ గాకుత్స్థుం డం

త నిజాంబకముల నప్ప

ట్టునఁ గాల్చు విధమ్ము రాముఁడు భృశముగ నటన్          

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట మూడవ  సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 104.

 

 

 

ఆకసమున దేవ గరుడ గంధర్వాదులు చూచు చుండ రామ రావణ ఘోర యుద్ధము కొనసాగుట.

 

 

 

 

కం.

భూతము లెల్లను ద్రాసం

బాతత మందె రఘునాథు నాగ్రహ వదనం

బా తఱి వీక్షింపంగన్    

భూతల మెల్లఁ జలియించె బోరన నంతన్   

  1.  

 

 

 

ఆ.వె.

సంచలించె సింహ శార్దూల చలిత వృ

క్ష చయ సంయుతమ్ము శైల వరము 

సాగరమ్ము గాంచ సంక్షోభి తంబయ్యె

రక్త లోచను గని రాఘవేంద్రు

  1.  

 

 

 

ఆ.వె.

ఖగములు ఘనములు గగన మందు ఖర తర

ఘోష లడర దుశ్శకునము లనఁగ

నెల్లెడలను దల్లడిల్ల నుల్లమ్ములు  

తిరుగు చున్న వెల్లఁ దెల్లముగను  

  1.  

 

 

 

కం.

కని పరమ రోషు రాఘవు

ని నింక నతి దారుణ మగు నిఖి లోత్పా తా

లిని భీతిలె భూతమ్ములు

ఘన భయ మొదవెను మది దశకంఠున కంతన్  

  1.  

 

 

 

తే.గీ.

భీమ నానాయుధమ్ముల వీర వరులు

పోరఁ బ్రళయ కాల రణము మూరి కనిరి

ఋషులు దేవ గంధర్వ ఫణీంద్ర దైత్య

దానవులు విమానముల నభాన గరుడి   

  1.  

 

 

 

కం.

పలికిరి సు రాసురు లపుడు

కలహించుచు నొండొరులను గయ్య మరయుచుం

జెలరేఁగ భక్తి హర్ష

మ్ములు భృశముగ నంత డెందముల నిబ్భంగిన్   

  1.  

 

 

 

 

 

 

తే.గీ.

చక్క నిలిచి యసురు లెల్ల జయము నందు

నాజి దశవక్త్రుఁ డని పల్క నపుడు సురలు

నీవు నెగ్గుమ రాఘవ! నెమ్మి ననుచు

మాటి మాటికిఁ బల్కిరి మాట లిట్లు       

  1.  

 

 

 

ఉ.

కోపము చేత రాము నెడఁ గ్రూరుఁడు దుష్టుఁడు రాక్షసేంద్రుఁ డా

టోపమునన్ గ్రహించెను బటుత్వపు టాయుధ మంతలోన య

ద్రూపము శృంగ సన్నిభమొ తూర్ణము దానిని ఘోర నాదముం

జూపఱ కార్తి నిచ్చు శిత శూలము రౌద్రము వజ్రసారమున్  

  1.  

 

 

 

తే.గీ.

శత్రు చయ నాశమును ధూమ సహిత వహ్ని

నిభ శిఖిని రౌద్రమును యమునికి దురాస

దమ్ము భూత సంచయ భయదమ్ము దార

ణమ్ము భేదనమ్ము నిజ కరమ్మునఁ గొనె   

  1.  

 

 

 

ఆ.వె.

మండు నట్టు లున్న మహిత శూలమ్మును

మధ్యఁ బట్టె నయ్యమర రిపుండు

సమర శూర వరులు చక్కఁ దనను జుట్టి

యుండఁగా ననేకు లుగ్రుఁ డడరి   

  1.  

 

 

 

ఉ.

ఎత్తి మహాశరీరుఁ డసురేంద్రుఁడు శూలము  భైరవమ్ముగా

నత్తఱి నార్చె రక్తకలితాక్షుఁడు హర్షము నంద రాక్షసుల్

మొత్తము భూమి యాకసము మూలలు  దిక్కులు పిక్కటిల్లఁగాఁ

గ్రొత్తగఁ గంప మందినవి ఘోర తరమ్ముగ వాని గర్జకున్      

  1.  

 

 

 

కం.

అతి దుష్టాత్ముని రావణు 

నతి నాదుని నాదము విని యఖి లావని భూ

త తతి భయపడె భృశముగ వి

తతముగ క్షోభించెఁ గడలి ధ్వానం బడరన్

  1.  

 

 

 

చం.

పలికెను రాక్షసాధిపుఁడు పన్నుగ శూలము నెత్తి యిట్లు దో

ర్బల గత ఘోర దర్పితుఁడు భాతృ సహాయుఁడ! చూడు శూలమున్

సలలిత వజ్రసారము భృశమ్ముగ నేఁ డిది నీదు ప్రాణముల్

కలనునఁ దీయు వేగ దశకంఠ మహోగ్ర కరచ్యుతమ్మునై      

  1.  

 

 

 

తే.గీ.

నిన్ను జంపి రణశ్లాఘి! నే నొనర్తు

నేఁడు  సేనా ముఖమ్మున నిన్ను  నసుర

శూరులకు రణ హతులకుఁ జూడు బలిమి

నెల్లరకు సమానునిగను గల్ల కాదు   

  1.  

 

 

 

కం.

నిలు రాఘవ! యీ శూలము

న లీలఁ జంపుదు నిను వచనము లిట్లని తా

బలమున విసరెను శూలము 

ఖలుఁ డా రాక్షస విభుండు కాకుత్స్థునిపై

  1.  

 

 

 

ఆ.వె.

రావణ కర ముక్త రౌద్ర శూల మశని

ప్రభల గంట లుండ రంజిలుచు నె

నిమిది ఘోరము లగు నిస్వనమ్ములఁ జేరి

విన్ను నంచితముగ వెల్గె నపుడు  

  1.  

 

 

 

శా.

శూలమ్ముం గని రాఘవుండు వెస రక్షోనాథ ముక్తమ్ము నా

భీ లాగ్రమ్మును మండు చుండఁగను నా వీరుండు ఘోరమ్మునున్

మేలౌ వింటిని వంచి బాణ తతినిం బెల్లేసె వారింపఁగా

నాలం బందు యుగాంత వహ్ని హరి నీరౌఘమ్మునన్ భంగినిన్    

  1.  

 

 

 

తే.గీ.

రామ కర ముక్త మార్గణ రాశి నెల్ల

రావణుని మహా శూలము రణమున దహి

యించె శీఘ్రముగఁ బతంగ సంచయమ్ము

నగ్ని చెలరేఁగి వెసఁ గాల్చు నట్టు లంత    

  1.  

 

 

 

కం.

కని యా శరముల శూల

మ్మునఁ బొడి యయి మాఱ నంత బూడిదగ నభ

మ్మున రాముఁ డూనెఁ గోప

మ్ము నెదఁ బ్రళయ కాల రుద్రుఁ బోలె రణమునన్    

  1.  

 

 

 

తే.గీ.

అతఁడు మాతలి తెచ్చిన యమర నాథ

సమ్మతమ్మును శక్తిఁ గ్రోధమ్ము మీఱఁ

గదలుప వెలిఁగించె నది నాకసము గంట

ల ధ్వను లడర యుగాం తోల్కల వలెఁ బ్రభల     

  1.  

 

 

 

ఆ.వె.

విసర శక్తి నట్లు వీరుఁడు రాఘవుఁ

డసుర విభుని శూల మందుఁ బడెను

బడఁగ శక్తి శూల వరము భగ్న మయి కాం

తు లణఁగ ధరఁ గూలె దొర్లు చుండి

  1.  

 

 

 

చం.

శరముల వేగ వంతములఁ జంపెను రావణు ఘోటకమ్ములన్

గురుతర వేగ వాజులను ఘోర శితాలి నజిహ్మగమ్ములన్

శరములు రాక్షసేశ్వరు విశాలపు ఱొమ్మున నాటి పెక్కు లం

త రఘు వరుండు ఫాలమున దారుణ పత్రులు నాటె మూడిటిన్   

  1.  

 

 

 

తే.గీ.

బాణ భిన్నావయవ తప్త వపుఁడు రక్త

సిక్త స్వీయేంద్రియుఁడు ప్రకాశించె వృక్ష

సంచయస్థ ఫుల్లాశోక సాల భంగి

రాక్షసేశ్వరుం డాజిని రావణుండు    

  1.  

 

 

 

కం.

రామ శ రార్త ని జాంగుఁడు

భీమ నిశాచరుఁడు రక్త ఫేనార్ద్రుఁడు దుః

ఖామేయక్రోధమ్ముల

నా మనుజాశనుల మధ్య నందె నెడందన్  

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట నాలుగవ  సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 105.

 

 

 

మహోగ్రుండైన రాముఁడు జనస్థానమున సీతాపహరణము కుత్సిత కర్మ మొనరించి నందులకు నిందించి శస్త్రాస్త్రముల మిక్కిలి బాధింప నలసి నిశ్చేష్టుఁడై యుండ రావణుని సారథి రావణుని సమర తలము నుండి గొనిపోవుట.  

 

 

 

 

కం.

కినిసిన కాకుత్స్థునిచే

ననిలో ఘో రార్దితుఁ డయి యధికక్రోధ

మ్మును సమరశ్లాఘి దశా

ననుండు రావణుఁ డెడంద నైరృతుఁ డూనెన్  

  1.  

 

 

 

చం.

కను లవి కిన్క నెఱ్ఱఁ బడఁ గార్ముక మూని దశాననుండు రా

ముని రణ మందు నింపి వెయి ముల్కుల ధారను నింగి నున్న యా

ఘన మది తోయ ధారలను గ్రన్నన దొర్వును నింపు భంగినిన్

మనుజ వరేణ్యు వీరు సుర మాన్యుఁ గలంచెను మిక్కుటమ్ముగన్     

  1.  

 

 

 

ఆ.వె.

పోరున శర పంక్తిఁ బూరింపఁ బడియు ధ

నుర్వరచ్యుతములను గదలింప

రాని శైల మనఁగ రాముఁడు కంపింప

నేరఁ డింత యేని వీర వరుఁడు     

  1.  

 

 

 

కం.

నిలిచి సమర మందు మహా

బలుండు కాకుత్స్థుఁ డడరి వారించె శర

మ్ములఁ బఱిపి బాణ జాలము

ములికలను దినేశు కిరణము లన సహించెన్   

  1.  

 

 

 

కం.

శరములు సహస్రములు వే

సె రాముని యురమ్ము నందు క్షిప్ర కరుం డై

న రణశ్లాఘి దశాస్యుం

డు రావణుండు ఘన రోషుఁడు నిశాటుఁ డనిన్

  1.  

 

 

 

ఆ.వె.

రణము నందుఁ దడిసి రక్త మందు భృశము

లక్ష్మణాగ్రజుం డరణ్య మందుఁ 

బూసి నట్టి గొప్ప మోదుగు చెట్టు వో

లె నగపడె ఘనుండు మనుజ విభుఁడు     

  1.  

 

 

 

మ.

శర జాలార్త  సుసంభ్రమమ్మునఁ గొనెన్  శల్యాలిఁ గాకుత్స్థుఁ డా

నర శార్దూలుఁడు కల్ప భాస్కర సమానద్యోత తేజస్వి యి

ర్వురు యుద్ధమ్మున రామ రావణులు వీరుల్ మార్గణధ్వాంత మం

దరయం జాలరె యొక్కరొక్కరిని బాణౌఘమ్ము లేపారఁగా      

  1.  

 

 

 

కం.

అంతం గ్రోధావిష్ట ని

జాంతఃకరణుండు నగుచు నాతని రక్షః

కాంతుఁ గని రాముఁడు పరుష

వంత వచనములు వచించెఁ బన్నుగ నిట్లున్  

  1.  

 

 

 

ఉ.

నే నెఱుఁగంగ రాని గతి నీచుఁడ నా సతిఁ దెచ్చితే జన

స్థానము నుండి యా వివశ జానకి వీరుఁడ వెట్టు లౌదువే

దీనను నుండ నయ్యటవి దేవిని భర్తృ విదూరనే బలం

బూని కొనంగ శూరునిగ నుద్ధతి నెంతువె రాక్ష సాధమా!

  1.  

 

 

 

ఆ.వె.

స్త్రీల యందు నింక దీన లనాథ లం

దకట కాపురుషులు నధము లొనరు

చు పనిఁ జేసి నేను శూరుఁడ నని పర

దార హర్త! శూర! తలఁతె నీవు

  1.  

 

 

 

ఆ.వె.

కట్టుపాట్ల నణఁచి పెట్టి చని చెడు దా

రిఁ ద్యజియించి సిగ్గు రిత్త మృత్యు

వుఁ గొని సరస నుంచి తగ శూరుఁడను నే న

ని మది నకట తలఁతె నిన్ను నీవు    

  1.  

 

 

 

తే.గీ.

చేయఁబడె గొప్ప కార్య మమేయ యశము

నిచ్చు శ్లాఘనీయమ్ము నహీన మైన

యట్టిది  ధనదు భ్రాతచే నసుర సైన్య

మున్న నీ చేత శూరుచే మిన్నగాను

  1.  

 

 

 

ఆ.వె.

నింద్య మహిత మైన నీ చేత గర్వము

న నొనరింపఁ బడ్డ పనికి గొప్ప

ఫలము నేఁడు నీవు పన్నుగఁ బొందుమ

తప్ప కిప్పు డింకఁ ద్వరిత గతిని   

  1.  

 

 

 

ఆ.వె.

నేను శూరుఁడ నని నిన్ను నీవు తలంచు

చుందు వెడఁద నెపుడు చోద్యముగను

దొంగ వోలె సీత దొంగిలించితి వీవు

లేదు సిగ్గు నీకు నో దురాత్మ!   

  1.  

 

 

 

కం.

నా సన్నిధి నీ చే సీ

తా సతి యవమాన మంది తపియించినచో

నా సాయకముల నిహతుఁడ

వై సోదరుఁ గాంచు వాఁడ వౌదువు ఖరునిన్     

  1.  

 

 

 

ఆ.వె.

దైవ వశము చేత నీ విట్లు నా కంటఁ

బడితి దుష్ట చిత్త! పంపు వాఁడ

నేఁడు శరము లేసి  నిన్ను దీక్ష్ణమ్ములు

యముని యింటికి నసురాధమ! నిలు     

  1.  

 

 

 

తే.గీ.

ఈడ్చుఁ గ్రవ్యాదము లడరి యిపుడు కుండ

లమ్ముల వెలుంగు నీదు శిరమ్ము నాదు

వాడి శరముల ఛిన్నమై పడఁగ దుమ్ము

లోన దొర్లంగ రణభూమి  నానఁ గోరి       

  1.  

 

 

 

ఆ.వె.

నేలఁ గూల నీవు వ్రాలి గృధ్రమ్ములు

నీదు ఱొమ్ము పైన నాదు బాణ

శల్య సంచయమున స్రవియించు నీ రుధి

రమ్ముఁ ద్రాఁగుఁ గాక నెమ్మి నేఁడు  

  1.  

 

 

 

తే.గీ.

మచ్ఛరాలి భిన్నాంగునిఁ దుచ్ఛు విగత

జీవునిఁ బతితుఁ బక్షులు సేరి లాగు

గాక ప్రేవుల నెల్లను గరుడి సర్ప

ములను జెలరేఁగి లాగు నట్టుల నడరుచు       

  1.  

 

 

 

చం.

పలుకుచు నిట్లు రాఘవుఁడు వైరి చయఘ్నుఁడు చెంత నున్న యా

ఖలు నసు రేంద్రు ముంచె విశిఖమ్ముల వర్షము నందుఁ గ్రుద్ధతం

గలనునఁ గోర వైరి దశకంఠ వధమ్మును  వీర్య విక్రమ

మ్ములు ముద మస్త్ర రాశి బలమున్ ద్విగుణమ్ములు నయ్యె నత్తఱిన్   

  1.  

 

 

 

కం.

స్ఫురియించె మహాస్త్రమ్ములు

విరిసె నెడఁద సంతసమ్ము విదితాత్మునకున్

గురు తేజస్వికిఁ బెరిఁగెను

గర లాఘవ మత్యధికము కాకుత్స్థునకున్    

  1.  

 

 

 

కం.

తన లోని శుభ నిమిత్తము

ల నెఱిఁగి యసురాంతకుండు రాముం డంతన్

ఘనముగఁ బీడించెఁ దిరిగి

మనుజేంద్రుఁడు రావణుని సమరతల మందున్       

  1.  

 

 

 

తే.గీ.

హరి వరుల శిలావర్ష మడరఁగ రామ

బాణ వర్షము మీఱ రావణుఁడు పీడి

తుండునై విచలిత హృదయుండు నయ్యె

భృశతరము దశగ్రీవుండు వీర వరుఁడు     

  1.  

 

 

 

ఆ.వె.

అంతరాత్మ సెంద వ్యాకులం బప్పుడు

శస్త్ర వరము లేయఁ జాలకుండెఁ 

జాప వరము నైన సంధింపఁ జాలండు

ప్రతిఘటింపఁ డతఁడు రామ బలము   

  1.  

 

 

 

ఆ.వె.

కదియ నంత మృత్యు కాలము రాక్షస 

విభుఁడు వేగ మడర విసరి నట్టి 

శరము లైన వివిధ శస్త్రమ్ము లైన ర

ణార్థము నట రిత్త లయ్యె నెల్ల  

  1.  

 

 

 

కం.

అసురేంద్రు నవస్థను గాం

చి సూతుఁ డరదంపు నేత సెందక తడబా

టిసుమంతయు మెల్లగఁ రథ 

ము సమరమున కపుడు దూరముగఁ గొనిపోయెన్    

  1.  

 

 

 

కం.

గత వీర్యునిం బరాజయుఁ

బతినిం గని సారథి వెస వారిద నిభ వి

స్తృత రవ రథమును గొని చనె

నతి భీతి మరల్చి వీడి యంకము నంతన్

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట యేనవ  సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 106.

 

 

 

యుద్ధభూమి నుండి తొలఁగఁ జేసిన తన సారథిని రావణుఁడు నిందింపఁ దా నట్లొనరించుటకుఁ దగిన కారణముల నాతఁడు వివరింపఁ దృప్తిల్లి దశాననుండు సమరావనికిఁ గొనిపొమ్మని యాజ్ఞ నొసఁగ సారథి యట్లొనర్చుట.    

 

 

 

 

కం.

మోహ వశమ్మునఁ గ్రుద్ధుం

డాహవమును వీడి నట్టి యా సారథితో

నోహటిలఁ గాలచోదితుఁ

డై హేయ వచనము లనె దశాననుఁ డిటులన్  

  1.  

 

 

 

చం.

సమరము నందు నన్నిటు లశక్తుని వీర్య విహీను భంగిఁ తే

జ మకట లేని వాని వలె జంకిన భీరుని వోలె మాయ లె

ల్ల మఱచి నట్టి వాని వలె రావణుఁ బౌరుష హీను భంగి నీ

వు మసలి స్వీయ బుద్ధినిఁ గుబుద్ధి! కరమ్ము పరాభవించితే    

  1.  

 

 

 

తే.గీ.

అస్త్ర హీను నట్టుల నేల యరదము గొని

పోవఁ బడెను నీ చే శత్రువు లరయంగ

నన్ను నవమానపఱచియు నన్నడుగక

యిట్టు లక్కట కారణ మెద్ది చెపుమ

  1.  

 

 

 

కం.

చిర కాలార్జిత కీర్తియుఁ

బరాక్రమము నమ్మకమ్ము ప్రభయు లయము ల

య్యె రయమున నీ వలన నో

దురాత్మ! సారథ్య మూన దుష్కార్యమునన్   

  1.  

 

 

 

ఆ.వె.

పరమ యుద్ధ లుబ్ధుఁ బ్రఖ్యాత శత్రువు

స్వీయ విక్రమమున విరివి ముదము

నొసఁగు వాఁ డరయుచు నుండ నీచ పురుషుఁ

జేసి తీవు నన్ను వాసి యణఁగ   

  1.  

 

 

 

తే.గీ.

దుష్ట! రథము మోహమ్ముచే దూరము గొని

పోక యున్నచో నీ విట్లు పోరు నుండి

సత్యముగ నెంతు సత్కార మత్యధికము

నంది తీవు పరుల చేత నంచు నాత్మ

  1.  

 

 

 

ఉ.

నీ వొనరించి నట్టి పని నింద్యము శత్రులు సేయు కార్యమే

యే వర మిత్రు లివ్విధము నెన్నఁడు సేయఁ దలంప రెన్నఁగన్

నీవు మదీయ సన్నిధిని నెమ్మి స్మరించిన నాగుణమ్ములన్

నీ వరదమ్ముఁ దోలు వడినిం బరుఁ డేఁగక మున్న సారథీ!     

  1.  

 

 

 

కం.

పరుషమ్ముగ దుర్బుద్ధి య

గు రావణుఁ డనంగ నిట్లు కోపం బడరం

గరము హిత బుద్ధి సారథి

గిరల ననునయముగ నిట్లు కేల్మోడ్చి యనెన్   

  1.  

 

 

 

ఉ.

భీతుఁడఁ గాను గానె యవివేకిని శత్రుల విత్తముం గొనం

బ్రీతిని వీడ లేదె యొనరించిన సత్క్రియలం దలంతు  నే

నే తఱి మత్తులో నిలువ నీ హిత మప్రియ మేను జేసి నీ

యాతత కీర్తిఁ బెంచితిని యాత్మ ప్రసన్నము గాఁగ మైత్రిచే

  1.  

 

 

 

ఉ.

దోషిగ నన్ననార్యునిగఁ ద్రోల రథమ్ము రణమ్మునం బ్రభూ

రోషము నూని చూడకుమ క్రూరుఁడు నల్పుఁ డటంచు నీవు నా

భాషల నాల కింపు మిటఁ బల్కెద నేఁగిన కారణమ్ము లా

ఘోష నదీ రయం బరయ గుట్టల వీడఁ బెరుంగు భంగినిన్  

  1.  

 

 

 

తే.గీ.

నేరితిని గొప్ప రణ మందు నీదు శ్రమను

వీర్యమున సుముఖత్వము కార్య మందుఁ 

గాంచ కుంటి నీ యాధిక్య మించు కేని

లాగ రథము గుఱ్ఱమ్ము లలసిన వెల్ల

  1.  

 

 

 

ఆ.వె.

తేరి భార మూని వారువములు భగ్న

ము లయినవి రణమున నలసి యుండె

వేఁడిమికి నితాంత వృష్టి హతము లైన

గోవుల వలె నపుడు ఘోరముగను     

  1.  

 

 

 

తే.గీ.

ఏ నిమిత్తము లిట నుద్భవించె నధిక

ముగ విచారింప నవి యెల్లఁ బోరు నందు

మనకుఁ బ్రతికూల రీతినిఁ గనుల కగప

డినవి తెల్లముగ నసురేంద్ర! నిజ మెంచ  

  1.  

 

 

 

తే.గీ.

దేశ కాలమ్ము లింక రథికుని వదన

మందు భావ లక్షణముల నరయ వలయు

హర్ష ఖేదమ్ములు బల దైన్యములు నేర

వలె మహా బల! సారథి కలహ మందు    

  1.  

 

 

 

ఆ.వె.

పుడమి నెత్తు పల్లములు సమ విషమమ్ము

లెల్ల నేర వలయుఁ దెల్లముగను

యుద్ధ కాలముల సముచిత రీతి నెఱిఁగి

పగల లోపముల నెఱుఁగ వలయును

  1.  

 

 

 

తే.గీ.

కదియుట  చనుట దూరము కయ్య మందు

మరలుటయు మున్నగున వెల్ల నరద మందు

నున్న రథ కుటుంబులు నేర నొప్పు రాక్ష

సేంద్ర! సముచిత రీతిని నింక వినుమ     

  1.  

 

 

 

కం.

తగు విశ్రాంతిని నీకు నొ

సఁగ సమ రాశ్వమ్ముల యలసట రౌద్రము నె

ల్లఁ గని తొలగింప వేగ

మ్ముగ నొప్పిదపుఁ బనిఁ జేయఁ బూనితి హితమున్

  1.  

 

 

 

కం.

మరలింప లే దధిప! నే

ను రథమ్ము నిజేచ్ఛతో వినుమ నిజ పతిపైఁ

గర మడర నెడఁద స్నేహము

త్వరపడి యిట్టు లొనరింప వలసె రణమునన్

  1.  

 

 

 

తే.గీ.

ఆన తిమ్మరిసూదన! నే నొనర్తు

నీవు వచియించి నట్టుల నీదు ఋణము

తీఱు తీరున నీ యానతిని వహించి

యౌదలను రాక్షసేశ్వర! యంచితముగ   

  1.  

 

 

 

కం.

అన విని సంతుంష్టుండై

తన సారథి పల్కుల నెడఁదం గడు వచియిం

చెను యుద్ధ లుబ్ధుఁడు దశా

ననుఁడు ప్రశంసించి భాషణమ్ముల నిట్లున్     

  1.  

 

 

 

కం.

తేరును జేర్పుమ శీఘ్రము

గా రాముని చెంత కింకఁ గయ్యము నందుం

దా రిపులను వధియింపక  

యీ రావణుఁడు మరలఁడు వహించి చలమ్మున్

  1.  

 

 

 

ఆ.వె.

రావణుండు పలికి రంజిల్లి యిట్లొసం

గెఁ దన సూతున కటఁ గేల నున్న

యుత్త మాభరణము నొక్కటి నంత మ

రల్చె రథము నతఁడు రావణు విని   

  1.  

 

 

 

కం.

రావణ చోదితుఁడు నడపె

నా వారువముల రయముగ నా సారథి వే

రావణుని మహా రథము మ

హా వీరుని రాము స్యంద నాగ్రముఁ గదిసెన్

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట యాఱవ  సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 107.

 

 

 

యుద్ధమును వీక్షింప దేవతలను గూడి బ్రహ్మర్షి భగవంతుఁ డగస్త్యుఁడు రాముని చెంతకు వచ్చి యుద్ధమున గెలుపు నందుటకునై యాదిత్య హృదయమును రామున కుపదేశించుట.

 

 

 

 

చం.

పరమ మునీంద్రుఁ డప్డు భగవంతుఁ డగస్త్యుఁడు గాంచ యుద్ధమున్

సురలను గూడి వచ్చి రఘు శూరుని రామునిఁ గ్లేశ మంద సం

గరమున రావణుం డలసి కయ్యము సేయఁగ రాఁగఁ దిర్గి చూ

చి రఘు వరుండు నిల్వగను జింతను జేరి వచించె నిట్టులన్    

  1.  

 

 

 

తే.గీ.

రామ! రామ! మహాబాహు! రమ్యమును ర

హస్యమును సనాతనమును నైన దాని

వత్స! దేని వలన రిపు వ్రాతమును జ

యింప నగును దాని వినుమ యింపు గొలుప    

  1.  

 

 

 

తే.గీ.

నిరత మాదిత్యహృదయము నీ వడరి జ

పింప వలయు  శత్రువుల వధింప నొప్పు

దాని నఘములను హరించు దాని నక్ష

యమును బరమ శివమును బుణ్యము జయదము     

  1.  

 

 

 

తే.గీ.

మంగళమ్ముల కెల్లను మంగళమ్ము

సర్వ పాప వినాశము సర్వ దుఃఖ

భగ్న హేతువు నాయుర్వివర్ధనమ్ము

పరమ మాదిత్య హృదయమ్ము నరవరేణ్య!

  1.  

 

 

 

తే.గీ.

రామ! పూజింపు ముత్థితు రశ్మి మంతు 

నిర్జ రాసుర వందితు నిఖిల లోక

పతిని నా వివస్వంతు నా భాస్క రాఖ్యు

సకల దేవాత్మకునిఁ బ్రభాశాలి రవిని   

  1.  

 

 

 

కం.

ఈతఁడు దే వాసుర తతి

నాతతముగ జగతిఁ గాచు నంశుల నిత్యం

బీతండె బ్రహ్మ విష్ణువు

నీతఁడె శివ వరుణ గుహులు నీతఁడె యముఁడున్

  1.  

 

 

 

కం.

ఈతఁడె ప్రజాపతి ధనదుఁ

డీతండె మహేంద్రుఁ డీతఁ డీతఁడె కాలుం

డీతఁడె సోముండు పితరు

లీతండె వసువులు నీతఁ డీతఁడె సాధ్యుల్

  1.  

 

 

 

కం.

ఈతఁడె మరుత్తు లశ్విను

లీతఁడె మను వీతఁ డగ్ని యీతఁడె యనిలుం

డీతఁడె ప్రజ లితఁడె ప్రభల

దాత యసువులు ఋతు కర్త ధర నీతండే    

  1.  

 

 

 

తే.గీ.

సూర్యుఁ డాదిత్యుఁడు ఖగుఁడు సురభి నిభుఁడు

భానువు గభస్తి పూషుఁడు పసిడి వీర్యుఁ

డు దివసకరుఁడును సవితృఁడు హరి దశ్వుఁ

డును సహస్రార్చి  సప్తాశ్వుఁడు సకిరణుఁడు  

  1.  

 

 

 

చం.

తిమిర హరుండు శంభుఁడు నతీత మరీచియుఁ ద్వష్ట యీ మహాం

డము జనియించు వాఁడు ధర డయ్య మహా తపనుం డహస్కరుం

డమరు హిరణ్య కుక్షిగ మహా శిశిరఘ్నుఁడు నగ్నికుక్షి త

ప్త మనుజ కోటికిన్ శిశిర దత్తుఁడు శంఖుఁడు నాదితేయుఁడున్

  1.  

 

 

 

తే.గీ.

భాస్కరుఁడు రవి యాకాశ భర్త గగన

గామి  ఋగ్యజు సామ వే దామిత నిపు

ణుఁడు తమో భేది తద్వరుణు సుహృదుండు  

నాతప యుతుండు ఘన వృష్టి యర్కవంశ!     

  1.  

 

 

 

తే.గీ.

మండలి కవి శత్రు వనురక్తుండు పింగ

ళుండు మృత్యు వఖిల తాపనుండు విశ్వుఁ

డుగ్ర తేజస్వి సర్వభ వోద్భవుండు

వరుఁడు గ్రహ తారలకు విశ్వ భావనుండు

  1.  

 

 

 

కం.

తేజస్వుల నెల్ల మహా

తేజస్వివి ద్వాదశాత్మ! దివ్యాంగా! నీ

వీ జగముల నెల్లం గన

నోజ నమస్సు లగు నీకు నున్నత భక్తిన్   

  1.  

 

 

 

తే.గీ.

వందనములు పూర్వాద్రికి వందనములు

పశ్చి మాగమమున కహర్పతికి వంద

నములు జ్యోతిర్గణావలి నాథున కిల

వందనములు సమర్పింపఁ బడును గాక  

  1.  

 

 

 

కం.

జయ మిడు వానికి భద్రము

జయము లొసఁగు వానికి దివసకరునకు సహ

స్ర యుగాక్షున కాదిత్యున

కయి హర్యశ్వ విలసితున కయి వందనముల్  

  1.  

 

 

 

కం.

ప్రణతులు శత్రూగ్రునకును

బ్రణతులు సారంగునకును బ్రణతులు సునభో

మణికిని మార్తాండునకును

బ్రణామము ప్రచండునకును బద్మసఖునకున్  

  1.  

 

 

 

తే.గీ.

నలిన జేశాన నారయణస్వరూపు

నకును నాదిత్య వర్చస్సునకును సూర్యు

నకును భాస్వంతునకు రౌద్రునకును సర్వ

భక్షకునకు నమస్కార మక్షయముగ    

  1.  

 

 

 

తే.గీ.

ఆ తమోఘ్న హిమఘ్న ద్విషావలిఘ్ను

నకుఁ గృతఘ్నఘ్నునకును ఘన తర  హృదయు

నకును జ్యోతిర్పతికి దేవునకును భక్తి

సంయు తాంచిత వందన సంచయములు     

  1.  

 

 

 

తే.గీ.

తప్త చామీక రాభ శుద్ధచ్ఛవి విల

సితునకు హరున కవనిపైఁ జీఁకటిఁ దొలఁ

గించు వానికి లోకసాక్షికిఁ బ్రకాశి

కెలమి విశ్వకర్మునకు నతులు సభక్తి

  1.  

 

 

 

తే.గీ.

భూతములను సృష్టించు విభుం డితండు

లయ మొనర్చు నితండు కిరణములం ద

పించు నెండించు నింక వర్షించుచుండు

దినకరుండు లోకమ్మునఁ దనరి భృశము   

  1.  

 

 

 

తే.గీ.

నిలిచి యితఁడ భూతము లందు నిద్ర నున్న

నవి మెలఁకువగ నుండుఁ దా ననవరతము 

నగ్ని హోత్రుఁడు నీతఁడె యగ్ని హోత్రు

ల ఫలము నయి యితఁడు తనరారుచుండు    

  1.  

 

 

 

కం.

క్రతువులు క్రతు ఫలములు దే

వత లీతండె పరికింపఁ బరమంపు విభుం

డితఁడు జగం బందున్న వి

తత కార్యమ్ములకు నెల్లఁ దర్కింపంగన్      

  1.  

 

 

 

ఆ.వె.

ఆపద సమయమ్ము లందు దుఃఖమ్ముల

భయము లందు ఘోర వనము లందు

నార్తి నే పురుషుఁడు కీర్తించు నీతని

నాతఁడు రఘువర!లయమ్ము కాఁడు   

  1.  

 

 

 

ఆ.వె.

దేవు నీ జగత్పతిని రామ! యేకాగ్ర

చిత్త మూని తగ భజింపు మూడు

మారులు జపియింప మంత్రమ్మును జయింతు

వీవు సమర మందు భూవరుండ!     

  1.  

 

 

 

కం.

రావణు నీ క్షణ మందునె

నీవు వధింతువు రణమున నీరజ నేత్రా!

యీ వాక్కు లని యగస్త్యుఁడు

దా వెడలెను వచ్చి నట్లు తాపసుఁ డంతన్    

  1.  

 

 

 

ఆ.వె.

నష్ట శోకుఁ డయ్యె నరవరేణ్యుఁడు విని

యధిక తేజుఁ డంత నాత్మఁ దలఁచి 

నిశ్చలమతి వూనె నెమ్మి జపించి ము

మ్మారు లాచమించి యా రవిఁ గని  

  1.  

 

 

 

తే.గీ.

శుచి యయి ధనువు నూని సురుచిర మంత

రావణు నరసి పడసి హర్షమ్ము సమర

మెంచి దరి సేరె వధియింప నెంచి సర్వ

యత్నముల రాముఁ డంత దృ ఢాత్ముఁ డయ్యె     

  1.  

 

 

 

కం.

మురియుచును రవి వచించెను

ద్వరపడు మని రామునిఁ గని ప్రమదాత్ముండై 

సుర గణముల మధ్య నిలిచి

యరసి దశాస్యుని క్షయమ్ము నాదిత్యుఁ డటన్  

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట యేడవ  సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 108.

 

 

 

రావణుని రథమును గాంచి రాముఁడు మాతలికిఁ దగు కర్తవ్యమును దెలిపి రథమును రావణుని దెస కరుగు మని నుడువ నంత రావణుని పరాజయము రాముని జయమును సూచించు నిమిత్తము లుద్భవించుట.

 

 

 

 

ఉ.

సారథి సంతసించి యెద శత్రు చమూ భయదమ్ము మూర నా

కారము నందు దేవ వర గాయన పట్టణ భంగి ఘోర ర

క్షో రథముం బతాక యుత శుద్ధ సువర్ణ తురంగ యుక్తమున్

మూరఁగ యుద్ధ సాధన సమూహము సధ్వజ రాజితమ్మునున్  

  1.  

 

 

 

ఉ.

తోలెను నింగి మ్రింగు విధిఁ దోరము భూమి ధ్వనించు భంగినిం 

గ్రాలఁగ శత్రు సైన్య మట రాక్షస సైన్యము సంతసింపఁగా 

నాలము నందు వేగముగ నాసుర వర్యుని సూతుఁ డాత్మలో   

మే లొనరింపఁ గౌతుక సమేతుఁడు క్షిప్రము రావ ణాజ్ఞతో      

  1.  

 

 

 

మ.

కనె నా రాముఁడు మాన వేశ్వరుఁడు రక్షః కాంతు తార్క్ష్యమ్మునుం

దన పై కత్తఱి వచ్చు చుండఁగను సద్ధ్వానమ్ముతో మూరుచున్

ఘన కాలాశ్వ చయోక్తమై తనరగం గాంతుల్ మహా రౌద్ర భం

గిని సూర్యాభమునౌ  విమాన మన నింగిన్ వెల్గ వర్చస్సులన్  

  1.  

 

 

 

తే.గీ.

మెఱపుల వలె టెక్కెమ్ములు మెఱయ నింద్ర

చాపమును బోలు ప్రభల సంచయము లడర

బాణ ధారల విడుచుచు వారి దాంబు

ధారల పగిది నరద మేతేరు చుండ

  1.  

 

 

 

తే.గీ.

వజ్ర హత గిరి ధ్వనిఁ బోలు స్వనము లడర

మేఘ సన్నిభ రథమును రాఘవుండు

సూచి వచ్చుచుండఁగ ధనుస్సు నట వంచి

బాలశశి భంగి వేగమ పలికె నిట్లు

  1.  

 

 

 

ఆ.వె.

ఇంద్రు సారథిని నరేంద్రుఁడు వీక్షించి 

మాతలి! యని కితఁడు మరల వచ్చు

చుండఁ దొందరగను జూడుమ యపసవ్య

ముగను దనదు మరణము కొఱ కనఁగ  

  1.  

 

 

 

కం.

కనుక నిలుమ భద్రమ్ముగఁ

గొని పొమ్మరి స్యందనమునకు నెదురుగన్ నే

ననిలం బుత్థిత మేఘ

మ్మును భంగిని గోరుదు లయము నొనర్పంగన్  

  1.  

 

 

 

ఆ.వె.

భయ మెడంద వీడి పడక తొందర యిసు

మంత సూపుల నెద వంత నంద

కుండఁ గళ్లెములను గుదురుగఁ బట్టి తే

రిని ద్రుతముగ నడపు మనిని నార్య!  

  1.  

 

 

 

తే.గీ.

చాలు నీ కింక నేఁ జెప్ప నేల యిటుల

నింద్ర రథమున కుచితుఁడ వీవు భృశము

సమర మేకాగ్ర చిత్తతఁ జలుపఁ గోరి

గుర్తు సేయుదు నేర్పంగఁ గోర నేను  

  1.  

 

 

 

కం.

పరితుష్టుం డయి రాముని

గిరల నమర సారథి నిజ కేలీ లీలన్

దుర మందు నడపె మాతలి

యరదము సత్తఁముఁడు ప్రీతి యాత్మఁ జెలంగన్  

  1.  

 

 

 

ఉ.

స్యందన మంతఁ జేయ నపసవ్యము రావణు గొప్ప తేరికిం 

జింద రజమ్ము చక్రజము చెన్నుగఁ గప్పె దశాస్యు నాజినిన్

డెందము నిండఁ గిన్కను వడిన్ రుధిరాక్షుఁడు రావణుండు వే

యిందు నిభాస్యు నొంచెను నరేంద్రుని రాముని సాయకమ్ములన్  

  1.  

 

 

 

ఉ.

కోపము నీయ ధర్షణము ఘోర తరమ్ముగ నూని ధైర్యమున్

భూప వరేణ్యుఁ డందె జవమున్ దివిజేంద్రు ధనుస్సు రాఘవుం

డేపున వేగ వంతముల నింపుగ భాస్కర రశ్మి తుల్యముల్

దూపులఁ దా గ్రహింప వెస దుర్భర మయ్యెఁ బరస్ప రాంకమే  

  1.  

 

 

 

తే.గీ.

వైరు లన్యోన్యము వధింపఁ గోరు చుండి

యభిముఖు లయి యయ్యిర్వురు నలయ కుండ 

మత్త సింహద్వయము భంగి నత్తఱిఁ దల

పడుచు నుండఁ దుముల మయ్యెఁ గడు రణమ్ము  

  1.  

 

 

 

తే.గీ.

రావణక్షయమ్మును గోరు దేవ సిద్ధ

గణ మహర్షి గంధర్వ నికాయ మపుడు

సేరె రథిక ద్వయ మడరి చేయు సంగ

రమ్ము వీక్షింపఁగఁ గుతూహలమ్ముతోడ    

  1.  

 

 

 

ఆ.వె.

పొడమిన వట  శకునములు దారుణమ్ములు

రోమ హర్షణము లురువుగ నంత

రావణాసురుని విలయము రాముని విజ

యమ్మును దెలుపెడు విధమ్ము దోఁప  

  1.  

 

 

 

కం.

కురిసెను బర్జన్యుండు రు

ధిర వర్షము రాక్షసేంద్రు తేరు పయి ననిం

దిరుగుచు నపసవ్యమ్ముగ

గిరగిర గుండ్రమ్ముగ వణఁకించెను గాలుల్  

  1.  

 

 

 

కం.

విరివిగ వడి వడి నెగురుచుఁ 

దిరుగాడెడు గ్రద్ద లసురు తే రే దెసలం

దిరిగిన నా యా దిక్కుల

కరుగుచు నున్న వరయంగ గములై నింగిన్    

  1.  

 

 

 

ఆ.వె.

సంధ్య యలము కొనిన సమయమం దా లంక

కనఁబడెను జపా సుమ నిభము దిన

మందుఁ గూడ మండు నట్లధికమ్ముగ

నెల్లెడలను వింత నెఱ్ఱగాను  

  1.  

 

 

 

తే.గీ.

రాలెఁ బిడుగులఁ గూడి యుల్కలు  మహాస్వ

నమ్ము లప్పుడు రావణునకు నహితము

లెల్లఁ గలిగించుచు విషాద మెల్ల రక్క

సులకు నెదల మిక్కుటముగఁ జోద్యముగను     

  1.  

 

 

 

తే.గీ.

రావణుం డెక్క డెక్కడ రాక్షస పతి

నిలిచె నక్క డక్కడ ధర చలిత మయ్యె

సమర మొనరించు చుండ రాక్షసుల బాహు

వుల నెవరొ పట్టి నట్లయ్యెఁ బోరు నందు  

  1.  

 

 

 

ఆ.వె.

పడిన వెఱుపు పసుపు పచ్చని తెల్లని

నల్లని సవితృ కిరణములు రావ

ణు నెదుట నగ రాజమున నున్న ధాతు రా

శి సరణి నగపడుచుఁ జిత్రముగను  

  1.  

 

 

 

చం.

వెనుకను వెంబడించుచును వేగమ గ్రద్దలు రాఁగ సంభ్రమ

మ్ము నెగడ నాడు నక్కల సమూహము గక్కుచు నోళ్ల మంటలం

గనుచును రాక్షసేశ్వరు ముఖమ్మును నార్చె నమంగళమ్ముగా

ననిలము వీచె లేచి రజ మక్షులఁ గప్ప విరుద్ధ రీతినిన్

  1.  

 

 

 

ఆ.వె.

ఘన ఘ నారవములు వినఁ బడకున్నను

నసుర సైన్య మందు నంతటఁ బిడు

గు లడరుచుఁ బడినవి ఘోరముగ భరింప

రాని నిస్వనముల రణము నందు

  1.  

 

 

 

ఆ.వె.

చీఁకటి యలము కొనెఁ జిత్రమ్ముగను దిక్కు

లందు మూల లందు నాకసమ్ము

గాన రాక యుండెఁ గప్పఁబడఁగ దుమ్ము

కురియ మిక్కుటముగఁ గొంచెమైన         

  1.  

 

 

 

కం.

కలహించుచు నట గోర్వం

క లఱచుచును దారుణమ్ముగను వందలు వం

దలు ఘోరావేశమునఁ ద

మ లోన రావణు రథమున మరలక వ్రాలెన్  

  1.  

 

 

 

ఆ.వె.

మొలల విస్ఫులింగములు నేత్రముల నుండి

యశ్రువులను వాని యశ్వము లిల

రాల్చినవి నిరంతరం బగ్నిని జలముఁ    

దుల్యముగను వింత దురము నందు

  1.  

 

 

 

కం.

ఈ విధ మనేకములు సమ

రావని నుత్పాతము లట నగపడినవి ర

క్షోవరు వినాశమునకు భ

యావహములు దారుణములు నాశ్చర్యముగన్   

  1.  

 

 

 

ఆ.వె.

రామునకును సంగరమున నిమిత్తము

లుద్భ వించె నప్పు డద్భుత జయ

సూచిక లవి పెక్కు సురుచిరము లతి సౌ

మ్యమ్ము లెల్లెడల శుభావహములు  

  1.  

 

 

 

ఆ.వె.

సంతసించె భృశము శకునములను సౌమ్య

ములను గాంచి విజయము నెఱిగించు

వాని రాముఁడు దశవక్త్రుఁడు మరణించి

నట్టు లెంచె నంత నాత్మలోన   

  1.  

 

 

 

కం.

కని తన నిమిత్తములు రణ

మున విజ్ఞుం డిల నిమిత్తముల హర్షించెన్

ఘనముగ సుఖము వడసి చూ

పెను రాముం డాజి లోనఁ బెను విక్రమమున్

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట యెనిమిదవ  సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 109.

 

 

 

రామ రావణుల ఘోర యుద్ధము కొనసాగుట.

 

 

 

 

కం.

అతి ఘోర యుద్ధము మహో

న్నత రథికద్వయము మధ్య నర రాక్షస సం

తతి రామ రావణుల కట

వితతక్రూర గతి నయ్యె వీర వరులకున్  

  1.  

 

 

 

చం.

నిలిచెను వీత చేష్టల ననీక యుగమ్ము ప్లవంగ రాక్ష సా

వలి గొని యాయుధమ్ములను బన్నుగ భండన భూమిలోఁ గుతూ

హలముగ మాన వాసురుల నత్తఱి యుద్ధము నందుఁ గాంచుచున్

బలమున మించ నిద్దఱును వావిరి విస్మయ మందె రెండునున్ 

  1.  

 

 

 

ఆ.వె.

నగచరులు నసురులు నానాయుధమ్ముల

నూని భుజము లందు నొక్క రొక్క

రి పయిఁ దలపడక నిలిచిరి యాశ్చర్యమ్ము

దనర మనము లందుఁ దద్ద యపుడు  

  1.  

 

 

 

ఉ.

బొమ్మలఁ బోలె నిల్చి రటఁ బోరున రావణుఁ జూచి రాక్షసుల్

గ్రమ్మఁగ విస్మయం బపుడు గన్నుల రాముని గాంచి వానరుల్

గ్రమ్మిన యా నిమిత్తములఁ గాంచి స్థిరమ్ముగ రామ రావణుల్

వమ్మిన యాగ్రహమ్మునను వార కభీతిఁ బెనంగి రిద్దఱున్       

  1.  

 

 

 

తే.గీ.

నెగ్గ వలె నంచు రాఘవుఁ డగ్గలముగ

మరణ మైన రానిమ్మని మదిని రావ

ణుండు నిశ్చయించి ధృతిని భండనమున

చూపి రెల్ల వీర్యమ్మును గోప మూని  

  1.  

 

 

 

ఉ.

రావణుఁ డంతఁ గోపమున రామ శతాంగపు టా పతాకముం 

దా వడిఁ గూల్ప బాణముల ధార్మిక వర్యుఁడు గూర్చి వేయఁగా

దేవ నికాయ నాథవరు తేరి పయిం గల శక్తిఁ దాఁకఁగా

నా వసుధా తలమ్మున మహార్భటిఁ గూలె ధ్వజమ్ముఁ జేరకే    

  1.  

 

 

 

తే.గీ.

అంత రాముఁడు కూడఁ గ్రుద్ధాంతరంగుఁ

డయి ప్రతిక్రియ నొనరింప నాత్మ నిశ్చ

యించి యుత్సాహ మడరంగ మించి నట్టి

వేగమున విల్లు గొని వంచి వీర వరుఁడు

  1.  

 

 

 

ఉ.

రాముఁడు రావణధ్వజము లక్ష్యముగా నిశి తాంబకమ్మునున్

భీమ ఫణీంద్ర సన్నిభము వెల్గ నిజప్రభ నంత  వేసె సం

గ్రామము నందు వేయ శిత కాండము చీల్చి ధ్వజమ్ము నంతటన్

వే మహిఁ దూఱె నా ధ్వజము పృథ్వినిఁ గూలె నికృత్తమై వెసన్  

  1.  

 

 

 

ఆ.వె.

ఖండితంపు ధ్వజము గాంచి దశగ్రీవుఁ

డసహనమున నవ్వి నట్లగపడి

బల్లిదుండు బాణ వర్షము కురియించెఁ 

గోప వశత మండి ఘోరముగను

  1.  

 

 

 

చం.

నరవరు నశ్వ రాజముల నైరృత నాథుఁడు దీప్త మార్గణో

త్కరముల నొంచెఁ దొట్రిలవు దాఁక వహింపవు భ్రాంతి నింతయుం

దురగము లబ్జ నాళములతోఁ బ్రహరించు విధమ్ము స్వాస్థ్య సం

భరిత నిజాంతరంగములఁ బన్నుగ నున్నవి సంగరమ్మునన్  

  1.  

 

 

 

కం.

వారువముల భయ హీనం

బారసి క్రుద్ధుం డడరి దశాస్యుం డంతన్

ఘోర శర వర్షము గురిసె

నా రక్షో విభుఁడు తిరిగి యాహవ మందున్    

  1.  

 

 

 

చం.

పరిఘ గదాది చక్రములు పర్వత శృంగ తరూన్నతమ్ములుం

బరశువు లింక శూలములు భైరవముల్ ముసలమ్ము లెల్లనున్

విరివిగ మాయఁ జేయఁ బడ వే లవి గుర్సెను శస్త్ర వర్షమే

శరముల వేల నశ్రమము సంగర భూమిని వేసె నుద్యతిన్

  1.  

 

 

 

తే.గీ.

వ్యాకులమ్ము భీమమ్ము భయమ్ము నొసఁగు

నట్టి యుద్ధ మనేక శస్త్రావళి మయ

మైన వర్షము వర్షింప నద్భుతముగ

నుద్భవించె నవ్వేళ నత్యుగ్రముగను     

  1.  

 

 

 

ఆ.వె.

విడిచి రాము రథము నడరి వానర బల

మందు సాయకముల నంతరిక్ష

మందు నంతరమ్ము నరయని భంగిని

నింపె రావణుండు సంపఁ దలఁచి       

  1.  

 

 

 

తే.గీ.

వదలె నిస్సంగ మనమున బాణములను

రావణుం డుద్యమింప నరయుచుఁ దత్ప

రు నసురేంద్రుఁ గని నగుచు సునిశిత శర

ములను వేవేల వేసె రాముఁ డతని పయి  

  1.  

 

 

 

ఆ.వె.

వాని గాంచిన దశవక్త్రుఁడు నిరవకా

శ మొనరించె నింగి శర చయమున

నా శర చయ యుగ్మ మడర నభము శర

బద్ధ మపర నభము వలె వెలింగె  

  1.  

 

 

 

తే.గీ.

రామ రావణ శిఖుల నలక్ష్యములు న

భేద్యములు నిష్ఫలము లైనవి కన రావు

యుద్ధమున నవి యెల్ల నొండొరులఁ దాఁకి

ముక్కలయి కూలినవి వేగ పుడమి పైన

  1.  

 

 

 

తే.గీ.

గగనమును నిరుచ్ఛ్వాస నికాశముగ నొ

నర్చి రిరువురు వేసి బాణములు కుడి యె

డమల నెడతెగని విధమ్ము సమర మిద్ద

 ఱపుడు సేసిరి యతి ఘోర మైన రీతి         

  1.  

 

 

 

ఆ.వె.

రాఘవుండు గొట్ట రావణు తేజుల

రావణుండు గొట్టె రాముని హయ

ముల నొక రొకరిని నిటు లనుకరించి చే

యఁ దొడఁగిరి రణమున నలిగి యలిగి       

  1.  

 

 

 

కం.

కోపము వహించి యిర్వురు

నాపక చేయ సమరమ్ము వ్యాకుల మయ్యెన్

భూ పాసుర వరుల రణ మ

హో పులకింప భృశ మొక ముహూర్తం బంతన్

  1.  

 

 

 

కం.

బల్లిదులు రామ రావణు

లుల్లమ్ములఁ బంత మూని యుద్ధ మొనర్పం

బెల్లుగ శరముల రాముం

డల్లనఁ గూల్ప ధ్వజ మసురుఁ డాగ్రహ మందెన్

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట తొమ్మిదవ  సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 110.

 

 

 

రామ రావణుల యుద్ధము ఘోరముగాఁ బవలు రాత్రి యంత క్షణ మైన విరామము లేక దేవ దానవ యక్ష పిశా చోరగములు సూచుచుండ జరుగుట.  

 

 

 

 

కం.

సమరమున రామ రావణు

లమితమ్ముగఁ బోరుచుండ నాశ్చర్యము నిం

డ మనము లందు నఖిల భూ

తము లరయుచు నిలిచిన వటఁ దద్ద వివశతన్    

  1.  

 

 

 

కం.

అరదమ్ములు పీడించుచుఁ

బరస్పరము నుత్తమములు బైరవముగ సం

గరమున నేఁగుచు రెండు నె

దు రెదురుగ నమర్ష మడరఁ దోరము సెలఁగెన్   

  1.  

 

 

 

తే.గీ.

తిరుగుచును గుండ్రముగ దూర మరిగి కదిసి

వీథులఁ జను గతులను జూపి వివిధముల

నరదములు భయదము లయ్యె నా పరస్ప

ర వధ నెంచి యగపడ సారథుల నేర్పు    

  1.  

 

 

 

తే.గీ.

రాముఁ డాజిఁ బీడింపఁగ రాక్షసేంద్రు

రావణుండు పీడించెను రాఘవేంద్రు

నంది ప్రతి వేగమునకుఁ దుల్య మగు వేగ

ము నుభయులు నుద్యమించుచుఁ బోరు నందు  

  1.  

 

 

 

కం.

చిమ్మఁగ బాణము లిర్వురు

పమ్మి భృశం బుభయుల రథ వరము లపుడు నీ

రమ్ముల ధార లడరు మే

ఘమ్ముల భంగిఁ జరియించెఁ గలహం బందున్    

  1.  

 

 

 

తే.గీ.

చూపి గతు లనేకమ్ములఁ జోద్యముగ ర

ణమున స్యంద నోత్తమములు నైపుణమునఁ

దిరిగి నిలిచిన వంత నెదు రెదురుగను

జేరినవి రెండు చేరువ శీఘ్రముగను      

  1.  

 

 

 

కం.

కదియ రథమ్ములు కాఁడికి

నెదురుగఁ గాఁడియును జేర నిఁక వాజులవౌ

వదనమ్ము లయ్యుభయములు 

గదియఁ బతాకములు నొక టొకటిఁ గదిసె వెసన్    

  1.  

 

 

 

ఉ.

రాముఁడు నాల్గు బాణముల రావణు నాలుగు ఘోటకమ్ములన్

వే మరలంగఁ జేయ నని వీర వరేణ్యుఁడు విక్రమించి రో

షామిత తామ్ర నేత్రుఁడు దశాననుఁ డవ్విధిఁ జూచి వాజులన్

రాముని పైన వేసెను శరమ్ములు తీక్ష్ణము లంత నుద్ధతిన్     

  1.  

 

 

 

ఉ.

కొట్టఁ బడంగ బాణముల ఘోరముగా దశకంఠు చేత న

ప్పట్టున నే వికారమును బాధను జెందఁడు రాముఁ డింతయున్

నెట్టన నంత రావణుఁడు నేర్పున మాతలి నింద్రసారథిన్

గట్టిగఁ వజ్ర పాత సమ  గర్జన పత్రులఁ గొట్టె నుగ్రుఁడై    

  1.  

 

 

 

చం.

శరములు వేగ వంతములు చయ్యన మాతలి పైన గూలినన్

దురమున మోహ మీయ విఁక దుఃఖము సుంత యొసంగ వత్తఱిన్

నరవరుఁ డట్లు మాతలిని నైరృత నాథుఁడు నొవ్వఁ జేయఁగా

నరసి కలంతఁ జెందెఁ గడు నాతఁడు నొవ్వఁడు స్వీయ బాధకున్    

  1.  

 

 

 

తే.గీ.

విముఖునిం జేసె వెస శత్రు వీరు నంత

బాణముల రాముఁ డప్పుడు పఱపెఁ జెలఁగి  

యిరువదియు ముప్పది వరుస నింక నఱువ

ది మఱి వందలు వేలు రథము పయినను   

  1.  

 

 

 

ఆ.వె.

రావణుండు కినిసి రాక్షసేశ్వరుఁడు భృ

శమ్ము నిలిచి తాను స్యందనమ్ము

న గదలు ముసలములు నరనాథుపైఁ గురి

యించి బాధ పెట్టె మించి యాజి

  1.  

 

 

 

చం.

ఒనరుప నిర్వురుం దిరిగి యుద్ధము వ్యాకుల మయ్యె గగ్గురుల్

గనఁబడె మిక్కిలిం బరిఘ కాండ గదా ముస లౌఘ వేగ సం

జనిత మరుజ్జవమ్మునను సప్త సముద్రము లత్తఱిన్ మహా    

నినదములం జలించినవి నిష్ఠుర రీతిని భీకరమ్ముగన్  

  1.  

 

 

 

తే.గీ.

సాగరమ్ము లల్లాడఁగ వేగతరము

వ్యథితు లై రెల్ల పాతాల వాసు లురగ

దానవులు వేల కొలఁది తద్ద భయము సెల

రేఁగ నంతరంగము లందుఁ గ్రింద నుండ  

  1.  

 

 

 

కం.

చలియించె నెల్ల మేదిని

కలసి గిరులను వనములను గాననములఁ దా

నిల వీవఁడు వాయు వటఁ బ్ర

భలు లేక నిలిచెను వింత భాస్కరుఁ డంతన్         

  1.  

 

 

 

కం.

సురలు మహర్షు లురగ కి

న్నర చయ గంధర్వ వర గణమ్ములు సిద్ధుల్

గర మందిరి దుఃఖము నె

ల్లరు నా సమయమ్ము నందు రణ మరయంగన్  

  1.  

 

 

 

తే.గీ.

స్వస్తి యగుఁ గాక యెల్ల గో బ్రాహ్మణులకు

శాశ్వతమ్ము నిలుచుఁ గాక జగ మఖిలము

రాముఁడు జయించు గావుత రావణు నసు

రేంద్రు నాజి లోన ననుచు నిట్టు లపుడు    

  1.  

 

 

 

తే.గీ.

రామ రావణ భీకర రణముఁ గాంచి

రోమహర్షణమ్మును దాప సామరవర

నిచయ గంధర్వులు జపింప నెమ్మి తోడ

నగపడిరి యెల్లరు నిలిచి యాకసమున  

  1.  

 

 

 

తే.గీ.

ఆకసమునకు సాటియె యాకసమ్ము

సాగరమునకు సాటియె సాగరమ్ము

రామ రావణ సమరమ్ము రామ రావ

ణ రణమునకె సాటి యనుచు గిరల ననుచు  

  1.  

 

 

 

ఆ.వె.

అప్సరసల సంచయమ్ము గంధర్వ 

మూహ మరసి భీక రాహవమును

బరవశమ్ము నంది భండనమ్మును గాంచఁ

జాగి రప్పు డట్లు జరుగుచుండ    

  1.  

 

 

 

చం.

కినుక వహించి రాఘవుల కీర్తి వివర్ధనుఁ డంత ఘోర స

ర్పనిభ శరమ్ము వింటిఁ దగ రాముఁడు గూరిచి  కుండలమ్ములన్

ఘనముగ వెల్గు నయ్యసుర కాంతుని శీర్షముఁ జీల్చెఁ జీల్వఁ గూ

ల నిలను ముజ్జగమ్ములును రంజిలి చూచిన వా శిరమ్మునున్  

  1.  

 

 

 

ఆ.వె.

మొలచె నొండు శిరము మొదలిటి తల వంటి

ది వెస రావణునకు నృవరుఁ డరసి

దానిఁ ద్రుంచె వేగ తత్క్షణమ్మున నాజి

వేగవంతుఁ డంత వీర వరుఁడు

  1.  

 

 

 

ఉ.

ఛిన్నము గాఁగ రావణుని శీర్షము రెండవ దంప వానచేఁ

గ్రన్నన నుద్భవింపఁ దల రాముఁడు ద్రుంచెను సాయకమ్ములన్

భిన్నము లయ్యె నివ్విధము వేగముగా శత శీర్ష రత్నముల్

సెన్నుగ నుండఁ దుల్యముగ శీర్షము లన్నియు స్వీయ కాంతులన్

  1.  

 

 

 

కం.

నృవరుఁడు కౌసల్యానం

ద వర్ధనుఁడు నస్త్ర కోవిద మహా రథికుం

డవిరళ బాణ యుతుండు మ

ది విచారించె  దశముఖుఁడు దెగకున్న ననిన్

  1.  

 

 

 

సీ.

మారీచుఁ జంపిన మార్గణములు ఖర దూషణుల ననిలోఁ ద్రుంచినయవి

క్రౌంచ వనమ్మున ఘనుఁ గబంధుని దండకా వనిని విరాధుఁ గడపినయవి

సాల పర్వతముల వాలినిఁ గూల్చిన యట్టివి కడలికి వ్యథ నొసంగి

నట్టివి నాకు నత్యంత విశ్వాస పాత్రములు సకల సంగరమ్ము లందు

 

ఆ.వె.

నట్టి సాయకమ్ము లక్కట మంద తే

జమ్ము లయ్యె నేల సమర మందు

రాక్షసేశ్వరుఁ డగు రావణు నందుఁ గా

రణము సుంత కాన రాదు మదిని   

  1.  

 

 

 

కం.

చింతా పరుఁడై యివ్విధి

నంత నెడఁద నప్రమత్తుఁడై రావణ బా

హ్వంతరమున శర వర్షము

నంతక సన్నిభుఁడు రాముఁ డాజినిఁ గురిసెన్   

  1.  

 

 

 

కం.

రావణుఁడు గూడఁ గ్రుద్ధతఁ

జేవ గదా ముసలములు విశేషముగ ననిన్

వేవేగ వైచి రాముని

భూవరు నొప్పించె భృశము పుణ్యాత్మునినిన్      

  1.  

 

 

 

కం.

కలిగింప గగుర్పాటు తు

ములమై సమరమ్ము  దివిని భూమిని గిరులం

దలపడఁగ రామ రావణు

లలయక వర్తిల్లె నప్పు డాశ్చర్యముగన్

  1.  

 

 

 

తే.గీ.

దేవ దానవ యక్షులు దివిఁ బిశాచ

రాక్ష సోరగ గణము లరయుచు నుండ  

రామునకు నసురేంద్రుఁడు  రావణునకు 

సర్వ రాత్రము సాగెను సంగరమ్ము

  1.  

 

 

 

ఆ.వె.

రామ రావణ సమరమ్ము దినము నందు

నైన రాత్రి యందు నైన నొక్క

క్షణము గూడ నాగక విరామ మెఱుఁగక

కొంచె మైన జరిగె ఘోరముగను

  1.  

 

 

 

కం.

అరయక రాముని విజయము

నరవర రాక్షస రణమ్మున మహాత్ముం డా

సురపతి సారథి మాతలి

త్వరితము రణరతుని తోడ వచియించె నిటుల్       

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట పదవ  సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 111.

 

 

 

మాతలి గుర్తు సేయ రాముఁడు బ్రహ్మాస్త్రమును బ్రయోగించి రావణుని సంహరించుట. 

 

 

 

 

కం.

స్మరియింపఁ జేసె మాతలి

నరేంద్ర! వెన్నంటు దేల నైరృత పతినిన్

దురమున నెఱుఁగని వాని వ

లె రాఘవేంద్ర! స్మృతినిఁ జెలరేఁగుమ యాజిన్

  1.  

 

 

 

ఆ.వె.

వదలు మస్త్ర వరము పైతామహము రామ!

యీతని వధియింప నెంచి యింకఁ 

జెప్పి రెద్ది యమరు లొప్పుగ నట్టి వి

నాశ కాల మిప్పు డీశ! వచ్చె   

  1.  

 

 

 

ఉ.

మాతలి గుర్తు సేయఁగను మానవ వీర్యుఁడు రాఘవుండు దా

నాతత దీప్త బాణమును నంచిత నిశ్వస నాహి తుల్యముం

బ్రీతి నగస్త్యుఁ డీయఁగ విరించిదమున్ భగవంతుఁ డెంతొ వి

జ్ఞాతుఁడు మున్ను గైకొనెను జక్క నమోఘము సంగరమ్మునన్      

  1.  

 

 

 

తే.గీ.

ఇంద్రున కొసంగ నిర్మిత మీ శరమ్ము

బ్రహ్మ చేతఁ దేజస్విచే వాసవునకు

ముజ్జగమ్ములను విజయము నెదఁ గోరు

వాని కీయఁ బడెను మున్ను మానితముగ          

  1.  

 

 

 

తే.గీ.

మసలు దాని ఱెక్కల లోన మారుతమ్మ

యగ్ని సూర్యు లుందురు దాని యగ్ర మందుఁ 

గాయ మెల్ల వీక్షింప నాకాశ మయము 

మేరు మందర తుల్యము భార మందు   

  1.  

 

 

 

తే.గీ.

తనువు జ్వాజ్వల్యమానమై తనరు చుండుఁ 

బుంఖము విలసిల్లును హేమ భూషిత మయి

తీర్పఁ బడె భూత రాసుల తేజములను

గాంతి పరికింప భాస్కర కాంతి సమము

  1.  

 

 

 

ఆ.వె.

ధూమ యుక్త కాల దుర్వార వహ్ని ని

భమ్ము వెల్గు చుండుఁ బమ్మి నర గ

జాశ్వ బృందముల లయం బొనరించును

క్షిప్ర మాజి లోన క్షిప్ర కారి    

  1.  

 

 

 

కం.

ద్వారమ్ములఁ బరిఘమ్ముల

దారుణ పర్వతముల వితతము భేదించున్

మూరు నిజ శరీరము మే

దో రక్తములం దడియఁగఁ దోరం బనిలో     

  1.  

 

 

 

చం.

ఘనతమ నాద సంయుతము కర్కశ వజ్ర సమాన సారముం

బెనఁకువ లందుఁ జీల్చునది భీమము క్రుద్ధత నిశ్వసించు పా

మునకు సమాన మైన యది భోజన మిచ్చును గంక గృధ్ర గో

మి నిచయ రాక్ష సావలికి మించి బకాలికి నిత్య మాజిలో        

  1.  

 

 

 

తే.గీ.

యమ సదృశ రూప మడర భయదము వాన

రేంద్రులకు హర్ష దాయక మెల్ల రక్క

సులకు లయదము గరుడి ఱెక్కల విచిత్ర

ముల నొనర్పఁ బడెను జవము ఘనతరము         

  1.  

 

 

 

మ.

అనిలో రాఘవుఁ డట్టి మార్గణము నత్యంతోత్తమమ్మున్ భయ

మ్మును నిక్ష్వాకుల కెల్ల వారికి వడిం బోకార్చుచున్ శత్రు కీ

ర్తిని విధ్వంసము సేయు దానిని నతిప్రీతిన్ మదిం గూర్చు దా

నిని మంత్రించుచు వేద సూక్తములు వింటిం గూర్చె నుగ్రుండునై       

  1.  

 

 

 

తే.గీ.

అట్లు సంధించు చుండంగ నస్త్ర వరము

రాఘవుం డుత్తమమ్మును రణము నందు  

సర్వ భూతమ్ము లందెఁ ద్రాసమ్ము నవని

యెల్లఁ గంపించె నెల్లరు తల్లడిల్ల    

  1.  

 

 

 

ఆ.వె.

వంచి కార్ముకమ్ము మించి క్రుద్ధుండునై

సావధానుఁ డయి మహాత్ముఁ డంత

మార్గణమ్ము వైచె మర్మ విదారణ

మా దశాస్యు పైన నద్భుతమును       

  1.  

 

 

 

ఆ.వె.

వజ్రి బాహు ముక్త వజ్రమ్ము భంగి కృ

తాంత సన్నిభము దశానన ఘన

వక్ష మందుఁ బడె నవార్యమై రామ ము

క్త శర రాజ మంత దారుణముగ      

  1.  

 

 

 

చం.

శర మది ముక్తమై యటుల సంహస నాంతక మంత శత్రు భీ

కరము దురాంతరాత్ము దశకంఠుని వక్షముఁ జీల్చె వేగ చీ

ల్చి రుధిర సిక్తమై యసుర శేఖరు దుష్కర కర్ము రావణా

సురు నసువుల్ హరించియె వసుంధరఁ జొచ్చెను వేగవంతమై

  1.  

 

 

 

ఆ.వె.

చంపి రాక్షసేంద్రు సమర మందు శరము

సుకృత కర్మ మంతఁ జోద్యముగను  

రక్త సిక్త కాంతి యుక్తమై స్వీయ తూ

ణీర మందుఁ జొచ్చె నెల వనంగ    

  1.  

 

 

 

తే.గీ.

హతుని విగత జీవితు రావ ణాసురు ఘన

హస్త తలమున నుండి రయమున వాని

యసువులను గూడి కార్ముక మంబకమ్ముఁ 

గూడి ధరణీ తలమ్మునఁ గూలె నంత   

  1.  

 

 

 

కం.

నైరృత విభుఁ డతి వేగుం

డా రావణుఁడు ద్యుతి మంతుఁ డసు హీనుఁ డహో

యా రథము నుండి ధరఁ బా

కారి కులిశ నిహత వృత్రుఁ డనఁగం గూలెన్   

  1.  

 

 

 

కం.

హత శేషులు రక్కసులు ప

తితు ధరపైఁ బతిని గాంచి దిశలకు భీతిన్

విత తార్తులు పరువు లిడిరి

హత నాథులు వీడి సంగ రాంగణ మెల్లర్

  1.  

 

 

 

ఆ.వె.

వారి నెల్లెడలను వానరులు జితకా

శులు  ఘన తరు యోధు లలరి వెంట

నంటి రపు డరసి దశానను మరణము

నెల్ల రుత్సహించి హీన భయులు       

  1.  

 

 

 

కం.

హరి వీరులు బాధింపఁగ 

నిరాశ్రయులునై యసురులు నీ రొలుకంగాఁ

గర మక్షుల జాలి నెగడ

నరిగిరి లంకకు నడలున నార్తి సెలంగన్      

  1.  

 

 

 

తే.గీ.

విజయ సుప్రకాశ ముఖులు వీర వరులు

వానరులు సంతసించిరి మాన వేంద్రు

రాముని జయమ్ము కొనియాడి రావణు వధ

నుడివి నినదించి రెల్లరు బెడిదముగను

  1.  

 

 

 

ఆ.వె.

అంతరిక్ష మందు నంత మ్రోగినవి సౌ

మ్య సుర దుందుభు లట నమర గంధ

యుక్త సుఖద మారు తోత్తమ మపుడు వీ

చె నడరుచు భృశమ్ము చెలువముగను     

  1.  

 

 

 

కం.

కురిసెను రామస్యందన

వరమునఁ జల్లుచును బుష్ప వర వృష్టి భువిన్

దురవాపమ్ము నతి మనో

హర మాకాశమున నుండి యానందదమై    

  1.  

 

 

 

కం.

వినిపించె రాఘవస్తవ

నినదమ్ములు సాధు వంచు నింగిని నమరుల్

ఘనముగ వచించు చుండఁగ

మునుల మహాత్ములను గూడి ముద మడరంగన్     

  1.  

 

 

 

కం.

ఆవేశించెను హర్షము

దేవతలకుఁ జారణ వితతి సహిత మంతన్

రావణుఁడు రౌద్రుఁడు హతుఁడు

గా విశ్వ భయంకర దశకంఠుం డట్లున్   

  1.  

 

 

 

ఆ.వె.

సుప్రసన్నుఁ డట్లు సుగ్రీవు నంగదు

బల్లిదు నొనరించె నుల్లసిల్లఁ

బ్రాప్త కాములుగను రాముఁడు వధియించి

రావణుని రణమున రాక్షసేంద్రు     

  1.  

 

 

 

చం.

పడసిన దా మరుద్గణము పన్నుగ శాంతిని వెల్గె దిక్కు లె

ల్లెడల నభం బహో విమల మింపుగ నయ్యెఁ జలింప దింతయుం

బుడమియు వీచె  మారుతము మూరి వెలింగె దివాకరుండు న

ప్పుడు నిజ కాంతులం గరము పోరున రావణుఁ డాఱ నవ్విధిన్      

  1.  

 

 

 

ఉ.

ఆ విజయమ్ము నందఁగ మహాత్ముఁడు రాఘవుఁ డాజి లోన సు

గ్రీవ విభీష ణాంగదులు హృష్టులు లక్ష్మణు గూడి రామునిన్

భూవరు మిత్ర సంయుతము భూరి విదార వరాభిరామునిన్

వావిరి సంస్తుతించిరి యపార ముదం బడరన్ యథావిధిన్    

  1.  

 

 

 

కం.

హత ఘోర రిపుండు స్థిర

ప్రతిజ్ఞుఁడు రఘుకుల వర నృపతి స్వజన బ లా

వృతుడై తేజస్వి త్రిదశ

తతి పరివృత వజ్రి భంగిఁ దద్ద వెలింగెన్

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట పదునొకండవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 112.

 

 

 

అన్న రావణుఁడు సమరమున మరణించి పుడమిపై శయనింపఁ గని విభీషణుండు శోకార్తుండై విలపించు చుండ రాముఁ డూఱడించి యన్నకు నంతిమ సంస్కారము లొనరింప విభీషణు   ననుమతించుట.

 

 

 

 

కం.

అగ్రజు శయనింప నిహతు

నుగ్ర రణం బందు నరసి సోదరుఁ డంతన్

వ్యగ్రుండు నై విభీషణుఁ

డగ్రమున నిలిచి కలంత నట విలపించెన్      

  1.  

 

 

 

ఆ.వె.

వీర వరుఁడ! సుప్రవీణ! విక్రాంత! వి

ఖ్యాత! యుత్తమ శయనార్హుఁడ! నయ

కోవిద! శయనింతు వీ వక్కజముగ ని

ట్లేల నిహతుఁడ వయి నేల నేఁడు

  1.  

 

 

 

ఉ.

అంగద భూషితమ్ముల మహాత్మ! భుజమ్ముల నున్నతమ్ములన్

సంగర భూమి నిట్లునిచి సన్నగిలంగ స్వచేష్ట లన్నియుం

గ్రుంగఁ గిరీట కాంతులు సుఘోరముగా నిట భాస్కరాభముల్ 

భంగము గాఁగ నిట్లు నిజ పౌరుష మెల్లను నేల నుంటివే     

  1.  

 

 

 

ఉ.

మున్నట నేను జెప్పినది మూరఁగఁ గామము మిక్కుటమ్ము నీ

వెన్నని యట్టి దిప్పు డరుదెంచెను వీర వరేణ్య! యివ్విధిం

గ్రన్నన నా ప్రహస్తుఁ డతి కాయుఁడు రావణి కుంభకర్ణుఁడున్

మన్నన సేయ రుద్ధతిని మంచి గిరాలి నరాంతకుండునున్   

  1.  

 

 

 

ఆ.వె.

అతిరథుండు నీవు నన్యులు నంగీక

రింపకుండ నుత్సహింప దాని

ఫలము మించి నేఁడు వచ్చిన దీ రూప

మున నిశాచరేంద్ర! పుడమిఁ గూల

  1.  

 

 

 

సీ.

మంచి నీతుల యెల్ల పంచత్వ మందెను ధర్మశరీరము తఱిఁగె నిపుడు

సత్త్వసంక్షేపమ్ము సడలె నెల్లఁ బొగడ్తల గతి నశించె నిల నరయంగ

నాదిత్యుఁ డక్కట యవనిఁ గూలి నిలువఁ జంద్రుండు మున్గె మేచకము నందు 

నాఱిన జ్వాలల నగ్ని యుత్సాహ మణఁగ నుద్యమింపఁడు విగత రుచుల               

 

ఆ.వె.

శస్త్రధరుల మేటి శస్త్రధరుం డిట్లు 

రాక్షసేశ్వరుండు రావణుండు

వీర వరుఁడు గూలఁ బృథ్వీ తలమ్మున

మేదినీశుఁడు నరిసూదనుండు    

  1.  

 

 

 

కం.

నిదురించి నట్టు లుండం

గ దుమ్ము లో రాక్షస గణ కాంతుం డిట్లుం

జెదరిన బలమ్మున మిగిలి

న దేమి యున్నది జగముల నైరృత వర్యా!    

  1.  

 

 

 

తే.గీ.

ధైర్య మనెడు ప్రవాళము దాల్మి యనెడు

సుమము శౌర్య మనియెడు మూలము దనరెడు

రావణుఁ డనెడు వృక్షమ్ము రాముఁ డనెడు

మారుతమ్ముచేఁ గూలె సమర తలమున      

  1.  

 

 

 

తే.గీ.

దంతములు గాఁగఁ దేజము దనర వెన్నె

ముకగ వంశము దన కోపము కరుణలు బ

రగఁగ వీపు తుండములుగ రావణ మద

గజము గూలె నిక్ష్వాకు మృగపతి చేత             

  1.  

 

 

 

తే.గీ.

విక్ర మోత్సాహ జృంభిత స్వీయ భీక

రార్చి స్వబల ప్రతాపము  నతుల సుప్ర

తాపవంత రాక్షస నామ దారు ణాగ్ని

యాఱె నాజిలో రామ నామాంబుదమున 

  1.  

 

 

 

తే.గీ.

తోఁక మూపు కొమ్ములు గాఁగ వీక నసుర

సింహు లరి నాశి లౌల్యపుఁ జెవుల కనుల  

శ్రమ నొసఁగ మద కరి రాక్షసర్షభమ్ము  

రాజ శార్దూల వరముచే రాలె నేల    

  1.  

 

 

 

చం.

పలుకఁగ నా విభీషణుఁడు బాధ యెడందఁ జెలంగ రాముఁ డి

ట్టు లనెను హేతుమంతపు నుడుల్ పరికింపఁగ నిశ్చయార్థముల్

విలయుఁడు గాఁ డచేష్టలను భీకర చండ పరాక్రముం డనిం  

గలహ మొనర్చి తా నుదరి కౌణప నాథుఁ డభీతి రాలెనే    

  1.  

 

 

 

ఉ.

ఎవ్వరు క్షత్ర ధర్మమున నింపుగ నిల్చి వరింత్రు వృద్ధినిన్

నొవ్వరు వారు గూల నని నొంచె నెవండు పరాక్రమమ్మునన్

రివ్వున ముజ్జగమ్ములను రేఁగి బలారినిఁ గూడి యా బుధుం 

డివ్విధిఁ గూల నేల నశియింపఁగఁ గాలము కాదు చింతకున్

  1.  

 

 

 

ఉ.

మున్నిలఁ గాదు నిశ్చయము పోరున గెల్పు దలంప నేరి కే

నెన్నఁడు నాజిఁ జంపుటయు నేని పరాలినిఁ దాను జచ్చు టే

నెన్నగ నౌను క్షాత్రవుల కియ్యది యుక్తము రాచ పుట్టువే

చన్న రణమ్ము సేయుచు విషాదము నందఁగ రాదు వానికై    

  1.  

 

 

 

ఆ.వె.

దీని నెఱిఁగి తత్వ మూని మది విచార

ముడిగి యిప్పు డింక నొప్పు నట్టి

పని నొనర్పఁ బూన వలయుఁ జింతింపుమ

దాని నింక నీవు త్వరిత గతిని   

  1.  

 

 

 

కం.

గిరల ననిన విక్రాంతుని

వర రాజకుమారు నరసి వచియించెను సో

దర హిత మనంతరమును నొ

నరింపఁగ విభీషణుండు నలినాక్షునితో   

  1.  

 

 

 

కం.

అపరాజితుఁ డాజి నితం

డు పూర్వము మహోగ్ర వీరుఁడు సురల కమ రా

ధిపతికినిఁ గదిసి  నృవరా

ధిప! నిను వేలఁ గదియు వనధి పగిది నోడెన్           

  1.  

 

 

 

తే.గీ.

యాచకుల కిచ్చెఁ బెక్కింటిఁ బ్రోచె భృత్య

గణము ననుభవించెఁ గడు భోగముల మిత్రు

లకు సమర్పించె విత్తములను రిపులకు

నొసఁగె వైర మడరి రాక్షసోత్తముండు    

  1.  

 

 

 

తే.గీ.

ధరణి నిత్యాగ్నిహోత్రుండు తాపసుండు

వేద వేద్యుండు కర్మాలి వినుత శూరుఁ

డితని ప్రేత కృత్యమ్ముల నే నిట నొన

రింప నిచ్చగింతు ననుమతింప నీవు     

  1.  

 

 

 

కం.

కరు ణావృత వాక్యమ్ముల 

సురుచిరముగ వేఁడుకొన నసుర రాడ్వర సో

దరుఁడు నరేంద్ర కుమారుఁ డ

పర లోకపుఁ గర్మములకుఁ బనుపు నొసంగెన్         

  1.  

 

 

 

కం.

మర ణాంతమ్ములు వైరము

లరసితిమి స్వకార్యము మన మందఱ మాజిన్

గురు సంస్కారము లెల్ల నొ

నరింపు నీకు నితఁ డెట్లొ నాకును నట్లే      

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట పండ్రెండవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 113.

 

 

 

రావణుని మరణ వార్తను విని రావణ కాంత లంతఃపురమును వీడి యుద్ధ భూమికి వచ్చి నేలపైఁ బడి యున్న రావణునిఁ గాంచి విలపించుట.  

 

 

 

 

కం.

విని రావణు మరణమ్మును

మను జేంద్రుని చేత నసుర మానిను లా రా

మునిచే నని నంతఃపుర

ము నుండి వెలువడిరి త్వరితముగ శోకార్తల్    

  1.  

 

 

 

కం.

వారించినఁ బెక్కు గతుల

నారీ మణులు కురు లూడ నైరాశ్యమునన్

వారలు దొర్లుచు దుమ్మున

ఘోర తరముగ హతవత్స గోవులు వోలెన్    

  1.  

 

 

 

చం.

అసురులఁ గూడి యుత్తరపు టా పెను ద్వారము నిష్క్రమించి యా

యసురులు సంగ రాంగణము నంగన లంతటఁ జేరి రోయుచున్

వెసఁ బతి నార్యపుత్ర! యని వేదనఁ బల్కుచు నాథ! యంచు న

ల్దెస రుధిరంపు ఫేనములు దేలఁ గబంధము లుండఁ గాంచుచున్     

  1.  

 

 

 

తే.గీ.

ఎల్లెడల నుండి యరుదెంచి తల్లడిల్లి

కనులఁ గన్నీరు నిండంగఁ గాంత శోక

తప్త లార్చి రప్డు హతయూధప కరేణు

గణము భంగిని ఘోరముగ ధ్వను లడర      

  1.  

 

 

 

ఉ.

కాంచిరి వారు రావణునిఁ గాటుక ముద్దను బోలు వానినిన్

మించిన వీర్యవంతుని నమేయ శరీర మహా ప్రభాయుతుం 

బంచత నంది నేలఁ బడ భర్తను దొర్ల రజమ్మునం దటుల్

గాంచిన ఛిన్నవల్లు లన గాత్రములం బడి రెల్ల రంతటన్    

  1.  

 

 

 

ఉ.

ఒక్కతె గౌఁగిలించికొని యుగ్మలి యీతని గౌరవమ్ముతో

నొక్కతె వట్టి పాదముల నొక్కతె కంఠముఁ బట్టి యేడ్వఁగా

నొక్కతె యెత్తి బాహువుల నుర్విని దొర్లుచు నుండ నార్తితో

నొక్కతె గూలె మోహమున నుక్కిన వాని ముఖమ్ముఁ గాంచఁగా

  1.  

 

 

 

ఆ.వె.

శిరము నంక మందుఁ జేరిచి యొక్కతె

యేడ్చెఁ గాంచుచును నిజేశు ముఖము

నశ్రములఁ దడుపుచు నాస్యమును దుషార

మంబుజమును భంగి నార్తి తోడ       

  1.  

 

 

 

ఆ.వె.

ఆర్త లింతు లిట్లు భర్తను హతు ధరా

పతితుఁ గని యనేక గతులఁ  బలవ

రించుచును గలంత మించ నేడ్చిరి యెల్ల

రప్డు మరల మరల నసుర సతులు    

  1.  

 

 

 

ఉ.

ఎవ్వరు శక్రు భీతు నొనరించెను గాలుని తోడ నాజి నిం

కెవ్వరు గెల్చి వైశ్రవణు నింపుగఁ గైకొనెఁ బుష్పకమ్ము నిం

కెవ్వరు దేవగాయనుల నెల్ల సురర్షులనున్ భయార్తులై

నివ్వటిలంగఁ జేసె ననినిం బగ నాతఁడు గూలి పండెనే     

  1.  

 

 

 

కం.

దేవాసు రోరగమ్ముల

నేవిధి భయ మరయని యసురేశ్వరునకు ని

ట్లీ వసుధ మానవ భయ మ

హోవారక దాపురించె యుద్ధము లోనన్    

  1.  

 

 

 

కం.

సురల కవధ్యుఁడు రాక్షస

వరులకు నైనఁ బరికింప భండన మందున్

నరవరుని పదాతి వలన

దురమునఁ గూలి శయనించె దుర్జయుఁ డైనన్    

  1.  

 

 

 

తే.గీ.

ఎవఁ డశక్యుఁడు సురలకు నేని యక్షు

ల కసురుల కైన వధియింప రణము నందు

నట్టి వాఁ డబలుం డైన వట్టి మర్త్యు

ని వలనఁ బడసె మృత్యువు భువిని నేఁడు        

  1.  

 

 

 

కం.

విలపించి రిట్లు వాని స

తులు పలుకుచు ఘోరతరము దుఃఖిత లింకం

బలవించిరి మరల మరల  

విలపించిరి బలు తెఱగుల వేదన మీఱన్       

  1.  

 

 

 

తే.గీ.

వినమి సుహృదుల నీ హితము నెదఁ గోరు

వారి నీ మరణార్థమ నారి సీత

తేఁ బడెను గూలె నసుర తతి రణ మందుఁ 

బతితులము మేము నీవును నుత బలాఢ్య!      

  1.  

 

 

 

ఆ.వె.

ప్రియపు టవరజుఁడు విభీషణుండు హితము

వలుక వాక్యములను బరుషములను

బలికి పంపి తీవు తెలియక స్వీయంపు

వధ నెడందఁ గోరు విధము దోఁప   

  1.  

 

 

 

ఆ.వె.

సీత నిచ్చి యున్న నా తఱి రామున

కీవు మైథిలి నసు రేంద్ర! నేఁడు

మూలహరము ఘోరము వ్యసనమ్ము నకట

యందఱ మిటఁ బడయ కుందు మిట్లు    

  1.  

 

 

 

తే.గీ.

ప్రాప్త కాముఁడై యుండును భ్రాత మిత్ర

కులుఁడు నై యుండు రాముండు వెలయు చుందు

మెల్లర మవిధవల మయి యుల్లసిల్లి 

కారు మన శత్రు లెల్ల సకాము లిట్లు

  1.  

 

 

 

కం.

క్రూరుఁడ వగు నీ చేతను

ఘోరమ్ముగ నుంచఁ బడియెఁ గోమలి చెఱలో

నీ రాక్షసాలి నీవును

దారలు మేముఁ బతితులము త్రయము సమముగన్   

  1.  

 

 

 

కం.

కా వసురేశ్వర! కతములు

నీ వాంఛించిన పను లవి నిక్కం బెంచన్

దైవమ చేయును సర్వము

దైవ విఘాతమున హతులు తథ్యముగ జనుల్

  1.  

 

 

 

కం.

వానర వినాశ మేనియు

నీ నీ రాక్షసుల చావు లేనియు నింకన్

నీ నిర్యాణం బైన ద

శానన! దైవమ్ము చేత నైనవి యెల్లన్      

  1.  

 

 

 

తే.గీ.

అర్థమున నైనఁ గోరిక నైన విక్ర

మమ్మున నయినఁ జింతింపఁ బమ్మి నట్టి 

యుగ్ర మైన యాజ్ఞ నయిన నుద్యమింప

దైవ గతినిఁ దప్పింపఁగఁ దరము గాదు

  1.  

 

 

 

కం.

అక్షయ భాష్ప జ లాపూ

ర్ణేక్షణలు విచార తప్త హృదయలు దీనల్

రక్షా హీనత నేడ్చిరి

యా క్షణమునఁ గురరుల వలె నసు రాంగనలే   

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట పదుమూడవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 114.

 

 

 

రావణాసురుని రాముని చేతిలో హతుని రణ భూమిలోఁ గాంచి జ్యేష్ఠ పత్ని మండోదరి విలపించుట, రాముని యాదేశముతో విభీషణుఁ డన్నకు నగ్ని సంస్కారము లొనరించుట. 

 

 

 

 

కం.

విలపించు రాక్ష సాంగన

ల లోన జ్యేష్ఠ సతియుఁ బ్రియు రాలు నిజ పతిన్ 

విలయుని నచింత్య కర్ముని

వలనను మండోదరి గని వగ విలపించెన్   

  1.  

 

 

 

ఆ.వె.

రామ హస్త నిహతు రావణు దశకంఠు

నంత నరసి దీన యై భృశముగ

జాలి గొలుపు రీతిఁ జాల విలాపించెఁ

బట్టమహిషి యిట్లు బెట్టిదముగ      

  1.  

 

 

 

ఉ.

పర్వదె భీతి శక్రునకు వైశ్రవ ణానుజ! యూన భీక రా

ఖర్వపు టాగ్రహమ్ము నెదఁ  గట్టెదుటన్ నిలువంగ నింక గం

ధర్వులు చారణర్షులును దద్ద భయంపడి దీర్ఘ బాహుఁడా 

గర్వము వీడి పాఱ దశకంఠ! దిశాలికి మున్నెఱుంగమే   

  1.  

 

 

 

చం.

మదిఁ ద్రప నూన వక్కజము మానుష మాత్రున కోడి యాజి నే

మిది యసురేంద్ర! ముజ్జగము లెల్లను బల్మిని నాక్రమించి  నీ

వుదరి సిరిన్ వహించి కడు నుద్ధతి వర్ధిలఁ గాననమ్ములన్

వదలక తిర్గు మానవుఁడు పట్టి యెటుల్ వధియించె దుస్సహున్

  1.  

 

 

 

చం.

నరులకు రాని చోటున ఘనమ్ముగ నిల్వఁగఁ గామ రూపతం 

బరఁగెడు వాని నాశనము భండన మందు రఘూద్వహుం డొన

ర్ప రుచిర మంచు నెట్టు లన వచ్చును నమ్మఁగఁ జాల నేను సం

గరమున నుండ సిద్ధత నృకాంతుఁడు ధర్షితుఁ జేసె నిన్ననన్        

  1.  

 

 

 

ఉ.

కానన మందు నా ఖరుఁడు కౌణప యుక్తుఁడు భ్రాత తజ్జన

స్థానము నందు నవ్విధము సంపఁ బడంగఁ దలంప హర్త దా 

మానవ మాత్రుఁ డౌనె హనుమానుఁడు లంకను దేవతా గణం

బేనియుఁ జేర రానిది తపించితి మప్పుడె చేర బల్మినిన్

  1.  

 

 

 

తే.గీ.

ఘోర వానరు లెప్పుడు వారిరాశి

వారధినిఁ గట్టి రప్పుడె యా రఘు సుతు

రాముని యమానుషత్వము నా మనమ్ము

నందు శంకించితిని నాథ! డెంద మడల       

  1.  

 

 

 

ఆ.వె.

లేనిచోఁ గృతాంతుఁ డేని స్వయమ్ముగఁ 

బన్ని మాయ నిట్లు వచ్చి యుండ

నోపు నిపుడు రామ రూపమ్మున ననూహ్య

ముగను నీదు నాశము నరయంగ          

  1.  

 

 

 

ఆ.వె.

లేక వాసవుండు రేఁగి నిన్నెదిరించి

యుండ నోపు నేమొ దండి బలుఁడ! 

యయిన నిన్నెదిర్ప నాజిలో నాతని

కట్టి శక్తి కలదె యరసి చూడ   

  1.  

 

 

 

సీ.

వ్యక్త మితండు మహాయోగి పరమాత్ముఁడు సనాతనుండు నడుము తుది మొద

లును లేని పరమ పురుషుఁడు ఘనుఁ డతీతుఁ డజ్ఞానమున కెల్ల నరయ ధాత

శంఖ చక్ర గదా లసద్ధస్త విలసిత శ్రీవత్స వక్షుండు శ్రీ యుతుండు

నిత్యం బజేయుండు సత్య పరాక్రముండు ధ్రువుఁడు శాశ్వతుండు నర రూప

 

తే.గీ.

మూని విష్ణువే యమరులు వానరత్వ

మూని పరివృతు లై యుండఁ దాను సర్వ

లోక నాథుండు హిత మీయ లోకములకుఁ

జంపె నిన్ను సరాక్షస సంచయమ్ము      

  1.  

 

 

 

కం.

మున్నింద్రియముల నీ వె

ల్లన్నిర్జించి భువనమ్ముల జయించితివే 

యెన్నినవో యా వైర మ

నన్నిన్నోడించిన వవి నాథా! యకటా

  1.  

 

 

 

కం.

తనరుపు తగ నవిరోధం

బనఘా! రాఘవుని తోడ నంచును నీ తో

డ ననేక వారములు నే

నన నొల్లవు దాన వచ్చె నా ఫల మిట్టుల్  

  1.  

 

 

 

ఉ.

జానకి పైఁ దటాలున నిజక్షయ కారక ముద్భవించె నీ

మానస మందుఁ గామ మది మాపఁగ సంపద బంధు వర్గముం 

గానఁగఁ దా నరుంధతికిఁ గల్లరి! రోహిణి కెన్న మిన్నయౌ

మానిని భంగ పెట్టి కడు మాన్యను దుష్కృత మీ వొనర్చితే       

  1.  

 

 

 

చం.

స్వజన నిజాంగ నాశకుఁడ! క్ష్మాకును క్ష్మా యగు శ్రీకి శ్రీయు నా

విజనను జానకీ సతినిఁ బెన్ననవద్యను భర్తృ వత్సలం

గుజన మతీ గ్రహించి వనిఁ గొంచును వచ్చితి కోర్కి తీరకే

కుజ సుతపః ప్రభావమునఁ గ్రూరుఁడ! దగ్ధుఁడ వైతివే ప్రభూ!

  1.  

 

 

 

తే.గీ.

సీత నా తను మధ్యను వీత భీతి

నీవు తాఁకిన యప్పుడె నీఱు కాక

యుంటి వేలన భీతిల్లి యుండి రింద్రుఁ

గూడి దేవత లెల్ల నీకు ననలుఁడును      

  1.  

 

 

 

చం.

ఫల మొనగూరుఁ దప్పకయె పాప మొనర్చెడు నెల్లవారి కీ

యిల నిజ పాప కర్మముల కెల్లను గాలము దాపురింపఁగా

వల దిట శంక కల్గును శుభం బొనరింప శుభమ్ము చెడ్డకుం

గలుగును జెడ్డ నీకుఁ జెడు గల్గ విభీషణుఁ డందె సౌఖ్యముల్    

  1.  

 

 

 

ఉ.

రూపము నందు నత్యధిక రూపవతుల్ లలితాంగు లెందఱో 

ప్రాపున నుండ నీకు స్మర వశ్యత నజ్ఞత నేర కుంటివే

రూపము నందు నేర్పున సులోచన సీత కులమ్ము నందు నో 

హో పరికింప నెక్కు డయి యుండునె  నా కిల లేక తుల్యయే   

  1.  

 

 

 

కం.

కారణము లేక మరణం

బేరిని నెన్నండును వరియింపదు కన నీ

కా రీతి నయ్యె మైథిలి

కారణము లయమునకు దశకంఠ! దృఢముగన్

  1.  

 

 

 

తే.గీ.

చేరె సీతా నిమిత్తము దారుణంపు

మృత్యు వెంతొ దూరము నుండి మీఱి నిన్ను

మైథిలి విహరించు నిఁక రామ నృవరేంద్రుఁ

గూడి యెల్ల శోకమ్మును వీడి రహిని

  1.  

 

 

 

ఉ.

కూలితి నల్ప పుణ్యను సుఘోర విచార సముద్ర కుక్షిలో

మేలుగ వెండి కొండ పయి మేరు స మందర పర్వతమ్ములన్

లీలగ సంచరించుచు వరిష్ఠ విమానము లందు దేవతా

పాలిత వాటికా తతులఁ బన్నుగఁ జైత్ర రథాంగణమ్ములన్    

  1.  

 

 

 

తే.గీ.

ఇంపుగ నతుల వైభవ సంపదల ధ

రించి చిత్ర స్రగంబర సంచయమ్ము

చూచితిఁ దగ నీతో బలుచోట్లు దఱిఁగెఁ

గామ భోగమ్ము లిఁక నీవు భూమిఁ గూల

  1.  

 

 

 

ఆ.వె.

అట్టి నేను గాంచ నన్యకాంతను భంగి

నైతి నేఁడు దీన నైతి నకట

చంచలమ్ము లౌను సార్వభౌముల సంప

ద లవి చీ తలంప ధరణి లోన   

  1.  

 

 

 

ఉ.

గోముగ మంచి కన్బొమలఁ గొప్ప త్వచమ్మున  నెత్తు ముక్కునన్

దామర వెల్గుఱేనులకుఁ దమ్ముల గొంగకు నీడుజోడునై

నీ ముకుటంపు సొంపు జిగి నివ్వటిలంగఁ గడింది యెఱ్ఱనై

మోము సెలంగు చుండుఁ గడు మున్నది హా యసు రేంద్ర! నేఁ డహో           

  1.  

 

 

 

ఉ.

కల్లు గొనంగ మిక్కుటము కన్నులు దిర్గఁగఁ గల్లుపాకలో

నుల్లము గొన్న దండల నహో చిఱునవ్వులఁ బల్కు సుద్దులున్

గొల్లున రేఁగు నా మొగము కొట్టఁబడంగను రాము తూపులం

ద్రుళ్లఁగఁ గ్రొవ్వునున్ మెదడు దుమ్మున వెల్గదు కాఱ నెత్తురున్   

  1.  

 

 

 

కం.

చివరి దశ యేఁగుదెంచెఁ గ

ద విధవగ నొనర్చునట్టి దారుణ గతి యి

ట్లవు నంచు మంద బుద్ధి న

యి విషయ మూహింప నైతి నే మన వచ్చున్    

  1.  

 

 

 

తే.గీ.

దానవేశ్వరుండు స్వయము దండ్రి నాకు

రాక్షసేశ్వరు నేను భర్తగఁ బడసితి

నా సుతుఁడు శక్రనిర్జేత యీ సరణిఁ ద

లంచి గర్వింతు నిత్యమ్ము మించి నేను

  1.  

 

 

 

ఉ.

నమ్మితి నిశ్చయమ్ముగను నా మన మందు మదీయ రక్షకుల్

సమ్మత శత్రు మర్దనులు సన్నుత వీర్య పరాక్రమోన్నతుల్

గ్రమ్మ నెఱుంగ రెట్టి భయ కారక వేదన లంచు సంతతం

బిమ్మెయి రాక్షసప్రవరు లెట్లగు మానవ భీతి మీ కిటుల్

  1.  

 

 

 

సీ.

నున్నని నల్లని మిన్న యయ్యింద్రనీలము వంటి మేను శైల సదృశమ్ము 

కేయూర వైడూర్య కాయాంగద సిత ముక్తాహార మాలల కాంతు లడరు

గాత్రము విహరించు కాలమ్ముల రణమ్ములందు భృశము వెల్గు నంగ మాభ

రణ రాశినిఁ తటిత్తుల పగిది రంజిల్లు నట్టిది దుర్లభ మంటఁ దిరిగి         

 

తే.గీ.

ముళ్లపంది యీకలఁ బోలు ముల్కు లుండ

నిరవకాశముగను మర్మ నివహముల వె

లువడఁ బ్రేవులు ధరఁ గూల వివశ మంది 

రక్త కాంతుల వెల్గుచు రణ తలమున     

  1.  

 

 

 

ఆ.వె.

వజ్ర ఘాత భంగ పర్వతమ్మును బోలి

నేలఁ గూలి నట్టి కాల మేఘ

సన్ని భంపు మేన నున్న నశక్య మ

య్యె నిను గౌఁగిలింప నిపుడు నాకు   

  1.  

 

 

 

కం.

కలయా యిది సత్యంబా

యిల మృత్యున కీవు మృత్యువే పరికింపన్

విలయుఁడ వెవ్విధి నైతివి

కలనున రాఘవుని చేతఁ గాలు వశుఁడవై    

  1.  

 

 

 

తే.గీ.

ముజ్జగమ్ముల విత్తంపు  భోక్త వీవు

ముజ్జగమ్ములకును భయము నిడి తీవు

లోకపాలుర గెల్చితి వీఁక నీవు

శంకరుని నెత్తి తింపుగ సత్త్వ మూని   

  1.  

 

 

 

తే.గీ.

నిగ్రహించితి గర్వుల నిత్య మీవు

నిల్పితి పరాక్రమమ్ము ననల్పముగను

క్షోభపెట్టితి జగముల ఘోరముగను

భూతముల నేడిపించితి మూరి ధ్వనుల

  1.  

 

 

 

ఆ.వె.

విక్రమించి శత్రు వీరుల సన్నిధిఁ

బల్కుదు పరుషంపు వాక్యములను

స్వీయ వర్గ సర్వ భృత్యుల రక్షకుం

డ వతి భీమ కర్ముల వధియింతు

  1.  

 

 

 

ఆ.వె.

దానవేంద్ర! యక్ష తతుల వేల వధించి

నాఁడ వీవు బలము తోడ నని ని

వాత కవచుల వెసఁ బన్నుగ సంగ్రహిం

చితి వసుర వరేణ్య! వితత శూర!

  1.  

 

 

 

తే.గీ.

నాశనమ్ము సేయుదువు జన్నముల నడరి

రక్షకుండ వగుదు స్వీయ రాక్షసులకుఁ

గూల్తు ధర్మవ్యవస్థను గోప మూని

మాయ సృష్టించు చుందు సమరము లందు    

  1.  

 

 

 

కం.

దే వాసుర మానవ క

న్యావలిని హరించు వాఁడ వచ్చట నచటన్

వేవేగ రిపుల నారుల

కీ విత్తు వెతలను నేతవే స్వజనులకున్

  1.  

 

 

 

ఆ.వె.

అసుర నిచయ నిలయ మైన లంకాద్వీప

మునకు రక్షకుఁడవు భూరి భీమ

కర్మము లొనరించు కౌణప పతివి మ

హా రథుండ విత్తు వన్ని మాకు     

  1.  

 

 

 

తే.గీ.

ఇట్టి యతుల ప్రభావ మున్నట్టి పతిని

రామ పాతితుఁ గాంచి  స్థిరముగ నుంటి

దేహ మూని ప్రియుఁడు వీడ దేహ మాజిఁ

గఠిన చిత్తను నేను నిక్కమ్ము నెంచ    

  1.  

 

 

 

కం.

గొప్పవి యగు తల్పమ్ముల

నప్పుడు శయనించి చక్క నసుర గణేశా! 

యిప్పుడు దుమ్ము సెలంగెడు

నిప్పుడమిఁ బరుంటి వేల నివ్విధి నాథా!    

  1.  

 

 

 

ఆ.వె.

తనయు నింద్రజిత్తు విని లక్ష్మణుని చే హ

తుఁ డయి నట్లు కొట్టఁ బడితి నపుడు

బెడిదముగ నిపు డిటఁ బడఁ గొట్ట బడతి ఘో

రముగ నిట్లు నేను రాక్షసేంద్ర!   

  1.  

 

 

 

ఆ.వె.

హీన బంధు చయను హీన నాథను నేను

గామ భోగములకు నీ మహీ త

లమున దూర మయి చిరమ్ము శోకించు చుం

దు నిఁక శాశ్వతముగ దుఃఖమునను    

  1.  

 

 

 

ఉ.

పొందితె దీర్ఘ మార్గమును బోవ నశక్యము రాక్షసేశ్వరా!

కుందున నే వసింప నిటఁ గోర ననుం గొని పొమ్ము నీవు లే

కెందుల కిట్లు నన్ను విడి యెంచితి వేఁగ వచింప వేల నే

వందుచు నుండ దీన నయి వాక్యము లెవ్వియు మంద బుద్ధితో    

  1.  

 

 

 

కం.

నగర ద్వారము నుండి ము

సుఁగు లేకయె రాఁగ నడచుచును నాథా! నే

ను గని సహింపక క్రుద్ధుఁడ

వు గాదు గద నా పయిం బ్రభు! నిజాంగనపై

  1.  

 

 

 

ఆ.వె.

ఇష్ట దార! దార లిట్లు వెడలి రాఁగ

వీడి ముసుఁగు లెల్ల బిడియ పడక

బయట కెల్లరు గని పడయ వేల కినుక

సుంతయుఁ బరికింపఁ జోద్య మయ్యె     

  1.  

 

 

 

ఆ.వె.

క్రీడ లందుఁ దోడు కృత్స్నమీ దారా జ

నమ్ము నీకు నిల్చె నుమ్మలించి

యిట ననాథ భంగి నేల యోదార్పవు  

గౌరవింప కుంటి కరుణ వీడి

  1.  

 

 

 

ఉ.

స్త్రీలు పతివ్రతా మణులు  సేవలఁ బెద్దలఁ దన్పు వారు నీ

చే లలితాంగు లెందఱొ కృశించిరి యార్తిని భర్తృ హీనలై

వాలఁగ వారి శాపములు వశ్యుఁడ వైతివి వాని కివ్విధిన్

వ్రాలిన విప్డు నీ పయిన భర్తలఁ బాసిన వారి తిట్టులే        

  1.  

 

 

 

తే.గీ.

పడ విలఁ బతివ్ర తావలి భాష్పములు ద

లంప రిత్తగ నెన్నండు రాక్షసేంద్ర!

యన్న నానుడి యిత్తఱి నయ్యె నిజము 

నీ యెడలఁ బరికింపగఁ బ్రాయికముగ   

  1.  

 

 

 

కం.

లోకముల నాక్రమించి య

హో కుత్సిత కార్య మెట్టు లొనరించితి నీ

వీ కాంతా చౌర్యమ్మును

నీకుఁ దగునె గర్వమాని! నిస్సత్త్వుఁడవే   

  1.  

 

 

 

కం.

మృగ కపటమ్మునఁ దోర

మ్ముగం దఱిమి రాముని వని భూసుతఁ గొన్న

ట్టి గతి దలఁపఁ బిరికి తనమె

తగునే శూరుల కొనర్పఁ దలఁపవు మదిలో    

  1.  

 

 

 

కం.

పిరికితనం బది నీ యం

దు రణమ్ముల నుండ నెఱుఁగ దుర్భాగ్యమునన్

ధరణిజఁ దెచ్చితి లక్షణ

ము రాక్షస! యది యఘ పక్వమునకుఁ దలంపన్      

  1.  

 

 

 

తే.గీ.

జరిగినవి జరిగెడివియు జరుగు చున్న

వి యెఱుఁగఁ గలట్టి నా మఱఁది యపహృతను

సీతఁ గాంచి నిట్టూర్చుచుఁ జింత సేసి

యా విభీషణుం డన్నది యరుగుదెంచె      

  1.  

 

 

 

తే.గీ.

సత్య వచనుండు దీర్ఘ భుజద్వయుండు

వలికిన యసుర ముఖ్యుల పాటు వచ్చెఁ 

గామ రోష సంజనితము కాంత పైన

మోహ మడరంగ నీ కిట్లు మూరె లయము   

  1.  

 

 

 

ఉ.

నీదు నిమిత్తమే కలిగె నెవ్వగ మూల హరమ్ము ఘోరమే

యీ దెస రాక్ష సాన్వయమె హీన మనాథగ నయ్యెఁ ద్వత్కృతిన్  

రా దిల నేను నొవ్వగను రాడ్వర! వీర్యుఁడ పౌరుషోన్నతా!

నా దగు స్రీ స్వభావమున నాథ! వహించితి దైన్య మాత్మలో

  1.  

 

 

 

కం.

కొని పుణ్యముఁ బాపమ్మును

జని తీ వరయఁగ నిజ గతి సలిపి సమరమున్

నిను గని నిహతుని దుఃఖ

మ్మున నే శోకించు చుంటి బోరునఁ బుడమిన్       

  1.  

 

 

 

కం.

విన వీవు సఖుల నీ హిత

మును గోరెడు వారి గిరల మోహాంధుఁడవై

యను జోక్తమ్ముల నైనను

వినవే హితముల దశాస్య! వెఱ్ఱితనమునన్

  1.  

 

 

 

తే.గీ.

చేయవు విభీషణుఁడు సక్కఁ జెప్పి నట్టి 

పనిని హేత్వర్థ యుతము శుభము నొసంగు

పనిని శాస్త్ర సమ్మతముగఁ బరఁగు దాని

యుక్తి యుతము నక్రూరము నుచిత మైన

  1.  

 

 

 

కం.

మారీచ కుంభకర్ణులు

తీరుగ నా తండ్రి నేను దేఁటపఱుప ర

క్షో రాడ్వర! బల మత్తత

మూర వినమి యీ ఫలమ్ము మూరెం జుమ్మీ     

  1.  

 

 

 

తే.గీ.

నీల ఘన సన్ని భాంగుఁడ! మేలి పసుపు

రంగు బట్ట లతిశయిల్లఁ బ్రభల నంగ

దమ్ములు మెఱయంగ నవయవమ్ము లుంచి

నేల నెత్తు రోడఁగ శయనింతు వేల     

  1.  

 

 

 

ఆ.వె.

నాథ! పలుక వేల నా తోడ ననిఁ బాఱ

నట్టి వీర్య యుతుని నఖిల జన ను

త వర యాతుధాను దౌహిత్ర!నిద్రించు

నట్టి వాని పగిది నార్త తోడ       

  1.  

 

 

 

తే.గీ.

క్రొత్త యవమాన ముదయించె ఘోర రీతి 

నేఁడు లంకాపురము నందుఁ జూడు సూర్య

రశ్ము లవి సొచ్చుచుండె నిర్భయముగాను

నెమ్మి నిద్రింతు విట్లేల లెమ్ము లెమ్ము   

  1.  

 

 

 

చం.

కరమున నుంచి దేని నరి కాయముఁ ద్రుంచితి వాజిలోఁ బ్రభా

కర సదృశప్రభాచయ నికాశము వజ్ర నిభమ్ము ఖండి తో

గ్ర రిపు గణమ్ము కాంచన వికాశి భవార్చిత హేతి యట్టి నీ

పరిఘను జూడు ముక్క లయి బాణములం బడి యుండె వేలుగన్

  1.  

 

 

 

కం.

ప్రియ సతి నా నేల యిటుల 

శయనించితి కౌఁగిలించి  సమరావని న

ప్రియ వోలెను నా తోడుత

నయముగ మాటాడ వేల నాథా! చెపుమా        

  1.  

 

 

 

ఆ.వె.

వనరునం బగులదు పంచత్వ మంద నీ

విట్లు నాదు గుండె యిచట వేయి

ముక్కలుగను గఠినము కడింది యిస్సిరో

యిది తలంచి చూడ నెప్పగిదిని

  1.  

 

 

 

కం.

విలపించుచు నశ్రుల న

క్షులు వ్యాకులము లయి యుండఁ గుందుచు నంతన్

వలపు సెలంగ మనము దు

ర్బలమ్ము గా మోహ మందె రాణి భృశముగన్

  1.  

 

 

 

ఆ.వె.

మూర్ఛ సన్నగిల్లి పొలఁతి రావణు వక్ష

మందు వెలిఁగె సంధ్య యందు నెఱ్ఱ

నై చెలంగు మేఘ మందుఁ బ్రకాశించు

నట్టి మెఱపు పగిది నసుర కాంత    

  1.  

 

 

 

చం.

సవతులు దుర్భరం బగు దశం గల యట్టి సపత్ని లేపి యం

త వగచు చుండి యాతురలు దారను మిక్కిలి యూఱడించి దే

వి! విదితమే గదా విభుల విత్తము లెల్లను జంచలమ్ము లౌ

టవి దశ మాఱి నంతటనె యంచు వచింపఁగ వార లెల్లరున్        

  1.  

 

 

 

ఆ.వె.

ఆలకించి వార లనుచుండ మండోద

రి విలపించె ధ్వనులు రేఁగ భృశము

కాంత తడుపు చుండి కన్నీట నిర్మ లా

స్యము నురోజముల విచార మడర    

  1.  

 

 

 

ఉ.

ఆరసి యంతలోన నట నయ్యసురేంద్రు విభీషణున్ మహా

వీరుఁడు వల్కె రాఘవుఁడు వేగ విభీషణ! యన్న కింక సం

స్కార మొనర్పు మింపుగను గాంతల వే మరలింపుమా తగన్

వారిని నూఱడించి యనఁ బార్థునిఁ గాంచి విభీషణుం డనెన్ 

  1.  

 

 

 

చం.

మదిఁ బరికించి ధర్మ రత మాన్యుఁడు పల్కులు ధర్మ యుక్తముల్

విదిత మితండు క్రూరుఁ డవివేకి నృశంసుఁ డసత్య వాదియుం

దదుపరి సంగ్రహించుఁ బర దారల  ధర్మ విహీనుఁ డెన్న నే

ను దగనె యగ్ని కార్యములనుం దమి వీని కొనర్ప రాఘవా!

  1.  

 

 

 

ఉ.

రావణుఁ డన్న రూపమున వ్రాలిన శత్రు వితం డనర్హుఁడే

భూవర! పూజ లందఁగను బూజ్యుఁడు నైన గురుండు గావుటన్

నీవు నృశంసుఁ డౌదు వని నేరి త్యజింతురు నన్ను భూజనుల్

రావణు దుర్గుణమ్ములను రామ! యెఱుంగ స్తుతింత్రు వారలే     

  1.  

 

 

 

కం.

విని ప్రీతుండై యాతనిఁ

గని ధర్మధరుల ఘనుండు కాకుత్స్థుం డా

మినుకుల నేరిన నేర్పరి

యనెఁ దా వాక్యమ్ము లిట్టు లర్థ యుతమ్ముల్     

  1.  

 

 

 

ఉ.

నేనును నీకునుం బ్రియము నెమ్మి విభీషణ! చేయఁగా వలెం

గానఁగ నీదు సాయమునఁ గయ్యము గెల్చితి రాక్షసేశ్వరా!

కాన నవశ్య మే నుడువఁగా వలె యుక్తము లైన వాక్యముల్

మానుగ నీకు నిత్తఱిని మంచివి కొన్నిటి నాలకింపుమా   

  1.  

 

 

 

ఉ.

ఈతఁ డధర్మ వర్తనుఁడు నింక నసత్య వచో యుతుండునౌ

యాతత వీర్యుఁ డంకముల నంచిత శూరుఁడు గొప్ప తేజ మం

దీతని కీతఁడే సముఁడు సేంద్ర సురాలి కజేయుఁ డాజిలో

నీతని విందు మట్టు లసురేంద్రుఁడు లోక విరావణుండునున్

  1.  

 

 

 

కం.

మర ణాంతమ్ములు వైరము

లరసితిమి స్వకార్యము మన మందఱ మాజిన్

గురు సంస్కారము లెల్ల నొ

నరింపు నీకు నితఁ డెట్లొ నాకును నట్లే       

  1.  

 

 

 

తే.గీ.

అర్హుఁ డీతఁడు నీ నుండి యందఁగ విధి

పూర్వకమ్ముగ సంస్కారములను ధర్మ

యుక్తముగను విభీషణ! యుచిత కీర్తి

నందఁ గలవాఁడ వీవు నమంద రీతి     

  1.  

 

 

 

కం.

విని రాఘ వేంద్రు వాక్యము

ల నా విభీషణుఁ డపుడు త్వరపడుచును దొడం

గె నొనర్పఁగ సంస్కారము

లను రావణునకు సభక్తి రణ నిహతునకున్    

  1.  

 

 

 

తే.గీ.

గంధపుం జెక్కలును బద్మకములు వట్టి

వ్రేళ్లు నున్ని బట్టల పైన వేసి సొదను

బేర్వ వేద యుక్తమ్ముగ వీర వర్యు 

రావణు నపర క్రియలు పరఁగఁ దొడంగె         

  1.  

 

 

 

తే.గీ.

రాక్ష సేంద్రున కొనరించి రా క్షణమున

నుత్తమ పితృమేధముఁ జక్క నుంచి యంత

వేది నాగ్నేయమున నగ్ని వెలయఁ జేసి

రి దగి నట్టి స్థానమ్ములఁ గుదురు గాను    

  1.  

 

 

 

తే.గీ.

పెరుఁగు నేతిని నిండ నింపిన స్రువమ్ము

వైచి రాతని భుజముపైఁ బాదముల స

రస శకటము నుంచిరి తొడల దెస ఱోటి 

నుంచిరి దశకంఠున కప్పు డంచితముగ       

  1.  

 

 

 

తే.గీ.

ఎల్ల దారు పాత్రమ్ముల నింక నరణి

నుత్త రారణి ఱోటిని నుక్త రీతి  

నన్యముల వాని స్థానము లందుఁ జెంత

నుంచి సొద చుట్టు తిరిగిరి యుచిత రీతి       

  1.  

 

 

 

ఉ.

అంతటఁ జంపి శాస్త్రముల నారసి నట్టి విధమ్ము మౌను ల

త్యంతము చెప్పి నట్టి గతి నంచిత జంతువు నెల్ల రక్కసుల్

సాంతము నాజ్య మం దిడిన యట్టి వపం దగ రాక్షసేంద్రు నా

స్యాంతర మందు నుంచిరి దశాస్యున కత్తఱి దీన మానసుల్       

  1.  

 

 

 

ఉ.

రావణు గంధ మాల్యముల రాక్షసు లంత నలంకరించి నా

నా వస నోత్తమమ్ముల ఘనమ్ముగఁ గూడి విభీషణున్ ఘనున్   

వే వెదచల్లి లాజలను వేదన నేడ్చిరి శాస్త్ర రీతినిం 

దా వగ నా విభీషణుఁడు తత్క్షణ మిచ్చెను వహ్ని నన్నకున్     

  1.  

 

 

 

ఆ.వె.

స్నాన మాచరించి తా నార్ద్ర వస్త్రుండు

నంత దర్భ లున్న యట్టి యుదక

మును దిలలను సోదరునకు నర్పించి శి

రమ్ము వంచి మ్రొక్కె రావణునకు     

  1.  

 

 

 

ఆ.వె.

రాక్ష సాంగనలను వీక్షించి యనునయిం

చెను విభీషణుండు వనిత లార!  

వెడలుఁ డింక నంచు వడి మాటి మాటికి

నగరి కేఁగి రంత నారు లెల్ల   

  1.  

 

 

 

కం.

చేర నతివ లెల్లఁ బురము

నా రక్షోవర విభీష ణాఢ్యుఁడు నమ్రుం 

డై రాముని చెంత నిలిచె 

గౌరవ మేపార నంతఁ గాకుత్స్థునిపై    

  1.  

 

 

 

కం.

రాముండు ససుగ్రీవ స

సౌమిత్రి ససైన్యము రిపుఁ జంపి రణమునం

దా మోదమ్ము వడసె సు

త్రాముఁడు వృత్రుని విధమ్ము రాఘవుఁ డంతన్    

  1.  

 

 

 

తే.గీ.

శత్రు సంహారకుం డంత స శర చాప

ము కవచము మహేంద్ర సుదత్తము విడనాడె

రోషమును గూడి చంప శత్రువును రాఘ

వుండు సౌమ్యుఁ డయ్యె నెడంద మెండుగాను

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట పదునాలుగవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 115.

 

 

 

రాముని పంపున లక్ష్మణుఁడు విభీషణునకు లంకా రాజ్యాభిషేకము సేయుట, రాముఁడు సీతకుఁ  గుశల వార్తను దెలిపి సందేశమును దెచ్చుటకు హనుమంతునిఁ బంపుట. 

 

 

 

 

కం.

సుర దానవ గంధర్వు ల

సురేంద్రు రావణుని వధను జూచి రణము నం

దరిగిరి శుభ కథ లనుచును  

మురియుచుఁ దమ తమ విమానములఁ ద్వరితముగన్   

  1.  

 

 

 

ఉ.

రావణు ఘోర మైన వధ రాముని వీర్యము వాన రాలి పో

ర్చేవయు వాన రాధిపుని చింతన సీత పతివ్రతా గుణం

బా వర వీర్య లక్ష్మణుని యగ్రజుపై రతి వారు వల్కుచుం

బావని విక్రమమ్ము రహి వచ్చిన దారిని నేఁగి రెల్లరున్     

  1.  

 

 

 

తే.గీ.

రాఘవుఁడు మహా బాహువు రథము నింద్ర

దత్తమును వహ్ని సదృశము నుత్తమముగ

గౌరవించి మాతలిని నా సారథిఁ దగ

ననుమతించెను మరలంగ నంత దివికి       

  1.  

 

 

 

కం.

అనుమతి నంది యటుల రా

మునిచే నరదమ్ము దివ్యమును మాతలి యె

క్కి నగారి సారథి ముద

మ్మున నింద్రునిఁ గాంచఁ జనె నభో వీథిఁ దమిన్      

  1.  

 

 

 

తే.గీ.

స రథము దివ మేఁగఁగ సుర సారథి రథి

కప్రవరుఁడు రాముఁడు ప్రీతిఁ గౌఁగిలించి

కొనియె సుగ్రీవుఁ బ్రేరేప ననుజుఁ డంత

హరులు పూజింపఁ జేరె బలాలయమ్ము          

  1.  

 

 

 

ఆ.వె.

కాంచి చెంత నంతఁ గాకుత్స్థుఁ డట లక్ష్మ

ణు శుభలక్షణుని ఘనుని స్వ తేజ

మందుఁ బలికె నిట్టు లా సత్య సంపన్ను

తోడ గిరలను బరితోష మడర      

  1.  

 

 

 

ఉ.

చెన్నుగ నీవు చేయు మభిషిక్తుని సౌమ్యుని నీ విభీషణుం

గ్రన్నన లంక కింపుగను రాజుగ భక్తుఁ డితండు రక్తుఁడున్

మున్నుపకార మింపుగను మూరి యొనర్చెను గోర్కి యాత్మలో

మిన్నగఁ గాంచ రాజుగను మిత్రు విభీషణు రావణానుజున్

  1.  

 

 

 

కం.

అన రాముఁ డిట్టు లట్టులె 

యని లక్ష్మణుఁ డన్న తోడ నానందముగన్

మనుజర్షభుండు వేగమ

కనకంపు ఘటమ్ము నొకటి గైకొని యంతన్    

  1.  

 

 

 

ఆ.వె.

కనక ఘటము నుంచి కపి నాయకుల హస్త

మందు లక్ష్మణుండు తొందరగ మ

నోజవులను హరులను బలాఢ్యులను సము

ద్ర జలము గొనితేరఁ దడయ కనిపె      

  1.  

 

 

 

కం.

చని శీఘ్రమ్ముగఁ బ్లవగులు

మనోజవు లెగురి గభీర మకరాలయముం 

గని నీరమ్మును ఘటమునఁ

గొని తెచ్చిరి యుద్యమించి కోరిన రీతిన్      

  1.  

 

 

 

తే.గీ.

అంత లక్ష్మణుండు గ్రహించి యా ఘటమును

నిలిపి తగ విభీషణు ఘనుని వర పీఠ

మున విభునిగ లంకా రాజ్యమునకు విమల

జలమున నభిషేకించెను లలిత రీతి    

  1.  

 

 

 

తే.గీ.

మంత్ర దృష్టిని నసురుల మధ్య స్నేహి

తులను గూడి రామాజ్ఞ సంతోషముగ య

థా విధి నభిషేకించిరి తరుచరు లసు

ర వరులు స్తుతించిరి మురిసి రాఘవేంద్రు    

  1.  

 

 

 

కం.

కని లంకా పురి కభిషి

క్తు నమాత్యులు సంతసింపఁ దోరమ్ముగ నా

తని భక్తులు హర్షించిరి

ఘనమ్ముగ విభీషణు నిజ కాంతుని నెదలన్           

  1.  

 

 

 

ఆ.వె.

రాముఁ డతుల ముదము లక్ష్మణ సహితమ్ము

వడసె నంత నసుర వరుఁడు రాజు

గా విభీషణుండు కాకుత్స్థు దయ రాజ్య

మందఁ బరమ హర్ష మందె నెడఁద   

  1.  

 

 

 

కం.

పౌరుల నోదార్చి యసుర

వీరుండు విభీషణుండు వినయమ్ముగఁ దా

జేరెను ముదమ్ము మీఱఁగ

నా రాముని చెంత కంత నసురేశ్వరుఁడే

  1.  

 

 

 

ఉ.

తెచ్చిరి పౌరు లక్షతలు తియ్యని మోదక కోటి లాజలున్ 

విచ్చిన పుష్పరాసులు విభీషణునిం గని యిచ్చి రింపుగా

మెచ్చుచు నా నిశాచరులు మేటి నిశాటుఁడు  వాని నంది దాఁ

గ్రచ్చఱ మంగళమ్ములను రాఘవ వర్యుల కిచ్చె భక్తిమై      

  1.  

 

 

 

కం.

కని కృత కార్యుని సంప

న్ను నా విభీషణు గ్రహించెను రఘువరుఁడు నె

మ్మిని సమ్మతించి యన్నిటి

మనుజేంద్రుండు సఖుఁడు పరమప్రీతుండై   

  1.  

 

 

 

కం.

అంజలి ఘటించి నిల్చిన

యంజన సుతుని హనుమంతు నారసి సరసం

గంజ దళాక్షుఁడు రాముఁడు

మంజులముగఁ బల్కె నంత మాటల నిట్లున్   

  1.  

 

 

 

ఆ.వె.

గౌరవించి యసుర కాంతు విభీషణు

ననుమతిఁ బడసి తగ నాంజనేయ!

సౌమ్య! లంక కేఁగి జానకిఁ గని రావ

ణాలయమ్ము నందు హరి వరేణ్య!       

  1.  

 

 

 

తే.గీ.

విజయమున కభినందించి వీర వర్య!

నాదు సుగ్రీవు లక్ష్మణు నరవరేణ్యు

కుశలములు దెల్పి రావణు కూలుట నెఱిఁ

గించి నా చేత రణ మందు నంచితముగ

  1.  

 

 

 

కం.

హరి వీర యీ ప్రియమ్మును

ధరణిజకు వచించి నీవు తగిన విధముగం

దిరిగి యిటకు సందేశము

పరిగ్రహించి యరుదెంచ వలె శీఘ్రముగన్   

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట పదునేనవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 116.

 

 

 

రామునిచే నాదేశింపఁ బడి హనుమంతుఁడు విభీషణు ననుజ్ఞ వడసి లంకా పురిలో నశోక వృక్ష మూలమున దుఃఖముతో నున్న జానకిఁ గాంచి రామ సందేశము దెలిపి నా భర్తను జూడఁ గోరుచున్నా నన్న సీతా సందేశమును రామునకు వచింప వచ్చుట.  

 

 

 

 

కం.

ఆనతి నివ్విధము వడసి

వానర వర్యుండు హనుమ వాయు కుమారుం

డానందమున నిశాచర

మానితుఁడై లంకకుఁ జనె మానినిఁ గాంచన్

  1.  

 

 

 

చం.

హనుమ విభీష ణానుమతి నంత గ్రహించి పురమ్ము లంకకుం

జని తగ వృక్షవాటికను జానకి నేరిన మారుతాత్మజుం

డనిల జవుండు సేరి కనె నార్తను సీతను రాక్షసీ వృతం

దనువె యలంకరింపని విధంబున నుండఁగ హర్ష హీననున్       

  1.  

 

 

 

తే.గీ.

వృక్ష మూలమ్ము చెంతను భీత రోహి

ణీ సతీ నిభ నారసి నిలిచెఁ జేరి

వంగి వినయమ్ము మీఱఁగ వందన మొన

రించి మౌనమ్మును వహించి యంచితముగ   

  1.  

 

 

 

ఉ.

వచ్చిన మారుతాత్మజుని బల్లిదు నచ్చట గాంచి యాత్మఁ దా

నచ్చెరు వంది మౌనముగ నత్తఱి జానకి యుండి క్రమ్మఱన్

హెచ్చుగ నూనె సంతసము నీతని నంతట గుర్తుపట్టఁగా

నిచ్చను సౌమ్య వక్త్రమును నింపుగ మారుతి గాంచి యంతటన్       

  1.  

 

 

 

చం.

పలుకఁ దొడంగె రాఘవుని వాక్యము లెల్ల విదేహరాట్సుతా!

యిలఁ గుశలుండు రాముఁడు హరీశ్వరు లక్ష్మణుఁ గూడి యా ప్లవం

గుల బల సంయుతమ్ముగను గ్రూరుని రావణుఁ జంపి ఘోరపుం

గలనున వారి సాయమునఁ గాంతరొ పల్కెను నీకు క్షేమమున్    

  1.  

 

 

 

చం.

పలికెను దాఁ గృతార్థుఁ డయి పార్థుఁడు రాఘవుఁ డిట్లు వాక్యముల్

సలలిత మైన నీ ప్రియము సక్కఁగఁ బల్కుదు  సంతసింపుమా

లలన! జయింప నే ననినిఁ బ్రాణములం దనరంగ నయ్యె నీ

కిలఁ గన భాగ్య వశ్యమున నింపుగ నివ్విధి ధర్మపారగా!     

  1.  

 

 

 

చం.

మనకు లభించెనే జయము మానుగ జానకి వీడి దుఃఖమున్

మనమున సంతసింపు మిఁక మ్రందె దశాస్యుఁడు వైరి లంకయున్

మన వశ మయ్యె నిద్ర విడి మానిని నిన్ను జయింప సాగర

మ్మున వెసఁ గట్టి వంతెనను మూరి ప్రతిజ్ఞను నిర్వహించితిన్

  1.  

 

 

 

ఆ.వె.

రావ ణాలయమున నీ వుండ వలదు సం

భ్రమము లంక యెల్ల రాక్షసేశ్వ

రుఁడు విభీషణునకు లొంగి యుండు పగిది

సేయఁ బడియె నిపుడు చింత యేల

  1.  

 

 

 

కం.

కాన మది నూఱడిల్లుమ

నీ నివసన మందు నున్న నెఱి వైదేహీ!

కానఁగ నిను సంతోషము 

నూని విభీషణుఁడు వచ్చు నున్నత గుణుఁడే      

  1.  

 

 

 

కం.

అన విని లేచి శశి నిభా

నన సీత సెలంగ ముదము నారీమణియే

యన లేక యడ్డు కొనఁగ వ

చనమ్ము లెవ్వియు నిలిచెను జక్కఁగ నెదుటన్       

  1.  

 

 

 

ఉ.

ఏలనొ సుంత యేని బదు లీయని సీతను గాంచి వాయుజుం

డేలను దేవి యుంటి వచియింపక యెద్ది దలంతు దేని నీ

వేలను నంచుఁ దన్నడుగ నెంతయొ ప్రీతి వచించె భాష్పముల్

సాల స్రవింప గద్గదతఁ జాగని మాటల సీత యిట్టులన్      

  1.  

 

 

 

తే.గీ.

ధర్మ పథ మందు నిల్చిన ధరణిజ గని

యనిల నందను ననియె నో హనుమ! వినఁగ

భర్తృ విజయమ్ము సంతోష వశను గాఁగ

నోట నొక క్షణ మే నుంటి మాట రాక

  1.  

 

 

 

ఆ.వె.

కాన రాక యుంటి దేని నొసఁగ నీకుఁ 

గల్గు సుఖము మదికిఁ గపివరేణ్య!

ప్రియము చెప్పి నట్టి వినుత సౌమ్యున కేను

బుడమి నందు నెందు నడరు దాని     

  1.  

 

 

 

ఆ.వె.

సాటి రావు నీదు మాటలకు గణింప 

వెండి యైన నా పసిండి యైన

వివిధ రత్నములును విను ముజ్జగమ్ముల

రాజ్య మేని వానరప్రవీర!    

  1.  

 

 

 

కం.

పలుకఁగ వైదేహి వచన

ము లివ్విధమ్ము ప్లవగోత్తముఁడు హర్షుండై

నిలిచి యెదుట సీతకు నం

జలి తోడ మరుత్సుతుండు సయ్యనఁ బలికెన్     

  1.  

 

 

 

చం.

పతి హితముం బ్రియమ్ములను భర్తృ జయం బెద లోనఁ గోరెడిన్

సతి వయి స్నేహ వాక్యమును జక్కఁగఁ బల్కఁగ సౌమ్య! నీకె యీ

గతి జనకాత్మజా! తగును గాంత! యనిందిత! సారవంత మం

చితమును రత్నరాశికిని శ్రేష్ఠమ యెక్కుడు దేవ భూమికిన్   

  1.  

 

 

 

తే.గీ.

సుస్థితుని రాముని విజయ శోభి తాత్ముఁ

గాంచితిని నేను దేవి! సుఖమ్ముగ నిట

ననఁగ దేవరాజ్యము మొదలైన గుణము

లన్నిటినిఁ బొందితిని భూజ! యంచితముగ   

  1.  

 

 

 

మ.

అన వాక్యమ్ముల నాలకించి మదిలో నానంద మేపారఁగా

హనుమంతుం గని సీత యంత శుభవాక్యమ్ముల్ వచించెం దగన్

ఘనముల్ లక్షణ పుష్కలమ్ములగు వాక్యమ్ముల్ సు మాధుర్యముల్

గన నష్టాంగ యుతుండ వాడితివి శాఖా సన్మృగేంద్రా! మతిన్   

  1.  

 

 

 

తే.గీ.

ఇట్లు వచియింప నర్హుఁడ వీవ శ్లాఘ

నీయుఁడ వనిల సుతుఁడవు నిగమ వేత్త

పరమ ధార్మికుండవు శౌర్య బల పరాక్ర

మ వినయస్థైర్య తేజః క్షమా గుణుఁడవు   

  1.  

 

 

 

ఆ.వె.

సత్త్వ దాక్ష్య  ధృతులు సద్గు ణాన్యమ్ము ల

నేకముల నలరుచు నిత్య ముందు

వీవు నుత చరిత్ర! నీ విట్లనంగ న

చ్చెరువు నంద నేల హరి వరేణ్య!       

  1.  

 

 

 

ఉ.

అంతట నిల్చి కట్టెదుట నంజలి హర్షము మీఱ నమ్రుఁడై

సుంతయు భీతి లేక యరిసూదనుఁ డిట్లు వచించె సీతతో

నింతుల రాక్షసాంగనల నెల్లర నిత్తఱి నీకు మున్నహో

వంత లొసంగి నట్టి వెడ భామలఁ జంపుదు నాన నిచ్చినన్          

  1.  

 

 

 

ఉ.

వింటిని రాక్ష సాంగనలు వే పరుషమ్ములు వల్కఁ బల్మఱుం

గంటకముల్ వికారములు గన్నులు సూపులు నివ్వటిల్లఁగా

వెంట చరించి సంతతము వేదన లిచ్చుచు భర్తృ దేవకుం

దొంటిని నయ్యశోక వనిఁ దొయ్యలి! నీవు కలంత నుండఁగా    

  1.  

 

 

 

ఉ.

ఘోర తరంపు వర్తనలు ఘోరత రాకృత రాక్ష సాంగనల్

క్రూరలు క్రూర భాషణలు క్రూర క చేక్షణ లెల్లరున్  వెసన్

వీరిని ఘోర మానసల బెట్టిదముల్ వివిధమ్ము లైన వౌ

దారుణ మైన ఘాతములఁ దప్పక చంప వరమ్ము నీయుమా      

  1.  

 

 

 

తే.గీ.

పిడికిళుల చేతి దెబ్బలఁ బెద్ద బాహు

వులను బిక్కల మోకాళ్ల వెలయు దెబ్బ

ల రదములచేఁ గొఱికి చెవుల నసలం ది

ని నెఱులం బీఁకి లంఘించి తనువుల పయి     

  1.  

 

 

 

తే.గీ.

ముఖములం బట్టి యెండించి మూరి చీల్చి

విఱుగ మెడలును బ్రక్కలు పెను భుజములు  

వ్రాల మొండెమ్ము లెల్లఁ జంపంగ నెంతు

నీకు కీ డొనరించిన నెలఁతల నిట

  1.  

 

 

 

కం.

ఇట్టు లనే కాభిహతులఁ

గొట్టి వధింతును సుకీర్తి! ఘోరాంగనలన్

బెట్టిదముగ నిను బాధలు

పెట్టిన దుష్టాంగనలను భీకర రీతిన్

  1.  

 

 

 

కం.

హనుమంతుం డిట్లన విని

జనకాత్మజ దీన జన నిచయ వత్సల ప

ల్కెను జింతించి యొకింత మ

దినిఁ బరిశీలించి కరుణ తేటపడంగన్   

  1.  

 

 

 

కం.

రాజాశ్రయ వశ్యల నిజ

రాజాజ్ఞం జేయు వారి రామావలి దా

సీ జనముల నెవ్వండు మ

నోజవ! కని కోప మూనును హరివరేణ్యా!

  1.  

 

 

 

ఉ.

మున్నొనరించి నట్టి పని మూరిన భాగ్య వియోగ హేతువే

నన్నిటు లుంచ దుఃఖమున నా కిది యెల్ల భుజింప నర్హమౌ 

యెన్నగ స్వీయ కర్మ మిది యిట్లు వచింపకు దీర్ఘ బాహుఁడా!

చెన్నుగ దైవ చోదితము సేరె దశాయత యోగ మివ్విధిన్       

  1.  

 

 

 

తే.గీ.

వీర! రావణ దాసులు వీరి సైఁతు

రావ ణాజ్ఞ నదల్చిరి చేవ మీఱ 

హతుఁడు గాఁగ నాతం డిప్పు డతివ లింక

నన్ను దర్జింప రయ! వాయు నందనుండ! !    

  1.  

 

 

 

కం.

కల దొక్క వ్యాఘ్ర సన్నిధి

నెలుఁగు వచించినది శ్లోక మింపైన పురా

ణ లలిత సూక్తము దాని న

నిల నందన! తెలిసికొనుమ నెమ్మిని హనుమా!     

  1.  

 

 

 

ఆ.వె.

పరుల కింత యేని పాప కర్ముల కుత్త

ముండు హాని దలఁప కుండు నెపుడు 

సత్పురుషులు ధరణిఁ జారిత్ర భూషణు

లౌటఁ గాతురా నియమము నెపుడు       

  1.  

 

 

 

ఆ.వె.

పాపు లైనఁ బరమ పావను లైనను

జంపఁ దగిన నైన నింపుగ దయ

సూపఁ దగును హనుమ! సుజనుల కపరాధి

కాని వాఁడు కలఁడె కాంచఁ బుడమి     

  1.  

 

 

 

కం.

తగదు చెడు సేయ నేరికి

జగముల హింసించు చుండి సంచారము సే

యఁగ గమకించెడు నసురుల

కుఁ గపీంద్ర! యఘముల లోనఁ గూరిన నైనన్      

  1.  

 

 

 

చం.

అన వచనమ్ము లిట్లు విని యా ప్లవగేంద్రుఁడు వల్కె నిట్టులన్

విను తగు ధర్మపత్నివి భువిన్ రఘు రామున కీవు సద్గుణా!

చనియెద రాము చెంతకును జక్కని యుత్తర మిమ్ము దేవి! నా

కన ననె సీత నాదు ప్రియ కాంతుని దర్శన మేను గోరెదన్     

  1.  

 

 

 

కం.

విని జానకి వాక్యములను

హనుమంతుఁడు సంతసించి యనిలాత్మజుఁ డి

ట్లనెను మహాద్యుతి వైదే

హిని హర్షితఁ జేయుచును హరీంద్రుం డంతన్      

  1.  

 

 

 

తే.గీ.

ఆర్య! గాంతువు పూర్ణ చంద్రాననుని స

లక్ష్మణు స్థిరమిత్రుని రఘు రాముని హత

శత్రువుని శచీ దేవి యా శక్రుఁ బతినిఁ

గాంచిన విధము వల్కి యిట్లంచితముగ      

  1.  

 

 

 

తే.గీ.

శ్రీ సతీ సన్నిభము వెల్గు సీత తోడఁ

బలికి యిట్లు హరీంద్రుఁడు వాక్యములను

మారుతాత్మజుం డింపుగ మారుత నిభుఁ

డేఁగె రాముని చెంతకు వేగముగను    

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట పదునాఱవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 117.

 

 

 

రాముని యాజ్ఞతో విభీషణుఁడు సీతా దేవి చెంత కేఁగి రాముని వచనములను జెప్పి స్నాత సాలంకృతను  రాముని చెంతకు రప్పించుట.  

 

 

 

 

కం.

సాదరము మహా ప్రాజ్ఞుని

మేదిని లోన విలుకాండ్ర మేటి నరవరుం   

దా దాశరథిఁ గని హనుమ

వే దండము లిడి వచించె వికచాస్యునితో       

  1.  

 

 

 

ఉ.

ఎవ్వరి కోస మీ పనుల నింపుగఁ జేసితి మిట్టు లార్య! నీ

వవ్వనితా మణిన్ ఫలము  నంచిత దేవిని శోక తాపమే 

నివ్వటిలంగ నున్న సతినిం గన నర్హుఁడ వౌదు రామ! నీ

యివ్విజయమ్ము నేరి మది నెంతయొ సంతస మందె సీతయే     

  1.  

 

 

 

తే.గీ.

కాంత భాష్ప పర్యాకు లేక్షణ మును నను 

గన్న నమ్మకమున నన్ను గాంచి పలికె

రాముని కృతార్థునిఁ బతి సలక్ష్మణుఁ గనఁ

గోరుచుంటి నంచుఁ దనదు కోర్కి నపుడు           

  1.  

 

 

 

కం.

హనుమంతుండు వచింపఁగ

విని ధర్మాత్ముల ఘనుండు వీరుండు మన

మ్మున ధ్యాన మగ్నుఁ డయ్యెను

గనులన్ నీ రొలుక  నంతఁ గమలాక్షుండే    

  1.  

 

 

 

ఉ.

వేఁడిగ నిశ్వసించి కడు పెద్దగఁ జూచుచుఁ దాను మేదినిం

బాడిగ నా విభీషణునిఁ బ్రక్కన కాంచి వచించె మజ్జనం

బాడిన దివ్య భూషణవ రాంచిత చర్చిత భవ్య వస్త్రఁ బూఁ

బోఁడిని సీత నిచ్చటను బోరన నిల్పుమ రాక్షసోత్తమా!      

  1.  

 

 

 

చం.

పలుకఁగ నిట్లు రాఘవుఁడు పమ్మిన వేగము తోడ నేఁగి తా

నిలయము నా విభీషణుఁడు నెమ్మినిఁ జొచ్చి నిజాంగ నాదులం

దెలుపఁగ సీత కంపి కని దేవిని సీతను మోడ్చి చేతులం 

బలికెను రాక్షసేశ్వరుఁడు వాక్యము లిట్లు వినమ్రుఁడై తగన్       

  1.  

 

 

 

తే.గీ.

దేవి! దివ్యానులేపన దివ్య భూష

ణ వర భూషితవు నయి యానమ్ము నెక్కు 

భద్ర మగు నీకు జానకి! భర్త రాముఁ

డువిద! నిను జూడ నటఁ గోరుచున్నవాఁడు        

  1.  

 

 

 

ఉ.

నా విని స్నాతఁ గాక నిజ నాథుని రామునిఁ గాంచఁ గోరెదన్

నా వచియింప సీత విని నైరృత నాథుఁడు వల్కె నివ్విదిన్

నీ వొనరింపఁగాఁ దగుదు నీ పతి రాముఁడు చెప్పి నట్టులన్  

నా విని యా పతివ్రత యనంతర మార్తిని నట్టులే యనెన్    

  1.  

 

 

 

తే.గీ.

జానకిని శిరస్స్నాతను జవ్వను లల

రుచు నలంకరింపఁగ నగలు వసనమ్ము

లందు విలసిల్లఁగ నునిచి యసుర గుప్త

పరమ వసన వృత శిబికా వరము నందు      

  1.  

 

 

 

తే.గీ.

చేరి యా మహాత్మునిఁ దెలిసియును ధ్యాన

మందు నున్న రాముని వంగి యవ్విభీష

ణుండు సంతోషమును బొంది మెండుగ నెద

వచ్చెను జనకాత్మజ యంచుఁ బలికి నిలిచె    

  1.  

 

 

 

ఉ.

వచ్చెను సీత యన్న విన స్వాంతము నందు ముదమ్ము దైన్యమున్

హెచ్చుగ రోషముం గలిగె నిత్తఱి మూడును నేక కాల మం

దచ్చట రాక్షసాలయము నందు చిరమ్ము వసించి దారయే

వచ్చుటఁ జేసి రామునకుఁ బార్థ వరేణ్యున కక్కజమ్ముగన్   

  1.  

 

 

 

ఆ.వె.

అంతఁ బార్శ్వ గతుని నా విభీషణుఁ గాంచి

పలికె రాముఁ డిట్లు వాక్యములను

సహ విమర్శనము విచారించి వీత హ

ర్షమున రాఘవుండు సద్గుణుండు   

  1.  

 

 

 

ఆ.వె.

సతము గోరు దీవు సౌమ్య! నా విజయమ్ము

రాక్షసాధినేత! రాగ మడర

నాదు చెంత కిపుడు వైదేహి శీఘ్రము

గ నరుదెంచుఁ గాక  కౌణపాఢ్య!

  1.  

 

 

 

కం.

విని రాఘవేంద్రు పల్కులు

జనులం దొలఁగించు పనుల సద్ధర్మజ్ఞుం

డు నిశాచరేంద్రుఁ డొనరిం

చె నప్పుడు విభీషణుండు సీతార్థంబై      

  1.  

 

 

 

కం.

తలపాగలు సొక్కాయలు

గల వారలు బెత్తములను గాయ లడరు చే

తులు గల వారలు యోధులఁ

దొలఁగం జేయుచుఁ దిరిగిరి దొర లెల్లెడలన్    

  1.  

 

 

 

కం.

కపి ఋక్ష రాక్షస గణము

లపు డెగిరి వెడలిన వంత నతి దూరముగం

గృప లేక తోలుచుండఁగ 

విపరీతమ్ముగ నెడఁదల వెఱఁగు సెలంగన్         

  1.  

 

 

 

        కం.

వారు దొలఁగింపఁ బడఁగా

మారుతమున రేఁగి నట్టి మకరాలయ ఘో

రారవముల మించ ధ్వనులు

వారించెను రాముఁడు విని వాత్సల్యమునన్

  1.  

 

 

 

కం.

ఆక్షణమున నాగ్రహమునఁ

జక్షులఁ గాల్చెడు సరణి భృశతరప్రాజ్ఞున్ 

వీక్షించి విభీషణు ననె 

నాక్షేపమ్ముగ వచనము లాశ్చర్యముగన్      

  1.  

 

 

 

తే.గీ.

నను దలఁప కిట్టు లేల యీ జనము రాక్ష

సేంద్ర! నీ చేత భృశము బాధింపఁ బడుచు

నున్న దిఁక నాపు మిది యెల్ల నెన్న నీ జ

ను లనఘా! స్వీయ జనులు ఘనులు దలంప    

  1.  

 

 

 

తే.గీ.

కావు గృహములు బట్టలు కావు కావు

చుట్టు గోడలు తెర లైనఁ జూడఁ గావు

రాజ సత్కారములు నిట్టు లీ జగతిని

కావు రక్షలు వృత్తము కాంతల కగు         

  1.  

 

 

 

చం.

వ్యసనము లందుఁ గృచ్ఛ్రముల నాజుల యందు స్వయంవరమ్ము లం

దు సవన వేళలం దరయ దూష్యము గాదు వివాహ వేళ లం

దు సునయ నాలి దర్శనము దోరపుఁ గష్టము నందు నున్న నా

దు సరసనే విశేషముగఁ దోయలి సీతను గాంచ నొప్పగున్ 

  1.  

 

                                                                              

 

ఆ.వె.

తెమ్ము జానకీ సతిని విభీషణ! నాదు

చెంత కసుర వర్య! శీఘ్రముగను  

నన్ను నా సుహృదుల నగచరుల నడుమ 

సీత గాంచు నిచట వీత శంక

  1.  

 

 

 

కం.

విని యా రాముని పల్కులు

మనమునఁ జింతించి సుంత మానిని నా సీ

తను రాఘవేంద్రు చెంతకు  

ననిపె విభీషణుఁడు సవినయము శీఘ్రముగన్     

  1.  

 

 

 

తే.గీ.

లక్ష్మణుండు సుగ్రీవుఁడు ప్లవగ వర్యుఁ

డాంజనేయుఁడు భృశముగ నాత్మ లందుఁ 

గలఁతఁ జెందిరి రామ వాక్యముల నాల

కించి వాని భావము పరికించి నంత

  1.  

 

 

 

ఆ.వె.

దారుణంపు టింగితమ్ముల వీక్షించి

స్వీయ భార్య పైనఁ బ్రేమ లేని

యట్టు లుండఁ బల్కు లాత్మలఁ దర్కించి

రాలిఁ గాంచి కాఁడు హర్షుఁ డంచు        

  1.  

 

 

 

చం.

బిడియము తోడ నంగములు పెల్లుగఁ గ్రుంగ విభీషణుండు రా

వడి వడి వెంట భూ తనయ భర్తను జేరెను గప్పి యాస్యమున్

మడుఁగున సిగ్గు పిక్కటిల మందినిఁ గాంచఁగఁ జేరి భర్తఁ దా

నడుగిడి యార్యపుత్ర! యని యంగన యేడ్చెను  భర్తృ దేవయే       

  1.  

 

 

 

తే.గీ.

విస్మయమున హర్షమ్మునఁ బ్రేమను బతి

దేవుని ముఖము సౌమ్యమ్ము దేవి సౌమ్య

తర వదన గాంచె నప్పుడు ధరణిజ రఘు

రాముని సమీప మరుదెంచి రామ సీత       

  1.  

 

 

 

కం.

మనసునఁ గ్లేశము విడిచె న

వనిజ విమల చంద్ర వదన పతి పూర్ణ శశాం

క నిభ ముఖముఁ జిర కాలము 

గన నట్టిది గాంచి యపుడు కమనీయముగన్  

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట పదునేడవ సర్గము.

యుద్ధ కాండము

సర్గము 118.

 

 

 

రాముఁడు సీతతో నీ కపకారము సేసిన రావణుని వధించి నీ చెఱను విడిపించితిని మా యిక్ష్వాకు వంశ గౌరవమును గాపాడితిని కనుక నీవు యథేచ్ఛ నెవరి రక్షణ మైన నెంచి  యేఁగ వచ్చు నని పరుష వాక్యములను వచించుట.    

 

 

 

 

కం.

ప్రక్కన వంగి నిలఁబడిన

యక్కమలాక్షి జనక సుత నరసి పలుక ని

ట్లక్కాకుత్స్థుఁడు క్రోధుం

డక్కజముగఁ దొడఁగె నంత నవనిజ తోడన్   

  1.  

 

 

 

తే.గీ.

నిర్జిత వయితి విఁక భద్ర! నీవు క్రూరుఁ

డైన శత్రు జయింప నే నడరి పౌరు

షమున నెయ్యది యొనరింపఁ జక్కఁగఁ దగు

నయ్యది యొనరింపఁ బడెను గయ్య మందు

  1.  

 

 

 

చం.

అరసితి నేను గోపమున కంతము ధర్షణ మెల్ల నంత మ

య్యె రుచిర రీతి శాత్రవుఁడు నియ్యవమానము  రెండు నొక్క మా

రరయ నశించె నా వలన నాత్మ పరాక్రమ మెల్ల దృష్ట మ

య్యె రణమునన్ ఫలించె శ్రమ మిట్టులఁ దీర్చి ప్రతిజ్ఞ నిల్చితిన్      

  1.  

 

 

 

తే.గీ.

మద్విరహితను గొనితెచ్చె మాయఁ జలిత  

చిత్తుఁ డసురుండు దైవంపుఁ జేఁత దోష

మిప్పు డొక మానవుని చేతఁ దప్పక గెలు

వఁబడె నా చేత నిబ్భంగిఁ బౌరుషమున          

  1.  

 

 

 

ఆ.వె.

కలిగిన యవమానము లయ మొనర్పక

యున్న సత్వరమ్ము చిన్న దైన

స్వాంత మున్న పురుషు పౌరుషమ్మున నేమి

యర్థ ముండు వాని కరసి చూడ

  1.  

 

 

 

తే.గీ.

సఫల మయ్యెను హనుమంతు శ్లాఘ్య కర్మ

మర్ణవమ్ము దాఁటుట లంక నంతఁ జేరి

ఘోర తరము మర్దించుట వైరి పురము

నెల్ల స్వీయ విక్రమమున నెలమి నేఁడు

  1.  

 

 

 

తే.గీ.

సఫల మయ్యెను సుగ్రీవు సంగరంపు

విక్రమము హిత మంత్రమ్ము స్వీయ సైన్య

సహిత మొనరించిన సుపరిశ్రమము నాయ

కత్వ మింపుగ నేఁడు వీరత్వ మెల్ల

  1.  

 

 

 

ఆ.వె.

సఫల మయ్యె నసుర సత్తముని విభీష

ణుని పరిశ్రమ మగుణు దశకంఠు

నగ్రజునిఁ ద్యజించి యంచితముగ నన్ను

గదిసి చేసి నట్టి కర్మ మెల్ల

  1.  

 

 

 

చం.

పలుకఁగ నిట్లు రాఘవుఁడు పల్కులు జానకి యాలకించి క

న్నులను స్రవింప భాష్పములు నొవ్వున లేటి విధమ్ము లోచన

మ్ములు కడు వివ్వ నిల్వఁ గని భూజను నా హృదయప్రియాంగనం

గలవర మంది భీతిలి జగజ్జన వాదము నెంచి యార్తుఁడై   

  1.  

 

 

 

తే.గీ.

సీత నుత్పల పత్రాక్షి స్నిగ్ధ నీల

కుంచి తాంచిత మూర్ధజ గురు కటిస్థ

లి నసుర హరుల మధ్యను  గని వచించె

భ్రుకుటి ముడిచి యిట్టులు రాఘవుండు గిరలు          

  1.  

 

 

 

చం.

అవమతి నార్పఁ జేయఁ దగి నట్టిది మానిసి కెద్ది దాని నే

నవనిజ! మూరి చేసితిని యా రిపుఁ జంపితి మాన కాంక్షినై

భువిఁ దగ నైతి నిర్జితవు భూరి తపమ్మున దక్షి ణాశ నా

యవని సురుం డగస్త్యుఁడు మహాత్ముఁడు గెల్చిన రీతి మానినీ!     

  1.  

 

 

 

ఆ.వె.

సఖులఁ గూడి బలిమి సమర పరిశ్రమ

మిట్లు దాఁటు  టెల్ల నెఱుఁగు మబల!  

నీ కొఱకుఁ జెలంగి నేను జేసినది గా

దనుచు నీకు భద్ర మగును గాక 

  1.  

 

 

 

తే.గీ.

తలఁచి స్వీయ వృత్త మపవాదముల నెల్ల

దిశల రక్షింప నింపుగ యశము నందు

మిన్న యైన నా కులమున కెన్నఁ డేని

మచ్చ వలదని చేసితి నిచ్చ నేను        

  1.  

 

 

 

తే.గీ.

శంక నంది నడత యందు నంక మందు

నిలిచి తీవు నాకు నిచట నిన్ను సమ్మ

తింపఁ జాల ధర్మముఁ బరికింప నేను 

నేత్ర రోగికి దీపంపు నిభము గాను   

  1.  

 

 

 

ఆ.వె.

ఏఁగు మనుమతింతు నెక్కడ కైనను

దశ దిశల యథేచ్ఛఁ దనరి భద్ర!  

జనక తనయ! నాకుఁ బని లేదు నీ తోడ

నెందు నింక వలదు సందియమ్ము

  1.  

 

 

 

కం.

పర గృహ మందు వసించిన

తరుణీ మణి నే నరుండు తాదాత్మ్యమునం

దిరిగి గ్రహింపఁగ నెంచును

గురుతర వంశోద్భవుండు కోమలి! చెపుమా   

  1.  

 

 

 

ఆ.వె.

రావణాంక మందు భ్రష్టవు దుష్టంపుఁ 

గనులఁ జూడఁ బడితివి నిను నెట్టు

లే నకట గ్రహింతు నిద్ధ వంశమ్మును

జెప్పుకొంచు సీత! గొప్పగాను   

  1.  

 

 

 

తే.గీ.

గెలువఁ బడితివి నా చేతఁ గులము కొఱకుఁ 

గీర్తి గడియించితిఁ దిరిగి గెలిచి రిపుని

లేదు నీ యందు నాసక్తి నాదు మదిని

నేఁగ వచ్చు యథేచ్ఛ మహీజ! నీవు   

  1.  

 

 

 

కం.

పలికితి నే నిట్లు మదినిఁ

దలంచి దృఢముగను భద్ర! తరలి సుఖముగం

లలనా! లక్ష్మణు నందై

న లేక భరతు పయి నేని నడపుమ రక్షన్      

  1.  

 

 

 

తే.గీ.

లేక శత్రుఘ్నఁ గాని  సుగ్రీవుఁ గాని

యవ్విభీషణుఁ గాని ధరాత్మజ! గణి

యింపు మీవు రక్షణమున కిట్లు కాని

చో సుఖం బెట్లు నీ కట్లు చూచుకొనుమ     

  1.  

 

 

 

కం.

చిర కాలము నిజ గృహమున

నరసి మనోరమను నిన్ను నా దశవక్త్రుం

డు రుచిర దివ్యాకార న

సు రాధముఁడు సైపఁ గలఁడె చోద్యము కాదే     

  1.  

 

 

 

కం.

విని ప్రియములు వినుటకుఁ దగు 

వనితామణి యప్రియములు పతి ప్రియుఁడు వచిం

ప నిభ కర కంపిత లత వ

లె నవనిజ వణఁకె భృశముగ రేఁగిన వశ్రుల్    

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట  పదునెనిమిదవ సర్గము.

 

 

యుద్ధ కాండము

సర్గము 119.

 

 

 

రాముని మాటలకుఁ గలఁత సెంది మిక్కుటముగ సీత తగిన యుత్తరము నొసంగి తన పాతివ్రత్యమును నిరూపించుకొన నగ్ని ప్రవేశము సేయుట.

 

 

 

 

కం.

అన రోమహర్షణములు వ

చనములు పరుషమ్ము లిట్లు సక్రోధముగం

మనుజేశ్వరుండు రాముఁడు

విని సీత కలంత నందెఁ బృథ్వీజ కడున్   

  1.  

 

 

 

చం.

అవనత యయ్యె సిగ్గున ధరాత్మజ పల్కులు పూర్వ మెన్నఁ డే

ని వినని వాలకించి ధరణీ జన సంఘము చూచుచుండఁగా

నృవరుఁడు స్వీయ భర్త యన నిష్ఠుర రీతిని వాక్ఛరమ్ములే

యవయవ రాశిఁ దూఱఁ గను లందు స్రవించెను భాష్పతోయముల్   

  1.  

 

 

 

ఉ.

భామ నిజాస్య మంతటను భాష్ప జలార్ద్రము దుడ్చుకొంచునుం

దా మగనిం దగం గనుచుఁ దద్దయు గద్గదయై వచించె ని

ట్లేమివి శ్రోత్ర దారుణము లీ వన రానివి వాక్కు లేల నో     

రామ వచింతు విచ్చటను బ్రాకృతుఁ డక్కట ప్రాకృతన్ వలెన్

  1.  

 

 

 

తే.గీ.

నే మహా బాహు! నన్నిట నీ వెటుల నె

ఱింగితివొ యెదఁ గా దట్టి యంగన నక

ట నను నమ్ము వచింతు నొట్టు నొనరించి 

నాదు చరితమ్ము పైనను నాథ! నీకు

  1.  

 

 

 

తే.గీ.

కాంచి ప్రాణేశ! సామాన్య కాంతల నడ

వడిని శంకించు చుంటివి యెడఁద జాతి

నెల్ల మున్ను బరీక్షించి తేని నన్ను

వీడు మీ సందియమ్మును వీర వర్య!   

  1.  

 

 

 

చం.

కలిగిన స్పర్శ మంగమునఁ గల్గె నవశ్యత నాకు నచ్చటం 

దలఁపకు కోరి చేసిన విధమ్ముగ దానిని నెంచి చూడఁగాఁ

జెలఁగెను దైవ దోషమునఁ జిత్తము నా వశ మందు నుండ నే

వలతును నిన్ను నిత్యము నవశ్యము లంగము లేమి సేయుదున్     

  1.  

 

 

 

తే.గీ.

మానద! కలసి పెరిగిన వైనమునను

మంచి సంబంధ ముండుట నంచితముగ

నన్ను నేర కుంటివి యేని చెన్నుగ నెద

నప్పుడె హతను స్థిరముగ నైతి నేను   

  1.  

 

 

 

ఉ.

పంపితి వీవు నన్ వెదక వాయు కుమారుని నుంటి లంక నీ

వంపిన వేళ నే నపుడె యక్కట యేల త్యజింప లేదు నీ

పంపును నాలకించి కపి వక్త్రము నుండి విసర్జ నార్తి  లోఁ

బెంపు వహింప జీవితము వీర! త్యజింపఁగ నోపు దాననే

  1.  

 

 

 

తే.గీ.

జీవితము నుంచి శంకను జేసి నట్టి

యీ వృథా పరిశ్రమ మెల్ల నింకఁ దప్పి

యుండు నీ సహృదుల క్లేశ ముండ కుండు

రామ! యప్పుడు సుంతయు రాఘవేంద్ర!      

  1.  

 

 

 

ఆ.వె.

స్త్రీత్వ మొక్క దాని  చిన్న నరుని భంగి

నాత్మ లోన ముఖ్య మంచు రోష

ముద్భవింపఁ దలఁచి తుర్వీప శార్దూల! 

యెంచ వన్య మెద్ది యేని యిపుడు      

  1.  

 

 

 

తే.గీ.

పుట్టితి జనకునకు నని భువిఁ బ్రసిద్ధి

పుట్టితిని నేను నిజముగ భూమి నుండి

నాదు వృత్తము వృత్తజ్ఞ! నాథ! నీవు

గౌరవింపవు మదిలోన వీర వర్య!   

  1.  

 

 

 

ఆ.వె.

పాణి పీడనమ్ము బాల్య మందు జరిగి

నది ప్రమాణ మంచు మది గణింప

వకట నాదు  గుణము నంచిత భక్తిని

నెట్టితివి వెనుకకుఁ గట్ట యిపుడు    

  1.  

 

 

 

ఉ.

మానిని పల్కి యేడ్చుచును మాటలు బొంగురువోవ లక్ష్మణున్

దీనుని ధ్యాన మగ్నుఁ గని దీన గతిన్ వచియించె నివ్విధిన్

నేను భరింప నిట్టి యపనిందను వంతకు నౌషధమ్ముగాఁ 

గానఁగ వచ్చు నా చితినిఁ గ్రన్నన లక్ష్మణ! నాకుఁ బేర్పుమా    

  1.  

 

 

 

తే.గీ.

బ్రతుక మిథ్యాపవాద తప్త నయి నేను 

గుణములకు సంతసింపని కోర నట్టి                            

భర్త ప్రజ ముందు విడువఁగ భార్య కెద్ది

యర్హ మం దేను వెసఁ జొత్తు ననల మందు    

  1.  

 

 

 

చం.

పలుకఁగ సీత రుట్టునకు వశ్యుఁడునై కడు లక్ష్మణుండు శ

త్రుల వధియించు వాఁడు నృవరుం గనె రాముని నన్న యింగిత

మ్ములఁ గని యంత రాఘవుని బుద్ధి నెఱింగి మనమ్ము నందుఁ దా

వెలయఁగఁ జేసెఁ జింతఁ జితి వీర వరుండు సహోద రాజ్ఞతో     

  1.  

 

 

 

తే.గీ.

అంత కాలాంతక యముని యట్టు లున్న

రాఘ వేంద్రుని నేరు నరయుట కేని

కదిసి ప్రార్థించుటకు నేని తుదకుఁ బలుకు

టకు నయినఁ జాలకుండిరి సకల సఖులు    

  1.  

 

 

 

చం.

పతికి నధో ముఖాబ్జునకుఁ బన్నుగఁ జేసి ప్రదక్షిణమ్మునున్

సతి తగ హవ్యవాహనుని సన్నిధి కేఁగి నమస్కరించి సీ

త తమి సురాలి కింక వసుధా సుర కోటికి నాత్మలోన నం

చితముగఁ బల్కె వాక్యములు సేతులు మోడ్చి సభక్తి యిట్టులన్    

  1.  

 

 

 

ఆ.వె.

ఎట్లు నాదు హృదయ మెప్పుడు రాముని

నుండి సుంత తొలఁగ కుండు నట్లు

లోక సాక్షి నన్ను వీఁక నెల్లెడలను 

గాచుఁ గాక వహ్ని కరుణ తోడ  

  1.  

 

 

 

ఆ.వె.

ఎట్లు దుష్ట నంచు నెంచెడు పతి గల

యేను శుద్ధ చరిత నెప్పు డట్లు

లోక సాక్షి నన్ను వీఁక నెల్లెడలను

గాచుఁ గాక వహ్ని కరుణ తోడ   

  1.  

 

 

 

ఆ.వె.

నారి నెట్లు నే మనః కర్మ వాక్కుల 

సర్వ వేత్త రామ సక్త నట్లు 

లోక సాక్షి నన్ను వీఁక నెల్లెడలను

గాచుఁ గాక వహ్ని కరుణ తోడ   

  1.  

 

 

 

తే.గీ.

సూర్య భగవానుఁ డనలుండు  సోముఁడు దిశ

లహము సంధ్యయు రాత్రియు నవని యటులె

యన్యులును శుద్ధ చరిత నే నంచు నెట్లు

నేర్తు రట్లగ్ని ననుఁ గావ నేర్చుఁ గాక   

  1.  

 

 

 

తే.గీ.

పలికి యిట్లగ్ని చుట్టును వడి వడి నెద

లేక యెట్టి కోర్కి తిరిగి దూఁకె సీత

మంట లోన నిశ్శంకను గంటి రబల

జనులు బాలవృద్ధులఁ గూడి జ్వాలఁ దూఱ    

  1.  

 

 

 

కం.

కనినవి సమస్త భూతము

లనలమ్మున రుక్మ వేది కాభను బడుచుం

డ నతివను విశాలాక్షిని

జనకాత్మజ రామ సతిని సంభ్రమ మడరన్

  1.  

 

 

 

కం.

కనె ముల్లోకము లన్నియు 

ననలములో నతివ  సొర మహాభాగను సీ

త నపుడు పుణ్యాజ్యాహుతి

యన నక్కజముగ వసుంధ రాత్మజ నంతన్

  1.  

 

 

 

ఆ.వె.

మంత్ర శుద్ధ హవ విమల రుచి రాజ్య ధా

రా నిభముగ నగ్ని రామ పత్ని

దూఁకు చుండ నేడ్చి రా కాంత లెల్ల ర

చ్చటఁ గలంత నంది స్వాంతములను

  1.  

 

 

 

తే.గీ.

ముజ్జగములు గంధర్వులు పుడమి సుతను

దేవ దానవు లరసిరి దేవత వలె

శప్త యయి నరకమునకు జాఱుచుండ

దేవ లోకము నుండి పతిత యయి వెస   

  1.  

 

 

 

కం.

అనలమునఁ జొచ్చుచుండ న

వనిజ హరుల రక్కసుల రవమ్ములు హా హా

యని విపులమ్ముగఁ జెలరేఁ

గిన వద్భుతముగఁ గలంత గిర లచ్చోటన్  

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట  పందొమ్మిదవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 120.

 

 

 

సీతా దేవి యగ్నిలో దూఁక రాముని చెంతకు బ్రహ్మ, మహేశ్వరుఁడు, దేవత లెల్లరు విమానములలో వచ్చి చేర బ్రహ్మ దేవుఁడు రామునితో నీవు సాక్షాత్తు మహా విష్ణు వని తెలిపి స్తుతించుట. 

 

 

                                                                                                 

 

కం.

విని సకల జనాక్రందము

లను ధర్మాత్ముఁడు భృశముగ రాముండు కలం

త నరసి కన్నీ రొలుకం

గనులను జింతించె నొక్క క్షణ మెద లోనన్     

  1.  

 

 

 

సీ.

యక్ష రాజాధి రా జా కుబేరుండు యముండు పితరులతో నుండి దేవ

రాజు సహస్రాక్ష రాజితుండు జలేశ్వరుం డైన యా వరుణుండు పరమ

శివుఁడు షడర్ధ రాజిత లోచనుం డీశ్వరుండు వృషభ సద్ధ్వజుండు శ్రీ మ

హా దేవుఁ డఖిల లోకావలి కర్తయు బ్రహ్మవిత్ప్రవరుండు  బ్రహ్మ దేవుఁ

 

తే.గీ.

డిట్టు లన్యులు గుమికూడి యెల్ల రేఁగు

దెంచిరి విమానముల నెక్కి యంచితముగ

సూర్య నిభముల లంకకు నార్యు రాఘ

వేంద్రు నింపుగఁ గదిసిరి యెలమి తోడ           

  1.  

 

 

 

కం.

పలికిరి త్రిదశశ్రేష్ఠులు

సలలిత హస్తాభరణ లసద్బాహుల నె

త్తి లపనము లిట్లెదుటఁ బ్రాం

జలి నిలిచిన రాఘవుఁ గని సచ్చారిత్రున్   

  1.  

 

 

 

తే.గీ.

కర్త వీవు రాఘవ! ముజ్జగముల కెల్ల

జ్ఞానవంతుల మేటివి జగతి విభుఁడ

వీ వుపేక్షించితివి యేల యింతి యగ్నిఁ

బడ నెఱుఁగ వేల నిను సురవరుఁడ వీవు

  1.  

 

 

 

తే.గీ.

మును వసువుల లోన ఋతుధాముఁడవు స్వయము

విభుఁడ వీవు ప్రజాపతివి త్రిజగముల

నాది కర్తవు రుద్రుల నష్టముఁడవు 

సాధ్యు లందెంచఁ బంచమ సాధ్యుఁడ వయ!   

  1.  

 

 

 

తే.గీ.

అశ్వినులు కర్ణములు నీకు నక్షు లరయ

సూర్య చంద్రు లాదిఁ దుదినిఁ జూడఁ బడుదు 

సీత నేల యిటుల నుపేక్షించి తీవు 

ప్రాకృతు వలెఁ బరంతప! రాఘవేంద్ర!

  1.  

 

 

 

ఉ.

రాముఁడు లోక నాథుఁడు సురవ్రజ మట్లు వచింప ధర్మ స

క్తామల చిత్తుఁ డిట్లనియె నయ్యమ రావలి తోడ నిర్జరుల్! 

రాముఁడ నేను దాశరథి రాఘవుఁడన్ మనుజుండ దేవ! గా

కే మిది నేనెవండను సురేంద్ర! వచింపుమ యెట్లు వచ్చితిన్

  1.  

 

 

 

కం.

అన విని కాకుత్స్థునితో

ననె బ్రహ్మవిదుల వరిష్ఠుఁ డబ్జజుఁ డంతన్

వినుమా సత్యపరాక్రమ!

ఘనచరితమ్ము వివరింతుఁ గమనీయముగన్     

  1.  

 

 

 

కం.

నారాయణుఁడవు దేవా!

నేరుమ చక్రాయుధుఁడవు నీవు పురా భ

వ్యారాతిఘ్నుఁడవు విభుఁడ

వో రామ! వరాహుఁడ వగు దొక శృంగముతో    

  1.  

 

 

 

తే.గీ.

అక్షరము సత్యము మఱియు యాది నంత

మున వెలుంగు బ్రహ్మవు నీవు మూరి లోక

ములకు వర ధర్మ మౌదువు నలు భుజుండ

వవుదు నీవు విష్వక్సేనుఁడవు విభుఁడవు   

  1.  

 

 

 

తే.గీ.

శార్ఙ్గ ధన్వి వజితుఁడవు సత్తముండ

వును హృషీకేశుఁడవు నీవు పురుషుఁడవు మ

ఱి పురుషోత్తముఁడవు నింక విపుల ఖడ్గ

ధారి విష్ణువు కృష్ణుఁడు తగుదు వనఁగ      

  1.  

 

 

 

తే.గీ.

నీవు పరమ సేనానివి నీవు గ్రామ

ణివి క్షమ దమలు బుద్ధివి నీవు భవము

లయము లీ వుపేంద్రుండవు రాఘవ! మధు

సూదనుఁడ వీవు నిజముగ శూర వర్య!      

  1.  

 

 

 

చం.

ఒనరుతు వింద్రకర్మముల నొప్ప మహేంద్రుఁడ వీవు మాపు దీ

వనులను బద్మనాభుఁడవు నందురు దివ్య మహర్షి పుంగవుల్

నిను శరణార్థి సంతతికి నిత్య శరణ్యుఁడ వౌదు వంచు వే

ల నెగడ శృంగముల్ శత శిరమ్ములు మిన్కుల కాత్మ వౌదువే         

  1.  

 

 

 

తే.గీ.

ఆది కర్తవు లోకత్రయమ్ము నందు

స్వయము ప్రభు వీవు సిద్దాలి సాధ్య తతికిఁ

బూర్వజుండ వాశ్రయుఁడ వఖర్వముగను

యజ్ఞ మీవు వషట్కార మౌదు వీవు   

  1.  

 

 

 

శా.

ఓంకారమ్ము పరాత్పరుండవును నీ యుత్పత్తి నీ నాశమున్

శంకం జెల్లును నేర రెవ్వరు నహో సందేహ మెవ్వారికిం

బంకేజాక్ష యెవండ వీ వని గనన్ వత్తీవు భూతాలి నే

వంకం గన్నను గో ద్విజావలిని నభ్రస్థావరజ్యానులన్      

  1.  

 

 

 

తే.గీ.

వేలు పదములు దృక్కులు వేలు వంద

లుత్త మాంగమ్ము లడరు శ్రీ యుతుఁడ వీవు

మోయు దీవు భూతమ్ములఁ బుడమి శైల

వరములను గూడి నిత్యము భద్రముగను   

  1.  

 

 

 

కం.

కనఁ బడుదు నీటి లోన య

వని కంతమ్మున నిలిచి భువనముల మూడిం

టిని గంధర్వుల దానవు

లను సురల వహించు నా యురగ రూపమునన్

  1.  

 

 

 

చం.

అరయఁగ నేను నీ హృదయ మౌదు సరస్వతి దేవి జిహ్వయౌ

సురల శరీర రోమముల చొప్పున నే సృజియించితిం దమిం

బరఁగును నీవు ఱెప్పలను బన్నుగ మూసిన రాత్రి విప్పినం

దిరముగ ఘస్రమై చెలఁగుఁ దీఱు సమస్తము నీవు లేనిచో        

  1.  

 

 

 

తే.గీ.

నీదు సంస్కారము లవియె వేదము లగు

జగతి నీ శరీరము నీదు స్థైర్య మగును

భూమి కోప మగ్ని ప్రసాదము శశియై య

డరును శ్రీ వత్స లక్షణుండవు రఘువర!       

  1.  

 

                                                                            

 

కం.

మును నీ వీ ముల్లోకము

ల నాక్రమించితివి పదములన్ మూడింటన్ 

ఘనుని మహేంద్రుని రాజుగ

నొనరించితి కట్టి బలిని నుగ్రాసురునిన్   

  1.  

 

 

 

కం.

సీత మహాలక్ష్మియె వి

ఖ్యాత మహావిష్ణు వీవు కాకుత్స్థవరా!

నేతవు ప్రజలకుఁ గృష్ణుఁడ

వైతివి  దేవ!నరునిగ దశాననుఁ జంపన్  

  1.  

 

 

 

ఆ.వె.

ధర్మభృత్తు లందుఁ దద్ద శ్రేష్ఠుండ! యీ

మా పని కృత మయ్యె మానవేంద్ర! 

నీ వలన సమసెను రావణుం డని రామ! 

చేరు మింక దివికి మూర ముదము  

  1.  

 

 

 

తే.గీ.

నీదు వీర్య మమోఘము నీదు విక్ర

మం బమోఘము నీ దర్శనం బమోఘ

మౌ యమోఘమే నీ కమనీయమైన

సంస్తవమ్ము  రఘువరేణ్య! సంతతమ్ము    

  1.  

 

 

 

తే.గీ.

నీదు భక్తు లమోఘులు నిత్యు ధ్రువుని

దేవుఁ బురుషోత్తముఁ బురాణు స్థిరత నెవ్వ

రుంద్రు కని భక్తు లయి వార లొందఁ గలరు

కామము లిహ పరమ్ముల రామ! నిజము  

  1.  

 

 

 

కం.

దీనిని నార్షస్తవమును

మానుగఁ గీర్తింతు రేరు మహి దివ్యముఁ బ్రా

చీనము నితిహాసము  వా

రే నిందల నంద రెన్నఁడేని నరేంద్రా!   

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట  యిరువదవ సర్గము.

 

 

యుద్ధ కాండము

సర్గము 121.

 

 

 

బ్రహ్మ దేవుని వాక్యమ్ము నాలకించి యగ్ని దేవుఁడు సీతను భద్రముగ నొడిలోనుంచి చితిపై నుండి లేచి సీత పవిత్రురాలని వక్కాణించి రామునకు సమర్పింప రాముఁడు సంతోషముగఁ దన భార్యను స్వీకరించుట. 

 

 

 

 

కం.

విని యా పితామహుం డా

డిన శుభవాక్యమును దన యొడి నునిచి వైదే

హినిఁ బైకి లేచెను హుతా

శనుండు వెస నంత నక్కజం బేపారన్

  1.  

 

 

 

ఆ.వె.

పుడమి పట్టినిఁ గొని మూర్తి మంతుండునై

హవ్యవాహనుండు భవ్యముగను

సొదఁ దొలంగఁ జేసి యుదరి యుత్థితుఁ డయ్యె

సీత తోడ నంత శీఘ్రముగను    

  1.  

 

 

 

చం.

పొలతిఁనిఁ దప్త కాంచన సుభూషణ నూతన సూర్య తుల్య బా

ల లలిత రక్త వస్త్రధర రామను నీల సుకుంచితాంగజన్ 

లలితను మాల్య భూష లవి రాజిలు చుండఁగ మాయ కింత యే 

నిల సుత సీతఁ దొంటి గతి నిచ్చెను రామున కా యనిందితన్   

  1.  

 

 

 

ఆ.వె.

పలికె నొసఁగి సీతఁ బావకుం డఖిల లో

కముల సాక్షి యిట్లు గని రఘు వరు 

నిదివొ రామ! చూడు మింతి నీ వైదేహిఁ

బాప మంట నేర దీ పడతికి    

  1.  

 

 

 

ఆ.వె.

మనసు చేత నైన మినుకుల నైనను

సీత తనదు బుద్ధి చేత నైనఁ

జక్షువుల నయినను సద్వృత్త కాంక్షిని

నిన్నతిక్రమింప నేర దమల    

  1.  

 

 

 

ఉ.

నీ వట లేక యున్న తఱి నిర్జన మైన యరణ్య మందుఁ దా

రావణు వీర్య దర్పితు పరాక్రముచే హృత యయ్యె బల్మి నా  

రావణు నింట బంధితగ రాక్షస కాంతలు ఘోర దర్శనల్

వావిరిఁ గాచుచుండఁగను బావని నీ పయి నుంచె చిత్తమున్       

  1.  

 

 

 

ఆ.వె.

లోభపెట్టఁ బడినఁ దా భయపెట్టఁ బ

డినను మిక్కుటముగ మనము నందు

నీవు నిలువ సతము రావణు లెక్కకుఁ

గొనదు సుంత నీదు కూర్మి దార

  1.  

 

 

 

తే.గీ.

శుద్ధ బావము లున్నట్టి యిద్ధరణిజఁ

బాప మింతయే నెఱుఁగని భామ సీత

నిప్పు డామె నింక ననక యెద్ది స్వీక

రింప వలయు నీ విది నాదు పంపు సుమ్ము   

  1.  

 

 

 

ఆ.వె.

అంతఁ బ్రీతి నంది యంతరంగమ్మునఁ 

బలుకు లాలకించి తలఁచె సుంత

భాష్పలోచనములు వఱలంగ రాముఁడు

ధర్మరతుఁడు గిరలఁ దద్ద దిట్ట   

  1.  

 

 

 

కం.

అనవిని దృఢవిక్రముఁడు ద్యు

తి నధికుఁడు రఘూద్వహుండు దిట్ట ఘన నయ

జ్ఞ నరులలో సుర వర్యునిఁ 

గని యంచితముగ వచించెఁ గాకుత్స్థుఁ డిటుల్    

  1.  

 

 

 

ఉ.

లోకము లందుఁ దప్పక సులోచన జానకి శుద్ధి కర్హ యౌ

యా కడ రావణాలయము నందు వసింపఁగ దీర్ఘ కాలమే

యీ కలకంఠి మంగళయు నీ రఘురాముఁడు కాముఁ డందురే

లోకులు నన్నశోధిత నిరుద్ధను గైకొన మూర్ఖుఁ డంచునున్    

  1.  

 

 

 

తే.గీ.

ఇయ్యనన్య హృదయను నహీన భక్త

ను జనకాత్మజ మైథిలి నిజ మనమ్ము

నందు నిత్యము చరియించు నతివ నేను

 నెఱుఁగు వాఁడను బావని నింపుగాను    

  1.  

 

 

 

కం.

నిజ తేజో రక్షిత నవ

నిజను విశాలాక్షినిఁ దగునే దాఁటంగన్

నిజ మరయ రావణుఁడు ఘో

ర జలధి దాఁటఁ గలదే ధరణి నా వేలన్     

  1.  

 

 

 

తే.గీ.

ముజ్జగమ్ముల నమ్మింప ముఖ్యముగను

సత్య సంశ్రయుండ నయి నే సత్యముగను

హవ్యవాహన! వాక్యమ్ము లట్టు లాడి  

యవనిజను నుపేక్షించితి నగ్నిఁ దూఁక   

  1.  

 

 

 

కం.

జనకాత్మజ నెదిరింపఁగ

మనసున నైనఁ గడు దుష్ట మానసుఁడు దశా

ననుఁ డసమర్థుఁడు కదియం

గ నశక్యను దీప్త భుజి శిఖా సదృశముగన్

  1.  

 

 

 

తే.గీ.

మంగళప్రదురా లైన మైథిలికి ద

శాన నాంతః పురము లోన నడరు నట్టి

వాని యైశ్వర్యమున లేదు పని దినకరు

ప్రభ పగిది నా కనన్యము రామ సీత    

  1.  

 

 

 

ఆ.వె.

కడు పవిత్రురాలు గాంచ ముల్లోకము

లందు సీత విడువ నవనిజ నస

మర్థుఁడను యశమ్ము మనుజ వరేణ్యుఁడు 

వీడ లేని భంగి విశ్వ మందు   

  1.  

 

 

 

ఆ.వె.

లోకపాలు రిట్టులు వచింప సస్నేహ

ము హిత మొసఁగు వాక్యము నది యింకఁ 

దప్పకుండఁ జేయఁ దగు నట్టి కార్యంబ

యగును నాకు నిప్పు డార్యులార!

  1.  

 

 

 

తే.గీ.

పలికి విజయుం డధిక బలవంతుఁ డిట్లు 

మురిసి స్వీయ కార్యమునకుఁ బొగడఁ బడుచుఁ  

బ్రియను గూడి సుఖార్హుఁడు ప్రీతి రాముఁ

డందె సౌఖ్యమ్ము నంతట నధికముగను      

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట  యిరువది యొకటవ సర్గము.

 

 

యుద్ధ కాండము

సర్గము 122.

 

 

 

రాముని శుభ వాక్యముల నాలకించి మహేశ్వరుఁడు ప్రీతిఁ జెంది రామ లక్ష్మణులతో విమానమున నింద్రునితోఁ గూడి వచ్చిన దశరథునకు మొక్కుఁ డనంగ వారట్లు సేయ దశరథుఁడు వారికి హిత వచనములు పలికి రాముని నయోధ్య కేఁగి పట్టాభిషిక్తుఁడవు కమ్మని తిరిగి యింద్రునితోఁ గూడి యమర లోకమున కేఁగుట. 

 

 

 

 

కం.

అన రాఘవుఁ డట్లు శుభ వ

చనమ్ములు మహేశ్వరుండు శంభుఁడు వచియిం

చె నిటుల శుభతర వాక్య

మ్మును రామునిఁ గాంచి యంత మోదం బలరన్    

  1.  

 

 

 

ఉ.

చేసితి రామ! యిప్పనిని శీలవరేణ్య! పరంతపా! మహా

భాసిత వక్ష! దీర్ఘ భుజ! భాగ్య వశమ్మునఁ బుష్కరాంబకా!

వాసెను రావ ణోద్భవము భైరవ భీతి తమమ్ము సంపఁగా

నా సమరమ్ములో నసురు నావృత మెల్లను లోక రాశినిన్   

  1.  

 

 

 

సీ.

భరతుని దీను నాశ్వాసించి కౌసల్య నా యశస్వినిఁ దగ నాశ్వసించి

కైకేయి నరసి లక్ష్మణ మాత నా సుమిత్రం గని యింపుగ రాజ్య మయ్య

యోధ్య లోనఁ బడసి యుచిత రీతి సుహృజ్జనుల నెల్ల నలరించి లలిత రీతి

నిక్ష్వాకు వంశము నింపుగ స్థాపించి యశ్వమేధ క్రతువు లలరి చేసి              

 

ఆ.వె.

బ్రాహ్మణుల కొసంగి పన్నుగ విత్తమ్ము

నత్యధికముగను మహా భుజుండ!  

వాని చేత నంది పరమ యశమ్మును

దివికి నరుగ నర్హుఁడవు రఘువర!   

  1.  

 

 

 

తే.గీ.

రాజు దశరధుం డీతఁడు రామ! యివ్వి

మాన మందు వెలయు వాఁడు  మాననీయ

జనకుఁడు నరలోకమ్మున మనుజ వర్య!

నీకు ఘన కీర్తిమంతుండు నీరజాక్ష!      

  1.  

 

 

 

ఉ.

ఏఁగె మహేంద్ర లోకమున కీతఁడు నీవు తరింప రాఘవా!

బాగుగ నందనుండ వయి భ్రాతను లక్ష్మణుఁ గూడి తండ్రికిన్

వేగమ యాచరింపు మిటఁ బ్రీతి యుతమ్ముగ వందనమ్ములన్

నాఁ గనె నవ్విమాన వహనస్థుని లక్ష్మణు తోడ మ్రొక్కుచున్

  1.  

 

 

 

ఆ.వె.

స్వీయ కాంతి తోడఁ జెన్నుగ వెల్గుచు

విమల వాసనమ్ము లమరి యుండ

జనకుఁ గాంచె రాముఁ డనుజ వర్యునితోడ

విభుఁడు సంతసమున వీర వరుఁడు   

  1.  

 

 

 

చం.

ముదము సెలంగ మిక్కుటము భూపతి నిల్చి విమాన పీఠికం

గుదురుగఁ గాంచి పుత్రు ననుగుం దమిఁ బంక్తిరథుండు నచ్చటం 

బదపడి యుంచి యంకమునఁ బ్రాణము కన్నను మిన్న వాని నం

తఁ దనయుఁ గౌఁగిలించికొని దాశరథిన్ వచియించె నిట్టులన్    

  1.  

 

 

 

కం.

రుచియింపదు విను స్వర్గము

వచింతు సత్యమ్ము నేను వత్స! కననిచో

రుచిరంపు నీ ముఖమ్మును

బచరించిన సురల గౌరవం బది నాపై      

  1.  

 

 

 

తే.గీ.

ఛేది తామిత్ర సంపూర్ణ చిత్తు నిన్ను

దీర్ణ వనవాస ముదిత హృదినిఁ గుమార!

నిన్ను వీక్షింపఁగా నాకు నేఁడు ప్రీతి 

సందడించె భృశమ్ముగ డెంద మందు        

  1.  

 

 

 

కం.

కైకేయి యన్నపలుకులు

నీ కానన వాసమునకు నిలిచిన వెదలో

నా కింకను ఘోరమ్ములు

కాకుత్స్థ కులోద్భవుండ! కాఱియ సెలఁగన్    

  1.  

 

 

 

కం.

కని నిన్ను క్షేమముగ నీ

యనుజుని సౌమిత్రిఁ గూడి యాశ్లేషింపం 

దనయా! తొలఁగితి ధుఃఖ

మ్మున నుండి హిమమ్ము నుండి పోవు రవి వలెన్

  1.  

 

 

 

కం.

తరియింపఁ బడితి నీ చే

నురుతరము సు సుతు వలనఁ గహోలుఁడు ధరణీ

సురుఁ డష్టావక్రునిచేఁ

దరియింపఁ బడిన విధమ్ము తనయా! ప్రీతిన్    

  1.  

 

 

 

కం.

రావణ వధార్థ మివ్విధి

దేవత లొనరించి నట్లు తెల్లమ్ముగ నా 

కో వత్సా! తెలిసె నిపుడు

నీ వా పురుషోత్తముఁడవు నేరితి నిన్నున్        

  1.  

 

 

 

ఆ.వె.

నిన్ను దిరిగి చేర నిలయమ్ము కౌసల్య

వనము నుండి వెడలి పన్నుగ నరు

దెంచ నీవు మురియు మించి సిద్ధార్థ యై

శత్రుసూదను నటఁ జక్కఁ గాంచి

  1.  

 

 

 

ఆ.వె.

చేరఁ బురము నీవు సిద్ధార్థు లౌదురు

జనులు నిన్ను గాంచి మనుజ ధవుని

గ నభిషిక్తు నిన్ను గాంతురు హర్షింతు 

రపుడు మిక్కుటముగ నంద ఱడరి

  1.  

 

 

 

చం.

భరతుని శుద్ధు ధర్మచరు బల్లిదుఁ గూడిన నిన్ను రామ! నే

నరయఁ దలంతు నెమ్మది నిజానుజు తోడుత సీత యుండగా

దరి వన వాస మింపుగఁ గృతమ్ము గదా పదునాలు గేండ్లు నా

వర సుత! నా ప్రతిజ్ఞ రఘు వర్య గనం బరి పూర్ణ మిట్టులన్       

  1.  

 

 

 

ఉ.

రావణుఁ జంపి దేవతల రంజిలఁ జేసితి భండనమ్మునన్

నీ వొనరించి కర్మమును నెమ్మి యశమ్మును శ్లాఘనీయ మి

ట్లీ వసుధా తలమ్మున గ్రహించితి దీర్ఘపు టాయు వింపుగన్

భూవర! యంది రాజ్యమును బొందుమ తమ్ములఁ గూడి రాఘవా!

  1.  

 

 

 

మ.

అన రాజేంద్రుఁడు పల్కు లిట్లు విని తా హస్తమ్ములన్ మోడ్చి ప

ల్కెను గాకుత్స్థుఁడు రాముఁ డిట్లు కని తండ్రిం బార్థశార్దూల! గై

కను నా సోదర పుంగవున్ భరతునిం గారుణ్య మేపారఁగాఁ 

గను ధర్మజ్ఞుఁడ! వీడితిన్ సుతునితోఁ గైకేయి నాఁ బల్కితే          

  1.  

 

 

 

ఆ.వె.

మున్ను ఘోర కోపమున శాప మయ్యది

వారిఁ దగుల కుండు వరము నిమ్ము

ప్రభు! దయా సముద్ర! రాముఁ డిట్లన విని                                        

తండ్రి యట్లె యనెను దశరథుండు

  1.  

 

 

 

తే.గీ.

దశరథుం డంతఁ గౌఁగిలి తద్ద ప్రీతిఁ

దనయు లక్ష్మణునిఁ దిరిగి యనియె నిట్లు

సీత తోడుత రాముని సేవ సేసి

ముద మొసఁగితి ధర్మ సుఫలముం బడసితె

  1.  

 

 

 

ఆ.వె.

ధర్మ మందఁ గలవు ధర్మజ్ఞ! కీర్తిని

విస్తృతముగ నీవు పృథ్వి లోన

సుప్రసన్నుఁ డైన సువ్రతుఁ డా రాముఁ

డందఁ గలవు స్వర్గ మధిక మహిమ   

  1.  

 

 

 

కం.

భువి రాము సుమిత్రానం

ద వర్ధన! భజింపు శుభము దనరును నీకున్

నృవరుఁ డతఁడుఁ వర్తించు న

నవరతము జగద్ధితం బొనర్ప ముదమునన్                

  1.  

 

 

 

తే.గీ.

వీర లింద్రునితో లోక వీరు లింక

సిద్ధులు పరమర్షులు నెల్లఁ జేరి యిమ్మ

హాత్ముఁ బురుషోత్తముని భక్తి యతిశయిల్ల

వచ్చి రర్చింప నింపుగ మెచ్చి పనిని         

  1.  

 

 

 

తే.గీ.

పుడమి నవ్యక్త మక్షరమ్ము సుర హృదయ

సంస్థితము సౌమ్య! గుహ్యము స్వయము బ్రహ్మ

మిట్లు రామునిగను సృజియింపఁ బడిన

దంచు నుక్తమ్ము బుధులచే నంచితముగ    

  1.  

 

 

 

ఆ.వె.

పడసితివి కుమార! వైదేహి తోడుత

సేవ సేసి భక్తి నీ విటుల ని

తనికి సంతతమ్ము ధర్మాచరణము య

శమ్ము లక్ష్మణా! భృశమ్ముగాను

  1.  

 

 

 

చం.

అని సుతు తోడ నిప్పగిది నంజలి నిల్చిన సీతఁ గోడలిం

గని వచియించెఁ బుత్రి యని కమ్మని పల్కుల నిట్లు మెల్లగాఁ

గినుక వహింప కమ్మ! పలికెం బతి యవ్విధిఁ గోరి నీ హిత

మ్మును నిను శుద్ధి సేయఁగను బుత్రి! యొనర్చి తసాధ్య కర్మమున్        

  1.  

 

 

 

కం.

పర నారీ మణుల యశం

బరయఁగ క్షీణించె సాధ్వి! యమలం బగు నీ

చరితమ్మున నిప్పుడు దు

ష్కర కర్మమ్మునను దల్లి! కాంతామణిరో!      

  1.  

 

 

 

తే.గీ.

భర్తృ సేవ గుఱించి చెప్పఁ బని లేదు

నీకు మైథిలి! నిజ మెన్న నే నయినను

 జెప్పఁ దగు నింత మాత్రము సీత నీకు

పరమ దైవము నిరతమ్ము భర్త సతికి    

  1.  

 

 

 

కం.

ఉపదేశించి కుమారుల

కపు డివ్విధిఁ గోడలికిని ననుమతి నిడి యా

నృపతి దశరథుం డేఁగె సు

ర పతి పురమునకు విమాన రత్నము నందున్

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట  యిరువది రెండవ సర్గము.

 

 

యుద్ధ కాండము

సర్గము 123.

 

 

 

దశరథుఁ డేఁగువాఁడు కాఁగ మహేంద్రుఁడు ప్రీతుం డయి  రాముని వర మేదేనిఁ గోరుకొను మనంగ రాముఁడు మరణించిన వానరుల నెల్ల బ్రతికింపు మన నట్లు సేసి యమరలతో దశరథునితోఁ    బాకశాసనుఁడు మరలి వెడల వానరులు విశ్రాంతి నందుట. 

 

 

 

 

కం.

చను వాఁడగు చుండఁగ నా

మనుజేంద్రుఁడు దశరథుం డమర నాథుఁడు రా

మునిఁ బ్రాంజలినిం గని హ

ర్ష నిమగ్నుండు నయి పాకశాసనుఁ డంతన్    

  1.  

 

 

 

తే.గీ.

పలికె మా దర్శనము రామ! వ్యర్థ మగుట

తగదు మీకు నరర్షభ! తద్ద ప్రీతి

నందితిని నేను నీ మన మందు నున్న

యీప్సితమ్మును వేఁడుమ యిత్తు నేను  

  1.  

 

 

 

ఉ.

నా విని యింద్రుఁ డట్లన ఘనంపుఁ బ్రసన్నుఁడు సుప్రసన్నుఁడై

భూవరుఁ డంజలించి సహ భూమిజ  లక్ష్మణుఁడై వినమ్రతం

దా వచియించె దేవ వర! తద్ద ముదమ్ము నెడందఁ బొందినన్ 

నా వలనం దగన్ నిజ మొనర్పుమ పల్కుదు నాదు మాటలన్   

  1.  

 

 

 

ఉ.

నా కయి విక్రమించుచు రణమ్మునఁ గాలునిఁ గాంచి నట్టి వా

రా కపి వర్యు లెల్లరు మహాత్మ! సజీవము లేవఁ గోరెదన్

వీఁకను బోరి నా కొఱకు వీడిరి కూలఁగఁ బుత్ర దారలన్  

నీ కృపఁ గాంచ నెంచెదను నేను సుఖమ్ముగ రాఁగ వారినిన్  

  1.  

 

 

 

కం.

బ్రతికింపుమా విపన్నులఁ

గృత యత్నుల శూరుల మృతికి భయపడని స

న్నుత విక్రాంతప్లవ సం

తతి నెల్లఁ బురందర! వినుత దయా హృదయా!   

  1.  

 

 

 

ఆ.వె.

మత్ప్రియానురక్త మర్క టోత్తములు గ

ణింప రేరు మృతిని నింపు కొలుప

నీ ప్రసాదమునను నిర్జర గణ నాథ!

వారు లేచి వచ్చు  వర మడిగెద     

  1.  

 

 

 

తే.గీ.

ఎలుఁగుగొడ్లు  గోలాంగూలములు రుజలు వ్ర

ణములు లేక పౌరుష మగణ్య బలము లడ

రంగ మానద! రాఁగ గాంచంగఁ గోరు

వాఁడ నీదు కరుణతోడ నేఁడు మదిని     

  1.  

 

 

 

తే.గీ.

ఎక్క డుందురు వానరు లక్క డమర

నాథ! మూల ఫలమ్ములు నదులు విమల

ములు నకాల మైనను నిత్యము విలసిల్ల

వలెను గరుణ వహించి యీ వరము నిమ్ము      

  1.  

 

 

 

కం.

విని రాఘవుని మహాత్ముని

యిన వంశోద్భవు వచనము లింపెసలారన్

మనమున మహేంద్రుఁడు  వచిం

చె నుత్తరమ్మును ముదమ్ము సెలఁగు విధమునన్

  1.  

 

 

 

కం.

వర మది నీ యడిగిన యది

నర పుంగవ గొప్పదౌఁ గన మును పలుక నే

ను రఘూత్తమ! రెండు గతుల

జరగు నటులె యందు వలన శంక వల దిటన్    

  1.  

 

 

 

ఉ.

లేతురు ఋక్ష వానరులు లీలగ నెల్లరు రాక్షసాలి సం

పాతులు ఘోర యుద్దమున భగ్న భు జానన తప్త దేహులున్

వీత రుజా వ్ర ణార్తు లయి విస్తృత వీర్య స పౌరుషాఢ్యులై

యీ తఱి నిద్ర నుండి వెస నింపుగ లేచిన భంగి దోఁపఁగన్

  1.  

 

 

 

తే.గీ.

బంధు మిత్రుల జ్ఞాతుల స్వజనుల ముద

మార నింపుగ నెల్లరు నర్మిలిఁ గల

యఁ గలరు సజీవులై యీ ప్లవగులు నిశ్చ

యముగ భక్త వరులు నీకు నంచితముగ   

  1.  

 

 

 

కం.

తనరు మహేష్వాస! తరులు

ఘన చిత్ర సుమ ఫలముల నకాలము నందై

నను భృశముగ విలసిల్లు నిఁ

క నదులు జల పూర్ణము లయి కమనీయముగన్   

  1.  

 

 

 

తే.గీ.

నిద్ర నుండి లేచిన భంగిని మును గాయ

ములను గూడి యిప్పుడు గాయము లవి లేని

కాయముల తోడ లేచిరి కపులు విస్మ

యమ్ము నంది రెల్లరు నేమి యట యిది యని   

  1.  

 

 

 

కం.

పరి పూర్ణార్థుని రాముని

సురోత్తములు గాంచి యంత స్తుతియించుచు నా

నరవరు సలక్ష్మణు వచిం

చి రిట్లు ప్రీతాత్ము లయి రుచిరముగ నంతన్      

  1.  

 

 

 

మ.

చనుమా రాఘవ వీడి వానరుల రాజా! నీ వయోధ్యా పుర

మ్మునకున్ సీతను నూఱడింపుమ యశః పూర్ణాంగనా రత్నముం

గని నీ యం దనురక్త భ్రాత భరతుం గాకుత్స్థ! శత్రుఘ్నుతో

డను వీక్షింపుమ యార్తు నీ కొఱకుఁ గట్టా తల్లులం జూడుమా!       

  1.  

 

 

 

తే.గీ.

ఏఁగి యభిషిక్తుఁడ వయి నీ వింపుగ నటఁ

బౌరులకు నిమ్ము హర్షమ్ము పార్థివేంద్ర! 

పలికి యిటుల సహస్రాక్షుఁ డలరి సురల 

తోడఁ జనె విమానమ్ములఁ దూర్ణముగను   

  1.  

 

 

 

కం.

సురలకు నమస్కరించి నృ

వరుండు రాముండు దన యవరజునితో వా

నరుల కట విశ్రమింపఁగఁ

గరుణ నొసంగె ననుమతినిఁ గ్లమ మాఱంగన్      

  1.  

 

 

 

కం.

వెలిగిన దా హృష్ట జనుల

నలరెడు చము వెల్లెడల మహా రఘుకుల చం

ద్రుల రక్షణమున శోభలఁ 

గలువల దొర వలన వెలుఁగు క్షణద పగిదినిన్     

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట  యిరువది మూడవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 124.

                                               

 

 

రాముఁ డయోధ్య కేఁగ నుద్యుక్తుఁడు గాఁగ విభీషణుఁడు పుష్పక విమానమును రామునకై తీసికొని వచ్చుట.

 

 

 

 

కం.

నిసి నిదురించి తగిన రీ

తి సుఖమ్ముగ మేల్కన నృపతి రఘూత్తమునిన్

వెస నంత విభీషణుఁడు గ

దిసి పలికి జయమ్మును వినతి ననియె నిట్లున్    

  1.  

 

 

 

ఉ.

స్నానపు టంగ రాగములు స్వర్ణ విభూషణ వస్త్ర రాజముల్

మానిత గంధ మాల్యములు మంచివి దివ్య పదార్థ కోటినిన్  

మానిను లూని హస్తముల మాన్యలు నిల్చిరి తమ్మికంటులే  

కానఁగ వీ రలంకరణ కర్మవిదల్ నిను స్నాతుఁ జేయఁగన్   

  1.  

 

 

 

తే.గీ.

నన్ననుగ్రహింపఁ గొనుమ నర వరేణ్య!

వాని నెల్ల ననఁగ విని బదు లిడె రఘు

వరుఁడు సుగ్రీవ ముఖ్య ప్లవగుల స్నాన

మునకుఁ బిలువుమ రాక్షస ముఖ్య నాథ!      

  1.  

 

 

 

చం.

భరతుఁడు నా నిమిత్త మట వంత మహా భుజుఁ డుండెఁ దా నిరం 

తరమును సత్య సంశ్రయుఁడు ధర్మ రతుండు సుఖోచితుండు  నే

నరయక వానిఁ గైక సుతు నా సుకుమారుని నొల్ల నంబ రా

భరణము లూన నో యసుర వర్యుఁడ! స్నానము నాచరింపఁగన్  

  1.  

 

 

 

కం.

చనుదు నయోధ్యకు వెస నే

రినదే గద దారి యాపురికి దుర్గమమే

కన మార్గమ్ము భృశమ్ముగ

నన రాముండు విని యిట్టు లసురేంద్రుఁ డనెన్  

  1.  

 

 

 

చం.

నరవర! చక్క నిన్నొక దినమ్మునఁ బంపెద నయ్యయోధ్య కం

బరమణి తుల్య పుష్పక విమానము భ్రాత కుబేరు నుండి సం

గరమునఁ దా జయించి దశకంఠుఁడు గొన్నది బల్మిఁ గోరు న

ట్లరుగును దివ్య మున్నది త్వదర్థము రాఘవ! భద్ర మయ్యెడిన్ 

  1.  

 

 

 

చం.

చనఁ గల వెట్టి యానమున సన్నుత యట్టి విమాన మియ్యెడన్ 

ఘన ఘన సన్నిభమ్ము మదిఁ గాఱియ నంద కయోధ్యకున్ వెసం

గను మిట నిల్చియున్నయది గల్గిన సద్దయ నా గుణమ్ము లెం

చిన నిలు మొక్క ఘస్ర మిటఁ జెన్నుగ నాపయి స్నేహ మున్నచో   

  1.  

 

 

 

ఉ.

తమ్మునిఁ గూడి లక్ష్మణుని దారను గూడి విదేహ కన్యనున్

నెమ్మి సమస్త కామముల నిన్నిట నింపుగ గౌరవింప సై

న్యమ్మును మిత్ర సంఘము ఘనమ్ముగ నేను దలంచి నట్టి క

ర్మమ్మును స్వీకరింపుమ కరమ్ము ముదమ్ము వహించి చేయఁగా

  1.  

 

 

 

ఆ.వె.

గౌరవమ్ము ప్రేమ కాకుత్స్థ! స్నేహమ్ము

తోడ వేఁడు చుంటి ఱేఁడ! నేను

గింకరుండను ఘన కీర్తిమంత! యిటుల

నరయ విన్నపంబ యాజ్ఞ కాదు   

  1.  

 

 

 

చం.

పలుక నిటుల్ విభీషణుఁడు వాక్యము లింపుగ నాలకించి యి

ట్టుల వచియించె రాముఁడు గడుం గడు యుక్త వచస్సులం బ్లవం

గు లసురు లెల్లరున్ వినఁగఁ గూరిమి మిత్రుఁడ! పూజితుండఁ జే

ష్టలను బరఘ్న! సాయమున సర్వ విధమ్ముల సౌహృదమ్మునన్     

  1.  

 

 

 

తే.గీ.

రాక్షసేశ్వర! నీ మాటలను విన నను

మాట లేదు నిక్కముగను మనసు నాది

భరతు వీక్షింప క్షిప్రమ్ము భ్రాతృ వర్యు

నిపుడు త్వరపఱుపఁ దొడంగె విపులముగను     

  1.  

 

 

 

తే.గీ.

మున్ను చిత్రకూటమ్మున సన్నిధి యయి   

నన్ను మరలింపఁ దల వంచి మన్నన నడు

గంగఁ గా దంటి నెవ్వనిఁ గాంచ నెంతు

వాని నో విభీషణ! క్షిప్ర మేను వినుమ     

  1.  

 

 

 

తే.గీ.

కాంచఁ గౌసల్యను సుమిత్రఁ గైక నా య

శస్విని జననుల గుహుని సఖుని పౌరు

లను జనపదులం గూడి తలంతు ననుమ

తింపు మైతిఁ  బూజితుఁడఁ గోపింప వలదు        

  1.  

 

 

 

కం.

నిలుపుమ విమాన వరమును

లలి రాక్షస నాథ!  సత్వరమ్ముగ నింకన్

వలయునె కృత కార్యునకుం

దలంప వాస మది యసుర దక్షా! చెపుమా   

  1.  

 

 

 

కం.

విని రాఘవేంద్రు పలుకులు

సని యంత విమానము రవి సన్నిభమును వ

చ్చెను గొని విభీషణుం డసు

ర నాథుఁ డతి వేగముగను రామార్థమ్మున్    

  1.  

 

 

 

సీ.

కాంచన చిత్ర వికా సాంగము వర వైడూర్య మణి మయ పటుతర వేది

కా విలసిత మండ పావృతమ్ము రజత శోభితము ధవళ సురుచిర ధ్వ

జ పతాక భూషిత విపులమ్ము కాంచన పద్మ భూషిత ఘన భర్మ హర్మ్య

లసితమ్ము కింకిణీ రవ నాదితమ్ము ముక్తామణి మయ గవాక్ష పరివృతము            

 

తే.గీ.

వితత మేరు శృంగ నిభమ్ము విశ్వకర్మ

నిర్మితమ్ము ముక్తా రూప్య నిలయ వృతము

స్ఫటిక చిత్రావృత తల నిచయ విలసిత

సుంద రాస్తర ణాసన బృంద యుతము   

  1.  

 

 

 

కం.

విమలతర పుష్పక విమా

నమును మనోజవము నుంచి నరవరు నెదుటన్

సముదము విభీషణుండు త

రము కాని దెదిర్ప నిలిచె రాముని చెంతన్

  1.  

 

 

 

కం.

కని పుష్పకమ్ముఁ గామ గ

మనమ్మును విమానము నగమ నిభము సౌమి

త్రినిఁ గూడి యచ్చెరువు నం

దెను రాముఁ డుదార బలుఁడు దెచ్చిన దానిన్

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట  యిరువది నాలుగవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 125.

 

 

 

రాముని కోరిక మేరకు విభీషణుఁడు వానరుల నెల్ల ధన రత్న భూష ణాదుల సత్కరింప సంతసించి సీతా సమేత రాముఁడు లక్ష్మణునితో విభీషణ సుగ్రీ వాది వానర సమూహముతో నయోధ్యకుఁ బుష్పక విమానమున బయలుదేరుట. 

 

 

 

 

తే.గీ.

పుష్ప సంచయ భూషిత పుష్పకము వి

మానము నునిచి దరి నున్న మాన వేంద్రుఁ

గాంచి రామునితో నంజలించి పలికెఁ

ద్వరితుఁ డింకేమి నేఁ జేయ వలయు నంచు     

  1.  

 

 

 

చం.

వినయముగా విభీషణుఁడు పేరిమిఁ బల్కఁగ లక్ష్మణుం డటన్

విన ననె నాత్మలోఁ దలఁచి వీరుఁ డొకింత రఘూత్తముండు నె

మ్మిని ఘన తేజుఁ డారసి సమీప విభీషణు గారవమ్మునన్

వనచరులం గృతార్థులను బన్నుగ నెల్లర సత్కరింపుమా   

  1.  

 

 

 

చం.

ధనము లనేక రత్న వివిధమ్ము లొసంగు విభీషణా! పుర

మ్మును సమ రానివర్తు లని మూరుచుఁ బ్రాణ భయమ్ము వీడి పో

రిన ముద మూని గెల్చితివి రేఁగి భృశమ్ముగ నీవు విక్రమ

మ్మున నసురేశ్వరా! బలమ మోఘము వర్తిల దుస్సహమ్ముగన్    

  1.  

 

 

 

ఉ.

చేసిరి కార్య మెల్లఁ గపి శేఖరు లెల్లరు విత్త రత్నముల్

వాసిగ నిచ్చి యా పనిని భద్రముగా సఫలమ్ము సేయుమా

చేసినచోఁ గృతజ్ఞతను సిద్ధుల కర్హుల కీగి మానదా! 

యీ సమయమ్ము నందు హరు లెల్లరు హర్షితు లౌదు రాత్మలన్     

  1.  

 

 

 

ఉ.

త్యాగినిఁ బ్రీతిఁ జేర్చుకొను నాతని జాలి గలట్టి వానినిన్

బాగుగ నింద్రియమ్ములను వారక నెగ్గిన వాని నెల్లరున్

వేఁగక చేరు చుందు రిలఁ బ్రీతి వచించుచు నుంటి నందుకే

యీ గతి నెంచి స్నేహ మసురేంద్ర! విభీషణ! యాలకింపుమా     

  1.  

 

 

 

కం.

ప్రేమ విహీనునిఁ దన సం

గ్రామము లందు వధియించు కరుణా హీనున్

భూమీశుని నిజ వాహిని 

యేమఱక త్యజించు నింక నేఁపు సెలంగన్      

  1.  

 

 

 

కం.

పలుకఁగ రాఘవుఁ డిట్టుల

నలరి విభీషణుఁ డపుడు ధనాధిక రత్న

మ్ములు పంచి యంచితముగ హ

రులఁ బూజించె నసురేశ్వరుం డందఱినిన్         

  1.  

 

 

 

కం.

కని రత్నార్థమ్ముల హరు

ల నట్లు పూజింపఁ బడఁగ రఘురాముం డె

క్కెను వర విమాన మంక

మ్మున నిడి లజ్జితను సీత మురిసి యనుజుతో   

  1.  

 

 

 

తే.గీ.

నిలిచి యా విమానమ్మున నెమ్మి గౌర

వించి తగ వానరుల నెల్ల నంచితముగఁ

బల్కె రాముఁడు వీక్షించి వాన రేంద్రు

నసుర నాథు విభీషణు నంత నిట్లు     

  1.  

 

 

 

ఆ.వె.

మిత్ర కార్య మెల్ల మేలుగఁ జేసిరి

వానరర్షభు లనివార్యముగను 

జనుఁడు మీర లింకఁ జక్క నచ్చిన రీతి

ననుమతింతు మిమ్ము నార్యు లార!    

  1.  

 

 

 

తే.గీ.

ఏది సేయఁ దగు సఖుని హితుని చేతఁ

బ్రేమ నీ చేత నది యయ్యె వెఱపు ధర్మ

మందుఁ గలవాఁడ! సుగ్రీవ! డెంద మలర

నేఁగు కిష్కింధకు ససైన్య మింక వేగ

  1.  

 

 

 

తే.గీ.

నా యొసంగిన లంకను నైరృత ధవ! 

స్వీయ రాజ్యమ్ము నందు విభీషణ! వసి

యింపు మింపుగ నెదిరింప నేరు సేంద్ర

సురులు కారు సమర్థులు సుమ్మి నిన్ను   

  1.  

 

 

 

కం.

అరిగెద నయోధ్యకు జనకు

ని రాజధానికి ననుమతిని నొసఁగ వలె నె

ల్లరు నడుగుచుంటి  మిమ్మా

దరమున నన రాఘవుండు తద్దయుఁ బ్రీతిన్   

  1.  

 

 

 

కం.

విని సుగ్రీవుండు ప్లవగు

లు నవ్విభీషణుఁ డసుర వరుఁడుఁ బ్రాంజళులై

కని రాఘవేంద్రు మనుజేం

ద్రునిం బలికిరి వచనమ్ములు పరమ రక్తిన్      

  1.  

 

 

 

కం.

కనఁ గోరు వారల మయో

ధ్య నెల్లరమును గొనిపొమ్ము దయతో నీతో

వనముల నుపవనముల ముద

మున విహరింతు మట మేము  భూరి యశస్వీ!  

  1.  

 

 

 

తే.గీ.

కని యట నభిషేకార్ద్రుని నిను నరేంద్ర!

కని జననినిఁ గౌసల్యను వినతి మ్రొక్కి

యచిర మెల్లర మిండ్లకు నంతఁ దనిసి

యేఁగు వారము వెస మాన వేంద్ర! వినుమ

  1.  

 

 

 

ఉ.

ఆ వచనమ్ములన్ విని మహాత్ముఁడు గాంచి ప్లవంగ కోటి సు

గ్రీవుని నా విభీషణునిఁ బ్రీతిని నెల్లరఁ బల్కె నివ్విధిన్

నే వెడలంగఁ గూడి మిము నెమ్మి యగున్ ద్విగుణం బయోధ్యకై

యో వర మిత్రులార! మది నుద్భవ  మింపుగ నంది నా కటన్      

  1.  

 

 

 

తే.గీ.

వానరులఁ గూడి సుగ్రీవ! వడి విమాన

మెక్కుమ ప్లవంగ నాథుఁడ! చక్కఁగాను

రాక్షసేంద్ర! మంత్రులఁ గూడి రమ్యముగ వి

భీషణ! యధిరోహింపుమ ప్రీతి నిపుడు

  1.  

 

 

 

ఆ.వె.

వానరులను గూడి వాన రాధిపుఁ డెక్కె

దివ్య పుష్పకమును భవ్య రీతి

నవ్విభీషణుండు సామాత్యుఁ డెక్కెను

సంతసమ్ము మీఱ సద్గుణుండు    

  1.  

 

 

 

కం.

ఘన మా కౌబేరం బా

స నోత్తమం బెల్ల రెక్కఁ జక్కఁగ నంతన్

మనుజేంద్రుఁడు రాముఁ డొసఁగ

ననుజ్ఞ నింగి కెగిరె వెస నాశ్చర్యముగన్       

  1.  

 

 

 

కం.

అంచలఁ గూడి వెలుంగుచు

సంచారం బాకసమునఁ జలుపు వర విమా

నాంచితమున  రాముఁడు గని

పించెఁ గుబేరుని విధమ్ము వినుతుఁ డలరుచున్    

  1.  

 

 

 

తే.గీ.

ఋక్ష వానర వర్యులు రాక్షసులు బ

లాన్వితులు దివ్య పుష్పక మందు నిఱు కె

ఱుంగక సుఖ మేపారఁగ నంగములకు

నలరి కూర్చుండి రెల్లరు పులకితు లయి     

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట  యిరువది యేనవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 126.

 

 

 

పుష్పక విమానమున నేఁగుచు రాముఁడు సీతకు మార్గమున లంకా నగరము భండన భూమిని సంగర విశేషములు నల సేతువు వివరించుచుఁ గిష్కింధలో సీత కోరఁగ వాన రాంగనలను విమానమున నెక్కించుకొని యయోధ్యకు మరలుట. 

 

 

 

 

కం.

అనుమతి నొసంగ రాముఁడు

ఘనుండు వర హంస యుక్త కమనీయము వా

హన మెగిరె మారు తోద్ధత

ఘన మేఘ నికాశ మంత గగనమ్మునకున్    

  1.  

 

 

 

కం.

నలు దెసలఁ బఱచి చూపులు

పలికెను రఘు నందనుండు పన్నుగఁ గని మై

థిలిని శశి నిభాస్యను సీ

త లలిత వాక్యమ్ములను ముదమ్మున నిట్లున్     

  1.  

 

 

 

శా.

కైలా సాద్రి శిఖాభ శృంగ చయ యుక్తంబౌ త్రికూటమ్మునం

దీ లంకా పురి విశ్వ కర్మ కృతమౌ యీదివ్యముం జూడు మా  

భీ లాంకస్థలి మాంస పంక రుధి రోపేతమ్ము రక్షో ప్లవం

గాలిప్రక్షయ కారకం బవనిజా! యాత్మేశ్వరీ! కాంచుమా         

  1.  

 

 

 

తే.గీ.

దత్త వరుఁడు రాక్షస గణ ధవుఁడు పీడ

లొసఁగు వాఁడు రావణుఁ డిట నుర్వి పైన

నిదుర నున్నవాఁడు హతుఁడు నీ కొఱకు వ

ధించితిని విశాలాక్షి! కోపించి మిగుల     

  1.  

 

 

 

తే.గీ.

కుంభకర్ణుండు ఘోరుండు గూలె నిచట

నిహతుఁ డయ్యెఁ బ్రహస్తుఁడు నీరజాక్షి!

చంపఁబడెను ధూమ్రాక్షుఁడు సమర మందు

హరి వరేణ్యుం డయిన యట్టి హనుమ చేత    

  1.  

 

 

 

కం.

హతుఁ డా విద్యున్మాలి వి

త తాత్ముని సుషేణు చేత ధరఁ గూలెను దు

ర్గతి నింద్రజిత్తు రావణి

యతుల బలుని లక్ష్మణుని మహాత్ముని వలనన్

  1.  

 

 

 

శా.

రక్షో వీరుని ఘోరు నా వికటు నాలం బందు నా యంగదుం

డక్షోభుండు వధించెఁ దత్త్రిశిరుఁ డంకాసహ్యుఁ డింకన్ విరూ

పాక్షుం డుగ్ర మహోదరుం డసహనుం డాజిన్ మహాపార్శ్వుఁడున్

దక్షుం డైన యకంపనుండు నితరుల్ దర్పాంధులై చావఁగా           

  1.  

 

 

 

మ.

అతికాయుండు నరాంతకుండు మఱి గర్వాంధుండు దేవాంతకుం

డతు లోత్సాహులు నాజిఁ గుంభుఁడు నికుం భాఖ్యాసురుండుం బ్రభా

యుత సత్పుత్రులు కుంభకర్ణునకు యుద్ధోన్మత్తుఁడున్ మత్తుఁ డిం

కితరుల్ దంష్ట్రుఁడు వజ్రదంష్ట్రుడును దేవీ! కూలి రంకమ్మునన్    

  1.  

 

 

 

మ.

మకరాక్షుం డని దుర్జయుండు సమసెన్ మత్సాయ కౌఘమ్ముచే

నకటా దుర్మతి శోణితాక్షుఁడును యూపాక్షప్రజఘ్నాదులున్

వికలాంగవ్రజు లైరి యంకమున నుద్విగ్నాత్ములై యుద్ధమం

దు కరాళుండగు యజ్ఞశత్రువును విద్యుజ్జిహ్వుఁడుం గూలిరే         

  1.  

 

 

 

మ.

ఘన భీభత్సుఁ డకంపనుండు నగ సంకాశుండు సుప్తఘ్నుఁడున్

ఘన వీర్యుం డగు సూర్యశత్రువును సంగ్రామమ్ములో బ్రహ్మశ

త్రుని యుక్తంబుగ నన్య వీరులును ఘోరుల్ భగ్న దేహమ్ములం 

జని రా కాలుని వీటి కెల్లరును రక్షః కాంతు దుర్నీతినిన్       

  1.  

 

 

 

కం.

ఇక్కడ మండోదరి యను

రక్కసుల విభుని సతి యితర సపత్నులతో

స్రుక్కెను భాష్పమ్ము లొలుక

మిక్కుటముగ రావణుండు మేదినిఁ గూలన్        

  1.  

 

 

 

కం.

ఇక్కడి తీర్థము గనుమా

యిక్కడలిని దాఁటి సీత యింపుగ నిసి మే

మెక్కఁడ వసించి యుంటిమొ

చక్కఁగ నంభోజ నయన! సదమల చరితా!    

  1.  

 

 

 

కం.

కనుమా దుష్కర సేతువు

వననిధిఁ గట్టితిని నేను బన్నుగ దాఁటన్ 

వనజాక్షీ! నీ కొఱకై 

వినుమా నలసేతు వనఁగ విదితం బిదియే

  1.  

 

 

 

కం.

కను మక్షోభ్యం బీ కడ

లి నపారము నూర్మి చయ సలిల నిలయమ్మున్

ఘన వరుణాలయమును గ

ర్జన యుతమును శంఖ శుక్తి సద్విలసితమున్     

  1.  

 

 

 

చం.

కనుమ హిరణ్య నాభమును గాంచన శైల వరమ్ము మైథిలీ! 

హనుమ కొసంగ విశ్రమము నర్ణవ తోయము నుండి లేచెఁ బ్రీ

తిని నిటఁ జూడు మప్పరమ దేవుఁడు పూర్వము సాగరుండు కు

క్షినిఁ దగ లేచి యిచ్చటను జెన్నుగ నం గరుణించె నత్తఱిన్          

  1.  

 

 

 

ఉ.

సాగర బంధనం బనఁగఁ జక్కఁగ ముజ్జగ మందు ఖ్యాతినిన్ 

బాగుగ వెల్గు తీర్థ మిది పాతక నాశక పావనమ్మునౌ 

భాగము రాక్షసోత్తముఁడు వచ్చిన చోటు విభీషణుండు న

న్వేగమ కోరఁగా శరణు విజ్ఞుఁడు జానకి! రావ ణార్తినిన్    

  1.  

 

 

 

తే.గీ.

తరుణి! కిష్కింధ సుగ్రీవు పుర వర మిది

చిత్ర కాననమ్ముల విలసితము సతము

వాలి చంపఁ బడె నిచట బాణ మొకట

నపుడు నా చేతఁ గినుక ధరాత్మజ! కను      

  1.  

 

 

 

ఆ.వె.

వాలి పాలిత పుర వరమును గిష్కింధ

నరసి సీత పలుకు లనియె నిట్లు

వినయ మారఁ బ్రీతి వెలయ సంభ్రమ మెద

రామునిఁ బతిఁ గాంచి రమ్యముగను      

  1.  

 

 

 

ఉ.

నే వెడలంగ నెంతు తరుణీ మణి తార కపీంద్రు భార్య సు

గ్రీవుని దార లన్యలును స్త్రీలును వానర కోటి దారలున్ 

భూవర! నాదు వెంటఁ జన భూరి పురంబున కయ్యయోధ్య కీ

వీ వర మిమ్ము నాకు నిట నింపుగ నాథ! దయార్ద్రమానసా!     

  1.  

 

 

 

తే.గీ.

ఇట్లన జనకాత్మజ రాముఁ డట్లగు నని

యవ్విమానముఁ గిష్కింధ నాపి చక్క

రాఘవుండు సుగ్రీవుని రాజు నరసి

పలికె నింపుగ నివ్విధి వాక్యములను     

  1.  

 

 

 

ఉ.

ప్రీతిని వానరర్షభ! హరిప్రవరుల్ నిజ దారలం దమిన్

సీతకు నుండఁ దోడుగను శీఘ్రమ తోడ్కొని రాఁగఁ బల్కుమా

చూతము పట్టణమ్ము నతి సుందర మైన యయోధ్య నింపుగా

నీ తఱి నంచు నవ్విధి హరీశ్వర! నీవును రమ్ము వేగమే   

  1.  

 

 

 

ఉ.

నా విని గొప్ప తేజుఁడు నృనాథుఁడు వల్కఁ బ్లవంగ నేత సు

గ్రీవుఁడు శ్రీ విరాజితుఁడు ప్రీతినిఁ గూడి ప్లవంగ కోటినిం 

దా వెసఁ జేరి యంతిపురి తారను భార్యను గాంచి యిట్లనెం

బావని సీత కోరగను బార్థుఁ డనుజ్ఞ నొసంగె మీ కిటుల్      

  1.  

 

 

 

తే.గీ.

హరుల దారల నెల్లర నంచితముగఁ

గూడి ప్రియ! యేఁగఁగ నయోధ్యకు ననుమతి నొ

సంగె రండు త్వరితముగ నంగనా మ

ణి! దశరథుని దారలను జూచెదము తార!          

  1.  

 

 

 

కం.

విని సుగ్రీవుని పలుకులు

తను శోభలఁ గరము వెల్గు తారా సతి యం

త నగచరుల భార్యా మణు

ల నెల్లరను బిలిచి పల్కుల ననియె నిట్లున్    

  1.  

 

 

 

తే.గీ.

అనుమ తించిరి హరు లెల్ల హరి విభుండు

కూడ నేఁగ నయోధ్యకుఁ గూర్మి నొసఁగు

కార్య మియ్యయోధ్యా పుర గమన మెంచ

నాకు సత్వర మిఁక రండు నాతులార!   

  1.  

 

 

 

తే.గీ.

పౌర జానపదుల తోడ మూరి రాముఁ

డయ్యయోధ్యలోఁ జొచ్చుట యా దశరథు

నెల్ల భార్యల యైశ్వర్య మెల్లఁ గాంచు

టయును బ్రీతి నొసంగు నెడంద నాకు     

  1.  

 

 

 

ఉ.

వార లలంకరించికొని వానర నారు లనుజ్ఞ నీయఁగాఁ 

దార యథోక్త రీతినిఁ బ్రదక్షిణ మింపుగ నాచరించి సీ

తా రమణీ మతల్లి వర దర్శన కాంక్షలు వేగ హర్ష మే

పారఁగ నవ్విమానమును  నంగన లెక్కిరి సంభ్రమమ్మునన్        

  1.  

 

 

 

కం.

వారిని గూడి విమానము 

నారసి యెగురంగ రాముఁ డవనిజ తోడం

జేర వెస ఋష్యమూకము

నారీ మణి సీతఁ గాంచి నరవరుఁ డనియెన్   

  1.  

 

 

 

ఉ.

కంటె స విద్యు దంబుద నికాశము శైలము ఋష్యమూకముం

గంటిని వానరేశ్వరునిఁ గాంచన ధాతు విరాజి నద్రినిన్

వెంటఁ జరింప లక్ష్మణుఁడు బ్రీతిని నిచ్చటఁ దొల్లి వాలిఁ గ్రా

ల్గంటిరొ చంపఁ బల్కితినిఁ గంటకు వానరు భ్రాతృ బాధకున్      

  1.  

 

 

 

కం.

ఇది పంపా నది చూడుమ

ముదమారఁగఁ బద్మ చిత్ర భూరి వనమ్ముల్

సుదతీ వెలయం గుందితి

నెద నిన్నరయమి భృశంపు టేఁపు సెలంగన్    

  1.  

 

 

 

తే.గీ.

దీని తీర మందు శబరి నేను ధర్మ

చారిణిం గంటి వైదేహి! చారు నేత్ర!

భయదు యోజన బాహుఁ గబంధు నిచట 

నే వధించితి నప్పుడు నీరజాక్షి!    

  1.  

 

 

 

ఉ.

మానుగ గోచరం బిచట మానిని! పాదప రాజ మీ జన

స్థానము నందు బల్లిదుఁడు తద్ద జటాయువు మేటి పక్షులం

దా నిట సీత! నీ కొఱకు ధాత్రినిఁ గూలె దశాస్యుఁ డుగ్రుఁడై

వీనిని ఘోర యుద్ధమున భీమ నిశాటుఁడు గొట్టఁ గ్రూరతన్     

  1.  

 

 

 

తే.గీ.

ఖరునిఁ దిన్నగఁ జరియించు శరముల వధి

యించిన స్థల మిది త్రిశిరు నిద్ధ బలుని

దూషణుని రక్కసుల బల్లిదులను జంపి

నట్టి మన యాశ్రమం బిది యంబుజాక్షి!

  1.  

 

 

 

కం.

మన పర్ణశాల యియ్యది

కనఁబడు చున్న దిటఁ జిత్ర కానన మందున్

నిను నెచ్చట రావణుఁడే

గొని పోయెను బల్మి చూడు కోమలి! యిదియే

  1.  

 

 

 

కం.

ఇది పావన గోదావరి

సదమల జల పూర్ణ మవనిజ! కనుమ రమ్యం

బిది ముని యగస్త్యు నిలయము

కదలీ వన శోభితమ్ము కనఁబడు చుండెన్

  1.  

 

 

 

తే.గీ.

వెలుగుచు సుతీష్ణుని మహాత్ము స్వీయ సుంద

రాశ్రమము దృశ్య మిచ్చట యరయు మింక

ను శరభంగు నాశ్రమము మును చనుదెంచె

నెచటకుఁ బురందరుం డదియె యిది కనుమ   

  1.  

 

 

 

చం.

కనఁబడు చుండెఁ దాపస నికాయము లిచ్చట యత్రి యెచ్చటన్ 

ఘనుఁ డన లార్క సన్నిభుఁడు గ్రాలు విభుం డయి యిచ్చ టే మహాం

గు నసురునిన్ విరాధు నతి ఘోరునిఁ జంపితి సీత! యిచ్చ టీ

వనమున నీవు తాపసినిఁ బన్నుగఁ గంటివి దర్మచారిణిన్    

  1.  

 

 

 

కం.

తనుమధ్య! చిత్రకూటము

ఘన శైలము రమ్యముగఁ బ్రకాశించుచు నుం

డె నిచట కైక కుమారుఁడు

నను వేఁడఁగ వచ్చియుండె నరవరుఁ డిటకున్   

  1.  

 

 

 

కం.

ఇది యా యమునా నది యు

న్నది కనఁబడి దూరముగ వనమ్ములు వెలుగం

గఁ దనరి చిత్రమ్ములఁ గను

మ దరి భరద్వాజు మఠము నడరఁగ శ్రీలన్   

  1.  

 

 

 

ఆ.వె.

కాన వచ్చు చుండె గంగా నది త్రిపథ

గ కడుపావనము జనక కుమారి!

కాననమ్ము లెల్ల నానా ద్విజ గణా వృ

తమ్ము లింకఁ బుష్పితమ్ము లరయ   

  1.  

 

 

 

తే.గీ.

శృంగిబేర పుర మదివొ స్నేహితుండు

గుహుఁడు నం గలిసిన చోటు కోమలాంగి!

యూపమాలినిఁ గను  సరయూ నదిని వి

విధ తరు కుసుమ రాసుల వెలయు దాని       

  1.  

 

 

 

తే.గీ.

అదివొ కనిపించు చున్నది యయ్యయోధ్య

రాజధాని నా తండ్రికి రమణి! కనుమ

తిరిగి వచ్చితి మింపుగ దేవి! వంద

నమ్ము లాచరింపుమ భక్తి పమ్మ మదిని

  1.  

 

 

 

కం.

హరులు విభీషణు తోడ న

సురు లెల్లరు నెగిరి యెగిరి జూచిరి యా సుం

దర పురము నయోధ్య నచట 

మురియుచు నవ్వేళ డెందముల నధికముగన్       

  1.  

 

 

 

తే.గీ.

ధవళ హర్మ్య మాలికలను దనరు దానిఁ

గడు విశాల కక్ష్యలు హయ గజము లడరు

పురము గనిరి ప్లవగులు నసురులు నింద్రు

ని యమరావతి భంగిని నెగడు దాని     

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట  యిరువది యాఱవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 127.

 

 

 

రాముఁడు భరద్వాజుని యాశ్రమమున కరిగి నమస్కరించి యయోధ్యా నగర క్షేమమును భరతుని మాతల కుశలమ్ము నెఱుంగుట. 

 

 

 

 

కం.

పదునాలు గేండ్లు పరిపూ

ర్తిఁ దనర నైదవది యైన తిథి నరుదెంచెన్

ముద మార లక్ష్మ ణాగ్రజుఁ

డెదను భరద్వాజు దరికి నెరఁగెను భక్తిన్    

  1.  

 

 

 

ఉ.

ఓజ నమస్కరించి పురుషోత్తముఁ డిట్లడిగెన్ వెసన్  భర

ద్వాజుని దేవ! వింటిరె స్వ పట్టణ భద్ర మనామయమ్మునుం   

దేజుఁడు యుక్తుఁడై చనునె ధీమతి యా భరతుండు పల్కుఁడీ

నా జననీ మణుల్ ధర ఘనమ్ముగ నుండుదురే స జీవలై   

  1.  

 

 

 

కం.

అన నిట్టులఁ గాకుత్స్థుఁడు

విని ముని నవ్వుచు ననె రఘు వీరుని తోడన్

మినుకులను భరద్వాజుఁడు  

మనమున సంతోష మడర మాన్యుం డిట్లున్     

  1.  

 

 

 

తే.గీ.

పంక మంటంగ భరతుండు వనరు చుండి

జడల నూని వేచుచు నుండె నడరి నీదు

పాదుకుల గౌరవించుచు భద్ర గతిని

నెల్ల రున్న వా రచ్చట నిండ్ల లోన

  1.  

 

 

 

ఉ.

మున్నిటఁ జీర వస్త్ర ధరు భూజ తృతీయునిఁ జొచ్చు వానినిన్

నిన్ను నరణ్య మత్తఱిని నీరజ లోచన! రాజ్య దూరునిన్

మన్నన నుంచి ధర్మమున మానవ పుంగవ! కేవలమ్ముగా

నెన్ని త్యజించి సర్వము నరేంద్రుని యానతిఁ బాద చారివై     

  1.  

 

 

 

చం.

దివమున సర్వభోగ వితతిం ద్యజియించిన దేవు వంటి మా

నవ వర! నిన్నుగాంచఁ గరుణా రస పూరిత మానసుండ నై

తి వినుమ కైక వాక్కుల రతిం గొని మూల ఫలాశి వై మహో 

గ్ర వనిని సంచరించి నను గాంచఁగఁ జేరిన నాఁడు రాఘవా!

  1.  

 

 

 

తే.గీ.

నేఁడు సిద్ధార్థుఁడవు నయి నీవు రాఁగ

బంధు మిత్ర యుతమ్ము గఁ బార్థివేంద్ర!

నిన్ను వీక్షింప విజితారి నీరజాక్ష!

సంతసం బుద్భవించె నితాంత మాత్మ

  1.  

 

 

 

సీ.

స సుఖ దుఃఖము జనస్థానమం దీ వందినది యెల్ల  రాఘవ! యాత్మ నెఱుక

నాకు ద్విజులు వేఁడ నరవర్య! తాపసులను గాచు చున్నట్టి రామ! నీదు

భార్య రావణు చేత వన మందు దొంగిలింపఁ బడుట మారీచుఁ బడతి సీత

గాంచుట యంతటఁ గాంతాపహరణమ్ము సూచుటయుఁ గబంధు సువ్రత! వెసఁ

 

తే.గీ.

జనుట పంపకు సుగ్రీవు ఘనుని చెలిమి

వాలి వధ సీత వెదకుట వాయు తనయు

కర్మ మవనిజఁ గనుట లంకా దహనము

నలుఁడు సేతువు నిర్మించిన విధ మెల్ల    

  1.  

 

 

 

తే.గీ.

బంధు మిత్ర సూ నామాత్య స్వబల యుతము

దేవ కంటకు రావణుఁ ద్రెంపుటయును 

సుర సమాగమ మొసఁగుట వరము లలరి

నా తపశ్శక్తి నేరుదు నర వరేణ్య!

  1.  

 

 

 

ఆ.వె..

అవని రాఘవేంద్ర! యఖిల ప్రజలకు గో

విత్త ధాన్య మిత్ర వితతి గౌర

వమున కర్హము నరవర్య! మిన్న యగును

జనని జన్మభూమి స్వర్గమునకు

  1.  

 

 

 

కం.

ఏఁగుదు రయోధ్యకుఁ బలుక 

బాగుగ నా శిష్యు లచటి వార్తల నెల్లం 

జేఁ గొను మిత్తు వరము రే

పేఁగు మయోధ్యకు గ్రహించి యీ సత్క్రియలన్       

  1.  

 

 

 

ఆ.వె.

అట్లె యంచు  రాముఁ డా గిర లౌదల

నూని రాజ  తనయుఁ డుత్తమముగ

నడిగె వరము నిట్లు పుడమి విభుండు శ్రీ

మంతు నా మహర్షి  సంతసమున

  1.  

 

 

 

తే.గీ.

ఒప్పుగ నకాల మందు  నయోధ్య కేఁగు

దారిఁ దరులు తేనె లొలుకు భూరి ఫలము

లమృత గంధ యుక్తమ్ముల నడర నిమ్మ

నేకముల వివిధముల మునీంద్ర! కరుణ       

  1.  

 

 

 

కం.

ప్రతిన నొసఁగ నట్లె యగు న

ని తాపసుం డెల్లెడలను నెగడిన వంతన్

వితత దివపాదపమ్ముల

గతి నచ్చటి పాదపములు కమనీయముగన్

  1.  

 

 

 

తే.గీ.

ఫల సమృద్ధమ్ము లయ్యె నిష్ఫల తరువులు

పుష్ప హీనము లయ్యెను బుష్ప వంత

ములుగ శుష్క తరులు పత్రముల వెలింగె 

మూడు యోజనముల దారి నోడెఁ దేనె   

  1.  

 

 

 

కం.

వానర వర్యులు ఫలముల

నూనిరి తమకమ్ము మీఱ నుత్సాహముతో

నా నాకమ్ము జయించిన

వైనము హర్షాన్వితు లయి బహు విధ ఫలముల్

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట  యిరువది యేడవ సర్గము.

 

 

 

యుద్ధ కాండము

సర్గము 128.

 

 

 

రాముని యాజ్ఞఁ దలఁ దాల్చి హనుమంతుఁడు  శృంగిబేర పురమున  గహునకుఁ గుశలముగ రాముని పునరాగమనమును దెలిపి నందిగ్రామమున కరిగి భరతుని దర్శంచి రాముని వృత్తాంతము తిరిగి రాకను దెలుఁప భరతుడు పరమానంద మంది హనుమంతుని సత్కరింపఁ దలంచుట.

 

 

 

 

కం.

కని తా నయోధ్య రాముఁడు

ఘనత్వరిత విక్రముండు కడఁగి ప్రియ మొన

ర్ప నృవరుఁడు దృష్టి సారిం

చి నగచరులపైఁ గని హరి శేఖరు హనుమన్

  1.  

 

 

 

చం.

అరిగి పురం బయోధ్యకు మహాత్మ! ప్లవంగ వరేణ్య! శీఘ్రమే

నరవరు నింట నెల్లర యనామయ మీ వెఱుఁగంగ నొప్పు నో

హరి వర! శృంగిబేర పురి నా గుహుఁ గాంచి యరణ్య వాసినిన్

వర నిషధాధి నేత నిజ భద్రముఁ  జెప్పుమ నాదు వాక్కులన్

  1.  

 

 

 

ఉ.

నేరిన నాదు క్షేమమును నిల్వ నరోగిగ వీత బాధలన్

మారుతి! యందు నా గుహుఁడు మానస మందు సమగ్ర హర్షమున్

దారిని నీ కయోధ్యకు ముదమ్మునఁ జెప్పును బల్కు నింపుగాఁ

బేరిమి తోడుతన్ భరతు వృత్తము నా సమ మిత్రుఁ డెన్నఁగా

  1.  

 

 

 

చం.

పలుకుమ నాదు మాటలను భార్యను లక్ష్మణుఁ గూడి యున్న నా

సలలిత సౌఖ్య మెల్ల నట సర్వము నా దగు కార్య  సిద్ధినిన్

లలనను జానకీ సతిని రావణుఁ డుగ్రుఁడు దొంగిలించుటం

గలియుట వానరోత్తముల కాంతునిఁ గ్రన్నన వాలిఁ గూల్చుటన్

  1.  

 

 

 

తే.గీ.

మైథిలీ మార్గణమ్మును మారుతాత్మ

జా! యనంత తోయ మయము  సాగరమును

నీవు దాఁటి చూచిన గతిఁ బావని! వచి

యింపు మింపుగ భరతున కెల్ల నచట

  1.  

 

 

 

చం.

కడలిని వేగ డాయుటను  గ్రాంతిని సాగర దర్శనమ్మునుం

వడి వడి సేతు బంధనము భండన మందు  దశాస్యుఁ జంపుటం 

బడయుట నే వరమ్ములను వజ్రి నదీశ సరోజయోను ల

య్యెడ నిడఁ బల్కుమీ హనుమ! యీశ్వరు సద్దయఁ దండ్రిఁ గూడుటన్   

  1.  

 

 

 

ఉ.

వచ్చిన వానిగా నిటకు వానర నాథుని రాక్షసేంద్రునిం

జెచ్చెర నుంచి తోడుగను జీల్చి విరోధుల నెల్లఁ గీర్తి నే

నిచ్చ వహించి కార్యము ఫలింప బలాఢ్యులు స్వీయ మిత్రులే

వచ్చుచు నుండ వెంటఁ దమి వాయుజ! తమ్ముని తోడఁ జెప్పుమా

  1.  

 

 

 

కం.

ఇది విన్న భరతుఁ డెబ్భం

గిఁ దాల్చు నాకారము నెఱిఁగి కొనుమ నాకై

యెదఁ దా నెవ్విధి వర్తిలు  

నది యెల్ల గ్రహింప వలయు నాత్మ హరీంద్రా!   

  1.  

 

 

 

తే.గీ.

అచ్చటి కథల నెల్ల నీ వరయ వలయు

భరతు నింగితముల ముఖ వర్ణముల వ

చనముల నిజముగ నచట సంగ్రహింప

వలయు నరసి వివరముగ వాయు తనయ!   

  1.  

 

 

 

తే.గీ.

సర్వ కాల సమృద్ధ మఖర్వ భూమి

హస్తి తురగ రథ వర సమావృతమ్ము

రాజ్యము పితృ పైతామహ ప్రాప్త మెవరి

మనము మరలింప కుండును హనుమ వినుమ    

  1.  

 

 

 

ఉ.

కూడికొనంగ రాజ్యమును గోరిక కల్గినఁ బాలనమ్ముపైఁ

బాడిగ నాతఁ డేలు నిఁక వారక రాజ్యము నెల్లఁ బ్రీతిమై

ఱేఁడయి వాని బుద్ధిని నెఱింగి కపీశ్వర! వాని యత్నముల్

తోడన రమ్ము నేరి తగ దూరము సాగక మున్న మే మిటన్

  1.  

 

 

 

ఉ.

ఆనతి నీయ నివ్విధము హర్షమునన్ హనుమంతుఁ డంతటన్

మానవ రూపధారి యయి మారుత సూనుఁ డయోధ్యకై వెస

న్మానుగఁ బైకిఁ దా నెగిరె నాగులకై వినతా సతీ మహా

సూనుఁడు మించు భంగి కపి శూరుల ముఖ్యుఁడు సంభ్రమమ్మునన్       

  1.  

 

 

 

తే.గీ.

ఎగిరి తండ్రి మార్గమున ద్విజేంద్ర నిలయ

మందు గంగా యమునల సమంచితంపు

సంగమమ్మును దాఁటి యా శృంగి బేర

పురము సొచ్చి కూడి గుహుని మురిసి పలికె     

  1.  

 

 

 

ఉ.

రాముఁడు నీదు స్నేహితుఁడు రామను తమ్మునిఁ గూడి యింపుగా

నా మను జేశుఁ డడ్గెను గుహా! కుశలమ్మును నిన్ను క్షేముఁడై  

తా ముని చెంత నిల్చి నిసిఁ దాపసు నానతి నూని కాంచ ని

న్గోముగ సత్య విక్రముఁడు కూరిమి వచ్చు నిషాద రాడ్వరా !        

  1.  

 

 

 

తే.గీ.

పలికి తేజస్వి కపి గగుర్పాటు వొడమ

వేగవంతుండు మారుతి వేగముగను

బై కుఱికె నవిచారము వీఁకఁ జాగఁ

దొడఁగె నాగక యెచట సంతోషముగను   

  1.  

 

 

 

తే.గీ.

కాంచె రామతీర్థమ్మును గాంచె నదిని

వాలుకినిని వరూధినిఁ బావనంపు  

గోమతిని సాల వనమును భీమమును వి

శాల జనపదములఁ గాంచెఁ జాల జనుల        

  1.  

 

 

 

చం.

త్వర త్వర యేఁగి దూరము ప్లవంగ వరేణ్యుఁడు స్త్రీలు వృద్ధులుం

దిరుగఁగ నుండ వెంటను రతిం దమ పిల్లలు సేరె శీఘ్రమే    

తరువుల నంది పేరున శ్రుతమ్ము భృశమ్ముగ గ్రామ మందుఁ జై

త్ర రథముఁ బోలు నట్టి వని రమ్యముగాఁ గనిపించు దానినిన్     

  1.  

 

 

 

చం.

గురు నగరం బయోధ్య కొక క్రోశపు దూరమునన్ జటాధరున్

భరతుఁ గృశాంగు నాశ్రమ నిబద్ధుని నింపిరి గాత్రుఁ ద్వక్కు టం

బరు ఫల మూల భోజనుని వల్కల వస్త్రునిఁ దాప సాభునిన్

గురు పద చింత నార్తిఁ గనెఁ గూరిమి దాంతుని ధర్మ చారినిన్      

  1.  

 

 

 

చం.

పరఁగచు నుండఁగా జడల భారము బ్రహ్మ ఋషిప్రభా నిభున్

సురుచిర నీతిమంతు నతి సుందర చిత్తుని గారవించుచున్

విరివిగ నన్న పాదుకలఁ బృథ్వినిఁ గాచుచు నున్న వాని నా

భరతుని  నాల్గు వర్ణములఁ బన్నుగఁ బ్రోచెడు లోక రక్షకున్   

  1.  

 

 

 

చం.

సచివులు నా పురోహితులు సద్గుణు లుండ సమీప మందు స్వీ

య చమువు సాయ ముండఁగ సమంచిత రీతినిఁ గావి చీరలన్

రుచిరము లూని నట్టి జనులుం దన నింపుగఁ జుట్టు ముట్టఁగాఁ

బ్రచురపు ధర్మవత్సలుని రాజకుమారునిఁ బౌర యుక్తునిన్

  1.  

 

 

 

తే.గీ.

ధర్మ విదుఁ దను వూనిన ధర్మ మపర

మనఁగ నున్న వానినిఁ గాంచి హరివరుండు

పలికె నంజలి ఘటియించి పలుకు లిట్లు

మారుతి పరమ నిపుణుండు మాట లందు      

  1.  

 

 

 

తే.గీ.

దండకారణ్యమున మున్ను తాప మంది

తెట్టి చీర జటా ధారి నెంచి రాజ!

యట్టి కాకుత్స్థుఁడు కుశల మడిగె నిన్ను

నేఁడు ప్రియము పలుకు చుంటి వీడు వగను

  1.  

 

 

 

కం.

దారుణ శోకము వీడుమ

వీరా! యీక్షణము నంద ప్రీతిని భరతా!

నీ రాముని భ్రాతను  వెస

గారవముగఁ గలయఁ గలవు కలవర మేలా      

  1.  

 

 

 

ఉ.

రావణు రాక్ష సాధముని రాముఁడు సంపి గ్రహించి జానకిన్

దేవిని సిద్ధినిం బడసి తిన్నగ బల్లిదు లైన మిత్రులన్

భూవర! గూడి నిం గదియు మున్నిడి లక్ష్మణు జానకీ యుతుం

డై వెస నింద్రు వెంట శచి హర్ష సమేతము సాగు నట్టులన్    

  1.  

 

 

 

కం.

అన హనుమంతుం డిట్టుల

విని భరతుఁడు కైక సుతుఁడు పృథ్వినిఁ గూలెన్

ఘన హర్షమ్మున మోహ

మ్ము నంది యెద లోపల భృశముగ నొక్క ద్రుటిన్    

  1.  

 

 

 

కం.

అంతట లేచి  భరతుఁ డొ

క్కింత తడవున కెద నూఱడిల్లి తగ హనూ

మంతుని వీక్షించి పలికె

సంతస ముప్పొంగ నిట్లు సంభ్రమ మడరన్   

  1.  

 

 

 

కం.

తడిపెం గౌఁగిలి ప్లవగుని

వడి హర్షాశ్రువులఁ గరము వాయుజు నంతం

గడు సంభ్రమమున నా భర

తుఁడు శ్రీమంతుఁడు కడింది తుష్టుం డగుచున్   

  1.  

 

 

 

చం.

నరుఁడవొ నీవు దేవుఁడవొ నాకుఁ బ్రియమ్మును దెల్పితిట్టులన్

వరముగ లక్ష గోవులను వంద పురమ్ముల నిత్తుఁ గన్నెలన్

ధరఁ గొనుమా పదాఱుగుర దారలఁ గుండల రాజి తాస్యలన్

సురుచిరలన్ మహాత్మ! కడు సుందర దాసుల నిత్తు వారికిన్    

  1.  

 

 

 

తే.గీ.

పసిడి వర్ణపు వారిని స్వర్ణ భూషి

తలను సంపన్నలను మంచి కులమున జని

యించి నట్టి వనితల ననేకుల నొసఁ

గుదు ముదము మీఱఁ గొను మీవు కోర్కి తీర   

  1.  

 

 

 

కం.

విని రాము వింత రాకను

మనుజేంద్ర సుతుఁడు ముదమ్ము మనమున నిండం

గన నెంచి రాముని వచిం

చెను భరతుం డిట్లు సంతసిల్లి వచనముల్

  1.  

 

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట  యిరువది యెనిమిదవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 129.

 

 

 

సీతా రామ లక్ష్మణుల వనవాస విశేషములను హనుమంతుఁడు భరతుఁ డడుగ నెల్లరు వినుచుండ వివరించుట. 

 

 

 

 

కం.

వనమునఁ బెక్కేండ్లు చరిం

చిన నా నాథుని కథ నిటఁ జేకుఱ ముదమే

వినుచుంటిని గద రఘు రా

ముని చరితమ్మును వచింపుము వెస మహాత్మా!       

  1.  

 

 

 

కం.

మానవుఁడే జీవించిన

యానందము వంద యేండ్ల కైనను గను వాఁ   

డీ నానుడి నా యందు న

హో నిజ మైనది దలఁప సముచితపు రీతిన్   

  1.  

 

 

 

ఉ.

రామున కా ప్లవంగులకు రమ్యపు సంగమ మెట్టు లెక్క డే

సీమలఁ గల్గె నెవ్వరినిఁ జేర లభించెను జెప్పు మడ్గఁగా 

నో మహితాత్మ! సత్యమును యుక్తముగా నడుగంగ నట్టులన్

గోముగఁ బీఠ మిచ్చి హరి కూర్చొని చెప్పఁ దొడంగె నిట్టులన్   

  1.  

 

 

 

సీ.

ఓ మహాభుజ యుగ్మ!  నీ మాత కెట్లు వరము లీయఁ బడినవొ రాముఁ డెట్లు

వనములకై వెసఁ బంపఁ బడెనొ పుత్రు పై నార్తి జనకుండు వ్రాలె నెట్లు

రాజగృహము నుండి రప్పింపఁ బడి తెట్లు దూత వరేణ్యుల చేత నీవు

సేరి యయోధ్యను గోర కుంటివి రాజ్య మెట్లీవు శీఘ్రమ యేఁగి చిత్ర

 

తే.గీ.

కూట గిరికి రాజ్య మొసఁగఁ గూడ దనియె

నెట్లు రిపు నాశకుఁడు భ్రాత యెంచి నీతి  

రాజు నానతి తలఁ దాల్చి భ్రాత పాదు

కుల గ్రహించి మరలి తీవు కలఁత నెట్లు    

  1.  

 

 

 

ఆ.వె.

నిజముగ నిది యెల్ల నీవ యెఱుంగుదు

తెల్లముగను జనఁగఁ దల్లడిల్లి

నీవు జరిగిన కథ నే నుడివెద రామ

చరిత మెల్ల నీకుఁ జక్కఁగాను

  1.  

 

 

 

చం.

వెడలఁగ నట్లు నీ వడవి భీకర మయ్యె మృగద్విజాలితో

నడలుచు మిక్కుటమ్ముగను నార్య జనావృతమై భృశమ్ముగా

వడి వడిఁ జొచ్చె రాఘవుఁడు  వ్యాఘ్ర కరీంద్ర మృగేంద్ర జంతువుల్

వెడవెడఁ దిర్గు చుండగ నభీతిని భైరవ దండకా వనిన్    

  1.  

 

 

 

కం.

చను చుండ వారి యెదుటను

వనమున ఘోర నినదమ్ము పరఁగఁగఁ గన్ప

ట్టెను బల్లిదుఁడు విరాధుఁడు

కని యూర్ధ్వభుజుని నథో ముఖ మడరు నసురున్   

  1.  

 

 

 

తే.గీ.

లేపి వానిని ఘోరు గర్జించు చున్న

గజ మనఁగ గుంట లోన ముఖమ్ము దనర

నడుగు వైపున వైచిరి  యన్నదమ్ము

లంత రామలక్ష్మణులు నితాంత బలులు   

  1.  

 

 

 

తే.గీ.

దుష్కరపుఁ గర్మ మొనరించి దొడ్డ బలులు

రామ లక్ష్మణు లవ్విధి రమ్యపు శర

భంగు నాశ్రమమ్ము గనిరి వనము నందు

వారు మునిమాపు వేళను భక్తి తోడ

  1.  

 

 

 

తే.గీ.

దివ మరుగ శరభంగుఁడు దివ్య ముని వ

రేణ్యుఁడు మునులకు నర వరేణ్యుఁ డంత

వందనము లాచరించి సభక్తి కదిసె

నంతఁ దా జనస్తానము నలరి మిగుల     

  1.  

 

 

 

చం.

కదిసెను గాంత శూర్పణఖ కైణప భామయె కామ సక్తయై

పదపడి రాము నాజ్ఞఁ గరవాలము తోడుత లక్ష్మణుండు వే

విదిలిచె ముక్కునుం జెవుల వీర వరేణ్యుఁడు రాముఁ డత్తఱిం 

దుదిఁ బదునాల్గు వేవురను దుష్టులఁ జంపెను దత్స్థలమ్మునన్    

  1.  

 

 

 

ఆ.వె.

కయ్యమునకు నడరి కలసి వచ్చిన రక్క

సులను రాముఁ డొకఁడు చోద్యముగను

బగటి నాలుగవది భాగములోన ని

శ్శేషముగ వధించె శీఘ్ర గతిని

  1.  

 

 

 

తే.గీ.

దండకారణ్య వాసులఁ దాపసుల కొ

సంగ  విఘ్నములను గాంచి చంపె వేగ

రాఘవుండు రణము నందు రక్కసు ఖరు

దూషణుఁ ద్రిశిరసునిఁ గూల్చెఁ దూర్ణముగను     

  1.  

 

 

 

ఆ.వె.

అంత శూర్పనఖ కలంత సెంది కదిసె

రావణు నసుర పతి రావణ సఖుఁ

డపుడు రత్న మృగపు టాకృతి మారీచుఁ

డూని లోభపఱచె నుర్వి సుతను

  1.  

 

 

 

ఆ.వె.

సీత గాంచి మృగము ప్రీతిఁ బలికె దీనిఁ 

బట్టి తెచ్చి యీయ వలయు నంచు 

నాశ్రమమున నుంచ నంద మొసఁగు నని

యంత రాముఁ డరిగె నందుకొనఁగ   

  1.  

 

 

 

కం.

ధను వూని రాముఁ డప్పుడు

చనె వెంట మృగమున కంత సత్వరముగ దా

నిని జంపెను బాఱ రయము

న నంద కున్న నత పర్వ నారాచమునన్     

  1.  

 

 

 

చం.

మృగమును బట్ట రాఘవుఁడు మించి చనంగ సుమిత్ర పట్టియున్

మగువను వీడి యేఁగగను మాయను రావణుఁ డేఁగుదెంచి బ

ల్మిఁ గుజుఁడు రోహిణిం బగిది లీలగఁ గైకొని చాగె శీఘ్రమే

తెగఁబడ నా జటాయువును దిట్ట తనమ్మునఁ గూల్చె నిర్దయన్     

  1.  

 

 

 

చం.

గిరి శిఖరమ్ము పై నసురు కృత్యము గాంచిరి నిల్చి వింతఁగా

హరి వరు లెల్ల రావణ మహాసురుఁ డంబర వీథి నేఁగఁగా 

గిరి నిభ కాయు లెల్లఁ బరికించిరి రక్కసు విస్మయమ్మునన్

ధరణిజఁ గూడి పుష్పకపుఁ దద్ద విమానము నందుఁ జాగఁగా

  1.  

 

 

 

తే.గీ.

చని మనోజవంపు విమానమున స సీత

యెక్కి  బలవంతుఁ డసురుండు గ్రక్కున నగ

రమ్ము సేరె నా లంకను రాక్షసేశ్వ

రుండు రావణుండు దశముఖుండు ప్రీతి      

  1.  

 

 

 

ఆ.వె.

స్వర్ణ సౌధ మందు జానకి నుంచి శు

భ తర వేశ్మ మందుఁ బలికి మంచి

వాక్యములను గొన్ని వైదేహి నూఱడిం

పఁ దొడఁగె నవనిజను బహు విధముల     

  1.  

 

 

 

ఆ.వె.

గడ్డి పరక వోలెఁ గాంత భావించి ద

శాస్యు భాషణముల నవనిజ మది

నుంచి భర్తను వసియించె నశోక వ

నమ్ము లోన నెడఁద నమ్మి పతిని      

  1.  

 

 

 

ఆ.వె.

జింకఁ జంపి మరలి సీతను గానక

కాంచి హతుని గ్రద్దఁ గలఁత సెందెఁ 

దండ్రి కన్న ప్రియునిఁ దనతోడ నుడువంగ

రావణుఁడు హరించె రమణి నంచు

  1.  

 

 

 

తే.గీ.

సంస్కరించి తండ్రి సఖునిఁ జక్కఁగాను 

వెదకుచుఁ బడతి సీతను వెంట నుండ

లక్ష్మణుండు గోదావరీ లలిత తటిఁ జ

రించుచుఁ గబంధు నసురునిఁ గాంచె నచట

  1.  

 

 

 

కం.

విని యా కబంధు వచనము

లను సత్య పరాక్రముండు రాముఁడు సుగ్రీ

వునిఁ గలిసె ఋష్యమూక

మ్మున గిరిశిఖరమ్మునఁ గపి ముఖ్యుని సుహృదున్

  1.  

 

 

 

తే.గీ.

మును జనించె వారల స్నేహము విన నొకరి

నొకరు గాఢ మయ్యెఁ జెలిమి యుగ్రుఁ డన్న

వాలి సుగ్రీవుఁ దఱిమెను వానిఁ జంపి

రాముఁ డనుజున కిచ్చెను రాజ్య మెలమి     

  1.  

 

 

 

ఆ.వె.

రాజ్య మందు నిలుప రాముఁడు సుగ్రీవు

నవనిజను వెదుకఁగ హరి వరుండు

మాట నొసఁగె నంత మనుజ నాథునకుఁ బ్ల

వంగ గణ విభుండు వత్సలుండు          

  1.  

 

 

 

తే.గీ.

పంపె నాల్గు దిక్కులకును బ్లవగులఁ బది

కోట్ల వీరుల నెల్లర కోమలిఁ బరి

కించి రాఁగ మహాత్ముఁడు సంచరింప

వింధ్యలో మాకు గతి తప్పె  వెఱపు వుట్టె

  1.  

 

 

 

తే.గీ.

కడవఁ గాలము మిక్కిలి కలఁత రేఁగ

బాధ పడుచుండఁగ జటాయు  భ్రాత మాకుఁ 

దెలిపె సంపాతి రావణు నిలయ మందు

సీత వసియించు చున్నది జేరుఁ డనుచు    

  1.  

 

 

 

కం.

తొలఁగించుచు బంధువుల  వె

తల వీర్యము నాశ్రయించి తద్ద ముదమునన్  

జలనిధిని వంద యోజన

ముల దాఁటితి రామ కృపను బుడమి తనయకై

  1.  

 

 

 

ఉ.

చూచితి నే నశోక వని సువ్రత మాసిన చీర మానినిన్ 

వేచుచు నుండ భర్త కయి వేదన మీఱఁగఁ బట్టు వస్త్రనుం  

దోఁచుచు నుండ దుఃఖ మెదఁ దూర్ణము నన్నెఱిగించికొంచు వే

వే చని యంగులీయకము ప్రీతి నొసంగితి నానవాలుగా    

  1.  

 

 

 

చం.

అవనిజ నుండి నే మణిని హర్షమునం గొని యానవాలుగా

నృవరున కీయ వెల్గు మణి నెమ్మిని నే యరుదెంచి శీఘ్రమే

యువిదను గూర్చి విన్న పురు షోత్తముఁ డాశను  జీవితమ్మునం

దవిరళ మూనె రోగి యిల నయ్యమృతమ్మును గొన్న భంగినిన్

  1.  

 

 

 

కం.

విని రాముఁ డుద్యమింపం

గ నెంచెను లయ మొనరింపఁ గ్రన్నన లంకం

గనలిన యనలుండు జగము

లను గాలుచు భంగి నంత లయ కాలమునన్     

  1.  

 

 

 

ఆ.వె.

అంతఁ జేరి యెల్ల రర్ణవమును సేతు

వు నొనరింప నలుఁడు వన నిధి పయి

దాఁటి రెల్ల రంత త్వరిత గతిఁ కడలిఁ 

బ్లవగ వీర వరులు రమ్యముగను     

  1.  

 

 

 

తే.గీ.

నీలుఁడు వధించెను బ్రహస్తు లీల నాజిఁ 

గుంభకర్ణు వధించెఁ గాకుత్స్థుఁ డడరి

యింద్రజిత్తును లక్ష్మణుఁ డెదిరి చంపె

రావణుని స్వయముగఁ జంపె రాముఁ డాజి      

  1.  

 

 

 

తే.గీ.

శక్రు యమునిని వరుణుని శంభు నింక

బ్రహ్మ దేవుని దశరథు రాఘవుండు

కలిసెఁ బడసె వరములు మునుల సురర్షు

లను గలిసె వార లొసఁగిరి ఘన వరములు

  1.  

 

 

 

తే.గీ.

దత్త వరుఁడు రాముఁడు హర్షిత హృదయుండు

వానరవ్రాతమును గూడి మానవేంద్రుఁ

డేఁగుదెంచెను గిష్కింధ కింపుగాను

పుష్పక విమానవరమునఁ బురుష వరుఁడు   

  1.  

 

 

 

తే.గీ.

తాను గంగా నదినిఁ జేరి తాపసేంద్రు

చెంత నున్నవాఁడు మనుజ శేఖరుండు

రామునిఁ గన నర్హుండవు రాజపుత్ర!    

నీవు బుష్య యోగమ్మున నెమ్మి రేపు      

  1.  

 

 

 

కం.

విని హనుమంతుని గిరలను

మనముప్పొంగ భరతుండు మాటలఁ దా ని

ట్లనెను జిర కాల మీ రీ

తినిఁ దీరెను నాదు కోర్కి తియ్యగ నంచున్      

  1.  

 

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట  యిరువది తొమ్మిదవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 130.

 

 

 

భరతుని యానతిని రాముని రాకకు సంతోషించి యయోధ్యా నగర పౌరులు నగరము నలంకరించి భరతుని వద్దకు రాఁగ రాముఁడు నందిగ్రామమును జేరి భరతునిఁ గలసుకొనుట. పుష్పక విమానమును దిరిగి రాముఁడు కుబేరుని వద్దకు పంపుట.

 

 

 

 

కం.

విని పరమానందములు వ

చనమ్ములు భరతుఁ డనుపమ సంతోషమునన్

ఘనుఁడా సత్యపరాక్రముఁ

డనిపెను శత్రుఘ్నుఁ దమ్ము నానందితునిన్   

  1.  

 

 

 

చం.

పురమున నున్న చైత్యములఁ బుణ్య సురాలయ సంచయమ్మునున్

నరు లతి శుద్ధులై నిజ మనమ్ములఁ జందన మాల్య పంక్తులన్

సురుచిర రీతిఁ బూజలను శూర వరేణ్య! యొనర్పఁ బంపుమా

గురు తర వాద్య నైపుణులు కోవిదులున్ వర సూత పంక్తులున్

  1.  

 

 

 

చం.

గణికలు వంది మాగధులు కాంతల యుక్తము రాజ మాతలున్

వణిజులు వాహిణీ సచివ వర్యులు రాజకుమార కోటి బ్రా

హ్మణులు పురప్రవీరులు  మహాత్ముని రాముని దర్శనార్థమై

గుణ గణ వంద్యు నా శశి ముఖుం గన నెల్లరు నేగఁగా వలెన్    

  1.  

 

 

 

కం.

విని భరతుని వాక్యములను

బనివారి ననేకుల నటఁ బంచెను పరవీ

ర నికాయఘ్నుఁడు బల్లిదు

లను శత్రుఘ్నుం డపుడు పరమ నైపుణులన్

  1.  

 

 

 

తే.గీ.

పూడ్ప వలయుఁ బల్లములను బుర మయోధ్య

వఱకు వేగ నందిగ్రామ పరిసరముల

నుండి సమముగఁ జేయుఁడు మండితముగ

దారిఁ దొలఁగింపుడి యవరోధముల నెల్ల       

  1.  

 

 

 

ఉ.

చల్లుడు శీత లోదకము  సల్లుడు లాజలు పూవు లెల్ల మీ

రెల్లెడ లందు టెక్కెముల నింపుగ నుంచుడు వీథులం దహో

కొల్లలుగాఁ బ్రభాతమునఁ గూర్చుఁడు శోభల నెల్ల వీడులన్

సల్లలితంపు రీతులను జక్కఁగ నింక నలంకరించుచున్   

  1.  

 

 

 

తే.గీ.

పూల దండలు విడి విడి పూల నెల్లఁ

జల్ల వలయు రాజ గతులఁ జక్కఁగాను

వందల కొలఁదిగ జనులు పంచ వర్ణ

ములను ముగ్గు లేయ వలయు లలితముగను   

  1.  

 

 

 

ఆ.వె.

శాసనమ్మును విని శత్రుఘ్నుఁ డీయ జ

యంత ధృష్టి విజయు లరిగి రర్థ

సాథకుం డశోక సన్నామ  సిద్ధార్థ

మంత్రపాలురును సుమంత్రుఁడు వెస     

  1.  

 

 

 

ఉ.

కొందఱు మత్త నాగముల గొప్ప ధ్వజమ్ముల భూషితమ్ములం

గొందఱు హేమ మేఖలల కుంజర యుక్త కరేణు పంక్తిపైఁ

గొందఱు స్యందనమ్ముల సుఘోర మహా రథు లేఁగ వేగమే

కొందఱు నేఁగఁ జాగిరి రఘుప్రవరుం గన ఘోటకమ్ములన్    

  1.  

 

 

 

ఆ.వె.

శక్తి ఋష్టి పాశ సధ్వజ స పతాక

హస్తు లేఁగఁ దొడఁగి రంత వేల

కొలఁది కాల్బలులు రఘువరుని వీక్షింపఁ 

బరివృతు లయి పౌర వరుల తోడ         

  1.  

 

 

 

కం.

కౌసల్య కైకయు సుమి

త్రా సతి మున్నగు దశరథు దారలు ప్రీతిన్

భాసుర వాహనములలో

నా సవతులు సనఁ దొడఁగిరి యానందమునన్    

  1.  

 

 

 

తే.గీ.

నగర మెల్ల నందిగ్రామము గనె నంత

హరుల గిట్టల రవములు స్యందనముల

కమ్మి ధ్వనులు గ్రామమ్మునఁ గ్రమ్మె శంఖ

దుందుభుల తోడఁ జలియించెఁ దోరము భువి    

  1.  

 

 

 

సీ.

బ్రాహ్మ ణోత్తములతో వర్తకశ్రేణి ముఖ్యులఁ గూడి మోదకములును విరుల

దండలు నుండ హస్తమ్ము లందు నమాత్యులను గూడి భరతుండు ఘనుఁడు ధర్మ

రతుఁడు  భేరీ శంఖ రావమ్ములను గూడి పొగడఁగ వందులు మూరుచు నుప

వాసములఁ గృశించి వఱలు చున్నట్టి దీనుండు నారల నూని యుండి యన్న

 

తే.గీ.

రాకకై  మురిసిన వాఁడు  భ్రాతృ పాదు

కలు శిరమునఁ దెల్లని గొడు గలరఁ గరము

నందు వెల్ల దండం గొని యంది వ్యజన

మెదురు చనఁ జాగె నన్నకు నెలమి నపుడు             

  1.  

 

 

 

తే.గీ.

కాంచి పవనాత్మజునిఁ బ్లవగ వరుని భర

తుండు వలికె నంతఁ గన రాకుండె రాఘ

వుండు ప్లవగ చాపల్యతఁ బూని పలుక

వు గద! కనఁ బరంతపునిఁ బ్లవగ వరేణ్య!

  1.  

 

 

 

కం.

అన విని హనుమంతుఁడు వ

ల్కెనంత వివరింప నెంచి లీలఁగ నీ రీ

తిని సత్య విక్రముని భర

తు నాశ్వసింపంగ నిట్లు దొడఁగెను బ్రీతిన్          

  1.  

 

 

 

చం.

నిరతము పండ్లు పుష్పములు నిండిన చెట్లను గూడి తేనియల్

గురియుచు నుండు నట్లుగను గూరిమి మౌని వరమ్ము నీయ ష

ట్చరణము లుండ నాదముల సంతస మంది ప్లవంగ వీరులే

స్థిరముగ దాఁటి గోమతినిఁ జేరుచు నుందు రటంచు నెంచెదన్    

  1.  

 

 

 

తే.గీ.

మును భరద్వాజున కొసంగె మునికి వాస

వుండు వర మింపుగను ముని పుంగవుం డొ

సంగెను గద యాతిథ్యము సంతసమున

భరత! సైన్యయుతమ్ముగ వనిని నీకు   

  1.  

 

 

 

తే.గీ.

అదె వినఁబడు చుండెను గపు లఱచు చుండఁ

గలకలధ్వను లచ్చట పలు విధములు

దుమ్ముఁ గనుమ యచట నుత్తితమ్ము సాల

వనమును గదల్చు చుంటిరి వనచరు లట    

  1.  

 

 

 

మ.

కనుమా చంద్ర నిభమ్ము పుష్పకము భూకాంతా! విమానమ్మునున్

ఘన మా దివ్యము బ్రహ్మ నిర్మిత మహో కన్పట్ట దూరమ్ముగా

నని నా రావణుఁ జంపి బంధు యుతు స్వీయామాత్య సంతాను నీ

యిన వంశోద్భవుఁ డింపుగాఁ బడసె దేవేంద్రాభుఁ డీ రాముఁడే

  1.  

 

 

 

కం.

తరు ణాదిత్య నికాశము

నరేంద్ర! రఘు రామ వాహన వరము యక్షే

శ్వర సుప్రసాదము నిరం

త రాతుల మనోజవమ్ము తరలెను గనుమా      

  1.  

 

 

 

ఉ.

అంతట రామ లక్ష్మణులు నంగన సీతను గూడి యుండఁగాఁ

జెంతను వానరేశ్వరుఁడు సేరఁగ నంత విభీషణుండు దా

సంతస మంది  నిల్వఁగ భృశమ్ముగ హర్ష సమేత మంతటన్

వింతగ రేఁగె శబ్దములు విన్నును ముట్టుచు రామ శబ్దముల్

  1.  

 

 

 

తే.గీ.

స్త్రీలు బాలురు వృద్ధులు సేరె రాఘ

వుండిట కని కీర్తించుచు నుండ మిక్కు

టముగ నంది యానంద మెడంద లందు

దిక్కు లెల్లఁ బిక్కటిలంగ వెక్కసముగ      

  1.  

 

 

 

కం.

తురగ రథ కరుల నుండి ది

గి రయమ్మునఁ బుడమి నిలిచి కేళుల మొగిడిం

చిరి నరులు గాంచి రాముని

నర వరుని విమాన మందు నడయాడ ఘనున్          

  1.  

 

 

 

కం.

భరతుం డంజలి నూని వె

స రామునకు స్వాగతమును జక్కఁగ వచియిం

చి రఘు వరుఁడు పూజించెను

నరర్షభున కెదురు నిలిచి  నమ్రత నార్తిన్

  1.  

 

 

 

తే.గీ.

మన మలర బ్రహ్మ సుకృత విమాన మందు

నపర వజ్రపాణి యనంగ నన్న రాముఁ

డగపడె విశాల లోచనుఁ డప్పుడు భర

తాగ్రజుఁడు ప్రకాశించుచు నంబరమున   

  1.  

 

 

 

ఉ.

సోదరు నా విమానమునఁ జూచుచు నా భరతుండు రాముఁ దా

నాదర వీక్షణమ్ముల మహాత్ముని మేరువు నందు సూర్యుఁ డో

నాఁ దనరంగ రాఘవు ఘనమ్ముగ మ్రొక్కెను హంస యుక్తమై

మేదిని వ్రాలె వాహనము మించి రఘూత్తముఁ డీయ నాజ్ఞనున్    

  1.  

 

 

 

తే.గీ.

అంత నెక్కింపఁ బడ నట్టు లవ్విమాన

మందు భరతుండు ముదమున నన్నఁ జేరి

నతులొసంగినఁ  దిరిగి యన్నకు ననుజుని

నంకమున నుంచి కౌఁగిలె నన్న ప్రీతి    

  1.  

 

 

 

తే.గీ.

అక్షి పథమునఁ గనఁబడ నతఁడు చాల

కాలమున కక్కునం జేర్చి వీలుగాఁ బ

రిష్వజించికొనియె మదిఁ బ్రీతి సెలఁగ

రాముఁ డనుజుని భరతుని రాగ మడర    

  1.  

 

 

 

కం.

భరతుండు కదిసి లక్ష్మణుఁ

బరంతపుఁడు జనక సుతను బన్నుగ నంతన్

ధరణిజను గాంచి నతు లా

దరమున నొసఁగె వచియించి తన పేరు తగన్    

  1.  

 

 

 

తే.గీ.

కైక సుతుఁ డంత సుగ్రీవు నా కపీంద్రు

జాంబవంతు నంగదు కపి సత్తముని ద్వి

విదుని మైందుని నీలునిఁ బేర్మి ఋషభుఁ

గౌఁగిలించెను భరతుండు కపివరులను        

  1.  

 

 

 

ఆ.వె.

నల సుషేణులఁ బ్లవగుల గంధమాదను

శరభు నింకఁ బనసు హరి వరేణ్యు

లను బరిష్వజించె రామానుజుండు గ

వాక్షుని సహితమ్ము నలర మనము

  1.  

 

 

 

ఉ.

వారలు మానవాకృతుల వానరు లూని నరేంద్ర సూనునిన్

మూరి యనామయం బడిగి మోదము నందఁగఁ గామ రూపులే

వీరుని వానరేశ్వరునిఁ బేరిమి గాంచి పరిష్వజించి తా

నా రఘు వీరుఁ డీ గిరల నంతటఁ బల్కెను ధర్మ యుక్తముల్         

  1.  

 

 

 

తే.గీ.

మా నలువుర కీవు మహాత్మ!  మాన్యుఁ డ వగు

నేనవ సహోదరుండవు వానరేంద్ర!

ప్రేమఁ జనియింత్రు మిత్రులు ద్విషుల స్వీయ 

లక్షణం బపకారము ప్లవగ నాథ!    

  1.  

 

 

 

కం.

భరతుం డంత విభీషణు

నరసి వచించె నతి కష్టమైన పనియె నీ

యరుదగు సాహాయ్యమునను

బరఁగె సుసాధ్యముగ నసుర వర్య! మహాత్మా!     

  1.  

 

 

 

తే.గీ.

రాముని సలక్ష్మణునిఁ జేరి భ్రాత లందు

ఘనుఁడు శత్రుఘ్నుఁ డట నమస్కారము లొన

రించె భక్తి వినయమున వంచి శిరము

సీత చరణమ్ము లంటి చేసెను నతులను       

  1.  

 

 

 

ఉ.

పాదము లంటి మాత కిడె వందనముల్ రఘు రాముఁ డంతటన్

మోద మొసంగ మిక్కుటము పొంగిన వేదన నున్న కాంతకున్

సాదర మా సుమిత్రకును నంజలిఁ గైకకు వందనమ్ములన్

గాదిలి తల్లు లన్యులకు గ్రన్నన జేసి పురోహితుం గనెన్

  1.  

 

 

 

కం.

నృవరా! కౌసల్యానం

ద వర్ధనా స్వాగత మని తగ నాగరికుల్

వివశులునై కని యా రా

ఘవు నంజళు లిడి పలికిరి కాకుత్స్థునితో   

  1.  

 

 

 

తే.గీ.

పౌరులు నిలువ దోసిళ్ల మూర వేల

కొలఁది వికసించి యున్నట్టి నలినముల ప

గిదిఁ గనఁబడిన వవి పరికింప రాఘ

వునకు భరతాగ్రజునకు నృపుంగవునకు   

  1.  

 

 

 

చం.

స్వయముగఁ దెచ్చి పాదుకలు పాద యుగమ్మున నుంచి యంతటన్

నయముగఁ బల్కె నిట్లు నర నాథుని నా భరతుండు గాంచి యో

నయ విద! గొన్మ రాజ్యమును న్యాసము నగ్రజ! నీకు నింక నే   

నియతిని దీనినిం దిరిగి నెమ్మి నొసంగెద నాదరమ్మునన్      

  1.  

 

 

 

తే.గీ.

నేఁడు నా జన్మము పుడమి ఱేడ! యది కృ

తార్థ మయ్యెను సిద్ధంచె నంచితముగ

నా మనోరథము పురమున కరుదెంచఁ

దిరిగి నీ వయోధ్యకు రామ! నరవరేణ్య!     

  1.  

 

 

 

ఆ.వె.

బొక్కసముల నిండ్ల వెక్కసముగ నున్న

గాదెలను  బలమ్ము గాంచు మయ్య!

దశ గుణములు నయ్యె  భృశము నీ తేజము

న నవి యెల్ల రామ! నర వరేణ్య!   

  1.  

 

 

 

తే.గీ.

భరతుఁ డట్లను చుండఁగ భ్రాతృ వత్స

లుండు రాక్షసుండు విభీషణుండు వాన

ర వరు లెల్లరు నశ్రువులను విడిచిరి 

యంత నానంద భాష్పము లతనిఁ గాంచి    

  1.  

 

 

 

ఉ.

అంకము నందు నా భరతు హర్షమునం దగ నుంచి రాముఁడా

పంకజ లోచనుండు నిజ వాహిని తో భర తాశ్రమంపు టా

వంకకుఁ జేరె నంత దిగి వాహన రాజము నిల్చె ధాత్రి నా

టంకము లేక రాఘవుఁడు డగ్గఱి  తాను విమాన మింపుగా

  1.  

 

 

 

తే.గీ.

ఉత్తమ విమానము నరసి యుచిత రీతిఁ

బలికె ననుమతింతు నిను నో వాహనంబ

మోయుమీ కుబేరుని నింక మోదముగను

నాఁ జనె నుదీచికి నది ధనదుని కడకు      

  1.  

 

 

 

తే.గీ.

రావ ణాపహృత మయిన యా విమాన

ముత్తమమ్ము సేరెను వేగయుతము వైశ్ర

వణుని వేశ్మమునకు నర వర్యుఁ డా ర

ఘూత్తముని యాజ్ఞను వహించి యుత్సహించి       

  1.  

 

 

 

తే.గీ.

ఆత్మ సదృశ పురోహితు నంఘ్రు లంటి

వాసవుండు బృహస్పతి పాదములను

దాఁకి నట్లు రాఘవుఁ డంతఁ దద్ద ప్రీతి

సరసఁ గూర్చుండెఁ దగఁ బరాసనము నందు

  1.  

 

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట  ముప్పదవ సర్గము.

 

యుద్ధ కాండము

సర్గము 131.

 

 

 

భరతుఁడు రామునకు రాజ్యము నప్పగింప నయోధ్యా నగరమున శ్రీరాముఁడు రాజ్యాభిషిక్తుఁడై మిత్రుల నెల్ల సత్కరించి సాగ నంపుట, యజ్ఞ యాగాదులను జలుపుచు శ్రీరాముఁడు పదునొకండు వేల సంవత్సరములు సుభిక్షముగా రాజ్య పాలనము సేయుట, శ్రీరామాయణ మహా కావ్య పఠన మాహాత్మమును భగవానుఁడు వాల్మీకి మహర్షి వివరించుట.  

 

 

 

 

కం.

అవిరళ కైకేయ్యానం

దవర్ధనుఁడు నుదుటఁ గేలు దగిలించుచు నా

నృవరునిఁ గౌసల్యానం

దవర్ధనునిఁ గాంచి పలికెఁ దగు గిర లిట్లున్     

  1.  

 

 

 

తే.గీ.

రాము నా జ్యేష్ఠు సత్యపరాక్రముఁ గని

నా కొసఁగి నట్టి పూజించి నా జననిని

రాజ్యము నొసఁగు చుంటిని రామ తిరిగి

నీ కని పలికె భరతుండు నెమ్మి నూని         

  1.  

 

                                                                                

 

చం.

బలమున మిన్న దొక్క వృషభమ్ము వహించెడు గొప్పభార మె

ట్టుల నొక దూడ మోయును బటుత్వము చాలునె మోయ దానికిం

దలఁగుదు రాజ్యభారమును ధైర్యము తోడ వహింప రాఘవా! 

కలుగదు శక్తి నాకు నరకాంత! భరింపఁగ నింక రాజ్యమున్

  1.  

 

 

 

ఉ.

సేతువు వారి వేగమున ఛిద్రము కాఁగ స్రవించు నీటి నే

రీతిని నాపఁగా నగును రేఁగఁగ రాజ్యము నందు ఛిద్రముల్

నా తర మౌనె వారణ మొనర్ప రయమ్మున నెంచి చూడఁగా

నే తఱి నైన నగ్రజ! నరేశ్వర నీ వలె రక్ష నీయఁగన్

  1.  

 

 

 

ఉ.

గాడిద గుఱ్ఱపుం గతినిఁ గాంచఁగ వాయస మంచ మార్గముం 

గూడని రీతి నీ గతినిఁ గోరఁగఁ జాల నరిందమా! మదిన్

వేడుక నాట వాకిలిని వృక్షము నింపుగ గొప్ప శాఖలం

గూడిన నెక్కరాని దయి కోర ఫలమ్ములు దక్క కుండినన్             

  1.  

 

 

 

ఉ.

నాటిన వాని కప్పుడు కనంగ ఫలం బది కల్గ నేర్చునే

సూటిగ మమ్ము గావఁగను శూరుడ! నీవు దలంపకున్నచో

మేటి మగండ వై పుడమి మిన్నగ పాలన మీ వొనర్పకే

దీటుగ మమ్ము భృత్యులను దేర్పక యుండిన లాభ మేమియో   

  1.  

 

 

 

కం.

జగ మరయుఁ గాక రాఘవ!

తగ నభిషిక్తుఁడవు గాఁగ ధర్మజ్ఞా! సూ

ర్యు గతిని మధ్యాహ్నమున వె

లుఁగు తేజమ్ము దనరఁగ సురుచిరప్రభలన్

  1.  

 

 

 

తే.గీ.

వాయిదమ్ముల గము లవి మ్రోయు చుండ

నందియల నొడ్డణమ్ముల నడరు నట్టి

మ్రోతలను తియ్యనై నట్టి గీతములఁ బ

రుండు మగ్రజ! మేల్కొను రుచిరముగను     

  1.  

 

 

 

తే.గీ.

వసుమతీ చక్ర మున్నంత వఱకుఁ దిరుగు

నంత వఱకు జ్యోతిష్చక్ర మడరి రాఘ

వేంద్ర! స్వామివై వర్తింపు మింపుగాను

భూ జనుల కెల్లరకు నీవు భూరి యశుఁడ!        

  1.  

 

 

 

కం.

విని యా భరతుని మాటలు

మనుజేంద్రుఁడు సమ్మతించె మన మలరంగం

గని పర పురంజయుం డా

సనమును గూర్చుండె నంత సమ్మోదమునన్      

  1.  

 

 

 

తే.గీ.

అంత శత్రుఘ్ను నానతి నతి నిపుణులు

శీఘ్ర కర్ములు సుఖముగ చేయు వారు

మంగళులు చుట్టు ముట్టిరి మాన వేంద్రు

రాముని రయమ్మున నట సంభ్రమము మీఱ        

  1.  

 

 

 

తే.గీ.

మున్ను భరతుండు స్నాతుఁడై చన్న లక్ష్మ

ణుండు బల్లిదుఁడు విభీషణుండు వాన

ర పతి సుగ్రీవుఁ డొనరింప రాముఁడును జ

డలను విప్పి జలకమాడి నిలిచె నంత      

  1.  

 

 

 

ఆ.వె.

మడుగుల నిఁకఁ జిత్ర మాల్యానులేపన

ముల విభూషితుఁ డయి వెలుఁగుచు నిజ

తేజమున భృశమ్ము దేవ విభు నిభుండు

రాఘవుండు నిలిచె రమ్యముగను       

  1.  

 

 

 

తే.గీ.

రామునకు నింపుగ నలంకరణము సేయ

నంత నియమించె శత్రుఘ్నుఁ డర్క వంశ

వర్ధనుండు శ్రీమంతుఁడు పరమ లక్ష

ణునకు లక్ష్మణునకును వినుత యశుండు  

  1.  

 

 

 

ఉ.

సీతను నంతఁ బంక్తిరథు స్రీలు మనస్విను లెల్ల రింపుగాఁ 

బ్రీతి నలంకరించిరి యపేక్ష వహించి మనోహరమ్ముగా

నాతుల వాన రాంగనల నారుల రత్నము రామ మాత తా  

నాతత రీతి నెల్లరను నందముగా హవణించెఁ బ్రీతిమై      

  1.  

 

 

 

తే.గీ.

సారథి సుమంత్రుఁ డద్భుత స్యందనమ్ముఁ  

దెచ్చె శత్రుఘ్ను నానతిఁ దివ్య రథము 

నంత సర్వాంగ శోభన మంచితమ్ము

నర్కమండల సంకాశ మడరు దాని    

  1.  

 

 

 

కం.

కనియా రథమ్ము నంచిత

మును గాకుత్స్థుండు దీర్ఘ భుజుఁ డధిరోహిం

చెను బర పురంజయుం డా

మనుజేంద్రుఁడు రాఘవుండు మాన్యుం డంతన్         

  1.  

 

 

 

కం.

చని రా సుగ్రీవుండును

హనుమంతుఁడు స్నాతు లయి మహార్హ వసనముల్

దనర మహేంద్ర నిభద్యుతు

లు నెగడ శుభ కుండలమ్ములు వెలుఁగు చుండన్    

  1.  

 

 

 

చం.

నగరముఁ గాంచు కోరిక ఘనమ్ముగ భూషల నెల్ల నూని యా

మగువలు సుంద రాంగులును మర్కట నాథుని పత్నులున్ మదే

భ గమన జానకీ సతిని భామను గూడి సకుండలమ్ములం

దగ వెడలంగఁ జాగిరి రథమ్ముల మోదము నిండ నాత్మలన్        

  1.  

 

 

 

ఉ.

అంత నయోధ్యలోఁ బురి నజాత్మజు మంత్రులు నాపురోహితుం 

జెంతను మంతనమ్ములను జెన్నుగఁ జల్పిరి గాంచి యెల్లరున్

సాంతము రామ వృద్ధికిని నంచిత పట్టణ వృద్ధి నెంచుచున్

స్వాంతములం దశోక ముఖ సన్నుత మంత్రులు నన్య నాములున్

  1.  

 

 

 

తే.గీ.

విజయుఁడు మఱి సిద్ధార్థుఁడు వినుత మంత్రు

లిట్లని రభిషే కార్థమ యీ జయార్హు

నకు మహాత్మున కీ రామున కొన రింప

వలయు నెల్ల మంగళముల నలరి యిపుడు         

  1.  

 

 

 

ఆ.వె.

మంత్రు లెల్ల రిట్లు మంతనములు సల్పి

యాపురోహితునకు నానతి నొసఁ

గి నగరమ్ము నుండి మనుజేంద్రు దర్శింపఁ

బయలు దేరి రంతఁ బార్థు కడకు     

  1.  

 

 

 

సీ.

హరి యుక్త రథమున నమరేంద్రు భంగిని రాముఁడు సనె నెక్కి రథ వరమును 

భరతుండు కళ్యాలఁ బదిలమ్ముగాఁ బట్టె శత్రుఘ్నుఁడు వహించె ఛత్రవరము

లక్ష్మణుం డూని వాలవ్యజనమ్మును వీవఁ దొడంగెను బ్రేమ మీఱఁ

జెంత విభీషణుం డంత నన్యము సిత వ్యజన మూనె శశి నిభమ్ము రక్తి       

 

ఆ.వె.

గగన మందు ఋషి నికాయము స మరుద్గ

ణమ్ము సంస్తుతింప నెమ్మి రాము

ని వినిపించె మధుర రవము లంచితముగ

దేవతలు నుతింప దివ్యముగను    

  1.  

 

 

 

కం.

కుంజర రాజము వర శ

త్రుంజయ నామమ్ము నెక్కె రుచిరమ్ముగ నా

మంజుళ తమ సుగ్రీవుఁడు

సంజాతుఁడు కపి కులమున సంతోషముగన్       

  1.  

 

 

 

కం.

తొమ్మిది వేల గజమ్ముల

నెమ్మి నరాకృతుల నూని నిఖిలప్లవముల్

సమ్మదమున సర్వాభర

ణమ్ముల వెలుఁగుచుఁ దరలిరి నగచరు లంతన్            

  1.  

 

 

 

చం.

చెలఁగఁగ శంఖ దుందుభులు సెన్నుగ రమ్యపు నిస్వనమ్ములే

తరలెను మానవర్షభుఁడు తద్ద పురమ్మున కా యయోధ్యకై

పరఁగఁగ హర్మ్య పంక్తులను బన్నుగఁ గాంచిరి వచ్చు చుండఁగా

నర వరు నట్లు రాఘవు ఘనప్రభలన్ రథ మందు నిల్వఁగా

  1.  

 

 

 

తే.గీ.

రాము నతిరథు నరసి పుర జనులు జయ

వాచ్యములు వల్కి రింపుగ వారిఁ గాంచి

రాముఁ డభినందనము లిడఁ బ్రజలు మురిసి

యనుగ మించిరి చక్కఁగ ననుజులఁ గని        

  1.  

 

 

 

కం.

తారల మధ్య సుధాకరు   

నా రాముఁడు వోలి వెలిఁగె నవనీసురులుం

బౌరు లమాత్యులు వృతులై

వార లనుగమింపఁ దన యవయవప్రభలన్         

  1.  

 

 

 

చం.

కదలెను రాఘవుం డపుడు కంజదళాక్షుఁడు స్వస్తికమ్ములన్

సదమల వాద్య తాళములు చక్కగ నూనిన వార లేఁగు చుం

డ దరి ముదమ్ము నూని మును డయ్యక యించుక మంగళమ్ములన్

మది యలరంగఁ బాడుచును మానవ పుంగవు కీర్తనమ్ములన్    

  1.  

 

 

 

తే.గీ.

మును చనఁ దొడంగి రక్షతలను బసిడినిఁ

గైకొని నరులు విప్రులు కన్య లావు

లు సన మోదక పాణులు వెస నరేంద్రు

రాఘవున కగ్రమునఁ గదలం దొడఁగిరి    

  1.  

 

 

 

ఉ.

ఆ వర వాన రాలి పని నాసుర సైన్య బలమ్ము నెల్ల  సు

గ్రీవుని తోడి స్నేహమును బ్రీతిని మారుతి ప్రాభవమ్మునున్

భూవరుఁ డెల్ల మంత్రులకు మూరి వచింపగ విస్మయమ్మునున్ 

వావిరి పొందిరా నగర వాసులు డెందము లందు నెల్లరున్     

  1.  

 

 

 

తే.గీ.

రాక్షసేంద్రు విభీషణు రాఘవుండు

నుడివెఁ దాను గూడుట సద్వినుత చరిత్రు

నంతఁ జేరె నయోధ్యను సంతసమున

నున్న జనుల గూడిన యట్టి తన్నగరము       

  1.  

 

 

 

తే.గీ.

ఎగుర వేసిరి యింటింట నెలమిఁ బౌరు

లెల్ల రడరి పతాకము లింపుగాను

రుచిర మిక్ష్వాకుల గృహము నచిరము గని

చేరె రాముఁడు తన తండ్రి శ్రేష్ఠ గృహము     

  1.  

 

 

 

కం

 

కౌసల్యకు నింక సుమి

త్రా సతికిం గైక కొసఁగి తన వందనముల్

భాసుర పితృ గృహముఁ గదిసి

వే సోదరు భరతుఁ గాంచి పేర్మి నిటు లనెన్     

  1.  

 

 

 

చం.

భరతుని శ్రేష్ఠు ధార్మికుల భ్రాతను గాంచి వచించె నర్థ యు

క్త రుచిర భాషణమ్ములను దత్కపి రాజున కిమ్మశోక స

త్తరు సవిడూరజమ్ము లసితమ్మును మౌక్తిక భాసితమ్మునున్

హరికి మదీయ  సౌధము మహాత్మున కిత్తఱి రాఘవోత్తమా!           

  1.  

 

 

 

కం.

విని యాతని వాక్యములను

ఘన సత్య పరాక్రముండు కరముల సుగ్రీ

వునిఁ గొని భరతుం డాలయ

మునఁ జొచ్చెను బ్రీతి దనర బోరన యంతన్      

  1.  

 

 

 

ఆ.వె.

తైల దీపములను దల్ప పర్యంకము

లఁ గొని తెచ్చి రంత రయమునను న

నుజ్ఞ నీయ నా ఘనుండు శత్రుఘ్నుఁడు

వాన రాధిపతికి భటులు రక్తి         

  1.  

 

 

 

కం.

ఘన తేజుఁడు రామానుజుఁ

డనఘుఁడు సుగ్రీవుఁ గాంచి యభిషేక మొన

ర్ప ననుపుమ దూతలఁ ప్లవం

గ నాథ!యని వేడె నంతఁ గపి రాడ్వరునిన్       

  1.  

 

 

 

కం.

బంగరు కుండలఁ గాంచి ప్ల

వంగుల నల్వుర నొసంగె స్వర్ణ మయములం 

జెంగునఁ దేర జలము నిం

డంగను నాల్గింటి నలు కడళుల జలములన్      

  1.  

 

 

 

తే.గీ.

ఇచ్చి పలికె సుగ్రీవుఁడు వచ్చి జలము

నిండి నట్టి ఘటములతో నెమ్మి యుదయ

మందు నెదురు చూడ వలయు హరి వరేణ్యు

లార! నా యాజ్ఞ కొఱకునై మీర లంచు   

  1.  

 

 

 

కం.

అన నిట్లు వానరులు నా

గ నిభు లెగిరి రంత నుదరి గగనమ్మునకున్

ఘన వేగమున గరుత్మం

తునిఁ బోలుచు వీర వరులు తోషం బడరన్         

  1.  

 

 

 

ఉ.

మారుతి జాంబవంతుఁడును మాన్య హరీంద్రుఁడు వేగదర్శియున్

వీర వరుండు నా ఋషభ విశ్రుత నాముఁడు నాల్గు కుండలన్  

ధీరులు నైదు వందల నదీ జలకమ్ముల నిండి యుండఁగం

దీరుగఁ దెచ్చి రింపుగను దిట్ట తనమ్మున నాథు నానతిన్           

  1.  

 

 

 

ఉ.

రామున కంతఁ బ్రా గుదధి రమ్య జలమ్ము సుషేణుఁ డగ్ర్య శా

ఖా మృగ సంచ యోత్తముఁడు కాంచన రత్న మయంపుఁ గుంభిలో

గోముగఁ దెచ్చె స్వర్ణ మయ కుంభములో ఋషభుండు గంధ వృ

క్షామల శాఖలం బఱచి యామ్య మహోదధి నీరముం గొనెన్    

  1.  

 

 

 

చం.

గవయుఁడు పశ్చి మాబ్ధి యుదకమ్మును దెచ్చెను రత్న కుంభిలోఁ

బ్రవిమల శీతలమ్మును శుభమ్ముగ మారుత విక్రముండు తో

య వరము నుత్త రార్ణవము నందు గ్రహించి నలుండు వచ్చె ధ

ర్మ విదుఁడు సద్గు ణాన్వితుఁడు మారుత తార్క్ష్య పరాక్రముండునై       

  1.  

 

 

 

తే.గీ.

వానర వరులు తెచ్చిన పావ నోద

కమ్ము నరసి రామాభిషేకమ్మునకు న

మాత్య సహితుండు నెఱిఁగించె మాన్యునకుఁ బు

రోహితునకు నాప్తులకు శత్రుఘ్నుఁ డలరి

  1.  

 

 

 

చం.

అన విని సావధానుఁ డయి యంత వశిష్ఠుఁడు కూడి విప్రులన్

ఘన మణి పీఠ మందుఁ దగఁ గాంతను సీతను గూడి రామునిన్

మనుజ వరేణ్యు నింపుగను మాన్యునిఁ దా నుపవిష్టుఁ జేయఁగా   

మునివరు లా వశిష్ఠుఁడును బుణ్యతముం డగు వామదేవుఁడున్     

  1.  

 

 

 

తే.గీ.

కాశ్యపుండు కాత్యాయన గౌతమ విజ

యులు సుయజ్ఞుఁడు జాబాలియుఁ బురుషర్ష

భు నభి షేకించిరి సుగంధపు సలిలముల

వసువు లా వాసవుని భంగి వఱల నంత

  1.  

 

 

 

ఉ.

ముందుగ విప్ర ఋత్విజులు ముగ్ధలు గన్యలు మంత్రి వర్యులున్

సుందర యోధ వర్తకులు సుస్థిర ముండ నభమ్ము నందు నా

నందముగా సురావలియు నల్వురు నుత్తమ లోకపాలు రిం

కందఱు నౌషధమ్ముల మహాత్ముని వా రభిషిక్తుఁ జేయఁగా    

  1.  

 

 

 

సీ.

బ్రహ్మచే మున్నెద్ది పన్నుగ నిర్మిత మయ్యె మనువు పూర్వ మెయ్యది ధరి

యించె నాతనికి జనించిన వా రెయ్య దూనిరి క్రమముగ నుజ్జ్వలమ్ము

నట్టిది పసిడి మయమ్మును దీప్తము రత్నఖచితమును రమ్యమును స

భాస్థలి రత్నవిభాసిత పీఠమున యథావిధి నునిచి నయ విదుండు                    

 

తే.గీ.

ముని వశిష్ఠుఁ డంతఁ గిరీటమును మహాత్ముఁ

డుంచె రాముని శిర మందు నంచితముగ

ఋత్విజులు భూషణమ్ముల నెల్ల వా ర

లంకరించిరి రాముని రమ్యముగను              

  1.  

 

 

 

మ.

చని తాఁ బ్రీతి ఘనుండు వట్టె ధవళచ్ఛత్రమ్ముశత్రుఘ్నుఁడే

ఘన సుగ్రీవుఁడు పట్టె హర్షమున శాఖా చారి వింజామర

మ్మును గాకుత్స్థున కప్డు పట్టెఁ దగ సంపూర్ణాబ్జ సంకాశమున్

గని యన్యమ్మును నా విభీషణుఁడు రక్షః కాంతుఁ డింపారఁగన్              

  1.  

 

 

 

కం.

తను కాంతులం బ్రకాశిం

చు నగ నొసంగె శత పుష్ప శోభితమును నా

యనిలుండు సువర్ణము రా

మునకుఁ బురందరుని యాజ్ఞఁ బుణ్యాత్మునకున్           

  1.  

 

 

 

ఆ.వె.

సర్వరత్నమయము సకలమణి విలసి

తమును మౌక్తికములు దనరు హార

ము నొసఁగె ననురక్తిఁ బురుహూతు నానతి

మానవర్షభునకు మారుతమ్ము           

  1.  

 

 

 

తే.గీ.

అర్హు నభిషేక సమయమ్ము నందుఁ బాడి

రఖిల గంధర్వు లాడిరి యప్సరసలు

రాఘ వేంద్రు ధీమంతుని రమ్యమైన

యట్టి యభిషేకము నరసి యంచితముగ    

  1.  

 

 

 

ఆ.వె.

సస్య వంత మయ్యెఁ జక్కఁగ వసుమతి

ఫలము లీనె నపుడు పాదపములు

గంధవంతము లయి కన్పట్టె పూవులు

రాఘవోత్సవమున రమ్యముగను   

  1.  

 

 

 

చం.

ఒసఁగెను లక్ష గుఱ్ఱముల నొయ్యన నావుల లక్ష సంఖ్యలం 

బస గల వంద యెడ్ల నట బ్రాహ్మణ కోటికి మానవేంద్రుఁడే

యొసఁగెను గోట్లు ముప్పదుల యుక్త హిరణ్యము లగ్ర జాతికిన్

వసనము లింక భూషలను బార్థివుఁ డత్తఱిఁ జేసె దానమున్              

  1.  

 

 

 

తే.గీ.

అంత సుగ్రీవున కొసంగె నర్క రశ్మి

సన్నిభ సువర్ణ మాలను సన్మణి విల

సితము దివ్యమ్మును బురుష శేఖరుండు

గారవమ్మునఁ బ్లవగ శేఖరున కలరి       

  1.  

 

 

 

కం.

ధృతి మంతుఁ డొసఁగె రాముఁడు

వితత విడూరజ వర మణి వృత రత్న సమా

వృత మంగద మంగదునకు

రతి వాలి సుతున కపుడు పరమ హర్షమునన్

  1.  

 

 

 

చం.

వర మణి జుష్ట ముత్తమము భామకు మౌక్తిక హార మంతటన్

ధరణిజ కాలి కిచ్చె హిమ ధామ వరాంశు నిభప్రభా లస

త్సురుచిర మింక భూషలు విశుద్ధ దుకూల యుగమ్ము దివ్యముం

దరుణి కొసంగె రాఘవుఁడు దద్దయుఁ బ్రీతిని సీత యంతటన్

  1.  

 

 

 

తే.గీ.

చూచుచు హనుమంతుని నంత సుదతి సీత

తనదు కంఠము నుండి సత్వరము తీసి

హారమును మాటి మాటికి నరయు చుండెఁ 

బతిని వానర కోటిని భావ యుతము         

  1.  

 

 

 

తే.గీ.

ఇంగితజ్ఞుఁడు సతి భావ మెఱిఁగి పలికెఁ 

దేజము యశము నేర్పును ధృతియు నీతి

పౌరుషము బుద్ధి వినయము పరఁగు నేరి

కతని కిమ్ము తుష్టి నిడిన యతని కంచు

  1.  

 

 

 

ఆ.వె.

వాయు సుతున కిచ్చె వైదేహి హారము

హార మూని వెలిఁగె హనుమ చంద్ర

కాంతు లడరు మాల నంతఁ దెల్లని మబ్బు

లున్న యద్రి పగిది మిన్న గాను   

  1.  

 

 

 

చం.

ద్వివిదున కింక మైందునకు వీరుఁడు నీలున కెల్ల వాన రా

లి వఱలు పెద్ద వారికినిఁ బ్రీతి నొసంగెను భూషణమ్ము లిం

క వసన రాజముల్ పుడమి కాంతుఁడు సక్కఁగఁ గోర నొప్పు న

ట్టి వొసఁగె నర్హ రీతినిఁ గడింది సఖిత్వము నెంచి యాత్మలో       

  1.  

 

 

 

ఉ.

వావిరి జాంబవంతుఁడును వాయుజుఁ డన్య హరీంద్ర కోటి సు

గ్రీవుఁడు నవ్విభీషణుఁడు గృత్స్నము పూజితు లైరి కోర్కులన్ 

భూవరు చేత రత్నముల భూరిగ వారలు వచ్చి నట్టి యా

త్రోవను నేఁగఁ జాగిరి సతోషము వానరు లింక రక్కసుల్     

  1.  

 

 

 

కం.

ప్లవగులు మహాత్ము లెల్లరు

నృవరునకు నమస్కరించి నెమ్మి వెడలి రం

త వడిం గిష్కింధకు రా

ఘవుం డనుమతింప వారిఁ గారుణ్యమునన్         

  1.  

 

 

 

కం.

పురిఁ జేరెను సుగ్రీవుం

డరయఁగ నభిషేకముఁ దగ నర్చితుఁ డయి భూ

వరుచే రాముని చేతను

విరివిగఁ గిష్కింధను హరి విభుఁడు ముదమునన్      

  1.  

 

 

 

ఆ.వె.

కుల ధనము గ్రహించి కూర్మి విభీషణుం

డరిగె లంక కంత నసుర వరులఁ

గూడి రాజు ధర్మ కోవిదుండు మహా య

శుండు  రక్కసుల విభుండు మురిసి    

  1.  

 

 

 

తే.గీ.

కీర్తి మంతుఁడు సక లారి హర్త యఖిల

ము నిజ రాజ్యమ్ము నేలెను మురిసి భృశము

రాఘవుం డుదారుఁ డరసి లక్ష్మణు నయ

విదుని ధర్మవత్సలుఁ డనె సదయ నిట్లు       

  1.  

 

 

 

ఉ.

భూమిని నీవు ధర్మవిద! పూర్వులు నేలిన రాజ్య మింపుగా

గోముగ యౌవ రాజ్యమునఁ గూడి ననుం దగ భ్రాత! యేలుమా

యీ మహి భార మూను మయ యింపుగఁ నిత్తఱిఁ దండ్రు లేల నాఁ

డే మఱకుండ వర్ధిలిన దెల్లను నేనును నుండఁ దోడుగన్     

  1.  

 

 

 

చం.

పలుమఱు నిట్లు వేఁడినను బార్థుఁడు లక్ష్మణు ధర్మవేత్తనున్

నిలువఁగ యౌవరాజ్యమున నెమ్మిని నొల్లక యున్న భ్రాతయే

లలిత మనస్కు నా భరతు భ్రాతను దా నభిషిక్తుఁ జేసె నం

త లలి మహాత్ము రాఘవుఁడు ధారుణికిన్ యువరాజుగా వెసన్               

  1.  

 

 

 

తే.గీ.

పౌండరీ కాశ్వ మేధ స వాజపేయ

యాగములు పెక్కు లొనరించి యన్యములను

వివిధములను బూజించెను బ్రీతి దేవ

తలను వేల వర్షములు రాట్తనయుఁ డేలె        

  1.  

 

 

 

ఆ.వె.

ఆచరించి వంద యశ్వమేధమ్ముల

నుత్త మాశ్వరాజ యుతము భూరి

దక్షిణల నొసంగి ధరణి నాథుఁడు ద్విజ

పుంగవులకుఁ బ్రీతిఁ బుడమి నేలె         

  1.  

 

 

 

తే.గీ.

రాముఁ డాజాను బాహుఁడు భీమ వక్షుఁ

డును బ్రతాపవంతుఁడు లక్ష్మణుని సహితము

చక్కఁ బాలించె నీ భూమి సద్గుణుండు

సర్వమును లీలఁ గాకుత్స్థ సత్తముండు    

  1.  

 

 

 

కం.

నుత ధర్మాత్ముఁడు రాముఁడు

క్రతువు లనేకము లొనర్చె రాజ్యమ్మును నా

తతమును గ్రహించి తన స్నే

హితులను జ్ఞాతులను గూడి యిల బాంధవులన్      

  1.  

 

 

 

ఆ.వె.

విధవ లేడ్వఁ గలఁత వినము క్రూర మృగము

ల భయ మెందు గనము లవ మయినను 

వ్యాధులఁ గన మెందు బాధల నీయఁగ  

రాముఁ డేలు చుండ రాజ్య మడరి

  1.  

 

 

 

ఆ.వె.

లేరు దొంగ లిలను లే వనర్థము లెందుఁ 

వృద్ధు లైన వారు పిల్లల కయి

వేఁగఁ జేయ రెందుఁ బ్రేత కార్యములను    

రాముఁ డేలు చుండ రాజ్య మడరి

  1.  

 

 

 

ఆ.వె.

ఎల్ల నిండెను ముద మెల్లరు ధర్మప

రు లయిరి కని రఘువరు నొక రొక్క

రెవ్విధమున నయిన హింసించు కొన రెందు  

రాముఁ డేలు చుండ రాజ్య మడరి

  1.  

 

 

 

ఆ.వె.

వేల యేండ్లు గడిచె వేల పుత్రుల తోడ

విగత రోగములను విగత శోక

ములను లోకు లుండి రలరి భృశమ్ముగ  

రాముఁ డేలు చుండ రాజ్య మడరి

  1.  

 

 

 

ఆ.వె.

రామ రామ యంచు రాముని గాథలు

ప్రజల లోన ననవరతము సెలఁగె 

రామ మయమునై ధరాతలము వెలిఁగె       

రాముఁ డేలు చుండ రాజ్య మడరి

  1.  

 

 

 

చం.

తరువులు పూలఁ బండ్లను సతమ్ము నొసంగుచు నున్న వెల్ల నె

ట్టి రుజలు లేక వానలు పటిష్ఠము లయ్యెను గోరి నంతటం 

బరఁగె సుఖంపు మారుతము పన్నుగ నిత్యము రాముఁ డేలఁగా

ధరణిసు రాలి క్షత్రియులు ధాత్రిని వైశ్యులు శూద్రు లెల్లరున్      

  1.  

 

 

 

చం.

అలరిరి వారి వారి పనులం దను రక్తి వహించి నిత్యముం

బరఁగిరి వీడి లోభమును బన్నుగ నుండిరి ధర్మ బద్ధులై

గిరలు వచించి సత్యముగఁ గీర్తి గడించిరి మిక్కుటమ్ముగన్

నర వరు లెల్ల రచ్చటను నైపుణి రాజ్యము రాముఁ డేలఁగా      

  1.  

 

 

 

కం.

అందఱు లక్షణ వంతులె

యందఱు తత్పరులు ధర్మ మందున నిరతం

బందఱు వశింతు రట నా

నంద మెదలఁ దాండవింప నరవరు లెలమిన్      

  1.  

 

 

 

కం.

పది వేల వత్సరమ్ములుఁ

బది వందల యేండ్లు ఘనుఁడు పాలించె దయా

హృదయుండు రాముఁ డింపుగ 

సదమల వృత్తుండు భ్రాతృ సహితము ధరణిన్      

  1.  

 

 

 

చం.

పరగును ధర్మ సమ్మతము పన్నుగ నాయువు నిచ్చుఁ గీర్తినిన్

నర పతి కిచ్చు సజ్జయము నైపుణి వ్రాసెను బుట్టపుట్టువే

గురుతర మార్ష సత్కృతము కోరి పఠించిన నాది కావ్యముం

బురుషుఁడు విన్న లోకమునఁ బోవును బాపము లెల్ల వానికిన్   

  1.  

 

 

 

తే.గీ.

రామ పట్టాభిషేకము రక్తి వినిన

జగతిఁ బుత్ర కాములు వడయఁ గలరు తన

యులను ధన కాములు ధనము నుర్విఁ గాంత్రు

ధరఁ గెలుచు రాజు వధియించు నరుల నెల్ల            

  1.  

 

 

 

ఉ.

రాముని చేత మాతయును లక్ష్మణు చేత సుమిత్ర యింకనున్

శేముషి తోడ నా భరతు చేతను గైకయు జీవ పుత్ర లై

రీ మహిఁ జక్క నవ్విధమ యింపుగ నౌదురు కాంత లచ్చటం 

బ్రేముడిఁ బుత్ర పౌత్రులును బెంపు వహింపఁగ నిత్య హర్షలై       

  1.  

 

 

 

తే.గీ.

ఘనుని రాముని యక్లిష్ట కర్ముని విజ

యమ్ము గూడిన రామాయణమ్ము నెల్ల

నాలకించిన దీర్ఘంపు టాయువుఁ బడ

యఁ గల రెల్ల జనులు నిశ్చయముగ నవని         

  1.  

 

 

 

కం.

మును ముని వాల్మీకి రచిం

చిన యీ కావ్యము నెవండు జిత రోషుండై

మనమున శ్రద్ధ దనరఁ జదు

వు నా నరుఁ డతిక్రమించు బోరన వెతలన్      

  1.  

 

 

 

కం.

మును ముని వాల్మీకి రచిం

చిన యీ కావ్యము నెవండు చెన్నుగ విను నా

మనుజుండు ప్రవాసాంత

మ్మునఁ గూడును బంధువులను ముదము వహించున్       

  1.  

 

 

 

ఉ.

కోర వరమ్ము లింపుగను గూరిమి రాముని చేతఁ బొందుదుర్

కోరిక లాలకించి సుర కోటి సమస్తము వొందు హర్షమున్

వారి యెడం బఠింపగను వారి గృహమ్మున సంచరించెడున్ 

ఘోర వినాయకప్రజలు గూర్మిని శాంతి వహింతు రంతటన్  

  1.  

 

 

 

కం.

ధర నింపుగ గెల్వఁ గలరు

ధరాధి నేతలు బహిష్కృత నరపతులు స

త్వరముగ స్వాస్థ్యమ్ము వడయు

దు రింపుగఁ బఠించిన నిది తోరపు భక్తిన్   

  1.  

 

 

 

తే.గీ.

సుతుల నుత్తములం గందు రతివ లా ర

జస్వలలు పఠించినను బూజ లొసఁగినఁ బు

రాతన మితిహాసమునకు వీత పాపు

లగుదు రాయువు దీర్ఘము నందఁ గలరు    

  1.  

 

 

 

చం.

వినవలె నెల్ల క్షత్రియులు విప్రుల నుండి వినమ్ర మూర్ధులై

ఘన ధన పుత్ర లాభములు గల్గును విన్న పఠింప నేరికిం

గన మిసు మంత సందియము కాంతుని రాముని గాథ నింపుగా

మనమున నొందు సంతసము మాన్య సనాతన విష్ణు వాతఁడే        

  1.  

 

 

 

తే.గీ.

హరియు నారాయణుండును నాది దేవుఁ

డీ మహా బాహువు నర వరేంద్రుఁ డెన్న

నితఁడు  సాక్షాద్రఘు వరుండె యితని కనుజుఁ

డైన లక్ష్మణుఁ డగు శేషు వవని లోన

  1.  

 

 

 

కం.

విని యర్థ వంత కావ్య

మ్మును ధన ధాన్య సకుటుంబముల వృద్ధి నిలన్

వనితా సుఖముల నంద న

గు ని జాఖిల కార్య సిద్ధి గురుతర రీతిన్         

  1.  

 

 

 

ఆ.వె.

యశము నింక నాయు వారోగ్యముల బుద్ధి

శుభము లింకను ననుజుల ననుంగు  

ప్రేమ నొసఁగు దాని వినఁ దగు సద్బుద్ధు

లకును నియమ గతిని రామ గాథ        

  1.  

 

 

 

తే.గీ.

ఇట్లు మున్ను జరిగి నట్టి యీ వర కథ

నుడువుఁ డెల్లరకును  భయపడక యెదల

భద్ర మగు మీకు విష్ణుని బలము వృద్ధి

సెందు గాక ధరణి లోన శ్రేష్ఠముగను        

  1.  

 

 

 

కం.

సుర వరు లనుగ్రహింతురు

కరము గ్రహించినఁ జదివినఁ గమనీయముగా

వర రామాయణ మెలమిఁ బి

తరు లెల్లరు సంతసింత్రు తప్పక యెదలన్         

  1.  

 

 

 

కం.

ముని కృతము సంహితము నీ

మనుజేంద్ర చరితము నెల్ల మన్నన లిఖియిం

చిన నరులు వసింత్రు దివ

మ్మున సంతోష మడర సతము సుఖస్థితులై

  1.  

 

                                                                    

 

శా.

నీలాంగద్యుతి పుంజ నిర్జిత చలన్నిర్భేధ్య పర్జన్యమా!

వేలాక్రాంత యశః పయోధి! కృత నిర్వీ ర్యోగ్ర  రత్నాకరా! 

లీలా మానుష రూప సంచరిత కేళీ ఖండితాస్యవ్రజా!

బాలా భూమిజ హస్త పూజిత పదా! పద్మాయతాక్షద్వయా!    

  1.  

 

 

 

మాలిని.

దశరథ నృప సంజాతా సరోజాయతాక్షా!

నిశిత విశిఖ వద్ధన్వీ! వినీ లాభ్ర గాత్రా!

దశవదన శిరో హర్తా! జగత్త్రాణ దక్షా!

స శమ దమ విరాజత్స్వాంత! శ్రీరామ భూపా!

  1.  

 

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట  ముప్పది యొకటవ సర్గము.

శ్రీమదాంధ్ర రామాయణము యుద్ధ కాండము తోడ సర్వము సంపూర్ణము.   

 

 

 

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి