26, ఆగస్టు 2026, బుధవారం

1. శ్రీమదాంధ్ర రామాయణము_ బాల కాండము - 4

 

బాలకాండము

సర్గము 41.

 

 

 

అంశుమంతుఁడు యజ్ఞాశ్వమును వెదకుచు రసాతలమున కేఁగి కపిల మహర్షి సమీపమున నున్న యశ్వమును గాంచి వైనతేయుని వలన గంగాజలమునఁ బిన తండ్రులకు మోక్షము

కలుగు నని విని హయమును గొని తిరిగి వచ్చుట, యాగము పూర్తి యగుట.

 

 

 

 

కం.

చిర కాలము గడవ నెఱిఁగి 

యరిగి హయార్థము సుతులు నరాధిపుఁ డంతం

బరికించి పౌత్రుఁ దేజో

విరాజితుని నంశుమంతు వీరు ననె నిటుల్

1.      

 

 

 

తే.గీ.

శూరుఁడ వఖిల విద్యల నేరి నట్టి

విబుధుఁడవు సమానుఁడవు పూర్వీణులకును

దేజ మందుఁ దండ్రులు చన్న యా జగతి న

రిగి హయాపహరునినిఁ గనుగొనుమ ధృతి

2.      

 

 

 

ఆ.వె.

పుడమి లోపలఁ గడు నడరెడు బల సత్వ

ములను వీర్యవంతముల నెదిర్ప  

నస్త్ర యుతము వింటి నంది వీరవరేణ్య!

యంశుమంత! యేఁగు మయ్య! వేగ

3.      

 

 

 

కం.

అభివాదము తగు వారికి

సభక్తిక మొనర్చి యింక సవనఘ్నుల వీ

త భయమునఁ జంపి పురుష

ర్షభ! దాఁటఁగఁ జేయ నిష్టి సఫలత రమ్మా

4.      

 

 

 

కం.

అన విని విల్లంబులు క

త్తిని లఘువిక్రముఁడు గొని ధృతినిఁ జనఁ జాగెన్

ఘనుఁ డంశుమంతుఁడు సగర

జనాధినాథు వచనముల సమ్మద మొదవన్

5.      

 

 

 

ఆ.వె.

తండ్రు లడరి మున్ను ద్రవ్విన దారిని

రాజు నాజ్ఞ దాల్చి రాజ నంద

నుండు తరలి యేఁగు చుండె రయమ్మున

నశ్వ శోధనార్థ మడరి రామ!

6.      

 

 

 

కం.

చని యంతఁ గాంచె దిగ్గజ

మును దైత్య దనుజ పిశాచ ముఖ రక్షోవ్రా

త నభశ్చ రోరగ సుసే

వ నార్హము నృపాత్మజుండు పన్నుగ రామా!

7.      

 

 

 

తే.గే.

అంతఁ జేసి ప్రదక్షిణ మడిగి క్షేమ

మును జనకులను నడిగి సముచితముగ మ

హాత్ముఁ డంశుమంతుం డమ్మహా గజమ్ము

వేఁడె యజ్ఞాశ్వ చోరుని జాడఁ దెలుప

8.      

 

 

 

తే.గీ.

అంశుమంతుని వాక్యము లాలకించి

బదు లొసంగె దిగ్గజ మంతఁ బార్థు నరసి

యంశుమంతుఁడ! యేగుదు వశ్వ యుతము

కార్యసిద్ది శీఘ్రమ నరవర్య! యనుచు

9.      

 

 

 

ఉ.

అవ్విధి దిగ్గజవ్రజము నాతఁడు సేరి క్రమమ్ముగా వడిన్

జవ్వనుఁ డొక్కటొక్కటినిఁ జక్కఁగ వేడఁగ నర్చ సేసి తా

నవ్విధి నుత్తరమ్ము తగ నందెను వాక్య విశారదేభముల్

క్రొవ్వున నప్రమేయములు కూర్మి వచింపఁగ సంతసమ్మునన్

10.    

 

 

 

కం.

గజరాజుల మాటలు విని

స్వజనులు పినతండ్రు లెల్ల భస్మంబయి న

ట్టి జగతి కసమంజసు నా

త్మజుండు లఘువిక్రముండు తడఁబడి చేరెన్

11.    

 

 

 

ఆ.వె.

వారి వధను గాంచి ఘోర మహాపన్న

దుఃఖ వశుఁడు నయి యతుల్యముగఁ ద

దంశుమంతుఁ డచట నార్తి దుఃఖించి తో

రమ్ముగ విలపించె రఘువరేణ్య!

12.    

 

 

 

కం.

అవిదూరమునఁ జరించెడు

సవనాశ్వము నంతఁ గాంచె సత్క్షత్రియ పు

త్రవరుఁడు పురుషవ్యాఘ్ర

ప్రవరుం డా దుఃఖశోక పరితప్తుండున్

13.    

 

 

 

కం.

నృప నందనులకుఁ దగ నుచి

తపు  జలతర్పణము లీయఁ దలఁచుచు శోధిం

చి పరిసరములం గాంచఁడు

నృపాత్మజుఁడు తోయము నెట నీరజనేత్రా!

14.    

 

 

 

ఆ.వె.

దృష్టిఁ బఱుపఁగ నలుదిశలఁ గాంచె సుపర్ణు

నంత మేనమామ యా సగర కు

మారులకు ననిల సమానుని ఖగరాజు

వైనతేయు వీరు నా నృవరుఁడు

15.    

 

 

 

కం.

వినతా నందనుఁడు పలికె

ఘన వీర్యుండు తగ నిట్లు కదిసి నరవ్యా

ఘ్ర! నలిని  శోకింపకు వధ

కు నర్హులే లోక హితమ  కుందఁగ నేలా

16.    

 

 

 

ఆ.వె.

అప్రమేయుని కపిలాఖ్య మహర్షి వ

రేణ్య కోప వహ్ని గణ్య! దగ్ధు

లిట్టి వారి కుదక మిట్టి సాధారణ 

లౌకిక జల మీయ రాదు సుమ్ము

17.    

 

 

 

కం.

అమల జలాన్విత గంగా

రమణీయ నది హిమ శైల రాజ తనయ స

ద్విమ లోదకమున నీ వు

ద్యమించి పితరుల జలక్రియ సలుపు ప్రాజ్ఞా!

18.    

 

 

 

ఉ.

పన్నుగ భస్మరాశి పయిఁ బాఱిన లోక పవిత్ర గంగతోఁ

గ్లిన్నము సేయ నింపుగను లీలఁ దరించి దివమ్ము లోఁ దగం

గ్రన్నన వెల్గు వారలు కరమ్ము పునీతులునై నృపోత్త మా

పన్న కుమారు లెల్లరు నపార యశం బది కల్గు నీ కిలన్   

19.    

 

 

 

కం.

తురగమ్ముతో మహా భా

గ! రాజనందన! నరవర! కదలి యరుగుమా

పరఁగి పితామహుని క్రతువు

త్వరితమ్ముగను నెఱవేర్ప వలయును జుమ్మీ

20.   

 

 

 

కం.

ఖగరాజు సుపర్ణు ముద మొ

సఁగు వచనము లాలకించి జన్నపు గుఱ్ఱ

మ్ముఁ గొని మహాయశుఁ డేఁగెఁ ది

రిగి సగరుని మనుమఁడు దనరి సవన తటికిన్

21.    

 

 

 

ఆ.వె.

అతఁడు రాజుఁ జేరి యా దీక్షితుని నంశు

మంతుఁడు కథ నెల్ల నంత నుడివి

మఱి సుపర్ణుఁ డనిన మాటలఁ దెలిపెను

మాననీయములను ఱేని కెల్ల

22.   

 

 

 

తే.గీ.

ఘోర మా వార్త  విని పిడుగు వలెఁ జెలఁగ

దుఃఖ మంది తిరిగి యంతఁ దురగ మేధ

యాగము యథావిధి నొనర్చె నఖిల కల్ప

సమ్మతముగను వారక సగర నృపతి

23.   

 

 

 

ఆ.వె.

ఏఁగె స్వీయ పురము యాగము గావించి

ధరణి ధవుఁడు సగర నర వరుండు

గంగ రాకఁ గూర్చి కాకుత్స్థ! నిశ్చయ

మెడఁదఁ గైకొనండు పుడమి ఱేఁడు

24.   

 

 

 

కం.

చేయక నిశ్చయము మహా

మేయ పరాక్రముఁడు దనరి మేదినిఁ దగఁ దా

నా యేండ్లు ముప్పది వెయి ల

హో యేలి దివమున కేఁగె నోడి యమునకున్

25.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నలువది యొకటవ సర్గము.

 

బాలకాండము

సర్గము 42.

 

 

 

అంశుమంతుఁడు తన కుమారుఁడు దిలీపునకు రాజ్య మొసఁగి తపమాచరించుచు దివి కేఁగఁగ  దిలీపుఁడు గంగావతరణమునకై నిశ్చయింపక దివంగతుఁడు కాఁగ నతని కుమారుఁడు

భగీరథుఁడు బ్రహ్మను గూర్చి తపమాచరించి వరములను బొందుట.

 

 

 

 

కం.

సగరుండు కాలధర్మం

పు గతి ననుసరించె నంతఁ బురజనులు నమా

త్య గణమ్ము లంశుమంతునిఁ

దగ నభిషేకించి రవని ధవునిగ రామా!

1.      

 

 

 

ఆ.వె.

అంశుమంతుఁ డయ్యె నంత మహారాజు

ఘనయశుఁడు దిలీపుఁ డనఁగ సుతుఁడు

కల్గె నాతనికి జగద్విశ్రుతుఁ డతండు

రాజ్యపాలనమున రఘువరేణ్య!

2.      

 

 

 

చం.

తనయు దిలీపు నిల్పి తగ ధారుణి రాజుగ నంశుమంతుఁడే

యొనరిచె శీత శైలమున నున్నత మైన తపమ్ము నిష్ఠతో

ఘనుఁ డతి దారుణమ్ముగ నకంపము ముప్పది వేల యేండ్లటం

గనియెను దేవలోకమును గాలవశమ్మున రాఘవోత్తమా!

3.      

 

 

 

ఉ.

వే తపియించి సాగరుల వీరుల చావు దిలీపుఁ డెర్గి ము

త్తాతల నుత్తరింపఁ గడు దల్చుచు నెక్కటి గంగ నెవ్విధిం

జూతు మరల్ప నచ్చటికిఁ జోద్యమ యంచుఁ దలంచు చుండి తా

నే తఱి నిర్ణయింప మది నింతయుఁ జాలక యుండె నక్కటా

4.      

 

 

 

తే.గీ.

విదిత ధీమంతుఁడు సత మవ్విధము తల్చు

ధర్మ పరునకుఁ బుట్టెను దనయుఁ డొకఁడు

ధార్మికుఁడు భగీరథుఁ డనఁ దనరు వాఁడు

వంశ వర్ధనుఁ డా దిలీప నరపతికి   

5.      

 

 

 

మ.

ఘనతేజుండు దిలీపుఁ డధ్వరములం గావించి పెక్కింటినిన్

జన సమ్మోదముగా నిరంతరము రాజ్యం బేలి న్యాయమ్ముగా

నిన వంశోత్తమ వేలు ముప్పదులు నౌ యేఁడాదు లింపారఁగం

జనె రోగార్తతఁ గాలధర్మ గతి రాజన్యుం డనిర్ణేతయై

6.      

 

 

 

కం.

తనయు భగీరథు రాజ్య

మ్మున నిల్పి దిలీపుఁడు నిజ పుణ్యమ్మున శ

క్రుని లోకమ్మున కింపుగఁ

జనె నరశార్దూలుఁ డంబుజ దళ నిభాక్షా!

7.      

 

 

 

ఆ.వె.

ఆ భగీరథుఁడు మహాధార్మికుం డన

పత్యుఁడు సుత కామి పార్థవరుఁడు

తేజ మందు మిన్న రాజవరేణ్యుల

నెల్ల భూతలమున నినకులాగ్ర్య!

8.      

 

 

 

చం.

స్థిరముగ రాజ్య భారమును జేర్చి యమాత్య నికాయ మందు ని

బ్బరముగ నా భగీరథుఁడు పన్నుగ గంగను దేర నిష్టుఁడై

కరములు పైకి నెత్తి తమకమ్మున వహ్నుల మధ్య నొక్క వా

సరమున మాస మందుఁ దిని సన్మతినిం దప మాచరించుచున్

9.      

 

 

 

తే.గీ.

ఇంద్రియ జయుండు గోకర్ణ మెలమిఁ జేరి

యతఁడు వేల యేండ్లు నిలిచి యలర ఘోర

నిష్ఠ నంతఁ బ్రజాపతి నీర జోద్భ

వుండు మెచ్చి రాజును రామ! మెండుగాను

10.    

 

 

 

కం.

సుర  గణముతోడు నుండగ

నరవిందాసనుఁడు బ్రహ్మ యమ్మహితాత్మున్

గురుతర తపస్స్థితునిఁ దా

నరసి భగీరథునిఁ జేరి యనె నిబ్భంగిన్   

11.    

 

 

 

కం.

చక్కఁగఁ జేయఁ దపమ్మును

దక్కక నిష్ఠను భగీరథ! మహాభాగా! 

మిక్కిలి ముద మాయె వరం

బిక్కడ సువ్రత యడుగుమ యిచ్చెద నీకున్

12.    

 

 

 

ఆ.వె.

అంజలించి పలికె నంత భగీరథుఁ

డప్పితామహునకు నఖిల లోక

ములకుఁ గరము భక్తి పూర్వకముగ నిట్లు

నమ్మహాయశో ధనాధికుండు

13.    

 

 

 

తే.గీ.

దేవ! కల్గినఁ బ్రీతి యధికముగ మఱి

కల్గె నేని తపస్సిద్ధి వెల్గి మిగుల

సగర పుత్రులు వారికి సలిల మే నొ

సంగు వాఁడ కావలయును సరసిజభవ!

14.    

 

 

 

తే.గీ.

వారి భస్మము గంగేద్ధ వారి తోడఁ

గ్లిన్నమై సర్వ మంత సలీల వారు

నాదు ప్రపితామహులు దేవ! నాక లోక

మేఁగ వలయు వీ తాఘులై వేగముగను

15.    

 

 

 

ఆ.వె.

సంతు నిమ్ము నాకు నంత మిక్ష్వాకు కు

లమ్మరయఁ దగదు వరమ్మగు నిది

పరము దేవ! కరుణఁ బద్మగర్భ! కనుమ

ధన్యుఁడఁ జుమి కాంచి తాత! నిన్ను

16.    

 

 

 

కం.

అన నట్లు రాజు మధుర వ

చనమ్ములఁ బితామహుండు సన్నుత దేవుం

డును శుభకరమ్ముగం బలి

కెను బదులుగ నివ్విధమ్ము కృప మీఱంగన్

17.    

 

 

 

తే.గీ.

ఉత్తమం బైన కోరిక యో భగీర

థా! మహారథ! యగునట్లు నగును నీకు

భద్ర మిక్ష్వాకు వంశ సంవర్ధనా! భృ

శమ్ము శంకింపఁ బని లేదు నెమ్మనమున

18.    

 

 

 

తే.గీ.

హైమవతి యీమె హిమవన్న గాగ్ర తనయ

గంగఁ గొనితెచ్చిన భువికి భంగవతిని

నామె ధరియింప శక్తుండు భూమిఁ బరమ

శివుఁడు వేఁడ వలెను శంభు శీఘ్ర మీవు

19.    

 

 

 

కం.

దిగ నా గంగ నృవర! యో

ర్వఁగ లేదు వసుంధర రయ భారమ్ము నహో

మగువం ధరింపఁగ నితరు

నిఁ గాంచ నోప హరుఁ దక్క నే నెప్పగిదిన్

20.   

 

 

 

కం.

పలికి తగ ధరణిపతితో

లలితమ్ముగ గంగతో నల వచించి తగన్

నలినజుఁ డంత మరుద్గణ

ములు సురలం గూడి స్వర్గమున కరిగె వెసన్

21.    

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నలువది రెండవ సర్గము.

 

బాలకాండము

సర్గము 43.

 

 

 

భగీరథుఁడు శివుని గూర్చి తపము చేసి మెప్పింప గంగా నదిని శంకరుఁడు తలపైఁ దాల్చి కొంత విడువ యా నదిని రసాతలమునకుఁ గొంపోయి సగర పుత్రుల భస్మ రాశినిఁ దడుప వారు

మోక్షమును  బొందుట.

 

 

 

 

కం.

ఏఁగఁ బితామహుఁ డంతం

దాఁ గాలిది బొటన వ్రేలు తద్దయు ధరణీ  

భాగమ్మున నిల్పి తపము

నా గురుసంకల్పుఁ డబ్ద మడరి యొనర్చెన్

1.      

 

 

 

కం.

వత్సాంతమ్మున నప్పర

మోత్సాహు  భగీరథుఁ గని యుగ్రుం డనియెన్

వత్సా మెచ్చితి మోయుదుఁ

దత్సరి దమరాపగ నిటఁ దలపై నంచున్

2.      

 

 

 

చం.

నగపతి జ్యేష్ఠ పుత్రిక ఘనమ్మగు రూపము దాల్చి యుగ్రమున్

జగదభి సన్నుతాపగ నిజస్రవ వేగము పెంచి మిన్నఁగన్

గగనము నుండి దుమ్కె వడి గంగ యుమాపతి శీర్ష మందుఁ ద

ల్చె గరళకంఠుఁ గూడి కన శీఘ్రమ దోడ్కొని గ్రింది లోకమున్

3.      

 

 

 

ఆ.వె.

నది మదమ్ము గాంచి మది నెంచె హరుఁడు త్రి

నేత్రుఁడు భృశ మలిగి నెఱప బుద్ధి

నబల కణచి యంత నంచితముగ గర్వ

మెల్ల రఘువరేణ్య యుల్ల మలర

4.      

 

 

 

తే.గీ.

పుణ్య నది పడెను శివుని పుణ్య శిరము

నందు హిమనగ సన్నిభ మందు జడల

గుట్టల గుహ లోన నిరికె దిట్టముగను

గంగ పడి నంతనె యభంగ భంగ రామ!

5.      

 

 

 

ఆ.వె.

చిక్కి జడల లోనఁ జేర భువి నలవి

గాక యుద్యమింప గంగ కింత

యేని వెనుదిరుగుట కేని వీలు నరయ

లేక తిరుగు చుండె వీఁక రామ!

6.      

 

 

 

ఆ.వె.

ఏండ్లు గడవ నట్లు నెందును గన లేక

యా భగీరథుండు హరునిఁ గూర్చి

గొప్ప తపము నందు నప్పట్టున నిలిచి

రాజ ఋషి వెలింగె రామ! ధృతిని

7.      

 

 

 

ఆ.వె.

దానికి ముద మంది ఱేనికిఁ బ్రియమారఁ

బరమశివుఁడు విడిచెఁ బరమ నదిని

 గంగ బిందుసరసిఁ గాకుత్స్థ సంప్రీతి

బిందు బిందువు లగు చంద మొప్ప

8.      

 

 

 

తే.గీ.

విడువ నేడు పాయలుగనై యడరె గంగ

హ్లాదిని నలిని పావని యనఁగ మూడు

విమల జలవాహినులు పాఱె విరివిఁ దూర్పు

దిశకు నుజ్జ్వల రూపమ్ము తేటపడఁగ

9.      

 

 

 

ఆ.వె.

అక్షయ జలముల సుచక్షువు సీతయు

సింధు వనఁగఁ బరఁగి శీఘ్ర వాహి

ణులు ప్రతీచికి కడు నలరి శుభజలమ్ము

లు తనరంగఁ బాఱె వితతముగను

10.    

 

 

 

ఆ.వె.

ఏడవ దగు పాయ ఱేఁడు వడిఁ గదల

ముందు ననుగమించె మూరి రాజ

ఋషి భగీరథుండు నిద్ధ దివ్య రథము

నందుఁ జాగు చుండ డెంద మలర

11.    

 

 

 

చం.

గగనము నుండి శంభు తలఁ గ్రమ్మరి యచ్చట నుండి భూమిపైఁ

దగఁ బడి పాఱు చుండ వడిఁ దద్దయు శబ్ద యుతమ్ము గంగయే

దిగఁబడి యింకయున్ దిగఁగ దిర్దిర దిర్గెడు మత్స్యకచ్ఛ పా

దిగ జలజీవముల్ వెలిఁగె దివ్యముగా నల నక్ర కోటితో

12.    

 

 

 

మ.

నగ రాకార విమాన చంచల లసన్నాగాశ్వ బద్ధాసనుల్

సగణోద్భాసిత దేవ సంయములు యక్షవ్రాత గంధర్వ సి

ద్ధగణమ్ముల్ దగ నిల్చె నభ్రమున నత్యంతాద్భుతం బైన య

ట్టి గతిన్ భూమికి జాఱు గంగఁ గనఁ గుంఠీభూత చేతస్కులై

13.    

 

 

 

కం.

గగనము గత తోయదమై

తగ భాసిల్లెఁ గదియంగఁ దప్త సువర్ణాం

క గణ విరాజిత గీర్వా

ణ గణమ్ములు వింత శత దినక రాభముగన్

14.    

 

 

 

తే.గీ.

శింశుమార మీ నోరగ సేవి తాభ్ర

ము విలసిల్లె విద్యుద్గణ పూర్ణ భాస

మాన శారదా భ్రావృత మండిత మన

ధవళ కలహంస సువికీర్ణ వివృతమునను

15.    

 

 

 

ఉ.

ఒక్కట వేగ మెక్కువగ నొక్కట వంకర నొక్క టెక్కువై

యొక్కట వంగి మిక్కిలిగ నొక్కటఁ బాఱుచు మెల్లమెల్లఁగా

నొక్కట నీరు నీటి వడి నుద్ధతి గొట్టఁగఁ బైకి దుమ్కి వే

రొక్కట వ్రాలు చుండి ధర నొప్పుగ స్వర్నది సాగె నత్తఱిన్

16.    

 

 

 

కం.

శివుని శిరస్సునఁ దగ వ్రా

లి వసుధపైఁ బాఱి గంగ లీలఁగ మలిన

మ్ము విడివడంగఁ బునీత య

యి విరాజిల్లె విమల జల మేపారంగన్

17.    

 

 

 

ఆ.వె.

భవుని యంగము విడఁ బరమ పవిత్రము

జల మని సుర ముని నిచయము భూజ

నామర వర గాయ కావలి నుదకమ్ము

ముట్టి రెల్ల రెడఁద ముదము నూని

18.    

 

 

 

తే.గీ.

స్నాన మొనరించి యెల్లరు శాప పతితు

లు పుడమికి గగనము నుండి యపుడు విగత

కల్మషు లయి చనిరి యుదకమ్ము పాప

ముల హరింపఁగ నిజ లోకములకు నలరి

19.    

 

 

 

కం.

జను లెల్లం బరవశమున

మునింగి గంగామల జలముల హర్షమునం

దనువుల శ్రమ మెల్లఁ దొలఁగ

మనముల శాంతం బడర విమలు లైరి తగన్

20.   

 

 

 

ఆ.వె.

దివ్య మైన యట్టి తేరునఁ దేజస్వి

యా భగీరథుఁడు మహాత్ముఁ డేఁగు

చుండ వెనుకఁ జాగు చుండె గంగానది

యనుసరించి రాన్మహర్షి నెలమి

21.    

 

 

 

తే.గీ.

దైత్య దానవ రాక్షస దైవ సర్షి

గణ మహోరగ గంధర్వ గణ సకిన్న

రాప్సరస్స్త్రీలు యక్షవ రాదు లనుగ

మించిరి నృపతి జలజీవు లెల్ల నదిని

22.   

 

 

 

కం.

ఎట కేఁగినను భగీరథుఁ

డట కేఁగుచు నుండె గంగ యలరుచు మిగులం

దటినీ లలామ వేగమ

పటు పాపవినాశిని రఘువంశ వరేణ్యా!

23.   

 

 

 

ఆ.వె.

ముంచె నంత గంగ మునివరుఁ డద్భుత            

కర్ముఁడు ఘన యజ్ఞకర్త జహ్ను

వుని మహాత్ము పరమ పుణ్య యాగస్థల

మడరి యొక్క త్రుటిని నక్కజముగ

24.   

 

 

 

ఆ.వె.

గంగ దర్ప మెల్లఁ గాంచి జహ్ను మహర్షి

రోష మూని యంత రుద్రు భంగి

గంగ నీటి నెల్లఁ గాకుత్స్థ! త్రాగెఁ దా

నలుకఁ జూచుచుండ నద్భుతముగ

25.   

 

 

 

తే.గీ.

విస్మయమ్మున నది సూచి భృగుమహర్షి

వేడి రట దేవ గంధర్వ వినుత ముని వ

రులు తనయగఁ దలఁచి గంగ నిల విడువగఁ

బురుష పుంగవుని మహాత్ముఁ బూజ చేసి

26.   

 

 

 

కం.

ముద మంది జహ్నువు చెవుల

నదిఁ దిరిగి సృజించెఁ దా ఘన తపో మహిమం

ద దనుగుణమ్ముగ జాహ్నవి

గఁ దనరె నామమ్ము ధాత్రి గంగకు రామా!

27.   

 

 

 

తే.గీ.

తిరిగి గంగ భగీరథు తేరు వెంట

నేఁగి యేఁగి చేరి కడలి వేగ మింక

రాజు కార్య సిద్ధి కొఱకు నోజఁ జేరెఁ

దమి రసాతలమును సరిత్ప్రవర మంత

28.   

 

 

 

ఆ.వె.

గంగను గొని తివిరి గాంచె భగీరథుఁ

డంత రాజ ఋషి మహాత్ముఁడు పిత

రులను భస్మములను విలపించి మిక్కిలి

దీన చేతనుండు తెల్లముగను

29.   

 

 

 

కం.

బూడిద గుట్టను దడుపగఁ

బాడిగ గంగా జలమున భవపాపమ్ముల్

వీడఁగ సాగరు లెల్లరు

నాఁడు సనిరి స్వర్గమునకు నలినదళాక్షా!

30.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నలువది మూడవ సర్గము.

 

 

బాలకాండము

సర్గము 44.

 

 

 

బ్రహ్మదేవుని నానతి సగర పుత్రులకుఁ దర్పణము లర్పించి స్నాన మాచరించి శుచియై  భగీరథుఁడు రాజ్యమునకుఁ దిరిగి వచ్చి రాజ్య మేలుట. గంగానది  త్రిపథగ యని , భాగీరథి యని బ్రసిద్ధి కెక్కుట.

 

 

 

 

కం.

సురనదిఁ గూడి యతఁడు సా

గర మేఁగి రసాతలమ్ము గదిసెను వడిగాఁ

బరమంపు ముదము తోడ స

గర తనయుల భస్మరాశిఁ గాంచెను రామా!

1.      

 

 

 

ఆ.వె.

భస్మరాశి మునుఁగఁ బన్నుగ గంగా జ

లమున నరుగుదెంచి కమల సంభ

వుండు సర్వలోక పూజితుండు కని భ

గీరథునిఁ బలికె నుదారముగను   

2.      

 

 

 

తే.గీ.

సగరు షష్టి సహస్రాత్మజ వరు లరిగి

రి దివికిఁ దరించి సురగణ సదృశులై మ

హాత్ము నందను లట్లు నరాగ్రగణ్య!  

పావనంపు గంగా జల స్పర్శమునను  

3.      

 

 

 

కం.

సాగర జల మెంత వఱకు

వీఁగుచుఁ బ్రవ హించుచుండుఁ బృథ్విని సతమున్

సాగరు లంత వఱకు దివి

బాగుగ దైవత్వ మంది వఱలెడు వారల్

4.      

 

 

 

ఆ.వె.

నీదు సత్కృతమున నెగడ గంగ యిచట 

పెద్ద కూఁతు రౌను బేర్మి నీకుఁ

బరఁగు నిది జగముల భాగీరథి యనంగ

విశ్రుతముగ నింక పేరు వడసి

5.      

 

 

 

ఆ.వె.

మూడు మార్గముల సమున్నతముగ నేఁగఁ

ద్రిపథగ యని విశ్రుతినిఁ జెలంగు                    

దివ్యగంగ రాజతిలక! భాగీరథి

రమ్య విమల తోయ రాశి నలరి

6.      

 

 

 

కం.

తాతలకు నెల్ల మనుజేం

ద్రా! తరళ సలిలము లిమ్ము తర్పణముల నీ

యీ తపము నింక విడువుమ

ప్రీతి భగీరథ! కృతార్థ పృథ్వీనాథా!

7.      

 

 

 

తే.గీ.

నీకుఁ బూర్వులును యశస్వులే కరమ్ము

ధర్మనిరతుల శ్రేష్ఠులు ధరణి పతులు

నిజ మనోరథమును బొంద నేర కకట

చనిరి గొప్ప వారైనను సగరుఁ గూడి

8.      

 

 

 

ఆ.వె.

అప్రతిముఁడు తేజ మందు నా యంశుమం

తుండు నెంచి గంగఁ దూర్ణము గొని

తేరఁ గైకొనియుఁ బ్రతిన నశక్తుం డయ్యె

నతఁడు నిష్ఫలుండు నయ్యెఁ దండ్రి

9.      

 

 

 

తే.గీ.

రాజ ఋషి మహర్షి సముండు రాజధర్మ

రతుఁడు తపమందు నా కగుఁ బ్రతిమ సద్గు

ణుఁడు దిలీపుఁడు నీ తండ్రి పుడమిఱేఁడు

తే నశక్యుఁ డాయెను గంగఁ దాను గూడ

10.    

 

 

 

తే.గీ.

అట్టి దయ్యె సాధ్యము నీకుఁ బట్టి కరము

ప్రతిన పూర్తి గావించితి రమ్యముగను

యశము గొందువు మిక్కిలి యభిమతముగ

లోక మందు నరర్షభ! లోకవినుత!

11.    

 

 

 

కం.

దించితి గంగను నీ విట

నంచితముగ నరవరేణ్య యాశ్చర్యముగా

నెంచఁగ ధర్మపు టింటను

మించును నీ కెలమి చో టమిత్రధ్వంసీ!

12.    

 

 

 

కం.

ఉచితపు జలముల నిత్యము

శుచి వగుము మునింగి రాజసూను వరేణ్యా!

ప్రచురముగఁ బుణ్యఫల మొం

దు చిరము పుణ్యాత్ముఁడ వయి దుర్జయశూరా!

13.    

 

 

 

ఆ.వె.

చలుపు చక్కఁగ నిఁక సలిలక్రియ పితామ

హులకు నెల్ల రాజ! యుచిత రీతి

భద్ర మగును నీకుఁ బయనింతు నిజ లోక

మునకు నీవు నరుగుము నిఁక వేగ

14.    

 

 

 

ఉ.

అంత భగీరథుండు తగు న్యాయ విధమ్ము క్రమంపు భంగినిన్

సాంతము సాగరోత్తముల కత్యధి కార్తి జలక్రి యాదు లా

వంతయు భక్తి హీనమును నచ్చట చూప కొనర్చె నిష్ఠతో

నంత నతండు శుద్ధినిఁ బ్రయాణము సేసెఁ బురమ్ముఁ జేరఁగన్

15.    

 

 

 

కం.

తాను గృతార్థుండై చని

దాన విధు లొనర్చి యంతఁ దద్దయుఁ బ్రీతిన్

భూనాథుఁ డేలె రాజ్యము

నీ నృవర భగీరథుండె యినకుల వర్యా!

16.    

 

 

 

కం.

జగ మెల్ల సంతసించెను

జగతి పతి భగీరథుఁ గని సంపూ ర్ణేష్టిన్

విగతజ్వరుండు నయ్యెను

దగ శోక లయుండు నాయెఁ దద్దయు రామా!

17.    

 

 

 

కం.

ఇది గంగ గాథ రామా!

యుదితం బయ్యె నిది యెల్ల నొప్పుగ నా చేఁ

బదిల మగు నీకు సంధ్యయు

విదితం బయ్యె నిపు డీవు వెలుఁగుదు స్వస్తిన్

18.    

 

 

 

తే.గీ.

ధనము యశ మాయువుల దివిఁ దనయ సంచ

యమ్ము నిచ్చున దీ గాథ యవని సురుల

రాజులఁ బరు లందు నెవండు రతినిఁ జెప్పుఁ 

బ్రీతి నుంద్రు సుర లతని పితరు లెల్ల

19.    

 

 

 

తే.గీ.

శుభము గంగావతరణము శుద్ధ బుద్ధి

విను నెవండు వానికి నిక్కము నిజ వాంఛ

లెల్లఁ దీరుఁ బాపములు నశించు నాయు

వు యశముం జక్కఁగను వృద్ధిపొందు రామ!

20.   

                                                                                          

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నలువది నాల్గవ సర్గము.

 

బాలకాండము

సర్గము 45.

 

 

విశ్వామిత్రుఁడు రామలక్ష్మణులకు క్షీరసాగర మథన గాథ, దేవాసుర యుద్ధము దేవేంద్రుని విజయమును వచించుట. 

 

 

 

 

కం.

విని విశ్వామిత్రుని గిర

లను రాముఁ డనుజ వరుండు లక్ష్మణు తోడన్

మన మచ్చెరు వందఁగ నా

మునివర కౌశికునిఁ గాంచి ముదముగ ననియెన్

1.      

 

 

 

కం.

మునివర చెప్పితి రద్భుత

మును గంగావతరణమును బుణ్య చరితమున్

విన సొంపుగ నింకయు నా

వననిధి పూరణము నెల్ల బ్రహ్మజ్ఞ వరా!

2.      

 

 

 

ఆ.వె.

తలఁచు చుండ నెల్ల రలరి విశ్వామిత్రు

కథ సలక్ష్మణు లయి కడచె నంత

రాత్రి యెల్ల నట విచిత్రముగఁ దెలియ

రాక సుంత యేని రమ్యముగను

3.      

 

 

 

కం.

తెలవాఱఁ బ్రభాతమున వి

మలమ్మునఁ గృతాహ్నికుండు మహితాత్మునిఁ గాం

చి లలిత వచనమ్ముల నిన

కుల తిలకుఁడు రాముఁ డనియెఁ గుశికాత్మజుతో 

4.      

 

 

 

చం.

కడచెను దివ్య రాత్రి వినగం దగు గాథను నాలకింప మా

కడరి మునీంద్ర! యొక్క క్షణమై పరగంగ మహాతపోధనా!

యెడఁదఁ దలంచు చుండఁ గడు నింపుగ నీ యుదితంపు గాథనే

పడయుచు సంతసమ్ము నెదఁ బన్నుగ నేరక కాల మింతయున్

5.      

 

 

 

ఉ.

ఆగమనమ్ము మీది విని యబ్జజ సన్నిభ నావ యిత్తఱిన్

వేగమ వచ్చె మౌనివర విస్తృత వారిరథమ్ము చిన్మ యా

త్మా! గరిమంపు టీ త్రిపథ గాఖ్యను గంగను బుణ్య వాహినిన్

వీఁగి తరింత మెల్లరము వేగమ యంచు వచింపఁ బ్రీతినిన్

6.      

 

 

 

ఆ.వె.

అవ్వచనము లెల్ల నాలకించి మహర్షి

కౌశికుండు తొడఁగె గంగ నుత్త

రింప రామలక్ష్మ ణేతర మునివర

గణ సమేత మంతఁ గరము ప్రీతి

7.      

 

 

 

తే.గీ.

మునులఁ బూజించి సమ్మదముగను జేరి

యుత్తరంపుఁ దీరమ్ము మహత్తరమును

నిలిచి గంగ యొడ్డున వారు లలిత పురము

నరసిరి విశాల యను దాని నంచితమును

8.      

 

 

 

కం.

వడి రాఘవులం గూడి ఘ

నుఁడు ముని పుంగవుఁడు పురమును విశా లాఖ్యం

గడు రమ్యము దివ్యమ్మును

దడయక స్వర్గాభ మైన దానిం జేరెన్

9.      

 

 

 

కం.

రాముండు మహా ప్రాజ్ఞుం

డా ముని పుంగవు నుతించి యంజలు లిడి వి

శ్వామిత్రు నడిగె నా యభి

రామంపు విశాల యను పురపు వివరములన్

10.    

 

 

 

కం.

ఏ రాజవంశ వర్యు ల

పార విశాలా నగరము భద్రమగు మునీం

ద్రా! రమణీయముఁ గట్టిరి

మీ రెఱిఁగింపరె కుతుకము మిన్నఁగ నయ్యెన్

11.    

 

 

 

కం.

అన విని రాముని మాటలు

ముని విశ్వామిత్రుఁ డంత మురిసి విశా లా

ఖ్యను బరఁగు నగరము పురా

తనం బయిన దానిఁ గూర్చి తా ననఁ దొడఁగెన్

12.    

 

 

 

కం.

విను మా శక్రుని కథ రా

మ! నుడువగ మహా శుభమ్ము మఱి యీ దేశ

మ్మున జరిగిన వృత్తం బె

ల్లను గూడ వినుము పవిత్ర రఘుకుల వర్యా!

13.    

 

 

 

ఆ.వె.

అదితి పుత్రులు కల రా కృత యుగమున

మున్ను ధర్మరతులు సన్ను తార్యు

లెల్ల దితికిఁ గల్గి రెలమిఁ గుమారులు

వీర్యవంతు లెల్ల పృథ్వి రామ!

14.    

 

 

 

ఉ.

వారికిఁ గల్గెఁ జిత్తమున భావ మనాశ మరోగ మింకయున్

నేరక వార్ధకమ్మనఁగ నిత్యము నుండఁగ నెట్టు లంచు నా

నో రఘురామ తల్చు చటు లుండఁ దలంపు రసమ్ముఁ బొందఁగన్

క్షీర సముద్ర మంథనముచే నమృతమ్మును బుట్టె నంతటన్

15.    

 

 

 

తే.గీ.

వాసుకినిఁ ద్రాడుగ నొనర్చి పర్వతమ్ము

మందరముఁ గవ్వముగఁ జేసి మంథనమ్ము

నిశ్చయించి వా రెల్లరు నివ్వటిల్ల

నోజఁ ద్రచ్చఁ జాగిరి వేగ యుదధి నంత

16.    

 

 

 

శా.

క్షీ రాంభోనిధి సిల్కఁ జిల్క విష మక్షీణమ్ముగాఁ జిమ్ముచున్

ఘో రాశీవిష ముగ్రతం గఱచెఁ దా ఘోరంపు దంష్ట్రమ్ములన్

వీ రావేశత ఱాళ్ల నగ్ని నిభమై పెంపారె హాలాహలం

బే రక్షస్సుర మానవాళి యుతమై యిద్ధాత్రి దగ్ధంబు గాన్

17.    

 

 

 

తే.గీ.

శరణు వేడిరి సుర లెల్ల శంకరుఁ బశు

పతి మహాదేవు నరిగి కాపాడ మంచు

నార్తిఁ గైలాస నాథుని నభవు రుద్రు

భక్తి నార్త జనత్రాణు యుక్తముగను

18.    

 

 

 

ఆ.వె.

అమరు లెల్ల రిట్టు లర్థించు చుండఁగ

దేవదేవుఁడు హరి దివ్య శంఖ

చక్ర ధారి యచట చక్కఁగఁ బ్రత్యక్ష

మయ్యె హర్ష మంద నంత సురలు

19.    

 

 

 

మ.

చిరు నవ్వొల్కఁగ మోముపై హరుని నా శ్రీవర్ధనుం గాంచి ని

ర్జర కోట్యగ్ర భవుండ వీ వని సురవ్రాతాగ్ర గణ్యుండ! సా

గరముం ద్రచ్చుచు నుండగా నమరు లగ్రప్రాప్త మీ వస్తువున్

గరళమ్ముం దొలి యర్చ యంచుఁ గొను ముక్కంటీ! యనెం జక్రియే

20.   

 

 

 

చం.

అని హరి మాయ మయ్యె నమరాగ్రిముఁ డత్తఱి మాధవుం డటం 

గని సుర భీతి నిర్జర ముఖమ్ముల దైన్యయుతమ్ము లింకయున్

మినుకులఁ జక్రి పల్క విని మీఱిన హాలహలమ్ము నంతయుం

ద్రినయనుఁ డంత మ్రింగె సుధ దీ టని తోఁపఁగ నొక్క పెట్టునన్

21.    

 

 

 

ఆ.వె.

విడిచి సురల నంత వెడలె శ్రీకంఠుఁడు

దేవదేవుఁ డెలమి దేవతలును

దైత్య వరులు తిరిగి త్రచ్చనారంభించి

రెల్ల రడరి మిగుల నినకుల వర!

22.   

 

 

 

పృథివి.

మథన మడరఁగ మాయగ నా

కుధరము త్రుటినిఁ గూలె నహో

పృథివికి దిగువ వింత సురల్

వ్యథను గొలిచిరి యా హరినిన్

23.   

 

 

 

ద్రుతవిళంబితము.

గతివి భూత నికాయముఁ గావఁగా

పతివి యీ సుర వర్గము నెంచి సం

పతిత శైలముఁ బన్నుగ నెత్తుమా

సతము రక్ష నొసంగుమ కేశవా!

24.   

 

 

 

తోటకము.

విని యీ నుడులన్ హరి వేగమ గో

మునఁ గూర్మపు రూపము మూరఁగఁ గొం

డను వీపున నూని విలంబము దా

నొనరింపక యుంచెఁ బయోనిధినిన్

25.   

 

 

 

స్రగ్విణి.

కొండ కగ్రమ్మునం గూర్చి హస్తమ్ము దా

నుండి దేవాంతరా ళోత్తమ స్థాయియై            

మండితుండై తగన్ మంథనం బా ముకుం

దుండు లోకవ్రజాత్ముండు సేసెన్ వడిన్

26.   

 

 

 

ఉపేంద్రవ్రజము.

సహస్ర వర్షమ్ములు సాగ వచ్చెన్

స్వహస్త సక్తోదక పాత్ర దుడ్డున్

వహించి ధన్వంతరి వచ్చె నా స్వ

ర్గ హంస యానావలి రాగ దీప్తిన్

27.   

 

 

 

దోదకము.

అప్పును ద్రచ్చఁగ నందపు నారుల్

చప్పునఁ బుట్టఁగఁ జక్కఁగ వారిం

జెప్పుదు రచ్చర చేడియ లంచున్

మెప్పు వహింపఁగ మేదిని రామా!

28.   

 

 

 

కం.

అఱువది కో ట్లప్సరసలు

తఱచై పరిచారికలును దనరఁగఁ గాంతుల్

మెఱయఁగ దేహమ్ముల నం

దఱి కింపుగఁ బుట్టి రపుడు దశరథ తనయా!

29.   

 

 

 

ఆ.వె.

వారి దేవ దానవ తతి నెవ్వరు నొల్ల

కున్న దారలుగను జెన్ను మీఱఁ

జామ లెంచఁ బడిరి సాధారణ లనంగ

వార లెల్ల రపుడు వారిజాక్ష!

30.   

 

 

 

కం.

పతి నాశించుచు వరుణుని

సుత పుట్టెను వారుణి యనఁ జోద్యం బలరన్

దితి పుత్రులు వల దనిరి య

దితి సూనులు గైకొనిరి యతివ నా విమలన్

31.    

 

 

 

కం.

సుర నొల్ల కసురు లనగం

బరఁగిరి దైతేయు లెల్లఁ బడయంగ సురన్

సుర లై రదితి కుమారులు

సురఁ గొని మురిసిరి కరమ్ము శూరవరేణ్యా!

32.   

 

 

 

తే.గీ.

పుట్టె నుచ్చైశ్రవ మన నపూర్వ హయము

కౌస్తుభము మణిరత్నము కడలి యందు

నుద్భవించె నమృత మంత నుత్తమమ్ము

త్రచ్చఁ ద్రచ్చఁ గ్రమమ్ముగ రఘువరేణ్య!

33.   

 

 

 

కం.

అమృతమ్ము కొఱకు నయ్యెను

సుమహా వంశక్షయమ్ము సురవరు లచటన్

సమయించిరి దైత్య సమూ

హము నంత సమరము నందు నాగ్రహ మడరన్

34.   

 

 

 

తే.గీ.

రక్కసు లసురు లెల్ల రలరి యొక టయి

పోర ఘోర యుద్ధం బయ్యె వీర! మూడు

లోకములు మోహ మందఁగఁ దాఁక ధ్వనులు

చెలఁగి దిక్కుల నన్నిటిఁ జెచ్చెర నట

35.   

 

 

 

ఆ.వె.

సర్వ లయము కాఁగ శక్తిమంతుఁడు విష్ణు

వతి బలుండు వచ్చి యమృతమును హ

రించెఁ జక్కఁగ ధరియించి మోహిని రూప

మడరి తూర్ణముగ మహాత్ముఁ డంత

36.   

 

 

 

తే.గీ.

అక్షయ పురుషోత్తమునకు నభిముఖు లయి

విష్ణువునకు భండనమున వీర దైత్య

వరులు ప్రభవిష్ణువునకు నపారముగ న

లిగిరి యెల్ల రసువులు వోవఁగ నరేంద్ర!

37.   

 

 

 

ఆ.వె.

దేవ దానవ సమితి నదితి పుత్రులు

వీర వరు లసురుల ఘోరముగను

యుద్ధము నొనరించి యుద్ధతిఁ జంపిరి

దోర్బలమ్ము చెలఁగ దుర్భరముగ

38.   

 

 

 

కం.

దితి పుత్రుల నిర్జించి సు

గతిఁ బడసి పురందరుండు ఘన రాజ్యము దా

నతి ముదమునఁ బాలించె జ

గతుల సచారణ వరముని గణముల రామా!

39.   

                                                                                          

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నలువది యైదవ సర్గము.

 

బాలకాండము

సర్గము 46.

 

 

 

దితి పుత్ర శోకమున భర్త కశ్యపునిఁ దనకు నింద్రుని జంపు నట్టి పుత్రు నొసఁగు మనియుఁ దాను తపము చేయుటకు ననుజ్ఞ నిమ్మని వేఁడ నా వరమును బ్రసాదించుట, పిన తల్లి దితికి సేవలు చేయుచు నింద్రుఁడు తల్లి యశుచిగా నిద్రింప గర్భమునఁ బ్రవేశించి పిండము నేడు ముక్కలుగ వజ్రమున నఱుకుట.

 

 

 

 

కం.

చన దివికిఁ గుమారులు వగ

పున దితి మారీచుఁ గశ్యపునిఁ గని భర్తన్

ఘన తాప తప్త యయి పలి

కెను వచనము లిట్లు రామ! కినుకయుఁ బొడమన్

1.      

 

 

 

ఆ.వె.

పుత్ర హీన నైతిఁ బోరునఁ జంప నీ

పుత్రు లెల్ల మీఱి పూజ్య! శక్రుఁ

జంపఁ గలుగు సుతుని నింపయిన తపము

వలనఁ గల్గు వానిఁ బడయ నెంతు

2.      

 

 

 

తే.గీ.

ఏఁగెదఁ దపమ్ము నే నాచరింప నాథ!

గర్భ మొసఁగ వలయు నాకు నర్భకునిఁ బు

రందరునిఁ జంపు నీశ్వరు డెంద మలర

నాన తిమ్ము తపమునకు నూని కరుణ

3.      

 

 

 

కం.

దితినిన్ దారఁ బరమ దుః

ఖిత నరసి మహాత్ముఁడు విని గిరలం గరుణం

బతి కశ్యపుండు సంయమి

పతి బదులుగఁ బల్కె నిట్లు పన్నుగ రామా!

4.      

 

 

 

ఆ.వె.

అట్లగును దపోధనా! శుచి వగుమ భ

ద్ర మగుఁ గాక నీకు రమణి! మిగులఁ

బుట్టఁ గలఁడు సుతుఁడు పోరున నింద్రునిఁ

జంపు వాఁడు నీకు నింపొదవఁగ

5.      

 

 

 

తే.గీ.

వేయి యేండ్లు పూర్తి యయిన వెలఁది! నీవు

శుచిగ నుందు వేని సతము సూను నొందఁ

గలవు ముల్లోకములకును గాంతు నెలమి

శంక వల దింక నీ కిందుఁ జారువదన

6.      

 

 

 

కం.

పలికి పతి మహా తేజుఁడు

లలిత కరస్పర్శ సేసి లాలన వచన

మ్ములు స్వస్తి భాషణములం

బలికి తపము సేయఁ జనియెఁ బరమర్షి వడిన్

7.      

 

 

 

కం.

చనఁ బతి పురుష శ్రేష్ఠా!  

వనిత దితి ముదమ్మువడసి పరమమ్ముగఁ దాఁ

జనియెఁ గుశప్లవనము సే

సెను దారుణ మైన తపము చిరకాలమ్మే

8.      

 

 

 

ఆ.వె.

తపము చేయు చుండఁ దల్లి సహస్రాక్షుఁ

డు పరిచర్యలను గడు వినయమున

గుణధనుండు సేసెఁ గూర్మి నిత్యమ్మును

భక్తి సంయుతమ్ము పరమపురుష!

9.      

 

 

 

ఆ.వె.

అగ్ని కుశలు కఱ్ఱ లప్పు ఫలములు మూ

లముల నన్యముల వలసిన వాని  

నెల్లను సమకూర్చి యెలమి సేవలు సేయు

చుండె భక్తి వాసవుండు వేగ

10.    

 

 

 

కం.

చరణము లొత్తుటయు శ్రమము

పరిమార్పఁ దలంచి యట్టి పనులం దగు నా

దరమునఁ జేయుచు శక్రుఁడు

పరిచర్యలు నిత్య ముండె వారక రామా!

11.    

 

 

 

తే.గీ.

ప్రీతయై దితి పల్కెను వేయికిఁ బది

తక్కువగ నేండ్లు గడచిన మిక్కుటముగ

నా సహస్రాక్షు వీక్షించి హర్ష మడర

నివ్విధముగ నుచిత రీతి నినకులేంద్ర!

12.    

 

 

 

కం.

సురముఖ్య! నీ జనకుఁ డిడె

వరమ్ము నడుగంగ వేయి వత్సరములకుం

బరమునఁ బుత్రోదయమున్

జరుపంగఁ దపమ్ము నాకు సదమలచిత్తా!

13.    

 

 

 

తే.గీ.

ఆచరించుచు నుండ మహాతపమ్ము

తక్కు వయ్యె నింకఁ బది వత్సరము లిపుడు

వీర్యవంత! వీక్షింతువు బ్రీతి నపుడు

నీదు భ్రాతను భద్రము నీ కగుఁ జుమి

14.    

 

 

 

ఉ.

ఎవ్వని నెంచితిన్ నిను జయింప నొనర్తును నెమ్మి నాతనిన్

నొవ్వక మూడులోకములనుం దగఁ గెల్చెడు వీరు భంగిగా

నవ్వర పుత్రుతోఁ గలసి యాత్మఁ దొలంగ జ్వరమ్ము పుత్రకా!

నివ్వెఱ వీడి లోకములు నేర్పునఁ బాలన సేయు మింపుగన్

15.    

 

 

 

చం.

తగ నపరాహ్న మైన దితి తల్లి వచించి బలారి కివ్విధిన్

మగువకు రాఁగఁ గూ ర్కడరి మత్తున నత్తఱి వేగ సోలె వీ

లుగఁ దల దిక్కు కాళ్లిడి పరుండెను గాలవశమ్మునం గటా

తగ దని యెంచ కింతయును దన్మయ మంది సరోరుహాక్షియే

16.    

 

 

 

తే.గీ.

శిరపు దిక్కునఁ గాళ్లును జరణములకుఁ

దగిలి కురు లుండ వీక్షించి తల్లి నంత

వాసవుండు నవ్వొలయంగ వక్త్ర మందు

నంతరంగమున భృశము సంతసించె

17.    

 

 

 

ఆ.వె.

సూక్ష్మ రూప మూని చోద్యపు ధృతిఁ జేరి

దితి శరీర వివర గతిని నంత

గర్భము గని యదయ ఖండించె నేడు ఖం

డములుగఁ దమకించి నరవరేణ్య!

18.    

 

 

 

ఆ.వె.

వంద యంచులు గల వజ్రమ్ముచే నట్లు

పగులఁ గొట్టఁ బడఁగ బాధ తోడ

పిండ మేడ్చె నంతఁ బెద్ద యెలుఁగు తోడ

నంత మేల్కొనె దితి యార్తి తోడ

19.    

 

 

 

కం.

రోదింపకు రోదింపకు

మో దితి పిండమ యనుచు నహో శక్రుఁడు దా

భేదించె నేడ్చు చున్నను

వే దయ నూనక మది బలభేది రఘువరా!

20.   

 

 

 

కం.

తగదు వధింప వధింపఁగఁ

దగ దని సంభ్రమమున ననఁ దల్లి దితి యటం

దగ గౌరవమే యేపా

రఁగఁ దల్లి వచనముల నుదరము విడి వచ్చెన్

21.    

 

 

 

ఆ.వె.

ప్రాంజలి యయి చక్క వజ్రము తోడుతఁ

బలికెను దితినిఁ గని పదము లందుఁ

గురులు పడఁగ నిదురకు నశుచిగ నుపక్ర

మించి తీవు తల్లి యంచు వజ్రి

22.   

 

 

 

కం.

అద నది కొని శక్రు హరుని

విదారమున దేవి యేడు భిత్తమ్ములుగన్

మది భీతిలి చేసితి న

మ్మ దయన్ క్షమియింపు మని కుమారుఁడు వేఁడెన్

23.   

                                                                                          

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నలువది యాఱవ సర్గము.

 

బాలకాండము

సర్గము 47.

 

 

 

సప్త గర్భ శకలములు మరుద్గణములుగ దేవతలు కావలె నని దితి కోరుట  యింద్రుఁ డంగీకరించుట, ఆ స్థలమున విశాల నగరమును నిర్మించిన నిక్ష్వాకు పుత్రుఁడు విశాలుని వంశ చరిత్ర,  వైశాలుఁ డైన సుమతి విశ్వామిత్రుని పూజించుట.   

 

 

 

 

కం.

శకలము లే డగుట యెఱిం

గి కడుపు దితి చిత్త మందు ఖేదము సెలఁగన్

వికలస్వరమునఁ గాంచి ప

లికెను దురాధర్షుని బలరిపు సాంత్వమునన్

1.      

 

 

 

ఆ.వె.

ముక్క లయ్యె గర్భము సత తునుకలుగ

నాదు తప్పు వలన నీదు దోష

మేమి లేదు పుత్ర! యిందు దేవేశ! బ

లాసురారి! యంచు ననునయించె

2.      

 

 

 

తే.గీ.

గర్భ భేద దుఃఖిత నైతి కరము నాకు

నొక్క ప్రీతి సేయుమ పుత్ర! చక్క నీ మ

రుత్తు లేడ్గుర కేడు గురుస్థల పరి

పాలనమ్ము నొసంగుమ భద్రముగను

3.      

 

 

 

తే.గీ.

అలరి సప్తవాత స్కంధములకు నా కు

మారు లేడ్గురు విభులయి మారుతులుగ

దివిఁ జరింప వలయును గీర్తిని వహించి

దివ్య రూపములఁ జెలంగి దేవముఖ్య!

4.      

 

 

 

ఆ.వె.

బ్రహ్మ లోక మందుఁ బరఁగ నొకఁడు నింద్ర

లోక మందుఁ బరుఁడు వీఁక నుండ

నాకసమ్ము నందు నన్యుఁ డుండ వలయు

వాయు వనఁగ ఖ్యాతి వడసి పుత్ర!

5.      

 

 

 

తే.గీ.

నల్గు రింక సురశ్రేష్ఠ! నా తనయులు

దేవ భూతులై నీ యాజ్ఞ దిశలు నాలు

గింటఁ జరియింప వలయు నకంటకమ్ము

భద్ర మగు నీకుఁ బుత్రక! పనుపు మట్లు

6.      

 

 

 

కం.

పలుక జనని మాటల నా

బలసూదనుఁ డాలకించి ప్రాంజలియై తాఁ

బలికెను బురందరుఁడు క

న్నులు వేయి కలట్టి వాఁడు నుతియించి తగన్

7.      

 

 

 

తే.గీ.

చెప్పినవి యెల్ల నట్లగు శీఘ్రముగను

సంశయమ్ము సుంతయు లేదు జనని నమ్ము

భద్ర మగు నీకుఁ జరియింత్రు వార లట్లు

దేవ నిభులు నీ తనయులు దేవి! వినుమ

8.      

 

 

 

ఆ.వె.

తల్లియుఁ దనయుండు తత్తపోవనమున

నిశ్చయించి యట్లు నెమ్మి దివికి

నరిగి రట కృతార్థులై యిద్ద ఱింపుగ

వింటి మిట్లు రామ! వీరవర్య!

9.      

 

 

 

కం.

ఇది యా దేశము కాకు

త్స్థ! దితి తపము సేయుచుండ శక్రుఁడు సేవిం

చి ధృతి నివాసం బున్న

ట్టిది సిద్ధి నొసంగినది కడింది శుభదమున్

10.    

 

 

 

మ.

నర శార్దూల! యలంబుషా సతికి భూనాథుండు నిక్ష్వాకు నా

మ రవిప్రాభవ వంశ జాతునకు సన్మాన్యంపుఁ బుత్రుండుగాఁ

బర మోదార విశాలుఁడే కలిగె నప్పార్థుండు నిర్మించె నీ

బుర రాజమ్ము విశాల నాఁ దనరగం బుణ్యుంపు టిచ్చోటునన్

11.    

 

 

 

ఆ.వె.

హేమచంద్రుఁడు సుతుఁ డీ విశాలునకు మ

హా బలుండు రామ! యతని పిదప

నయ్యె నతని తనయుఁ డా సుచంద్రుఁ డిల వి

ఖ్యాతుఁ డిద్ధ చరితుఁ డత్యధికము

12.    

 

 

 

ఆ.వె.

నందనుఁడు సుచంద్రునకును ధూమ్రాశ్వుఁడు

యశము వడసెఁ బుడమి నతని నంద

నుండు ఘనుఁడు సృంజయుం డుద్భవించెను

వంశ వర్ధకుండు పరమ పురుష!

13.    

 

 

 

ఆ.వె.

సృంజయుని సుతుండు శ్రీమంతుఁడు సహదే

వుఁడు ప్రతాపవంత పూరుషుండు 

పరమ ధార్మికుండు వర సుతుండు కుశాశ్వుఁ

డతని కుద్భవించె నవని రామ!

14.    

 

 

 

ఆ.వె.

సోమదత్తుఁ డయ్యె సుతుఁడు కుశాశ్వున

కతఁడు విక్రముఁడు మహాయశస్వి

సోమదత్తు నకిల సూనుఁడు కాకుత్స్థ

నామ విశ్రుతుండు రామ! వినుమ

15.    

 

 

 

ఆ.వె.

సుమతి నాముఁ డతని సుతుఁడు తేజస్వి యి

ప్పురమునం దిపుడు రిపుగణ దుర్జ

యుఁడు వసించు చుండు నడరి సుర నిభుండు

రాజ వరుఁడు ధర్మ రతుఁడు రామ!

16.    

 

 

 

తే.గీ.

నృపులు వైశాలికులు దయ నెగడ మిగుల

వారి కిక్ష్వాకునిది యెల్ల వారు వీర్య

వంతులు సుధార్మికులు గుణవంతు లమల

చిత్తు లింక దీర్ఘాయువు లుత్తములును

17.    

 

 

 

కం.

నిలిచెద మిట యీ రాతిరి

యలరి నరవరేణ్య! జనకు నవనీ నాథుం

దెలవాఱినఁ జన్నం గనఁ

గలవు రఘుశ్రేష్ఠ! యంచుఁ గౌశికుఁ డనఁగన్

18.    

 

 

 

తే.గీ.

నరవరుండు తేజస్వి ఘనయశుఁడు నృప

తి సుమతి విని విశ్వామిత్రు దివ్య సంయ

మీంద్రు రాక నచట కట్లు నింపుగ నెదు

రేఁగె సద్భక్తి మీఱంగ వేగ మురిసి

19.    

 

 

 

కం.

గురువులు బంధుజనులతో

నరుదెంచి సుమతి నరేశుఁ డచటికిఁ బ్రీతిం

గరములు మొగిడ్చి పూజ లొ

నరిచి కుశలమడిగి పలికె నమ్రత మునితో

20.   

 

 

 

తే.గీ.

ధన్యుఁడ నయితి మిమ్మిటఁ దాపసేంద్ర!

కాంచి నాదు పురమ్మునఁ గా లిడఁగ న

నుగ్రహమ్ముఁ బడసితి నేను బరుఁ డొకఁడు

ధన్యతరుఁ డెవండును లేఁడు తథ్యముగను

21.    

                                                                                          

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నలువది యేడవ సర్గము.

 

బాలకాండము

సర్గము 48.

 

 

 

గౌతమ మహర్షి సతి యహల్యా శాప వృత్తాంతము.

 

 

 

 

కం.

కలయికఁ గుశలప్రశ్నము

లలరంగఁ గథాంత మందు ననె శుభ వాక్య

మ్ముల నృపతీంద్రుండు సుమతి

లలితముగ మునీంద్రు తోడ రాగం బలరన్

1.      

 

 

 

మ.

ముని చంద్రా! యగు నీకు భద్రము ఘనుల్ పుత్రుల్ సురాభుల్ సుమీ

ఘన శౌర్యమ్మున హస్తి సింహ గమనుల్ గాంచంగ శార్దూల ధు

ర్య నిభుల్ వీరులు పద్మపత్ర నయనుల్ రమ్యాశ్వినీ పుత్ర తు

ల్య ని జాకారులు ఖడ్గ తూణ గుణి విఖ్యా తావతంసద్యుతుల్

2.      

 

 

 

ఉ.

యౌవను లిర్వు రిచ్చటకు నా దివి నుండి యథేచ్ఛ వచ్చిరా

పావన నిర్జ రేంద్రులు నపార కుతూహల చిత్తులై యనన్

భావన మాత్మ నేర్పడఁగఁ బాద చరత్వ విలాస లోలులై

యీ వన వీథి నేల యరుదెంచిరి యెవ్వరు వీరు చెప్పరే

3.      

 

 

 

ఉ.

పోలు చొకండు నొక్కనిని మూర్తినిఁ జేష్టల నింగితమ్ములన్

మే లగు నాయుధమ్ములను మీఱి వహించుచు ధైర్యవంతు లీ

నేల నలంకరించుచు వినీల నభో గత సూర్యచంద్రు లన్

లీలఁగ నేల యీ నర వరిష్ఠులు వచ్చిరొ చెప్పుఁ డింపుగన్

4.      

 

 

 

కం.

విని రాజవరు వచనములు

ముని సిద్ధాశ్రమ నివాసము నసుర వధయున్

వినిపించె మహాత్ముఁడు జరి

గిన వృత్తాంతమ్ము నృపతికి నఖిల మంతన్

5.      

 

 

 

తే.గీ.

క్ష్మాపతి కడు ముదం బంది కౌశికు పర

మర్షి గిరల దశరథు కుమారు లతిథు

లతి బలులను బూజార్హుల నర్హ రీతిఁ

దనరి పూజించెను యథావిధమ్ము ప్రీతి   

6.      

 

 

 

కం.

నృపతి సుమతి గౌరవ మల

రి పడసి రాఘవులు రాతిరి వసించి యటన్

నృప నందనలు స ముని చయ

ము పయన మైరి మిథిల కతి ముదమున నంతన్

7.      

 

 

 

కం.

కని జనకు శుభ పురము మిథి

లను సాధువు సాధువంచు రాజపురమ్మున్

ఘనముగ శ్లాఘించిరి య

ర్చన లిచ్చిరి చిత్తములను సముచిత రీతిన్

8.      

 

 

 

తే.గీ.

నెమ్మి నప్పురంపు టుపవనమ్ము నందుఁ

జనిచని కని శూన్యంపు టాశ్రమము నొక్క

దాని రఘువరేణ్యుఁడు పురాతనము నిర్జ

నమ్ము నడిగె మునిఁ గుతూహలమ్ము సెలఁగ

9.      

 

 

 

కం.

సిరి చెలఁగు నాశ్రమ మనఁ ద

నరు ముని వర్జితమునై కనబడు మునీంద్రా!

పరమాత్మా! యిది యెవ్వరి

వరాశ్రమము మున్ను దెలియఁ బల్కుఁడు నాకున్

10.    

 

 

 

కం.

విని పలికె వాక్య కోవిదుఁ

డనువుగ వాక్యమ్ములను మహా తేజుం డా

ముని పుంగవుండు రాఘవుఁ

గని విశ్వామిత్రుఁ డంతఁ గమనీయముగన్

11.    

 

 

 

కం.

నుడివెద యథార్థముగ ని

య్యెడ నాశ్రమపద చరిత్ర నెల్ల నొక మహా

త్ముఁడు శపియించిన దానిని

బెడిదమ్ముగ రాఘవేంద్ర! విస్తారముగన్

12.    

 

 

 

ఆ.వె.

దివ్య సన్నిభమ్ము దేవ సంచయ సేవి

తమ్ము నైన యాశ్రమమ్ము కలదు

మున్ను దనరి గౌతముండు మహాత్ముఁడు

వాస ముండ నందుఁ బరమపురుష!

13.    

 

 

 

ఆ.వె.

సతి యహల్యఁ గూడి సంవత్సరమ్ములు

పెక్కు తపములు విరివిగ నొనర్చు

చుండె రాజసుత! యశోవిరాజితుఁ డిందుఁ

బరమ పావనుండు బ్రాహ్మణుండు

14.    

 

 

 

కం.

తగిన సమయమ్ము నారసి

నగవైరి యడరి సహస్ర నయనుఁడు శచికిన్

మగఁ డింద్రుఁ డహల్యా దే

విఁ గదిసి మునివేష మూనిఁ బేర్మినిఁ బలికెన్

15.    

 

 

 

కం.

ఋతుకాలము కొఱ కాగరు

లతాంగి! కామార్తు లీ యిల వనజనేత్రా!

మతి యాయెఁ జిత్తమున నో

సుదతీ! నీ సంగమమ్ము సుందరి! వినుమా

16.    

 

 

 

ఆ.వె.

వచ్చినట్టి వాని వాసవుం డని రామ!

కపట వేషు నెఱిఁగి కాంత కపుడు

దేవ రా జనంగఁ దెరలఁ గుతూహల

మతివ సమ్మతించె నంతఁ గుమతి

17.    

 

 

 

తే.గీ.

పూర్ణ కామ చిత్తమ్మున ముదిత పలికె

నంత నే కృతార్థ నయితి నమర ముఖ్య!

శీఘ్ర మేఁగుమ యిటనుండి చెన్నుగ విభు

గౌతముని నుండి నిను నన్ను గాచికొనుమ

18.    

 

 

 

కం.

పలికె నగుచు నింద్రుం డా

లలన నహల్యఁ గని దేవ రాజు ముదమునం

జెలఁగెఁ దనివి సుశ్రోణి! మ

రలెద యథాగతి ననుచు బలరిపువు రామా!

19.    

 

 

 

ఆ.వె.

భామఁ గూడి వీడి పర్ణశాల పురంద

రుండు వేగ గౌతముండు గాంచు

నంచు బయలు పడెను మించ సంభ్రమ మది

స్వీయ చిత్త మందు వెఱచి రామ!

20.   

 

 

 

చం.

కనె హరి యంత వే కదియు గౌతము సన్ముని నుజ్జ్వలత్తపో

ధనుని సురాసు రాజితు నుదప్లుత గాత్రుని వహ్ని దీప్తునిన్

ఘన కర భాసి తాట్ట కుశుఁ గంజ వరాన్వయ వార్ధి చంద్రునిన్

మునిగణ పూజ్యమాను ఘను బుణ్య చరిత్రు విలోల చిత్తుఁడై

21.    

 

 

 

ఆ.వె.

కని వివర్ణ వదన ఘన తాప తప్తుఁ డా

యె సురవిభుఁడు మునివరేంద్రుఁ డంతఁ

గని సహస్రనేత్రు ముని వేషధరు దుష్ట

వృత్తుఁ గినిసి సుగుణవృత్తుఁ డనియె

22.   

 

 

 

ఆ.వె.

నాదు రూప మూని యీ దుష్ట కార్యము

సేసి తీవు దుష్ట! సేయ రాని

కృత్యము నిటఁ గాన వృత్తహీన! యఫలుఁ

డౌదు వీవు సుర గణాధినాథ!

23.   

 

 

 

కం.

పలికిన తత్క్షణ మివ్విధిఁ

బలుకులు ముని సత్తముండు వాసవున కహో

యిల రాలె వృషణములు క

న్నులు వేయి కల సురపతి కనూహ్యముగ వడిన్

24.   

 

 

 

మ.

ముని యా శక్రు శపించి శాప మొసఁగెం బూర్ణేందు బింబాస్యకున్

వనితాహల్యకు స్వీయ దారకును వే వర్షంబు లుండంగ ని

త్య నిరాహారము వాయు భక్షణమునం దాపమ్మునన్ భస్మ శా

యినియై యాశ్రమ మందుఁ గన్పడక తా నెవ్వారి కంచుం గటా

25.   

 

 

 

ఆ.వె.

ఎన్నఁ డీ వనమున కినకుల రాముం డ

జేయుఁ డరుగుదెంచుఁ జిగురుఁ బోడి!

నాఁడు శుచివి యై తనరుదువు దుర్వృత్త!

వేల వేల యేండ్లు క్రాల నట్లు

26.   

 

 

 

ఆ.వె.

అబల! యాతని కిడ నాతిథ్య మింపుగ

మూరి లోభ మోహము లణగంగ

స్వీయ దేహ మూని చేరుదు నన్నింక

ముదము వడసి చిత్తమున భృశమ్ము

27.   

 

 

 

కం.

పలికి ముని యిట్లు వేగమ

కలుష చరితఁ గాంచి యంత గౌతముఁ డా శీ

తల నగము సిద్ధ చారణ

కుల సేవిత మేఁగి చేసె ఘోరపుఁ దపమున్

28.   

                                                                                          

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నలువది యెనిమిదవ సర్గము.

 

బాలకాండము

సర్గము 49.

 

 

 

ఇంద్రునకు మేష వృషణములను గూర్చుట, యహల్యా శాపవిమోచనము, గౌతముఁడు దారతోఁ గూడి రామలక్ష్మణులను సత్కరించుట.

 

 

 

 

కం.

అవృషణుఁడు కాఁగఁ బరిత

ప్త వాసవుఁడు దేవ సిద్ధ వర గంధర్వ

ప్రవర సుచారణ యుత ముం

డ వహ్నితోఁ బలికె నలమట సెలఁగ మదినిన్

1.      

 

 

 

ఆ.వె.

దేవ కార్య మడరి యీ వని గౌతమ

ముని తపంపు విఘ్నము దగఁ జేసి

తిఁ గినియంగఁ జేసి తీవ్రముగ మహాత్ము

నిపుడు సంతసమ్ము నీయ మీకు

2.      

 

 

 

తే.గీ.

నే నయితి నక్కట వృషణ హీనునిగను

భర్త వర్జిత యయ్యె నీ భామ యిపుడు

శాప మీయంగ నడరి రోషమ్ము నూని

యపహరించితి వేగ మా యనఘు తపము

3.      

 

 

 

తే.గీ.

అమర సాహాయ్యుని కమర నంచితంపు

టండకోశము లింపుగ నఖిల సురులు

చారణులు మునులును జేయ సముచితముగ

నుద్యమింప నర్హులు గారె హృద్యముగను

4.      

 

 

 

తే.గీ.

వాసవుని శతక్రతువుని వాక్కు లాల

కించి దేవత లెల్లరు నింపుగను మ

రుద్గణములతో నా యనలుండు ముందు

నుండఁ బితృదేవులను జేరి యుచిత రీతి

5.      

 

 

 

ఆ.వె.

పల్కి రిట్లు మేష వరము సవృషణ మి

ది యఫలుండు నయ్యె దేవపతియె

మేష ముష్కములను మీరు దేవ పతికిఁ

గూర్పుఁ డంచు వారు కోరి రంత

6.      

 

 

 

ఆ.వె.

అఫల మైన మేష మందించుఁ గడు తుష్టి 

మీకు నారగింప మేదినీ జ

ను లొసఁగుదురు వీని నిల నంచితమ్ముగ

హర్ష మడరఁగ హృదయమ్ము లందు

7.      

 

 

 

తే.గీ.

అగ్నిమాటలు వినినంత నా పితరులు

శక్రున కిడిరి పెకలించి చక్క తగరు

నండకము లంత శీఘ్రమ యద్భుతముగ

సంతసింప నమరు లెల్ల శక్రుఁ గూడి

8.      

 

 

 

తే.గీ.

నాఁటి నుండి కాకుత్స్థ! యనవరతమ్ము

బీజ హీన మేషమ్ముల నోజఁ దింద్రు

పితరు లెల్ల కలసి యీయ బీజములు పు

రందరునకు నా రీతి గౌరవము సెలఁగ

9.      

 

 

 

కం.

గౌతము తపః ప్రభావము

చేత నజ వృషణుఁ డకట శచీపతి యయ్యెన్

వీత నిజ బీజుఁ డింద్రుం

డాతత బలవిక్రముండు నాదిత్యుండే

10.    

 

 

 

తే.గీ.

రమ్ము రామ! పుణ్యుని యాశ్రమమ్ముఁ గాంచ

నిట మహాతేజ! తరియింప నీ యహల్య

ను సతి దేవరూపిణిని వినుత మహా త

పః పునీతను గాకుత్స్థ! భద్రముగను

11.    

 

 

 

కం.

విని తగ నా విశ్వామి

త్రుని వచనము లెల్ల ముని వరుఁడు ముం దలరం

గ ననుజుఁడు లక్ష్మణునితోఁ

జనె రాముఁడు ప్రీతిఁ బర్ణశాలకు నంతన్

12.    

 

 

 

చం.

అడుగిడి కాంచె దాశరథి యాశ్రమ మందు నహల్య వ్యోమ భా

గుడు గణ కాంతి తుల్యఁ బ్రజ కుర్వి నగోచర మౌనికుల్య నా

పడతిని దీప్త కల్య రవిభాసన తుల్యను ధాతృమాయనున్

బడబ ధవానుకూల్యఁ దుహినస్థిత సాభ్ర సుధాంశు తుల్యనున్

13.    

 

 

 

తే.గీ.

దుర్నిరీక్ష యయ్యె నహల్య పర్ణశాల

యందు ముల్లోకములకు మహర్షి గౌత

ముని వచనముల దర్శనము రఘు రాము

నిది కలుగు నంత వఱకు సునిశ్చయముగ

14.    

 

 

 

కం.

శాపాంతము చేరువ కా

నా పార్థ కుమారు లంత నట చేరంగం

జూపులకు గోచర మయిన

నా పడతికి మ్రొక్కి రిద్ద ఱప్పుడు భక్తిన్

15.    

 

 

 

కం.

తలఁచి పతి గౌతము వచన

ములను బలికి స్వాగతము సముచితం బర్ఘ్య

మ్ములు పాద్యము లాతిథ్య

మ్ముల నీయ సతి రఘువరుఁడు ముదమున కొనియెన్

16.    

 

 

 

తే.గీ.

పుష్ప వర్షము కురిసె విపులముగాఁ జె

లంగె దేవదుందుభులు వెలింగె నప్స

రసల నాట్యమ్ము గంధర్వ రమ్య సంఘ

మలరె నింపుగ విలసిల్లె హర్ష మచట

17.    

 

 

 

ఆ.వె.

పల్కి రెల్ల రంత బాగు బాగని ప్రీతి

సతి నహల్యఁ గాంచి నుతుల ముంచి

రి పతి వశగ నుచిత రీతిఁ దపో బల

శుద్ధ తన్వి వినుత బుద్ధి నడరి

18.    

 

 

 

కం.

తగఁ బూజించి రఘూత్తము

ని గౌతముఁడు తాపసుండు నిజ దార యుత

మ్ముగ ఘన తేజుండు తపం

బు గరిమ నొనరింపఁ జాగె ముద మేపారన్   

19.    

 

 

 

కం.

రాముఁడు సుపూజ నంది మ

హా ముని గౌతముఁడు సేయ నంచిత రీతిన్

నీమముల నెంచి ప్రీతిని 

నా మిథిలా నగరమునకు నలరుచు నరిగెన్

20.   

                                                                                          

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నలువది తొమ్మిదవ సర్గము.

 

బాలకాండము

సర్గము 50.

 

 

 

రామలక్ష్మణులు విశ్వామిత్రుని మునులను గూడి జనకుని యజ్ఞ వాటమును జేరుట, రాఘవులను జనకునకుఁ బరిచయము చేయుట.

 

 

 

 

కం.

ముని విశ్వామిత్రుని నిడి

మునుముం దీశాన్య దిశకుఁ బూర్ణోత్సాహ

మ్మున నేఁగి యజ్ఞవాట

మ్మును రాముఁడు లక్ష్మణుండు పొలసిరి ప్రీతిన్

1.      

 

 

 

కం.

మునిశార్దూలునితోఁ దా

ననియె సలక్ష్మణుఁడు రాముఁ డానందమునన్ 

జనకుని మహాత్ముని వర స

వనపు సమృద్ధి విలసిల్లె బాగుగ నిచటన్

2.      

 

 

 

ఉ.

వేల కొలంది బ్రాహ్మణులు భిన్న విభిన్న విదేశ వాసులే

మేలుగఁ జేరి రిచ్చటను మింతు రధీతిని నిత్య మెంచఁగం

జాల చెలంగు వాటికలు చక్కఁగ నిచ్చట నూఱు బండ్లలోఁ

దేలెను వస్తుసంచయము తెల్పుఁడి యెల్లర ముండఁ జోటునున్

3.      

 

 

 

కం.

విని రాముని వచనమ్ములు

ముని విశ్వామిత్రుఁడు జలము విరివిగా నుం

డిన యేకాంతపుఁ జోటును

గని యెంచె వసింపఁగా సుఖమ్ముగ నంతన్

4.      

 

 

 

తే.గీ.

కౌశికుని రాక విని జనక నృపతీంద్రుఁ

డతి రయమునఁ బురోహితుఁ డధ్యయన ర

తుని శతానందుఁ దోడ్కొని ముని వరేణ్యు

న కెదురేఁగె వినయము దనరఁగ భక్తి

5.      

 

 

 

తే.గీ.

ఋత్విజులు మహాత్ములు గొని యెలమి నర్ఘ్య

ములను సత్వరము సమంత్రము లొసఁగంగ

ధర్మయుతముగ నధ్వర కర్మరతుఁడు

తగ గ్రహించె విశ్వామిత్ర తాపసుండు

6.      

 

 

 

కం.

నృపతి మహాత్ముని జనకుని

సుపూజల గ్రహించి యా వసుమతీశునిఁ దా

నపుడు కుశలమ్ము నిఁక జ

న్నపు శుభ చరితమ్ము నంత నయముగ నడిగెన్

7.      

 

 

 

ఆ.వె.

మునుల నొజ్జల నిఁక మూరి పురోహితు

లను యథా నయమ్ముగ నడుగఁ గుశ

లమ్ము మునివరుండు రహిఁ జేరి రెల్ల ర

చటకు సంయమీంద్రు సరస కడరి

8.      

 

 

 

తే.గీ.

అంత రాజు కృతాంజలుఁ డై మునీంద్రుఁ

గాంచి పలికె నిట్లు మునిపుంగవులఁ గూడి

దేవ యాసీనుఁ డవు కమ్ము దివ్యమైన

యీ వరాసనమ్మున నంచు నెడఁద వొంగ

9.      

 

 

 

కం.

ఆసీనుఁ డయ్యెఁ గౌశికుఁ

డాసనమున గురువు లింక నధ్వర్యులతో

నా సామాత్యుఁడు నృపతియు

నాసీనుం డయ్యెఁ బ్రీతి నా సమయమునన్

10.    

 

 

 

తే.గీ.

అంద ఱప్పుడు గూర్చుండ నరసి రాజు

సముచితమ్ముగ నంతట సంయమీంద్రుఁ

గౌశికునిఁ గాంచి పల్కె వాక్యమ్ములు వచ

నజ్ఞుఁ డివ్విధి నెడఁద నానంద మడర

11.    

 

 

 

తే.గీ.

నేఁడు చేసిరి సురలెల్లఁ గూడి నాదు

యజ్ఞ సుసమృద్ధి సఫలమ్ము విజ్ఞ! నిజము

నేఁడు మీ రాక సేకూర్చె నెమ్మి నాకు

యజ్ఞ ఫలము సత్వరముగ నార్య నిజము

12.    

 

 

 

తే.గీ.

ధన్యుఁడ నయితి మిమ్మిటఁ దాపసేంద్ర!

కాంచి నాదు సవన వాటికను భృశము న

నుగ్రహమ్ముఁ బడసితి నేను ముని సంచ

యమ్ము తోడ మీ రడుగిడ సమ్మదమున

13.    

 

 

 

ఆ.వె.

సంయమీంద్ర దేవ! జన్నపుఁ బండ్రెం డ

హముల శేష మున్న దంచు నంద్రు

విదులు సంతసమునఁ బిదప భాగార్థము

రాఁగఁ జూడ నగు సుర వరుల నిట

14.    

 

 

 

కం.

అని ముని శార్దూలునితో

జనకుఁడు హర్షమునఁ దిర్గి సంయమి వరుతో

ననియెం బ్రాంజలి నివ్విధి  

వినతు లొనర్చి నృపవరుఁడు వినయము దోఁపన్

15.    

 

 

 

మ.

ముని చంద్రా యగు నీకు భద్రము ఘనుల్ పుత్రుల్ సురాభుల్ సుమీ

ఘన శౌర్యమ్మున హస్తి సింహ గమనుల్ గాంచంగ శార్దూల ధు

ర్య నిభుల్ వీరులు పద్మపత్ర నయనుల్ రమ్యాశ్వినీ పుత్ర తు

ల్య ని జాకారులు ఖడ్గ తూణ గుణి విఖ్యా తావతంసద్యుతుల్

16.    

 

 

 

ఉ.

యౌవను లిర్వు రిచ్చటకు నా దివి నుండి యథేచ్ఛ వచ్చిరా

పావన నిర్జ రేంద్రులు నపార కుతూహల చిత్తులై యనన్

భావన మాత్మ నేర్పడఁగఁ బాద చరత్వ విలాస లోలులై

యీ వన వీథి నేల యరుదెంచిరి యెవ్వరు వీరు చెప్పరే

17.    

 

 

 

ఉ.

పోలు చొకండు నొక్కనిని మూర్తినిఁ జేష్టల నింగితమ్ములన్

మే లగు నాయుధమ్ములను మీఱి వహించుచు ధైర్యవంతు లీ

నేల నలంకరించిరి వినీల నభో గత సూర్యచంద్రులం

బోలుచుఁ గాక పక్ష ధర మూర్తులు వీరుల నెంతు నేరఁగన్

18.    

 

 

 

కం.

విని జనకు నుడులను దశర

థ నందను లని యెఱిగించెఁ దద్దయు ప్రీతిన్

వినిపించె మహాత్మున కా

ముని సిద్ధాశ్రమ నివాసము నసుర వధయున్   

19.    

 

 

 

తే.గీ.

దర్శనము విశాలుని మఱి దర్శనమ్ము

సతి యహల్యది గౌతమ సంయమీంద్ర

దర్శనము చూడ నిచ్చ సద్ధనువుఁ దెలిపి 

యూరకుండె విశ్వామిత్రుఁ డుచిత రీతి

20.   

                                                                                          

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నేఁబదవ సర్గము.

 

బాలకాండము

సర్గము 51.

 

 

 

గౌతమ నందనుఁడు శతానందుఁడు రామునకు విశ్వామిత్ర బ్రహ్మర్షి చరిత్రమును వివరించుట.

 

 

 

 

మ.

వశి రోమాంచితుఁ డయ్యెఁ దా వినఁగ విశ్వామిత్ర వాక్యమ్ము లె

ల్ల శతానందుఁడు సత్తపో బల మహాప్రాశస్త్య విభ్రాజితుం

డ శమాక్రోధన గౌతమాత్మజుఁడు సూర్యామ్నాయ కాకుత్స్థుఁ గాం

చి శశాంకానను విస్మయమ్ము వడసెం జిత్రమ్ముగా నచ్చటన్   

1.      

 

 

 

కం.

కని రామలక్ష్మణు లిరువు

రను గూర్చుండ సుఖముగ నరశ్రేష్ఠు లటన్

ముని విశ్వామిత్రుం గని

యనియె శతానందుఁ డిట్టు లాశ్చర్యముగన్

2.      

 

 

 

కం.

చూపితివే ముని పుంగవ

క్ష్మాప తనూజునకు నాదు జననిని సుమహా

తాపసిని యశస్విని నిజ

తాపము తీరఁగఁ గృశతర తన్విన్ ధన్యన్

3.      

 

 

 

కం.

కొలిచినదే రాఘవుని న

ఖిల జన పూజార్హుని వరకీర్తన నిచయ

మ్ముల నా జననీమణి సద

మల చిత్తత సంయమీంద్ర! మఱి వన్యములన్

4.      

 

 

 

కం.

తెలిపితివే మునివర ము

న్నల జరిగిన దెల్ల నట మదంబకు నకటా

బలరిపుఁ డొనరించిన య

క్కలుషపుఁ గృత్యమ్ము గూర్చి కౌశిక! కరుణన్

5.      

 

 

 

కం.

కలసినదే భద్రమ్మగు

నిల నీకు నిజ జనని గురు నినవంశజు ని

ర్మల దర్శనమ్ము వడసి వి

మలాత్మ యింపుగ మునిజన మాన్యవరేణ్యా!

6.      

 

 

 

కం.

పడసెనె రాముఁడు కౌశిక!

యడరుచు నా తండ్రి పూజ లానందమునం

బడసెనె జనకుఁడు రాముం

డడరి యొనర్పంగఁ బూజ లపుడు ముదమునన్

7.      

 

 

 

కం.

ఒనరిచెనే శాంత మదిని

ముని పుంగవ! రఘువరుండు మురియుచుఁ దగ నా

జనకుండు రాఁగ నచటకు

వినయాన్విత వందనములు విశ్వామిత్రా!

8.      

 

 

 

కం.

అన విని విశ్వామిత్రుఁ డ

నెను వాక్యజ్ఞుఁడు కడింది నెమ్మి శతానం

దుని వాక్య కోవిదు నరసి

మినుకులు ప్రత్యుత్తరముగ మేటి గురుండే

9.      

 

 

 

ఆ.వె.

ఏది యేని విడువ లేదు మునిశ్రేష్ఠ

చేయఁ దగిన దెల్లఁ జేసితి నట

మునినిఁ గూడె పత్ని ముదమార భార్గవ

రేణుకలు కలసిన రీతి చెలఁగి

10.    

 

 

 

కం.

ముని విశ్వామిత్రు మినుకు

ల నా శతానందుఁడు విని రాముని వీక్షిం

చి నయముగ మహా తేజుం

డనె నీ విధి భాషణముల నాదర మలరన్

11.    

 

 

 

ఆ.వె.

స్వాగతమ్ము పురుష శార్దూల! రాఘవ!

నీకు వచ్చి తీవు నెమ్మి నజితు

మునివరేణ్యునిం దపోధను ముందుంచి

యిట కదృష్ట మనఁగ నెంతు నెడఁద

12.    

 

 

 

తే.గీ.

నీ వెఱిఁగితె విశ్వామిత్రుని నతులప్ర

భా విలసితు బ్రహ్మర్షినిఁ బరమ గతియె

యెల్లర కనూహ్య కర్ముని నిద్ధ తపపు

బలము చేతను తేజస్విఁ బార్థ తనయ!   

13.    

 

 

 

ఆ.వె.

అన్యుఁ డొకఁడు లేఁడు ధన్యతరుఁడు నిన్ను

మించి గొప్ప తపము మించి చేసి

న మునిపుంగవు వలన ఘన రక్షితుఁడవు

కౌశికు వలన భువిఁ గాంచ రామ!

14.    

 

 

 

కం.

కుశికాత్మజుని తపశ్శ

క్తి శుభ చరిత్రంబు నెల్లఁ గీర్తింతుఁ దగన్

దశరథ నందన! వినుమా

విశదమ్ముగ నే నుడువఁగఁ బ్రీతిన్ రామా!

15.    

 

 

 

కం.

చిరకాలము నేలె నితఁడు

ధరాతల మరిందమనుఁడు ధర్మజ్ఞుఁడు ధ

ర్మ రతుఁడు బ్రజా హితమ్ము నొ

నరించుచుఁ జదువరియై యినకుల వరేణ్యా!

16.    

 

 

 

కం.

కలడు ప్రజాపతి తనయుం

డిలఁ గుశ నామ ధరణీ పతీంద్రుఁ డతనికిన్

బలవంతుఁడు ధార్మికుఁడుం

గుల వర్ధన నందనుండు కుశనాభుండే

17.    

 

 

 

తే.గీ.

గాధి యన విశ్రుతుం డైన ఘనుఁడు నంద

నుండు కుశనాభునకు గుణమండితుండు 

నతని సుతుఁడు విశ్వామిత్రుఁ డతి తపో ధ

నుండు నృవరుండు నలఘు తేజుండు రామ!

18.    

 

 

 

కం.

విశ్వామిత్రుం డేలెను

విశ్వంభర ధర్మ యుతము విఖ్యాతిఁ బ్రజా

విశ్వాసము సూఱ కొనుచు

శాశ్వత చిరకాల రాజ్య సౌఖ్యము లలరన్

19.    

 

 

 

తే.గీ.

సైన్యము సమకట్టి తగ రాజన్యుఁ డొక్క

దివసమున మహా తేజుఁడు తేజ మలర

నొక్క యక్షౌహిణీ సేన యుండఁ బరివృ

త మయి విహరించె ధరణి నుత్సాహమునను

20.   

 

 

 

ఆ.వె.

తిరిగి తిరిగి వరుసఁ బురములు రాష్ట్రము

లేఱులు గిరులు పృథివీశుఁ డాశ్ర

మములు తుదకుఁ జేరె మహితంపు టాశ్రమ

మొక్కటి నట నుండ నక్కజముగ

21.    

 

 

 

మ.

నరనాథుండు వసిష్ఠు నాశ్రమము నానా వృక్ష నానా మృగ

స్తిర సంవాస సుశోభితమ్ము విలసద్దే వాసురవ్రాత కి

న్నర గంధర్వ ససిద్ధ చారణ వితానప్రార్థ నానీక సు

స్వర సువ్యాప్తముఁ బక్షి సంఘ హరిణచ్ఛాయా ప్రదీప్తమ్మునున్

22.   

 

 

 

మ.

వర దేవర్షి గణార్చితమ్ము సుమహా బ్రహ్మర్షి దివ్యాంగ భా

సుర దేశమ్ముఁ దపో రతద్విజ గణాక్షోభ్యమ్ము నీరాశ నా

పర వాయ్వన్న కృశచ్ఛ దాశన మహా వన్యాశ నామ్నాయమున్

వర వైఖానస వాలఖిల్య గణ సంవాసమ్ముఁ గాంచెం దమిన్

23.   

 

 

 

తే.గీ.

దాంతు లగ్నికల్పులు మహత్తర మనో వి

రాజితులు గత రోషులు నా జితేంద్రి

యులు నిరంతరం బుండంగ నెలమి నచట

నట్టి పుణ్యాశ్రమము గాంచె నలర మనము

24.   

 

 

 

తే.గీ.

కనియె నపరంపు బ్రహ్మ లోకమ్మనంగ

వెల్గెడు వసిష్ఠుని మఠము వీరవరుఁడు

బల్లిదుండు విశ్వామిత్ర పార్థివుండు

దుర్జయశ్రేష్ఠుఁడు మది సంతోష మడర

25.   

                                                                                          

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నేఁబది యొకటవ సర్గము.

 

బాలకాండము

సర్గము 52.

 

 

 

విశ్వామిత్రునకు స్వాగతము పలికి బ్రహ్మర్షి వసిష్ఠుఁడు రాజునకు ససైన్య మాతిథ్య మిచ్చుటకు నిర్ణయించి శబలినిఁ గామధేనువును సంభారములను సమకూర్చుటకు నాదేశించుట.

 

 

 

 

కం.

కని తాప సోత్తము వసి

ష్ఠుని విశ్వామిత్రుఁడు బలి సుక్షత్రియుఁ డా

ననము వికసింపఁ బ్రీతిని

వినయాన్వితుఁ డయి నతు లిడె వీరుం డంతన్

1.      

 

 

 

ఆ.వె.

స్వాగతమ్ము పలికి సంయమీంద్రుఁడు వసి

ష్ఠుండు రాజ సత్తముండు కౌశి

కునకు నాసనమ్ము కూర్మి నాదేశించె

భగవ దాభుఁ డడరి బ్రాహ్మణుండు

2.      

 

 

 

ఆ.వె.

వెలయ నాసనమున నలరి విశ్వామిత్రుఁ

డు తగినట్టి రీతి వితత సఫల

మూలముల నొసంగె మునివర శ్రేష్ఠుండు

గౌరవమ్ము తోడ నారగింప

3.      

 

 

 

ఆ.వె.

తా గ్రహించి పూజఁ దాపసోత్తముఁ డీయ

రాజ సత్తముండు నోజ నడుగ

నగ్నిహోత్ర శిష్య యజ తపస్తరు కుశ

లముల సర్వము కుశల మనియె ముని

4.      

 

 

 

కం.

కని విశ్వామిత్రు సుఖము

గ నాసనమున వరజపి నికాయ శ్రేష్టుం

డు నలువ పట్టి వసిష్ఠుఁడు

ఘన తాపసి యంత నడిగెఁ గౌశికు నిట్లున్

5.      

 

 

 

తే.గీ.

క్షేమమె నరేంద్ర! పాలింతువే మహి నల

రంగఁ బ్రజలు సధర్మము రాజ నీతి

దలఁచి ధార్మిక! నిత్యము దయ నరయుదె

భృత్యు లెల్లరను వశులె పేర్మి నీకు

6.      

 

 

 

ఆ.వె.

రిపు నిషూదన! తవ రిపు వర్గము జయించి

తె బల కోశ సఖులు నెల్ల రింక  

నీవుఁ బుత్ర పౌత్ర నిచయమ్ము క్షేమంబె

యంచుఁ బార్థివేంద్రు నడుగఁ బ్రీతి

7.      

 

 

 

తే.గీ.

అంతటఁ గుశలము మునీంద్ర యని వచించె

వినయమునను విశ్వామిత్రుఁడు నగ వలర

నొండొరులు చిరకాలము యుక్త రీతిఁ  

జలిపి భాషణములు ప్రీతి నలరి రంత

8.      

 

 

 

కం.

నగుచుం దుదను వసిష్ఠుఁడు

భగవంతుఁడు రఘువరేణ్య! పన్నుగ మధురం

బగు వచనమ్ములు భద్ర

మ్ముగ విశ్వామిత్రు తోడ ముదముగఁ బలికెన్

9.      

 

 

 

కం.

ఎంచితి నాతిథ్యము నే

నంచితముగ వీర్యవర్య! యర్హ విధముగన్

మించ రుచుల నీకును బల

సంచయమున కీయ నీదు సమ్మతి నిమ్మా

10.    

 

 

 

కం.

పర మాతిథి వీ విచటఁ ది

విరి చేయం దగును బూజ విశ్వామిత్రా!

సురుచిరము సేయ కార్య మ

లరి నేను గ్రహించు టొప్పు రాజవరేణ్యా!

11.    

 

 

 

కం.

పలుక వసిష్ఠుం డివ్విధి

విలసిల్ల ముఖ కమలమ్ము విశ్వామిత్రుం

డలరుచుఁ బ్రియమార నపుడు

పలికె నొనర్చితివి దేవ! పన్నుగ నంచున్

12.    

 

 

 

చం.

ఫలములు మూల సంచయము పాద్యము నాచమ నీయ మిచ్చి మా

కలరుచు నాశ్రమ స్థితము లంచితపున్ నిజ  దర్శనాది పూ

జ లిడితి రర్హ రీతి నిట సంయమి పుంగవ! మీకు వందన

మ్ములు నను స్నేహభావమున ముద్దుగఁ గాంచుఁడి పోయి వచ్చెదన్

13.    

 

 

 

ఆ.వె.

ఇట్టు లనిన నరవరేంద్రుని వచనము

లాలకించి ముని మహాత్ముఁ డాగ

క మఱి మఱి యడిగెను గౌశికు నాతిథ్య

మలరి సమ్మతింపు మంచు రామ!

14.    

 

 

 

కం.

మంచిది యనె గాధేయుం

డెంచి వసిష్ఠు వచనముల నెల్ల ననియె మీ

రెంచిన యట్టి విధమ్ముగ

నంచితముగ నగు మునీంద్ర! యంచు ముదమునన్

15.    

 

 

 

తే.గీ.

ముదము నంది మహాత్ముఁడు మునుల నుత్త

మ తముఁడు వసిష్ఠుఁ డలఘుఁ డమలమతి యెల

మిఁ బిలిచె నపుడు కల్మాషినిఁ బరమంపు

గోవు నా కామధేనువు దేవ సముఁడు

16.    

 

 

 

తే.గీ.

రమ్ము రమ్ము శబల వచనమ్ము లాల

కింపు సబలము రాజున కేను ప్రీతి  

నీయ సత్కార మెంచితి నింపు గొలుపు

భోజ నాదుల సమకూర్పు పుణ్యచరిత!

17.    

 

 

 

తే.గీ.

ఎవ్వ రెవ్వరి కేమేమి యిష్ట మగునొ

వాని నెల్లఁ దత్క్షణమ యవారితముగ

షడ్రసోపేతములను నొసంగ వలయు

నా కొఱకు సమస్తముల ననాయసమ్ము

18.    

 

 

 

తే.గీ.

సరస విమల పానీయ చోష్య వరలేహ్య

భక్ష్య భోజ్య సంచయము లపారముగను

సకల వస్తు నికాయము సమ్మతముగ

శబల! రయమునఁ బుట్టించు ప్రబల మహిమ

19.    

                                                                                          

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నేఁబది రెండవ సర్గము.

 

 

బాలకాండము

సర్గము 53.

 

 

 

ససైన్యము విశ్వామిత్రునకు కామధేనువు విందు సమకూర్చుట, గో మహిమకు మెచ్చి వసిష్ఠునిఁ  గామధేనువు నిమ్మని విశ్వామిత్రుఁడు వేఁడ బ్రహ్మర్షి నిరాకరించుట.

 

 

 

 

కం.

అన నరిసూదన! యివ్విధి

మునీశుఁడు వసిష్ఠుఁడు విని మూరి శబల కో

రిన వెల్లం గూర్చెను గో

రిన వారికి వా రడిగిన రీతి రయమునన్

1.      

 

 

 

ఆ.వె.

చెఱకు ముక్క లింకఁ జేరుళ్లు తేనియ

లు మఱి పానకమ్ము లమర భక్ష్య

ములు మహత్తరములు మూర మైరేయము

లలరెఁ బాత్ర లందు నంచితముగ

2.      

 

 

 

మ.

ధవళో ష్ణావిర ళాన్నరాసులు మహాధాత్రీ ధరాభమ్ములున్

నవ మృష్టాన్నము లిద్ధ సూపములు సన్నద్ధేద్ధ దధ్యంబుధుల్

వివి ధానేక రసోత్తమమ్ములును హృద్వేద్యమ్ములౌ షడ్రుచుల్

ఛవిమద్గౌడ విశేష భక్ష్య తతి సంసర్గంపుఁ బాత్రాళియున్ 

3.      

 

 

 

తే.గీ.

సర్వము విలసిల్ల నపుడు సంయమి వరుఁ

డా వసిష్ఠుఁ డీయఁగఁ దృప్తి నంది రెల్ల

జనులు గాధేయుని మహిత సైన్య మందు

సంతసించిరి రాఘవ! స్వాంతములను

4.      

 

 

 

తే.గీ.

అంతిపురపుఁ బూఁబోడుల నవని సురుల

నిజ పురోహితులను గూడి నెమ్మి నొంది

రాజమౌని విశ్వామిత్రుఁ డా జనపతి

వొందెఁ బుష్టి తనివి విందు నంది యట్లు

5.      

 

 

 

తే.గీ.

సచివ సామాత్య నిజభృత్య సహిత మవని

విభుఁడు పూజింపఁబడి యట్లు విరియ హర్ష

మంతరంగ మందు వసిష్ఠు నరసి బ్రహ్మ

ఋషినిఁ బలికె విశ్వామిత్రుఁ డిట్లు రామ

6.      

 

 

 

ఆ.వె.

గౌరవింపఁ బడితి గౌరవార్హముగను

దేవ! చేయ మీరు దివ్యముగను

వాక్య కోవిదులరు వాక్య మొక్కటి విన్న

వింతు నేను దాని వినుఁడు ప్రీతి

7.      

 

 

 

తే.గీ.

శబల నిండు గో శత సహస్రముల నిత్తు

దేవ! దీనికి మారుగ ధీ వరేణ్య!

రత్న మిది రత్న హరుఁ డగు రాజు భువిని

శబల నీయ ధర్మ మగును సత్య మెంచ

8.      

 

 

 

చం.

అన ధరణీధవుండు కుశికాత్మజుఁ డట్లు వసిష్ఠుఁ డంతఁ బ

ల్కెను వచనమ్ము లిట్టులు విరించి నికాశుఁడు ధర్మయుక్తముల్

దనరి యొసంగ గోవుల శతమ్ములు నింక సహస్ర కోటులున్

ఘన కలధౌత రాసులును గామదుహమ్ము నొసంగ భూవరా!

9.      

 

 

 

ఆ.వె.

సజ్జనునకుఁ గీర్తి సదృశముగ శబల

శాశ్వతమ్ము నాకు సమ్మదముగ

నిమ్మహి రిపుదమన! యెమ్మెయి నా చెంత

వీడ రానిది పృథివీధవుండ!

10.    

 

 

 

తే.గీ.

ఇదియ యాధారము నరవరేంద్ర నాదు

హవ్య కవ్యములకుఁ బ్రాణ యాత్ర కింక

నగ్నిహోత్ర హోమములకు నర్పణముల

కును శబలఁ గామధేనువుఁ గోరఁ దగదు

11.    

 

 

 

కం.

చను నిది స్వాహాకార

మ్మునకు వషట్కారమునకు భూపా! విద్యా

ది నిచయముల కాధారము

గను సకలమునకు నరేంద్ర కన నిశ్శంకన్

12.    

 

 

 

తే.గీ.

నిక్క మెంచ సర్వస్వము చక్కఁగ నిది

నాకు రాజన్య! తుష్టిని నాకు నొసఁగు 

నిత్యము కలవు హేతువు లత్యధికము

లీయఁ జాల నీ శబలను వేయు నేల

13.    

 

 

 

కం.

అన బ్రహ్మర్షి వసిష్ఠుఁడు

విని విశ్వామిత్రుఁడు ముఖ విజ్ఞుం డనియెన్

మినుకుల నతి సంరంభ

మ్మున రాజ వరేణ్యుఁ డంతఁ బ్రోత్సాహముగన్

14.    

 

 

 

తే.గీ.

పసిడి మొలనూలు మెడనూలు వంకియ లల

రంగఁ దిరుగాడు నేనుఁగులను మునీంద్ర!

యిత్తుఁ బదునాల్గు వేలను మొత్తములను

సత్వరమ్ముగ నిఁక నైన శబల నిమ్ము

15.    

 

 

 

తే.గీ.

పుత్తడి యరదమ్ములు కట్ట నుత్తమములు

తెల్లనివి గుఱ్ఱములు నాల్గు కళ్లెములును

బరఁగఁ జిరుగంట లెనిమిది వంద లిత్తు

సత్వరమ్ముగ నిఁక నైన శబల నిమ్ము

16.    

 

 

 

తే.గీ.

మంచి తెగఁ బలు నేలల నంచితముగఁ

బుట్టి నట్టి దిటవు గుఱ్ఱములను బదు నొ

కండు వేల నిత్తు మునీంద్ర! మండితముగ

సత్వరమ్ముగ నిఁక నైన శబల నిమ్ము

17.    

 

 

 

తే.గీ.

రంగు రంగుల గోవులు రంజిలంగ

యౌవనమ్మున మిక్కిలి యంద మొలుక

నొక్క కోటి నొసంగుదు నక్కజముగ

సత్వరమ్ముగ నిఁక నైన శబల నిమ్ము

18.    

 

 

 

తే.గీ.

వేఁడి నన్ని రత్నమ్ములు వేఁడి నంత

పైఁడి నైన నిప్పట్టున వార కిత్తు

మునివరేణ్య! సర్వంబును బుణ్యపురుష!

సత్వరమ్ముగ నిఁక నైన శబల నిమ్ము

19.    

 

 

 

కం.

విని విశ్వామిత్రు గిరలు  

మను జాధీశా! తగ వినుమా నే నెబ్భం

గిని నైనను నీ కీఁ జా

ల నని వసిష్ఠుండు వలికె రఘుకుల వర్యా!

20.   

 

 

 

ఆ.వె.

ఇదియె నాదు రత్న మిదియె నాదు ధనము

సర్వ మిదియె నాకు శంక యేల

నాదు జీవితమ్ము నరనాథ! యెంచంగ

నిదియె చుమ్ము బ్రతుకఁ బదిలముగను 

21.    

 

 

 

తే.గీ.

సవనములు దర్శ పూర్ణమాసమ్ము లింక

నపర దక్షిణ సహితంపు యాగములను

నా కగు నిదియె రాజన్య! వీఁకఁ జేయఁ

బెక్కు కర్మము లందును దిక్కు సుమ్ము

22.   

 

 

 

కం.

మూల మిదియ సందేహం

బేల సకల కార్యములకు నెంచఁగ నా కీఁ

జాల నిలఁ గామధేనువు

నేల వదరఁ బెక్కు మాట లివ్విధి నధిపా

23.   

                                                                                          

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నేఁబది మూడవ సర్గము.

 

 

 

బాలకాండము

సర్గము 54.

 

 

 

విశ్వామిత్రుఁడు కామధేనువును బలమునఁ గొనిపోవుచుండ వసిష్ఠు ననుమతి శబల సైన్యమును సృష్టించి కౌశికుని సైన్యమును బరిమార్చుట.

 

 

 

 

కం.

మునివరుఁడు వసిష్ఠుఁడు శబ

లను దన కీకున్నఁ గనలి రాజవరుం డే

మని యందుఁ గామధేనువుఁ

గని బల్మినిఁ గొని తరలెను గాకుత్స్థ! వడిన్

1.      

 

 

 

కం.

అపహృతము కా మహాత్ముని  

నృపు విశ్వామిత్రు చేత నిర్వేదమునం

దపియించి శబల రాఘవ!

విపరీతమ్ముగఁ దలఁచెను వేదన నిట్లున్   

2.      

 

 

 

ఆ.వె.

దీన నైతి దుఃఖ మూనితి నక్కట

యేల విడిచె నన్ను నీ ముని వరుఁ

డదయ నీ మహాత్ముఁ డజ సన్నిభుఁడు వసి

ష్ఠుండు రాజభటులు చూఱకొనఁగ

3.      

 

 

 

ఆ.వె.

భావితాత్ముఁ డేల నీ వసిష్ఠుఁడు నన్ను

విడిచె నెట్టి తప్పు కడఁగితి నని

యిష్ట  నేను భక్త నిట్టి యమాయకఁ

దాపసుండు పరమ ధార్మికుండు

4.      

 

 

 

చం.

మదినిఁ దలంచి యివ్విధము మాత కడుంగడు నిశ్వసించి యా

పదిలపు రాజసైన్యమును బక్కకుఁ ద్రోసి బలమ్ము మీఱఁగాఁ

బొదివెను బర్వు లెత్తుచు విమోచనయై వడి మౌనిపుంగవుం

బదయుగ మూల మందుఁ దమి భద్రముగాఁ బడె శత్రుసూదనా!

5.      

 

 

 

తే.గీ.

శబల మూల్గుచు నేడ్చుచు సంయమి వరు

చెంత నిలిచి పలికె నిట్లు వంత తోడ

మేఘ దుందుభి రవముల మించు కంఠ

నిస్వన మడరంగ నపుడు నీరజాక్ష!

6.      

 

 

 

కం.

నే నేల విడువఁ బడితి నృ

పానీకమ్ము గొని పోవ నన్యాయముగా

నో నలినజ పుత్రా! దే

వా! నీ సముఖమ్ము నుండి యకటా చెపుఁడీ

7.      

 

 

 

కం.

అని పలికిన విని శోకా

ర్తను నిజ సోదరి యనంగఁ దపియించెడు దా

నినిఁ గని బ్రహ్మర్షి వచిం

చె నిట్టు లాదర మడర నుచిత వచనమ్ముల్

8.      

 

 

 

మ.

శబలా నే నిను వీడ లేదు కన దోషం బింత నీయందుఁ జూ

సబలుం డా సుమహద్బలుండు గొనెనే సమ్రాట్టు గర్వాంధుఁడై

యబలుండం బ్రియ నేను దుల్యుఁడను గా నా భూపకున్ క్షత్రియుం

డ బలుం డీధర తిర్గి తా నచలకీ లాధీశుఁడై నిల్చెనే

9.      

 

 

 

ఆ.వె.

అరయు మీవు పూర్ణ మక్షౌహిణీ సేన

హస్తి వాజి రథ సమావృతమ్ము

ధ్వజ విరాజితమ్ము దాన నతఁడు బల

వత్తరుండు శబల! పార్థివుండు

10.    

 

 

 

చం.

పలుక వసిష్ఠుఁ డీ విధము వాక్యము లత్తఱి యాలకించి యా

వల బదు లిచ్చె వాక్యవిద బ్రహ్మఋషీంద్రునిఁ గాంతిమంతుఁ గాం

చి లలిత భాషణమ్ములు వచించుచు రాజ బలమ్ము దేవ కా

దిల బలవత్తరం బధిక మీ ద్విజ వర్య బలమ్మ దివ్యమై

11.    

 

 

 

తే.గీ.

అప్రమేయము నీ బల మా నరేంద్రు

బలము కన్న మిన్న మునీంద్ర! పరుల కిల దు

రాసదము నీదు తేజము భాసురమ్ము

దివ్య పురుష! విశ్వామిత్రు తేజ మెంత

12.    

 

 

 

తే.గీ.

నన్ను బంచు మహాభాగ మిన్న యైన

నీదు బ్రహ్మ బలయుతను నెమ్మి యా దు

రాత్ము దర్ప బలము నెల్ల నాత్మ బలము

చేత నాశన మ్మొనరింతుశీఘ్రముగను

13.    

 

 

 

కం.

రిపుబల నాశకమౌ బల

మపారముగ నుద్భవిల్లు నట్టుల నొనరిం

పు పదిలముగ నిప్పు డని ము

నిపతి వసిష్ఠుఁ డనియె విని నీరజనయనా!

14.    

 

 

 

తే.గీ.

ముని పలుకు లాలకించి యబ్బురముగ సృజి

యించె సురభి తత్క్షణము కోపించి పప్ల

వుల నిజాంభారవమున వందల కొలంది

చూచుచుండ రాజు బలము సోలె చచ్చి

15.    

 

 

 

చం.

కని బల నాశనం బటులఁ గౌశికుఁ డాగ్రహ కంపితుండునై

ఘనతర మైన స్యందనము గ్రక్కున నెక్కి కనుల్ విశాల మై

తనరఁగఁ జంపెఁ బప్లవుల దారుణ శస్త్రచయమ్ము లేసి య

జ్జన పతి యస్త్ర శస్త్ర సువిశారదుఁ డుద్ధతి నంత రాఘవా!

16.    

 

 

 

తే.గీ.

నిర్జితులను విశ్వామిత్రుని వలన ననిఁ

గాంచి సృష్టించెఁ బప్లవ కాయ మంతఁ

దిరిగి శబల శక యవన ధీర వరుల

వందలును వేల సంఖ్యలఁ బంతమునను

17.    

 

 

 

తే.గీ.

శక యవన మిశ్రమమున విశాల భూమి

యెల్ల నిండె మహా వీరు లెంచ హేమ

కేసరాభులఁ దేజో విలాసవంత

వీర్య వంతు లకుంఠిత ధైర్య వరుల

18.    

 

 

 

ఆ.వె.

పీత వస్త్ర ధరులు భీమాసి పట్టిశ

ధరులు బలుల చేత దగ్ధ మయ్యె

రాజసైన్య మెల్ల నోజ మండు ననల 

మందు దగ్ధమైన చంద మపుడు

19.    

 

 

 

కం.

కని విశ్వామిత్రుఁ డలిగి

ఘనాస్త్ర నిచయమ్ము విడిచెఁ గాలుని భంగిన్

ఘన పప్లవ కాంభోజ య

వన వరు లాకులితు లైరి పరమాస్త్రములన్

20.   

                                                                                          

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నేఁబది నాల్గవ సర్గము.

 

 

బాలకాండము

సర్గము 55.

 

 

 

కామధేనువు తిరిగి సృజించిన బలముతో విశ్వామిత్రుని సైన్యము హతము కాఁగ మఱియు నూర్గురు సుతులు దగ్ధము కాఁగ విశ్వామిత్రుఁడు శివుని గూర్చి తపము సేసి దివ్యాస్త్రములను బడసి బ్రహ్మర్షి వసిష్ఠుని యాశ్రమము నెల్ల ధ్వంసము సేయ ముని కోపించుట.

 

 

 

 

కం.

నృవరా! విశ్వామిత్రా

స్త్ర విమోహితులం గని యటఁ దాపస వర్యుం

డు వసిష్ఠుఁ డరసి యా ధే

నువు యోగ బలమున నింకను సృజింపు మనెన్

1.      

 

 

 

మ.

అఱవం బుట్టిరి కామధేను వట దీప్తాంశాభ కాంభోజులుం

దఱచై పుట్టిరి యూధ మందు హను హస్తశ్రేణితోఁ బప్లవుల్

మఱియుం బుట్టిరి గర్బమందు యవనుల్ మర్కమ్మునం దత్శకుల్

నెఱులన్ మ్లేచ్ఛ కిరాతక వ్రజముతో నిర్భీత హారీతులున్

2.      

 

 

 

తే.గీ.

వారి చేతను రఘువర! భటులఁ గూడి

రథము లశ్వచయము కుంజర వ్రజమ్ము

నృపవరేణ్య విశ్వామిత్రునివి లయమ్ము

నందెఁ దత్క్షణంబ సమర మందు వింత

3.      

 

 

 

ఉ.

అమ్మను జేశ్వ రాత్మజులు నారసి నూర్వురు మ్రగ్గినట్టి సై

న్యమ్ము వసిష్ఠుచేత వివిధాయుధ ధారులు పర్వు లెత్తఁగా

నమ్ముని చెంత కత్తఱి మహాగ్రహ మూని తపోవరిష్ఠుఁడే

హుమ్మని హుంకరించి వడి నొక్కఁడ దగ్ధులఁ జేసె వారినిన్

4.      

 

 

 

కం.

ఆ వనమం దశ్వ రథ స

హావృత విక్రమ పదాతు లంత క్షణమునన్

వావిరి భస్మీకృతు లై

రా విధము వసిష్ఠు చేత నాశ్చర్యముగన్

5.      

 

 

 

ఆ.వె.

సమసిన నిజ సుతుల సైన్యమ్ము వీక్షించి

యమ్మహాయశుండు వమ్ము వోయి

యుమ్మలికము మీఱఁ గ్రమ్మఁగ సిగ్గు త

లంపఁ జాగె నెడఁద రాజవరుఁడు

6.      

 

 

 

తే.గీ.

వడి సడలి కనిపించెడు  గడలి వోలె

పన్ను లూడిన యట్టి సర్పమ్ము వోలె

రాహువు కినిసి పట్టిన రవి యనంగఁ

గాంతి హీనుఁ డయ్యె నృపతి కౌశికుండు

7.      

 

 

 

తే.గీ.

మక్క నిజ సుతులు బలము వెక్కసముగ

ఱెక్క లూడఁగ విలపించు పక్కి వోలె

నుక్కు దర్ప ముత్సాహమ్ము నొక్క ద్రుటిని

నూడ నిర్వేదమును రాజు కూడి యుండె

8.      

 

 

 

కం.

అంత నొక సుతుని రాజ్యం

బంతయుఁ బాలింపు మనుచు ననిపి వడి వనో

పాంతమున కేఁగె మదిఁ దాఁ

జింతించి క్షితిపతి నియతిఁ జేయఁగఁ తపమున్

9.      

 

 

 

కం.

అతఁ డేఁగి హిమాద్రికి సం

తత కిన్నర నాగ సేవితమ్మునకు నుమా

పతి సుప్రసాదమునకై

రతిఁ జేసె మహాతపమును రాఘవ! నిష్ఠన్

10.    

 

 

 

కం.

కనిపించెఁ గొంత కాల

మ్మునకును వృషభధ్వజుండు ముక్కంటి మహా

త్మునకు మహా వీర్యున కా

వని విశ్వామిత్రున కట వరదుం డంతన్

11.    

 

 

 

ఆ.వె.

ఏల యీ తప మవనీశ కాక్షింతు వె

ద్దాని నడుగు మిత్తు దాని నీ య

భీక్షితమ్ము నంచుఁ బ్రీతిఁ బలికె నంత

చంద్రశేఖరుండు శైల ధన్వి

12.    

 

 

 

ఆ.వె.

దేవదేవుఁ డిట్లు తియ్యఁగఁ బలికినఁ

దాపసుండు నమ్రత నతు లొసఁగి

వినిన యంతఁ గరము ప్రీతి విశ్వామిత్రుఁ

డిట్లు పలికె వాక్కు లీశ్వరుఁ గని

13.    

 

 

 

తే.గీ.

తృప్తిలినఁ దపమున మహాదేవ! యంగ

ములు నుపాంగములను మర్మముల సహితము

నుపనిషత్తు ధనుర్వేద ముచిత రీతి

నిమ్ము నాకు ననఘ! పార్వతీశ! సదయ

14.    

 

 

 

ఆ.వె.

సురల మునుల రక్కసు లసుర గంధర్వ

యక్ష గణము లందు నలరు నస్త్ర

కోటు లెల్ల ననఘ! కూర్మి నా యందు భా

సిల్లఁ జేయు మయ్య యుల్ల మలర

15.    

 

 

 

కం.

నీ దయ నా యీ కోరిక

వే దేవా తీరనిమ్ము వేఁడఁగ నిట్లుం

దాఁ దగఁ దథాస్తని చనె మ

హా దేవుఁడు గరళకంఠుఁ డక్షరుఁ డంతన్

16.    

 

 

 

తే.గీ.

అంతఁ బొంది విశ్వామిత్రుఁ డస్త్ర రాజి

దర్ప మూని భృశమ్ము చిత్తమున నయ్యె

రాజ ఋషియె గర్వాంధుఁడు రామచంద్ర!  

బల్లిదుఁడు గాధిపట్టి యప్పట్టు నందు

17.    

 

 

 

కం.

పెరిఁగి బలమ్మునఁ బున్నమిఁ

బెరుఁగు సముద్రంపు భంగి విశ్వామిత్రుం

డరసె వసిష్ఠుని సంయమి

వరు హతుని విధమ్మెడందఁ బార్థివ తనయా!

18.    

 

 

 

ఆ.వె.

ఆశ్రమమున కేఁగి యడరి విశ్వామిత్రుఁ

డస్త్రములు విడిచిన యంత ముని త

పోవనమ్ము సర్వము ద్రుటి దగ్ధం బయ్యెఁ

జూచుచుండ మునులు చోద్యముగను

19.    

 

 

 

ఆ.వె.

భీతి పర్వు లిడిరి యా తపోధను లెల్లఁ

గాంచి మండ వనము గాధి సుతుని

యనల సన్ని భాస్త్ర ఘన సంచయమ్మున

సకల దిక్కులకు నశాంతి చెలఁగ

20.   

 

 

 

ఆ.వె.

కౌశి కాస్త్ర భీత కాననాంతర మృగ

పక్షి నిచయ సహిత పరమ శిష్య

గణము దశదిశలకుఁ గరము సంభ్రమమునఁ

బర్వు లెత్తెఁ గలఁగి రుర్వి జనులు

21.    

 

 

 

కం.

ఒక్క త్రుటి శూన్య మయ్యెను

జక్కటి యాశ్రమము వింత శబ్దరహితమై

చిక్కెఁ జవుటి నేల పగిది

నక్కౌశికు నస్త్ర మహిమ ననివార్యముగన్

22.   

 

 

 

తే.గీ.

వలదు భయము భయమ్మది వల దనుచుఁ ది

రిగి తిరిగి వసిష్ఠుఁడు పల్కి ఋషివరుండు

గాధిపట్టిని నిపుడు భాస్కరుఁడు మంచుఁ

ద్రుంచు నట్లు వధింతును గాంచుఁ డనియె

23.   

 

 

 

కం.

పలికి మఱి మహాతేజుం

డలుక వసిష్ఠుఁడు మునివరు లందు ఘనుఁడు దాఁ

బలికెను విశ్వామిత్రుని

నల గాంచి వచనములు వసు థాధీశునితో

24.   

 

 

 

తే.గీ.

చిర సమృద్ధాశ్రమమ్మును జేసి తీవు

నాశనము దుశ్చరితుఁడవు నాశ మౌదు

దాన మూఢాత్మ కౌశిక తథ్యముగను

సంభ్రమమ్ముగ బ్రహ్మర్షి చాటి యిట్లు

25.   

 

 

 

కం.

అతి కృద్ధుఁడై వసిష్ఠుఁడు

గత ధూమ ప్రజ్వలితము కాలాగ్ని యనన్ 

నుత పర యమ దండ మన ల

సిత నిజ దండమ్ము నెత్తెఁ జేతం బరమున్

26.   

                                                                                          

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నేఁబది యైదవ సర్గము.

 

బాలకాండము

సర్గము 56.

 

 

 

విశ్వామిత్రుఁడు రోషమూని ప్రయోగించిన నానాస్త్రములు బ్రహ్మర్షి వసిష్ఠుని బ్రహ్మదండముచే శాంతింపఁగా క్షాత్రవ బలము బ్రహ్మ బలమునకు సరితూఁగ దని యెఱింగి బ్రహ్మత్వము నొంద నిశ్చయించుట.   

 

 

 

 

కం.

పలుక వసిష్ఠ మహా ముని

బలి విశ్వామిత్రుఁ డలిగి పర మాగ్నేయా

స్త్ర లపనములు చదివి పలికె

నిలు నిలు మని హుంకరించి నీరజనయనా!

1.      

 

 

 

ఆ.వె.

బ్రహ్మదండ మెత్తి వర కాలదండ మై

పరఁగు దాని కినిసి బ్రహ్మఋషి వ

సిష్ఠుఁ డపుడు తగఁ బటిష్ఠంపుఁ బల్కులు

పలికె నివ్విధమ్ము పరుషములను

2.      

 

 

 

తే.గీ.

క్షత్రి యాధమ! నిల్చెదఁ జక్కఁగ నిట

నెట్టి బల మున్నయది నీకు నట్టి బలము

చూపు మిఁక నేడు నీ శస్త్ర శుష్మ మింక

దర్ప మడతు గాధికుమార తథ్యముగను

3.      

 

 

 

తే.గీ.

క్షత్రియ కులపాంసన! చూడు క్షాత్ర వీర్య

మెక్కడ మఱి బ్రహ్మ బలంబు నెక్కడ యర

యవలయు నిపుడు నాదు దివ్యంపు బ్రహ్మ

బలము కౌశిక! చూపుమ పార్థ బలము

4.      

 

 

 

కం.

నరవరు నాగ్నే యాస్త్రము

వరముని దండమున శాంతిఁ బడసె ననల భీ

మ రయము తోయమ్మున నన

వరతం బాఱెడు విధంబ బలహీనంబై

5.      

 

 

 

ఉ.

వారుణ మైంద్ర రౌద్రములు బాశుపతమ్ము నుషీక శస్త్రమున్

దారుణ మైన మానవము దారణ మున్నత మోహనమ్మునున్

దారుణ  జృంభణమ్మును సుతాపన దివ్య విలాపనమ్ములన్

ధీరత స్వాపనమ్ము మఱి ధీర జనార్దన మాదనాదులన్      

6.      

 

 

 

తే.గీ.

శోషణమ్ము గాంధర్వము శూర దుర్జ

యమ్ము వజ్రాస్త్ర మింక బ్రహ్మ వర పాశ

మింకఁ గాలపాశము వారు ణేద్ధ పాశ

ము దయితమ్ము నార్ద్రము శుష్కము లుభయములు

7.      

 

 

 

తే.గీ.

అశని పైనాక పైశాచ భృశత రాస్త్ర

ములు ఘన క్రౌంచ దండాస్త్రములు సురుచిర

ధర్మ విష్ణు కాలాఖ్య నుత వర చక్ర

ములను వాయువ్య మథ నాస్త్రములను మఱియు

8.      

 

 

 

తే.గీ.

హయ శిరో౽స్త్రము శక్తిద్వయమ్ము ముసల

మింక వైద్యాధర మహాస్త్ర మింక భయద

ములగు కంకాళ కాలాస్త్రములను వేసెఁ

గనలుచుఁ ద్రిశూల కాపాల కంకణముల

9.      

 

 

 

కం.

వేసిన యస్త్రము లెల్లను

దా సమయించె నిజ దండదర్శనముననే

యా సంయమి బ్రహ్మాస్త్రము

వే సంధించి విడిచె నిఁకఁ బృథివీశుఁ డహో

10.    

 

 

 

మ.

కని బ్రహ్మాస్త్రము సాగ్నిదేవ వరులున్ గంధర్వ నాగాళియున్

ఘన దేవర్షి గణమ్ము మిక్కుటముగాఁ గంపించె ముల్లోకముల్

వనటం బొందె దిశాప్త తాపమున నాబ్రహ్మాస్త్ర సందీప్త వ

హ్నిని గాఢమ్ముగఁ దత్క్షణంబ మదులన్ నిస్తేజ మేపారఁగన్

11.    

 

 

 

తే.గీ.

బ్రహ్మ మస్త్రమును గ్రసించె బ్రహ్మ దండ

ముననె బ్రహ్మ తేజ మడర ముని వరుఁడు వ

సిష్ఠుఁ డతి ఘోరమును గూడ శీఘ్ర గతిని

రఘు కులాంబుధి హిమధామ! రామచంద్ర!

12.    

 

 

 

కం.

కబళింపఁగ బ్రహ్మాస్త్రముఁ

దబిసి వసిష్ఠుఁడు వడసెను దారుణ రూప

మ్ము బెదరి మూర్ఛిల ముజ్జగ

ము బెడిదముగ మండు టగ్నిఁ బోలుచు నంతన్

13.    

 

 

 

ఆ.వె.

అమ్మహాత్ముని సక లాంచిత రోమ కూ

పముల ధూమ సహిత వహ్ని శిఖలు

కిరణ తతుల భంగిఁ దరళమ్ముగ వెడలె

భీతిలంగ సర్వు లాతతముగ

14.    

 

 

 

ఆ.వె.

వెల్గె నట వసిష్ఠు విప్రవరుని చేతి

దండము పొగ లేని మండు టగ్ని

భంగి మిక్కుటముగఁ బర యమ దండమో

యనఁగ భ్రాంతిఁ జెంద నక్కజముగ

15.    

 

 

 

కం.

మీ బల మమోఘ మైనది

నాఁ బొగడి యనిరి మునులు ఘన ముని వసిష్ఠున్

మీ బహుళ తేజమున నిట

నీ బిగి తేజమ్ము నాపుఁ డెలమిని నంచున్

16.    

 

 

 

ఆ.వె.

తాపసుఁడు మునీంద్ర! తగ్గె విశ్వామిత్రుఁ

డిపుడు నీ వలననె యింకఁ గరుణఁ

జూడు లోకములను వీడి వెత మనఁగఁ

దాపస గణ ముఖ్య! యాపి కినుక   

17.    

 

 

 

కం.

విని యాపలుకులు దా శమ

మును బొందెను దాపసోత్తముండు వసిష్ఠుం

డు నరపతి తా నణపఁబడి

మునివరుచే నిశ్వసించి మూల్గుచు ననియెన్

18.    

 

 

 

తే.గీ.

అల్ప బల మిసీ  యీ క్షత్రియ బలము ద్విజ

పరమ తేజోబలమ చుమ్ము బలము బ్రహ్మ

దండ మొక్కటి సమయించె గండు మీఱ

నస్త్ర రాజము లన్నిటి నలపు లేక

19.    

 

 

 

కం.

తలఁచి నృవరుఁడు ప్రసన్నత

యలవడ మన మందు మిగుల నాత్మఁ దలంచెన్

లలితమ్ముగఁ జేయఁ దపము

ఫలం బరసి కౌశికుండు బ్రహ్మత్వమ్మున్   

20.   

                                                                                          

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నేఁబది యాఱవ సర్గము.

 

బాలకాండము

సర్గము 57.

 

 

 

వశిష్ఠ మహర్షిపైఁ గోపముతో విశ్వామిత్రుఁడు ఘోర తపమును జేయ బ్రహ్మ దేవుఁడు దర్శన మిచ్చి రాజర్షి పదవి ప్రసాదించినఁ దృప్తిఁ జెందక తిరిగి తపము చేయుట, తత్కాలమున నిక్ష్వాకు చక్రవర్తి త్రిశంకుఁడు సశరీరము దివికిఁ జేరుటకు యజ్ఞము జరిపింపు మని వసిష్ఠునిఁ బిమ్మట వాసిష్ఠులను గోరుట.

 

 

 

 

కం.

మునితో విశ్వామిత్రుఁడు

ఘన వైరం బూని కలఁపఁగఁ బరాజయ కో

టి నిజ మనమ్మును దుఃఖ

మ్మున నిట్టూర్చుచు భృశమ్ము మునిఁగెను రామా!

1.      

 

 

 

ఉ.

చని నిజ భార్యఁ గూడి వడి సంయమనీ పతి దిక్కు రాఘవా!

మనమున దాంత మూని పరమంపుఁ దపమ్మును ఘోర భంగినిం

దనరుచుఁ గౌశికుండు వసుధాపతి సత్ఫల కంద మూల భో

జనుఁ డయి చేసె నచ్చట నచంచల దీక్ష వహించి నిత్యమున్

2.      

 

 

 

తే.గీ.

అంతఁ గొంత తఱిని హవిష్యందుఁడు నన

ఘుఁడు మధుష్యందుఁడు దృఢ నేత్రుఁడు మహా ర

థుఁడు ననంగ నల్వురు సుపుత్రు లుదయించి

రాతనికి సత్య ధర్మ ర తాత్ము లెలమి

3.      

 

 

 

మ.

పరి పూర్ణంబయినన్ సహస్ర సమ లప్పద్మాసనుం డేఁగుదెం

చి రహిం బల్కె జగత్పితాముహుఁడు దాక్షిణ్యమ్ము దీపింపఁగా

వర రాజర్షి! జగమ్ములన్ గెలిచి విశ్వామిత్ర! రాజర్షి నా

బరఁగం జాలుదు వీవు ధాత్రి నిఁక సంభావ్యుండవై యం చటన్

4.      

 

 

 

కం.

లోకేశ్వరుఁ డిట్లు పలికి

నాకమ్మున కేఁగె బ్రహ్మ నలినజుఁడు సురా

నీకము గూడి యపుడు నిజ

లోకము తేజోవపువు సురుచి రాధ్వమునన్   

5.      

 

 

 

కం.

విని విశ్వామిత్రుఁడు సి

గ్గునఁ దల వాంచి వగ పింకఁ గోపం బడరన్

మనమునఁ గరమ్ము దాఁ బ

ల్కెను వచనమ్ములు ముఖమ్ము గెంపాఱంగన్

6.      

 

 

 

తే.గీ.

చేసితి నిట గొప్ప తపము భాసురముగ

సురలును సురర్షిగణము కని రకట నను

గేవలమ్ము రాజర్షిగ నా వర తప

పు ఫల మది శూన్య మని యెంతు మురియ నేల

7.      

 

 

 

ఆ.వె.

తిరిగి చేయఁ దొడఁగెఁ బరమంపుఁ దపమును

దలఁచి యిట్లు మదినిఁ గలఁత నంది

వినుత పరమ చిత్త ఘనుఁడు విశ్వామిత్రుఁ

డలఘు ధృతి ధరుండు ఫలము నెంచి

8.      

 

 

 

తే.గీ.

సత్యవాది జితేంద్రియ చక్రవర్తి

యా తరుణ మందు విఖ్యాతుఁ డా త్రిశంకు

నాముఁ డిక్ష్వాకు కుల వర్ధన నృవరుండు

కలఁడు నిజ రాజ్య మేలుచు ఘనుఁడు రామ!

9.      

 

 

 

తే.గీ.

నిజ శరీరముతో దివికిఁ జను నిచ్చ

తోడ యజ్ఞ మొకటి సేయ వేడుక తన

రెను మదిని దృఢతరముగ ఘనున కవని

పతికి నా త్రిశంకున కిన వంశ రామ!   

10.    

 

 

 

తే.గీ.

అతఁడు పిలిపించి బ్రహ్మర్షి నా వసిష్ఠు

నంతఁ దెలిపె మనోరథ మలరి నృపతి

యది విని యసాధ్య మనియె మహాత్ముఁ డపుడు

ఖేద మడరంగ నెడఁద దుఃఖింప రాజు

11.    

 

 

 

కం.

కా దన వసిష్ఠుఁడు చనియెఁ

దా దక్షిణపు దిశకు ముని తనయులఁ గాంచన్

సాదరముగ వేఁడఁ దలఁచి

వే దీర మనోరథమ్ము పృథివీ పతియే

12.    

 

 

 

చం.

చని కనె నా త్రిశంకుఁ డట సంయమి నందను లైన వంద మం

దినిఁ జిర కాల మచ్చట రతిం దప మింపుగ నాచరించు వా

రిని నిజ తేజముల్ పరఁగ లీల దిశావళి భాసురమ్ముగం 

దనరెడు వారి సంతస మెదన్ విలసిల్లఁగఁ గీర్తిమంతులన్

13.    

 

 

 

ఉ.

చేరి తగన్ మహాత్ముల వసిష్ఠ కుమారుల నెల్లరన్ మహీ

భార ధరుండు దల్చి తగఁ బ్రాయపు వావిరి వందనమ్ములం

దీరుగఁ జేసి సిగ్గు కొలఁదిం దల వంచి కృతాంజలుండునై

వారల తోడఁ బల్కె నిటు పన్నుగ వాక్య విదుండు ప్రీతినిన్

14.    

 

 

 

కం.

శర ణాగతుఁడను శరణము

శరణ మొసఁగు వారి వేఁడఁ జనుదెంచితి భూ

సుర వర్యులార శుభమగుఁ

గరమ్ము మీకు జనకుండు కాదనె నడుగన్

15.    

 

 

 

ఆ.వె.

నతు లొసంగుచు గురు సుతుల నర్థింతును

గ్రతువు నొకటిఁ జేయ లలితముగఁ ద

లంచితిని ధరణి సుర వరులార యనుజ్ఞ

నొసఁగ నర్హులు దయ నుంచి నాకు

16.    

 

 

 

తే.గీ.

శిరసు వంచి మ్రొక్కుదు నేను ధరణి సురులు!

మీకు నాదు కోరిక తీర మీఱి తనువు

తోడ దివి కంపు జన్నము తుష్టిఁ జేయ

నిండు మీరు ఋత్విజు లయి యుండి ప్రీతి   

17.    

 

 

 

తే.గీ.

త్రోసిపుచ్చ వసిష్ఠుఁడు తోఁప రెవ్వ

రింక గతి నాకు శోధింప నెందు గురు త

నయులు మీరు దక్కంగ నన్య నరు లందుఁ

దాప సోత్తములార యీ ధాత్రి లోన

18.    

 

 

 

తే.గీ.

గతి పురోహితు లిక్ష్వాకు పతుల కెల్ల

రాజులఁ దరింపఁ జేయఁ గలరు పురోధ

లరయ విద్వాంసు లెల్ల రనంతరమ్ము

మీర దేవుళ్లు నాకెంచఁ దోరముగను

19.    

                                                                                          

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నేఁబది యేడవ సర్గము.

 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి