3, నవంబర్ 2023, శుక్రవారం

5. శ్రీమదాంధ్ర రామాయణము_ సుందర కాండము

 

శ్రీ మదాంధ్ర

రామాయణము

సుందర కాండము.

మూలము

శ్రీ వాల్మీకి రామాయణము

 









 

ప్రణీతము

పోచిరాజు కామేశ్వర రావు 



శ్రీ మదాంధ్ర

రామాయణము

 

 

 

 

 

 

సుందర కాండము.

మూలము

శ్రీ వాల్మీకి రామాయణము

 

 

 

 

 

 

 

 

 

 

  

 

 

ప్రణీతము

పోచిరాజు కామేశ్వర రావు


 

శ్రీమదాంధ్ర రామాయణము

(మూలము: శ్రీవాల్మీకి రామాయణము)

 

సుందర కాండము

సర్గము 1.

 

 

 

 

హనుమంతుని సముద్ర లంఘనము. 

 

 

 

 

కం.

 

నిత్యాంజనేయ సేవిత!

భృత్యవ్రాతానుకంప! పృథ్వీజేశా! 

సత్యపరాక్రమ! పూ జ్యా

దిత్యాన్వయ వార్ధి సోమ! స్థిత సౌమిత్రీ!    

1.      

 

 

 

కం.

శ్రీరామాయణ  కావ్యా

పారప్రవచన కృతార్థ పరమర్షి సదా

చార పరాయణుఁ దలతుం

బౌరాణికుఁ బుణ్యపురుషు వాల్మీకి మునిన్

2.     

 

 

 

కం.

శ్రీజానకీ సతీమణి

భూజాత సుశోధ నానుపూర్వ సఫలమున్

భ్రాజిత సుందర వృత్తము

తేజోమయ వాయుజాత ధీర చరితమున్

3.     

 

 

 

చం.

నుడివెద భక్తిపూర్వక వినోద భరాంచిత వీర గాథ లే

నడుగిడి మారుతాత్మజుఁడు నద్భుత లీలఁ ద్రికూట శృంగిలో

నడినిసి రావణా వసథ నందన భంగి నశోక వాటికం

గడువడి చేసి శోధనము కాంతను గాంచిన రీతి నంతయున్

4.     

 

 

 

శా.

శ్రీభూనందన దర్శనార్థము కపిశ్రేష్టుండు వాతాత్మజుం

డాభీలాద్రిని రావణాపహృత చింతాక్రాంత చిత్తంబుతో

భీభత్సంబుగ హుంకరించి పద సంపీడ్యక్షతాద్రిద్యుతిన్

సౌభాగ్యం బిడఁ జేరె వేగమునఁ దా సన్మార్గమే యివ్విధిన్

5.     

 

 

 

 

 

 

సుందర కాండము ప్రారంభము

 

మ.

అరివీరోగ్రుఁడు వాయుపుత్రుఁడు దశాస్యానీత సీతా సతిం

బరిశోధింపఁ దలంచి చారణ సుసంభావ్యాధ్వ సంవర్ధియై

తరణార్థంబు సముద్రరాజమును దుర్ధర్షంపు దుష్కార్యమున్

భరణార్థంబుగ నిశ్చయాత్ముఁడయి చూపట్టెం గకుద్మంతమై

6.     

 

 

 

కం.

ధీరుఁడు మహా బలాఢ్యుఁడు

మారుతి వైడూర్య వర్ణమయ శాద్వల సం

చారము చేసె సుఖమ్ముగ

వారి సమతల నిభ సానువర దేశములన్

7.     

 

 

 

తే.గీ.

పక్షులకు నెల్ల మిక్కిలి భయము గొలుప

నురపు ఘాతమున విఱుగఁ దరులు జంతు

రాజి నణఁచి పెరుఁగు మృగరాజు పగిది

ధీనిధి హనుమ చరియించె మేను మెఱయ

8.     

 

 

 

తే.గీ.

నీల పీత రక్త హరిత కాల ధవళ

చిత్ర వర్ణ ధాతు చయ భాసితము యక్ష

కిన్న రోరగ గంధర్వ గేహ శిఖరిఁ

గపియె కరిగణ గజరాజ కాంతిఁ దోఁచె

9.     

 

 

 

తే.గీ.

సూర్య పవ నేంద్ర ధాతృ పశుపతి గణము

లకు హరివరుఁ డంజలి సేసి ప్రకటిత మతి

పూర్వ ముఖియై పితరుఁ దల్చి భూరి తమముఁ

జేసె తనువు దక్షిణ దిశఁ జేరఁ దలఁచి

10.    

 

 

 

ఉ.

వానరు లెల్లఁ దన్నుగనఁ బై కెగుర న్మది నిశ్చయించి తా

మేనును వృద్ధి సేసి కడు మేలును గూర్పఁగ రామ మూర్తికిన్

మీన నికేతనంపు గతి మేను వహింపఁగఁ బౌర్ణమాసిలో

వే నగ పీడనమ్ము నతి భీకర లీలను జేసె నత్తఱిన్

11.    

 

 

 

కం.

అపరిమిత శరీరమ్మున

విపరీత కర చరణ ఘన పీడన గావిం

చి పయోధిని దాఁటఁగ గిరి

నపుడు కుధరముం జలించె నచలం బైనన్

12.    

 

 

 

కం.

కుసు మాగ్రములు తరుల నుం

డి సుమ చయము రాలె భువి వడిని గంధ యుతం

పు సుమ మయ మయ్యె శైలము

సుసంవృత సుమాకర ఘన శోభ లొసంగన్

13.    

 

 

 

ఆ.వె.

వీర వాయు సూను పీడిత నగరాజు

వారి ధారఁ గార్చె ఘోరముగను

వన కరేణు యూధ వైభవ భాసిత

మత్త సింధురంపు మదము భంగి

14.    

 

 

 

కం.

బల్లిదుఁడా మారుతిచేఁ

దల్లడిలిన యా మహేంద్ర ధాత్రీ ధరమే

మెల్లన స్రవించె నచ్చట

వెల్లువలన్ రజత వహ్నిబీజాంజనముల్

15.    

 

 

 

తే.గీ.

పర్వతంబు గురిసె శిలాపర్వ మంత

గంధక సుసమావృత శిలా బంధురమ్ము

మండు చున్నట్టి యనలమ్ము మధ్య నుండి

ధూమ రాజి యెగయు తీరు తోఁచె నచట

16.    

 

 

 

సీ.

సంకుచి తాచలస్వాంత పీడిత భూత

            జాల మఱచె వింత స్వనము లంత

భరణీ గగన దిశోపవనము లెల్ల మ్రో

            గె మృగ రవమ్ముల నమితముగను

స్వస్తిక లక్షణ సర్పములు కఱచె

            రాళ్లను ఘోర గరళము గక్కి

కుపిత భుజగ దష్ట ఘోర శిలలు మండి

            వ్రక్క లయ్యెను వేయి ముక్కలుగను

 

 

 

 

ఆ.వె.

ఘన విషఘ్నమౌ నగ భరిత భూరుహ

జౌషధ నిచయము విషాంతము నొన

రింప శక్తి నుడిగి రిత్త వోయె నడవి

జ్వాల లెల్ల నెగసె మూల లెల్ల

17.    

 

 

 

మ.

ముని లోకమ్ము దలంచి పర్వతమునున్ భూతమ్ములే త్రుంచె నో

యని పాఱంగ సతీ సమేత మిఁక త్రస్తాస్వాంత విద్యాధరుల్

చని రంతన్ దిగనాడి పానగృహముం జామీక రామత్రముల్

తినుబండారము లార్షభత్వచములన్ దివ్యాధ్వముం జేరఁగన్

18.    

 

 

 

కం.

పాన విమోహితులును బిం

జాన సర గళు లనులిప్త చందన తనువుల్

మానిత రక్త సర ధరులు

యాన మయిరి దివికి పుష్క రారుణ నయనుల్

19.    

 

 

 

తే.గీ.

హార నూపుర కేయూర పారిహార్య

ధారిణులు మందహాసాస్య తరుణు లంత

విస్మితాంతరంగలు మేఘవేశ్మ మందు

నిల్చి రెల్లరుఁ దమిఁ గూడి నిజ విభులను

20.   

 

 

 

కం.

విద్యాధరర్షులు మహా

విద్యా మహిమను నిలఁబడి విన్ను తలమునం

దాద్యంతమ్ము సమేతులు

సద్యో వీక్షణ మగమును జల్పిరి యంతన్

21.    

 

 

 

తే.గీ.

భావితాత్ములు సంయమి వరులు సిద్ధ

చారణ గణ మంబర వీధిఁ జారు విమల

పథమున నిలిచి యంతటఁ బలుకు నుడులు

వింటి రచ్చట నెల్లరు విస్మయముగ

22.   

 

 

 

కం.

జవ్వనుఁడు భూధర నిభుఁడు

రివ్వున నెగిరి దివికి విపరీతంపు వడిన్

దవ్వగు పారముఁ జేరఁగ

నివ్వన నిధి దాఁటఁ గోరు నీ హనుమ వెసన్

23.   

 

 

 

కం.

కపి రామ కార్యము లవి స

లుపంగఁ దా మదిఁ దలఁచె గురుతరం బైన

ట్టి పయోధి లంఘనమ్మది

యపర జనాసాధ్యము నిఁక నప్రాప్తమునున్

24.   

 

 

 

కం.

ఆమాటలు ఘన మునులవి

యేమఱక విని కని రటఁ గపీంద్రు నగమునన్

రోమములు కుదిపి కదలెడు

భీమ జలద నిభ నినదుని విద్యాధరులే

25.   

 

 

 

తే.గీ.

చుట్ట చుట్టు కొన్నట్టి యా జుట్టు నిండి

నట్టి తోఁకను విదలించె నంత నెగుర

నుత్సహించి కరమ్ము వాయు తనయుండు

కాద్ర వేయులఁ గొంపోవు గరుడు కరణి

26.   

 

 

 

ఆ.వె.

ఘోర వేగ గామి గోపుచ్ఛము వెనుక

ముడుఁచు కొన్న వాలము గనిపించె

వైనతేయుఁ డలిగి బలమునఁ గొనిపోవు

పన్నగమ్ము భంగి వారి కెల్ల

27.   

 

 

 

ఉ.

శైల తలమ్మునం బరిఘ సన్నిభ బాహువు లూని మధ్యమున్

లీలగ వంచి పాదములు రివ్వున సంకుచితమ్ము సేయుచున్

ఫాలము దోర్ద్వయమ్ములను వంచియుఁ దేజు బలమ్ము లెల్ల నా

భీలము సేసి చూపు లిడి వీథిని నూపిరి పట్టి యింపుగన్

28.   

 

 

 

తే.గీ.

పదములు  స్తిరముగ నునిచి వానరేభుఁ

డంత లంఘింప నుద్యుక్తుఁ డయి యనువుగఁ

గర్ణముల సంకుచించి యా కపి వరులకు

ననియె నిట్లు సంరంభియై యనిల సుతుఁడు

29.   

 

 

 

కం.

రామ విముక్త శర గతిన్

భీమశ్వసన జవ సదృశ వేగము మీఱం

గామిత ఫల సిధ్యర్థము

నేమఱక చనియెద లంక హితము నొనర్పన్

30.   

 

 

 

తే.గీ.

జానకీ దేవి లంకను జాడ తెలియ

కున్న నేఁగెద నవ్వేగ మొప్ప దివికిఁ

జూడ కున్న నచ్చట నింక సుదతి సీతఁ

దెచ్చెద దశకంఠు నట బంధించి వేగ

31.    

 

 

 

మ.

కృత కార్యద్యుతి తెత్తు భూమిజను శంకింపంగ రాదేరికిన్

నత శీర్షార్తు సలంక రావణుని విఘ్నం బైనచోఁ దెత్తు నీ

గతి నౌన్నత్యపు సుద్దులం బలికి వేగం బూని లంఘించెఁ దా

మతిఁ బక్షీంద్రుగ నెంచి వాయుజుఁడు సంభావ్యుండు నిర్బీతిగన్

32.   

సీ.

 

 

 

 

 

 

 

శైలసాలమ్ములు సర్వ శాఖా యుత

            మెగసె వేగమ్మున నిందు నందు

విమలాభ్రమం దీడ్చె వింతగ నూరు జ

            వమ్మున సబక పుష్పభర తరుల

నూరు వేగోద్ధతి నొడఁగూడెఁ దరులెల్ల

            సాగనంపెడి బంధు జనము రీతి

భీమ సాలాదులు వెకలి తరలె మహీ

            పతి వెంట జను సైన్య పటల మనఁగ

 

 

 

 

తే.గీ.

పుష్ప సహిత విటపముల భూరి వృక్ష

జాలములఁ గూడి పర్వత సన్ని భుండు

దర్శనం బిచ్చె నత్యద్భుతమ్ముగను గ

పీంద్రుఁ డప్పుడు గుప్పించి యెగురు వేళ

33.   

 

 

 

కం.

ఘన నగ రాజములు మునిఁగె

వననిధిఁ గపివర పథానువర్తులు సక్రం

దన వజ్ర భయార్త ఘన త

ర నగేంద్రములు జలరాశి లయమైన క్రియన్

34.   

 

 

 

కం.

కుసుమాంకుర నవ ముకుళ వి

లసిత హరి జలద నిభుండు రాజిల్లెను దా

నసమాన రుచిధ్వాంతమ

ణి సమాహిత ఘన శిఖరి మణి సదృక్షంబై

35.   

 

 

 

కం.

పువ్వుల నెల్లన్ రాల్చుచు

దవ్వుల కేగి జవ విగళితంబై ఘోరం

బవ్వనధిఁ గూలె నగముల్

నొవ్విని మఱలెడు సుహృజ్జనుల వలె నపుడున్

36.   

 

 

 

కం.

కపి వరుని గమన వేగపు

టపూర్వ వాయువు వలన కుటావలులన్ వీ

డి పయోధిఁ బడ కుసుమములె

యపు డబ్ధి యలరెను దార కావృత దివిగన్

37.   

 

 

 

తే.గీ.

చిత్రపు టలరు గము లల చేరి ప్లవగ

వరుఁడు భాసిలె సాశని వారిదముగ

నుదిత కపివేగ పతిత సుమోదధి గన

నలరె నప్పుడు తారోది తాంబరముగ

38.   

 

 

 

తే.గీ.

కపివరు గగన మందలి కర యుగళము

గోత్ర నిష్క్రాంత పంచాస్య కుహనము లనఁ

దోఁచె హరి తృష్ణ సలహరి తోయరాశి

నంబరమ్మును  ద్రాగున ట్లగపడె నట

39.   

 

 

 

తే.గీ.

వాయు తనయుండు స్థిరమతి వాయుపథ వి

హారి విద్యుద్రుచి నిభాక్షు లలరె నమిత

తేజమునఁ బర్వత శిఖర దేశ మందు

మండు చున్నట్టి మేటి రెండగ్ను లనఁగ

40.   

 

 

 

చం.

కపివరు పింగ లాక్షములు కాంతుల నెంచఁగ సూర్యచంద్రులే

యపరిమితంపుఁ గాంతులను నద్భుత రీతిని సంధ్య యందునం

దపనునిఁ బోలె వాయుజుఁడు తామ్ర ముఖమ్మునఁ బింగ లాక్షులన్

విపుల హరీంద్ర వాలము దివిప్రభు సుధ్వజమై విరాజిలెన్

41.    

 

 

 

తే.గీ.

 

ధవళ దంతావళి ననిలాత్మజుఁడు దనదు

చుట్ట చుట్టిన పుచ్ఛము సుందరముగ

నమర మండలము కరణి యంబరమణి

భంగి విలసిల్లెఁ గన మహాప్రాజ్ఞుఁ డపుడు

42.   

 

 

 

కం.

అరుణ నితంబ విరాజిత

హరి శార్దూల ముపమింప నాశ్చర్యముగన్

గిరి రా జగును విఱిగిన గ

వరన రుచి వెలుంగు ధాతు పంక్తుల వలనన్

43.   

 

 

 

తే.గీ.

సాగరము నల లంఘించి చాగు వేళ

వానరేంద్రు దోర్మూలము వాసి చనెడు

వాయు వతి ఘోర ఘోషము వారి ధరపు

గర్జనము భంగి వినిపించెఁ గర్కశముగ

44.   

 

 

 

కం

నభమున నుత్తర దిక్కున

గభీర గతి జాఱు తారక సదృశమున నా

యిభ నిభ వానర వీరుఁడు

ప్రభా కలితమై తనరెను లంఘన మందున్

45.   

 

 

 

ఆ.వె.

అస్త నగము వాఱు నంబరమణి నిభుఁ

డా హరిప్రవీరుఁ డలఘు యశుఁడు

మేను బెంచి దాట మీరముఁ జూపట్టెఁ

గక్ష్య బద్ధ భీమ గజము వోలె

46.   

 

 

 

కం.

సాగరము పయి శరీరము

సాగర మందుఁ దన నీడ సాగుచు నుండన్

వేగపు గాలికిఁ గదలెడు

నాగాభుఁడు కపివరుండు నావగఁ దోఁచెన్

47.   

 

 

 

కం.

ఏయే తావుల కేఁగిన

వాయు సుతుండు జలరాశి పై వేగముతో

నాయా స్తలమ్ము లందుం

దోయధి సుడులును నురుఁగుల తోఁ గనిపించెన్

48.   

 

 

 

కం.

శైల నికాశ చలోర్మిక

జాలముల నురమ్ము తోడఁ జఱచుచు వేగన్

సాలావృక మృగరాజము

హేలాగతి సాగె నపు డహీన జవమునన్

49.   

 

 

 

కం.

భీమబలుఁడు కపి గమనో

ద్దామ రయము మేఘ మారుతస్వనములచే

నీ మీనాలయ మెల్లన్

వేమరు కంపించె నంత భీతి జనింపన్

50.   

 

 

 

తే.గీ.

లవణ తోయధి భంగ జాలమ్ము లెల్ల

వింతగ నల నాకర్షించి వీఁకఁ జిమ్ము

రీతిఁ దోఁచె నాకమ్మున నాతతముగ

నెగురు వేళ ధీరుండు కపీశ్వరుండు

51.    

 

 

 

ఆ.వె.

పైకి లేచు నట్టి భంగములను మేరు

మందర సమముల విమల జలనిధి

మీఁద హరివరుఁడు వినోదియై తా లెక్క

పెట్టు రీతి తోఁచె విస్మయముగ

52.   

 

 

 

ఆ.వె.

ఆకసమున విపుల మైన శారద మేఘ

జాలము వలె నొప్పె జలద సహిత

జలము లేవ వాయుజాతుని వేగపుఁ

గారణమ్మున నటఁ గాంచు నపుడు

53.   

 

 

 

కం.

తిమి నక్ర కూర్మ ఝష జా

లములు జల చరమ్ము లెల్ల లవణాంబుధిలో

గములై వశ్త్ర విహీన జ

నముల విధముగఁ గనిపించినవి తెల్లముగన్

54.   

 

 

 

తే.గీ.

వ్యోమ మార్గము నందున భీమ కాయు

నట్లెగురుచు నున్న కపీశు నరసి వనధి

తోయముల నున్న పన్నగ కాయము గరు

డుఁ డని మది భ్రాంతి నొందుచు నడరి చెదరె

55.   

 

 

 

కం.

వానర సింహపు శైల స

మాన శరీరంపు ఛాయ మానుగను వెడ

ల్పైనది దశ యోజనములు

నా నిడు పది మూడు పదుల నమరె లలితమై

56.   

 

 

 

మ.

హరి వీరానుగ మాతతంపుఁ బ్రతిబిం బాకార మంభోధిఁ నె

ల్లర కచ్చోట ముదంబు గొల్ప ధవ ళాభ్రశ్రేణిగం దోఁపఁగం

దరణాసక్త సుభీమ దేహుఁడు నిరాధారుండు వ్యోమంబునన్

విరిసెం బక్ష యుగంబు తోడ నల పృథ్వీభృత్తు రూపమ్మునన్

57.   

 

 

 

తే.గీ.

ఈ మహాబలుఁడు కపివరేభ మెందుఁ

జనిన నందు శీఘ్రమ మహా సాగరమ్ము

ద్రోణియై కనిపించె వీరుని గమన ర

యంపుఁ గారణమ్మున జల మంత యుబికి

58.   

 

 

 

ఆ.వె.

పక్షి మార్గ మందుఁ బయనించి మారుతి

వైనతేయు భంగిఁ గానిపించె

మేఘ జాలము నల లాఘవమ్మును జూపి

లాగు చుండె గాలి లాగు నట్లు

59.   

 

 

 

కం.

ఆకర్షింపఁ గపివరుం

డా కాలసితారుణ మయమై మాంజిష్ఠా

నేకాలఘు వర్ణాభ్రము

లాకాశమునఁ జెలరేఁగె నధికప్రభలన్

60.   

 

 

 

కం.

మఱిమఱి తూఱుచు వెడలుచు

నెఱి దప్పక మేఘములను నేర్పు చెలంగం

బఱఁగెను గపికుంజరుఁ డ

త్తఱి దృశ్యాదృశ్య చంద్రుఁ దలపింపంగన్

61.    

 

 

 

చం.

కురిసిరి పుష్పవర్షము నిగూఢ నిలింపులు దానవేంద్రులుం

దరణియుఁ దాప మీయఁడు నిదానము వీచెను వాయు వత్తఱిన్

స్థిరముగ రామకార్య రతిఁ దృప్తి నుతించిరి మౌను లెల్లఁ బా

డిరి సుర గాయనుల్ హనుమ ఠీవిగ వారిధి దాఁటు నప్పుడున్

62.   

 

 

 

తే.గీ.

అశ్రమమున నెగురు మారుతాత్మజుఁ గని

యా క్షణంబ విస్మయమున యక్ష నాగ

రాక్షసామర శ్రేష్టులు పక్షి రాజ

గణము సంతస ముప్పొంగఁ బ్రణుతు లిడిరి

63.   

 

 

 

తే.గీ.

వనధి ఘన రఘు  వంశ సంవర్థ నార్థి

హనుమఁ బ్లవగ శార్దూలము నచ్చటఁ గని

తలఁచె నిట్లు సాహాయ్య మీతనికి నిపుడు

సేయకున్న నిందింపరే చేరి జనులు

64.   

 

 

 

తే.గీ.

సగరుఁ డిక్ష్వాకు వంశాబ్ధి చంద్రుఁ డతడు  

వృద్ధి నిడె నాకు నిక్ష్వాకు నృప సచివుఁడు

హరి వరేణ్యుఁ డీతం డిట నార్తిఁ జెంద

రాని యట్టి విధ మొనర్తు రాగ మొప్ప

65.   

 

 

 

కం.

సరసముగఁ గొంత తడ విట

విరామ మీయ వలయుఁ గపి వీర వరునకున్

సరమ తొలగిన రయమ్మునఁ

జరించు శేషాధ్వ మింక సౌఖ్యము తోడన్

66.   

 

 

 

కం.

మది నీరీతి సముద్రుఁడు

గుదురుగఁ దలఁచి వచియించెఁ గుధర వరముతో

నుదధిస్థిత మైనా కా

సదృశ కనక గర్భ శైల సత్తము తోడన్ 

67.   

 

 

 

తే.గీ.

అద్రి రాజ! పాతాళము నందు నున్న

దైత్య సంఘముల కవరోధముగ నుంచ

నిన్ను బర్జన్యుఁ డసురుల నిర్భయముగ

నాప నిల్చితి ద్వారము నందు బలిమి

68.   

 

 

 

తే.గీ.

ఊర్ధ్వ ముఖ మధోముఖము లనూహ్యముగ ని

రు దిశలను వృద్ధిఁ జెందు నేర్పు గల దయ్య

నీకుఁ బూనింతు నయ్యది నాకుఁ దెలియఁ

బర్వ తోత్తమ లెమ్ము నా వాక్కులు విని

69.   

 

 

 

ఉ.

భీకరమైన కార్యమున వేలుపు త్రోవను నగ్ర గామియై

యీ కపి రామకార్యమున నేఁగుచు నీపయి వచ్చుచుండె ని

క్ష్వాకు కులానువర్తి సహకార మవశ్యము సేయ నోపునే

నాకును బూజనీయము ఘనప్రవ రమ్మది యెంచ నీకునున్

70.   

 

 

 

మ.

ఉపకారమ్మును జేయ వేఁడెదను బ్రత్యూహమ్ము కాకూడ దిం

త పనుల్ సత్యము సేయకున్ననిలఁ గర్తవ్యంపుఁ గార్యంబులే

యపరాధమ్మయి సచ్చరిత్రులకుఁ గ్రోధాధిక్య మూలం బగుం

గపి సేవార్థము పైకి లెమ్మిపుడు వేగం దోయముల్ వీడుచున్

71.    

 

 

 

కం.

కపివరుఁ డతిధి మన కిట న

తి పూజ నీయుండు నుపకృతికి నర్హుఁడు దా

నపరంజి బొజ్జ! నీ దగు

నుపరితలమున నిలుచుండ నూఱట కలుగున్

72.   

 

 

 

తే.గీ.

విశ్రమించి కొంత తడవు నశ్రమమునఁ

బ్లవగ పుంగవుండు పవన వర సుతుండు

పయన మొనరించు నిఁక శేష పథము దనరి

దేవ గంధర్వ సేవిత దివ్య నగమ!

73.   

 

 

 

తే.గీ.

రాఘవేంద్రుని చరిత గుణౌఘములను

జానకీ వివాసన ఘన సంకటమును

వీర వానర కేసరి వేసరమును

దలఁచి గిరివర పైకి రావలయు నీకు

74.   

 

 

 

ఉ.

ప్రాకట వార్ధి భాషణము లన్విని భీమ సువర్ణ నాభ మై

నాకుఁడు వల్లరీ ద్రుమ గణమ్ముల తోడను లేచెఁ దూర్ణమున్

వీఁక జలమ్ము నుండి వన భేదన మింపుగఁ జేయ భాసిలెన్

నాకము నందు దీప్తి దిన నాథుని తోయద భేదనద్యుతిన్

75.   

 

 

 

ఉ.

అంబుధి శాసనమ్మున మహా గిరి రాజు జలావృతమ్ము తా

రాంబర చుంబితమ్మనఁగ నద్రి శిఖావలి కిన్నరోర గా

లంబన రాజితమ్ముగ మహాద్భుత దర్శన మిచ్చె నా ప్రభా

తాంబర రత్న సన్నిభము హాటక సంకలితంబునై యటన్

76.   

 

 

 

తే.గీ.

కంద రాక రోత్థితములు కడలి నుండి

తప్త కాంచన నిభ శృంగ తండ రుచిని

శస్త్ర సంకాశ నాకమ్ము సంతరించు

కొనెను గాంచనప్రభలను దనరి యంత

77.   

 

 

 

తే.గీ.

జాతరూప మయమ్ములు శాత శృంగ

షండములవి స్వయం ప్రభా మండితములు

వాని రుచుల నాపర్వత వరుఁడు వెలిఁగె

సూర్య శత సమానమ్మున శోభ లందు

78.   

 

 

 

కం.

ఆకస్మికముగ గిరి లవ

ణాకూపారమ్ము మధ్య నవిరళ రీతిం

బై కెగయ నవాంతర మని

యా కపిసత్తముఁడు దలఁచె నంత ధ్రువముగన్

79.   

 

 

 

తే.గీ.

ఇవ్విధిఁ దలఁచి మారుతి యవ్వన నిధి

లోనికిం ద్రోసె నగమును రోషమునను

బేరురమ్మునఁ గదలుచు వేగముగను

మబ్బు లెల్లను దొలఁగించు మారుత మన

80.   

 

 

 

ఆ.వె.

వాని చేత నట్లు పతనమై నగరాజు

మది నెఱిఁగి కపివరు మహిత జవము

సంతసించె మఱియు సన్నుతించె నపుడు

రామ కార్య భార రాగ పరుని

81.    

 

 

 

ఆ.వె.

అల నిలిచి నిజ శిఖరాగ్రమునఁ బలికె

నూని శైలరాజు మానవాకృ

తి కపివీరు ఘనుని ధీరవరేణ్యు న

భస్స్థితు నరసి సముపగతుఁ డగుచు

82.   

 

 

 

తే.గీ.

దుష్కర తర కార్యం బూని తోయనిధిని

దాఁటు చుంటివి వానరోత్తమ యిట దిగు

నాదు శిఖర మందున పవన తనయ యిఁక

విశ్రమింపు కొంత తడవు ప్రీతి తోడ

83.   

 

 

 

ఉ.

రాఘవు వంశ పూర్వికుల ప్రాభవ వర్ధిత మీ పయోధి నీ

వా ఘను కార్యసాధక విహర్తవు ప్రత్యుపకార మెంచె ను

ల్లాఘ పయోధి నీకిటఁ బురాతన ధర్మము కర్త కింపుగన్

మోఘ విహీన కర్మములు మూరగఁ బ్రత్యుపకారమే గదా

84.   

 

 

 

తే.గీ.

యోజన శతము దా ప్లవగోత్తముండు

దాఁట నెంచెను గాన నతనిని నీదు

సాను తలములఁ బయనపు శ్రమము దీర

నిలిచి యేఁగు మన జలధి నిలిపె నన్ను

85.   

 

 

 

తే.గీ.

అట్టి సన్మతి తోయధి నర్హ మగును

నీకు గౌరవింపఁ గపీశ నియమితుండ

నైతి నే నతని వలన నరుగు సేద

దీరి నాదు తలమ్మున ధీర చరిత!

86.   

 

 

 

తే.గీ.

బహుళముగ కల విచ్చట పరిమళంపు

స్వాదు కంద మూల పరిపక్వ ఫలము లవి

యాస్వదించి ముదమ్ముగ హరి వరేణ్య

సుంత విశ్రాంతి గైకొని యంతఁ జనుమ

87.   

 

 

 

కం.

హరి వీరాగ్ర్య కలదు మన

మిరువుర మధ్యను జగమ్ము లెఱిఁగిన  సుగుణౌ

ఘ రతానుబంధము ప్లవగ

వరుల వరిష్ఠుఁడవు నీవు ప్లవగేభమ్మా!

88.   

 

 

 

తే.గీ.

జ్ఞానవరులకు ధర్మ జిజ్ఞాసులకును

బూజనీయుఁ డగు నతిధి తా జనాల్పుఁ

డైనను భవత్సదృశ సుగుణాఢ్యుఁ జెప్ప

నేల మారుతాత్మజ! వానరేశ! యింక

89.   

 

 

 

తే.గీ.

వాయు దేవు మహాత్ముఁడ మేయ బలుని

సూనుఁడవు నిజ జనక సమాన వేగ

భాసితుండవు పూజింపఁ బ్లవగ నిన్ను

ననిలున కగుట మత్పూజ కర్హుఁడ విట

90.   

 

 

 

తే.గీ.

కారణం బొండు విను కపి వీరవర్య!

మున్ను కృతయుగమ్మున రెక్కలున్నవి గిరు

లకును దిశలెల్ల గరుడానిల జవ తేజ

మునఁ దిరుగు చుండెడివి దర్పమున ననిలజ!

91.    

 

 

 

చం.

పయనము సేయు నాకమునఁ బర్వత సంఘముఁ గాంచి నంత దే

వ యమి నికాయ భూతములు పాత భయంపు విశంకఁ జెందఁగన్

నయన సహస్ర దేవపతి నాగ పతత్రము లెల్లఁ గ్రోధియై

వెయి గనెలై చెలంగ భువి వ్రేసెను భీకరమైన వజ్రమున్

92.   

 

 

 

ఉ.

ఆ క్షణమందు నన్ను గని యయ్యమ రేంద్రుఁడు నుద్యమింప నన్

రక్షితుఁ జేసె వాయువు పరాక్రమ మేర్పడఁ ద్రోసి తోయధిం

బక్ష సురక్షితమ్ముగ నపార కృపారస సిక్త శీతముల్

వీక్షణముల్ నిగుడ్చుచు నభీతునిఁ జేసెను నీ గురుం డిటన్

93.   

 

 

 

కం.

బహు పూజనీయుఁ డనిలుం

డు హరివరేణ్య కల దుగ్గుడు వినుము నీ పై

న హృదయ మం దక్కతనన్

బహు గుణవంత మగును మన బంధ మిటఁ గనన్

[ఉగ్గుడు = మర్యాద]

94.   

 

 

 

తే.గీ.

కార్య మీగతి సాగ సాగరుని నన్ను

బ్రీతి సంప్రీతులను జేయ నీతి యగును

వానరేంద్ర! మా పూజలు వడసి సేద

దీరి మన్నింపు నిను గనఁ దృప్తి కలిగె

95.   

 

 

 

తే.గీ.

శైల రాజు పల్కుల కెల్ల సంతసించి

పలికెఁ గపిరాజు నగరాజ! పడసితి నిటఁ 

ప్రీతి నాతిథ్య మెల్లను విడువుఁ డీ వి

చారము ముద మొదవె మీ వచనములు విన

96.   

 

 

 

తే.గీ.

కర్జము తఱుము చున్నది గడచు చున్న

దహము వూనితి పంతము నాగ దగదు

నడుమ నెందును నగరాజ! నాకు నిట్లు

పలికి హరి చేత గిరిఁ దాఁకి చలిపె యాత్ర

97.   

 

 

 

తే.గీ.

పర్వ తార్ణవములు కపివర్యు గౌర

వంపు దృక్కులఁ జూచిరి యింపు తోడ

స్వస్తి వాచకములు వల్కి సచ్చరితులు

పూజ చేసిరి భక్తిని ముదము తోడ

98.   

 

 

 

తే.గీ.

అంత వాయు నందనుఁడు మహార్ణ వాగ

ములను వీడి మహోన్నతములకు నెగిరి

విమల నభమున నా వాయు వీథి నేఁగె

నూత లేక గిరి వరుని యునికిఁ గనుచు

99.   

 

 

 

కం.

హనుమంతుని దుష్కర మగు

పనిని ద్వితీయమును గాంచి పరమాద్భుతమున్

మునివర సుర సిద్ధాదులు

ఘనముగఁ బొగడిరి కపివరు గగన తలమునన్

100.                

 

 

 

కం.

ఆనందితు లైరి సురలు

మైనాకుని చర్య గాంచి మఘవుని తోడన్

నానా ధాతు సునాభుని

వానర సేవా రతస్వభావుని గనినన్

101.  

 

 

 

కం.

దేవాధిపుఁ డా యింద్రుఁడు

గ్రావ వరేణ్యుని సునాభుఁ గాంచి స్వయమునం

దా వర వచనములఁ బలికె

ధీవరుఁ డల గద్గదుఁ డయి తృప్త మనమునన్

102.                

 

 

 

తే.గీ.

తోషితుఁడ నైతి భృశము సంతోష మలర

నభయ మిచ్చితి నీకిట నగమవర! హి

రణ్య నాభ! సుఖము దనరంగ నుండు

మిచట భయమెల్లఁ ద్యజియించి యింక నెపుడు

103.                

 

 

 

చం.

భయము నెఱుంగ నట్టి ఘను వానరు విక్రము భీతి శంకచే

రయమున సాహ్యమున్సలుప లంఘన కామినిఁ గొల్చితీవు ని

ర్భయముగ రామ కార్యమున వారిధి యోజనముల్ శతమ్ము దా

నియతిని చేసె దాఁటఁ గడు నేర్పున సంతస మయ్యె శైలమా

104.                

 

 

 

ఆ.వె.

విపుల హర్ష మొంది వేల్పుఱేనిఁ బరితు

ష్టుని శతక్రతు నటఁ జూచి యగమ

వరుఁడు దత్తవరుఁడు పర్వతోత్తముఁ డుండెఁ

గపి వరుండు దాఁటెఁ గడలి నంత

105.                

 

 

 

తే.గీ.

అంత దేవ గంధర్వ సిద్ధాదులు ముని

వరు లరసి సురస నిననిభ నురగ గణ

మాతఁ బల్కిరి ట్లెల్లరు మారు తాత్మ

జుం డితఁడు హనుమంతుఁడు సూడు మమ్మ

106.                

 

 

 

తే.గీ.

కడలి పైనెగురు చునున్న కపి వరేణ్యు

నడ్డ గింపు సుంత తడవు నసుర రూప

ము కుధర నికాశము సుఘోరము నభ తుల్య                             

ముఖము భీమ దంష్ట్రము లెఱుపు కను లడర

107.                

 

 

 

ఆ.వె.

బలము తేజ మెఱుఁగ వలనన్న తలఁపున

నున్న వార మెల్ల ఖిన్నుఁ డౌనొ

యతఁ డుపాయ మెంచి యరయునొ విజయమ్ము

సురస మాకుఁ దెలియఁ జూపఁ దగును

108.                

 

 

 

ఆ.వె.

అమర భాషణమ్ము లాదరించి వినతు

లంది యసుర రూప మవతరించి

కడలి మధ్య నిలిచి కపివరునిఁ గదిసి

పలికె వికృత సురస పరుషముగను

109.                

 

 

 

తే.గీ.

భయద రూపమున సురస వలికె నిట్లు

వానరేశ్వర సురదత్త భక్ష్య మీవు

సేరు నావదనము దనిసి భుజియింతు

నాపలుకుల కనియె వినయ మలర హరి

110.  

 

 

 

తే.గీ.

అంజలి ఘటించి ముదమున నా హరీశ్వ

రుండు చెప్పఁ దొడంగె రాముండు దాశ

రథి యనుజుఁడు లక్ష్మణుని భార్య ధరణిసుతఁ

గూడి దండకావని నుండ వేడుక నట

111.   

 

 

 

కం.

అసుర విరోధనమునను నృ

ప సుతుఁడు సన నన్య కార్య వశమున ధరణీ

జ సతీ సీత నపహరిం

చి చనెను దశకంఠుఁ డంత జిత కార్యుండై

112.  

 

 

 

ఆ.వె.

రామ శాసనమున రమణీమణి సకాశ

మేఁగు వాఁడ నేను వేగముగను

దేశ వాసి వతివ తీరైన సాహ్యము

సేయఁ దగును నీకు శ్రేయ మెంచి

113.  

 

 

 

కం.

కాదేని మైథిలిం గని

నా దేవుని రాముఁ గని యనల్పద్యుమ్నున్

నీ దరి వత్తుఁ బ్రతిన యన

నా దేవి సురస వరకపి కనియెం గడిమిన్

114.  

 

 

 

కం.

నను దాఁటి పోవ నేరినిఁ

గనము వరంబిది కపీశ కంజజు వలనం

జను తూఱి నాదు వక్త్రము

ఘను బల మెంచఁగఁ దలంచి కామాంగి యనెన్

115.  

 

 

 

తే.గీ.

నాఁ బలికి నాగమాత ఘనముగఁ బెంచి

వక్త్రము గమనోద్యుక్తుని వానర వరు

నెదుట నిలిచె నపుడు భయ మేర్పడఁగను

సురసఁ గని కోపమున ననె హరి వరుండు

116.  

 

 

 

తే.గీ.

నన్ను భరియింప వలె నన్న మిన్న చేయు

మమ్మ నీదు వక్త్రమ్మని హరి వరుండు

పెరిగె దశయోజనమ్ములు విరివి పొడవు

నంతియ త్రుటిని విస్మయం బలర నంత

117.  

 

 

 

సీ.

 

 

 

 

యోజన దశపు వాయు సుతు నభ్రాభ కా

            యుఁ గని తాల్చె ద్విదశ యోజనములు

సురస వక్త్రము కపివరుఁ డయ్యె మూడు ప

            దులు నవి నాల్గు పదు లయిన ముఖ

మైదు పదులు హరి యయ్యె యోజనములు

            నాఱు పదులు వక్త్ర మయ్యె నవియ

యేడు పదులు కపి యెదుగ యోజనములు

             నవియ యెనుబదియు నయ్యె నాస్య 

 

 

 

 

తే.గీ.

మంత హనుమంతుఁడు పెరిగె వింత కొలుప

యోజనములు తొంబది వక్త్ర ముత్తమముగఁ

బెంచె నాగ జనని యుద్యమించి యంత

యోజన శతము నాహరి యోధునిఁ గని

118.  

 

 

 

చం.

నరక సమాన వక్త్రము ననర్గళ వర్ధిత దీర్ఘ జిహ్వయున్

వర సురసా సతీ మణిని వానర వీరుఁడు సూచి యంతటన్

స్తిరముగ నంగు ళాభముగ దేహము దాల్చి గళమ్ము దూఱి తాఁ

ద్వరితము నిష్క్రమించి యనెఁ దాల్మిని నంబర మందు నిల్చియున్

119.  

 

 

 

కం.

చొరఁబడితి భవద్వక్త్ర మ

తి రయమున సదమల మతి నుతింతును నీ యీ

వరము నిజ మయ్యెను గదా

యరిగెద దాక్షాయణి! యిఁక నవనిజ కడకున్

120.                

 

 

 

.

రాహు విముక్త సోమ నిభ రంజిత వానర వీరు తోడ సం

దేహము తీర మోదమున దేవి నిజాకృతిఁ దాల్చి పల్కెఁ దా

నో హరి! సింహవిక్రమ! గుణోత్తమ! కార్య ఫలార్థ మేఁగు వై

దేహినిఁ గూర్పు రామునకు ధీర వరేణ్య! యథేచ్ఛ నింపుగన్

121.  

 

 

 

కం.

దుష్కర కార్య తృతీయము

నిష్కపటముగ నొనరింప నిజ వీర్య ఘనా

విష్కరణమ్మునఁ గ్లేశ ప

రిష్కరణము సురలు వొగిడిరి పవన తనయున్

122.                

 

 

 

తే.గీ.

దుర్జయ వరుణాలయమును దోయధి నటఁ

జేరి యెగసి నభో వీథి చిత్త మలర

వైనతేయుఁ బోలుచు జవప్రాభవమున

వేగముగఁ జాగె ధీర కపి ప్రవరుఁడు 

123.                

 

 

 

సీ.

 

 

 

వారి ధారౌఘ సంపాతము ద్విజగణ

            చరితమ్ము కైశికాచార్య యుతము

సిత సామజ వర సంసేవితమ్ము మృగేంద్ర

            వారణ శార్దూల పతగ సర్ప

వాహ నాలంకృత వర విమాన విచరి

            తము వజ్రనిర్ఘాత తరళ వహ్ని

సంశోభితము పుణ్యచరిత దివి జిత మ

            హాభాగ పటల విహార తలము

 

 

 

 

తే.గీ.

హవ్య యుత చిత్రభాను సమాశ్రితమ్ము

తారకా గ్రహ చంద్రార్క తరళ తరము

యక్ష గంధర్వ నాగ మహర్షి గణ స

మాకులము వివిక్తము విమలాంచితమ్ము

124.                

 

 

 

తే.గీ.

శివ మఖిలము విశ్వావసు సేవితమ్ము

దేవరాజ గజాక్రాంత దివ్య తలము

చంద్రసూర్య సన్మార్గము జన రహితము

నీరజాతసంభవ ఘన నిర్మితమ్ము

125.                

 

 

 

తే.గీ.

వీర విద్యాధర గణ సేవితము సంత

తమ్ము వాయు మార్గము సంతసమ్మునఁ గపి

పుంగవుండు గరుత్మంతు భంగిఁ జేరి

చాగు చుండెను మారుతి వేగముగను

126.                

 

 

 

తే.గీ.

హనుమ మారుతాత్మజుఁడు నిరాశ్రయుండు

నంబరమున దృశ్య మగుచు నంత టెల్ల

రకును విలసిల్లె నాతఁడు లంబ పక్ష

శైలరా డ్భంగిఁ బయనమై చాగుచుండ

127.                

 

 

 

ఆ.వె.

కామ రూప భామ బీమ కాయము జేసి

సింహి కాభిధ కడుఁ జింత సేసె

రక్కసి మన మందు నక్కజముగఁ గాంచి

భీమ కాయు హరిని వ్యోమ చరుని

128.                

 

 

 

తే.గీ.

కంటి నిమ్మహా సత్త్వము ఘన మశనము

నా కగును జువ్వె చిరకాల నందనముగ

నేడు సంతృప్తి కలుగు నని మది నెంచి

వానర చ్ఛాయను నొడిసి పట్టె నంత

129.                

 

 

 

ఆ.వె.

నీడ నట్లు లాగ నిజ వేగము గుదియ

పట్టు వడితి వింత గుట్టు నేరఁ

దలఁచె వానరుండు తరణికి మారుత

మెదురు వడిన నింకఁ గదలని క్రియ

130.                

 

 

 

ఉ.

అంతటఁ దిర్య గూర్ధ్వములు నంబుధి దిక్కునఁ జూచి యాతఁ డ

త్యంత భయాన కాంగి లవణాంబుధి నుత్తితనున్ విరూప న

క్కాంతను జూచి నీడలను గ్రాహము సేసెడి దైత్య కాంతగన్

వింత నెఱుంగ బల్క మును భేనజుఁడే మది నెంచె నత్తఱిన్

131.  

 

 

 

మ.

వర గోపుచ్ఛము సింహికాత్త నిజ తత్వం బెంచి సంరంభియై

విరివిం జేసెను వేగఁ గాయమును బ్రావృట్కాల మేఘక్రియన్

గురు దేహుండు కపీంద్రుఁ గాంచి జనితాక్రోశంబునన్ వక్త్రముం

ద్వరమా నోగ్ర విరూపి పెంచె వడిఁ బాతాలాంత రాభమ్ముగన్

132.                

 

 

 

చం.

పరుగున వాన రేంద్రు నుదవాహపు ఘోషము మించి యార్చుచున్

దరి వడి వచ్చి సింహికఁ దదాస్యము  దా నిజ దేహమాత్ర యం

తర మృదు మర్మ భాగముల దర్శన మింపుగ జేసె నంతటం

గరము వివేకియై పరఁగి కర్జము చిత్తము నందు నిల్పుచున్

133.                

 

 

 

తే.గీ.

వజ్ర కాయుఁడు ప్లవగ ప్రవరుఁడు సింహి

కా వివృత ముఖమ్మునఁ ద్రుటిఁ గాయ మించు

క యొన రించి తూఱె మరి యొక పరి సిద్ధ

చారణులు గన నగు వందుఁ జంద్రు పగిది

134.                

 

 

 

తే.గీ.

సునిశిత నఖాగ్ర దారిత శోణి తార్ద్ర

మర్మ భాగ గళిత జీవి మగువ సింహి

కను వనధిఁ ద్రోసి చలమునఁ గపి వరుండు

పైకి నెగిరె నంత మనోజవమ్ము మీఱ

135.                

 

 

 

తే.గీ.

అవ్విధి జలనిధిఁ బతిత మైనఁ గాంచి

ధృతిని దాక్షిణ్యమునఁ గాయ మతి ఘనముగ

వృద్ధిఁ జేసె హరి వరుండు వేగమునను

గగన చరిత భూత తతులు గాంచ నతని

136.                

 

 

 

తే.గీ.

హత మసురిఁ గని పల్కిరి హరి వరేణ్యు

నరసి గగనస్థితులు హత మయ్యె భీమ

దేహి ఘనకార్య మొనరించితివి తలఁచిన

కార్య మెల్ల సాధింపు మవార్యముగను

137.                

 

 

 

కం.

అనయము కర్మముల ఫలమ

గును దృష్టి ధృతి మతి దాక్ష్య గుణ చత్వారం

బును విరివిగ నేరికి నై

నను నీవలె నున్నను బవన సుతా! చనుమా

138.                

 

 

 

తే.గీ.

నుతుల నంది పూజ్యుఁడు మరుత్సుతుఁడు  లక్ష్య

ము నిడి మన మందుఁ జేరి గగనము పన్న

గాశన ప్రతీకాశము నచ్చెరువుగఁ

జాగి పారము కనిపింపఁ జాఁపెఁ జూపు

139.                

 

 

 

తే.గీ.

యోజన శతాంతమున వన రాజి వివిధ

తరు విభూషిత ద్వీప ముత్తమము మలయ

నికట వనముల నెగురుచునె కనెను గపి

పుంగవుం డట ముది తాంతరంగమునను

140.                

 

 

 

తే.గీ.

కడలి మున్నీటి చిత్తడి పుడమి నప్పు

డమినిఁ బుట్టిన చెట్లఁ గడలి సతీ ము

ఖములఁ గని కపిశ్రేష్ఠుఁడు గగనతల ని

రోధ నిజ మేఘనిభ దేహి మేధఁ దలఁచె

141.  

 

 

 

ఉ.

కాయము భీమ మివ్విధముఁ గాంచిన వేగము ఘోర దాన వా

మేయ కుతూహలమ్మగుట మేను గుదింపఁ దలంచె నత్తఱిం

దోయద తుల్య కాయమును దూర్ణము సేసెను బ్రాకృతమ్ముగన్

మాయల మారి మోహమును మాయము సేసెడి దాంతు కైవడిన్

142.                

 

 

 

తే.గీ.

హరి వరేణ్యుఁడు తిరిగి దేహ మగ నిభము

మానుగఁ గుదించి నిజ పరిమాణుఁ డైనఁ

దోఁచె బలి బలము హరించి తొల్లి తిరిగి

వడుగు రూపుఁ డైన గరుడ వాహను వలె

143.                

 

 

 

శా.

ఆ నానా విధ రూపధారి హరి కార్యామోద రూపమ్మునం

దా నా వారిధి పారముం గదిసి గర్తవ్యమ్ముఁ జిత్తమ్మునన్

వే నిక్షిప్తము సేసి దుష్కర తరంబే యన్యు లెవ్వారికిన్

నానా వృక్ష సమాకులంబున దిగెన్ నాణ్యంపు లంబాద్రినిన్

144.                

 

 

 

తే.గీ.

కేత కోద్ధాలక సనారికేళ ముఖ మ

హీరుహ సమృద్ధ శైల మహీన కూట

కూట మందు నవతరించెఁ బాటవమున

నా మహాత్ముఁ డద్రి సమానుఁ డనిల సుతుఁడు

145.                

 

 

 

తే.గీ.

దగ్గఱి జలధి తీరము దిగ్గునఁ గని

లంకఁ బర్వత శిరమందు జంక మృగ ఖ

గములు సడలించి రూపమ్ము కపివరుండు

డిగ్గె బర్వతమం దకుంఠితము నంత

146.                

 

 

 

తే.గీ.

పన్నగాసుర వర గణావాస వర మ

భంగ భంగ రాజి యుత మా వనధి దాఁటి

వారి రాశి పారము సేరి వాన రేంద్రుఁ

డంత నమరావతీ నిభ మరసె లంక

147.                

 

 

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నొకటవ సర్గము.

 

 

 

సుందర కాండము

సర్గము 2.

 

 

కం.

దురతిక్రమమా రత్నా

కరము సునాయాస ముఱికి కదిసి ప్లవగ శే

ఖరుఁడు త్రికూట మహీధ్ర శి

ఖర సంస్థిత లంకను గనె ఘన వీర్యమునన్

1.      

 

 

 

ఆ.వె.

అంత పుష్ప వర్ష మచ్చటఁ గురియంగఁ

దరు గళిత లతాంత తతులఁ దనరె

ముదముగ హరివరుఁడు పుష్పరాశి కరణి

పర్వ తాగ్రమం దఖర్వముగను

2.     

 

 

 

కం.

శత యోజనాబ్ధి దాఁట న

మిత విక్రముఁడు హరివరుఁడు మే నలసట యా

యత నిశ్వాసమ్మెఱుఁగడు

వితత బలాన్వితుఁ డతండు వీర్యాధికుఁడున్

3.     

 

 

 

తే.గీ.

యేఁ దరింతు యోజనము లనేక వంద

లేక ధాటి ననఁగ వింత యింత యగునె

శత మనఁగ నింక నించుక శంక యేల

శ్రమ నెఱుఁగక హరి దలఁచె శాంతముగను

4.     

 

 

 

ఆ.వె.

ఉచ్చలితుల లోన నుత్తమ ప్లవగుండు

వీర వరుల కెల్ల విభుఁడు వేగ

వంతు లందు మేటి పవన సుతుండు లం

ఘించి వనధిఁ జేరె నెంచి లంక

5.     

 

 

 

తే.గీ.

హనుమ చరియించె రయమున వనము మధ్య

పచ్చిక బయలులు ముదురు పచ్చ రంగు

నమర గంధము వెదల్ల నంత నంత

గండ శిలలు తరువు లుండ మెండు గాను

6.     

 

 

 

తే.గీ.

వృక్ష షండ సంఛాదిత విస్తృ తాద్రు

లందు వివృత పుష్ప వనము లందు సంచ

రించి చనుచు నా హరివరుం డంచితముగఁ

గాంచె లంకా పురముఁ బరాక్రముఁడు ఘనుఁడు

7.     

 

 

 

తే.గీ.

దేవదారులు నారింజ తేట మామి

డి మొగలి యరఁటి తరులు కడిములు కొండ

గోఁగులు మిరియపుఁ దరులు కోవిదార

ములును గన్నేరు వేగిసల్ ముద్దు గొలుప

దబ్బ చెట్లును ఖర్జూర తరువు లెల్ల

8.     

 

 

 

ఆ.వె.

ముకుళ కుసుమ భారమున వంగిన మహీజ

రాజి విహగ గణ విరాజితమ్ము

పవన చలిత శిఖర పాదప వ్రాతము

సర్వ కాల సఫల ససుమ తరులు

9.     

 

 

 

తే.గీ.

హంస కారండవ జలవిహంగ షండ

సంగత నలినాకర జలాశయ చయముల

వివిధ రమ్యోప వనముల విమల విహర

ణాంగణముల వాపులఁ గనె హరివరుండు

10.    

 

 

 

సీ.

 

 

 

 

శుభగుఁడు హరి మరుత్సుతుఁడు సమీపించి

            లంక నట పరిఖాలంకృతమ్ము

పద్మోత్పల యుతమ్ము బాణాసన ధరాసు

            ర సురక్షితమ్మును రావణాసు

ర సుపాలితమ్ము ధరణి జాపహరణ కా

            రణ కృతాధిక పరి రక్షణమ్ము

భర్మ తటిత్సాల పరివృతమ్ము మహాపు

            రమ్ము శారద కంథర నిభము లగు

 

 

 

 

తే.గీ.

గ్రహ నికాశ గృహ నికాయ రాజి తమ్ము

పాండ రోన్నత సమ్మర్ధ పథ యుతమ్ము

రాజ గృహ శతాధికము తోరణ యుతమ్ము

ధ్వజ పతాక పరంపరా భాసితమ్ము

11.    

 

 

 

తే.గీ.

దివ్య కాంచన వర్ణ చిత్రిత లతా వి

తాన తోరణ గణ బాసిత పుర వరము

దివిని వెలుఁగొందు నట్టి యా దేవ రాజ

పురముఁ బోలు లంకా పురము గనెను హరి

12.    

 

 

 

ఉ.

శైల వరాగ్ర భాగ సమ సంస్థిత పట్టణ శోభనమ్మటన్

మేలగు సౌధ రాసుల నమేయపుఁ బాండర కాంతు లీనెడిం

బాలిత మా దశానన సుబాహు బలమ్మున విశ్వకర్మ చే

నీలపు టాకసమ్మొలయ నిర్మితముం గనె నంత లంకనే

13.    

 

 

 

తే.గీ.

తమిఁ బ్రహరి కోటలు కటిస్థలములు నగడి

త జలము వలువలు శిత శతఘ్నశూల

ములు జడ ముడు లనగ సౌధము లవతంస

కములఁ బోలఁ గట్టెను విశ్వకర్మ లంక

14.    

 

 

 

తే.గీ.

అట్టి లంకా పురప్రతీహార ముత్త

రమ్ముఁ జేరి చింతించెఁ గరమ్ము హరి వ

రుండు కైలాస శిఖర గురు తర మంబ

ర తల చుంబితము భాసురమ్ము గిరిని

15.    

 

 

 

సీ.

 

 

ఉత్తుంగతర భవనోత్తమములు నభః

            ప్లవమానములు దైత్య భరము లెల్ల

నాగ గణావాస నగరమ్ము భోగవ

            తీ నిభము కుబేర తిలక గృహము

పూర్వ మనూహ్య మఖర్వ సుకృతము సు

            రక్షితము భయ దంష్ట్ర యుత ముఖ వి

లసి తాసుర వర శూల శిత పట్టిస పాణు

            ల ఘన శూర వరేణ్యుల వలన నిల

 

 

 

 

తే.గీ.

గురు విషాహి సురక్షిత గుహను బోలి

లంక కల రక్షణ మొసఁగు లవణ జలధి

ఘోర రిపు రావణుఁ దలఁచి ధీరుఁ డా హ

రి వరుఁడు తలపోసె మది విరివిగ నంత

16.    

 

 

 

కం.

ఇహమున నాజి జయించుట

మహానగర మరుదు సుమి యమర గణములకై

న హరివరు లెల్ల వచ్చిన

నహీన బలమున నిరర్థ కార్థులు కారే

17.    

 

 

 

ఆ.వె.

దుర్గమంబు శత్రు దుర్వార మెవ్విధి

రావణ ఘన బాహు రక్షితమ్ము

నరి నిషూదనుఁడు మహా బాహు రాముఁడు

సేరి లంక నేమి సేయ నోపు

18.    

 

 

 

ఆ.వె.

రావణాసురుండు లంకాధిపతి యెట్టి

సామ దాన  భేద భీమ దండ

నమ్ము లతని యందు వమ్ములు  చింతింప

సందియమ్మది మరి యిందు లేదు

19.    

 

 

 

తే.గీ.

వాలి సూనుఁ డంగదుఁడును నీలుఁడు మరి

నాదు విభుఁడు సుగ్రీవుఁడు నన్ను గూడి

నలువురము దక్క నన్యులు జలధి దాఁటి

లంక నడుగిడ నేర్తురె యింక నరయ

20.   

 

 

 

కం.

మొదలు విచారింపఁ దగును

విదేహ నృప సుత సజీవ విలసిత యగునో

తుదిఁ గనెనో విదిత మయిన

తదనంతరము దలఁచెదను దర్శన మయినన్

21.    

 

 

 

తే.గీ.

ఇవ్విధిం గొంత తడవు గిరీంద్ర శృంగ

మున నిలిచి రాఘవుని శుభము మది నుంచి

తలఁచె హరి కుంజరుండు సీతా సతీ వి

చారణా విధము మదిని సాంప్రతముగ

22.   

 

 

 

ఉ.

వీరులు రాక్షసాన్వయులు భీకర దేహ బలాఢ్యు లెల్లరున్

ఘోరపు టాయుధమ్ములను గ్రూరులు లంకను గాచు చుండగన్

వీరల దాఁటి యేఁగ నవివేకమ యీ నిజ రూప మందు నేఁ

జేరఁగ లంక శక్యమె యజేయులు ధీరులు సంగరమ్మునన్

23.   

 

 

 

ఉ.

తేజు పరాక్రమంబులను దిట్టలు వీర్యము నందు నుగ్రులే

యాజినిఁ గార్య హీన మగు నంతయు యుక్తిఁ దలంచి యిత్తఱిన్

వ్యాజ మొకింత చేసి చన భావ్యము లంకకు సత్వరమ్ముగన్

భూజను గాంచ నేఁగ వలె మూఱిన ధీద్యుతిఁ గార్య సిద్ధికిన్

24.   

 

 

 

చం.

అనువుగ రూప మెల్ల విదితావిదితమ్ముగఁ జేసి రాత్రినిం  

జన వలె లంక నింపుగ నిశాచరు లెవ్వరు గాన కుండఁగన్

ఘనమగు కార్యసాధనకుఁ గాలము యుక్తము తధ్య మెవ్విధిన్

మనమున నిశ్చయించె నటు మారుతి యెంతయు ధీర చిత్తుఁడై

25.   

 

 

 

కం.

రావణునకు దుర్మతికిని

నే విధి నేర్పడక రాక్షసేశ్వరునకు ధా

త్రీ వర తనూజ నెవ్విధిఁ

బావన తర చరిత సీతఁ బరికింపఁ దగున్

26.   

 

 

 

కం.

విదితాత్ముఁడు రాముఁడు ఘనుఁ

డు దాశరథి కార్య మెన్నఁడు నలయ మగుచున్

సుదతీ మణి ధరణిజ తోఁ

గుదురుగ నేకాంతము పలుకుట యెట్లగునో

27.   

 

 

 

తే.గీ.

తమము తొలఁగదె సూర్యోదయమున నట్టి

రీతి నవివేకుఁ డైనట్టి దూత వలన

దేశ కాలానుగుణము నతిక్రమింపఁ

జెడును భవ్య కార్యములును జిక్కు లొసఁగి

28.   

 

 

 

తే.గీ.

లాభ నష్టము లెల్ల నరసి దృఢ మతు

లైన దూతలు పండితు లంచు నెంచు

వారు కార్య హానినిఁ జేయు వారు సుమ్మి

శోభ సేకూర్ప లేరిల సుంత యైన

29.   

 

 

 

తే.గీ.

కార్య హాని కాకుండుటఁ గాంచ నెట్లు

కలఁత దూర మగుట నది గాంచ నెట్లు

కడలి దాఁట ఫలం బది గాంచ నెట్లు

కరము చింతించె నచ్చటఁ గపి వరుండు

30.   

 

 

 

ఆ.వె.

రావణ విలయార్థ రామ సత్కార్యము

రాక్షసప్రవరుల చక్షు పథము

వడిన నిచట నేను వ్యర్థమౌను భృశము

తుదకు మిగులు దిగులు మదిని నింక

31.    

 

 

 

ఆ.వె.

అవిదితముగ నుండ నసురులకు నసుర

రూప మూనిన నిట నోప దగదు

రూప మన్య మింక రోయ నేల మదిని

శక్య మగునె నాకుఁ జనఁగ లంక

32.   

 

 

 

ఆ.వె.

వాయు వైన నిచట మాయమై వీవ నే

ర దని తలఁతు మదిని రక్కసులకు

నా బలులకు సుంత యవిదితం బిట లేదు

వింత నిందుఁ జూడ మింత యైన

33.   

 

 

 

ఉ.

నేనిట దాఁగి యుండిన ననిశ్చిత బుద్ధిని నైజ రూపి నై

దాన వినాశనం బగుట తథ్యము మచ్ఛ్రమ భర్తృ కార్యముం

గాన మదీయ రూపమును గర్జము హ్రస్వము చేసి శర్వరిన్

జానకి లంకయం దరయ సమ్మత మౌనది కార్య సిద్ధికిన్

34.   

 

 

 

కం.

దశకంఠ పురము దుర్గమ

ము శర్వరిఁ జని భవనమ్ము మొత్తము వీక్షిం

ప శుభముగఁ గందు సీతను

దశరథ నంద మనోరథం బీడేఱన్

35.   

 

 

 

కం.

సూర్యాస్తమయ సుగోచర

పర్యంతము వేచియుండె బావని యంతన్

వీర్యోపేతుండు బృహ

త్కార్య ధురంధరుఁ డవనిజ దర్శన రతుఁడై 

36.   

 

 

 

కం.

రవి యస్తమింపఁ దిమిరము

కవియ బిడాల పరిమాణ కాయము ధరియిం

చి వనేచరుండు వీరుఁడు

పవనాత్మజుఁ డద్భుతముగ భాసిలె నచటన్

37.   

 

 

 

కం.

మునిమాపు వేళ యందున

హనుమంతుఁడు గెంతి చేరె నసమాన బలుం

డు నగరము లంకఁ దూర్ణము

తనర విభాజిత మహా పథ విరాజితమై

38.   

 

 

 

తే.గీ.

సౌధ రాజి విరాజిత సత్పథమ్ము

శాత కుంభ మయస్తంభ సంకులమ్ము

సురభి జాల మాలా రుచి శోభితమ్ము

దివ్య గంధర్వ నగర సదృశ పురమ్ము

39.   

 

 

 

తే.గీ.

అష్ట తల సప్త తల సంయు తాయత భవ

నాభిరామ విలసితము నర్క సంస్థి

త తల విలసిత సౌధ వితానము వసు

భూషితము మహానగరమ్ము భూతలమున

40.   

 

 

 

ఆ.వె.

భవన పంక్తు లచట వైడూర్య మణి ఖచి

త విలసితములు గురుతర గృహ తల

ము లవి మౌక్తిక చయ కలిత భాసితములు

రాక్షస గణ భవన రాసు లెల్ల

41.    

 

 

 

ఆ.వె.

స్వర్ణ చిత్ర వర్ణ వర తోరణమ్ములు

బృహ దలంకృతములు వీథు లెల్ల

దీప పంక్తి తోడ దీపిత మనిశమ్ము

దైత్య రాజ నగర మత్యధికము

42.   

 

 

 

తే.గీ.

ధవళ గృహరాజ చయ సంయుతమ్ము తప్త

కాంచనప్రభా తోరణ కాండ జాల

గణ పరివృతమ్ము రావణ ఘన కరద్వ

య పరిపాలితమ్ము క్షపాచ రావృతమ్ము

43.   

 

 

 

కం.

ఊహాతీతము నద్భుత

మా హర్మ్యగ ణాకలిత మహా నగరిన్ వై

దేహీ దర్శన కాముం

డా హరి కని పొందె దుఃఖ మానందమునున్

44.   

 

 

 

ఉ.

చంద్రుఁడు చంద్రికా రుచులఁ జల్లుచు తారల మధ్య నుండి పా

రీంద్ర నిభుండు మారుతికి నింపుగ సాహ్యము సేయు వాఁడనన్

సాంద్ర సహస్రరశ్మి ఘనసార మరాళ నిభప్రభారుచుల్

మంద్ర సునిస్వనమ్ముల నమంద గతిం దనరంగఁ గన్పడెన్

45.   

 

 

 

తే.గీ.

శంఖ నిభుని క్షీర మృణాళ సదృశ వర్ణు

దివిని దోబూచు లాడుచుఁ దిరుగు వాని

సరసి నీదుచుఁ దిరుగు హంస గతిఁ జూచె

హరి వరుండు శశాంకుని నలరి నిసిని

46.   

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు రెండవ సర్గము.

 

సుందర కాండము

సర్గము 3.

 

మ.

కపి మత్తేభుఁడు లంబ శైలమున శృంగప్రస్థ మభ్రాభ మం

ద పృథుస్థేమము నాశ్రయించి వడి నుత్సాహంబుగన్ శర్వరిన్

విపి నోద్యాన వనావృతమ్ము పురి సంవీక్షింపఁ బద్మాకరౌ

ఘ పరీతంబును జేరె వాయుజుఁడు లంకా పత్తనం బత్తఱిన్

1.      

 

 

 

ఆ.వె.

శారదాంబుద నిభ సదన విలసితమ్ము

రావ ణావన పుర రాజము లవ

ణాకర ఘన నిస్వ నాకలితము సాగ

రానిలప్రసారి తాద్రి కీల

2.     

 

 

 

కం.

అందపు వాకిళులు వెలరు

చందపుఁ దోరణములు ఘన సైన్య పటలమున్

సుందర విటపావతి యన

నందఱు తనరెడు పురమ్ము నసురావృతమున్

3.     

 

 

 

తే.గీ.

భుజగ విచరిత మభిగుప్త భోగవతిని

మూరు పురము శంపాలత పూరి తాభ్ర

జాల పరివృత ముడుగణ సరణి సేవి

తమ్ము రావణ ఘన పాలితమ్ము సతము

4.     

 

 

 

ఆ.వె.

మంద గతిని వీచు మారుత మ్మనిశము

దేవ పట్టణ మమరావతి వలె

శాత కుంభ సాల సంవృత నగరమ్ము

దుర్గమంబు వైరి వర్గమునకు

5.     

 

 

 

ఆ.వె.

కేతనమ్ము లలరె మ్రోతలఁ జిఱుగంట

లన్ని మ్రోగ వీథు లందుఁ దనరి

యంతఁ గపి వరేణ్యుఁ డలరి మనమ్మునఁ

జేరి ప్రహరి దాఁటె శీఘ్రముగను

6.     

 

 

 

ఆ.వె.

విస్మయ మలర మది వీక్షించె నగరమ్ము

బసిఁడి గుమ్మములును బాల సూర్య

మయ మరుఁగులు వజ్ర మణి మౌక్తికస్ఫటి

క మయ కుట్టిమములు కాంతు లమర

7.     

 

 

 

సీ.

 

 

 

 

మిసిమి గల పసిఁడి మేటి వాకిళ్లు

            చ్చపు వెండి వెల్లని జదును దలలు

పిల్లి కన్రతనపు వెడఁద మెట్టికలును

            బటికంపు గోడలు పదిలముగను

జక్కఁదనపు నాల్గు చావడుల యిలులు

            నాకసమ్మును దాఁకు నటుల వెలయ

నెమలి కొంగ గములు నెఱి యంచ జంటలు

            తిరుగాడు కొలకు లమరు నగరము

 

 

 

 

ఆ.వె.

వాయిదముల మరియు బంగరు తొడవుల

మ్రోఁత లెల్ల మాఱు మ్రోఁగ నచట

వానరుఁడు గని పురి వస్వౌకసారను

బోలి తాఁక దివిని ముదము వడసె

8.     

 

 

 

కం.

అమిత బలాన్వితము శుభము

కమనీయము రావణుని నగర రాజము దు

ర్గమ మరి వరులకు వృద్ధి యు

తము లంకఁ గని కపి వరుఁడు దలఁపఁ దొడంగెన్

9.     

 

 

 

ఆ.వె.

కుముదుఁ డంగదుండు కుశపర్వణుండు సు

షేణుఁడు రవిజుండు సేర లంక

ఋక్ష రాజు గూడి నేను మైందద్వివి

దులు సమర్ధుల మిల దోర్బలమున

10.    

 

 

 

కం.

రాముని పరాక్రమంబును

రామానుజు విక్రమమును రవి వంశజులం

దా మహిత యశుల ఘన భుజ

సామర్థ్యము దలఁచి హనుమ సంతస మందెన్

11.    

 

 

 

చం.

రతనము లంబరమ్ములుగ రమ్యపు గాదెలు కుండలమ్ములై

యతులిత యంత్ర ధామము లనల్ప పయోధర భాతిఁ దోఁపఁగన్

వితత విభూషణద్యుతుల వెల్గెడి మానిని చంద మొప్ప న

ష్ట తిమిర పట్టణమ్ము గృహ షండము మారుతి గాంచె భాసమున్

12.    

 

 

 

కం.

అంతట హరి కుంజరు వి

క్రాంతుని నిజ రూపమున నగరమా లంకా

కాంతయ కాంచెను వేగమ

వింతగ వచ్చెడు విశేష వీర్య విలసితున్

13.    

 

 

 

కం.

రావణ పాలిత మా లం

కా వనితా రత్నము హరిఁ గాంచి స్వయముగం

దా వికృతానన యుత్థిత

యై వానరు నెదుట నిల్చి యావేశమునన్

14.    

 

 

 

తే.గీ.

కట్టెదుట నిల్చి మారుతి కపి వరునకు

భీషణంపు నాదమ్మున భీకరముగఁ

బల్కెఁ బవనాత్మజుని తోడఁ బడఁతి కినిసి

యేల వచ్చితిట కెవర వీవ యనుచు

15.    

 

 

 

ఆ.వె.

బొంది లోనఁ బ్రాణములు నిల్చి యుండగఁ

బల్కు సత్య మెల్ల వననివాస!

లంకఁ జేర లేవు రావణ గుప్తము

దైత్య వీర రక్షితమ్ము భృశము

16.    

 

 

 

ఉ.

నా విని పల్కె వాయుజుఁడు నాతుక యడ్డుగ నిల్వ ముందటన్

నే వినిపింతు సత్యమును నీ వడుగన్ మును బల్కు నా కిటన్

నీ వెవ రిందు ద్వారమున నిల్చితి వేల వికార నేత్రవై

త్రోవకు నడ్డ ముండి నను దోర మదల్పఁగ నేల యిత్తఱిన్

17.    

 

 

 

తే.గీ.

లంక కామరూపిణి యంతఁ గింకఁ బూని

హనుమ మాటలు విని పల్కె నతని తోడ

రాక్షసపతి రావణు నాజ్ఞ రక్షణమ్ము

చేయుదుఁ బురము రిపుల కజేయ నేను

18.    

 

 

 

తే.గీ.

నన్ను నేమఱించి చన వానర వశంబె

నీకు నగరమ్ము నాచేఁత నేఁడు మడిసి 

ప్రాణములు విడిచి సుఖనిద్ర వడయ గల

విచట నిక్కము నామాట లెల్ల వినుమ

19.    

 

 

 

కం.

స్వయముగ లంకా నగరము

భయదము నేన యిట నగర పరి రక్షణకెం

తయుఁ దగిన దాన నే నని

నియమిత నసుర పతిచే వనేచర! వింటే

20.   

 

 

 

ఆ.వె.

నాతి మాటలు విని కోఁతి గాడ్పుకొడుకు

మేటి యైన ఱాతి మేను వాడు

కొండకుఁ బెఱ దొడ్డ కొండ యనఁగ నిల్చె

గమక మందు నంత తమక ముంచి

21.    

 

 

 

ఉ.

వానర పుంగవుండు పుర భద్రను లంకను గాంచి పల్కె నే

నీ నగరంపు వేడుకల నిత్తఱి దర్శన కాంక్ష యేర్పడన్

మానస మందుఁ దోరణ విమాన నికాయ వణిక్పథమ్ములన్

మే నలరంగఁ గాంచెడు నిమిత్తము వచ్చితి వేడ్క మీఱఁగన్

22.   

 

 

 

తే.గీ.

లంకఁ గల వనోపవనముల నడవులను

గాంచ వచ్చితి నన లంక కామరూపి

ణి పరుష వచనమ్ములఁ గపినిఁ గని పల్కెఁ

దిరిగి రాక్షస పాలిత పురవర మిది

23.   

 

 

 

తే.గీ.

చూడ శక్యము కాదిట సురల కైన

నను జయింకుండ కుమతి నగ చరాధ

మ యనిన నిశాచరి నరసి మారుతాత్మ

జుండు పలికె నింపుగఁ గార్య చోదితుఁ డయి

24.   

 

 

 

ఆ.వె.

దేవి! పురముఁ జూచి తెల్లముగను నేను

సంత సించి మదిని సత్వరమ్ము

నేఁగు వాఁడ నింక నేవచ్చిన విధమ్ము

పడతి నమ్ము నన్ను భద్ర శీల! 

25.   

 

 

 

తే.గీ.

అంత లంక పెద్దగ నొక్క యఱపు నఱచి

యఱచెయి నతని తలనొక్క చఱపు చఱచె

వేగముగ భయము గొలుప వీర్య వంతుఁ

డా హరి మహాస్వనము సేసె ననిల సుతుఁడు

26.   

 

 

 

ఉ.

అంత బిగించి ముష్టిఁ బవనాత్మజుఁ డాగ్రహ మూర్చితుండునై

యింతిగ నెంచి కోప మొకయింత కుదించి దయార్ద్ర చిత్తుఁడై

పంతము వూని వేగముగ వామ కరంబున వ్రేసె నత్తఱిం

గాంత శిరమ్ము పైన నొక ఘాతము ధీరుఁడు కార్యమగ్నుఁడై

27.   

 

 

 

ఆ.వె.

ఆమె యంత విహ్వలాంగియై పడె భువి

ఘాతమున నిశీథ గామిని వడి

మారుతాత్మజ కర భార మహిమ నయ్యె

వికృత దర్శనమ్ము వింత గొలుప

28.   

 

 

 

కం.

తేజస్వి బుధ వరేణ్యుఁడు

దా జాలిం జూపెను పతిత నిశాచరి న

వ్యాజ మనమ్మునఁ గని యట 

స్త్రీజాతి పురస్కృతిఁ గపి శేఖరుఁ డంతన్

29.   

 

 

 

తే.గీ.

మిక్కుటముగఁ గలఁత సెంది తక్కి గర్వ

మెల్ల డగ్గుత్తిక మినుకు లల్లన యనె

లంక హనుమంతుఁ జూచి యో ప్లవగ వీర!

మారుతాత్మజ! దయఁ జూపు మగువ పైన

30.   

 

 

 

తే.గీ.

సమయ మందు నిల్తురు మహా సత్వవంతు

లెల్లరు హరి వీర వరేణ్య! యిద్ధ బలులు

సౌమ్య! రక్షింపు నన్ను విజయము పొంది

తీవు నాపై స్వయము లంక నేను హనుమ

31.    

 

 

 

కం.

వినుమ హనుమ తరళ తర వ

చనములు తధ్యములు నబ్జజాత వరము నా

కు నది నిజ మగు నిపుడు దాఁ

ట నశక్యం బెవ్వరికిఁ బుడమి నెన్నండున్

32.   

 

 

 

ఆ.వె.

వానర వరుచే నపజయము కల్గిన

నాఁడు విక్రమమున నారి! నీకు

రక్కసులకు నింక నిక్క మాపద లెల్ల

లంక! యెఱుఁగు మంచు బ్రహ్మ పలికె

33.   

 

 

 

ఆ.వె.

తత్సమయము నీదు దర్శనమున వాన

రేంద్ర! నేఁడు వచ్చె నెలమి కలుగ 

బ్రహ్మ వాక్కు లేల వ్యర్థ మగును జుమ్మి

లంక కింక కీడు శంక లేదు

34.   

 

 

 

కం.

సక లాసురులకు రావణుఁ

డు కలుష చిత్తుఁడు దురాత్ముఁడు నిశాచర రా

జు కతన వినాశ మగు జా

నకీ నిమిత్తము కపీంద్ర! నమ్ముము లంకన్

35.   

 

 

 

తే.గీ.

పురము రావణ పాలితమును హరివర!

లంకను బ్రవేశ మింపుగ నింకఁ జేసి

మన మలరఁగ యథేచ్ఛగఁ బనుల నన్ని

చూచు కొనుము నిశ్శంక భాసురముగ నట

36.   

 

 

 

తే.గీ.

జానకీ దేవినిఁ బురము శాప తప్త

ము దశకంఠ పాలిత మందు ముదము మీఱ

వెదకుము హరిప్రవీర వివేక మలర

సంశయము వీడి యిఁక నెల్ల స్థలము లందు

37.   

 

 

 

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు మూడవ సర్గము.

 

సుందర కాండము

సర్గము 4.

 

ఉ.

 

వీరుఁడు వానరేంద్రుఁడు సుభీషణ నారినిఁ గామరూపిణిన్

సార పురమ్ము లంక నట సత్వము మీఱ జయించి వేగ నే

ద్వారము లేని చోటు గని పట్టణ కుడ్యము దాఁటి యింపుగం

జేరెఁ బురమ్ము లంకను నిశీథిని బాహు బలాఢ్యుఁ డత్తఱిన్

1.      

 

 

 

కం.

నిజ వామపాద మంత రి

పు జన శిరమ్మున నునుచుచుఁ బురమును లంకన్

గజనిభ మారుతి చేరె ని

నజ హితకరుఁడు వెతకఁగ జనక సుత నచటన్

2.     

 

 

 

తే.గీ.

చేరి పురము తిమిరమున మారుతాత్మ

జుఁడు మహాపథ రాజము సుసుమ ముక్త

లలరు పథము రమ్య పురమ్ము బల సమాహి

తుండు తిరిగెను గపి సత్తముండు నంత

3.     

 

 

 

తే.గీ.

కిలకిల నగవు మ్రోతల గలగల మను

వాద్య నిచయ సుమధుర రవమ్ము లలర

గేహచయ వజ్రజాల సంకీర్ణ నగర

మంబుద యుతాంబరమ్ముగ నలరె నచట

4.     

 

 

 

మ.

సిత మేఘాభ విచిత్ర రాక్షస గృహాశేషావలిన్ వెల్గి సం

స్థిత పద్మప్రతిమమ్ము స్వస్తికమహాదీప్తంపు సంకేతముల్

వితతమ్ముల్ విలసిల్లు గేహ తతులన్ వే వర్ధమానమ్ములన్

సత తాలంకృత భాసితంబయి ప్రకాశంబయ్యె దివ్యంబుగన్

5.     

 

 

 

ఆ.వె.

రాఘవేంద్ర కార్య రత మానసుం డయి

వాన రౌఘ రాజ వాంఛఁ దీర్ప

మాననీయుఁడు హరి మాలా విభూషిత

లంకఁ జూచె మన మలరఁగ ఘనుఁడు

6.     

 

 

 

కం.

గృహ గృహము తిరిగి తిరిగి య

ట హరి వివిధ రూపముల నడరిన భవనముల్

సహనమ్మునఁ జూచె ముదా

వహముగ నగరచరుఁ డయ్యె వనచరుఁ డంతన్

7.     

 

 

 

తే.గీ.

అప్సరస్స్త్రీల మించెడు నమ్మదవతు

ల సుమధుర గీతముల ననిలజుఁడు మువ్వి

ధములఁ బరగు స్వరమ్ములు దానవ గృహ

రాజముల వినె హరి కుధర సదృశుండు

8.     

 

 

 

ఆ.వె.

అచ్చ టచ్చట వినె నంచిత కాంచీని

నదము లందెల ఘన నాదములును

సోపనంపు రొదలు సుద్దులు చప్పట్లు

క్రేవు లెల్ల దివ్య గేహములను

9.     

 

 

 

కం.

వినిపించె వేద మంత్ర ప

ఠనము లసుర వేశ్మముల నడర రావణ వం

దనములు కనె శ్రుతి పారా

యణ నిరతుల రక్కసులను నఱచెడు వారిన్

10.    

 

 

 

తే.గీ.

రాజ మార్గాంతికమ్మున రాక్షస బల

మతి భయంకరమ్మును మారు తాత్మజుండు

ఘనుఁడు దర్శించె నగర రక్షకుల దుర్గ

మధ్యమున వేగులను బెక్కు మంది నతఁడు

11.    

 

 

 

తే.గీ.

హరి వరేణ్యుఁడు వీక్షించె నద్భుతముగ

దీక్ష గైకొన్నవారినిఁ దేట జూట

ధరుల కేశ హీనులను గోత్వగ్ధరులను

కావి తాలుపులను దర్భకర హనువుల

12.    

 

 

 

తే.గీ.

అగ్ని కుండాయుధుల సుత్తు లాయసంపు

గుదియలును దుడ్డు కఱ్ఱలు కొన్న వారి

విల్లు రోకళ్లు కత్తులు పెక్కు ముల్లు

లున్న కఱ్ఱలు గునపమ్ము లున్న వారి

13.    

 

 

 

తే.గీ.

చిత్ర కవచములు ధరియించిన యసురుల

నేక కర్ణులేకాక్షుల భీక రోద

రుల గళిత కుచుల భయంకరు లతి వక్ర

వక్త్రుల వికృత రూపుల వామనులను

14.    

 

 

 

తే.గీ.

వారు గనఁ బెద్ద కాయులు కారు కృశ శ

రీరులును గారు పొడవైన వారు గారు

పొట్టి వారును గా రెఱుపు మెయి వారు

కారు నల్లవారును గూను వారు గారు

15.    

 

 

 

తే.గీ.

వక్ర రూపుల బహు రూప వంతులను సు

రూపులను దేజు రూపుల రుచిర కేత

నమ్ములు పతాకములు పూనిన సురులను

హరివరుఁడు సూచె నాయుధ ధరుల నపుడు

16.    

 

 

 

తే.గీ.

బల్లెములు నడ్డ కత్తులు పాదపములు

వజ్రములు త్రాళ్లు లోహపు వలలు శూల

ము లతి తీక్ష్ణపు టాయుధములు కరములఁ

దాల్చిన యసురులను జూచెఁ దరుచరుండు

17.    

 

 

 

తే.గీ.

హారులను ననులిప్తుల నభ్ర భూష

ణావలి విలసితులను మహా బలుల య

ధేచ్ఛ సంచారుల వివిధ దివ్య వస్త్ర

ధారులఁ గపి వరుఁడు సేసె దర్శనమ్ము

18.    

 

 

 

కం.

అంతిపురపు టుత్థానము

నంత సురక్షణ నిమగ్ను లసురాధిపు కా

లాంతక శతాధికులు బల

వంతులఁ గనెను హరి మధ్యవర సేనాళిన్

19.    

 

 

 

చం.

హరివరుఁ డంతఁ జూచెను మహాధన తోరణ భాసితమ్మునున్

గిరివర మూర్ధ సంస్థితము కీర్తిత రాక్షస రాజ వేశ్మమున్

వర పరిఖాభిరక్షితము పంకరు హోత్పల రాజితమ్మునున్

వరణ పరీవృతం బధిక వైభవ సంచిత శోభితమ్మునున్

20.   

 

 

 

ఆ.వె.

దేవ లోక నిభము దివ్యము మధుర ని

నద భరితము భూషణ నినద విల

సితము వాజి హేషిత తరళము విమాన

హయ గజ రథ వాహ నావృతమ్ము

21.    

 

 

 

కం.

సిత వారిద సన్నిభ గజ

వితత చతుర్దంత రుచిర విల సద్ద్వారాం

చిత మృగ పక్షి చరద్భా

సితము మహోగ్రాసుర గణ చిర రక్షితమున్

22.   

 

 

 

మ.

అతి గుప్తం బటఁ దూఱె మారుతి దశాస్యాంతఃపురమ్మున్ వడిన్

సిత ముక్తా మణి భూషి తాంతము మహాచిత్రాభ్ర నిర్యూహమున్

సత తోత్కృష్ట పటీర వంశక వరశ్లాఘ్యావలిప్తంబునున్

సత మెన్నంగను శత్రు దుష్కరము దుష్ప్రాప్యమ్ము దుర్భేద్యమున్

23.   

 

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నాలుగవ సర్గము.

 

సుందర కాండము

సర్గము 5.

 

 

తే.గీ.

గగన మధ్యస్థుఁడై నట్టి కాంతిమంతు

దివ్య కిరణంపు సంఘంపు దీప్తిమంతుఁ

జూఛె ధీశాలి నిసి రాజు సోము నంత

గోష్ఠి నున్నట్టి వృషభ మ్మొకో యనంగ

1.      

 

 

 

ఆ.వె.

అల జగతి నఘముల హరియింపఁ దగువాని

నర్ణవంపుఁ బెంపు నరయు వాని

జీవ రాశి నెల్లఁ జేరి వెలుఁగు లీను

వాని చంద్రుఁ జూచె వాయుజుండు

2.     

 

 

 

ఆ.వె.

ధరణి మంద రాద్రిఁ బరిఢవిల్లిన శోభ

జలధి సంధ్య నున్న చారు శోభ

సరసి లోని పంకజాతంపు ఘన శోభ

శర్వరీశు నందు సమ్మతమ్ము

3.     

 

 

 

తే.గీ.

అరయ రజత పంజర గత హంస వోలె

నెలమి మందర గుహపు మృగేంద్రు భంగిఁ

బేర్మి వేదండ భాసిత వీరు తీరుఁ

జందురుం డట విలసిల్లె సత్పథమున

4.     

 

 

 

తే.గీ.

వాడి కొమ్ములు గల వృషభమ్ము వోలె

శృంగ రాజముల ధవళ శృంగి వోలెఁ

గనక బద్ధ కర కలిత గజము వోలెఁ

బూర్ణ శృంగ చిహ్నుఁడు శశి పొలసె నచట

5.     

 

 

 

తే.గీ.

ఇనకర గ్రాహిత పలల ఘనత తోడ

ముక్త శీతలజల హిమ రిక్త పంక

విభవ రుచిరామలాంకుఁడు వెలిఁగె నచట

చంద్రుఁడు శశాంకుఁడు విభుఁడు సౌమ్యముగను

6.     

 

 

 

తే.గీ.

ఇంపగు గిరితటమున మృగేంద్రుఁ బోలె

నిల సమర భూమిఁ జేరు గజేంద్రుఁ బోలె

నెలమి నిజ రాజ్య మొందు నరేంద్రుఁ బగిది

నడరె జంద్రుఁడు వైభవం బలర నపుడు

7.     

 

 

 

చం.

తిమిరము నష్ట మాయెను ప్రదీప్తుఁడు చంద్రుని దర్శనమ్మునన్

గమకము వీడె దానవ నికాయము మాంస నిషేవణమ్మునం

దమకము మన్మదోత్థితము దానవ కాంతల కెల్ల రేఁగెనే

విమల శశాంక కాంతులను వెల్గఁ బ్రదోషము స్వర్గ తుల్యమై

8.     

 

 

 

చం.

శ్రవణ మనోహరమ్ముగ విరాజిత మయ్యెను వాద్యఘోషముల్

వివశులునై సువృత్త లిఁకఁ బ్రేమగ నాథులఁ గూడి రెల్లరుం

దివిరి నిశా విహారులు సుతీక్ష్ణపు టాయుధముల్ ధరించి వీ

రవరులు రౌద్రవృత్తు లట రక్షణ కారణ మేఁగి రెల్లరున్

9.     

 

 

 

తే.గీ.

రథ తురంగ గణ యుత భద్రాసనములఁ

గూడి మత్తప్రమత్త సంకుల గృహమ్ము

సకల సంపద్విలసితము సదన రాజ

ము గనె ధీశాలి కపి వాయు పుత్రుఁ డంత

10.    

 

 

 

తే.గీ.

పాన మత్త ఘనప్రలాపములు రేఁగెఁ

బరఁగెను బరస్పరాక్షేప వాక్కు లంతఁ

బీన భుజపు ఘర్షణములు పెరిఁగె వింత

నొండొరుల జగడమ్ముల హోరు సెలఁగె

11.    

 

 

 

తే.గీ.

రొమ్ము విఱిచిరి రక్కసు లిమ్ముగ నటఁ

గులుకి వేసిరి కాళ్లను గలికుల పయిఁ

జూపి రచ్చట చిత్రంపు రూపములను

జాపముల నంతఁ బెల్లుగఁ జాచి రచట

12.    

 

 

 

ఆ.వె.

చంద నాదు లలమ కొంద ఱిందు ముఖులు

కొందఱు నిదురింపఁ గొంద ఱబ్జ

ముఖులు నవ్వఁ గ్రోధమున నిశ్వసింపఁగఁ

గొందఱు సువదనల నందఱిఁ గనె

13.    

 

 

 

కం.

గజముల ఘీంకారమ్ముల

సుజనుల సంపూజితుల విశుద్ధ గుణుల వీ

రజనుల సరోవరస్థిత

భుజ గోచ్ఛ్వాస నిభ రుతులఁ బురమట వెలిఁగెన్

14.    

 

 

 

తే.గీ.

తరళ బుద్ధిప్రధానుల సురుచి రాభి

ధానులను శ్రద్ధ ధాను లుదార వచను

ల వివిధ విధానులఁ బురమ్మున విపు లాప్ర

ధానుల హరి వరుఁడు సూచె దానవులను

15.    

 

 

 

ఉ.

చూచెను వారి యందు బహు సుందర రూపుల యాతుధానులన్

వే చరియించు వారి నల వెల్గెడు వారని సద్గుణమ్ములం

దోఁచిన సంతసించె హరి తోరము కొందఱి వారి యందుఁ దాఁ

జూచె విరూపులన్ దనుజ శూరులఁ గ్రూరుల దుష్ట బుద్ధులన్

16.    

 

 

 

తే.గీ.

సురుచిరప్రభా వదన సుందర తనులను

గౌరభావ నిజ ధవ మనో రతలను

దాన వాబలల మధు పానానురతలఁ

దార కాభప్రభావ కాంతలఁ గనెఁ గపి

17.    

 

 

 

తే.గీ.

గో గణద్యుతి వ్రీడోపగూఢ వశల

గాఢ శర్వరీ నాథోపగూఢ రతల

గురు పతగ నిభ పుష్పోపగూఢ తనులఁ

గొందఱి నచట హర్షోప గూఢలఁ గనె

18.    

 

 

 

తే.గీ.

ఉవిద లచ్చట సౌధత లోప విష్ట

లొరు లట నిజ నాధాంక సుఖోప విష్ట

లు పతి ధర్మ రత నివిష్టలు మరి కొంద

ఱన్యు లతి మద నాభి విష్టాత్మలఁ గనె

19.    

 

 

 

తే.గీ.

కొందఱు సువర్ణ వర్ణలు కొంద ఱుత్త

రీయ హీనలు కొందఱు రేదొర వెలుఁ

గుల తనువు వారు పతిహీన కోమలాంగు

లన్యులును రుచిరాంగుల నతివలఁ గనె

20.   

 

 

 

తే.గీ.

ప్రియులను గలసి హర్షించు లేమలను మ

నోభిరామల నటఁ బరమాభిరామ

లను ముదిత మానస లలనలను హరిప్ర

వీరుఁ డెల్లరఁ గాంచె నివేశములను

21.    

 

 

 

కం.

శశి రుచ్యానన మాలల

భృశ వక్రాక్షి వర పక్ష్మ వృత నేత్రాళిన్

స్వశనిశ్రేణి నికాశా

గ్నిశేఖర విభూష ణాంకినిం గనె నచటన్

22.   

 

 

 

తే.గీ.

రాజ వంశాభి జాత ధర్మపథ సంస్థి

త మనసాభిజాత లతా వితాన జాత

తరళ కుసు మాభిజాత సీతా సతీ మ

తల్లిఁ దాఁజూడ లేదటఁ దన్విని హరి

23.   

 

 

 

తే.గీ.

రామ దర్శన లాలసఁ బ్రాణ నాథ

మాన సానువర్తిని వర మానినీ వి

శిష్టను సనాత నాచార చింతనా ర

త మద నాభివిష్టను గపి తా నరయఁడు

24.   

 

 

 

తే.గీ.

కలికి వెచ్చటి కన్నీటి గళము దానిఁ

గాంచ నాభరణమ్ములు కంఠ మందుఁ

బూర్వ మున్నట్టి భామ నఖర్వ పక్ష్మ

నీలకంఠాభ కంఠిని నీరజాక్షి

25.   

 

 

 

తే.గీ.

చంద్ర రేఖ వోలెఁ గృశాంగి చంద్ర వదన

హేమ రేఖ వోలెఁ బరాగ మెల్ల నిండ

బాణ రేఖ వోలె క్షతము బాధ తోడ

రేఁప గాలి చెదరు మేఘ రేఖ వోలె

26.   

 

 

 

తే.గీ.

గాంచ లేక సీతను రామ కాంత నచట

పురుష విభుని వాగ్విభవుని ముదిత నంత

దుఃఖ వశు డయ్యె క్షణము మందు పగిది నచి

ర సమయంబు వెదక వానరప్రవరుఁడు

27.   

 

 

 

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నేనవ సర్గము.

 

సుందర కాండము

సర్గము 6.

 

 

కం.

హరివరుఁడు కామరూపుఁడు

కర మార్తి విమానములు సకలములు పురమం

దు రయమునఁ దిరిగి లంకం

బరిశోధింపంగఁ దొడఁగె బరమాసక్తిన్

1.      

 

 

 

తే.గీ.

భాగ్యశాలి శాఖామృగప్రవరుఁ డంత

రాక్షసేంద్ర నివేశ మర్క రుచి విలసి

తమ్ము ప్రాకారవర భాసితమ్ము దైత్య

రక్షితము జేరె వని మృగరాజు భంగి

2.     

 

 

 

తే.గీ.

రజత తోరణములు సువర్ణ విలసితము

లతి విచిత్రపు టంకణా లలర రుచుల

ద్వార మాలావృత విరాజిత గృహ రాజ

ము కపివరుఁడు గాలించె సముచిత రీతి

3.     

 

 

 

టే.గీ.

మదపు టేనుగు లెక్కిన మావటీళ్లు

శూరు లలుపన నెఱుఁగని వీర వరులు

నడ్డు లేని హయమ్ములు నతి రథులును

సిద్ధముగ నున్న వారిఁ జూచెఁ గపి వరుఁడు

4.     

 

 

 

కం.

పులి సింహపుఁ జర్మమ్ముల

నలంకృతమ్ములు రజత కనక దాంత వరా

మల చిత్ర విరాజిత రథ

ములు సంచరణముల నినదములఁ గాంచె నటన్

5.     

 

 

 

ఆ.వె.

మణిమయ విలసిత విమాన మత్యుత్తమ

భాజ నాసన చయ రాజి తమ్ము

వర రథాకలన నివాస రాజమ్ము మ

హా రథస్వనస్ఫు టాకలితము

6.     

 

 

 

ఆ.వె.

వివిధ రకములు కడుఁ బ్రీతి కరములు హృ

ద్యమ్ములును మృగద్వి జాళులు గన

వేల సంఖ్యలు పరివేష్టితము లచట

సుందరమ్ము లెల్ల డెంద మలర

7.     

 

 

 

కం.

ద్వార పరిపాల కాసుర

వీరులు శిక్షితులచే నవిశ్రాంతముగం

దోరముగ రక్షితంబై

నారీ మణి పూరితమ్మనవరత మెలమిన్

8.     

 

 

 

ఆ.వె.

సాగరధ్వని నిభ సమ్యగాభరణస్వ

న కలిత విభవమున నైరృ తేంద్ర

రాజ వేశ్మ మొప్పె రంజిత మానస

మానినీ మణి యన మానితముగ

9.     

 

 

 

ఆ.వె.

చంద నాగరుప్రసారిత వాసనా

కలితము వర జన నికాయ సంచ

రితము రాజస గుణ యుత వీర భరితం

రణ్య మందున మృగరాజు భంగి

10.    

 

 

 

కం.

దుందుభి మృదంగ వాద్యా

మందాభిరుతము జలజ సుమధురధ్వనులన్

సుందర తరమ్ము రాక్షస

వందన నిరతార్చనా విభాసిత మవనిన్

11.    

 

 

 

ఉ.

వారిధి మించు ధీరమును ధ్వానము మించెను వారిరాశికిన్

నైరృతరాజ రాజసదనమ్ము వరాభరణమ్ముగన్ మదిన్

మారుతి యెంచి రత్నమయ మందిర మింపుగ రత్నవాసముల్

తోరము నుండఁ దద్గృహము తూర్ణము సూచెను విస్తరమ్ముగన్

12.    

 

 

 

ఉ.

ఆరయ రూప మందుఁ బరమాద్భుత మిమ్ముగఁ గాంతిమంతముం

దేరుల నశ్వ నాగముల దీటుగ నిండిన సౌధరాజమున్

ధీరుఁడు రావణాసురు నిదేశము నందు నిగూఢ రీతిన్

మారుతి ధీవరేణ్యుఁడు సమంచిత బుద్ధిఁ జరించె నచ్చటన్

13.    

 

 

 

చం.

వరుసగ రాక్షసప్రవర భవ్య గృహమ్ముల నిష్కుటమ్ములం

దిరుగుచు నిర్భయమ్ముగఁ బ్రతీక్షణ సల్పుచు మేడ లందునం

బరఁగి ప్రహస్త సౌధమును బన్నుగఁ జేరి మహా జవమ్మునం

ద్వరపడి చూచె నంత ఘనపార్శ్వుని వేశ్మము వీర్యవంతమున్

14.    

 

 

 

ఆ.వె.

కుంభకర్ణ సదన మంభోధర నిభమ్ము

చూచి సత్వరమ్ముచోద్య మంది

భాషణ చతురుఁడు విభీషణ వేశ్మంబు

హరి వరుండు సూచె నద్భుతమును

15.    

 

 

 

సీ.

 

 

అంత విరూపాక్ష హర్మ్యమును మహోద

            ర విమానవరము నరసి భృశమ్ము

ఘనుఁడు విద్యుజ్జిహ్వ తనరు విమానము

            వెదకి విద్యున్మాల వేశ్మము గని

రయముగ వజ్రదంష్ట్ర గృహమ్ము పరికించి

            తేజోమయ శుకుని దివ్య గృహము

వీక్షించి సారణ రాక్షస సదనమ్ము

            తిలకించి యా మారుతి హరి వరుఁడు

 

 

 

 

ఆ.వె.

మేఘనాదు గృహము లాఘవమ్మునఁ గాంచి

మఱి సుమాలి జంబుమాలి సదన

రాజములు చరించి రశ్మికేతు గృహము

సూర్యకేతు గృహము సూచె నంత

16.    

 

 

 

సీ.

 

 

 

 

 

వజ్రకాయుని వీటిఁ బరిశీలన మొనర్చి

            సంపాతి ధూమ్రాక్ష సదన రాజ

ములు గమనించి భీముని ఘన విఘన వి

            ద్యుద్రూపుల నివస నోత్తమముల

దర్శించి శుకనాస దంష్ట్ర వక్ర శఠ వి

            కట రోమశ బ్రహ్మకర్ణ మత్త

నాదిన శోణిత నయ నేంద్ర జిహ్వ క

            రాళ పిశాచ వారణ ముఖాది

 

 

 

 

తే.గీ.

రాక్షసప్రవర గృహ దర్శనము సేసి

వాయుజుండు యుద్ధోన్మత్త భవనము పరి

కించి క్రమముగ నసురుల కీర్తి మంతు

ల విభవము లెల్లఁ గనె విమల చరితుండు

17.    

 

 

 

కం.

భవనమ్ము లెల్ల హరి వరుఁ

డు వరుసగఁ దిరిగి తిరిగి కడు రయమ్మున దా

నవ రాజప్రాసాదము

నవలీలగఁ జేరె మారుతాత్మజుఁ డంతన్

18.    

 

 

 

తే.గీ.

రావణాంతఃపురమ్మున రమ్యముగను

రాణి వాసోపశాయినీ రమణుల హరి

వరుఁడు శూల ముద్గర శక్తి కరల భీమ

తోమ రాయుధ పాణుల భామలఁ గనె

19.    

 

 

 

ఆ.వె.

దాన వాధిప వర ధామమున బహు గు

ల్మముల తోడఁ బెక్కు రావ ణాను

యాయుల నసురుల మహాకాయుల వివిధ

శస్త్ర ధారుల నచరుఁడు సూచె

20.   

 

 

 

తే.గీ.

శ్వేత సిత తామ్ర ఘోటక వ్రాతము లతి

వేగవంతములను సుమహా గజములు

సుకుల జాతములు సురూప శోభితములు

పర కరుల మిన్న బలరిపు కరి సమములు

21.    

 

 

 

తే.గీ.

హస్తులవి శిక్షితంబులు నంచితముగ

శత్రు సేనాంత కరములు సమర మందు

మద జలస్రవమున నగాంబుద నికాశ

ముల రణంబున దుర్జయములఁ గనె హరి

22.   

 

 

 

తే.గీ.

చండ సూర్యాభములును గాంచన పరిష్కృ

తమ్ములు సువర్ణ జాల వృతమ్ములును స

హస్ర సంఖ్యల సేనల నసుర రాజ

హర్మ్యరా జమున నరసె హరి వరుండు

23.   

 

 

 

ఉ.

అందపు టందలమ్ములు వరాకృతులన్ విలసిల్లు చుండగన్

సుందర వల్లరీ గృహ సుశోభిత పంక్తులఁ జిత్ర శాలలన్

సందడి గొల్పు కేళి గృహ సంచయ సంయుత దారుశృంగులన్

డెందపు విందుసాలలు గుటీరములం గనె కార్యగేహముల్

24.   

 

 

 

చం.

వరగిరి మంద రాచల నిభమ్ము మయూర సమాకులమ్మున్

సురుచిర చిహ్న దండ యుత సుస్థిర సౌధ విరాజమానముం

బరమ శివాలయాభము నపార నిధివ్రజ రత్న కీర్ణమున్

హరివరుఁ డంతఁ గాంచెను మహాసుర వీర సుపాలిత మ్మన్

25.   

 

 

 

ఆ.వె.

రత్న కాంతు లీన రావణ తేజము

మూర వెల్గె నా యగార మచట

కిరణముల వలన నలరు ప్రభాకరు భంగి

కాంతిమంత మయ్యె నంత గృహము

26.   

 

 

 

కం.

ఆసనములు సంస్తరములు

భాసురము లనేక ముఖ్య భాజన వరముల్

తా సౌవర్ణ మయమ్ములఁ

బ్రాసాదమునఁ గపి వరుఁడు పరికించె వడిన్

27.   

 

 

 

తే.గీ.

సారఘాసవక్లిన్నము సన్మణి మయ

భాజన విలసితము నసంబాధము నర

వాహన భవన సన్నిభ వాస వరము

రాక్షసేంద్ర మహా వేశ్మ రాజ మందు

28.   

 

 

 

ఆ.వె.

అందియల రవళు లమంద గతి నలర

నొడ్డణమ్ముల రొద లుర్వి నిండ

మద్దెల దిమిదిములు మారు మ్రోఁగ నసుర

రాజ మందిరముల రాగ మలర

29.   

 

 

 

తే.గీ.

సౌధ మాలికా సంయుత సారసాక్షి

శత విరాజితము బహు కక్ష్య సుసమాహి

తము మహాగృహమును వాయుతనయుఁ డంతఁ

దమిఁ బ్రవేశించె శోధన తత్పరుండు

30.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నాఱవ సర్గము.

సుందర కాండము

సర్గము 7.

 

 

తే.గీ.

వాయుతనయుండు గాంచెను వర్ష కాల

సంజనిత మహాశని మేఘ జాల నిభము

విహగ జాల సంయుక్తము వేశ్మ వర ని

చయము వైదూర్య సౌవర్ణ జాల మయము

1.      

 

 

 

తే.గీ.

సద్గృహ సమాహిత వివిధ శాల లచట

శంఖ సంహి తాయుధ చాప శాల లచట

చారు తరములు విపుల విశాలములును

సద్మ శిఖరులఁ గనెఁ జంద్రశాల లంత

2.     

 

 

 

తే.గీ.

రత్నకాంచన సంప ద్విరాజితముల

భాజనీయ దేవాసుర పూజితముల

వాస్తు దోష సంచయ పరివర్జితముల

నరసె గృహముల స్వీయ బలార్జితముల

3.     

 

 

 

తే.గీ.

అధిక దీక్షా ప్రయత్న సమాహితముల

దానవాచారి మయ నిర్మితము లనంగ

నుర్వి సకలాధికతర గుణోత్తమములఁ

గాంచె రావణాసుర గృహ కాయములను

4.     

 

 

 

ఆ.వె.

మేరు శైల శృంగ మేఘాను రూపము

లోహవర మయంపు రూప మంత

సాటి లేని మేటి వీటిని రావణ

రుచిర నిజ బలాను రూపము గనె

5.     

 

 

 

ఆ.వె.

వింతగ దివిఁ బుడమి విసరిన భంగిని

గిరి నిభము రజోవకీర్ణము నట

కుజ నికాయ గళిత కుసుమావకీర్ణము

వర్ణ కలిత రత్న కీర్ణముఁ గనె

6.     

 

 

 

మ.

గురు శంపా లతికార్చ్యమాన ఘన భృత్కోశమ్ము రూపించుచున్

వర కాదంబ కదంబకమ్ములు మహా వాహ్యమ్ము లేమో యనన్

సురవర్త్మమ్మున నా విమానము మహా శోభా సుసంపన్నమై

వర నారీమణి హస్త పద్మముల దీప్యంబా యనం దోఁచెనే

7.     

 

 

 

ఆ.వె.

చిత్ర వర్ణ భాస జీమూత తుల్యము

గ్రహ శశాంక రుచి నికాశ మనఁగ

ధాతు చిత్ర కలిత ధాత్రీ ధర నిభ వి

మాన రత్న మచట మారుతి గనె

8.     

 

 

 

తే.గీ.

పుడమి యయ్యెఁ బర్వతరాజి పూర్ణముగను

భూధరములు వృక్ష వితాన పూర్ణములును

భూభవములు కుసుమ షండ పూర్ణములును

పూవు లెల్లఁ గేసర పత్ర పూర్ణములును

9.     

 

 

 

తే.గీ.

చిత్రితములు ధవళ సౌధ చిత్రములును

రుచిర పుష్ప రాజులు ససరోవరములు

భాసమాన పద్మములు సకేసరములు

ధన్య సానువులు విమాన తలము లందు

10.    

 

 

 

తే.గీ.

మాన్య పుష్ప కాఖ్య విరాజమాన మచట

మణి ఘృణి నికాయ సంవర్ధమాన మవని

నురుతర సకల దైత్య గృహోన్నతమ్ము

మారుతి పరికించె మహా విమాన మంత

11.    

 

 

 

ఆ.వె.

పక్షి చిత్రము లవి వైడూర్య మయములు

రజత విద్రుమ ఖచరవ్రజములు

నశ్వ రాజములు వరాంగ భాసితములు

రత్న ఖచితము లహి రాజములును

12.    

 

 

 

ఉ.

చిన్నిదముం బ్రవాళములు సేర్చిరి రెక్కల పైన నింపుగం

గొన్ని సుపుష్ప చిత్రములు కోరి యొకింతగ వంచి రెక్కలం

బన్నుగఁ బక్షిమూర్తులు సుపక్ష సుచంచువులన్ సృజింపఁగం

దిన్నఁగఁ గామ భృత్యులుగఁ దేజము మీఱఁగఁ దోఁచె నత్తఱిన్

13.    

 

 

 

తే.గీ.

పద్మ హస్తయై శ్రీసతీ ప్రతిమ పద్మి

నిన్నిలువ నుత్పలమ్ములు నిలిపి కరము

నఁ రు లర్చించెఁడు విధమున నమరె నటఁ

జిత్రము విమానమునఁ గడు చిత్రముగను

14.    

 

 

 

కం.

శివతమ మాగృహము గదిసి

సవిస్మయము సుందర తర శైల సదృశముం

దివిరి వసంత సుగంధ న

గ వర సకందర నిచయ నికాశము సూచెన్

15.    

 

 

 

తే.గీ.

తత్పురము దశానన పాలితము సుపూజి

తము చరించుచు జనక సుతను బతి గుణ

నిర్జిత సుపూజితను గాంచ నేర కున్న

దుఃఖ వివశుఁ డయ్యె హనుమ తోరముగను

16.    

 

 

 

తే.గీ.

సచ్చరితుఁడు స్థిరమతి విచక్షణుండు

బహు విధోపాయ కుశలుండు మహ దమల మ

నస్కుఁడు చరించి పరిశీల నాభిరతుఁడు

నవనిజను గాంచ నేరక వ్యధితుఁ డయ్యె

17.    

 

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నేడవ సర్గము.

 

సుందర కాండము

సర్గము 8.

 

 

తే.గీ.

తప్త కాంచన జాల యుతమ్ము వజ్ర

రత్న భాసితమ్ము విమాన రత్న మా భ

వనము మధ్య గాంచెను గపి వరుఁడు మారు

తాత్మజుండు వీర వరేణ్యుఁ డద్భుతమును

1.      

 

 

 

చం.

అరుదగు నా విమాన మది యప్రతికారము నప్రమేయముం

గర మనురక్తి సాధు కృతకం బిది యింపుగ విశ్వకర్మ చేఁ

జరమగు నాకసమ్మున విశాల సమీర పథమ్ము నందునన్

సురుచిర సూర్య మార్గమున శోభిలు చుండును గాంతిమంతమై

2.     

 

 

 

మ.

గురు యత్నం బది లేక చేసినది యే కొంచెంబు లే దందులో

వర రత్నాకలితంబు కాని దట రవ్వంతైనఁ గన్పించునే

సుర లందైనను గాంచ నేరరట యస్తోకమ్ము లెవ్వారలుం

బర మాశ్చర్యము గాని దెక్కడ యపూర్వంబౌ విమానంబునన్

3.     

 

 

 

ఉ.

తేజు తపో బలార్జితము దివ్య విమానము పుష్పకాఖ్యయై

భ్రాజిత రూప సంపదల భావ మెఱింగి చరించు యానమే

యౌజస రాజి తాసన వరాధిక సంయుత నిర్మితమ్ము ని

ర్వ్యాజము లెల్ల భాగములు భవ్య తరమ్ములు దర్శనీయముల్

4.     

 

 

 

చం.

అతిశయ రీత్యుపాశ్రయ మహాకృతమై విలసిల్లు చుండు నీ

యతులిత చిత్ర కూటములు నత్యధి కమ్ముగ భాసితమ్ములే

మతి నలరించు చందమున మానిత మిందు రుచిప్రభాభమై

నుతగిరి కూట సన్నిభ మనోహర శృంగ విరాజితం బటన్

5.     

 

 

 

తే.గీ.

మోయుదురు విమానమ్మును భూత గణము

లు వివృత విశాల విధ్వస్త లోచనులు గ

గన నిశాచరులును మహాశనులు వేల

సంఖ్యలు కలసి మిక్కిలి శ్రమము తోడ

6.     

 

 

 

ఆ.వె.

ఆమని విరి గముల యందపుఁ జందము

భాసిలఁగ వసంత మాస కాంతిఁ

దనరు పుష్పకమును దర్శించె నవ్విమా

నమును దిరిగి వాయు నందనుండు

7.     

 

 

 

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నెనిమిదవ సర్గము.

 

 

సుందర కాండము

సర్గము 9.

 

 

తే.గీ.

ఆ మహా గృహాంతర సీమ నాయతంబు

భవన రాజము విపులమ్ము వాయు తనయుఁ

డరసెఁ బ్రాసాద షండము నర్ధ యోజ

నపు విరివి తోడ నొక యోజనంపుఁ బొడవు

1.      

 

 

 

కం.

హనుమంతుం డరి సూదనుఁ

డు నెరపె మార్గణ మపుడు కడు విచారమునన్

జనకాత్మజ నాయత లో

చనను గనఁ  దిరిగె రయమున సకల తలములన్

2.     

 

 

 

ఉ.

దారుణ రావ ణాలయము ధామ వరమ్ము కరద్వయత్రి చ

త్వార కరీంద్ర సంఘములఁ బన్నుగ నొప్పెడు రక్ష్యమాణ మై

వీర వరేణ్య దైత్య తతి భీకర శస్త్రని కాయ పాణులం

దోరము విస్తృతమ్ము గృహ తోరణ మా హరి చేరె నత్తఱిన్

3.     

 

 

 

చం.

మకర తిమింగిలమ్ములును మత్స్య విభేదములున్ భుజంగముల్

సకల వనాశ్రయమ్ములును జాగు సముద్రము వాయు కంపితం

బు కరణి రావణాంగనలు పొల్తులు ధర్షిత రాజకన్యలున్

సుకరము సంచరింపఁగ సుశోభిత మయ్యెను వేశ్మ మింపుగన్

4.     

 

 

 

తే.గీ.

వైశ్రవణుని యైశ్వర్యము వాసవు హరి

వాహనుని విభవమ్ము నవారితముగఁ

గలదు రావణ వేశ్మ నికాయములను

నిత్య వృద్ధి దాయకమునై సత్యముగను

5.     

 

 

 

కం.

యక్ష విభుండు కుబేరుని

యక్షయ సంపదకు వరుణుము భూతులకున్

రక్షోవిభు వేశ్మములన్

నిక్షిప్త మధికము నైన నిభముగ నైనన్

6.     

 

 

 

తే.గీ.

మహిత వేశ్మము తద్ధర్మ్య మధ్య మందుఁ

బెక్కు వాకిళ్ల సహితమ్ము పేర్మి నిర్మి

తమ్ము పరికించె నా వాయు తనయుఁ డయ్య

సుర వరాధి పావాసంబు చోద్యముగను

7.     

 

 

 

తే.గీ.

విశ్వకర్మ నిర్మాణము విశ్వసృజుని

కొఱకు దివ్యము రత్నసంకుల రుచిరము

పుష్పక విమాన మంతఁ దపో బలమున

గొనెఁ గుబేరుఁ డజుని నుండి కూర్మి తోడ

8.     

 

 

 

కం.

అగ్రజుఁ గుబేరు నిలబిలు

నుగ్ర రణమ్మున జయించి యుత్సాహమునన్

వ్యగ్రుండు రావణుఁడు ప్ర

త్యగ్రము పుష్పకము నంత హరియించె వడిన్

9.     

 

 

 

శా.

ఆధారంబుగ నిల్చి కంబములు నవ్యాలంకృ తేహా మృగ

ప్రాధా న్యాకలితంబు స్వర్ణ మయముల్  రంజిల్ల సందీప్తులై

యా ధాత్రీధరమైన మేరు గతి గూటాగారముల్ వే నభో

వీథిం దాఁకు ననన్ శుభాకృతుల నొప్పెం దద్విమానం బటన్

10.    

 

 

 

కం.

జ్వలనార్క నిభము సుర శి

ల్పి లలిత కలనమ్ము చారు వేదిక యుతముం

గలధౌతపుఁ దంతియలన్

విలసిల్లె విమాన మచట వివశాత్మకమై

11.    

 

 

 

సీ.

 

 

జాల గవాక్ష సంచయ మెల్ల కాంచ నా

            ర్క మయమ్ము ఘన వేదికలు మహేంద్ర

నీల మహానీల నిర్మితమ్ములు ముక్త

            చిత్ర విద్రుమ విలసిత తలములు

తప్త కాంచన రాజిత రుచిప్రభలఁ బుణ్య

            గంధ చందన వర్ణ కరణఁ దరుణ

సూర్య నిభమ్ము సుశోభిత సురుచి రా

            కార కూటాగార గణ యుతమ్ము

 

 

 

 

ఆ.వె.

దానవ విభు ఘన విమాన మాపుష్ప కా

ఖ్యమును దివ్యమును వికాస మాన

మును మహా విచిత్రమును వాయు తనయుండు

కపి వరేణ్యుఁ డెక్కి కలయఁ దిరిగె

12.    

 

 

 

తే.గీ.

దండ నిలిచి హరి హనుమంతుండు భక్ష్య

పాన రాశి సంభవ గంధ లీన వాత

మంత మోహ కారక మట నాస్వదించె

మారుతి ధరించె రూపము మారుత మన

13.    

 

 

 

తే.గీ.

బంధువును బిల్చు చందము బంధువ! రు

గుమని రావణు చెంతకుఁ గోరి చేర్చె

గంధ మా మహాసత్త్వునిఁ గపి వరేణ్యు

ని విమల మతిని రావణ నిలయమునకు

14.    

 

 

 

ఉ.

అంతట వాయు పుత్రుఁడు మహావృత శాల విశాలమున్ మనః

కాంతము రాక్షసేంద్రునకు గారపు పట్టపు రాణి వోలె నా

ద్యంతము కాంతిమంతమును దర్శన లాలసఁ జేరె నచ్చటన్

వింతగ వాయు వేగమున వీరుఁడు నంచిత కార్యదక్షుఁడున్

15.    

 

 

 

తే.గీ.

మణులు వొదిగిన మెట్లును మంచి పటిక

ము లదిమిన నేల బంగరపుఁ గిటికీలు

దంతముల మధ్య వెండిని వింత గొలుప

గూర్చి రా శాల నంతటఁ గూర్మి తోడ

16.    

 

 

 

ఆ.వె.

వెండి బంగరముల మెండగు ముత్యము

లు పగడముల వెల్గులు మది కింపు

గూర్ప మణుల తోడఁ గూడి కంబమ్ము ల

నేకము లమరె నట నేర్పు మీ

17.    

 

 

 

కం.

కొమరారు నిట్టలు నెరుల

నమరగఁ గొన్ని మరి కొన్ని యవి తిన్ననివై

యమరంగ రెక్కలన నా

కము దాఁకు ననంగఁ దోఁచెఁ గరము పొడవునన్

18.    

 

 

 

తే.గీ.

వివిధ దేశముల మహా నివేశనముల

ప్రతిమ లున్న కంబళులు ధరణి నవి తల

పింపఁ బఱచి రా శాల యందింపు నొసఁగఁ

గప్పుచుఁ దలము నెల్ల సౌకర్యముగను

19.    

 

 

 

తే.గీ.

కిలకిల రవము లంత పక్షిగణ కృతము

లెల్లెడ ప్రతిధ్వనింపఁగ నింపగు జల

తారు జవనిక లల్లాడఁ దావు లచట

హాయి నొసఁగ మెఱసె నసురాధిపు నిలు

20.   

 

 

 

తే.గీ.

అగరు ధూప మయమ్ము రాయంచ తెల్లఁ

దనము విమలమ్ము చిత్రాంచిత కుసుమ సమ

లంకృత విరాజితమ్ము సురభి నిభ సురు

చిర శుభప్రభా చయ విలసిత సదనము

21.    

 

 

 

కం.

హృదయానంద కరమ్మును

ముద సంజనన వర వర్ణ భూయిష్ఠము స

మ్మద సంపత్కారకము న

తి దివ్య మనుశోక సుప్రతిహతం బనఁగన్

22.   

 

 

 

తే.గీ.

ఇంద్రియమ్ముల నైదింటి నింద్రి యార్థ

ములఁ దనుపు ల్లి వలె దైత్య పుంగవ నిజ

పాలిత నివేశనమ్మటఁ బరిఢవిల్లె

మారుతాత్మజ మనమంత మరులు గొలుప

23.   

 

 

 

ఆ.వె.

ఇది దివ మిది యనిమి షేంద్ర లోకము దేవ

లోక మియ్యది జగదైక సిద్ధి

నాఁ దలంచె వాయు నందనుం డాగృహ

రాజ మెల్ల గాంచి భ్రాజితమ్ము

24.   

 

 

 

ఉ.

కాచిన యన్ని పందెములఁ గైరవ వీర వరేణ్యు చేతి లోఁ

బాచిక లాట నోడిన విపన్నుఁడు జూదరి చంద మొప్పగం

దోఁచెను దీప రాసు లటఁ దోరపుఁ గాంతుల మౌనముద్ర లా

లోచన లంచు నిల్చిన విలోకను లందఱి ముంద టత్తఱిన్              

25.   

 

 

 

కం

దివ్వియల వెలుంగుల తో

రవ్వలు పొదిగిన వరాభరణ సుప్రభలన్

నివ్వటిలె నని తలఁచె హరి

సవ్వడితో రావణోపజన తేజమునన్

26.   

 

 

 

కం.

వర వస్త్రమాల విలసిత

తరుణీ మణులు బహు వేష ధర లాసీనా

సుర కాంతా దశ శతముల

హరివీరుఁడు గాంచె రావణాసుర శాలన్

27.   

 

 

 

తే.గీ.

అర్ధ రాత్రి వరకు నాట లందు నలసి

పాన నిద్రావశమ్మున మేను మఱచి

వివశలై శయనించిరి యువిద లెల్ల

రచ్చట బలవంతముగను నాద మఱచి

28.   

 

 

 

తే.గీ.

భూషణ రవ విరహితమై పొల్చె నా గృ

హమ్ము నిదురింపఁ బూఁబోఁడు లంద ఱచట

హంస మధుకర గణ నినా దాపహృత న

లిన వనము భంగి నర్ధ రాత్రి మహితముగ

29.   

 

 

 

కం.

అధరావృత దంతమ్ముల

సుధాంశు నిభ వదనములను జూచెఁ గపీంద్రుం

డు ధరణిజ కొఱకుఁ రిపరి

విధముల వనితామణులను విరి గంధలనే

30.   

 

 

 

కం.

ఉదయమ్మున వికసించిన

మృదుతర పద్మములఁ బోలి భృశ యామవతిన్

ఛద నివృతమౌ కమలము ల

నఁదగు నని తలంచె వారి నయముగ హరియే

31.    

 

 

 

ఆ.వె.

ముదితలు గుమిగూడ ముఖపద్మములు గాంచి

భ్రమర గణము లెల్ల భ్రాంతిఁ జెంది

యంబుజమ్ము లనుచు ననిశమ్ము గోరుచుఁ

దిరిగి తిరిగి మరల మరల మూఁగె

32.   

 

 

 

కం.

వారి గుణ గణార్హమ్ముల

వారిజ తుల్యలె యనంగఁ బన్నుగఁ జెల్లున్

మారుతి మహాకపి తలఁచె

వారిజ నయనలను గాంచి వనితా మణులన్

33.   

 

 

 

కం.

ఆ రావణ శాల తనరె

నా రామా గణ విరాజి తారామంబై

తారా గణ సంశోభిత

శారద రజనీ విహాయస నిభమ్మనగన్

34.   

 

 

 

కం.

పరివారిత నారీగణ

విరాజి తాసుర గణైక విభు డటఁ దనరెన్

సురుచిర తారాగణ సం

పరివేష్టిత శీతరశ్మిభాతి నిభమునన్

35.   

 

 

 

కం.

పుణ్యావసాదనమున ధ

రణ్యవతరణంబు లైన రాత్రిజములు లా

వణ్య వనితా నిచయముల

గణ్యములుగ వెలసె నంచుఁ గపివరుఁ డెంచెన్

36.   

 

 

 

తే.గీ.

ధగధగమను కాంతులనీను  తారల వలె

నిశ్చయమ్ముగ వెల్గిరి నెలఁత లచట

నిజ తను రుచి పుంజములఁ గని విని యెఱుఁగ

ని విధముల రావణాసుర నివసనమున

37.   

 

 

 

ఉ.

దండలు భూషణమ్ము లటఁ దండములై పడ దారితమ్ములై

మెండుగ ద్రాగి మద్యమును మేనులు తూలఁగ నాట పాటలన్

గుండెలు ఝల్లు ఝల్లుమనఁ గున్కుల నాపఁగ లేక మత్తులై

పండిరి చిత్తముల్ మఱచి పన్నుగ భామలు సోలి యెల్లరున్

38.   

 

 

 

తే.గీ.

చెదరి నట్టి బొట్టులను మంజీరములు తొ

లగఁగ నూడిన కంఠహారమ్ముల వని

తలు నలుదిశలఁ గనిపింప నలరె గృహము

రావణాంతఃపుర మది విలాసముగను

39.   

 

 

 

తే.గీ.

ముత్యపు సరుల గొందఱు ముడివడిన మొ

ల గొలుసులఁ గొందఱుండఁ దొలఁగిన వసన

ములను మఱి కొంద ఱింపగు ముగ్ధ లచట

నలసిన బడబలను బోలి యలరిరి కన

40.   

 

 

 

తే.గీ.

నలిఁగి తెగిన పూదండల నాతు లన్యు

లు కమనీయ కుండలముల లోల లోచ

నులు వనము నందు గజరాజు వలన కరము

కమలిన లతల సదృశమ్ము కన్పడి రట

41.    

 

 

 

కం.

ఉరమున హారములు సుధా

కర కిరణాభ రుచిరములు కమనీయముగన్

ధరియించిన పూఁబోఁడు ల

లరిరి సుసుప్త కలహంసల సమూహ మనన్

42.   

 

 

 

కం.

వైడూర్యములు ధరింపఁగ

నాడ పడుచులు మరి కొంద ఱచట వడిం దా

రాడెడు కాదంబములే

చూడఁగ జక్కవలు హేమ సూత్రములఁ బరుల్

43.   

 

 

 

ఆ.వె.

ఆ వనితలు సైక తాభ జఘనములఁ

దనరి రచట వర నదముల భంగి

నమల చక్రవాక హంస కారండవా

వృత విభాసితములు నుత జలములు

44.   

 

 

 

కం.

అందియలు మొగ్గ లన నర

విందములుగ భూషణములు వెలదులు నదులౌ

చందమె సుమి యశము తటులు

డెందపుఁ దలఁపులు మొసళ్ల ఠీవిని నమరన్

45.   

 

 

 

తే.గీ.

మృదుత రోరుభాగమ్ముల మేలిమి పసిఁ

డి తొడవుల ముద్రలు పడఁ గడింది వెలిఁగె

భూషణమ్ములై యింపుగఁ బొలఁతు లిందు

వదనలకు కొందఱ కచట నిదురవోవ

46.   

 

 

 

కం.

చేలాంచలములు ముఖమున

లీలగ నల్లాడె నొక్క లేమకు నన్యుల్

గాలి విడువ నూపిరి వే

పీలిచి వయ్యారముగ నవిరళం బగుచున్

47.   

 

 

 

కం.

అఖిలాంగ వర్ణ సిత శశి

ముఖ దార ముఖ రుచి తేజముల నట వెలిఁగెన్

ముఖ మూలమ్ములఁ జలితము

లఖి లాంచలములు స్ఫురింప నా ధ్వజము లనన్

48.   

 

 

 

కం.

రమణీ రత్న వరానన

కమలచ్యుత మంద వాయు కంపిత కలధౌ

త మయాంచిత కుండలములు

కమనీయముగఁ గదలాడెఁ గాంతుల తోడన్

49.   

 

 

 

ఆ.వె.

సహజ గంధవతుల శర్కరాసవ గంధ

సహిత వదన నిశ్వసన సుసేవి

తుండు రాక్షస పతి తోయజనేత్ర సం

సేవితుండు ఘనుఁడు రావణుండు

50.   

 

 

 

తే.గీ.

రాక్షసాధిపు దారలు రావణాన

న మనుకొని సవతుల వదన కమలములు

మూర్కొనిరి పలుమారులు మోహ మలర

భీమ నిద్రా వశ గత వివేకములను

51.    

 

 

 

కం.

అమితాసక్త మనస్సులు

ప్రమదలు రావణుని పైన పరవశ్యు లటం

దమ సవతుల కెల్లరకును

బ్రమోద మొనఁగూడు నట్లు పరఁగిరి ప్రేమన్

52.   

 

 

 

కం.

భామలు కొందఱు దిండుగఁ

గోమల హస్తమ్ములు మఱి కొందఱు వలువల్

సేమముగ నుంచి పండిరి

హేమ విభూషణ వరమ్ము లెల్లెడఁ జెదరన్

53.   

 

 

 

ఆ.వె.

ఒకరి భుజము పైన నొకరుండ నొకరి వ

క్షమ్ము పైన వేరొకరును నొకరి

యంకము పయి నుండి రింకొకరును నిజ

భుజము తలగడగను బొర్లె నొకతె

54.   

 

 

 

కం.

ఊరువులు పార్శ్వము లికం

దోరంపుఁ గటులు నడుములు తొయ్యలులవి యే

చేరి పెనఁగె నొకరి వొకరి

పై రాగము మీర మోహ వైవశ్యమునన్

55.   

 

 

 

తే.గీ.

భుజములు పరస్పర మిలితము లయి మాల

యై విరాజిల్లె సూత్ర బద్ధాంచి తాళి

గణ సహిత సుమమాల నికాశముగను

దోయజాక్షులు వివశలై తూఁగు చుండ

56.   

 

 

 

ఉ.

రావణ యోషితా వనము రాజిలె నంత వసంత మాస మం

దా విరబూసి వెల్గెడు లతావళి తోడుతఁ బుష్పరాజి తోఁ

బీవపు వాయు సంగమున వీఁగ పెనంగి మనోహరంబుగం

దావుల మూర్కొనంగ నలి తండము కానన సన్నిభమ్ముగన్

57.   

 

 

 

ఆ.వె.

శక్యమే తెలిసిన జనులకైన నుడువ

భేద మంగ భూష ణాదు లంబ

రముల స్రజము లందు రమణీమణులఁ గాంచి

సంశయమ్ము లేని సరణి నచట

58.   

 

 

 

ఆ.వె.

రావణుండు నిద్ర వోవ నెఱింగి మ

హా రుచుల వెలంగు నసుర రాజ

కాంతలఁ గనె నేమొ కాంచన దీపముల్

ఱెప్ప లెల్ల నంత నప్ప గించి

59.   

 

 

 

మ.

ధర రాజర్షి నికాయ దైత్య పితృ గంధర్వాత్మ సంజాతలున్

వర రక్షోగణ రమ్య కన్యకలు విభ్రాంతల్ వశంబైరి యు

ద్ధ ర తేంద్రారికి నెమ్మిఁ గొంద ఱికఁ గందర్పప్రభా వశ్యలై

దుర మం దోడగ నంతఁ గొందఱు వడిన్ దోర్దండ సత్త్వమ్మునన్

60.   

 

 

 

చం.

అటఁగన జానకీసతి వరార్హను వీడి వెలందు లందు మి

క్కుటముగు సత్తుఁ జూపి యటఁ గూర్చిన కాంతలు లేరు సూడగం

బటుతర వంశ జాతకలె భామలు సర్వు లనన్య చిత్తలే

ట మును బెండ్లి యైన సతు లచ్చట లేరు దశాస్యు చెంతనన్

61.    

 

 

 

కం.

అకులీనలు హీనాంగుల

నఁ గాంతునకు నప్రియవచనలు నకుశలలున్

సకల కళత్రము లందుఁ బ

రికింప నబల లవినయులు లే రొక రయినన్

62.   

 

 

 

తే.గీ.

తోఁచె బుద్ధిమంతు హనుమంతు మన మందు

రాక్షసాంగన లెల్లరు రావణుని ర

మించు విధమున జానకి మేటి వంశ

జాత రాముఁ గూడినఁ జూడ సాధు వగును

63.   

 

 

 

తే.గీ.

స్వీయ రూపము ధరియించి చింత సేసె

హనుమ గుణవంతురాలు మహా పతివ్ర

తావనిజఁ దెచ్చి రావణుఁ డతి దురితము

న కొడికట్టె నీ లంకాధినాథుఁ డనుచు

64.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందుఁ దొమ్మిదవ సర్గము.

 

 

సుందర కాండము

సర్గము 10.

 

 

ఉ.

తోరపు దాంత కాంచన విదూరజ సంస్థిత రత్న తల్పముల్

చారు తరోత్తమ స్ఫటిక సంవృత దివ్య ని భాసనమ్ములున్

మారుతి వీక్ష ణాతురుఁడు మందిర మందు విలాసవంతమై

మూరఁగ వైభవ ప్రతతి పూర్ణము నచ్చటఁ గాంచె నింపుగన్

1.      

 

 

 

ఆ.వె.

అచ్చట నొక మూల హరి వరేణ్యుఁడు గాంచె

రాజు ఛత్రము శిశిరకర నిభము

విమల పాండు వర్ణ విలసిత ముత్తమం

పు విరిదండల సువిభూషితమ్ము

2.     

 

 

 

మ.

హనుమంతుం డటఁ గాంచెఁ దప్త కలధౌతాలిప్తమున్ భాసమా

న నభోరత్న నికాశ భాసురము సూన శ్రేష్ట మాలాభి శో

భి నవైణాంక నిభానన వ్యజన సంవీతమ్మునున్ ధూప చం

దన సంజుష్టము సంస్త రావృతము సద్భాసమ్ము నౌశీరమున్

3.     

 

 

 

ఆ.వె.

ఆవికాజిన వృత మమల మాలాభి శో

భితము చంద నాగరు తతి ధూపి

తమ్ము సంతతమ్ము దైత్య రాజ వరాస

నమ్ము నద్భు తమ్ము నెమ్మిఁ జూచె

4.     

 

 

 

సీ.

 

 

 

 

 

మేఘ సంకాశంపు మేను వాఁడు రుచిర

            కుండలమ్ముల వాఁడు కుసుమ మలిమి

న కనుల వాఁడు ఘనమగు హస్తమ్ముల

            వాఁడు విమల రౌప్య వస్త్ర రాజ

ముల వాఁడు రోహితంపు సుగంధ చందన

            లిప్తాంగముల వాఁడు రిక్క దారిఁ

దిరుగాడు నరుణంపు మెరుపుల తోటి జ

            లధర నిభము వాఁడు లలిత రూప

 

 

 

 

తే.గీ.

ము కలవాఁడు సుభూషణముల నలరెడు

వాఁడు కామరూపము లూను వాఁడు నసుర

కాంతలకు ప్రియతముఁడు సుఖప్రదుండు

రాక్షసాధిపుని సుసుప్తు రావణుఁ గనె

5.     

 

 

 

తే.గీ.

రాతిరి సుఖమ్ములఁ దనరి త్రాగి విశ్ర

మింప శయన వరమున నమేయ వృక్ష

గుల్మ వన యుత మందర కుధరము గతి

మారుతి విభూషితు నసుర వీరుఁ గాంచె

6.     

 

 

 

తే.గీ.

కాల సర్పము వోలెను గరము నిశ్వ

సించు రావణు దరిఁ జేరి చెంది భయము

వానరర్షభుండు తొలఁగె వ్యాకులమ్ము

నఁ ద్రుటి భీకరాకార దానవునిఁ గాంచి

7.     

 

 

 

కం.

సోపానముఁ జేరి విలసి

తాపరమౌ వేదికాత లాశ్రితు డౌచుం

దాఁ బరిశీలించె నసురు

నా పలలాధీశ్వరుని దశాస్యుని సుప్తున్

8.     

 

 

 

కం.

రావణ నిద్రిత శయ్య మ

హా వారణ యుత సరోవ రాభము వెలిఁగెన్

సౌవర్ణాంగద భూషిత

రావణ కర మొప్పె వేల్పురాయని ధ్వజమై

9.     

 

 

 

సీ.

 

 

 

ఐరావత విషాణ దారితములు వజ్ర

            ఘాత సంకేత ప్రకటితములును

విష్ణు చక్ర క్షత పీడితములు పీన

            సమజాత ఘన బల సంయుతములు

లక్ష ణాంగుష్ఠ విలసిత నఖమ్ములు

            స్వంగుళీ తలరుచి భాసితములు

సుదృఢ పరిఘ నిభ శుండాల కర తుల్య

            ములు శయన స్థితములును పంచ

 

 

 

 

తే.గీ.

శీర్ష పన్నగ నిభములు శీత గంధ

శశ రుధిర సమ చందన చర్చితములు

వర తలోదరీ విమృదిత భాసురములు

కర యుగమ్ములఁ గాంచెను హరి వరుండు

10.    

 

 

 

తే.గీ.

యక్ష గంధర్వ కాకోద రాసుర సుర

రావణ కర కరములు తల్పగత కర యు

గమ్ము మందర కందర గత సుసుప్త

పన్నగ ద్వయ నిభమును గన్నులఁ గనె

11.    

 

 

 

తే.గీ.

సుపరి పూర్ణ భుజద్వయ శోభి తాసు

రేంద్రుఁడు విలసిల్లె నచట నింపుగ నచ

ల సదృశుండు ఘనుఁడు శిఖర ద్వయ యుత

మంద రాచల సన్నిభ మహిమ తోడ

12.    

 

 

 

తే.గీ.

చూత పున్నాగ వకుల ససురభి గంధ

సంయుతమ్ము మృష్టాన్న రస యుత పాన

గంధ సహితమ్ము ఘన తల్పగత దశాన

నచ్యు తోచ్ఛ్వాస మా సదనమున నిండె

13.    

 

 

 

సీ.

 

 

 

 

 

 

ముక్తామణి సువర్ణ యుక్త భూషణ విరా

            జితుని సమీప సంస్థిత మకుటునిఁ

గుండల జ్వలిత ముఖుని రక్త చందన

            లిప్తాంగుని సలిల సుప్త కుంజ

ర నిభుని హార విరాజిత కంఠునిఁ

            బీనాయత విశాల వివృత వక్షు

ధవళ కౌశేయ వస్త్ర విలాసితుని రక్త

            నేత్రుని మాష వినీల గాత్రుఁ

 

 

 

 

తే.గీ.

బీత వాసోత్తమతమ సంవీత విభుని

దీప చాతుష్క దీపిత దిగ్విలాసు

సాశని జలద నిభుని నిజ పద సంస్థి

త గృహిణీ వర భాసిత దైత్యుఁ గాంచె

14.    

 

 

 

తే.గీ.

చంద్ర సురుచి వదనలను జారు కుండ

ల వర భూషితలను విమలతర మాల్య

కాంచ నాభరణ విలాస కాంత లసుర

నాథ సతులను హరిమృగ నాథుఁడు గనె

15.    

 

 

 

ఆ.వె.

నృత్త వాద్య నైపుణీ వరాంగనలు వ

రాభరణ విభూషి తాసమాన

సుందరులు దశాస్య సుభుజాశ్రిత నిషణ్ణ

మానినీ గణముల మారుతి గనె

16.    

 

 

 

కం.

లలనా మణి వైడూర్య మ

ణి లసద్వజ్ర కలిత రమణీయ శ్రవణాం

త లలిత రుచి కుండలములఁ

గలధౌ తాంగదముల హరి గాంచె గృహమునన్

17.    

 

 

 

కం.

తారాగణ సంశోభిత

తారాధ్వము వోలెఁ దోచె ధవళ క రాస్యా

గారము కుండల శోభా

పార విరాజిత విమాన వరమటఁ జూడన్

18.    

 

 

 

ఆ.వె.

అలసి సొలసిన యసు రాధిపు భార్యలు

వారి వారి వీలు మేర జారి

రంత నిద్ర కింతు లందరు నింపుగ

సన్న మధ్యలు వల పున్న వారు

19.    

 

 

 

ఆ.వె.

నర్తకీ మణి యొక నారీమణి తనర

నటన భంగిమలను నాట్య రీతు

లమరు నట్లు శుభపు టవయువములఁ బేర్చి

నిదుర కొరిగె నంత నిశ్చలముగ

20.   

 

 

 

ఆ.వె.

వేరొక నలినాక్షి వీణ నొదిగి శయ

నింప వెలిఁగెను నళినీ ప్రరోహ

ము తటినీ ప్రకీర్ణమున నావ నాశ్రయిం

చు గతిఁ దోఁచుచు నటఁ జోద్యముగను

21.    

 

 

 

కం.

నల్లని కన్నుల చిన్నది

యల్లనఁ జంకను మృదంగ మమరఁ గునుకగం

బిల్లను నెత్తుకొనిన యొక

తల్లి యనంగఁ గనిపించెఁ దత్సమయమునన్

22.   

 

 

 

కం.

మరియొక్క సుందరాంగి రు

చిర స్తని పటహము వేడ్కఁ జేతఁ గొని బిగిం

చి రమణుని కౌఁగిలించెడు

కరణిం బట్టి నిదురించెఁ గమనీయముగన్

23.   

 

 

 

ఆ.వె.

ప్రియుని నేకతమునఁ బ్రేమ మీఱఁగఁ బరి

ష్వంగ మాచరించు భంగి కమల

లోచన యొక వనిత దాఁచి కరమ్ముల

వంశము నిదురించె వన్నె లొలుక

24.   

 

 

 

ఆ.వె.

వీణ మీద వ్రాలి ప్రియునిఁ జేరి యలరు

పడఁతి భంగి యొక్క భామ నాట్య

కత్తియ శయనించె నత్తఱి నిద్రా వ

శమున మేను మఱచి శయ్య మీద

25.   

 

 

 

ఆ.వె.

మృదు మనోహర పృథు సదమలాంగి కనక

రుచి నిభ తను మత్తలోచన యొక

ముద్దియ నిదురించె మద్దెలఁ బీడించి

కర కమలముల నతి పరవశమున

26.   

 

 

 

తే.గీ.

తప్పెట భుజాంతరమ్మునఁ దరుణి యొకతె

యుంచి యొప్పుల కుప్ప కృశోదరి నిదు

రించెఁ గందర్ప రాగ విలీన తన్వి

కక్ష భాగమందు నునిచి కదల కుండ

27.   

 

 

 

కం.

సరసన నింపుగ డిండిమ

వర వాద్యంబుంచి సవ్య బాహు పరిష్వం

గ రతమ్మున నిద్రించెను

దరుణ సుతాలింగన గతి తరుణీ మణియే

28.   

 

 

 

కం.

నారీ లలామ మపరము

తోరపు టాడంబరమును దోర్యుగళమునన్

భారముగఁ బట్టి కునికెను

జారు కమల నయన కుసుమ శర ఘన వశయై

29.   

 

 

 

కం.

కలశమ్మును నేల నునిచి

కలకంఠి యొకతె పరుండె కమనీయముగన్

విలసిల్లె నట వసంత వి

మల తర పుష్ప చయ శబల మాల యనంగన్

30.   

 

 

 

కం.

కరముల రెంటిని నానిచి

యురమున బోరగిలి రమణి యొకతె పరుండెం

గరము వశంబై నిద్రకుఁ

దరుణీ మణుల నడుమ సమద మతి ముదముగన్

31.    

 

 

 

తే.గీ.

పూర్ణ చంద్ర నిభానన పొలఁతి యొకతె

మదన వివశాత్మ ముదమార సుదతి నొక్క

దాని నాలింగనము సేసి మేను బులక

రింప నిదురించె నచ్చట నంచితముగ

32.   

 

 

 

తే.గీ.

హత్తుకొని తమ వాద్యము లబల లచట

మత్తిలి పరుండి రెల్లరు మగలఁ గౌఁగి

లించుకొను మగువల వోలె నెంచ దనరి

యంతిపురమందు నిండిరి యింతు లెల్ల

33.   

 

 

 

తే.గీ.

కపివరుండు దర్శించె నేకతము నందుఁ

దరుణు లెల్లర కతి దూర తల్ప రాజ

మందు శయనించి నట్టి రూపాతిశయ వి

లాసవతి నపర వనితా రత్నము నట

34.   

 

 

 

మ.

వర ముక్తామణి సంయు తాభరణముల్ భాసిల్లగన్ స్వీయ దే

హ రుచివ్రాత సుదీపి తావరణ దైత్యాంతఃపు రాధీశ్వరిం

దరుణాదిత్య సుగౌర వర్ణ కలధౌతశ్రేష్ట వర్ణాంగినే

దరహా సానన మారుతాత్మజుఁ డటన్ దర్శించె మందోదరిన్

35.   

 

 

 

తే.గీ.

భూషిత వరాంగిఁ గాంచి యా భుజ బలుండు

రూప యౌవన సంపదలు తలఁపించె

నవనిజ నని తలఁచి మారుతాత్మజుండు

హర్షమొందెఁ గంటిని సీత ననుచు నంత

36.   

 

 

 

కం.

జబ్బలు సఱచుచు గంతుల

నబ్బురముగఁ గంబ మెక్కి యవనిం బడెఁ దా

నుబ్బుచుఁ బాడెను వాలము

దబ్బునఁ జుంబించి చూపెఁ దన కపి గుణముల్

37.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందుఁ బదవ సర్గము.

సుందర కాండము

సర్గము 11.

 

 

తే.గీ.

సీత తానెట్లగు ననుచుఁ జింత సేసెఁ

దిరిగి మదిని మహాకపి తరమె సతికి

నిద్ర సేయ భుజింపఁగ భద్రముగను

ద్రాగఁగ నలంకరింపఁగ రాము వీడి

1.      

 

 

 

తే.గీ.

మూడు లోకము లందును లేఁడు సముఁడు

రఘువరునకు వెదుకఁగఁ బరమ పతివ్ర

తా మతల్లి యన్యుని నెట్లు తలఁచు నీమె

వేరనుచుఁ బాన భూమికి వేగ యేఁగె

2.     

 

 

 

కం.

ఆటల శ్రమింపఁ గొందఱుఁ

బాటల మరి కొంద ఱంత వర నృత్యములన్

బోటులు కొందఱు పానపు

ధాటికి సొలసిరి ఘనముగఁ దరుణీ మణులే

3.     

 

 

 

ఆ.వె.

తప్పెట పయి నొదిగెఁ జప్పున నొక కాంత

మద్దెలఁ బడె నొక్క ముద్దరాలు

పీఠ మాశ్రయించె బింబోష్ఠి యొక్కతె

యాస్తరణమున నొక యబల తూఁగె

4.     

 

 

 

చం.

ముదితల స్వర్ణ భూషణ విభూషితలం గపి చూచె నచ్చటన్

సదమల రూప భాషణ విశారద భామల గీత భావ కో

విదల సహస్ర సంఖ్యల వివేక సుయుక్త వచో విశిష్టలన్

మదన విలాస తోషిత సమంచిత మానినులన్ సుసుప్తలన్

5.     

 

 

 

తే.గీ.

దేశ కాలజ్ఞ కాంతా నిదేశ మందు

రాక్షసేశ్వరుఁడు వెలిఁగె వ్రజము నందు

గోగణాంతర చరిత కకుద్మి యనఁగ

వన కరేణు వేష్టిత ఘన వారణ మ

6.     

 

 

 

తే.గీ.

రాక్షసేంద్ర మహాగృహ రాజమున హ

రీశ్వరుండు వాయుజుఁడు దర్శించెఁ బాన

భూమిని సకల వస్తు సమూహ భరిత

మై వెలుఁగుచున్న దాని నిరంతరమ్ము

7.     

 

 

 

కం.

మృగముల మహిషమ్ముల నడ

వి గూఁటుల పొలసుల నచట విడివిడిగ నమ

ర్పఁగ వెలుఁ గొందెడి యా పా

న గృహము దర్శించె వాయు నందనుఁ డంతన్

8.     

 

 

 

తే.గీ.

స్వర్ణ మయ విశా లాంచిత పాత్ర లందు

నర్ధ భక్షిత పలల పదార్థములును

గుక్కుట మయూర సంయుత వృక్క రాసు

లెల్ల దర్శన మిచ్చెఁ గపీశ్వరునకు

9.     

 

 

 

కం.

దధి సౌవర్చల రాసుల

నధి కాస్థి నిచయముల హరి ణార్జున తతులన్

వ్యధిత కిటి ఖడ్గమృగముల

నధికమ్ముగఁ గాంచె నచట హరి సత్తముఁడే

10.    

 

 

 

తే.గీ.

మహిష మత్స్యాజ సమ పక్వ మాంసములను

బక చకోర సిద్ధ వివిధ పలల రాసు

లర్ధ భక్షితములఁ గాంచె హరి వరుండు

లేహ్య భోజ్య పేయములు లలితము లచట

11.    

 

 

 

తే.గీ.

ఆమ్ల లవణ కలిత వివి ధాసమాన

షాడబము లొలుక రుచిర స్వర్ణ హార

నూపు రాంగ దాదు లటఁ గనులు చెదరఁగఁ

బడ విరాజిలె నింపుగఁ బాన భూమి

12.    

 

 

 

కం.

వివిధ ఫల పుష్ప రాసుల

ట విరివి యై చెదరి కనుపడఁగ నేలం బా

న విశేషము లొలుక భృశము

భువి రాజిల్ల హరి పాన భూమినిఁ జూచెన్

13.    

 

 

 

కం.

చక్కఁగ శయ నాసనములు

వెక్కు లమర్ప నచ టచట వింతగ వెల్గెన్

మిక్కుటముగ నగ్నియ లే

కక్కడ పాన గృహ మెల్ల నతుల ప్రభలన్

14.    

 

 

 

కం.

నానా ప్రకార సంస్కా

రానేక పదార్థ సంస్కృ తాశేష పలా

హీన కుశల పాకమ్ములు

పాన గృహ వరమ్మున హరి పన్నుగఁ గాంచెన్

15.    

 

 

 

తే.గీ.

మధు ఫల కుసుమ శర్కర మయ సురా వి

శేషములు సుగంధ యుత విశిష్ట చూర్ణ

ములు విశుద్ధములు వివిధములను వేఱు

వేఱ దివ్యముల చటఁ బేర్పఁ గనెను

16.    

 

 

 

తే.గీ.

అమరఁగ వెలిఁగె పూదండ లచట వివిధ

రీతు లాపాన భూమి వరిష్ఠ భాజ

నమ్ములు స్ఫటిక కృతముల నాణ్యతర సు

వర్ణ కరక సంచయముల భాసురముగ

17.    

 

 

 

తే.గీ.

కుండ లందును వెండి పసిండి పాత్ర

లందు విరివియై యుండఁగ నా సురా వి

శేషములఁ గాంచె నా కపిశ్రేష్ఠుఁ డచట

పానభూమి భాసిల్ల నపారముగను

18.    

 

 

 

కం.

ద్రాక్షాసవ పానీయ సు

నిక్షిప్త రజత కనక మణి ఖచిత పాత్రల్

రక్షోధిపు పానస్థలి

వీక్షించె మరుత్సుతుండు విపరీతముగన్

19.    

 

 

 

కం.

ఒకచోఁ గొంచెము మిగిలిన

నొకచో నిశ్శేషమయ్యె నొకచో గన నిం

చుకయుం ద్రాగక మిగులన్

సకలము మద్యము ల హరి సందర్శించెన్

20.   

 

 

 

ఆ.వె.

వివిధ భక్ష్యములను విరివిగ పానీయ

ములను వేఱు వేఱ ముదము గొల్ప

గాంచుచు నవశేష కలశాన్నము లచటఁ

గపివరుఁడు చరించె రిపు గృహమున

21.    

 

 

 

తే.గీ.

భిన్న మధుపాత్ర లొకచోటఁ బృధు ఘటము ల

టు నిటు దొర్లుచు నొక్కచోటున ఫలములు

జలము లొక్కెడఁ గనిపించె సంయుతమయి

పూల మాలల తోడ నద్భుతముగ నట

22.   

 

 

 

ఉ.

అందము లొల్కు తల్పముల నంగన లచ్చటఁ గౌగిలింతలన్

డెందము సంతసింపగ వడిన్ నిదురింపఁగఁ గొన్ని యుండగన్

సుందర తల్ప రాజములు శూన్యములై విలసిల్లె నచ్చటన్

మందిర మందు కొన్ని యసమాన విశేష విలాస రీతులన్

23.   

 

 

 

చం.

వనితలు కొంద ఱేమఱచి పండఁగ నన్యులు కొంద ఱంత వే

నువుగ వారి వస్త్రముల నంది కరమ్ముల సుందరమ్ములౌ

తనువులు గప్పు కొంటిరి నితంబిను లాగక నిద్ర కత్తఱిం

గునికిరి శయ్య లందు వర కోమల తన్వులు నిశ్చలమ్ముగన్

24.   

 

 

 

తే.గీ.

వారి యూపిరి గాలికి వారి వారి                                       

వస్త్ర మాల్యము లవయవ భాసితములు

గదలె మెల్లగఁ జిత్రముగ ననిలమ్ము

వడయ మందముగఁ గదలు భంగి నచట

25.   

 

 

 

ఉ.

శీతల గంధ చందన సుశీధు రసాకలి తానిలమ్ము లా

యాతత పుష్ప మాల్య సహి తామల ధూపయుతానిలమ్ములున్

వాత విశేషము ల్పఱఁగె వాసన లీనుచు పాన శాల లో

నా తఱి మిక్కుటమ్ముగ మహాసుర రాజ విమాన మం దటన్

26.   

 

 

 

కం.

స్నానానంతర చందన

నానా ధూపానులేపన సుగం ధాహీ

నానిల మట ప్రసరించె వి

మానం బాపుష్పకమున మధుర తరంబై

27.   

 

 

 

ఆ.వె.

రాక్షస గృహ మందు రాక్ష సాంగనలను

శ్యామ ధవళ కృష్ణ సదమల కన

క నిభ దేహ రుచిర కాంతా మణులఁ గాంచె

వాయు నందనుండు వానరుండు

28.   

 

 

 

తే.గీ.

శయన కామ వశమ్మున శ్రమను బడసి

లలన లచ్చట నిదురింప లలితముగను

వడలిన నళినమ్ముల భంగి భాసిలి రట

పద్మ నయనలు రాక్షస సద్మ మందు

29.   

 

 

 

తే.గీ.

రావ ణాంతఃపురము నందుఁ దావు లెల్ల

వెదకెఁ దమి నశేషమ్ముగఁ గదలి హరి వ

రేణ్యుఁడు సుమహా తేజస్వి పుణ్య సతిని

జానకినిఁ గాంచ నేరక దీనుఁ డయ్యె

30.   

 

 

 

కం.

ధర్మాతిక్రమణ మని స్వ

కర్మను జింతించెను బర కాంతలఁ గనుటన్

నిర్మల సుప్తుల నచట న

ధర్మంబ యని తలఁచి హరి తప్తుం డయ్యెన్

31.    

 

 

 

కం.

కన లేదు నేను దమిఁ బర

వనితల సత్యముగ విషయ వాంఛల తోడన్

దను జాంగనలే యిట నా

కనులఁ బడిరి గములుగ ని కపి తాఁ దలఁచెన్

32.   

 

 

 

ఉ.

రావణ యోషి తోత్తముల రమ్య వరాంగన దర్శనమ్మునన్

భావము నందు వైకృతపు బంధము వుట్ట దొకింత యైనఁ దా

నీ విధిఁ దల్చెఁ జిత్తమున నింపుగ నిశ్చిత బుద్ధి నిత్య సం

భావిత కార్య దక్షుఁడును వాయు తనూజుఁడు నిర్వికారియై

33.   

 

 

 

తే.గీ.

ఇంద్రియ ప్రవర్తనలకు హేతువై చె

లంగు మానస మిల సర్వభంగుల శుభ

ముల నశుభ వేళలను మనము దృఢమై వ

ఱలును నా కనవరతము వలదు చింత

34.   

 

 

 

కం.

స్త్రీల నడుమ గా కన్యము

నేల వెదక వనిత కొఱకు నెవ్వరి కైనం

జాలునె కనుఁగొన జానకి

నే లలనలు లేని చోట నెంత వెదకినన్

35.   

 

 

 

తే.గీ.

జంతువును వెదకంగ స్వజాతి బృంద

మందు ఫలిత ముండు నితర మందుఁ గలదె

నష్ట భామినీ పరిశోధనమ్ము జంతు

రాశి యందు సేయఁ గనఁ దరంబు గాదు

36.   

 

 

 

తే.గీ.

రావణాంతఃపురము విమల తర మాన

సమ్మునఁ బరికించితి నెల్ల జానకీ స

తీ మతల్లి వీక్షింప నైతి నిటఁ గంటి

దేవ గంధర్వ నాగ సతీ మణులను

37.   

 

 

 

కం.

ధరణిజఁ గానక కని పర

వర కాంతల హరి వరుండు పాన గృహము వీ

డి రయమున నంత చింతా

పరవశుఁ డయ్యె ధృతి భావి పరిశోధనకై

38.   

 

 

 

కం.

శ్రీమంతుఁడు హనుమంతుఁడు

దా మఱి మఱి యత్న మూని తత్పాన గృహా

రామము విడనాడి తిరిగి

ధామము వీక్షింప భృశము త్వర పడె నంతన్

39.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందుఁ బదునొకండవ సర్గము.

 

 

సుందర కాండము

సర్గము 12.

 

 

తే.గీ.

తద్భవనము మధ్య మహా లతా గృహములఁ

జిత్ర గృహ సమూహమ్ములఁ జీఁక టిండ్ల

సంచరించె ధరాతనూజఁ గను వేడ్క

చారు రూపిని హరి కన నేరఁ డయ్యె

1.      

 

 

 

తే.గీ.

రఘు కులేశు ప్రియ సఖి దర్శనము గాక

కపి వరేణ్యుఁడు దలపోసెఁ గలఁతఁ జెంది

యెంత వెదకిన ఫలితము సుంత లేదె

యువిద ధ్రువముగ మరణించి యుండ నోపు

2.     

 

 

 

ఉ.

ఈ క్షితి నార్య మార్గమున నింపుగ వర్తిలు సీత శీల సం

రక్షణ తత్ప రాంచిత ధరాసుత తప్పక దుష్ట కర్ముఁ డా

రాక్షస రాజు రావణుని రాక్షస కార్య నికాయ భీతిచే

వే క్షయ మైన నౌ నని కపి ప్రవరుండు దలంచె నత్తఱిన్

3.     

 

 

 

కం.

వికృతలు విరూపలు సుదీ

ర్ఘ కాయలు మహా వదనలు కాంతి విహీనల్

సక లాసుర గణ రాజ వ

ర కాంతలఁ గని భయమున ధరణిజ గతించెన్

4.     

 

 

 

ఉ.

జానకి జాడ నేరకయు జాగున నేఁగ నశక్య మిత్తఱిం

బూనిన కార్య మెల్ల పరి పూర్ణము గాక హరీశు చెంతకున్

భాను తనూజు నాగ్రహ మపారము దండము గూడ తీక్ష్ణమున్

దాని భరింపఁ జాలుదురె తాఁకిన వానర యూధ పుంగవుల్

5.     

 

 

 

ఆ.వె.

చూచితి దశకంఠు సుదతుల నెల్లరఁ

గంటి నంతి పురము గన్ను లార

వ్యర్థ మయ్యె నాదు వాటంపు శ్రమ యెల్ల

జానకీ సతిఁ గనఁ జాల నైతి

6.     

 

 

 

కం.

లంకా పురమున నీ వక

ళంక చరిత! చేసిన పనులను జెపుమా ని

శ్శంన నెల్ల ప్లవము

కింక బదు లిడంగఁ దరమె యెవ్విధి నైనన్

7.     

 

 

 

కం.

ఏలీలఁ జెపుదు గనుగొన

జాలక ధరణీ తనయను సద్గుణ రాశిం

గాలాతీతమున ధృవము

కాలము సెల్లును భువిఁ బ్లవగ ప్రవరులకున్

8.     

 

 

 

తే.గీ.

ఏ మనును వయో వృద్ధుఁడు నే మరలిన

జాంబవంతుఁడు ననుగని సత్వవంతు

డంగదుఁడు హరి వీరులు నంద ఱిం

నకృత కర్ము నని వగచె హరి వరుండు

9.     

 

 

 

తే.గీ.

శ్రేయములకు మూల మ్మనిర్వేద మెంచ

విరివి యగును సుఖము లనిర్వేదమునను

రిత్త వో వర్థములు ననిర్వేదమునను

వీడ వలె మది జనులు నిర్వేద మెపుడు

10.    

 

 

 

ఉ.

ఖేదము వీడ జంతు తతి కృత్యము లెల్ల ఫలించు నింపుగన్

మోదము మీఱఁ జేసెదను భూమిజ శోధన మన్య భూములన్

వేదన వీడి రావణ నివేశము లెల్లయు బెక్కు మాఱు లే

నేదరి నైన జానకిని నెవ్విధి నైనను జూడ కుందునే

11.    

 

 

 

కం.

చూచితిఁ బాన గృహమ్ములఁ

జూచితిఁ బుష్పగృహములను జూచితి నేఁ గ్రీ

డోచిత శాలల మేడలఁ

జూచితి వాటికలఁ జిత్ర శోభా గృహముల్

12.    

 

 

 

ఆ.వె.

తలఁచి హనుమ యిట్లు దర్శింపఁ దొడఁగెను

దిరిగి భూగృహముల నురుతర పథ

శాల లందు మేటి చైత్య సౌధమ్ముల

ద్వార బహుళ వేశ్మ తతుల నెల్ల

13.    

 

 

 

చం.

ఎగురుచు డిగ్గునం దిగుచు నిమ్ముగ నిల్చి చరించి పల్మఱుల్

వగరుచు ద్వారముల్ తెఱచి వైచి కవాటము లుత్తరించుచుం

దగు విధిఁ దూఱి గెంతుచును దాఁటుచు నిండ్లను నేల వ్రాలుచున్

నగచరుఁ డంతరంబు సదనమ్ముల వీడక చేసె శోధనన్

14.    

 

 

 

కం.

రావణ నివాస మందున

లావున హరి నాలు గంగుళమ్ముల చోటుం

దా వీడక శోధించెను

దావుల నెల్ల నవిరళము ధరణిజ కొఱకై

15.    

 

 

 

కం.

ప్రాకారపు నడి దారులు

ప్రాకట చైత్య తతు లెల్ల బావుల నెల్లన్

వాకిళ్లులు నరుఁగులతో

నా కపి కోనేరు లరసె నవనిజ కొఱకై

16.    

 

 

 

ఆ.వె.

అసుర కాంతల వివిధాకారల విరూప

ల వికృతలను గాంచెఁ బవన సుతుఁడు

రాక్షసేశ్వర గృహ రాజ వరము నందు

నరయ నేరఁడు జనకాత్మజ నట

17.    

 

 

 

తే.గీ.

రూపమున నసమానలు లోక మందు

నెంచ విద్యాధరస్త్రీలు గాంచె వారిఁ

గపి వరుండు నచట దశకంఠు నింటఁ

గాంచ నోఁచఁడు రాఘవ కాంత నచట

18.    

 

 

 

తే.గీ.

నాగ కన్యకా మణులఁ బూర్ణ  శశిముఖులఁ

గాంచె సుశ్రోణుల హరీశుఁ డంచితముగ

రాక్షసేంద్రు గృహమున సురక్షితలను

జూడ నేరఁడు సీతను సుదతి నచట

19.    

 

 

 

తే.గీ.

బలమున నపహృతలు నాగ వనిత లాహ

వమ్మునఁ బరాజితలఁ గాంచెఁ బవన సుతుఁడు

రాక్షసేశ్వర ప్రాసాద రాజ మందు

కనులఁ గాంచ లేఁ డచ్చట జనక సుతను

20.   

 

 

 

కం.

హనుమంతుఁడు ధీమంతుఁడు

జన కాత్మజఁ గానక పరసతు లిందు నిభా

ననలఁ గని తిరిగి వగచెను

మనమ్మునం గలఁతఁ జెంది మారుతి యంతన్

21.    

 

 

 

ఆ.వె.

వానరేంద్రుల శ్రమ వనధి లంఘన మింక

వ్యర్థ మయ్యె నంచు వ్యథిత చిత్తుఁ

డయ్యె ననిల సూనుఁ డత్యంతము దిరిగి

కాంచ ధరణిజను గపి వరుండు

22.   

 

 

 

తే.గీ.

వర విమానమ్ము దిగి వేగ హరి వరుండు

మారుతాత్మజుఁ డంతఁ గోమలి ధరణిజ

దర్శనమ్ము నొందఁగ లేక తప్త చిత్తుఁ

డై పరి తపించె శోకోపహతుఁడు కరము

23.   

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందుఁ బండ్రెండవ సర్గము.

 

 

సుందర కాండము

సర్గము 13.

 

 

కం.

ప్రాకారము పైకి నుఱికి

యా కపి వీరుఁడు విమాన యానచ్యుతుఁడై

భీకర మేఘాంతర శం

పా కాంతి యనఁగ వెలింగెఁ బవనాత్మజుఁడే

1.      

 

 

 

కం.

రావణ గృహముల నన్నియుఁ

బ్రావీణ్యమ్మునఁ జరించి వైదేహి నెటం

బావని గన లేక యనియె

నీ వచనములు దనలోన నెంతయు భీతిన్

2.     

 

 

 

కం.

పరి శోధించితి లంకను

బరిపరి విధముల భృశముగ వైదేహిని రా

మ రతావనిజను సీతను

దరళాంగిం గాంచ లేక తప్తుఁడ నైతిన్

3.     

 

 

 

చం.

వనముల నూప దేశములు పర్వత పంక్తులు దుర్గమమ్ములున్

ధునులును బల్వలమ్ములును దొర్వులు చెర్వులు నెల్ల భూములుం

జని చని శోధనమ్మునను జానకి నెచ్చటఁ గాన నైతినే

యిన కుల వార్ధి చంద్ర సతి నెవ్విధిఁ గానఁగ నేర్తు నిద్ధరన్

4.     

 

 

 

తే.గీ.

గృధ్ర రాజము సంపాతి ధృతినిఁ బలికె

రావణ నివేశమున నుండు రమణి సీత

కాన రా దిచట నరయ జానకీ స

తి నళిన దళాక్షి రామ పత్ని సుగుణవతి

5.     

 

 

 

తే.గీ.

మైథిలి జనక నందన మానినీ మ

ణి వసుధాత్మజ నళినాక్షి వివశయై య

నిష్టమునఁ గ్రూరు రావణు దుష్ట చరితుఁ

డయ్యసుర గణాధిపు వశ మయ్యె నేమొ

6.     

 

 

 

ఆ.వె.

రామ బాణ భీతి రావణుం డతి వేగ

మున నెగిరి చనంగ జనక తనయ

తోడ మార్గ మందుఁ దూలి జానకి పడె

నేమొ శంక కల్గు నింక నాకు

7.     

 

 

 

ఆ.వె.

సిద్ధులు చరియించు నిద్ధ మార్గము నందుఁ

బోవు సమయ మందు రావణాప

హృత ధరణిజ జడిసి హృదయమ్మునఁ గడలిఁ

జూచి పడె ననంగఁ దోఁచు నాకు

8.     

 

 

 

ఆ.వె.

రావ ణాసురోరు రయమున భుజ బల

పీడనమ్మునఁ గడు వేప మాన

యై విశాల లోచ నావనిజ విడిచెఁ

బ్రాణము లని తోఁచుఁ బరమ సాధ్వి

9.     

 

 

 

కం.

కాదేని యసురుఁడు కడలి

వే దాఁటు తఱి ధరణిజ వివేష్టితయై నీ

లోదకమునఁ బడియె ననుచు

నే దలఁచెదఁ గాన రామి నిక్కము సుమ్మీ

10.    

 

 

 

ఉ.

క్షుద్రుఁడు రావణాసురుని ఘోరపుఁ బల్కులు సైప లేక యా

భద్ర విహీన ధర్షితయు బంధు నికాయము దూర ముండగన్

నిద్ర యొకింత లేక యనునిత్యము శీల సురక్ష ణార్థమై

రౌద్ర దశాస్య భక్షితము రామ సతీమణి యంచు నెంచెదన్

11.    

 

 

 

తే.గీ.

దుష్ట భావ లసుర నాథు నిష్ట సతు ల

దుష్ట భా వావనిజను విదూర కల్మ

షను శశి నిభాన నసిత లోచనను నంత

భక్షణమ్ము సేసి రనఁగ భయము వొదవె

12.    

 

 

 

ఆ.వె.

పూర్ణ చంద్ర కాంతి ముఖుఁ బద్మ దళ నేత్రు

రామ చంద్ర వక్త్ర రత మనమ్ము

న నబల తలపోసి నలినాక్షి రఘు రాము

నసువు లెల్ల వీడె నంచుఁ దలఁతు

13.    

 

 

 

కం.

హా రామా! హా లక్ష్మణ!

హా రుచి రాయోధ్య!  యంచు నార్చుచు నకటా

యా రమణీ మణి మైథిలి

యారాటమున విడనోపు నసువుల నెంచన్

14.    

 

 

 

తే.గీ.

జనక నందిని వైదేహి చారుశీల

రావణ నివేశమున విచారమున నుండ

నోపు నిర్బంధ దుఃఖము నోప లేక

కలికి హేమ పంజరమునఁ జిలుక వోలె

15.    

 

 

 

ఆ.వె.

రామపత్ని జనక రాజ తనయ సీత

నలిన పత్ర నేత్ర సలలి తావ

లగ్న భూ తనూజ రావణ వశ మేల

యగును దలఁపఁ దరమె యవని నాకు

16.    

 

 

 

తే.గీ.

తప్పి పోయిన నైనను దాఁ గనుపడ

కున్న జానకి మరణించి యున్న నైన

రామ చంద్ర ప్రియ సతి ధరా తనూజ

తెలియఁబఱచు టనుచితమ్ము తెల్ల మింక

17.    

 

 

 

కం.

ఎఱుకపఱచినన్ దోషమ

యెఱుకపఱప కున్న దోషమే యగు నెంచన్

వెఱ పగు చున్నది మిక్కిలి

యెఱుఁగక కర్తవ్య మింక నిత్తఱి నాకున్

18.    

 

 

 

కం.

ఇక్కార్యమ్మున నెయ్యది

చక్క నగును జేయ నని భృశము చిత్తంబం

దక్కాలాతీతమ్మున

నక్కపి పుంగవుఁడు సేసె నటఁ దర్కమ్మున్

19.    

 

 

 

ఉ.

చేరిన వాన రేంద్ర పురి సీతను గానక రిత్త సేతులం

దీరిన యత్న మెయ్యది గతింపగఁ గాలము మిక్కుటమ్ముగన్

వారిధి దాఁటు టెల్లయును వ్యర్థము గాదె తలంప నెవ్విధిన్

మూరిన శోధనమ్ము లరి పుంగవు వీటుల నిష్పలమ్ములే

20.   

 

 

 

కం.

నే నేఁగినఁ గిష్కింధకుఁ

దా నేమను భానుజుండు దరుచర గణమున్

మానుగ నేమను ఘనులా

భాను కులజు లేమని యిఁకఁ బల్కుదు రకటా

21.    

 

 

 

కం.

సీతను నేఁ గన లేదన

ఘాతపుఁ బల్కులు వినంగఁ గాకుత్స్థుఁడు సం

పాతముఁ జెంది భువి నసువు

లా తఱి విడుచును వితర్క మది యేల యిఁకన్

22.   

 

 

 

కం.

అతి పరుషమ్మతి దారుణ

ము తీక్ష్ణ మింద్రియ దహనము భూజా తార్థ

శ్రుతి దుర్వాక్యము విని క్రూ

ర తరము మరణించు దాశరథి నిక్కముగన్

23.   

 

 

 

తే.గీ.

వ్యసన గతు మరణావస్థు భ్రాతను గని

లక్ష్మణుండు మేధావి పరమ రతుండు

నిత్య సహచరుం డెల్లెడ సత్యముగను

బ్రాణములు నిల్ప నేర్చునె వసుధ నింక

24.   

 

 

 

తే.గీ.

రామ లక్ష్మణ మరణ వార్త విని భరతుఁ

డుర్విఁ దనువు చాలించు నయోధ్య లోన

నన్న మరణింప శత్రుఘ్నుఁ డంత వగచి

మేను చాలించుఁ ద్వరితమ్ము దాను గూడ

25.   

 

 

 

కం.

ఘన రఘు వీరుల మరణము

గని కౌసల్యయు సుమిత్ర కైకయు నసువుల్

సన మరణించుట తధ్యము

కన నేరము సంశయమ్ము కల నందైనన్

26.   

 

 

 

కం.

రామునిఁ గన గత చేతను

నా మర్కట గణ విభుండు నావేశమునన్

ధీమంతుఁడు సుగ్రీవుఁడు

దా మరణించును గృతజ్ఞతా పరవశతన్

27.   

 

 

 

కం.

పతి శోకమున రుమా సతి

యతి బాధితయై విదారకాత్మ నిరానం

ద తపస్విని దీనతఁ దా

గతాసువులఁ జను భృశమ్ము కలవర పడుచున్

28.   

 

 

 

కం.

వాలిజ శోక సుపీడిత

యా లలితాంగి సతి తార యాప్లవ గేశా

కాల మరణమ్మునకు కర

మాలోలితయై త్యజించు నసువుల నంతన్

29.   

 

 

 

కం.

జననీ జనక మరణమునఁ

బిన తండ్రి వినాశనమున వికల మనస్కుం

డు నిలుపునె యంగదుఁడు జీ

వనమును నొక నిమిష మైన వాలిజుఁ డింకన్

30.   

 

 

 

కం.

తమ రాజు వలని గురు దుః

ఖమున వనౌకస గణములు కలఁత వడసి చి

త్తమున నిజ శిరములఁ గర త

ల ముష్టి ఘాతములఁ గడు నలయుదురు సుమ్మీ

31.    

 

 

 

కం.

రవిజుఁడు యశస్వి మధుర త

ర వచనముల దానములను లాలనమున గౌ

రవ మీయ వాన రేంద్రుఁడు

వివశత్వమ్మున నసువులు విడువరె కపులున్

32.   

 

 

 

కం.

వనముల నైన మహీధర

ఘన నిర్ఝర తటుల నైనఁ గందరముల నై

న నగముల నైనఁ గ్రీడిం

ప నలవియే వానరులకుఁ బన్నుగ నింకన్

33.   

 

 

 

కం.

సమతల విషమతల నగా

గ్రము లందున నుండి దుముకగ నిఁకఁ గపి నికా

యము ససుత దార సామా

త్యమిత్రము నశించు నంత నధిపు లయమునన్

34.   

 

 

 

కం.

గర ళాశనమ్మున నయిన

నురిని నయిన మండునగ్ని నుఱికి యయిన భా

సుర శస్త్రముల నడిచి వా

నర సందోహమ్ముల మరణము తథ్యంబే

35.   

 

 

 

చం

అసఫల శోధనమ్మున మహాత్ముని రాముని చెంత కేఁగినన్

ముసిరిన దుఃఖ భారమున భూరి కులక్షయ మౌ నయోధ్యలోఁ

బసచెడి వానరాన్వయము భానుజుఁ దోడ వినాశమౌ నిఁకన్

మసలెద గాన నిప్పురిని మార్గణ తత్పర మానసమ్మునన్

36.   

 

 

 

శా.

సీతాహీనము శక్యమే చనఁగఁ కిష్కింధాపురిన్ నా కిఁకం

జేతం గాదిల వారి దర్శనమునుం జేయంగ సుగ్రీవ సా

కేతాధీశులు రామలక్ష్మణులు తర్కింపంగ నా రామికిన్

వీతక్లేశము నాశ లుండ మఱి జీవింపంగ సాధ్యం బిలన్

37.   

 

 

 

ఉ.

సాగర తీర దేశమున సంతత మూల ఫలోద కాదులం

జాగఁగ జీవితమ్ము యతి చాడ్పున నేఁ జరియింతు నిష్ఠగన్

వేగిరపాటు లేక యనపేక్షము చేత లభించు భుక్తితో

నేఁ గన నేరకున్న నవనీసుత నిచ్చట నిశ్చయమ్ముగన్

38.   

 

 

 

తే.గీ.

చితినిఁ బేర్చి దుమికెద నే శీఘ్రముగను

దాపసత్వము సాధించి దారుణమ్ము

గఁ గృశియించి చాలింప నింకఁ దనువు నిట

వాయస శ్వాపదమ్ములు వడయు దాని

39.   

 

 

 

ఆ.వె.

జానకిఁ గన నేని జలనిధి మునిఁగెదఁ

దలఁప నిదియ మునుల దర్శ నమ్మ

ని తలఁతు మది నింక నిస్సంశయమ్మది

యౌర నాదు మరణ మారయంగ

40.   

 

 

 

తే.గీ.

శుభత రారంభమై వెల్గి సుభగపు యశ

మున మిగులఁ దనరి మదీయ ఘన సుకీర్తి

మాల భగ్నమయ్యెను సీత నా లతాంగిఁ

గాంచ నేరక నిచట దీర్ఘంపు రాత్రి

41.    

 

 

 

ఆ.వె.

తాపసుండ నౌదుఁ దరువు మూలిక లందు

నుండి నియతి నిచట నుండి పోను

జూడ కుండ నేలచూలి నసిత నేత్ర

నినకులేశ పత్ని నిద్ధచరిత

42.   

 

 

 

కం.

జానకిఁ గానక చనినన్

వే నశియించును నితాంత వేదన నంతన్

వానర వీర సమూహము

తో నంగదుఁడు యువరాజు దుర్జయుఁ డైనన్

43.   

 

 

 

ఆ.వె.

ప్రాణములను వీడ బహు దోషములు గల్గు

భద్రము లగు మేనఁ బ్రాణ మున్న

ధృవము జీవ నమున ధృడముగ ధరియింతుఁ

గానఁ బ్రాణములను గార్య దీక్ష

44.   

 

 

 

కం.

ఆ కపి వరేణ్యుఁడు మది న

నేక విధములం గుములుచు నిల్వఁగ నటఁ దా

నేకాంతమ్మున మఱి మఱి

శోకాంతము గాన లేఁడు సుస్థిర మతియే

45.   

 

 

 

తే.గీ.

రావణుని దశగ్రీవుని లంక యందు

నమ్మహాబలుని వధించి యపహృ తావ

నిజ నిమిత్త ప్రతీకారము జనియింపఁ

జేసెద ముద మొనర్పఁగ నా సతి కిఁక

46.   

 

 

 

కం.

రఘు రామచంద్రు దరికిఁ బ్ర

తిఘముగ జలధి పయి నుండి తెత్తు నసురు నం

త ఘనత్రినయన పశు వన

విఘటిత దేహు దశకంఠు వేగమ బలిమిన్

47.   

 

 

 

కం.

సీ తాదర్శన కర్శిత

వాతాత్మజుఁడు ఘన శోక పరివృత సంత

ప్తాతత దుఃఖ విదారిత

చేతనుఁడు దలంపఁ దొడఁగెఁ జిత్తము నందున్

48.   

 

 

 

ఆ.వె.

రామపత్ని సాధ్వి రమణీ లలామ సీ

తను యశస్విని నిట దర్శనమ్ము

సేయు నంత దనుకఁ జేసెద శోధన

మిప్పురమ్ము నందు నెలమి నేను

49.   

 

 

 

కం.

విని సంపాతి వచనములు

గొని తేర రఘుప్రవీరుఁ గూర్మిని నిటకుం

గన జాలక దార నతం

డనలమ్మునఁ గాల్చు వానరాలిని వరుసన్

50.   

 

 

 

కం.

నివసింతు నింక నిచ్చట

నవశ్యము మితాశనమున హరినర తతికిన్

లవ లేశము హాని కలుఁగ

క వఱలఁగ జితేంద్రియునిగఁ గరమున్నియతిన్

51.    

 

 

 

తే.గీ.

భూరి వృక్ష చయమ్ములఁ బూర్ణమై య

శోక వన మల్లదిగొఁ గడు శోభితమ్ము

దాని శోధింప లే దింత దనుకఁ బోయి

వేగఁ బరికింప వలయు నెవ్విధము నైన

52.   

 

 

 

తే.గీ.

రాక్ష సామిత శోకవర్ధనుల నశ్వి

నుల మరుత్తు లాదిత్యులను వసువులను

రుద్రుల నమస్కరింతును భద్రముగ చ

రింతు నచ్చట వెదకుచు వంత దీర

53.   

 

 

 

ఆ.వె.

తాపసేంద్రున కుచితంపు సిద్ధి పగిది

రామ మూర్తి కిత్తు రమణి సీత

నినకుల సుముదావ హేలా తనూజను

దనుజుల వధియించి దర్ప మడర

54.   

 

 

 

కం.

ఇవ్విధి చింతించి హనుమ

చివ్వున లేచె ననిలజుఁడు చిత్తం బెల్లన్

నొవ్విం దపింప వేగం

బవ్వనమును గనఁ దలఁచుచు నమర గణములన్

55.   

 

 

 

చం.

ప్రణతుల తోడఁ గొల్తు రఘురాము సలక్ష్మణు జానకీ సతిం

బ్రణతులు నావి కైకొనరె భర్గ బలారి యమప్రభంజనుల్

ప్రణతు లొసంగి వేఁడెదను వారిధి జార్క మరుద్గణమ్ములన్

మణి రుచి తుల్య విగ్రహ రమాసతి సత్వర దర్శనార్థమై

56.   

 

 

 

కం.

స్తుతియించి వారి నాతఁడు

మతి నుతియించి రవిసూను మర్కట విభునిన్

గతు లెల్లం బరికించి హ

రి తద్వనం బరుఁగగ నడరి తలఁచె మదిలో

57.   

 

 

 

ఆ.వె.

మానసమ్ము నంద వానరేంద్రుఁ డశోక

వనము పూర్వమ చని మనము నందుఁ

జింతఁ జేసె కార్య మంత మార్గణ నిమి

త్తమ్ము వాయుజుండు తఱచి తఱచి

58.   

 

 

 

కం.

పుణ్యంపు టశోక వనమ

గణ్య తరు గణావృతమ్ము ఘన సమరప్రా

వీణ్య దనుజ పాలిత లా

వణ్యోద్యాన వన మది ధ్రువమ్ముగ భువిలో

59.   

 

 

 

కం.

భటులు నియతులై యుందు ర

చట తరు రక్షణము సేయ సతత మనిలముం

బటు తరము గాక వీచున

చట గిటకగ నుండి యింకఁ జరియింతు నటన్

60.   

 

 

 

సీ.

 

 

 

 

 

రామార్థము మఱియు రావణార్థము నల్ప

            దేహినై చరియింప దిటవు తోడ

దేవర్షి గణములు దేవతలు భగవ

            దఘ్న్యుఁడు దీవింతు రాదరమున

వజ్రధారి వరుణ వాయు వహ్నులు పాశ

            హస్త సోమాదిత్యు లశ్వినులు మ

హాత్ము లెల్ల మరుత్తు లరయ సిద్ధి నొసఁగి

            కాచెద రింపుగఁ గరుణ తోడ

 

 

 

 

ఆ.వె.

శర్వు డీశ్వరుండు సర్వభూతములు భూ

తాధిపతియు గోచ రాన్య జీవ

తతు లదృశ్యులైన ధరణి ఫలము నిచ్చి

నన్ను గరుణఁ గాంతు రన్ని గతుల

61.    

 

 

 

తే.గీ.

ఆయ తాంచిత నాసిక నవ్రణ సిత

దంతఁ బద్మాయతాక్షిఁ జంద్ర నిభ వదన

శుచితరస్మిత నెన్నఁడు చూడ నగును

ధరణిజఁ బ్రసన్నశశధర దర్శనాభ

62.   

 

 

 

తే.గీ.

పాప కర్మునిఁ గ్రూరుని బలిమి సూపు

వాని దారుణాలంకృతు బారిఁ బడిన

యతివఁ బరితప్త చిత్తను నవనిజ నిఁక

దృష్టి పథమునఁ బడయు సుకృతము గలదె

63.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందుఁ బదుమూడవ సర్గము.

 

సుందర కాండము

సర్గము 14.

కం.

తలఁచి యొకింత తడవు మది

నలఁ జేరి మహాకపి సద నావరణమ్మున్

సులువుగ నుఱికెం ద్రుటిలో

బలవంతుఁడు కార్య మగ్న వర చిత్తమునన్

1.      

 

 

 

కం.

ప్రాకారమ్మున నిలిచి మ

హా కపి హృష్టాంగముల మహా ద్రుమములఁ దా

నా కుసు మాగమ వేళ న

శోక వని సుమ సహితమ్ముఁ జూచె వివిధముల్

2.     

 

 

 

తే.గీ.

మద్ది మ్రానులఁ గంకేళి మ్రాకుల విరి

గములఁ గూడి విరివి సంపెఁగల గుమ గుమ

ల గజపిప్పళ్లఁ గొండగొనుగులను మఱి

రాగి మావుల గన్నెరుల నరసె హరి

 

 

 

3.     

తే.గీ.

వడి ధనుర్ముక్త బాణము భంగి నంత

నామ్రవణ సమావృతము లతాధిక పరి

వృతము వానరశ్రేష్టుండు వృక్షవాటి

కఁ గని యెగిరె జనక సుతఁ గాంచఁ గోరి

4.     

 

 

 

సీ.

 

చిత్రవర్ణ ద్విజశ్రేణ్యభి నాదితము రజత తపనీయ తరు యుతమ్ము

విహగ మృగ సమూహ విలసిత చిత్ర కాంతారమ్ము బాలార్క తాదృశమ్ము

ఫలపుష్ప సంయుత పాదప షండ సమావృతమ్ము ముద జనాకులమ్ము

ఘనమత్త పిక భృంగ కాండ నిషేవితమ్ము మద ఖగ మయూర పూరితమ్ముఁ

 

 

 

 

తే.గీ.

జేరి వాతాత్మజుండు సూచె ముద మార

వనము జానకి వెదకుచుఁ రమ సాధ్వి

నచట మేల్కొనఁ జేసె మహా కపి సుఖ

సుప్త విహగ నికాయముఁ జోద్యముగను

5.     

 

 

 

ఆ.వె.

పై కెగురు విహంగ పక్ష ఘాతమ్మునం

దరుల విరుల జల్లు కురియఁ గపి శి

రమ్ము పైన వివిధ రంగులఁ దనరుచు

హరి యగపడె పుష్ప గిరి యనంగ

6.     

 

 

 

కం.

దిశ  లెల్లం బాఱుచు సా

ల శిఖాలి దుముకు హరిఁ గని లావణ్యముగన్

విశదంబ వసంతు డనుచుఁ

బ్రశస్తముగఁ దలఁచిన వటఁ బ్రాణులు మదులన్

7.     

 

 

 

కం.

కుసుమమ్ములు రాల ఘన త

రు సమామ్నాయమ్ము నుండి రుచిర వివిధ పు

ష్ప సమాకీర్ణమ్మున నీ

వసుధయె కన్పట్టె నచట వనితా మణిగన్

8.     

 

 

 

కం.

అతి వేగవంతు డమ్మా

రుతి వేగమ్ముగఁ గుదుపఁ దరు సమూహమ్ముం

బతితంబయ్యె సుమ చయము

లతి చిత్ర రుచుల వెలుఁగుచు నత్యధికముగన్

9.     

 

 

 

తే.గీ.

తొడవులు వలువలు గిరవు వడిని నోడి

యిడిన జూదకాని పగిదిఁ బుడమి పుట్టు

వు లట రాల నాకులు ఫల పుష్ప తతులు

దనరెఁ గడువింతగ నశోక వనము నందు

10.    

 

 

 

చం.

హరివరు బాహు కంపన జవాతిశయమ్మున నెల్ల వృక్షముల్

విరులను బండ్లు పత్రములఁ బెక్కులు రాల్చుచు బోడి కొమ్మలై

తరగి యచేతనమ్ములయి ధారుణి నిల్చెను వింత గొల్పుచున్

సురుచిర పక్షి సంఘములు సూడ విహీనములా నగమ్ములన్

11.    

 

 

 

చం.

చెదరిన జుట్టు మోము పయి చిందఱ వందఱ యైన గంధమున్

వదలక త్రాగి వీడఁ దడి వారిన యందపు టోష్ఠ దంతముల్

పదను నఖంపు గీతలును బండుల గాటులు గల్గి నట్టి ప

ద్మ దళ నిభాక్షులా యనఁగ మ్రానులు గన్పడె వింతఁ దోఁకచేఁ

దముల నింకఁ జేతులను వానర వీరుఁడు వేగఁ దాఁకఁగన్

12.    

 

 

 

కం.

క్రొక్కారు వింధ్య ఘనముల

నక్కజముగఁ బాఱఁ ద్రోలు ననిలము పగిదిన్

మిక్కుటముగ నత్తీగల

నక్కపి పుంగవుఁడు ద్రుంచె నార్భాటముగన్

13.    

 

 

 

కం.

అచటఁ గనె మనోహర మణి

ఖచిత తలముల రజత మయ కాంచన మయముల్

రుచిర తరమ్ములఁ గపి వరుఁ

డు చరించుచు వనమునం గడు విచిత్రములన్

14.    

 

 

 

తే.గీ.

బావులు విమల సుమధుర వారి పూరి

తములు వివిధ రూపమ్ములు తరళ రత్న

ఖచిత సుందర సోపాన నిచయ భాసి

తము లచట నచట నశోక తలము గనియె

15.    

 

 

 

తే.గీ.

ముత్తియపు మఱి పగడంపు భూరి సైక

తముల స్పటికంపు టరుగులఁ దటుల నున్న

తరులు వెలుఁగ మహారజత రుచుల విక

సిత నలినపంక్తుల ద్యుతులు చిందు చుండ

16.    

 

 

 

తే.గీ.

చక్రవాక ప్రతిధ్వని సంయుతములు

చాతకస్వన కలహంస సారస రవ

భాసితములు దీర్ఘద్రుమ వ్రజ యుతములు

వివిధ గుల్మ షండ వృతమ్ము లవిరళములు

17.    

 

 

 

ఆ.వె.

శత లతావృతములు సంతాన కుసుమావృ

తమ్ములు కరవీర తరు యుతములు

నమృత సమ మధుర త రామల సలిల సం

పూర్ణ సరసులఁ గనె భూషితముల

18.    

 

 

 

ఉ.

కంద నికాశ ముచ్ఛ్రిత శిఖా పరివారితమున్ విచిత్ర కూ

టేంద్ర నికాయ సంభృత మహీన మృగద్విజ సేవితమ్ము క

న్విందుగఁ గంద రావృతము వృక్ష గణావృతమున్ జగత్తునన్

సుందర మైన పర్వతముఁ జూచెను వానర పుంగవుం డటన్

19.    

 

 

 

కం.

శైలాగ్రము నుండి పరఁగు

కూలవతినిఁ గాంచె హనుమ కోపము తోడం

దూలి తొలఁగు పత్యంకము

లీలావతి లీల నపుడు లీలగ నచటన్

20.   

 

 

 

కం.

ప్రియ బంధు గణము చేతను

నయముగ వారింపఁ బడు ఘన కుపిత వనజా

క్షి యనంగ సలిల మగ్నం

బయిన నగాగ్రమ్ముల నద మరసె ముదమునన్

21.    

 

 

 

కం.

వెను తిరిగి పాఱు జలములఁ

గని నదిని హనుమ ప్రసన్నకాంతా మణియే

యనునయమునన్ మరలి వ

చ్చిన విధమును బోలఁగ మురిసెను జిత్తమునన్

22.   

 

 

 

కం.

సకల జల విహంగోత్కర

సుకలిత కాసార వరముఁ జూచె కపి వరుం

డకళంక మనతి దూర

మ్మ కుధర రాజమున కెంచ హనుమంతుఁ డటన్

23.   

 

 

 

కం.

నడబావి శీత జలముల

నడరి మణి మయమ్ము లైన వగు మెట్టులతో

గడిగిన ముత్యంపు టిసుక

తడి నేలం దనరు దానిఁ దాఁ గనెఁ గృతమున్

24.   

 

 

 

ఆ.వె.

వివిధ మృగ గణ బహు విలసితమ్ము విచిత్ర

వన విరాజితమ్ము భవన రాజ

సంఘ భాసి తమ్ము చారు తరం బది

నిజము విశ్వకర్మ నిర్మితమ్ము

25.   

 

 

 

కం.

ఏ తరువు లున్నవొ యచట

యా తరు నివహమ్ము లన్ని యలరారు ఫల

వ్రాతముల సుమమ్ములఁ గల

ధౌతపు వేదికల ఛత్ర తాదృశము లనన్

26.   

 

 

 

ఛం.

లత లవి పైకిఁ బ్రాఁక బహుళమ్ముగఁ బత్ర సమున్న యాభి శో

భితము సువర్ణ కాండ సముపేతము కాంచన వేదికా విరా

జిత మది శింశుపా నగము సేరి హరీశుఁడు గాంచె నచ్చ టే

కత మగు వృక్ష రాజమును గన్నుల కింపుగ నవ్వనమ్మునన్

27.   

 

 

 

ఆ.వె.

ముందుఁ గనె నతండు భూభాగముల నింకఁ

బల్లముల స్రవించు ప్రస్రవణము

లఁ బర కాంచన తరుల ననల నిభముల

హరి వరుండు మారుతాత్మజుండు

28.   

 

 

 

కం.

మేరు మహీధర రుచి నే

పారు దివాకరునిఁ బోలి పాదప నిచయా

పారప్రకాశ మహిమ మ

హారజతద్యుతిఁ బడసితి నని కపి తలఁచెన్

29.   

 

 

 

తే.గీ.

వాయు కంపిత సౌవర్ణ వర్ణ వృక్ష

షండ సంజని తోద్ధండ శబ్ద మొప్పఁ

గింకిణీ శత నిర్ఘోష శంక నంత

విరివిఁ బడసె హరి వరుండు విస్మయమ్ము

30.   

 

 

 

తే.గీ.

పత్ర విటప పుష్పాంకుర భాసిత మట

నయ్యిరుగుడు మ్రాను పయికి నాప్లవంగ

వీరుఁ డవలీల నెక్కి విహార లీల

జానకీ దర్శనము నెంచి మానసమున

31.    

 

 

 

తే.గీ.

రామ దర్శన కాంక్షిత రమణి నబల

దుఃఖ సంతప్త వైదేహిఁ దోయజాక్షిఁ

జూడ నోపుదు నేఁ జరించు నవనిజ ని

ట నట నియ్యశోక వని నడర మనమ్ము

32.   

 

 

 

ఉ.

తప్పక వచ్చు నిచ్చటకు ధాత్రిజ చంపక చంద నాదులుం

జొప్పడ వృక్ష సంతతులు చోద్యము గొల్పుచుఁ బక్షి సంఘముల్

కప్ప నశోక వాటికను గంజములుం దనరంగఁ గాంతు నే

నప్పడతిన్ విదేహ నగ రాధిప నందన రామ పత్నినే

33.   

 

 

 

తే.గీ.

పాదపము నెక్కి తలపోసెఁ బవన సుతుఁడు

గాంచఁ గలనంచు నిచ్చటఁ గాంత నవని

జాత నటవీ విశేషజ్ఞఁ జారు శీల

నిన కుల విభు పత్ని జనక తనయ నింక

34.   

 

 

 

ఆ.వె.

గుణవతీ మతల్లి కోదండ రామాభి

దర్శ నార్తి హరిణ తరళ నయన

వన విహార పరిచయ నలిన దళనేత్ర

రాఁ గల దిట కరయ రామ పత్ని

35.   

 

 

 

ఆ.వె.

రమణి వామ నయన రామశోకాభి సం

తప్త గహన వాస తృప్త చిత్త

నిత్య వన విహార నిరతి మానస సీత

రాఁ గల దిట కరయ రామ పత్ని

36.   

 

 

 

ఆ.వె.

వనచరము లన నతి వాత్సల్యము సతము

మునుపు నిజము రాము ముద్దు గుమ్మ

జనక రాజ తనయ సద్గుణవతి సీత

రాఁ గల దిట కరయ రామ పత్ని

37.   

 

 

 

ఆ.వె.

జానకీ సతి యిట సంధ్యార్థము సుదతి

శ్యామ పరమ సాధ్వి చారు శీల

శుభ జలములఁ బాఱు స్రోతస్వినీ తటి

సాగి చేర వేగ నేఁగుదెంచు

38.   

 

 

 

తే.గీ.

గుణమగు నశోకవనము రఘుకుల నంద

నాంగనా మణికి భువిఁ బ్రాణావశేష

మైన ధరణిజ విమల జలాత్త నదిని

జానకి గన వచ్చు నిటకుఁ జంద్ర వదన

39.   

 

 

 

కం.

క్రమముగఁ దలఁచుచు నిట్లు

నుమ మనుజేంద్ర సతి నటఁ గనుటకై నిరతిన్

ద్రుమ సుమ పర్ణ ఘనముల న

డుమఁ గపి వీరుం డనిలజుఁడు గడఁగి దాఁగెన్

40.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందుఁ బదునాలుగవ సర్గము.

సుందర కాండము

సర్గము 15.

 

కం.

నగమున నుండి యరయుచును

జగతీసుతఁ గను గొనంగ సదమల బుద్ధిం

దగఁ బరికించుచు నలు దిశ

ల గుంభనముగ హరి తలములఁ బరీక్షించెన్

1.      

 

 

 

తే.గీ.

కల్పవృక్ష లతాధి కాకలితము తరు

గణ మహోపశోభితము సుగంధ యుతము

సర్వతస్సమలంకృత సద్విలసిత

నంద నోప మాశోక వనము రుచిరము

2.     

 

 

 

తే.గీ.

మృగ విహంగ సంచరితము భృంగ యుగళ

మోద కాంచ నోత్పల పద్మ ముకుళ సంకు

లమ్ము కోకిల సుస్వర రాజితమ్ము

హర్మ్య మాలావృతము భూగృ హాధికమ్ము

3.     

 

 

 

కం.

వివి ధాస నాస్త రోపే

త విలసితము దీర్ఘికా యుత విరాజితమున్

సువికసిత సుమోపేత ఫ

ల విటప షండావృతమ్ము లావణ్యమ్మున్

4.     

 

 

 

తే.గీ.

మారుతాత్మజుఁ డరసె విస్ఫార సార

పుష్పి తాశోక తరు రాజముల ప్రభ లట

బాల భానుని దీపించు భంగి నుండ

పాద పాంతరమ్మున నుండి వనము నెల్ల

5.     

 

 

 

తే.గీ.

కర్ణికార కింశుక సుమ కలిత తరులు

పుష్ప భారమున వినమ్రము లయి నేలఁ

దాఁకు చుండ మూలముల నార్తవము లుండ

శోక నాశన సుంద రాశోక తరుల

6.     

 

 

 

తే.గీ.

విహగ శత సహస్రమ్ములు విటపముల ద

ళ రహితముల నింపుగ సపత్ర విలసితము

సేయు రీతి నుండఁ గుసుమ శ్రేణు లుండ 

స్వర్ణ కుండలముల భంగి వనముఁ గనెను

7.     

 

 

 

కం.

వెలిఁగించుచుఁ బరిసరములఁ

జెలువముగ నిజప్రభల విచిత్రమ్ముగ నా

యలరులఁ గదళీ పున్నా

గ లలిత చంపకము లడరె ఘన మూలములన్

8.     

 

 

 

కం.

కాటుక రంగునఁ గొన్నియు

హాటక రుచు లలరఁ గొన్ని యగ్ని శిఖ లనన్

మేటి యశోక నగమ్ములు

వాటమ్ముగ గొన్ని వేలు బన్నుగ నుండెన్

9.     

 

 

 

మ.

దివిజాధీశ్వర నందనాభము మహా దివ్యంబు యక్షేశ వై

భవ సంరక్షిత చిత్ర చైత్రరథ బింబస్ఫూర్తి విద్యోతమున్

వివిధోద్యాన సమాకులమ్మసమమున్ విస్తారమున్ రమ్య మా

ర్తవ ధిష్ణ్యాళి వృ తాప రాభ్ర మనఁగన్ రంజిల్లెఁ దోరంబుగన్

10.    

 

 

 

ఛం.

శత సుమ రత్న సంకలిత సన్నుత పంచమ సాగరంబనన్

నత సకలర్తు పుష్పిత ఘనద్రుమ గంధ యుతావృతమ్ము సం

తత మృగ పక్షి ఘోషణ యుతమ్మతి రమ్యము గంధ వాహ భా

సితము మనోరమమ్మది విశేష మశోక వనమ్ము ధాత్రిలో

11.    

 

 

 

కం.

అటఁ గనె నవిదూరమ్మున

పటుతర శైలేంద్ర నిభము పవనాత్మజుఁ డొ

క్కటి యపర గంధమాదన

మటుల సుగంధాలయము వరాశోక వనిన్

12.    

 

 

 

తే.గీ.

వేయి స్తంభముల నడుమ వెలసి వెండి

కొండ ధవళ మలర శాతకుంభ వేది

క లటఁ దనరంగ మెట్లు పగడముల మెఱ

యంగఁ జూడఁ గన్నులు సెదరంగఁ బ్రభల

13.    

 

 

 

తే.గీ.

ఉన్నతమ్మున నంబర మూను ననగ

ద్యోతమానము నిజకాంతి తోడ మిగుల

నచ్చట హిమ నిభ సిత దేవాలయమ్ము

మధుర గంధ వాహ భరిత మందిరమ్ము

14.    

 

 

 

తే.గీ.

అంతట నచటఁ గాంచెను హరి వరుండు

మలిన వస్త్రను రాక్షస మానినీ వృ

త నుపవాస కృశాంగినిఁ దరుణి దీన

వదన మఱి మఱి కుముల నిశ్వాసములను

15.    

 

 

 

తే.గీ.

శుక్ల పక్షాదిఁ గనిపించు సోమ రేఖఁ

బోలు నామె నస్పష్ట రూపున నగపడు

నామె రుచిర ప్రభ వెలుఁగు నామె ధూమ

జాలమున నగ్నికీలను బోలు నామె

16.    

 

 

 

తే.గీ.

ఒంటి పుట్టము పచ్చని దున్న యామె

నొంటిని మసి బారిన దేహ మున్న యామె

భూషణమ్ములు మేనునఁ బూన లేని

పద్మ హీనంపుఁ బద్మిని వంటి యామె

17.    

 

 

 

ఆ.వె.

సిగ్గు తోడ బాధ సెందు నామెఁ దపించు

నామె వాడిన మెయి నామె దీను

రాలి లోహితాంగు పాలు పడిన రోహి

ణీ సతీ లలామ నిభపు టామె

18.    

 

 

 

తే.గీ.

ముఖము కన్నీటి ధారల మునుఁగు నామెఁ

గూడు వీడఁగఁ గృశియించి కుములు నామె

ముచ్చిరి తనమ్ము నిచ్చలు మూఁడు నామె

దీనురాలి వెత కధీన మైన యామె

19.    

 

 

 

తే.గీ.

ప్రియ నిజ జనుల నచ్చోటఁ బేర్మిఁ గాంచ

నోప నామె నసుర వని తోత్కరములఁ

గాంచు నామె నడవి కుక్క గముల నడుమ

చిక్కిన స్వగణ రహితంపు జింక వోలె

20.   

 

 

 

తే.గీ.

వర్ష కాలము తుది విటప సహితంపు

వసుమతీ నికాశ మనఁగ నసిత మైన

పాము వంటి నల్లని జడ పడతి తుంటి

నంటు నామె సుఖమ్ముల కర్హు రాలి

21.    

 

 

 

తే.గీ.

వ్యసనము లనంగఁ దెలియని యామె యాప

దలఁ దపించు నామె విశాల తరళ నేత్రఁ

గాంచి మలినాంగిఁ గృశను సకారణముల

సీత యని మదిఁ దర్కము సేసె నంత

22.   

 

 

 

కం.

అలనాఁడు కామరూపుఁడు

పలాశనుండు గొనిపోవు వనితాకృతి నీ

లలనా మణి యాకారము

దలపించు నవశ్యమంచుఁ దలఁచెను మదిలో

23.   

 

 

 

తే.గీ.

నిండు చంద్రుఁ బోలు వదన మండలమ్ము

గండు తుమ్మెదల పగిది కనుబొమలును

పండు వెన్నెల మఱపించు మెండు మై వె

లుంగులును జీఁకటులు తొలఁగంగ దిశల

24.   

 

 

 

కం.

అలి నీల వర్ణ కేశ

మ్ములు బింబాధర సుమధ్యములు లలితాంగ

మ్ములు నలిన దళాంబకములు

కలిగి రతీ సతి యనంగఁ గన్పడ నామెన్

25.   

 

 

 

తే.గీ.

జగతి నెల్లర కిష్టంపు సదమలాంగి

నిండు చంద్రుని వెన్నెల నిఖిల జనుల

కిష్టమైన రీతి భువిని నేకతమునఁ

గూరుచుండఁ దాపసి వోలె భారముగను

26.   

 

 

 

కం.

భుజగేంద్రాంగన వైఖరి

నజస్రమును నిశ్వసించు నా భీరువు దుః

ఖ జనిత భయ కంపిత శో

క జాల సంలీన నష్ట కాయప్రభనున్

27.   

 

 

 

తే.గీ.

నివురు గప్పిన నిప్పు వోని యమల తను

రుచుల నలరు నామె యనుమాన చయ శాస్త్ర

నిచయ సరణి నష్ట విభవ నివహ నిభము

పరఁగు నామె నధికముగ వగచు నామె

28.   

 

 

 

కం.

విలయ మయిన విశ్వాసము

దొలఁగిన యాశా నివహము దుస్సాధ్యంబై

కలుగ మహోపద్రవములు

కలుషితమై చనెడు బుద్ధి గతిఁ నిపించెన్

29.   

 

 

 

కం.

దూఱుల దూరమగు యశము

మాఱన నొప్పు కొమరాలి మగనికిఁ జిరమున్

వేఱయిన వ్యథిత చిత్తను

గాఱడవిని దనుజ హరణ కర్శిత కాంతన్

30.   

 

 

 

ఆ.వె.

హరిణ లోచన నబ లాశ్రు పూర్ణాప్రస

న్న వదనను వగను ననవరతమ్ము

నిశ్వసించు నామె నీల వక్రాక్షి ప

క్ష్మ దిశలఁ దిలకించు సతిని సతము

31.    

 

 

 

ఆ.వె.

కాల మేఘ జాల ఘన పరివృత చంద్రి

కా ప్రభా నిభమ్ము కనక భూష

ణార్హు రాలు భూష ణానలంకృత దీన

వదన భామ సమల పంక తన్వి

32.   

 

 

 

తే.గీ.

సంత తాధ్యయన విహీన సంక్షయంపు

విద్య వోలె సీతఁ గని కపి వరు చిత్త

మునఁ గలిగె సందియము కరము బహుళమ్ము

నరయ నరయంగ నది మది నధిక మయ్యె

33.   

 

 

 

కం.

సుకరముగఁ గూర్పని వచన

నికర మపర భావమిచ్చు నెఱిని హనుమ జా

నకి ననలంకృతను నరయ

సుకృతమ్మున గుఱు తెఱుంగ సుడివడెఁ గరమున్

34.   

 

 

 

కం.

అకలంక నురు నయన రా

జకుమారినిఁ గాంచి హనుమ జానకి యనుచుం

బ్రకటితములు దిటవు లనే

క కారణములఁ దలపోసెఁ గమనీయముగన్

35.   

 

 

 

ఉ.

శోభల నీను సూర్యకుల సోముఁడు సెప్పిన భూషణమ్ములే

శోభన కర్ణ హస్తముల సుందర దేహము నందు కాల మే

ఘాభము తోఁప భూషలు చిరాకలితం బయి కానిపించె నా

యాభర ణాత్త ముద్ర లవి యంగము లందున ప్రస్ఫుటమ్ముగన్

36.   

 

 

 

ఉ.

ఏనవి చూడ లేదు మిథి లేశుని నందన పాఱవేయఁ దా

నీ నరనాథ నందను ముఖేరితమైన సుభూషణమ్ములన్

జానకి యొంటి నేర్పడిన చక్కటి గుర్తులు వీడఁ జాలునే

యేనవి యెల్లఁ జిత్రముగ నిప్పుడు గంటిని నిశ్చయమ్ముగన్

37.   

 

 

 

చం.

ప్లవగ వరేణ్య దృష్టము సువస్త్రము పీత సువర్ణ భాసమై

ప్రవిమల సూత్తరచ్ఛదము స్రస్త మగస్థితమున్ శుభమ్మునున్

భువిపతి తాగ్ర భూషణ విభూతులు సుస్వన వంతముల్ గనం

గ విశద మీ రమామణి సుకర్పట భూషణ సన్నిభమ్ములే

38.   

 

 

 

కం.

చిరకాలము ధరియింపగఁ

గరము నలిగె వస్త్రమయినఁ గాంతి మయంబే

యరయఁగ నితరము భంగిని

సురుచిర మా వసనము వర శోభా యుతమై

39.   

 

 

 

కం.

అపహృత యైనను రఘురా

మ పత్ని యీ కనక వర్ణ మహదంచిత మూ

ర్తి పదిలము మానసమ్మున

నపరిచితస్థలిఁ బతిపయి నమితప్రేమన్

40.   

 

 

 

చం.

కరుణయు సౌమ్య భావమును గర్కశ శోకము నింకఁ మోహమే

రుదగు నాల్గు తాపముల నందగఁ జేసిన కాంత యీమెయే

వర గుణ రామచంద్రునకు భామిని యౌటయు నాశ్రితార్థమున్

వర సతి నష్టమున్ దయిత భావము చేత క్రమంబుగా నిలన్

41.    

 

 

 

కం.

అంగాంగ సౌష్ఠవమ్ముల

నంగన యనురూప మినకు లాధీశునకున్

భంగము కాదు రఘూత్తపు

టంగ విలాస మవనిజకు నరయంగ నిలన్

42.   

 

 

 

కం.

మించిన తగులము పతి యన

నంచిత గారవము దార యన నిరువుర కీ

యించుక తడవైన మనుట

కెంచ నిదియ కారణము మహీతల మందున్

43.   

 

 

 

కం.

శోకమునఁ గుందక నిలిపి

యా కాయ మపహృత దార యైన రవి కులో

దాకర చంద్రుఁడు చేసె మ

హా కార్యము దుష్కరము మహాత్ముఁడు నెమ్మిన్

44.   

 

 

 

తే.గీ.

మోహ నాకార ధరణిజ మోము గాంచ

నేరకయు మని రాముఁడు ధీర వరుఁడు

చేసె దుష్కర కార్యము సీత నరయు

కాంక్ష చిత్తమున సతము గడలుకొనఁగ

45.   

 

 

 

కం.

ఇవ్విధి సీతా సతిఁ గని

యవ్వానర పుంగవుండు నానందమునన్

ఱివ్వున నేగె మనమ్మున

నవ్విభుని దరికి రఘువరు నంతఁ బొగడుచున్

46.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందుఁ బదునేనవ సర్గము.

 

సుందర కాండము

సర్గము 16.

 

కం.

కొనియాడి సీత నభినం

దనీయను గుణాభి రాముఁ దారక రామున్

వినయమ్ముతోఁ గొలిచి మది

హనుమంతుండు వడెను పున రాలోచనలన్

  1.  

 

 

 

ఆ.వె.

కలఁతఁ జెందె హనుమ కన్నీటి చూపులఁ

దలఁచి తానొ కింత తడవు మదిని

సీత వెతల నెంచి శిఖినిభ తేజుఁడు

మారుతాత్మజుండు తోరముగను

  1.  

 

 

 

తే.గీ.

మాన్యురాలు లక్ష్మణునకు మహిత శిక్షి

తునకుఁ బ్రీతి పాత్రము వృద్ధ జనుల కెల్ల

నయిన దుఃఖములఁ బడసె నవని తనయ

కాల మెల్లరకు దురతిక్రమము సుమ్ము

  1.  

 

 

 

కం.

వర్షాగమ గంగ సరణి

మర్షాతిశ యావనిజకు మనము నడలు దు

ర్ధర్షంబె రామలక్ష్మణు

లార్ష సువేషుల ప్రయత్న మవగత మైనన్

  1.  

 

 

 

కం.

తగునీ యింతి వయో వృ

త్త గుణాన్వయములఁ దలంప దాశరథి కిలం

దగు నీరాముఁ డవనిజకు

సుగుణోద్దాముఁడు ఘనుండు సుక్షత్రియుఁడున్

  1.  

 

 

 

కం.

కనక సువర్ణా భాంగిం

గని లక్ష్మీద్యుతులఁ బోని కాంతామణినే

మనమున నెంచి రఘూత్తము

హనుమంతుఁడు వల్కెనంత నాత్మగతముగన్

  1.  

 

 

 

ఆ.వె.

వాలి నిహతుఁ డయ్యె బలశాలి కపిరాజు

రావణప్రతిముఁడు సావు గనియె

నసురుఁ డా కబంధుఁ డడవి లోనఁ బడసి

యాయతాక్షి ధరణి జార్థమె కన

  1.  

 

 

 

కం.

భీమ పరాక్రముఁ డసురుఁడు

రామునిచే నిహతుఁ డా విరాధుఁ డనిన్ సు

త్రామునిచే హత చేతనుఁ

డా మను జాశనుఁడు శంబ రాఖ్యుని భంగిన్

  1.  

 

 

 

కం.

పదునాలుగు వేల బెడిద

పు దనుజుల వధించె ననలపు శిఖ లనంగం

బదను శరమ్ముల రాముఁడు

విదారణమ్మున నొకండె విచ్చలవిడిగన్

  1.  

 

 

 

తే.గీ.

ఖరునిఁ బంపె నాజిని దండధరుని కడకుఁ

ద్రిశిరు వధియించి పంపెను దివికి వేగ

దూషణుని రాక్షసాధముఁ దునిమె ననిని

రాముఁడు విదితాత్ముఁడు దాశరథి ఘనుండు

  1.  

 

 

 

కం.

సుగ్రీవున కీమె వలన

నుగ్రాధిక వాలిపాలి తోర్వర రామా

నుగ్రహమున సైశ్వర్య స

మగ్రము లభియించె నిరుపమానం బెంచన్

  1.  

 

 

 

తే.గీ.

నాదు నద నదీ పతి లంఘనమ్ము భీక

రమ్ము లంకా నగర శోధనమ్ము ధరణి

జాయతాక్షి జానకి రావ ణాపహృతను

గూర్చి కాదె విచారింప గుంభనముగ

  1.  

 

 

 

కం.

మున్నీరు సుట్టిన పుడమిఁ

గ్రన్ననఁ దల క్రిందు సేయ రఘు వరుఁ డడరన్

మన్ననయ యీ తరుణి కొఱ

కన్నను విశ్వమ్ము తోడ నాశ్చర్యంబే

  1.  

 

 

 

ఉ.

లోకము నందు రాజ్యము సులోచన జానకి నెంచి చూడగం

బ్రాకట మౌను సుమ్మిదియ వైభవ మందునఁ దూఁగు సీతయే

యేకము నైన ముజ్జగము లింపుగ రాజ్యము లెల్ల తూఁపఁగం

దాఁకవు షోడశాంశమును ధాత్రిజ తో మఱి పోల్చి చూచినన్

  1.  

 

 

 

తే.గీ.

ధర్మశీలుఁడు మిథిలా ప్రధాన పట్ట

ణాధి నాథుఁడు జనక మహాత్ముని సుత

భర్తృ దృఢతమవ్రత యీమె వసుధఁ జీల్చి

సీత ముఖమున జనియించె సీత యనఁగ

  1.  

 

 

 

తే.గీ.

విక్రముఁడు సమరాజేయ వీర వరుఁడు

ధర్మవర్తనుఁడు ధవుఁడు దశరథాఖ్యు

పెద్ద కోడలు ఘన యశస్విని గుణ గణ

విలసిత శుభాంగి తరుణి పృథ్వీ తనూజ

  1.  

 

 

 

తే.గీ.

ధర్మ మెఱిఁగిన వాని నా ధర్మరతుని

మేలు మఱువని వాని నా మేటి మగని

నాత్మ నెఱిఁగిన వాని రామాభిధాను

ప్రణయ తమపు వధువు నసుర వశ మయ్యె

  1.  

 

 

 

మ.

సకలైశ్వర్య మహాత్త భోగముల సంసక్తంబు గా కవ్వనిం

బ్రకృతిన్ భర్తృవిలీన చిత్త యయి సంప్రాప్తంపు దుఃఖాలి చే

నొక యింతైనను జింతలేక పతికిన్ యోగ్యంపు శుశ్రూషలే

యకళం కాబల కీయఁ దృప్తి ఫలమూ లాహారి యై వెల్గెనే

  1.  

 

 

 

చం.

వనమును గూడ సౌధముగ భావన సేసి మనమ్ము లోపలం

గనక నిభాంగి మోదమునఁ గాంతుని తోడఁ జరించె నిత్యమున్

ఘనమగు సంకటమ్ములను గష్టము లన్న యెఱుంగ రాని యీ

యినకుల సోమ గేహిని సహించె సుభాషిణి విస్మయంబుగన్

  1.  

 

 

 

కం.

దాహార్తికి విమల తరం

బా హిమ సలిలమ్ము వోలె నవనీ సుత వై

దేహి దశానన బాధిత

నా హేమాంగిని రఘువరుఁ డర్హుఁడు సూడన్

  1.  

 

 

 

కం.

పతితపు రాజ్యము హస్తా

గతమైన ధరాధినాథు గతిని ధరణిజన్

సతినిఁ దిరిగి పొందిన రఘు

పతి మోదముఁ జెందు నింక బాహుళ్యముగన్

  1.  

 

 

 

ఆ.వె.

రామ దర్శన ఘన కామనా చిత్తయై

దేహము నిలిపెను విదేహ రాజ

కన్య కామ భోగ కాయముల విడిచి

బంధు జన విహీన భామ యిచట

  1.  

 

 

 

కం.

చూడదు రాక్షస కాంతలఁ

జూడదు ఫల పుష్ప తరుల సుంతయు సుమ్మీ

పాడిగ నేక మనమ్మున

వీడక రామస్మరణము వేదన నుండున్

  1.  

 

 

 

కం.

పతి మాత్రమె మేటి తొడవు

సతులకు నెల్లఁ దొడవుల విచారింప నిలన్

విత తాలంకార్హ యయినఁ

బతి దూరమ్మున నవనిజ భాసిల్ల దిటన్

  1.  

 

 

 

కం.

ఇసుమంతైన మది నిరా

శ సెందక విభుండు ధరణిజ విరహితము క

క్కసపుఁ బనిం గాయమ్మున

నసువులు ధరియించి చేసె నా రాముండే

  1.  

 

 

 

ఆ.వె.

నాదు మనము గూడ వేదన వశమయ్యె

నసిత కేశిని నలినాక్షి నిటుల

దుఃఖితఁ గలకంఠిఁ దోరంపు సుఖముల

కర్హురాలి సీత నబల నరయ

  1.  

 

 

 

కం.

ఓరిమినిఁ బుడమి మించెడు

నారీమణి రామలక్ష్మణ సురక్షితయే

వారిజ లోచన రాక్షస

నారుల పాలయ్యె నేఁడు నగ మూలమునన్

  1.  

 

 

 

తే.గీ.

మంచు ముంప శోభ సెడు తామరస సరణి

పతినిఁ గన లేని జక్కువ పక్షి వోలె

నిడుము గములంది మనము పీడింపఁ బడిన

సీత దుర్దశ పాలయ్యెఁ జిత్రముగను

  1.  

 

 

 

మత్తకోకిల

పుష్ప భార వినమ్ర శాఖల భూరి వృక్ష మశోకమున్

బాష్ప పూరిత నేత్రఁ జేసెను భామ నా యవ నీసుతం

బుష్పమాస సహస్ర రశ్మి నభో వ్రజమ్మున నుండి తా

శష్పముం గలుగంగఁ జేసె భృశమ్ముగం బరుషంబుగన్

  1.  

 

 

 

కం.

బలవంతుఁడు హరి వృషభుఁడు

తలఁచి మది నివిష్ట బుద్ధిఁ దరుణీ మణియే

యల సీత యంచుఁ గూర్చొనె

లలితమ్ముగ నాని శాఖల విలాసముగన్

  1.  

 

 

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందుఁ బదునాఱవ సర్గము.

 

సుందర కాండము

సర్గము 17.

 

 

 

ఆ.వె.

అంత సిత సరోరు హాభుండు చంద్రుండు

విమల నీల రుచుల వెల్గు నభము

నిర్మలుండు సేరె నీలోదకమ్ములఁ

జేరు హంస వోలెఁ జిన్మయముగ

  1.  

 

 

 

కం.

తెల్లని వెన్నెల నిండగఁ

జల్లని కిరణమ్ముల శశి సాచివ్యమనన్

మెల్లన సేవించెఁ గపిని

నుల్లము సంతసిలఁగఁ బవనోద్భవున కటన్

  1.  

 

 

 

తే.గీ.

చంద్ర బింబ తుల్య విమ లాస్య నవనిజను

శోక భార కృశీ భూత నా కబంధ

బంధ భార నౌకాభను వానర వృష

భుండు దర్శించి దుఃఖించె మెండు గాను

  1.  

 

 

 

కం..

వైదేహిం దిలకించుచుఁ

దా దాపున రాక్షస వనితల నటఁ గాంచెన్

వేదన లిడ గాడ్పునకున్

గాదిలి పట్టి హనుమ సువికార వదనలన్

  1.  

 

 

 

ఆ.వె.

ఒంటి కంటి తమ్మికంటి యొకతె కర్ణ

మొక్కటి గల యింతి యొకతె యొక్క

చెవియు లేని యట్టి చేడియ యొక్కతె

చుట్టు ముట్టు చెవుల పట్టి యొకతె

  1.  

 

 

 

ఆ.వె.

శంకు భంగి చెవుల పంకజాక్షి యొకతె

యూర్పు పైకి పంపు నోటి ముక్కు

తోడ నున్న యట్టి తొయ్యలి యొక్కతె

పెద్ద యొంటి నొక్క ముద్దు గుమ్మ

  1.  

 

 

 

ఆ.వె.

పొడుగు గడను బోలు మెడయున్న పడఁతుక

యొకతె పస చెడిన జడ కల కొమ్మ

యొకతె కంబళి వలె నున్న సిగల కొమ్మ

యొకతె బోడి శిరపు టువిద యొకతె

  1.  

 

 

 

ఆ.వె.

నొసలు నాను వీనుల సకియ యొక్కతె

లావు కడుపు చెలులు చేవ బోర

లున్న వన్నెలాడు లుండంగ వ్రేలాడు

మరియు గౌద పెదవుల రమణులును

  1.  

 

 

 

ఆ.వె.

దొడ్డ మొగపు లేమ తోరంపు మోకాళ్ల

తోయజాక్షి కుఱుచ మాయలాడి

వాలు మేని చాన చాల గూని కలికి

వంకర మఱుగుజ్జు బాగరులును

  1.  

 

 

 

ఆ.వె.

బెడిదపు టతివలును వికృతపు మోములు

న్నట్టి వారు కడిమి చొట్ట నోటి

వారు పసుపు నెఱుపు వర్ణ నయనలును

వారి నెల్లఁ జూచె వాయుజుండు

  1.  

 

 

 

కం.

కాషాయాకారలు ఘన

రోషా కలితలు వికృత లురుశ్యామాంగుల్

దూషణ రతలున్ సుమహ

ద్భీషణ గిరిసార భల్ల వివిధాస్త్ర కరల్

  1.  

 

 

 

ఆ.వె.

బెబ్బులి శివ జింక వెడఁద దున్నయు మేక

పంది మోము మోము వారు నుండ

సొట్ట నెత్తి వారు సూడ గౌరొంటె గు

ఱ్ఱంపుఁ గాళ్ల కాళ్ల సొంపు వారు

  1.  

 

 

 

తే.గీ.

ఆవు గొమ్మమెకము పిప్పలాశనమ్ము

గాలిగాని మఱియుఁ దుఱగంపుఁ జెవుల

వంటి చెవు లున్న వారేక పాద మేక

కరము లున్న వారన్యలు కాంత లచట

  1.  

 

 

 

కం.

అతి నాస లనసలు నెరి నె

రి తలపు నాసలును మదకరి నసలును లలా

ట తలోచ్ఛ్వాస నసలు విర

హిత నాసికలు నెలఁతుక లహితు లెల్ల రటన్

  1.  

 

 

 

కం.

వేదండోద్దండాంఘ్రులు

పాదాంగ రుహలును ధేను పాదలు ఘన లం

బోదర పయోధర సహిత

లీ దైత్య వరప్రమద లహీనగ్రీవల్

  1.  

 

 

 

ఆ.వె.

కడిఁది నోరు కనులు పొడవైన నాల్కలు

నాఁడు మేక పంది హస్తి వదన

లును హయోష్ట్ర ఖర వదనలును ఘోర ద

ర్శనలు రక్కసులు ఖర నఖ యుతలు

  1.  

 

 

 

కం.

సమ్మెట యీటియలు దమ క

రమ్ముల నలరఁగ భయంకరంపుఁ గలహ రో

షమ్ములఁ దపించు వారు ము

ఖమ్ములు వికృతములు వెండ్రుకలు ధూమలముల్

  1.  

 

 

 

చం.

సతతము మాంస మద్యములఁ జాగఁగఁ జిత్తము త్రాగ సంతత

మ్ము తడియ రక్త మాంసముల బొందులు వాని నిషేవణమ్మునన్

రత మతి రోమహర్షణ భరప్రళయాంతక దర్శనాంగనల్

వితత సుకాండ సాల పరి వేష్టలఁ గాంచెను వాయుజుం డటన్

  1.  

 

 

 

కం.

ఆ పాదప మూలమ్మున

నా పార్థివ తనయను జనకాత్మజ నమలన్

రూపాతిశ యానిందిత

శ్రీ పవనాత్మజుఁడు కపి వరేణ్యుం డరసెన్

  1.  

 

 

 

కం.

హీనప్రభ శోకార్దిత

దీన వదన ధూలి కలిత దీర్ఘాంగ రుహన్

హీన సుకృత గగనచ్యుత

మౌ నక్షత్రం బనంగ హరి వరుఁ డరసెన్

  1.  

 

 

 

కం.

పతి వాత్సల్యైక విభూ

షిత భూషణ విరహి తాంగి శీల సుగుణ కీ

ర్తిత పరితప్త చిరాకాం

క్షిత భర్త్రీక్షణను గాంచె సీత నవనిజన్

  1.  

 

 

 

ఆ.వె.

బంధు జన విదూర భార హృదయ సీత

దొడ్డ రక్కసుఁ జెఱ బడ్డ యబల

మంద వీడి బెదరి కందర సింహంపు

బారిఁ బడ్డ హస్తి పగిదిఁ గాంచె

  1.  

 

 

 

ఆ.వె.

తీఁగ తెగిన వీణ తీరు నయుక్తమై

శారద ఘన వృతపుఁ జంద్ర రేఖ

భాతి రుచి విహీన పతి కరస్పర్శ వి

హీన జనక తనయ దీన వదన

  1.  

 

 

 

చం.

పతివశ మైన యుక్తమగుఁ బాడియె దైత్య వశా వశమ్ము మా

నిత వనితా లలామ యిట నిత్య మశోక వనమ్ము లోపలం

బతితను దుఃఖ తోయధి నవారిత బంధిత యై మహా గ్రహా

వృతమగు రోహిణీ నిభము వేదన జెందు ధరాత్మజన్ లతా

గతిఁ గనె హీన పుష్పముల కాంతను మారుత నందనుం డటన్

  1.  

 

 

 

కం.

నిజ దేహ కాంతుల వెలిఁగి

రజ లిప్తాంగక మలిన కరణమున వెలుఁగం

గఁ జనదు పలల మృణాళం

పు జిగి పగిది శోక తప్త భూజాత యటన్

  1.  

 

 

 

కం.

నలిగిన మాసిన బట్టల

వెలసిన మృగ లోచన నలివేణిని భామన్

లలితాంగిఁ గనె నసుర భా

మల యారడిఁ గుములఁగ హనుమానుఁడు సీతన్

  1.  

 

 

 

తే.గీ.

సీత నసిత లోచన నిజ శీల రక్షి

త పతి కాంతి బలాన్విత తప్త హృదయ

దీన వదన నా దేవిని ధీర వరుఁడు

మారుతాత్మజుండు గనెను మానితముగ

  1.  

 

 

 

చం.

నలుదిశ లెల్లఁ జూచు హరిణంపు నిభమ్ము భయమ్ము సెందుచుం

దలిరులఁ గూడి వృక్షములఁ దప్తము సేయఁగ నిశ్వనమ్ములే

యలజడి తళ్ల రూ పెగసి నట్టి విచారపుఁ గుప్ప వోని యా

నలిన దళాక్షి సీతను వినమ్రను మారుతి గాంచి యచ్చటన్

  1.  

 

 

 

ఆ.వె.

మేదినీ నిభమ్ము మేటి యంగములును

భాసితమ్ము హీన భర్మ భూష

ణముల నింతి వాయునందనుం డానంద

మొందెఁ గరము గాంచి వందిత నట

  1.  

 

 

 

ఆ.వె.

సోయగంపుఁ గనుల సుందరి దర్శించి

నంద జనిత తిగ్మ నయన జలము

వాయు నందనుండు వాయ నొత్తి తలంచె

నంత రామచంద్రు నంచితముగ

  1.  

 

 

 

తే.గీ.

వందన మిడి రామునకు నవరజ లక్ష్మ

ణునకు వీర వరేణ్యుఁడు హనుమ మారు

తాత్మజుండు సీతా దర్శ నాతి హర్ష

చిత్తుఁ డొదిగి యుండె నపుడు చెట్టు మీద

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందుఁ బదునేడవ సర్గము.

 

 

సుందర కాండము

సర్గము 18.

 

 

కం.

అవ్విధిఁ దిలకింప హనుమ

యవ్వనము సకుసుమ పాద పాకలితమ్మున్

జవ్వని సీతఁ గడచె నిసి

ఱివ్వునఁ జిఱు శేషము నిసి ఱేఁడు సనంగన్

1.      

 

 

 

కం.

వేకువన నాతఁడు వినియెఁ

బ్రాకటముగ శ్రుతి షడంగ పారగ విప్రా

నీకక్రతు యాజక సు వ

శీకర వేదక్వణములు చిత్తం బలరన్

2.     

 

 

 

తే.గీ.

దశముఖుఁడు మహాబాహువు దనుజ విభుఁడు

నంత వీనుల కెల్ల విందైన వాద్య

ఘోషములు మంగళమ్ములకు ముద మొంది

మేల్కొనియె రాజ దర్పంబు మెఱయ నపుడు

3.     

 

 

 

కం.

చెదరిన దండల దుస్తుల

మొదలిటి తఱి లేచి దనుజ ముఖ్యుఁడు వీర్యా

భ్యుదయుండు పరాక్రమ విభ

వ దర్పుఁడు దలంచెఁ గరము వైదేహి మదిన్

4.     

 

 

 

తే.గీ.

చారుశీల రామదయిత జానకి పయిఁ

బ్రేమ పాశ బంధనమున భృశము దగిలి

కామ భావము దనలోనఁ గప్పి పుచ్చఁ

జేత గాక రావణుఁ డుండె వీత లజ్జ

5.     

 

 

 

కం.

కనకాభరణ విభూషణుఁ

డనవరత ఫల కుసుమ కలితాగ విలసితం

బు నశోక వనమ్ముఁ గదిసె

ననుత్త మాభరణ ధారి యాత్రము దోడన్

6.     

 

 

 

తే.గీ.

రంగు రంగుల నలరు నలరులు నిండ

నిరత మత్త విహగ గణ నినద మలరు

కనుల కద్భుతమై తోఁచు కమలినీ వృ

తమ్ము నాయశోక వనము సమ్ముదముగ

7.     

 

 

 

చం.

వృకగణ దర్శనమ్ము కను విందొన రింపగ నుండ భవ్య వా

టిక మణి తోరణమ్ములను ఠీవిగఁ జూచుచు రావణుం డశో

క కుజ వనంబుఁ జేరె దశకంఠుఁడు సంతత వృక్ష రమ్యమున్

సకల మృగాకులమ్ము ఘనసాల ఫలమ్ముల నేలఁ గాంచుచున్

8.     

 

 

 

తే.గీ.

వెడలెడు నసురాధీశుని వెంబడించి

రంగనలు నూర్గు రచ్చట నమర విభుని

వజ్రధరు దేవ గంధర్వ వనిత లెల్ల

ప్రీతి సేవింపఁ జాగెడు రీతి యలర

9.     

 

 

 

ఆ.వె.

స్వర్ణ దీప హస్త భామలు కొందఱు

చామరముల వీచు చామ లొరులు

తాలవృంత హస్త తరుణులు కొందఱు

దనుజ విభుని వెంటఁ జనిరి భక్తి

10.    

 

 

 

తే.గీ.

కాంచన కలశమ్ముల నిండఁ గాంతలు సలి

లమ్ము తోడ ముందు వెడల లలనలు మఱి

కొంద ఱాసనములఁ జేత నందు కొనుచు

మండలాగ్రములఁ జనిరి మగని వెనుక

11.    

 

 

 

కం.

రతనాలు పొదిగిన నెఱి ర

జతంపు కలశమ్ము నిండు సారాయముతో

నతి నేర్పరి కుడిచేత ము

దిత యునిచి నడచె వెనుక పదిలముగ నంతన్

12.    

 

 

 

కం.

తెలిపిట్ట వంటి తెలుపునఁ

గలువల దొర మేని మించి కనిపింపంగన్

వెలిగొడుగు పసిడి దండం

బలర నపర వనిత నడచె నసురుని వెనుకన్

13.    

 

 

 

తే.గీ.

నిదుర వీడని ముఖముల నెచ్చెలుని వ

లని వలపు మీర లలన లల్ల పతి వెనుక

వచ్చి రంబుదమ్ముల వెన్క వచ్చు నట్టి

మెఱపుల పగిది రావణు మేటి సతులు

14.    

 

 

 

కం.

మలఁగిన యంగద హార త

తులఁ జెదరిన కుంతలములఁ దొలఁగిన మైపూఁ

తలఁ బట్టిన వదనపుఁ జెమ

టలఁ జెలులు నడచిరి యటఁ దడఁబడుచు వెనుకన్

15.    

 

 

 

కం.

వలపున నిదురను దూలుచు

నలినాక్షులు దలను వాడిన సరమ్ముల పూ

వులు దడియగ ఘర్మమ్మున

వలపున భక్తిం గదలిరి పతి సన నంతన్

16.    

 

 

 

ఆ.వె.

వారి మగఁడు మేటి బలుఁ డతి కామాతు

రుఁడు ధరణిజ పయి మరులు కొనిన మ

నమ్ము వాఁడు దశముఖమ్ముల మందుండు

మందగామి యయ్యె మగువ కొఱకు

17.    

 

 

 

ఆ.వె.

నెలఁతల మొలనూళ్ల నెఱవు చప్పుళ్లును

సతుల యందెల చిఱు సవ్వడులును

మెండుకొలుప వాయుజుండు కపి వరుండు

వినెను దరువు పైన వేడుకగను

18.    

 

 

 

ఆ.వె.

గుమ్మము గదియంగ నమ్మహాబల విక్ర

ము నసమాన కర్ము దనుజ నాథు

రావణు నరసెఁ గపి రామ కార్య రతుఁడు

మారుత సుతుఁడు హనుమానుఁ డంత

19.    

 

 

 

కం.

ససుగంధ మా చమురునఁ ద

డసిన దశల దీపములఁ బడఁతు లగ్రమునన్

వెస వెడలఁగ నా ప్రభల మె

ఱసెడు వదను రావణుని వెఱవకుండఁ గనెన్

20.   

 

 

 

తే.గీ.

మత్తు నుబ్బును మోహము సత్తు వున్న

వాని లోహిత వక్ర నిధ్యాన లోచ

నమ్ము లున్న వాని ధనువు నమ్ము లెల్ల

విడిచిన మరు నిభము వాని వీర వరుని

21.    

 

 

 

కం.

చిలికిన యమృతంపు నురగ

వలె నున్న యమలిన ధవళ పట మంగద మూ

ల లలిత లగ్నమును గర

మ్ముల లీలగఁ దీయు వాని మోహావేశున్

22.   

 

 

 

కం.

ఆసన్నాగతుని నతని

నా సోమ తనయుఁడు దాఁగి యా దళ శాఖా

వాస సుమ పత్ర లీనుఁడు

నాసక్తుం డయ్యెఁ జూడ నా దనుజ విభున్

23.   

 

 

 

కం.

తిలకింప నటుల నెలనాఁ

గల సుందరులఁ గనెను దశ కంఠాంగనలన్

వెలసెను వారి నడుమ తా

రల మధ్య శశాంకుఁ బోలె రావణుఁ డచటన్

24.   

 

 

 

తే.గీ.

వివశుఁడు విచిత్ర భూషణ విలసితుండు

శంకు కర్ణుఁడు బలశాలి జంతు విహగ

సంయుత ప్రమదా వన సముప గతుఁడు

విశ్రవసు సుతునిఁ గనెఁ గపి వరుఁ డంత

25.   

 

 

 

కం.

ఇతఁడే రావణుఁ డసురా

యత భుజుఁ డని మదిఁ దలంచి హనుమంతుఁడు భా

సిత కాయుఁడు దిగె లేశ

మ్ము తరువున మరుత్సుతుండు భూరి బలుండే

26.   

 

 

 

తే.గీ.

స్వయముగ బల పరాక్రమ వంతుఁ డైన

వాని వీర్య ప్రభలు గాంచి వాన రేంద్రుఁ

డించుక చలించి దాఁగె నిజేప్సిత పరి

పూర్ణ కాంక్షియై తరుపత్రముల నడుమను

27.   

 

 

 

ఆ.వె.

చూడఁ గోరి వేగ సుదతి నసిత కేశి

ని నలినాక్షి శశివదన నవనిజఁ

జారు గాత్రఁ దరుణి జనకాత్మజను రావ

ణాసురుండు సేరె నా వనమ్ము

28.   

 

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందుఁ బదునెనిమిదవ సర్గము.

 

 

 

సుందర కాండము  

సర్గము 19.

 

 

తే.గీ.

గాడ్పున విరివిగఁ గదలు కదళి వోలెఁ

దూఁగెఁ జూచిన నిమిషంబ వేఁగ మనము

రాజపుత్రి వైదేహి యా రావణు దను

జాధిపుఁ దరుణు భూషితుఁ నందగాని

1.      

 

 

 

కం.

తొడల నుదరమ్ము గప్పుచుఁ

బడఁతి కరమ్ములను వక్ష భాగము నెల్లన్

బెడిదమ్ముగ రోదించుచుఁ

గడు దుఃఖమ్మున నవనిజ కన్పడె నపుడున్

2.     

 

 

 

కం.

కడలి మునిఁగిన తరణి వలె

నడలున మునిఁగిన సుభీత నవనిజఁ గాంచెన్

దుడుకు లసు రాంగనలు కడు

బెడిదమ్ముగఁ గాచుచుండఁ బిశితాశనుఁడే

3.     

 

 

 

ఆ.వె.

వ్రేటు వడి కుజంపు విటపమ్ము భూమి పైఁ

బడిన రీతి కటికి యిడిక పైనఁ

గూరు చున్న సుదతి కోమలి ధృఢ మతి

దుఃఖ భార తప్త తోయ జాక్షి

4.     

 

 

 

ఆ.వె.

దుమ్ము తోడఁ గూడి పమ్మిన రంగుల

మెఱయు మేని భామ మేటి కనక

భూష ణార్హ హీన భూషణ మెఱయని

పంక నాళ భంగి పడఁతి నంత

5.     

 

 

 

కం.

మనమే యరదము కాఁగన్

ఘన సంకల్పమె హయములు కాఁగ మహాత్ముం

డు నరాధీశ్వరుఁ డా రా

ముని చెంతకుఁ జనియె సీత ముదమారఁ ద్రుటిన్

6.     

 

 

 

కం.

కృశియించి నేకతమ కుం

ది శోకముల కంత మన్నది యెఱుఁగని యహ

ర్నిశ రామానువ్రతను ఘ

న శోక పరవశను రామ నలిన దళాక్షిన్

7.     

 

 

 

కం.

కేతువు పొగఁ బాఱిన నా

వీతప్రభ రోహిణి వలె వేష్టిత సుమహా

వాతంధయ వధువు పగిది

సీతను నవినీ తల విలసితను విలపితన్

8.     

 

 

 

కం.

జనియించి సదాచార ని

ధనమ్మున కుగోత్ర జాత తరుణీ భంగిన్

ఘన విమల కరణము దిరిగి

యొనగూరు ననం గనఁ బడు నువిదను సీతన్

9.     

 

 

 

ఆ.వె.

సత్య దూరమైన నిత్యాప వాదమ్ము

ల లయమైన కీర్తి వలె సురుచిర

వేద సమ్మతమ్ము విరహితంపుఁ జదువు

లీల నున్న సీత నీల వేణి

10.    

 

 

 

ఆ.వె.

తఱిఁగినఁ బరువు వలె తగ్గిన నమ్మిక

చందము నహితంపు మంద పూజ

యోజ భంగ పడ్డ యుక్తంపు టాశ య

నంగఁ దోఁచు కోమలాంగి సీత

11.    

 

 

 

తే.గీ.

కను మఱుగయిన నిజ భావి కరణిఁ బరఁగు

మీఱిన కటికి యానతి మేర చెలఁగు

ప్రళయ కాలార్చి వెల్గుల పగిది మెఱయు

నిలువరించిన పూజల నిభము వెరచు

12.    

 

 

 

తే.గీ.

కలఁచిన కమలిని యనఁగఁ దలఁగ కాంతి

మడిచిన భటుల వాహిని మాడ్కి మెలఁగు

తిమిరమునఁ దొలఁగిన కాంతి తీరు నున్న

యెండి పోయిన యేటిని మెండు మీఱు

13.    

 

 

 

కం.

మలినీకృత వేదీ నిభ

సలిలార్ద్రానల శిఖాభ సైంహిక దనుజా

కుల చంద్ర మండల సమా

కలి తేందుమతీ నిభ జనక తనయ సీతన్

14.    

 

 

 

తే.గీ.

కరి కరోత్కృష్ట పల్లవ కమల సహిత

ఘోర విత్రాసిత విహగ కోటి కలిత

పాద ఘట్టన లోలిత పద్మినీ ని

భాబల తరల నయనఁ గృశాంగి సీత

15.    

 

 

 

ఆ.వె.

మగని వలని కలత మనమును నెరియింపఁ

గుములు మగువ నీటి కొఱఁత తోటి

యేటి వోని లేమ యొడలుఁ గడుగ లేని

బహుళ పక్ష రాత్రి భంగి యతివ

16.    

 

 

 

ఆ.వె.

ఇప్డు కోసిన బిస మెండ వాడిన రూపు

తోఁచెడు సుకుమారి తోయ జాక్షి

మణిమయ గృహ వాస మాన్యురాలు శుభాంగి

భర్తృ దర్శ నార్తఁ బరమ సాధ్వి

17.    

 

 

 

తే.గీ.

పట్టి కంబము నందునఁ గట్టి గట్టి

గ విడగొట్ట యూధప సముఖమ్ము నుండి

కరము నిశ్వసించి తపించు గజ వధూటి

యనగఁ దలఁపించు నెలఁతుక నబల సీత

18.    

 

 

 

కం.

నిడుదైన యేక వేణికఁ

గడు సహజంపు వపు రుచుల కాంతా మణినిన్

బెడఁగు తొలుకారి కడపటి

దడపు మహీజముల తోటి ధరఁ బోని సతిన్

19.    

 

 

 

కం.

ఉపవాసమ్ముల భయమున

విపరీతపు శోకమున నవిరళపు వగలన్

వపువు కృశించిన దీనను

తపస్వి నల్పాశనను సదమల మనస్విన్

20.   

 

 

 

తే.గీ.

అంజలి ఘటించి రఘు రాము నడిగె మదిని

దుఃఖమున దశగ్రీవుని దుష్టచిత్తు

ఖండనమ్ము నాబరగు ప్రకటిత భవ్య

భావముల దేవతా మూర్తిఁ బతి నిరతను

21.    

 

 

 

తే.గీ.

చూచి రావణుఁడు విలపించు సువదన న

నిందిత దిశలఁ బరికించు సతిఁ బతివ్ర

తను సుపక్ష్మ తామ్రాయత తరళ నేత్ర

నాశ పెట్టె భయము గొల్పె నంతఁ జంప

22.   

 

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందుఁ బందొమ్మిదవ సర్గము.

 

 

సుందర కాండము 

సర్గము 20.

 

                                                                     

కం.

అసుర తరుణీ వృతార్తను

నసమ్మదను దీనురాలి నా తాపసురా

లి సతీ రత్నముఁ జూచుచు

నసుర విభుఁ డనె మధురముగ సాంగిక గిరలన్

1.      

 

 

 

కం.

నను గని భయమ్మున నుర

మ్ము నుదరమును నక్కజముగ ముడుఁగఁగఁ దగునే

కనఁబడ నిష్టము లేక మ

ది నెంచితివ పల్కుమ సుదతీ! నలినాక్షీ!

2.     

 

 

 

కం.

నీ దయఁ గోరెదఁ దరుణీ

సాదరముగఁ జూడు నన్ను నంబుజ నయనా

యీ దనుజేంద్రు కరము గొను

మా దయితా మరులుకొంటి మగువా వినుమా

3.     

 

 

 

ఉ.

మానవ వీరు లైన మఱి మానిసి దిండులు  కామ రూపులుం

గానఁగ లేరు దారి నిను గావ మదీయ భయమ్ము నుండి యో

మానవతీ! శుభాంగి! జన మాన్య! ధరాతల మందు భామినీ!

జానకి! నన్ను గైకొనుమ చారువిలోచన సంతసమ్మునన్

4.     

 

 

 

కం.

పరనారుల వరియించుట

హరించుటయు నతి బలమున నసుర వరులకున్

నిరతము నిజ ధర్మమె కల

వర మేల నలిన దళాక్షి! భయ మెందులకో

5.     

 

 

 

ఆ.వె.

వలపు నాదు మేన వలసిన విధముగ

వఱల నిమ్ము భృశము పంకజ నయ

నా! యనిష్టము నిను నారీమణీ! విను

తాఁక నవనిజ! యిటఁ దథ్యముగను

6.     

 

 

 

కం.

వెఱపున కిటఁ దా వీయకు

మఱి మఱి విలపింపఁ దగదు మగువా! నీకుం

దఱచుఁగ వరింపు నను నే

యఱమర లేక మది నమ్మి యవనిజ! వింటే

7.     

 

 

 

ఆ.వె.

ధ్యాన మొంటి తిరియు దారుణంపుఁ బుడమి

పఱు పకాలపు టుపవాసములును

మలిన వస్త్రములును దలఁపంగ యుక్తమ్ము

లె వనజాయతాక్షి! హీనము లవి

8.     

 

 

 

మ.

కొనుమా నన్ను వరించి నెమ్మి సుమనోగుచ్ఛప్రభా మాలికల్

ఘన గంధావృత చంద నాగరు లసత్కాంచీ విభూషాదు లా

సన శయ్యాదులు దివ్య చిత్ర వసనస్కంధమ్ములున్ మద్యముల్

విన సొంపైన సవాద్య గీతములు సంప్రీతంపు నృత్యమ్ములున్

9.     

 

 

 

కం.

వనితా రత్నమ యివ్విధి

వనరకు తొడుగుము తొడవుల వరదేహమునన్

ననుగొని యనర్హ వగుదువె

కనకాభరణ వరమణి నికాయమ్ములకున్

10.    

 

 

 

ఆ.వె.

పాఱి నట్టి నీరు వాహినిఁ జేరని

భంగి చారు జాత పరమ భవ్య

యౌవనమ్ము గడువ నతివ దిరిగి పొంద

శక్యమె యెటు లైనఁ జారు వదన!

11.    

 

 

 

కం.

నిను సృజియించి ధరాత్మజ!

వనజభవుఁడు విశ్వసృక్కు భవముల నిక నా

పె నని తలంతు ధరఁ గలరె

నిను బోలెడు రూపవతులు నీరజ నయనా!

12.    

 

 

 

కం.

తరుణము చెలువము మీఱినఁ

దరుణీ నిను గన్న నుండఁ దర మగునె ధృతిం

బురుషుల కైవ్వరి కైనను

నరవిందాసన సహితము నరయఁగ భువిలో

13.    

 

 

 

కం.

అంగాంగంబుల నే కడ

నంగన! నేఁ జూచిన నిఁక నంబుజ ముఖి! య

య్యంగంబు నెవ్విధిని మర

లంగ మదీయ నయనము లలవడవు లలనా!

14.    

 

 

 

చం.

విడువుము మోహ మెల్ల నిఁకఁ బేర్మి వివాహము గమ్ము నన్నిటం

బడఁతులఁ జూడు పెక్కుర నపార బలమ్మున నే హరించితిం

గడు ముద మంది నాకుఁ బ్రియ కాంతరొ! యగ్రపు రాణివై తగం

బుడమిని వెల్గు రత్నములఁ బొందు బలాహృత సంచయమ్ములన్

15.    

 

 

 

తే.గీ.

నేను నీ రాజ్యము రమణి నీవియ చుమి

వసుధ నంతయు బహువిధ పట్టణ నిచ

యమ్ములను గూడి బాహు బలాతిశయము

న నొసఁగెద జయించి జనకునకు ముదమున

16.    

 

 

 

కం.

ఈ లోకమ్మునఁ గనఁ గ

ల్లోలునిఁ దులతూఁగ నాకు లోలనయన! న

న్నాలమున నజేయు మహా

భీల పరాక్రము నరయుము విరిఁబోఁడి! తమిన్

17.    

 

 

 

తే.గీ.

అనిని సులువుగ గెలిచితి నమరుల నసు

రులను మఱల మఱల రథముల విఱిచితి

నను సమరమున నెదిరిప ఘనులు గలరె

జగముల నిలఁబడి ధృతి నిజముగ నతివ!

18.    

 

 

 

ఆ.వె.

మెఱసెడు తొడవులను మేనున ధరియింపఁ

గనుల కింపుగఁ బ్రతికర్మ మతివ

సేసి కొనఁగఁ జూడ నాస కలిగె మది

నిచ్ఛఁ గొనుమ వేగ యింతి నన్ను

19.    

 

 

 

కం.

సాలంకారము సువదన

మేలౌ భోగచయముల నమేయప్రీతిం

గాలానుగుణము వొందుమ

లీలం ద్రాగుము రమింపు లీలావతివై

20.   

 

 

 

కం.

ఇష్టానుసార మొసఁగుమ

యిష్టులకు ధరా ధనముల నింతీ! శంకా

నష్టమ్మున లాలించి య

ధీష్టము సేయు మిఁక నన్ను ధీరశ్రమణా

21.    

 

 

 

ఆ.వె.

నీదు బంధు జనము నాదు దయా బుద్ధి

ననుభవింప నిమ్ము వనిత! నెమ్మి

నబ్జ నేత్ర! గను మదైశ్వర్య యశముల

లాలితమ్ముఁ దనరు బేల! యిచట

22.   

 

 

 

తే.గీ.

నార చీరల వాని వనగతు విజయ

దూరు గతవైభవు రతవ్రతుని మహీధ

ర శయను శుభాంగి! లాభము రాము వలన

నేమి గలదు కలఁడొ లేఁడొ యిప్పు డతఁడు

23.   

 

 

 

తే.గీ.

లలన! చూడ నేరఁడు సబలాక పంక్తి

కారు మేఘ జాలము క్రమ్మఁ గానిపింప

నట్టి వెన్నెల వోలె జానకి దశరథ

నందనుం డెన్నఁడు వినుమ పొంద లేఁడు

24.   

 

 

 

కం.

ఇంతీ! నిన్నిత్తఱి నా

పొంతన నుండఁగను రాఘవుఁడు పొందఁగ లే

డెంత బలుండయిన శచీ

కాంతు యశమ్మును హిరణ్య కశిపుని భంగిన్

25.   

 

 

 

కం.

గరుడుఁ డురగమ్ము హరియిం

చు రీతి సుదతి! దరహాస సుందర నేత్రా!

హరియించితి నాదు మనము

పరవశ పఱచి భృశము నను బంకజ వదనా!     

26.   

 

 

 

కం.

నలిఁగిన పట్టు వలువ తో

నలంకృత విహీన వైన నబలా! నన్నుం

గలఁచిన కతనన్ నిజ భా

మల పైన వలపు గలుగదు మగువా! వింతన్

27.   

 

 

 

కం.

అంతఃపుర కాంతల క

త్యంత గుణ వతులకు మత్ప్రియ సతుల  కాధి

క్యాంతఃకరణమునఁ దనరు

సంతతము ధరాతనూజ! సదమల చిత్తా!

28.   

 

 

 

కం.

శ్రీదేవిని సేవించు న

భో దేవాంగనల వోలెఁ బూజింతురు నా

యీ దేవేరులు వర శా

తోదరు లనునిత్యము నిను నుజ్జ్వల నేత్రా!   

29.   

 

 

 

తే.గీ.

అగ్రజుఁడు వైశ్రవణు నుండి యతి బలమున

నపహరించిన రత్న ధనాదు లెల్ల 

లోకముల మఱి నను గూడ లోలి తాక్షి!

సంతసమ్మునఁ జేకొను చంద్ర వదన!

30.   

 

 

 

కం.

బలమున విక్రమ మందు న

తుల తేజమున ధనమునను దుల్యంబె యశ

మ్ముల నైనను వైదేహీ!

తలంప రాముండు నాకు ధరణిని లలనా!

31.    

 

 

 

ఆ.వె.

ఇత్తు భూ ధనముల నింక ననంతము

పాన విహరణములఁ బడఁతి! కేళి

భోగముల రమించి వేగ లాలింపుమ

బంధు జనము గూడి పరిఢవిల్లి

32.   

 

 

 

కం.

అచ్చంపుఁ బైడి తొడవుల

నిచ్చకమున నెచ్చెలి విహరింపు ముదమునం

బచ్చని కానల నాతో

విచ్చలవిడి విరుల తరుల వెల్లువ లోనన్

33.   

 

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నిరువదవ సర్గము.

 

 

సుందర కాండము

సర్గము 21.

 

                                                         

కం.

ఆ మాటలు రౌద్రాసుర

భీమ ముఖచ్యుతములు విని వివ్యథిత హృదిం

దా మందస్వరమున ననె

భామామణి సీత దీన వచనము లంతన్

1.      

 

 

 

చం.

ఎదురుగ గడ్డి నడ్డ మిడి యివ్వసుధా సుత రోదనమ్మునన్

మది కలఁగంగ దుఃఖమున మానిని మేను వడంక మిక్కిలిన్

సుదతి పతివ్రతామణి విశుద్ధ మనంబునఁ దల్చి భర్తనున్

బదులిడె మందహాసమునఁ బద్మదళాయత నేత్ర యత్తఱిన్

2.     

 

 

 

కం.

నిజ సతులం దుంచు మనము

నజస్రము మలఁపుము చిత్త మది నాపైనం

గుజనులు సంసిద్ధి వడయ

ని జాడ నను వేఁడ నీకు నీతియుఁ గాదే

3.     

 

 

 

కం.

సత్కుల సంజాతనయి బృ

హత్కుల సంప్రాప్త భామ నసమంజస కా

ర్యోత్కరము లకార్యమ్ములు

మత్కాంత రతవ్రత నధమక్రియ లేలా

4.     

 

 

 

కం.

ఈవిధి పలికి ధరాసుత

రావణు రక్కసుని నుంచి రయమున వెనుకన్

భావోచితంపుఁ బలుకుల

నా వనితా రత్న మనియె నసురుని తోడన్

5.     

 

 

 

తే.గీ.

ఋజ వగు తెరువునఁ జరింపు భృశము ధర్మ

మును దలంపుము నిత్యము మనము నందుఁ

బరసతిఁ బతివ్రతను నేను భార్య నౌట

నీకు యుక్తమ్ము దలఁపఁ గానేర దెపుడు

6.     

 

 

 

ఆ.వె.

నీదు దారల వలె నాదరనీయులు

పర సతు లని యెంచి భద్రత నిడఁ

బాడి యగును స్వీయ భార్యల రమియించి

యిమ్ము తగు నిదర్శనమ్ము భువిని

7.     

 

 

 

తే.గీ.

తనదు భార్యల యందున తనివి నొంద

కుండు వాని నింద్రియ లోలు నుగ్రుఁ జపలుఁ

గాంచి పర కాంత లెల్లరు గించపఱుప

కుండుదురె వాఁడు రాజైన నుర్వి వాని

8.     

 

 

 

కం.

లేరే బుధు లీ పురమున

వారున్నను వారి వినవె వచనమ్ముల నా

చార విహీనతఁ గాంచిన

నా రీతినె తోఁచు బుద్ధి యరయ వికృతమే

9.     

 

 

 

కం.

మాయా జగమునఁ గులుకుచు

నీ యసుర సమున్నయంపు నిర్ఘాతార్థం

బా యన విజ్ఞుల యుచితో

పాయమ్ములను దనుజాధిప వినవు వింతన్

10.    

 

 

 

కం.

అనియమి తా త్మానయ రత

ఘన విభుఁ గూడిన నశించుఁ గమనీయమ్ముల్

ధన ధాన్య విలసిత నగర

ఘన రాజ్య విభవ చయములు కరము రయమునన్

11.    

 

 

 

ఆ.వె.

రత్నరాశి మయము లంకా నగర మింక

నేక నాథు దోష మెంచి చెడును

సత్వరమ్ము రాక్షస గణ రాజ! భవ దా

సాదన కరణమ్ము సత్యముగను

12.    

 

 

 

కం.

దూరాలోచన దూరుఁడు

ఘోరస్వీయ కృతములఁ దెగుట దురితములన్

వా రరసి జీవులెల్ల న

పారానందమ్ము వొంది పరవశు లగుదుర్

13.    

 

 

 

తే.గీ.

అవ్విధి మును వంచితు లైన యట్టి జనులు

పాప కర్ముఁడు కోపిష్ఠి ఫలము వొందె

విధి బలమ్మున నని పల్కి యధిక హర్ష

హృదయు లౌదురు నీ ఘన కృచ్ఛ్రము గని

14.    

 

 

 

తే.గీ.

రాఘవేంద్రున కే నపరమ్ము కాదు

వెలుఁగుఱేనికి నింపగు వెలుఁగు వోలె

లోభ పఱపంగ శక్యమె వైభవముల

నన్ను ధనముల నేరికి నెన్నఁ డేని

15.    

 

 

 

కం.

లోకైకనాథు రఘువరు

నా కాంతు నుత భుజ సుప్త నారిని నయి నే

నే కతన నయిన నితరుల

వౌ కరముల నేల నుందు నసురా! వినవే

16.    

 

 

 

కం.

వసుధాధిప రామునకె ఘ

న సువ్రతున కాత్మ వేదున కనుగుణపు భా

ర్య సత మగుదు నే నిల ధర

ణిసురునకు సురుచిర విద్య నెగడెడు భంగిన్

17.    

 

 

 

కం.

ఆర్తను నన్నిఁకఁ జేర్పుము

కీర్తిత సూర్య కుల రాజ కేసరి దరికిన్

ధూర్తుఁడ! రావణ! కానన

వర్తిత వాశితను నాగ వరునకుఁ బగిదిన్

18.    

 

 

 

కం.

పురుషోత్తముఁ డా రాముని

దరిఁ జేరుట స్నేహ మెంచి తగు నునికికి నీ

కరయఁగ ధరణిని మఱియున్

నిరయము వాంఛింప కున్న నిజముగ నసురా!

19.    

 

 

 

ఆ.వె.

ధర్మ విదుఁడు నాశ్రిత జన సంరక్షణ

కోవిదుండు వర రఘుకుల తేజుఁ

డాతని యనుఁగుఁదన మరయుము జీవింప

నిచ్ఛ యుండె నేని నింక నసుర!

20.   

 

 

 

ఆ.వె.

అభయ మడుగుము శరణాగత వత్సలు

రామ చంద్రు నింక రాక్షసేంద్ర!

నియమ మాచరించి రయమునఁ బంపుము

నన్ను నా పతి దెస మన్నన నిడి

21.    

 

 

 

కం.

అవ్విధియె శుభము నీ కగు

నివ్వసుమతిని రఘువరున కీయఁగ నన్నున్

నొవ్వులు వడయుచుఁ జచ్చెద

వవ్విధిఁ జేయని తఱి నసురాధమ! వింటే

22.   

 

 

 

తే.గీ.

ఎగసిన యశని విడువంగ నగును గాక

యంతకుండు దయ దలంచి కొంత కాల

ము విడువంగ నగును రాముఁ డవని నాథుఁ

డలుగ విడువండు నీవంటి ఖలుని నింక

23.   

 

 

 

తే.గీ.

అగమ రిపుఁ డలిగి విడిచి నట్టి యమర

నాథ వజ్రాయుధపు నిస్వనమ్ము వోలె

రామ భీమ ధనుర్వినిర్గత నినాద

మసుర! వినియెద వీవు భయంకరముగ

24.   

 

 

 

కం.

అచిరమ్మిచట కురియు మం

డుచున్న కోరలఁ దనరు పటుత రాహుల వో

లు చిలుకులు రామలక్ష్మణ

రుచిరాంకములు భయదము లరుల కెల్లరకున్

25.   

 

 

 

కం.

రాపులుఁగు నీఁక తూపులు

వే పుర మెల్లెడల నిండి విశిఖ చయ విఘా

తాపాత దేహ కీనా

శాపూరం బగును లంక యసురా! యింకన్

26.   

 

 

 

కం.

వినతా సుతుండు పాముల

గొనిపోవు పగిది పలాశి ఘోరాక్షములన్

ఘన రామ వైనతేయుఁడు

దనరి యనుపు వేగ యమ సదనమున కింకన్

27.   

 

 

 

తే.గీ.

అరి నిబర్హణుం డచిరము నసుర! రఘు వ

రుండు నా పతి వడయు నీ నుండి నన్ను

మున్ను హరి మూడు పదముల మిన్న యైన

దైత్యు సంపద హరియించు దారి మీఱి

28.   

 

 

 

తే.గీ.

వధ పథము జనస్థానపు టధము లసురు

లు నిహతులు సైన్య మందు దారుణముగ నట

శక్తి హీనత నీవు కుయుక్తిఁ బన్ని

చేసితి వసాధు కృత్యము సిగ్గు విడిచి

29.   

 

 

 

కం.

నరసింహులు భ్రాతలు వా

రరుగఁగ శూన్య మయినఁ గని యా యాశ్రమముం

దరుణ మరసి యేతెంచి య

సురాధమా! యపహరింప శూరత్వంబే

30.   

 

 

 

కం.

శునకమ్ము వ్యాఘ్ర యుగళము

గని నిలువఁగ లేని భంగిఁ గాకుత్స్థుల వా

సన గాత్ర జనితమును మూ

ర్కొన నీవు భువి నిలువంగఁ గుమతీ వశమే

31.    

 

 

 

ఆ.వె.

ఒంటి చేతి వృత్రు డొంటరి జత చేతు

లున్న యింద్రు గెలువఁ జన్న నట్లు

రామలక్ష్మణులఁ బురందర సన్నిభు

ల గెలువంగఁ దరమె రణము నందు                                                                 

32.   

 

 

 

కం.

నా నాథుఁడు రాముఁడు స్వీ

యానుజుఁ గూడి భవదసువు లతి సులభమునం

దీ నేర్చు శరముల నినుఁడు

దా నీరం బల్ప మున్నఁ ద్రాగెడు భంగిన్

33.   

 

 

 

కం.

ధనదుని కొండను దాఁగిన

ఘనుండు వరుణు సభనున్నఁ గాల హతుఁడవై

చన జాలవు రాముని నుం

డి నగం బశని హత మయ్యెడి విధమ్ము వడిన్

34.   

 

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నిరువది యొకటవ సర్గము.

 

సుందర కాండము    

సర్గము 22.

 

కం.

పరుషములైన వచనములు

ధరణిజ శుభదర్శ నోచితమ్ములు విని పా

మర వాక్కుల బదు లిచ్చెను

బర మాప్రియములు విన దశ వక్త్రుం డంతన్

1.      

 

 

 

ఆ.వె.

ఎంత యెంత యనునయింప నంతగ నింతు

లు వశ మౌట నిజ మతివ ప్రియమ్ము

లెంత పలికిన మఱి యంత చులక నౌదు

రెల్ల పురుషు లన్న కల్ల కాదు

2.     

 

 

 

కం.

చెలరేఁగిన నా కోపము

బలమగు నీ  పయి వలపునఁ  బ్రతిహత మయ్యెన్

ఖల మార్గమునఁ బరుగిడు హ

రుల నాపఁగ నోపు నేర్పరుల పగిది తగన్

3.     

 

 

 

కం.

కామము గడు ప్రతికూలం

బే మనుజుని వెస దగిలిన నీ కామ మికం

బ్రేమ దయా గుణము లొదవు

నేమాఱక యా నరు మది నెమ్మెయి నైనన్

4.     

 

 

 

తే.గీ.

కావున నిను వధార్హవు కపట తాప

సివి పరాభ వార్హవు నైన నవని జాత!

చంప నేర్వక యుంటిని చంద్రవదన!

కామ మది యెంత విడువంగఁ గఠిన తరమొ

5.     

 

 

 

తే.గీ.

నీవు పల్కిన యొక్కొక్క నిష్ఠురంపుఁ

బల్కున కిట నొక్కొక్క యబ్జముఖి! శిక్ష

వేసి దారుణమ్ముగఁ జంపి వాసి కెక్క

నుచిత మగు నాకు జానకి యుక్కు నడచి

6.     

 

 

 

తే.గీ.

పలికి యీరీతి సతి విని కలఁతఁ జెందఁ  

గ్రోధ సంరంభపుం బలుకు లిటు లలిగి

పలికె వైదేహిఁ గాంచి రావణుఁడు రాక్ష

సాధిపుఁడు తీవ్ర వచనము లంతఁ దిరిగి

7.     

 

 

 

కం.

గడు విచ్చితి మాసద్వయ

మడరఁగ రక్షితవు సుమ్మి యతివా నీకుం

గడవఁగ నవి వరవర్ణిని

నడవక తప్పదు మమ శయనమునకు నింకన్

8.     

 

 

 

చం.

నెల లవి రెండు దాఁటఁగను నీకు నొసంగిన కాల మిత్తఱిన్

వలపున నన్ను భర్తగ నవారిత రీతిని నెంచ కున్నచో

నలినసునేత్ర! ప్రాతరశనప్రకరమ్ముల నుంచఁ బుచ్చెదన్

లలితపు నాదు భోజన విలాస మనంగ నసంశయమ్ముగన్

9.     

 

 

 

తే.గీ.

దానవాధిప తర్జిత జానకిఁ గని

దేవ గంధర్వ కన్యలు దీన వదన

లెల్ల వికృతంపుఁ గన్నుల నల్లన పరి

తప్త లైరి దుఃఖమున విస్తరము నెంచి

10.    

 

 

 

కం.

పెదవులు గదుపుచుఁ గొందఱు

వదనపు సంజ్ఞల నితరులు వర నయనములన్

సుదతులు గొందఱు నోదా

ర్పఁ దలపడిరి తర్జిత సతి వైదేహి నటన్

11.    

 

 

 

తే.గీ.

ఆశ్వసింప నమర కన్య లట్లు చంద్ర

వదనలు నిజ వృత్తోద్ధతి వచనము లల

రంగ నాత్మ హితములును రాక్షసాధి

పున కనియె జనక సుత యోర్పు దన రంగ

12.    

 

 

 

ఉ.

తప్పక నీదు లంకను నధర్మపుఁ గార్యము లాపి నీకు మే

లొప్పుగఁ గల్గఁ జేయు సఖుఁ డుత్తము డొక్కఁడు లేఁడె లేక నీ

వెప్పుడు వాని మాటలను హీనముగా మది నెంచి వీడ నీ

దెప్పర మందుఁ గ్రుంగి నిజ దేశ వినాశన కారి వైతివే

13.    

 

 

 

తే.గీ.

ఇంద్ర పత్ని శచీదేవి నెనయు నన్ను

ధర్మ నిరతుండు రాముని ధర్మ సతిని

మూడు లోకములఁ గలరె మూర్ఖ! నీవు

దక్క నన్యులు గోరఁ జిత్తమున నైన

14.    

 

 

 

కం.

అనుపమ తేజో మయు రా

ముని భార్యను గూర్చి పాపపుఁ బలుకు లాడన్

దనుజాధమ! దాని వలని

ఘనాఘ మోక్షము వడయఁగఁ గలవే తలఁపన్

15.    

 

 

 

తే.గీ.

వనమున మద గజము సరసన శశమనఁ

గుంజర నిభుండు భీమారి భంజనుండు

రామ చంద్రుండు మఱినిన్ను రావణ! శశ

సముఁడ వందురు లోకులు సత్య మెంచి

16.    

 

 

 

తే.గీ.

గించపఱుప నిక్ష్వాకుప్రకీర్తితాధి

నాథుని బిడియ పడవె మనమున నతని

దృష్టి పథ మొక పరియు నేతెంచ కుండ

రావణాధమ! యది మల్లరమ్ము గాదె

17.    

 

 

 

కం.

ఈ నీ కన్నులు క్రూరము

లై నల్లనివై వికృతములై చూడంగన్

దానవ! యవి నేలఁ బడఁగఁ

గానను గారణ మెఱుఁగను గఠినాత్ముండా

18.    

 

 

 

తే.గీ.

రాముని సతీమణిని దశరథుని స్నుషను

నన్ను బరుషంపుఁ బల్కు లనయము లెల్లఁ

బలుక నీదు జిహ్వ తెగి యవనిఁ  బడదు వి

చిత్రముగను నేఁ డసుర! దుశ్శీల చరిత!

19.    

 

 

 

కం.

రామాదేశము లేకయు

తామసమును వీడి నాదు తాపస వృత్తిన్

నే మదిఁ దలఁపక యుండిన

మై మెయి ప్రభఁ జేయనె నిను మసి భస్మార్హా

20.   

 

 

 

ఆ.వె.

బుద్ధిశాలి ధన్వి పురుషోత్తముఁడు రాము

ని రఘువరుని నుండి నీకు నన్ను

నాహరింపఁ దరమె యంతరింపఁగ నిను

విధి కృతమ్ము సుమ్ము విశయ మేల

21.    

 

 

 

ఆ.వె.

చూడ శూరుఁడ వయి తోడుగ మఱి సైన్య

ముండ ధనదున కనుజుండ వీవు

రాముఁ డరయ కుండ రావణ! దారాప

హృతియ తగునె నీకు హీనముగను

22.   

 

 

 

కం.

ఆ మాటలు సీత పలుకఁ

గామాతురుఁ డాలకించి కనులఁ గదుపుచున్

భీమముగ దశగ్రీవుఁడు

భామిని వైదేహిఁ గాంచె బాహు బలుండున్

23.   

 

 

 

కం.

నీలాభ్ర సన్నిభుండు వి

శాల భుజ శిరోధరుండు జటిల సదృశ క

ల్లోలాభీల గమనుఁడు య

శో లబ్దౌద్ధత్య దీప్త సునయన రసలున్

24.   

 

 

 

తే.గీ.

పొడవయిన యా బొమిడికంపు జడలు కదల

రంగు లీను పూదండలు నంగ లేప

నమ్ము లలర నరుణ వసనమ్ములు సుమ

మాలలు దనరఁ దప్తాంగదాల తోడ

25.   

 

 

 

కం.

అమృతము కొఱకై యహి రా

జము సుట్టిన మందరగిరి సన్నిభమై తోఁ

ప మొల ధరించిన నల్లని

విమ లాయత సూత్ర కాంతి విలసితుఁ డైనన్

26.   

 

 

 

కం.

నిండైన భుజద్వయమున

మెండైన శిఖర యుగంపు మేటి నగ వరో

ద్దండము మందరము వగిది

గండఁడు రావణుఁడు వెలిగె ఘన గర్వమునన్

27.   

 

 

 

తే.గీ.

బాల సూర్యాభ కుండల భాసి తాసు

రుండు గన్పట్టెను విమలారుణ సుమ దళ

సంయు తాశోక తరుయు గాచల నిభమ్ము

రాక్షస గణ రాజేంద్రుండు రావణుండు

28.   

 

 

 

కం.

వరకల్ప తరువు రూపము

ధరించిన వసంత మనఁగ ధరణి తలమునన్

మరుభూమి నున్న బొమ్మన

వర భూషితుఁ డయ్యుఁ గరము భయకరుఁ డయ్యెన్

29.   

 

 

 

కం.

అరయుచు జనకాత్మజ నం

త రాక్షసాధిపుఁడు కోప తామ్ర నయనుఁడై

యురగంపు నిశ్వసనముల

ధరణిజతో ననియె నిట్లు దశకంఠుండే

30.   

 

 

 

కం.

ధనహీను దురాచారుని

ననవరతం బనుసరింతు వతివా నిన్నే

నినుఁడు కిరణముల సంద్యను

వినాశ మొనరించు భంగి వ్రేసెద నిపుడే

31.    

 

 

 

ఆ.వె.

అనుచు నిట్లు రావణాసురుం డరి రావ

ణుండు సీతతో దనుజ వనితల

ఘోర రూపలఁ గని వారి నాదేశించె

రాక్షసాధిపుండు నా క్షణంబ

32.   

 

 

 

ఆ.వె.

ఒక్క కన్ను దాని నొక్క కర్ణను కర్ణ

ము లగపడని నాతి బలపు టేను

గు చెవులు గల దాని కుఱ్ఱి చెవుల దాని

శ్రవణ హీన నిడుద చెవుల యసురి

33.   

 

 

 

మ.

గజ పాదమ్ముల దాని నశ్వ పద యుక్తంబైన దానిన్ సుపా

దజ కేశమ్ముల దాని గోపద యుగాత్తంబైన దానిన్ విపా

ద జవాంఘ్రిద్వయ నేకపాద నొక నేత్రన్ భీమ నేత్రాస్య నీ

రజ పత్రాక్షుల రాక్షసాంగనల దీర్ఘశ్రీ శిరో గ్రీవలన్

34.   

 

 

 

తే.గీ.

భారపు టుదరోరము లున్న పడఁతుకల న

నాసికల దీర్ఘ జిహ్వల నాలుక యన

లేని నారిని మృగరాజు వోని ముఖుల

గోముఖ కిటి ముఖంపు మగువులఁ గాంచి

35.   

 

 

 

తే.గీ.

పలికె దనుజ వనితలార! కలికి సీత

యెవ్విధిఁ ద్రుటి మద్వశ మగు నవ్విధి నిక

నందఱు గలసి చేయుఁడు డెంద మలర

సత్వరమ్ము జానకి మది సమ్మతించి

36.   

 

 

 

ఆ.వె.

సామ దాన భేద భీమ దండోపాయ

ములు విదేహ రాజ పుత్రి యందుఁ

దనరఁ జేసి సీత మన మింక నాయందు

నుండు విధము సేయఁ బొండు మీరు

37.   

 

 

 

కం.

దనుజాంగనల మఱల మఱ

ల నిదేశించి కినుకయు వలపు మది నిండన్

దనుజేంద్రుఁడు తర్జించె న

వనిజను మిథి లేంద్ర సుత నవశను భృశమ్మున్

38.   

 

 

 

తే.గీ.

అంతఁ జేరి దశగ్రీవు చెంత ధాన్య

మాలినీ నామ రాక్షసి మధుర వచన

ములఁ బలికెఁ గౌఁగిలించి వేగ లలితమ్ము

గ మరులుకొని మనమ్మునఁ గాంతు నందు

39.   

 

 

 

కం.

తమిఁ గ్రీడింపు మహాప్రభు!

సముదము నాతోడఁ గృపణ జనకాత్మజ యే

ల మనుజ కాంత వివర్ణయ

తమకం బేల దశకంఠ! ధరణిజ యందున్

40.   

 

 

 

కం.

తవ బాహు బలార్జిత వై

భవము లనుభవింప నలినభవుఁ డవనిజకున్

భువి వ్రాయక యుండుఁ జుమీ

యవిరళములు భోగ సంచయమ్ముల నెల్లన్

41.    

 

 

 

తే.గీ.

ఇష్ట మొక యించుకయు లేని యింతిఁ గోరఁ

గష్టము కలుగ నిక్కము కాయమునకు

వలచిన మగువఁ గోరినఁ బడయ వచ్చు

మన మలరెడు ప్రీతిని రిపు మర్దన! విను

42.   

 

 

 

ఆ.వె.

అసురి పలుకుల విని యసురేంద్రుఁడు బలవం

తుఁడు జలద నిభుండు వడి వెనుదిరి

గి చిరు మందహాస రుచి రాననుండు నై

యేఁగె రావణుండు తూఁగ ధరణి

43.   

 

 

 

తే.గీ.

ఏఁగి చేరె నిజ గృహము వేగ మతఁడు

జ్వలిత దినకర వర్ణ నిభమ్ము దేవ

నాగ గంధర్వ కన్యా గణమ్ము పిదప

ననుసరించి విభునిఁ జేరె నంతిపురము

44.   

 

 

 

తే.గీ.

ధర్మరత దృఢచిత్తను ధరణిజ భయ

కంపితను గడు వేధించి కరుణ లేక

వీడి సీతను వెలిఁగెడు వీటి కరిగెఁ

గామ మోహితుఁడై దశకంఠుఁ డంత

45.   

                                                                     

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నిరువది రెండవ సర్గము.

 

 

సుందర కాండము    

సర్గము 23.

 

                                                         

కం.

వచియించి యివ్విధ మసుర

నిచ యాధీశుఁ డవనిజఁ గని రిపు దమనుఁ డే

యచిరం బాజ్ఞ లొసంగి ని

సి చరులు సర్వులకును దశ శిరుఁ డేగె వడిన్

1.      

 

 

 

కం.

వెడలి యసురేశ్వరుఁడు కడు

వడిఁ జన నంతఃపురమ్ము భయ దాకారల్

బడఁతు లసురాంగనలు పరు

గిడి రంత నవనిజ వైపు నెగ్గులు వల్కన్

2.     

 

 

 

ఆ.వె.

అంత సీతఁ జేరి యసుర వనిత లెల్ల

రాగ్రహ భరితాత్మలై పరుష త

రమ్ముగం బలికిరి రమణీమణి సుకుమారి

రాకుమారి తోడ భీకరముగ

3.     

 

 

 

ఆ.వె.

భామ! యేల నీవు పౌలస్త్యునకు మహా

త్ముఁడు వరిష్ఠుఁడు దశముఖ ఘనునకు

రావణునకు నిష్ట దేవివై చరియింప

నిష్ట పడవు మదిని నిందు వదన

4.     

 

 

 

ఆ.వె.

పిలిచి సీతను గరతల సమోదరి నేక

జట యను నసుర కుల జనిత వనిత

కోప రక్త నేత్ర కువలయాననఁ జూచి

పలికె నిట్లు నయ్యవసరమునను

5.     

 

 

 

చం.

పరమ పితా మహాత్మజుఁడు భామ! పులస్త్యుఁ డనంగ విశ్రుతుం

డరయఁగ షట్ప్రజాపతుల యందున నాల్గవ వాఁడు వానికిన్

వరతనయుండు విశ్రవస పార్థుఁడు వాని సుతుండు రావణా

సురుఁ డసురేంద్రుఁ గై కొనఁగ సుందర లోచన యర్హురాలవే

6.     

 

 

 

తే.గీ.

జానకి! గుణగణములఁ బ్రజాపతికి స

ముండు విశ్రవసుఁడు రావణుండు తనయుఁ

డతనికి రిపు రావణుఁ డసహాయ వీరుఁ

డేల వినవు నాపల్కులు బేల నీవు

7.     

 

 

 

కం.

హరిజట యను రక్కసి యం

త రోషమునఁ గనులు ద్రిప్పి ధరణిజ తోడన్

విరసపు వచనము లుడివెను

గరువమ్ముగఁ బిల్లి కనుల కాంతామణియే

8.     

 

 

 

తే.గీ.

యెవని వలన ముప్పది ముగ్గు రెంచ సురలు

నింద్ర సహితమ్ము నిర్జితు లెన్న నట్టి

విక్రమోపేతుఁడు బలదర్పితుఁడు దలఁపఁ

దగుదు వీవ యా దైత్యేంద్రు దార గాఁగ

9.     

 

 

 

కం.

ప్రఘస యన నొప్పు భామ య

లఘు కోపావేశమున నల నవనిజను గాం

చి ఘృణా హీనంపుఁ బలుకు

ల ఘోరముగ మానసము కలఁత పడఁ బలికెన్

10.    

 

 

 

కం.

బల గర్వుని శూరునిఁ బో

రుల వెనుదిరుగని మహాబలునిఁ దేజస్వం

తు లసద్వపుని సతీమణి

గ లలన యేల మది నొల్లఁగఁ దలఁప వబలా

11.    

 

 

 

ఆ.వె.

భార్య లందు నెల్ల పరమ భాగ్యవతి స

తీమతల్లి సుదతి ప్రేమ మూర్తిఁ

బాసి యంత భీమబలుఁడు రాజేంద్రుండు

రమణి నిను వరించె రావణుండు

12.    

 

 

 

ఆ.వె.

వేల కొలఁది వెలఁదు లేలు నంతిపురమ్ము

వివిధ రత్న నిచయ విలసితమ్ము

వీడి రాక్షస గణ విభుఁడు వీర వరుండు

రమణి నిను వరించె రావణుండు

13.    

 

 

 

కం.

మఱి యొక్క రక్కసి యపుడు

పరఁగఁగ విక టాఖ్య నయ్యవనిజఁ గదిసి వే

మరుఁ బోర నాగ గంధ

ర్వ రాక్షస విజేత నిన్ను వరియించె ననెన్

14.    

 

 

 

తే.గీ.

అతని సర్వ సమృద్ధు మహాత్ము నిర్జి

తామరేంద్రు దశానను భీమ బలుని

రావణుని శత్రురావణు చేవ యెఱుఁగ

కధమ! యసురేంద్ర పత్నీత్వ మరయ వేల

15.    

 

 

 

ఆ.వె.

అంత దుర్ముఖి యను నసుర కాంత యనియె

నెవని భీతి మండఁ డినుఁ డనిలుఁడు

వీవఁ డడరి యట్టి వీర వరుఁడు రజ

నీ చరేంద్రు వంక నిలువ వేల

16.    

 

 

 

తే.గీ.

పూలవాన కురియుఁ దరువులు భృశమ్ము

నీటి నొసఁగు నభ్రాద్రులు వాటముగను

రావణాజ్ఞలు దలఁదాల్చి రమణి యట్టి

రాజ రాజునిఁ బతిగఁ దలంప వేల

17.    

 

 

 

కం.

నీ మేలు గోరి నిజముగ

భామిని! చెప్పితిమి యెల్ల వచనములు దగన్

మా మాటలు విను దరహా

సామల వదనా! మన వలె ననఁ దరళాక్షీ

18.    

 

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నిరువది మూడవ సర్గము.

 

 

 

సుందర కాండము   

సర్గము 24.

 

 

తే.గీ.

రక్కసులు వికృతాస్యలు రయము మీఱఁ

జేరి సీతను బరుషంపు నారులు పరు

ష వచనమ్ములఁ బల్కిరి జానకిఁ గని

రావణాసుర చోదిత భావ మొప్ప

1.      

 

 

 

కం.

సకల జన ముదకరము జా

నకి! యంతఃపుర నివేశనము శయన నికా

య కలితము నేలఁ గోరవు

సుకరమ్ముగ లభ్య మైన సుందర వదనా!

2.     

 

 

 

కం.

మానవ కాంతవు గావున

మానవునకుఁ బత్ని వౌట మానస మందున్

మానిని! తలఁచితి వొప్పగుఁ

గాని మరువకున్న రాముఁ గాయం బవియున్

3.     

 

 

 

ఉ.

మానవ మాత్రు నిష్ఫలుని మానిని రాజ్యవిహీను రామునిన్

మానస మందు నిల్పి యభిమానము విక్లబు పైన నేలకో

దానవ రాజ లోక వసు తర్పిత సంప దధీశ పత్నివై

మే నలరన్ యథేచ్ఛగ సమీప్సిత సిద్ధిని సంచరింపుమా

4.     

 

 

 

చం.

అన విని సీత వారిజ దళాయత లోచన వారిఁ జూచి తాఁ

గను లవి వారి భారములు గాఁగ నవారిత రీతిఁ బల్కె మీ

రనిన యసహ్య వాక్కు లవి యన్నియు లోక విగర్హితమ్ములే

దనుజ వరాంగనా మణులు! దల్పరె పాపము సుంత వానిలో

5.     

 

 

 

కం.

నర కాంత యెన్నఁడు ధర న

సుర దార యగుట కనర్హ సుమ్మీ దలఁపం

గర మలిగి నను దినిన మీ

పరిభాషణము లవి యొల్ల భామినులారా!

6.     

 

 

 

కం.

దీనుం డైనను రాజ్య వి

హీనుం డైన పతియే యధీశ్వరుఁడు సదా

నే నాతని యంద రతిని

మానవతి సువర్చల రవి మవని భంగిన్

7.     

 

 

 

చం.

తనరి శచీ సతీమణి శతక్రతు నెమ్మదిఁ గొల్చు తీరునన్

వనిత యరుంధతీ సతి యపార తపోధను నా వసిష్ఠునిం

గనదజి రేద్ధ రోహిణి వికాస శశాంకు విదర్భ రాజ స

త్తనయ నగస్త్యునిన్ మది సతమ్ము వరించు విధమ్ము వోలఁగన్

8.     

 

 

 

తే.గీ.

చ్యవనుని సుకన్య రీతిని సత్యవంతు

ని నల సావిత్రి భంగిని ముని కపిలుని

శ్రీమతి పగిది సౌదాసు భామిని మద

యంతి సగరుని కేశిని యనఁగ బరఁగ

9.     

 

 

 

కం.

నలుని నిషధ రాజ వరుని

నలివేణి సతి దమయంతి యర్చించు గతిన్

లలితేక్ష్వాకు వరుని రఘు

కులాన్వయ కళానిధి కనుకూలపు సతినే

10.    

 

 

 

కం.

అవనిజ పలుకులు విని యసు

ర వనిత లాగ్రహమునన్ సొలసి దశకంఠో

క్త వచన చోదితలై యె

ల్ల వార లదలించి రిఁక నిలా సుతను గడున్

11.    

 

 

 

కం.

బెడిదమ్ముగ బెదరించెడి

పడఁతు లసురుల పరుషంపు వచనము లెల్లన్

జుడిఁగి యిరుగుడు తరువు పై

నుడిగి హనుమ మాటలు వినె నురు దుఃఖమునన్

12.    

 

 

 

కం.

వెలుఁగుల వ్రేలెడు పలు క

ప్పులు గొఱుకుచుఁ జేరి త్రాసమున వణిఁకెడి సీ

త లలనను గ్రోధ వశలై

పలలాశన భామ లంతఁ బల్కిరి వరుసన్

13.    

 

 

 

తే.గీ.

దొడ్డ కోపమున నొకతె గొడ్డలిఁ గొని

చేత వడిఁ బల్కె భర్తగ సీత పొంద

రాక్షసాధిపు వీరుని రావణుని య

నర్హయె యగును నిక్కమ నాఁ బలుకఁగ

14.    

 

 

 

తే.గీ.

పీడ్యమానయై జానకి భీమ రాక్ష

సాంగనా గణము వలన సాశ్రు నయన

యై కదలి చేరి యా శింశు పాగ వరము

నిలిచె రక్కసుల నడుమ విలపనమున

15.    

 

 

 

కం.

ఆమెఁ గృశాంగిని సీతను

నా మలినాంబరము దాని నతి దీనాస్యన్

లేమలు దానవ మానిను

లే మొదలిడిరి యదలింప నెల్లెడ లందున్

16.    

 

 

 

తే.గీ.

రక్కసి వినత భీమోదరంపు వనిత

ఘోర వక్ర రూపిణి యనెఁ గుపిత ముఖము

తోడ సీతఁ జూచి పతి యందుఁ గల ప్రేమ

నతిగఁ జూపితి విఁకఁ జాలు నవని తనయ!

17.    

 

 

 

తే.గీ.

అతి యనిశ మాపదల మూల మబల వింటె

తృప్తి కల్గె నీ మనుజ విధి సుకృతమ్ము

గాంచి భద్రం బగును గాక కాంత నీకు

నాదు యుక్తంపు నుడులు వినవె శుభాంగి!

18.    

 

 

 

తే.గీ.

విక్రముఁడు సుందరుం డతి వితర ణాభి

రతుఁడు దాక్షిణ్యుఁడు ప్రియదర్శనుఁడు సర్వు

లకును సురరాజ వాసవ లక్షణుండు

భర్తగఁ దలంపు రాక్షస భర్త నతివ

19.    

 

 

 

కం.

మనుజుని దీనుని రాముని

మనమున నెంచక వరింపు మనుజాశన నా

థుని దివ్య చందన సమం

డన విలసిత! యెల్లరకు నడరు మీశ్వరివై

20.   

 

 

 

తే.గీ.

సుందరాంగి శచీదేవి సుర విభునకు

నగ్నిదేవున కెంచ స్వాహా సతి వలె

రావణున కీవు వైదేహి రాముఁ డేల

కృపణుఁ డాయువిహీనుఁడు నృపతి తనయ!

21.    

 

 

 

కం.

నా నుడివిన యిమ్మాటను

మానితముగఁ జేయ వేని మగువా నిన్నున్

దానవ కాంతల మెల్లర

మీ నిమిషమ యారగింతు మిచ్చట వినుమా

22.   

 

 

 

కం.

అంత నసుర వికట యనియె

నింతి సుదతి సీతఁ గాంచి యిట్టలపుం గో

పాంతఃకరణను బిడికిలి

వింతగ నెత్తి పరుషముగ వ్రేలు నురములన్

23.   

 

 

 

కం.

అప్రియపు మినికు లెల్లయు

సప్రేమ మృదు హృదయమున సహియింపఁబడెన్

క్షిప్రము దురాత్మ! యొల్లవు

మా ప్రమద సమయ హితంపు మాటల సీతా!

24.   

 

 

 

మ.

జలధిన్ దాఁటి దురాసద మ్మొరులకుం జక్కంగ నిం దెచ్చి తా

లలితాంతఃపుర మందుఁ జేర్చియు ఘనోల్లాసమ్ము రక్షింపఁగా

బలవద్రాక్షస కాంత లెల్లర మిటన్ భద్రంబుగన్ మైథిలీ!

తలమే కావఁగ నిన్ను స్వర్గపతికిన్ ధైర్యంబునుం బూనుచున్

25.   

 

 

 

చం.

హితవచ నోక్త వాక్యముల నిందుముఖీ! విను చాలు నశ్రు సం

పతనము లింక వీడుమ యపారపు శోక మనర్థకమ్ము ప్రీ

తి తనర హర్ష మేసర నతీత నిరంతర దైన్యమున్ విదు

ల్పు తరుణి! దానవేంద్రు నసురుం గొను మైథిలి! యాడు లాలనన్

26.   

 

 

 

చం.

ఎఱుఁగవె యవ్వనమ్మచిరమే యని భీరువ! స్త్రీల కిద్ధరం

బఱఁగెడు నంత కాలమున భామ సుఖమ్ముల నెల్లఁ బొందుమా

యఱిముఱి లేక పర్వతపు టారెము లందున నందనమ్ము లం

దుఱుకుచు రాక్షసేంద్ర సహితోత్సుకతన్ మదిరేక్షణా! తమిన్

27.   

 

 

 

ఆ.వె.

ఏడువేల మంది యెలనాఁగలు వశమై

యుందు రింక నీకు సుందరి విను

మెలమి గోరు రాక్షసేంద్రు భర్తగ భర్త

సర్వ రాక్షసులకు నుర్వి నతఁడు

28.   

 

 

 

కం.

పెఱికి జనకాత్మజా! ద్రుటిఁ

గఱకైన హృదయము నీది కాంతామణు లం

దఱ మిప్పట్టునఁ దిందుము

వెఱఁ గందఁగ మా పలుకులు విని చేయనిచో

29.   

 

 

 

కం.

బెడిదపు శూలము ద్రిప్పుచు

వడి చండోదరి వచించె పలలాశనయే

కడు రోషమ్మున నా మన

మడరెం దిన సీత రావ ణాపహృత నిటన్

30.   

 

 

 

తే.గీ.

గుండెఁ బిండి యకృత్ప్లీహ ముండ బంధ

నములఁ బ్రేగుల దండిగ నమల బుద్ధి

కలిగె హరిణలోచన భయ కంపి తోర

సిజ విదేహ రాజసుతఁ గాంచి యమితముగ

31.    

 

 

 

ఉ.

అంతట రోష మంది బ్రఘ సాసుర భామిని పల్కెఁ గంఠముం

బంతము వూని నొక్కెదము పన్నుగ జాగది యేల యిత్తరిం

దంతులమారి నీల్గె నిట ధాత్రిజ యంచు వచింప రాజు దా

నంతటఁ బల్కు మీర తినుఁ డంచును నిక్కము తత్క్షణమ్మునన్

32.   

 

 

 

తే.గీ.

అనవిని యజాముఖి యసుర యనియె నిట్లు

నందఱు గలసి చేయుడి యవని జాంగ

మును సమానపు టుండలుగ నిపుడు  దెగఁ

గోసి పంచు కొన వలయుఁ గూర్మి తోడ

33.   

 

 

34.   

కం.

తగవు లన నాకవి తగవు

దగఁ బంచుకొనంగ మేలు త్వరితమ్ము భుజిం

పగ నుదక లేహ్యముల నో

మృగలోచనలార! తెండు మెండైన విలన్

35.   

 

 

 

కం.

అన శూర్పణఖా నామపు

దనుజ సతి యనియె నిటుల హిత మగు వచనముల్

ఘనము లజాముఖ్యుక్తము

లు నయమ్మగు నాహరింప లోలాక్షి నిఁకన్

36.   

 

 

 

తే.గీ.

వగలఁ దెగటార్చు కలుఁ దెండు మగువలార!

మనిషి మాంసము కడుపార తిని మన మల

రఁగ నికుంభిలా నృత్యమ్ము రమణు లార!  

ప్రీతిఁ జేయంగ మనసాయె నీ తరుణము

37.   

 

 

 

కం.

బెదరింప నివ్విధమ్ముగ

సుదారుణాసుర వనితలు చోద్యము మీఱం

ద్రిదశ సుతోపమ జానకి

చెదర మనో ధైర్యము వగచెను దీనముగన్

38.   

 

                                                         

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నిరువది నాల్గవ సర్గము.

 

 

సుందర కాండము   

సర్గము 25.

 

                                                         

కం.

రక్కసులు క్రూరులు వదర

మిక్కుటముగ దారుణంపు మినుకుల నంతం

జిక్కి కడు దుఃఖమునఁ దా

నుక్కు సెడి జనక తనూజ యోర్వక యేడ్చెన్

  1.  

 

 

 

ఆ.వె.

అనఁగ దైత్య కాంత లట్లు సుగుణవతి

ధరణి జాత దనుజ ధర్షిత యనె

గద్గదంపు నుడులు గన్నీరు గార్చుచు

దుఃఖ మగ్గలింపఁ దోయజాక్షి

  1.  

 

 

 

ఆ.వె.

ధాత్రి మనుజ కాంత దైత్యున కెవ్విధిఁ

బాడి యగును ధర్మపత్ని కాఁగఁ

దినఁగ నెంచి రేని వనితలార! తినుఁడు

నేను జేయ నొల్ల మీ నొడువులు

  1.  

 

 

 

ఆ.వె.

దేవకాంత వోని యా విదేహాధిప

తనయ రక్కసుల గమి నడుమ నొక

యింత సుఖము లేక వంతఁ బొందెఁ గరము

రావణార్దిత హృద యావని సుత

  1.  

 

 

 

కం.

తోఁడేళ్ల బారి సిక్కిన

లేడి యన వదలి నిజావలి భయార్తియునై

మోడిచి యంగమ్ముల వడఁ

కాడఁ దొడంగె నట సీత యత్యధికముగన్

  1.  

 

 

 

కం.

ఆనుకొని యశోకపు శిఖ

సూన విలసితమ్ము గాఢ శోకవ్రీడా

మానసయై చింతించె మ

నోనాథుని సీత ఘన మనోవ్యథ తోడన్

  1.  

 

 

 

కం.

కన్నీటి ధారలఁ దడియఁ

బెన్నుర మతి దుఃఖ మంత పిక్కటిలంగం

గ్రన్నన వైదేహికి న

న్నన్న యెఱుఁగ దంత మింతి యవ్వగ కింకన్

  1.  

 

 

 

కం.

గాలికిఁ గూలిన కదళము

వోలె వడంకుచు భృశమ్ము పుడమిసుత ఘనా

భీలాసురీ భయత్ర

స్తాలోల వివర్ణ వదన యయ్యెం జుమ్మీ

  1.  

 

 

 

కం.

వడఁకాడు సుదతి జానకి

పొడుగైన జడ కదలంగఁ బొడచూపె నటన్

వడివడి నడయాడు వెలుచ

పడఁతి పగిది శోకతప్త వనిత వగవఁగన్

  1.  

 

 

 

కం.

వగపునఁ దెగిన యెడఁద తో

సెగ యూరుపులు నిగిడించి సీత యమేయం

బగు దిగులున నశ్రమ్ములు

దగం దుడుచుచు విలపించె దయనీయముగన్

  1.  

 

 

 

కం.

హారామా హాలక్ష్మణ

యౌరా యని యా సుమిత్ర నా కౌసల్యం

జీరుచు హా యత్తమ్మలు

నా రవములు మ్రోఁగ నేడ్చె నారీమణియే

  1.  

 

 

 

ఆ.వె.

పలుకు జనులది మఱి పండి తోక్తమ్మును

జూడ సత్య మయ్యెఁ జోద్యముగను

మగల కైన నేమి మగువలకు నకాల

మృత్యు వేల వచ్చు మేదినిఁ గన

  1.  

 

 

 

తే.గీ.

ఏల యన నేను రామ విహీన నయ్యు

నొక ముహూర్తము నైనయు నుండ లేదె

ప్రాణములఁ గూడి రాక్షస వనిత లెల్లఁ

గ్రూరముగ వెత లిడు చుండఁ గుటిల నీతి

  1.  

 

 

 

ఆ.వె.

చేరి కడలి నడుము  జిక్కి గాలి హతికి

నిండు నావ మునుఁగ నేర్చు రీతి

నల్ప పుణ్య దీన నయిన నే నిచ్చోటఁ

గుమిలి కుమిలి చెడుదు ఘోరముగను

  1.  

 

 

 

కం.

కనఁ జాలక నిజ నాథుని

దనుజావలి వశ నితాంత ధర్షిత నగుచున్

వినశన మగుదు నవశ్యము

వనహత కూలమ్ము వోలె వనరుచు నింకన్

  1.  

 

 

 

ఆ.వె.

సింహ గమను బురుష సింహుఁ పద్మదళాక్షు

సర్వదా కృతజ్ఞు సంతతప్రి

య వచ నాభిరతుని నరయు వా రెల్లరు

ధన్యతములు నాదు ధవునిఁ గాంచ

  1.  

 

 

 

ఆ.వె.

ఆత్మవేది రాము నరయక యసువు లుం

డంగ దరమె యెన్ని భంగుల నిల

నాకుఁ దీక్ష్ణ విషము నాకి జీవింపఁగ

రాని భంగి యేరి కైన నెంచ

  1.  

 

 

 

కం.

ఏ జన్మంబునఁ జేసిన

వ్యాజంబొ తదఘ ఫలమ్ము పరఁగెను నాకుం

దేజోమయు రామునిఁ గన

నీ జన్మమున నగునె యిఁక నెవ్విధి నైనన్

  1.  

 

 

 

కం.

మునిఁగి మహా శోకమ్మున

దనుజుల రక్షణము నందుఁ దపియించుచు రా

మునిఁ జేరఁగ లేక కుమిలి

తను విఁకఁ ద్యజియింపఁగ భువిఁ దలఁచెదఁ జుమ్మీ

  1.  

 

 

 

కం.

మానవ జన్మం బిస్సీ

దానవ వశ్యం బిసి కడుఁ దాప జనకమే

మేను విడువంగ జాలనె

యేను యథేచ్ఛమ్ముగ భరియింప వలె వగన్

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నిరువది యేనవ సర్గము.

 

 

 

 

సుందర కాండము    

సర్గము 26.

 

                                                         

కం.

కను లశ్రు పూరితములై

మనికితమునఁ గానిపింప మనము దపింపన్

జనకాత్మజ నేలం గని

మినుకుల విలపింపఁ దొడఁగె మిక్కటముగనే

  1.  

 

 

 

తే.గీ.

వెఱ్ఱి దాని పగిది మత్తు వెనిచి నట్లు

భ్రాంత చిత్త భంగి విచార భరిత చిత్త

సీత విలపించె దుర్భర భీతి తోడ

దొర్లి నేల బడబ భువిఁ  బొర్లు రీతి

  1.  

 

 

 

తే.గీ.

రక్కసుఁడు కామరూపియు రావణుండు

రాముఁ డుండ నొండు మనికిఁ బ్రసభమున నొ

గిల్చి దారుణముగ నన్ను గెరలి యపహ

రించి తెచ్చె నే నకట రోదించు చుండ

  1.  

 

 

 

ఆ.వె.

రక్కసుల వశమునఁ జిక్కి మిక్కిలి హింస

కలమటపడి దుఃఖ మతిశయింప

బ్రతుకు మీద యాశ స్వల్ప మైనను లేదు

మరణ మింక నాకు శరణ మగును

  1.  

 

 

 

తే.గీ.

విత్త మేల తొడవు లేల రిత్త యైన

జీవితం బేల యతిరథుఁ జేర కుండ

రామభద్రు నుండి నడుమ రక్కసులకు

వారి వశమై కుములుచు నవారితమ్ము

  1.  

 

 

 

కం.

ముదిమి తుదియుఁ బడయ నెఱుం

గదొ యీ తనువు హృదయమ్ము కాచక మయమో

కదిసినఁ బెను దుఃఖమ్ము దె

గ దల్పమైన వెఱఁ గందఁగాఁ దథ్యముగన్

  1.  

 

 

 

చం.

నడవడి నాకు మంచిది ఘనమ్ముగ నున్న దనంగ భ్రాంతియే

బెడఁగగు  భక్తి యున్నదన వింత యగుం గడు భర్త యందునన్

విడిచి నిజాత్మనాథుని నభీతినిఁ బ్రాణము లున్న భార్యనే

పడయ ముహూర్త కాలమునఁ బ్రాణము లంగము నందుఁ బాడియే

  1.  

 

 

 

తే.గీ.

వారి రాశి పరీత భూవలయమునకు

నాథుఁడు ప్రియ వాక్చతురుఁడు నాదు ప్రియుఁడు

దూరమైన నాకు సుఖ మందు మనసుండ

నెట్లు నేర్చు జీవిత మందు నింక నెంచ

  1.  

 

 

 

ఉ.

కోయఁ దలంపఁ గోయనగుఁ గ్రూరముగం దిన నిచ్చ యైన నా

కాయము సంశయమ్ము మదిఁ గాంతలు! వీడి తినుండు ప్రీతితో

మాయలు పన్న నేల యవమానము దుఃఖము తాళ జాల నీ

హేయపు దేహ మెందు కిఁక నిష్ట మనోవిభుఁ గాన కున్ననున్

  1.  

 

 

 

ఉ.

దాపటి కాలి నైన మఱి తాఁకను రావణు యాతుధాను నే

నీ పురి నీ నృశంసు వరియింపఁగ నా మది సమ్మతించునే

పాపుని దుష్ట చిత్తుని నపార మదోద్ధతు వంశ ఘాతకుం

దాపము నొంది కోర నను దైత్యుఁ డెఱుంగఁడు కీర్తి నాశమున్

  1.  

 

 

 

తే.గీ.

ప్రజ్వరిల్లెడు నగ్నిని జ్వలన మొందఁ

జేసినను గోసినను విఱిచినను బంచు

కొన్న నేఁ జేర నసురునిఁ గ్రూరు రావ

ణునిఁ బ్రలాపము లెల్ల మానుఁ డిఁక నైన

  1.  

 

 

 

ఉ.

రాముఁడు కీర్తిమంతుఁడు విరాజిత శీలుఁడు ప్రాజ్ఞుఁ డెంతయుం

బ్రేమ మయుండు నాగమ సువేది కృతజ్ఞుఁడు ధర్మ మూర్తియే

నా మదిఁ గల్గె సంశయము నాదగు భాగ్యము హీనమై చనం

దా మది వీడె శూక మని దారను గావఁగ రాక యున్నచో

  1.  

 

 

 

ఆ.వె.

వ్రేసెను బదునాల్గు వే లసురుల జన

స్థాన మందు నొంటి ధైర్య మూని

యట్టి వీరుఁ డకట యబల యలమటింప

రాముఁ డేల నన్ను రాఁడు కావ

  1.  

 

 

 

కం.

బంధిత నైతి నిట ఘన మ

దాంధుని యల్ప బలు రావణాసురు వశమై

బంధు జనహితుఁడు మత్పతి

సింధు గమనుఁ డని నసురునిఁ జీరఁగఁ జాలున్

  1.  

 

 

 

తే.గీ.

దండ కారణ్యమునఁ జంపె దనుజవరు వి

రాధునిఁ బరాక్రమమున నా  రాఘవుండు

గడఁగి యట్టి వీర వరేణ్యుఁ డడుగిడం ద

లఁపఁడు నను జేర నేలకొ రాముఁ డకట

  1.  

 

 

 

ఆ.వె.

కడలి మధ్య నుండి కడు దుష్కరంబైన

దాఁటుటకును లంక తఱచి చూడ

రామ శిఖుల కంతరాయ మేల యగు న

సాధ్య మంత త్రుటి సుసాధ్య మగును

  1.  

 

 

 

కం.

కారణ మది యేది యగునొ

యా రాముఁడు రాక్షసాధి పాపహృ తార్తన్

గారపుఁ దనదు సతీమణి

నీ రీతి పరాక్రముండు నిటఁ జేరమికిన్

  1.  

 

 

 

ఆ.వె.

లక్ష్మణాగ్రజుండు రఘు వరున కెఱుక

లేదని యనుకొందు నాదు స్థితము

ధర్షితము దెలిసియుఁ దాను ధర్షణము స

హింప నిర్దయ మది నెంచె నేమొ

  1.  

 

 

 

కం.

నా యపహృతం బెఱిఁగిన జ

టాయువు ఖగ రాజ మక్కటా హతుఁ డయ్యెన్

రేయింద్రిమ్మరి కరమున

నా యనఘుఁడు సెప్ప నోపు నా రామునకున్

  1.  

 

 

 

కం.

ముదుసలి యైన నెదిర్చి బె

డిదముగ దశకంఠు నతి కఠిన కృత మొనరిం

చె దయానురాగముల రా

మ దయిత నను గావఁగ ఖగమన రాజ మటన్

  1.  

 

 

 

కం.

లోకము రాక్షస హీనము

కాకుత్స్థుఁడు సేయ నోపుఁ గాదంబములం

బ్రాకిన రాఘవుని చెవులఁ

బ్రాకటముగ నాదు వార్త లంకన యునికిన్

  1.  

 

 

 

శా.

లంకా పట్టణ మెల్ల నొక్క త్రుటిఁ ద్రెళ్లం జేయు నస్త్రమ్ములన్

సంకోచింపక సాగరమ్మును వడిన్ స్తంభించి యెండించునే

లంకాధీశుని నీచు నామమును గాళ్లం దాఁచి ఖండించునే

సంకాశుల్ రఘు రామచంద్రునకు నెంచన్ శూన్యులే ధాత్రిలోన్

  1.  

 

 

 

కం.

నా వగచిన విధమున నసు

రావా సావాసముల నిహత భర్తృకలై

యీ వనితా మణు లెల్లరు

వే వేదనల వగచుట నవితథమ్ము సుమీ

  1.  

 

 

 

తే.గీ.

లంకను గనుంగొని ధృతి సలక్ష్మణుండు

రాక్షసుల నెల్ల వధియించు రాఘవుండు

వారి నిరువురఁ గని యరి వీరు లింక

బ్రతుకఁగఁ దరమె యొక ముహూర్త సమయమ్ము

  1.  

 

 

 

కం.

చితి పొగల నిండిన గతుల

నతి వేగమ లంక నెల్ల వ్యాపించు మహా

ద్భుతముగ గృధ్ర తతుల భూ

త తతుల నిది ప్రేతభూమిఁ దలఁపించు నిఁకన్

  1.  

 

 

 

తే.గీ.

తీర నున్నది నాదు మనోరథమ్మ

సత్వరమ్ము మీదైన క్రూరత్వ మెల్లఁ

దెలుపు చున్నది పతనమ్ము తేట తెల్ల

ముగను మీకింక నగునని ముగుదలార!

  1.  

 

 

 

తే.గీ.

లంకఁ గన్పించు చున్నవి శంక లేక

పెక్కు దుశ్శకునమ్ములు నొక్క పెట్టు

కాంతి హీనంబగు ననతి కాల మందు

రావణ పురమ్ము లంక దుర్వారముగను

  1.  

 

 

 

కం.

దుర్భేద్యము లంకాపురి

దుర్భరుఁ డా రావణుండు దుశ్చరితుఁడు భూ

గర్భమ్మునఁ గలియఁగఁ దా

నిర్భర్తృక వనిత వోలె నెఱి శోషించున్

  1.  

 

 

 

ఆ.వె.

ఉత్సవ సముదయ ఘనోత్సుక లంకా పు

రమ్ము రాక్షసీ వర గణ యుతము

నాథ విరహిత యయి నష్ట ధవప్రమ

ద పగిది కనిపించుఁ దథ్యముగను

  1.  

 

 

 

కం.

వినియెద చెవులారఁగ ని

స్వనముల దుఃఖ జనితముల సర్వ పలాశాం

గనలవి యతి శీఘ్రమ్ముగ

వనర గృహ గృహముల మేటి వనితా మణులే

  1.  

 

 

 

ఆ.వె.

చీఁకటి ముసురు కొని శ్రీ యెల్ల నశియించి

త్రుంగ దనుజు లెల్ల సంగరమున

రామ ఘోర బాణ భీమాగ్ని లంకాపు

రమ్ము దగ్ధ మగు స రావణమ్ము

  1.  

 

 

 

ఉ.

నా యిట యున్కి తా నెఱుఁగ నాపతి రాముఁడు రక్త నేత్రుఁడై

యీ యసు రౌఘ నాథ వరు నింట నృశంసుఁడు రావణుండు దా

నా యెడ యిచ్చినట్టి సమయం బది యిప్పుడు సేరు వైననున్

నా యుసు ఱెవ్విధిం దరమె నాశము సేయఁగ వాని కిచ్చటన్

  1.  

 

 

 

తే.గీ.

పాప కర్ములు దనుజులు పాడి గాని

పను లెఱుంగ రధర్మపుఁ బనులఁ గలుగు

నిపు డుపద్రవములు లంక నెల్ల ధర్మ

మన్న పిశితాశనలు నేర రన్న నిజము

  1.  

 

 

 

తే.గీ.

రక్కసుఁ డొనర్చుఁ దప్పక  ప్రాతరశన

ముగ నను బ్రియ దర్శనుని రాము నరు ణాంత

లోచనునిఁ గానమి యిఁకేమి తోఁచు నాకుఁ

జేయ నిచటఁ దర మగునె సేద దీర

  1.  

 

 

 

కం.

కలరేని విష మొసఁగు దా

త లిచటఁ బుణ్యాత్ము లర్క తనయు సదనమున్

సలలితముగఁ గను దానఁ గ

నులఁ గానక యున్నఁ బతిని నుడువెద నిజమున్

  1.  

 

 

 

తే.గీ.

తెలియదు సజీవ నని ధరాధిపతి లక్ష్మ

ణాగ్రజుం డుగు రామున కంబుజాక్షు

నకు నవశ్యము కాదేని నా విశోధ

నమ్ము సేయరె యుభయులు పమ్మి ధరణి

  1.  

 

 

 

కం.

కాయము వీడి వసుంధర

నా యసహాయ దమనుండె యమరేంద్రస్థా

నీయము సని యుండును శో

కాయత చిత్తుఁడు రఘువరుఁ డరయక నన్నున్

  1.  

 

 

 

తే.గీ.

మునులు సుర సిద్ధ గంధర్వు లనఘు లెల్ల

ధన్యులు సుమి మన్నాథు ననన్య విక్ర

ముఁ గని దేవలోకమున రాముని మహార

థు ఘను రాజీవ లోచనుఁ దూర్ణముగను

  1.  

 

 

 

తే.గీ.

రాజ ఋషి ధీనిధియు ధర్మ రతుఁడు రామ

చంద్రుఁ డా మహాత్మునకు నే సతిగ నుండు

నర్థ మడఁగె నేమొ ధరణి యందు గాక

రాఁడె నను గావ వేగమ రాముఁ డిపుడు

  1.  

 

 

 

కం.

కను లెదుట నున్న వర్తిలు

ననురాగము కను మఱుంగు నయిన లయ మగున్

మనుజులు కృతఘ్నులు చెలిమి

వినాశ మొనరింతురు రఘు వీరుఁడు దక్కన్

  1.  

 

 

 

కం.

సుగుణము లరుదై యుండెనొ

విగతం బయ్యెనొ మదీయ భృశ భాగ్యమ్మున్

జగతీ తనయ నశింతు న

పగత మనోనాథ నౌటఁ బరవాసమునన్

  1.  

 

 

 

తే.గీ.

విమల చారిత్రు నరిసూదను మహి తాత్ము

శూర వరు రఘురామునిఁ జూడ కుండ

మనుట కన్నను మేలగు మరణ మింక

పతిని నెడఁబాసి మనఁ గులసతికిఁ దగునె

  1.  

 

 

 

కం.

కాదేని కంద మూలా

స్వాదులయి నరప్రముఖులు వన గోచరులై

యాదిత్యాన్వయ శూరులు

సోదరులు త్యజించిరె తమ యుచి తాస్త్రములన్

  1.  

 

 

 

ఆ.వె.

లేక రావణుఁడు మలిన మనస్కుఁ డసుర

మోస చెయువు లూని యీసు చేత

రామ లక్ష్మణులను భ్రాతల శూరులఁ

జంపి యుండ నోపుఁ దెంపు మీఱి

  1.  

 

 

 

ఆ.వె.

ఇవ్వ్యసనపుఁ గాల మెంచ నెవ్విధి నైన

మరణమ గుణ మౌను గరము నాకు

విహిత మైన చావు వింత రా దేలకో

దుఃఖ మింక సైఁప దుర్భరమ్ము

  1.  

 

 

 

తే.గీ.

ధన్యులు గద మునులు పరిత్యక్త కిల్బి

షులు విమల హృదులు జితాత్ము లలఘు చిత్తు

లు వసియింప ధరణి వీడి లోభ మెల్ల

ప్రియము లప్రియముల నొక్క పేర్మిఁ జూచి

  1.  

 

 

 

తే.గీ.

పొంగరు సుఖముల వెతలఁ గ్రుంగ రా ము

నీంద్రు లుందురు దూరులై యీ యుభయము

లకు ననవరతమ్మును వారల కిడుదు నిట

వందనమ్ములు సద్భక్తి డెంద మందు

  1.  

 

 

 

కం.

రాముని ప్రియార్హుని విడిచి

నే మనఁ జాలను విడిచెద నిజ జీవములే

యా మహితాత్మునిఁ గానక

భీమాఘ దశాస్య వశను భీతి చెలంగన్

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నిరువది యాఱవ సర్గము.

 

 

 

 

సుందర కాండము    

సర్గము 27.

 

                                                         

కం.

అవనిజ పల్కులు విని యసు

ర వనిత లెల్ల ఘన రోష రయ మూర్చితలై

రి వడిం గొందఱు సని రం

త విషయ మెల్ల వివరింప దశకంఠునకున్

  1.  

 

 

 

కం.

ధరణిజ చేరువ సేరి య

సురాంగన లనర్థ భావ సూచితములు పా

మరు లేకార్థస్ఫురణం

బరుషంపు వచనము లెల్లఁ బల్కిరి క్రూరల్

  1.  

 

 

 

ఆ.వె.

కుమతి! సీత! దురిత కుటిల చిత్త! వదర

నేల పెక్కు మాట లిపుడు నీదు

పలల మెల్ల నేడు భక్షించు వార లీ

రక్కసులు యథేచ్ఛ నక్కజముగ

  1.  

 

 

 

కం.

జానకి నా రీతి దురభి

మానాసుర కాంత లెల్ల మథన పఱపఁగన్

దానవ వృద్ధయ త్రిజట య

హీన ధృతి శయన గత యనె నిబ్బంగి వెతన్

  1.  

 

 

 

తే.గీ.

సుత జనకునకు దశరథస్నుషయు సీత

తినఁ దగదు మీకు నెప్పట్టున నిరతంపు

నీచ చిత్తలార! తినుండు నెలఁతలార!

మిమ్ముల నొకరి నొక్కరు మిడిసిపడుచు

  1.  

 

 

 

ఆ.వె.

కంటి నేఁడు నేను గల యొక్కటి కరంబు

దారుణమ్ము భీతి దాయకమ్ము

రోమ హర్షణమ్ము రామ శుభ కరమ్ము

రాక్ష సేంద్రు సర్వథా క్షయదము

  1.  

 

 

 

తే.గీ.

తా నుడువఁ ద్రిజట యిటు లహీన రోష

మూర్చిత భయార్త కంపిత మూర్తు లాయ

సుర వనిత లెల్ల రడిగిరి చూచి త్రిజట

నా కల వివరింపు మనుచు నత్తరముగ

  1.  

 

 

 

తే.గీ.

స్వప్న మది యెట్టిది నిసిని వచ్చె నంచు

నడుగ దనుజ గణ ముఖపు టా నుడువుల

విని త్రిజట చెప్పఁ దొడఁగెను వృత్త మంత

యుదయము తనదు కల గూర్చి యువిదలకును

  1.  

 

 

 

చం.

కరి దశనౌఘ కల్పిత వికాస నభోధ్వ విహార రాజ మం

దురుతర డోలికా వరట యుక్త మహోన్నత పీఠ మందు నా

వర రఘు వంశ వర్ధనుఁడు పన్నుగ శుక్ల సుచేల ధారియై

విరి సర మొప్ప కంఠమున వే యరుదెంచె సలక్ష్మణుండునై

  1.  

 

 

 

ఉ.

కాంచితి స్వప్నమందు జనకప్రభు సూననుఁ బాండరాంశుకం

జంచల వీచిమాలి వృత శైత్య మహీధర రాజ సంస్థితం

గాంచన భాను భానునకుఁ గాంతి నిభమ్మన రామ సంగతిన్

మించిన సంతసంపు మది మీన సులోచన మేదినీసుతన్

  1.  

 

 

 

మ.

ధర సంకాశము సామజేంద్రము చతుర్దంష్ట్రప్రయుక్తమ్మునం

బరమాత్ముండు రఘూత్తముండు జనసంభావ్యుండు సౌమిత్రి తోఁ

బరగం జూచితి నేఁ జరింప నుభయుల్ భాసిల్లి తేజంబునన్

నర శార్దూలురు జానకిం గదియ సానందమ్ము శుక్లాంబరుల్

  1.  

 

 

 

చం.

నగమున నుండి సీత గగనమ్మున నున్న యిభాంస కూటమున్

మగఁడు కరంబు నీయ నభిమానము తోడుత నాశ్రయించి వే

యెగిరి నిజాత్మనాథు నొడి నింపుగఁ జేరి వినోద కేళిగాఁ

దగులఁగ సూర్య చంద్రులను దర్శన మిచ్చెను స్వప్న మందహో

  1.  

 

 

 

కం.

ఇనకుల కుమార యుగళ

మ్మును సీతను నిడుద నేత్రముల దాని నభ

మ్మున మోయుచు నున్న యిభ

మ్మును గంటిని లంక పయి సమున్నత రీతిన్

  1.  

 

 

 

కం.

తెల్లని యెడ్లవి యెనిమిది

యల్లన రథమును నడుపఁగ నానంద మటన్

వెల్లి విరియంగ రాముం

డుల్లమున స్వయముగఁ గలిసె నువిదను సీతన్

  1.  

 

 

 

ఉ.

వీరుఁడు రామచంద్రుఁ డరి వీర భయంకరుఁ డుత్తముండు దా

దార మహీజ లక్ష్మణ యుతమ్ము విమానము పుష్పకం బనం

దోరము సూర్య సన్నిభము ద్రుళ్లుచు నెక్కి యుదీచి దిక్కు పెం

పారఁగ నెల్లరున్ ముదితులై యతి వేగము సాగఁ గాంచితిన్

  1.  

 

 

 

ఉ.

ఈ విధిఁ జూచి తేను గల నీ రఘు రాముని విష్ణు విక్రముం

బావని సీత భార్య మఱి భ్రాతయు రాఁ దన వెంట నంటియున్

దేవ గణాసు రాన్యులకుఁ దేజున విక్రమ వీర్య సంపదన్

దేవ పథమ్ము పాపులకుఁ దీరున రాముఁ డజేయుఁ డిద్ధరన్

  1.  

 

 

 

మత్త కోకిల

రావణాసురుఁ దైల మగ్ను నిలా స్థి తారుణ వస్త్రునిన్

వావిరిన్ సుర గ్రోలి తూలెడు వానినిం గరవీర మా

లావృతాయత కంఠు దైత్యుని నా దశాస్యునిఁ గంటిఁ ద్రా

సావహాంగిక భీమ రూపు మహాఘ పూరిత చిత్తునిన్

  1.  

 

 

 

తే.గీ.

పుష్పక విమాన మందుండి పుడమిఁ బడఁగ

రావణుని నల్లని వలువల ధరియించి

తిరుగు వాని బోడి తలతోఁ బరఁగు వాని

నాతి చే నీడ్పఁ బడు దశాననునిఁ గంటి

  1.  

 

 

 

తే.గీ.

తైలము ద్రాగుచు నాడుచు

నా లంకాపతి హసింప నగపడెఁ గలలో

మాల లనులేపనములను

వే లాగ ఖరములు దేరు వెఱ్ఱి యనంగన్

  1.  

 

 

 

చం.

వడివడి దక్షిణంపు దిశ వాహన రాజము గర్దభమ్ము పై

నడరుచు నేఁగఁ గంటిఁ గల నయ్యసు రేంద్రుని రావణాసురుం

దడయక యంతలోఁ దిరిగి దర్శన మిచ్చె నధోముఖంబుగం

బడి భువి మోహ చిత్తుఁ డయి పాయని గార్దభ భీతి తోడుతన్

  1.  

 

 

 

కం.

చివ్వున లేచి భయమ్మును

నివ్వెఱఁగును మైకము మది నెరయఁగ వింతన్

నొవ్వి తిరుగుచు వివస్త్రుం

డవ్వెఱ్ఱి పలుకులు వల్క నగపడెఁ గలలో

  1.  

 

 

 

ఆ.వె.

మునిఁగె రావణుండు బురద లోన వడినిఁ

జేరి ఘోర మసహ మౌర నరక

నిభము పూతిగంధి నిబిడాంధకారము

వింత గొల్ప నచట నింతులార!

  1.  

 

 

 

తే.గీ.

ఎఱ్ఱ పుట్టము లూనిన యింతి యొకతె

నలుపు టొడలునఁ బంకమ్ము నలఁది మెఱసి

కంఠము బిగించి వటి దశకంఠు నంత

లాగుచుండెఁ గాలు దిశకు వేగముగను

  1.  

 

 

 

తే.గీ.

కానపడెఁ గుంభకర్ణుఁడు దానవుండు

స్వప్నమందు దీనముగ రావణ తనయులు

దర్శనం బిచ్చిరి తడియఁ దైల మందుఁ

దనువు లెల్ల సర్వులకును దన్వులార!

  1.  

 

 

 

తే.గీ.

సూకరమ్మున విశ్రవసు తనయుండు

రావణుండు మకరి పైన రావణాత్మ

జుండు నింద్రజిత్తు నిశాచరుండు కుంభ

కర్ణుఁ డొంటె నేఁగఁగ వల కడకుఁ గంటి

  1.  

 

 

 

కం.

చూచితి నొక్కని నచ్చట

రోచిర్ధవళాతపత్రు రుచి రాంబరు శు

క్లోచిత గంధాలేపను

నా చిద్రూపుని విభీషణాఖ్యాభినుతున్

  1.  

 

 

 

ఉ.

మ్రోతలు శంఖ దుందుభులు మ్రోగఁ జెలంగ స గీత నృత్యముల్

చాతక నంద వర్ధన సుజాత నినాద సమాన ఘీంకృతుల్

శ్రోతము లెల్ల నింపెడు సుశోభిత దంత చతుష్క హస్తి పైఁ

బ్రీతి విభీషణుం డడరె ప్రెగ్గడ లుండఁగ నింగి నల్వురున్

  1.  

 

 

 

కం.

రక్కసి మూఁకం జూచితి

వెక్కసముఁగఁ ద్రాగి పాడి వింతగ నాడం

బిక్కటిల వాద్య ఘోషల

నక్కావి సరి వసనముల నలయఁగ నచటన్

  1.  

 

 

 

తే.గీ.

తోరణములు గోపురములు తునుక లయ్యె

నందమైన లంకాపుర మశ్వ కుంజ

ర రథ సంయుతమై జల రాశి మునుఁగ

గంటిఁ గలయందు భయమొందఁ గాంతలార!

  1.  

 

 

 

కం.

రావణ రక్షిత లంకను

బావన కీలార్పణమ్ము వానరుఁ డొకఁడే

వేవేగ రామదూత బ

లావేశమ్ముల నొనర్ప నరసితిఁ గలలో

  1.  

 

 

 

కం.

త్రాగుచుఁ దైలము నవ్వుచుఁ

దూఁగుచు నాడుచు ముదముగఁ దోరపు ధ్వనులన్

వీఁగఁగ రాక్షస వనితలు

కాఁగి భసితమైన లంకఁ గ్రాలఁగఁ గంటిన్

  1.  

 

 

 

తే.గీ.

కుంభ కర్ణాద్యసుర కుల సంభవులు రు

ధిర నివసనములు ధరించి ధీర వరులు

నావు పేఁడ మడుఁగు సేరి రంత నెల్ల

రొకరి పిదప నొకరు కల నుఱికి యుఱికి

  1.  

 

 

 

చం.

తొలఁగుఁడు దూర మెల్లరును దొయ్యలి సీతను జేరు రాముఁడే

తలఁగక యున్ననాశనము తప్పదు దైత్యుల తోడ నింక మీ

కలిగిన మిమ్ము రాక్షస చయమ్మును నెల్ల నడంచు నుగ్రుఁడై

యెలమిని సీతఁ గైకొను సహింపఁడు తర్జన భర్జనమ్ములన్

  1.  

 

 

 

కం.

ప్రియతరపు గౌరవపు భా

ర్య యవనిజను రాఘవుఁడు వనానువ్రతనున్

భయపఱచు కార్యములఁ గాం

చి యనుమతించునె రిపుల కజేయుఁడు ఘనుఁడున్

  1.  

 

 

 

కం.

చాలిఁకఁ గ్రూరపుఁ బల్కులు

మేలగు నుపశమన మిచ్చు మినుకుల మనకున్

లాలించుచు యాచింతము

లోలాక్షి నవనిజ నదియ రుచిరము నాకున్

  1.  

 

 

 

కం.

ఏ కాంత దుఃఖ మందున

వే కాంచిన నిట్టి కలను వీడును వ్యసనా

నేకము లా కాంత మఱి య

నేక శుభమ్ములను బడయు నిక్కము సుమ్మీ

  1.  

 

 

 

కం.

రాముని వలని భయము భీ

మామర రిపు వరులకు కల దందఱ కిచటన్

వేమాఱు నింద సేసిన

నా మానిత సీత వేఁడ నభయము నిచ్చున్

  1.  

 

 

 

తే.గీ.

జానకి నమస్కరింపఁ బ్రసన్న మగును

భృశము చాలును గాపాడఁ బేర్మితో మ

హా భయమ్ముల నుండి మి మ్మసుర వనిత

లార! వేఁడుఁ డుడుగుఁ డింక నలమట లిడ

  1.  

 

 

 

ఆ.వె.

ఆతత నయన జనకాత్మ జాంగమ్ముల

సూక్ష్మ దోష  మైనఁ జూడ లేను

తను విరూప మల్ప తర మైనఁ గాంచ శ

క్యంబె యేరి కైన నవని యందు

  1.  

 

 

 

తే.గీ.

దుఃఖముల నొందఁ గంటిని దుఃఖముల క

నర్హురాలు సీత విమాన మందు నుండి

యడుగిడఁ గలఁ బ్రభాక్షీణ మయ్యె నంచు

మదిఁ దలంతు వైదేహికి మగువలార!

  1.  

 

 

 

ఆ.వె.

సీత కీప్సితమ్ము సిద్ధించుటయు రాక్ష

సేంద్రు నాశనమ్ము నింద్ర తుల్య

రాఘవేంద్రు జయము రమణులార! పనులు

గాంచితిఁ గలలోనఁ గా గల వవి

  1.  

 

 

 

తే.గీ.

పద్మ పత్రాయ తాంబక వామ నయన

మదురుచుఁ గనబడె లలనామణి జనక త

నూజ సూచిత మనఁగ వినుటకుఁ బ్రియ త

రంబయిన వార్త నచిరము సంబరముగ

  1.  

 

 

 

తే.గీ.

దాపల కయి వడఁకె నమాంతముగ సీత

కంత దాక్షిణ్యవతి కించు కంత యదిరె

నెడమ తొడ కరేణు కరాభ మించు కంత

తెలుప రాఘవ దర్శన మలరు ననఁగ

  1.  

 

 

 

తే.గీ.

విహగ మొక్కటి చేరుచు విటప గృహము

మఱల మఱల ననునయంపు మాట లనఁగ

సుస్వరమ్ముల స్వాగతించు క్రియ జాన

కీ సతినిఁ బాడె ముదమున నాస లిడుచు

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నిరువది యేడవ సర్గము.

 

 

 

సుందర కాండము    

సర్గము 28.

 

                                                         

కం.

వగ పొదవు నసురు వల్కులు

మిగులఁ గలఁప మది నవనిజ మిక్కిలి యార్తిం

దగిలి వనాంతర మందున్

మృగేంద్రుఁ గదియు కరి కన్య మేర తపించెన్

1.      

 

 

 

తే.గీ.

పడఁతు లా రక్కసుల కెల్ల నడుమఁ జిక్కి

ములుకు లా రావణాసురు పలుకులు విని

యులికి యులికి యడవిని వదలిన బేల

కన్య వోలె సీత వగచె దైన్యముగను

2.     

 

 

 

తే.గీ.

నుడువరే మున్ను మునులెల్లఁ బుడమి లోన

నిధన మది యకాలమ్ము రా నేర దంచు

బ్రతుక నే క్షణమైన సంభర్త్సితార్తి

హీన పుణ్యను దీనను హీనముగను

3.     

 

 

 

తే.గీ.

లేశ మైనను సుఖములు లేక యున్న

తేర వెతలెల్లఁ బూర్ణమై దీనముగను

గట్టి దీ హృదయమ్ము భగ్నమ్ము కాక

యుండె వజ్రమున విఱుగు కొండ రీతి

4.     

 

 

 

తే.గీ.

దోష మెంచ నించుక నే వదుల నసువులు

వధ్య నెటులైన నసురుచేఁ దథ్యముగను

మంత్ర మబ్రాహ్మణునకు బొమ్మఁడిడ నట్టి

పగిది తగ దీకొన నసురుఁ బర పురుషుని

5.     

 

 

 

కం.

జగదేక విభుఁడు రాముఁ డ

డుగిడక మును నన్నునసురుఁడు శితాస్త్రములం

బగ నఱకు శస్త్ర వైద్యుఁడు

విగతాయుర్భ్రూణము నిఁక విఱిచెడు భంగిన్

6.     

 

 

 

తే.గీ.

గడువు రెండు మాసమ్ములు గడప నరిది

శోక తప్త చిత్తకు నెంచఁ జోరున కప

రాధికి నిసి తఱుఁగ నట్లు రాజ దండి

తునకు బంధితునకు వధార్హునకు నకట

7.     

 

 

 

కం.

హా రామా హా లక్ష్మణ

హా రామ జనని యహో మదంబా హా రా

మారాధ్య సుమిత్రా కూ

పారమున మునిఁగెడి నావ భంగి మునిఁగితిన్

8.     

 

 

 

తే.గీ.

మృగపు రూపమ్ము ధరియించి పగ వహించి

మసలు సత్త్వ మహిమ రాకుమారు లౌర

కోరి నాకతమ్ము బలులు గూలి రేమొ

యడవి సింహర్షభద్వయ మశని రీతి

9.     

 

 

 

కం.

వెడ సిరి నను లోభ పఱచె

వడిఁ గాలము మృగపు రూపు వడసి వనమునన్

విడచితి మూఢ నయి యకట

నిడుద కలఁత నార్యపుత్రుని సలక్ష్మణునిన్

10.    

 

 

 

అల్పాక్కర

హా రామ సత్యవ్ర తాయత భు

జా రాజ నిభ వక్త్ర హా లోక హి

తా రాగ చిత్త వధ్య నని నే నీ

ఘోరాసుర విభునకు వినలేదే

11.    

 

 

 

ఆ.వె.

పతియ దైవ మనెడు భావము సహనమ్ము

భూమి పైన నిద్ర పుణ్య నిరతి

నియతియుఁ బతిభక్తి నేఁ డాయెను నిరర్థ

కము కృతఘ్నున కుపకారము వలె

12.    

 

 

 

తే.గీ.

నిన్ను గాంచఁగ నెవ్విధి నేర లేక

యాశ నీ సంగమపు సిద్ధి యడఁగె నిఁకఁ గృ

శాంగి కెంచఁగ నాదు ధర్మాచరణము

పుడమి నీ యేక పత్నీత్వము విఫలమ్ము

13.    

 

 

 

తే.గీ.

తండ్రి యాజ్ఞను బాలించి తగిన రీతిఁ

గాననమ్ము వీడి ఫలింపఁ గటికి  వ్రతము

నాయతాక్షుల తోడుత నలరి పురిని

వీత భయము గృతార్థత వెలయఁ గలఁడు

14.    

 

 

 

తే.గీ.

భృశము జనియించె నీయందుఁ బ్రేమ రామ

బద్ధమై నిలిచెను నాదు భావ మెల్ల

నిష్ఫలము లయ్యె  వ్రత జప నియమ తతులు

జీవిత మదృష్ట హీనము వే విడుతును

15.    

 

 

 

కం.

విషమున నైన సునిశిత ప

రుష శస్త్రమున నయిన వదలుదుఁ బ్రాణములన్

విష శస్త్రదులం గన నని

మిషారి విభుని గృహ మందు మెలఁగెడు జనులన్

16.    

 

 

 

కం.

తడియాఱి నట్టి కుత్తుకఁ

గడు వణఁకెడు మేను తోడఁ గాకుత్స్థు మదిన్

విడువక కుములుచు భృశముం

దడఁబడుచు ససుమ నగమ్ము ధరణిజ జేరెన్

17.    

 

 

 

తే.గీ.

శోక పరితప్త తలఁచి యనేక విధము

ల మది నిజకేశ జటఁ బదిలముగఁ బట్టి

సీత మెడ చుట్టు జడ కట్టి భీత చిత్త

యమ సదన మేఁగ నెంచెఁ దోయజ దళాక్షి

18.    

 

 

 

తే.గీ.

కోమల తనూర్వ రాత్మజ కుజ విటపము

నానుకొని నిల్చి రాము రామానుజు నిజ

కుల గుణము లెన్నుచుండ విమల తర మతిఁ

గర ముఖాక్షిప్రముఖ శుభాంగముల నంత

19.    

 

 

 

తే.గీ.

గోచరము లయ్యె నట శుభ సూచకములు

వెక్కు లోకోత్తమమ్ములు వెతలను హత

మార్చి ధైర్యము నీయంగ మహిత శకున

ములు ఫల నిరూపితమ్ములు పూర్వ మందు

20.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నిరువది యెనిమిదవ సర్గము.

 

 

 

 

సుందర కాండము   

సర్గము 29.

 

                                                         

ఉ.

ఆవిధి నున్న దుఃఖితకు హర్ష విహీన కనింద్య చిత్తకున్

వావిరిఁ గ్రుంగి మానసము వర్తిలుచున్న నిలా తనూజ కు

ద్భావము లయ్యె నా శకున వర్గము లంత శుభంకరమ్ములై

శ్రీవిభవుం దమిం గదియు సేవక బృందము భంగి నొప్పుచున్

1.      

 

 

 

తే.గీ.

నెఱి నెఱులఁ గూడి కడు నల్లని కను గ్రుడ్డు

తెలుపు నందునఁ గూడి యతివ సుకేశి

ని యెల కన్నదరె భృశ మనిమిషపు హతి

వలనఁ గదలు కెందామర పగిది నంత

2.     

 

 

 

ఆ.వె.

స్థూల మంచి తమ్ము సుందర ముండ్రమ్ము

నగరు చంద నోత్త మార్హ మైన

నిజ మనోధవునకు నిత్యోషితమ్మైన

వామ భుజ మదిరెను వనజ ముఖికి

3.     

 

 

 

ఆ.వె.

హస్తి కర నిభమ్ము లతి సంహత సుజాత

పీన వర్తులములు జానకీ స

తీ మతల్లి తొడల వామోరువు వడఁకెఁ

దోఁప రాము రాక సూచకముగ

4.     

 

 

 

ఆ.వె.

స్వర్ణ తుల్య వర్ణ భాసితమై దుమా

రమున మాసి శుభకరమ్మనంగ

నమల నేత్ర సురుచి రాంగికి వాసము

జాఱె నిలువ నలఁతి చారు దతికి

5.     

 

 

 

ఆ.వె.

వాత మెండఁ గంది వర్షమున నలరు

విత్తు వోలె నీ నిమిత్తముల వి

వరణము లవి సిద్ధ వరులు పరులు దెల్ప

మునుపు సీత యంత ముదము నొందె

6.     

 

 

 

తే.గీ.

దొండ పండు వోలెడు మోవి తోడ రుచిర

నేత్ర కేశ పక్ష్మభ్రూ సుగాత్ర శుక్ల

దంష్ట్ర వదనములఁ దనరె ధరణి తనయ

రాహు ముఖ ముక్త శీతకిరణ నిభమ్ము

7.     

 

 

 

తే.గీ.

శోకము నశింప భయ మది లేక యలపు

దీఱ వికసింప ముదమునఁ దెలివి సీత

సుందర తర వదనమున శోభిలె నట

శుక్ల పక్ష చంద్రోదయ శోభ వోలె

8.     

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నిరువది తొమ్మిదవ సర్గము.

 

 

సుందర కాండము   

సర్గము 30.

 

                                                         

 

కం.

వినె కపి వీరుఁడు సర్వము

జనకాత్మజ పల్కులను ద్రిజట వచనములన్

ఘన తర్జనమ్ములు దనుజ

వనితా గణముల యథార్థ వచనము లంతన్

1.      

 

 

 

కం.

నందన వన మందలి సుర

సుందరి చందమున నున్న సుదతి నవనిజన్

డెంద మలరఁ గాంచి తలఁచె

నందఱి విని బహు విధముల హరి సత్తముఁడే

2.     

 

 

 

కం.

ఎవతినిఁ బరికింపగఁ గపు

లు వేలు పదివేలు దిక్కులు సనిరి తమి నా

సువదన జానకి నేనీ

యవసరమునఁ గంటి నింక నాశ్చర్యముగన్

3.     

 

 

 

కం.

చారునిగ నియుక్తుఁడనై

ఘోర రిపుల శక్తి నెల్ల గుంభనపు విధ

మ్మారయఁ జరించి యంతట

నే రయమునఁ గంటి లంక నిశ్చిత బుద్ధిన్

4.     

 

 

 

కం.

రాక్షస పురమును వీరుల

లక్షణములు విక్రమమ్ములఁ బ్రభావములున్

వీక్షించితి నా రావణు

రక్షో నాథునివి సవివరముగన్ లంకన్

5.     

 

 

 

ఆ.వె.

ఉచిత మని తలంతు నూఱడింప సకల

సత్వ గణ దయా పరత్వు నప్ర

మేయు భార్య సీత మేదినీ సుతఁ బతి

దర్శ నాభి రతను దరళ నేత్ర

6.     

 

 

 

తే.గీ.

శోకమున నుండ నెవరును జూడ నామె

దుఃఖముల నిప్డు దపియించు తోయ జాక్షి

నంత మెఱుఁగని వంతల నలయు నామె

నూఱడింతుఁ జంద్ర వదన నుచిత రీతి

7.     

 

 

 

కం.

పరితప్త హృదయ దేవి న

సుర వనితా తర్జితను నశోక వనమునన్

దురితంబగుఁ దథ్యమ్ముగఁ

గరం బనునయింపక మును గమ్యము సనినన్

8.     

 

 

 

కం.

నా చనిన పిదప జానకి

రాచకుమారి విమలాంతరంగ యలమటం

గాచెడు వానిం గానఁగ

నోఁచక తా జీవితమ్మును ద్యజించు నిటన్

9.     

 

 

 

తే.గీ.

రాము నాజాను బాహుఁ బూర్ణ శశి నిభ ము

ఖు నిజ దార దర్శన లోలు మన మలర్ప

నెమ్మి నూఱడించు నునికి సమ్మతమ్ము

సుమ్మి యిచ్చోట నాకింకఁ జూడఁ జూడ

10.    

 

 

 

కం.

అవనిజ తోడఁ బలుక నసు

ర వనితల సమక్షమున నెర వగునె నాకుం

గవిసె నకట సంతాపము

లు వెక్కు కర్తవ్యములను రోయఁగ నగునే

11.    

 

 

 

తే.గీ.

రాత్రి యిది ముగియక మున్న రమణి సీత

ననునయింపక వేగ నే నరిగిన జన

కాత్మజ విడుచుఁ బ్రాణము లాత్మ నాథుఁ

దలఁచి సందియ మించుక కలదె యిందు

12.    

 

 

 

తే.గీ.

సీత తన కెట్టి నుడువులు సెప్పె నంచు

రాముఁ డడిగిన నన్నటఁ బ్రేమ తోడ

నేమని వచింపఁ గలను నే రామ తోడ

నిచట భాషింప కున్న సముచితముగను

13.    

 

 

 

తే.గీ.

రోష పూరిత సంరక్త లోచనముల

రఘువరుండు దహింపఁడె రయము నన్ను

సీత సందేశ మించుక సెప్ప కుండ

నున్న నచ్చటఁ గాకుత్స్థుఁ డుగ్రుఁ డౌచు

14.    

 

 

 

ఆ.వె.

వ్యర్థ మగు ససైన్య హరిరాజ సుగ్రీవు

రాక లంక కింక రామ కార్య

భార రతిని నాదు ప్రేరణమున వీత

ధరణిజాత తటికిఁ దథ్యముగను

15.    

 

 

 

కం.

దైత్యాంగ నాంతరమ్మున

నత్యంతోద్వేగ తర్జి తాబల సీతన్

స్తుత్యానునయ వచనముల

సత్యమ్ముగ నూఱడింతు సత్సమయమునన్

16.    

 

 

 

ఆ.వె.

అల్పకాయ మందు హరి సత్తముఁడ వీలుఁ

జూచి మానుషంపు సూక్తు లమర

సంస్కృతమ్ము నందు జనక నందన తోడ

మాట లాడ నుత్త మంబు నాకు

17.    

 

 

 

ఉ.

భూసురు భంగి దివ్య సుర పూజిత సంస్కృత మందుఁ బల్కినన్

వేసము మార్చె రావణుఁడ వీఁ డని యెంచును నన్ను గాంచినన్

భూసుత సీత భీత హృది వూనును శంకఁ దలంచుఁ జెంది సం

త్రాసము కోఁతి కెవ్విధిఁ దరంబగు సంస్కృత భాషణమ్ములున్

18.    

 

 

 

కం.

అయినను మానుష వాక్యము

ల యంద వచియింప వలె నిలా నందనతో

నయముగ నుపశమనమ్ముల

వి యన్యముల శక్య మెట్లు విమల మతి కిఁకన్

19.    

 

 

 

కం.

నా రూపము భాషణముల

నారసి పూర్వాసుర నిచయార్త భృశమ్మున్

దారుణముగ విలపించును

ఘోర విషాదాబ్ధి మునిఁగి కోమలి మరలన్‌

20.   

 

 

 

ఉ.

వచ్చిన వాఁడు రావణుఁ డవశ్యమ యీతఁడు కామ రూపుఁడే

నొచ్చి తలంచి యివ్విధి కనుంగవ యస్రు మయమ్ము గాఁగఁ దా

హెచ్చుగఁ దాపముం బడసి యేడ్వ నిలాసుత నిస్వనమ్ముతో

నచ్చట కేఁగు దెంతురు మహాయుధ హస్తలు దైత్య బామినుల్

21.    

 

 

 

కం.

ననుఁ జుట్టుముట్టి వికృతా

నను లా యసురాంగనలు గనలి బంధింపం

గ నసువులు హరింప బల

మ్మున యత్నింతురు కరమ్ము మూరును వెతలే

22.   

 

 

 

కం.

కొమ్మలు రెమ్మలు తరుకాం

డమ్ముల నిమ్ముగ గ్రహించి డంబము మేనం

గ్రమ్మఁగ నేఁ బరుగిడ నా

బ్రమ్మిన యసురలకుఁ  గల్గు భయ మధికంబై

23.   

 

 

 

ఆ.వె.

ఇవ్వనమునఁ దిరుగ నీ రూపమున నన్ను

జూచి నంతటనె యసుర వనితలు

వికృత ముఖులు త్రాస విహ్వల లౌదురు

సందియమ్మొకింత నొంద నేల

24.   

 

 

 

కం.

పిలిచెదరు వార లత్తఱి

నులికి దశగ్రీవ నియమి తోగ్రాసురులం

బలలాశనేంద్ర మందిర

విలసిత రక్షకుల నంత భీత హృదయలై

25.   

 

 

 

కం.

భయ కారణమున నా యసు

ర యోషితలు శూల తోమర కృపాణ నికా

య యుతోగ్ర దైత్య భటులఁ గ

దియింతు రతి వేగముగ ధృతి సమర మందున్

26.   

 

 

 

కం.

పరివేష్టించిన భీభ

త్స రాక్షస బలము దునిమి యసదృశ జవమునం

దిరిగి సముద్రపు టావలి

దరిఁ జేరఁగ శక్య మగునె తలఁపఁగ నాకున్

27.   

 

 

 

తే.గీ.

వేగవంతు లీ రాక్షస వీరు లెగిరి

నాదు పైకి బంధింపఁ గనలి కరమ్ము

సీత యవిదితయై యుండు భీత చిత్త

నాదు రాక లంకకు బంధనమ్ము గూడ

28.   

 

 

 

ఆ.వె.

సీత కింక హింస శీఘ్రమ సమకట్టఁ

గ్రూర కర్ములు నపకారు లసుర

వరులు రఘుకులవర వానరేంద్రుల కార్య

హాని జరుగ కున్నె దాని వలన

29.   

 

 

 

చం.

పరులకు దుర్నిరీక్ష్యమును వారిధి వేష్టిత గుప్త దేశమౌ

గురుతర భీమ రాక్షస సుగుప్త మశోక వనమ్ము లోపలన్

సురుచిర రూప సీత ఘనశోక పయోధి నిమగ్న యుండగం

బరివృత రాక్షసీగణ మవారిత రామ విలోక నార్తయై

30.   

 

 

 

కం.

అన్యులఁ గానను వానర

సైన్యమ్మునఁ దోడు కార్య సాధన కా రా

జన్యున కిట పట్టు వడిన

దైన్యముగ నశింప నేను దనుజుల వలనన్

31.    

 

 

 

ఆ.వె.

నే హత మయిన నిట నీ హరి వీరులఁ

గాంచ నెంచ భృశము కడలి దాఁట

వంద యోజనములు బల జవములు కల్గు

వారి సీత జాడ నేరు వారి

32.   

 

 

 

ఆ.వె.

వేల కొలఁది దనుజ వీరులఁ జంపంగఁ

గలదు నాకు శక్తి కాని వనధి

యావలి దరిఁ జేర నలయక వశమగు

నే తలంచి చూడ నిశ్చయముగ

33.   

 

 

 

తే.గీ.

యుద్ధము లసత్యములు శంక లున్న నచ్చ

వెన్నఁ డిల నాకు మనసున నెవ్విధమ్ము

నైన నిస్సంశయంపుఁ గార్యమ్ములను స

సంశయము ప్రాజ్ఞు లగు వారు సల్ప గలరె

34.   

 

 

 

ఆ.వె.

పలుకరింప కున్న వైదేహి ఘన శోక

భారమునఁ ద్యజించు బ్రాణములను

దోషమై చెలంగు భాషింప నే నిట

సీత తోడ నెట్టి రీతి నైన

35.   

 

 

 

కం.

కలవర మందిన దూతుని

వలన సమయ దేశములకు భంగము లైనన్

విలయము లగుఁ గార్యమ్ములు

వెలవెలఁ బోవు తిమిరంపు విధి రవి వెలయన్

36.   

 

 

 

తే.గీ.

తమ్ము తాము పండితులుగఁ దలఁచు వారు

సాధ్వసాధుత్వముల నెల్ల సంప్రదించి

కూడ నిశ్చితముగఁ బ్రతికూల సరణిఁ

బరఁగి నిజముగఁ జెఱతురు పనుల నెల్ల

37.   

 

 

 

తే.గీ.

చేవ నెవ్విధిఁ గార్యమ్ము సెడక యుండుఁ

గలవరం బెప్పగిది నింకఁ గలుగ కుండుఁ

గడలి లంఘన మెబ్భంగిఁ గాదు వమ్ము

చింత సేసెఁ గపివరుఁడు శీఘ్రముగను

38.   

 

 

 

తే.గీ.

వీత భయమున వైదేహి వినెడు రీతి

నాదు పల్కుల నెల్ల మానస మలరఁగ

మానితముగఁ బల్కుదు నంచు వానరుండు

బుద్ధిమంతుఁడు స్తిరముగ బుద్ధి నిలిపె

39.   

 

 

 

తే.గీ.

అలు పెరుగని పనుల వాని నవనిజ మన

మందు నున్న వాని సుబంధు వైన వాని

రాము రఘుకుల దీపకు రమ్యముగను

బాడి యలరింతు వైదేహి భయము వీడ

40.   

 

 

 

ఆ.వె.

ఆత్మవేది రాము డైక్ష్వాకుఁ డార్త జ

నాభయదుని కీర్తనాళి సహిత

ధర్మ యుక్త వచన తతులు శుభమ్ములు

వలికెద నతి రమ్య భంగి నింక

41.    

 

 

 

కం.

నమ్మకము కల్గు నట్టుల

నమ్మానిని కవనిజకు వరానన కానం

దమ్ముగ వినిపించెద మధు

రమ్మగు వాచ్యమ్ములన్ని రామకు నింకన్

42.   

 

 

 

కం.

వానర వరేణ్యుఁ డా హను

మానుఁడు సుమహానుభావ మారుతి వలికెన్

భూనాథు సతిం జూచుచు

నా నగమున నుండి సుమధు రావితథ గిరల్

43.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు ముప్పదవ సర్గము.

 

 

 

సుందర కాండము   

సర్గము 31.

 

                                                         

కం.

ఇవ్విధి వివిధ తలంపుల

నవ్వానర వరుఁడు వగచి యవనిజ వినగం

జివ్వున మృదు మధురం బగు

నవ్వచన సుమములఁ బాడె నానందముగన్

1.      

 

 

 

తే.గీ.

అవని నుండెను దశరథుఁ డనఁగ రాజు

పుణ్య శీలుఁ డిక్ష్వాక్వగ్ర గణ్యుఁ డనఁగ

భద్ర రథవాజి కుంజర వాహనుండు

కీర్తి మంతుఁడు నిల ధర్మమూర్తి యనఁగ

2.     

 

 

 

తే.గీ.

గుణము లందు రాజర్షులకు నధికుండు

తపము లందు మునులకు సధర్ముఁ డెంచ

బలమున నమరప్రభు సన్నిభము దలంప

చక్రవర్తి కులోద్భవ క్షత్రియుండు

3.     

 

 

 

తే.గీ.

హింస యనఁ గిట్టదు కరుణా హృదయుఁడు మహి

తాత్ముఁ డిక్ష్వాకు వంశ మహా యశుండు

విభుఁడు సత్య పరాక్రమ విలసితుండు

లక్ష్మి వర్ధనుండును శ్రీ విరాజితుండు

4.     

 

 

 

తే.గీ.

రాజ లాంఛన రుచిర విభ్రాజితుండు

సకల విభవ విరాజిత క్షత్రియర్ష

భుండు చతురంత భూ విశ్రుతుండు హర్ష

దుండు ఘనసుఖియు దశరథుండు ఘనుఁడు

5.     

 

 

 

ఆ.వె.

ఆతని ప్రియ పుత్రుఁ డగ్రజుఁడు శశి ని

భ వదనుండు రామభద్రుఁ డనఁగ

వేద విదుఁడు ధరణి విలుకాండ్రులకు నెల్ల

మేటి వాని కేరు సాటి లేరు

6.     

 

 

 

కం.

రక్షితుఁడు స్వధర్మమ్మున

రక్షకుఁడు నిజ జనులకుఁ రంతపుఁ డవనిన్

రక్షకుఁడు జీవ కోటికి

రక్షకుఁ డిల ధర్మమునకు రాముఁడ యెలమిన్

7.     

 

 

 

తే.గీ.

సత్య నిరతుఁడు వృద్ధు దశరథు గురుని

మాట నాచరించి వనపు బాట పట్టె

రాముఁడు నిజాను జార్ధాంగుల సహితమ్ము

వీర వరుఁ డరి వీర విదారకుండు

8.     

 

 

 

ఆ.వె.

కాననమునఁ దమి మృగమ్ముల వేటాడు

వాని చేత మృత్యు బారి వడెను

కామ రూప దైత్య కాయమ్ము వేగంబ

శూర వరులె పోర వార లెల్ల

9.     

 

 

 

తే.గీ.

వధ జనస్థాన మందు విధ్వంసము ఖర

దూషణుల విని కోపము తోడ రావ

ణుండు వంచించి రాముని దండకాట

వి మృగ రూపమున హరించె వేగ సీత

10.    

 

 

 

కం.

వెదకుచు సీత ననిందిత

ను దరలి సుగ్రీవుఁ జేరెను సహానుజుఁడై

సదయుని మిత్రుని వానరుఁ

బదిలమ్ముగ రాముఁ డంత వ్యాకుల మతియై

11.    

 

 

 

ఆ.వె.

బలుఁడు రాఘవుండు పరపురంజయుఁడు ద్రు

టిఁ బరిమార్చి వాలిని బల వంతు

హరుల రాజ్య మెల్ల నల్లన సుగ్రీవు

నకుఁ గపీంద్రునకుఁ దనరఁగ నిచ్చె

12.    

 

 

 

తే.గీ.

హరులు సుగ్రీవు నాజ్ఞ సహస్ర సంఖ్యు

లెల్ల దిశల నన్వేషింప నేఁగఁ గామ

రూప ధారులు సీతను వేపమాన

 చిత్తుఁడౌ రఘువరు తాప ముత్తరింప

13.    

 

 

 

తే.గీ.

వారి లోన నేనొకఁడ సంపాతిఁ గాంచి

వాక్యముల నాలకించి దుష్పార వారి

ధి శతయోజన విస్తీర్ణము శర వేగ

మున విశాలాక్షిఁ గన దాఁటితిని చలమున

14.    

 

 

 

శా.

ఏ రూపమ్మును జెప్పె రాఘవుఁ డహో యీ యింతి యట్లుండఁగా 

నే రంగంచు వచించెఁ దాను గలదే యీ కాంత యా రంగులో

నే రీతిం దను లక్షణమ్ము లనెనో యీ తన్వి కట్లుండఁగా  

నే రామా మణిఁ జూడ వచ్చితినొ తా నీ భామ గా నోపునే

15.    

 

 

 

కం.

ఈ విధి వచనములు వలికి

యా వానర వీరుఁ డంత నాగిన వెన్కం

దా విన వైదేహి మది మ

హా విస్మయము వొడచూపె సానందముగన్

16.    

 

 

 

కం.

సురుచిర చికురమ్ముల నెఱి

కురుల కొనలఁ గేశవృత మగు ముఖం బలరన్

గురు భీరువు జానకి యా

యిరుగుడు వృక్షమ్ము పైకి నీక్షించెఁ దమిన్

17.    

 

 

 

కం.

హరి వచనమ్ములు దా విని

పరికించి దిశోపదిశలు పరమ ముదమునం

బరఁగె నవనిజ నిజ మనము

న రాము సర్వాత్ముఁ గనుచు నలిన దళాక్షున్

18.    

 

 

 

కం.

ఇరుదెసలు పైకిఁ గ్రిందికి

నరయుచు హర్యధిపు మంత్రి నరసెను సుమతిన్

హరి వీరుని మారుతి నా

తరుణాదిత్యుని నిభమ్ము ధరణిజ యంతన్

19.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు ముప్పది యొకటవ సర్గము.

 

 

 

 

సుందర కాండము    

సర్గము 32.

 

                                                         

తే.గీ.

విమల ధవళ వస్త్ర ధరుని విద్యు దావ

లి నిభ పింగళ వర్ణుని ఘన తరు శిఖ

లందు దాఁగిన కపిఁ జలి తాంతరంగ

యాత తానంద విస్మయ సీత గాంచి

1.      

 

 

 

కం.

వినయునిఁ బ్రియ వాక్చాతు

ర్యుని ఫుల్లాశోక సుమ వరోత్కర రుచునిన్

వనచర వరుని జ్వలిత కాం

చన వీక్షణుఁ గాంచి సీత సదమల చిత్తున్

2.     

 

 

 

కం.

తలఁపఁ దొడఁగె మైథిలి మి

క్కిలి విస్మయమున నహో శిఖిచరుని రూప

మ్మల దరి జేర నశక్యం

బిల భీతిదము గన రాని దేరికి ననుచున్

3.     

 

 

 

తే.గీ.

మూర్చిలి యొకింత దేఱి సుముఖ ధరణిజ

దైన్యముగ విలపించెను దలఁచి రామ

లక్ష్మణుల మది మందస్వరమున పలవ

రించుచు వగపు ద్రుంప రా కించు కేని

4.     

 

 

 

కం.

కల యంచుఁ దల్చె మైథిలి

వెలంది సూచి హరి వీరు వినయ విధేయున్

బలవంతుని సాలపు టా

కుల నడుమున నున్న వాని గూఢుని మదిలో

5.     

 

 

 

తే.గీ.

గాలిపట్టిఁ దెలివరుల మేలిమి నెఱి

మేటి నోటి వానిని మేని మెఱపు వాని

కోఁతి గమికాని మాటల చేత కాని

సామవాయికునినిఁ జూచె లేమ సీత

6.     

 

 

 

తే.గీ.

చూచి నంతట నాతని సొమ్మసిల్లె

వీత జీవమ్ము భంగిని వెక్కసముగ

తిరిగి తెలివి చిరమునఁ బొంది జనకసుత

తలఁపఁ జాగె మనమ్మున జలజ నేత్ర

7.     

 

 

 

ఆ.వె.

కాంచితి వికృత ముఖుఁ గపి నిటఁ గల లోన

సమ్మతమ్ము కాదు శాస్త్ర తతికి

క్షేమ మగును గాక రామలక్ష్మణులకు

జనక రాజు నాదు జనకునకును

8.     

 

 

 

మ.

నిదురే లేదన సత్యభాషణములే నిస్సంశయం బెవ్విధిన్

నిదురే లేకయె స్వప్న మే పగిదిఁ గంటిం దల్పఁ జిత్రం బగుం

గదురన్ భీకర శోక దుఃఖములు మేఁ గంపించె ఘోరంబుగం

జెదరెన్ సౌఖ్యము లెల్ల చంద్రముఖు నా సీతేశ దూరమ్మునన్

9.     

 

 

 

తే.గీ.

రామ రామ యన ననవరతము చిత్త

మందుఁ దలఁచి లఁచి యరవింద నేత్రు

వాచ్యములు వలికి పలికి వానిఁ గూర్చి

లు పలుకు లెల్ల వినఁగఁ గనఁగ నేర్తు

10.    

 

 

 

తే.గీ.

భర్త యంద నిల్వంగ భావమ్ము లెల్ల

నన్నిపుడు నొంపఁ దన మీది నర్మిలి కడు

నతని పైనుంచ సంతతము తలపు లవి

యవ్విధమె విన్పడును గందు నవ్విధంబ

11.    

 

 

 

తే.గీ.

మనము నందలి యీప్సిత మనఁ దలంతు

దీనిఁ దర్కింతు నా మదిఁ గాని రూప

హీనము గద వాంఛ సతము వైన మేమి

పలుకు చున్నది యిది సరూపము ననుఁ గని

12.    

 

 

 

తే.గీ.

వందనమ్ము లమర గురు వజ్రులకును

వనజ భవ హుతాశనులకు వందనములు

వాన రోక్తము లన్నియు వమ్ము గాక

నిజ మగును గాక నాకిట నిశ్చయముగ

13.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు ముప్పది రెండవ సర్గము.

 

 

సుందర కాండము   

సర్గము 33.

 

                                                         

మ.

దిగి యా వృక్షము నుండి మారుతి మహా దీప్తప్రవా ళాస్యుఁ డా

మగువన్ భీతను జేరి నమ్రుఁ డయి సమ్మానమ్ముగం జేతులం

దగ శీర్షమ్మున నుంచి మ్రొక్కుచును నిర్దర్పమ్ము తేజోద్ధతుం

డ గిరల్ వల్కెను సౌమ్య సంయుతము దా నక్కాంతతో సీతతో

1.      

 

 

 

తే.గీ.

పద్మదళనేత్ర! సదమల భవ్య చరిత!

మలిన కౌశేయ వస్త్ర! ద్రుమ విట పాశ్రి

త! చెపు మమ్మ! యెవర వీవు తన్వి! చూడ

నీ విధిఁ గలఁత నిట నుండ నేల నమ్మ!

2.     

 

 

 

తే.గీ.

తామరాకుల జంట నుదకము జాఱు

రీతి దుర్భర ఘనశోక జాత భాష్ప

ధార లరయంగ నీదు నేత్రద్వయములఁ

గాఱ నలినాక్షి చెప్పుమ కారణమును

3.     

 

 

 

కం.

సురవర వరాసు రావలి

ని రాక్షసుల నాగ యక్ష నిచయమ్ములనున్

వర గంధర్వోత్కర కి

న్నర భామల నీవెవరవు నలిన దళాక్షీ!

4.     

 

 

 

ఆ.వె.

రుద్ర వంశ భవ తరుణివొ కాదేని మ

రుత్కులాభి జనిత సత్కృపా భ

రిత హృదయవొ వసుకుల తరలాక్షివొ దేవ

తా సతి వని నేను దలఁతు దేవి!

5.     

 

 

 

కం.

తారా చయమున నుత్తమ

తార శశి విహీనమై పతన మైన నభో౽

పార తలము నుండి భువినిఁ

జేరిన రోహిణి వరగుణ సింధు వగుదువో

6.     

 

 

 

తే.గీ.

కోపముననొ  తెలియకయొ కోపము నిజ

పతి వసిష్ఠున కొకయింత పఱచి నట్టి

సతి యరుంధతివి యబల సదమ లాక్షి

కావు గద నీవు కళ్యాణి! కరుణఁ జెపుమ

7.     

 

 

 

తే.గీ.

సుతుఁడ తండ్రియ భ్రాతయ పతియ యెవరిఁ

దలఁచి వగచెద వీ విటఁ దన్వి! చెపుమ

యీ జగమ్మున నుండియ యాజగమున

కేఁగి నట్టి వారిఁ దలంచి వేఁగె దీవు

8.     

 

 

 

తే.గీ.

ఇంతి యియ్యేడ్పు నిట్టూర్పు లిద్ధరా త

లమ్ము దాఁకుట లెల్లను నెమ్మిఁ జూ

దేవ కాంత కాదన్నది తెల్ల మయ్యె

రాచ లాంఛన ధారణఁ దోఁచు నదియ

9.     

 

 

 

కం.

కవళిక లాకారమ్ముల

నవగత మగు భూపవరుని కర్థాంగిగ రా

జ వరాన్వయ కాంత యనఁగ

నువిదా! నా చిత్తమందు నూఱట కల్గన్

10.    

 

 

 

కం.

బలిమి నట జనస్థానము

న లలన! రావణుఁ డపహరణము సేసిన కో

మలి నీవ యైన చెప్పుమ

యిల నగు భద్రమ్ము నీకు నిఁక నే నడుగన్

11.    

 

 

 

కం.

నిక్కముగ నీవ యౌదువు

చక్కఁగ రామ సహధర్మచారిణివి సతీ!

మిక్కిలి దైన్యపు రూపము

నక్కజము నమానుష మరయఁ దపోయుతమున్

12.    

 

 

 

తే.గీ.

రామ కీర్తనముల మది రహి వొడమ హ

నుమ వచనములు చెవిసోఁక ద్రుమ కదంబ

కాశ్రితు మరుత్సుతునిఁ గాంచి యవని జాత

పల్కె వివరించుచు నిజానుభవము లెల్ల

13.    

 

 

 

తే.గీ.

పుడమి రాచసింగముల దిట్టఁడు దనను నె

ఱింగిన తెలివి కలవాఁడు గొంగల కల

యందు సింగము దశరథు నర్మిలి యగు

కోడలిని నే నిచట నుంటి నీడ లేక

14.    

 

 

 

కం.

జనకుని విదేహు పుత్రిక

ననుంగు టిల్లాలి సీత యను బేరున రా

మునకు ఘటికుండు విలుకా

నినిఁ జేకొంటి నొక యాలిని వలచు నతనిన్

15.    

 

 

 

ఆ.వె.

రామ చంద్రు నింట రహి మీఱఁ బండ్రెండు

వత్సరమ్ము లుంటి భర్త తోడ

భోగ భాగ్యములను బూర్ణముగ ననుభ

వించుచుఁ బతిఁ గొల్చి యంచితముగ

16.    

 

 

 

తే.గీ.

అంతటఁ బదుమూడవ వర్ష మందు రాజు

దశరథుండు నిక్ష్వాకు నందనుని రాము

ని నిజమంత్రుల సమ్మతమున ముదమ్ము

న నభిషిక్తుఁ జేయఁగ రాజ్యమునకు నెంచె

17.    

 

 

 

కం.

సాగ నభిషేక కార్యము

లాగక కైకేయి పత్ని రాజవరునకున్

వేఁగి దశరథునిఁ జూచుచు

వేగఁ బలికె రోష తప్త వికృతాననయై

18.    

 

 

 

తే.గీ.

రామునకుఁ బట్టముం గట్ట రాజ్య మెల్ల

నే నహ రహము త్రాగను బోన మింకఁ

దినను నాదు జీవితమునకు నిదియ యగు

నంతమె యవశ్య మనృతము సుంత లేదు

19.    

 

 

 

కం.

ప్రీతిని నీ వాడిన మధు

రాతి మధుర వచనములు నృపాధిప! కన నే

రీతిని వ్యర్థం బగునే

యీ తఱి రాముం డడవికి  నేఁగంగ వలెన్

20.   

 

 

 

.

దార కొసంగి నట్టి వర దానము భావన జేసి యవ్విధిం

గ్రూరము లప్రియమ్ములును గుత్సిత వాక్కులు శ్రోత్ర యుగ్మముం

జేరఁగ నంత సత్య రత శీలుఁడు పంక్తి రథుండు వెల్లనై

శూర వరాగ్ర గణ్యుఁ డల శోకము తోడ విమోహుఁ డయ్యెనే

21.    

 

 

 

ఆ.వె.

వృద్ధుఁ డైన యట్టి పృథ్వీపతి దశర

థుండు సత్య ధర్మ మండితుండు

భృశతరమ్ముగ విలపించి యశస్వంతు

రాము జ్యేష్ట పుత్రు రాజ్య మడిగె

22.   

 

 

 

తే.గీ.

తనదు రాజ్యాభిషేకము తండ్రి మాట

కన్న మిన్న కాదని యెంచి మున్న మాన

సమ్మునఁ బితృవాక్యమ్ముల నిమ్ముగ విని

సమ్మతించెను రాముఁడు సద్యశస్వి

23.   

 

 

 

ఆ.వె.

ఒరుల కీయ నెఱుఁగుఁ బరుల నుండి కొనఁడు

కొంచమైన పలుక నెంచఁ డప్రి

యమ్ము తనదు జీవితార్థము నైనను

సత్య వీర్య రామ చంద్రుఁ డనఁగ

24.   

 

 

 

తే.గీ.

మేటి బైరవాసమ్ములు వీటి నునిచి

వీడి మనసార రాజ్యమ్ము వేద విదుఁడు

రాఘవుండు ఘన యశస్వి మేఘ సన్ని

భాంగుఁ డుండ మనియెఁ దల్లి పాల నన్ను

25.   

 

 

 

కం.

వన గమననై వడిని నా

తని పూర్వమ పయన మైతిఁ దాల్మి ధవునితోఁ

జన నిశ్చయించి నాక మ

యిన రుచియింపదు రమణ రహిత నైన నటన్

26.   

 

 

 

తే.గీ.

అనుసరింప రాముని వల్కలాంబరుఁ డయి

పూర్వమ మహాత్ముఁ డనుజుఁడు పుణ్యమూర్తి

మిత్ర గణ నందనుండు సౌమిత్రి తరలె

సంతసమ్మున శంక యొకింత లేక

27.   

 

 

 

కం.

నరపత్యాదేశము గొని

యురుతర ధృతిఁ జేరితిమి మహోన్నతమును ము

న్నరయని కాననము భయం

కరము బృహద్దుర్గమమ్ము గంభీరమ్మున్

28.   

 

 

 

తే.గీ.

ఉండ దండకా వని యందు నుగ్ర తేజు

రాముని సతిని నేనంత రావణుండు

దుష్ట చేతనుఁ డతనిచే దుస్సహముగ

నపహృత నయి యుంటి నిచట నత్యయమున

29.   

 

 

 

కం.

గడు విచ్చె రెండు నెలల న

తఁడు రావణుఁ డసుర ధవుఁడు దర్పం బెసగం

గడవంగ గడువు విడుతును

దడఁబడక యసువుల నెల్లఁ దప్పక యిచటన్

30.   

 

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు ముప్పది మూడవ సర్గము.

 

 

 

సుందర కాండము   

సర్గముము 34.

 

                                                         

కం.

వగపై వగపులు నిగిడెడు

మగువ వచనములు విని హనుమంతుఁడు సమయిం

పఁగ నెంచి దుఃఖమును మృదు

వగు పల్కుల బదులు వల్కె ననునయ రీతిన్

1.      

 

 

 

ఆ.వె.

రాము నాజ్ఞ వేగ భామ! వచ్చితి దూత

నేను నిన్ను గాంచఁ దాను గుశల

మడిగె నీదు కుశల మతఁడు కాకుత్స్థుఁడు

దేవి! ప్రేమ మీఱ దివిజ నిభుఁడు

2.     

 

 

 

కం.

శ్రుతులను బ్రహ్మాస్త్రమ్ము న

నతులిత కుశలుఁడు వరిష్ఠుఁ డా వేద విదా

తత పండితులకు నెల్ల వ

నితా! యడిగె రఘువరుండు నీదు కుశలమున్

3.     

 

 

 

తే.గీ.

లక్ష్మణుండు తేజోనిధి లలన! నీ ప

తి ప్రియానుచరుండు నతి వినయుండు

శోక తప్తుఁడు శిరసు వంచుచు నమస్క

రించె నీ పదాబ్జములకు నంచితముగ

4.     

 

 

 

తే.గీ.

రఘు వరులు నరసింహులు రామ లక్ష్మ

ణు లుభయుల ప్రీతి జనక కుశలపు వార్త

విని జనక సుత హర్ష వివృత ముఖ సక

లాంగి పలికెఁ గపి వరుఁడౌ హనుమ తోడ

5.     

 

 

 

తే.గీ.

వచ్చు నరులకు హర్షమ్ము వంద యేండ్ల

కైన బ్రతికు కల్గిన నన్న నానుడి నిజ

మయ్యెఁ దలఁపంగ నాయందు నియ్యెడఁ గన

నేర్తు శుభముల నెల్లను నిశ్చయముగ

6.     

 

 

 

ఉ.

ఈ విధి భాషణమ్ము లుదయింపఁగఁ జేసెను స్నేహ భావమున్

వావిరి వారి లోపల నవారిత మంతఁ జెలంగె మాటలుం

లావగు నమ్మకమ్మున ధరాసుత దుఃఖకరంపు సుద్దులం

దా విని మారుతాత్మజుఁడు తప్తుఁడునై దరిఁ జేరు చుండఁగన్

7.     

 

 

 

ఆ.వె.

ఎంత యెంత దరికి నీ హరివచ్చెనో

యంత యంత వింత నవనిజ కను

మాన మెల్లఁ బెరిఁగె మానవతికి భయ

దుఃఖ రాశి వెరిఁగెఁ దోరముగను

8.     

 

 

 

ఆ.వె.

విధిని నేమి యందు వివరించితి కథను

మారు వేష మూని మారుతి యని

వచ్చి నట్టి వాఁడు పాపకర్మ రతుఁడు

రాక్షస గణ విభుఁడు రావణుండ

9.     

 

 

 

కం.

తలఁచి యిటులం గలఁతఁ జెం

ది లతాంగి తరువును వదలి  దీనముగాఁ దా

నిలపైఁ గూలఁబడియె నా

యిలాతనూజ విమలాంగి హీనప్రభలన్

10.    

 

 

 

కం.

భయ విహ్వల దుఃఖార్త సు

నయనను భూపుత్రిఁ గాంచిన హనుమ రామ

ప్రియదూత యెరంగెను సవి

నయం బయినను ధరణిజ గన దతని భీతిన్

11.    

 

 

 

తే.గీ.

వంద నమ్మాచరించుచు నంద యున్న

వానరునిఁ గాంచుచు మధుర స్వరము నందు

సీత చంద్ర సన్నిభ వద నాత తోష్ణ

నిశ్వసనమునఁ బల్కెఁ గనికరముగను

12.    

 

 

 

తే.గీ.

మాయలను వీడు మాయావి! సేయ కింక

నీ కపటపుఁ గృత్యమ్ముల నీవు రావ

ణుండ వైన స్వయమ్ముగ మెండుగ నిట

వగపు నీయఁ  దిరిగి నీకుఁ దగవు గాదు

13.    

 

 

 

కం.

నిజ రూపము వీడి కపట

పు జటిగ వేషము ధరించి మోసమ్మున ము

న్ను జనస్థాన మరసిన ద

నుజుఁడవు రావణుఁడ వీవు నుడువుము నిజమున్

14.    

 

 

 

తే.గీ.

కామ రూపుఁడ వోదశ కంఠ! నన్ను

బాధ పఱతువు నిర్దయఁ బంతమున ని

రంత రోపవాస కృశకు నింతి కింక

వగపు నీయఁ  దిరిగి నీకుఁ దగవు గాదు

15.    

 

 

 

ఆ.వె.

అయిన నాదు శంక యనృతమ్ము గానోపుఁ

బ్రీతి మది జనించె రోత వోయె

నిన్ను జూడ భృశము సున్నితమ్ము లయిన

నీదు పల్కు లెల్ల నేను వినఁగ

16.    

 

 

 

తే.గీ.

రామ దూతవు నీవైన క్షేమ మగును

గాక నీకుఁ బ్రియము రామ కథ లనంగ

నాకు నింపారఁ జెప్పుమ శోక మెల్లఁ

దీఱ హరివరేణ్య యడిగితి ముద మార

17.    

 

 

 

ఆ.వె.

రామ గుణ గణముల శ్రవణము ప్రియ తర

మౌను నాకు నుడువు మయ్య కపివ

రేణ్య! నాదు మది హరించి తీవు జల ర

యమ్ము నద తటమ్ము నడఁచు పగిది

18.    

 

 

 

కం.

తద్దయుఁ బెద్ద తరుణమున

కిద్దను జాపహృత నాకు నివ్విధిఁ గలలో

గ్రద్దన రాముఁడు పంపగ

నిద్దెసఁ గపి కన్పడ సుఖ మేమని చెపుదున్

19.    

 

 

 

కం.

కలయం దైనఁ గనిన రా

మలక్ష్మణుల వీర వరుల మానెద వగపుం

గలకును మత్సర మేలనొ

తెలియఁగ లే నెవ్విధిని విధి వశం బైతిన్

20.   

 

 

 

కం.

కల యని యెంచను దీనినిఁ

గలుగు నశుభములు నగచరుఁ గనినం గలలోఁ

బులకించె హృదయ మిత్తఱి

లలితమ్ముగఁ గాంచ హరిని రాముని దూతన్

21.    

 

 

 

తే.గీ.

తెలివి లేమియ యగునో హృది చపలత్వ

మగునొ యియ్యది మఱి పిచ్చి యగునొ తలఁప

నివ్వికారము కాదేని మృగతృష  యయి

యుండ నోపునో తెలియ రాకుండ నుండె

22.   

 

 

 

తే.గీ.

వెఱ్ఱి లక్షణమ్ములు గాని వెఱ్ఱి గాని

మూర్ఛ గాని కానేరదు ముందు నున్న

వానరుని నన్ను నింపుగ నేను నిక్కు

వముగ గుర్తించు చున్నదాన ముదముగను

23.   

 

 

 

కం.

ఈ రీతి బహు విధమ్ముల

నారసి తర్కించి మది బలాబలముల భా

మా రత్న మెంచెఁ గా మా

కార గుణుం డగుట నతనిఁ గౌణప పతిగన్  

24.   

 

 

 

కం.

తలఁ పుంచి యివ్విధి కృశాం

గి లలన సీతా సతి యికఁ గించిద్వచన

మ్ములు వానర ముఖ్యుని తోఁ

బలుకక మౌనముగ నుండెఁ బరమాతురతన్

25.   

 

 

 

ఆ.వె.

బహు విచార మగ్న వసుధాత్మజను గాంచి

హనుమ దివ్య మారు తాత్మజుండు

వీను లలరు నుడులఁ బ్రీతి జనింపఁగ

సీత కంతఁ బల్కె శీఘ్రముగను

26.   

 

 

 

ఉ.

తేజము నందు భాస్కరుఁడు దీటు విలాసికి మోద మీయ నీ

భూజన సంచయమ్మునకు భూపతి దేవ కుబేర సన్నిభుం

డీ జగ దుత్కరమ్మునకు నిద్ధ పరాక్రమ మందు విష్ణువే

రాజిత కీర్తి చంద్రికల రాఘవుఁ డెక్కుడు ముజ్జగమ్ములన్

27.   

 

 

 

చం.

నిజమునె పల్కుఁ దా సముఁడు నిర్జర వాగ్మికిఁ దీపి పల్కులన్

సుజనుఁడు భాగ్యవంతుఁడును సుందర రూపుఁడు శ్రీయుతుండు నం

గజ నిభ మూర్తి మంతుఁడు సకాల సురోష ధరుండు దండుఁ డీ

త్రిజగము లందు నెంచఁగ రథిప్రవరాగ్ర వరేణ్య ముఖ్యుఁడున్

28.   

 

 

 

కం.

ఆతత బాహు యుగళ సమ

వేత శరణ గత జన నుత వికసిత వదనుం

డీతని ఘన మహిమం బే

రీతిం గొని యాడఁ దరము లెస్సగ నిచటన్

29.   

 

 

 

ఆ.వె.

జింక మఱుఁగు పఱుప నింక రాము నుటజ

తలము నుండి యేకతమున నున్న

నీ వపహృత వైతి నెలఁతుక! తత్ఫల

మనుభవించు రావణు నరయుదువు

30.   

 

 

 

తే.గీ.

రావణు నచిరమున సమరమ్ము నందు

రోష ముక్తజ్వలద్బాణ రుద్ధ కాయుఁ

జేసి వధియించు వీరుని చేతఁ బంపఁ

బడితి నతఁడె కుందుచు సేమ మడిగె నిన్ను

31.    

 

 

 

తే.గీ.

ప్రబల భుజ సుమిత్రానంద వర్ధనుండు

లక్ష్మణుండు మహా వీర్య లక్షణుండు

వందనం బాచరించియు భక్తి నడిగె

నీదు కుశలమ్ము కుములుచు నెగులు తోడ

32.   

 

 

 

ఆ.వె.

సుభగుఁ డురు సఖుండు సుగ్రీవ నాముఁడు

హరి గణప్రవర వరాధి నేత

రామచంద్రునకును భామ యాతఁ డడిగె

నీ యనామయమ్ము నెమ్మి యెల్ల

33.   

 

 

 

కం.

తలఁచును నిత్యము రాముం

డు లక్ష్మణుండును హరివిభుఁడు ననునయింపం

గ లలన! భాగ్యమ  దనుజ వ

రుల బారిం గల వసువులు రుచిరము నీకున్

34.   

 

 

 

కం.

అచిరమ్మున నరయ గలవు

రుచి రానను రాము వానరు లనేకులు కొ

ల్చుచు నుండ రవిజుఁ డనుజుం

డు చరింప నిరుదెసల ఘనుఁడు కదియ నిన్నున్

35.   

 

 

 

కం.

సుగ్రీవ మంత్రి హనుమ ను

దగ్ర జలధి దాఁటి లంక దర్శించుచు నీ

యగ్రమ్మున నిల్చితిని స

మగ్రము శోధించి యేను మారుతి నమ్మా!

36.   

 

 

 

తే.గీ.

రావణు దురాత్ము శిరమునఁ జేవఁ గాలు

మోపి విక్రమమ్మును నమ్మి రూప మించు

క యొనరించి వెదకి లంకఁ గనఁగ నిన్ను

బంత మూని వచ్చితి నేను వాయుజుండ

37.   

 

 

 

తే.గీ.

శంక లెల్లను వీడుమ యింక దేవి!

నాదు మాటలు నిజములు నమ్ము మమ్మ!

రామ దూతగ వచ్చితి లేమ! వినుమ

నేను నీ తలఁచిన యట్టి వానిఁ గాను

38.   

 

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు ముప్పది నాల్గవ సర్గము.

 

 

సుందర కాండము

సర్గము 35.

 

                                                         

 

తే.గీ.

సీత విని రామ కథ హరిశేఖ రేరి

తమ్ము సాంత్వ భాషణముల సమ్మదమ్ము

సెలఁగ మధురమ్ముగఁ బలికెఁ జెంత నున్న

మారుతాత్మజుఁ గాంచి విమల చరిత్ర

1.      

 

 

 

తే.గీ.

ఎక్క డరసితి రాముని నిన కులేశు

నెట్లు సౌమిత్రి లక్ష్మణు నెఱుఁగుదు వట

యెవ్విధి నర వానర సంగ మేర్పడె వన

మందు నేర్పడఁ జెప్పుమ హరివరేణ్య!

2.     

 

 

 

తే.గీ.

ఎట్టి లక్షణములఁ జూచి తీవు రామ

లక్ష్మణుల యందుఁ జెప్పుమ సూక్ష్మముగను

మఱల వానర పుంగవ! మారు తాత్మ

జ! విన శోకము వోవును సత్వరమ్ము

3.     

 

 

 

ఆ.వె.

అంద చందము లవి హనుమ వర్ణింపుమ

రామ లక్ష్మణులవి రాగ మలర

నూరు బాహువులు యథోచితమ్ముగఁ జెప్పు

మయ్య యుండు రీతి యయ్యిరువుర

4.     

 

 

 

కం.

వైదేహి పలుక నివ్విధిఁ

దాఁ దెల్లముగ విని వాయు తనయుండు ఘనుం

డా దశర థాత్మ జాకృతి

నాదర మొప్పఁ దెలుపంగ నారంభించెన్

5.     

 

 

 

కం.

అవనిజ! కమల దళ నయన!

వివరము లెఱిఁగియు నడిగితి వివరింప ననున్

రవి కుల జలనిధి శశధరు

ల వర తను గుణముల నుచిత లలిత ఫణితులన్

6.     

 

 

 

ఆ.వె.

ఏ గుఱుతు లలరునొ యీ రాము నందును

లక్షణమ్ము లేవి లక్ష్మి వర్ధ

నుండు నయిన లక్ష్మణోత్తమ దేహమ్ము    

నందుఁ దెలిపెద విను మిందు వదన!

7.     

 

 

 

ఉ.

తామర సాంబకుండు వసుధా జన సత్త్వ మనోహరుండు నీ

రాముఁడు రూప నైపుణ విరాజిత కాయ సముద్భవుండు తే

జోమయ దేహ ధామముల సూర్య నిభుండు క్షమా గుణంబునన్

భూమి సముండు గీష్పతియ బుద్ధుల నింద్రుఁడు కీర్తి నెంచగన్

8.     

 

 

 

కం.

రక్షించును లోకమ్ములు

రక్షించును స్వీయ జనుల రాగం బలరన్

రక్షించును నిజ వృత్తము

రక్షించును ధర్మమును బరజన దమనుఁడే

9.     

 

 

 

కం.

కాపాడు నాలుగు కులము

లో పంకజ నయన! రాముఁ డుర్విని నెమ్మిన్

రూపించు వర్తనమ్ముల

నీ పృథ్వీ జనులకు వెలయించును వానిన్

10.    

 

 

 

తే.గీ.

భూరి కాంతిమంతుఁడు జన పూజితుండు

నింద్రియ సునిగ్రహుండు మునీంద్ర సజ్జ

నోపకారజ్ఞుఁడు క్రియా కలాప విస్త

రణ ధురీణుండు రాముఁడు రఘువరుండు

11.    

 

 

 

తే.గీ.

క్షితి విభుఁడు రాజ విద్యల శిక్షితుండు

బ్రాహ్మణ గణ భక్తుఁడు శీలవంతుఁడు నిగ

మ విదుఁడు వినీతుఁడు రిపు దమనుఁడు ఘనుఁడు

రవి కులాబ్ధి శశాంకుఁడు రాముఁ డరయ

12.    

 

 

 

తే.గీ.

వేద పండిత పూజిత వేద సకల

శాస్త్ర వేదాంగ నిష్ణాత సచ్ఛరితుఁడు

వర యజుర్వేద శిక్షిత నరవ రాధి

పుఁడు ధనుర్వేద విజ్ఞత నడరు నతఁడు

13.    

 

 

 

తే.గీ.

నిడుద మూపు లెఱ్ఱ కనులు పొడవు చేతు

లు వలమురి మెడయు మెఱయు శివపు ముఖము

మఱుఁగు టెముకలు మనుజుల మంచి వాని

గఁ గడు పేరున్నవాఁడు పంకజ దళాక్షి!  

14.    

 

 

 

తే.గీ.

బేరిఁ బోలు కంఠధ్వని విక్రముండు

మెఱుగు గూడిన నల్లని మేని వాఁడు

పొందికగ నమరిన యంగములఁ దనరెడి

వాఁడు చూడఁ జక్కని వాఁడు వామనయన!

15.    

 

 

 

తే.గీ.

స్తిరము లతి దీర్ఘములు సమోచితము లున్న

తము లరుణములు కాంతి మంతములు పల్ల

ము లవి మూడు మూఁడన్నియు ముగ్ధ మోహ

నాంగముల యందు రామున కబ్జ నయన!

16.    

 

 

 

తే.గీ.

మడతలు సుడులు లోతులు నడరు మూడి

ట వెడ యైన తలములు పొడవది మూర

లు సమ పరిమాణములు గీతలు మఱి చార

లు గన నాల్గు నాల్గు దనరు లోలనేత్ర!

17.    

 

 

 

తే.గీ.

సమపు పదునాల్గు జతలు దంష్ట్రములు నాల్గు

నడక రీతులు నాలుగు నాసి కోష్ఠ

హనువు లతి రుచిరమ్ములు నైదు మృదువు

లైనవియు నెనిమిది లేమ! యాతతములు

18.    

 

 

 

తే.గీ.

పద్మములు పది మహతులు పదియ మూటి

ని యశుఁడు తెలుపు రెంటిని నీరు తొమ్మి

దిటిని నారిటి నుచ్చము పటు తరముగ

విస్తరించు మూటిని రఘు వీరుఁ డతివ!

19.    

 

 

 

తే.గీ.

నిజము నేయము లంద తనివి చెలంగుఁ

జేకొనుట నిచ్చుటలఁ దమి సాఁకు చుండు

తావు తరుణములం దగు చేవ నుండు

మానిసులఁ దీపి మాటల మరులు కొలుపు

20.   

 

 

 

ఆ.వె.

రూపమున గుణముల నోపు రామున కను

రాగ మందు గూడ భ్రాత లక్ష్మ

ణుండు లక్ష్మి వర్ధనుండు సుమిత్రా సు

తుఁడు ఘనుఁ డపరాజితుండు దేవి!

21.    

 

 

 

కం.

వెదకుచుఁ బృథ్వీతల మ

న్నదమ్ములు నరర్షభులు వనమ్మున మమ్ముం

బదిలమ్ముగం గలిసిరి యు

విదా! నిను గను తమకమున వేదన తోడన్

22.   

 

 

 

చం.

తిరుగుచు భూమి నిన్నరయ దీన మనస్కులు రామలక్ష్మణుల్

వరకపి నాథుఁ గంటి రట భ్రాతృ విసర్జితు ఋష్యమూక భూ

ధర సహవృక్షషండమున ధైర్యము వూనిన వాలి తర్జితుం

గర మను రక్తి సూర్యజు సుకంఠుని నార్తుని ప్రీతి దర్శనున్

23.   

 

 

 

కం.

మేమును సేవింతు మతని

నా మర్కట సంఘ నాథు నా సుగ్రీవున్

భీమాగ్రజ నిజ రాజ్య స

భామా నిర్వాసి తార్తు వాస్తవ రతునిన్

24.   

 

 

 

కం.

విలు కాండ్రను బురుషవ్యా

ఘ్రులఁ జూచి కపి వృషభుండు ఘోర భయమునన్

మల కొనల నుండి యెగిరెను

దలచుచు రాఁ దగెడి యాపద మదిని భామా!

25.   

 

 

 

కం.

ఆ శిఖరం బంద నిలిచి

తా శంకించి నను వారి తలపెఱుఁగఁగ సం

కాశ మనిపె సత్వర మా

వేశము మదిఁ బెనగొనంగ వింతగ నంతన్

26.   

 

 

 

తే.గీ.

ప్రభువులు పురుష సింహులు రమ్య తర శ

రీర లక్షణుల కృతాంజలి దరిఁ జేరి

తిని హరీశ్వరు సుగ్రీవు మినుకులు విని

వారి వివరమ్ము లరయంగ వామనయన!

27.   

 

 

 

తే.గీ.

ఉన్న విషయమ్ము నెల్లయు విన్నవింపఁ

బడిన వారు ప్రీతి జనింపఁ బడిన వారు

నా పయిన నుభయులు వడి నాదు వీపు

న ననువుగ నుండఁ దేఁ బడిరి నగమునకు

28.   

 

 

 

తే.గీ.

నుడువ సుగ్రీవునకు వారి నొడువు లెల్ల

నర కపీంద్రుల నడుమఁ దనర పరస్ప

ర మృదు భాషణములు మధురముగ నంతఁ

బ్రీతి జనియించె నద్భుత రీతి నతివ!

29.   

 

 

 

తే.గీ.

రామ సుగ్రీవులు వరాభిరామ రాగ

కలిత చిత్తులు నిజ పూర్వ కథలు వినఁగ

నొండొరుల నూఱడించిరి యుచిత రీతి

నమ్మకమ్మది పెరిఁగెను సమ్మతముగ

30.   

 

 

 

ఆ.వె.

అతివ కోస మన్నయైన వాలి మహా బ

లుని వలన బలిమి వెలువఱుపఁ బడి

వగచు వాని గారవమ్మున లాలించె

లక్ష్మణాగ్రజుండు రమ్యముగను

31.    

 

 

 

ఆ.వె.

నీ కనఁ బడమి వలని వగపునఁ గుములు

వాఁడును నలవోక పనుల వాని

రాముని వెత లెల్ల లక్ష్మణుండు నుడివె

వాన రాధిపునకు వామనయన!

32.   

 

 

 

కం.

విని సౌమిత్రి వచనములు

మన మెరియంగ ప్రభ లెల్ల మాసెఁ దనువునన్

ఘనుఁ డగు సుగ్రీవునకు గ్ర

హ నిగ్రహ దినకరు భంగి నాక్రోశమునన్

33.   

 

 

 

మ.

దనుజుం డెత్తుకు పోవు నప్పు డిలఁ బాతంబైన త్వద్గాత్ర మం

డన పుంజమ్ములు రాఘవేంద్రునకుఁ గొండాటమ్ము గల్గింపఁగాన్

ఘనుఁ డీ వానర యూధ నాయకుఁడు సత్కర్ముండు సూపించె నా

వనితా రత్నపు జాడ నేరనని తా వాక్రుచ్చె సుగ్రీవుఁడే

34.   

 

 

 

ఆ.వె.

ఆభరణములు గని యయ్యె రాముఁడు విమో

హితుఁడు ధరణిఁ జెదర నెల్ల నగలు

రవము లెసఁగి నేన రాముని కొసఁగితి

నేఱి వాని నెల్ల నిందు వదన!

35.   

 

 

 

కం.

నీ యీ యందంపు నగలు

వే యంకమున నునిచి బహు విధముల దేవా

మ్నాయ నిభ రాఘవుఁడు దయ

నీయముగఁ దపించె నంత నీరజ నేత్రా!

36.   

 

 

 

ఆ.వె.

వానిఁ జూచు నేడ్చు వాలు మఱల మఱ

ల నవియు రగిలించు రఘు వరేణ్యు

శోకపు టనలమ్ము సుదతి! మిక్కుటముగ

వెఱ్ఱి వాని భంగి వికలుఁ డగును

37.   

 

 

 

ఆ.వె.

అలమట సుడిగొని మహాత్ముఁడు రాముఁడు

పృధ్విఁ గూలి యుండఁ బెద్ద తడవు

ననునయ వచనముల నతనిని లేపితి

నేను సంకటమున దీను నతివ!

38.   

 

 

 

కం.

చూచుచుఁ బలుమఱు తొడవుల

నా చిన తమ్ముండు నుండ నచ్చట నెదుటన్

వే చూపుచుం గపీశుం

జూచి తిరిగి యిచ్చె వానిఁ జోద్యము మీఱన్

39.   

 

 

 

ఆ.వె.

నిప్పు కొండ వోలె నిత్యము మండును

నిన్నుఁ జూడ రామి నెలఁత! యుండ

లేక రాఘవుండు శోకాగ్ని తప్తుఁడై

యున్న వాఁడు మేను వన్నె తఱిఁగి

40.   

 

 

 

ఆ.వె.

అగ్గి కొలిమి పగిది మగ్గు చుండెఁ గునుకు

లేక నిన్ను గాన లేక శోక

మెల్ల నిండఁ దలఁపు లెల్ల వేఁప మది మ

హాత్ముఁ డా రఘు వరుఁ డలమటించు

41.    

 

 

 

కం.

వర రఘు కులాబ్ధి సోముఁడు

కరము వణఁకఁ దొడఁగె నిన్ను గానక యెచటన్

గిరి శృంగమ్ములు కంపిం

చు రీతి భూకంపమునను జోద్యము సూడన్

42.   

 

 

 

కం.

విహరింపఁగఁ గాననముల

బహు రమ్యముల సెలయేటి వరుసల నదులన్

రహి రామున కించుక రా

దు హృదయమునఁ జూడమి నిను దోయజ నేత్రా!

43.   

 

 

 

కం.

వధియించి రావ ణాసురు

విధి వశగతు బంధు మిత్ర వితతి సహిత మే

విధి యైన నిన్ను బొందు వ

సుధా తనయ! రఘువరుండు సురుచిర వదనా!

44.   

 

 

 

కం.

కలిసి రఘునాథ సుగ్రీ

వు లిరువురునుబోర వాలిఁ బొలియించుటకుం

బలు దిక్కుల నిను వెదకుట

కిలా తనూజ సమయమ్ము నేర్పఱచి రటన్

45.   

 

 

 

తే.గీ.

అంత రాకుమారులు వీరు లా హరీశు

తోడ కిష్కింధ కరుగ జిద్దునను వాలి

యపుడు ఘోరముగ నిహతుం డయ్యె రామ

భద్రుని వలన నేకైక బాణమునను

46.   

 

 

 

కం.

వడి నట్లు చంపి వాలిని

నడరి యథోక్తము నభేద్య హర్యృక్ష గణం

బొడఁగూడ నధీశునిగ నె

గడ సుగ్రీవు నొనరించెఁ గాకుత్స్థుండే

47.   

 

 

 

తే.గీ.

ఈ విధిఁ గలిగె నైక్యపు భావ మంత

రామ సుగ్రీవులకు నన్నరయుము మారు

తి హనుమానుని నే వచ్చితి నిటు వారి

దూత నై వెదకుచు నిన్నుఁ దోయజాక్షి!

48.   

 

 

 

కం.

నిజ రాజ్యము వడసి ఋతా

త్మజుఁ డా సుగ్రీవుఁడు బల దర్పులు హరులన్

గజ నిభుల దశ దిశలు భూ

మిజ! నిను వెదకంగఁ బంపె మేదిని నెల్లన్

49.   

 

 

 

తే.గీ.

వాన రేంద్రు మహాబలు నానతి హిమ

శైల నిభ కాయులు హరులు సర్వ దేశ

ములు సుశోధింప నుత్సాహ మునఁ దరలిరి

వేల వేల సంఖ్యులు దేవి! వేగముగను

50.   

 

 

 

కం.

సుగ్రీవ వచన రత హ

ర్యగ్ర వరేణ్యులము మేము నవనీ భాగ

మ్ము గ్రుమ్మరు చుంటి మిఁక స

మగ్రము శోధించుచు నిను నవనిజ! నెమ్మిన్

51.    

 

 

 

ఆ.వె.

అంగ దాభిధానుఁ డతి భాగ్యవంతుఁడు

వాలి నందనుండు బల్లిదుండు

వాహినీ త్రి భాగ బల సహితమ్ము మ

హా కపి వెడలె నిను నరయ నతివ!

52.   

 

 

 

ఆ.వె.

వారి యందు మేము పర్వత రాజము

వింధ్య దాపుల గతి విధ మెఱుంగ

లేక మునుఁగ భృశము శోక జలధి నంతఁ

గడఁచె రే పవళ్లు కాంత పెక్కు

53.   

 

 

 

తే.గీ.

ఆశ లడుగంట పని యందు నార్తిఁ జెంది

కాలపు టవధి దాటంగఁ గలఁతఁ జెంది

వానరేంద్రుఁడు సుగ్రీవు భయము వలన

ప్రాణములను విడువ సిద్ధపడితి మింక

54.   

 

 

 

తే.గీ.

వెదకి వన దుర్గము లగములు దరులు సెల

యేరులు భవత్పదము లవి యేరుఁ గాంచ

లేక యసువులు విడువంగ నీ కపి గణ

మంత నిశ్చయించె నతివ! వంత సెంది

55.   

 

 

 

ఉ.

వానర వీరు లందఱను బ్రాణ విసర్జన సక్త చిత్తులం

గానఁగ నంగదుండు గడుఁ గంది మనమ్మున నుమ్మలంపు సం

ద్రాన మునింగె నీ హరణ దారుణ వృత్తము వాలి హత్యయున్

దీన జటాయు నాశము గతించు కపివ్రజ చింతఁ బల్కుచున్

56.   

 

 

 

ఆ.వె.

అట్టి మేము స్వామి యాదేశ భయ కంపి

తులము కృత మరణ రతులము నాశ

వీడ నంత వచ్చె విహగ రాజ మొకటి

కార్య సిద్ధి మాకుఁ గలుగుట కన

57.   

 

 

 

ఆ.వె.

తమ్ముఁ డౌ జటాయు ధరణి పాతము విని

గృధ్ర రా ట్టట నులికి పడి భీత

చలిత హృదయుఁ డౌచు సంపాతి యడిగెఁ గో

పమ్మున నెలుఁ గెత్తి మమ్ము నంత

58.   

 

 

 

కం.

ఎవరి వలన హతుఁ డయ్యె మ

దవరజుఁ డెచట మరణించె హరి సత్తములా

ర పలుకుఁడు వివరముగ వినఁ

గ వలయు నంచు నడిగె విహగ వరేణ్యుఁ డొగిన్

59.   

 

 

 

తే.గీ.

అంగదుండు నుడువ రావణాసురుఁ డొన

రించిన మహావధను నీ గుఱించి క్రూర

తను జనస్థానమున యథా తథము సకల

మంత సంపాతికి జటాయు నగ్రజునకు

60.   

 

 

 

కం.

అనుజుని మృతి విని యరుణిని

తనయుం డతిదుఃఖితుఁ డయి తరుణీ మణి! నీ

యునికి దశకంఠు నిలయం

బున నుంటఁ దెలిపె ముదంబు ముప్పిరిగొనఁగన్

61.    

 

 

 

తే.గీ.

ప్రీతి సంజనకములు సంపాతి పల్కు

లు విని యంగ దాది కపి వరులము హర్ష

భరిత చిత్తులమై వడి బయలు దేరి

వింధ్య వీడి చేరితి మబ్ధి వేల లీల

62.   

 

 

 

తే.గీ.

సాగ రోత్తర తీరము వేగఁ జేరి

నీదు దర్శ నోత్సాహమ్ము నెగడ మదిని

వానరవ్రాత మానంద వార్ధి మునిఁగి

తృప్తిఁ జెందెను మిక్కిలి తీఁగబోఁడి!

63.   

 

 

 

కం.

వాలి సుతాది హరి వరే

ణ్యాలి పయోరాశి నంత నరయఁగఁ బున రా

భీలవ్యధాకలితమై

వేలాశ్రిత మయ్యె నిన్ను వీక్షించు తమిన్

64.   

 

 

 

కం.

దూరము చేసి భయము కపి

వీరులకు నిరాశులకును వెస నీ పారా

వారము శతయోజన వి

స్తారమ్మును నేఁ దరించి దామరసాక్షీ!

65.   

 

 

 

తే.గీ.

చేరితి నసు రావృత లంక ఘోర రాత్రి

చూచితి నిసిని రావణాసురుని నంతఁ

గంటి నిన్ను నిచ్చోట శోక జలధి మునిఁ

గి విలపించుచు నుండఁగ నవని జాత!

66.   

 

 

 

కం.

ఇది యెల్లయు జరిగిన య

ట్టిది నే నుడివితిని రాచఠీవి వెలుఁగు నా

విదితాత్ముఁడు దశరథ సూ

ను దూతను బలుకుము దేవి! నోరారంగన్

67.   

 

 

 

తే.గీ.

రాముని పని చేయుటకును రమణి నీదు

కతమునన వచ్చితి నిటకుఁ గాంతుఁడు హరి

సైన్యమునకు సుగ్రీవుఁడు సచివుఁడ నత

నికిఁ బవన సుతునిగ నెంచు నీరజాక్షి!

68.   

 

 

 

కం.

కుశలము నీ రాముఁడు సక

ల శస్త్ర ధరులకు వరుండు లక్ష్మణుఁడు దృ ఢా

నిశ గురు సేవా నిరతుఁడు

కుశలమ్ముగ నున్న వాఁడు కువలయ నయనా!

69.   

 

 

 

తే.గీ.

నీదు భర్త వీర వరుని మోద కరపు

హితము సేయ నేతెంచితి నింతి యొంట

రిగను సుగ్రీవు నానతిఁ దగ వహించి

యౌదల నతి రయమ్ముగ నబ్జ వదన!

70.   

 

 

 

ఆ.వె.

నీ యునికిని వేగ నేరు తమకమున

నేను గోరు నట్టి మేను నూన

నేర్పునఁ జరియించి యోర్పున దక్షిణ

దిక్కు సేరితి ధృతి నక్కజముగ

71.    

 

 

 

ఆ.వె.

హరి వరేణ్యులకు భవాపహరణజ సు

శోక తప్తులకు నశోక వనము

నందు నీదు నునికి నందఱకుఁ దెలుపు

భాగ్య మబ్బె నాకు వగపు మాపి

72.   

 

 

 

కం.

మున్నీరు దాఁటి వచ్చుట

యెన్నఁగ నది వమ్ము కాదు హృద్యముగ నినుం

గన్న మహా యశ మది నా

కున్నతి నీయంగ నబ్బెఁ గువలయ నేత్రా!

73.   

 

 

 

కం.

రావణు సమిత్ర బాంధవ

దేవారి గణమ్ముఁ జంపి దేవీ! నిన్నుం

దా వీర వరుఁడు సేరును

భూవరుఁ డా రఘు వరుండు భూపుత్రి! వడిన్

74.   

 

 

 

తే.గీ.

ఉర్వి మాల్యవంతం బను పర్వతమ్ము

కలదు కేసరి నామ శాఖా చరుండు

వెడలె గోకర్ణ మనెడు పృథ్వీధరమ్ము

మాల్యవంతమ్ము నుండి యమల చరితుఁడు

75.   

 

 

 

తే.గీ.

అతడు నాదు తండ్రి సురర్షు లానతి గొని

కపి వరేణ్యుఁడు బల మూని కడలి తీర

పుణ్య తీర్థము నందు నగణ్య బల స

మున్నతుని శంబసాదను నుత్తరించె

76.   

 

 

 

తే.గీ.

అక్కపిక్షేత్రమున మరుదంశమున జ

నించితిని హనుమంతుఁ డని జగ మందు

ఖ్యాతి నొందితి నిజ కర్మ కాయమునను

నాదు చరితమ్ము దేవి! నివేదితమ్ము

77.   

 

 

 

ఆ.వె.

నమ్మకమ్ము నీయ నమ్మరొ చెప్పితి

నీదు భర్త సుగుణ నిచయ మెల్ల

వచ్చి రాముఁ డతివ భద్రరీతిని నిన్న

చిరమునఁ గొనిపోవు కరము ప్రీతి

78.   

 

 

 

తే.గీ.

ఈ విధి నుదాహరణ కార ణేత రాంక

ముల నుడువ సీత ఘన శోకమూర్తి యంత

వాని వానరశ్రేష్ఠుని వారిజాక్షి

నమ్మె రామదూత యనుచు నెమ్మనమున

79.   

 

 

 

ఆ.వె.

కరము సంతసించి కన్నుల నెఱి కను

నెఱులు వెలుఁగ ముదపు నీరు రాల్చె

చారు వదన మంత సద్విలసిత మయ్యె

రాహు ముక్త రాత్రి రాజు వోలె

80.   

 

 

 

ఆ.వె.

ఆమె హనుమ కపియ యన్యుఁ డనఁగ రాద

ని తలఁచుట మనమున నిశ్చయించి

వాయునందనుం డవనిజ నా ప్రియదర్శ

నను గని తిరిగి పలికెను ముదమున

81.    

 

 

 

కం.

చెప్పితి నెల్లయు మైథిలి!

యిప్పుడు నే నేమి సేయ నింపగు నీకుం

జెప్పుము శాంతినిఁ బొందుమ

యిప్పురమును నింక వీడి యేఁగెద దేవీ!

82.   

 

 

 

ఆ.వె.

మునుల యానతి నసురుని శంబసాదను

జంపి నట్టి వాని సత్సుతుండ

ననిల నందనుండ నవనిజ రయమున

సత్వమునను వాయు సముఁడ నెంచ

83.   

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు ముప్పది యేనవ సర్గము.

 

సుందర కాండము

సర్గము 36.

 

                                                         

కం.

హనుమంతుఁడు తేజస్వి ప

వనాత్మజుఁడు జానకి మదిఁ బడ నమ్మకమే

వినయముగఁ బల్కె వాక్యము

లను దిరిగి ముద జనకమ్ముల నతిప్రీతిన్

1.      

 

 

 

కం.

దేవీ రాముని దూతను

నే వానరుఁడను రఘు వరుని వరోర్మిక నా

మావృత భాసిత మిది సు

మ్మీ వీక్షింపుమ ముద మగు నింపుగ రమణీ

2.     

 

 

 

తే.గీ.

నమ్మకము నీకుఁ గల్గఁగ నమ్మహాత్ముఁ

డీయఁ దెచ్చితి నీ కొఱ కింతి దీని

నుచిత భద్ర మగును గాక యూఱడిల్లు

తల్లి దుఃఖ మెల్లయుఁ బోవుఁ దథ్య మిదియ

3.     

 

 

 

కం.

చూచుచుఁ గైకొనె నుత్పల

లోచన యా యుంగరము విలోకించి పతిం

జూచిన రీతి నవనిజకుఁ

దోఁచిన హర్ష ముదయించెఁ దోరముగ మదిన్

4.     

 

 

 

ఆ.వె.

అతి విశాలపుఁ గను లలర ధవళ తామ్ర

లోచ నాంతముల వెలుంగు నామె

సుందర తర వదన శోభ లినుమడించె

రాహు ముక్త శీతరశ్మి వోలె

5.     

 

 

 

తే.గీ.

మగని గూర్చి కబుర్లు వినఁగఁ గరమ్ము

సంతసించి తృప్తిల్లి ప్రశంసలు కపి

వరుని ప్రియ మొనరించిన వాని పైన

బిడియపడి కురిపించెను బడఁతి సీత

6.     

 

 

 

తే.గీ.

వాన రోత్తమ కడు శౌర్యవంతుఁడవు స

మర్థుఁడవు ధీ నిధివి నీవు మాననీయ

యీ దనుజ గణ నిలయము నేకతమున

ధీరతం బ్రవేశించితి తేజ మలర

7.     

 

 

 

ఆ.వె.

వంద యోజనముల వారిధి మకరాల

యమ్మును నవలీల నధిగమించి

గోష్పదముగ నీవు ఘోరార్ణవముఁ జేసి

తివి పొగడఁ దగు పగిది హరి వీర!

8.     

 

 

 

కం.

నిను నల్ప కపిగ నెంచ మ

దిని వానర కుంజర! యిది తెల్లము దశకం

ఠుని వలని భయము కలవర

మును నీ మది నెంత మాత్రమును లేవు సుమీ

9.     

 

 

 

కం.

విది తాత్ముఁడు రాముఁడు స

మ్మదమునఁ బంపిన యెడల విమల చరిత! నినుం

బదిలమ్ముగ నర్హుండ వ

గుదు విచ్చట భాషణములకును నాతోడన్

10.    

 

 

 

కం.

పరిశీలింపక బలమును

దురతిక్రమ రాముఁడుఁ తనదు సతి సమీప

మ్మరయ ననుప నేరఁడు మది

పరాక్రమ మెఱుఁగక యెట్టి వారిని నైనన్

11.    

 

 

 

ఆ.వె.

భాగ్య వశమున రఘువరుఁడు రాముఁడు సత్య                               

సంగరుండు ధర్మ చరుఁ డతి కుశ

లమ్ము లక్ష్మణుం డరయ సుమిత్రానంద

వర్ధనుండు నుండె భద్ర రీతి

12.    

 

 

 

తే.గీ.

ప్రళయ కాలజ్వలన సన్నిభమ్ము నేల

సాగ రావృత మేదినీ సకల దేశ

ముల మహాకోప మూని రాముండు కుశలుఁ

డైన మఱి కాల్ప నొల్లఁడొ యరయ రాదు

13.    

 

 

 

తే.గీ.

దేవ దానవ నిగ్రహ దేహ దార్ఢ్య

తేజ మలరు వారైన మదీయ శోక

ము లవి యెల్ల నంత విహీనము లని తలఁతు

నేను మన మందు నిప్పుడు వానరేంద్ర!

14.    

 

 

 

ఆ.వె.

దుఃఖ మొంద లేదె తోరమ్ము రాముండు

పరితపింప లేదె పార్థివుండు

నుచిత కార్య గతుల నుండ భావింపఁడె

పురుష సత్తముండు కరుణ తోడ

15.    

 

 

 

తే.గీ.

కాదు గద దీనుఁ డినకుల కాంతుఁ డిపుడు

కాదు గద భ్రాంత చిత్తుఁడు కలఁతఁ జెంది

పురుష కార్య చయముల నలరి నిమగ్నుఁ

డౌను గద నృపతి తనయుఁ డార్తి తోడ

16.    

 

 

 

తే.గీ.

తలఁచునె యుపాయములు రెండు తగ నుపాయ

ము లవి మూడును నాయా తఱులను రాఘ

వుఁడు జయార్థియై సఖు లందుఁ బడయునె రతి

శత్రు దమనుండు రాముఁడు సత్య రతుఁడు

17.    

 

 

 

కం.

మిత్త్రులఁ బొందునె రాముఁడు

మిత్త్రులచేఁ గోర బడునె మీఱిన ప్రీతిన్

మిత్త్రులు కళ్యాణ పరులె

మిత్త్రులు గౌరవము నిచ్చి మెలఁగుదురె రతిన్

18.    

 

 

 

ఉ.

కోరునె దైవ దీవనలు కూర్చునె యాశ మనమ్ము లోపలన్

వారక సేయునే పురుష భాసుర ధీయుత కార్య కాయముల్

భారము దైవ మందు నిడి పార్థివ సూనుఁడు రామభద్రుఁడున్

దారను దూరమైన నను దల్చుఁ గదా కడు ప్రేమ తోడుతన్

19.    

 

 

 

కం.

మనమం దెంచెద దృఢముగ

నను నీ యిక్కట్ల నుండి నయముగఁ గాపా

డునని హరి వరేణ్య రఘు కు

ల నందనుం డరి నిచయ దళనుఁ డచిరమ్మున్

20.   

 

 

 

కం.

సుఖముల కర్హుఁ డయుక్తుఁ డ

సుఖములకు నిరతము మృదు వచో రత విలస

న్ముఖున కలవడంగ ఘనత

ర ఖేదములు నలయఁడు గద రాముం డచటన్

21.    

 

 

 

ఆ.వె.

తఱచు వినునె తివిరి తాను కౌసల్యా సు

మిత్రల కుశలమ్ము మేదినీ వి

భుఁడు భరత కుమారుఁ డడరు వార్తను రామ

భద్రుఁ డెసక మెసఁగ వానరేంద్ర!

22.   

 

 

 

తే.గీ.

నా కతనఁ బూజనీయుఁడు శోకమున ర

ఘువరుఁ డున్న వాఁడె భృశము గుమిలి యింక

శూన్య చిత్తుఁ డయ్యెనె నన్ను జూచి తాను

వేగఁ గాపాడుఁ గద యనురాగమునను

23.   

 

 

 

తే.గీ.

పంపు భరతుఁ డక్షౌహిణీధ్వజము మంత్రి

వర గణ సుగుప్త మగ్రజ వత్సలుండు

భీమ మరివీర సందోహ భీతికరము

మన్నిమిత్తము గలదు నమ్మకము కరము

24.   

 

 

 

తే.గీ.

భాగ్యశాలి సుగ్రీవుఁడు వాన రాధి

పతి శిత నఖ దంతాయుధ వానర పట

లమ్ము నెల్లఁ బంపును గద లంకకు వడి

నన్ను రక్షింప నణఁచి దానవుల నెల్ల

25.   

 

 

 

తే.గీ.

భండన భయంకరుఁడు లక్ష్మణుండు శూర

వర వరుఁడు సుమిత్రానంద వర్ధనుండు

నస్త్ర శస్త్ర నిచయముల నసుర వీర

గణము నెల్ల వధించును గద యచిరము

26.   

 

 

 

ఆ.వె.

నిజ సుహృజ్జనులు దనుజ వరులం గూడి

రావణుండు నాజి రౌద్ర శస్త్ర

రాజి మండు చుండ రయమునఁ గాంతునె

వంత యెల్లఁ దీఱ వానరేంద్ర!

27.   

 

 

 

తే.గీ.

హేమ నిభ వర్ణమున వెల్గు రామ ముఖము

తామరస సన్నిభమ్ము గంధ సహితమ్ము

నిండ శోకమ యెండునె నేను లేక

యెండ నెండు నబ్జము వోలె నిగుర జలము   

28.   

 

 

 

తే.గీ.

ధర్మము నిలుప రాజ్యముఁ దా విడిచెను

గానకు నరిగె నా తోడఁ గాలి నడక

భయము శోకముఁ జూపఁడు పార్థివుండు

ధైర్యము మది వహించుఁ గద రఘువరుఁడు

29.   

 

 

 

చం.

తలఁపఁగ నెక్కుడున్ సములు తల్లియు తండ్రియు నన్యు లెవ్వరుం

గులసతి కంటె నెన్నఁడును గూర్మినిఁ గా రిఁక రామ మూర్తికిన్

వలచిన నా రఘూత్తము సువాక్కుల నే విన నోపు దన్క నే

కలవర మొంద కుండ నిటఁ గాయము నిల్పుదు దూత సత్తమా!  

30.   

 

 

 

ఉ.

ఈ విధిఁ బల్కి జానకి కపీశ్వరు మారుతి తోడ రామ సం

భావన సక్త చిత్త మృదు భాషణముల్ మధు రార్థ యుక్తముల్

తా వినఁ గోరి రాఘవుని ధర్మ ర తాత్ముని మాట లింకయుం

బావని నోటి నుండి నుత పావని మాటల నాపె నంతటన్

31.    

 

 

 

కం.

అవనిజ పల్కులు భీమం

పు విక్రముఁడు మారుతి విని ముకుళించుచు భ

క్తి వర కరమ్ములు శిరమం

దు వచించెఁ గపివరుఁ డతి మధురముగ నంతన్

32.   

 

 

 

ఆ.వె.

నీ యుని కది యిచట నీరజ లోచన!

తా నెఱుఁగమి లోక తారకుండు

రాముఁడు వడి నిను బురందరుఁడు శచిఁ గొం

పోవు నట్లుగఁ గొని పోవ లేదు

33.   

 

 

 

కం.

విని నంతనె నామాటల

నిన కులతిలకుండు రాముఁ డేతెంచు వడిన్

ఘన హర్యృక్షానీకము

గొని లంకకు రావణ వధ కొఱకు నవనిజా!

34.   

 

 

 

కం.

చావైన సహాసుర వర

దేవత లయిన రఘువరు గతికి నవరోధం

బై వచ్చిన వధియించును

దేవీ! సందేహ మేల ధీరుని యందున్

35.   

 

 

 

కం.

మృగరాజ పీడితపు టే

నుఁగు వోలె ముదము గొనడు నిను గనని బాధన్

మగువా రఘు రాముండు ము

నిఁగి శోకమ్మున ఘనముగ నీరజ నయనా!

36.   

 

 

 

ఆ.వె.

మలయ వింధ్య మేరు మందర దర్దరా

గాంఘ్రి ఫలముల పయి నాన వేగ

యరయుదువు సునేత్రు నతివ! బింబాధరుఁ

జారు కుండలు సిత శశి నిభ ముఖు

37.   

 

 

 

తే.గీ.

అతివ యైరావ తాసీనుఁ డైన యింద్రుఁ

బోలె వేగ చూచెద వీవు లీల నుండ

రామచంద్రుఁ బ్రస్రవణ ధరాధరమున

విశ్వసించి యూఱడిలుము విమల చరిత!

38.   

 

 

 

ఆ.వె.

తినఁడు మాంసము కుల తిలకుండు రాముఁడు

మధువు ముట్టఁడు పరమ నియమమున

సువిది తాన్నము రుచి సూచు వన్యములను

సాయ సమయ మందుఁ జారునయన!

39.   

 

 

 

ఆ.వె.

త్రోల మఱచు మేను వ్రాల నీగల దోమ

లఁ బురుగుల ఫణులను రఘు వరుండు

నీ తలఁపు లవి మది నిండ నిరతమును

మేదినీ విభుండు మేను మఱచు

40.   

 

 

 

కం.

మునుఁగును దలఁపుల నిత్యము

ననిశము కుములును వగపున నత్యంతమ్మున్

మనమునఁ దలంపఁ డన్యము

మిను కంతయుఁ గామ వశుఁడ మీన నిభాక్షీ!

41.    

 

 

 

కం.

నిదురే యరుదు రఘుపతికి

నిదురే వచ్చిన యొకింత నీరజ నయనా!

యదిరి మధురంపుఁ బలుకులఁ

జెదరఁగ మది పలవరించు సీతా యనుచున్

42.   

 

 

 

తే.గీ.

ఫలము గాని పుష్పము గాని చెలువము లవి

యితరములఁ జూచినఁ దలఁచి యెదను నిశ్వ

సించి హాప్రియా యనుచు వచించు బహు వి

ధంపు భాషణములు వసుధా విభుండు

43.   

 

 

 

తే.గీ.

అనవరతము శోకమ్మున నలయు వాఁడు

సీత సీతా యనుచు నిన్నె చెప్పువాఁడు

రాజ సుతుఁడు మహాత్ముఁడు రాముఁ డతివ!

దృఢ హృదయుఁడు స్థిరుఁడు నిను దెచ్చు పనుల

44.   

 

 

 

తే.గీ.

ఉపశమింప దుఃఖము రాము నునికి తెలియఁ

బతి వగపునకు సరితూగఁ బడతి వనట

మిగులు మబ్బులఁ గూడిన మృగ ధరుండు

వెలుఁగు శరదృతు నిశ వోలె వెలిఁగె సీత

45.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు ముప్పది యాఱవ సర్గము.

 

 

సుందర కాండము

సర్గము 37.

 

                                                         

కం.

అంత హనుమాను పల్కులు

శాంతిని విని పలికెఁ బూర్ణ శశినిభముఖి భూ

కాంత సధర్మార్థ యుతము

లింతి విదేహపతి సుత హరీశుని తోడన్

1.      

 

 

 

తే.గీ.

రామునికి నన్యము దలఁప రామి నిత్య

శోక మగ్నతయును విన శూరవరుఁడ!

నీదు భాషణ మది తోఁచె నాదు చిత్త

మందు సవిషామృత మనంగ హరివరేణ్య!

2.     

 

 

 

ఆ.వె.

మృత్యువు పురుషు ననునిత్య మదను గాచి

లాగు నేరి నైనఁ ద్రాటిఁ గట్టి

న పగిది కడిది వ్యసన పరితప్తుని నైన

నధిక భాగ్యవంతు నైన హనుమ!

3.     

 

 

 

కం.

ప్రాణుల కసాధ్య మనిలజ!

వాణీశ కృత విధి దాట వ్యసన నిచయ ని

స్త్రాణుల లక్ష్మణు నల్ప

ప్రాణను నను రామునిఁ గను ప్లవగ వరేణ్యా!

4.     

 

 

 

ఆ.వె.

అరయ శోక జలధి కావలి దరి యెన్నఁ

డగును రామున కిఁక నంబు రాశి

మునుఁగఁ దరణము శ్రమమునుబొంది యీదుచు

వగచు వాని పగిది వానరేంద్ర!

5.     

 

 

 

ఆ.వె.

సమయఁ జేసి యాజి సర్వరాక్షసులను

బురమును బెకలిచి సమూలముగను

శిరములు దునిమి దశశిరున కాలమున నా

కాంతుఁడు నను లంకఁ గాంచు నెపుడు

6.     

 

 

 

మ.

ఒక సంవత్సర కాలమే గడువు నయ్యుగ్రుండు దా నిచ్చె ను

న్కికి వర్తిల్లచు నున్న దీ దశమమే నే రెండు మాసమ్ములే

యిఁక జీవమ్మున నుండు సుద్దులను నీ విక్ష్వాకుఁ డుండంగ వేఁ

గక హర్యుత్తమ సెప్పి సత్వర గతిం గార్యోన్ముఖుం జేయుమా

7.     

 

 

 

ఆ.వె.

నను బతి దరి కంప వినయ వంతుఁడు విభీ

షణుఁ డనుజుఁడు నా దశశిరు నెంత

వేఁడిన వినఁ డయ్యె వీడఁడు పంతము

రావణుండు లోక రావణుండు

8.     

 

 

 

కం.

నను దిరిగి యీయ నొల్లఁడు

వినయమ్ముగ నాదు పతికి వివశుఁడు కాల

మ్మునకు దశగ్రీవుం డా

తని వెదకుచు వచ్చు నని నిధనమ స్వయముగన్

9.     

 

 

 

కం.

నల యను కన్య నుడివె నిది

లలన విభీషణు పెనుసుత లాలన లీలన్

సలలితముగ నా కెల్లన్

నలా జననియే పనుప వనచరశ్రేష్ఠా!

10.    

 

 

 

కం.

సంశయ మించుక గన నిన

వంశోత్తముఁ డచిరము నను బడయు హరీశా!

సంశోభిత విస్తార గు

ణాంశ యుతుఁ డతఁ డని యంతరాత్మ వచించున్

11.    

 

 

 

తే.గీ.

రాఘవుని యందు వెలయు విక్రమము పౌరు

షమ్ము నుత్సాహము ననృశంస్యమ్ము సత్త్వ

మును గృతజ్ఞతయును దేజము నధికముగ 

 నా నరోత్తముం డల్పుఁడే హరివరేణ్య!

12.    

 

 

 

కం.

ఒక్కఁడు పదునాలుగు వే

లుక్కు మెయి యసురుల లేక సోదర సాయం

బుక్కడఁచె నతని ననిలోఁ

నెక్కడి వైరులు మన గల రెదిరించి భువిన్

13.    

 

 

 

తే.గీ.

పురుష వృషభుండు రాముఁడు ముప్పులను జ

లింపఁ డెన్నఁడు నాతని యింపు గూర్చు

తేజ మే నెఱుఁగుదు శక్రు తేజ మా పు

లోమజ యెఱుఁగు రీతిని రుచిరముగను

14.    

 

 

 

ఆ.వె.

రామ దినకరుండు రంజిల్లి నారాచ

కిరణ జాల మహిమ హరివరేణ్య!

యెండఁ జేయ నేర్చు మెండుగ నరి దను

జ మయ తోయ మెల్ల సత్వరముగ

15.    

 

 

 

కం.

ఆలాపింపఁగ నివ్విధి

నా లల నాశ్రు భరిత నయ నాత్మేశ్వర చిం

తా లాలస శోకార్తను

నాలోకించి పలికెను మహా కపి యంతన్

16.    

 

 

 

కం.

నా మాటలు విని నంతనె

రాముఁడు గడు నుద్యమించి లంకా నగరిన్

భీమ హరి భల్ల గణముల

తో మానిని! సేరు వేగ దుఃఖం బేలా

17.    

 

 

 

కం.

కాదేని నిన్ను క్షిప్రము

నీ దుఃఖము నుండిఁ గాతు నీ క్షణమ సతీ!

నాదగు వీపున నుండుమ

సాదరముగ విమల మతి! యచంచల రీతిన్

18.    

 

 

 

ఆ.వె.

వీపున నునిచి నిను విమలాంగి సాగర

ముత్తరింతు వీడి తత్తఱింత

శక్తి గలదు నాకుఁ జక్కఁగ మోయ లం

క దశకంఠు తోడఁ గాంత! నిజము

19.    

 

 

 

ఆ.వె.

ప్రస్రవణ మహీధర విరాజమానుఁడౌ

రాఘవేంద్రు నిన్ను రమణి! సేర్చె

ద ననలుండు హవ్యమును హుతమును శక్రుఁ

జేర్చు రీతి నేఁడు క్షేమముగను

20.   

 

 

 

చం.

అసురుల సంహరించు వర యత్న సుసంయుత విష్ణు భంగి నీ

కుసుమ నిభానన మ్మరయఁ గోరుచుఁ గుందుచుఁ బర్ణశాల లో

వసనము సేయు రాఘవునిఁ బార్థు సలక్ష్మణుఁ జూతు విప్పుడే

యెసక మెసంగు నాగ వర మెక్కిన శక్రుని బోలు పూరుషున్

21.    

 

 

 

తే.గీ.

సంశయింపక నాదు విశాల పృష్ఠ

ము నధిరోహింపు దేవి! రాము పతి సన్ని

ధానమును గోరి మది శశధరునిఁ జేరు

రోహిణీ సతి చందము రుచిర వదన!

22.   

 

 

 

కం.

తరియింపుము పృష్ఠమ్ము రు

చిరముగ నారోహణమ్ము సేసి నభము సా

గరమును భాసుర రవి శశ

ధరుల నరసి భాషణముల ధరణిజ! వేడ్కన్

23.   

 

 

 

కం.

నిను గొని పోవు తఱిన్ నే

ననిలపు వడి ననుసరింప నట నాకాశ

మ్మున లంకా నగర మహా

దనుజ వరు లశక్తులు వసుధాసుత! వినుమా

24.   

 

 

 

ఆ.వె.

ఎట్లు వచ్చితి నిట కేను వైదేహి య

వ్విధిని శంక లేక విన్ను దారి

వీపున నిడి నిన్ను నేపారి కొనిపోదుఁ

జూడు రాము దరికిఁ జోద్యముగను

25.   

 

 

 

తే.గీ.

హరివరేణ్యు  భాషణములు హర్ష విస్మ

యాకలిత మానసమ్మున నతివ యాల

కించి యద్భుతములు పరికించి మారు

తాత్మజునిఁ బల్కె మైథిలి యంత నెలమి

26.   

 

 

 

కం.

దాపున నున్నదె గమ్యము

నోపఁగ నగునె నను మోయ నో హరి వీరా!

పాప మతి దూర మా గతి

చూపితి వల కోతి తనము శూర వరేణ్యా!

27.   

 

 

 

ఆ.వె.

చిన్ని మేను తోడ నన్ను జేర్పఁగ రామ

చంద్రు భర్తృ మానవేంద్రు దివ్య

సన్నిధికి వనచర సత్తమ! పలుకంగ

నమ్మ శక్య మగునె నాకు హనుమ!

28.   

 

 

 

కం.

విని జానకీ సతి పలుకు

లను వాయు తనయుఁడు వానరర్షభుఁడు యశో

ధనుఁడు మది నెంచెఁ దనకు న

ది నవ పరిభవమ్మనుచు నతి విచారమునన్

29.   

 

 

 

చం.

వరసతి నా బలమ్మును బ్రభావము తేజము విక్రమమ్మునున్

ధరణిజ నేర దబ్జముఖి తామరసాక్షి మదీయ రూపమున్

సురుచిర కామ రూపమును జూచును నేఁ డని యెంచి వేగఁ దా

నరి గణ మర్దనుండు కపి యంతటఁ జూపెను స్వీయ రూపమున్

30.   

 

 

 

శా.

ఆరంభించెను వానరోత్తముఁడు కాయంబెల్లఁ బెంచంగ నా

వీరుండంత నగమ్ము నుండి దిగి దేవీ భావనార్థంబుగన్

మేరూర్వీధర మందరాద్రి నిభమై మేఘద్యుతిన్మీఱుచున్

ధీరోదాత్తుఁడు నిల్చె జానకి గనన్ దివ్యంబుగన్ మేదినిన్

31.    

 

 

 

తే.గీ.

పర్వత నిభుండు హరి మహాబలుఁడు తామ్ర

వక్త్ర వజ్ర దంష్ట్ర నఖుఁడు భైరవుండు

వానరోత్తముండు వలికె వారిజాక్షి

మైథిలి జనకాత్మజఁ గని మాన ధనుఁడు

32.   

 

 

 

కం.

గిరులు వనము లంగళ్లును

వరణమ్ములు తోరణములు పతియుత లంకా

పుర మెల్లం గొంపోవఁగ

ధరణిజ! శక్తి గల దమ్మ! ధరణిని నాకున్

33.   

 

 

 

ఆ.వె.

కుదురు కొలుపు మమ్మ! కోమలి బుద్ధిని

శంక యేల యింక సత్వరమ్ము

రామలక్ష్మణులకు రమణి శోకము మాన్పు

మేదినీ తనూజ! మీన నేత్ర!

34.   

 

 

 

తే.గీ.

అంత వాయ్వౌరస తనయు నరసి భీమ

దర్శను హనుమానునిఁ బద్మ దళ విశాల

నయన జనకాత్మజ ముదమునఁ బలికె వచ

నమ్ములు మధురమ్ముగ నమ్మకమ్ము గుదుర

35.   

 

 

 

కం.

ఎఱిఁగితి మహాకపి బలము

మఱి ధైర్యము విక్రమమ్ము మాహాత్మ్యము మై

మెఱ పరయ సూర్య తుల్యము

మెఱయుదు వీవు గతి గాలి మీఱుచు వింతన్

36.   

 

 

 

మ.

అతి సామాన్యుఁడు సేర శక్యుఁడె యమేయాంభోధి వే దాఁటి భూ

మి తలం బీ విధి వానరప్రవర నీ మేలౌ జవం బెల్ల నే

మతి నూహించితిఁ గార్య సంచయము సంభావ్యంపు మంత్రమ్ములన్

స్థిత ధీరుల్ సుఫలప్రదంపు విధముం జేయంగ సామర్థ్యులే

37.   

 

 

 

తే.గీ.

నన్ను గొంపోవు సత్త్వ సంపన్నుఁడ విల

వాయు వేగ సమాన జవ కపి వీర!

నీదు వేగము మోహింప నేను జనఁగఁ

దగను నీ తోడ నంబుధి దాఁటి చుమ్మి

38.   

 

 

 

తే.గీ.

కడలి పైపైకిఁ బోయి గగనము సేర

నీదు వీపున భయ మది నెలకొనంగ

మదిని వేగము మీఱఁ గంపనము కల్గు

వానరేంద్ర! తలంపుము మానసమున

39.   

 

 

 

ఆ.వె.

మీన మకర గణ సమేతమై భాసిలు

కడలి నీటఁ గూలఁ గపివరేణ్య

మేటి యన్న మౌదు నీటి సత్త్వములకు

సత్వరమ్ముగ వివశమున నేను

40.   

 

 

 

తే.గీ.

శత్రు నాశన కపివీర! శక్యమనఁగ

రాదు పయనమ్ము నీతోడ రమణి యుండఁ

జెంత నాపద రానోప వింత గాదు

సందియం బది యించుక యిందు లేదు

41.    

 

 

 

కం.

నన్ను దరలించు నప్పుడు

క్రన్నన విక్రము లసురులు రావణు నాజ్ఞన్

వెన్నంటి రాఁగ దుష్టులు

సన్నే కాపాడ నన్ను సదమల చరితా!

42.   

 

 

 

ఆ.వె.

గుదియ లీఁటె లనఁగ ఘోరాయుధమ్ములు

పట్టి చేత నిన్ను చుట్టు ముట్టఁ

బ్రాప్త మగును నీకు బాధ లింక నబల

చెంత నున్నతఱి విశేషముగను

43.   

 

 

 

తే.గీ.

రక్కసులు సాయుధులు వారు పెక్కు రుండ

నభమున నిరాయుధుండవు నారి యుండ

శక్యుఁడవె యాల మొంటరి సల్ప వారి

తోడ రక్షింప నను దగుదువె హరివర!

44.   

 

 

 

ఆ.వె.

ఉద్యమింప వానరోత్తమ! క్రూర క

ర్ములు దనుజుల తోడఁ బోరు నందు

వీపు నుండి నేను భీతిల్లి వణఁకుచు

నేలఁ గూల గలను నీవు సూడ

45.   

 

 

 

కం.

బలవంతులు భీమాంగులు

పలాశనులు భయదులు నిను భండన మందుం

దలపడి యెవ్విధి నైనను

గలవర పఱచి విజయమ్ము గైకొను వారే

46.   

 

 

 

కం.

కాదేని నీ వని మునుఁగ

నీ దనుజులు భూ పతిత నహీనతర మనః

ఖేదను నీ యేమఱుపున

మోదమ్మునఁ గొనిచను భయముం గలదు హరీ!

47.   

 

 

 

కం.

సమర జయాపజయమ్ములు

సమముగఁ దెలియఁ దరమే నిశాటులు నీ హ

స్తములం దుండఁగ నా హర

ణ మైన దళనమ్మయిన నొనర్ప సమర్థుల్

48.   

 

 

 

కం.

ఇడుమల పాలౌదు నపుడు

గడు వెఱపింపఁగ నసుర నికాయమ్ము పదం

పడి నీ వచ్చిన కార్యము

సెడి నిష్ఫలమౌ నిఁక హరి శేఖర! కనుమా

49.   

 

 

 

కం.

దనుజ సమూహము సర్వము

హనుమ సమర్థుఁడవు వేగ హతమార్పంగన్

విను మిన కులేశుని యశ

మ్మునకుఁ గలుగు భంగ మధికముగ నట్లైనన్

50.   

 

 

 

తే.గీ.

రక్కసులు నన్ను పక్షాంతరమ్ము నంతఁ

బట్టి దాచెద రేకాంత భాగమునను

నీవు హరులు రాఘవులును నేర రాని

చోటు నందు మూలమునకుఁ జేటు రాదె

51.    

 

 

 

కం.

ఆరంభించిన పని మ

త్కారణ రతి నిష్ఫలమ్ము గాకుండంగన్

మారుత నందన నీతో

నా రామాగమనము గుణమై యొప్పుఁ గడున్

52.   

 

 

 

ఆ.వె.

హరి నికాయ వర! మహాబాహు! రాముని

తమ్ముల కపికోటి ధవుని సకుల

గణము నీదియు మనుగడ లెల్ల నా యంద

ముడివడినవి చూడఁ బూర్ణముగను

53.   

 

 

 

ఆ.వె.

వారిరువురు నాశ దూర మగుడు శోక

తప్త చిత్తు లంతఁ దాళ లేక

యసువు లన్ని యింక హర్యృక్ష సందోహ

సహితము విడుచుటయు సత్య మయ్య!

54.   

 

 

 

కం.

పతి యందలి భక్తి వలన

నతి గౌరవమున నిరతము నన్యంపుఁ బుమాం

సు తనువు నేఁ దాఁకను నా

పతి రాముని మేను దక్క వానర ముఖ్యా!

55.   

 

 

 

తే.గీ.

వివశ శక్తిహీన ననాథను వర బలుని

రావణు బలము నెదిరింప రాక తాఁక

నాతని శరీర మేమి సేయఁ గల దాన

నా తఱిని మారుతాత్మజ! హరివరేణ్య!

56.   

 

 

 

తే.గీ.

బంధువుల తోడ రావణు భండనమునఁ

జంపి రాముఁడు నను జేరి చక్కఁగఁ గొని

పోవ నిచ్చట నుండి యద్భుతముగ నది

యోగ్య మగు నతనికిఁ బురుషోత్తమునకు

57.   

 

 

 

కం.

వింటిని చూచితి రాముని

వింటి బలము వాని తేజు విక్రమ గుణముల్

తంటల సురాసుర ఫణుల

వంటి పరులు సములె రామ భద్రున కవనిన్

58.   

 

 

 

తే.గీ.

చేరి సంగ్రామమున మహా చిత్ర కార్ము

కుని సలక్ష్మణ రాముని ఘన బలుని పు

రందర సమ విక్రము నెవ రుందు రిల నె

దిర్చి యనిల దీప్తాగ్ని రీతి హరి వీర!

59.   

 

 

 

తే.గీ.

మత్త దిగ్గజ నిభ రణ మర్దన రఘు

నందను సలక్ష్మణుఁ గని రణమున నిల్చి

యుండు వారెవరు యుగాంత చండకర ని

భ విశిఖార్చిస్సు రాముఁడు వానరేంద్ర!

60.   

 

 

 

ఆ.వె.

రామ లక్ష్మణ కపిరాజుల సైన్య స

మేత మిచ్చటకు నమేయ బల హ

రిప్రవీర! తెమ్ము క్షిప్రము రామార్థ

శోకిత కిడు ముదము ప్రాకటముగ

61.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు ముప్పది యేడవ సర్గము.

 

 

సుందర కాండము

సర్గము 38.

 

                                                         

 

కం.

అప్పలుకుల కానందము

ముప్పిరిగొన మనమునఁ గపి ముఖ్యుం డంతన్

విప్పారు మినుకులు వలికె

నప్పడఁతినిఁ గాంచుచు వచ నాతిశయుండే

1.      

 

 

 

తే.గీ.

రూపమునకు యుక్తంపుఁ బల్కులు సురుచిర

దర్శన! పలికి తీవు సుదతులు సాధ్వు

లు వినయవతులకుఁ దగి నట్టి వచనమ్ము

లెల్ల వినఁగ సంతస మయ్యె నుల్ల మందు

2.     

 

 

 

కం.

అధిరోహించి మదజిరము

నధమ మసాధ్యమగు దాఁట నతివలకు మహో

దధి యోజన శత మెల్ల వ

సుధాతనయ! నిక్క మనినఁ జోద్యంబగునే

3.     

 

 

 

ఉ.

రామునిఁ దక్క నన్యుల కరస్పృశ మేను దలంప నన్న నీ

భామరొ కారణాంతరము పన్నుగ యుక్తము నీక ధాత్రి నం

దా మహి తాత్ము రాఘవుని యాలికి నొప్పెడి పల్కు లెల్ల నీ

యీ మృదు భాషణమ్ము లన నేరికి శక్యము జానకీ సతీ!

4.     

 

 

 

తే.గీ.

నీదు చెయ్వుల నుడువుల నాదరముగ

రామునకు సమస్తమ్ము పరమ ముదంబు

నఁ బలికెద నా యెదుట ననిన నుడు లమల

చిత్త! కాకుత్స్థునకుఁ బురుషోత్తమునకు

5.     

 

 

 

తే.గీ.

కలవు పెక్కులు యోగ్యంపుఁ గారణములు

ముదము నొనగూర్ప నెంచి రామునకుఁ బ్రీతి

మమత చింతల మునిఁగిన మానసమునఁ

బలికితిని దేవి! యివ్విధి వచనములను

6.     

 

 

 

తే.గీ.

చేర రాని లంకాపురిఁ జేరితి నని

దాఁట రానట్టి యంబుధి దాఁటితి నని

నాదు సామర్థ్య మంత మనమున నెంచి

పలికితిని దేవి! యివ్విధి వచనములను

7.     

 

 

 

ఆ.వె.

భర్త తోడ నిన్ను భక్త్యను రాగము

లతిశయింపఁ గూర్ప నతివ! కోరి

పలికితి నిట నేను భాషణముల నన్య

భావ మెద్దియుఁ దలఁపంగఁ దగదు

8.     

 

 

 

తే.గీ.

ఎంచి నాతోడ రా నిచ్చగింప వేని

యానవాలుగ నేదైన నరసి యిమ్ము

దేనిఁ జూడ రాఘవునకుఁ దేటపడును

నీవ యని మఱి కాంచఁగ నెమ్మి కలుగు

9.     

 

 

 

తే.గీ.

పలుక హనుమ యీరీతి నవనిజ సుర సు

త నిభ మందస్వరమున గద్గదముగఁ గపిఁ

గాంచి పలికె నా గుఱుతుగ నంచితంపు

టీ కత నుడువు రామున కింపొదవఁగ

10.    

 

 

 

సీ.

పూర్వము నొకనాఁడు పూర్వోత్తర దిశను జిత్రకూట నగము చెంత నుండఁ

దాప సాశ్రమము సిద్ధ కుటీర దేశమున నధిక ఫల మూల వన యుతమ్ము

మందాకినీ నది విందు సేయ నవిదూరమున నుపవ నాకరమ్ము లందు

విహరించుచు సుగంధ వివిధ కుసుమ సంచయమ్ముల శుచి సలి లార్ద్రుఁడ వయి

 

 

 

 

ఆ.వె.

నా యొడిం దల నిడి తీయఁ గునుకు నీవు

మాంస మందఁ గోరి మౌకలి నను

గలఁత పఱప మట్టి గడ్డ తో నడ్డగిం

చుచును రామ! కుములుచు నిలువంగ  

11.    

 

 

 

సీ.

బలిభోజనుఁడు కాకి పలలార్థముం జీరుట నను మానక యుండుటఁ గని యలుగ

జారఁగ వస్త్రము చక్కఁగఁ గటిమాల లాగుచు నుండ నరసితి వీవు

పరిహసింప నపుడు కరము సిగ్గిలి కాక దారిత నలిగి నే చేరితి నిను

నలసి యాసీనుఁడ వంకమున నునిచి యూఱడింపఁగ హృష్టి నుంటి నేను

 

 

 

 

ఆ.వె.

వాయసము వలన నమేయ కోపము నూని

యశ్రు భరిత వదన నంత కనుల

నింపుగఁ దుడుచుకొన నీక్షించి తీవు నా

థ! ముద మొదవ నన్ను ధరణి నాథ!

12.    

 

 

 

సీ.

క్లేశమునన్ నిదురింపఁ బెద్ద తడవు పత్యంకమున నంతఁ బరఁగి నాథ!

రాఘవేంద్ర! తడవ రాఁగ నిద్రించితి వీవు నా యొడిఁ బ్రీతి యెసఁగ నంత

వాయసము తిరిగి వచ్చి రాము నొడి నిదుర నుండి లేచిన తరుణి నన్ను

జీర నారంభించెఁ జేరి స్తనాంతరమున మరల మరల మన మెరియఁగ

 

 

 

 

తే.గీ.

మూరి నెత్రు బొట్టులు కాఱ నో రఘుప్ర

వర! తడియ నీవు కాకము బాధ లీయ

బలిమి సుఖ సుప్తుఁడవు రామ భద్ర! యంత

మేలు కొలుపఁ బడితి వయ్య! మేటి వీర!

13.    

 

 

 

సీ.

వ్రణమును గాంచి యురమున మహా భాహు! యలిగి బుస్సు మనుచు నగము పగిదిఁ

బలికి యెవం డిటఁ బంచ శీర్షాహితో నాడఁ దలఁచె నన్ను నరసి యంతఁ

జూచి కాకమ్మును జూచు చుండగ నన్ను రక్త సిక్త నఖ సంయుక్త పక్షి

నంత శక్ర తనయు నచటఁ జన ననిల జవమున దూరమ్ము సత్వరముగ

 

 

 

 

తే.గీ.

నంత ధీమంతులకు మేటి వైన నీవు

క్రూర కాకమ్ము శిక్షింపఁ గోరి మదిని

దర్భఁ గొని వేగ నీదు సంస్తరము నుండి

యేయ బ్రహ్మాస్త్రము ద్విజము నెంచి యంత

14.    

 

 

 

సీ.

అగ్నికీ లాభంపు టస్త్రము మండుచు వెన్నంటఁ గాకమ్ము వేగ యెగిరి

యంబరమ్మున వివిధాధ్వములఁ జరించె రక్షణముం గోరి ప్రాణ భీతిఁ

దండ్రియు నమరులు తాపసు లెల్లరు త్యజియింప నంతట నరిగి మూడు

లోకములు దిరిగి లోకనాథుని నిన్ను శరణు వేఁడ దనికి చరణములను

 

 

 

 

తే.గీ.

దాని శరణాగతుని వధ్యు దయను గాచి

యస్త్ర మిది యమోఘమ్మని యడుగఁ గాకిఁ

బ్రాణ నేత్రముల నొకటి వలపటి కనుఁ

గొని మనుపు నన్ను ననెఁ గాకి వినయ మెసఁగ

15.    

 

 

 

కం.

కుడి కన్నొసంగి కాకం

బడరి నిలిపి ప్రాణములు మహానందమునం

గడు భక్తి మ్రొక్కి రామున

కెడఁద దశరథునకు ననుమ తీయ నిలు సనెన్

16.    

 

 

 

తే.గీ.

వేయ బ్రహ్మాస్త్ర మేకాక్షిపై నడరుచు

మన్నిమిత్తము ధరణిప! నన్నపహర

ణమ్ము సేసి నట్టి యతని నిమ్మహీత

లమున క్షమియింతు వేల కలవర మాయె

17.    

 

 

 

తే.గీ.

నాథ! నీవు నాథుఁడ వైన నాథ రహిత

యట్ల కానఁ బడితి నిట నరసి చూడు

మమిత కృపను గురిసి యిక నైన నన్ను

రామచంద్ర! మహోత్సాహ రాగ మమర

18.    

 

 

 

చం.

పలుకఁగ నీవ వింటిని కృపాగుణ ముత్తమ ధర్మమే యనన్

బలమున మిన్న వెన్నఁగను బౌరుష మందును శక్తి యందునుం

దలఁప గభీర మందును నుదగ్ర వినిశ్చల వార్ధి తుల్యతన్  

జలనిధి సంయు తావనికి శక్ర సమాన విభుండ వెంచఁగన్

19.    

 

 

 

తే.గీ.

సత్యవంతుఁడ వస్త్ర శాస్త్ర వరుల నధి

కుండవు బలవంతుఁడవు నీ క్రూర దాన

వ తతి పై నస్త్రముల నేల వాడవు దశ

రథ వరాత్మజ! రఘువీర! రామచంద్ర!

20.   

 

 

 

ఆ.వె.

నాగు లైన నసుర నాథులు గంధర్వు

లైన మఱి మరుత్తు లైన రాము

ని నెదిరింప సమరమున శక్య మగునె వే

గమును దాళ జాలఁ గలరె యెందు

21.    

 

 

 

కం.

ఆతురత యున్న నాయెడ

నీ తఱి రఘు వీరునకు నహీన బలునకున్

యాతు గణముఁ దీక్ష్ణ శర

వ్రాతమ్ముల నేలఁ గూల్ప రాఁడు రయమునన్

22.   

 

 

 

కం.

సోదరు నానతి కైకొని

సాదరముగ లక్ష్మణుండు నతిబలుఁడు ధను

ర్వేద నిపుణుండు గావఁగ

నీ దను జార్తితను నన్ను నేల నెఱుఁగఁడో

23.   

 

 

 

తే.గీ.

సురలకు నజేయు లైనను బురుష సింహు

లుభయు లని లాగ్ని నిభ తేజు లుత్తము లరి

మర్దనులు ఘనులు బలులు మాన వోత్త

ము లకట యనాదరమ్మేల ముగుద యందు

24.   

 

 

 

తే.గీ.

నా వలన నపరాధ మనల్పము గన

నోపు నిస్సంశయమ్ముగ నుగ్రులు రిపు

వర్గమునకు సామర్థ్యులు వా రిరువురు

నయిన నన్నిట రక్షింప నరయ రకట

25.   

 

 

 

కం.

కన్నీటి తోడఁ బలుకఁగ

నన్నారీ మణి పలుకులు హనుమానుఁడు వి

చ్ఛిన్నాంతరంగుఁ డయి విని

పన్నుగఁ బలికె ననునయపు వచనము లంతన్

26.   

 

 

 

తే.గీ.

అన్నిట విరక్తుఁ డయ్యె నీ యాన రాముఁ

డచట దేవి! నీ శోకము నరసి నిజము

దుఃఖ మందు మునుఁగ నన్న తోరముగను

లక్ష్మణుఁడు కూడ నుండె నలమట నంత

27.   

 

 

 

కం.

కంటి నిను భాగ్య వశమునఁ

గంటఁ దడి నిడ సమయమ్ము కా దిది సుమ్మీ

తొంటి వెతల కంతము తెలి

గంటి కనియెద వచిరమ్ము కమనీయముగన్

28.   

 

 

 

కం.

వా రుభయులు బలవంతులు

ధీరులు పురు షర్షభులు త్వదీయేక్షణ సం

చారక్షత్రియ సూనులు

సేరి దహింతురు పురము నశేషము లంకన్

29.   

 

 

 

కం.

సమరమునఁ జంపి రావణు

స మంత్రి బంధు జన గణము సక్కఁగఁ గ్రూరున్

విమలాయత నేత్ర! నిజ పు

రమునకుఁ గొంపోవును రఘు రాముఁడు నిన్నున్

30.   

 

 

 

ఆ.వె.

రామభద్రునకును భీమ బలుఁడు లక్ష్మ

ణునకుఁ గపి గణాధిపునకు సంగ

త హరి నిచయమునకుఁ దగిన సందేశము

నిమ్ము వారికెల్ల నిందు వదన!

31.    

 

 

 

కం.

పలుక ననిల సుతుఁ డివ్విధి

నిలా తనూ జామర నిభ యీక్షించి హరిం

గలఁతం గూడిన మనసునఁ

బలికె శుభతర వచనములు వైదేహి తమిన్

32.   

 

 

 

తే.గీ.

సున్నిత హృదయ కౌసల్య సుతుని సకల

లోక నాథుని నాదు పలుకులఁ గుశల

మడుగు మరసి సవినయమ్ము హరి వరేణ్య!

శిరసు వంచి సద్భక్తితో నెరఁగు మయ్య!

33.   

 

 

 

సీ.

త్యక్తస్రజ వరాంగ నైశ్వర్య దుర్లభ భూభాగ మణి రత్న పుణ్య తముఁడు

సమ్మాన్య యాచిత సమ్మతి మాతాపితృ మనస్వి సౌమిత్రి ధీర వరుఁడు

రామానుచర పరిరక్షి తాగ్రజుఁడు త్యక్తోత్తమ సుఖనిచ యోత్తముండు

సింహమధ్యముఁడు విశేషాయత భుజుఁడు ప్రియదర్శనుండు వినయ పురుషుఁడు

 

 

 

 

ఆ.వె.

నన్నఁ దండ్రి పగిది నన్ను దల్లి వలెను

గను నపహరణ మెఱుఁగఁ డది యతఁడు

మిత వచనుఁడు శక్తి యుతుఁడు నమిత భాగ్య

శాలి వృద్ధ జనుల పాలి సురభి

34.   

 

 

 

తే.గీ.

పితృ సదృశుఁడు శ్రేష్టతముఁడు ప్రీతి పాత్రుఁ

డన్నకును నాకు దత్త కార్యాచరణ ర

తుండు నెవనిఁ జూచి మఱచి యుండు రాముఁ

డు గురు నతని లక్ష్మణుని నడుగు కుశలము

35.   

 

 

 

తే.గీ.

దక్షుఁడు సుకుమారుఁడు శుభ లక్షణాంగ

విలసితుఁడు లక్ష్మణుండు సుప్రియుఁడు నగ్ర

జునకు శోక క్షయమగు రీతి నతని హరి

వర! నియోగింపఁగఁ దగిన వాఁడ వీవు

36.   

 

 

 

కం.

కార్యోద్యుక్తుం డగు విధి

నార్యున కా రాఘవునకు హనుమ! భవచ్చా

తుర్యమ్మున మరల మరల

శౌర్య ధనుఁడు నాదు పతికి సంగతి సెపుమా

37.   

 

 

 

తే.గీ.

రామ! దశరథాత్మజ! విను ప్రాణములు ని

లుపుదు నొక్క మాసము మాత్రమ పలుకంగ

నిజము మాసమ్ము దాఁటిన నేను బ్రతికి

యుండ లంకయం దెవ్విధి నండ లేక

38.   

 

 

 

ఆ.వె.

రావ ణావమతను  రాఘవ! నే బంధి

త నిటఁ బాప కర్ము దనుజు చేతఁ

గావ రావె నన్ను కౌశికిఁ గాచిన

పగిది దుర్గమము బలిగృహ మందు

39.   

 

 

 

ఆ.వె.

పలికి యంత సీత వర చేలమున నున్న

శుభ శిరోమణి పరిశుద్ధముఁ గొని

యిచ్చె హరి వరునకు నిమ్ము రాఘవునకు

నని పలికి ముదముగ నవనిజాత

40.   

 

 

 

తే.గీ.

అంతఁ జూడామణిని నుంచె నంగుళమున

హరి వరేణ్యుఁడు నిజ భుజ మందు నిమడ

నందున నభివాదము చేసి యవనిజకుఁ బ్ర

దక్షిణము తోడ నంత సీత దరి నిల్చె

41.    

 

 

 

ఆ.వె.

సీతను గనిన సుమ దాతిరేకమ్మున

మనసునఁ జనెను హరి మారుతాత్మ

జుండు రాము దరికిఁ జోద్యముగ నిలువఁ

గాయము ధరణిజ సకాశ మందు

42.   

 

 

 

కం.

విలువైన రత్నముం గొని

యిలాతనయ శిరమున ధరియించిన దానిం

జెలువంపు మనమున నివ

ర్తిలఁ దొడఁగె ననిల విధూత దృఢ గిరి భంగిన్

43.   

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు ముప్పది యెనిమిదవ సర్గము.

 

 

సుందర కాండము

సర్గము 39.

 

                                                         

కం.

చూడామణి నొసఁగి యనియె

వ్రీడావతి సీత కపిని వీక్షించుచు నే

వాడిన యీ తొడవు పుడమి

ఱేఁ డా రాఘవున కిడు నఱిముఱియు ముదమున్

1.      

 

 

 

కం.

మణిఁ జూడ రాఘవునకు స్ఫు

రణ కేతెంచెదరు నంతరంగము నందున్

గణియింప మువ్వురు సతిఁ ద

రుణి నేనును మజ్జనని గురువు దశరథుఁడున్

2.     

 

 

 

కం.

హరి సత్తమ! యిక్కార్యా

చర ణోద్యుక్త రత మానస సుచోదిత ధీ

వరుఁడవు నీవు తలఁపు ము

త్తర కార్య నికాయము మది ధైర్యము తోడన్

3.     

 

 

 

తే.గీ.

నీవ యీ కార్య సిద్ధికి నిపుణఁడ విలఁ

దగు ప్రయత్నము నొనరించి వగపుఁ దీర్చు

వాఁడ వగుము హరి వరేణ్య! పరఁగి నట్టి

పూన్కి దుఃఖ నాశన కరము నగు నెంచ

4.     

 

 

 

ఆ.వె.

అట్లగునని ప్రతిన యాదరముగఁ జల్పి

భీమ విక్రముండు ప్రీతి వంద

నమ్ము సేసి యనిల నందనుండు శిరసు

వంచి వెడలఁ దొడఁగె నంచితముగ

5.     

 

 

 

కం.

గమనోద్యుక్తుని వానరు

ని మరున్నందను ఘనునిఁ గని పలికె నంతన్

విమల చరిత మైథిలి వచ

నము లశ్రు భరిత గళమున నయముగ మరలన్

6.     

 

 

 

చం.

కుశలము రామ లక్ష్మణులకుం గపి వీర వచింపుమా దమిం

గుశలము ధర్మ సమ్మతము కోట్యధికప్లవగప్రభుండు సూ

ర్య శుభ సుతుం డమాత్య వరు లందఱు వృద్ధులు నుండఁ దెల్పుమా

విశదముగం గపిప్రవర! వేగమ నా వగు భాషణమ్ములున్

7.     

 

 

 

కం.

ఆజాను బాహువు మహా

తేజుఁడు తరియింపఁ జేయు తీరుగ నన్నున్

రాజసమున దుఃఖాంబుధి

నోజమ్ముగఁ జేయు మా రఘూత్తము నింకన్

8.     

 

 

 

ఆ.వె.

నే నసువుల నుండ నా నాథుఁడు యశో ధ

నుండు నన్ను గొని చను విధము వడిఁ

జేయు మనిల తనయ! చెప్పి యింపగు వచ

నములు పుణ్య మిల నొనరును నీకు

9.     

 

 

 

తే.గీ.

నిరతము వలుకు నుత్సాహ భరిత వాక్కు

లెల్ల విని నీవి రాఘవు నెడఁదఁ బౌరు

షమ్ము వర్ధిల్లు నంత ఘనమ్ముగ నను

లంక నుండి గొంపోవ నిశ్శంక నింక

10.    

 

 

 

కం.

విని నీ వలన రఘు వరుం

డు నాదు సందేశమున నొడువు లెల్ల మహా

త్ముని విక్రమమ్ము వర్ధిల

మనమున సంకల్పము గొను మహితముగ ధృతిన్

11.    

 

 

 

కం.

జానకి పల్కులు విని హను

మానుఁడు విన యాంజలు లిడి మహితాత్ముండే

మానితముగ నిచ్చెఁ బదులు

మానిని వైదేహిఁ జూచి మారుతి యంతన్

12.    

 

 

 

ఆ.వె.

ఋక్ష హరి వర గణ వృత మహాసైన్యము

తోడ నేఁగుదెంచుఁ దూర్ణ మిటకు

రాఘవుండు నరి వరవ్రాతము నఱికి

శోక ముత్తరించు సుదతి! నీదు

13.    

 

 

 

కం.

నరులైన నసురు లైనను

సురలైన విడువ శరమ్ము సూచుచు నిలువం

దరమె రఘురాము నెదుట నె

దిరించి యెవ్వరి కయినఁ బృథివిని ధరణిజా!

14.    

 

 

 

ఆ.వె.

దినపతి నయిన మఱి దేవపతి నయిన

నర్క నందనుండు యముని నైన

సమర మందుఁ గలదు శక్తి సహింపఁగ

మీఁదుమిక్కి లెంచ నీదు కతన

15.    

 

 

 

తే.గీ.

కడలి హద్దుగ నున్నట్టి పుడమి నెల్ల

నిచ్చగించు జయింపఁగ నిన కులుండు

నీ నిమిత్తము రాముండు నెగడి జనక

నందన! విజయ మింపుగ నందు కొనును

16.    

 

 

 

తే.గీ.

సత్యము లతి యుక్తమ్ములు సమ్మద వచ

నములు మారుతి వదనమ్మున విని సీత

మన్నన లొలుకు చూపులఁ గ్రన్నన పలి

కె మినుకులు హరి వరుఁ గని సముచితముగ

17.    

 

 

 

ఆ.వె.

తిరిగి వెడల నడరు హరివరుఁ జూచుచు

మరల మరల యంత మైథిలి నిజ

పతినిఁ బ్రేమ కలిత వచనములఁ బొగడ

సహృదయమున నతని సత్కరించె

18.    

 

 

 

కం.

ఉచితమ్మని యెంచిన నీ

వెచట నయిన గుప్త దేశ మెంచి నిలిచి నేఁ

డు చనుమ యెల్లి యుపశమిం

చి చక్కఁగ హనుమ! రిపుగణ సింహస్వప్నా!

19.    

 

 

 

తే.గీ.

నాదు ఘనశోక మొకయింత నీదు నికట

మున నుపశమించును ముహూర్తము నయిన నిట

నల్ప భాగ్యశాలిని నాకు ననిల తనయ!

నీదు మధుర భాషణములు నెమ్మి నొసఁగు

20.   

 

 

 

తే.గీ.

ఏఁగి హరివర! తిరిగి రా నిచటకు వడి

సంశయమ్ము చిత్తమునఁ బొసఁగిన నాదు

ప్రాణములకును గూడఁ బరఁగును జుమ్మి

సందియమ్మించు కంతయు నిందు లేదు

21.    

 

 

 

కం.

నీ కనిపింపమి నన్నీ

శోకము భృశము తపియించుఁ జుమ్మీ మరలన్

శోకమ్మును వెంటాడుచు

శోకము లెల్ల వెలయించు చొప్పున హనుమా!

22.   

 

 

 

కం.

నామదిఁ దొలుచుచు నున్నది

భీమపు సందేహ మొకటి వీర కపీంద్రా!

నీ మాన్య సహాయుల శా

ఖామృగ భల్లూక వీర కాయం బందున్

23.   

 

 

 

కం.

హరి భల్ల వీర సైన్యము

నరాధిపాత్మజు లుభయు లనంతాంబుధి దు

స్తర మే రీతినిఁ గపివర!

తరియింప సమర్థులు మదిఁ దలఁపఁగఁ దరమే

24.   

 

 

 

ఆ.వె.

భూత సంచయముల భూ వలయమ్మున

సాగరమ్ము దాఁట శక్తి యున్న

వారి మువ్వురఁ గను వారము వైనతే

యుండు నీవును ననిలుండుఁ గాదె

25.   

 

 

 

కం.

మిక్కుటముగఁ జిక్కులు గల

యిక్కార్యమ్ము ఫలియింప నెయ్యది మార్గం

బక్కట కాంచఁ గలవు మదిఁ

జక్కటి పని వారలం దసదృశుఁడ వరయన్

26.   

 

 

 

తే.గీ.

శత్రు నాశకుండవు నీవ చాలు నిప్ప

ని సమకూర్పంగ నతి కమనీయముగను

ఘన యశఃకారణమ్మగు హనుమ! నీకు

కార్య ఫల సిద్ధి తల్ప నిక్కమ్ము సుమ్మి

27.   

 

 

 

ఆ.వె.

సకల బల సమేతము కలనున దశ కం

ఠుఁ దునిమి ఘన విజయుఁడు నయి రఘు వ

రుండు రాముఁ డంత నిండు ప్రేమఁ గొని పో

వ నిజ పురము భావ్య మని తలంతు

28.   

 

 

 

కం.

శర జాలమ్ముల లంకను

బర బల సూదనుఁడు రామ భద్రుండు నిరం

తర మొనరించి నను గొని చ

న రయమ్మున నది యతనికి నయ మగుఁ జుమ్మీ

29.   

 

 

 

ఆ.వె.

ఆజి శూరునకు మహాత్మున కెవ్విధి

యుక్త మౌను విక్ర మోత్తమునకు

రాఘవునకు ననిఁ బరాక్రమింపఁ గపీంద్ర!

చేయు మవ్విధిఁ గడు శీఘ్రముగను

30.   

 

 

 

ఆ.వె.

అర్థ వంతపు వినయాన్వితపు సహేతు

కంపు వాక్యములను గపి వరుండు

సీత పలుకఁగ విని శేష వాక్యము లెల్లఁ

బల్కె నింపొసంగ భామ కంత

31.    

 

 

 

తే.గీ.

ప్లవగ వరుఁడు హర్యృక్ష సైన్య వర విభుఁడు

ఘనుఁడు సుగ్రీవుఁ డట నీదు కారణమున

దేవి! కృత నిశ్చయుఁడు సత్వ తేజముల వ

రుండు రాఘవేంద్ర వర సఖుం డతండు

32.   

 

 

 

తే.గీ.

ఆతఁడు మహాసుర వినాశ నార్థ మేఁగు

దెంచు లంకకు క్షిప్రము నంచితముగ

వేలు కోట్ల మహా కపి వీరుల సహి

తమ్ము వైదేహి నీకుఁ జింత వల దింక

33.   

 

 

 

కం.

సీత! మనో వేగాధికు

లాతత విక్రమ గుణులు మహా బలవంతుల్

కోఁతులు నిరంతర మెదురు

చూతురు పాటింప వేగ సుగ్రీ వాజ్ఞన్

34.   

 

 

 

తే.గీ.

అడ్డు లేదు చరింప నీ హరి వరులకు

నూర్ధ్వ గతి నైనఁ బృథివీ తలోగ్ర గతిని

నైన మఱి నధో తల గతి నైనఁ గష్ట

సాధ్య కర్మ నిచయము లొసంగ వలపు

35.   

 

 

 

కం.

నగ పారావార సమే

త గహ్వరీ వలయ మెల్లఁ దారాధ్వమునన్

నగ చారులు పల్మరు లిం

పుగఁ జేసిరి భ్రమణము వడిఁ బ్రోత్సాహముతోన్

36.   

 

 

 

ఆ.వె.

నన్ను మించి నట్టి నన్ను దూఁగం గల

యట్టి వారు పెక్కు రక్కపి విభు

చెంతఁ గలరు లేరు చేవ నాకంటె న

ల్పులు హరి గణ మందుఁ గలయ నరయ

37.   

 

 

 

కం.

నేన యిటఁ జేర నుడువం

గా నేల మహా బలుల నిఁక ననుప రిల వీ

రానీకమున వరేణ్యులఁ

గానఁగ నితరులనె కాని కార్య తతులకున్

38.   

 

 

 

కం.

పరితాప మింకఁ జాలును

బరిత్యజింపుము వగపును బన్నుగ దేవీ!

హరి వీరు లొక్క పెట్టునఁ

బురవర మీ లంకఁ జుట్టుముట్టుదు రింకన్

39.   

 

 

 

కం.

నరసింహులు వా రిరువురు

నురు బలు లరుదెంతు రిటకు నుదయించెడు భా

స్కర శశధరు లేమొ యనఁగ

స్థిరముగ నా వీపున నిలిచి యతి రయమునన్

40.   

 

 

 

ఉ.

వీరులు రామలక్ష్మణులు వే యరుదెంచి నరోత్తముల్ మహో

దార పురమ్ము లంకకు నుదగ్ర శరావళి నేసి త్రుంపఁగం

గ్రూరుఁడు రావణాసురునిఁ గూల్చి సమిత్ర సబాంధవమ్ముగన్

నీ రమణుండు శౌర్యమున నింగొని పోవు నయోధ్యకున్ వడిన్

41.    

 

 

 

ఆ.వె.

మండు నగ్ని భంగి మానిని గాంతువు

రామచంద్రుని నచిరమ్ము నందు

నుపశమిల్లు మింక నుచిత శుభము లగు

నాగుమ తగిన సమయమ్ము కొఱకు

42.   

 

 

 

కం.

హతుఁ డైన దశాననుఁడు స

సుత సచివ సబాంధవమ్ము సుదతి రఘువరుం

బతిఁ గందు విచటఁ జంద్రుని

సతి రోహిణి భంగి నీవు చక్కఁగఁ బ్రీతిన్

43.   

 

 

 

ఆ.వె.

రామ హస్త నిహత రావణుఁ గాంతు వ

చిరమున సతి! శోక సీమ నరయఁ

గలవు శీఘ్రమంబ కల్ల కానేర ది

ది నిజ మగును జుమ్మి దివ్యముగను

44.   

 

 

 

కం.

సముదాయించి ధరణిజను

సముచితముగ నివ్విధి హరి సత్తముఁ డంతన్

గమనోద్యుక్తుండై తిరి

గి మారుత తనూజుఁడు వలికెఁ దగు మినుకులన్

45.   

 

 

 

ఉ.

కాంతువు రాఘ వేంద్రుని సుకార్య వినిశ్చయు ధన్వి సత్తముం

గాంతువు వీర లక్ష్మణునిఁ గాలిడ ముంగిలి లంక లోపలం

గాంతువు వానరేంద్రుల నఖమ్ములు దంతము లాయుధమ్ములై

వింతఁ జెలంగ లంక ధృతి వీర వరేణ్యుల సింహ తుల్యులన్

46.   

 

 

 

తే.గీ.

కాంచెదవు మేఘ సన్నిభ కాయ యూధ

వరుల లంకా మలయ సాను వర తలముల

వానరప్రవరుల నారవమ్ముల ననిఁ

జెలఁగు వారినిఁ బెక్కండ్ర సీత! వేగ

47.   

 

 

 

కం.

మృగ రాజార్దిత కరి వరు

పగిది రఘు వరుఁడు ముదమ్ము వడయండు మదిం

దగులంగ హృదిని ఘోర

మ్ముగఁ గందర్ప శిఖులు సతము కువలయాక్షీ!

48.   

 

 

 

కం.

ఒఱలంగ వలదు వగపున

మఱియుఁ దలఁపకు మహితంపు మాటల నిఁక నీ

వెఱుఁగుమ పతిఁ గూడెద వం

దఱు గన నింద్రు శచి పగిదిఁ దప్పక ప్రీతిన్

49.   

 

 

 

తే.గీ.

ఎక్కడ కలండు రాముని కెక్కుడు భువి

నెవఁడు లక్ష్మణునకు సముం డిల నరయఁగ

నగ్ని మారుత సన్నిభు లన్న దమ్ము

లాశ్రయులు జనకాత్మజ యధికముగను

50.   

 

 

 

తే.గీ.

చిరము నుండ విచ్చోట దుశ్చిత్తు లతి భ

యంక రాసురు లున్నట్టి లంక లోన

వేగ రా మాగమన మగు వేచి యుండు

మాత! నా చన నగు నంత మాత్ర మింక

51.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు ముప్పది తొమ్మిదవ సర్గము.

 

 

సుందర కాండము

సర్గము 40.

 

                                                         

కం.

ఒప్పిదపు వాయు సూనుని

యప్పలుకులు విని యమర సుతాభంబౌ యా

యొప్పులకుప్ప మహీసుత

తెప్పరిలి పలికె హితకర దివ్య వచనముల్

1.      

 

 

 

తే.గీ.

సగము మొలచిన చేను వర్షమ్ము వొంద

సంతసించు వసుధ భంగి చారు మధుర

భాషణుండవు నిను గాంచఁ బవన తనయ!

హర్ష మొదవె మనమ్మున నమితముగను

2.     

 

 

 

ఆ.వె.

అలమటఁ గృశియించి నట్టి యంగమ్ములఁ

బురుష సింహుఁ దమిని ముట్టు కొనెడి

వాంఛ కృప వహించి వానర పుంగవ!

తీర్పు మయ్య నీదు తేజ మలర

3.     

 

 

 

కం.

నుడివితిఁ గద హరి సత్తమ!

విడిచిన శరపు టొక కంటి విధ్వంసమ్మున్

బెడిదంపుఁ గాక చరిత

మ్మడుగ నభిజ్ఞానమునకు నా రామునకున్ 

4.     

 

 

 

తే.గీ.

నుదుటఁ జెదరంగఁ దిలకము కదిసి వేగ

నాదు చెక్కిలి దిద్దితి వాదరముగ

బొట్టు మణిశిల తోడ నింపు గొలుపంగ

రామ! స్మరియింపు మది యభిరామముగను

5.     

 

 

 

తే.గీ.

వీర్య వంతుఁడ వయ్యును వృష వరుణ స

మాన బలుఁడవై యనుమతింపఁ దగునె మద

పహృతము వసనము దనుజ వరుల మధ్య

నీకు రఘువర ధర్మపత్నిఁ గృపఁ గనవె

6.     

 

 

 

ఆ.వె.

వర శిరోమణి నతి భద్రముగఁ బరి ర

క్షించితి నిట నీవ యంచు నెంచి

దీనిఁ జూచి నేను మానసమ్మున సంత

సింతు ననఘ కరము చింత లందు

7.     

 

 

 

కం.

ఒసఁగఁ దిరిగి నీకిది జల

ధి సంభవము విమలము వర దివ్యమణి నిఁకన్

వసియింపఁగ శోకమ్మున

నసువుల తోడఁ దర మగునె యవనిని నాకున్

8.     

 

 

 

ఆ.వె.

దుస్సహంపు ఘోర దుఃఖము లన్నియు

భీమ దైత్య హృదయ భేద నంపు

వాచ్య రాశి నెల్ల బాధ నీ కొఱకునై

విని సహించు చుంటి ననవరతము

9.     

 

 

 

ఆ.వె.

మాస కాలమ రిపు మర్దన ధరియింతుఁ

బ్రాణములను బొంది రాజ తనయ!

నిన్ను విడిచి యింక నెల దాఁటిన బ్రతుకఁ

దరము కాదు నాకుఁ దథ్యముగను

10.    

 

 

 

ఆ.వె.

దుఃఖ దాయకమ్ము దుష్ట రాక్షస దృష్టి

నాకు లంకలో వనట నొసంగు

నీ వ్యసనములు విన నిలువవు  నాదు ప్రా

ణమ్ము లవి యొక నిమిషమ్ము నైన

11.    

 

 

 

ఆ.వె.

అశ్రు పూరితంపు టవనిజ పల్కులు

దీన భాషితము లహీన బలుఁడు

మారుతాత్మజుండు భార హృదిని విని

బదులు పల్కె నిట్లు భామఁ గాంచి

12.    

 

 

 

కం.

తవ శోకమ్మున రాముం

డు విముఖుఁ డాయెను నిజము నుడువ నీ మీదా

న వగపునఁ దగుల రాముఁడు

నవరజుఁ డా లక్ష్మణుండు నలమటఁ జెందెన్

13.    

 

 

 

కం.

చూచితి నిన్నెట్లైనను

నే చింతకు కాదు సమయ మీ నిమిషంబే

చూచెద వీ వంతం బీ

ప్రాచుర్యపు దుఃఖములకు భామిని! వినుమా

14.    

 

 

 

తే.గీ.

రాజ పుత్రులు శత్రు మర్దను లుభయులు

పురుష శార్దూలురు పరాక్రములు నిను గన

నుత్సహించెడి వారు మహోగ్ర రూపు

లై దహింతురు లంక శాతోదరి! విను

15.    

 

 

 

ఆ.వె.

సమరమున వధించి సహ బాంధవమ్ముగఁ

గ్రూర రావణాసురుని శరముల

రాఘవు లిరువురు ధరణిజా! వగవకుమ

నిను గొని చనియెదరు నిజ పురమ్ము

16.    

 

 

 

కం.

రామునకు నానవాలుగ

భామ మఱియు నొక్కటీయఁ బాడి యగును దా

వేమారు సూచి ముదమున

మైమఱవఁ గొని చనియెద నమంద జవమునన్

17.    

 

 

 

తే.గీ.

పూర్వమ యొసంగితిని కపి పుంగవ మణిఁ

గేశ భూషణమ్ము గుఱుతు కీర్తితమ్ము

దానిఁ గని నమ్ము రాముఁడు మాననీయ!

నీదు వచనమ్ము లనె సీత సాదరముగ

18.    

 

 

 

కం.

మణిఁ జేతఁ గొని ప్లవగ వర

గణ ముఖ్యుండు ఘన వజ్రకాయుం డంతన్

రణ ధీర వరుండు శిరః

ప్రణామ మతి భక్తిఁ జేసి పయనింతు ననన్

19.    

 

 

 

కం.

గమ నాసక్తుని హరి స

త్తముఁ గని జనక సుత గద్గదస్వరయై దుః

ఖమున నయన జల భర వద

నమున ననియె దీనురాలు నళినాక్షి గిరల్

20.   

 

 

 

తే.గీ.

సింహ సంకాశులం గపి శేఖర వర

రామ లక్ష్మణులను సోదరప్రవరుల

నిన కుమారు నమాత్యుల నితరులం గు

శల మడుగు మందఱిని నింక సవినయముగ

21.    

 

 

 

ఆ.వె.

శోక జలధి నుండి సురుచిరముగ దాఁటు

నట్లు సేయ రాము నరసి యచట

సిద్ధపఱుపు మయ్య శీఘ్రముగను నాదు

పల్కు లెల్లఁ జెప్పి పావని! చని

22.   

 

 

 

తే.గీ.

క్షోభ పఱిచెడు నా తీవ్ర శోక రయము

చంప నెంచు దైత్యుల బెదరింపు లెల్లఁ

జేరి రాముని వినిపింపు వీర! వేగ

హ్లాద యానమ్ము నీ కగు నాంజనేయ!

23.   

 

 

 

తే.గీ.

తత్త్వ మెల్ల నెఱిఁగి రాజ తనయ చేత

మారుతి కృతార్థతా హర్ష మానసుఁ డయి

తలఁచి మిగిలిన వెడ పని తనదు మదిని

వెడలె నుత్తర దిశ వేగ యెడఁద యందు

24.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నలువదవ సర్గము.

 

 

సుందర కాండము

సర్గము 41.

 

కం.

ఏఁగుచు హరివరుఁడు ప్రథిత

వాగమృత సుకీర్తుతుఁ డయి వసుధా సుతచే

వేగం బాస్థలము వదలి

చాగెఁ దలఁప హృదయ మందు సముచిత రీతిన్

1.      

 

 

 

తే.గీ.

కంటి నసితేక్షణను జిన్నకార్య ముండె

శేషముగ నుపాయమ్ము లుచితము లనఁగ

రాదు మూడిచ్చట ననుసరణమునకును

న్యాయమ యుపయోగింపఁగ నాల్గవదియ

2.     

 

 

 

తే.గీ.

సామము గుణ మీయ దసు రోద్దాములకును

దాన మగుణము ధనమద దనుజులకును

భేద మలవడ దీ బల భీకరులకు

విక్రమంబ గుణం బగు వీరల కిఁక

3.     

 

 

 

కం.

విక్రమము దక్క నిచ్చట

సక్రమ మన్యముఁ దలంప సాధ్యంబె మహా

భిక్రమ హతాసురులఁ గన

నక్రములు దనుజులు మెత్త నౌదురు తలఁపన్

4.     

 

 

 

తే.గీ.

తన కొసంగిన పని యందును నితరంపుఁ

బను లనేకములు సలుప మును పొనర్చి

నట్టి పనులకు నంతరాయమ్ము లేక

యతఁడ కార్య సాధకుఁ డన నర్హుఁ డగును

5.     

 

 

 

తే.గీ.

ఎంత చిన్న కార్యం బైన సంతరింప

నొక్క గతియ యనంగ రా దుండు పెక్కు

లెంచ నవి యెఱింగిన వాఁడ యివ్వసుమతి

నర్థ సాధనకు సమర్థుఁ డగును జుమ్మి

6.     

 

 

 

చం.

స్వపర బలమ్ము లెల్లఁ గని పన్నుగ నిచ్చట ప్రస్ఫుటమ్ముగం

గపి విభు చెంత కేఁగఁ బ్రభు కార్యము సత్కృతమై చెలంగుఁ గౌ

ణప గణ శౌర్యమున్ విహరణమ్ములు నేర్పడు భంగి నిక్క డుం

డి పురము లంక లోపల వడిం జను వాఁడను నిశ్చయమ్ముగన్

7.     

 

 

 

తే.గీ.

ఏ విధి నగు సుఖమ్ముగ నీ యసురుల

తోటి నాకు సమరము నాదు బల మెల్ల

నగు ఫలప్రద మిచట దశాననుండు

గౌరవించు నాదు బల విక్రమము లింక

8.     

 

 

 

ఆ.వె.

చేరి రణమున దశశీర్షు సామాత్య స

బల గణమ్ము నరసి బలము వ్యూహ

ములు తలంపులెల్లఁ దెలిసికొని తిరిగి

యరిగెద ముదమున నినాత్మజుఁ గన  

9.     

 

 

 

కం.

ఇది యా దురాత్ముని వనము

సదమల నందన వన నిభ సతత నయన స

మ్మద నానా ద్రుమ వల్లీ

స దమన సంయుతము మానసహ్లాదజమున్

10.    

 

 

 

తే.గీ.

ఎండిన యడవి నగ్ని మండించు నటుల

ధ్వంస మొనరింతు వేగ మివ్వనము నెల్ల

నంత భగ్నమైన వనము నరసి రావ

ణుండు కోపించును దశకంఠుండు భృశము

11.    

 

 

 

కం.

స రథ గజ తురంగ బల స

మరమున కానతి యొసంగ మనుజాశన శే

ఖర నిచ యాధిపుఁ డా దశ

శిరుండు సాయుధ రణమగు శీఘ్రమ యిచటన్

12.    

 

 

 

తే.గీ.

దుస్సహ పరాక్రమమ్మున దురము నందుఁ

జండ విక్రము లా రాక్షసప్రవరుల

రావ ణాజ్ఞాను వర్తుల నే వధించి

యేఁగెద సుఖముగఁ గపీంద్రు నింటి కడరి  

13.    

 

 

 

కం.

ఆరంభించె ఘనానిల

దారుణ వేగమ్ము పగిదిఁ దరు సంతతిఁ దా

నూరు జవమ్మునఁ గూల్పఁగ

ధారుణిఁ గోపమున మారుత సుతుం డంతన్

14.    

 

 

 

ఆ.వె.

అవ్విధి హనుమంతుఁ డవ్వనము ప్రమదా

వనము మత్త విహగ పరివృతమ్ము

వివిధ వృక్ష షండ వీరుట్సమావృత

భాసితమ్ము ద్రుంచెఁ బంతమునను

15.    

 

 

 

తే.గీ.

భిన్నము లయిన గురుతర వృక్షములను

గలయఁ ద్రొక్కిన సురుచిర కమలినులను

బొడిపొడి యయిన ఘోరంపు భూధరములఁ

గనులకు నసహ్య మయ్యెను గాంచ వనము

16.    

 

 

 

తే.గీ.

చెఱువు లవి కూల నెఱ్ఱని చిగురు లన్ని

వడలఁ దరువులు లత లెల్ల వాడి పోవ

ఖగపు టఱుపులఁ గారగ్గిఁ గాల లతలు

కన్పడె నవి కూలి పుడమిఁ గాంత లనఁగ

17.    

 

 

 

తే.గీ.

ధ్వంసమైనవి చిత్ర లతా గృహములు

పాము లడవి మృగములు స్తంభనము లయ్యెఁ

గొండయిం డ్లవి వ్రక్కలై కూలె వీడు

లయ్యె వికృత రూపులు వనమందుఁ జూడ

18.    

 

 

 

తే.గీ.

వానర ప్రమ దావనమే నుడువఁగ

రావణ ప్రమదా వన ప్రాంత లయము

కపి కృ తాశోక ఘన లతా క్షయ మసురుల

శోక ఘన లతా ప్రతతిగం జూడ నయ్యె

19.    

 

 

 

తే.గీ.

అమ్మహా కపి యొసఁగి మహార్థ పతి మ

నసున కత్యంత ఖేదము నసుర పతికి

నుద్యమించి తా నెదిరింప నొంటరిగ న

నేక దైత్యులఁ దోరణ నిల్చె నంత

20.   

 

 

                                                         

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నలువది యొకటవ సర్గము.

 

 

సుందర కాండము

సర్గము 42.

 

                                                         

 

కం.

పక్షుల యఱుపులు భగ్నపు

వృక్షముల మహాస్వనములు పిక్కటిలంగన్

రాక్షసుల కెల్లరకు భయ

మక్షయమై చెలఁగె లంకయం దొక్క త్రుటిన్

1.      

 

 

 

కం.

భయ కంపితములు పాఱిన

వి యఱచి మృగ విహగము లతి వికృతస్వనముల్

దయనీయ దుశ్శకునము లు

దయించెఁ గ్రూరమ్ము లంత దనుజ వరులకున్

2.     

 

 

 

కం.

అంతట వికృత ముఖు లసుర

కాంతలు మేల్కని యరసిరి ఖండిత వన మా

చెంత మహా వీరుని దు

ర్దాంతాభీ లాంగ మారుత తనయునిఁ గపిన్

3.     

 

 

 

తే.గీ.

ఆతఁడు మహా భుజుండు మహా బలుండు

సత్త్వ రాజము దర్శించి సత్వరమ్ము

పెంచెఁ దనదు రూపమ్ము కపివరుఁ డసుర

వనితలకు భయావహముగఁ దనర నంత

4.     

 

 

 

కం.

దనుజాంగన లరసి యనిల

తనయు మహా కాయు నగమ తాదృశు నంతన్

జనక తనయ నతి సంభ్రమ

మున నడిగిరి చేరి వేగము విషయ మెల్లన్

5.     

 

 

 

తే.గీ.

ఎవ్వ రాతఁ డెందు నిమిత్త మేఁగుదెంచె

నిటకు నెందుండి యెవరి వాఁ డేమి పలికె

సీత! నీతోడ నిప్పుడు చేరి నిన్ను

సుభగ! చెప్పు మాకు భయము సుంత లేదు

6.     

 

 

 

ఆ.వె.

అంతఁ బలికె నా మహాసాధ్వి సర్వాంగ

సుందరి జనకసుత యందఱిఁ గని

దారి కలదె నాకు దనుజుల భీమ రూ

పుల నెఱుఁగఁగ నిచట ముదితలార!

7.     

 

 

 

కం.

ఎవ రేమి చేయఁగఁ దలం

చు వారొ మీక తెలియ నగుఁ జుమ్ము నిజముగన్

భువి పన్నగ పదములు ఫణి

కవగత మౌట పరికింప ననృతం బగునే

8.     

 

 

 

ఆ.వె.

భీత నైతి నేను బెట్టిదముగ నేర

నతనిఁ గామ రూపుఁ డయిన రక్క

సుఁ డని తలఁతు నతని నెడఁద వచ్చిన వాని

నిటకు నతివలార! యేల శంక

9.     

 

 

 

కం.

వైదేహి వచనములు విని

యా దనుజాంగనలఁ గొంద ఱటునిటుఁ బాఱన్

వేదన నిల్చిరి కొందఱు

వే దశముఖు దరి కరిగిరి వివరింపఁ బరుల్

10.    

 

 

 

కం.

చని దశకంఠు సమీపము

దనుజ వనితలు వికృత ముఖ దర్శన లంతన్

వనచరు విరూపు వానరు

ఘన భీమ శరీరుఁ దెలుపఁగఁ దొడంగి రటన్

11.    

 

 

 

తే.గీ.

రాజవర! యశోక వనికఁ దేజ మందు

ఘనుఁడు విక్రమ భీమాంగ కపి వరుం డొ

కండు వీరుఁడు జానకిఁ గదిసి భాష

ణమ్ము లాడిన వాఁడు గానఁబడె నుండ

12.    

 

 

 

ఆ.వె.

పల్మరు నడిగినను బలుక నిష్ట పడదు

నతని వివరము లవని తనయ జన

కాత్మజ హరిణాక్షి హరి గుఱించి యిసుమం

తైన రిపుగణ దమ నైక వీర!

13.    

 

 

 

కం.

అమరేంద్ర దూత యగుఁ గా

క మఱి ధనద దూతయైనఁ గావలెఁ దలఁపన్

రమణీమణి సీతను వెద

క మనుజ పతి రాముఁ డనిపెఁ గపివరు నేమో

14.    

 

 

 

తే.గీ.

అద్భుతంపు రూపమ్మున నతని చేత

నాశనం బయ్యెఁ బ్రమదావనమ్ము నీదు

చిత్త రంజన మ్మది వడి యిత్తఱి వివి

ధ మృగ విహగ గణాకీర్ణ మమితముగను

15.    

 

 

 

తే.గీ.

లేదు కాంచఁగ దేశము లేశ మైన

లయము కానిది యతని వలన వనమున

సీత యున్న యట్టి స్థలము నాతఁ డింత

యేని ముట్ట లేదు వదలె దాని వింత

16.    

 

 

 

కం.

జానకినిఁ గావ నెంచియొ

కానఁగ రా దలసియొ మఱి కాచెన్ వింతన్

మానిత వీరున కలపా

జానకి కావం బడియె నచట నాతనిచేన్  

17.    

 

 

 

తే.గీ.

శింశుపద్రుమమ్ము తరళ చిత్ర కుసుమ

పల్లవ సుశోభితమ్ము నప్పడఁతి సీత

యాశ్రయించి కూర్చున్న మహా తరు వది

రక్షితం బయ్యె నవ్వానరమ్ము వలన

18.    

 

 

 

తే.గీ.

సీతతోఁ బలికిన వాని నాతత వని

నాశనమ్మొనరించిన నగ చరోగ్ర

రూపుని మహోగ్రముగ రూపు మాపు నటుల

దండ మానతీయఁ దగును భండనమున

19.    

 

 

 

తే.గీ.

రాక్షస గణాధిప తలఁపఁ బ్రాణము లన

నాశ గలయట్టి వాఁడు ధైర్యమ్ము సేయు

నె పలుకఁగ సీత తోడ నీ వెలమి కోరి

నట్టి వనితామణి నరసి యడలు లేక

20.   

 

 

 

కం.

రక్కసుల వచనములు విని

మిక్కిలి రగిలె ననలమ్ము మించెడి భంగిం

బిక్కటిలిన కోపమ్మున

నక్కను గుడ్లు తిరుగంగ నసుర విభుఁ డటన్

21.    

 

 

 

తే.గీ.

మంటల వెలుంగు దివ్వెల మండు తైల

బిందువులు స్రవించి పడెడు చంద మొప్ప

నతని క్రుద్ధుని నేత్రద్వయంబు నుండి

కాఱఁ జాగెఁ గన్నీటి చుక్క లిల నంత

22.   

 

 

 

కం.

కింకరు లను వారలఁ ద

న్నింక బలమున సరితూగు నిద్ధ దనుజులన్

బింకముతో ననిపె హరిని

సంకెల బంధింప నా దశ శిరుఁడు వేగన్

23.   

 

 

 

మ.

అతి వేగోద్ధత వీర కింకరులు సాహస్రమ్ము లెన్నంగ నా

తతమౌ యెన్బది ఘోర సైనికులు తత్కాలంబ సంరంభులై

వితతోద్రేకులు కూట ముద్గర కరాభేద్య ప్రభూతోదరుల్

శిత దంష్ట్రప్రవరుల్ కపిగ్రహణ సంసిద్ధుల్ ర ణాశంసనుల్

24.   

 

 

 

తే.గీ.

వెడలి యా భవనము నుండి వీర హరి వ

రేణ్యుఁ దోరణమున నున్న రిపునిఁ గదియ

వేగ నిగ్రహింపఁ దలఁచి భీకరముగ                                                   

దూఁకిరి పులుఁగు లనలమ్ము దూఁకు పగిది

25.   

 

 

 

తే.గీ.

వా రతి విచిత్ర గదల సువర్ణ దండ

పరిఘముల దినకర నిభ శరములఁ గపి

వీర పుంగవు సంగర విక్రము నెది

రింపఁ జాగిరి క్రోధమ్ము నెంచి యంత

26.   

 

 

 

కం.

సమ్మెటల నడ్డ కత్తెల

ముమ్మరముగ శూలములను మూఁగి హరి వరుం

జిమ్మఁగ నీఁటెలతో క్షి

ప్రమ్మికఁ దోమర తతులను వాలిరి యెదుటన్

27.   

 

 

 

కం.

హనుమంతుఁ డతుల తేజో

ధనుండు శ్రీమంతుఁడు వసుధాధర నిభుఁడున్

ఘన వాలము తాడించి భు

విని నినదించె వన మెల్ల వే కంపింపన్

28.   

 

 

 

ఆ.వె.

మారుతాత్మజుండు ఘోర కాయుండయి

ధీరతఁ జఱచెఁ గడు దిట్టముగను

జబ్బ లంత హనుమ నిబ్బరము చెదర

నిండెను ధ్వని లంక నిండ వేగ

29.   

 

 

 

తే.గీ.

అమ్మహా శబ్దమునను దదనుగుణంపు

మారు మ్రోతల భువిఁ గూలె ఘోరముగ వి

హంగములు బిగ్గరగ మారుతాత్మజుండు

వలికె నందఱు విను నట్లు కలయఁ జూచి

30.   

 

 

 

ఆ.వె.

రఘకు లాతిబలుఁడు రామునకు జయము

జయము లక్ష్మణునకు సత్వ వంతు

నకు జయమ్ము హరిగణ విభుఁడు సుగ్రీవు

నకును రామ పాలిత కపిపతికి

31.    

 

 

 

ఆ.వె.

దాసుఁడ నరవరుఁడు కోసలేంద్రునకును

సులభ కర్మునకును శూర వరున

కు హనుమంతుఁడ నిట గొంగల హంతను

మారుతాత్మజుండ ధీర వరుఁడ

32.   

 

 

 

కం.

సరితూఁగరు వేలకు వే

ల రావణులు యుద్ధమున శిలలను దరువులం

బరుషముగ సహస్రములు వి

సరి చెలరేఁగంగ నాకు సత్యము నుడువన్

33.   

 

 

 

కం.

రాక్షసు లెల్లరుఁ గన మిథి

లాక్షితిధవ సుతకు మ్రొక్కి లంకా నగరిన్

రాక్షస నికాయ సహితము

నే క్షయ మొనరించి చనెద నిండిన పనితో

34.   

 

 

 

ఆ.వె.

అమ్మహా ధ్వని విని యసురు లెల్లరు భీత

చిత్తులై ఘనుఁ డగు మత్త గజ ని

భ హనుమంతుఁ గపిని భాసిత సంధ్యాస

మయ పయోద నిభుని మరలఁ గనిరి

35.   

 

 

 

తే.గీ.

అంత విభునాజ్ఞ నిశ్శంక నసుర వరులు

వివిధ చిత్ర విచిత్రంపు భీక రాయు

ధమ్ములు ధరించి కుప్పించి పమ్మి వేగ

మెగసిరి కపి వరుని మీద విగత భీతి

36.   

 

 

 

తే.గీ.

శూరు లెల్లరు నవ్విధిఁ జుట్టు ముట్టఁ

దనను హరి మహాసత్త్వుఁడు ధైర్య సాహ

సమ్ములు దనర నట నాయసంపు భీమ

పరిఘ నొకటి తోరణమునఁ బడసి వేగ

37.   

 

 

 

కం.

హతమార్చి రక్కసుల నా

తత పరిఘ విఘాతములఁ బతగ రా జహులన్

వెతకికొని తిరుగు విధి మా

రుతి పట్టి పరిఘ దివినిఁ దిరుగఁ జొచ్చెఁ దమిన్

38.   

 

 

 

ఆ.వె.

చంపి వీర రాక్షస భటుల కింకరా

ఖ్యులను సమర మందుఁ గలహ కాంక్ష

మీర నాశ్రయించెఁ దోరణమ్మును మారు

తాత్మజుండు తిరిగి యంత వింత

39.   

 

 

 

కం.

తెలిపిరి రావణునకు దను

జులు కొందఱు మిగుల నంత శూరాగ్ర వరే

ణ్యులు కింకరుల మరణముం

గలహమునఁ గపీంద్రు వలన గాంభీర్యముగన్

40.   

 

 

 

తే.గీ.

రాక్షస మహా బల మృతిని రావణుండు

విని కను లదరఁ గనలున వీరవరుఁ బ్ర

హస్త పుత్రుని ఘను నసహాయ శూరు

దుర్జయుని ననిపె ననికిఁ గర్జమెంచి

41.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నలువది రెండవ సర్గము.

 

సుందర కాండము

సర్గము 43.

 

                                                         

చం.

యమపురి కంపి కింకరుల నయ్యని లాత్మజుఁ డంత చింత సే

సె మనము నందు నాశనము సేసితి రమ్య వనమ్ము మెండుగన్

విమలపుఁ జైత్య సౌధముల వీడితి గాన లయం బొనర్పఁగన్

సమయము నాకు నింక నని సత్వముఁ జూపెఁ గపీంద్రుఁ డంతటన్

1.      

 

 

 

ఉ.

మేరు శిఖమ్ము నాఁ దనరు మిద్దియ పైకి సముద్గమించి యా

మారుత నందనుండు హనుమానుఁడు వానర పుంగవుండు గం

భీరత నెక్కి యున్నతము విస్తృత వేశ్మము వెల్గె నింపుగం

దూరుపు దిక్కు నం దపర తోయజ బాంధవు భంగి నత్తఱిన్

2.     

 

 

 

ఆ.వె.

గెల్చి యంతఁ జైత్య గృహము దుర్ధర్షము

నుత్తమమ్ము వాన రోత్తముండు

నరయ నపర పారియాత్ర నగము భంగి

కాంతి తోడ వెలిఁగెఁ గరము గాంచ

3.     

 

 

 

ఆ.వె.

మారుతాత్మజుండు ఘోర కాయుండయి

పరఁగి జఱచెను గడు బలము తోడ

జబ్బ లంత హనుమ నిబ్బరము చెదర

నిండెను ధ్వని లంక నిండ వేగ

4.     

 

 

 

తే.గీ.

అమ్మహా నిస్వనము శ్రవ ణాసహమ్ము

పాఱ దిశ లెల్ల భువిఁ గూలె ఘోరముగ వి

హంగములు చైత్య పాలకు లంతఁ గోలు

పోయిరి తెలివి కూలిరి పుడమిఁ దూలి

5.     

 

 

 

ఆ.వె.

అస్త్ర విదుఁడు బలుఁడు నా రాముఁడు జయించు

జయము లక్ష్మణునకు సత్వ వంతు

నకు జయమ్ము హరిగణ విభుఁడు సుగ్రీవు

నకును రామ పాలిత కపికి నిల

6.     

 

 

 

ఆ.వె.

దాసుఁడ నరవరుఁడు కోసలేంద్రునకును

సులభ కర్మునకును శూర వరున

కు హనుమంతుఁడ నిట గొంగల హంతను

మారుతాత్మజుండ ధీర వరుఁడ

7.     

 

 

 

కం.

సరి తూఁగరు వేలకు వే

ల రావణులు యుద్ధమున శిలలను దరువులం

బరుషముగ సహస్రములు వి

సరి చెలరేఁగంగ నాకు సత్యము నుడువన్

8.     

 

 

 

కం.

రాక్షసు లెల్లరుఁ గన మిథి

లాక్షితిధవ సుతకు మ్రొక్కి లంకా నగరిన్

రాక్షస నికాయ సహితము

నే క్షయ మొనరించి చనెద నిండిన పనితో

9.     

 

 

 

ఆ.వె.

పలికి యిట్లు చైత్య భవనమ్ము నందుండి

యఱచె గావుకేక ననిల సుతుఁడు

రక్కసులకు భయము మిక్కుటముగఁ గలు

గంగ నంత ధైర్య భంగ మయ్యె

10.   

 

 

 

కం.

విని యామహా స్వనమ్మును

గొని వివి ధాయుధము లసి సుఘోరప్రాసా

శని ఘన కుఠారములు కర

మునఁ జైత్యాధిప శతమ్ము మూఁగెను గపినే

11.    

 

 

 

ఆ.వె.

అతి విచిత్ర గదల నభ్ర మయ పరిఘ

ల రవి సన్నిభంపు శర చయముల

వానరప్రవరుని వారెల్ల బాధింపఁ

దొడఁగి రంతఁ గదిసి తోరముగను

12.   

 

 

 

కం.

పరివృతమై హరి పుంగవు

నరి వర్గము దనుజ నిచయ మట విలసిల్లెన్

గరిమంపు సుర నదీ జల

విరాజి తావర్తము వలె భీతిఁ గొలుపుచున్

13.   

 

 

 

ఉ.

అంతట వాయు పుత్రుఁడు మహాగ్రహ చిత్తుఁడు భీమ రూపమున్

వింతగ దాల్చి కంబమును బీఁకి విమానము నుండి హేమ భా

స్వంతము వంద కోణములు వాఁడి గలట్టివి యున్న దానిఁ దా

బంతము తోడఁ ద్రిప్పెను బ్రమాద కరంబుగ వేగవంతుఁడై

14.   

 

 

 

ఉ.

అప్పుడు పుట్టి యగ్నియు మహా భవనమ్మును గాల్పఁ జాగఁగన్

గుప్పున చూచి వాయుజుఁడు ఘోర నిశాట శతమ్ము నంత ము

న్నప్పురుహూతుఁడుం గులిశ మంది పలాశులఁ జంపి నట్టు తా

నొప్పి వధించి యభ్రమున నుండి వచించెఁ గపీంద్రుఁ డిట్టులన్

15.   

 

 

 

తే.గీ.

నా సమానులు బలులు వానర వరేణ్యు

లు బృహదాత్ము లెల్లరు వశులు కపి యూధ

రాజు సుగ్రీవునకు సహస్ర హరు లనుపఁ

బడి తిరుగు చుంటి మిట మేము పుడమి నిండ

16.   

 

 

 

కం.

పది యేఁనుగుల బలము తో

డఁ దనరఁ గొందఱు నపరు లడరఁగ దశ గుణం

బు దశ శతంపుఁ గరుల బల

ము దనరి మఱి కొంద ఱుండ ముచ్చట గొలుపున్

17.   

 

 

 

కం.

వఱద రయము మించఁగఁ గొం

దఱు వాయు జవమ్ము మించి తనరఁగ మఱి కొం

దఱు నప్రమేయ బలమున

వఱలెద రన్య హరి వరులు పన్నుగ నచటన్

18.   

 

 

 

తే.గీ.

అయుతములు శత శత సహస్రాధికములు

కోటులును సంఖ్యల హరుల ఘోర దంత

నఖము లాయుధములుగఁ దనరెడు వారి

తోడ వచ్చు సుగ్రీవుఁడు త్రుంప మిమ్ము

19.   

 

 

 

కం.

లంకా నగరం బుండదు

లంకేశుఁడు మీరు నింక లయ మౌదురు ని

శ్శంకను నిక్ష్వాకు విభుని

వంకన్ మీ కకట బద్ధ వైరము గలుగన్

20.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నలువది మూడవ సర్గము. 

 

 

సుందర కాండము

సర్గము 44.

 

                                                         

కం.

దనుజేంద్రు నానతిఁ బ్రహ

స్త నందనుండు ఘన దంష్ట్ర దనుజుండు మహా

ధను వూని జంబుమాలి య

ను నామధేయుండు దరలెను గనలి యనికిన్

1.      

 

 

 

కం.

అరు ణాంబరస్రజాక్షస

ర రుచిర కుండల వివృత వర వలయ నేత్రుం

డు ర ణాభేద్యుండు ఘనుఁ డ

సుర చండ పరాక్రముండు శూర వరుండున్

2.     

 

 

 

తే.గీ.

విల్లు వోల నింద్ర ధనుస్సు బెట్టి దంపు

బాణములు నారి సాగించి వడిని వజ్ర

తుల్య మగు నిస్వనమ్మును దుర్భరమ్ము

నన్ని దిశలను బూరించె సాభ్ర పథము

3.     

 

 

 

తే.గీ.

గాలిగాని యరదమున మ్రోల వాలు

నసురుఁ గాంచి హనుమ మోద మంది మిగుల

నఱచె నురు వేగవంతుఁడు హరి వరుండు

భీకరమ్ముగ దిశ లెల్ల సోఁక స్వనము

4.     

 

 

 

ఆ.వె.

జంబుమాలి చూచి సత్త్వవంతు హనుమ

నా కపివరుఁ దోర ణాగ్ర మందు

ఘన భుజుండు శర నికాయ ప్రయోగము

నఁ గడుఁ గాయపఱచెఁ బగను బూని

5.     

 

 

 

కం.

వదనమున నర్ధ చంద్రపుఁ

బదను సెలను దింపి కర్ణ బాణము శిరమం

దుఁ దనరఁ జేసి భుజముల బె

డిదంపు టిషువులఁ బదంపడి పదింటఁ గపిన్

6.     

 

 

 

తే.గీ.

జంబు మాలి బాధింపఁగ శర విఘాత

ములఁ గపి యెఱుపు ముఖమంత వెలిఁగె భాస్క

ర కిరణమ్ములు పడ్డ శరదృతు పుల్ల

పద్మము పగిది రుధిరమ్ము వాఱ నపుడు

7.     

 

 

 

కం.

నభ మందు నున్న పద్మపు

విభవమ్ము స చందనేద్ధ బిందు నివహముల్

ప్రభవిల్లెఁ గపి వరేణ్యుని

శుభారుణాననము తడియ శోణిత మందున్

8.     

 

 

 

చం.

దనుజుని బాణ ఘాత మతి దారుణ కోపము రేఁప వాయునం

దనుఁడు ఘనుండు వానరుఁడు దారుణ మైన శిలన్ సమీపమం

దు నరసి యెత్తి వైచె నిజ దోర్బల దర్పము చెన్ను మీఱఁగం

గని దశ తీవ్ర బాణముల ఖండన ముక్కునఁ జేసె దైత్యుఁడున్

9.     

 

 

 

తే.గీ.

నిష్ఫలము గాగఁ గర్మ మనిల సుతుండు

గాంచి చండ విక్రముఁ డంత ఘన నగమ్ము

సాలవృక్షము నొకదాని శౌర్య ధనుఁడు

పెల్లగించి త్రిప్పఁ దొడఁగె భీకరముగ

10.    

 

 

 

కం.

గిరగిర త్రిప్పెడి యా వా

నరు ఘన బలవంతు సాల నగము నరసి వే

సె రయమున జంబుమాలి య

సురుండు నారాచ తతులు చోద్యము గొలుపన్

11.    

 

 

 

తే.గీ.

చక్కడిఁచె నాల్గు శరముల సాల తరువు

ననిల సుతు భుజముల నేసె నైదు నురము

నందు నొకటి స్తనాంతర మందుఁ బదియు

నేసె నిషువులు రాక్షసుఁ డెసక మెసఁగి

12.    

 

 

 

కం.

తను వెల్ల నిండ శరములు

హనుమంతుఁడు నావృతండునై క్రోధమునన్

మునుపటి పరిఘమ్ము వడసి

తనరెం ద్రిప్పుచు రయమున దైత్య దమనుఁడై

13.    

 

 

 

కం.

ఘన వేగవంతుఁడు బల

మ్మున నధికుండు వడిఁ బరిఘమును ద్రిప్పుచు నా

దనుజ వరు జంబుమాలి బ

లు నురమ్మున నేసె నంత రోషం బొప్పన్

14.    

 

 

 

ఆ.వె.

అంత నతని శిరము హస్తము లింక మో

కాళ్లు ధనువు రథము ఖరము లిషువు

లెల్ల కాన రావు బల్లిదంపు గుదియ

తాఁక నసురు నురము దారుణముగ

15.    

 

 

 

కం.

అని హతుఁడై పరిఘమ్ము క

తన వేగమ జంబుమాలి ధరణిం గూలెం

గనక విభూషణ రాసులు                                             

తునకలు గాఁగఁ బడఁ బుడమిఁ దూలుచు నంతన్

16.    

 

 

 

ఆ.వె.

జంబుమాలి నిహతి చావు కింకరుల మ

హా బలుల విని దను జైక నాథుఁ

డు దశకంఠుఁడు ఘనుఁడు కడు నలిగెఁ గను

లరుణ మయము  లయ్యె నధికముగను

17.    

 

 

 

కం.

మరణింపఁ బ్రహస్త సుతుఁ డ

సురపతి యానతి నొసంగె సుమహా కోపం

బు రగుల నమాత్య సుతులకుఁ

బరఁగ ననికి వీరులకును బట్టంగఁ గపిన్

18.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నలువది నాలుగవ సర్గము. 

 

సుందర కాండము

సర్గము 45.

కం.

వెడలిరి భవనము నుండి య

తి డంబరమ్ముగ నమాత్య ధీ సుతు లంతన్

వడి యేడ్గు రనల తేజులు

నిడ నానతి నసుర నాథుఁ డీసున ననికిన్

1.      

 

 

 

ఆ.వె.

బల సమేతులు నురు బలవంతు లందఱు

ఘన ధనుర్ధరులును గదన దుర్జ

య సకలాస్త్ర విద వరాగ్ర గణ్యులు జయ

కాంక్షిత మతు లంతఁ గదలి రనికి

2.     

 

 

 

తే.గీ.

బంగరు వలగప్పి సిడలు పడగలు గల

యరదముల గుఱాలను గూడి యక్కజంపు

మబ్బు లందలి పిడుగుల నుబ్బు మ్రోత

లెల్లఁ జెలఁగ మల్లులు పైడి విల్లు లంది

3.     

 

 

 

కం.

చాచుచు నతి మోదమ్మున

రోచిర్విద్యుల్లతా గురు జలద నిభమై

తోఁచుచు మహాసుర వరులు

వే చనిరి మహా కపి వరు విదళింపఁ బగన్

4.     

 

 

 

తే.

కింకరుల తల్లు లెల్లరు కింకర గణ

నిహతము విని సబాంధవ నిచయ మిత్ర

గణము తల్లడిల్లిరి శోక గరిమ తప్త

చిత్త లయి భృశమ్ము చెలంగఁ దత్తరమ్ము

5.     

 

 

 

ఆ.వె.

మంత్రి పుత్రు లంత మదమున నొరయుచు

నొండొరుల వర కన కోత్త మేద్ధ

భూషణ ధరు లెల్లఁ బూని దుమికిరి తో

రణ తలస్థిత కపి గణ వరుఁ గని

6.     

 

 

 

తే.గీ.

రాక్ష సాంబుదములు ఘన రథ రవంపు

టుఱుముల శర వర్షమ్మును బరఁగఁ జేసి

వాన తోడి మేఘమ్ముల భంగి దనరి

విహరణమ్మొనరించెను విస్మయముగ

7.     

 

 

 

తే.గీ.

వర్ష ధారల మునిఁగిన వర గిరి వలె

హనుమ కన్పట్టె నచ్చట నద్భుతముగ

శర నికాయము గప్పఁగ హరి వరేణ్యు

సుందర తర కాయం బెల్ల సందు లేక

8.     

 

 

 

ఆ.వె.

వేగవంతుఁడు కపి వీరుల రథ వేగ

మంత మించి విభవ మధికమై త

నర శరముల నన్ని కరము నిష్పలము గా

వించె నభమునఁ జరియించి యంత

9.     

 

 

 

తే.గీ.

ఇంద్ర చాపమున నలరు నింపగు జల

దమ్ములఁ గదల్చు ప్రభు వనిలమ్ము పగిది

యా ధనుర్ధరుల నెదిర్చి యనిల సుతుఁడు

వీరుఁడు నభమునఁ జరింప వెలిఁగె నపుడు

10.    

 

 

 

కం.

నినదించి ఘోరముగ నా

దను జానీకము నదల్చి దట్టంబుగఁ బెం

చెను వేగమ్మును హరి దుమి

కెను రాక్షస వీరుల పయికి మహోగ్రుండై

11.    

 

 

 

తే.గీ.

కొందఱి నఱచేతన్ మఱి గొందఱి నటఁ

బాదముల రిపు దమనుఁడు పదపడి మఱి

కొందఱిని ముష్టి నఖములఁ గొందఱిని క

పిప్రవరుఁడు పీడించెను భృశము కనలి

12.    

 

 

 

తే.గీ.

వక్షమున నలిపె దనుజ వరులఁ గొంద

ఱి నడిచెను నూరువులఁ గొందఱి మఱి పరులు

పడిరి పుడమిని దుర్భర ధ్వనిని వినఁగ

దానవధ్వజమున ధీరత సడలంగ

13.    

 

 

 

కం.

కాంచఁగ నిహతామాత్య వ

రాంచిత సుతులను బతిత మహాసుర సేనా

సంచయమును శేషాసురు

లెంచి శుభముఁ బాఱిరి దిశ లెల్ల భయమునన్

14.    

 

 

 

తే.గీ.

కరులు ఘీంకరించె వికృతక్వణనములను

దురగములు దారుణమ్ముగఁ దూలె భువిని

ఛత్ర పీఠ కేతనములు పత్ర యుతము

భగ్నమై చెల్ల చెదరయ్యె వసుధ నంత

15.    

 

 

 

కం.

పాఱుచు రుధిరమ్ములఁ బథి

నేఱులు కనిపించె లంక నెచ్చట గనినన్

మీఱె నతి వికృతపు ధ్వనులు

మాఱెను లంకా నగరము మరు భూమి యనన్

16.    

 

 

 

ఆ.వె.

చండ విక్ర ముండు సత్త్వ వంతుఁడు మహా

కపి వరుండు చంపి కండ కావ

రంపు రక్కసులను రాక్ష సాన్యులఁ గోరి

నిలిచెఁ దోరణమున నలిగి తిరిగి

17.    

 

                                                         

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నలువది యేనవ సర్గము. 

 

 

 

సుందర కాండము

సర్గము 46.

 

                                                         

కం.

వానర వీరుని వలనన్

దానవ మంత్రి తనయు లతి దారుణ రీతిన్

వే నాశన మౌట విని ద

శాననుఁ డతి గుంభనముగ నాలోచించెన్

1.      

 

 

 

శా.

ఆదేశించెను రాక్షసేంద్రుఁడు విరూపాక్షున్ ససైన్యంబుగం

జేదోడై వెలుగంగ నాతనికిఁ బంచెన్ వీరు యూపాక్షుఁ గ్ర

వ్యాదుల్ దుర్ధర భాసకర్ణులను వే పట్టంగ నా మారుతిన్

ఛేదింపన్ ఘన వీరు నా ప్రఘసునిన్ సేనాగ్ర నాథోగ్రులన్

2.     

 

 

 

తే.గీ.

వాయు వేగ నిభు లనిని వాయుజ గ్ర

హణ రతు లయి బల సమేత మగ్ర నేత

లార! రథ వాజి కరి సమూహములఁ గూడి

చనుఁడు శాసింప వానరు ఘనుని ననుచు

3.     

 

 

 

కం.

కపివరుఁ జేరి ప్రయత్న

మ్ము పరఁగఁ జేసి స్థల సమయముల కరయంగన్

విపరీతము గాకుండఁ జ

లుప వలెఁ బను లెల్ల జాగరూకత మీరల్

4.     

 

 

 

తే.గీ.

కాంచ నాతని ఘోరంపుఁ గార్యములను

దలఁప నతనిని సామాన్య తరుచరుఁ డన

నతి బల సమన్వితుండు మహా శరీరి

యతఁ డని మది నెంచెద నిశ్చయముగ నిపుడు

5.     

 

 

 

చం.

తనదు తపోబలమ్మున శతక్రతువే సృజియింప నోపు నీ

తనిని మదర్థ మిచ్చటను దావది లే దనుమాన మొందఁగన్

మునిగణ నాగ యక్ష సురముఖ్య నిశాచరకాయ దేవగా

యనుల జయింప మీరలు సహాయులు గా నని నేను గ్రుద్ధుఁడై

6.     

 

 

 

తే.గీ.

కలుగ నోపు మనకు వారి వలన నించు

కైన నాపద తథ్యమ యనువుగ బల

మెల్లఁ జూపి పట్టవలె హరీశ్వరునిఁ బ

రాక్రము నవమానపఱుప రాదు సుమ్మి

7.     

 

 

 

ఉ.

వేవుర వానరోత్తముల విస్తృత విక్రము లైన వాలి సు

గ్రీవుల జాంబవంతుఁ డను ఋక్ష వరేణ్యుఁడు నీల నామ సే

నా విభుఁ డింక నా ద్వివిద నామ హరీంద్రుఁ డనంగఁ బెక్కురన్

భూవలయమ్మునం దిరుగఁ బూర్వము గంటిని కాని వారికిన్

8.     

 

 

 

తే.గీ.

లేవు తలఁపంగ నిట్టిదౌ లావును గతి

తేజ మింక నుత్సాహము ధీగుణమ్ము

కామరూప సంపదయును భీమ విక్ర

మమ్ము నీతని వలె నిశ్చయమ్ముగఁ జుమి

9.     

 

 

 

కం.

కపి రూపమ్మునఁ దనరెడు

విపుల బృహత్సత్త్వ మిది వివేకముగఁ దలం

చి పరమ యత్న భరమ్మునఁ

గపి వీరునిఁ బట్టఁగ వలెఁ గౌణపు లారా!

10.    

 

 

 

తే.గీ.

సమరమున నిల్వ మీముందుఁ జాల రెవ్వ

రును సశక్ర ససుర నర దనుజ వరుల

యందు నీ ముజ్జగము లందు నెందుఁ గూడ

వెదకి చూడ నిక్కమ్ముగ వీరులార!

11.    

 

 

 

ఆ.వె.

అయినను ఘన విజయ మరసి రణము నందు

నాత్మ రక్షణ మెద లందు నునిచి

సుప్రయత్నయుక్త మప్రమత్తు లగుఁడు

జయము నెంచ నేను సందియ మని

12.    

 

 

 

తే.గీ.

నాథు నానతిఁ జేకొని నైరృ తాగ్ర

వీరు లగ్ని నిభప్రభా విక్రము లతి

రయమునఁ జనిరి మద కుంజర రథ తురగ

సహిత సబల సుతీక్ష్ణ శస్త్ర వర యుతము

13.    

 

 

 

ఆ.వె.

కాంచిరి చని వారు కపివరేణ్యు నుదయ

భాను పగిది వెలుఁగు వాని స్వీయ

దేహ తేజమునను ధీరునిఁ దోరణ

మందు బలుని సత్త్వు యత్న పరుని

14.    

 

 

 

తే.గీ.

వారి వారి యాయుధములు వీరులు గొని

యరయఁగనె మహా బలుని మహా రయుని మ

హాంగుని నలుదిసల నిల్చి యంత భీక

రమ్ముగం దాఁకి రా వానరప్రవరుని

15.    

 

 

 

తే.గీ.

దుర్ధరుం డంత వాడివౌ తూపు లైదు

నల్ల కలువ రేకుల రంగునఁ బసిఁడి మిసి

మి మొనలు గలవి యేసె నినుమునఁ జేసి

నట్టివి శిరమందుఁ గినిసి హరివరు పయి

16.    

 

 

 

తే.గీ.

తగులఁ దల యందు శిఖు లైదు దద్దరిల్ల

దశ దిశ లఱచి యంతఁ బెద్ద స్వనమున హ

రీశ్వరుం డెగిరెను వేగ మింత పెంచి

యాకసమ్మున కత్తఱి నద్భుతముగ

17.    

 

 

 

ఆ.వె.

సరథుఁడై గుణమ్ము సాచి దుర్ధరుఁడు వీ

ర వరుఁ డంత శిత శర శతములు మ

హా బలుండు వేసె హరివీరు వీక్షించి

కోప తప్త హృదిని ఘోరముగను

18.    

 

 

 

కం.

నభ మందుండి హరి కరటి

నిభుండు వారించెను శర నివహమ్మును నీ

లభ పంక్తినిఁ ద్రోలు ననిలు

నిభమ్మున మెఱసి ఘనుఁడు వనేచరుఁ డంతన్

19.    

 

 

 

కం.

హరి హింసకు గుఱి యయి దు

ర్ధరు చేత ననిల సుతుఁడు కదన మొనరించెం

దిరిగి శరీరముఁ బెంచి య

తి రయమ్మున భీకరముగ ధీరుం డంతన్

20.   

 

 

 

తే.గీ.

దూర మెగిరి యతం డొక్క సారి ఘోర

వేగముగ దుమికెను హరి వీరుఁ డంత

దుర్ధరు రథమ్ము పైకి విద్యుత్సముచ్చ

యమ్ము శైలమునఁ బతన మైన పగిది

21.    

 

 

 

ఆ.వె.

గుఱ్ఱము లెనిమిదియుఁ గూలంగ నక్షము

కూబరమును రథము ఘోరముగ వి

ఱుగ విడిచి రథమ్ము విగత జీవిగఁ గూలె

ధరణి దుర్ధరుండు దారుణముగ

22.   

 

 

 

కం

కని వాని భూపతన మా                   

దనుజ లరి భయంకరులు కదన దుర్ధర్షుల్

ఘన యూపాక్ష విరూపా

క్ష నగ నిభాంగులు దుమికిరి సమరమ్మునకున్

23.   

 

 

 

కం.

నిలఁబడ మహాభుజుఁడు దివి  

నల క్షిప్రం బెగిరి కొట్ట యసుర వరులు దై

త్యుల సమ్మెట లుర మందుఁ ద

గిలె ఘోరమ్ముగ గిరి నిభ కీశ వరునకున్

24.   

 

 

 

ఆ.వె.

వేగవంతుఁడు ఘన వీర్య విలసితుండు

వారి వేగ మంత ధీర వరుఁడు

వాయు నందనుండు వారించి దుమికె ని

లాతలమునఁ బక్షి రాజు భంగి

25.   

 

 

 

ఆ.వె.

వేగ చేరి సాల వృక్షమ్ము పెకలించి

దాని ననిల సుతుఁడు దానవద్వ

యమ్ము మీద వైచి యత్యంత ఘోరమ్ము

గ సమయించె నంతఁ గర్కశముగ

26.   

 

 

 

తే.గీ.

ముగ్గురి మరణం బెఱిఁగి వా రగ్గలముగఁ

గనలుచుఁ బ్రఘసుండును భాసకర్ణుఁడు నతి

తీక్ష్ణ శూలమ్మును గొని చేతిని రయమున

నుఱికిరి హరి వీరుని పైకి నుక్కు మీఱ

27.   

 

 

 

కం.

కపి శార్దూలుం డుండ నొ

క పార్శ్వమున నడిచె నా ప్రఘసుఁడు మహా తీ

క్ష్ణపుఁ బట్టిసమున డొంకెనఁ

గపివరుఁ బొడిచె వడి భాసకర్ణుం డింకన్

28.   

 

 

 

ఆ.వె.

గాయ పడిన యట్టి గాత్రములను రక్త

సిక్త రోమ జాల యుక్తమై క

పీశ్వరుం డుదయ దినేశ్వరు భంగి క

న్పడెఁ గనలి భృశమ్ము వాయుజుండు

29.   

 

 

 

కం.

హతమార్చె నుభయ వీరుల

నతి ఘన గిరిశృంగ మెత్తి యహి మృగ భీమ

క్షితిజ యుతమ్ము విసరి వా

యు తనయుఁ డా యసుర వరుల నుగ్రత నంతన్

30.   

 

 

 

ఆ.వె.

శీఘ్రమ తునిమి యని సేనాపతుల నైదు

గురను హరి వరుండు ఘోరముగను

నాశనమ్ము సేసె నా శేష దనుజ బ

లమ్ముఁ గూడ వేగ క్రమ్ము కొనఁగ

31.    

 

 

 

తే.గీ.

తురగములఁ దురగమ్ముల తోడఁ గరులఁ

గరుల చేత నరదముల నరదముల వ

లనను యోధులఁ గపి యోధుల వలన విన

శన మొనర్చె నసురులను శక్రు భంగి

32.   

 

 

 

కం.

అవరోధము లాయె గతులు

భువి నెల్ల దిశల హత కరి పూరణమున సా

శ్వ వినిహ తాసురుల రథా

క్ష వికలత వలనను వింతగ నపుడు లంకన్

33.   

 

 

 

ఆ.వె.

మారుతాత్మజుండు మడియించి సేనాప

తుల బల సహితమ్ము కలనున ఘన

వాహనముల నంతఁ బరగెఁ దోరణమునఁ

దిరిగి ప్రళయ సమయ హరి యనంగ

34.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నలువది యాఱవ సర్గము. 

 

 

సుందర కాండము

సర్గము 47

 

తే.గీ.

సేన కధిపతు లేవురు వే నశింప

హరి వరేణ్యు వలన సహచరులఁ గూడి

వాహన సహితం బరసి రావణుఁడు సూచె

రణ రతాక్ష కుమారు నగ్రమున నపుడు

1.      

 

 

 

ఆ.వె.

రాజ వీక్షణమ్ము రయమునఁ గాంచి ప్ర

తాపవంతుఁ డంత దశముఖ సుతుఁ  

డక్షుఁడు వడి లేచె నమర చాపమ్ముతో

విప్ర హుతపు టగ్ని విధము దనరి

2.     

 

 

 

ఆ.వె.

అంత బాల దినక రాభ ప్రభా భాసి

త కలధౌత జాల ధర రథ వర

ము నధిరోహణమ్ము నొనరించి రాజ సు

తుండు సనెఁ గపిఁ గన దోర్బలుండు

3.     

 

 

 

చం.

తపముల నాచరింప ఫలితమ్ముగ నందిన యట్టి తేరు నం

ద పరమపుం బసిండి వల యందు నమర్పఁగ  రత్న సక్తమై

న పడగలున్ ధ్వజమ్మును ఘనమ్ముగఁ గాంతుల నీయ వాయు తు

ల్య పరమ వేగ ఘోటక లలామము లారథ యోజితమ్ములై

4.     

 

 

 

తే.గీ.

ఎనిమిది చెలంగఁ దగులక యిల నడువ న

భేధ్య మా సురాసురులకు విన్నునఁ జరి

యింప శక్తి మెఱసి కత్తు లెనిమి దుండ

శక్తి తోమర వరతూణ యుక్త ముండ

5.     

 

 

 

తే.గీ.

సకల వస్తువుల నమర స్వర్ణ దామ

విలసితంబై తనరఁగ రవి శశి నిభపు

రుచుల సూర్య సమాన గురుతర రథము

నంద యతుల విక్రముఁ డంత నరిగె వేగ

6.     

 

 

 

ఆ.వె.

నింపి రథ గజాశ్వ నిస్వనముల నభ

స్సాచ లావనీ తలావరణము

నరిగెఁ దోరణస్థి తాంజనేయు సమర్ధు

దరకి సబల మసుర తనయుఁ డంత

7.     

 

 

 

తే.గీ.

చేరి వానరుఁ గాలాగ్ని తీరు నున్న

వాని లయకాల మందలి పరమ సంభ్ర

మైక చిత్తమున నరసె నక్కపివరు

హరినయనుఁ డక్షుఁ డపుడు మర్యాద తోడ

8.     

 

 

 

తే.గీ.

సుబలుఁ డక్ష కుమారుఁడు శూరవరు క

పి వరు బలము వేగము గాంచి స్వీయ బలము

నెంచి తర్కించి  మది నుత్సహించి పెరిఁగె

హిమ లయానంతరంపు దినేశు భంగి

9.     

 

 

 

తే.గీ.

స్థిరుని నాహవ దుర్జయు హరివరేణ్యు

సుదృఢ చిత్తుఁ డసుర తనూజుండు జాత

రోష మానసమున  జాగరూకత శిత

శరము లేసి మూ డాజికిఁ బురికొలిపెను

10.    

 

 

 

కం.

అలసట గెల్చిన వాని రి

పు లయోత్సాహు నరసి కపి పుంగవు దర్పున్

విలు నూని సబాణమ్ముల

బల దర్పిత మానసమునఁ బావనిఁ జూచెన్

11.    

 

 

 

కం.

కన కాంగద కుండలములఁ

దనరి రణాప్రతిముఁ జేర దను జానిల నం

దనుల సమర మయ్యె నమర

దనుజ గణ భయప్రద మతి దారుణ రీతిన్

12.    

 

 

 

మ.

ధ్వని మ్రోఁగెన్ భువి దద్దఱిల్ల నిలిచెన్ భానుండు హీనద్యుతిన్

ఘనుఁ డా వాయువు వీవ నొల్లఁడు మహా గ్రావాళి కంపించె నెం

డెను వారాశి నభమ్ము  మ్రోఁగెఁ గడుఁ గాఠిణ్యంపు రీతిన్  దశా

నన పుత్రానిల నందన ద్వయపు టానర్తమ్ము వీక్షింపఁగన్

13.    

 

 

 

తే.గీ.

చెల్వగు చిలుకు లంతఁ బసిండి పుంఖ

ములు నెఱులఁ గూడి తనరెడు మూడిఁట విష

పూరి తోరగము లనంగ మూర్ధ మందుఁ

గపి వరునకు నాఁటఁగ నేసె ఘన నిపుణుఁడు

14.    

 

 

 

ఆ.వె.

మూడు నొక్క ద్రుటిని మూర్ధమునఁ దగులఁ

గాఱు రక్త మందుఁ గలసి తిరిగె

డు కనుల నుదయ దివస కరు నిభమ్ము వె

లింగె శర కిరణ సుసంగతమున

15.    

 

 

 

కం.

అంతఁ గని రాజ నందనుఁ

జెంతన సుగ్రీవ మంత్రి శేఖరుఁ డని న

త్యంతాయుధ కార్ముక ధీ

మంతు నలరి పెంచి మెయి సమర ముఖుఁ డయ్యెన్

16.    

 

 

 

కం.

మందర గిరి రవి పగిది న

మంద బల హరీశ్వరుఁడు కుమారాక్షునిఁ దా

డెందమునఁ గాల్చెఁ గోపం

బంది సబల వాహనముల నంబక శిఖులన్

17.    

 

 

 

తే.గీ.

విల్లు నంపపొది ధరించి జల్లు కురిసె

నంబుల నెఱచిమేపరి యనెడి మబ్బు

హరి నగము పైన నీరద మచలము పయి

వాన కురియు పగిది కోప మూని యాజి

18.    

 

 

 

తే.గీ.

మేఘ నిభ విక్రముని నక్షు మేటి సమర

వీరుఁ దేజము బలమును విరివి యైన

వానిఁ జూచి భండనమున వాయు నంద

నుండు నినదించె ముదమున మెండు గాను

19.    

 

 

 

కం.

బల దర్పితుఁ డలుక నరుణ

కలిత నయనుఁడు గదిసె రణ కాఠిన్యు హరిం

దలఁపఁగఁ జిన్నతనమ్మనఁ

జెలఁగి గఱిక కప్పినట్టి చెలమఁ గరి విధిన్

20.   

 

 

 

కం.

తీవ్రముగ నాఁట శరములు

నా వ్రణములఁ గాంచి యఱచె ననిల సుతుఁడు మే

ఘవ్రజ రవ మనఁ జాఁచి సు

తీవ్రముగ భుజోరువులను దివమున కెగిరెన్

21.    

 

 

 

ఆ.వె.

వెనుక నుఱికె నసుర వీరుఁడు రథికప్ర

వరుఁడు విక్రముండు పఱచి బాణ

ములు కపివరు పైన జలధరము నగము

పైన ఱాల వాన పఱచు పగిది

22.   

 

 

 

ఆ.వె.

వాయు సమ రయుండు భండన చండ వి

క్రముఁడు శరములకు నడుమ వెడలుచు

గగన తలమున హరి గాలి వోలెఁ జరించె

రిత్త వోవ తూపు లత్తఱి నిఁక

23.   

 

 

 

కం.

సమరోన్ముఖు నక్ష కుమా

రు మహా తూణీర ధరు నురుతర శరములం

దమి దివము నింపు వాని బ

హుమాన దృష్టులఁ గని కపి యూహించె నిటుల్

24.   

 

 

 

తే.గీ.

గాయపడి భుజముల మధ్య కడుఁ గుమార

వీరు శరముల వలనను వివిధ సమర

కార్య తత్త్వజ్ఞుఁ డంత సంగ్రామ విక్ర

మము తలంపఁ దొడఁగె హరి  మనము నందు

25.   

 

 

 

ఉ.

బాల దివాక రాభుఁడు నబాల పరాక్రమ వంతు తీరునన్

మేలుగ మేటి కర్మములు మించి బలమ్మునఁ జేసె నిప్డు  తా

నాలపుఁ గార్య సంచయము లందున భాసిలె నద్భుతమ్ముగన్

బాలుని రూపు మాపుటకు భావము వుట్టదు చిత్త మందహో

26.   

 

 

 

తే.గీ.

పోరు నందు నోర్పరి ఘన వీరు లందు

మేటి హృదయ మందు ఘనుఁడు మాట లందు

హితుఁడు గుణకర్మముల చేత నుతుఁడు నాగ

యక్ష మునుల చేతను సందియమ్ము లేదు

27.   

 

 

 

తే.గీ.

వేగవంతుఁడు నుత్సాహ వీర్యముల న

లరిన మానసుండు నిలిచె నరసి నన్ను

సముఖమున నడరి యితని శౌర్యము వణిఁ

కించు మది సురాసురులకు నెంచ నిజము

28.   

 

 

 

తే.గీ.

పెరుగు చున్నది దనుజుని విక్రమమ్ము

తగదు నా కుపేక్షింపఁగఁ బగతుని నిఁక

వధయె గుణమని తలఁతు నే విధము నయిన

మండు ననలము నశ్రద్ధ మనుపఁ దగదు

29.   

 

 

 

తే.గీ.

శత్రువు జవము పరికించి చక్కఁగఁ

యెంచిన పనిఁ దర్కించి కపీశ్వరుండు

ఘన బలుండు వేగము పెంచి మనము నందు

నిశ్చయించెఁ బరునిఁ జంప నిష్కరుణను

30.   

 

 

 

తే.గీ.

అంత నష్టాశ్వములను మహాజవముల

భార వాహములఁ దిరుగ వాయు పథము

నందుఁ దల ఘాతమునఁ జంపె ననిల సుతుఁడు

వీరుఁడు కపి శేఖరుఁ డతి వేగమునను

31.    

 

 

 

ఆ.వె.

పడెను నభము నుండి పుడమిని రథ మంతఁ

గపి వర ఘన తల విఘాతమునను

బగుల గూడు నొగలు వ్రాల నశ్వమ్ములు

భువి నుసుఱులు గోలుపోవఁ ద్రుటిని

32.   

 

 

 

తే.గీ.

ఖడ్గ కార్ముకముల నూని గగనమున కె

గిరె మహా రథుఁ డా రథ వరము వీడి

దేహమును సంయతిని వీడి దివ్య లోక

మేఁగు ముని భంగి వీరుఁడు వేగముగను

33.   

 

 

 

తే.గీ.

అంత నంబరమును గరు డానిల సుర

సిద్ధ సేవిత పథమును జేరి సంచ

రించు వాని పాదములు చేరి నిబిడముగఁ

బట్టెఁ గపి పితృ సమ వేగ వంతుఁ డడరి

34.   

 

 

 

తే.గీ.

పట్టి వే మారులుం గాలిపట్టి గొట్టి

యక్షు దట్టముగను ద్రిప్పి యభ్ర మందు

నిట్టె పడవైచె రయముగ నిలను గరుడి

పుట్టపురుగుఁ బట్టి విసరి నట్టు లంత

35.   

 

 

 

చం.

పగులఁగఁ జేతులుం దొడలు భారపుఁ దుంటియుఁ గంబుకమ్మునున్

మొగమునఁ గాఱ రక్త మిఁక ముక్కలుగం బడ శల్య నేత్రముల్

పగులఁగ సంధు లన్నియును బర్వ నరమ్ములు నచ్చ టచ్చటన్

ఖగవతి పైనఁ గూలె మృతిఁ గౌణపుఁ డంత హరీశ ఘాతుఁడై

36.   

 

 

 

చం.

ఘనముగ భీతుఁ జేసె దశకంఠుని మారుతి చంపి పుత్రునిన్

మునులు మహావ్రతప్రవర భూత సచార సయక్ష బృంద ఫ

ణ్యనిమిష సేంద్రు లెల్లరు మహా కపి కార్యము గాంచి సంభ్రమ

మ్మున హరి వీరు రాక్షస విమోచను జూచిరి విస్మయమ్ముగన్

37.   

 

 

 

కం.

అక్ష కుమారుని ఘను నరు

ణేక్షణు వృష సుత నిభు వధియించి కపి యిఁకన్

రాక్షస నిరీక్షణమునఁ బ్ర

జాక్షయ  రత కాలుఁ డనఁగఁ జనెఁ దోరణకున్

38.   

                                                         

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నలువది యేడవ సర్గము. 

 

 

సుందర కాండము

సర్గము 48

 

                                                         

కం.

విని యక్ష కుమార నిధన

మనిలాత్మజుచేఁ గనలుచు నసురేంద్రుఁడు దా

మనమున నోర్చి పనిచెను ని                           

జ నందనుని నింద్రజిత్తు సము నమరులకున్

1.      

 

 

 

తే.గీ.

అస్త్ర శస్త్ర విజ్ఞుల కెల్ల నధికుఁడవు సు

రాసురవ్యథా దాత వీవయ్య సతము

సేంద్ర సుర గణము గనె నీ యెల్ల పనులు

పూజిత బ్రహ్మ దత్తాస్త్ర పూర్ణ వీర!

2.     

 

 

 

కం.

నీదగు నస్త్ర బలము గని

యా దివిజ గణము మరుత్తు లందఱు నింకన్

నీ దెస నిలువఁగఁ జాలరు

యా దేవేంద్రుని సహితము నాజిఁ దలంపన్

3.     

 

 

 

ఆ.వె.

అని నలయని వాని నరయము ముల్లోక

ములను నిన్ను దక్క భుజ బలమును

ఘన తపో బలమును గాపాడు నిను దేశ

కాల వేది వీవు ఘన తమ మతి!

4.     

 

 

 

తే.గీ.

కయ్యమున నీ వలనఁ గాని కర్మ మింక

దుష్కరము లేదు తలఁప మస్తిష్కమునను

నీకు నీ యస్త్ర బలమును నీదు బల మె

ఱుఁగని వాఁడు లేఁ డీ మూఁడు జగము లందు

5.     

 

 

 

ఆ.వె.

బల తపముల నస్త్ర పటిమ సమర విక్ర

మమున నా సముఁడవు మనము నందుఁ

జింత నొంద నిన్ను జిద్దున నుంచఁగ

నెంచి నిశ్చయ జయ మెన్నఁ డైన

6.     

 

 

 

తే.గీ.

కింకరులు నిహతు లయిరి యంక మందు

జంబుమాలి మృతుండయ్యె డంబము సెడి

పంచ సేనాధిపతులు సవాహ నాశ్వ

గజ బలములఁ జనిరి మంత్రి ఘన తనయులు

7.     

 

 

 

తే.గీ.

నీదు ముద్దుల తమ్ముఁడు నిహతుఁ డాయె

నాజి నక్ష కుమారుఁడు హరి వరేణ్యు

కరముల నరి సూదన! వారి కరయ లేదు

నీదు నాదు కాయమ్ముల నెగడు బలము

8.     

 

 

 

తే.గీ.

వానరు మహా బలమును ప్రభావమును బ

రాక్రమమును స్వీయ  బల మరసి మనమున

నుద్యమింపు వేగమ భవ దుగ్ర విక్ర

మమునకుఁ దగెడు రీతిని సమర మందు

9.     

 

 

 

తే.గీ.

అస్త్ర వేద వరేణ్య నీవరుగ నిఁక ని

జ బల వినశనము నిలుచు సరణి నిజ ప

ర బలముల సమీక్షించి కరమ్ము దొడఁగు

రిపు నణఁప విక్రమమ్ము మీఱ పర దళన!

10.    

 

 

 

తే.గీ.

వీర సేనా గణము నోడు శూర కపికి

సార వజ్రము చాలదు మారుతికిని

సాటి కపి వేగమునకు నెచ్చోట లేదు

నగ్ని నిభుఁ గపిఁ జంప దే యాయుధమ్ము

11.    

 

 

 

కం.

ఇవ్విధిఁ దలంచి బాగుగ

నివ్వటిల స్వకర్మ ధృతి సునిశ్చయ బుద్ధిన్

నొవ్వక యస్త్ర ధనుర్బల

మవ్వర బలము తలఁచి చను మని మొదలిడఁగన్

12.    

 

 

 

ఆ.వె.

నా పనుచుట నిను రణమ్మునకుఁ దలంపఁ

బాడి కాదు రాజ పరమ ధర్మ

మెంచ క్షత్రియులకు నెల్ల గుణము సుమ్మి

యార్య సమ్మతంపుఁ  గార్య మగును  

13.    

 

 

 

కం.

నైపుణ మవశ్యము సమితిఁ

దూపుల వివిధాస్త్రములను దోరమ్ముగ నీ

వేపున జయమ్ము గోరుచు

నో పరవర గణ విదళన యోర్పునఁ జనుమా

14.    

 

 

 

కం.

జనకుని యప్పలుకులు విని

వినయముగఁ బ్రదక్షిణమ్ము వీరుం డొనరిం

చెను దక్ష తనయ తేజుఁడు

దను జాధీశునకు సమర తత్పర బుద్ధిన్

15.    

 

 

 

తే.గీ.

ఇష్ట బంధు వర్గపుఁ బూజ లెల్ల నంది

యింద్రజిత్తు యుద్ధోత్సాహి యెలమి నేఁగె

సంగరమునకు దనుజేంద్రు నంగ భవుఁడు

పర్వమందలి పాథోధి భంగిఁ జెలఁగి

16.    

 

 

 

ఆ.వె.

పక్షి రాజ వేగ భాసితమై నాల్గు

పులులు వాడి కోర లలర లాగు

నింపగు నరదమ్ము నింద్రజి దింద్ర స

మాన తేజుఁ డెక్కె మానితముగ

17.    

 

 

 

తే.గీ.

రథికులం దధికుండు శస్త్రజ్ఞు లందు

నస్త్ర వరుల విశిష్టుండు నరద మందు

నేఁగెఁ దూర్ణముగ దనుజుఁ డింద్ర జిత్తు

హరి వరేణ్యుఁడు నిలిచిన యట్టి దరికి

18.    

 

 

 

కం.

అతని రథ మహా ఘోషము

పతంచికా నిస్వనమ్ము బాణాసన గ

ర్జితము విని కపిశ్రేష్ఠుఁడు

నతి సంతోషమ్ము వడసె నసురునిఁ గాంచన్

19.    

 

 

 

ఆ.వె.

పదను టంచు లలరు బాణములును బెద్ద

చాపమును సమర విశారదుండు

చేఁగొని చనె ననికి వేగముగ హనుమ

పైన గుఱి వహించి పంత మూని

20.   

 

 

 

ఆ.వె.

దుమ్ము కమ్మె దిశలఁ దోరముగ విలు ధ

రించి ముదమునఁ జన రిపు గణ దమ

నుండు సమరమునకు వెండియు నఱచెఁ గ్రూ

ర మృగములు బహువిధ రావములను

21.    

 

 

 

కం.

నాగులు యక్షులు సిద్ధులు

మూఁగిరి దివిఁ దిరుగు వారు మునులు ముదమునం

జాగుచు విహంగ కాయము

వేగముగ నభమున నఱచె వింత రవములన్

22.   

 

 

 

కం.

అరదమ్మున నరుదెంచు న

సుర వీరుని నింద్రజిత్తుఁ జూచి శరీర

మ్ము రయమ్మునఁ బెంచి యఱచె

హరివరుఁడు ఘనధ్వనిని మహా జవుఁ డంతన్

23.   

 

 

 

ఆ.వె.

దివ్య రథము నందు భవ్య ధానుష్కుఁ డా

యింద్రజిత్తు సాచె నెలమి మీఱఁ

జాప రాజము ఘన శంపాక్వణన నిభ

గర్జనమ్ము నిండ గగన మెల్ల

24.   

 

 

 

కం.

హరి దానవేంద్ర నందను

లురు తీక్ష్ణ జవ బలవంతు లుద్దండులు సం

గర నిర్విశంకు లమరా

సురేంద్రుల వలెఁ గలిసి రట సూడు లిరువురున్

25.   

 

 

 

తే.గీ.

అమ్మహారథుని సమర సమ్మతు ఘన

వీరు ధన్వి శర నిచయ వేగ మెల్ల

నప్రమేయుఁడు వర్ధిత హరి వరుండు

మోఘ మొనరించెఁ బితృ పథమునఁ జరించి

26.   

 

 

 

తే.గీ.

నిడుద లగు వాడి తూపులు నెఱిఁ దనరుచుఁ

బసిడి పుంఖములు ననువు పత్రము లల

రంగ వజ్రపాత సమాన రవము కలిగి

మెఱయు వాని నేసె నసుర మేటి బలుఁడు

27.   

 

 

 

ఆ.వె.

అంతఁ దేరు మ్రోత చెంతను మారు మ్రో

గంగఁ బటహ మురజ ఘన రవములు

దుందుభిస్వనములు దుస్సహ కార్ముక

స్వనము లలర నెగిరె హనుమ తిరిగి

28.   

 

 

 

తే.గీ.

మేటి గుఱికాని గుఱులెల్ల మాటి మాటి

కి కపి వరుఁడు ధీరుఁడు నిరర్థకము సేసె

శరములకు నెల్ల నడుమఁ దాఁ దిరుగుచు వడి

వడిగ ననిలాత్మజుఁడు లాఘవమ్ము మెఱయ

29.   

 

 

 

కం.

ఎదురుగ నిలిచి చిలుకులకుఁ

బదిలముగఁ గరములు సాచి పవన సుతుఁడు పై

కి దుమికెఁ దిరిగి రయమ్మునఁ

జదలున కచ్చెరువున దనుజ వరుఁడు గాంచన్

30.   

 

 

 

ఆ.వె.

వేగ వంతులు రణ విద్య లందు విశార

దు లిరువు రిల భూత కుల మనో గ్ర

హణ మనంగఁ జేసి రంత మహా సమ

రమ్ము దాన వానిల సుతులు ధృతి

31.    

 

 

 

తే.గీ.

దైత్యుఁ డరయఁడు హరివరు దారి యాజిఁ

గపియు నేరఁ డసుర వరు గతిని సుంత

దుస్సహులె సుమ్మి యిరువురు దురము నందుఁ

గలియ దేవ సమాన విక్రము లిరువురు

32.   

 

 

 

కం.

విడిచిన యమోఘ శరములు

గడవ విఫల లక్ష్యము లయి ఘనుఁ డసుర కుమా

రుఁడు చింతా పరుఁ డయ్యెను

గడు నవధాన కలి తాత్మ గాంభీర్యమునన్

33.   

 

 

 

కం.

హరివీరుఁ జంప రామి వి

వరముగ నెఱిఁగి మది నంతఁ బ్లవ గేంద్రుని స

త్వరముగ బంధించు గతి న

సుర రాజ తనయుఁడు దలఁచె సురుచిర రీతిన్

34.   

 

 

 

ఆ.వె.

రాక్షసప్రవరుఁడు బ్రహ్మాస్త్రమును మారు

తాత్మజునిఁ దలంచి యస్త్ర విదుల

మేటి యింద్ర జిత్తు పాటవమ్మున నేసె

విక్రముండు వేగ వీర వరుఁడు

35.   

 

 

 

ఆ.వె.

అస్త్ర తత్త్వ వేది యస్త్రము చేత న

వధ్యుఁ డీతఁ డని యవగతుఁడై క

పి వరుని బిగియించె భృశ మస్త్రమున నింద్ర

జిత్తు ఘన భుజుండు చింత సేసి

36.   

 

 

 

తే.గీ

కట్టు వడ నస్త్రమున దశకంఠ సూను

వలన వాన రేంద్రుఁడు భువిఁ బడెను జేష్ట

లుడిగి యస్త్ర బంధనమును నెడఁద నెఱిఁగి

బ్రహ్మ వరమును దలఁచెను వడి తఱుఁగఁగ

37.   

 

 

 

ఆ.వె.

బ్రహ్మ మంత్రము లలరంగ మంత్రించిన

యట్టి యస్త్ర రాజ మరసి కపి వ

రుండు మారుతాత్మజుండు దలంపఁ దొ

డంగె బ్రహ్మవర మెడంద నపుడు

38.   

 

 

 

తే.గీ.

లోకగురు వజుని మహిమ రోచి రస్త్ర

బంధనము తొలగింపఁగ బలము లేదు

నాకని యెఱింగి తానెంచె నళిన జాస్త్ర

బంధము ననుసరింపఁగఁ బాడి యనుచు                  

39.   

 

 

 

తే.గీ.

అస్త్ర బలము విచారించి యనిల సుతుఁడు

తనకు నొసఁగిన యజ వర దాన మెంచి

శర విమోచనమున నిజ శక్తి నరసి

లొంగె నస్త్రమునకుఁ జతుర్ముఖుఁ దలంచి

40.   

 

 

 

ఆ.వె.

అస్త్ర వర నిబద్ధమైన భయము లేదు

పద్మభవుని వలన బల దమనుని

వలన రక్షితుండఁ బవమాన రక్షణ

మునను విలసితుండ భూతలమున

41.    

 

 

 

కం.

అసుర గ్రహణ మ్మది నా

కు సమ్మద మగు దనుజేంద్రుఁ గూడి వచింపం

గ సులువగు నింకఁ గాన రి

పు సంఘము గ్రహించుఁ గాక పోరున నన్నున్

42.   

 

 

 

తే.గీ.

అవ్విధి సునిశ్చితుఁడు రిపు హంతకుండు

దూరదర్శి చేష్టోపగతుండు శత్రు

బంధితుఁడు పీడితుండును బలమునఁ గొని

పోవ నఱచె ఘోరముగను మ్రోగ నభము

43.   

 

 

 

కం.

రక్కసు లంత రిపు దమను

నక్కపిని మెదలని వాని నరసి రయమునం

జక్కఁగఁ గట్టిరి యందఱు

నొక్కుమ్మడి వల్కలముల నుగ్రత్వమునన్

44.   

 

 

 

కం.

పగతుర కట్టును వీరుల

వెగటు ప్రవర్తనము చెఱయు వీక్షించి ముదం

బుగ నెంచె మదిఁ గుతూహల

ముగఁ గాంచును రాక్షసాధిపుఁడు తన నంచున్

45.   

 

 

 

ఆ.వె.

అంతఁ ద్రాటఁ గట్ట హరి వరుఁ డస్త్రము

చేత విడివడియె విచిత్ర మనఁగ

నన్య బంధముల మహాస్త్ర మనుసరింప

నొల్ల దెన్న డైనఁ గల్ల కాదు

46.   

 

 

 

తే.గీ.

నారల చెఱ నున్న ననిల నందను విగ

తాస్త్ర బంధనుని నరసి యసుర నంద

నుండు చింతించెఁ బరబంధ ముండ నస్త్ర

బంధ నమ్మేల యుండును బరఁగి యనుచు

47.   

 

 

 

ఉ.

అక్కట వమ్ము సేసి రిట నద్భుత కర్మము వీర లెల్లరున్

వెక్కస మైన మంత్ర గతి వీరు మదిం దలఁపంగఁ జాలరే

యుక్కు సెడంగ మంత్ర మిక నూనఁగ రా దిత రాస్త్ర మేదియున్

నిక్కము రాక్షసవ్రజము నేడు విపత్తులఁ జిక్కు టెల్లయున్

48.   

 

 

 

ఆ.వె.

రజ్జు పీడితుండు రక్కసు లీడ్చుచుఁ

గొని చనంగ బలిమి హనుమ నేరఁ

డస్త్ర మోచనమ్ము నక్కజముగ వీర

వరుఁడు శత్రు నిచయ భంజనుండు

49.   

 

 

 

కం.

పిడికిళ్లులఁ గఱ్ఱలఁ గడు

బెడిదమ్ముగఁ గొట్టఁ బడుచుఁ బిశితాశులచే

వడి నీడ్చఁ బడియెను గపీం

ద్రుఁడు దశముఖు సముఖమునకుఁ గ్రూరుల చేతన్

50.   

 

 

 

ఉ.

అంతట నింద్రజి త్తరసి యస్త్ర విముక్తుని క్షౌమ సూత్ర భా

స్వంతుని వానరప్రవరు వాయు కుమారుని భీమ వీర్యు దే

వాంతక రాక్ష సేంద్రునకు యాతు గణావృత భాసమాన ధీ

మంతున కర్పణ మ్మసుర మాన్యుఁడు సేసెను గౌరవమ్ముగన్

51.    

 

 

 

తే.గీ.

రాక్షసేంద్రు ముం దునిచిరి రక్కసులు క

పీంద్రుని నిబద్ధుని మద గజేంద్ర సముని

నెవ రితఁ డెవరి వాఁ డిట కేల నెచట

నుండి వచ్చె నని నడుగ నొండొరు లట

52.   

 

 

 

కం.

ఇత రాసురు లొండొరుల న

మిత రోషమ్మునఁ బలికి రమిత్రు హరివరున్

హతునిం జేయుఁడు కాల్చుఁడు

కతుకుండు హితముగ నేడు కరుణింపకయే

53.   

 

 

 

కం.

హరి వరుఁడు మహాత్ముం డర

సె రయమ్ముగ దారి దాఁటి చేరి దనుజ మం

దిరము మణి భూషితమ్ము న

సురేంద్ర పద మూల గతుల సువయో భటులన్

54.   

 

 

 

ఆ.వె.

రావణుండు నరసె రాజిత తేజుఁడు

వికృత రూపు లసుర వీరు లెల్ల

లాగు చుండ వాని వే గతులఁ గపీంద్రు

మారుతాత్మజు ఘను వీర వరుని

55.   

 

 

 

కం.

కపి సత్తముండు నట నసు

ర పతిని విక్రము బలయుతు రావణు దైత్యుం

దపియింప ప్రభల భాస్కరు

ని పగిదిఁ గాంచె దశకంఠుని మహా కాయున్

56.   

 

 

 

తే.గీ.

కోపమున నెఱ్ఱనైన చక్షువులఁ ద్రిప్పు

చుఁ గని కపిని మంత్రి వరులఁ జూచి దశ ము

ఖుండు కుల గుణ వృద్ధులఁ గూరుచున్న

వారి కాదేశ మిడె హరి వీరు గుఱిచి

57.   

 

 

 

ఆ.వె.

క్రమమున నడుగంగఁ గార్య కారణ మూల

ములను వారు పలికెఁ గలవరమ్ము

లేకయె హరి దూత నా కపి నాథుని

ప్రాపు నుండి యేను వచ్చితి నని

58.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నలువది యెనిమిదవ సర్గము. 

 

 

సుందర కాండము

సర్గము 49.

 

                                                         

కం.

క్రూరపు టాతని కర్మము

నారసి హనుమంతుఁ డంత నామర్ష సు దీ

ప్తారుణ నయనుండై కనె

నా రాక్షస గణ విభుని మహాశ్చర్యముగన్

1.      

 

 

 

కం.

విభ్రాజమాన కనకా

దభ్ర విరాజిత నితాంత తరళ సిత మహా

శుభ్రేందురత్న జాల వృ

త భ్రాజిత మకుట దీప్త దశముఖుఁ గాంచెన్

2.     

 

 

 

కం.

పొదిగిన వజ్రముల మణి స

ముదాయ ఖచితములు హైమపు విచిత్రపు టం

గద భూషణ సంచయముల

హృదయానందకర రీతి కృతముల తోడన్

3.     

 

 

 

ఆ.వె.

వివిధ చిత్ర రూప విలసిత మ్మరుణచం

దన సులిప్త కీటజనిత వసన

ధారి నగరు లిప్త తను విలాస పురుషు

నరుణ లోచను గురుతర దశనుని

4.     

 

 

 

తే.గీ.

రక్త దృక్కులఁ దీక్ష్ణ దంష్త్రముల లంబ

మానపు టధరమ్ములను దశాననముల

కతన నానా మృగవ్యాళ యుత శిఖర వి

లసిత మందర గిరిఁ బోలు నసుర విభుని

5.     

 

 

 

తే.గీ.

నల్ల కాటుక కుప్ప యనఁ దనరు మెయి

నిండు చంద్రుఁ బోలు ముఖము నుండ హార

మురము నందుఁ గొంగల గమి యున్న యంబు

దము పగిది వెలుఁ గొందెడి దనుజ విభుని

6.     

 

 

 

ఆ.వె.

ఆయత భుజతతులు కేయూర భాసిత

చంద నార్చిత వర సుంద రాంగ

ద విలసితము లొప్ప దల లైదు తోడుతఁ

న్నగేంద్ర నిచయ వైభవమున

7.     

 

 

 

కం.

రుచిర స్పాటిక రత్నమ

య చారు సింహాసనమున నతి రమ్యముగన్

శుచి తాస్తరణ వరాంచిత

నిచితమున సుఖోపవిష్టుని దశగ్రీవున్

8.     

 

 

 

ఆ.వె.

విరివి యగు తొడవుల వింజామరము లమ

ర కర కమలములను లలన లుండఁ

జెంత భక్తి వారి సేవ లందుచు నల

రు నసుర గణ విభునిఁ గనలు వాని

9.     

 

 

 

తే.గీ.

మంత్ర వేదు లమాత్యులు మాన్య దుర్ధ

ర ప్రహస్త మహాపార్శ్వ రాక్షస స ని

కుంభ సహితాసనుం డటఁ గూడి నల్గు

రఁ దనరెఁ జతు రబ్ధ్యావృత రస యనంగ

10.    

 

 

 

ఆ.వె.

సకల మంత్రి వరులు సాచివ్య తత్త్వ వే

త్త లితరులు సుగుణ బుధ గణ మలర

నసుర సంఘ సేవి తాసురేంద్రుఁడు వెల్గ

నమర సేవి తాగ మారి వోలె

11.    

 

 

 

ఆ.వె.

చూచె ననిల సుతుఁడు చోద్యముగఁ దను జే

శ్వరునిఁ దేజ మలరఁ బరఁగు వాని

మేరు శిఖర మందు నీర ధరము సనీ

రమ్ము భంగి నున్న రావణు నట

12.    

 

 

 

కం.

బెడిదంపు దండితనమునఁ

గడు బాధింపఁ బడి కూడ కర్బర తతులం

బడయుచు వెఱంగు హరి వీ

రుఁ డరసె రక్షోధిపతి నురుత రాకారున్

13.    

 

 

 

కం.

వెలిఁగెడు నసురేంద్రుఁ గని య

నిల సూనుఁడు మదిఁ దలంచె నిశ్చేష్టుండై

సలలిత తేజో రూప

మ్ముల నలరుచు నుండ నిజ వపో దీధితులన్

14.    

 

 

 

కం.

ఆహా రూపము ధైర్యం

బాహా యాహా బలమ్ము నసు రాధీశుం

డాహా లక్షణ యుక్తుం

డాహా రాజసము చూడ నచ్చెరు వయ్యెన్

15.    

 

 

 

ఆ.వె.

ఇల నధర్మ మందు నితఁడు రక్షోధిప

తి బలము గొనకున్నఁ దిరముగ నగు

దేవలోకమునకు దేవేంద్రు సహితము

రక్షకుండునిజము రావణుండు

16.    

 

 

 

ఆ.వె.

ఈతని కడు దుడుకు చేతలు క్రూరము

లవి సకల జనుల భయమున నుంచు

సామ రాసురులను నర్ణవ మొక్కటి

గ నొనరించు ధృతి జగతిఁ గినిసిన

17.    

 

 

 

ఆ.వె.

బహు విధముల నిట్లు పవన తనూజుఁడు

బుద్ధిమంతుఁడు కని పుష్టి తేజ

ముల నసుర విభునివి తలఁచెఁ జిత్తమ్మున

వానరప్రవరుఁడు వాయు సముఁడు

18.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నలువది తొమ్మిదవ సర్గము. 

 

సుందర కాండము

సర్గము 50.

 

                                                         

చం.

అరసి కపీంద్రు నాతత భుజారుణ నేత్రుని నిల్వ ముందఱన్

గురుతర తేజ మొప్పు మెయిఁ గూడి వెలుంగ మనోహరమ్ముగన్

విరివిగఁ గోప మూని జన భీతి కరుండు దశాననుండు దాఁ

బరిపరి రీతులం దలఁచెఁ బావనిఁ గూరిచి శంక తోడుతన్

1.      

 

 

 

మ.

కన నీతం డగుఁ గాక రా నిచట సాక్షాన్నంది దేవుండు దా

నను బూర్వమ్ము శపించె నెత్తఁగ ధృతిన్ నాగమ్ము గర్వమ్మునం

దనరన్ వానర రూప మింపుగ నిటం దా బాణుఁడే దైత్యుఁడే

యని తోఁచున్ మది ధైర్య సాహస విలా సాధిక్యముల్ గాంచఁగన్

2.     

 

 

 

కం.

రోషారుణ నేత్రుఁడు మిత

భాషలఁ బలికెను బ్రహస్తుఁ బరికించి మహా

దోషాటు సమయ యుక్త వి

శేషార్థ యుతమ్ముగ దశ శీర్షుం డంతన్ 

3.     

 

 

 

ఆ.వె.

ఈ దురాత్ము నడుగు మెట నుండి యే కత

న నరుదెంచె నిటకు వనము నరసి

యింత నాశనమ్ము నేల యొనర్చె నీ

దనుజ తర్జనంపుఁ బనియు నేల

4.     

 

 

 

కం.

రా నలవి కాని నా పురి

కీ నగచర మేల వచ్చె నీ గతి నీఘో

రానీక హేతు వెయ్యది

యో నీ వడుగుమ దురాత్ము నుద్దేశ్యమునున్

5.     

 

 

 

కం.

రావణ వచనమ్ములు విని

యా వీర వరుఁడు ప్రహస్తుఁ డంత ననువుగం

దా వచియించె శుభమ్మగు

నో వానర! నీకుఁ గరము నోడకు మనుచున్

6.     

 

 

 

ఆ.వె.

నీ విటకు బలారి నిర్దేశమున వచ్చి

తేని రాక్షసేంద్రు నిరవునకును

నిజము పల్కు దాన నీకు భయములేదు

విడువఁ బడుదు వీవు వేగ యిపుడు

7.     

 

 

 

తే.గీ.

వేగువానిగ నిచ్చట కేఁగుదెంచి

తేని యమ వైశ్రవణ వనధీశు లనుప

నిప్పురమునకుఁ గాదేని నెలమి దూత

వ విజయ రతుఁడు విష్ణునకు వచియింపు

8.     

 

 

 

ఆ.వె.

రూపముననె వానరుండవు తేజమ్ము

నరయ వానరుండ వనఁగ రాదు

సత్యము వచియింప సత్వర ముద్ధరిం

పఁ బడఁ దగుదు వీవు వానర వర!

9.     

 

 

 

ఆ.వె.

రావణాలయమ్ము రాఁ గారణమ్మేది

యనృత మాడి నంత నసువు లన్ని

నేఁడు దుర్లభములు నీకు నిశ్చయముగఁ

గపివరేణ్య! పల్కు మిపుడు నిజము

10.    

 

 

 

చం.

పలుక బ్రహస్తుఁ డివ్విధిని వానర ముఖ్యుఁడు రాక్షసేంద్రు తో

సలలిత భాషలం బలికె శక్ర కృతాంత కుబేర పాశ హ

స్తుల ననుఁగుం దనమ్మెఱుఁగఁ జోదితుఁడై హరి చేఁ జెలంగ నే

నల హరి వంశ సంభవుఁడ నాగత కేవల వానరుండనే

11.    

 

 

 

తే.గీ.

దనుజ రాజ దర్శన మది తథ్యముగను

దుర్లభమ్మని మది నెంచి తోరపు వన

మెల్లఁ ద్రుంచితి దర్శన మెంచి రావ

ణాసురుని సులభపు మార్గ మని తలంచి

12.    

 

 

 

ఆ.వె.

అంత రాక్షసులు మహా బలులు సమర

ప్రీతులు కలియ నను భీకరంపు

యుద్ధ మందు వార లుత్సహింప నిజ దే

హావనార్థమ రణ మాడ వలసె

13.    

 

 

 

తే.గీ.

సుర లయిన నసురులు నైనఁ దరమె యస్త్ర

పాశముల నను బట్టఁగ వరము నిచ్చె

నా కిలఁ బితామహుం డట్లు ప్రాకటముగ

నమ్రుఁడ నయితి భక్తిని నలినజునకు

14.    

 

 

 

తే.గీ.

రాజ దర్శనము కొఱకు నాజి నస్త్ర

మునకుఁ దల యొగ్గి నీదు సముఖమున కిట

కరుగు దెంచితి ముక్తుఁడ నయిన రాజ

కార్యమున సహియించి రక్కసుల వెతలు

15.    

 

 

 

కం.

రఘు రాము మహాభుజుని య

లఘు విక్రము దూతగ నను ప్రభువ! యెఱుఁగు

య్య ఘనముగ శుభమ్ముల నె

ల్ల ఘటించెడు నా వచనముల ధృతి నరయుమా

16.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నేఁబదవ సర్గము. 

 

 

సుందర కాండము

సర్గము 51.

 

                                                         

 

కం.          

ఘన సత్త్వవంతుని దశా

నను గాంచి మహాబలుఁడు వన చరోత్తముఁ డా

యనిల సుతుఁ డర్థవంత వ                 

చనములు మందస్వరమునఁ జక్కఁగఁ బలికెన్

1.      

 

 

 

ఆ.వె.

ఏను నీదు వీటి కినసుత సుగ్రీవు

నాజ్ఞ వచ్చితి నిట కసుర నాథ!

వానరాధిపుండు భ్రాత నీదు కుశల

మడిగె సాదరము దశానన! విను

2.     

 

 

 

తే.గీ.

ఇహ పరములకు నుచితంపు హిత వచనము

లు కపివిభుని సోదరు పల్కులు విను మయ్య!

లలిత ధర్మార్థ సంయుతము లిన నంద

నుండు సుగ్రీవు ముఖ ముక్త మండితములు

3.     

 

 

 

కం.

రాజు దశరథుం డరయం

గా జనక సముఁడు స్వజనపు గమికిం దేరుల్

వాజులు కరులఁ జెలఁగు నిజ

తేజమునఁ బురంద రాభ దీప్తి వెలుంగున్

4.     

 

 

 

ఉ.

ఆతని జ్యేష్ఠ పుత్రుఁడు మహా భుజుఁడుం బ్రియ దర్శనుండునున్

భ్రాత ఘనుండు లక్ష్మణుని భార్య పతివ్రత సీత తోడ సం

ప్రీతిని రామ నామమున వీర వరేణ్యుఁడు తండ్రి పంపునన్

నేత సుధర్మ మార్గ రత నీతి గమించెను దండకాటవిన్

5.     

 

 

 

కం.

ఆతని భార్య పతివ్రత

సీత యపహృత వని నయ్యె ఛిద్ర హృదయయై

యాతత విదేహ రాజ మ

హా తాపస జనక తనయ యాశ్చర్యముగన్

6.     

 

 

 

ఆ.వె.

దేవి వెదకుచు నరదేవ సుతుఁడు సాను

జుండునై కదిసెను మండి తాద్రి

ఋశ్యమూకము వడి నిన కుమారవరు సు

గ్రీవుఁ గలిసె నచటఁ బ్రీతి తనర

7.     

 

 

 

కం.

సీతాన్వేషణ మా కపి

నేత వహింప హరిరాజ నిర్వేదము నా

భూతలనాథ కుమారుఁడు

వే తీర్పఁగఁ బ్రతి నలు సలిపిరి స్నేహమునన్

8.     

 

 

 

ఆ.వె.

అంత భండనమున హతమార్చి వాలిని

రాజపుత్రుఁడు రఘు రాముఁ డెలమి

ఋక్ష వానర తతి కెల్ల సుగ్రీవుని

రాజుఁ జేసె నమిత తేజ మలర

9.     

 

 

 

కం.

ఎఱుఁగుదు వీవు కపీశ్వరుఁ

బఱగ మహా తేజము ధర వాలిని వీరుం

జెఱచె శరం బొక్కట నం

దఱుఁ గడు విస్మయము నొంద ధరణీశుండే

10.    

 

 

 

ఆ.వె.

సీత జాడఁ గాంచ స్థిరమతియై సత్య

సంధుఁడు హరివిభుఁడు సకల వాన

రుల ననిపెను దశదిశలు జానకి నరయ

రామ కార్య మందు రక్తి తోడ

11.    

 

 

 

కం.

వందలు వేలును లక్షలు

మందలుగ హరులను బంపె మార్తాండజుఁ డా

నందమ్ముగఁ బాతా ళా

మందాంబర భూతలంపు మార్గణమునకై

12.    

 

 

 

ఆ.వె.

వారి యందుఁ గొంద ఱారయ ఖగరాజ

నిభులు కొంద ఱనిల నిభులు భూమి

నానక చనువారు వానరర్షభులు శీ

ఘ్ర చరులు బలవంతు లచల సములు

13.    

 

 

 

తే.గీ.

నేను హనుమంతుఁ డనువాఁడ మేను పెంచి

దాఁటి శతయోజ నాంబుధి వాటముగను

వాత నందనుండఁ గపిని సీత సాధ్విఁ

జూచు నాస వచ్చితిఁ గడు జోద్యముగను

14.    

 

 

 

తే..గీ.

సంచరించుచు నరసితి సాద్వి సీత

జనక సుతను నీ యింటను దనుజ నాథ!

ధర్మ తత్త్వజ్ఞుఁడవు తపోధనుఁడవు పర

దారల నిట బంధింపఁగఁ దగునె నీకు

15.    

 

 

 

ఆ.వె.

ధర్మ దూర హీన కర్మములు లయ కా

రణములు మొదళులఁ గరమ్ము చెఱచు

వాని నెప్పు డైనఁ బ్రాజ్ఞులు నీవంటి

వా రొనర్ప నోపు వారె యరయ

16.    

 

 

 

కం.

రామామర్ష ప్రచలిత

సౌమిత్రి విముక్త బాణ సంచయములకున్

భీమాసుర సుర గణముల

నే మగఁడు నిలువఁగ నేర్చు నెవ్విధి నైనన్

17.    

 

 

 

కం.

రాముని కపకార మకట

యేమఱి చేసిన నిశాచరేంద్ర! సుఖముగం

బో మనఁ జాలెడు నాతని

నీ ముల్లోకములఁ గాంచ నేరికిఁ దరమౌ

18.    

 

 

 

కం.

వే యరసి త్రికాల హితం

బౌ యర్థ సధర్మ భాష ణాలి దశముఖా!

యీయఁబడుఁ గాక జానకి

యా యవనీంద్రునకు రఘు కులార్ణవ శశికిన్

19.    

 

 

 

ఆ.వె.

కాంచఁ బడియె సీత కష్టతరముగ నా

చేత నిచ్చట నవశేష మైన

కార్య సంచయమ్ము గాంచు రాఘవుఁ డింక

లంక జేర వేగ రాక్షసేంద్ర!

20.   

 

 

 

తే.గీ.

కొందలమ్మున మునిఁగిన డెందపు

నీ తనయను జూచితి నిట నీ వెఱుఁగవు

భవ దపహృత సీతాసతిఁ బంచ శీర్ష

పన్నగీ నిభ  న్నుల మిన్న యనఁగ

21.    

 

 

 

కం.

కబళింపఁ దరమె సీతను

నబల యని సురాసురులకు నైనను బరికిం

ప బహుళముగ గరళము కలు

పఁబడిన యన్నపు విధమ్ము బలమున నైనన్

22.   

 

 

 

తే.గీ.

నీ దగు తపఃపరిశ్రమ నెమ్మి పొంది

న సురుచిర ధర్మ సంపద నాశనమ్ము

సేయఁ దగునె యాత్మప్రాణ శిథిల కార

ణంబగును జుమ్ము దనుజగణ వరనాథ!

23.   

 

 

 

ఆ.వె.

తపపు మహిమ నమర దను జాదుల వలని

చావు లేదని మది భావనమ్ము

కలిగిన దశకంఠ! కారణం బగు నీ య

కృత్య మొకటి చాలుఁ గీడు సేయ

24.   

 

 

 

తే.గీ.

రాక్షసుఁడు కాదు కా దమర వరుఁడు దను

జుండు కాదు యక్షుఁడు కాదు చూడఁ బన్న

గుండు కాదు గంధర్వుఁడు కూడ కా ద

సురుఁడు కాదు సుగ్రీవుఁడు హరి వరుండు

25.   

 

 

 

కం.

కావున దనుజ గణాధిప!

నీ వెవ్విధి బ్రాణములను నేర్తువు బొందిం

గావఁగఁ బదిలమ్ముగ నిల

భావింపుమ శాంత మూని పన్నుగ మదిలో

26.   

 

 

 

తే.గీ.

ధర నధర్మ ఫలం బొక్క ధర్మ పతన

మే యనఁగ రాదు తత్ఫల మేర్పడుటయుఁ

దథ్యము సుమి ధర్మ మది యధర్మ నాశ

నం బొనర్చుటయు నిజ మనంగ వినవె

27.   

 

 

 

ఆ.వె.

ధర్మ ఫలము నీకు దక్కె నింత వఱకు

సంశయమ్ము లేక స్వల్ప మైన

నేఁడు దొరకు నీకు నిక్కముగ నధర్మ

ఫలము కూడ దానవ గణ నాథ!

28.   

 

 

 

తే.గీ.

అరసి వధము జనస్థాన మందు వాలి

నిధనమును నెంచి రఘురాముని కపినాథు

సఖ్యము దలంచి మది నాత్మ సౌఖ్య మెల్లఁ

జింత సేయుమ దనుజేంద్ర! సుంత యైన

29.   

 

 

 

కం.

నే నొక్కరుండఁ జాలు స

వానాయుజ చక్రపాద వారణ లంకన్

వే నాశనమ్ము సేయఁగఁ

గాని యరయ నతని యాజ్ఞఁ గదనమ్మునకున్

30.   

 

 

 

ఆ.వె.

ఋక్ష వృక్షచర సమక్షమునఁ జలిపెఁ

బ్రతిన కనలి రామ భద్రుఁడు రిపు

లను నవనిజఁ గొందల పఱచి నట్టి వా

రి వధియింప నని నరి దమనుండు

31.    

 

 

 

కం.

అపకారము సేసి స్వయ

మ్మ పురందరుఁ డైన నారయ మనం డసురా

ధిప! సుఖముగ ననఁ దథ్యమ

యపరులు నీవంటి వారి నాడఁగ నేలా

32.   

 

 

 

ఆ.వె.

సీత యని యెఱుఁగుదు వీ తన్విఁ జెఱ యందు

నున్న నామె రాక్షసోత్తమ! మదిఁ

గాలరాత్రి యనఁగ గమనింపు మీమెను

గూర్చుఁ జేటు లంకకు నమితముగ

33.   

 

 

 

ఆ.వె.

చాలు నయ్య మోయ స్కంధమునను సీత

వర్ణ మూనిన యమపాశ మింక

నీదు క్షేమ మెంచుమో దాన వాధిప!

పాడి యగునె పరుని భార్యఁ గోర

34.   

 

 

 

కం.

సీతాసతి తేజస్సహి

తాతత రామాగ్ర హార్ది తార్తిని లంకం

జూతు విఁక దహ్యమానము

నీ తలమును సాపణ వర నిల యావలినే

35.   

 

 

 

చం.

ఘన సఖ చక్రవాళమును గౌరవ మంత్రుల భ్రాతృ వర్గముం

దనయుల జ్ఞాతి సంఘమును దార నికాయము భోగరాశి స

జ్జనుల హితవ్రజమ్ము నిఁకఁ జారు తరాట్ట విరాజి లంకనున్

వినశన మేలఁ జేసెదవు వీర వరేణ్య! గణింపు రావణా!

36.   

 

 

 

ఆ.వె.

నిజము సుమ్ము విను దనుజనాథ! నాదు గి

రలను ముఖ్యముగను రామ దూత

వానరు నవి నెమ్మి వీనుల నింపుగ

హిత కరమ్ము లివి యహీన తేజ!

37.   

 

 

 

కం.

లోకములు సాచర చరా

నేక సభూతముల నెల్ల నిహతము సేయన్

సాకారము సేయఁ దిరిగి

సాకేత విభుఁడు యశుండు శక్తుఁడు సుమ్మీ

38.   

 

 

 

తే.గీ.

అమరుల నసురుల నరుల యక్ష రాక్ష

స గణ గంధర్వ విద్యాధర గణముల భు

జంగముల సిద్ధ కిన్నర శకున తతుల

సర్వ భూతముల సకల సమయములను

39.   

 

 

 

ఆ.వె.

లేడొకండును నెదిరించి నిలుచు వాఁడు

రాము విష్ణునిభ పరాక్రమ సువి

రాజితుని ధనుర్ధర ప్రవరుని సంయు

గమ్మున దనుజేంద్ర! కాంచవయ్య

40.   

 

 

 

కం.

చేయ నపరాధము జగ

న్నాయకునకు రాజసింహునకు రామునకుం

గాయమున నసువులు నిలుచు

నే యసుర గణేంద్ర! నీకు నిద్ధర నింకన్

41.    

 

 

 

ఆ.వె.

కదన మందు దనుజ గంధర్వ విద్యాధ

ర సుర నాగ యక్ష రాక్ష సాది

గణము లరయ నిలువ గలవె ముల్లోక నా

యకుని యెదుట రాము నంకమునను

42.   

 

 

 

తే.గీ.

బ్రహ్మ చతురాస్యుఁ డాత్మ సంభవుఁడు నైన

రుద్రుఁడు త్రినేత్రుఁడు పుర శత్రు వయిన మఱి

యింద్రుఁడు మహేంద్రుఁడు సుర గణేంద్రుఁ డైన

రామ వధ్యుఁ గావఁగ లేరు రాక్షసేంద్ర!

43.   

 

 

 

తే.గీ.

కౌశలంపు వచనము లా కపి వరుండు

ధృతినిఁ బలుక నప్రియములై శ్రుతులఁ బడఁగ

రోషమున లోచనమ్ము లరుణములై చె

లంగ దశముఖుం డనిపెఁ జంపంగ హరిని

44.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నేఁబది యొకటవ సర్గము. 

 

 

సుందర కాండము

సర్గము 52.

 

                                                         

 

కం.

అతఁ డాతని మాటలు విని

యతి ఘన చిత్తుని హరీశ్వ రామాత్యుని మా

రుతిని దశగ్రీవుం డా

నతి నిచ్చె వధింపఁ గపిఁ గనలి యధికముగన్

1.      

 

 

 

ఆ.వె.

దూత నని నుడివిన నాతని వధియింప

నాజ్ఞ నొసఁగిన దనుజాధిపుని దు

రాత్ముని దశకంఠు నానతి నొప్పక

యుండె మది విభీషణుం డనుజుఁడు

2.     

 

 

 

తే.గీ.

క్రుద్ధుఁడై దూత వధమునకు స్థిర చిత్తుఁ

డైన రావణు దనుజేంద్రు నరసి తనదు

కార్య మెఱిఁగి తత్కార్య సంఘటన రత హృ

దయ విభీషణుఁ డనుజుండు దలఁపఁ జాగె

3.     

 

 

 

ఆ.వె.

అంత నిర్ణయాత్ముఁడై మృదువుగఁ బూజ్యు

నగ్రజు రిపు జయుని నరసి దైత్య

పతిని భాషణములు వాక్య విశారదుం

డనియె నిట్లధిక హితావహముగ

4.     

 

 

 

తే.గీ.

అగ్రజ క్షమింపు వీడుమీ యాగ్రహమ్ము

వినుమ దయ యుంచి నాదు వచనము లెల్ల

దూతఁ జంప నెంచరు గుణ దోష విదులు

సాధు వృత్త రతులు వసు ధాధిపతులు

5.     

 

 

 

తే.గీ.

తగదు పరికింప నిది రాజ ధర్మమునకు

విందు నిది లోక నీతిని నిందితమ్ము

పాడి కాదు చేయంగ నీవంటి వారు

వానరుం డీతని వధము దానవేంద్ర!

6.     

 

 

 

తే.గీ.

నీవ ధర్మ వేదివి రాజనీతి యెల్ల

నెఱిఁగి తీవు కృతజ్ఞుఁడ వీవు భూత

గణములన్ మంచి చెడు లెఱుఁగఁ గల వీవు

తెల్లముగఁ బరమార్థము తెలియు నీకు

7.     

 

 

 

కం.

వశమైనఁ గోపమునకు న

తిశయముగ భవత్సదృశు లతి విచక్షణులే

నిశితపు శాస్త్రాధ్యయనము

నిశాచరేశ్వర! తలంప నిష్ఫలము సుమీ

8.     

 

 

 

కం.

పరవీరఘ్న! కృపఁ గను మ

సురేంద్ర! యుచితానుచిత సుశోధన రతివై

హరి కీ దూతకు దుర్జయ!

సరియగు దండన మరసి యొసంగు మితరమున్

9.     

 

 

 

కం.

తమ్ముని విభీషణుని వచ

నమ్ములు విని రావణుండు నైరృతుఁ డతి కో

పమ్మావహింప నిటు వచ

నమ్ముల నుత్తర మొసంగె నయ విలయమ్ముల్

10.    

 

 

 

కం.

పాపులఁ జంపఁగ నంటదు

పాపము పరవీర దమన! పాప చరిత్రున్

వే పరిమార్చెద వానరు

నీ పుర నాశకుని దూత యీతం డైనన్

11.    

 

 

 

తే.గీ.

ధర్మ దూరము లన్నియుఁ దప్పిదములు

నీచ జన వచనములు వినిన విభీష

ణుండు పరమార్థ తత్త్వంపు నుడువు లంత

బుద్ధి మంతులం దుత్తమ వృద్ధుఁ డనియె

12.    

 

 

 

కం.

లంకానాథ! క్షమింపుమ

యంకము లేని నుడులు విను మార్యు లనెద రే

వంకను దూతల వధ ని

శ్శంక వలదని దనుజేంద్ర! సంతత మధిపా

13.    

 

 

 

ఆ.వె.

సంశయమ్ము లేదు శత్రు వితఁడు చేసె

నప్రమేయ మప్రియమ్ము మనకుఁ

జంపఁ గాలరిని సుజను లొప్ప రెన్నండు

కలవు దూత దండన లిలఁ బెక్కు

14.    

 

 

 

తే.గీ.

కొట్ట వచ్చు దూతను మునికోల చేత

ముండనమ్మంగ వైకల్యము నొనరింప

వచ్చు నుంచ వచ్చు మెయిని మచ్చ లనఁగ

శిక్ష లుండఁ జంప వినము కక్ష యున్న

15.    

 

 

 

తే.గీ.

శిక్షితుండవు ధర్మార్థ శిక్ష లందు

నిపుణుఁడవు చూడ గుణ దోష నిర్ణయముల

రోష వశ మెట్లగుదురు నీ రూపు లకట

యలుక నాప నేర్తురు మహా బలులు సతము

16.    

 

 

 

తే.గీ.

ధర్మ వాదుల లోకవృత్త విదు లందు

శాస్త్ర భావగ్రహణ వరిష్ఠ గణ మందు

నిన్ను బోలు వాని నరయ నేర రెందు

సకల దేవాసురుల యందు సత్తముఁడవు

17.    

 

 

 

కం.

నెగ్గితి వీ వసురేశ్వర!

యగ్గలముగ దైత్య నిర్జరాళిని విభులన్

బెగ్గడిలగఁ బలు మారుల్

తగ్గని వీరుండ వాజి దశముఖ! శూరా!

18.    

 

 

 

ఆ.వె.

ఇక్కపి వధియింప నే నరయ గుణమ్ము

కొంచమైన వీనిఁ బంచి నట్టి

వారి నరసి వేగ బంధించి దండింపఁ

దగును జుమ్ము వినుమ దానవేంద్ర!

19.    

 

 

 

తే.గీ.

పరుల చేతఁ బనుపఁ బడెఁ బరుల కొఱకుఁ

బరుల మాట నుడివెఁ బరవశుఁడు మంచి

యైనఁ జెడు గైన నెప్పట్టు నందు దూత

చంప నర్హుండు కాదు నిలింప విజయ!

20.   

 

 

 

కం.

అన్యుని హరిఁ జంపిన రా

జన్య! మహోదధిని దాఁటి చనుదెంచఁగఁ బ

ర్జన్య పథ గమనునిఁ గనను

ధన్యుఁ దిరిగి యిప్పురమ్ము దైత్య వరేణ్యా!

21.    

 

 

 

కం.

కావునఁ బర పుర నాశక!

నీ వతని వధించు తలఁపు నీ మది విడుమా

దేవతల నింద్రు నందును

నీ వధ మెంచఁ దగుదు వసురేశ్వర! వినుమా

22.   

 

 

 

తే.గీ.

మరణము కపి వరుం డొంద నరయఁ బరుని

రాజ సుతుల యుద్ధోన్ముఖుల నొనరింప

నీతి దూరుల బహుదూర నిష్ఠి తార్తు

ల నిఁక సంప్రహారప్రియ! రాక్షసేంద్ర!

23.   

 

 

 

తే.గీ.

దనుజ గణ మనో నందన! ఘన పరాక్ర

మ గుణ సంపన్ను లాసు రామరుల కెల్ల

దుర్జయుఁడ వైన నీ కిట్లు దురమున కవ

రోధ మొనరింపఁ దగునె దైత్యాధినాథ!

24.   

 

 

 

ఆ.వె.

హితులు శూర వరులు నుత గుణ కుల జాతు

లు వర భటులు విజ్ఞులు విలుకాండ్రు

లందు శ్రేష్ఠులు కల రయ్య నీ వద్ద కో

టాను కోటు లెంచ దానవేంద్ర!

25.   

 

 

 

కం.

చూపుము నీ తేజ మరుల

కీ పట్టున నీ ధ్వజమున నెంచి యొక కలన్

వే పనుపుము రాజ సుతుల

నా పెళుచులఁ జెఱగొనఁగ దశానన! వినుమా

26.   

 

 

 

కం.

అనుజవరు విభీషణుని వ

చనమ్ము లిష్టములు విని నిశాచర వరుఁడే

మనమున గ్రహించె నింపుగ

ననిమిష రిపు వతి బలుండు నసురాధిపుఁడున్

27.   

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నేఁబది రెండవ సర్గము. 

 

 

సుందర కాండము

సర్గము 53.

 

                                                         

 

కం.

అంతట నా వచనములు మ

హాంతఃకరణుఁడు విభీష ణాఖ్యుం డనఁగన్

సాంతము విని దేశ సమయ

సంతత సముచితము లా దశ ముఖుఁడు పలికెన్

1.      

 

 

 

కం.

కర ముచితమ్ములు వచనము

లరయ ననుజ నీవి దూత హనన మఘంబే

మర ణేతర దండన మీ

హరి కిచ్చెద మింకఁ జూడు మత్యధికముగన్

2.     

 

 

 

ఉ.

కోఁతికి  వాలు దోఁకయె యగుం బరమప్రియ మెంచి చూడ సం

ప్రీతి నొసంగు భూషణము వే యనలమ్మునఁ గాలి భస్మమౌ

రీతిని నిప్పు పెట్టుఁడు హరిప్రవరున్ వికలాంగు బాంధవ

వ్రాతము జ్ఞాతి మిత్ర హిత వర్గము గాంచును గాక యేఁగఁగన్

3.     

 

 

 

ఉ.

ఆనతి యిచ్చె నుగ్రుఁడు దశాస్యుఁడు వాలము మండు చుండఁగన్

వానరుఁ బట్టి త్రిప్పఁ బుర భాసిత వీథులఁ జత్వరమ్ములన్

దానవ వీర సంతతికి దానవు లంతఁ గపీంద్రు తోఁకకుం

బూని పటమ్ము లెల్లఁ బరి పూర్ణము సుట్టిరి రోష చిత్తులై

4.     

 

 

 

తే.గీ.

జీర్ణ కార్పాసములు కట్టఁ జిత్రముగఁ

పీంద్రుఁడు పెరిగె వన మందు నింధనమ్ము

శుష్క కాష్ఠ చయముఁ బొందఁ బుష్కలముగ

వెలుఁగు ననలమ్ము భంగి నిల సుతుండు

5.     

 

 

 

తే.గీ.

చమురుఁ బోసి వాలావృ తాచ్ఛాదనమున

నగ్ని ముట్టింప రక్కసు లంత మండు

చు వెలుఁగఁగఁ దోఁక త్రోసె నసురులఁ గపి వ

రుండు బాలేన సన్నిభాస్యుండు కనలి

6.     

 

 

 

కం.

వాలము జ్వలించు చుండ స

బాల స్త్రీ స్థవిర చయము వానరుఁ గాంచం

గోలాహలము సెలంగఁగ

వ్రాలెను వేగమ్ముగ నటఁ బరమ ప్రీతిన్

7.     

 

 

 

కం.

అంతట ఖలు లసురులు హను

మంతుని బంధింపఁ గలసి మఱల నపుడు ధీ

మంతుఁడు కాలోచితముగ

స్వాంతమ్మున నబ్బురంపుఁ బని నూహించెన్

8.     

 

 

 

ఆ.వె.

బంధము లవి యున్న బాధింప శక్యులె

నన్ను నిద్దనుజులు సున్నితముగఁ

ద్రెంచి త్రాళ్ల నెల్ల దివి కెగిరి తిరిగి

హతము సేయ నేర్తు నతి రయముగ

9.     

 

 

 

తే.గీ.

నా యధిపు కార్య భారమునఁ జరియించు

నన్ను వీరి నాథు పనుపునఁ జనుదెంచి

వీరు బంధించిరే కాని నేర రన్య

మెద్దియు దురాత్ములు విముక్తి నీయ రింక

10.    

 

 

 

తే.గీ.

వీరి నెల్లర దనుజులఁ బోరు నందుఁ

జంప నొక్కఁడఁ జాలిన సంతసమ్ము

నీయ రామున కేను సహింప నొప్పు

లంక తిరిగి తిరుగ నుపలబ్ధ మగును

11.    

 

 

 

తే.గీ.

రాతిరి కన దుర్గముల నిర్మాణపు వివ

రమ్ము లెల్ల నేర నయితి లంక నింక

దొలఁగఁ జీఁకటి చూడంగ వలయుఁ జుమ్మి

నిశ్చయమ్ముగఁ జరియించి నేను మరల

12.    

 

 

 

ఆ.వె.

పట్టి కట్ట మరల బెట్టిదముగ నన్ను

వాలమున ననలము పరఁగఁ జేయ

భీకరమ్ముగ నను బీడించి చెలఁగిన

నా మది నలసట కన పడ దణువు

13.    

 

 

 

కం.

ప్రీతినిఁ గొంపోయిరి యా

కోఁతిని బలవంతు మేనుఁ గుదియింపంగన్

వాతాత్మజుఁ బట్టి మహా

మాతంగ నిభ కపి నంత మానిసిదిండుల్

14.    

 

 

 

తే.గీ.

శంఖ భేరీ నినదములఁ జాటుచుఁ గపి

కృతము లా క్రూర రాక్షసులు రలించి

రా కపివరేణ్యు నగర మహాధ్వ సంచ

యమ్ములకుఁ బుర పౌరులు నరయు చుండ

15.    

 

 

 

కం.

అసురులు వెన్నాడి నడువ

నసహన దమనుండు మారుతాత్మజుఁ డా రా

క్షస పుర వీథులఁ దిరుగా

డె సకలము నరయుచు వడి వడి ముదం బారన్                   

16.    

 

 

 

చం.

అట హరి గాంచె సంవృత తలాంచిత భూములు చిత్ర సౌధముల్

బటుతర భక్త చత్వర విభాసిత రథ్యలు రమ్య వీథులున్

విటప సమాహితమ్ములు సుభీమగృహమ్ములు మేఘ తుల్యముల్

స్పటిక ని భోపమార్గములు సౌధ వరాంతర గేహ రాజులున్

17.    

 

 

 

తే.గీ.

మంది రావసానమ్ముల మార్గ సంగ

మమ్ము లందును ఘన రాజ మార్గములను

గపి వరుని గూఢచారినిఁ గాంచు డం చ

సురులు ఘోషించుచుఁ బుర వాసులకుఁ జనిరి

18.    

 

 

 

తే.గీ.

బాల లబలలు వృద్ధులు వాల మడర

మంటల ననిల సుతు హనుమంతు నరయు

నాతురత నేఁగుదెంచిరి యచ్చ టచట

నుండి లంక యందలి జను లుత్సహించి

19.    

 

 

 

కం.

వికృత ముఖు లసుర వనితలు

సకలము సెప్పి రవనిజకు సాధ్వికిఁ గపి తోఁ

కకు నిప్పు వెట్టిన విచా

ర కర విషయ మంత నేఁగి రమణీ మణికిన్

20.   

 

 

 

కం.

సీతా నీతోఁ బలికిన

యా తరుచరు వాల మగ్ని నంటించిరి వా

రా తామ్ర వదను వీథి

వ్రాతమ్ములఁ ద్రిప్ప మే మరసితిమి రమణీ

21.    

 

 

 

కం.

క్రూరము లా మాటలు విని

యారసె నా పని నిజాపహరణ సమముగం

దోరపు దుఃఖమున మునిఁగి

చేరె హృతాశను నుతింప సీత మనమునన్

22.   

 

 

 

ఆ.వె.

క్షేమ మరసి వాన రామాత్య వరునకు

వామ నయన హవ్య వాహను మన

మందు నెంచి భక్తి నిందువదన సీత

యర్చనమ్ము సేసె నవని తనయ

23.   

 

 

 

తే.గీ.

పతిని నిత్యము సేవించు పడతి నేని

తపము నందు మనము నుంచు తరుణి నేని

యేకపత్నినై యిల చరి యింతు నేని

వాత వర నందనున కిమ్ము శీతలమ్ము

24.   

 

 

 

ఆ.వె.

అల్పమైన నతని కనురాగ మున్న నా

యందు ధీవరునకు నరయ మదిని

భాగ్య శేష మదియుఁ బరఁగిన నాకిల

వాత సుతున కిమ్ము శీతలమ్ము

25.   

 

 

 

ఆ.వె.

సద్గుణ వర విత్త సంపన్నఁ బతి సమా

గమన లాలస నని కరుణ హృదిని

నమ్మె నేని నన్ను నా మనో నాథుఁడు

వాత సుతున కిమ్ము శీతలమ్ము

26.   

 

 

 

ఆ.వె.

సత్య సంగరుండు సద్గుణ సుగ్రీవుఁ

డు నను ఘోర దుఃఖ వనధి నుండి

సంతరించు నేని సత్వరమ్ముగ నింక

వాత సుతున కిమ్ము శీతలమ్ము

27.   

 

 

 

తే.గీ.

అంతఁ గన ననలుండు మహార్చి శిఖల

స్థిరముగ జ్వలించె నుడువంగ సీత కపుడు

మారుతి ఘన కుశల సమాచార మింపు

గూర్ప వైదేహికి నతి నిగూఢముగను

28.   

 

 

 

కం.

హనుమంతుని జనకుం డా

యనిలుఁడు వీచె నతి మందమై మంచును గూ

డిన గాలి పగిది శీతల

మన వాలానలము నుండి యవనిజ హితమై

29.   

 

 

 

ఆ.వె.

మండు చున్నది కన వాల మధికముగ

నేలఁ గాల్ప నేర దీ యనలము

వింతఁ గొల్ప నన్ను జింత సేయఁ దొడఁగె

మారుతాత్మజుండు మనము నందు

30.   

 

 

 

కం.

కనిపించు చుండె మంటయు

నొనరింపదు నించుకయు ననూహ్యముగ రుజం

బెనుపారెను వాలాగ్ర

మ్మున హిమ సంఘాతము వలె ముమ్మర మగుచున్

31.    

 

 

 

తే.గీ.

తథ్య మిది రామ మహిమయె దాఁటు సమయ

మున సముద్రము నగ రాజము జల మధ్య

మందు నుండి యెగసి కనువిందు సేయ

లేదె నాకు నింపుగ నన్ను నాదు కొనఁగ

32.   

 

 

 

ఆ.వె.

రామ కార్యమునకుఁ బ్రేమ తోడ సహక

రింప నెంచి సంభ్రమింప సాగ

రమ్ము మఱియు  భూధరమ్ము మైనాకుఁడు

నేల సేయ కుండు నింగిలమ్ము

33.   

 

 

 

తే.గీ.

జానకీ దేవి పుణ్యంపుఁ జరితమునను

రాఘవేంద్రుని తేజంపుఁ బ్రాభవమున

జనకుఁ డనిలుని తోరంపు సఖ్యమునను

కాల్ప నొల్లండు నన్నగ్ని కరుణ తోడ

34.   

 

 

 

కం.

ఒక్క క్షణ మాత్రము తలఁచి

యక్కపి కుంజరుఁడు మరల నంత రయమునం

బిక్క బలమ్మున నెగిరెన్

దిక్కులు పిక్కటిల నఱచి తేజం బలరన్

35.   

 

 

 

ఆ.వె.

కొండ కొనను బోలు కోట గుమ్మము చేరె

ననిల నందనుఁడు మహా బలుండు

నేకత మ్మసురుల యిఱుకు లేక వెలుంగు

ద్వార మంత వేగ వానరుండు

36.   

 

 

 

ఆ.వె.

పెరిగి యొక్కసారి గిరి సన్నిభమ్ముగఁ

దిరిగి తాను మెయి కుదించి యంత

బంధనమ్ము లెల్లఁ టిమ విడివడంగఁ

జేసె నింపు నొసఁగ శీఘ్రముగను

37.   

 

 

 

కం.

హరిపుంగవుఁడు విడువడియెఁ

దిరిగి పెరిగె నద్రి నిభము తేటపడఁ గనెం

బరిఘమ్మును దోరణమున

వరాయుధమ్మును నతండు పరమ ప్రీతిన్

38.   

 

 

 

ఆ.వె.

నల్లని యినుమున ఘనమ్ముగఁ జేసిన

యా పరిఘము నూని యనిల సుతుఁడు

దోర్బలుండు వేగ దుర్జయ రక్షక

దనుజ వరుల నెల్లఁ దునిమెఁ దిరిగి

39.   

 

 

 

ఆ.వె.

వారిఁ జంపి సమర వీరుఁడు మారుతి

సూచు చుండ లంకఁ జోద్యముగ వె

లింగె మండు చున్న యంగార ఘన కీల

మాలలు రవి రశ్మి మాల లనఁగ

40.   

  

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నేఁబది మూడవ సర్గము. 

 

 

సుందర కాండము

సర్గము 54.

 

కం.

అరయుచు లంకను దీర న

భిరతియు నుత్సాహము మదిఁ బెరుఁగఁగ నంతన్

హరి కుంజరుండు లఁచెన్

గురుతర కార్యం బొకండు కొదవను మదిలో

1.      

 

 

 

కం.

కలదె యిట కార్య శేషము

కలిగింప విచార మసుర గణముల కిపు డే

నెలమిం జేయంగ ననుచుఁ

దలంపఁ జాగెఁ గపి వరుఁడు తనదు మనమునన్

2.     

 

 

 

తే.గీ.

భంజనం బయ్యె నిచ్చటి వన మఖిలము

దనుజ ముఖ్యులు హతులైరి పెనఁగి యిచట

దళము నందొక్క భాగము దళిత మయ్యె

మీఱి దుర్గ వినాశము మిగిలి యుండె

3.     

 

 

 

ఆ.వె.

సఫల మగును నాదు శ్రమ యెల్ల యత్న మొ

కింత యిపుడు సేయ నీ విమాన

రాజి నాశనమ్ము తేజ మలరఁ జే

నగును గర్మ మిఁక ముదావహమ్ము

4.     

 

 

 

తే.గీ.

యుక్త మగుఁ దృప్తి పఱప  వాలోద్ధితాగ్ని

నిపుడు నే నర్పితము సేసి నీ గృహోత్త

మముల లంకా నగర భాసితముల శంక

లేక ప్రత్యుపకారమౌఁ గాక నెమ్మి

5.     

 

 

 

ఆ.వె.

మెఱపు గముల తోటి మేఘమ్ము మఱపింప

వీఁక మండు చున్న తోఁక తోడఁ

గపి వరేణ్యుఁ డంతఁ గదలి చరించె సౌ

ధాగ్ర భాగముల మహోగ్ర బలుఁడు 

6.     

 

 

 

కం.

చూచుచు రాక్షస గృహముల

నే చకితము లేక వనుల నెల్లం దిరిగెన్

రాచ యిలులు వరుసగ ధీ

రోచిత రీతిని హరి వరుఁ డుత్సాహమునన్

7.     

 

 

 

ఆ.వె.

వాయు సమ బలుండు వాతాత్మజుఁ డెగిరి

యంత నగ్ని నుంచె నసుర వరు ప్ర

హస్తు భవన రాజ మందు రయమ్ముగఁ

బ్రజ్వలింప మేటి ప్రభల తోడ

8.     

 

 

 

ఆ.వె.

పిదప నెగిరి యన్య వేశ్మ వరము పైకి

నగ్ని నునిచె మారుతాత్మజుఁడు మ

హా పరాక్రముఁడు మహాపార్శ్వు గృహమునఁ

బ్రళయ కాల వహ్ని భంగి నంత

9.     

 

 

 

ఆ.వె.

దుమికి వజ్రదంష్ట్రు తోరంపు టిలు పైకి

నమ్మహా కపి శుకు నలఘు తేజు

సదన మంతఁ జేరి సారణు ధీమంతు

నాలయమ్ము కదిసి యగ్ని నునిచె

10.    

 

 

 

తే.గీ.

హరి గణాధిపుండు దశాన నాత్మజుఁ డగు

నింద్రజిత్తుని తోరంపు టిల్లు గాల్చె

జంబుమాలి ఘన గృహమ్ముఁ జక్కఁ బెట్టె

దనుజుని సుమాలి భవనమ్ము దగ్ధ మయ్యె

11.    

 

 

 

సీ.

రశ్మికేతూత్తమ వేశ్మము సూర్య శత్రువుని నివేశము రోమ శాల

యమ్ము దంష్ట్ర గృహము హ్రస్వకర్ణుని నిలయ మ్మాజి రత మత్తు నాలయమ్ము

దనుజ ధ్వజగ్రీవ ధామమ్ము ఘోర విద్యుజ్జిహ్వ గేహమ్ము దుర్జయుండు

హస్తి ముఖుని యాలయమ్ము కరా పిశాచ శోణిత నేత్ర సదనములను

 

 

 

 

ఆ.వె.

కుంభకర్ణుని ఘన కూటమ్ము మకరాక్షు

సద్మ వరము యజ్ఞశత్రు శాల

బ్రహ్మశత్రు భవన రాజము కుంభ ని

కుంభ దనుజ వరుల కూటములను

12.    

 

 

 

ఆ.వె.

దనుజ వరు నరాంతకుని వీడు క్రమముగఁ

దాఁ జరించి కాల్చె దనుజ నాథు

ననుజుడాఁ విభీష ణాఖ్యు గృహము వీడి

మారుతాత్మజుండు వీర వరుఁడు

13.    

 

 

 

ఆ.వె.

భాగ్యవంతు లసుర వర యశస్వంతులు

వారి వారి దివ్య భవన సంప

దల భృశమ్ము నగ్ని దహియించె వానర

పుంగవుండు చెలఁగి ముమ్మరముగ

14.    

 

 

 

కం.

గృహముల నతిక్రమించుచు

మహాశయుఁడు వేగ గతిని మారుతి యంతన్

రహిఁ జేరెను దశకంఠుని

మహాసుర గణాధినాథు మందిర చయమున్

15.    

 

 

 

మ.

అసురేంద్ర ప్రము ఖాలయాగ్ర్యమున నానానేక రత్నప్రభా

లస దుర్వీధర మేరు మందర సముల్లాసమ్ము దుర్బేధ్య మా

సమానద్యుతి మంగళచ్ఛవి మహా హర్మ్యంబు పై నుంచి వా

ల సుసంస్కారపు టగ్నిఁ దా నఱచెఁ గల్పద్యోత మేఘంబనన్

16.    

 

 

 

ఆ.వె.

గాలి తోడఁ గలసి కాలాగ్ని యన బల

వేగముల వెలింగి పెరిగె నంత

హవ్యవాహనుండు దివ్యంపుఁ గాంతులు

దిక్కు లెల్లఁ బరఁగ నక్కజముగ

17.    

 

 

 

కం.

వ్యాపించెను వేగమ్ముగ

నా పవనునిఁ గూడి యగ్ని యవశథముల లం

కా పురమునఁ గాల్చుచు నిఁక

వే పెరిఁగె హుతాశనుండు భీతిఁ గొలుపుచున్

18.    

 

 

 

తే.గీ.

కాంచన గవాక్ష సహిత ముక్తా మణి మయ

భాసితములు రత్న ఖచిత భవన సంచ

యములు విపు లాయతమ్ములు హరి వరేణ్య

దీప్తములు నాశనం బయ్యెఁ దేఱి చూడ

19.    

 

 

 

ఆ.వే.

కలకలధ్వను లటఁ జెలరేఁగె నసురులు

పర్వు లిడఁగ నిజ నివాస విభవ

రక్షణార్థ మంత రగులుచుఁ బల్కగ

ననలుఁడు హరి రూపుఁ డయ్యె ననుచు

20.   

 

 

 

తే.గీ.

అఱచుచు నుఱికి రబలలు వెఱపునఁ బసి

పిల్ల లుండఁ జంకల వీడ వేగ ముడులు

హర్మ్యములు కాలు చుండగ నంబరంపు

టభ్రముల నుండి రాలెడి శను లనఁగ

21.    

 

 

 

తే.గీ.

మండు నిల్లులు కరఁగి విమలపు లోహ

ములు ద్రవింప వజ్రమ్ములు ముత్యములు ప

గడములు విదూరజమ్ములు కపి వరుండు

సూచె రజితమ్ము లత్యంత చోద్యముగను

22.   

 

 

 

కం.

అనలుఁడు తృణ కాష్ఠమ్ములఁ

దనియని విధ మనిల సుతుఁడు తనియఁడు దనుజేం

ద్రుని మృత రాక్షస నిచయ

మ్మున హనుమంతుండు చిత్తమున నెభ్భంగిన్

23.   

 

 

 

కం.

అనలంపు మొనలు వింతగఁ

గనపడె మోదుగుల వర్ణిక నొకఁట నవియే

కనపడె బూరుగు రంగునఁ

దనరె నొకఁటఁ గుంకుమ గతి ధగధగ రుచులన్

24.   

 

 

 

ఆ.వె.

దగ్ధ మయ్యె వేగ దనుజాధిప పురమ్ము

లంక యెల్లయు ననిల తనయుండు

మహిత చిత్తుఁడు హనుమంతుఁ డా వేగవం

తు వలనఁ ద్రిపురములు శివుని వలెను

25.   

 

 

 

కం.

జవ సంపన్నుండు హరి వ

రు వలన జనితం బయిన నురు తరాగ్ని చెలం

గి వలయముగ వ్యాపించి పు

ర వరోర్వీధర ఘన శిఖరమ్మున లేచెన్

26.   

 

 

 

తే.గీ.

ప్రళయ కాలాగ్ని వేగ నిభమ్ము నయి య

నలము తోడుతఁ బెరుఁగుచు నభము ముట్టఁ

జాగెను విధూమము భవన సంయుతముగ

యగ్ని దనుజ శరీ రాజ్య మర్పితమ్ము

27.   

 

 

 

కం.

సమమై కోట్యంబరమణి

సమూహమునకుఁ బ్రభలందు సకల పురపు టా

క్రమణమ్మున ననలము కది

య మహాశని రవముల బృహదండము వెలిఁగెన్

28.   

 

 

 

తే.గీ.

కింశుక కుసుమ సన్నిభ కీల వహ్ని

వృద్ధి సెందుచుఁ జేరంగ విన్ను నందు

నభ్రములు వెల్గె నీలోత్ప లాభము, శమి

యింప ననలము పొగ గము లెగియ, నభము

29.   

 

 

 

తే.గీ.

ఇంద్రుఁడు మహేంద్రుఁడు సుర గణేంద్రుఁ డైన

ననిలుఁ డైన సాక్షాద్యముఁ డైన వరుణుఁ

డైన రుద్రుఁ డర్కుఁడు నగ్ని యైన సోముఁ

డైనఁ గాలుఁ డయిన నగు హరివరుండు   

30.   

 

 

 

కం.

కాదేని విధి చతుర్ముఖుఁ

డాది సుర పితామహుండు నఖిల ప్రాణ

ప్రాదుర్భావ కరణు హృద

యోదిత దను జాగ్రహంబె యూనెఁ గపి గతిన్

31.    

 

 

 

తే.గీ.

విష్ణు వవ్యక్తుఁ డేకుండు విశ్వమందుఁ

దనదు మాయ ననంతుఁడు ఘనుఁడు వచ్చి

యుండ నోపు నచింత్యుఁడు నుత్తరింప

దైత్య వరులఁ దేజ మలరఁ దాను గపిగ

32.   

 

 

 

తే.గీ.

చూచి ఘన దైత్య వరులు రాజుకొని పురము

జీవులు తరు లిండ్లను గలసి సకలమ్ము

దగ్ధమై నిలువ యెదుట దారుణముగఁ

బలికి రా విధ మందఱు గలసి యంత

33.   

 

 

 

కం.

విలపించిరి కాలఁ బురము

కలసి యసుర గజ రథ తురగ విహంగ మృగా

కలన తరు షండముల నా

కు లాంత రంగులయి రొదలు ఘోరము లయ్యెన్

34.   

 

 

 

కం.

హా తండ్రీ హా నాథా

హా తనయా హా సఖుండ హా సుఖ జీవ

మ్మా తఱిఁగెనె భోగమ్ముల్  

యాతు రుతము లిట్లు సెలఁగె నట ఘోరముగన్

35.   

 

 

 

ఆ.వె.

అనల కీల లెగసి వ్యాపింప మంటలు

విగ్రహ హతవీర విముఖ భటుల

హరి వరాగ్ర హాన లాభిహతపు లంక

యంత శాప తప్త మనఁగఁ దోఁచె

36.   

 

 

 

తే.గీ.

కలవలము భీతి దుఃఖపుఁ బొలసు దిండ్ల

నుజ్జ్వలజ్వాల దగ్ధ మహోగ్ర లంక

హనుమ మహితాత్ముఁ డింపుగ నరసె నలిన

సంభవ ఘనాగ్రహ నిహత జగము భంగి

37.   

 

 

 

తే.గీ.

భగ్న మొనరించి తరు రత్న వనము నెల్లఁ

జంపి యాజి మహాసుర సంఘ మంతఁ

గాల్చి గృహ రత్న రాజి లంకా నగరము

నిల్చె ననిలాత్మజుం డట నిర్భయముగ

38.   

 

 

 

కం.

సుతల త్రికూట శిఖ రా

గ్ర తల స్థిత హరిగజారి రాజిలె నచటన్

నుత కిర ణాదిత్య నిభము

సితానల జ్వాల వాల చిత్రము తోడన్

39.   

 

 

 

ఆ.వె.

రాక్షసుల ననేకుల వధించి ఘోరుల

బహు తరు సహితమ్ము వనముఁ దునిమి

యుంచి యగ్ని రాక్షసోత్తమ గృహములఁ

జేరె రామునిఁ దమిఁ జిత్త మందు

40.   

 

 

 

కం.

దేవ గణ మెల్ల నంత మ

హా వానరు ఘన బలుని మహా మతిని ఘనున్

ధీవర వరు వాతాత్మజు

నా వాయు సమాన వేగు నగ్గించి రిటుల్

41.    

 

 

 

తే.గీ.

వనము ధ్వంసము గావించి దనుజుల హత

మార్చి సమరమున ననలుఁ గూర్చి లంక

నలఘు రమ్య పురమ్మున ననిల సుతుఁడు

వానరశ్రేష్టుఁడు నిలిచె భాసురముగ

42.   

 

 

 

కం.

పరమాశ్చర్యము పొందెను

సుర గంధర్వ వర సిద్ధ సురముని గణముల్

పుర మా లంక యతి భయం

కరమ్ముగ జ్వలించు చుండఁ గాంచఁగ నంతన్

43.   

 

 

 

ఆ.వె.

అక్కపి వరుఁ గాంచి హనుమంతుని హరి వ

రేణ్యు భూతమండలి సకలమ్ము

భయపడె నితఁ డరయఁ బ్రళయాగ్ని తథ్యమ

యంచు హృదిఁ దలంచి క్కజముగ

44.   

 

 

 

కం.

సుర సంఘమును సకల ముని

వరులును గంధర్వ యక్ష ఫణిగణ విధ్యా

ధరులు సకల భూతములుం

బరమ ప్రీతిఁ బడసి రసమాన ప్రతిమన్

45.   

                                                         

 

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నేఁబది నాలుగవ సర్గము. 

 

 

సుందర కాండము

సర్గము 55.

 

                                                         

 

చం.

నగరము గాల్చి లంకను ఘనమ్ముగ సర్వము వాల వహ్ని నా

నగ చరుఁ డంత వాయు వర నందనుఁ డార్పెను దాని నబ్ధిలో

రగిలెడు లంక ధ్వస్తపుఁ బురమ్మును ద్రస్త నరద్విషాలినిన్

వగపునఁ గాంచి చిత్తమున భావన సేసెను దత్తఱమ్మునన్

1.      

 

 

 

చం.

కలిగెను ఘోర భీతి నిజకర్మము గాంచఁగఁ జిత్తమందు నేఁ  

గలఁత చెలంగ నిందలకుఁ గారణ భూతుఁడ నైతి నివ్విధిం

జెలఁగి దహించి లంక నతి శీఘ్రమ చేసితి దుష్ట కార్యమే

యలమట నందఁ దోరముగ నంచుఁ దలంచెను వాయుజుం డటన్

2.     

 

 

 

ఆ.వె.

ధన్యులు పురుష ప్రధానులు ఘనులు మ

హాత్ములు నిజ బుద్ధి నలుక సెలఁగఁ

గ నరికట్టు వారు కనలెడు ననలము

నేర్పు తోడ నీటఁ  నార్పు పగిది

3.     

 

 

 

ఆ.వె.

కోప మున్న వాఁడు గురువుల వధియించుఁ

బరుష భాష లెల్లఁ బలికి భృశ మ

నిశము సాధుజనుల నిందించు ముక్కోపి

కోపి సేయ నట్టి పాప మెద్ది

4.     

 

 

 

తే.గీ.

కోపి యనఁ దగని యనఁ దగు పలుకు లెఱుఁ

గంగ నేరఁ డెన్నం డెఱుఁగం డకార్య

ముల నవాచ్యము లన్నవి మున్న నేర

నొల్లఁడు మది నించుక యైన నుర్వి నరయ

5.     

 

 

 

కం.

అడరిన కోపము నోర్పున

విడిచిన నాతఁడ పురుషుఁడు విఖ్యాతముగం

గడుఁ గృశియించిన యజినము

వడిఁ ద్యజియించు భుజగమ్ము భంగి తలంపన్

6.     

 

 

 

కం.

ఏమన నగు నిర్లజ్జుని

భీమపు దుర్బిద్ధిని నను వృజినపుఁ గర్మున్

స్వామిద్రోహిని జానకి

నేమఱి యనలున కొసఁగిన హీన చరిత్రున్

7.     

 

 

 

కం.

పుర మెల్ల మండ నగ్నిని

వర నారీ రత్న మేల వహ్నిఁ గనల కు

న్నె రయముగ జానకి యనల

పర మయ్యెఁ దెలియక నాదు పతి కార్యమిఁకన్

8.     

 

 

 

కం.

ఆరంభించిన కార్యం

బారయ నీఱయ్యె దగ్ధ మయ్యె నిట నిలిం

పారాతి పట్టణము సీ

తా రత్నము వహ్ని నకట దగ్ధం బయ్యెన్  

9.     

 

 

 

తే.గీ.

అల్ప కార్య మిది సఫల మయ్యె శంక

లేక లంకా దహన మింక భీకరముగ

మూల కార్య మకట కోపమునకు లొంగ

నేను నాశన మయ్యెను నిశ్చయముగ

10.    

 

 

 

ఆ.వె.

కాల నట్టి చోటు గానఁ బడదు లంక

నించు కైన దేశ మెల్ల భస్మ

మయ్యె విదిత మయ్యె నవనిజ నిహతమ్ము

నిందు నింక లేదు సందియమ్ము

11.    

 

 

 

ఆ.వె.

ధ్వంస మయిన నాదు పరమ మూర్ఖత్వము

వలన నీ పని యిటఁ బాడి యగును

నాకు నింక వీడ నాదు ప్రాణములను

జీవనమ్ము సేయఁ జేటు సుమ్మి

12.    

 

 

 

కం.

దూఁకుదునే యనలమ్మున

వీఁక నిపు డహో రుచియె ప్రవేశము కడలి

న్నాకు మహాశన మా మక

రాకర సత్త్వ చయమునకు నందింపంగన్

13.    

 

 

 

కం.

ఏ రీతిఁ గందు నసువుల

వా రిరువురఁ బురుష వరుల వానర విభునిన్

ఘోరముగఁ గార్య నాశన

మీ రీతిం జేయ నకట యిద్ధర నింకన్

14.    

 

 

 

కం.

చపలమ్మును లోక విదిత

కపిత్వమును జాటితి నిట ఘనముగ నే రో

ష పటుత్వ దోషమున నీ

విపరీత వినాశమున వివేకచ్యుతుఁడన్

15.    

 

 

 

కం.

వశమై రాజస బుద్ధికి

నశింప సుస్థిరత నా మనమ్మున నున్నన్

భృశము బలము రాగమునం

గుశలము సేకూర్ప నైతి క్షోణీ సుతకున్

16.    

 

 

 

సీ.

సీతా వినాశము చెవినిం బడిన రాఘవు లుభయు లిఁక నసువులు విడుతురు

రామ లక్ష్మణుల మరణము నరసి స బాంధవము సుగ్రీవుఁడు ధరణిఁ గూలు

నిది యెల్లఁ దెలియంగ నిక్ష్వాకు భరత శత్రుఘ్ను లుండుదురె ధారుణిఁ దలంప

నిక్ష్వాకు వంశస్థు లీరీతి లయమొంద సంతాప తప్తులు సకల జనులు

 

 

 

 

ఆ.వె.

భాగ్య హీనుఁడ నయి వదల ధర్మార్థ సం

చయము లీ విధమ్ము చపల చిత్త

మునను రోష దోషమున లయ కారకుం

డ నని విశద మయ్యె ననఁగ నిజము

17.    

 

 

 

కం.

శకునమ్ము లంత హరి వరు

నకుఁ దలఁచు తఱిఁ గనిపించినవి శుభ కరముల్

సకలము పూర్వ మరసినవి

య కపి వరుఁడు తిరిగి తలఁప నారంభించెన్

18.    

 

 

 

ఆ.వె.

సుందరాంగి సీత చోద్య మేల తనదు

తేజమునఁ బడయదె దివ్య రక్ష

ణమ్ము ననలమె యన లమ్మును దహియింప

నుత్సహింప నోప దుర్వి యందు

19.    

 

 

 

కం.

నిజశీల రక్షితను ధర

ణిజను మహాత్ముని రఘువరుని సతీ మణి నా

భుజి తాఁకఁగఁ దరమే యెం

చ జగతి సాధ్వీ లలామ సచ్ఛారిత్రన్

20.   

 

 

 

కం.

రాముని తేజము వలనను

భామామణి సీత సుకృత పటలము వలనన్

ధూమ విహీనాగ్ని ననుం

బ్రేమాతిశయమునఁ గాల్ప విముఖతఁ జూపెన్

21.    

 

 

 

కం.

భరతా ద్యనుజ త్రయమున

కరయఁగ దేవత రఘు వరుఁ డా రామునికిం

బరమ ప్రియ దారోదా

ర రమణి జానకి నిహతి తరమె యనలమునన్

22.   

 

 

 

ఆ.వె.

అఖిలము దహియించు ననలము నాదగు

వాలమును దహింప దేల కాల్చు

నవ్య యానలుండు దివ్య చరిత సీత

నింక శంక యేల యిందు నొంద

23.   

 

 

 

తే.గీ.

అత్తఱి స్మరియించెను విస్మయముగఁ బర్వ

తము హిరణ్యనాభమ్ము నుదధి జలమ్ము

నుండి వెడలిన దృశ్యమ్ము మండితముగ

మారుతాత్మజుండు తిరిగి మనము నందు

24.   

 

 

 

తే.గీ.

నిజ తపోబలమున సత్య నిరతి నాథు

నం దనన్య భావమ్మున నవనిజ నన

లమ్మును దహింప నోపును యిమ్మహి నన

లుండు జానకిఁ గాల్ప నేరండు నిజము

25.   

 

 

 

ఆ.వె.

చింత సేయు చుండ శీఘ్రమ మారుతి

సీత ధర్మ యుక్త  శీలవృత్తి

నాలకించెఁ దమి మహాత్ముల చారణు

ల వచనమ్ము లంత వివరముగను

26.   

 

 

 

కం.

ఆశ్చర్యమ్ముగఁ గపి కృత

నిశ్చయుఁ డై యగ్ని నుంచె నేర్పున లంకన్

దుశ్చరితులు రాక్షస సుమ

హాశ్చర్యావాసముల భయం బేపారన్

27.   

 

 

 

తే.గీ.

చెదర స్త్రీ బాల వృద్ధులు చింత తోడ

జనుల కోలాహల ధ్వని చదలు వార

రోదనమ్ములు నిండ దారుణముగ నట

లంక గిరి కందరంపు లీలఁ గనిపించె

28.   

 

 

 

ఆ.వె.

సౌధములు ప్రహరులు సద్వారములు దగ్ధ

మయ్యె నగ్ని లంక యందు నెల్ల

జానకి ధరణిజ కుశలయై నిలిచె నద్భు

తమ్ము సుమ్మి గాంచ ధరణి యందు

29.   

 

 

 

ఆ.వె.

ధృవపు శకునములను దివ్యర్షి గణ వాక్య

ములను గారణముల వలన హనుమ

ప్రీతి నొందె మదిని సీత కుశల వార్త

నాలకించి శాంతుఁ డయ్యె నంత

30.   

 

 

 

తే.గీ.

తీర నింపుగఁ దనదు మనోరథమ్ము

దెలియ నవనిజ క్షేమమ్ము తెల్లముగను

జూచి ప్రత్యక్షముగ సీత సుదతి నంత

మరలి చన మతి నెంచెను హరి వరుండు

31.    

 

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నేఁబది యేనవ సర్గము. 

 

 

సుందర కాండము

సర్గము 56.

 

                                                         

కం.

కాంచి ధరణిజను మారుతి

యంచితముగ శింశుపా నగాది రహిని జో

డించి కరములు నతుల ననెఁ

గాంచితి నిన్ను గుశలముగ క్షయహీనముగన్

1.      

 

 

 

కం.

ఏఁగెడు వానిం బలుమఱు

దాఁ గని హనుమంతు సీత తన నాథుని పై

రాగాతిశయపుఁ బల్కులు

ధీగతి వచియించె నిట్లు దృఢముగ నంతన్

2.     

 

 

 

కం.

ఒక్కఁడ వీవ సమర్థుఁడ

వుక్కడగించి విజయమ్ము నుగ్రారిఘ్నా

చక్కఁగ సాధింప యశము

పిక్కటిలఁగ సత్వ వృద్ధి పేర్మి వహింపన్

3.     

 

 

 

తే.గీ.

సంకులము సేసి శరముల లంక నెల్ల

ఘోర శత్రు బలఘ్న కాకుత్స్థుఁ డలిగి

నన్నుగొని పోవ నతనికిఁ జెన్ను సుమ్మి

గౌరవ మినుమడించును గపివరేణ్య!

4.     

 

 

 

ఆ.వె.

ఆతని బల విక్రమాతిశయములకుఁ

దగిన యట్టి రీతిఁ దనరు నట్లు

మారుతాత్మజ! పరమప్రీతిఁ బ్రోత్సహిం

పుమ రఘు కుల తిలకుఁ బురుష వృషభు  

5.     

 

 

 

ఆ.వె.

అర్థ వద్వచనము లాలకించి వినయ

కారణ సహితములు కపి వరుండు

బదులు పల్కె నంతఁ బవనాత్మజుండు ధ

రణిజఁ గాంచి యాదరమ్ము తోడ

6.     

 

 

 

చం.

త్వరితము వచ్చు రాఘవుఁడు వానర భల్ల నికాయ సంయుత

మ్ము రమణి! సంహరించి రిపు పుంగవులన్ సమరమ్ము నందు భీ

కరమగు నీదు దుఃఖము సుఖమ్ముగఁ బాపును దథ్యమింతయున్

హరివరుఁ డూఱడించి యిటు లామెను మ్రొక్కెఁ బ్రయాణ యత్నుఁడై

7.     

 

 

 

తే.గీ.

అంత నిజ నాథ సందర్శ నైక లాల

సాత్మ హరి వరుఁడు రిపుగ ణాంతకుండు

శృంగి రాజ మరిష్టము సేరి యెక్కె

వేగ గమన సంరంభియై విరియ వీఁక

8.     

 

 

 

తే.గీ.

ఉన్నతపుఁ బద్మక లతల వన్నె లలర

నీల వర్ణ భూ రుహ రాజి నెలకొనంగ

ఘన శిఖాంతర తలముల ఘన నికాయ

మలర నుత్తరీయ మనఁగ నద్రి పరఁగె

9.     

 

 

 

ఆ.వె.

దినకరు కరముల ముదితముగ మేల్కొనఁ

బడిన రీతి నెగయ పైకి రజము

కనపడు ఘన ధాతు కాంతులు తలపింప

లోచనముల పగిది తోఁచె నగము

10.    

 

 

 

ఆ.వె.

నీర ధార జనిత నిస్వనము లచట

నధ్యయనపు రవము లనఁగ వెలయ

జలజల సెలయేటి చప్పుళ్లు మధురంపు

గీతము లనఁ దనరె గిరి వరమ్ము

11.    

 

 

 

ఆ.వె.

దీర్ఘ దారు తరులు దీపించి నూర్ధ్వబా

హువుల పగిది నిలువ నుచ్చముగను

నిర్మల జలపాత నిస్వనములు రోద

నములఁ బోలె నపుడు నగము నందు

12.    

 

 

 

తే.గీ.

తూఁగు శరదృతు నీలంపుఁ దోఁపుల వలె

నూఁగు నటులుండె శైలము వేగవంత

మైన మారుతమ్మును గూడ నా వెదురులు

కదలెఁ బిల్లన గ్రోవి నినదము లీని

13.    

 

 

 

ఆ.వె.

రోష ఘోర విషధరులఁ గూడి కుధరమ్ము

నిశ్వసించు నట్లు నెగడె వింతఁ

గొండ గుహల మంచు నిండ పరిఢవిల్లె

ధ్యాన ముద్ర నున్న మౌని వోలె

14.    

 

 

 

తే.గీ.

శైల మూలము లభ్రంపుఁ జరణము లన

వెలయ నంచులు మేఘ మాలలను బోలఁ

జాగు చున్నట్లు కన్పించెఁ జక్కఁగ నభ

మందు జృంభణ యుత మన నగమ వరము

15.    

 

 

 

ఆ.వె.

శృంగములు విరివినిఁ జెల్లచెదరఁ గంద

రమ్ములు విలసిల్లఁ బమ్మి యచటఁ

గీచ కాశ్వకర్ణ కీర్ణ సాలావృత

శైల రాజ మలరె సమ్మదముగ

16.    

 

 

 

కం.

వితత లతా కుసు మాలం

కృత నానా మృగ వితాన కీర్ణ విలసిత

స్థిత ధాతుస్రావ విరా

జిత మా ధరణీధరమ్ము చిత్రము ధరణిన్

17.    

 

 

 

కం.

సెలయేఱు లనేకమ్ములు

విలసిల్ల శిలాచయంపు వెల్లువల మహ

ర్షులు యక్షులహులు గంధ

ర్వులు కిన్నరులు వసియింప రుచిరం బయ్యెన్

18.    

 

 

 

కం.

మృగరాజ నివాస కుహర

పు గముల వల్లీ ద్రుమ గణ పూర్ణంబును వా

ల్మృగ సంఘ సంచరితమును

నగరాజము స్వాదు మూల నగ ఫల యుతమున్

19.    

 

 

 

తే.గీ.

రామ సందర్శ నంపు సంభ్రమము తనర

హర్ష చోదిత మనమున ననిల సుతుఁడు

స్వామి కార్యము నింపుగఁ జలిపి హరి వ

రేణ్యుఁడు రయమున నగాగ్రగణ్య మెక్కె

20.   

 

 

 

కం.

నుగ్గయ్యె శిలా నిచయము

వెగ్గలముగ వానర వరు పెను పాదములన్

దిగ్గున నుంచ నగమ్మున

బిగ్గరగ ధ్వనులు చెలంగి వినపడె నెల్లన్

21.    

 

 

 

కం.

అధిరోహించి నగేంద్రము

నధికము సేసె నిజకాయ మా హనుమ మహో

దధి దాట నుత్తర దిశకు

నధో దిశా తలము నుండి యర్చించి మదిన్

22.   

 

 

 

ఆ.వె.

పర్వతమ్ము నెక్కి పవనాత్మజుండు వీ

క్షించె నర్ణవమ్ము నంచితముగ

మీన భుజగ భాసమానమ్ము భీమ గం

భీర మాయతము కపిప్రవరుఁడు

23.   

 

 

 

కం.

ఆకాశమ్మున కెగిరె మ

హా కాయుఁడు మారుత సుతుఁ డనిలుని భంగిం

బ్రాకటముగ నుత్తరమున

కేకాగ్రత యామ్య నుండి యింపుగ నంతన్

24.   

 

 

 

తే.గీ.

వానర పద పీడితయై మహా నగమ్ము

శిఖరము లవి తూల విరివిఁ జెట్టు లెల్లఁ

గూల సహభూత సంఘమ్ము గ్రుంకె భువిని

ఘోర ఘోషమ్ములు సెలంగ దారుణముగ

25.   

 

 

 

కం.

ఆతని యూరు రయమ్మున

భూతలమునఁ గూలె విరిగి పుష్పయు తాద్రుల్

భీతికర పురందర ని

ర్ఘాతమ్మున ఘాతమయిన కరణి తలంపన్

26.   

 

 

 

ఆ.వె.

కందరముల నున్న కంఠీరవమ్ములు

పీడితమ్ములై సు భీషణమ్ము

గర్జనమ్ము లీయఁ గంపించి నిర్ఘోష

ము లవి వినఁబడెను బగుల నభమ్ము

27.   

 

 

 

తే.గీ.

అంత విధ్యాధ రాంగన లంద ఱకట

భయమునఁ జెదరి తొలఁగిన బట్టల ముడి

వడిన యట్టి నగల వడి వడిగ నెగిరి

రదిరి పాటున నగరాజ మందు నుండి

28.   

 

 

 

తే.గీ.

నలియఁగ మెడలు పడగలు కలవరమున

బల్లిదపుఁ బెద్ద పాములు వెల్లు విరియ

విషము మండెడు నాల్కల భీతి చెంది

కరము తిరుగాఁడఁ జాగెను గిరి నిటు నటు

29.   

 

 

 

తే.గీ.

క్షోభితంబగు నమ్మహా గోత్ర ధామ

మును వదలి భీతి నాకాశమున నిలిచిరి

యక్ష భుజగ గంధర్వ విద్యాధర వర

కిన్న రాదులు చిత్రము మిన్ను ముట్ట

30.   

 

 

 

కం.

శ్రీమంతము కపి పీడిత

జీమూతము పాదపములు శృంగమ్ములతో

భీమపుఁ బాతాళమ్మును

భూమిఁ దొలఁచి చేరె నంత మ్రోగ రవమ్ముల్ 

31.    

 

 

 

ఆ.వె.

అద్ధరాధరము మహాద్భుతము పది యో

జనముల వెడలుపునఁ దనరి యోజ

నములు మూడు పదుల నమరి యెత్తున సమ

మయ్యె భూ తలమున కంతఁ గ్రుంగ

32.   

 

 

 

తే.గీ.

ఉత్తరింపఁ దివిరి లవణోర్మి మాలి

ఘన తరం గావృత తటి నా కపి వరుం డ

మంద గతి నెగిరెను వాయు నందనుండు

నభ్ర నిభుఁ డవలీలగ నభ్రమునకు

33.   

  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నేఁబది యాఱవ సర్గము. 

 

 

సుందర కాండము

సర్గము 57.

 

                                                         

 

సీ.

చంద్రుఁడు కనిపింపఁ జంద్రకాంతము భంగి కారండవము వలెఁ గమల సఖుఁడు

తోఁప హంసల వలెఁ దోఁపఁ బుష్యశ్రవణమ్ములు మేఘ జాలమ్ములు వర

సాద్వలమ్ము లుపతిష్యము మహా మీనంబు మంగళుం డరయంగ మకర మనఁగ

నైరావతము ద్వీప మనఁగ స్వాతి విహరించు మరాళము పగిది నమర మెఱసి

 

 

 

 

తే.గీ.

వాయు చలనములు తరంగ పటల మనఁగఁ

జంద్రిక లమర శీతల సలిల మనఁగ

యక్ష గంధర్వ భుజగము లమర ఫుల్ల

తామరస కుముద సుమ వితాన మనఁగ

1.      

 

 

 

ఆ.వె.

గగన మర్ణవ మనఁగఁ జెలఁగ నచట న

పారమై యల పన నేర కంత

మారుతాత్మజుండు మారు తాధ్వమ్మునం

బోవఁ జాగె వేగ నావ వోలె

2.     

 

 

 

మ.

ఖతలమ్మెల్లను నారగించు వహిఁ దాఁకం గోరు చందమ్మునన్

సితభానుం దమి సంగ్రహింప నన సాశీతాంశు తారాభ్రమున్

విత తాంభోధర చక్రవాళమును వే భేదించు చందమ్ము మా

రుత సూనుండు నభశ్చరుండు హరి వీరుం డంతఁ జాగెన్ వడిన్

3.     

 

 

 

కం.

ధవళంపు వారిదము లరు

ణ వర్ణములు నీల తామ్ర నవ హరిత సమా

న విషధరమ్ములు విలసి

ల్లె వానరుండు పయనింప లీలగ నంతన్

4.     

 

 

 

కం.

మఱిమఱి తూఱుచు వెడలుచు

నెఱి దప్పక మేఘములను నేర్పు చెలంగం

బఱఁగెను గపికుంజరుఁ డ

త్తఱి దృశ్యాదృశ్య చంద్రుఁ దలపింపంగన్

5.     

 

 

 

కం.

తెల్లని బట్టల మారుతి

పెల్లగు మేఘ నిచయముల విహరింప విరా

జిల్లెను దాఁగుచుఁ దోఁచుచుఁ

జల్లని చంద్రుని నిభమ్ము సత్పథ మందున్

6.     

 

 

 

తే.గీ.

చీల్చి మేఘ బృందమ్ములఁ జిత్రముగను

మాయ మగుచుఁ గన్పించుచు మరల మరల

నినదములు వారిదస్వన నిభము లిడుచు

గరుడుని పగిది తాఁ దోఁచెఁ గపి వరుండు

7.     

 

 

 

చం.

అల వధియించి రాక్షసుల నాత్మ యశస్సును విస్తరించి వ్యా

కుల మొనరించి పట్టణముఁ గ్రూరుని రావణు వేఁచి ఘోరపుం

బలమును నేఁచి మిక్కుటముఁ బ్రాంజలిఁ జేసి ధరా తనూజకుం

జలనిధి మధ్య భాగమును జక్కఁగ మారుతి సేరె ధీరతన్

8.     

 

 

 

తే.గీ.

పర్వతశ్రేష్ట మా సునాభమును హస్త

తలమున స్పృశించి వాన రోత్తముఁడు ప్రేమ

వీర్యవంతుఁడు సాగెను వేగముగ ధ

నుర్విముక్త నారాచమును దలపించి

9.     

 

 

 

తే.గీ.

చేరి కొలఁది సమీపము నారసి గిరి

వర మహేంద్ర మభ్ర నిభమ్ముఁ బవన సుతుఁడు

మేఘ సంకాశ నినదమ్ము లాఘవముగఁ

జేసె దిశలెల్ల వ్యాపింపఁ జేవ మీఱి

10.    

 

 

 

ఆ.వె.

త్వరితపు గతిఁ జేరి తద్దేశము హనుమ

చెలులఁ జూచు వేడ్క చెలఁగ భృశము

హరి వరేణ్యుఁ డార్చె నశని నిభధ్వని

వాలము నొనరించెఁ జాలనమ్ము

11.    

 

 

 

కం.

నినదించు చుండ మారుతి

వినతా తనయ చరిత గతి వీరవరు మహా

స్వనమున సార్యమ వలయ గ

గన తలము పగులు ననంగఁ గన్పడె నంతన్

12.    

 

 

 

ఉ.

పూర్వము సాగ రోత్తరపుఁ బుణ్య తటమ్మున నున్న వానరుల్

సర్వులు భీమ విక్రములు సత్వర వాయు సు తావలోక నా

ఖర్వ రతాత్మ సంస్థితుల కర్ణములందున సోఁకె రావముల్

పర్వఁగ వాన రోరుజ వమ్మనిలోత్థ ఘనస్వనాభమై

13.    

 

 

 

కం.

దీనులు కానన వాసులు

వానర వరు ఘోషణములు స్వనితాభమ్ముల్

వీనుల కింపుగ విని రట

నానందం బతిశ యిల్ల హరి వరు లంతన్

14.    

 

 

 

కం.

నినదింప నాదములు హరి

ఘనముగ వానరులు విని సకల దేశములం

దున నున్న వారు సఖ ద

ర్శన కాంక్షులు తహతహ పడఁ జాగిరి యరయన్

15.    

 

 

 

కం.

సరసకుఁ బిల్చి ముదమ్మున

హరి గణమును జాంబవంతుఁ డచ్ఛ వరేణ్యుం

డు రయమ్ముగఁ బల్కెను సుమ

ధుర భాషణములు మదిఁ బరితుష్టి చెలంగన్

16.    

 

 

 

తే.గీ.

అన్ని విధములఁ గృత కృత్యుఁ డయ్యె హనుమ

సందియం బొక యింతయు నిందు లేదు

కార్య విఫలుని నిస్వన మ్మార్యులార!

తోషణంబై చెలంగునె తూర్యనిభము

17.    

 

 

 

కం.

ఆతని భుజోరు వేగము

నాతత నాదము మహాత్ము నరసి హరి వరుల్

ప్రీతి నెగిరి రచట నచట

నాతురత ననిల తనయుని నరయఁగ నంతన్

18.    

 

 

 

ఆ.వె.

వా రిఁక ముద మంది భూరుహాగ్రము నుండి

భూరుహాగ్రమునకు మూరి దుమికి

శృంగ మందు నుండి శృంగాన్యమునకును

గంతు లిడిరి హనుమఁ గాంచు వేడ్క

19.    

 

 

 

కం.

నిలిచి నగాగ్రముల నెలమి

చెలంగఁ గొమ్మలను బట్టి చేలము లన శా

ఖల నూఁప దొడఁగిరి హరి వ

రు లంత ముది తాత్ములై సురుచిరముగఁ దమిన్

20.   

 

 

 

ఆ.వె.

కొండ గుహలఁ దూఱి మెండుగ వీచెడి

గాలి గర్జనమును బోలి హనుమ

మారుతాత్మజుండు ధీరుఁడు గర్జించె

ఘన బలుఁడు ఘనాఘన నిభుఁ డెలమి

21.    

 

 

 

ఆ.వె.

దరికిఁ జేరు ననిల తనయు మేఘ నిభు మ

హా కపిఁ గని యంత నా కపి వరు

లెల్ల రపుడు సంతసిల్లి కరమ్ములు

నెమ్మి మీ మోడ్చి నిల్చి రచట

22.   

 

 

 

ఆ.వె.

అంత దిగెను బాదపాకుల గిరి రాజ

మా మహేంద్ర శిఖర మందు వేగ

వంతుఁ డిద్ధ బుద్ధి మంతులలో నుత్త

ముండు హనుమ గిరి నిభుండు ప్రీతి

23.   

 

 

 

కం.

సంతసము నిండ మానస

మంత హరి వరేణ్యుఁ డంత నచ్చట  వ్రాలెన్

దంతిస్రోతస్సున కడు

వింత తెగిన ఱెక్కలఁ బడు పెను గిరి వోలెన్

24.   

 

 

 

ఆ.వె.

ముదిత మానస హరి పుంగవు లెల్లరు

చేరిరి కపి చుట్టు శీఘ్రముగను

హనుమ నా మహాత్ము హర్షమొందిరి యత్య

ధికము తిరిగి రాఁగ ధీర వరుఁడు

25.   

 

 

 

చం.

వదనము లందు సంతసము పాఱఁగ నందఱు వాన రోత్తముల్

పదిలముగన్ మరుత్సుతుఁడు పర్వత మింపుగఁ జేర మెచ్చుచున్

ముదముగ నిచ్చి రంత ఫలమూలములున్ బహుమానముల్ తమిన్

సదమల వృత్తి నర్చనలు సల్పిరి వానరు లందు మేటికిన్

26.   

 

 

 

తే.గీ.

పెద్దలను వృద్ధుల హనుమ పేర్మి జాంబ

వంతు నాదిగ నంగదు వాలి సుతుని

తద్దయు ననురక్తిం గాంచి బెద్దతనము

నిచ్చి మ్రొక్కె నందఱ కట నింపు నొసఁగ

27.   

 

 

 

ఆ.వె.

పూజ్యుఁ డంత హనుమ పూజింపఁ బడి వారి

రువురచే నితర హరులును గౌర

వింపఁ గంటి సీత నింపుగ నంచుఁ గౢ

ప్తముగ వీర వరుఁడు పలికె నంత 

28.   

 

 

 

కం.

వాలికుమారుని కరమును

గాలి కొమరుఁడు గ్రహియించి కమనీయ తటిన్

శైలవర మహేంద్రమ్మున

మేలుగ నాసీనుఁ డయ్యె మిత్రుల తోడన్

29.   

 

 

 

ఉ.

కంటిని సీత నేక జటఁ గాంత నశోక వనమ్ము లోపలం

దుంటరు లైన దానవ వధూటుల రక్షణ మందు రామునిం

గంటను నోఁచ కుంటమిని గాసిల మాసిన బట్ట లందుఁ దాఁ

దింటకు నొల్ల కుండగను దీర్పఁక జుట్టుఁ గృశించి యుండగన్

30.   

 

 

 

తే.గీ.

పలుక నివ్విధి మారుతి వానరర్ష

భులను గాంచి చూచితి నన్న పలుకు లమృత

నిభములను విని వానర నిచయ మంత

సంతసిల్లె మిక్కుటముగఁ జింత వీడి

31.    

 

 

 

ఆ.వె.

ఆడిరి వడిఁ గొంద ఱన్యులు గర్జించి

రపరులు నఱవంగ హరు లితరులు

కిలకిల రవములు వెకిలిగఁ జేసిరి ప్రతి

ధ్వనులు కొంద ఱట ముదముగ నిడిరి

32.   

 

 

 

కం.

కపికుంజరులు నత నితాం

త పుచ్ఛులు ముదితులు ఘనులు తరళములు సుదీ

ర్ఘపుఁ దోఁకల నాడించిరి

విపరీతము గొంద ఱంత వేడుక తోడన్

33.   

 

 

 

ఆ.వె.

మారుతాత్మజు ఘను వారణోపము హను

మానుని యనుమోద మానసు లిత

ర హరులు దుమికి శిఖరమ్ముల పయి నుండి

హస్తముల స్పృశించి రంతఁ బ్రీతి

34.   

 

 

 

కం.

మారుతి మధురోక్తులు విని

వీర హరుల నడుమ నుండి ప్రీతిగఁ బలికెన్

ధీర వరుఁ డంగదుం డతి

గౌరవముగ భాషణములు గాడ్పుకొడుకుతోన్  

35.   

 

 

 

ఆ.వె.

సములు లేరు నీకు సత్త్వ వీర్యమ్ముల

వానరవర తిరిగి వచ్చి తీవు

సాగరమ్ము దాఁటి వేగముగ బహు వి

స్తీర్ణ దుస్తరమ్ము దివ్యముగను

36.   

 

 

 

తే.గీ.

అద్భుతము నీదు వీర్య మత్యధికము పతి

భక్తి యెంచ ధైర్య మది యపార మింక

రామపత్నిని దేవి నరసితి వీవు

రాముఁ డిఁక వీడు సీతా విరహపు వగపు

37.   

 

 

 

కం.

వానరు లంగదు మారుత

సూనుని ఘను జాంబవంతు చుట్టును వడి నా

సీను లయిరి శిలల పయిన

మానసముల సంతసంపు మహిమ చెలంగన్

38.   

 

 

 

తే.గీ.

లవణ జలరాశి లలితంపు లంఘణమ్ము

తరుణి జానకి లంకను దర్శనమ్ము

దశము ఖాలోకనమ్మును దలఁచి వినఁగ

నంజలి ఘటించి నిల్చిరి హనుమ గిరల

39.   

 

 

 

కం.

విలసిల్లె నంగదుఁ డరయ

లలితమ్ముగఁ గపి వరేణ్యుల పరివృతమునం

గొలువున నమరులఁ గూడిన

బలసూదనునిఁ దలపించి వాలి సుతుఁ డటన్

40.   

 

 

 

తే.గీ.

కీర్తిమంతుఁ డా హనుమతోఁ గీర్తితుండు

నంగ దాభరణ విలసి తాంగదు ఘనుఁ 

గూడి రాజిల్లె నున్నత గోత్ర రాజ

మంత ప్రభల వెల్గి భృశము వింత గొలుప

41.    

 

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నేఁబది యేడసర్గము. 

 

 

సుందర కాండము

సర్గము 58.

                                                         

 

కం.

నగవరము మహేంద్రమ్మున

నగచర పుంగవు లనిల తనయ సహితముగం

దగ నాసీను లయి సుఖ

మ్ముగఁ బరమానందము మనములఁ బొంది రటన్           

1.       

 

 

 

ఆ.వె.

అంత జాంబవంతుఁ డడిగెఁ బ్రీతి ముదము

నిండ నెడఁదఁ గర మనిల తనయుని

సఫల కార్య వృత్త సరణి వివరముగఁ

జెప్పు మంచుఁ దమిని శీఘ్రముగను

2.       

 

 

 

తే.గీ.

ఏ విధి నరసితివి సీత నెవ్విధిఁ జరి

యించె నచ్చట జానకి యెట్లు రావ

ణుండు క్రూరుండు వర్తించె దుండగుండు

భూ తనూజను వీక్షించి వాత తనయ!

3.       

 

 

 

కం.

చెప్పుము యథార్థముగ మా

కిప్పట్టున వానరేంద్ర! యెల్లను వినినం   

దప్పక చింతించి మనకు

నొప్పగు కార్యము తలంప నోపఁగ వచ్చున్

4.       

 

 

 

కం.

తిరిగి యరుగ నచ్చటకు వి

వరింపుమ నుడువ దగు గుణ వచనమ్ములు నా

పరిరక్షితంపుఁ బల్కులు

హరివర! మాకు నిచట నుచి తానుచితజ్ఞా!   

5.       

 

 

 

ఆ.వె.

అడుగ నట్లతండు హనుమంతుఁ డంత క

రమ్ము లెత్తి భక్తి రామ సతికి

దేవి సీత వర విదేహ రాజ సుతకు

మ్రొక్కి పలికెఁ దనరి ముదము తోడ

6.       

 

 

 

చం.

అరయుచు నుండ మీరలు మహాత్మ! మహేంద్ర గిరీంద్ర మెక్కి నే

స్థిరమతిఁ జేర వారిధి కుదీర్ణపు దక్షిణ తీర భాగ మం

బర గతి నేఁగు చుండగ నపారపు విఘ్న మనంగ లేచె సా

గర జల మందు నుండి ఘన కాంచన పర్వత రాజ మత్తఱిన్

7.       

 

 

 

ఉ.

చూచి మనోహరంపు గిరి చొప్పున కడ్డము రాఁగ నత్తఱిం

దోఁచెను విఘ్న మంచు మదిఁ దూర్ణము డగ్గఱి దివ్య గోత్రముం

దాఁచెద నంచు వాలమునఁ దల్చి విభిన్నము సేయఁ గృత్స్నమున్

నూచగ నయ్యెఁ నంత శిఖ నుగ్గి దినేశ్వర తుల్య శృంగమే

8.       

 

 

 

ఆ.వె.

నా మన మెఱిఁగి ఘన నగమంత పుత్రా! య

ని మధురంపుఁ బిలుపున ముద మీయ

నాదు చిత్తమునకు నాదరముగఁ బిల్చి

పలికె భాషణములు పరమ రక్తి

9.       

 

 

 

కం.

పినతండ్రిగ నెంచుము నను

ననిలుని మిత్రుఁడ జలధి గృహము మైనాకుం

డను నామమ్మునఁ బరఁగుదు

ననిల తనయ! కంటి నిన్ను నానందముగన్

10.    

 

 

 

ఆ.వె.

పర్వతేంద్రములకు పక్షము లున్నవి

పూర్వ కాల మందు నుర్విఁ బుత్ర!

మెండుగ భువి తిరుగు చుండె యథేచ్ఛము

బాధ లొసఁగి సతము ప్రాణుల కిల

11.    

 

 

 

కం.

విని శైలశ్రేష్టముల గ

మనమును నమరేంద్రుఁడు పరిమార్చెను గులిశ

మ్మునఁ బాకశాసనుఁ డలిగి

తనూరుహమ్ములను వేగ ధరముల కంతన్

12.    

 

 

 

ఆ.వె.

అంతఁ గృప వహించి యనిలుండు రక్షించి

నన్ను నీదు తండ్రి నగ విరోధి

బారి నుండి ప్రీతి వార్ధిని దాఁచె స

పక్షముల కుమార! భద్రముగను

13.    

 

 

 

తే.గీ.

రామ సాహ్యము నాదు కర్తవ్యము సుమి

ధర్మ పరులందు శ్రేష్ఠుఁడు ధైర్య విక్ర

మమ్ముల సహస్రనయన సమానుఁ డెంచ

మారుతాత్మజ! పరబల వీర దమన!

14.    

 

 

 

తే.గీ.

ఆలకించి మైనాకుని యద్రి రాజు

పల్కులు మహాత్ముని మధుర భాషితములు

కార్యము తెలిపి గిరికి నేఁగఁగ మనమ్ము

నుంచి పడసితి ననుమతి నంచితముగ

15.    

 

 

 

ఆ.వె.

మనుజ తనువు వీడి మైనాకుఁ డింపుగ

శైల రూప మూని శైల వరము

దూఱె లవణ జలధిఁ దూర్ణముగను హృష్ట

మానసుం డయి యసమానముగను

16.    

 

 

 

కం.

అధిక జవ మూని యంత స

మధి కోత్సాహమున శేష మార్గమ్ము భృశం

పు ధృతి వహించి పయన మ

త్యధికపు సమయమ్ము సే నాకాశమునన్

17.    

 

 

 

ఆ.వె.

కంటి దేవి నాగ గణమాత సురసను

జని చని వడివడిగ జలధి మధ్య

నంత భామ పలికె నరసి నన్నతి ఘోర

ముగను సంభ్రమించి ముదిత వేగ

18.    

 

 

 

కం.

చిరకాలమ్మున కే ని

న్నరసితి భక్ష్యముగ నాకు నక్కజముగ నా

సుర లిచ్చిరి భక్షించెద

హరివర! సత్వరము తనియ నానందముగన్

19.    

 

 

 

కం.

పలుకఁగ నివ్విధి సురస స

లలితపు టంజలుల మ్రొక్కి లలనకు నంతం

బలికితి మృదువుగ వాక్య

మ్ములు గాఁగ ముఖము వివర్ణము భృశము నాకున్

20.    

 

 

 

తే.గీ.

దాశరథి రాముఁడు ఘనుఁడు దండకా వ

నమ్ము సేరెఁ దోడరుదెంచ నెమ్మి లక్ష్మ

ణుఁ డనుజుండు సతీమణి యడరి సీత

రిపు జన నికాయ దమనుండు శ్రీయుతుండు

21.    

 

 

 

కం.

ఆతని బార్య నవనిజను

సీత నపహరించె నంతఁ జేరి యచట దు

ర్నీతిని రావణుఁ డరుగుదు

దూతగ రామాజ్ఞ నేను దొయ్యలి వెదకన్

22.    

 

 

 

తే.గీ.

తగుదు వుపకృతి సేయఁగ ధరణి పతికి

రామునకు రాజ్య వాస కారణమున నిట

సీతఁ గని రాము నరసి వచ్చెదను దిరిగి

నిజము నీ కశనముగ లేని యెడల నిఁక

23.    

 

 

 

తే.గీ.

అంత సురసాసతి విని తా ననియె నాదు

మాటలను గామరూపిణి తేట తెల్ల

ముగను దాఁట లేరెవ్వరు జగతి నన్నుఁ

బడసితిని యివ్విధమ్ముగ వరము నంచు

24.    

 

 

 

ఆ.వె.

అట్లు పలికెడు సమయమ్మున నిడివిని

నుంటిఁ జక్కగఁ బది యోజనములు

పలుకులు విని నంత నలరి పెంచితి వేగ

యోలము పదునైదు యోజనములు

25.    

 

 

 

ఉ.

పెంచె నిజాస్య మంతఁ దగు పెద్దఁగఁ దూఁగఁగ నాదు కాయమున్

మించిన నోరు గాంచఁగనె మేనును హ్రస్వము సేసితిన్ ధృతిం

బొంచియు నుంగుటంపు సరి బొందినిఁ దూర్ణము దూఱి నోరు నే

నంచిత మేఁగుఁ దెంచితిని యాస్యము నుండి యనంత వీథికిన్

26.    

 

 

 

తే.గీ.

అంత దేవి పలికె నూని యాత్మ రూప

ము సురసా సతి వానర పుంగవ! వెడ

లు మిఁకఁ దీరఁ గోరిక చేర్పుమ మిథిలా సు

తను రఘు వరునితో ముదిత నయితి నిఁక

27.    

 

 

 

తే.గీ.

సుఖముగాఁ బయనింపుమ శూర వర్య!

యంచు దీవింప సర్వభూ తాలి పొగడ

సాధు వంచును నను నాకసమ్ము సేరి

వైనతేయుని రీతి నేఁ బయన మైతి

28.    

 

 

 

ఆ.వె.

అంత నాదు ఛాయ ననిపించె నెవ్వరొ

పట్టి నట్టు కానఁ బడరు చూడ

నెవరును దశ దిశల లవ మయ్యె వేగము

గతి విరోధు లెవరొ కాన కుంటి

29.    

 

 

 

తే.గీ.

కలిగె సంశయము మతిని గగన మందు

విఘ్న మెట్లు కలిగె నంచు విస్మయముగ

రూప మించుకయు నిచట తోఁపకుండ

లఁపఁ బడె దృష్టి యిఁక నధస్తలము నందు

30.    

 

 

 

కం.

చూచితి నే రక్కసిని మ

హాచల సన్నిభ సలిల శయన భామఁ జల

ల్లోచన ఘన కాయ భయద

లోచన నక్కజము గొల్ప రుద్రాకారన్

31.    

 

 

 

ఆ.వె.

నవ్వి పెద్ద యెలుగునఁ బలికె నా తోడ

నంత నసుర వనిత యదరు బెదరు

లేక వాక్యము లవి భీకరములు జుగు

ప్సాకరము లతి పరుషమ్ము లెల్ల

32.    

 

 

 

తే.గీ.

ఎచ్చట కరుగు చుంటివి నిచ్చలుగను

పివర! సుమహా కాయ నాఁకలి చెలంగెఁ   

బ్రియపు భక్ష్యముగ నయి తృప్తి పఱుపుమ న

ను గుడుపు చిర కాలం బయ్యెను తిని నేను

33.    

 

 

 

కం.

ఒడబఁడి యా మాటలకుం

గడు శుభమని పల్కి నేను గాయము నంతన్

వడిఁ బెంచితి నక్కజముగఁ

బడఁతి ముఖమున కధికముగ భవ్య తరముగన్

34.    

 

 

 

తే.గీ.

అంతఁ బెంచెఁ దనదు నోటి నింతి తినఁగఁ

గోరి భీమమముగ నన్ను గూఢ మెఱుఁగ

నేర దక్కట యల్పము నేర్పు మీర

నా యొనర్చు వికృతమును మాయను మది

35.    

 

 

 

కం.

వడి నా సుమహా రూపము

కడు చిన్నదిగ నొనరించి క్షణ మాత్రమునం

బడఁతుక యెడఁదను బెకలిచి

విడివడి నోటిని నెగిరితి విన్నున కంతన్

36.    

 

 

 

ఆ.వె.

విదళిత హృదయ యయి భీమదేహ ఘన సం

కాస సతి భుజములు వే సడలఁగ

నంత లవణ జలధి యందుఁ బతన మయ్యె

ధరణిఁ గూలు ఖండిత తరు భంగి

37.    

 

 

 

ఆ.వె.

సిద్ధ చార ణాది చిర నభో వాసులు

సింహిక హత మయ్యె క్షిప్ర మసుర

భీమ కాంత హనుమ వీర వరుని చేత

నని పలుకఁగ వింటి నభ్ర మందు

38.    

 

 

 

తే.గీ.

చంపి యసురినిఁ గర్మము స్మరణమునకు

రాఁగఁ జని బహు దూరము వేగముగ న

గ వర మబ్ధి దక్షిణమునఁ గంటిఁ బురము

లంక యున్నట్టి తీరము లలితముగను

39.    

 

 

 

కం.

చన నస్తమునకు దినపతి

దనుజ గణ నగరము భీమ దనుజల కెల్లం

గన రాని విధమ్ముగ నే

ననువుగఁ జొచ్చితిని లంక నరయఁగ సీతన్

40.    

 

 

 

కం.

చేరఁగ నంత నచట కొక

నారీమణి యట్టహాస నాదమ్ము మహా

నీరద నిభమ్ము కల్పాం

తేరిత మనఁ జేయుచు నట నీక్షింపఁ బడెన్

41.    

 

 

 

తే.గీ.

అగ్ని వలె మండు నంగ రుహముల దనరు

నామె భైరవ సతి నను హతముజేయ

నాశ పడెడు నామెను వామ హస్త ముష్టి

ఘాతమున గెల్చి చన సంధ్య భీతిఁ బలికె

42.    

 

 

 

కం.

లంకా పుర మే నోడితి

నంకమ్మున వీర! నీ మహా శౌర్యమునన్

శంక యొకింతయు లేదిఁకఁ

గింకరుల దనుజుల నెల్ల గెలుతువు శూరా

43.    

 

 

 

తే.గీ.

అంత రావణాంతఃపుర మంత వెదకి

రాత్రి యంతయును జనక పుత్రికా మ

ణి కొఱకు నిశితముగ నవనిజను గాంచ

నైతి నెంత శోధించిన నాతి నెందు

44.    

 

 

 

కం.

అరయంగ లేక సీత న

సురాధిపు గృహమ్ము నందు శోక మహాసా

గర మగ్న చిత్తమున నేఁ

బర పారము గాంచ నైతిఁ రితాపమునన్

45.    

 

 

 

కం.

విలపించుచుఁ జరియింపఁగ

నలఁ గానఁ బడియె నుపవన మావృతమై యు

జ్జ్వల కలధౌత వరణమున

లలితమ్ముగ నంత నాకు లంకా నగరిన్

46.    

 

 

 

తే.గీ.

దాఁటి ప్రాకారమును గంటిఁ దరు బహుళపు

వన మశోక మందున శింశుపా ద్రుమమ్ము

నభ్ర రుచి కదళీ వన మరసితి నధి

రోహణము సేసి వేగ భూరుహము నంత

47.    

 

 

 

ఉ.

చేరువ శింశుపా శిఖికి సీతను జూచితి రమ్య వర్ణిన్

నీరజ పత్ర లోచనను నిత్య సుతప్త కృశాంగి దీననుం

దోరపు భర్తృ భక్తిఁ బద తోయజముల్ స్మరియించు శ్యామనున్

భీరువు నేక వాసనను భీకర లిప్త రజశ్శిరోరుహన్

48.    

 

 

 

తే.గీ.

అరసితి నుపవాస భృశ కృశాస్య సతిని

ఘోర రూప విరూప సుక్రూర దనుజ

మాంస శోణి తాశన రత మానినీ వృ

తాబలను బంచనఖ గత హరిణి వోలె

49.    

 

 

 

తే.గీ.

ఒంటి జడ నుండి బెదరింప నుగ్రముగ న

సుర సతులు మఱిమఱి తలఁచుచును బతి

నిశము శయనింపఁ బుడమిని శిశిరమునఁ గ

మలిని వలె వివర్ణపు మెయిఁ గలికిఁ గంటి

50.    

 

 

 

కం.

మరణింప నెంచిన సతి న

సురాధినాథు దశకంఠు చోరుని వలనం

బరితాపము తీరు కతన

నరసితి మృగశాబ నేత్ర నాత్రము తోడన్

51.    

 

 

 

ఆ.వె.

చూచి యామె నట్లు సుదతి రామ సతిని

శింశుపా తరువునఁ జేరి యుంటిఁ

గాంచుచు నవనిజను గాంతామణి యశస్వి

ని మదిఁ జెలఁగఁ గలవరము కరమ్ము

52.    

 

 

 

తే.గీ.

అంత చిరుగంట లందెల వింత హలహ

లాస్వనములు కలసి రేఁగ రావ ణాల

యమ్ము నందు గంభీరములై చెలంగి

వినఁగ వచ్చె నధికముగ వీనులకును

53.    

 

 

 

కం.

కలవరము సెంది యంతటఁ

గలకలనిస్వనమును విని కాయము తగ్గిం

చి లలితముగ నిల్చితి యా

పలాశి పైన గగనంపుఁ బతగము వోలెన్

54.    

 

 

 

ఆ.వె.

అంత రావణుఁడు మహా బలుండు దశాస్య

దారలు నరుదెంచి రా రమణి ధ

రణిజ సీత యున్న రమణీయ దేశ మ

శోక వనమునకుఁ బ్రచోదిత హృది

55.    

 

 

 

కం.

వానిని రావణు దైత్య వి

తానేశ్వరుఁ గాంచి సీత తరుణీ మణి తా

మేనును దొడలుఁ గుదించుచుఁ

బీనోరము నిజ కరముల భీతిం గప్పెన్

56.    

 

 

 

చం.

భయమున వేఁగి కంపము నపారము వొందుచుఁ జూచి దిక్కులన్

నయముగఁ బ్రోచు వారి నయ నమ్ములఁ గాంచఁ దరమ్ము గాక కం

ది యబల దుఃఖ తప్తయయి దించిన మోమున నుండ నామె తోఁ

బ్రియముగ గారవింపు మని వేఁడె దశాస్యుఁడు జానకీ సతిన్

57.    

 

 

 

తే.గీ.

తిరిగి పలికె దశముఖుండు దేవి తోడ

దర్పమున గౌరవింపఁగఁ దలఁప వేని

నన్ను రెండు నెలలకు ననంతరమ్ము 

త్రాగెద జనకాత్మజ నీదు రక్త మింక

58.    

 

 

 

కం.

విని యా రావణు దుష్టుని

మినుకులు జనకాత్మజయు నమిత కోపమునం

గనలుచు మది మిక్కిలి పలి

కెను వచనము లుత్తమములు కీనాశునితోన్

59.    

 

 

 

తే.గీ.

రాముని యమిత తేజు భార్యామణిని

శరథు నిక్ష్వాకు నాథు స్నుష నసు రాధ

మ! పలుక నవాచ్యములు నీదు కపటతరపు

నాలుక తెగి క్షిప్రము గూల దేల నేల

60.    

 

 

 

తే.గీ.

ఏమది యనార్య! నీ శౌర్య మెంచఁ బాపి

భర్త లేని తరుణమునఁ బడఁతిఁ దెచ్చి

తీవు లజ్జను వీడి మహీశు కంటఁ

బడక మహితాత్ము రాముని భార్య నన్ను

61.    

 

 

 

కం.

యజమానుఁడు సత్య వచనుఁ

డజేయుఁ డాజి రఘునాథుఁ డతనికిని నియో

గజనులకు సమానుఁడవె ద

నుజాధమ! తలంప నీవు నుత చరితునకున్

62.    

 

 

 

ఆ.వె.

పరుషము లయి నట్టి వైదేహి పల్కులు

విని దశాననుండు భీమ కోప

వహ్ని మండె నంత భైరవముగఁ జితి

యందు నిల్చి మండు గ్ని వోలె

63.    

 

 

 

తే.గీ.

క్రూరపుఁ గనులఁ ద్రిప్పుచుఁ గుడి పిడికిలి

యెత్తి చంపఁ బూనఁగ దానవేంద్రుఁ డంత

జానకిని ముదితల యలజడులు రేఁగె

నచట హాహా నినాదము లలము కొనియె

64.    

 

 

 

ఆ.వె.

స్త్రీల మధ్య నుండి శీఘ్రమ వెడలి మం

దోదరి దశ శిరుని యుత్తమ సతి

దుశ్చరిత్రు నంతఁ దూర్ణము వారించె

భయము విస్మయమ్ము పరఁగ మదిని

65.    

 

 

 

కం.

నుడువం బడె మధురముగాఁ

బడఁతుక చేతను మహేంద్ర బల సన్నిభుఁడే

పడయంగ నేల సీతను

గడు దుఃఖిత బాల నుచిత కార్యము గలదే

66.    

 

 

 

కం.

కల రిట కన్యలు గంధ

ర్వుల యక్షుల సురల వర తరుణులు రమింపం

గ లలనలు పెక్కురు ప్రభూ!

తలంపఁ బని యేమి భూసుత వలన నింకన్

67.    

 

 

 

ఆ.వె.

అంతఁ గలసి నారు లందఱు క్షిప్రము

శాంత పఱచి ఘన నిశాచ రేశుఁ

గొని చనిరి స్వవేశ్మమునకు మహా బలు

రావణునిఁ ద్రిలోక రావణ రతు

68.    

 

 

 

కం.

తిరిగి చన దశగ్రీవుఁ డ

సుర వనితా మణులు సీత సురసుత నిభనున్

గురుతర ఘోర వచనములఁ

బరిపరి విధముల భృశమ్ము బాధించి రిఁకన్

69.    

 

 

 

తే.గీ.

వారి గర్జన లవనిజఁ జేరి యయ్యె

నట నిరర్థకములు కడు నక్కజముగఁ

దలఁప జానకీ సతి తృణముల విధమ్ము

గణన సేయక సుంతయు గర్జితముల

70.    

 

 

 

చం.

ధరణిజ నిశ్చయంపు మతి దానవ నాథునిఁ జెంతఁ జేరి చె

ప్పిరి చని కొంద ఱత్తఱి సుభీషణ వాక్కులు రిత్త వోవఁగన్

విరహిత యత్న మానసులు వీడఁగ నాశలు రాక్షసాంగనల్

పరిగొని యంత భూ తనయఁ బన్నుగ వే వశ లైరి నిద్రకున్

71.    

 

 

 

కం.

నిదురింపఁగ వా రెల్లరు

విదేహ రాజాత్మ జాత్మ విభు హిత రత రా

మ దయిత భృశ దీనమ్ముగ

సుదుఃఖ తప్త విలపించె శోకోపహతిన్

72.    

 

 

 

తే.గీ.

లేచి వారి నడుమ నుండి శోచనీయ

మైన పల్కులు విని పల్కె నంత త్రిజట

మిమ్ముల తినుఁడు మీరలు వమ్ము కాదు

సాధ్వి దశరథ స్నుష సుత జనకునకును

73.    

 

 

 

కం.

నే నరసితి నేఁ డొక కల

మేను గగురు పొడువ జయ మమేయము విమలా

యోనిజ పతికి వినాశము

దానవులకుఁ గలిగె నందు దారుణ రీతిన్

74.    

 

 

 

మ.

గనినన్ స్వప్నము నిట్లు తానరయు సౌఖ్యంబుల్ విషాదాంతమున్

జనకాత్మోద్భవ వేఁడు కొంద మది రక్షా మంత్రమై కాచు రా

ముని బారిం బడ కుండ నెల్లరను సంపూర్ణమ్ముగం దోఁచె నా

మనమం దిట్లు ప్రసన్న మౌను గొలువన్ మన్నించుఁ దథ్యమ్ముగన్

75.    

 

 

 

కం.

విని యా పల్కుల బిడియ

మ్ము దనరఁ బతి విజయవంతముల నలరుచుఁ బ

ల్కెను గల నిజం బయిన  నగు

దును శరణను మీ కిఁక వలదు భయము మదులన్  

76.    

 

 

 

ఆ.వె.

శాంతి చిత్త మందు సడలె వైదేహి న

త్తఱిని దారుణంపు దశను జూడ

విక్రమించి వచ్చి వేగముగ నిటకుఁ

దలఁపఁ జాగితి హృదిఁ ద్వరితముగను

77.    

 

 

 

కం.

పలుకంగ నెంచి భాషణ

ములు జానకి తోడఁ జిత్తమునఁ దగు రీతిం

దలఁచితి నింపుగ నిక్ష్వా

కుల గుణ కీర్తనమె నాకు గుణ మగు ననుచున్

78.    

 

 

 

ఆ.వె.

నాదు భాషణములు వేదజ్ఞ రాజర్షి

పూజితమ్ములు విని పూర్ణ భాష్ప

నయన సీత యంత నన్ను గాంచి యడిగె

దేవి మృదుతరముగఁ దెలియఁ గోరి

79.    

 

 

 

కం.

ఎవ్వర వీవు వనేచర!

యెవ్విధి నేల చనుదెంచి తిప్పురి రాముం

డెవ్వధి మిత్రుం డయ్యెను

నొవ్వీయక చెప్పు మయ్య! నోరార వడిన్

80.    

 

 

 

తే.గీ.

ఆ వచనములు విని నంత దేవి! నీదు

భర్త రామునకు సఖుండు వానరేంద్రుఁ

డతి బలుండు సుగ్రీవుఁడు పతి సకల హ

రి గణముల కని నేఁ బలుకఁగఁ దొడఁగితి

81.    

 

 

 

కం.

నన్నెఱుఁగు మా కపీంద్రుని

తిన్నని భృత్యు వని వచ్చితి నిటకు నే నా

సన్నుత రాఘవుఁ డనుపఁగఁ

గ్రన్నన హనుమంతుడ నిను గాంచంగ సతీ!

82.    

 

 

 

ఆ.వె.

అంగుళీయకమ్ము నా దాశరథి యీయఁ

దెచ్చితిఁ గొను మమ్మ దివ్య చరిత!

యానవాలుగ నిది యానంద దాయక

ము పురుషర్షభుండు ముదిత నీకు

83.    

 

 

 

తే.గీ.

ఆజ్ఞ నొసగుమా కార్యము నతివ సేయ

నిపుడు శిరసా వహించెదఁ జెపుమ ప్రీతి

రామలక్ష్మణుల సరస రయమున నిను

గొని చనియెద సమ్మతమగునె నుడువు మది

84.    

 

 

 

ఆ.వె.

జనక తనయ సీత మినుకులు మన్ముఖ

చ్యుతములను విని యనె సుంత తలఁచి

రాఘవుండు చంపి రావణు రణమునఁ

బ్రీతిఁ జేకొన నను నీతి యగును

85.    

 

 

 

ఆ.వె.

నే నడిగితి నంత నిందా విహీనను

సీతను రఘురామ చిత్త రంజి

తంపు గుర్తు నొకటి నింపుగ నిమ్మని

శిరము వంచి మొగిచి కర యుగమ్ము

86.    

 

 

 

తే.గీ.

పలికెఁ జూపుచు నొక మణి వరము నంత

సీత యుత్తమం బియ్యది చేరి యిమ్ము

రాముఁడు మహాభుజుం డనురాగ మలర

విశ్వసించి మన్నించుఁ గపివర! నిన్ను

87.    

 

 

 

కం.

వచియించి యివ్విధిని సీ

త చలిత చిత్త మణి నొసఁగి తరళ నయన తా

నుచితపుఁ బల్కులఁ జేసెను

రుచిరపు విజ్ఞాపనము గురు తరమ్ము తమిన్

88.    

 

 

 

ఆ.వె.

ప్రణతు లొసఁగి యంత భక్తిఁ బ్రదక్షిణ

ము లొనరించితి మనమున నిలువఁగ

రామలక్ష్మణులు నరపతి నందను లిరు

వు రరుదెంచు బుద్ధి ధరణిజ యనె

89.    

 

 

 

తే.గీ.

విని నంతనె వా రచిర

మ్మున సుగ్రీవ సహితమ్ము మూరిన ప్రేమన్

ఘను లా రాఘవు లేతెం

చు నట్లు సేయుము కపివర! శూరుల నిటకున్

90.    

 

 

 

తే.గీ.

రెండు నెలలు మాత్రమె ప్రాణ ముండు నాదు

బొంది రాకున్న రాముఁడు పూర్వమ కను

నతఁడు పతిహీన మృత సీత నవనిజ నని

తెల్పుమ హరికుంజర! చని తెల్లముగను

91.    

 

 

 

ఆ.వె.

క్రోధ ముద్భ విల్లె బాధఁ గూడి నళిన

నయన కరుణ భాషణమ్ములు విన

శేష కార్య మంత చింత చేసితి నాదు

చిత్త మందుఁ దనర నుత్తమముగ

92.    

 

 

 

కం.

కాయము పెంచి నగ నిభ

మ్మాయోధన కాంక్ష సెలఁగ నాత్మ నధికమై

యా యుద్యాన వనము ధృతిఁ

జేయ దొడంగితి లయమ్ము సేరి ముదమునన్

93.    

 

 

 

ఆ.వె.

దనుజ భామ లంత త్రస్త మృగ విహగ

చరిత భగ్న కుటప సంచయమ్ము

గాంచిరి వికృ తాస్య కాంతలు సంభ్రమా

శ్చర్యములు సెలఁగ భృశమ్ము మదుల

94.    

 

 

 

కం.

అరసి వనమందు నన్నును

దరుణులు గుమి గూడి చేరి తత్క్షణమ వడిం

గరము భయ మంది రావణు

దరి కరిగి తెలిపిరి వారు దయనీయముగన్

95.    

 

 

 

కం.

రాజ వరేణ్యా! భవదీ

యౌజస్సెఱుఁగక మహా బలాన్విత! నిత్య

భ్రాజిత దుర్గమ వనము ప

రాజేయము సేసె భగ్న మా హరి ఖలుఁడై

96.    

 

 

 

ఆ.వె.

ఆనతీయు మతని నప్రియ కర్ముని

దుష్ట వానరు నట దూర్ణము హత

మార్ప దైత్య రాజ! మాన్ప వినాశన

మింక లంక యంద క్రుంకు నట్లు

97.    

 

 

 

కం.

విని వారి పల్కు లెల్లయు

దనుజేంద్రుఁడు దుర్జయులను దనుజుల ననిపెన్

ఘనులను కింకర నాముల

మనోనుగముల దశముఖుఁడు మాత్సర్యమునన్

98.    

 

 

 

ఆ.వె.

వీరి నే నెనుబది వేల రక్కసులను

శూల ముద్గర కర శోభితులను

బరిఘ మొకటి నూని పరిమార్చితి వనము

నందు సత్వరమ్ము నంతఁ గనలి

99.    

 

 

 

కం.

హతశేషులు కొందఱు చని

యతి వేగమ్ముగను సైన్య హత విషయము చే

రి తెలిపిరి భీత చిత్తులు

నుతులిడి దశకంఠునకు దనుజ నాథునకున్

100. 

 

 

 

తే.గీ.

విమల మందిర మాక్రమింప మతి యయ్యె

నంత నాకుఁ జని యచటి యసుర శతము

ను హతమార్చితి స్తంభమును గొని యొకటి

భగ్న పఱచితి సురుచిర భవన మెల్ల

101. 

 

 

 

ఆ.వె.

అంత జంబుమాలి నసురు ప్రహస్తాత్మ

జుని ననేకుల దనుజు లతి ఘోర

రూపుల భయదులను రోషము చెలఁగంగఁ

దోడు నిచ్చి పంపె దురమునకును

102. 

 

 

 

కం.

అతనిని బల సంపన్నుని

స్తుత రణ కోవిదు దనుజుని తోటి యసురులన్

శిత పరిఘమ్మును గొని పం

పితి వడి యమ సదనమునకు వీరుల నంతన్

103. 

 

 

 

కం.

అది విని యసురేంద్రుఁడు ఘన

పదాతి బల సంయుతమ్ము బల దర్పుల మం

త్రి దయిత తనయ ప్రవరుల

నతి ఘోర ప్రధన రతుల నంపె నసూయన్

104. 

 

 

 

తే.గీ.

వారి నందఱ నంపితి పరిఘమున య

మ నిలయము రావణుండు సమర పరాక్ర

ముల నిధనము విని యమాత్య పుత్ర వరులు

పంచ సేనానుల ననిపెఁ బట్ట నన్ను

105. 

 

 

 

ఆ.వె.

వారి నెల్లరను సపరివారము వధింప

నెఱిఁగి రావణుండు మఱియుఁ నలి

యనిపెఁ దనదు తనయు నక్ష కుమారు మ

హద్బలు బల యుతము నక్కజముగ

106. 

 

 

 

చం.

అల నెగురన్ నభమ్మునకు నక్ష కుమారుఁడు మందకృత్స్న పు

త్రు లలిత పాద యుగ్మమును దూర్ణము పట్టి కృపాణమున్ మహా

ఫలకము భాసిలంగ నిజ పాణులఁ ద్రిప్పి యనేక వారముల్

విలయము చేసితిన్ దయను వీడి మనమ్మున యుద్ధ పండితున్

107. 

 

 

 

తే.గీ.

ఆజి కరిగిన యక్షు లయమ్ము నాల

కించి క్రుద్ధుఁడై యా దశగ్రీవుఁ డనిపె

నింద్ర జిన్నాముని నిశాచ రేంద్రుఁడు నిజ

పుత్రుని ద్వితీయు బలు యుద్ధ మోహితు నిఁక

108. 

 

 

 

తే.గీ.

ఆ మహా బల మంతయు నసుర పుంగ

వు బల దర్పము లెల్ల సంపూర్ణము విల

యమ్ము సేసి భండనమున నమిత హర్ష

భరిత చిత్తుఁడ నైతిని భద్ర గతిని

109. 

 

 

 

ఆ.వె.

గట్టి నమ్మకమునఁ బట్టిని వడి నంపె

నింద్రజిత్తును దనుజేంద్రుఁడు సుమ

హాబలుని భటులు మదాన్వితులను దోడు

గ నొసఁగి దశముఖుఁడు కదనమునకు

110. 

 

 

 

ఆ.వె.

నిజ బలక్షయమ్ము నజయుండని యెఱిఁగి

నన్ను భండనమునఁ గ్రన్నన మఱి

బంధితునిగఁ జేసె బ్రహ్మాస్త్రమున నంత

రావణాత్మజుండు చేవ మీ

111. 

 

 

 

తే.గీ.

అంత నిలువక యచ్చటి యసురు లంతఁ

ద్రాళ్ల బంధించిరి కఠిన తరము కనలి

నన్ను తరలించిరి దనుజ నాథు సన్ని

ధానమునకు రయమ్ముగ దర్పమునను

112. 

 

 

 

ఆ.వె.

కాంచి యపుడు నన్ను గారణమ్ము నగర

గమన మసుర గణ విఘాతమునకు

దైత్య గణ విభుండు దశకంఠుఁడు దురాత్ముఁ

డలఘు రోష మూని యడిగి నంత

113. 

 

 

 

తే.గీ.

ఇది జనక సుతార్థమ్మని విదిత పఱచి

నిన్ను నరయంగ వచ్చితి నే నిట కని

పల్కి హనుమంతుఁ డందురు వాయు సుతుఁడ

వానరునిగ నెఱుంగుము దాన వేంద్ర!

114. 

 

 

 

ఆ.వె.

రామదూత నేను రవిసూను సుగ్రీవు

మంత్రి వానరుండ మానవేంద్రుఁ

డు రఘు రాముఁ డంపఁగ రయమున నరుదెం

చితి దశముఖ! నీదు చెంత కిటకు

115. 

 

 

 

కం.

అల సుగ్రీవుం డడిగి కు

శలమ్ము ధర్మార్థ కామ సహిత హితంపుం

బలుకులు కొన్ని నుడివె నీ

కు లలితముగఁ దెల్పుమంచుఁ గూరిమి నాతో

116. 

 

 

 

కం.

నివసింప ఋశ్యమూక గి

రి వర శిఖర మందు నంబరీష ప్రావీ

ణ్య విలసితుఁడు రాముఁడు మి

త్ర వరుం డయ్యె ద్రుమ వన విలసిత నగమునన్

117. 

 

 

 

తే.గీ.

రాజవర రాముఁడు నిజ భార్యా హృతమ్ము

రక్కసుని చేత జరుగంగ నక్కథ నెఱి

గించి కోరె సాహాయ్యము నంచితముగ

సేయ నన్ని రీతుల నన్ను జింత తోడ

118. 

 

 

 

ఆ.వె.

వాలి వధ గుఱించి పన్నుగఁ బ్రకటించి

రవికుల తిలకునకు సవినయముగ

సమయ మొకటి సేయ సాయమునకు నుచి

తంబు మనకు నంటి దానవేంద్ర!

119. 

 

 

 

కం.

అనిలంపు సన్నిధిని రా

మునకు సలక్ష్మణునకు ఘనపుఁ జెలిమి యొనగూ

రెను సుగ్రీవుని పదహీ

నునితో నాహ్లాదముగ దనుజ గణ నాథా!

120. 

 

 

 

తే.గీ.

చంపి యొక్క బాణమ్మున సమర మందు

వాలిఁ జేసె సుగ్రీవుని వానర నిచ

యమ్మునకు మహారాజుగ నఖిల కపి ని

కాయ విభుని రాముఁడు భద్ర గతిని వినుమ

121. 

 

 

 

తే.గీ.

కాన ధర్మము సాహ్యము నా నృపాత్మ

జునకుఁ జేయ మాకింకఁ దగిన విధమ్ము

గ నని తలఁచి మనమ్మున ననిపి యుంటి

నీదు సన్నిధానమునకు నిశ్చయించి

122. 

 

 

 

ఆ.వె.

వీరులు మృగరాజ విక్రములు హరులు

నీదు బలము నెల్ల నిహత మిచటఁ

జేయుటకును మున్న శీఘ్రమ సీతను

రాఘవున కొసఁగుమ రాక్షసేంద్ర!

123. 

 

 

 

ఆ.వె.

ఎవ్వ రెఱుఁగరు భువి నీ వానరుల శక్తి

నమర నిభు లనంగ ననృత మౌనె

దేవతల పిలుపున ధీరులు కపివరు

లరుగుదురు దివికి నలరఁగ నెదలు

124. 

 

 

 

కం.

ఇవి వానరేంద్రు సుగ్రీ

వు వచనము లని వచియింపఁ బురుషాద విభుం

డు వివృత రక్త నయనుఁడై

యవలోకించెను దహించు నట్లుగ నన్నున్

125. 

 

 

 

తే.గీ.

ఘోర కర్ముఁ డాదేశించె దారుణముగ

నాదు వధను దురాత్ముఁడు నా ప్రభావ

మెఱుఁగక మదిని సుంతయు నేని యంత

రావణుండు సకల జగద్రావణుండు

126. 

 

 

 

ఉ.

సోదరుఁడౌ విభీషణుఁ డనుత్తమ నైరృతి బుద్ధిమంతుఁడున్

సాదర భాషణమ్ముల నిజాగ్రజు వేడెను నన్ను గావగం

గాదిది ధర్మ సమ్మతపుఁ గార్యము తల్చితి వీవు వీడు మా

సోదర! నిశ్చయమ్ము మది నుంచుమ నీతిని రాక్షసోత్తమా!  

127. 

 

 

 

ఆ.వె.

దూతఁ జంప రాజ నీతి కా దగ్రజ!

హితము పల్కు వాఁడు సతము నతని

నుండి నిజము నెఱుఁగు చుండంగ నొప్పగు

రాజ పుంగవులకు రాక్ష సేంద్ర!  

128. 

 

 

 

కం.

ఇహమున  దోషి యయిన దూ

త హననముం గనము శాస్త్ర తతు లందున వి

గ్రహ రూప భంగ మంకము

సహించి చేయఁ దగును దనుజ గణాధ్యక్షా!  

129. 

 

 

 

తే.గీ.

అంత నా విభీషణు మాట లా దశాన

నుండు రావణుండు విని యుగ్రుండు నాజ్ఞ 

నొసఁగె నచటి రక్కసులకు వెసఁ గపి ఘన

వాలము దహించుఁ డంచుఁ గోపమ్ము మీఱ

130. 

 

 

 

ఆ.వె.

అంత నాలకించి యసురులు రావణు

పలుకు లెల్ల జీర్ణ వస్త్రములను

జనప నారయు నలఁ జక్కగఁ జుట్టిరి

నాదు తోఁక చుట్టు చోదితు లయి

131. 

 

 

 

తే.గీ.

పాశ బద్ధుని రాక్షస వశుని చండ

విక్రములు కార్య సిద్ధులు వీరు లసురు

లంత ముష్టి కాష్టమ్ముల నప్పళించు

చు వడిఁ గాల్చిరి తోఁకను జూచు చుండ

132. 

 

 

 

చం.

అసురులు శూరు లంత నను సాగ్నిని బంధితు రాజ మార్గమం

దు సకల రాజ్య పౌరులకుఁ దూర్ణము తెల్పుచుఁ జేర్ప ద్వారమున్

వెస కుదియించి దేహమును విస్తర రూపము వీడి బంధముం

బస మెయి పెంచి నే పరిఘఁ బన్నుగఁ గైకొని చంపి దైత్యులన్

133. 

 

 

 

మ.

నగరద్వారము పైకి గెంతి పస సన్నాదంబునన్ శీఘ్రమే

ఖగరా జాభము దీప్త వాలమునఁ బ్రాకారాట్ట సౌధమ్ములన్

నగ సందోహ పురమ్ము నెల్లయు యుగాంతజ్వాల సంకాశుఁడన్

విగతప్రాణిగఁ గాల్చితిం బగను నిర్భీతిన్ మహోత్సాహినై

134. 

 

 

 

ఉ.

అక్కట జానకీ సతియు నగ్నికి నాహుతి యయ్యె నేమొ నే

వెక్కసపుం దమిస్రమున వేల్చితి లంక నదగ్ధ మింత యే

నెక్కడ లేదు భస్మమయి యెల్లెడఁ గన్పడు దూత కార్యమే

ముక్కెను రామ వాంఛితము మూఁడెను నా యవివేక మింతయున్

135. 

 

 

 

చం.

తలఁచుచు నిట్లు శోక తిమిధామము నందు మునింగి యుండగన్

లలితపు భాషణమ్ములు విలాసపుఁ జారణ భాషితమ్ములం

గలయన వింటి జానకి సుఖమ్ముగ నున్నది కాలకుండ భూ

తలమున నన్న పల్కులు సుధా సదృశమ్ముల నక్కజమ్ముగన్

136. 

 

 

 

తే.గీ.

అద్భుతపు టా వచనముల నాలకింప

శుభ నిమిత్తములు కలుగఁ జూచి నంత

జానకి యదగ్ధమని తోఁచె సమ్మదముగఁ

జిత్త మందు నా కంతట నుత్తమముగ

137. 

 

 

 

ఆ.వె.

వాల మది భృశమ్ము కాలుచున్నను వహ్ని

కాల్ప లేదు నన్ను గారవమున

వీచె మోద మలర వింతగ వాయువు

సంతసమ్ము హృదయ మంత నిండె

138. 

 

 

 

కం.

కనిపించిన శకునమ్ముల

ఘనగుణ కారణముల మునిగణ వచనములన్

విన సిద్ధుల భాషణములు

మనమున హర్ష ముదయించె మాధుర్యముగన్

139. 

 

 

 

ఆ.వె.

తిరిగి గాంచి యట విదేహ రాజ సుతను

బడసి యనుమతిఁ జనఁ బర్వతమ్మ

రిష్టము ధృతిఁ జేరి యిష్టపడి మిము న

రయఁగ శీఘ్రమ యెగురఁ దొడఁగితిని

140. 

 

 

 

కం.

అంత శశి పవనుఁ డర్చి

ష్మంతుఁడు గంధర్వ వరులు చారణ సిద్ధుల్

సంతతము చరించు గతిని

సంతసమున వచ్చితి మిము సందర్శింపన్

141. 

 

 

 

తే.గీ.

రాఘవేంద్రు మహాత్మ్యము ప్రజ్వరిల్ల

భవ దసదృశ తేజం బది పరఁగ సతము

రాజు సుగ్రీవు ఘన కార్య రతి చెలంగఁ

జక్కఁబెట్టితి కార్యము సర్వ మేను

142. 

 

 

 

కం.

తెలిపితి నేఁ జేసిన దె

ల్ల లంక యందు జరిగి నటుల వివరముగ నా

వలఁ గార్య శేష మున్న యె

డల నకృతము సేయఁ దగు నడరి వడి నిచటన్

143. 

 

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నేఁబది యెనిమిదవ సర్గము. 

 

 

సుందర కాండము

సర్గము 59.

 

కం.

వచియించి సర్వము హనుమ

సచివుఁడు వాయు తనయుండు సముచిత రీతిన్

వచనము లింకను నుత్తర

విచార యుక్తములు దొడఁగె వివరింపంగన్

1.       

 

 

 

చం.

ఫలితము నిచ్చె రాఘవుని పార్థివు యత్నము సర్వ మింపుగం

జెలువపు సౌరి సంభ్రమము చెన్ను వహించెను సత్వరమ్ముగం

జెలువ ధరాత్మజాద్భుతపు శీల మహా మహి మార్థ మెంచగన్

లలితపు భక్తి చిత్తమున లాలిత మయ్యెను నాకు నిత్తఱిన్

2.       

 

 

 

తే.గీ.

నిజ తపోబల శక్తి దనుజ విభుండు

రావణుండు ముల్లోకములను దహించు

నధిక సత్త్వవంతుండు దశాననుండు

శత్రు బలగమ్ము నెల్ల నాశన మొనర్చు

3.       

 

 

 

కం.

పతి యందుత్తమ భక్తి ని

యత గుణ సంపన్న సీత యఘ చారిత్రుం

గృత కల్మషు రావణునిన్

హత మొనరింపఁగఁ దలంప దాత్మప్రభలన్

4.       

 

 

 

తే.గీ.

సీత గాత్రము దాఁకిన శిధిలమై చ

నఁడు తపోబలమున దశాననుఁడు వహ్ని

శిఖలు తాకినఁ దూగవు కాల్ప సీత కోప

మూని చిత్త మందు భృశము పూని కాల్ప

5.       

 

 

 

తే.గీ.

నే నుడివితి మీ కెల్లను మానకుండ

న్యాయ్య మని యెంతు మది జనకాత్మజ సహి

తమ్ము గాంచ రాజ సుతుల నెమ్మి మనకు

జాంబవన్ముఖ హరుల యాజ్ఞ నిట నంది

6.       

 

 

 

తే.గీ.

లంకను స రాక్షస గణము శంక లేదు

నే నొకండఁ జంపఁ గలను దానవేంద్రుఁ  

డా దశగ్రీవు తోడ మహా బలాతి

శయుఁడు నైనఁ దూర్ణమ్ముగ సమర మందు

7.       

 

 

 

ఆ.వె.

వీరులు బలవంతు లీరుం గలియ నేలఁ

జెప్ప నింక నస్త్ర సిద్ధులు దృఢ

చిత్తులు ప్లవగులు విశేషించి శూర వ

రులు విజయ రతులు ఘనులు దురమున

8.       

 

 

 

కం.

అని నా వంతుగ దశకం

ఠుని స సహోదర సుత స కఠోర మహావా

హిని మఱియు బురోగాములఁ

గనలి వధింపఁ గలవాఁడ ఘన వీర్యమునన్

9.       

 

 

 

ఆ.వె.

బ్రహ్మ వారు ణేంద్ర వాయవ్య భీకర

రౌద్ర నామ వివిధ రౌద్ర దుస్స

హాస్త్రముల నణఁచెద నా శక్ర జిత్తు వే

య నసురుల వధింతు నాజి లోన

10.    

 

 

 

కం.

అనుమతి నిచ్చిన విక్రమ

మున నే నిఁక నశ్మ వర్షమున గూల్చెద న

య్యనిమిష తతి నవిరళ వృ

ష్టిని వ్రీల సురలు దనుజులఁ జెప్పఁగ నేలా

11.    

 

 

 

ఆ.వె.

వారి రాశి యెగసి వారణ మీఱిన

మందరమ్ము చలన మంద భృశము

జాంబవంతు ఘనుని శత్రు సేన కదల్ప

నేర్చునె రణ మందు నీ రయినను

12.    

 

 

 

ఆ.వె.

సకల దనుజ వీర సంఘములను వారి

పూర్వ జాసురులను సర్వుల నిల

వాలి తనయుఁడు కపి చాలును సమయింప

వీరు డొక్కరుండు ధీర వరుఁడు

13.    

 

 

 

కం.

పనసుని యూరు జవమ్మున

ఘనుండు నీలుని వలనను గంపించును భీ

మ నగము మందర మన భం

డనమున రక్కసులు భయపడ విచిత్రంబే

14.    

 

 

 

కం.

అమరుల నసురుల గంధ

ర్వ మారుతాశన ఖగముల భండనమున మైం

దు మఱియు ద్వివిదుఁ గెలువ వి

క్రమమున నొక్కరినిఁ జూపఁ గలమే పృధ్విన్

15.    

 

 

 

ఆ.వె.

అశ్వనీ కుమారు లలఘు వీరు లుభయు

లు హరి సత్తములు బలు ని యందు

వీరి గెలువఁ గలుగు వీరులఁ గాంచను

సుంత యైన లేదు వింత యిందు

16.    

 

 

 

ఆ.వె.

బ్రహ్మ వర బలమునఁ బరమ దర్పమ్మును

బడసి చిత్త మందు వాన రాగ్ర

గణ్యు లమృత మెలమిఁ గైకొని త్రాగిరి

తనివి తీర నన్న దమ్ము లంత

17.    

 

 

 

తే.గీ.

సర్వ లోక పితామహుఁ డుర్విఁ బూర్వ

మశ్వినీ గౌరవార్థమ్ము విశ్వ మందు

మరణ రాహిత్య మనిశము కరుణ తోడ

వీ రిరువురకు నొసఁగెను వేల్పు మిన్న

18.    

 

 

 

మ.

వర దర్పమ్మున మత్తులై దివిజ దుర్వారంపు ధట్టాలికిన్

హరి వీరుల్ సుధఁ ద్రాగి వీర్యమున నత్యాభీలముం గల్గ జే

సిరి వీరిద్దఱు గూల్తు రాగ్రహమునన్ శీఘ్రమ్మ లంకా పురిం

గరి ఘోట్టాణ శతాంగ సంయుతము శాఖావాసు లీక్షింపఁగన్

19.    

 

 

 

ఆ.వె.

ఏన మున్న లంక నెల్ల నణఁచి భస్మ

ముగ నలుకను దగ్ధము వడిఁ జేసి

నామ మెల్లెడలను భీమముగ వినిపిం

చితిని రాజ మార్గ తతుల నెమ్మి

20.    

 

 

 

ఆ.వె.

రామునకు మహా బల భుజునకు జయము

వీర లక్ష్మణునకు విజయ మగును

రామ పాలితుండు రాజు సుగ్రీవున

కవని జయము నిశ్చయమ్ము సుమ్ము

21.    

 

 

 

కం.

కోసల రాజ వరేణ్యుని

దాసుఁడఁ హనుమంతుఁ డనిల తనయుఁడ ననుచున్

భాసురముగ నామమ్మును

వేసర దనుజులు భృశమ్ము వినిపించితినే

22.    

 

 

 

ఉ.

శింశుప క్రింద దీనముగ సీత యశోక వనమ్ము నందు వి

భ్రంశిత చిత్త ధైర్యమున భర్తృ విచార ఘనార్త యయ్యెఁ జం

ద్రాంశము నీర దావృతపు టందము దైత్య గణాంగ నార్తి తా

నంశు విహీన యైది దశానను దర్పునిఁ దల్ప కింతయున్

23.    

 

 

 

ఉ.

సీత పతివ్రతా సుగుణ శీల నితంబిని భవ్య సూర్య  వం

శాతి రథ ప్రవీణ పురు షాభిరతిన్ మది నన్య మెంచ లే

దీ తనుమధ్య రాముని నరేంద్రుఁ దలంచును నిత్యమున్ బలా

రాతిఁ బులోమ పుత్రిక కరమ్ము దలంచు విధమ్ము వోలుచున్

24.    

 

 

 

కం.

కట్టిన పుట్టము తక్కఁగ

నెట్టి వలువయు నెఱుఁగక తదేకము రజమై

బెట్టిదముగ వగచుచు పతి

దిట్టముగఁ దలఁచుచు నుండె దీనముగ నటన్

25.    

 

 

 

కం.

చూచితి నసురుల నడుమను

వేఁచెడు రక్కసుల మధ్య పృథివీ తనయన్

రోచన నవనిజను దరళ

లోచనను నశోక వని విరూపల నడుమన్

26.    

 

 

 

తే.గీ.

దీన తలఁచుచుఁ బతినిఁ బృధ్విం బరుండి

యేక వేణితో నుండి మెయి కమలంగ

శిశిరపుఁ గొలను వలె దశశిరుని భయము

వలన మరణింప నెంచెను గలవరమున

27.    

 

 

 

తే.గీ.

విషయము సమగ్రము నుడివి విరివి నమ్మ

కమ్ము నింపి సంభాషించి నెమ్మిఁ జెప్ప

రామ సుగ్రీవ మైత్రిని రామ సీత

ప్రీతి నొందెఁ జిత్తమ్మున భీతి వీడి

28.    

 

 

 

తే.గీ.

రాముఁడు నిమిత్త మాత్రుఁడు రావణ వధ

కెంచ జానకి సుకుమారి యెంచఁ బ్రకృతిఁ

బతి వియోగపు వగపున నతి కృశమ్ము

నయ్యెఁ బాడ్యమి పాఠి విద్య సదృశ మయి

29.    

 

 

 

ఆ.వె.

పుణ్యశీల సీత మూరిన శోకము

నందు నుండ నిట్లు సుందరాంగి

చేయఁ దగిన పనినిఁ జింతించి మనమున

శీఘ్రమ యిఁక మీర చెప్ప వలయు

30.    

                                                         

   

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నేఁబది తొమ్మిదవ సర్గము. 

 

సుందర కాండము

సర్గము 60.

 

                                                         

   

తే.గీ.

అంత హనుమంతు మాటల నాలకించి

యంగదుండు వాలి తనయుం డనియెఁ గాంచి

యు నవనిజను విడిచి దేవిని నరుగ నుచి

తమ్మె రాఘవు చెంతకుఁ దిమ్మలార!

  1.  

 

 

 

కం.

అరసితిమి జానకిని నా

వరసతిఁ దేలే దిట కని వచియింప నటన్

హరి విక్రములారా! నే

నరయుదు ననుచిత మని మది నత్యధికముగన్

  1.  

 

 

 

ఆ.వె.

లంఘనమ్మునను బరాక్రమమున హరి

వీరులార! సములు లేరు మనకు

దేవ దైత్య తతులఁ ద్రిజగమ్ము లందును  

వెదకి చూడ ననఁగ వింత కాదు

  1.  

 

 

 

కం.

హతు లైరి వీరు లట మా

రుతి చేత ఘనులు దనుజ వరులతోఁ బనియే

మి తరుణి జానకినిఁ గొని ల

లితమ్ముగఁ జనియెద మింక లీలన్ వేగన్

  1.  

 

 

 

కం.

హరి వరుఁడు జాంబవంతుఁడు

పరమానందమును బొంది వాలి సుతునితో

స్తిర భావునితోఁ బలికెను

గర ముచితంపుఁ బలుకులను గార్య విదుండే

  1.  

 

 

 

తే.గీ.

నీ వరసినది యంతయు నిక్క మక్ష

మమ్మనంగ రాదు మనకుఁ జుమ్మి రాజ

పుత్ర! రామ చిత్త మరసి మున్ను కార్య

సిద్ధిఁ గాంచ నుత్తమ మని బుద్ధిఁ దలఁతు

  1.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నఱువదవ సర్గము. 

 

 

సుందర కాండము

సర్గము 61.

 

                                                         

   

 

కం.

వానరులు జాంబ వంతుని

మానిత వచనమ్ములు హనుమానుఁడు బలభి

త్సూను నిజ సూను తోడన్

వీనుల విని సమ్మతించి ప్రీతిని నంతన్

1.       

 

 

 

ఆ.వె.

గిరి మహేంద్ర మంత హరులు వాయు సుతుండు

ముందు నుండ వీడి యందఱు వడి

మద గజ నిభ మేరు మందర సంకాశు

లెగిరిరి ఘనులు నభ మెల్ల నిండి

2.       

 

 

 

కం.

ఘన కాయులు బలవంతులు

ఘన వీర్యుని మారుతిని జగత్సన్మానుం

గనులారఁ గాంచుచుఁ గపులు

హనుమంతు మహా జవుని మహా విశ్వాసున్

3.       

 

 

 

తే.గీ.

రామ కార్య సాధనకుఁ బరమ యశమ్ము

నొందుటకు నున్నతపుఁ గర్మ మోర్పు మీఱఁ

జేసి పడసి ఫలము పూని రాస తోడఁ

గలసి యెల్ల రుత్సాహమ్ము  క్రమ్మ భృశము

4.       

 

 

 

ఆ.వె.

అందఱు మధురంపు టాలాపములు పల్కు

వార యందఱు ననిఁ గోరు వార

యందఱు రఘు రాము నాస తీర్పఁగ నిశ్చ

యించి నట్టి వారె యంచితముగ

5.       

 

 

 

కం.

గగన పథమ్మున నెగురుచు

సగర్వ మా వానరులు విశాల వనము వే

గ గతిం జేరిరి ముదముగ

నగ నిచయ లతా యుతమ్ము నందన నిభమున్

6.       

 

 

 

కం.

అది సుగ్రీవ సురక్షిత

ము దరము కాదు చన భూతముల కెల్లరకున్

ముద మొసఁగుఁ బ్రాణి కోటికి

మది మధు వన మందురు పరమప్రీతి నిలన్

7.       

 

 

 

తే.గీ.

దానిఁ గాయు నిత్యమ్మును దధిముఖుండు

కపి వరుఁడు మేనమామ శాఖామృ గాధి

పతికి సుగ్రీవునకు మహా బలుఁడు ఘనుఁడు

రాజ శాసనమున ఘన రక్తి నుంచు

8.       

 

 

 

ఆ.వె.

చేరి యా వనమ్ము వారణ సన్నిభ

వానరప్రవరులు మానస హర

మా కపీంద్ర వనము నత్యంతముగ మత్త

చిత్తు లైరి వింత నత్తఱిఁ దమి

9.       

 

 

 

ఆ.వె.

అంత సంతసించి యా పింగళమ్ములు

మధువనమ్ముఁ జూచి మధువుఁ గ్రోల

నడిగినవి కుమారు నంగదుఁ గపి వాలి

పుత్రుని యువరాజు నాత్రముగను

10.    

 

 

 

కం.

అనుమతిఁ గొని హరి వృద్ధుల

మును దా నట జాంబవంత ముఖ వీరుల యి

చ్చెను వారికి మధు భక్షణ

మున కనుమతి నంగదుండు మూరిన ప్రేమన్

11.    

 

 

 

కం.

కానన వాసులు కౌతుక  

మానసులై యనుమ తీయ మధువుం గ్రోలన్  

మేను లలరఁ జోదితులై

గానమ్ముల నృత్యములఁ దగఁ దనరి రంతన్

12.    

 

 

 

ఉ.

కొందఱు పాడి రింపుగను గొందఱు చేసిరి వందనమ్ములం

గొందఱు ప్రీతి నాడి రటఁ గొందఱు నవ్విరి వింత వింతగం

గొందఱు భూమిఁ దూల మఱి కొందఱు తిర్గిరి దిక్కు లెల్లడం

గొందఱు గెంతి రుద్ధతినిఁ గొందఱు వాఁగిరి మిక్కుటమ్ముగన్

13.    

 

 

 

తే.గీ.

కొంద ఱట నొండొరులఁ జేర గోము తోడ

నొండొరులఁ గొందఱు పడిరి యోప లేక

వాదు లాడి రొండొరుల నిర్భయము పరులు

నాడి రొండొరు లితరులు వేడుకగను

14.    

 

 

 

తే.గీ.

చెట్టు నుండి చెట్టున కతి చిత్రముగను

దుమికి రంత కొందఱు భూతలమునఁ బడిరి

కొందఱు నగాగ్రముల నుండి క్షోణి తలము

నుండి తరుల పై కెగిరిరి వెండి పరులు

15.    

 

 

 

తే.గీ.

పాడు వానిని నవ్వుచుఁ బరుఁడు సేరె

నవ్వు వాని నొకఁడు రోదనమునఁ జేరె

నేడ్చు వానిఁ ద్రోయుచుఁ జేరె నింకొకండుఁ

ద్రోయు వాని నఱచుచుఁ రుండు సేరె

16.    

 

 

 

ఆ.వె.

మధువు త్రాగ నంత మర్కట సైన్యము

మత్త తప్త కార్య మగ్న చిత్త

మయ్యెఁ బడక మత్తు నందు నొకఁడు లేఁడు

లేఁడు తృప్తి లేని వాఁడు నచట

17.    

 

 

 

చం.

కనుగొని యా వనక్షయము కాపరి యా దధివక్త్రుఁ డంతటన్

ఘన తరు పుష్ప పల్లవ నికాయ విఘాతము భక్షితమ్మును

న్మనమున రేఁగఁ గోపము ఘనమ్ముగ వానరు లెల్లరన్ నిరో

ధన మది సేయఁ జాగె నమితమ్ముగఁ దర్జన భర్జనమ్ములన్

18.    

 

 

 

తే.గీ.

అంత వారిచే మితి మీఱి నట్టి వాక్య

ముల భృశము ధర్షితుం డయి చలము వూని

యుగ్ర తేజుఁడు హరి వృద్ధుఁ డుపవ నావ

నుండు కావ నెంచెఁ గపుల నుండి వనము

19.    

 

 

 

కం.

నిరసించెఁ గొందఱి నతఁడు

పరుషపు వాక్యముల ధృతిని బాదె తలమునం

బరులఁ గదిసి కలహించె ని

తరులం గని బుజ్జగించెఁ దాఁ బరహరులన్

20.    

 

 

 

ఆ.వె.

అంత దధిముఖుండు హరుల వారితుల చే

బలమున ననుచితపు భాషణములఁ

దర్జితుండు నయ్యె వర్జిత భయులచే

దోష కపుల వలనఁ ద్రోయఁ బడియె

21.    

 

 

 

తే.గీ.

నఖములను గీరి ఖర దశనమ్ములఁ గొఱి

కిరి కర తలమ్ములను జఱచిరి పదములఁ

దన్నిరి కపులు మదమున దధిముఖు నట

వనము నెల్లఁ జెఱచిరి నిష్ఫల దళముగ

22.    

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నఱువది యొకటవ సర్గము. 

 

సుందర కాండము

సర్గము 62.

 

                                                         

 

కం.

కపి వీరులఁ గాంచి పలికెఁ

గపి కుంజరుఁడు హనుమ తమకమ్మునఁ గొనుఁడీ

కపులార మధువు మీ క

డ్డు పడిన వారించెదను గడు ధృతిని వారిన్

1.       

 

 

 

కం.

విని హనుమంతుని పలుకులు

ఘనుఁ డంగదుఁడు ముద మంది కపి శార్దూలుం

డు నుడివె హరివరులారా!

తను పది తీరఁగ మధువును ద్రాగుం డనుచున్

2.       

 

 

 

తే.గీ.

మారుతి పలుకఁ గృత కార్య మాన్యుఁడు వినఁ

దగు నకార్య మైనను నాకుఁ దథ్యముగ న

నంగ నిత్తఱి సంశయింపంగ నెడఁద

నేల వానర వరులార! యెవ్వ రై

3.       

 

 

 

కం.

అంగద ముఖచ్యుతమ్ములు

సంగత వచనమ్ములు విని శాఖామృగముల్

చెంగున నెగిరినవి పులకి

తాంగులునై ప్రణతు లిడుచు నంచిత మనుచున్

4.       

 

 

 

ఆ.వె.

వందనమ్ము లొసఁగి వానరు లా వాన

రర్షభునకు మదిని హర్ష మెసఁగఁ

జనిరి మధువనమ్ము జల వేగ మడరంగఁ

బాఱు ద్రుమ గణమ్ము భంగి నంత

5.       

 

 

 

మత్త కోకిల

వారు సమ్మతి నొంది మీఱిన వారు దక్షులు వీరతం

జేరి రా మధు నిష్కుటమ్మును జెంగఁగొట్టి సుపాలురం

జారు సీతను జూడఁగా విని సంతసమ్మున వానరుల్

సారఘమ్మును ద్రాగి సత్ఫల సంచయమ్మును ద్రుంచిరే

6.       

 

 

 

కం.

వన పాలకుల పయి కెగిరి

ఘన వానరు లెల్ల రంతఁ గలసిమెలసి తా

డనముల బాధించిరి మధు

వన మందలి యాస తోడ బహు మార్గములన్

7.       

 

 

 

కం.

తూమెఁడు తేనెను జేతుల

గోముగ నొక చోటఁ జేరి గుంపుగఁ గొనుచున్

వేమరు త్రాగిరి యపరులు

భీమముగ నడిచిరి యడ్డు వీడుట కొఱకై

8.       

 

 

 

కం.

మధుపింగళులు కుడిచి తమి

మధువును ద్రోసిరి కొదవను మఱి కొంద ఱిఁకన్

క్షుధ తీర తేనెతెరలు వి

విధములు గొని మత్తు నందు వ్రేసి రితరులన్

9.       

 

 

 

ఆ.వె.

తరువు మూలములను హరులు కొందఱు శాఖ

లందు కొని నిలువఁగ నన్య కపులు

మత్తు నందు సొలసి మెత్తని వగు పత్ర

ములు పఱచి కునుకిరి యలసి భృశము

10.    

 

 

 

కం.

మైకము గ్రమ్మిన ప్లవగా

నీకమున నొకరి నొకరు గని పడిరి పైపై

నా కపులు త్రాగ మధువును

వీఁకను దూలిరి యితరులు వెఱ్ఱుల భంగిన్

11.    

 

 

 

తే.గీ.

సింహ గర్జన మొనరింప సింహ బలులు

కొందఱు మురిసి కూసిరి కొంద ఱంత

మత్తిలి మధు పానమ్మున మఱియు హరులు

తూఁగిరి మహీతలమ్మున నాఁగ లేక

12.    

 

 

 

తే.గీ.

చేసి నవ్వెడు వారును జేయు వా రి

తరముఁ గొందఱు చేసి యంత వచియించు

వారు కొందఱును దలఁచు వారు చేయ

నన్యమును గొంద ఱుండిరి యక్కజముగ

13.    

 

 

 

తే.గీ.

అచట నున్న కావలి వారు నా దధిముఖ

భృత్యు లెల్ల వానరు లతి భీమ విక్ర

మ బలదర్పులు వారింప మలఁగి దశ ది

శలకుఁ బాఱిరి భయ మింకఁ గలఁత రేఁగ

14.    

 

 

 

ఆ.వె.

ఈడ్ప వేగ వారి నెల్ల మోకాళ్లపైఁ

జూపఁ బిఱుఁదులు నగుచు హరు లంతఁ

జెదరి మనము సేరి చెంతకు దధిముఖు

తోడఁ ల్కి రిట్లు వేఁడుకొనుచు

15.    

 

 

 

కం.

హనుమంతు ననుమతిని మధు

వన మంతయు సేసిరి వడి భగ్నమ్ము బల

మ్మున మమ్మీడ్చిరి మోకా

ళ్లను జూపిరి నవ్వి పిఱుఁదులను వికటముగన్

16.    

 

 

 

కం.

వనపుఁడు దధిముఖుఁ డంతన్

విని కోపమ్మున మధువన విధ్వంసమ్మున్

వనచర ముఖ్యుఁడు వానరు

ల నూఱడించెను మధుర సరస వచనములన్

17.    

 

 

 

ఆ.వె.

ఊఱడించి యనియె నుగ్రుఁడై మన మేఁగి

తేనె నారగించు వానరులను

బల మహోత్కటులను వారించెదము రండు

మనము బలము సూపి వనము నందు

18.    

 

 

 

కం.

విని యా దధిముఖు వచనము

లను వానర పుంగవులు చలమున వెడలి రా

వనము తిరిగి నాథుని తో

డను వేగము మీఱఁ దడఁబడక ధైర్యమునన్

19.    

 

 

 

చం.

తరువును జేతఁ బట్టుకొని తైరుముఖుండు జవమ్ము మీఱగం

బరుగిడ వానరవ్రజము వాలిన చోటికి భృత్యు లెల్లరుం

దరలిరి పర్వతాశ్మ నగ దండము లంది మహాగ్రహమ్మునం

దరుచరు లంత నాథుని ప్రతాప కపీశుని వెంటనంటుచున్

20.    

 

 

 

ఉ.

వీరులు స్వామి వాక్కులను వే మన మందిడి సత్వరమ్ముగం

దోరపు సాల తాల తరు దుర్భర భీమ శిలా చయమ్ములుం

బోరఁగఁ గొంచు హస్తముల మూరి బలాంధుల భూతలస్థులన్

భూరుహ సంచయస్థ కపి పుంగవులన్ ధృతిఁ దాఁకి రెల్లరున్

21.    

 

 

 

శా.

వీరావేశము వూని రా దధిముఖున్ వీక్షించి వేగమ్ముగన్

వీరుల్ వానర పుంగవుల్ హనుమయున్ విన్నంది పర్వెత్తఁగన్

ఘోరంపుం దరు వుండ హస్తమున సుక్రోధుండు నా యార్యునిన్

వారింపంగఁ దలంచి యంగదుఁడు వే బాఁదెన్ స్వహస్తమ్ములన్

22.    

 

 

 

ఉ.

ఈతడు నా పితామహుఁడ యిమ్ముగ నెంచక యిట్లు గర్వి సం

పాతము సేసె నాతనిని బాహు యుగమ్మునఁ ద్రోసి ధాత్రిపైఁ

గోతుల ముఖ్యుఁ డంత ఘన కుంఠిత బాహు భుజోరుఁడై పడెన్

భూతల మందు నొక్క త్రుటి మూర్ఛిలి విహ్వల రక్త సిక్తుఁడై

23.    

 

 

 

తే.గీ.

తేఱుకొని త్వరితమ్ముగ ఘోర కోప

మున మధు విమోహితుల దండమున హరులను

రాజ మాతులుఁడు దధి వక్త్ర హరి పుంగ

వుండు వారించె వన రక్షకుండు ధృతిని

24.    

 

 

 

మ.

అతి యత్నమ్మున వారి బారి విడి యేకాంతమ్ము నందేర్పడన్

ధృత చిత్తుం డయి వానరప్రవరుఁ డార్తిం బల్కె భృత్యుల్ వినం

బతి సుగ్రీవుఁడు భూరి కంఠుడును సంభావ్యుండు శ్రీరామ సం

గతి భాసిల్లఁగ వాని కందు మట వేగం బోయి మీరుండుఁడీ

25.    

 

 

 

కం.

వినిపించెద నంగదు నఘ

మును బార్థివునకు నమర్షమున సర్వమ్మున్

విని నాదు భాషణమ్ములు

ఘనముగ దండించు నింకఁ గపి కాయమ్మున్

26.    

 

 

 

తే.గీ.

ధవునకుఁ బితృ పైతామహ దత్త మధు వ

నం బిది కడుఁ బ్రీతి మహాత్మునకు దురాస

దమ్ము దేవతలకును భూతలము నందు

భగ్న మైనది సైఁచునె పార్థివుండు

27.    

 

 

 

తే.గీ.

హరి విభుండు సుగ్రీవుఁడు హరివరుల సు

హృదుల మధులుబ్ధుల నలిగి వదలక యతి

దారుణమ్ముగ దండించు వీరి నెల్ల

రను గతాయుషు లౌదురు వనమున నిఁక

28.    

 

 

 

ఆ.వె.

దుష్ట చిత్త హరులు దూఱఁగ రాజాజ్ఞ

వధకు నర్హులు సుమి వసుధ యందు

నోర్పు మీఱ రాఁగ నుగ్రంపు రోషము

సఫల మగును మనకు జక్కఁగ నిఁక

29.    

 

 

 

కం.

పలికి యిటుల దధిముఖుఁ డతి

బలుండు వనపాలక హరి వర్గము తోడం

జలమున నేఁగె నెగిరి వా

రలఁ గొందఱు ననుగమింప రయమున నంతన్

30.    

 

 

 

కం.

నిమిషాంతర మాత్రమ్మునఁ

గమలాప్తాత్మజ వనచర ఘన సుగ్రీవుం

డు మహామతి యున్నట్టి స్థ

లమును దధిముఖుండు సేరె రయమున నంతన్

31.    

 

 

 

ఆ.వె.

రామలక్ష్మణుల నరసి ససుగ్రీవుల

సమ తలంపు జగతిఁ జక్కఁగఁ గని

నభము నుండి దిగె వన చరుండు వనపాల

కుండు ఘనుఁడు దధిముఖుండు భీతి

32.    

 

 

 

తే.గీ.

దిగి మహావీర్యుఁడు హరి యనుఁగులు ననుగ

మింపఁ బాలక గణమున కింపగు పతి

దధిముఖుం డయి దీన వదనుఁడు శిరసు

వంచి సుగ్రీవు పదములు పట్టె నుతుల

33.    

   

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నఱువది రెండవ సర్గము. 

 

 

సుందర కాండము

సర్గము 63.

 

                                                         

 

కం.

తల వంచి పాదములపైఁ

లఁత వహించి పడఁగఁ గని కపి పుంగవునిం

బలికె వెఱ పొలసినదిం

బలుకులు వానర విభుండు పన్నుగ నంతన్

1.       

 

 

 

ఆ.వె.

పదము లంట నేల వడి లెమ్ము లెమ్మిఁక

వీర నీ కభయ మపార మిచ్చి

తి నిటఁ జెప్పు మెల్లఁ దెల్లముగను వీర!

గారణమ్ము నీవు కలఁతఁ జెంద

2.       

 

 

 

ఆ.వె.

అభయ మీయ దినక రాత్మజుండు మహాత్ముఁ

డట్లు నమ్మకమ్ము నంది భృశము

దధిముఖుండు సన్నుత విదుఁ డంతఁ బలికె

లేచి ధృతిని హరుల లీల లన్ని

3.       

 

 

 

తే.గీ.

ఋక్షరజుఁ డైన వాలియు నేని రాజ!  

నీవు గాని మున్నెన్నండు నేర రే స్పృ

శింప నట్టి మధు వనమ్ము ఛిన్న మయ్యె

హరులు భక్షించి రంగదు నండ యుండ

4.       

 

 

 

కం.

వన సంరక్షకు లడ్డు వ

డినను హరివరులు భయము విడిచి యెంచక వా

రిని మధు ఫలములు త్రాగిరి

తిని రదలించిరి భృశమ్ము దేవా! వినవే

5.       

 

 

 

కం.

అవశేషము విసరిరి వా

రవని పయి నితరులు తినిరి యంతయు నంతం

దివిరి నివారింపఁగ హరు

ల వెక్కిరించిరి కనుబొమలను వికృతముగన్

6.       

 

 

 

ఉ.

కోపము నూని యాప వన గోపులు వే వన మందు నుండియున్

సైఁపక వానరేంద్రులు భృశంపు టమర్షము సెంది యాఱడిం

దాపము గల్గఁ జేయుచును దామ్ర త రాక్షులు పాఱఁ దోలి రీ

స్థాపిత పాలకవ్రజముఁ దామస చిత్తులు వానరర్షభా!

7.       

 

 

 

చం.

కరములఁ గొట్టఁ గొందఱిని గాఢపు జానువు లెత్తి కొందఱిం

బరుషపు భాషణమ్ములను బాఁది యథేచ్ఛగ నీడ్చి దేవ మా

ర్గ రభస దర్శ నమ్మిడిరి గర్వమునం గను వీరి నందఱిన్

స్థిరముగు నీదు పాలనను జేసిరి భక్షణ మీ వనమ్మునున్

8.       

 

 

 

తే.గీ.

ఈ విధము నివేదింప సుగ్రీవునకు మ

హాత్మునకు వానరేంద్రున కంతఁ గాంచి

లక్ష్మణుండు ప్రాజ్ఞుండు పర దమనుండు

వానిఁ బ్రశ్నించె మది ననుమాన మంది

9.       

 

 

 

ఆ.వె.

వానరుఁ డితఁ డేల వచ్చె వనావనుం

డిటకు రాజ! చెప్ప నేమి యెంచి

తూర్ణ మీతఁడు కడు దుఃఖితుండు పలికె

భాషణమ్ములు తెలుపంగ దగునె

10.    

 

 

 

కం.

అని యడుగ లక్ష్మణుండు సు

మనస్కుఁడు కపీంద్రుఁ డంత మన్నన తోడన్

ఘన వాక్య విశారదుఁడు వ

చనమ్ములు బదులు పలికెను సముచిత రీతిన్

11.    

 

 

 

చం.

గురుఁడు హరీశుఁ డీ దధిముఖుండు సవేదన నార్య! లక్ష్మణా!

హరివరు లంగ దాదులు విహారము సల్పి వనమ్ము లోపలన్

వర మధు వెల్ల గ్రోలి రనె వానరు లెల్లరు దక్షి ణాశ నుం

డి రయము మీఱ వచ్చితిరి ఠీవిగ జానకిఁ గాంచి యంచునున్

12.    

 

 

 

తే.గీ.

చేరి వనము భగ్నము సేసి యారగించి

మధువుఁ దర్జించి వనపుల నధమముగ న

తిక్రమించి చెలఁగి నట్టి తీరుఁ గాంచ

నకృత కృత్యులు కారని యరయఁ గలము

13.    

 

 

 

కం.

అభిపన్న వనము తెల్పును

శుభకర్మము సాధిత మని సుదతి కనఁబడెన్

శుభగుఁడు మారుత తనయుఁ డ

నుభవజ్ఞుఁడు గాక కనునె నుతుఁ డన్యుండున్

14.    

 

 

 

తే.గీ.

కార్య సామర్థ్యము తెలివి ఘన కృషియును

బలము విజ్ఞానము దనరి పరఁగు నితని 

యందు వానర పుంగవు నందుఁ బరులు

హనుమ కంటెను గారకు లనఁగ రాదు

15.    

 

 

 

తే.గీ.

నేత జాంబవంతుఁడు దమి నిలిచి యున్న

నంగదుఁడు ఘన బలుఁడు చెలంగ దరిని

నాంజనేయుఁడు పరికింప మంజులముగ

నార్య! యన్య గతి నగునె కార్య మెంచ

16.    

 

 

 

కం.

హత మయ్యెను మధు వనము వి

తతమ్ము నంగద ముఖ హరి తతులన్ విద్రా

వితు లైరి జాను ఘాతము

లు తగిలి వన పాలకులు నలు దెసల భీతిన్

17.    

 

 

 

కం.

ఈ విషయమ్మెఱిగింపగఁ

దా వడి వచ్చె హరి వరుఁడు దధిముఖుఁ డిటకుం

జూవె మధుర వచనముల మ

హా విక్రముఁడు ముద మీయ నాశ్చర్యముగన్

18.    

 

 

 

కం.

ఘనభుజ! సౌమిత్రి! నిజము

గనుమ కనఁబడెను ధరణిజ కమనీయముగన్

వనచరు లెల్లఁ గలసి మధు

వనమునఁ ద్రాగిరి మధువు నివారితు లయ్యున్

19.    

 

 

 

ఆ.వె.

హరులు సుప్రసిద్ధు లవనిజ నరయక

పురుష సింహ! వనముఁ బరుష తరము

శకలము లొనరింప సాహసింపరు సుమ్మి

దత్త వరము నొప్పిదమ్ము నెల్ల

20.    

 

 

 

మ.

సుమహానంద కరాంచి తోక్తముల నా సుగ్రీవు వాక్యమ్ములం

త మహాత్ముండు స లక్ష్మణుండు విని సత్కర్ణ ప్రమోదమ్ములన్

విమల స్వాంతుఁడు రామచంద్రుఁడు మహావీరుండు సౌమిత్రియుం

గమనీయమ్ముగ సంతసించిరి తమిం గాకుత్స్థ వంశోద్భవుల్

21.    

 

 

 

కం.

విని దధిముఖు నా వచనము

లను బ్రమదమ్మున వనపు నరసి సుగ్రీవుం

డనియెం దిరిగి మధురపు వ

చనముల నంతఁ గొనియాడి చక్కఁగ నతనిన్

22.    

 

 

 

కం.

కృత కృత్యులు భక్షించిన

నతి సంతస మానసుండ నైతి నిట సహిం

చితి సహనార్హము నీ చే

ష్టితమును గృత కృత్య హరులు సేయఁగ సౌమ్యా!

23.    

 

 

 

తే.గీ.

చూడఁ గోరుదు శీఘ్రమ శూర మారు

తాత్మజప్రధానులను సింహాభుల హరి

వీరులఁ గృతార్థుల నిచట వినఁగ వలయు

రాఘవులతో నవనిజ దర్శన విధమ్ము

24.    

 

 

 

తే.గీ.

ప్రీతి విస్ఫారి తాక్షులఁ బ్రీత చిత్తు

లను గుమార వరులఁ గార్య లబ్ధులఁ గని

వానరాధిపుం డా రాఘవానుజులను

సంతసించె ఫలము చేతి కంత నంద

25.    

  

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నఱువది మూడవ సర్గము. 

సుందర కాండము

సర్గము 64.

 

                                                         

  

కం.

విని సుగ్రీవు వచనములు

మనమున ముద మంది కపి నమస్కృతు లొనరిం

చె నియతి దధిముఖుఁ డర్క సు

తునకును రాఘవుల కంతఁ దోరపు భక్తిన్

1.       

 

 

 

కం.

ప్రణతు లొసఁగి రామ స ల

క్ష్మణ సుగ్రీవులకు వృక్షచర సహితమ్మున్

గుణనిధి దధిముఖుఁ డల నుడు

గణవీథి కెగిరె రయముగ గమనోత్కంఠన్

2.       

 

 

 

ఆ.వె.

వచ్చిన విధ మేఁగి వానరుఁ డతి వేగ

ముగ దిగి దివి నుండి భూమి పయికిఁ

జొచ్చి మధువనమ్ము సూచె మూత్ర చ్యుత

మద విహీన హరుల మండలమును

3.       

 

 

 

ఆ.వె.

అంగదునిఁ గదిసి కృతాంజలుఁడై వేగ

దధిముఖుఁడు ముదమునఁ దా వచించె

మృదువగు వచనములు సదమల బుద్ధిని

హరి వరేణ్యుఁ డంత హరివరుఁ గని

4.       

 

 

 

తే.గీ.

కోపము వడయఁ దగదు నీకు నిట సౌమ్య!

నీ పరిజనము నాపిరి కోపమునను

దెలియకయు వనపాలురు దివిరి వీరు

క్షమకు నర్హు లింక కుమార! కపివరేణ్య!

5.       

 

 

 

కం.

యువరాజు వీ వధీశుం

డ వీ వనమునకును మూర్ఖుఁడను బ్లవగ గణ

ప్రవరా! చేసితి దోషము

నవిచారము సైఁచు దాని నాదర మొప్పన్

6.       

 

 

 

కం.

తెలిపితి నీ పినతండ్రికి

నలఁ జేరి స వనచర భవ దాగమనమ్మున్

లలితంపు మధు వనమునకుఁ

గలుష విహీనాత్మ! యేను గపి గణ పతికిన్

7.       

 

 

 

ఆ.వె.

సంతసించె నంత సహచర సహితము

నీదు రాకను విని నేలమట్ట

మైన వనపు గాధ నాలకింపఁగ నించు

కేని మదిని రోష మూనఁ డతఁడు

8.       

 

 

 

ఆ.వె.

వానరేశ్వరుండు పంపుము వారి శీ

ఘ్రముగ నిట కని యను రాగ మలరఁ

బార్థివుండు నన్ను బనిచె సుగ్రీవుండు

నీ పితృవ్యుఁ డంత నెమ్మి మీఱ

9.       

 

 

 

కం.

అంగదుఁ డంత దధిముఖుని

మంగళ కర వాక్యములను  మన్నించుచుఁ దా

సంగత హరులను గని యి

భ్భంగి ననియెను జతురుండు వాక్యము లందున్

10.    

 

 

 

చం.

కలుగును శంక చిత్తమునఁ గాంతుఁడు రాముఁ డెఱింగె నంచు గా

థల హరి వీరకృత్యములు ధాత్రిజ దర్శన భాగ్య మిత్తఱిన్

ఫలితము నొంది కార్యమున భావ్యము కాదిట నింక నుండగం

దలఁచెద నిట్లు నేను రిపు దండ వినాశకులార! వింటిరే

11.    

 

 

 

ఉ.

త్రాగిరి చిత్త తృప్తిని సుధా నిభ మా మధు వెల్ల నెమ్మితోఁ

గాఁగల కార్య మేమి యిటఁ గాంతుము పోఁ దగు నాథు చెంతకున్

వేగమ మీర లింక హరి వీర వరేణ్యులు! చెప్పు తీరునం

బోఁగల వాఁడ బద్ధుఁడను మూరిన స్నేహము నెంచి మీ యెడన్

12.    

 

 

 

తే.గీ.

కార్య సాధకులకుఁ దిరస్కారము సలు

పఁ గలనె యువరాజు నయినఁ బ్రభువు కాదు

పంపు నీయంగ నేను మీ కింపు నొసఁగు

కార్యము వచింపు డెల్లరు కరుణ తోడ

13.    

 

 

 

కం.

పలుకఁగ నిట్లంగదుఁ డట

విలువైన వచనము లంత విని ప్లవగ వరే

ణ్యులు హర్ష సంకలిత చి

త్తులయి పలికి రిట్లు వాని తో నుచిత గతిన్

14.    

 

 

 

ఉ.

ఎవ్వరు పల్క నేర్తు రిటు లిద్ధర నాథులు వానరర్షభా!

క్రొవ్వి ధనాతిరేకమున గొప్పగఁ దన్ను దలంచు గర్వియై

యివ్విధి మాటలన్ వినయ మేరికి నుండును నీకుఁ గాకయే

దవ్వుల భాగ్య లబ్ధి నివి తథ్యమ తెల్పును నీకు నంగదా!

15.    

 

 

 

ఆ.వె.

హరిగణ విభు రవిజు దరికి నరుగ ధృతిఁ

దలఁచితిమి కదిసి హరులము  మేము

నరయుచుఁ దగు సమయము రహినిఁ గపివర!

భవ దభిరుచియు నిఁక వర మగుఁ గద

16.    

 

 

 

ఆ.వె.

సత్య మొక్క యడుగుఁ జనఁగ రా దిట మాకుఁ

జెప్పకుండ నీవు చెప్పు చుంటి

మి హరిగణ వరేణ్య! సహచరులము నీకు

నిందు లే దొకింత సందియమ్ము

17.    

 

 

 

కం.

వచియింపఁగ నట్లు హరులు

రుచిరమ్మని యంగదుఁడు హరుల నందఱిఁ జూ

చి చనుం డని పలుకంగ స

ముచిత రయమున నెగిరిరి నభో గతి కెలమిన్

18.    

 

 

 

తే.గీ.

చేసి యాకాశమును సు విలాస రీతి

నిరవకాశ మెగురు హరివరుని తోడఁ

జెలఁగి హరులు యంత్రచ్యుత శిలల భంగి

నెగిరిరి దివికి నెల్లరు నెసక మెసఁగ

19.    

 

 

 

తే.గీ.

వారు ద్రుటి నెగిరి ప్లవగ వరులు సేరి

నింగి నినదమ్ముఁ జేసి రనిలము చేతఁ

దఱుమఁ బడిన యభ్రంపు నాదమ్ము వోలె

భీకరమ్ముగఁ జాగుచు నాకసమున

20.    

 

 

 

ఆ.వె.

అంగ దాగమనము నరయక మున్న సు

గ్రీవుఁ డనియె మిగుల ప్రీతి తోడ

శోక తప్త చిత్తుఁ జూచి రాముని కమ

లాక్షు రఘుకుల లవణాకర శశి

21.    

 

 

 

శా.

శాంతిం బొందుమ భద్ర మింపుగ నగున్ సందేహమే లే దిటన్

సంతోషమ్ముగ దేవి కాంచఁబడియెన్ శాఖా మృగశ్రేణి చేఁ

బొంతం జేరఁగ శక్యమే కపులకుం బూర్ణేందు బింబాననా!

సాంతంబున్ గడు వెల్ల తీర నిట లోలాక్షిన్ విలోకింపకే

22.    

 

 

 

తే.గీ.

అంగదుఁడు మహాబాహువు భంగ మైన

కార్యము యువరాజగు ప్లవగప్రవరుఁడు

నాదు సంకాశమున కెట్లు నగచర సహి

తమ్ము రానేర్చు నిశ్శంకఁ దలఁపఁ దరమె

23.    

 

 

 

కం.

తిరిగి విఫల కార్యులు నయి

హరివరుఁ డేతెంచ నిటకు నతి దీనముగం

బరఁగు ముఖము భ్రాంతుఁ డగును

గరము చలిత మానసుఁ డగుఁ గాకుత్స్థ వరా!

24.    

 

 

 

తే.గీ.

హర్ష మందఁ డేని వనము నతఁడు ముట్టఁ

డు పితృ పైతామహమ్మది సుపరి రక్షి

తమ్ము పూర్వీణుల వలన వమ్ము సేయఁ

డూఱ డిల్లు కౌసల్యా సుతోత్తమ యిఁక

25.    

 

 

 

తే.గీ.

కాంచఁబడియె సీతాదేవి కలఁత వీడు

హనుమ కన్యుఁ డరయ నేరఁ డాంజ నేయు

న కితరు నన దగునె కరణమ్ము కార్య

సాధనమ్మున కచ్చట సార్వభౌమ!

26.    

 

 

 

కం.

హనుమంతు నందుఁ గల వా

యిను నందలి తేజము వలె నెఱుకయు వీర్య

మ్మును గృషియున్ సామర్థ్య

మ్మును నిస్సందేహము భృశముగ ధీవర్యా!

27.    

 

 

 

ఆ.వె.

జాంబవంతుఁ డుండఁ జారుత రేశుఁడు

నంగదుండు నుండ నతి బలుండు

మారుతాత్మజుండు భార మెల్ల వహింపఁ

గార్య మగునె యన్య గతిని రామ!

28.    

 

 

 

చం.

వలదిఁకఁ జింత నుండ నిట భండన విక్రమ! యంచు నుండగం

గిలకిల నిస్వనమ్ము లవి కించి దనంత పథమ్ము నందు వీ

నుల వినిపించెఁ దెల్పఁగ ఘనుం డనిలాత్మజు కార్య సిద్ధినే

లలితముగా ననన్ జితఫలధ్వజ వానర గర్జనమ్ములే

29.    

 

 

 

కం.

విని యా కపిగణ నినదము

లను గపి సత్తముఁడు వాల లాలన రతుఁడై

ఘనముగ సంతస మందెను

మనమున సుగ్రీవు డంత మందస్మితుఁడై

30.    

 

 

 

కం.

చేరిరి హరివరు లందఱు

నా రామునిఁ జూచు వేడ్క నత్యాతురతన్

వీరులు మారుతి యంగదు

లే రయమున ముందు నుండ నింపారంగన్

31.    

 

 

 

ఆ.వె.

అంత నంగ దాది హరి వీరులు ముదాన్వి

తులు హరీశు చెంత కల రఘూత్త

ముని సమీపమునకు మూరఁగ హర్షము

దిగిరి నభము నుండి దివ్యముగను

32.    

 

 

 

తే.గీ.

మారుతి మహాభుజుండు నమస్కరించి

యంత నాదేవి నక్ష నసమ భర్తృ

చింతనా రత దృఢతర చిత్తను రఘు

రామునకుఁ దెలిపె ఘనుఁడు రమ్యముగను

33.    

 

 

 

ఆ.వె.

చూచితి నట దేవి సువ్రత నన్న ప

లుకు లమృత సమమ్ములు విని హనుమ

వదనమున వెలువడ ముదమందె భృశముగ

లక్ష్మణ సహితమ్ము రాముఁ డంత

34.    

 

 

 

తే.గీ.

హనుమ పై దృఢాభిప్రాయ మాత్మ నున్న

వాని హర్షితు సుగ్రీవు మాననీయుఁ

జూచె బహుమాన దృక్కులఁ జోద్యముగను

బ్రీతి నొంది లక్ష్మణుఁ డంత వీర వరుఁడు

35.    

 

 

 

కం.

హనుమంతుఁ గాంచె రాముఁడు

ఘన గౌరవ భావమున నఖం డాభిప్రీ

తిని రిపు వీర వినాశకుఁ

డినకుల వర్ధనుఁడు ధరణి జేశుం డంతన్

36.    

  

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నఱువది నాలుగవ సర్గము. 

 

సుందర కాండము

సర్గము 65.

 

ఉ.

అంగదు ముందు నుంచి చని యద్రికిఁ బ్రశ్రవ ణాఖ్యకున్ వడిన్

వంగి సశీర్ష మెల్లరును భక్తిని వందన మాచరించి స

ద్భంగిని రామలక్ష్మణ విభాకర సూనుల కంత జానకీ

సంగతి నెల్లఁ జెప్ప నిఁకఁ జాగిరి వారికి సమ్మదమ్మునన్

1.       

 

 

 

చం.

అవనిజ బంధన మ్మసురు నంతిపురమ్మునఁ దర్జనమ్ము దై

త్య వశల భర్తృ చింతనము దైత్య కృతావధి రామ సన్నిధిన్

సువదన యున్న తీరును విశుద్ధ మనో గతు లన్నిటిన్ వడిన్

వివరముగన్ వచించి రట వీరులు వానర పుంగవుల్ తమిన్

2.       

 

 

 

తే.గీ.

అక్షతము సీత యని విని యనియె రాముఁ

డంత నెట్లున్న దా సీత హరి వరేణ్యు

లార! నా యందు నెవ్విధి నవనిజ చరి

యించు నుడువుఁడు సీత గుఱించి యెల్ల

3.       

 

 

 

కం.

రాముని భాషణములు విని

యా మారుతిని హరు లెల్ల రడిగిరి యంతన్

భామా వృత్తాంత విదుని

రాముని సన్నిధి నుడువఁగ రమణి చరితమున్

4.       

 

 

 

కం.

కోఁతుల నుడులు విని హనుమ

సీతా దేవి దిశను నరసి పరమ భక్తిన్

సీతకు నమస్కరించుచు

సీతా దర్శన విధమ్ముఁ జెప్పఁ దొడంగెన్

5.       

 

 

 

తే.గీ.

యోజన శతపు సంద్రము నుత్తరించి

నేను సీతను వెదకంగ మానసమున

నిచ్చగించి తగులమున నచ్చెరువునఁ

జేరితిని దక్షిణ తటికి శీఘ్రముగను

6.       

 

 

 

ఆ.వె.

దక్షిణ జలరాశి దక్షిణ తట మందు

నుండె లంక యనఁగ మండితంపుఁ 

బురము రావణుండు వర దర్పితుండు దు

రాత్ముని వశ మందు నలరి భృశము

7.       

 

 

 

కం.

కంటిని జానకి రావణు

నింట నచట సతిని రామ! యీప్సితముల న

న్నింటి దిగనాడఁ దామర

కంటి యునుప నాస లెల్లఁ గలఁతన్ నీపైన్

8.       

 

 

 

కం.

కాంచితి నసురల నడుమం

జంచల నేత్ర వికృత దనుజస్త్రీ భయముల్

మించఁగ మఱిమఱి నసురీ

సంచయ రక్షితను సీత శ్యామా వనిలో

9.       

 

 

 

ఉ.

ఇడుమల బారిఁ బడ్డ సతి నెట్టి విపత్తు లెఱుంగ రాని యా

పడఁతిని రాణివాసమున బంధిత కాంతను రాక్షసీ సతుల్

తడబడ కుండ నిత్యము సతర్జన రక్షణ మిచ్చు చుండగం

గడు వ్యధ నున్న భామను సుఖమ్మును నీ దయఁ గోరు సీతనున్

10.    

 

 

 

తే.గీ.

ఒంటి జడ నున్న తామర కంటి దీను

రాలి నిత్యమ్ము నిను దల్చు లోల నేత్ర

నేల నిద్రించు సతి శీతకాల తామ

రసము పగిది వివర్ణమైన సువదనను

11.    

 

 

 

ఆ.వె.

రావణు మరలింపఁ జావఁగ నెంచిన

దేవి మదిని నిన్ను దృఢముగ నిలి

పిన సతి నతి కష్టమునఁ గంటి నచ్చట

రామ! రఘు కులాబ్ధి సోమ! నేను

12.    

 

 

 

తే.గీ.

పలికి యింపుగ నిక్ష్వాకు వంశ కీర్తి

ననఘ! పురుషోత్తమ! సతికి నంత నమ్మ

కమ్ము కలిగించితిని మెల్లఁగ నవనిజ క

శోక వని నేమఱంగ నసుర వనితలు

13.    

 

 

 

తే.గీ.

సముచితముగ భాషించితి సకల విషయ

ములఁ దెలిపితి దేవికి ముదము వడసె విని

రామ సుగ్రీవ మైత్రి సువ్రత దృఢముగ

నిలిపె సద్భక్తి నీయంద నిత్య మబల

14.    

 

 

 

కం.

జన కానంద జనక భూ

తనయ మహాభాగ యట్లు దర్శిత మయ్యెన్

ఘన తాపసి పురుషర్షభ!

తనరఁగ నీయందు భక్తి తరుణీ మణికిన్

15.    

 

 

 

కం.

ధరణిజ గుఱుతు నొసఁగె నా

కు రమణి రఘువీర! చిత్రకూటమ్మున నీ

సరసన సుమహా ప్రాజ్ఞా!

వర కాక చరిత్రము నుడువఁగ నీ తోడన్

16.    

 

 

 

తే.గీ.

జానకి పలికె నాతోడ దీనముగను

విన్నవింపు నరవ్యాఘ్రు సన్నిధాన

మేఁగి నీ చూచినది యెల్ల నిచట రాము

నకు ననిల నందన! రయమున హరివీర!

17.    

 

 

 

కం.

వినుచుండఁగ సుగ్రీవుఁడు

హనుమ పలుకుచు వచనమ్ము లవనీ పతికిన్

ఘన యత్న రక్షితము దీ

ని నీయ వలయు రఘు రామునికి ననిల సుతా!  

18.    

 

 

 

ఆ.వె.

సురుచిరముగ భవ్య చూడామణిని దాఁచి

తిఁ దమి జ్ఞప్తి గొనుమ తివిరి నుదు

దిద్ది తీవు రామ! ముద్దుగ మణిసిల

చేఁ జెడఁ దిలకమ్ము చెంతఁ జేరి

19.    

 

 

 

ఆ.వె.

ఇచ్చు చుంటి నీకు నిత్తఱి నీ వని

తలఁచి దీని వెతల కలఁత వీడి

ముదము వడయ నేర్తు నుదక సంభవ మిది

వృద్ధి నొసఁగు మణిని వీడు చుంటి

20.    

 

 

 

తే.గీ.

జీవితం బొక్క మాసము నే వహించు

దాన దాఁట నెల బ్రతుకఁ దరము కాదు

ఘోర రాక్షసుల వశము సేరి నేను

బ్రాణముల నుండఁ జాలను బ్రాణ నాథ!

21.    

 

 

 

తే.గీ.

ఇవ్విధిఁ బలికె సీత తా నొవ్విఁ జెంది

ధర్మ చారిణి నా తోడఁ దనువు సన్న

గిల్ల బంధితయై దశగ్రీవు నింట

మృగము వోలె ఫుల్ల నయన చిగురుఁబోఁడి

22.    

 

 

 

కం.

జరిగిన దెల్ల యథా తథ

ము రాఘవ నుడివితి నిఁక సముద్రోదకముం

దరియించు విధ మవశ్యము

నరయఁగ వలయు నెటు లైన నార్యా! మనకున్

23.    

 

 

 

తే.గీ.

రాజ పుత్రు లూఱటఁ జెంది రని యెఱింగి

రామునకు నిచ్చి సన్మణి రాగ మలర

నవనిజ ముఖచ్యుతపు వాక్కు లాది నుండి

హనుమ సంపూర్ణము నుడివె నంత నెమ్మి

24.    

                                                         

   

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నఱువది యేనవ సర్గము. 

 

సుందర కాండము

సర్గము 66.

 

కం.

విని రాముఁడు దశరథ సుతుఁ

డనిలాత్మజు భాషణముల ననుజుని సౌమి

త్రుని తోడ మణిని హృదయ

మ్మున నిడి విలపించె ఘోరముగ దుఃఖమునన్

1.       

 

 

 

కం.

కని యా మణి రాఘవుఁడు హృ

దిని శోక సుతప్తుఁ డౌచు ద్వినయనముల భా

ష్ప నలినములు నిండఁ గపీం

ద్రుని సుగ్రీవుఁ గని పలికె ‌రోదన మడరన్

2.       

 

 

 

ఆ.వె.

దూడ నరసి గోవు తోరపు వాత్సల్య

మునను జేఁపెడు పగిది నిజ మనము

న మణిఁ గాంచి నంత నా కతి స్నేహము

వొడమె హరి వరేణ్య! యడరి కరము

3.       

 

 

 

తే.గీ.

పెండ్లి సమయమ్మున నొసఁగెఁ బేర్మి తోడ

నాదు శ్వశురుండు సీతకు నార సంభ

వమ్ము మణి రత్న ముంచె శిరమ్ము నందు

శోభల వెలుంగు నిత్యము చోద్యముగను

4.       

 

 

 

కం.

జలమునఁ బుట్టిన మణి యిది

లలితమ్ముగఁ బూజితము ధరను సుజనులచే

బలరిపుఁ డొసంగె యాగము

వలనను దృప్తుఁ డయి భృశము ప్రాజ్ఞుఁడు ప్రీతిన్

5.       

 

 

 

కం.

జనకునిఁ జూచిన విధమును

గని నట్లు విదేహ విభునిఁ గమనీయముగం

గన నీ మణి నయ్యెను సౌ

మ్య! నాకు నిప్పట్టు నందు మహనీయులనున్

6.       

 

 

 

ఆ.వె.

అబల నా ప్రియసఖి యౌదల విలసిల్లు

నట్టి మణినిఁ గాంచ నార్య! యిచట

సీత నరసి నట్టి రీతి తోఁచె హృదయ

మందు వానరేంద్ర! యిందు ముఖిని

7.       

 

 

 

ఆ.వె.

ఇంక నేమి నుడివె నిభయాన సీత వి

దేహ రాజ పుత్రి తెలుపు హనుమ

వాక్య వారి తోడ వారింపు దాహము

దప్పి గొన్న వాని నప్పు వోలె

8.       

 

 

 

ఆ.వె.

ఈ జలజ మణి నిట నీక్షించితిఁ బ్రియ సీ

తాగమనము నిచట నరయ కుండ

దీని కన్న మిన్న ధీమంత! సౌమిత్రి!

దుఃఖ మున్నదె యిల దుర్భరమ్ము

9.       

 

 

 

ఆ.వె.

ఒక్క మాస మున్న నిక్కము వైదేహి

చిరపు జీవనమ్ము సీత లేక

యేను క్షణము కూడ నూన లే నసువులు

కాయ మందు మాననీయ! సౌమ్య!

10.    

 

 

 

కం.

కొని పొమ్ము నన్ను నా ప్రియఁ

గనిన ప్రదేశమున కుండగఁ దగదు క్షణమై

నను మన కిచ్చట లక్ష్మణ!  

యునికి తెలిసి నంత నింక నుండఁగ నేలా

11.    

 

 

 

కం.

అతి భీరువు నా సతి ప్రియ

నితంబిని సతము దనుజ వనితలు సుఘోరల్

సతత భయావహల నడుమ

వెతల నతివ యుండు నెట్లు విత్రాసముగన్

12.    

 

 

 

ఆ.వె.

దనుజ గణ పరివృత ధరణిజ వదనము

కాంతి హీన మౌను గాంచ నిపుడు

శార దాభ్ర సువృత చంద్రు పగిది యంధ

కార మచట సుంత దూరమైన

13.    

 

 

 

ఆ.వె.

సీత యింక నేమి చెప్పె యథార్థము

గ ననిల సుత! పలుకు కపివరేణ్య!

బ్రతుక నేర్తు నీదు భాషణమ్ములు విని

మందు గొన్న రోగి చంద మేను

14.    

 

 

 

ఆ.వె.

తీపి తీపి నుడులఁ దీయగ నేమని

నాదు భామ సీత నన్ను వీడి

యుండ నొంటిగ నట నండ లేక సుజఘ

లికె సతి హనుమ! చెపుమ నాకు

15.    

                                                         

   

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నఱువది యాఱవ సర్గము. 

 

సుందర కాండము 

సర్గము 67.

 

కం.

రఘు రాముఁ డా మహాత్ముఁ డ

లఘు విక్రముఁడు పలుక ననిల కుమారుం డం

త ఘనుండు నుడివె దైత్య గ

ణ ఘాతకుఁడు జానకి వచనము లన్నింటిన్

1.       

 

 

 

కం.

పురుషోత్తమ! సీతా సతి

గురుతర చిహ్నముగఁ జిత్రకూటము నందున్

జరిగిన ఘటనను జెప్పెను

ధరణిజ యివ్విధి యథాతథమ్ముగ నీకై

2.       

 

 

 

కం.

పవళించి సుఖమ్ముగ నిం

దువదన నీ తోడ సీత తొలి మేలుకొనం

గ వడి నెగిరి వాయస మది

యవనిజఁ జీలిచె నురమున నాశ్చర్యముగన్

3.       

 

 

 

ఆ.వె.

క్రమమున సతి యొడిని రాఘవ నిదురింప

నీవు మఱల నకట నెమ్మి వచ్చి

పక్షి దేవి నంత బాధింపఁ దొడఁగెను

భృశము శంక లేక వీడి భీతి

4.       

 

 

 

చం.

పలుమఱు నేఁగు దెంచి తమి వాయస మింతిని గీరుచుండఁగన్

నెలఁతుక నెత్తుటిం దడియ నిన్నట మేలుకొనంగఁ జేసె సీ

త లలన మాటి మాటికినిఁ దల్లడపెట్టఁ బరఘ్న! కాకి తాఁ

గలవర మంది లేపె నిను గాంత సుఖమ్ముగ నిద్ర నుండగన్

5.       

 

 

 

సీ.

వ్రణమును గాంచి యురమున మహా భాహు వలిగి బుస్సు మనుచు నగము పగిదిఁ

బలికి యెవం డిటఁ బంచ శీర్షాహితో నాడఁ దలఁచె నన్ను నరసి యంతఁ

జూచి కాకమ్మును జూచు చుండగ నన్ను రక్త సిక్త నఖ సంయుక్త పక్షి

నంత శక్ర తనయు నచటఁ జన ననిల జవమున దూరమ్ము సత్వరముగ

 

తే.గీ.

నంత ధీమంతులకు మేటి వైన నీవు

క్రూర కాకమ్ము శిక్షింపఁ గోరి మదిని

దర్భఁ గొని వేగ నీదు సంస్తరము నుండి

యేయ బ్రహ్మాస్త్రము ద్విజము నెంచి యంత

6.       

 

 

 

సీ.

అగ్నికీ లాభంపు టస్త్రము మండుచు వెన్నంటఁ గాకమ్ము వేగ యెగిరి

యంబరమ్మున వివిధాధ్వములఁ జరించె రక్షణముం గోరి ప్రాణ భీతిఁ

దండ్రియు నమరులు తాపసు లెల్లరు త్యజియింప నంతట నరగి మూడు

లోకములు దిరిగి లోకనాథుని నిన్ను శరణు వేఁడ దనికి చరణములను

 

తే.గీ.

దాని శరణాగతుని వధ్యు దయను గాచి

యస్త్ర మిది యమోఘమ్మని యడుగఁ గాకిఁ

బ్రాణ నేత్రముల నొకటి వలపటి కనుఁ

గొను మనుపు నన్ను ననెఁ గాకి వినయ మెసఁగ

7.       

 

 

 

కం.

విడువఁబడి యట్లు కాకం 

బడరి చనియె నిజ గృహమున కానందముగం

గడు భక్తి రామ! నీకు వి

భుఁడగు దశరథునకు నంత మ్రొక్కి రయమునన్

8.       

 

 

 

తే.గీ.

సత్యవంతుఁడ వస్త్ర శాస్త్ర వరుల నధి

కుండవు బలవంతుఁడవు నీ క్రూర దాన

వ తతి పై నస్త్రముల నేల వాడవు దశ

వరాత్మజ! రఘువీర! రామచంద్ర!

9.       

 

 

 

ఆ.వె.

నాగు లైన నసుర నాథులు గంధర్వు

లైన మఱి మరుత్తు లైన రాము

ని నెదిరింప సమరమున శక్య మగునె యె

ల్లరకు నెన్నఁ డైన ధరను దలఁప

10.    

 

 

 

కం.

ఆతురత యున్న నాయెడ

నీ తఱి రఘు వీరునకు నహీన బలునకున్

యాతు గణ నాథుని సమా

ఘాతమ్మున రావణు తల ఖండించు వడిన్

11.    

 

 

 

కం.

సోదరు నానతి కైకొని

సాదరముగ లక్ష్మణుండు నతిబలుఁడు ధను

ర్వేదుఁడు పరంతపుం డే

లా దయఁ గావఁ డిట నను నర వరుండు ధృతిన్

12.    

 

 

 

తే.గీ.

సురలకు నజేయు లైనను బురుష సింహు

లుభయు లని లాగ్ని నిభ తేజు లుత్తము లరి

మర్దనులు ఘనులు బలులు మాన వోత్త

ము లకట యనాదరమ్మేల ముగుద యందు

13.    

 

 

 

కం.

కన్నీటి తోడఁ బలుకఁగ

నన్నారీ మణి పలుకుల నన్నిటి విని వి

చ్ఛిన్నాంతరంగుఁడ నయితిఁ

బన్నుగఁ బలికితిఁ బ్రశాంత వచనము లంతన్

14.    

 

 

 

తే.గీ.

అన్నిట విరక్తుఁ డయ్యె నీ యాన రాముఁ

డచట దేవి! నీ శోకము నరసి నిజము

దుఃఖ మందు మునుఁగ నన్న తోరముగను

లక్ష్మణుఁడు కూడ నుండె నలమట నంత

15.    

 

 

 

కం.

కంటి నిను భాగ్య వశమునఁ

గంటఁ దడి నిడ సమయమ్ము కా దిది సుమ్మీ

తొంటి వెతల కంతము తెలి

గంటి కనియెద వచిరమ్ము కమనీయముగన్

16.    

 

 

 

కం.

వా రుభయులు బలవంతులు

ధీరులు పురు షర్షభులు త్వదీయేక్షణ సం

చార క్షత్రియ సూనులు

సేరి దహింతురు పురము నశేషము లంకన్

17.    

 

 

 

కం.

సమరమునఁ జంపి రావణు

స మంత్రి బంధు జన గణము సక్కగఁ గ్రూరున్

విమలాయత నేత్ర! నిజ పు

రమునకుఁ గొంపోవు ధ్రువము రాముఁడు నిన్నున్

18.    

 

 

 

కం.

అడిగితి సీతను భర్తకుఁ

గడుఁ బ్రీతి నొసఁగు గుఱుతును గరము విదితమున్

వడి యేఁగి యేను రామున

కిడఁ దగు దానిని ననింది తేద్ధ చరిత్రన్

19.    

 

 

 

తే.గీ.

అంత వీక్షించి దిశలెల్ల నంబరమ్ము

నుండి మణి శిరోజస్థిత మండితమ్ముఁ

దీసి యిచ్చెను నాకు నతివ మహాత్మ!  

నీకు నొసఁగంగఁ బ్రీతిని నీరజాక్ష!

20.    

 

 

 

కం.

కొని మణి నంత రఘూద్వహ!

వనితామణి నుండి భక్తిఁ బ్రణమిల్లి రయ

మ్మున నీ కీయఁగ నేను బ

యనమ్మునకుఁ ద్వరపడితిని యార్యా! నెమ్మిన్

21.    

 

 

 

తే.గీ.

నిండఁ గన్నీరు ముఖమున మెండుగాను

గద్గదము లయ్యెఁ బలుకులు గాఢముగను

జదలున కెగురఁ దమకింప బెదర మిగుల

శోక రయము మించఁగ నేలచూలి కెదను

22.    

 

 

 

తే.గీ.

సింహ సంకాశులం గపి శేఖర! వర

రామ లక్ష్మణులను సోదరప్రవరుల

నిన కుమారు నమాత్యుల నితరులం గు

శల మడుగు మందఱిని నింక సవినయముగ

23.    

 

 

 

ఆ.వె.

శోక జలధి నుండి సురుచిరముగ దాఁటు

నట్లు సేయ రాము నరసి యచట

సిద్ధపఱుపు మయ్య శీఘ్రముగను నాదు

పల్కు లెల్లఁ జెప్పి పావని! చని

24.    

 

 

 

తే.గీ.

క్షోభ పఱిచెడు నా తీవ్ర శోక రయము

చంప నెంచు దైత్యుల బెదరింపు లెల్లఁ

జేరి రాముని వినిపింపు వీర! వేగ

హ్లాద యానమ్ము నీ కగు నాంజనేయ!

25.    

 

 

 

తే.గీ.

రమణి వచనమ్ము లివి నృపరాజ సింహ!

సీత భృశ విషాదమ్మునఁ జెప్పె నచట

నెఱిఁగి పల్కితి నీ తోడ నెల్ల నిచట

నమ్ము సీత సేమము సమగ్రమ్ము రామ!

26.    

 

                                                         

   

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నఱువది యేడవ సర్గము. 

సుందర కాండము.

సర్గము 68.

 

కం.

పలికెను జానకి గౌరవ

మలవడ నాపైన నీదు ననురాగమునన్

లలితంపు భావమునఁ దిరి

గి లలన నరపుంగవ మృదు గిరలను నాతో

1.       

 

 

 

ఆ.వె.

రావణు వధియించి రాముఁ డాహవ మందు

శీఘ్ర మే విధి హరి శేఖర! కొని

పోవు నన్ను బ్రీతిఁ బురుషోత్తముం డా వి

ధమ్ము పల్కు బహు విధ వచనముల

2.       

 

 

 

కం.

ఉచితమ్మని యెంచిన నీ

వెచట నయిన గుప్త దేశ మెంచి నిలిచి నేఁ

డు చనుమ యెల్లి యుపశమిం

చి చక్కఁగ హనుమ రిపుగణ సింహస్వప్నా!

3.       

 

 

 

ఆ.వె.

నాదు శోక మెల్ల నీదు నికటమున

నుపశమింప నోపు నొక్క నిమి

మైన భాగ్య మల్ప మైన నాకిత్తఱి

మారుతాత్మజ! హరివీర ముఖ్య!

4.       

 

 

 

తే.గీ.

ఏఁగి హరివర! తిరిగి రా నిచటకు వడి

సంశయమ్ము చిత్తమునఁ బొసఁగిన నాదు

ప్రాణములకును గూడ పరఁగును జుమ్మి

సందియమ్మించు కంతయు నిందు లేదు

5.       

 

 

 

కం.

నీ కనిపింపమి నన్నీ

శోకము భృశము తపియించుఁ జుమ్మీ మఱలన్

శోకమ్మును వెంటాడుచు

శోకము లవమానిత కిటఁ జొప్పడు హనుమా!

6.       

 

 

 

కం.

నామదిఁ దొలుచుచు నున్నది

భీమపు సందేహ మొకటి వీర కపీంద్రా!

నీ మాన్య సహాయుల శా

ఖామృగ భల్లూక వీర కాయం బందున్

7.       

 

 

 

కం.

హరి భల్ల వీర సైన్యము                                 

నరాధిపాత్మజు లుభయు లనంతాంబుధి దు

స్తర మే విధమ్ము గపివర!

తరియింప సమర్థులు మదిఁ దలఁపఁగఁ దరమే

8.       

 

 

 

ఆ.వె.

భూత సంచయముల భూ వలయమ్మున

సాగరమ్ము దాఁట శక్తి యున్న

వారి మువ్వురఁ గను వారము వైనతే

యుండు నీవును ననిలుండుఁ గాదె

9.       

 

 

 

కం.

మిక్కుటముగఁ జిక్కులు గల

యిక్కార్యమ్ము ఫలియింప నెయ్యది మార్గం

బక్కట కాంతువు చెప్పుమ

చక్కటి పని వారలం దసదృశుఁడ వరయన్

10.    

 

 

 

తే.గీ.

శత్రు నాశకుండవు నీవ చాలు నిప్ప

ని సమకూర్పంగ నతి కమనీయముగను

ఘన యశఃకారణమ్మగు హనుమ నీకు

కార్య ఫల సిద్ధి తల్ప నిక్కమ్ము సుమ్మి

11.    

 

 

 

ఆ.వె.

సకల బల సమేతము కలనున దశ కం

ఠుఁ దునిమి ఘన విజయుఁడు నయి రఘు వ

రుండు రాముడంత నిండు ప్రేమఁ గొని పో

వ నిజ పురమునకు నతనికి యశము

12.    

 

 

 

తే.గీ.

రక్కసుని చేత భీతి నరణ్య మందు

నే నపహృత నైన పగిది నికృతిఁ జేసి

తగదు రామున కవ్విధముఁ గొని పోవ

నన్నయోధ్యా నగరి కని విన్నవింపు

13.    

 

 

 

కం.

వర సైన్యమ్మున లంకను

బర బల సూదనుఁడు రామ భద్రుండు నిరం

తర విధి నింపి నను గొని చ

న రయమ్మున నది యతనికి నయ మగుఁ జుమ్మీ

14.    

 

 

 

ఆ.వె.

ఆజి శూరునకు మహాత్మున కెవ్విధి

యుక్త మౌను విక్ర మోత్తమునకు

రాఘవునకు ననిఁ బరాక్రమింపఁ గపీంద్ర!

చేయు మవ్విధిఁ గడు శీఘ్రముగను

15.    

 

 

 

ఆ.వె.

అర్థ వంతపు వినయాన్వితపు సహేతు

కంపు వాక్యములను నింపుకొలుప

సీత పలుకఁగ విని శేష వాక్యము లెల్లఁ

బల్కితి బదులు భామ కంత

16.    

 

 

 

తే.గీ.

ప్లవగ వరుఁడు హర్యృక్ష సైన్య వర విభుఁడు

ఘనుఁడు సుగ్రీవుఁ డట నీదు కారణమున

దేవి! కృత నిశ్చయుఁడు సత్వ తేజముల వ

రుండు రాఘవేంద్ర వర సఖుం డతండు

17.    

 

 

 

కం.

సీత! మనో వేగాధికు

లాతత విక్రమ గుణులు మహా బలవంతుల్

కోఁతులు నిరంతర మెదురు

చూతురు పాటింప వేగ సుగ్రీ వాజ్ఞన్

18.    

 

 

 

తే.గీ.

అడ్డు లేదు చరింప నీ హరి వరులకు

నూర్ధ్వ గతి నైనఁ బృథివీ తలోగ్ర గతిని

నైన మఱి ధో తల గతి నైనఁ గష్ట

సాధ్య కర్మ నిచయము లొసంగ వలపు

19.    

 

 

 

కం.

నగ పారావార సమే

త గహ్వరీ వలయ మెల్లఁ దారాధ్వమునన్

నగ చారులు పల్మరు లిం

పుగఁ జేసిరి భ్రమణము వడిఁ బ్రోత్సాహముతోన్

20.    

 

 

 

ఆ.వె.

నన్ను మించి నట్టి నన్ను దూఁగం గల

యట్టి వారు పెక్కు రక్కపి విభుఁ

జెంతఁ గలరు లేరు చేవ నాకంటె న

ల్పులు హరి గణ మందుఁ గలయ నరయ

21.    

 

 

 

కం.

నేన యిటఁ జేర నుడువం

గా నేల మహా బలు నిఁక ననుప రిల వీ

రానీకమున వరేణ్యులఁ

గానఁగ నితరులనె కాని కార్య తతులకున్

22.    

 

 

 

కం.

పరితాప మింకఁ జాలును

బరిత్యజింపుము వగపును బన్నుగ దేవీ!

హరి వీరు లొక్క పెట్టునఁ

బురవర మీ లంకఁ జుట్టుముట్టుదు రింకన్

23.    

 

 

 

కం.

నరసింహులు వా రిరువురు

నురు బలు రుదెంతు రిటకు నుదయించెడు భా

స్కర శశధరు లేమొ యనఁగ

స్థిరముగ నా వీపున నిలిచి యతి రయమునన్

24.    

 

 

 

ఉ.

కాంతువు రాఘ వేంద్రుని సుకార్య వినిశ్చయు ధన్వి సత్తముం

గాంతువు వీర లక్ష్మణునిఁ గాలిడ ముంగిలి లంక లోపలం

గాంతువు వానరేంద్రుల నఖమ్ములు దంతము లాయుధమ్ములై

వింతఁ జెలంగ లంక ధృతి వీర వరేణ్యుల సింహ తుల్యులన్

25.    

 

 

 

తే.గీ.

కాంచెదవు మేఘ సన్నిభ కాయ యూధ

వరుల లంకా మలయ సాను వర తలముల

వానర ప్రవరుల నారవమ్ముల ననిఁ

జెలఁగు వారినిఁ బెక్కండ్ర సీత వేగ

26.    

 

 

 

కం.

ముగియింప రాఘవుఁడు చ

క్కఁగ వనవాసము విపక్ష గణ నాశకు నో

ముగుద యయోధ్యా పుర విభు

నిఁ గాంతు వభిషిక్తుఁ దోడు నీ వుండంగన్

27.    

 

 

 

ఆ.వె.

శుభములు ప్రియదములు సుందర భాషణ

ములు వచింప నేను గలవరమ్ము

సెలఁగిన నవనిజకుఁ జిత్తములో నీ వి

షాద మరసి సీత శాంతిఁ బొందె

28.    

 

 

 

మ.

గుణ సంసిద్ధ సదా విరాజిత మహా కోదండ హస్తాంబుజా!

గుణ సంధాన పరాక్రమ ద్యుతి మహాకోదండ విధ్వంసకా! 

క్షణి కోద్రేక మహీసు రార్చిత మహేష్వాస ప్రభా గ్రాహకా!  

రణ విచ్ఛేదిత దైత్య సంచయ! విభూ! రామా! నరేంద్రోత్తమా!

29.    

 

 

 

మాలిని.

నత జన!నిజ మాత్రానందసంధాయకాగ్ర్యా!

సతత ఋత వచోనిష్ఠా! సురాధ్యక్ష పూజ్యా!   

తత వినుత లసత్కోదండరామా!ఘనాంగా!

హత నిజ రిపు సందోహా! సదానంద చిత్తా!

30.    

 

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున సుందర కాండ మందు నఱువది యెనిమిదవ సర్గము.

శ్రీమదాంధ్ర రామాయణము నందు సుందర కాండము సమాప్తము.   

 

 

 

 

 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి