26, ఆగస్టు 2026, బుధవారం

1. శ్రీమదాంధ్ర రామాయణము_ బాల కాండము - 2

 బాలకాండము

సర్గము 17.

 

 

 

పద్మసంభవుని పంపున నమ రాదులు తనూజులుగఁ గామరూపులు బలసంపన్నులు నైన వానర భల్లూక వర వ్రాతమును విష్ణు సహాయార్థము సృజించుట.

 

 

 

 

కం.

తా నట్టులఁ బుత్రత్వం

బూన ధరణి పతికి విష్ణు వుత్సాహమునన్

మానుగ స్వయంభువుఁ డనియె

నా నిర్జర గణముతో మహానందముగన్

1.      

 

 

 

కం.

మన యెల్లరి హిత మారయు

వనజాక్షుఁడు దత్త సత్య వాక్శూరునికిం

గనుఁ డిల నండగ నుండఁగఁ

దనూజులను గామరూప ధారుల బలులన్

2.      

 

 

 

ఉ.

శూరుల వాన రాకృతుల సూనుల మాయ లెఱుంగు వారలన్

మారుత వేగ కేశవ సమాన పరాక్రమ దివ్య కాయులం

బేరు టుపాయులన్ నయ వివేకుల ధీనిధు లస్త్ర వేదులన్

నారుల నప్సరో౽బలల నాక సుగాయను లందుఁ బొందుఁడీ

3.      

 

 

 

కం.

దురతిక్రములఁ గుమారు ల

మర సన్నిభుల నిఁక మీ సమానుల ధాత్రిం

బరమానందముగఁ గనుఁడు

సురపుంగవు లార మీరు సురుచిర లీలన్

4.      

 

 

 

కం.

మున్న సృజించితి ఋక్షముఁ

బన్నుగ నల జాంబవంతు బల సంపన్నుం

జెన్నుగ నేఁ దుమ్మినఁ దాఁ

గ్రన్ననఁ బడె నోటి నుండి కమనీయముగన్

5.      

 

 

 

ఆ.వె.

నలువ శాసనమ్ము నయముగ శిరసావ

హించి నిర్జరేంద్రు లంచితముగఁ

బుత్రులఁ గపి రూప మూర్తులను సృజించి

రెల్ల రంత మనము లుల్లసిల్ల

6.      

 

 

 

తే.గీ.

సిద్ధులు మహాత్ములు ఋషులు నిద్ధ చరిత

సర్ప విద్యాధ రాదులు చారణులును

వీర నందనులఁ గనిరి ప్రీతి మీఱ

వన విహార విలాసుల వానరులను

7.      

 

 

 

మ.

జననం బిచ్చెను శక్ర సన్నిభ మహా సత్వుండు నా వాలికిన్

ఘనుఁ డౌ యింద్రుఁడు వాన రేంద్రునకు సంగ్రామోగ్ర సంచారికిన్

జనియింపం గనె వీర విక్రముని సచ్చారిత్ర సుగ్రీవునిన్

ఘన తాపాంశు యుతుండు భాస్కరుఁడు విఖ్యాతున్ మహావీరునిన్

8.      

 

 

 

తరళము.

సుర పురోహితుఁ డా బృహస్పతి శూరుఁ దార వరాఖ్యునిన్

ధర సృజెంచె మహా ప్లవంగు లతామృ గావలి నుత్తముం

బరఁగెఁ బుత్రుఁడు గంధమాదన భాసురాఖ్యఁ గుబేరుఁడే

గురువు కాఁగను విశ్వకర్మకు గొప్ప పట్టి నలుం డనన్

9.      

 

 

 

కం.

అనల కుమారుఁడు నీలుఁడు

కన నన లోగ్రప్రభా నికాశుఁడు ఘనుఁ డై

మనుఁ దేజో యశముల బల

మున వానర వీరు లందు మూరి చరించున్

10.    

 

 

 

తే.గీ.

అంద మను సంపదఁ జెలంగు నశ్వినీ త

నయులు మైందుని ద్వివిదుఁ దనయుల రూప

సమ్మతుల సృజియించిరి శౌర్య విక్ర

మ ఘన సంపన్ను లిద్దఱ మర్కటముల

11.    

 

 

 

కం.

వరుణుఁడు సుషేణుఁ డను వా

నరర్షభున కిచ్చె ధర జననము ముదముగన్

శరభునిఁ బర్జన్యుఁడు వా

నర పుంగవుని సృజియించె నందను నెలమిన్

12.    

 

 

 

మ.

జననం బిచ్చెను వాయు వంత నిజ వజ్రస్కంధ సూనుండు నా

హనుమన్నామ మహాకపీంద్రునకు హర్యాధిక్య మేధావికిన్

వినతానందన తుల్య వేగునకు సంప్రీతిన్ సుసాధ్వ్యంజనా

తనయత్వమ్మున వర్ధిలంగఁ గన నిద్ధాత్రీప్రసిద్ధిన్ రహిన్

13.    

 

 

 

కం.

వారింకను వే వేలుగ

వీరులు కపులు దశకంఠు వే విధ్వంసం

బారయ సృజియింపఁ బడిరి

ధారుణి బల కామరూప ధారులు ఘనులున్

14.    

 

 

 

తే.గీ.

కోతు లెలుఁగులు గోపుచ్చ కోటులు బల

వంతులు త్వరితమ్ముగ వపుష్మంతులు గన

మేరు మందర సన్నిభ ధీర మతులు

పుడమి నుద్భవిల్లిరి యంత ముమ్మరముగ

15.    

 

 

 

తే.గీ.

ఎట్టి యెట్టి రూపమ్ములు నెట్టి యెట్టి

వేషములు నింక నెట్టెట్టి విక్రమ సురు

లట్టి యట్టి కుమారులు వుట్టి రంత

వేఱు వేఱుగ వారికి వీర వరులు

16.    

 

 

 

ఆ.వె.

కొంద ఱధిక బలులు కోతులు పుట్టిరి

కొండముచ్చులకును గొంద ఱింకఁ

గిన్నరులకు మఱియుఁ బన్నుగ నెలుఁగుబం

టులకు భూతలమున నెలమి మీఱ

17.    

 

 

 

మధ్యాక్కర.

అమరౌక గంధర్వ భుజగ యక్ష విద్యాధర సిద్ధ

విమల కింపురుషర్షి నాగబృందము లింపుగ నాగ

రమణుల గంధర్వ కన్యలను నప్సరసల యందును సు

ర మహిళా గాయను లం దరసిరి వనచరుల సుతుల

18.    

 

 

 

తే.గీ.

కామ రూపు లనేకులు గమను లిష్ట

రీతి వని సింహ శార్దూల లీల దర్ప

వీర్య సంపన్నులు ఘనులు విక్రమమ్ము

నందు వానరేంద్రులు భువి నలరు చుండ్రు

19.    

 

 

 

ఆ.వె.

శిలలు దరులు వారి చేతి యాయుధములు

గోళ్లుఁ బళ్లు నగును గొప్ప శస్త్ర

ములు సెలంగి వాడి మొనలతో మెఱయంగ

నస్త్ర వేదు లెల్ల రధికముగను

20.   

 

 

 

తే.గీ.

కుదుపుదురు దొడ్డ కొండలు ఘోరముగను

విఱిచెద రవలీలం గేల వృక్షములను

క్షోభ పెట్టుదు రంబోధిఁ గోపగించి

వాన రేంద్రులు విహరించి కోన లందు

21.    

 

 

 

తే.గీ.

చీల్ప ధరఁ గాళ్ళ శక్తులు దాల్ప కోర్మి

దుమికెదరు పంత ముప్పొంగఁ దోయరాశిఁ

జేరెదరు గెంతి విన్వీధిఁ జెల్వముగను

బట్టెదరు మేఘజాలమ్ము నిట్టె యెగిరి

22.   

 

 

 

ఆ.వె.

మసలి యడవి లోన మత్త కుంజరములఁ

బట్టి యుంతు రడరి కట్టెదుటను

భీకరముగ నార్చి విహగ సంఘమ్ముల

నేలఁ గూల్తు రిట్టె నివ్వటిల్లి

23.   

 

 

 

కం.

ఈ విధ మలరెడు వారిని

వేవేల హరుల సృజించె విశ్వము నందున్

దేవాలి కామ రూపుల

నావేశము పొంగ హర్ష మంది కరమ్మున్

24.   

 

 

 

కం.

హరి యూధమ్ముల వీరలు

హరి నాయక వర్గమందు నగ్రాధిపులై

హరి యూధ పేశులు సృజిం

చిరి యన్య హరిప్రవరులఁ జిత్తము లలరన్

25.   

 

 

 

తే.గీ.

కొంద ఱుండిరి చక్కటి కొండ నెత్త

ముల వసించుచు భల్లూకములను గూడి

కొంద ఱింక కాననములఁ గొండ లందు

వేలు వేలు వివిధములౌ నేల లందు

26.   

 

 

 

మ.

ధర శక్రాత్మజ సూర్య నందనులు భ్రాతల్ వాలి సుగ్రీవులే

హరి వీరుల్ నల నీల వాయుజ ము ఖాన్యారణ్య సంచారులుం

బరమోత్సాహము తోడ వారి దరి సంవాసమ్ము సేకూరఁగన్

నిరతం బుందురు కొల్చు చింపుగను సుస్నేహమ్ము వర్ధిల్లఁగన్

27.   

 

 

 

కం.

బలమున గరుడునిఁ బోలుచు

నిల వారు మృగేంద్ర పన్నగేంద్ర వ్యాళా

దుల నొప్పించుచు దర్ప

మ్మలరఁ జరింత్రు ఘన నిపుణు లాహవ మందున్

28.   

 

 

 

తే.గీ.

ఋక్ష గోపుచ్ఛ వానర రక్షకుండు

వాలి విపుల పరాక్రమ బాహు బలుఁడు

వారి నెల్లరఁ బాలించు వానరుండు

దీర్ఘబాహువు దుర్జయ ధీర విభుఁడు

29.   

 

 

 

కం.

వివి ధాకార విలసితులు

వివిధ వ్యంజన సహితులు వివిధ గుణయుతుల్

భువి స వన గిరి మహోదధి

సువికీర్ణు లయిరి కపికుల శూరవరేణ్యుల్

30.   

 

 

 

తే.గీ.

నిండినది భూమి మేఘాగ నిభులు ఘనులు

వాన రానీక పాలక వర్గ విభులు

రామ సాహాయ్య హేతు కార్య నిచ యార్థ

మడరి భీమ శరీరులు నాక్రమింప

31.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందుఁ బదునేడవ సర్గము.

 

 

బాలకాండము

సర్గము 18.

 

 

 

యాగ సమాప్తమున రాజులు ఋష్యశృంగాది మునులు స్వగృహముల కేఁగ దశరథుఁడు రాణులతోఁ  గూడి యయోధ్యా నగరము ప్రవేశించుట, రామ లక్ష్మణ భరత శత్రుఘ్న కుమార జననము, విద్యాభ్యాసము, విశ్వామిత్ర మహర్షి యాగమము. 

 

 

 

 

కం.

మహితాత్మ నృపతి క్రతువులు

స హర్షము ముగియ నమరులు చని రంత గ్రహిం

చి హవిర్భాగమ్ములు నిజ

గృహమ్ములకు వచ్చి నట్లు హృష్టాత్ములునై

1.      

 

 

 

కం.

దారాగణ సహితమ్ముగ

నా రాజు స భృత్య వాహ నానీకముగం

జేరె నిజ పురము దీక్ష న

వారితముగఁ బూర్తిచేసి పరమాసక్తిన్

2.      

 

 

 

కం.

పూజింపఁబడి నృపతిచే

రాజు లుచిత రీతి నంతఁ బ్రణమిలి మునికిం 

దేజమ్ము లలర వా రా

యా జగముల కేఁగిరి వడి నానందముగన్

3.      

 

 

 

ఆ.వె.

భూధవులు సను నెడఁ బురము నుండి నిజ ని

లయములకు నరయ బలములు వారి

వెల్ల మెఱసెను గడు తెల్లఁగ సానంద

ముండి చాగ వెలుఁగు చుండి కరము

4.      

 

 

 

కం.

చన రాజు లెల్లరు ముద

మ్మున సమ్మానించి రాజు భూసుర వరులన్

ఘనముగఁ బురము ప్రవేశిం

చెను శ్రీమంతుండు నంతఁ జిత్తం బలరన్

5.      

 

 

 

తే.గీ.

శాంతతో ఋష్యశృంగుఁడు సత్కృతుండు

నై భృశం బనుచర నిచయమ్ము తోడ

రోమపాదుఁడు విజ్ఞుఁడు భూమిధవుఁడు

వెంట రాఁ బయనం బయ్యె జంట యలర

6.      

 

 

 

తే.గీ.

వీడుకొలిపి సర్వజనుల ఱేఁడు నిండు

మనసుతో నంతఁ గడపుచుండెను దినమ్ము

లు సురుచిర లీలఁ జింతించుచు సుత జన్మ

సంభవమ్మును నిత్యము సంభ్రమముగ

7.      

 

 

 

మ.

ఋతువుల్  సాగఁగ నాఱు రాఘవు మనం బింపారఁ జైత్రంపు శు

ద్ధ తిథిం సన్నవమిం జెలంగ గ్రహముల్  దా మైదు స్వోచ్ఛస్థితిన్

నుత నక్షత్రమునం బునర్వసున విన్నూత్నప్రభా కాయుఁడై

వ్రత సాఫల్య మనంగ నంతఁ గలిగెన్ రాముండు కౌసల్యకున్

8.      

 

 

 

తే.గీ.

కర్కటక లగ్న మందుఁ బ్రకటపు గతి వె

లసి బృహస్పతి విమల చంద్ర సహితమ్ము

నుదయ మొందు చుండఁగ రాముఁ డుర్వి సకల

భువన వందితుఁడు జగద్విభుఁడు జనించె

9.      

 

 

 

తే.గీ.

సద్గుణాన్వితుఁ డిక్ష్వాకు సత్కులప్ర

వర్ధనుండు నదృష్ట విష్ణ్వర్ధ ఘన భు

జుండు రక్తాక్ష రక్తోష్ఠ మండితుండు

దుందుభిస్వనుండు తొలి సుతుండు వుట్టె

10.    

 

 

 

కం.

వెలిఁగె సుతుని తేజమ్మున

నల కౌసల్య యమితముగ నదితి వెలిఁగి న

ట్టుల సకల దేవ నిచయ

మ్ముల కధిపతి వజ్రపాణి మూరఁగఁ జెంతన్

11.    

 

 

 

చం.

భరతుఁడు సత్య విక్రముఁడు పంకజ నాభ చతుర్ధ భాగుఁడుం

బరఁగఁగ సర్వ సద్గుణ విభాసితుఁడై భువి పుష్యమీభ మం

దరయఁగ మీన లగ్నమున నంత జనించె సధీద కైకకుం

గర మనురక్తిఁ గేకయప కన్యకు నంతఁ బ్రసన్న చిత్తుఁడున్

12.    

 

 

 

మ.

రుచి రాకారులు లక్ష్మణుండు మఱి శత్రుఘ్నుండు వీర్యాధికుల్

నిచితంబై సగ భాగ మా హరిది కన్పింపంగ నస్త్రంబులం

దుచితోద్దండ విశారదుల్ ఘనులు దివ్యోద్భావు లాశ్లేష యం

ద చలన్నేత్ర సుమిత్రకుం గులిర మందాదిత్యుఁ డేపారఁగన్

13.    

 

 

 

తే.గీ.

రూప సామ్యులు గుణులు పుత్రులు నలువురు

భాద్రయుగ్మ సదృశ్యులు భాతు లందుఁ

బుట్టిరి మహాత్ము లా యజు పట్టి కెలమి

వరుసగ దశరథున కట్లు పార్థివునకు

14.    

 

 

 

మధ్యాక్కర.

పాడిరి గంధర్వు లలర స్వర్గ వధువు లాడి రెలమి

వీడక పుష్ప వర్షమ్ము విందు సేసె నభము నుండి

యోడక దుందుభి ధ్వనులు నుల్లమ్ము లలరంగ మ్రోఁగె

వేడుక లుప్పొంగె నగర వీథుల జనులెల్ల మూఁగ

15.    

 

 

 

తే.గీ.

దారు లవి క్రిక్కిరిసె జన తతులు సెలఁగ

నటులు నర్తకు లచ్చట నాట్య మాడ

గాయనులు పాడ వాద్య సంఘాతములను

గూడి రత్నభూషితు లయి కూర్మి మీఱ

16.    

 

 

 

ఆ.వె.

ఈయఁ దగిన వాని నిడె వంది మాగధ

సూతులకును రాజు సురుచిరముగ

బ్రాహ్మణుల కొసంగె వందలు వందలు

విత్త గో ధనమ్ము లుత్తమములు

17.    

 

 

 

శా.

రా నేకాదశ వాసరమ్ము దగఁ బేళ్లం బెట్టి రుత్సాహులై

తా నా జ్యేష్ఠునిఁ బిల్చెరాముఁ డని యంతం బ్రీతినిం గేకయీ

సూనుం బిల్చె వసిష్ఠుఁడే భరతు డంచుం దత్సుమిత్రాత్మ స

త్సూనశ్రేష్ఠులఁ బిల్చె లక్ష్మణుఁడు శత్రుఘ్నుండు నా హర్షియై

18.    

 

 

 

తే.గీ.

అన్నదానము సేసె బ్రాహ్మణుల కింకఁ

బౌరులకు జానపదులకుఁ బార్థివుండు

రత్నరాసు లొసఁగె ద్విజులకుఁ దనయుల

సర్వ జన్మ కార్యములను జరపె వరుస

19.    

 

 

 

కం.

నాయన కొసంగు హర్షము

నా యగ్రజుఁడు పడగ వలె నత్యంతముగా

నాయె నతండు ప్రియతముం

డాయతముగ భూతరాశి కబ్జజు భంగిన్

20.   

 

 

 

ఉ.

అందఱు వేద పారగులు నందఱు శూరులు భ్రాత లెల్లఁ దా

రందఱు గాంత్రు లోకహిత మందఱు జ్ఞానులు సద్గుణాబ్ధు లే

చందము నందు నిర్మలుఁడు సత్యపరాక్రమ శోభి రాముఁడే

యందఱి కిష్టుఁ డిజ్జగతి నచ్చపుఁ జంద్రుని భంగి మిన్నఁగన్

21.    

 

 

 

కం.

నిపుణుం డయ్యెను రాముఁడు

విపుల గజాశ్వ రథ యాన విద్యల నెల్లన్

సుపరిశ్రమ వింటినిఁ గల

దు పిత్రుపాసన నొనర్చు దోరము సతమున్

22.   

 

 

 

తే.గీ.

లక్షణ గణ సుసంపన్న లక్ష్మణుండు

లక్ష్మివర్ధనుండు నిజ బాల్యమ్ము నుండి

రాము నగ్రజు జగదభి రాము సేరి

నిత్య మర్చించు స్నేహమ్ము నెగడు చుండ

23.   

 

 

 

తే.గీ.

ప్రీతి గూర్చుచు సంతత మాతతము శ

రీర సహితమ్ము నన్నకు గారవమున

లక్ష్మి సంపన్నుఁడే బహిః ప్రాణమనఁగ

సంచరించు ముదమ్మున మించ భక్తి

24.   

 

 

 

ఆ.వె.

లక్ష్మణుండు లేక రాముండు నిదురింప

నేరఁ డెన్నఁ డేని గారవమునఁ

బెట్ట నన్న మతఁడు ముట్టఁడు మృష్టాన్న

మైన లేక యున్న ననుజ వరుఁడు

25.   

 

 

 

కం.

ఏఁగ హయ మెక్కి రాముఁడు

వేగమ వేటకు నతండు వెన్నంటుచు వే

వేగ సెలంగి ధనువుతోఁ

జాగు సుమిత్రా సుతుండు సంతోషముగన్

26.   

 

 

 

తే.గీ.

మిన్న ప్రాణము కన్నను నన్న భరతు

న కెద లక్ష్మ ణానుజుఁడు గుణగణ సంయు

తుండు శత్రుఘ్నుఁ డట్లగ్రజుండు భరతుఁ

డితనికిఁ బ్రియతముం డగు నెడఁద సతము

27.   

 

 

 

కం.

ప్రీతిం జెందె దశరథుం

డా తనయుల నల్వురను మహాభాగుల ధా

త్రీతల ధవుఁ డరసి కమల

జాతుఁ డమరు లందు భంగిఁ జారుతరముగన్

28.   

 

 

 

ఉ.

తెలివరు లింత సిగ్గరులు తేజు సెలంగెడు వారు మంచి వా

రలు మఱి వన్నె కెక్కిరి కరమ్మును ముందును జూచు వారలుం

దెలిసిన వారు పెక్కులును దీరుగఁ బట్టులఁ గాంచి తండ్రి దా

వెలిఁగెను సంతసం బడర వేల్పుల పెద్ద వెలింగి నట్టులన్

29.   

 

 

 

తే.గీ.

వారును బురుష వ్యాఘ్రులు మూరి వేద

ములు చదువుచు సంతసమున నలరుచుఁ పితృ

సేవ లందు నిష్ణాతులై చెలఁగి రెల్ల

రును ధనుర్విద్య లందు సురుచిర రీతి

30.   

 

 

 

కం.

తలఁపం దొడఁగె వివాహ

మ్ములు సేయ సుతులకు నింక భూనాథుం డొ

జ్జలు నిజ బంధు జనులతోఁ

జలుపుచు మంతనము లంతఁ జక్కఁగఁ బ్రీతిన్

31.    

 

 

 

కం.

నిజ మంత్రుల మధ్య నిలువ

నజసుత ధర్మాత్ముఁడు తగ నాలోచనలన్

విజయమ్ముచేసె నా గా

ధిజ విశ్వామిత్రుఁ డట కతిధియై ప్రీతిన్

32.   

 

 

 

కం.

ఆరసి తాఁ బలికె నిటులు

ద్వారపతులఁ గౌశికుండు వడి గాధిజుఁడే

భూరమణ దర్శనార్థము

చేరె నని వచింపుఁడు చని శీఘ్రమ పతికిన్

33.   

 

 

 

చం.

భయ మిఁక సంభ్రమ మ్మొదవ ద్వార సురక్షకు లెల్ల నాలకిం

చి యతని భాషణమ్ములను శీఘ్రమ పర్వులు వెట్టి భూధ వా

లయమును జేరి కౌశికుని రాకను గాధిజు భాషణమ్ములన్

రయముగఁ దెల్పి రర్క కుల రాణ్మృగరాజున కంత నమ్రులై

34.   

 

 

 

చం.

త్వర నెదురేఁగె నా దశరథక్షితిపుం డన ద్వారపాలకుల్

గిర లవి యాలకించి గమకించి పురోధనుతో శచీధవుం

డరసి విధాత నేఁగు విధి హర్షమునం జని దీప్త కాయ మౌ

ని రుచిర సువ్రతుం గని వినీతుఁడు నర్ఘ్య మొసంగె భక్తినిన్

35.   

 

 

 

కం.

కొని యర్ఘ్యమ్ము మునీంద్రుం

డనునయముగ శాస్త్రదృష్టి నరసి దశరథుం

గని నరనాథునిఁ దా నడి

గెను గుశలము నవ్యయమ్ము గిర లలరంగన్

36.   

 

 

 

చం.

కుశలమె బందుమిత్రులును గోశము పౌరులు గ్రామవాసులున్ 

భృశముగ నమ్రులే సరస వెల్గెడి రాజులు నోడిరే రిపుల్

విశదముగా నొనర్తువె భువిన్ సుర మానుష కార్యకోటులన్

దశరథ! రక్తియుక్తులను ధర్మము నూని నరేంద్రపుంగవా!

37.   

 

 

38.   

కం.

మునిపుంగవుని వసిష్ఠుని

ఘన తాపస శేఖరులను గదిసి కుశలముం

దనరి యడిగెఁ దగు న్యాయ

మ్మును బాటించి యట గాధిపుత్రుం డెలమిన్

39.   

 

 

 

ఆ.వె.

రాజగృహము నందు రమణీయముగ యథో

చితము కూర్చొనిరి నృపతి వరుండు

సేయ బూజ లంది హాయిగ ఱేఁ డంత

హర్షమునఁ బలికె మహర్షి తోడ

40.   

 

 

 

శా.

పీయూషమ్మిల నంది నట్లు పొడి పెన్బీళ్లందు వర్షంబనన్

జాయాగర్భ మపుత్రుఁ డారసి నటుల్ సక్కంగ నష్టార్థుఁడే

యా యర్థమ్మును బొంది నట్టులును గార్యప్రాప్తి హర్షార్ణవ

ప్రాయం బట్టుల నెంతు మౌనివర విశ్వామిత్ర మీ రాకనున్

41.    

 

 

 

తే.గీ.

స్వాగతమ్ము మునీంద్ర తపమ్మున మును         

వెల్గ రాజర్షివై పేర్మిఁ బిదపఁ బొంది

తీవు బ్రహ్మర్షి పదము నహీన జప త

పో నిరతుఁడవై నా కతి పూజ్యుఁడ విట

42.   

 

 

 

తే.గీ.

ఏది యెవ్విధి నీ యిచ్ఛ నేను జేయఁ

బూజ్య! దొరికితే కొనఁ బాత్ర పూరుషుఁడవు

పూర్ణ సఫలంబ నాజన్మ ముదము వొడమె

సుప్రభాత మయ్యె నిశను విప్రవర్య!  

43.   

 

 

 

తే.గీ.

అద్భుతమ్ము మీ రాక పుణ్యతమ మయ్యె

నా గృహమ్ము మీ సందర్శనమునఁ దీర్థ

యాత్ర ఫలము లభించె సత్పాత్రముగను

సంయమీశ్వర నాదు వేశ్మమ్ము నంద

44.   

 

 

 

కం.

వినిపింపుఁడు మీ వచ్చిన

పనిఁ దగ ధన్యుఁడను జేయ భవ దిష్టంబౌ

ఘన కార్యమ్మును హర్ష

మ్మున వృద్ధిం జెందఁ గాంతు మునిగణ పూజ్యా!

45.   

 

 

 

కం.

వే తర్కింపఁ దగదు పని

నో తాపసవర యొనర్తు నుత్సాహముగం

బ్రీతి నశేషము మిమ్మున్

భూతలమున నాదు దైవముగ భావింతున్   

46.   

 

 

 

తే.గీ.

కలిగినది మహాభ్యుదయము కౌశిక! మిముఁ

గాంచ నాకు ద్విజవరేంద్ర! కారణంబ

యో దయామయ! మీ రాక నాదు మేటి

ధర్మ వృద్ధికిఁ జింతింపఁ దాపసేంద్ర!

47.   

 

 

 

కం.

విన సొంపై నిజ హృదయ

మ్మున కత్యంతమ్ము హర్షము నొసంగు మహా

త్ముని పల్కులు వినఁగఁ బరమ

మునికిఁ గలిగె సంతసమ్ము భూరిగ నంతన్

48.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందుఁ బదునెనిమిదవ సర్గము.

 

బాలకాండము

సర్గము 19.

 

 

 

విశ్వామిత్ర మహర్షి యాగ రక్షణార్థము రామునిఁ దనతోఁ బంపు మని దశరథ మహారాజు నడుగ నాతఁడు విషాదము నొందుట. 

 

 

 

 

కం.

పులకాంకురుఁడై తేజో

విలసిత సన్ముని వృషభుఁడు విశ్వామిత్రుం

డలరి సవిస్తర వాక్య

మ్ములు రాజేంద్రుం డన విని మూరి వచించెన్

1.      

 

 

 

కం.

భూవర! సత్కుల జాతా!

నీవ తగుదు వన్యుఁ డిట్లు నేరఁ డనంగం

బావన వసిష్ఠు శిష్యుఁడ

వీ వితరమ్ము లగు బలుకు లేల విన నగున్

2.      

 

 

 

కం.

నా మది నిల్చిన కార్యము

భూమీశ్వర! చేయ నెంచుము నిలుపు మెలమిన్

నీ మాటను సత్యవ్రత!

యేమఱకయె రాజసింహ! యిద్ధచరిత్రా!

3.      

 

 

 

కం.

వ్రత మొక్కటి పురుషర్షభ!

రతి యొక్క ఫలమ్ము నందు రంజిల నే ని

ల్చితి నిష్ఠఁ జల్పుచు వనిఁ జె

ఱతు రిష్టాకారు లది తఱ చిరువు రసురుల్

4.      

 

 

 

కం.

అల మారీచ సుబాహులు

బలులు సుశిక్షితులు కదియ వ్రత పూర్తి యటం

బలు గతులఁ జేయ వేదినిఁ

బల లాసృక్కులు కురియుచు బాధింతు రహో

5.      

 

 

 

కం.

క్రతు భంగ మరసి యలసి వి

గతంపు టుత్సాహమునను గాంచఁగ నిను నే

నతి శీఘ్రమ్ముగ నరుదెం

చితి నిట కిక్ష్వాకు రాజశేఖర! వినుమా

6.      

 

 

 

కం.

కోపింప బుద్ధి పుట్టదు

భూపవర! మనమ్ము నందు మూర్ఖుని పైనం

బాపపుఁ గార్యము లారసి

శాపము నీయం దలంప సద్గుణ రాశీ!

7.      

 

 

 

కం.

నిత్యము కూఁకట్ల నలరు

సత్య వచశ్శూరు నీదు సత్పుత్రుని నా

దిత్య నిభు ననుపు రాముని

సత్య పరాక్రముని జ్యేష్టు క్ష్మాపతి! నాతో

8.      

 

 

 

కం.

ఇతఁడె సమర్థుండు నృపా!

దితిజుల వధియింప స్వీయ తేజమ్మున నా

దు తగు పరిరక్షణమ్మున

నతి దారుణ కర్ముల వసుధాధిప భృశమున్

9.      

 

 

 

కం.

సకల శ్రేయస్సుల నిత

ని కిత్తు నిశ్శంక రాజ నేను బహుగతుల్

సుకరమ్ముగ విమల ఖ్యా

తి కలుగు ముల్లోకముల విదితుఁడై వెలుఁగున్

10.    

 

 

 

కం.

వా రుభయు లరసి రామునిఁ

బోరున నెదిరించి నిల్వ ముందు నశక్తుల్

లే రన్యులు నెందేనియు

వారిఁ గెలువ రాజ! రామభద్రుఁడు తక్కన్

11.    

 

 

 

కం.

బల దర్పిత పాపు లిరువు

రిలఁ గాలవ శాసురేంద్రు లెవ్విధి నైనం

దలఁప సరి రారు దినకర

కుల రత్నము రామునకును గోత్రాధీశా!

12.    

 

 

 

కం.

పుత్రప్రేమ కతమ్మునఁ

బాత్రము కా దుత్తలమ్ము వడయ నరేంద్రా!

చిత్రము కాదిది దుష్ట చ

రిత్రులు మరణింతు రొట్టు లీల దశరథా!

13.    

 

 

 

కం.

మానిత సత్యపరాక్రము

నే నెఱుఁగుదు నిమ్మహాత్ము నీ సుతు రాముం

దా నెఱుఁగు వశిష్ఠ మహా

మౌని వర తపోధనులును మనుజాధీశా!

14.    

 

 

 

కం.

ఇల ధర్మలాభము యశము

విలసిల్లఁ దలంతు వేని విస్తారముగం

గలవర మందక డెందం

బలర నొసఁగ నొప్పునాకు నవనిప! రామున్

15.    

 

 

 

కం.

నిజ మంత్రులును వసిష్ఠ ము

ఖ జనులు దగ నిచ్చి రేని కడఁగి యనుజ్ఞన్

నిజ పుత్రు నొసఁగ ధరణీ

శ! జయమ్మగు నీకు నిమ్ము శంకింపకయే

16.    

 

 

 

కం.

ఆత్ర మొకింత పడక ప్రియ

పాత్రుండు నిరంతరమ్ము పార్థివముఖ్యా!

పుత్రుని జన్నమునకు దశ

రాత్రుల కొఱ కిమ్ము రాము రాజీవాక్షున్

17.    

 

 

 

కం.

అవ్విధిఁ జేయుమ క్రతువున

కెవ్విధి నాలస్య మింత యేర్పడ కుండన్

నివ్వటిలునొ శోకింపకు

మివ్వసుధఁ జెలంగు భద్ర మింపుగ నీకున్

18.    

 

 

 

కం.

నీతి యుతపు వచనము లీ

రీతి యని మహాత్ముఁ డుచిత లీల ముని వరుం

డా తేజో మయుఁ డాగెను

నీతి మనః కుశిక కులుఁడు నిశ్చల మతియై

19.    

 

 

 

తే.గీ.

పడగఁ జెవుల విశ్వామిత్రు భాషణములు

మించ శోకమ్ము ఱేఁడు చలించె మోహ

మందె నుత్తలమ్మున సంజ్ఞ నంది కొంత

తడవునకు భీతిఁ గ్రుంగె భూధవుఁడు కరము

20.   

 

 

 

ఆ.వె.

హృదయ మంత చీల్చు ఋషిపుంగవు వచన

మ్ములు కలఁత నొసంగఁ బుడమి ఱేఁడు

వ్యథిత చిత్తుఁ డై నిజాసనమునఁ గంపి

తుండు నయ్యె దశరథుండు మిగుల

21.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందుఁ బందొమ్మిదవ సర్గము.

బాలకాండము

సర్గము 20.

 

 

 

దశరథుఁడు చింతాక్రాంతుఁడై విశ్వామిత్రుని కోరిక నిరాకరించుట, ముని కుపితుఁడౌట.

 

 

 

 

కం.

ములికులఁ బోలు పలుకులు సె

వులఁ బడ నా ముని యనంగ భూమీశుఁడు మూ

ర్ఛిలి సుంత తేఱుకొని తాఁ

గలఁతం జెంది యనె నిట్లు కౌశికు తోడన్

1.      

 

 

 

కం.

పసిబిడ్డఁడు నా రాముఁడు

ముసరవు పదునాఱు వరుసములు దనుజుల తో

డ సరి యని యాజికిఁ దలఁప

ను సుతుని రాజీవలోచనుని మునిచంద్రా!

2.      

 

 

 

మ.

అధినాథుండను సంయమీశ్వర! యశే షాక్షౌహిణీ సేన కే

నధికోత్సాహము తోడ సేనఁ గొని దైత్యశ్రేణి వీర్యమ్మునన్

వధియింపంగ స్వయమ్ము నచ్చటకు వే వత్తున్ భయంబేల స

ద్విధి నీ యాగము పూర్తి సేయ నిఁక నిర్విఘ్నమ్ముగాఁ గౌశికా!

3.      

 

 

 

తే.గీ.

విక్రములు శూరులును నాదు భృత్యు లెల్ల

నస్త్ర శస్త్ర విశారదు లాజి సేయ

శక్తు లసుర గణమ్ముతో సంయమీంద్ర!

తోడికొని పోవ రామునిఁ బాడి కాదు

4.      

 

 

 

ఆ.వె.

ధనువు నూని హస్తమున యుద్ధభూమి ర

క్షింతు నిలిచి నేన యెంత దనుకఁ

బ్రాణము ధరియింతు బలిమి నంత వఱకు

దనుజుల నెదిరింతుఁ దాపసేంద్ర!

5.      

 

 

 

తే.గీ.

విఘ్నములు లేక మఱి నెరవేరు వ్రతపుఁ

గార్యములు రక్షితము లయి కార్య భార

మూన నేన వత్తు నటకు మౌని రత్న!

తోడికొని పోవ రామునిఁ బాడి కాదు

6.      

 

 

 

ఉ.

బాలుఁడు కాఁడు శిక్షకుఁడు పన్నుగ నేరఁడు శక్త్యశక్తులం

జాలఁడు యుద్ధ విద్యలను శస్త్రము లస్త్రము లెల్ల నేర్వఁడే

యాలము సేయఁ జాలఁ డసు రాదుల తోడ నెదిర్చి వంచనల్

చాల యెఱుంగు వారలు నిశాచరు లెల్లరు వారి సాటియే

7.      

 

 

 

తే.గీ.

ఒక్క నిమిషంబు నైనను జక్క నైన

రాముని విడిచి మేనునఁ బ్రాణ ముంచ

నుత్సహింప నిజము తాపసోత్తమ! విను

తోడికొని పోవ రామునిఁ బాడి కాదు

8.      

 

 

 

కం.

సుతు రాఘవుఁ గొనిపో నెం

చి తేని సువ్రత మునీంద్ర శీఘ్రమ్ముగ నీ

చతురంగ బలమ్ముల సం

యుతమ్ము నను గూడఁ గొనుమ యుత్తమ చిత్తా!

9.      

 

 

 

తే.గీ.

వే లఱువది యేండ్లు గడచెఁ బృధ్వి నాకు

దుఃఖమున నుండఁ బెక్కేండ్లు తుష్టి నీయఁ

బుట్టెఁ బుత్రుఁడు కౌశిక మునివరేణ్య!

తోడికొని పోవ రామునిఁ బాడి కాదు

10.    

 

 

 

తే.గీ.

సుతుల నల్వుర నెన్నంగ నితని పైన

మక్కువ సెలఁగు చుండును మిక్కుటముగ

ధర్మ ముఖ్యుండు జ్యేష్ఠుండు తాపసేంద్ర!

తోడికొని పోవ రామునిఁ బాడి కాదు

11.    

 

 

 

ఉ.

ఎవ్వరు వారు వారి బల మెంత నిశాటులు మౌనిపుంగవా

యెవ్వరి పుత్రు లాకృతులు నెట్టివి యందఱి మేను లెట్టివో

యెవ్వరు రక్ష వారి కట నెవ్విధి రక్షణ మందు చుందురో

యివ్వివరమ్ము లెల్లఁ దగ నేర్పడ నాకు దయన్ వచింపుఁడీ

12.    

 

 

 

కం.

రాముం డైన బలమ్ములు

నో మునివర! నేను నెట్టి యుక్తిని నా సం

గ్రామ కపట దోషాట

గ్రామము నెదిరింప వచ్చుఁ గడఁగి నుడువుఁడీ

13.    

 

 

 

చం.

సకలము నాకు దేవ ముని సత్తమ చెప్పుఁడు దుష్ట భావులన్ 

సకల నిశాచ రోద్ధతుల శక్తి గుణాన్విత దర్ప చిత్తులన్

సుకరముగా నెదిర్చి తగ శూరత నిల్చు విధమ్ము నంత కౌ

శికుఁ డనె రాజు పల్కుల నశేషము దా విని యివ్విధమ్ముగన్

14.    

 

 

 

శా.

పౌలస్త్యాన్వయ రావణాఖ్యుఁ డసురవ్రా తాధిరా డ్వీరుఁడే

ద్రైలోక్యమ్ముల సంచరించుచును బాధల్గూర్చు నిత్యమ్ము నా

భీలాకారుఁడు బ్రహ్మ దత్త వరుఁడున్ వీ రాసురానీకమే

లీలం గొల్చుచు నుండ నబ్బలుని సంప్రీతిం నరాధీశ్వరా

15.    

 

 

 

తే.గీ.

చూడ సాక్షాత్కుబేరుని సోదరుండు

విశ్రవస్సన్ముని సుతుండు వీరవరుఁడు

రాక్షస నిచయ నాథుండు రావణుండు

నా వినంబడు ధాత్రిని నరవరేణ్య

16.    

 

 

 

ఆ.వె.

స్వయముగఁ గ్రతువు నతి బలుఁడు సేయఁడు నాశ

నమ్ము వాని యాజ్ఞ నెమ్మి నూని

వా రిరువు రసురులు మారీచుఁడు సుబాహు

వు లొనరింతురు క్రతు విలయ మడరి

17.    

 

 

 

కం.

నా విని యనె నా దశరథ

భూవరుఁడు ముని గని యంత మునిపుంగవ! యా

రావణు నెదిరించి నిలువ

నే విధిఁ జాలను రణమున నిద్దుష్టాత్మున్

18.    

 

 

 

కం.

కరుణింపుమ ధర్మజ్ఞా

వర నందను నన్ను నల్ప భాగ్యుని నీ వే

గురువును దైవము నాకుం

బరమ మునీంద్రా తలంచి పన్నుగ దేవా!

19.    

 

 

 

ఆ.వె.

అమర దనుజ పతగ యక్ష గంధర్వోర

గాదు లిల నశక్తు లాజి గెలువ

రావణాసురు ననఁగా వచింపఁగ నేల

మాన వాలి నకట మౌనివర్య!

20.   

 

 

 

తే.గీ.

బలముఁ గొంపోవు నాతండు బవర మందు

బల్లిదుల యందు దైత్యుఁడు వాని వాని

బలము నైనఁ జాలను నేను గెలువ నాదు

తనయులు బలము తోడను దాపసేంద్ర!

21.    

 

 

 

ఆ.వె.

దైవ నిభుఁడు నింక తనయుండు బాలుఁడు

కోవిదుండు కాఁడు కొంచె మైన

భండనమ్ము లందు బ్రహ్మసన్నిభ! యట్టి

పుత్రు నీయఁ జాల మునివరేణ్య!

22.   

 

 

 

ఆ.వె.

యజ్ఞ విఘ్న కర్త లాయిద్దరు యమ స

న్నిభులు కయ్యములఁ గనికర మున్నె

చూడ వారు సుతులు సుందోపసుందుల

పుత్రు నీయఁ జాల మునివరేణ్య!

23.   

 

 

 

మ.

స్థిరులై వెల్గెడు వీర్య వంతులు కడున్ శిక్షాత్త నైపుణ్యు లీ

ధర మారీచ సుబాహు రాక్షసులు యుద్దం బేను వారిద్దఱన్

సరియౌ నొక్కని తోడఁ జేయ మఱి యుత్సాహమ్మునం జాగ నెం

తు రహిన్ లేని యెడన్ సబంధు జన మేఁ దోరమ్ము నిన్వేఁడెదన్

24.   

 

 

 

తే.గీ.

వదర నిట్లు రా జా ద్విజ వరుఁడు కుశిక

తనయునకు రేఁగెఁ గోప మత్యధికముగను

నేయి వేల్చిన మఖపు టగ్ని నిభ మనఁగ

మున్యనలము జ్వలించెను మూరి యపుడు

25.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నిరువదవ సర్గము.

 

బాలకాండము

సర్గము 21.

 

 

 

దశరథుని పల్కుల కాగ్రహింప విశ్వామిత్రుఁడు వసిష్ఠ మహర్షి సాంత్వన వచనములకు దశరథుఁ  డూఱటఁ జెంది ప్రసన్నుఁ డగుట.

 

 

 

 

కం.

విని యా మాటలు దశరథుఁ

డనంగఁ బ్రేమాకులమ్ము లాగ్రహ మడరన్

మనమునఁ గౌశికుఁడు మహీ

శుని నారసి పల్కె బదులు సువ్రతుఁ డంతన్

1.      

 

 

 

ఆ.వె.

ఇచ్చి మాట మున్పు నచ్చముగఁ బ్రతినఁ

దప్ప నెంతు వకట యిప్పు డింక

రాఘ వాన్వయులకు రాజ! యయుక్తమ్మ

యీ విపర్యయమ్ము సూవె యెంచ

2.      

 

 

 

తే.గీ.

ఐన నిది నీకు యుక్తము నేన యింక

వచ్చి నట్టి రీతిని నేఁగు వాఁడ వేగ

మనృత భాషణ! కాకుత్స్థ! యలరు భద్ర

ముగ సబాంధవమ్ము కరము భూధవుండ!

3.      

 

 

 

కం.

ఉరువుగ రోష మడర ధీ

వర విశ్వామిత్రునకుఁ దపః ప్రజ్వలి తా

జిర భాసిత ముని వరునకు

విరివిం గంపించెఁ బుడమి భీతిలిరి సురల్

4.      

 

 

 

ఆ.వె.

పుడమి యెల్ల వేఁగ భూసురుఁడు వసిష్ఠుఁ

డరసి యంత గాంచి యవని పతిని

సువ్రతుండు పలికె సుస్తిర ధీరుండు

భాషణమ్ము లిట్లు భవ్యముగను

5.      

 

 

 

తే.గీ.

పుట్టి యిక్ష్వాకు కుల మందు మూర్తి ధర్మ

మునకు ననఁగ వెల్గ ధృతినిఁ దనర మంచి

వ్రతము లూని శ్రీమంతుండ! పాడి గాదు

ధర్మమును వీడ నీకు సద్ధర్మ చరిత

6.      

 

 

 

కం.

నుతి కెక్కితి ముజ్జగముల

నతి ధర్మాత్ముండ వని ధరాధీశ్వర స

న్మతిఁ బాటింపు స్వధర్మము

ధృతి నూని యధర్మ మెవ్విధిఁ దగదు నీకున్

7.      

 

 

 

కం.

ఇది చేసెద నని చేయం

గుదర దని పిదప వచింపఁ గూలును గుణముల్

పదిలముగ మున్ను గొన్నవి

సదమల మతి! కానఁ బంపు జంకక రామున్

8.      

 

 

 

తే.గీ.

అస్త్ర విదుఁ డైన కాకున్న నణఁప లేరు

రక్కసులును విశ్వామిత్రు రక్షణమ్ము

కలుగ రాముని మండు టనలము చే మ

నియెడు నమృతమ్ము భంగిని నిశ్చయముగ

9.      

 

 

 

ఉ.

ఈతఁడె ధర్మవిగ్రహుఁడు నీతఁడె వీరుల నుత్తముండు నౌ

నీతఁడె యెల్ల లోకముల నెంచఁగ శ్రేష్ఠుఁడు జ్ఞానవంతు లం

దీతఁడె తాపసేంద్రులకు నింపగు నాశ్రయ మౌను సంతత

మ్మీతఁడె సర్వ శక్తి యుతుఁ డిద్ధ చరిత్రుఁడు రాజ పుంగవా!

10.    

 

 

 

తే.గీ.

ఈతఁ డెఱుఁగు నస్త్రమ్ము లనేకములు త్రి

లోకముల సచరాచ రానీక మందు

నన్యుఁ డెఱుఁగఁడు మున్ముందు నరయ లేఁడు

రాజమృగరాజ! దశరథ! రాఘవేంద్ర!

11.    

 

 

 

తే.గీ.

రాక్ష సాసుర గంధర్వ యక్ష కిన్న

రోరగ మహర్షి గణ మందు నొక్క రైన

గాధి సూను సమానులు కారు రాజ!

యస్త్ర విద్యాప్రయోగము లందు ధాత్రి

12.    

 

 

 

ఆ.వె.

పరమ ధార్మికు లగు పర మాస్త్రములు భృశా

శ్వునకుఁ బుత్ర గణము సుమ్ము దత్త

ము లవి కౌశికునకుఁ బుడమి నేలు నపు డ

స్త్రమ్ములు రఘువంశ చక్రవర్తి!

13.    

 

 

 

తే.గీ.

పుత్రులు భృశాశ్వునకు రూపములు కడు దుహి

త సుతులు ప్రజాపతికి ఘనాస్త్రమ్ము లుజ్జ్వ

లములు వీర్య వంతములు జయము నొసంగు

నట్టివి నిరత మవి యెల్ల నజకుమార!

14.    

 

 

 

కం.

జయ సుప్రభ లను వార లు

భయు లా దక్ష తనయ లనుపమ మధ్యలకుం

బ్రియముగ శస్త్రాస్త్రమ్ము ల

వి యొక శతం బుద్భవిల్లె వెల్గుచుఁ బ్రభలన్

15.    

 

 

 

ఆ.వె.

జయకుఁ బుట్టిరి మును సమయింప నసురులఁ

గామ రూప సుతులు భామ కప్ర

మేయు లెల్ల ఘనులు మేటి బలులు పంచ

దశ కుమార వరులు ధరణి నాథ!

16.    

 

 

 

ఆ.వె.

సుప్రభకును బిదప సుతులు సంహార నా

ములు తనరి యయిదు పదు లుదయించి

రతి బలులును దుర్జయ పరాక్రములు భండ

నముల నందఱు విను నరవరేణ్య!

17.    

 

 

 

కం.

విరివి నెఱుఁగు నా యస్త్రము

ల రమ్యముగఁ గౌశికుండు రాజవరేణ్యా!

గురు ధర్మ రతునకుఁ గలదు

పరమాస్త్రములు సృజియింపఁ బన్నుగ బలమున్

18.    

 

 

 

ఆ.వె.

ఇట్టి బల్లిదుండు ఋషి కౌశికుండు మ

హా యశుండు తేజ మధిక ముండు

రాము నంప నీకు రాజ శార్దూల! శం

క వల దింక నెడఁద లవము కూడ

19.    

 

 

 

కం.

వారి నణఁప శక్తి కలదు

తోరముగఁ గుశిక సుతునకు దుష్టాసురులం

దా రామ హితార్థమ్మే

చేరెను యాచింప నిన్ను జింతింపకుమా

20.   

 

 

 

కం.

విని ముని వసిష్ఠు వచనము

ల నిఁకఁ బ్రసన్నాత్ముఁ డయ్యె రఘు వృషభుండే

తనువు వెలింగెఁ బ్రభల రా

మునిఁ బంపఁ దలంచె నెడఁద ముదముగ మునితో

21.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నిరువది యొకటవ సర్గము.

 

బాలకాండము

సర్గము 22.

 

 

 

వసిష్ఠుని మాటలకు శాంతించి దశరథుఁడు సంతసించి రామ లక్ష్మణులను విశ్వామిత్రునకు నొసంగుట, విశ్వామిత్రుఁడు రామలక్ష్మణులకు బల యతిబల యను మంత్రముల నుపదేశించుట.

 

 

 

 

కం.

శాంతి దనర చిత్తమ్మున

నంత వసిష్ఠు గిరలు విన నమృత సదృశముల్

సంతుల రాముని లక్ష్మణుఁ

గాంతి తనులఁ బిల్చె ధరణి కాంతుఁడు ప్రీతిన్

1.      

 

 

 

చం.

జనని యొసంగ స్వస్తి సువచస్ప్రచయమ్ములు తండ్రియుం దమిన్

మినుకులు మంగళమ్ము లిడ మీఱి వసిష్ఠుఁడు గాంచి భ్రాతలం

దనరి నిజాత్మజద్వయము దగ్గఱి మూర్కొని మూర్ధముల్ తగన్

జనపతి యిచ్చె పుత్రులను సంయమి చంద్రున కంతఁ బ్రీతినిన్

2.      

 

 

 

కం.

వీచె రజో హీనం బట

వే చన సుఖముగ మునీంద్రు వెంటన్ రాముం

డే చిన్మయ రాజీవ సు

లోచనుఁడు సలక్ష్మణుండు రుచి రాననుఁడే

3.      

 

 

 

చం.

కురిసెను బుష్పవర్షము సుఘోషము లేచెను మ్రోగ దుందుభుల్

సురవర సత్కృతమ్ము లయి చోద్యము మీఱ నభః పథమ్మునన్

గురుతర శంఖ దుందుభి సుఘోషము లెల్ల నయోధ్య విన్పడెన్

సురుచిర మా మహాత్ములు విశుద్ధ చరిత్రులు నేఁగుచుండఁగన్

4.      

 

 

 

తే.గీ.

ముందు నడవ మునీంద్రుఁడు సుందరుండు

రాముఁడు ధనుర్ధరుఁడు వెన్క లక్ష్మణుండు

కాకపక్ష ధరుఁడు వెనుక ననుగామి

యై తరలు చుండి రట జగత్త్రాత లెలమి

5.      

 

 

 

తే.గీ.

విల్లు కరముల భుజముల వెలయ నంబు

లపొదులు వెలిగించుచు దిశలను భృశమ్ము

చనిరి ముని వెనుక త్రిశీర్ష సర్పము లన

నలువ నా యశ్వినుల భంగి నలరు చుండి

6.      

 

 

 

చం.

కుదురుగ వేళ్లఁ దోళ్ల తొడుగుల్ ధరియించి వహించి విల్లులన్

ముదముగ భూషితాంగులయి పూని కరండము లుజ్జ్వలాంగు లం

తఁ దనరి రామలక్ష్మణులు తాపసి వెన్క ననింద్యు లేఁగు చుం

డ దహను జంట పట్టి శివు డాయు విధమ్ముగ నొప్పె నప్పుడున్

7.      

 

 

 

కం.

చని యర్ధాధిక యోజన

ము నది సరయు నా సువిదతము తటమ్ముం జే

రి నిలిచి తీయఁగ రామా

యని పిలిచి యనె నిటులు కుశికాత్మజుఁ డంతన్

8.      

 

 

 

కం.

కొనుమీ తడయక వత్సా!

యినకుల తిలకా! జలమ్ము నీ మంత్రములం

గొనుమా బల నింక నబల  

ననె విశ్వామిత్రుఁడు పరమానందముగన్

9.      

 

 

 

కం.

అల పుండదు రాదు జ్వరము

కలుగదు విపరీత రూప కాయము మంత్ర

మ్ముల బలమున జాలరు దను

జులు వేఁపఁ బ్రమత్తుల నిఁక సుప్తుల నైనన్

10.    

 

 

 

ఆ.వె.

పృథ్వి నేరు భాహు వీర్యమ్మునను నిన్ను

మించు వార లుండ రెంచ నింక

ముజ్జగమ్ము లందు నెజ్జనులును సరి

రారు నీకు నిజము రామచంద్ర

11.    

 

 

 

కం.

చదివిన బలాబలల మఱి

బదులిడు నందు విభవమునఁ బ్రతిబోధమునం

దు దయాగుణమ్మునను రా

మ దురిత హీన సరి రారు మతి నిర్ణీతిన్

12.    

 

 

 

ఆ.వె.

ఈ బలాబలలు లభింప విద్యలు రెండు

సములు నీకుఁ గన నసంభవమ్ము

జ్ఞానములకు నెల్ల జననీ మతల్లులు 

సుమ్మివి చదువు లుభయమ్ము లెంచ

13.    

 

 

 

ఆ.వె.

మహిమఁ దనరు విద్య లిహమున నివి రెండు

నీరజాక్ష వినుమ నీకు క్షుత్పి

పాస లుండ వయ్య బల నింక నబలను

దారిఁ జదివి నంత నో రఘువర

14.    

 

 

 

చం.

విరివిగఁ గీర్తిఁ బొందెదవు విద్యల రెంటిని నేర్వ నీవు వీ

రిరువురు పద్మసంభవున కింపుగఁ బుట్టిన సత్తనూజలే

పరగుదు మీఱి తేజమునఁ బన్నుగ నర్హుఁడ వీవు ధార్మికా

వర రఘు నందనా కొనుము భద్రము లుర్వి నొసంగ నే నిటన్

15.    

 

 

 

కం.

కలవీ గుణమ్ము లన్నియు

వెలయుచు నీయంద రామ విరివిఁ దగఁ దపో

బలమున భరింప బహు విధ

ముల విలసిల్లు నివి రెండు ముదము నొసంగన్

16.    

 

 

 

కం.

జలము స్పృశించి శుచి యయి వి

మలాత్ముఁడు గ్రహించెను బరమప్రీతిని వి

ద్యల రాఘవుఁ డంతఁ గుశిక

కులోద్భవ మహర్షి నుండి కొలిచి సు భక్తిన్

17.    

 

 

 

ఆ.వె.

భూరి విక్రముండు మూరి విద్యాద్వయ

మ్మున రఘూత్తముండు తనరెఁ బ్రభల

శారద దివసములఁ జారుతరము వెల్గు

ఖరకరుఁడు సహస్రకిరణు భంగి

18.    

 

 

 

కం.

అలరింప సకల గురు సే

వలు కౌశికు గూర్చి రాఘవద్వయ మంతన్

లలిత సరయూ తటమ్మున

సలలిత మా ముగ్గురు నిసి శయనించి రటన్

19.    

 

 

 

తే.గీ.

దశర థాత్మజు లిద్దఱు తద్ద బలు ల

నర్హులు నిదురింపఁ గసవు నందు నకట

గాధి సుతు వచనమ్ములఁ గరము మురిసి

కలసి నిద్రించిరి నిశ సుఖమ్ము దనర

20.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నిరువది రెండవ సర్గము.

 

బాలకాండము

సర్గము 23.

 

 

 

విశ్వామిత్రుని తోడ రామ లక్ష్మణులు పయనించి గంగా సరయూ సంగమ స్థలమునఁ గల కామాశ్రమమున రాత్రి వసించుట.

 

 

 

 

కం.

మునివర విశ్వామిత్రుఁడు

చని రాతిరి తెల్లవాఱఁ జక్కఁగ నంతం

గని కాకుత్స్థులఁ బర్ణ శ

యన సుప్తులఁ బలికె నిట్టు లాదర మొప్పన్

1.      

 

 

 

కం.

అల కౌసల్యా నందన!

తెలవాఱెను మేలుకొనుమ దివిజార్హములే

కల విట దిన కృత్యమ్ముల్

వలయును జేయంగ రామ వర నరవృషభా!

2.      

 

 

 

ఆ.వె.

పలుకఁ గడు నుదార వచనమ్ములు మహర్షి

విని నృపాత్మజు లతి వీరు లంత

స్నాన మాచరించి సలిలప్రదానము

సేసి పరమ జపము చేసి రెడఁద

3.      

 

 

 

తే.గీ.

పగటి పను లెల్లఁ గావించి పార్థివాత్మ

జులు మహా వీరు లిరువురు నలరి వంద

నమ్ము లాచరించి మునీంద్రునకుఁ దపో ధ

నునకుఁ జనఁగ సంసిద్ధులై తనరి రెలమి

4.      

 

 

 

కం.

చని చని వీరభ్రాతలు

గని రమరాపగను ద్రిపథ గామిని సరయూ

వినుత నదీ సంగమ లా

స్యను జలదూర్మి భరిత జల సదమల గంగన్

5.      

 

 

 

కం.

కని రొక యాశ్రమమును ఘన

ముని వర్గము వేల వర్షములు పుణ్యతమ

మ్మును దపములు సేసెడు స్థల

మును బరమానందముగ నపుడు రఘువీరుల్

6.      

 

 

 

కం.

పదిలపుఁ బుణ్యాశ్రమము వి

శదముగ వా రెఱుఁగ నెంచి సంయమిచంద్రుం

గదిసి తమకమ్ము వొంగఁగ

నెద విశ్వామిత్రు నడిగి రిట్లు ముదమునన్

7.      

 

 

 

ఉ.

ఎవ్వరి యాశ్రమ మ్మిది మునీంద్ర వెలుంగుచు నున్న దింపుగా

నెవ్వరు పూరుషోత్తములు నిందు వసింతురు సంతసమ్ముగా

నివ్వర కాననమ్మున నహీన తపోధన వాస యోగ్యమై

యివ్విధి నుండ కారణము నింత యెఱుంగఁగఁ గల్గె నిచ్ఛయే

8.      

 

 

 

తే.గీ.

అన విని చిరు నవ్వొలయఁగ నాస్య మందు

రామ వినుమ వచించెద రమ్య మైన

యిక్కుటీరమునం బూర్వ మెవ్వ రుండి

రో వివరముగా ననియె మున్యుత్తముండు

9.      

 

 

 

మ.

వినుతుం డింపుగఁ గామ నామమునఁ దా విద్వాంస వర్గమ్ములో

విను కందర్పుఁడు మూర్తిమంతుఁ డయి యావేశంపుఁ జిత్తమ్మునన్

ఘనుఁ డా స్థాణువు నిశ్చయోద్వహునిఁ దత్కందర్పుఁడే వేఁచె వే

కొని తోడ్తోడ మరుద్గణమ్ములను దాఁ గూర్చుండ ధ్యానమ్ములో

10.    

 

 

 

ఆ.వె.

రుద్రుఁ డంతఁ గినిసి రౌద్రాక్షిఁ గాల్చె ర

ఘూద్వహ! యవయవము లూడి పడెను

వాని కామ నాము హీన బుద్ధు తనువు

నుండి తత్క్షణమ్మ మండి మండి

11.    

 

 

 

తే.గీ.

క్రోధము సెలంగ నెడఁద నుమాధవుండు

కాల్పఁ గాయము సర్వము కాముఁ డట్లు

హరునిచే నశరీరుఁడ యయ్యె నంత

నాఁటి నుండి లోకమ్మున మేటి వీర!

12.    

 

 

 

తే.గీ.

అంత నప్పటి నుండి విఖ్యాతుఁ డయ్యె

నతఁ డనంగుఁ డనఁగ మూరి యంగ దేశ

మయ్యె నెచ్చోటున విడిచె నంగములను

రాఘవేంద్ర! యచ్చోటు ధరాతలమున

13.    

 

 

 

ఆ.వె.

హరుని పుణ్య తమపు టాశ్రమమ్మిది యీ ము

ని వరు లెల్ల శిష్యు లవని నితని

కల పురాతన సమయము నుండి నిత్య ధ

ర్మ పరు లఘము లంట రావు వీరి

14.    

 

 

 

కం.

ఈ రాత్రి యిచటఁ గడపుదు

మో రామ శుభాస్య దివ్య యుగళ నదీ మ

ధ్యారామమునఁ దరింపుదు

మే రేపు దగ నదిని మన మెల్లర మెలమిన్

15.    

 

 

 

తే.గీ.

స్నాన మొనరించి జపియించి జపము శుచుల

మై నరోత్తమ హవ్యమ్ము లలరఁ జేసి

యంతఁ జేర నెల్లరము పుణ్యాశ్రమమ్ము

భావ్య మగును గాంచ మన కిప్పట్టు నందు

16.    

 

 

 

తే.గీ.

వార లచ్చట నవ్విధిఁ బలుకు చుండ

నిజ తపోమహి మాక్షులు నెగడ నెఱిఁగి

వారి మునులు చిత్తమ్ములఁ బరమ హర్ష

మంది వేగ సమీపించి రంతఁ బ్రీతి

17.    

 

 

 

ఆ.వె.

అర్ఘ్య పాద్యములు మహర్షి కాతిథ్యము

కౌశికున కొసంగి కరము ప్రీతి

రామలక్ష్మణులఁ బరమ హర్ష మున సత్క

రించి రంత నుద్యమించి మునులు

18.    

 

 

 

ఆ.వె.

అంది మౌనివరుల యాతిథ్య మానంద

పఱచిరి తగ వారి వాక్య తతుల

నియత చిత్తముల మునివరేణ్యు లెల్లరు

సంధ్య వార్చి రంత సమ్మదమున

19.    

 

 

 

తే.గీ.

తేఁబడి యటుల నాశ్రమ దివ్య వాసు

లు మునుల వలన వారు సుఖముగ వారిఁ

గూడి కామాశ్రమము నందు వేడుకగను

బ్రీతి తోడ వసించిరి రాతి రంత

20.   

 

 

 

కం.

అభిరామ కథల నుడువుచు

నభిరాములు రామలక్ష్మ ణాధిప సుతులన్

విభవమ్ముగ సన్ముని జన

విభుండు గాధి సుతుఁడు మురి పించె భృశమ్మున్

21.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నిరువది మూడవ సర్గము.

 

బాలకాండము

సర్గము 24.

 

 

 

రామలక్ష్మణులతో గంగానది నుత్తరించి విశ్వామిత్రుఁడు వారికి సరయూ నదీ విశేషమును వివరించి ఘోరారణ్యము ప్రవేశించి తాటక చరితమును దెలుపుట.

 

 

 

 

కం.

చేరిరి నదీ తటి మహా

వీరులు రిపుమర్దను లట వెలయించి పనుల్

తీరుగఁ గాలోచితములు

వా రుంచి మునివరు ముందుఁ బ్రత్యూషమునన్

1.      

 

 

 

ఆ.వె.

ఆ మునులును సువ్రతాత్ములు నెల్లరు

నంత మంచి నావ నచట నిడి మ

హాత్ము లలర వినయ మరసి విశ్వామిత్రుఁ

బల్కి రింపు గొలుపు భాషణములు

2.      

 

 

 

చం.

ధ్రువముగ మీరు చేయుఁ డధిరోహము నావ స రాజపుత్రులై

తివిరి శుభప్రదంపుఁ దగు తెన్నున నేఁగుఁడు జాగు చేయకే

కవిసి యనంగ వారి విని క్రన్నన నట్టులె యంచుఁ బ్రీతి మౌ

ని వలికి దాటె నబ్ధిగను నిమ్నగ  నింపుగ వీరి తోడుతన్

3.      

 

 

 

తే.గీ.

నది నడుమున కేతెంచిన నావ శబ్ద

మొకటి సంరంభమై పొంగు చుండ ఘోర

ముగ వినిరి రాఘవుండు తమ్ముండు దాని

విస్మయమ్ము నందిరి వారు  వినిన యంత

4.      

 

 

 

ఆ.వె.

అంత రఘు వరేణ్యుఁ డడిగె నానది మధ్య

మునివరేణ్యుఁ గదిసి మ్రోత నీటిఁ

జీల్చు చుండి మిగులఁ జెవుల వినంబడు

చున్నది యిది యేమియొ నుడువుఁ డని

5.      

 

 

 

కం.

చెప్పఁ దొడఁగె ధర్మాత్ముం

డప్పు డడుగ రాముఁడు మది నతి కౌతుకమే

చొప్పడ  నిస్వన కారణ

మప్పావన సంయమీంద్రుఁ డతి విపులముగన్

6.      

 

 

 

మ.

ఘన హర్షమ్మున మించు మానసముతోఁ గైలాస నామాచల

మ్మున నిర్మించె సరస్సు మానస సరఃపుణ్యాఖ్యఁ బద్మాసనుం

డనయం బా సరసీ జలమ్ములె యయోధ్యం జుట్టి పాఱంగ న

య్యెను జక్కన్ సరయూ నదీ ప్రవరమే యిక్ష్వాకు వంశోద్భవా!

7.      

 

 

 

తే.గీ.

ఇయ్యతుల శబ్దము జనించె నయ్య గంగ

నుండి రెండు నదుల నీళ్ల భండనమ్ము

వలన నుదయింప వినిపించె వందనమ్ము

సేయు మన్నదులకు రామ చిత్త ముంచి

8.      

 

 

 

ఆ.వె.

ధార్మికు లిరువురు కృతప్రణాము లయి న

దీ ద్వయమ్మునకుఁ గరద్వయముల

దక్షిణంపు దిక్కు తరలి పరాక్రము

లరుగఁ జాగి రంత హర్షమునను

9.      

 

 

 

కం.

చని వీక్షించి సుఘోరము

చని యెఱుఁగని కాననమ్ము సంకుల గహన

మ్ము నృపాత్మజుఁ డడిగెను స

న్ముని నైక్ష్వాకప్రవరుఁడు నుతు లిడి భక్తిన్

10.    

 

 

 

తే.గీ.

ఈల పురుగుల రొదలతోఁ జాల భయ మొ

సంగు క్రూర మృగములు మెలంగు చుండ

నిండి పక్షుల కిలకిల లుండ ధ్వనులు

మించి దుర్గ మారణ్యము గాంచ నింక

11.    

 

 

 

చం.

వివిధము లైన పక్షు లిటఁ బెట్టఁగ బొబ్బలు భీకరమ్ముగం

గవియుచు నుండఁ గానన మృగమ్ములు వ్యాఘ్ర వరాహ సింహ సిం

ధువులు భయంకరమ్ము లయి తోరము బిల్వ ధ వాశ్వకర్ణముల్

దవమునఁ బాటలా తరు వితానము వెల్గుచు నుండ నింకనున్

12.    

 

 

 

తే.గీ.

రేఁగు నేఱుమద్ది తుమికి నాఁ గుజము ల

నేకములఁ గీర్ణము లయి కన్పించు చుండ

దారు ణారణ్య మిది యేమి తాపసేంద్ర

తెలియఁ బల్కుఁడు కృప తోడఁ దెల్లముగను

13.    

 

 

 

తే.గీ.

నా విని యనె విశ్వామిత్ర పావన ముని

వత్స! విను మీ యరణ్యము పార్థివసుత!

దారుణం బెవ్వరి యధీనతం దనరునొ

చెప్పెదను విపులమ్ముగ నిప్పలుకులు

14.    

 

 

 

తే.గీ.

మున్నివి సుర శిల్పుల చేతఁ బన్నుగ నొన

రింపఁ బడ్డ రెండు పురులు సొంపు లలరు

నృవర! మలద కరూశము లవి విరివిగఁ

జెలఁగెఁ బ్రాభవముగను భూతలము నందు

15.    

 

 

 

ఆ.వె.

పూర్వము వధియింపఁ బురుహూతుఁ డా వృత్రు

నంటె మలము క్షుధయు నా బలారి

వశము చేసికొనియె బ్రహ్మహత్యా పాత

కమ్ము దేవపతినిఁ బమ్మి రామ!   

16.    

 

 

 

తే.గీ.

అంత ఋషులు తపోధను లమరు లెల్ల

నింద్రుఁ జేయింప స్నానము నింపుగఁ గల

శోదకమ్ముల మల మెల్ల నూడిపడియె

హర్ష మొసఁగంగ భృశము దేవాధిపతికి

17.    

 

 

 

కం.

మేనునఁ బుట్టిన మలమును

వాని క్షుధను గూడ దేవ వరులు వసుధకున్

దానమ్ముగా నొసఁగి వా

రానందము వొంది రంత నత్యధికముగన్

18.    

 

 

 

తే.గీ.

నిర్మలత క్షుధాహీనత నెగడ శుద్ధుఁ

డై పరఁగఁ బ్రభు వింద్రుఁడు హర్ష మంది

వరము లిచ్చె నా పట్టణ ప్రవరములకు

ఖ్యాతిఁ జెంద మలద కరూ శాఖ్య లంది

19.    

 

 

 

కం.

కని గౌరవింప దేశము

లను సాధ్వతి సాధు వని పురందరు నమరుల్

ఘనముగఁ బొగిడిరి పురములు

దనరెం జిర కాలము తగ ధనధాన్యములన్

20.   

 

 

 

తే.గీ.

కొంత కాలము గడవఁగ నంత యక్ష

కన్య కామరూపిణి వేయి గజముల బల

మున్న తాటక సుందు బుధోత్తము సతి

భద్ర మగు నీకు రాఘవ! వచ్చె నటకు

21.    

 

 

 

తే.గీ.

శక్ర సమ బలుండు ఘన పరాక్రముండు

నామె తనయుండు మారీచుఁ డసురుఁ డుగ్ర

రూపుఁడు విపులాస్య మహా శిరుండు వృత్త

భుజుఁడు ఘనదేహి బాధించుఁ ప్రజల సతము

22.   

 

 

 

ఆ.వె.

జనపదముల రెంటి ననవరతము కరూ

శ మలదలను దాటక మల మతియు

దుష్టచారిణి బహు కష్టముల నొసంగి

లయ మొనర్చు సతము రఘువరేణ్య!

23.   

 

 

 

కం.

నివసించు నడ్డగించి య

తివ యొక యోజనమునకు నధికమై యిటనుం

డి వఱలు చోటునఁ జనఁ జన

దెవరి కయినఁ దాట కాఖ్య యీ వనమునకున్

24.   

 

 

 

తే.గీ.

స్వీయ భుజ బల మాశ్రయించి రఘువీర!

నాదు పంపునఁ దాటక నాశన మొన

రించి దుష్టచారిణి నాతి నంచితముగఁ

దిరిగి నిష్కంటక మొనర్పు తివిరి దీని

25.   

 

 

 

ఆ.వె.

అరయ నెవరు దుస్సహాసుర యక్షిణి

ఘోర వనిత చేతఁ గ్రూర తరము

నాశన మయి నట్టి దేశము సేర స

మర్థు లగుట కల్ల మాట రామ!

26.   

 

 

 

కం.

క్రూరాసురి యివ్వనమును

దారుణముగ లయము సేసి దర్పమ్మున ని

చ్చేరువ నింకను నిల్చిన

తీరు రఘువరేణ్య నీకుఁ దెలిపితి నంతన్

27.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నిరువది నాలుగవ సర్గము.

 

బాలకాండము

సర్గము 25.

 

 

 

విశ్వామిత్ర మహర్షి రామునకుఁ దాటక సంభవము, వివాహము, శాపములను వివరించి దుష్టచారిణి నామెను వధించు మని యది దోషము కాదని వక్కాణించుట.

 

 

 

 

కం.

ముని యప్రమేయు నుచిత వ

చనములు రాముండు పురుష శార్దూలుండే

విని కుశికాత్మజుఁ గాంచి వ

చ నోత్తమముల ననె నిట్లు సద్వినయమునన్

1.      

 

 

 

ఆ.వె.

యక్షు లల్ప వీర్యు లని విందుము మునీంద్ర!

మున్నటు లయిన మఱి యిన్నెలఁతికి

విస్మయంబు గాఁగ వేయి కరుల మించు

బల మబలకు నెట్లు వచ్చె చెపుఁడి

2.      

 

 

 

కం.

పలుకులు విని రాముఁ డనఁగఁ

దెలిపెద నా కథను రామ ధీవర! వినుమా

నలినాక్ష! యని ముని పలికె

బల మబలకు వచ్చె దత్త వర బల మహిమన్

3.      

 

 

 

ఉ.

యక్ష వరుం డొకండు మును పబ్జదళాక్ష! సుకేతు నాముఁడే

యక్షయ వైభ వాన్వితుఁడు నక్కట తా ననపత్యుఁడై యహో

యీక్షితి ఘోర దుఃఖ మది యేఁపఁగఁ జేసెఁ దపమ్ము నంతఁ బు

త్రేక్షణ గోరి యుగ్రముగ నిద్ధ గుణాఢ్యుఁడు వీర్యవంతుఁడే

4.      

 

 

 

చం.

తప మొనరింప యక్షపతి తత్పర చిత్తత నంద నార్థమై

కృపఁగని పద్మ గర్భుఁడు సుకేతునిఁ బ్రీత మనస్కుఁడై కడుం

దపము ఫలింపఁ బుత్రికను దాటక నిచ్చె సహస్ర భీకర

ద్విప బల సన్నిభోగ్రతమ వీర్యను సుందరిఁ దోయజాక్షినిన్

5.      

 

 

 

కం.

తనయుని నొక్కని నీయఁడు

వనజాసనుఁ డకట యక్ష వరునకు ముద మా

ర నళినలోచన నిడి పు

త్రిని నంతర్ధాన మయ్యె దేవాద్యుండే

6.      

 

 

 

తే.గీ.

పుట్టి పెరిఁగి పెద్దది యైన పూర్ణ శశి ని

భాననను రూపవతిని నిజాత్మజ నొసఁ

గెను సతిగ జంభ పుత్రుఁడు కీర్తి మంతుఁ

డైన సుందున కింపుగ యక్ష వరుఁడు

7.      

 

 

 

తే.గీ.

కొంత కాలమునకు యక్షి యంతఁ గనెను

బుత్రు మారీచు దుర్ధర్షు ముదము నంద

రాక్షసుం డయ్యె నాతండు రామచంద్ర! 

శాపమంది ఘోరమ్ముగఁ బాప మతియె

8.      

 

 

 

ఆ.వె.

హతుఁడు కాఁగ సుందుఁ డల తాటక యగస్త్యుఁ

జంప నెంచి పగను సంయమీంద్రుఁ

బుత్రుఁ గూడి కోపము చెలంగ సంరంభి

ణి యయి మెలఁగు చుండి నెలఁత యంత

9.      

 

 

 

మ.

తినఁగా నెంచి నెడంద నామె వడి నేతెంపంగ గర్జించుచుం

దన పైకిం ద్వర నా యగస్త్యుఁడు ఘనోత్సంగుండు శాపం బిడెం

గని మారీచుని రాక్షసత్వ మిలఁ దత్కాలంబ తాఁ బొందఁగన్

వనితం దాటకఁ గూడ నారసియు శాపం బిచ్చెఁ గ్రుద్ధుండునై

10.    

 

 

 

కం.

నర మాంసము భక్షించుచు

విరూపిణిగ నీదు రూపు విడిచి నిలుతు విం

క రమణి పుడమి నని శపిం

చె రోత ముఖము నగు నంచుఁ జీత్కారమునన్

11.    

 

 

 

తే.గీ.

తాటక కినిసి కర మగస్త్య చరితప్ర

దేశముల నెల్లఁ గదిసి బాధింపఁ జాగెఁ

దా శపింపఁ బడి ముని చేత రఘు వీర

దారుణమ్ముగ నిత్యము దయను వీడి

12.    

 

 

 

కం.

దారుణ యక్షిణిఁ దాటక

వారక వేధించు నాతిఁ బాపాత్మను నీ

వో రాఘవ తునుమాడుమ

క్రూర చరిత్ర వడిఁ గావ గోబ్రాహ్మణులన్

13.    

 

 

 

ఆ.వె.

ముజ్జగముల నీమెఁ బురుషుఁ డన్యుఁ డెవండు

రామ నీవు దక్క భీమ శాప

దూషిత నెదిరించి దుష్ట చరిత్రను

నిలువ లేఁడు నిజము నిర్మలాత్మ!   

14.    

 

 

 

కం.

దయఁ గాంచ స్త్రీ నిమిత్తము

సుయశోనిధి! నరవరేణ్య! శోకింపఁగ రా

దయ చాతుర్వర్ణ్య హితమ

నయ మగు కర్తవ్య మగును నరపాలురకున్

15.    

 

 

 

కం.

క్రూరం బైనను మఱి య

క్రూరం బైన నఘ మయినఁ గూడిన దోషం

బారయఁ గావంగఁ బ్రజల

వారని కర్తవ్యము నరపాలుర కెల్లన్

16.    

 

 

 

ఆ.వె.

రాజ్య భార మూను రాజుల కెల్ల స

నాతనంపు ధర్మమే తగ నిది

సత్యసంధ రామ! చంపు మధర్మ్యను

ధర్మ మెఱుఁగ దీమె ధర్మనిరత!

17.    

 

 

 

తే.గీ.

శక్రుఁడు వధింపఁగ వినమె చంప నెంచ

మేదిని విరోచన తనయ మెలఁత మంథ

ర నడరి మునుపు కాకుత్స్థ! రవికుల వర

రత్న! సత్యపరాక్రమ! రాజచంద్ర!

18.    

 

 

 

ఆ.వె.

విష్ణు వైన మున్ను వింటిమి వధియింప

భృగు సతీమతల్లి దృఢతమ వ్ర

త జనయిత్రి కవికిఁ దలఁప లోకమ్ములఁ

జేయ నింద్ర హీనమే యినవర!

19.    

 

 

 

తే.గీ.

ఇట్లనేక నరవరేంద్రు లితరులు నృప

నందన మహాత్ము లెద ధృతి నంది పురుష

సత్తము లధర్మ  నారులఁ జంపి రదయఁ

గాన నిర్దయఁ జంపు నా యాన నీమె

20.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నిరువది యైదవ సర్గము.

 

బాలకాండము

సర్గము 26.

 

 

 

తాటకా సంహారము.

 

 

 

 

కం.

ముని విక్రమ బాషణములు

విని ప్రాంజలియై తగఁ బృథివీపతి సుతుఁ డా

ఘనతర దృఢవ్రతుఁడు ప

ల్కెను రాముండు బదులు నయ గిర లేపారన్

  1.  

 

 

 

కం.

పిత్రాదేశమ్మున మఱి

పిత్రోచిత గౌరవమునఁ బేర్మిన్ విశ్వా

మిత్రాకాంక్షా గిర లవి

పాత్రమ్ములు నాకుఁ జేయ వడి నిశ్శంకన్

  1.  

 

 

 

చం.

జనకుని పంపు వింటి నట సద్గురు సంచయ సన్నిధాన మం

దు నిటు లయోధ్య లోన వినతుండను బంక్తి రథుండు పల్కఁగా

మునుకక కౌశి కేద్ధ మునిపుంగవు నాజ్ఞలు నిత్య మాదర

మ్మున నెఱపంగఁ బాత్రములు పుత్రక దాఁటఁగ రాదు వానినిన్

  1.  

 

 

 

తే.గీ.

అట్టి నేను బిత్రాజ్ఞ వేదాంగ విజ్ఞు

మీ యనుజ్ఞను నెరవేర్తు నే యొకింత

సందియమ్ము వహింపక డెంద మందుఁ

దాటకా వధోత్తమమును దాపసేంద్ర!

  1.  

 

 

 

ఆ.వె.

గురువరేణ్య తలఁచి గోబ్రాహ్మణ హిత మీ

దేశ సౌఖ్య మరసి యీశ! యప్ర

మేయ మీ వచన నికాయమ్ము సిద్ధింపఁ

జేయ నుద్య మింతు శీఘ్రముగను

  1.  

 

 

 

కం.

నాఁ బల్కి వింటి మధ్యను

దాఁ బిడికిలి వే బిగించి దస్యు దమనుఁడే

జ్యాఁ బట్టి లాగి ఘోరము

గాఁ బిక్కటిలంగ దిశలు గర్జం జేసెన్

  1.  

 

 

 

కం.

అవియంగఁ దాటకా వన

నివాసు లాధ్వని చెలఁగ విని బెదరి మిగులం

గువదన తాటక సక్రో

ధ వదనయై మూర్ఛిలె వికృత ఖరాంగి యటన్

  1.  

 

 

 

ఆ.వె.

ఆ ధ్వని విని క్రోధ మడరంగఁ దాటక

రక్కసి మదినిం దలంచి సుంత

సంభ్రమించి యంత శబ్దంపు దిశఁ గాంచి

పర్వుదీసె వేగ గర్వ మడర

  1.  

 

 

 

తే.గీ.

కని విరూపను వికృతాననను గడింది

గ్రోధ మూర్ఛిత నతివను ఘోర దేహ

ను గదిసెడు దాని నతి రయముగ వచించె

లక్ష్మణునిఁ గాంచి రాముఁడు లాఘవముగ

  1.  

 

 

 

ఆ.వె.

భయద భీకరాంగిఁ బన్నుగఁ గాంచుమ

లక్ష్మణ వెఱపరు లరసిన దాని

గుండె లవయు నన్న నొండు వింత యగునె

సుంత యైన యేని చూడఁ జూడ

  1.  

 

 

 

తే.గీ.

మించి మాయా బలమ్మున మీఱ రాని

రక్కసిఁ గనుమ లక్ష్మణ యిక్కురూపి

ణి నొనరించి నే నీ క్షణమున హృతశ్ర

వణ నసాగ్ర మరల్చుదు వనిత నింక

  1.  

 

 

 

ఆ.వె.

చంప నెంచ నోప సౌమిత్రి స్త్రీ నిమి

త్తమ్ము చంప నెంతుఁ దరుణి వీర్య

మింక గమన మెల్ల శంక యుంచక సుంత

డెంద మందు మేలు కందు నిందు

  1.  

 

 

 

శా.

రాముం డట్టులు పల్కుచుండఁగ మహారౌద్రమ్ముగాఁ గూయుచున్

భామా రాక్షసి క్రోధ మూర్ఛిత మహా బాహాద్వయం బెత్తి యా

రాముం గాంచి సముద్యమించి కదియన్ లంఘించి వీక్షించి తా

నా మౌనీశ్వరుఁ డాపి హుంకృతి జయం బాశించె రామార్థమై

  1.  

 

 

 

తే.గీ.

అట్లు తర్జించి తాటక నంత ముని వ

రుండు హుంకారమున మీకు మెండుగ నగు

భద్ర మింక జయమ్మని పార్థివాత్మ

జులను దీవించె నత్తఱి సురుచిరముగ

  1.  

 

 

 

తే.గీ.

దుమ్ము లేపి ఘోరమ్ముగ నమ్మడఁతుక

తాటక రజో ఘనమ్మునఁ బాటవముగఁ

గప్పి రాఘవోభయుల నొక్క క్షణ మంత

మోహమున నక్కజమ్ముగ ముంచెఁ గినిసి

  1.  

 

 

 

కం.

నిజ మాయా మర్మమ్మున

సృజించి పాషాణ ఘోర వృష్టి నరవ రా

త్మజుల పయిం గురి యింపం

గ జనించెను రాఘవునకు ఘన కోపంబే

  1.  

 

 

 

తే.గీ.

ఆ శిలా వర్షమును వేగ మంత రాముఁ

డాపె శరవర్షమున నాప నామె పర్వ

రోషమునఁ దన వైపు నురుతర బాణ

చయమున నఱకె దాని హస్తముల నంత

  1.  

 

 

 

కం.

తెగఁ జేతు లలసి గర్జిం

పఁగ భీకర మలిగి చెంత వడి తమ్ముం డా

మగువ నరసి ముక్కును జెవు

లఁ గోసెఁ దత్క్షణమ ఘోర రౌద్రం బలరన్

  1.  

 

 

 

ఉ.

కోరిన రూపముం బడసి క్రూరత నూని యనేక రూపముల్

మూరుచు మాయమై కినుక బోరునఁ గుర్యుచు ఱాళ్ల వర్షమున్

ఘోరపు రీతి మాయలను గూర్చుచు మోహము కల్గఁ జేయుచున్

భైరవ మొప్ప యక్షిణి నభశ్చర తిర్గుచు నుండె నచ్చటన్

  1.  

 

 

 

కం.

మునుఁగ శిలా వర్షమ్మున

నినకుల తిలకద్వయమ్ము నీక్షించి తగన్

ముని కులపుంగవుఁ డా గా

ధి నందనుఁడు పల్కె నిట్లు ధీనిధి యంతన్

  1.  

 

 

 

కం.

దయఁ జూపఁ జాలు నింక యి

ది యజ్ఞవిధ్వంసిని కుమతి దురిత చారి

త్ర యడరి యచిరము బల వృ

ద్ధి యగును యక్షిణికి మాయఁ దెల్లము రామా

  1.  

 

 

 

ఆ.వె.

చంప వలె నసురిని సంధ్యకుఁ బూర్వమ

బలము వృద్ధి యగును బరఁగ సంధ్య

రక్కసులకు మిగుల రాదు వారి నెదిర్ప

నేరి కైన రామ! వీరవర్య!

  1.  

 

 

 

తే.గ.

అన ముని విని రాముం డంత నబల నశ్మ

వర్షము కురుయు నామె శబ్దగతి నెఱిఁగి

బాణ మేయ సమర్థుఁడు పార్థ సూనుఁ

డాపె నామె సాయకముల నంపి వేగ

  1.  

 

 

 

కం.

శరజాలమ్మున నాపఁగ

నురు మాయా బలసమృద్ధ యుగ్రమ్ముగఁ దాఁ

బరువున లంఘించె నసురి

కర మలిగి యఱచుచు నంతఁ గాకుత్స్థులపై

  1.  

 

 

 

ఆ.వె.

వేగ వచ్చునామె బిడు గన విక్రాంత

రాముఁ డురము నందు భీమ బాణ

మేసి చీరె నంత నిలఁ గూలెఁ దాటక

వీడె నసువు లవిసి వీర్య మణఁగ

  1.  

 

 

 

చం.

ముదిత సహస్రలోచనుఁడు పూర్వదిశేశ పురందరుండు నా

త్రిదశులు నెల్ల హర్షమునఁ దేలి భృశమ్ముగఁ గాంచి కౌశికున్

సదమల తాపశేంద్రు ముని సత్తమ! సంతస మయ్యె మాకు నీ

కుఁ దనరు భద్ర మింపుగను గూరిమి రామునిఁ జూచి తెల్పుమా

  1.  

 

 

 

తే.గీ.

మునివర! ప్రజాపతిప్రియ పుత్రుఁ డా భృ

శాశ్వు వర నందనులు తపశ్శక్తి యుతులు

పరమ సత్యపరాక్రమ భాసితులను

రాఘవునకు నివేదించు రక్తి తోడ

  1.  

 

 

 

ఆ.వె.

ధృతిని ననుసరించు దేవ! నిన్నిట రాజ

నందనుండు తగును బొంద నడరి

నిర్జరగణ హితము నెరవేర్పఁ గర్తవ్య

ములు కలవు ధరేశు పుత్రునకును

  1.  

 

 

 

తే.గీ.

పలికి సుర లిట్లు హర్షమ్ము వడసి తాప

సేంద్రుఁ బూజించి సద్భక్తి నేఁగి రంత

వచ్చి నట్టి విధమ్ము వియచ్చరు లిట

సంధ్య యరుగుదెంచె నపుడు జక్కఁగాను

  1.  

 

 

 

కం.

మన మలరఁ దాటకావధ

జని తానందమున నంత సంయమి యా రా

ముని మూర్థము చుంబించి వ

చనమ్ము లిప్పగిది పలికె సముచిత రీతిన్

  1.  

 

 

 

కం.

ఓ రామ! సుంద రాకా

రా! రాత్రి యిచట వసించి రమ్య వనమునన్

వే రేపకడయ యేఁగుద

మారయ నా యాశ్రమ వర మంబుజ నేత్రా!

  1.  

 

 

 

కం.

విని విశ్వామిత్ర ముని వ

చనములు రఘు రాముఁ డడరి సంతోషమునన్

ఘన తాటకా వనము నం

దు నతి సుఖముగ నివసించె దోషావేళన్

  1.  

 

 

 

ఆ.వె.

వీత శాప వనము వెల్గె నద్దిన మతి

సుందరముగ మించి చోద్యముగను

జైత్రరథ వరవన సన్నిభమ్ము రమణీ

యమ్ము నందు నింక నెమ్మి నొసఁగ

  1.  

 

 

 

తే.గీ.

రమణి తాటకఁ దునుమాడి రాఘవుండు

వడసి యమర ప్రశంసలు పన్నుగ నటఁ

గలసి మునితోడ వసియించె నలరి యచట

తెలుపఁ బడ నెమ్మి మునిచేతఁ దెల్లవాఱ

  1.  

 

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నిరువది యాఱవ సర్గము.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి